"కమనీయం తెలుగు రామాయణం"
జాతీయసదస్సు నవంబర్-2023 ప్రత్యేకసంచిక
(ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జి. కళాశాల (స్వయంప్రతిపత్తి) సిద్ధిపేట, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం.)
AUCHITHYAM | Volume-4 | Issue-15 | December 2023 (Special Issue) | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. శ్రీమదాంధ్రమహాభారతం: రామకథ
డా. కె.యన్.వి.వి.యస్. నారాయణమూర్తి
అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
బి.జే.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నారాయణగూడ,
హైదరాబాద్ - 500029, తెలంగాణ.
సెల్: +91 9866542365, Email: knvvsmurthy@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
భారతంలో రామాయణం ఉండడంతో, నేటికాలపు ఆధునికతరానికి రెండింటిలో పూర్వాపరాలు తెలియని పరిస్థితి ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. వేదధర్మంలోని అనేక అంశాలను వ్యాసులవారు భారతంలో పొందుపరిచారు. భారతం పంచమవేదంగా కీర్తి పొందింది. వేదసమమైన రామాయణగాథను సైతం వ్యాసులవారు భారతంలోని సందర్భావసరాన్ని గ్రహించి అరణ్యపర్వంలో పొందుపరిచారు. కవిత్రయం భారతాంధ్రీకరణలో ఆ మార్గాన్నే అనుసరించారు. అయితే అరణ్యపర్వరచన చేసిన ఎఱ్ఱన కొంత స్వతంత్రత చూపడం విశేషం. ఎఱ్ఱన అరణ్యపర్వ రచనలోని ప్రత్యేక అంశాలను అందించడం ఈ వ్యాసంలోని అంశం.
Keywords: శ్రీరామాయణం, శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్య పర్వం, ఎఱ్ఱన, కవిత్రయం, అవాల్మీకాంశాలు.
1. ఉపోద్ఘాతం:
శ్రీమదాంధ్రమహాభారత నిర్మాణం, కవిత్రయ సృష్టి. పురుషోత్తమాంబుజభవ శ్రీ కంధరులైన నన్నయతిక్కన ఎఱ్ఱనలను రాఘవపాండవీయంలో పింగళి సూరన రామాయణ భారతాలను శబ్దార్థగౌరవసమృద్ధి మరియు విశుద్ధితో ఆంధ్రీకరించిన మహాత్ములుగా, కావ్యపీఠిక పద్యం 4 లో ప్రస్తుతించి ఉన్నాడు.
“నన్నయ్య రాఘవాభ్యుదయం అనే పేరుతో రామాయణాన్ని ఆంధ్రీకరించాడని ఒక లక్షణ గ్రంథంవల్ల తెలుస్తుందని రావూరి దొరసామి శర్మ వివరించినా” (రామకథ, పుట.36) ఆ వివరాలు అలభ్యం. నన్నయ్య భారత భాగంలో అరణ్య పర్వంలో మూడుచోట్ల రామాయణ కథా స్మరణ ఘట్టాలున్నాయి. మొదట అరణ్య పర్య ద్వితీయాశ్వాసంలో సకలతీర్ధకీర్తనంలో నారదుడు ధర్మజునకు ’’...పురు, పురూరవులట్లు భగీరథ రఘుపతు- లయట్లు కృతకృత్యుడవై - ధారుణి రక్షింపుము’’ (ఆ.మ.భా - అర. ప. ఆ. పుట. 64) అని వివరించే ఘట్టం ఉంది. రెండవ సందర్భంగా, అరణ్య పర్య తృతీయాశ్వాసంలో, రోమశుడు ధర్మరాజుకు ఋష్యశృంగ చరిత్రాన్ని వివరించే ఘట్టంతో, ఇక మూడవ సందర్భంగా మళ్ళీ మూడవ ఆశ్వాసంలోనే భీముడు సౌగంధికాపుష్ప నిమిత్తమై పోవుచుండగా మార్గంలో కనిపించిన హనుమకు, రామగాథను ఒక దృష్టాంతం లాగా వివరిస్తాడు. అలాగే ఆశ్వాసాంత గద్యలో సైతం రామాయణగాధా ప్రస్తావన చోటు చేసుకున్నది.
ఇక తిక్కన సోమయాజి విరచిత నిర్వచనోత్తరరామాయణం జగత్ప్రసిద్ధం.
ఎఱ్ఱన ప్రబంధ పరమేశ్వరుడు భారతారణ్య శేష రచనతోపాటుగా రామాయణ రచన చేసినట్లు లాక్షణికుల గ్రంథాలలో (కూచిమంచి తిమ్మకవి-సర్వ లక్షణ సార సంగ్రహం) ఉన్న వివరాలను వేటూరి వారు వివరించిన సందర్భాన్ని వేలూరి శివరామశాస్త్రి గారు హరివంశ పీఠిక చెప్పారు.
అదే విధంగా ఎఱ్ఱన రామాయణ రచన చేసిన విషయాన్ని ముదిగొండ శివప్రసాద్ గారు సైతం స్పష్టంచేశారు.
కవిత్రయంలో కవనంలో అగ్రేసర గౌరవం పొందిన ఎఱ్ఱన రామగాథపైన ప్రీతితో, తన మొత్తం అరణ్య పర్య శేష రచనలో పదహారు వందల గద్య పద్యాలు వినియోగించగా అందులో ఇరవై శాతానికి దాదాపుగా రామకథ కోసం కేటాయించడం ఒక విశేషం. ప్రస్తుత వ్యాసం ‘భారతంలో రామాయణం’ ఎఱ్ఱన రచనను విశేషంగా పరిశీలించడం అనే లక్ష్యం కలది.
2. ప్రస్తావన :
‘భ’ అనగా కాంతి. కాంతిని ఆరాధించువారు, ఆరాధనలో రమించువారు భారతీయులు. వైదిక ఋషులు, అమూల్య ఋక్కులతో ఛందస్సులతో వేదాన్ని అందిస్తే, వేదోప బృంహణంగా, వెలసిన రామకథ ఆదికావ్యమై అపురూపమైన పాత్ర పోషణతో, సుందర వర్ణనలతో అద్భుత కథా సంవిధానంతో భూమిమీద ఎంతవరకు నదులూ, కొండలు ఉంటాయో అంతవరకు లోకంలో సజీవమై ఉంటుంది అని మహర్షి వాల్మీకి భావన. కాలక్రమేణా రామగాథపై ప్రేమతో పలువురు కథకులు, కవులు, వాల్మీకి కథనానికి తమకు తోచిన మార్పు, చేర్పులు చేసి రామభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో ఎఱ్ఱన కూడా తక్కువేమీ కాడు.
“కనియెన్ గోమల నీలమేఘ సుభగా కారున్ జటావల్కలా
జిన ధారున్ సితభూతి భూషితుని రాజీవాక్షు గల్యాణ కీ
ర్తును గాకుత్థ ప్రదీపకుని సీతాలక్ష్మణోపేతు స
న్ముని లోకార్చితు సత్కృపా భరణ రామున్ రాజ చూడామణిన్” (ఆ. మ. భా - అర. ప. ఆ. పుట. 309)
ఎఱ్ఱన రాముని భస్మధారిగా వర్ణించడం గమనిస్తే నాటి సాంఘిక, రాజకీయ పరిస్థితులు, అవసరాలను కూడా మనం అంచనా వేయవచ్చు.
3. రచనావైశిష్ట్యం:
సంస్కృత భారతంలో ఏడువందల ఇరవై ఏడు శ్లోకాలలో ఉన్న రామకథను ఎఱ్ఱన మూడు వందల పదమూడు గద్య పద్యాలలో ఆంధ్రీకరించాడు.
ఇందులో రామకథ శ్రీరామ జననంతో ఆరంభమైంది. అలాగే రావణాదుల జనన క్రమం, వారి పరాక్రమాదులు, వారి నణచుటకై చతుర్ముఖాదులు చేసిన యత్నాలు వివరంగా ప్రారంభంలోనే వర్ణించబడ్డాయి. ఈ రావణ జనన వృత్తాంతం, కొంత వాల్మీకి రామాయణంతో విభేదిస్తుంది. వాల్మీకి రామాయణంలో పులస్త్యుని పుత్రుడైన విశ్రవసువుకు భరద్వాజుని పుత్రిక ‘దేవవర్ణిని’ వలన వైశ్రవణుడు (కుబేరుడు), సుమాలి పుత్రికలైన కైకసి, పుష్పోత్కట పాకల వలన రావణ, కుంభకర్ణ, శూర్పణఖలు జన్మించారు.
పులస్త్యుని పుత్రుడైన వైశ్రవణుడు తండ్రిని విడిచి బ్రహ్మను గూర్చి తపస్సు చేసి ‘నల కూబరుడను’ పుత్రుని, లోకపాలకత్వం, లంకాధిపత్యం, ధనేశ్వరత్వం, ఈశ్వర సఖ్యం అనే వాటిని వరాలుగా పొందాడు. ఆగ్రహించిన పులస్త్యుడు తన శరీరంలో అర్థభాగాన్ని విశ్రవసువుగా చేసి వైశ్రవణునకు హాని చేయమన్నాడు. దానితో వైశ్రవణుడు విశ్రవసుని సమీపించి అతనికి పుత్రునిగ ఉందునని సమ్మతపరచి పుష్పోత్కట, మాలిని, పాక అను సుందర స్త్రీలను పరిచారికలుగా అతనికై నియోగించగా, వారిలో పుష్పోత్కటకు రావణ కుంభకర్ణులు, మాలినికి విభీషణుడు, పాకకు ఖర శూర్పణఖలు జన్మించినట్లు వర్ణించాడు.
ఎఱ్ఱన రామకథలో బ్రహ్మ ‘దుందుభి’ అను గంధర్వ స్త్రీని పిలిచి నీవు కుబ్జ రూపంలో ‘మంధర’ అను పేర భూలోకంలో జన్మించి నీ నేర్పు విధంబున దేవకార్యంబులు నిర్వహింపుమని’ చెప్పినట్లు వర్ణించాడు. పుత్ర కామేష్ఠి, శివధనుర్భంగాలు ఇందులో లేవు. కేవలం ‘రామునకు విదేహ రాజ నందనయైన సీత ప్రియాంగన యయ్యె’ అని మాత్రము ఉంది. కైక కోపగృహంలో ధూళి ధూసరితాంగయై అలుక వహింపక, సర్వాభరణ భూషితాంగయై దశరథుని చేరి ‘’ధరణీశ తొల్లి నాకుం...’’ (ఆ.మ.భా - అర. ప. ఆ. పుట.299) అని అడగగా ఈ సంగతి తెలిసి రాముడు దశరథాదులను చూడకుండానే అడవులకు వెళ్ళిపోతాడు.
ఇక కథాకధన విధానంలో కామ్యకవనంలో బ్రాహ్మణ బృందంతో ఉన్న ధర్మరాజు వద్దకు మార్కండేయుడు రాగా, అనుజ సహితుడై నమస్కరించి, సైంధవుడు పాంచాలికి చేయ యత్నించిన దుర్వ్యవసాయం, వానిని ‘బరిభవించుటకు’ తాము పడిన ‘ఆయాసము’ వివరించగా, ఆ మునివరుడు, ధర్మరాజును సంబోధించి రఘురాముడు పూర్వము ఇంతకన్నా ఎక్కువగా బాధపడినవాడు. జానకి, రావణునిచే అపహరించబడగా వానరులచే సహాయము పొంది, వారధిని నిర్మించి, దివ్య బాణములతో దశగ్రీవుని చంపి ‘అకిల్బిష రాజ్య విభూతిని పొందినవాడు’ కదా అని చెప్పగా విని ధర్మజుడు: ‘’రాముండెవ్వని వంశంబున వాడు, రావణుండెవ్వని తనయుండేమి నిమిత్తంబు సీతాపహరణంబు సేసె, రామ రావణులకు సంగ్రామం బెట్లు వర్తిల్లెం జెప్పవేయని రామాయణ కథా శ్రవణ కుతూహలియై’’ (ఆ.మ.భా-అర. ప. ఆ. పుట. 267) అడగగా, మార్కండేయుడు, ధర్మజునకు రామకథను వివరిస్తాడు. ఇది ఆరంభం. రెండు పద్యాలలో రామ జననం చెప్పి, ఆ పై రావణ జననాన్ని ఎఱ్ఱన వర్ణించాడు. ఇతర రామాయణాలలో వలె ఇందులో రాముడు విష్ణ్వాంశ సంభూతుడు గాక ప్రశస్త చరితుడైన దశరథునికి కౌసల్య యందు రాముడుదయించినట్లు మాత్రమే వర్ణితం. ఇది యథా వాల్మీకం. రాముని ఒక ఉత్తమ మానవునిగా వాల్మీకి చిత్రించాడే కాని సాక్షాత్తు విష్ణువని యెక్కడా వాచ్యం చేయలేదు. అక్కడక్కడా రాముడు విష్ణువు అవతారమని చెప్పినా అవి సకృత్తుగా ఉండి ప్రక్షిప్తాలని పండితులభిప్రాయపడినారు. రాజ్యం పోయి, భార్యపోయి, అడవుల పాలై, శత్రువులు దాపురించి నానాబాధలు పడి ఎంత కష్టం వచ్చినా రాముడు తాను పరమేశ్వరుడు అనే భావాన్ని చూపి కష్టాన్ని నిగ్రహించలేదు. వాల్మీకి మహర్షి ఆ విధంగా వ్రాస్తే రామాయణం మరో అధ్యాత్మ రామాయణమయ్యేది.
4. అవాల్మీకాంశాలు :
అయితే వాల్మీకి రామాయణంలో లేని చాలా అంశాలను ఎఱ్ఱన్న ఇందులో నిక్షేపించాడు.
- రావణ కుంభకర్ణాదుల పూర్వజన్మ వృత్తాంతం
- మంధర కారణ జన్మురాలు అని చెప్పడం
- వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా హనుమంతుడు సుగ్రీవుని హారాలంకృతుని చేయడం
- త్రిజటా స్వప్న వృత్తాంతంలో అవింధ్యుడనే రాక్షసుని వృత్తాంతం
- రామ పరాక్రమం పిదప ఇంద్రజిత్తు తండ్రిని ఊరడిరచడం
- యుద్ధరంగ వ్యూహ నిర్మాణం
- వారధి నిర్మాణ సమయంలో ఓడల ప్రస్తావన -మొదలైనవి
భారతాంతర్గత రామాయణ కథలో రావణ విభీషణ జన్మ వృత్తాంతాలతో పాటు వారు తపస్సు చేసి అందులో రావణుడు తన శిరసులను అగ్నిలో వేల్చి బ్రహ్మను మెప్పించి వరాలను పొందడం వర్ణితం. ఆ వరంతో గర్వోన్నతుడై జగద్రావణం చేసి రావణుండనే పేర ప్రఖ్యాతి పొందినవాడు రావణుడు. ఆ రావణుని సంహరించడానికి బ్రహ్మ దుందుభి అనే గంధర్వ కామినిని పిలిచి కుబ్జరూపంలో మంధర అనే పేరుతో భూలోకంలో జన్మించుమని ఆజ్ఞాపించడం యఱ్ఱనోపజ్ఞకం.
రాముని పట్టాభిషేక వార్త విన్న వాల్మీకి రామాయణ ‘కైక’ ఆనందించి, అందులో విడ్డూర మేమున్నదని అనుకొనగా, ఎఱ్ఱన ‘కైక’ తనకు తానుగా వరాలను ఇమ్మని వేడుకొన్నది. ఈ కథలో మంధర ప్రమేయమే లేదు. కోపగృహాది వ్యవహారాలిందు లేవు.
వాల్మీకి రామాయణ సీతాపహరణ ఘట్టంలో రావణుని ఉద్దేశ్యం సీతా సౌందర్య పిపాస. భారతాంతర్గత రామకథలో సీతాపహరణంలో రావణుని ఉద్దేశ్యం: ‘‘బ్రియా విరహ దుర్మనస్కుండై యతడు చెడిపోవునని’’ (ఆ.మ.భా-అర. ప. ఆ. పుట.554) లంకలోని సీతకు రామాదుల వార్త ఆంజనేయుని ఆగమనం వరకు తెలియదు. ఎఱ్ఱన మాత్రం అవింధ్యుడను ఒక వృద్ధ రాక్షసుని చేత రామ హితాన్వేషి త్రిజటతో, రాముని యోగక్షేమాలను సీతకు తెలియజేస్తాడు. ఈ అవింధ్యుడు రెండు సార్లు ఎఱ్ఱన రామకథలో దర్శన మిస్తాడు. రావణ వధానంతరం అవింధ్యుడు విభీషణ సహితుడై ‘జానకి నుచితయానంబున నునిచికొని రామదేవు పాలికిందెచ్చి’ స్వీకరింపుమని కోరుతాడు.
వాల్మీకీయంలో సముద్రునిపై రోషావిష్టుడైన రాముని, శరధిరాజు శరణు వేడి వారధి నిర్మించు కొనమని తెలుపుతాడు. కాని ఎఱ్ఱన ‘సముద్రుడు’ : ‘‘వినుము నా వాక్యంబు జనులెల్ల నెఱుగ నీకిత్తడి నే దెరువిత్తునేని..’ ’(ఆ.మ. భా-అర. ప. ఆ. పుట. 588) అని తనకు రానున్న కష్టాల్ని వివరిస్తాడు.
యుద్ధరంగంలో రామునికి మాతలి రథము తెచ్చి సహాయపడడం తప్ప ఇంకెవరో ప్రత్యక్ష సహాయం చేసినట్లు లేదు కానీ ఎఱ్ఱన మాత్రం శ్వేతుడను గుహ్యకుడు (నాగ ప్రసిద్ధుడు) దివ్య జలాలను తీసుకవచ్చి అదృశ్య యుద్ధం చేస్తున్న ఇంద్రజిత్తు రామునికి కనిపించునట్లు చేసినాడని వివరించాడు.
సీత అగ్ని ప్రవేశం చేసినట్లు రాయకపోవడం ఎఱ్ఱన రచనలోని మరో విశేషం.
‘‘నాదగు బుద్ధి నీదు చరణ స్మరణ మొనర్చుగాని యొండేదియు నెన్నడుం దలంపు’’ (ఆ.మ.భా-అర. ప. ఆ. పుట.613 )రాదనుచు జానకి మాటలకు వత్తాసుగా ‘పృథివ్యాది భూతంబులు’, దిక్కులు వినునట్లు ‘‘తమ తమ నామంబులు ఎరింగించి’’ (ఆ.మ.భా-అర. ప. ఆ. పుట. 614) జానకీదేవి ఉత్తమురాలని రామునికి విన్నవించిరి. బ్రహ్మ కూడా ప్రత్యక్షమై ‘రాఘవు చేత సత్కృతుండై’ నలకూబర శాపకారణం చేత ‘దశగ్రీవునకు బరస్త్రీలయందు బలాత్కారంబు చెల్లదు’ అని వివరించడం ఎఱ్ఱన స్వోపజ్ఞకం.
వాల్మీకి మహర్షి మూలంలో రావణుడు ఇంద్రజిత్తును పిలిచి రామ లక్ష్మణులను సంహరించి రమ్మని చెప్పడం, కుమారుని పరాక్రమాన్ని వర్ణించడం చేయగా ఎఱ్ఱన్న మాత్రం ఇంద్రజిత్తు వస్తూనే తండ్రిని ఊరడిరచడంగా వర్ణించడం విశేషం. కుంభకర్ణుని లక్ష్మణుడు సంహరించడం కూడా మరొక విశేషం.
ఇక వర్ణనా విశేషాలలో కల్పనాశక్తిని ప్రత్యక్షం చేయగల గుణాలుగా ఊహా వైచిత్య్రం, అపూర్వ భావ విచిత్రం, సందర్భానుసరణ సన్నివేశ కల్పన ఎఱ్ఱన రామాయణ కథలో ఉన్నాయి. రామలక్ష్మణులు చూసిన పంపా సరోవరాన్ని ఎఱ్ఱన్న ఇట్లు వర్ణించాడు. ‘‘కమనీయ కమలినీ కహ్లాద దళ కేసరాన్విత జలముల నర్ఘ్య విధియు...’’ (ఆ.మ.భా-అర. ప. ఆ. పుట. 564) పంపా సరోవరంపై, అతిథి సేవానురక్త అయిన స్త్రీ గుణాన్ని ఆరోపించడం ఒక వ్యంగ్యం. ఇక్కడ సీతాస్వరూపాన్ని పాఠకుడి మనసులో నిలపడం ఇందుకు ప్రయోజనం. సంస్కతభారతంలో రేఖా మాత్రంగా ఉన్న ఈ సరోవర వర్ణన ఇక్కడ ఇంత విపులంగా చేయడం కూడా ఎఱ్ఱన్న స్వోపజ్ఞకమే. ‘మూలానుసరణంగా శ్రీరాముని ప్రయాణం వర్ణింపబడినా, అమూలకమైన ఋతు వర్ణనం కూడా ఉంది. ఇదే విధంగా మూలాతిక్రమణంగా హనుమదాదుల మధువన విహార వర్ణన ఉంది. ఇంకా అంగద రాయబారంలో దౌత్యం, పలుచోట్ల యుద్ధ వర్ణన, రామ సుగ్రీవుల మంత్రాలోచన, కుమారుని యువ రాజ్యాభిషిక్తుని చేయాలని దశరథుడు అభిలషించినప్పుడు శ్రీరామ గుణాదికాల వర్ణనంలో నాయకాభ్యుదయం - ఈ రీతిని అష్టాదశ వర్ణనలందలి పెక్కు వర్ణనలు ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అనేటట్లుగా “హృదయంగమంగా కావించబడినవని’’ (తెలుగుసాహిత్యంలోరామకథ, పుట. 214) పండా శమంతకమణి గారు అభిప్రాయపడ్డారు.
ఎఱ్ఱన్న రామకథలో గమనించవలసిన మరో అంశం రామునికై నిజంగా పరితపించి ప్రాణాలర్పించిన వారిలో దశరథునకు కాక జటాయువుకు శ్రేష్ఠత్వాన్ని ఆపాదించడం. ఎఱ్ఱన్న జటాయువు దశరథునకు మిత్రుడని, ‘అరుణ తనయుడని’ వివరించాడు.
ఎఱ్ఱన రచనా చిత్రాలలో ‘జానకీ విలాపము’ కూడ ఒకటి. ‘దేవతలార యో ధరణి దేవతలార’ అని పిలిచి, మూడు లోకాలలో వెలుగొందే రాముని కులాంగన జానకిని నన్ను మోహావేశంతో ఒక రాక్షసుడు ‘అనర్గళమై’ తీసుకొని పోతున్నాడు. ‘‘కృపం - గావరే పుణ్యమున్ యశము గైకొనరే యిదె మీకు మ్రొక్కెదన్’’ (ఆ.మ.భా-అర.ప. ఆ. పుట. 558)అని మొర పెట్టుకోవడం కరుణాత్మకంగా ఉంది.
‘‘అద్దేవి వీడ్కొల్పిన నేను లంకాపురదాహంబు సేసి యిట దేవరకింతయు విన్నవింప వచ్చితి’’ (ఆ.మ.భా- అర. ప. ఆ. పుట. 78) అంటూ ఒక చిన్న వాక్యంతో సుందరకాండ కథను ఎఱ్ఱన దాటేశాడు. సుందరకాండలో హనుమంతుని వన ధ్వంసం, రాక్షసులతోడి యుద్ధం, రావణ సందర్శనం మొదలైనవేవీ ఇందు లేవు.
నాగపాశబద్ధులైన రామలక్ష్మణులను విభీషణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగంచే బంధమోక్షణం చేయడం ఎఱ్ఱన రామాయణ గాథ కాగా, గరుడుని ఆగమనం చేత బంధముక్తి కావడం వాల్మీకి ఋషి ప్రోక్తం. కుంభ కర్ణుని రాముడు వధించినట్లు వాల్మీకీయం కాగా లక్ష్మణుడు వధించినట్లు ఎఱ్ఱన కథ.
రావణుని సన్యాసి వేష వర్ణనను గమనిస్తే, ‘‘కమనీయంబగు జన్నిదంబు శిఖయున్ గౌపీనమున్ ధాతు వ...’’ (ఆ.మ.భా-అర. ప. ఆ.పుట.556) ఎఱ్ఱన ధారాశుద్ధి, కథాగమన వేగం చూపు దృష్టి మనకు అవగతమవుతాయి. అట్లే దండకవన సీతతో రావణుడు : ‘‘ఎక్కడి రాఘవు దక్కట..’’ (ఆ.మ.భా-అర.ప.ఆ. పుట.557) అని సంభాషించే సందర్భంలో ఎఱ్ఱన వాడిన భాషలోని సులభాన్వయ సమాస ధోరణి, మృదుశైలి అనుభవైక వేద్యం. ‘‘యాడెద వీరనృత్యము రయంబున బార్థివ సూను లిద్దరం...’’ (ఆ.మ.భా-అర. ప.ఆ.పుట.602) అంటూ ఇంద్రజిత్తు తన పరాక్రమాన్ని తానే వర్ణించుకొంటూ రామలక్ష్మణులను బంధించి తెచ్చెదనన్న ఘట్టంలో ఎఱ్ఱనచే వీరనృత్యం అనే పదబంధం వాడబడిరది. ఈ పదాన్ని గూర్చి వివరిస్తూ ఆరుద్ర గారు. ‘‘వీరనృత్యం పద్మనాయకయుగంలో ప్రబలిన ‘రణముకుడుపుట’ ను సూచిస్తున్నదేమో’’ (సమగ్ర ఆంధ్రసాహిత్యం, ఆరుద్ర, పుట. 161) అని అభిప్రాయపడ్డారు. సమకాలీన ఆచారాలతో పాటు జాతీయాలు, పలుకుబళ్ళు కలిగి ‘కలవా రెల్లను మడిసిరి, కలిగియు లేడయ్యె కుంభకర్ణుడు’ అని రావణుడు వాపోవడం,పైగా అతనితో ఆ రాముడు ‘మమ్మెల్లను నేలకుం గోకులం దెచ్చుచున్నవాడు’ అని తెలుగులో మొఱపెట్టుకోవడం’గా వర్ణించడం ఎఱ్ఱన్నకే చెల్లింది.
ఎఱ్ఱన రాముడు ‘సితభూతి భూషితుడు’ భస్మరేఖాంకిత చిహ్నములు కలవాడు. శంభుదాస బిరుదాంచితుడైన కవి పుంగవుడు, సూర్యవంశ రాముని నుదుట భస్మరేఖ లుంచడం శైవ వైష్ణవ అభేదాన్ని చూపడానికే గాని మరొకందుకు కాదు. మారీచుడు రామ పరాక్రమం చవిచూచిన తరువాత ఏమైనాడో మనకు వాల్మీకి రామాయణంలో తెలియదు కాని, ఎఱ్ఱన రామకథలో మాత్రం సముద్రతీర తీర్థ క్షేత్రమైన గోకర్ణంలో తపస్సు చేయడాన్ని వర్ణించాడు. గోకర్ణం ఒక శైవక్షేత్రం కావడం గమనార్హం. సీతాపహరణం జరిగిన తర్వాత ‘ప్రియా విరహ దుర్మనస్కుండై’ రాముడు దుఃఖించాడని చెప్పడం సమాజంలో రామునికున్న ఏకపత్నీ వ్రత నియమ పాలనా గౌరవాన్ని చాటి చెబుతుంది.
సమాజంలో భారతీయ సనాతన సంప్రదాయ ధర్మమైన అంత్యేష్టిని జటాయువుకు రాముడు చేయడంలో అతనికి ఉన్న జీవకారుణ్య బుద్ధితో పాటు సమాజ సంప్రదాయానుసరణం పట్ల శ్రద్ధను చాటి చెపుతుంది. అతి గౌరవంగా, నిజ జనకునితో సమానంగా ‘అగ్ని సంస్కారాది కరణీయంబులు’ రామునితో పొందిన ఆ ‘కలుగుఱేడు’ ధన్యజీవి.
రాజుకు మంత్రి ఉండడం రాజధర్మం. సుగ్రీవునికి ‘సచివ చతుష్టయ’ ముండడం కూడా అంతే. పరదారాపహరణం రాముని దృష్టిలో క్షమించరాని నేరం. వాలిని నిర్మూలించి, రావణుని నిర్జించినా, లోకంలో ఏకపత్నీ వ్రత ధర్మాన్ని తానాచరించి ఉదాహరణ ప్రాయంగా నిలిచినా, రాముని లక్ష్యం ఒక్కటే. అది సమాజహితం. స్వప్న శాస్త్రం గూర్చి ఎఱ్ఱన రామకథలో త్రిజటా స్వప్న రూపంలో కొంత గ్రహించవచ్చు. దక్షిణదిశలో ప్రయాణమవడం మరణానికి, రాబోయే కీడుకు చిహ్నం అని నాటి ప్రజల నమ్మకం. భేరీ మృదంగ గంభీర నాదాలతో పాటు సింహనాదాల్ని సైతం వినిపించినా లేవని గాఢనిద్ర కుంభకర్ణునిది. ‘ఇట్టి చోద్యపు నిద్రలు గలవె ఎవరికైన జగములోన - ఎవ్వరేమైన ఎరుగవు ధన్యుడవు నీవు’ అంటాడు దశకంఠుడు తమ్మునితో. ఇది లోక ప్రసిద్ధమైన విషయం.
‘ప్రాప్త శ్రీ విశేషోన్నతిన’ పుష్పకవిమాన మధిరోహించి అయోధ్య చేరిన రాముని భరతాది బంధు జనాలు అఖిల పరిజనాలు అభినందించగా వశిష్ట వామదేవ ఋషి పుంగవుల ఆశీర్వచనాలు పొంది రాజ్యాభిషేకం పొందినాడు. మిత్రులకు బహుమానాలు ఇవ్వడం లోకాచారం. సుగ్రీవ విభీషణాదులకు, సుహృజ్జనాలకు రాముడు బహుకృతులంద జేయడం ఆ ఆచారాన్ని పాటించడమే.
5. ఔచిత్యం ప్రయోజనం :
‘‘భార్యా వియోగశ్చ జనాపవాదో.......’’ (షోడశి, గుంటూరుశేషేంద్రశర్మ.పుట. 37) అన్నది ప్రసిద్ధి పొందిన శ్లోకం. మానవునికి రాగూడని ఆపదలలో, అయిదింటిలో అగ్రస్థానంలో ఉన్నది భార్యా వియోగమే. ఆ దుఃఖాన్ని అనుభవించిన వారిలో రాముడు అగ్రేసరుడు. ఎటువంటి పేర్లూ లేకుండా ఆసాంతం కావ్యాన్ని రచించి లోకంలో ప్రసిద్ధుడైన కాళిదాస మహాకవి కృత మేఘదూత మహాకావ్యానికి ప్రేరణ రాముని వేదన.
అటువంటి దుఃఖాన్నే పొందినవాడు ధర్మరాజు. పాండవుల కులసతి ద్రౌపది పడని ఇడుములు లేవు. ద్యూత పరాజితులై భార్యానుజులతో కూడి పదమూడేండ్ల అరణ్యవాస క్లేశం అనుభవించడానికై కానల చేరి కామ్యకవనంలో పర్ణశాల నిర్మించుకొని ఆశ్రమవాస జీవితం గడుపుతున్న ధర్మజుని దుఃఖం ద్విగుణమయ్యేటట్లు, దుర్యోధనుని బావ జయద్రధుడు, ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో సఫలీకృతుడై ద్రౌపదిని తీసికొనిపోతుండగా, విషయం తెలిసిన భీమార్జునులు అడ్డుపడి, ద్రౌపదిని రక్షించి, ధర్మజుని అనుమతితో సైంధవుడిని విడిచిపెట్టారు. ఇది కురువంశ శ్రేష్ఠుని గాథ.
తండ్రిగారి ఆజ్ఞకు బద్ధుడై పదునాలుగేండ్ల వనవాసం అనుభవించడానికై ముందుగా చిత్రకూటం, పిదప దండకవనం చేరుకొని, అక్కడ పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేసి భార్యానుజులతో ఉన్న రాముని పరాభవించడానికి, ‘ప్రియా విరహ దుర్మనుస్కుడై’ క్రుంగిపోవాలని రావణుడు జానకిని అపహరించగా, పది నెలలు ఇడుముల పడి, చివరకు కపి వీరుల సాయంతో రావణుని హతమార్చి సీతను రక్షించుకొన్నాడు. ఇది ఇనవంశ శ్రేష్ఠుని గాధ. వనవాస వ్యధ ఇద్దరికీ సమానమే. భార్యా వియోగ వ్యధ కూడా అంతే. ఇది సంఘటపరమైన సామ్యం.
ధర్మజుని ప్రశ్నకు మార్కండేయుడు సమాధానం చెపుతూ, ‘ఎంతో దుఃఖం పొందినా నీవు పడే బాధ చాలా చిన్నది. ధర్మరాజా! పూర్వం శ్రీరాముడు కారడవుల్లో ఇడుముల పాలై దుఃఖపడ్డాడు. అతని భార్య జానకి రావణునిచే అపహరింపబడగా, వానరులతో కలిసి, ప్రయాసలకు ఓర్చి సముద్రానికి వారధి నిర్మించి తుదకు దివ్య శరాలతో ఆ దశకంఠుని సంహరించి ‘పడిన వ్యధలు - వాని ముందర నీ కష్టాలు స్వల్పం’ అని అన్నాడు.
ధర్మజుడు ‘‘మునీంద్రా! రాముండెవ్వని వంశంబువాడు. రావణుడెవ్వని తనయుండు, ఏమి కారణంబున సీతాపహరణము చేసె’’ (ఆ.మ.భా- అర. ప. ఆ. పుట. 537) అని రామ రావణ సంగ్రామం ఎట్లా ఘటిల్లిందో చెప్పమని ‘రామాయణ కథాశ్రవణ కుతూహలియై అడిగినాడు.
ప్రతిగా మార్కండేయుడు, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథునికి ముగ్గురు భార్యలు వారికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించగా అందులో శ్రీరామునికి, విదేహ రాజనందన జానకి భార్య అయ్యింది అని ఆరంభించి రావణ జన్మ వంశాలను సవిస్తరంగా వివరించి తిరిగి రామ యువరాజ పట్టాభిషేక భంగంతో అరణ్యవాస కథను జతపరిచి ప్రధాన కథతో అనుసంధించాడు.
6. ముగింపు:
ఇది భారతంలో అరణ్యపర్వంలో షష్టసప్తమాశ్వాసాలలో చోటు చేసుకున్న రామాయణ కథ సందర్భం. సంస్కృత భారతంలో కూడా ఈవిధంగానే ఉంది. తెలుగులో అనువదించడంలో ఎఱ్ఱన మహాకవి నన్నయ తిక్కనల శైలిని కలుపుకొనే యత్నం ఒకటి, నాటికాలంలో జనసామాన్యంలో బహుళ ప్రచారమైన రామాయణ కథాంశాలను (అవింధ్యుడు అను వృద్ధ రాక్షసుని కథల వంటివి) జతపరచడం రెండు, స్వతస్సిద్ధమైన శివభక్తి పారమ్యం మూడు, కలిపి ముప్పేటలుగా అల్లిన సుందర కథ ఈ భారతంలోని రామాయణ కథ.
భారత ద్రౌపదిని జయద్రథుడు అపహరించి పరాభవింపబడగా, రామాయణ జానకిని ‘అపహరించి రావణుడు మరణించినాడు. వ్యధను పొందిన ధర్మజ, శ్రీరామచంద్రులు వారి శత్రువులను నిర్జించడంలో పడిన క్లేశం సమానమే. భారతాంతర్గత సందర్భావసరాన్ని బట్టి, దుఃఖభారమగ్నుడైన ధర్మజునకు ఉదాహరణ కథగా, సామ్యం కల్గిన గాథగా రామాయణ కథ ఉండడం ఎంతో ఔచిత్యవంతంగా ఉంది.
ఆదికవి వాల్మీకి మహర్షి. తత్ కృతము రామాయణం. వేదసమం. పంచమవేదమైన భారతాన్ని నిర్మించుటలో, ఇతర పురాణప్రపంచాన్ని ఆవిష్కరించుటలో వ్యాసుడు యథేచ్చగా రామాయణశ్లోక సముదాయాలను వాడుకొన్నట్లు పండితులు నిరూపించారు. సంస్కృతభారతాంతర్గతరామాయణకథ కూడా అట్టిదే అయివుండవచ్చు. సత్యధర్మాలను బోధించే రామకథ, సంహిత. శ్రీరామకథను తమ రచనలలో చేర్చిన కవులు సత్య ధర్మ- తప-శాంతి దయలను లోకంలో వ్యాపింపజేశారు. శ్రీరామకథ విశ్వంలోని సకల మానవాళికి నీతిని ధర్మాన్ని ప్రబోధించే సత్యం.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- అచ్యుతరామశాస్త్రి, ఒగేటి. ఎర్రన అరణ్యపర్వ శేషము. సాహిత్యసభ ప్రచురణ, హైదరాబాదు, 1989.
- ఆరుద్ర. సమగ్ర ఆంధ్ర సాహిత్యం. సంపుటాలు, ఎమెస్కో ముద్రణ, హైదరాబాదు, 1965.
- కృష్ణమాచార్యులు, యం. మరియు వెంకటరామయ్య, గోలి. శ్రీమద్రామాయణం, గీతాప్రెస్ ప్రచురణ, హైదరాబాదు, 2004.
- దొరసామి శర్మ, రావూరి. తెలుగు సాహిత్యము - రామకథ. త్రివేణి ప్రచురణలు,హైదరాబాదు, 1972.
- మలయవాసిని, కోలవెన్ను. ఆంధ్రవాఙ్మయంరామాయణం, అరుణశ్రీ ప్రింటింగ్ అండ్ బైండింగ్ వర్క్స్, అమలాపురం, 1989.
- రాధాకృష్ణ శర్మ, చల్లా. రామాయణ వ్యాసాలు. లక్ష్మి నారాయణ ప్రచురణలు, హైదరాబాదు,1992.
- వెంకటరెడ్డి, కసిరెడ్డి. జాతిజీవనం పై రామాయణప్రభావం. జాతీయసాహిత్య పరిషత్ ప్రచురణ, హైదరాబాదు, 1974.
- వెంకటావధాని, దివాకర్ల. రామాయణ సుధాలహరి. యువభారతి ప్రచురణలు, హైదరాబాదు, 1976.
- శమంతకమణి, పండా. తెలుగు సాహిత్యములో రామకథ. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి ప్రచురణ,హైదరాబాదు, 1972.
- శివప్రసాద్, ముదిగొండ. ఉద్యమ దర్శనం. రస గంగోత్రి ప్రచురణలు, హైదరాబాదు, 1990.
***
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

