AUCHITHYAM | Volume-5 | Issue-3 | March 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. తుమ్మల రామకృష్ణ 'మట్టిపొయ్యి' కథ: సామాజికవిశ్లేషణ
డా. రాళ్ళపాటి లోకనాథం
తెలుగు పరిశోధకులు
చిట్టివలస, కోటబొమ్మాళి మండలం,
శ్రీకాకుళం జిల్లా. ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9652070204, Email: rallapati88@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
భారతీయ సమాజంలో కుటుంబవ్యవస్థ ప్రాచీనమైన సాంప్రదాయత కలిగిన అతిపెద్దవ్యవస్థ. బంధాలు - అనుబంధాలు, బంధుత్వాలు - దగ్గరితనాలు, వారసత్వాలు – విలువలువంటివి సంపూర్ణస్థాయిలో ఆవిష్కరింప బడతాయి. వ్యక్తులుకుటుంబాలుగా, కుటుంబాలు సమాజాలుగా రూపుదిద్దుకొని ఓబృహత్ వేదికకుదారితీస్తాయి. కుటుంబాలలో రక్తసంబంధాలు, వైవాహికబంధాలు వంటి విభాగమై విస్తరణను తరతరాల వారసత్వాలకు కుటుంబవిలువలను, వ్యక్తిత్వాలనుసంక్రమింపజేస్తారు. ఇకపూర్వం సమిష్టి కుటుంబాలపేరుతో రెండు, మూడు తరాలు కలిసిమెలిసి నివసిస్తూ అతిపెద్ద కుటుంబాలగా మనగలిగేవి. కాలక్రమేణా పెనుమార్పులు సంభవించి ఆధునికతకు దారితీసి చిన్నకుటుంబాలుగా విచ్చినమై స్థిరపడ్డాయి. సమిష్టి కుటుంబాలలోఉన్నంత భద్రత, ఆనందం చిన్నకుటుంబాలలో ఉండవు. కానీమనిషి ‘నేను’ ‘నా’అనే స్వార్థాలలోపడి సంకుచిత భావాలతో శాశ్వతమైన వాటికన్నాఅశాశ్వతమైన వాటికే ప్రాముఖ్యతను ఇస్తున్నాడు. కనుక ఏది తనకు అవసరమో దాన్ని కోల్పోతున్నాడు. ప్రస్తుత కాలంలో పూర్తి సమిష్టి కుటుంబాలుగా వ్యక్తులందరూ కలసి ఉండటం వ్యవసాయ కుటుంబాలలో తప్ప మిగతా అంతరికీ ఉద్యోగరీత్యా సాధ్యపడదు. కానీ కుటుంబం అంటే కలసి ఉండటం. ఇది మానసికంగా అందర్నీఒకేచోట ఉండేలా భావింపజేసి వ్యక్తులు అన్యోన్యంగా ఉండటానికి ఉమ్మడి కుటుంబం దోహదపడుతుంది. అనే ఉద్దేశ్యంతో గ్రామీణ కుటుంబ వ్యవస్థపై పూర్తి అవగాహన కలిగిన రచయితగా తుమ్మల రామకృష్ణగారు ‘‘మట్టిపొయ్యి’’కథలోఉమ్మడి కుటుంబంలో ఉన్న మౌలికమైన సామాజికాంశాలను చిత్రీకరించారు.
Keywords: మట్టిపొయ్యి, ఉమ్మడికుటుంబం, కథ, చిన్నన్న, రోసినాయుడు, అప్పులు, విలువలు, గ్రామీణసమాజం
1. ఉపోద్ఘాతం:
తెలుగుసాహిత్యపరంపరలోఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, నవలలు, కథలు, వ్యాసాలు, కవితలువంటిప్రాచీన, ఆధునిక ప్రక్రియలు అందర్నీఅలరిస్తున్నాయి. కాలానుగుణంగా ఆయా కాలాల్లో ఓప్రత్యేకతను నిలుపుకొంటూ ఒకప్రత్యేకశైలీ, సాంప్రదాయాలతో, విశిష్టలతో సాహితీ ప్రియులను ఓలలాడిరచాయి. ఎన్ని ప్రక్రియలున్నా కథారూపాలకు మాత్రం ఎప్పుడూ ఓఉన్నతస్థానం ఉంది. ఒకప్పుడు ఆఖ్యానాలలోఇప్పుడున్నకథ, కథానికలు విలసిల్లాయి. నిడివినిబట్టి చిన్న, పెద్ద కథలుగా ఉండి పాఠకుల అభిరుచిని అనుసరించి అలరించాయి.
ఆధునిక రచయితలు కేవలం కాలక్షేపంగా కాక ప్రయోజనాన్ని ఆశించి సమకాలీన సామాజిక అంశాలను ఇతివృత్తాలుగా ఎంచుకొని కథనాన్ని రాస్తున్నారు. దీనివలన సమాజంలోసమస్యలు, వాటికిగల కారణాలను, మనుషులలో ఆలోచనలును రేకెత్తించి తద్వారా చైతన్యం కలిగేలా దోహదం చేస్తున్నాయి. అదే ధోరణిని తుమ్మల రామకృష్ణ తనకథలలో చిత్రీకరిస్తూ దిగజారుతున్న విలువల ప్రతిష్టాపనకు కలంపట్టి కథా రచనచేసి, తద్వారా కుటుంబంలో తప్పుఒప్పులను తెలియపరచి, సరిచేసే బాధ్యతను, నిర్వర్తిస్తూ కథాసేద్యం చేసారు.
2. రచయిత పరిచయం:
తుమ్మల రామకృష్ణ తేది 12-10-1957న చిత్తూరు జిల్లా, సోమల మండలంలోని ఆవులపల్లె గ్రామంలో శ్రీమతి సాలమ్మ, మునివెంకటప్ప దంపతలకు జన్మించారు. రామకృష్ణగారికి చంద్రకళతో మొదట వివాహాం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం తరువాత చంద్రకళ ప్రమాదవశాత్తు మరణించడంతో 2004 సంవత్సరంలో విజయలక్ష్మిని రెండో వివాహం చేసుకొని జీవితం సాగిస్తున్నారు.
1989వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయవిశ్వవిద్యాలయ పి.జి. సెంటర్‌కర్నూలులో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి 2004 డిసెంబర్ 1న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో రీడర్‌గా చేరారు. ఇటీవల కాలంలోనే కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ హోదాలో 2023 నవంబర్ 20వ తేదీన పదవీవిరమణ చేసి విశ్రాంతజీవనం గడుపుతున్నారు.
3. మట్టిపొయ్యి కథ - కథాకథనం :
ఈ కథ కర్నూలు సాహితీ మిత్రులు వెలువరించిన ‘హంద్రీకథలు’సంకలనంలో మట్టిపొయ్యి కథ డిసెంబర్ 2003లోముద్రింపబడిరది. ఈ కధారచయిత తుమ్మల రామకృష్ణగారు.
రచయితకు వెంకటరమణ, కృష్ణమూర్తి అనే అన్నలు, శ్రీరాములు అనే తమ్ముడు, ఇద్దరు అక్కలు ఉండేవారు. అందరూ ఉద్యోగస్తులు కాగా చిన్నన్న కృష్ణమూర్తి అతని భార్య రత్నమ్మతో పాటు వృద్దురాలైన తల్లితో స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకొంటుండేవారు. సెలవలువస్తే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు, తోడికోడళ్ళు పిల్లలతో పాతికమందిపైగా తమపల్లెకు వెళ్ళి సమిష్టిగా సరదాగా ఉండేవారు. అలా ఒకసారి ఉమ్మడి కుటుంబం అంతా చేరినపుడు చిన్నన్న కృష్ణమూర్తి వైఖరిపట్ల కొంత అసంతృప్తికి లోనవుతారు అందరూ. పంటల రాబడి ఉన్నా లక్షరూపాయల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది. కృష్ణమూర్తి పిల్లల చదువుల ఖర్చు తామోభరిస్తున్నాఇంట్లో ఏదో కొరత ఉండేది. ఆగ్రామంలో కృష్ణమూర్తి కొంత ఆడంబరాల ఖర్చులు, అనవసర గృహ అలంకరణలు పెట్టడం, దానితో పాటు రాజకీయాలు, ఇతరులకు మద్యవుండి అప్పులు ఇప్పించడం వంటివి కృష్ణమూర్తి చేస్తున్నాడని తెలిసిన పెద్దన్నమందలించగా కృష్ణమూర్తి అతని భార్యనొచ్చుకొని కొంతపెడసరంగా మాట్లాడతారు.
రచయితకు తన చిన్ననాటి స్నేహితుడు వెంకట్రాముడు ద్వారా ఒకప్పుడు ఏమీలేక ఆఊరికి వచ్చిన గుంతకనమోళ్ళు అందరకీ అప్పలివ్వడం, అందరి తనఖా పొలాలును ఆక్రమిస్తూ ఆఊరిలో పెత్తందారుగా పాతుకు పోయాడని వారుచేయని దాష్టీకాలులేవని పైకి మంచిగా నటిస్తూ ఊరిని చక్కబెట్టేస్తున్నారని తెలుస్తుంది. అలాంటి వారితో కృష్ణమూర్తి రాసుకుపూసుకు తిరుగుతూ అందరకీ తాను అడ్డుండి అప్పులిప్పిస్తున్నాడని ఆవే చిన్నన్నపై ఆర్ధిక భారాలైయ్యాయని అర్ధం చేసుకుంటాడు. తమకు చెప్పకుండా అమ్మిన పొలం గురించి పెద్దన్న వెంకటరమణ తమ్ముణ్ణి్ట్ల ప్రశ్నించగా అతనుదురుసుగా మాట్లాడతాడు. ఈ ఇద్దరి మాటలు పెరిగి పెద్దవై తల్లి ఏమి మాట్లాడలో తెలియక మౌనం వహిస్తుంది. వదినలు, మరదలు తమవారు అని పక్కన పెట్టి కృష్ణమూర్తి దురుసుమాట్లకు అందరూ బాధపడి ఎవరి గమ్యాలుకు వారు తిరుగుప్రయాణం అవుతారు. రోసినాయుడు వంటి స్వార్ధపరుల చేతిలో రైతులు, కుటుంబాలు చిక్కుకోవడం చూసి రచయిత ఆవేదన చెందుతాడు.
4. సామాజికవిశ్లేషణ:
‘మట్టిపొయ్యికథ’ ఒక కుటుంబకథ గ్రామీణ జీవితాల్లో విచ్చిన్నమౌవుతున్న ఉమ్మడి కుటుంబాలకు వెక్కిరిస్తున్న ఆర్థికస్థితిగతులకు ప్రతీక ‘మట్టిపోయ్యి’కథ. ఈ కథ సమకాలీన గ్రామీణ కుటుంబవ్యవస్థకు అద్దం పడుతుంది. ఒకకుటుంబంలో వ్యక్తుల ఆలోచనలు, ఆర్థిక, రాజకీయ విషయాలు ఏవిధంగా మనుషుల మధ్య దూరాన్నిపెంచి, కుటుంబ విశ్చిన్నానికి పాల్పడతాయో విశ్లేషించబడ్డాయి. విలువలు, బాధ్యత, పెద్ద-చిన్న అంతరాలు మరవడం లెక్కలేని తనాలు మొదలైనాంశాలు వ్యక్తులు మధ్యదూరాలను పెంచుతాయి. ఈ విధమైన వైనాలతో పాటు సమకాలీన గ్రామీణ కుటుంబాలు ఏవిధంగా విచ్చిన్నమవుతున్నాయో పాఠకులను ఆలోచింపజేసారు.
‘‘సెలవులకి మావూరికి వెళ్లడమంటే మాపిల్లలకి ఎంతోసరదా .... ఉత్సాహంకూడా ... నాకు మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా నాది తెంచుకోలేని బంధం’’1
సాధారణంగా ఏకుటుంబంలోని పిల్లలైనా సెలవులు వచ్చాయంటే అలాంటి సందర్భంలో సాధారణంగా ఎవరైనా సొంతగ్రామాలకి వెళ్లడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఎక్కడెక్కడోవున్న కుటుంబ సభ్యులందరూ ఒకచోటచేరి ఇల్లు పిల్లలు, పాపలతో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అనుబందాలుఅన్నీ ఆసమయంలో మాత్రమే బహిర్గతమౌతాయి. కానీ ‘రచయిత మాత్రం నాకు కొంచెం ఇబ్బంది’అనటంలో ఏదో చెప్పుకోలేని ఆవేదన తెంచుకోలేని అనుబంధం బహిర్గతమైంది. దీనికి కారణం కుటుంబంలో వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు, మనస్పర్థలు, దాపరికాలు, ఆర్థిక, రాజకీయ వైషమ్యాలే కారణంగా చెప్పవచ్చు.
కుటుంబంలో ముఖ్యమైనవి విలువలే వాటిని ఏ ఒక్కరు విస్మరించినా ఇలాంటి మనస్పర్థలు వచ్చి గొడవలకు మూలకారణం అవుతూ ఇల్లుకానీ, కుటుంబంకానీ తిరోగమనం బాటపడుతుందని, సమిష్టి కుటుంబాలలో ఆనందం కరువు అవుతందని తెలియచేసారు. ఇక ఏదైనా ఒక ఇంట్లో కోడళ్ళు వేరువేరు కుటుంబాల నుంచివచ్చినా, అక్కాచెల్లెళ్ళలా కలసిమెలసి ఆనందంగా మెలగాలని, అత్తవారి ఇల్లు తమకు పుట్టింటితో సమానంగా భావించాలని అత్తమామలని తల్లిదండ్రులువలె చూసుకోవాలని చెప్పడంలోభాగంగా
‘‘కోడళ్ళు ఎవురూ ‘అమ్మ’ని ‘అత్తా’నిపిలవరు. అమ్మానే పిలుస్తారు. మొదట్నుంచీ వాళ్ళకు అట్లే అలవాటైపోయింది’’2
అని రచయితే తన కుటుంబం గురించి చెప్పి అదే ఆదర్శనీయం అని అనుబంధాలకు నిలయంని సూచించారు. కాని రచయిత యొక్క చిన్నన్న, అతని భార్యలా బాధ్యతారాహిత్యంతో పిల్లల చదువులు పెళ్ళిళ్ళు సోదరుల మీద భారంవేసి ఇంటిపనులన్నీ తల్లిపైభారం వేయడం సరికాదు. పైగా ఎవ్వరూ తనకు సాయం చేయరన్నట్లు మాట్లాడటం వలన కుటుంబ విలువలు విస్మరించాడు. ఇలాంటివారు ఇంటి కొకరైనా ఉండటం వలనే ఉమ్మడి కుటుంబాల పునాదులు బీటలు వారుతున్నాయి అని హెచ్చరించారు.
ఇక ఆర్థిక పరమైన విషయాలుకు వస్తే ఏవిధంగా కుటుంబ కలహాలకు దారితీసి విచ్చిన్నత అవుతాయో చర్చించారు. ఆస్తులు సమృద్దిగా వున్నా, అప్పులు చేసే పరిస్థితికి వ్యక్తులు దిగజారినపుడు కుటుంబ కలహాలకు బీజం పడుతుంది. అలా ఆర్థిక లావాదేవీల సమస్యలు మొదలై కుటుంబం చిన్నాభిన్నం అవడానికి ఇదొక ప్రధాన కారణం అని చెప్పారు. చిన్నన్నలా గ్రామంలోని ప్రజలకు అందరకీ అండగా నిలిచి అప్పులు ఇప్పించడం, అనవసర ఆడంబరాలకు డబ్బు ఖర్చుచేసి గొప్పలకు పోవడంసరికాదు. డబ్బువిషయంలో మదుపు, పొదుపు, లెక్క అనేది ఉండాలి. బయట వ్యక్తులకు నమ్మి అప్పులకు మద్యస్తం చేస్తే వారు దివాలా తీస్తే ఆ అప్పు మొత్తం తానే భరించాల్సింటుంది. అలా అప్పులపాలై ఆస్తులను అమ్ముకుని వీధిని పడినవారు గ్రామీణ సమాజంలో కోకొల్లలు.
అందుకే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలి. అన్నదమ్ముల వద్ద దాపరికాలు లేకుండా ప్రతిరూపాయికీ ఖర్చు పారదర్శకంగా ఉండాలి. భూమిని అమ్మిన విషయం కూడా ఇంట్లో చెప్పని చిన్నన్న-
‘‘అందరూ మాటలు చెప్పేవాళ్ళే? ..... లక్షరూపాయల అప్పుంది. మీరేమన్నాఆరుస్తారా ... తీరుస్తారా’’3
అని నిష్టూరపు మాట్లాడటం తగనిది. అనవసరంగా చేసిన అప్పులును మరొకరు తీర్చాలని ఆశించడం కూడా తప్పే. ప్రతి పైసా ఆచితూచి లెక్కలుకట్టి రాబడి, పోబడి చూసినపుడు అప్పులు అనేవి ఉండవు. ఎంతచెట్టుకి అంతగాలి అని తృప్తిచెంది బ్రతకటం అలవాటు చేసుకుంటే ఆర్థిక కష్టాలు కలగవు.
పెద్దన్న ‘‘సరేనీమాటకేవద్దాంరా ... ఇల్లు అప్పుచేసి మేం కట్టమన్నామా నీకు నీబిడ్డలకి ఇప్పుడున్నఇల్లు చాలదా, ఎవరుండారీడ. నువ్వూ, నీపెండ్లాము, ముసలమ్మ ఇద్దరు పిల్లోళ్ళు. మీకా ఉన్నభూమిచాలదా’’!4
పైమాటల్లోఒక కుటుంబ పెద్దదిక్కూ తండ్రి తర్వాత ఇంటి పెద్దకొడుకుగా బాధ్యతతో చెప్పిన మాటలుగా చెప్పవచ్చు. తప్పుడు మార్గంలో నడిచిన అన్నదమ్ముడికి హితబోదచేస్తూ ‘‘అప్పుచేసిపప్పుకూడు’’తినకూడదు అనే సామెత చెప్పినట్టుగా కుటుంబానికి తగ్గట్లుగా ఇల్లుంటే చాలు అంగులు, ఆర్బాటాలు, ఆడంబాలు అనేవి సమాజంలో ఏ వ్యక్తికీ మంచిది కాదు అనేది తేటతెల్లమైంది.
‘‘ఎందుకురాలేనిపోనిగొపలకిపోయిబోడైపోతావు’’5
అని చెప్పినా వినని తమ్ముడు అప్పులు అందరినెత్తిన రుద్దేప్రయత్నం చేస్తే రచయితలాగ ఆలోచిస్తూ,
‘‘చిన్నన్నఅప్పులు వుండాయి అంటున్నాడు.
అప్పులు ఎవరు తీర్చాలి.
చిన్నన్నా ... లేక అందరూనా .... అందరికోసం
చేసిన అప్పులేనా ... చిన్నన్నలాగా చిన్నన్నకొడుకు
అప్పుల్లోకూరుకు పోతాడా ....
ముందుకు నడుస్తున్నామా .... వెనక్కి నడుస్తున్నామా ....
ఆలోచనల మధ్య తెల్లారి పోయింది’’6
పైవాక్యాలలో రచయిత యొక్క ఆవేదన బహిర్గతం అయ్యింది. ఆ రాత్రంతా ఆలోచిస్తూ చిన్నన్నను అప్పుల ఊబిలో నుండి ఎట్లా బయటపడతాడు అందరమూ ఈ అప్పులకు కారకులమా! లేదా చిన్నన్న మాత్రమే ఈ అప్పులు గొప్పలకి పోయిచేశాడా! చిన్నన్న కొడుకు కూడా చిన్నన్న మాదిరిగా అప్పుల బారిన పడతాడా! వీరి భవిష్యత్తు ఎటువెళ్తుంది అభివృద్ధి దిశలేకా దివాలాతీసేదిశా అనే మీమాంసతో ఆలోచనల మధ్య ఆరాత్రి గడిచిన తీరును విషదపరచారు.
సరైన కారణంతో చేసిన అప్పులైతే అందరూ కలసి తలొకచేయి వేసి తీర్చే అవకాశం వుంటుంది. కానీ వైభవాల కోసం, ఇతరలకు మధ్యస్తం వుండి అప్పులిప్పించడం వంటి అహేతుకమైన పనులు చేయడం తగదు. తీర్చ గలిగే ఆర్థిక స్థోమత లేనప్పుడు అప్పులు చేయడం తగదు. ఏదో ఉన్నపాటి ఆస్తి సంపాదనతో భార్యాబిడ్డలతో ఆనందంగా జీవనం సాగించాలి కాని మనం చేసే తప్పుకి ఎదుటవారిపై నిందవేయడం తప్పు.
ఉమ్మడి కుటుంబాలలో ఇలాంటి వ్యక్తుల వలనే ఎవరికి వారై కుటుంబ విచ్చిన్నతకు ఈ ఆర్థిక సమస్యలకు ముఖ్యకారణం అవుతున్నాయని వివరించారు.
పెట్టుబడిదారులు, వడ్డీవ్యాపారులు, పెత్తందారులు ఒక వ్యూహాం ప్రకారమే పథకం వేస్తారు. ముందు కుటుంబ స్థితిని, వ్యక్తి మనస్తత్వాని అంచనా వేసి అప్పులిస్తారు తిరిగి వసూలుచేసే ఎత్తుగడలో భాగంగా చిన్నన్నపాత్రలాంటి వారిని బలి చేస్తారు అనడంలోఎలాంటి సందేహం లేదు.
వెంకట్రాముడు
‘‘నీకు తెలుసునో లేదో నడిపి మామసంగతొకటుంది మామా...’’ ‘‘ఏందిరా అది ....’’ మామగుంతకనుమోళ్ళతో రాసుకోని పూసుకోని తిరుగుతాండాడు, వూర్లో చానామందికి పూచీకత్తూయిచ్చి వాళ్ళ దగ్గర అప్పులు వడ్డీకి యిప్పిచ్చినాడు అప్పులన్నిటికీ జామీను మామేగదా .... రేపొద్దున వాళ్ళు అప్పులు కట్టకపోతే మన మామతో వసూలుచేస్తారు. యిబ్బుడికే యాబై అరవైవేలు జామీను అప్పులు మీద పడ్నాయని వూర్లో అనుకుంటుండారు ....’’7
పై సంభాషణ రచయిత చిన్ననాటి స్నేహితుడు వెంకట్రాముడు రచయితతో సంభాషించే తీరును పరిశీలించినట్లైతే ఎవరో మూడో వ్యక్తికోసం తమ సొంత కుటుంబ పరువు, పరపతిని అడ్డుపెట్టి వాటిని ఏవిధంగా కోల్పొతారో, పరువు ప్రతిష్ఠలతోపాటు తాను కూడా తనకు తెలియకుండానే అప్పులు ఊబిలోకి ఎలాకూరుకుపోతారో అనే విషయం చెప్పదలచారు. కొన్ని కుటుంబాలలో కొంతమంది వ్యక్తులు సమాజంలో పెద్దరికపు పాత్రకోసం గుర్తింపుకోసం తపనపడి మధ్యస్తాలుచేసి జామీనులువుండి ఆర్థిక సమస్యలను ఎలాకొని తెచ్చుకుంటారో రచయిత చిన్నన్నపాత్ర ద్వారా ఈ కథలో మూర్ఖత్వంగా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవల్సింటుందో అనే విషయం ఈ కథలో వెంకట్రాముడు పాత్ర ద్వారా తెలియజేసారు.
5. ముగింపు:
ఈ వ్యవసాయరంగంలో ఎక్కడనుంచో వలసవచ్చి ఊర్లో ఒకరిద్దరి అండదండలతో స్థిరపడి, తమవంచనా శిల్పంతో అప్పులిచ్చే వలపన్ని, రాజకీయ ప్రాబల్యంతో పల్లెప్రజల భూములన్నింటినీ సొంతంచేసుకోగల రోసినాయుడులాంటి వాళ్ళే చివరకు మిగులుతారు. వీళ్ళు పరోక్షంగా అన్నదమ్ముల మధ్యఅనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలవిచ్ఛిత్తికి, సకల ప్రేమల వినాశనానికి కూడా కారకులౌతారు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్ళు ఏకధృవ ప్రపంచానికి సంకేతాలుగా ఉంటారు అనటంలో ఎలాంటి సందేహం లేదు.
క్లుప్తంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థలోంచిపుట్టుకొస్తున్న కొత్తసమస్యలను ఈ మట్టిపొయ్యి కథ ద్వారా పాఠకులకు తుమ్మల రామకృష్ణ తెలియజేసారు. అప్పులపాలైపోతున్న రైతుకుటుంబాలు, పెత్తందార్లకుట్రలకు విచ్చిన్నమౌతున్న ఉమ్మడి కుటుంబాలు, బీడులుగా మారుతున్నమాగాణులు, కుబేరుల్లా ఎదిగిపోతున్న వడ్డీవ్యాపారులు, గ్రామీణ పల్లె ప్రజలకుపట్టి పీడుస్తున్న దృష్ట గ్రహల్లా మనకు కన్పిస్తారు. గ్రామీణ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రతిబింబించే ఈ కథలో రచయిత యొక్కస్వీయానుభవం ఉన్నట్లు కనిపిస్తుంది.
6. పాదసూచికలు:
- మట్టిపొయ్యికథలసంపుటి, పుట - 109.
- పైదే, పుట - 110.
- పైదే, పుట - 112.
- పైదే, పుట - 113.
- పైదే, పుట - 113.
- పైదే, పుట - 130.
- పైదే, పుట - 128.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- ఇనాక్, కొలకలూరి (1974), సాహిత్యవ్యాసాలు, స్టేషన్‌రోడ్, హైదరాబాద్.
- దక్షిణామూర్తి, పోరంకి (1986), కథానిక-స్వరూపస్వభావాలు, హైదరాబాద్.
- రామకృష్ణ, తుమ్మల (2004), పరిచయం, (సాహిత్యవ్యాసాలు) చంద్రకళా పబ్లికేషన్ తారానగర్, శేరిలింగంపల్లి, హైదరాబాద్.
- రామకృష్ణ, తుమ్మల (2009), బహుముఖం, (ఆధునిక సాహిత్య వ్యాసాలు) చంద్రకళా పబ్లికేషన్ తారానగర్, శేరిలింగంపల్లి, హైదరాబాద్.
- రామకృష్ణ, తుమ్మల (2004), మట్టిపొయ్యికథలు, తెలుగువిశ్వవిద్యాలయం, హైదరాబాద్.
- రామారావు, కాళీపట్నం (1994), కారాకథలు ` సామాజికవిశ్లేషణ, విశాలాంధ్రపబ్లిషింగ్‌హౌస్, హైదరాబాద్.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి (1996), కథాశిల్పం, విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్, విజయవాడ.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి (2002), విమర్శాశిల్పం, విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.