AUCHITHYAM | Volume-5 | Issue-3 | March 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
9. క్షేత్రయ్య విరచిత ‘నాయక’ శృంగార పదములు: సాత్విక - సామాన్యాభినయ విశ్లేషణ
నాగలాపురం హరిప్రియ
నృత్య అధ్యాపకురాలు, సంగీత నృత్య లలిత కళల విభాగము,
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8309082432, Email: honeyharipriya5@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
తెలుగు పదసాహిత్య వినీలాకాశంలో శృంగార రసమంజరులను వికసింపజేసిన ధ్రువ తారాసమానులు క్షేత్రజ్ఞులు. వీరు రాసిన శృంగార పదాలలో అష్టవిధ నాయిక- నాయక అవస్థలను చతుర్విధాభినయ భరితoగా, రసాత్మకంగా అనుభవించి, అభినయించడం నృత్య అభ్యాసకులకు చాలా ప్రీతితో కూడిన విషయం. శాస్త్రీయ నృత్యాలలోని ప్రదర్శనా మార్గాలలో (Repertoire) క్షేత్రయ్య రాసిన శృంగార పదాలకు ప్రత్యేకమైన స్థానముంది. వైవిధ్యమైన సంచారీ భావాలను, మనోవికారాలను, అవస్థలను అభినయించేందుకు ఎంతో అనువైనవని ఎందరో నృత్య దిగ్గజులు అభిప్రాయపడ్డారు. క్షేత్రయ్య పదాలలో ఉన్న రస–భావ ప్రక్రియలపై చాలామంది రసజ్ఞులైన పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేసి ఉన్నారు. ఎక్కువ శాతం ‘నాయికా’ ప్రాధాన్యమైన (Heroine Centric) క్షేత్రయ్య పదాలే నృత్య ప్రదర్శనలలో సభికులకు పరిచయo. క్షేత్రయ్య రాసిన ‘నాయక’ శృంగార పదాలు (Hero Centric) చాల తక్కువగా లభ్యమైనాయి. కనుక, ఈ పరిశోధన వ్యాసము క్షేత్రయ్య రచించిన కొన్ని ‘నాయక‘ పదాలలోని నాయకుడి లక్షణాలను గురించి చర్చించడం, అతడి మాటల ద్వారా నాయిక యొక్క భావములను గమనించడం మరియు వాటిని నాట్యశాస్త్రములోని 22వ అధ్యాయo అయిన ‘సామన్యాభినయము’లో ఉన్న ‘సాత్విక –సామన్యాభినయ’ అలంకారముల కోణoలో విశ్లేషించడం.
Keywords: సాత్వికాభినయం, సామన్యాభినయం, వ్యభిచారి/ సంచారి భావములు, శృంగారం, విప్రలంభము, విరహము, విహ్రుతము, బిబ్బోకం, కుట్టామితం, విచ్చిత్తి, మొట్టాయితం, కిలకించితం, ప్రాగల్భ్యం.
1. ఉపోద్ఘాతం:
శాస్త్రీయ నృత్యాలలో నేడు శృంగార పదాలను పలు విధాలుగా మనోధర్మాలతో ప్రదర్శిస్తున్నారు. అందులో నాయికా-నాయకుని మధ్య అనుకూల పరిస్థితులు ఉన్నవి కొన్ని అయితే, వాదించుకొనేవి మరికొన్ని. విరహంతో నాయికను గురించి నాయకుడు లేదా నాయకుడిని తలుచుకొని నాయిక చింతించేవి కొన్ని అయితే, ఒకరినొకరు యేమార్చుకొనేవి మరికొన్ని. సాధారణoగా పదాలలో నాయిక-నాయకులకు వారి యొక్క సఖుల సహాయము ఎక్కువగా లభించడం చూస్తాము. భరతముని నాట్యశాస్త్రంలో అష్టవిధ నాయికలు చెప్పారు. రుద్రభట్టుడు వ్రాసిన కావ్యాలంకారములో దాదాపుగా 384 నాయికావిధములు చెప్పారు. కాని భానుదత్తుడు రుద్రభట్టుడు చెప్పిన వర్గీకరణను సమ్మతించలేదు. సింగభూపాలుడు వ్రాసిన ‘రాసార్నవసుధాకారము’, భానుదత్తుడు వ్రాసిన ‘రసమంజరి’ మొదలగు వాటిలో ఎక్కువగా సమ్మతించిన నాయికాభేదాలు మొత్తo సంఖ్య 16 గా ఉంది. నాయక భేదాలు నాయికకు ఉన్నంత ఎక్కువ సంఖ్యలో లేవు. ఎందుకoటే నాయికాభేదాలు స్త్రీ యొక్క మానసిక స్థితి (Emotional temperaments) మరియు తన మనోవికారాలను (psychological variants) ఆధారoగా చేసుకొని ఉంటే, నాయక భేదాలు పురుషుని యొక్క సహజ స్వభావము (Natural character/ personality) పై ఆధారపడి ఉంటాయి కనుక. వాటి దృష్ట్యా క్షేత్రయ్య శృంగార పదాలను అధ్యయనo చేయడం నృత్యకారులకు ఎంతగానో ఉపయోగకరం.
2. క్షేత్రయ్య పరిచయం:
ఆంధ్రప్రదేశ్ రాష్టo కృష్ణా జిల్లాలో ఉన్న మొవ్వ గ్రామంలో క్షేత్రజ్ఞులు జన్మించారు. వీరి జన్మనామము వరదయ్యగా తెలుస్తోంది. వీరు మొవ్వలోని గోపాలస్వామి ఆరాధకులు. అందుకే ఈయన రచనలలో మువ్వ గోపాల ముద్ర కనిపిస్తుంది. వీరు ఎన్నో తీర్త క్షేత్రాలను సందర్శించి భక్తి పారవస్యులై తమ జీవితమును గడిపారు కనుకే ‘క్షేత్రయ్య’ అనే పేరుతో ప్రసిద్ధి చెందారు అని చరిత్రకారుల మాట. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తాను వ్రాసిన చిత్రభాను ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో క్షేత్రయ్య జీవితములో జరిగిన ఒక సంఘటన గురించి వివరించినారు. ఏమనగా క్షేత్రయ్య ఒకానొక గోపాలుని ఆలయమును సందర్శించినపుడు అక్కడ ఒక దేవదాసీని మొహించినారట. కానీ ఆ దేవదాసి తనకి గోపాలుడే దేవుడని చెప్పి, గోపాలునిపై పదములను వ్రాసి తనని మెప్పించమని షరతు పెట్టిoదట. ఇది కష్టమైన విధిగా తలచి గోపాలుడిని ధ్యానo చేయగా పరమాత్ముని అనుగ్రహము కొన్నాళ్ళకు లభించినది. అప్పటి నుంచి అలౌకిక రసానుభూతిని పొంది, క్షేత్రయ్య సంతోషoతో మువ్వగోపాలునిపై పదాలు వ్రాసినారట. కనుకే వీరి పదాలన్నిoటిలో శృంగార రసము కేంద్రమైనది.
భగవద్గీత 13 వ అధ్యాయములో ‘క్షేత్రం’ మరియు ‘క్షేత్రజ్ఞ’ అను పదాలకు అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా చెప్పినారు:
“ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రం ఇతి అభిదీయతే |
ఏతద్ యో వెట్టి తమ్ ప్రాహుహ్ క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||”
అంటే ఈ శరీరమే ఒక క్షేత్రo అని, ఇటువంటి శరీరాన్ని సంపూర్ణముగా (జ్ఞానము) తెలుసుకున్నవాడినే క్షేత్రజ్ఞుడిగా రిషి పుంగవులు భావిస్తారని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. శృంగారావస్థలను అర్థo చేసుకోవటం సాధారణoగా కష్టమైన చర్యే. మానవ చిత్తము అతి చంచలమైనది. అలాంటి చంచలమైన మనస్సును అనుసరించి శరీరము, బుద్ధి, మతి ప్రవర్తిస్తాయి. క్షేత్రయ్య శరీరమును, దాని స్వాభావికమైన అవస్థలను పరిపూర్ణoగా అర్థముజేసుకున్న వారు కనుకే వీరు రచించిన అన్ని పదాలలో శృంగార రసం ద్వారా పరమాత్మునితో జీవాత్మ ఐక్యమవుటకు పడే ఆత్రుత స్పష్టoగా కనబడుతుంది. అందుకే కాబోలు వీరికి క్షేత్రయ్య గా నామాంకితము జరిగిoది. మానవ జీవితములోని అతి ముఖ్యమైన వస్తువు ‘మనస్సు’, అందులోoచి పుట్టే భావములు. వాటిని భగవంతునికి సామర్థ్యoగా చేరవేసేందుకు వీలైన రసo ‘శృంగారము’. అందుకే అన్నమయ్య, క్షేత్రయ్య మొదలగువారెందరో శృంగార రసాన్ని ముఖ్యంగా కలిగిన రచనలు చేశారు అనుటలో సందేహo లేదు. క్షేత్రయ్య వ్రాసిన శృంగార పదాలను గురించి లోతుగా ఆలోచన చేస్తే అందులో వీరికి గల కృష్ణ భక్తి, జ్ఞానములు ఎంత మాధుర్యమైనవో అర్థమౌతుంది.
క్షేత్రయ్య అలంకారశాస్త్రoలో ఎంతో పట్టు కలవారు. వీరు ఉపయోగించిన పదసాహిత్యమును గమనిస్తే అది తెలుస్తుంది. వీరు వ్రాసిన పదాలలో భానుదత్తుడు చెప్పిన శృంగార నాయికా-నాయక లక్షణాలన్నీ వివిధ అవస్థలలో స్పష్టoగా కనిపిస్తాయి. అందుకే కాబోలు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు పదకవితా కన్యకకు పితామహుడు అన్నమయ్య అయితే, జనకుడు క్షేత్రయ్యే అని చెప్పారు.
3. నాట్యశాస్త్రంలోని సామాన్యాభినయము :
మన మనస్సులో పుట్టే వివిధ భావాలను సభికులకు అభిముఖoగా (దగ్గరకు) చేర్చు ప్రక్రియనే ‘అభినయo’ అంటారు. నాట్యశాస్త్రంలో ‘అభినయo’ అనే పదానికి అర్థo భరతముని ‘ఉత్తమాంగాభినయం’ అనే అధ్యాయoలో ఈ విధoగా చెప్పినాడు:
“రూపకార్థములను సామాజిక హృదయములకు అందజేయునది అభినయము అనబడును”1 (నా.శా.8 అ.పుట: 268).
నాట్యంలో ‘చతుర్విధాభినయాలు’ ఎంత ముఖ్యమైన అంశాలో ‘సామాన్యాభినయము’ కూడా అంతే ప్రధానమైన అంశం. భరతుడు వివరoగా ఆంగిక-వాచిక-ఆహార్య-సాత్వికములనే నాలుగు అభినయాలను చెప్పినప్పటికీ, మరలా ‘సామాన్యాభినయము’ అని ప్రత్యేకoగా ఒక అధ్యాయాన్ని చెప్పడంలో దాని యొక్క పాత్ర రససిద్ధిలో ఎంత ముఖ్యమో మనo గ్రహించగలo.
భరతముని 22వ అధ్యాయములో ‘సామాన్యాభినయా’నికి నిర్వచనము ఈ విధంగా చెప్పాడు:
“వాచిక-ఆంగిక-సాత్విక అభినయములకు సంబంధించిన విశేషాభినయమే సామాన్యాభినయము అనబడును.”2 (నా.శా.22అ. పుట: 655).
దీనికి శ్రీ రామ పోనంగి అప్పారావు గారు తాను అనువదించిన నాట్యశాస్త్రo గ్రంథoలో భరతుడు చెప్పిన నిర్వచనమును ఈ విధంగా విశ్లేషించారు:
“వాచిక-ఆంగిక-సాత్విక అభినయములలో ఇంతవరకు చెప్పబడనిదియును, కానీ వాటితో సమప్రాధాన్యం కలదియును, కవి-నట శిక్షార్థమవశ్యము చెప్పవలసినదియును ఏది కలదో అది సామాన్యాభినయము అనబడును. వివిధములైన వాచిక-ఆంగిక-సాత్విక భేదములు అన్నింటిని ఆయా పాళ్లలో కూర్చిచేయు అభినయమే ఇది.”3 (నా.శా.22అ. పుట: 655) .
అంటే ముందు చెప్పిన చతుర్విధాభినయాలలో లేనిది, కానీ అభినయానికి ప్రత్యేకమైన వన్నె తెచ్చు అలంకారములే ‘సామాన్యాభినయము’ అని అర్థం. వీటిపై ఖచ్చితoగా నాట్యశిక్షణలో అభ్యాసకులకు అవగాహన కల్పించవలసిన అంశాలని మనకు అర్థమౌతుంది.
సామాన్యాభినయాన్ని భరతుడు నాలుగు భాగాలుగా వివరించాడు.
అవి: 1. సాత్వికాభినయము. 2. శరీరాభినయము. 3. వాచికాభినయము. 4. కామోపచారము. సహజమైన సాత్వికాభినయాలంకార భేదములు మూడు విధాలుగా భరతుడు చెప్పాడు:
అంగజవికారములు: అంటే శరీరంలోని అంగాల ద్వారా నాయకుడు లేదా నాయిక తమ అవస్థలను సహజoగా తెలిపేందుకు వీలైన అలంకారాలు. ఇవి 3 విధాలు. భావము, హావము మరియు హేలా (నాయిక తనలో కలిగిన రతి భావనను గమనించి చేసే ‘హావమే’ ‘హేలా’ అనబడుతుంది).
స్త్రీలకు స్వభావజములైన అలంకారములు: నాయిక యొక్క స్వభావాలలో నుంచి సహజoగానే అలంకారాలు కలిగినప్పుడు ఈ అభినయాలు కనిపిస్తాయి. ఇవి 10 రకాలు. లీల, విలాసము, విచ్చిత్తి (తేలికపాటి సహజ బట్టలతో నాయిక ఉన్న స్థితి), విభ్రమము (భ్రమను కలిగినది), కిలకించితం (భావోద్వేగాలను నియంత్రించలేని స్థితి కలది), మొట్టాయితం (రాతి భావనతో కూడిన ఆప్యాయత చూపేది), కుట్టామితం (కోపమును నటించేది), బిబ్బోకం (అభిమాన గర్వముతోటి వ్యవహరించేది), లలితము, విహ్రుతము (ఏ ప్రతిస్పందన లేకుండా నిబ్భరంగా ఉండేది).
స్త్రీలకు ఆయత్నజములైన అలంకారములు: అంటే నాయికలో ఏ ప్రయత్నము చేయకుండానే కలిగిన అలంకారాలు. ఇవి 7 రకములు. శోభ, కాంతి, దీప్తి, మాధుర్యము, ధైర్యము, ప్రాగల్భ్యం, ఔదార్యం.
పురుషులయందు సత్వ భేదములు : ఇవి నాయకుడికి అప్రయత్నముగా కలిగిన అలంకారాలు. ఇవి 8 రకములు. శోభ, విలాసము, మాధుర్యము, స్థైర్యము, గాంభీర్యము, లలితము, తేజస్సు, ఔదార్యం.
పైన చెప్పిన సాత్విక సామాన్యాభినయాలoకారాలు క్షేత్రయ్య పదాలలో ఏ విధంగా ఉన్నాయో క్రింది ఉపశీర్షికలో చూద్దాo.
3. క్షేత్రయ్య ‘నాయక’ పదములు – విశ్లేషణ
3.1 : ఇక నిన్ను నమ్మరాదే !4
తాళం : త్రిపుట
రాగం : సౌరాష్ట్ర
పల్లవి :
ఇక నిన్ను నమ్మరాదే – ఓ ఇంతిరో! మాట లేటికే
ఒక వేళ నవనీత – మొక వేళ పాషాణ
మకట నీ చిత్త – మయ్యయ్యో ! చెలి || ఇక నిన్ను||
అనుపల్లవి:
సరసుడని మెచ్చుకొందువు – ఏ వేళ నీ
చక్కెర కెమ్మోవి యానమందువు
తిరుగలేని కోపము దెచ్చుకొందువు – నాడు
సరసకు రావు యెంచ నన్ను దూరేవు || ఇక నిన్ను||
చరణము:1:
చెలువుడని భక్తి సేతువు తమి – దెలసి ప్రేమచే జేరదీతువు
కలికిరో ! తిరుగ కాక సేతువు
చలమేల జేసేవు? చాలు చాలు పదివేలు ! || ఇక నిన్ను||
చరణము:2: కూరిమి నీవెనేనంటివి మువ్వ – గోపాల ! యని కూడి యుంటివి
వేరే ఇంతుల చాడీ వింటివిదిమేలా?
వారిజముఖా ! యేల వాదాడ వచ్చేవు? || ఇక నిన్ను||
త్రిపుట తాళo, సౌరాష్ట్ర రాగoలో ఉన్న ఈ పదoలో నాయకుడు తన ప్రణయాన్ని నాయికతో పంచుకునేందుకు చేరువవ్వడానికి ప్రయత్నిస్తుండగా నాయిక నుండి ‘విహ్రుత’ సామాన్య అభినయాలoకారము ప్రదర్శింపబడుతోoది. నాయకుడు ప్రణయతాపాన్ని భరించలేక విరహానికి లోనవ్వడం తన సాత్విక వికారాలలో తెలుస్తుంది.
పల్లవిలో ‘ఒక వేళ నవనీత – మొక వేళ పాషాణ’మనడoలో నాయిక చెంత ఒకవేళ ‘ఔదార్యo’, ‘లలితము’లు మరొకవేళ ‘బిబ్బోకo’, ‘ప్రాగల్భ్యం’ల వంటి సామాన్యాలంకారములు స్పష్టము. ‘అకట నీ చిత్త – మయ్యయ్యో ! చెలి’ అనడంలో నాయికుడు నాయికలోని ‘చపలత’ సంచారీ భావముతో కూడిన ‘కిలకించిత’ చిత్తస్వభావాన్ని చూసి దైన్యo, చింత, నిర్వేదo మొదలైన వ్యభిచారీ అవస్థలను అనుభవించెను. అనుపల్లవిలో నాయిక దగ్గర తాను చూసిన ‘లీల, లలిత, విచ్చిత్తి, విలాస’ అలంకారాలను ‘స్మృతి’కి తెచ్చుకొని నాయకుడు ‘గ్లాని, మోహ, విషాదం’ మొదలగు భావాలను అనుభవించెను.
మొదటి చరణoలో ‘చెలువుడని భక్తి సేతువు తమి – దెలసి ప్రేమచే జేరదీతువు’ అని నాయకుడు నాయికతో అంటాడు. ఇందులో నాయిక గలిగినది అలంకారములు ‘మొట్టాయితం, లీల, లలితము మరియు విలాసము’లుగా తెలుస్తోంది. వెంటనే ‘కలికిరో ! తిరుగ కాక సేతువు. చలమేల జేసేవు? చాలు చాలు పదివేలు!’ అనటoలో ‘కుట్టమితo మరియు బిబ్బోకాలంకారాలను నాయికలో చూసి నాయకునిలో నిర్వేదo, వితర్క, గ్లాని, అమర్ష మొదలగు భావాలు పుట్టెనని స్పష్టoగా కనిపిస్తోంది. రెండవ చరణoలో ‘కూరిమి నీవెనేనంటివి మువ్వ – గోపాలా ! యని కూడి యుంటివి’ అని నాయకుడు అన్న మాటలలో, తనకీ నాయికకి మధ్య జరిగిన పూర్వ సంభోగమును మరియు ‘లలిత, మాధుర్య, హేలా, విలాసా’లానే సామాన్య అలంకారాలతో నిండిన రతిక్రీడలను ‘స్మృతి’కి తెచ్చుకొని ‘విప్రలంభ శృంగార’ రసాన్ని అనుభవించినట్టు తెలుస్తోంది. ‘వేరే ఇంతుల చాడీ వింటివిదిమేలా? వారిజముఖా! యేల వాదాడ వచ్చేవు?’ అనుటలో నాయిక విహ్రుతము, కిలకించితము, ప్రాగల్భ్యం లను ప్రదర్శిస్తున్న (భానుదత్త శృంగార రసమంజరి నాయిక-నాయక భేదములను అనుసరించి) ‘వక్రోక్తి గర్విత’5 మరియు ‘గురుమాన-మానవతీ’6 నాయికాలక్షణాలను కలిగిన ‘పరకీయ లేదా సామాన్య’ నాయికగా స్పష్టంగా అర్థమౌతుంది. శోభ, కాంతి, దీప్తి వంటి అప్రయత్నముగా కలిగే అలంకారాలు కూడా ఉన్నాయి. నాయకుడు అనుకూలుడు, ‘వైశిక-మధ్యమ’7 నాయకుని లక్షణాలను కలవాడు.
5. వక్రోక్తి గర్విత నాయిక : గర్వాన్ని, కోపాన్ని తన మాటల ద్వారా తెలిపే నాయిక.
6.గురుమాన-మానవతీ నాయిక: నాయకునికి ఇంకొక స్త్రీతో సంబంధo ఉన్న విషయాన్ని తెలుసుకొని కోపo ప్రదర్శించే నాయిక.
7. వైశిక-మధ్యమ నాయకుడు : చాలామంది స్త్రీలతో సంబంధములు కలిగిన వాడు. కానీ తన నాయిక యొక్క మనోగతాన్ని తన చేష్టల ద్వారా తెలుసుకుని ప్రవర్తించే తెలివిగలవాడు.)
3.2 : తలచినపుడే లేనిదానవు8
రాగం : సైంధవి
తాళం: మఠ్య తాళం
పల్లవి:
తలచినపుడే లేనిదానవు – తరుణీ నీవెందుకే? || తలచిన ||
అనుపల్లవి:
పిలిచినపుడే రాకయుంటే – ప్రియము పుట్ట నేర్చునటవే || తలచిన ||
చరణము:1:
చంచలాక్షి నిన్నేకోరి – జవ్వన మెల్ల నీ పాలు జేసి
ప్రాణము లోక్కటిగా భావించి నిన్నే కోరితిని || తలచిన ||
చరణము:2:
ఇలలో నిక నేమిటికి - నిన్ను వెదకిన నాటికే
బాలమరుడు నాపై గలిసి - జగడ మయ్యే సమయమున || తలచిన ||
చరణము:3:
ఎమ్మకాడు మువ్వగోపాలుడు – డిందు రమ్మని వేడినపుడే ఓ
యమ్మ సమ్మతిగా నీ వుందు – వని నెరనమ్మితిని || తలచిన ||
మఠ్య తాళం, సైంధవి రాగoలో ఉన్న ఈ పదoలో నాయకుడు ‘పతి’ మరియు ’అనుకూలుడు’. నాయిక యొక్క ప్రేమలో ఉన్న చంచలత్వాన్ని భరించలేక, ఇతడు ‘చింత, దైన్యము, నిర్వేదము’లు మొదలైన సంచారి భావాలను అనుభవిస్తున్నాడు. నాయిక ‘స్వీయ’, ప్రౌఢ, ధీర లక్షణాలున్నది. పల్లవి మరియు అనుపల్లవిలో నాయకుడు కోరిన వెంటనే నాయిక తన చెంతకు రాలేదని నిరాశపడినాడు. నాయిక ‘బిబ్బోకము’ను అలంకారoగా అభినయిస్తోంది. మొదటి చరణంలో చంచలాక్షి అని సంభోదించుటలో నాయిక ‘శోభ, కాంతి, దీప్తి’ వంటి అయత్నజములైన అలంకారాలతో ఉన్నది అని తెలుస్తుంది. నాయకుడు స్థైర్యం, శోభలను తన సత్వభేదాలుగా కలిగినాడు. రెండవ చరణంలో ఇతడు అనుభవించే విరహ తాపమును, ప్రణయ వేదనను నాయికకు తెలుపుతున్నాడు. ఇక్కడ ‘సూచ’, ‘వాక్యము’ వంటి శరీరజములైన సామాన్యాలంకారాలు ప్రదర్శిస్తున్నాడు. మూడవ చరణంలో నాయకుడు ఎంతగా విన్నవించినా తన ప్రేయసి దగ్గరకు రాకుండా నిబ్భరoగా ఉoది. కాబట్టి ఇక్కడ ప్రాగల్భ్యం, విహ్రుతాలు సామన్యాలంకారాలు. ఈ పదoలో ‘మోహo, ధృతి, స్మృతి, చింత, గ్లాని, వితర్కము, చాపల్యము, త్రాసము, మొదలైనవి వ్యభిచారీ భావాలుగా ఉన్నాయి.
3.3: తలచునో? తలచదో?9
రాగం : మధ్యమావతి
తాళం: త్రిపుట
పల్లవి: తలచునో? తలచదో? – తరుణీ || తలచునో ||
అనుపల్లవి: చెలిమి మువ్వగోపాలు – డెలిమికా డని నన్ను || తలచునో ||
చరణము:1:
కుందరదన మొన – కొరికి మడు పొసంగ
ఇంద మనుచు తానె – ఇయ్య వచ్చి లేదంటే
అందుకు నే జిన్న – నై యున్నానని నవ్వి
ముందా మడుపుతోనే – ము ద్దోసంగిన సుద్ది || తలచునో ||
చరణము:2:
ఇంతి నీ దయ లే – దింక నేను రాను నా
యంతరంగము నొచ్చె – నన విని దయ వచ్చి
అంతలో కౌగిట – నలమి నమ్మికె లిచ్చి
సంతస మొనరించి – చింత దీర్చిన సొగసు || తలచునో ||
చరణము:3:
ఆలించి నా మాట – లాలించి మువ్వ గో
పాల ! రమ్మని రతి – దేలించి మనసిచ్చి
లోలాక్షి నా మోవి – లోప లించుక గంటు
గీలించి చెలరేగి – కోరి నవ్విన హొయలు || తలచునో ||
మధ్యమావతి రాగo, త్రిపుట తాళoలో ఉన్న ఈ పదoలో పురుషుడు విరహోత్కoఠ నాయకుడు మరియు అనుకూలుడు. నాయిక కోసం విరహoతో ఉన్నట్టు స్పష్టoగా ఉంది. పల్లవి, అనుపల్లవులలో తన ప్రేయసి తనను ‘స్మృతి’కి తెచ్చుకొంటున్నదో లేదో అని ఇతడు ‘చింత, గ్లాని’తో ఉన్నాడు. మొదటి చరణంలో నాయికా నాయకుల మధ్య జరిగిన చెలిమిలో ‘లలిత- విలాస- మాధుర్య- హేలా- లీల’ అలంకారాలున్నాయి. హర్షo, మోహo, ధృతి మొదలైన సంచారీ భావాలు ఉన్నాయి. రెండవ చరణoలో నాయిక తనతో చూపించిన చొరవకు ఆనందించి, తన కౌగిటలో సుఖించి, రతికేళీలు జరిపి ప్రణయ డోలికలూగిన గోపాలుడు ఇప్పుడు నాయికతో ఎడబాటును సహించలేకున్నాడు. ఇక్కడ కూడా మొదటి చరణములో ఉన్న సామాన్య అలంకారములే ఉన్నాయి. ఇక్కడ కాంతి, దీప్తి, శోభ, ఔదార్యములు సహజాలంకారములు. మూడవ చరణoలో నాయిక ‘మొట్టాయితం, లలితములు’ అలంకారములుగా కలిగి ఉంది. ఇక్కడ నాయిక స్వీయ, ప్రౌఢ అయిన స్త్రీ. ఇది విరహ విప్రలంభ శృంగార రసము.
3.4: కొమలిరో! వలచినందుకు10
రాగం : ఘంటారావo
తాళం: త్రిపుట
పల్లవి :
కొమలిరో! వలచినందుకు గోపాలుడనరా నన్ను ||కొమలిరో||
అనుపల్లవి:
యేమే మని పేరను పిలుతురో
సీమలో జనులoదరయ్యయ్యో! ||కొమలిరో||
చరణం:1:
ఆముకొన్న తమి నిలుప లే నపుడు – ఆశలు బెట్టితివి
కాము తూపుల మనసు గరిగి మతిమాలిన – కరుణ జూడవైతివి
రామరో! ఇక తాళరా దేలుకోమ్మంటే – రమ్యము గాదంటివి
సోమవాదన! రేపు మాపంట కడకు – జూజమే చేసితి వయ్యయ్యో ! ||కొమలిరో||
చరణం:2:
చెలిమికై నేనెంత చుట్టక తిరిగిన – చింతలు బెట్టితివి
నెలతరో ! అందుకు కొలకుల వడియు – నీరు దుడువ వైతివి
లాలన నే వెన్నెల కాకకుడుకుగా – చల్లని మాటలాడ వైతివి
చలపాదివై పగ సాధించి- జాలి మాలి బెట్టితి వయ్యయ్యో? ||కొమలిరో||
చరణం:3:
పలుకరించి మా మువ్వగో – పాల! రమ్మని బత్తి సేయవైతివి
నలినాక్షి! నన్ను గూడి నాడిచ్చిన- నమ్మికే మరచితివి
చెలియరో! నీ వద్ద జాము నిలుచుండి నా – చేరదీయ వైతివి
కలికిరో! నా వంటి వాని మేలెన్నక- గర్వాన నుంటి వయ్యయ్యో! ||కొమలిరో||
ఘంటారావరాగoలో ఉన్న ఈ శృంగార పదoలో నాయకుడు ‘సత’ నాయక లక్షణాలను ప్రదర్శిస్తున్నాడు (మోసo చేసే చతురత కలిగినవాడు). ఇందులో శృంగార రసము ప్రణయ విప్రలంభoగా ఉంది. పల్లవిలో ‘కొమలిరో! వలచినందుకు గోపాలుడనరా నన్ను’ అనడంలో ‘చతుర సత’ నాయకుని లక్షణాలను చూడగలము. అనుపల్లవిలో ‘యేమే మని పేరను పిలుతురో సీమలో జనులoదరయ్యయ్యో!’ అనడంలో ‘మానీ సత’ నాయక లక్షణాలను (గర్వము) చూడగలము. మొదటి చరణం నుంచి నాయిక భావాలను నాయకుని మాటల నుండి తెలుసుకోవలెను. ఇక్కడ ‘విచ్చిత్తి, లలితములు’ ఉన్నాయి. ‘కాము తూపుల మనసు గరిగి మతిమాలిన – కరుణ జూడవైతివి. రామరో! ఇక తాళరా దేలుకోమ్మంటే – రమ్యము గాదంటివి’ అనడంలో నాయిక ‘ధైర్యము’ ‘ప్రాగల్భ్యం’ లు స్పష్టము. రెండవ చరణoలో మరియు మూడవ చరణoలో కిలకించితo, విహ్రుతo, ధైర్యo, ప్రాగల్భ్యం లు ఉన్నాయి. ‘చెలియరో! నీ వద్ద జాము నిలుచుండి నా – చేరదీయ వైతివి’ అనడంలో నాయికలో ‘ప్రాగల్భ్యం, విహృతములు’ ఎంత స్థిరoగా వున్న అలంకారాలో మనo ఊహించగలము. ‘కలికిరో! నా వంటి వాని మేలెన్నక- గర్వాన నుంటి వయ్యయ్యో!’ అని నాయకుడు అను మాటలలో అతని యొక్క వాక్చతురత మరియు లలితమైన సత నాయక లక్షణాలు ఏవీ నాయిక (స్థిరమైన స్వీయ, ధీర) వద్ద చెల్లలేదనే ‘చింత’ ప్రస్ఫుటముగా తెలుస్తుంది.
4. ముగింపు:
నీరు ఏ పాత్రలోకి నింపితే ఆ పాత్ర యొక్క ఆకారానికి ఒదిగినట్టు, క్షేత్రయ్య పదాలలోని శృంగార రసం కూడా ఎటువంటి నాయికా-నాయక స్వభావాలు కలిగిన పాత్రలో అయినా రసవత్తరంగా అమరిక కాగలదు అని ఈ వ్యాసంలోని విశ్లేషణలో తెలుస్తుంది. ఈ వ్యాసంలో చర్చించిన నాలుగు క్షేత్రయ్య ‘నాయక’ పదాలలోని అభినయసామగ్రి దేనికదే ప్రత్యేకoగా ఉంది. మొదటి పదంలో నాయకుడు నాయిక వలన విసిగిపోయిన మనస్సు కలవాడు అయితే రెండవ పదంలోని నాయకుడు నిరాశ చెందినవాడు. మూడవ పదంలోని నాయకుడు తన ప్రేయసి కోసం కలవరపడుతుంటే, నాల్గవ పదంలోని నాయకుడు లౌక్యంగా తనను తాను పోగుడుకుంటూ నాయికతో చతురంగా గొప్పలు చెప్పుకునే స్వభావమున్నవాడు. ఈ నాల్గింటిలో ఉన్నది శృంగార రసమే అయినప్పటికీ, దానిని వ్యక్తపరుస్తూ నాయికానాయకులు అభినయించిన సామాన్యాభినయ తీరులు వేరుగా ఉంది.
అభినయం సభికులకు పరిపూర్ణంగా వ్యక్తం అయ్యేందుకు అవసరమైన ముఖ్య మాధ్యమం సంగీతం. క్షేత్రయ్య పాదాలలోని రాగాలు అభినయించేందుకు ఎంతో వీలుకలిగినవి. పై పదాలు సౌరాష్ట్రం, సైంధవి, మధ్యమావతి మరియు ఘంటారావం వంటి రాగాల్లో కూర్చటం వలన సాత్విక భావాలు, సామాన్యాలoకారాలు మరింత విస్తారంగా ప్రకటితమైనాయి. సాత్విక సామాన్యాభినయాల గురించి ఎంత విశ్లేషించినప్పటికీ, దాని యొక్క ఫలితము రంగభూమి పై నృత్యమును నేర్పుగా పరిపక్వతతో నర్తకీనర్తకులు అభినయిoచినప్పుడే రస సిద్ధి కాగలదు. లేనిచో రస నిష్పత్తి శూన్యo. క్షేత్రయ్య రచించిన అమృతతుల్యమైన శృంగార పదములను కేవలo శారీరిక శృంగార దృష్టి కోణoలో చూసినట్లు అయితే వాటిలోని భక్తి మకరందమును పరిపూర్ణముగా గ్రహించలేము. కనుక నర్తకీనర్తకులు క్షేత్రయ్య రాసిన ఎన్నో శృంగార పదాలలోని సారమును సమగ్రముగా అవగతం చేసుకొని సాధనచేసి, సహృదయులైన సభికులనుమధురమైన భక్తీ-శృంగార భావములతో రంజింప వలెను.
5. పాదసూచికలు:
- నాట్యశాస్త్రము - పుట: 268
- పైదే. - పుట: 655
- పైదే. - పుట: 655
- ఫ్రాగ్రన్స్ అఫ్ పదమ్స్ - పుట : 286
- రసమంజరి అఫ్ భానుదత్త - పుట: 69
- పైదే. - పుట: 77
- పైదే. - పుట: 173
- ఫ్రాగ్రన్స్ అఫ్ పదమ్స్ - పుట : 287
- పైదే. - పుట : 288
- పైదే. - పుట : 286
6. ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పారావు, విస్సా, క్షేత్రయ్య పదములు (శృంగార రసమంజరి), ఆంధ్రగాన కళాపరిషత్తు, 195౦.
- వేణుగోపాల రావు, పప్పు, ఫ్రాగ్రన్స్ అఫ్ పదమ్స్ (లిప్యాంతరీకరణ మరియు అనువాదము), పప్పూస్ అకాడమిక్ & కల్చరల్ ట్రస్ట్ (PACT), 2౦15.
- వేణుగోపాల రావు, పప్పు, రసమంజరి అఫ్ భానుదత్త (ఆంగ్ల అనువాదము), పప్పూస్ అకాడమిక్ & కల్చరల్ ట్రస్ట్ (PACT), 2౦11.
- శ్రీ రామ అప్పారావు, పోనంగి, నాట్యశాస్త్రము, నాట్యమాలా పబ్లికేషన్స్, 1957.
- Ranganathan, aravind, ‘Kshetrayya: A figment of imagination?’, guruguha.org, 29/02/2024, https://guruguha.org/kshetrayya-a-figment/
- Gundappa, DV, ‘The life of Kshetrajna- by DVG’, prekshaa.in, 29/02/2024, www.prekshaa.in/article/life-kshetrajna-dvg
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.