headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-3 | March 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. నాచ్చారు పరిణయం యక్షగానం: శిల్పం - వర్ణనలు

సి. ఇ. గాయత్రీదేవి

పరిశోధక విద్యార్థిని, తెలుగు విభాగం,
మద్రాసు క్రైస్తవ కళాశాల
తాంబూలం, చెన్నై
సెల్: +91 9705302398, Email: cherukurigayathri@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఆంధ్రదేశానికి సుదూరప్రాంతంలో ఉన్న తమిళనాడులోని రాజపాళయంలో వెలువడిన అయిదు యక్షగానాలలో ఒకటి ఈ నాచ్చారు పరిణయం యక్షగాన కావ్యం. శ్రీకృష్ణ దేవరాయలు ఆండాల్‌ శ్రీరంగనాధుల వివాహ వైభవాన్ని ఆముక్తమాల్యద అనే పేరుతో కావ్యంగా రచించాడు. ఈ ఇతివృత్తాన్నే భాస్కర శేషాచలామాత్యులు ప్రదర్శన యోగ్యంగా ఉండే యక్షగాన కావ్యంగా రచించారు. శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు, శ్రీ ఆరుద్రగారు నష్టగ్రంథ్రంగా ప్రకటించిన ‘నాచ్చారు పరిణయం’ రాజపాళయంలోని యక్షగానములు రాయబడి ఉన్న తాటాకుల కట్టలో ఉండడాన్ని శ్రీ ముదునూరి జగన్నాథరాజుగారు గుర్తించి, చక్కగా ముద్రించి దానిని మొట్ట మొదటిసారిగా ఆంధ్రసాహితీ లోకానికి పరిచయం చేశారు. ఈ యక్షగాన కావ్యంపై ఇంతవరకు విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలు జరగలేదు. ఈ కావ్యాన్ని ఆంధ్రదేశంలోని సాహిత్యాభిమానుల అవగాహనకు తేవడమే ఈ పరిశోధన ఉద్దేశం.

Keywords: రాజపాళయం, యక్షగానం, శ్రీ విల్లిపుత్తూరు, విష్ణుచిత్తుడు (పెరియాళ్వారు), చూడికొడుత్త నాచ్చారు (గోదాదేవి), శ్రీరంగనాధుడు.

1. కవి జీవితవిశేషాదులు :

‘నాచ్చారు పరిణయం’ గ్రంథాంతంలో కవి తన గురించి చెబుతూ తన పేరు శేషయాచలామాత్యుడనీ, తాను ‘వాసి కెక్కిన నందవర కులం’లో జన్మించాననీ, తన తండ్రిపేరు భాస్కరుని సూరయామాత్యుడనీ, తన సోదరుడు భాస్కర వేంకటాచల కవియనీ, ఆంధ్రభాషలో ‘‘నాచ్చారు పరిణయం’’ అనే యక్షగానాన్ని రచించాననీ, ఈ గ్రంథం ఈ లోకంలో అక్షయంగా ప్రసిద్ధి చెందుతుందనీ చెప్పుకొన్నాడు.

‘నాచ్చారు పరిణయం’ గ్రంథాన్ని ఆంధ్రలోకానికి పరిచయం చేసిన శ్రీ ముదునూరి జగన్నాధ రాజుగారు ఈ గ్రంథం గురించి చెబుతూ ‘‘రాజపాళయంలో లభించిన తాటాకు కట్టలో గొట్టుముక్కల కృష్ణమరాజుగారి ‘సీతా కళ్యాణం’, గొట్టుముక్కల సింగరాజుగారి పారిజాతాపహరణం, గొట్టుముక్కల కుమార పెద్దిరాజుగారి ‘సావిత్రి’ అను యక్షగానములలో శేషాచల కవి రచించిన ‘నాచ్చారు పరిణయం’ ఇంకను ప్రచురణ కాలేదు. ‘కూరత్తాళ్వారు చరిత్ర’ అను యక్షగానము కూడా ఉండినది’’  అని చెప్పారు.

వీరి మాటలను బట్టి ఈ కవి ‘రాజపాళయం’ ప్రాంతానికి చెందినవాడని తెలుస్తున్నది. గ్రంథ ఇతివృత్తం కూడ రాజపాళయం సమీపంలో ఉన్న శ్రీవిల్లి పుత్తూరులో కొలువై ఉన్న గోదాదేవి రంగమన్నారుల వివాహానికి సంబంధించింది. ఈ అంశం కూడ కవి రాజపాళయం ప్రాంతానికి చెందినవాడనే వాదాన్ని బలపరుస్తోంది.

కళాప్రపూర్ణ శ్రీనిడదవోలు వేంకటరావుగారు తమ ‘‘దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయము’’లో ఈ కవిని గురించి మరిన్ని విశేషాలను తెలియజేశారు. ‘‘సేతు మహాత్మ్యము’’ అను నాలుగాశ్వాసముల పద్య ప్రబంధము రచించిన యతడు భాస్కర వేంకటాచలకవి. ఇతడు నందవరీక నియోగ బ్రాహ్మణుడు. వశిష్ఠగోత్రుడు, ఆశ్వలాయన సూత్రుడు. ఈతని పితామహుడు వెంగనార్యుడు, ఇతడు నంద వరమునకు ప్రభువై యొప్పునట్లుగా కవి అవతారికలో వర్ణించెను. దీని బట్టియే యితడు నందవరీకుడని ఊహింపబడినది. ఇతని తండ్రి సూరయామాత్యుడు, తల్లి వెంకాంబ. సోదరుడు శేషాచల కవి. ఇతడు నాచ్చారు పరిణయము అను యక్షగాన కావ్యమును రచియించినట్లు అవతారిక తెల్పుచున్నది’’

శ్రీ ఆరుద్రగారు తమ సమగ్రాంధ్ర సాహిత్యంలో ఈ కవిని గురించి చెబుతూ ‘‘భాస్కర వేంకటాచలమే కాక అతని సోదరుడు శేషాచలం కూడ రచయితే. ఆయన ‘నాచ్చారు పరిణయం’ అనే యక్షగానం వ్రాశాడు. అయితే అది నష్టమైంది.’’

శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు, శ్రీ ఆరుద్రగారు నష్టగ్రంథ్రంగా ప్రకటించిన ‘నాచ్చారు పరిణయం’ రాజపాళయంలోని యక్షగానములు రాయబడి ఉన్న తాటాకుల కట్టలో ఉండడాన్ని శ్రీ ముదునూరి జగన్నాథరాజుగారు గుర్తించి, చక్కగా ముద్రించి దానిని మొట్ట మొదటిసారిగా ఆంధ్రసాహితీ లోకానికి పరిచయం చేశారు. శ్రీహరిసేతు రామయ్యగారు, శ్రీ ఆరుద్రగారు ఈకవి 17వ శతాబ్ధికి చెందినవాడుగా పేర్కొన్నారు.

2. ఇతివృత్తం:

తన ఇష్టదైవమైన శ్రీరాముని సంస్తుతిస్తూ నందవర భాస్కర శేషాచలామాత్యుడు తన ‘నాచ్చారు పరిణయం’ అనే యక్షగానాన్ని  ప్రారంభించాడు. తరువాతి పద్యంలో శ్రీవిల్లిపుత్తూరులో కొలువై ఉన్న శ్రీరంగేశుడైన శ్రీరాజగోపాల మన్ననారును భక్తితో ప్రార్థించాడు. తరువాతి పద్యంలో శ్రీమహావిష్ణువు దశావతారాల వైభవాన్ని కీర్తించాడు. వటపత్రశాయి అయినటువంటి శ్రీరంగమన్నారుని, శ్రీదేవి అయినటువంటి నాచ్చారుయమ్మను భక్తితో వినుతిజేశాడు. త్రిమూర్తుల భార్యలను, కీర్తించి సీతా ప్రాణనాధుడైన శ్రీరామునికి తాను వ్రాసిన యక్షగానం అంకితం చేస్తున్నానని చెప్పి నాచ్తారు పరిణయం కథాక్రమాన్ని చెప్పడానికి కవి ప్రారంభించాడు.

శ్రీవిల్లిపుత్తూరు భూలోకంలో ప్రసిద్ధిచెందిన క్షేత్రం. మేరు పర్వతాలను మించిన సుందరహార్మ్యాలతో, హంసలు విహారం చేసే తటాకాలతో, ముక్కారు పంటలు పండే పంట పొలాలతో ఆ నగరం అలకాపురంతో సమానంగా విరాజిల్లుతోంది. అక్కడి బ్రాహ్మణులు ఆదిశేషుని సైతం ధిక్కరించే వేదశాస్త్ర పురాణవేత్తలు. అక్కడి క్షత్రియులు బల పరాక్రమాల్లో అర్జునుని సైతం లెక్కచేయరు. వైశ్యులు సకలైశ్వర్య సముపేతులై విరాజిల్లుతుంటారు. ధనధాన్య సంపదలను కలిగి దానగుణ సముపేతులై శూద్రులు గౌరవింపబడు తుంటారు.

ఆ నగరంలో ఆది నారాయణుడు భూదేవి సమేతుడై భక్తులను కటాక్షిస్తూ కొలువై ఉన్నాడు. షట్చాస్త్ర విజ్ఞానపరుడై విష్ణుచిత్తుడనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఆ నగరంలో నివసిస్తున్నాడు. అతడు వటపత్ర శయనునికి అందమైన నందవనం నిర్మించి పుష్పసరములు గట్టి భక్తితో ప్రతిరోజూ హరికి సమర్పిస్తూ వచ్చాడు.

ఒకరోజు విష్ణుచిత్తుడు నందవనంలో పూలు కోస్తుండగా అలనాడు సీత భూమినుండి ఎలా వెలువడిందో ఆ విధంగా ఒక చిన్నారి శిశువు అక్కడ కనిపించింది. విష్ణుచిత్తుడు ఆ శిశువును తన కూతురుగా భావించి ప్రేమతో తన భార్యకు ఇవ్వగా ఆమె కూడ ఎంతో ప్రేమతో ఆ బిడ్డను పెంచుతూ వచ్చింది.

చిన్నారి శిశువును బంగారు తొట్టెలో పడుకోబెట్టి ముత్తైదువలు లాలిపాటలు పాడారు. భూసుర వనితలు జోలపాటలు పాడారు. వచ్చిన సువాసినుల కందరికీ విష్ణుచిత్తుల భార్య సంతోషంగా వాయినాలు సమర్పించింది. ఆ తరువాత ఆ శిశువు దిన దిన ప్రవర్థమానమై, బొమ్మల పెండ్లిండ్లు, ఊయల లూగడం, బంతులాట మొదలైన ఆటలు ఆడుతూ వచ్చింది. పెరియాళ్వారు అనే పేరుతో పిలువబడుతున్న విష్ణుచిత్తులకు నిత్యమూ హరికి సమర్పించడానికై పువ్వుల సరాలను పుట్టికలలో నింపి భద్రపరచడం అలవాటు. తండ్రి అవతలికి వెళ్లిన సమయం చూసుకొని గోదాదేవి ఆ పుష్పాలను ఎత్తుకొని అలంకరించు కొంటూవచ్చింది. ఆ అలంకార వేషంతో అక్కడున్న బావినీటిలో తన అందాలను చూసుకొంటూ తండ్రి ఇంటికి రావడానికి పూర్వమే ఆ పుష్పాలను యథాప్రకారం పుట్టికలలో భద్రపరుస్తూ వచ్చింది. విష్ణుచిత్తుడు తిరిగివచ్చి ఇంతలో ఈ పుష్పాలు వాడిపోవడానికి ఏమి కారణం అని పరిశీలిస్తే ఆ పుష్పాలలో ఒక వెండ్రుక కనిపించింది. ఆ పుష్పాలు తన కూతురు ధరించిన పుష్పాలని తెలుసుకొని వాటిని పారవేసి వేరే పుష్పాలను తీసుకువచ్చి హరికి సమర్పించగా హరి తనకు గోదాదేవి అలంకరించుకొన్న పుష్పాలే ప్రీతి పాత్రములనుకొని కోపంతో వాకిటి తలుపులను మూసి వేశాడు. అప్పుడు దేవుని అభిప్రాయం తెలియక విష్ణుచిత్తుడు భగవంతుని ప్రార్థిస్తాడు. అప్పుడు హరి సంతోషించి ‘‘గోదాదేవి కన్య ధరియించినట్టి పుష్పాలు మాకు ప్రీతి పాత్రములు. కాబట్టి ఆ పుష్పాలను తీసుకువచ్చి మాకు సమర్పించు’’ అని ఆనతిచ్చాడు. అప్పుడు విష్ణుచిత్తుడు వేగంగా ఇంటికి వెళ్లి తన కూతురు పూర్వం ధరించిన పుష్పాలను తీసుకువచ్చాడు. అప్పుడు బంధింపబడి ఉన్న దేవాలయ కవాటాలు తెరుచుకున్నాయి. విష్ణుచిత్తుడు సంతోషంగా ఆ పుష్పాలను హరికి సమర్పించాడు. అప్పటినుండి విష్ణుచిత్తుడు తన పుత్రిక కొప్పున ముడిచిన పుష్పాలను తీసుకువచ్చి హరికి సమర్పిస్తూ వచ్చాడు. అది మొదలుకొని ఆ కన్యకామణి చూడికొడుత్త నాచ్చారు అనే నామధేయంతో  ప్రసిద్ధమైంది.

గోదాదేవి సౌందర్యాతిశయంబులు సకలజనులు చూసి సంతసిల్లి ‘‘ఆ శ్రీమహాలక్ష్మి యవని నిల్పుటకునై భూమిలోపల వచ్చి పుట్టె కాబోలు’’ అని అనుకున్నారు. తండ్రి అయిన విష్ణుచిత్తుడు తన కుమార్తెకు తగిన వరునికోసం అన్వేషిస్తూ ఉండగా ఆ సమయంలో ఒక ఎరుకత వచ్చింది. వచ్చి భూమీసురుడైన విష్ణుచిత్తుల ఇంటికి వచ్చి ఇలా చెప్పింది

‘‘ఓ చంద్రముఖీ! నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సకలలోకములకు శరణ్యుడైన వాడు, లోకాలన్నింటినీ పాలించేవాడు, రవికోటి భానుతేజుడు, రాజవదనుడు, ఎంతో చక్కనివాడు, ఉభయకావేరి నడుమ నుండి భక్తులకు అభయమిచ్చి రక్షించే శ్రీరంగనాధుడే నీకు భర్తగా వస్తాడు! నీ కోరికలన్నీ సఫలములవుతాయి!’అని చెప్పింది.

తన మనసులోని మాటలను ఉన్నదున్నట్లుగా చెప్పినందులకు సంతోషించి గోదాదేవి ఆ ఎరుకతకు కోరిన పదార్థాలు ఇప్పించి పంపించింది. తన మనసులో శ్రీరంగనాధునిపై  ప్రేమ తీవ్రంకాగా చింతాక్రాంతయై ఉన్న నాచ్చారును చూసి ప్రియసఖి “ఓ తల్లీ! ఎందుకు విచారంగా ఉన్నావు? నీ మనసులో ఉన్న దేమిటో నాకుచెప్పు’’  అని వేడుకున్నది. అప్పుడు గోదాదేవి తన మనసులో నిలుపుకొన్న శ్రీరంగనాధుని మీది వలపును తెలియజేసింది. ప్రియసఖి ఆ మాటలను విష్ణుచిత్తుల వారికి తెలియజేసింది. అప్పుడు ఆ విప్రవర్యుడు ‘‘నేను ధన్యుడనయ్యాను’’ అని అనుకొని తన కుమార్తెను శ్రీరంగనాధునికి సమర్పించాలనే దృఢనిశ్చయంతో శ్రీరంగానికి బయలుదేరాడు. పరివారం తన వెన్నంటిరాగా ప్రియమైన పుత్రిక నాచ్చారుతో కలసి విష్ణుచిత్తులు శ్రీరంగానికి సమీపంలో ఉన్న కావేరినది ఒడ్డున గల ఒరయూరు గ్రామం చేరుకొని అక్కడే బసచేశాడు.

ఆ విధంగా వచ్చిన నాచ్చారుదేవిని శ్రీరంగనాధుడు అదృశ్యరూపంలో వచ్చి తన మందిరానికి తీసుకువెళ్లి పోయాడు. తన కుమార్తె కనిపించక పోవడంతో విష్ణుచిత్తులు చింతాక్రాంతుడై శ్రీరంగనాధుని సన్నిధి దగ్గరికి వెళ్లి పలురీతుల ప్రార్థించాడు. అప్పుడు రంగనాధుడు సంతుష్టాంత రంగుడై విష్ణుచిత్తులతో ‘‘నేను నీ నగరమైన శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చి నీ కుమార్తె నాచ్చారును ప్రేమతో ఫాల్గుణమాసం ఉత్తరా నక్షత్రంలో పెళ్లి చేసుకుంటాను. నీవు నీ నగరానికి వెళ్లి వివాహమహోత్సవ ప్రయత్నాలు చేయమని చెప్పాడు.

శ్రీరంగనాథులు ఆనతి ఇచ్చిన విధంగానే విష్ణుచిత్తులు తన కుమార్తె నాచ్చారును శ్రీవిల్లిపుత్తూరుకు తోడ్కొని వచ్చి వివాహ మహోత్సవ ప్రయత్నాలు ప్రారంభించాడు. పట్టణ వీధులన్నింటిలో కస్తూరి సిక్త గంధములు చల్లారు. పుష్ప తోరణాలను వేలాడదీశారు. అరటి కంబాలను నాటారు. ఆ వివాహమహోత్సవానికి బ్రహ్మాది దేవతలు విచ్చేశారు. ఆ సమయంలో శ్రీరంగనాధుడు దివ్యమనోహరమూర్తియై శృంగారరూపం ధరించి గరుడ వాహనారూఢుఢై శ్రీవిల్లిపుత్తూరు చేరుకున్నాడు. దేవతలందరూ ప్రస్తుతిస్తుండగా క్షణమాత్రంలో తనను విల్లిపుత్తూరు నగరానికి చేర్చిన గరుత్మంతునికి రంగనాధుడు ప్రీతిగా అర్థాసనమిచ్చి గౌరవించాడు. విష్ణుచిత్తులు సపరివారంగా ఎదురుగా వచ్చి పెండ్లి కుమారుని తోడ్కొని వచ్చి మణిమయ స్వర్ణపీఠంపై సుఖాసీనుని గావించాడు. ముత్తైదువలు శ్రీరంగనాధునికి శోభనం పాడారు. తరువాత పెళ్లి కుమారునికి అభ్యంగన స్నానం చేయించి సర్వాభరణ భూషితునిగా అలంకరించారు. అదే విధంగా నాచ్చారుదేవిని కూడ నవరత్నమయ స్వర్ణపీఠంపై ఆసీనురాలిని గావించి అభ్యంగన స్నానం చేయించి శోభనగీతాలను ఆలపించారు. సువ్వి సువ్వి అంటూ సువ్వాళి పాడారు. కొందరు అల్లో నేరేళ్లు పాడారు. 

ఆ విధంగా నాచ్చారుదేవికి మంగళస్నానం చేయించి ముత్తైదువలు అలంకారం చేశారు. ఆ విధంగా సర్వాభరణ భూషితను గావించి, గౌరీదేవికి మ్రొక్కించారు. ఆ సమయంలో పెండ్లి కుమారుడైన మన్నారుదేవుడు పురవీధులలో వేంచేశాడు. నాచ్చారి శ్రీరంగనాధుల వివాహ- మహోత్సవానికి నానాదేశాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఆ విధంగా వచ్చిన వాళ్లందరికీ విష్ణుచిత్తులు విడుదులు ఏర్పాటుచేసి అతిథి మర్యాదలతో గౌరవించాడు. తరువాత పెండ్లికుమారుడైన శ్రీరంగనాధునికి పాద ప్రక్షాళనం చేసి కన్యాదానం చేశాడు. శ్రీమన్నారుదేవుడు నాచ్చారుదేవికి మంగళ సూత్రధారణ చేశాడు. ఆ తరువాత వధూవరులిరువురు తలంబ్రాలు పోసుకున్నారు. మంగళ వాయిద్యాలు మారుమ్రోగాయి. విప్రుల భార్యలు ధవళాలు పాడారు. మంత్ర పురస్సరంగా హోమం గావించి అగ్నిదేవునికి ప్రదక్షిణంగా వచ్చి మణిమయ స్వర్ణపీఠంపై దంపతులు ఇరువురూ ఆసీనులయ్యారు. అప్పుడు విప్రభార్యలు హారతులు ఎత్తి జయమంగళం పాడారు. ఆ తరువాత వధూవరులు గృహ ప్రవేశం చేసే సందర్భంలో యువతులు తలుపు దగ్గరచేరి పేర్లు చెప్పమని అడిగారు. పేర్లు చెప్పించుకొన్న తరువాత చెలికత్తెలు తలుపులు తీసి వధూవరులను లోపలికి ఆహ్వానించారు. ఆ సందర్భంలో విష్ణుచిత్తుడు పెండ్లికి వచ్చిన వాళ్లందరికీ రకరకాల పిండివంటలతో విందు భోజనం ఏర్పాటుచేసి అందరినీ సంతృప్తి చేశాడు. యువతులు నలుగు పాటలు పాడారు. నాగవల్లి పూజల అనంతరం వధూవరులు కళ్యాణవేదికా ప్రదక్షిణంబుగా వచ్చారు. భూసురులకు అభీష్ట దక్షిణలిచ్చిన తరువాత దంపతులిరువురూ భోజనానంతరం వసంతోత్సవం గావించి పురవీధుల వేంచేశారు. రంగనాథుడు భద్రగజము అధిరోహించగా, నాచ్చారుదేవి బంగారు పల్లకిపై ఆసీనురాలై నగర పర్యటనకు బయలుదేరారు. నగర పర్యటన మహోత్సవం ముగిసిన తరువాత విష్ణుచిత్తుడు భార్యాసమేతుడై తన కుమార్తె అయిన నాచ్చారుదేవిని శ్రీరంగమన్నారుకు అప్పగించాడు. అపూర్వములైన ఆభరణాలను, విలువైన వస్తువులను అరణంగా ఇచ్చాడు.

శ్రీ రంగనాధుడు నాచ్చారు రమణి తోడ సకలవైభవంగా విరాజిల్లుతుండగా భువనాలన్నీ సంతోషాంబుధిలో ఓలలాడాయి.

3. కావ్యశిల్పము

3.1. నామౌచిత్యము :

నందవర భాస్కర శేషాచలామాత్యుడు రచించిన ‘నాచ్చారు పరిణయం’ యక్షగానంలో నాచ్చారు గోదాదేవి) చరిత్రతో పాటు నాచ్చారు శ్రీరంగనాధుల వివాహ వైభవము విపులంగా వర్ణింపబడి ఉంది. ప్రధాన ఇతివృత్తం నాచ్చారు పరిణయం కాబట్టి ఈ యక్షగానానికి ‘‘నాచ్చారు పరిణయం’’ అనే పేరు అన్నివిధాలా సముద్భాసిస్తున్నది. కావ్య సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని కవి తన కావ్యానికి ఇటువంటి నామకరణం చేయడం అన్నివిధాలా సముచితంగా ఉంది.

3.2. కృత్యవతారిక :

నాచ్చారు పరిణయం యక్షగానాన్ని కవి తన ఇష్టదైవమైన శ్రీరామునికి అంకితం చేశాడు కాబట్టి బుధజన మందారుడు, మహనీయ కీర్తిధాముడు, జగదాధారుడు అయిన శ్రీరామచంద్రుని సంస్తుతిస్తూ కవి తన కావ్యాన్ని  ప్రారంభించాడు. కావ్యాన్ని మంగళప్రదమైన శ్రీతో ప్రారంభించాలనే కావ్య సంప్రదాయాన్ని  అనుసరించి శ్రీతో, తగణంతో ప్రారంభమయ్యే కందపద్యంతో ఈ యక్షగానం ప్రారంభమైంది.

‘‘శ్రీరాముడు, బుధజన మం
దారుడు మహనీయ కీర్తిధాముడు జగదా
ధారుడు సర్వాభీష్టము
లారూఢగి మాకు నొసగు నధిక ప్రీతిన్‌’’ (పుట.1)

శ్రీరాముని స్తుతించిన తరువాత కృతి రచనాపరుడైన మన్నారుదేవుని దశావతారవర్ణనతో కీర్తించాడు కవి. మీనమై జలరాశి లోపల సోమకుని కొట్టి వేదములను రక్షించడం, కమఠరూపము దాల్చి దేవతలకు అమృతం ఇవ్వడం కోసం మందరాచలమును పైకెత్తడం, పందిరూపంబెత్తి మేదిని క్రిందుజేసిన హేమ కశిపుని కూల్చడం, నర మృగేంద్రాకృతితో హిరణ్య కశిపుని నఖములతో చించడమూ, పొట్టియై యాచించి బలి తలమెట్టి పాతాళానికి అదమడం, ధరణీపతులను కొట్టి వసుమతిని ధారుణీసురులకు ఇవ్వడమూ, రవికులంలో జన్మించి దశరథరాముడై రాక్షసకోట్లను సంహరించమూ, హలము పూని ప్రలంబము రక్కసుని తునిమి జగంబు రక్షించడమూ, బుద్ధరూపంబున దురాత్ముల పొలియజేసి సమస్త సురముని సిద్ధసాద్యుల బ్రోవడమూ, కల్కీయై మ్లేచ్ఛులను యమపురికి పంపించి జగములను రక్షించడమూ మొదలైన అపూర్వ కార్యములను నిర్వహించిన వేదవేద్యుని, భావజుని కన్నట్టి వటపత్రశాయి అయిన శ్రీరంగమన్నారు దేవుని, త్రిభువనములకు తల్లి అయిన శ్రీదేవియగు మన్నారు రాణిని ప్రస్తుతించాడు. ఆ తరువాత సరస్వతీ లక్ష్మీ పార్వతులను ఈ కింది విధంగా ప్రార్థించాడు.

‘‘వాణిని నుత గీర్వాణుని గొలుతున్‌
కమలాలయ యను కమల భజింతున్‌
భవుని దేవియగు పార్వతి నెంతున్‌
సకలదేవతల సన్నుతి సేతున్‌’’ (పుట.3)

సకల దేవతలను ప్రార్థించిన తరువాత కవి కృతిభర్త అయిన శ్రీరామచంద్రుని అంకిత పద్యంతో స్తుతించి తన యక్షగానాన్ని  ప్రారంభించాడు.

‘‘రాతిని మెట్టిన యంతనె
నాతినిగా జేసినట్టి నలినాక్షుకు ఖ
ద్యోత కులాంబుధి శశికిన్‌
సీతాప్రాణేశునకును శ్రీరామునకున్‌’’ (పుట.3)


3.3. వర్ణనా శిల్పము:

నందవర భాస్కర శేషాచలామాత్య కవి తన నాచ్చారు పరిణయం యక్షగానంలో రక రకాల వర్ణనలను ప్రవేశపెట్టి కావ్యాన్ని మనోజ్ఞ రామణీయంగా తీర్చిదిద్దాడు.

3.3.1. నగర వర్ణన:

కవి తన యక్షగానాన్ని శ్రీవిల్లి పుత్తూరు నగరవర్ణనతో ప్రారంభించాడు. దేవదేవి అయిన గోదాదేవి జన్మించిన పుణ్య ప్రదేశం కాబట్టి కవి శ్రీవిల్లిపుత్తూరును అత్యంత రమణీయంగా వర్ణించాడు. ఆ ఊరి గోపురాలు మేరు మందరములను మించి ఉంటాయి. అక్కడి మందిరములన్నీ మణులతో విలసిల్లుతుంటాయి. కొలనులు రాజహంసలతో విచ్చిన కమలములతో కనుల పండువుగా కనిపిస్తూ ఉంటాయి. ఏపుగా పెరిగిన చెరుకుతోటలతో, పరిమళ భరితములైన నందనవనాలతో, మందరములను మిన్నంటు మేడలతో అలకాపురంబనే విధంగా విరాజిల్లుతూ ఉంటుంది.

ఆ నగరంలో ఉన్న భూసురులు వేద పురాణ శాస్త్రవేత్తలై ఆదిశేషుని సైతం అవఘళింపు చేయగలవారు. అక్కడి సురాధిపులు బలశౌర్యములందు పార్థుని సైతం చులకన చేయగలరు. అక్కడి వైశ్యులు అల కుచేలుని సైతం వసుమతి చేయగలుగు ధనంబులు కలిగినవారు. అక్కడి శూద్రవరులు దానధర్మంబుల, ధాన్య సంపదలలో మానితులై వరలుతుంటారు. చతురంగ బల సమేతమై శ్రీవిల్లిపుత్తూరు లోకోత్తరంగా విరాజిల్లు తుంటుంది.

‘‘శ్రీవెలయుచు నుండు శృంగారముగను
శ్రీవిల్లిపుత్తూరు చెలగు భూస్థలిని
మేరు సుందరముల మించి యున్నతపు
చారు గోపురములు సోపానములును
మణి కుట్టిమంబులు మణి కవాటములు
మణులచే విలసిల్లు మందిరంబులును
... ... ... ... ... ... ... ... ...
వేదశాస్త్ర పురాణవేత్తలై యపుడు
ఆదిశేషునియైన నవఘళింపుచును
భూసుర శ్రేష్ఠులప్పురి యందు మెలగి
భాసురులై మించి పరగు చుండెదరు...’’ (పుట.3)

3.3.2. వన వర్ణన :

శ్రీవిల్లి పుత్తూరు సమీపంలో ఉన్న చంపకవనాన్ని కవి అద్భుతంగా వర్ణించాడు. ఆ వనము-

‘‘శ్రీకరము సజ్జన వశీకరము, భువన భూషావరము
శుభకరము; సంపంగి వనము
సుకవి జన భాజనము, సుర సౌఖ్య కాపురము,
సకల సంపత్కరము, సంపంగి వనము...’’ (పుట.7)

అంతేగాక ఆ వనంలో దట్టంగా వ్యాపించి ఉన్న వివిధ వృక్షాలను కూడ కవి పట్టికరూపంలో మనకు అందించాడు. ఈ వర్ణన ప్రబంధకవుల శైలిని తలపిస్తూ ఉంది.
‘‘తాల రసాల హింతాల తమాల
మాలతీ జంబీర మందార కుంద
కురువక మంజుళ కుటజ మధూక
సరళి దాడిమ నింబ చంపక క్రముక
సింధువార కపర్థ శింశుపాశోక
బందూక కేదార బదరీ పలాశ
మాతులుంగ లవంగ మాధవీ వకుళ
... .... .... .... ..... .... ....
శుక కోకిలారవ సుస్వరంబులును
ప్రకట నానావిధ పక్షి సంఘముల’’ (పుట.8)
తో భువిలోన మిక్కిలి భూషణమై ఆ సంపెంగ వనము విరాజిల్లుతూ ఉంది.

3.3.3. పుత్రోత్సాహం :

నందనవనంలో మేదినిలో మెరుపులాగ దేదీప్యమానంగా కనిపిస్తున్న శిశవును చూసి విష్ణుచిత్తుడు ఆనందోత్సాహాలతో పరవశించిపోయాడు. ఆ శిశువును ప్రేమతో తన అక్కున చేర్చుకున్నాడు. జగన్మాత అయిన శ్రీ లక్ష్మి తనకు కూతురుగా లభించిందని పొంగిపోయాడు.

‘‘అఖిల జగన్మాతయైన శ్రీ లక్ష్మి
అఖిలంబు రక్షింప నవని లోపలను
ఉదయించు టెరుగక నొగి కూతురనుచు
... ... .... .... .... .... ... ... ....
తనరారు  ప్రీతిచే తన కన్య నెత్తి
కొని వచ్చి తన కుల కూరిమి సతికి’’ (పుట.9)

ఇచ్చాడు. బిడ్డ పుట్టినప్పుడు చేయవలసిన జాతక కర్మలన్నీ సాంగోపసాంగంగా నిర్వహించాడు.

3.3.4. లాలి పాటలు జోల పాటలు :

విష్ణుచిత్తుల దంపతులు ఆ శిశువును బంగారు ఊయ్యెలలో పడుకోబెట్టారు. ఆ సమయంలో ముత్తైదువులు లాలిపాటలు పాడారు.

‘‘లాలియన పాడరే లలన లిరుగడలా
బాల నాంచారమ్మ పవ్వళించినది
శ్రీ రాజితంభైన శృంగార తొట్ల
ఈరేడు భువనముల కిరవైన తొట్ల
... ... ... ... .... ... ... ... ... ...
ఘల్లు ఘల్లు మనుచు కంకణము లెసంగ
లలిత కరముల బట్టి లాలిపాడుచును.’’ (పుట.11)

ఆ సమయంలో కొందరు భూసుర వనితలు ఈ కింది విధంగా జోలపాటలు పాడారు.

‘‘జోజో మహాలక్ష్మి! జో జగన్మాతా!
జో జగన్నుత శీల! జో చిన్ని బాల!
పాలకడలికి కూర్మి బాలయైనట్టి
శ్రీ లక్ష్మి వేడ్కమై లీలార్థముగను
భూలోకమున బుట్టి బృందావనమున
బాలయై మెఱయుచును ప్రభవించు తల్లి! ॥జోజో॥ (పుట.11)

3.3.5. బాల్య క్రీడలు :

గోదాదేవి దినదిన ప్రవర్ధమానమై విష్ణుచిత్తుల గృహంలో నానావిధ బాల్యక్రీడా విశేషములతో వర్తింపుచూ వచ్చింది. ఆమె ఎటువంటి ఆటలు ఆడుకునేదో కవి హృద్యంగమంగా వర్ణించాడు.

‘‘తోడి చేడియలతో నాట్లాడున్‌
బొమ్మల పెండ్లిం డ్లిమ్ముగ జేయున్‌
చిలుకకు పద్యము చెప్ప దొడంగున్‌
పువ్వుల సరములు పొందుగా గట్టున్‌
బంగరుయ్యెలల బాగుగ నూగున్‌
పడతుల గూడుక బంతుల నాడున్‌ `’’ (పుట.12)

3.3.6. విరహ వర్ణన :

నాచ్చారు పరిణయంలో గోదాదేవి (చూడికొడుత్త నాచ్చారు) విరహవేదనను కవి రమణీయంగా వర్ణించాడు. గోదాదేవి శ్రీ రంగనాథుని యందలి ప్రేమ యగ్గలికంబునకు సుమశర పీడితయై తదధీన మాన మానసయగుచు చింతాక్రాంతయై ఉండగా చెలికత్తెలు ఆమెను ఈ కింది విధముగా సమాశ్వాసించారు.

‘‘అమ్మ యిన్నాళ్లవలె నీవు చెల్లువమ్ముగా నుండవేమిటికిన్‌
దీనతను చెంది యీవేళ మృదుల పానుపున పవళించవేళా
జలజాక్షి ఇంత తడవునకు యాల జలకంబు లాడకుండెదవు
తిలకంబు దిద్ద వేమిటికే యాలచిలక చేబూన కున్నావు...’’ (పుట.20)

3.3.7.  వివాహ వర్ణన :

నాచ్చారు పరిణయ యక్షగానంలో కవి అయిన నందవర భాస్కరశేషాచలామాత్యుడు గోదాదేవి శ్రీ రంగనాధుల వివాహాన్ని అత్యంత రమణీయంగా ఆనాటి తమిళనాడులోని తెలుగు ప్రజల సంప్రదాయం ప్రకారం విపులంగా వర్ణించాడు.

చూడి కొడుత్త నాచ్చారు శ్రీరంగనాధుల వివాహం ఉత్తరఫల్గుణి నక్షత్రంలో జరపాలని పెద్దలు ముహుర్తం నిర్ణయిస్తారు. ప్రజలు ఆనందంగా పట్టణ వీధులన్నింటినీ కన్నులపండువగా అలంకరిస్తారు. వీధులంతటా కస్తూరి గంధము చల్లుతారు. తోరణాలు కట్టారు. ఫలాలతో కూడిన అరటి స్తంభాలను నిలబెట్టారు. కస్తూరి మృగనుద ఘనసారములతో ముగ్గులు వేశారు. నగరాన్ని దేవతల పట్టణమైన అమరావతి లాగ అలంకరించారు.

శ్రీ రంగనాధుడు గరుత్మంతుని అధిరోహించి క్షణమాత్రంలో శ్రీవిల్లిపుత్తూరు చేరుకున్నాడు. పౌర కాంతలు అక్షతలు, పువ్వులు, ముత్యాలు తీసుకొని శ్రీ రంగమన్నారుకు ఎదురుగా వెళ్లి శాసలు చల్లి స్వామిని పిలుచుకొని వచ్చి మణిమయ స్వర్ణపీఠంలో అధివసింప జేశారు. వామదేవ, జమదగ్ని, గౌతమ, జాబాలి, విశ్వామిత్రుడు మొదలైన మునులు వశిష్ఠుని ముందు పెట్టుకొని అక్కడికి విచ్చేశారు. పురోహితుల అనుమతితో అంగనలు పంకజాక్షునకు ఆనందంగా అభ్యంగన స్నానం చేయించారు. కురులకు సంపెంగ నూనె అంటారు. అప్పుడు ముత్తైదువులైన భూసురోత్తముల భార్యలు ఈ కింది విధంగా శోభనం పాటలు పాడారు.

శోభనమె శ్రీధరునకు సుజన మందారునకు
ప్రాభవముల నలరిన మా శ్రీరంగమన్నారునకు
హరినీల గాత్రునకు అంబుజనేత్రునకు
సురవర స్తోత్రునకు శుభ చరిత్రునకు
॥శోభనమే॥ (పుట.30)

మంగళ స్నానమైన తరువాత పెళ్లి కుమారుని సర్వాభరణ భూషితుని గావించారు. పెండ్లి కుమార్తె అయిన నాచ్చారు దేవిని నవరత్నమయ స్వర్ణపీఠంబున నునిచి అభ్యంగన స్నానాలు చేయిస్తూ యువతులు ఈ కింది విధంగా శోభనం పాడారు.

‘‘పొందుగ శ్రీవిల్లి పుత్తూరను చెంది వేడుక తోడ శ్రీలలర
బృందావనమున బుట్టి మహీసుర నందనయగు శ్రీ నాచారమ్మకు ॥శోభన శోభనమె॥
ఇందు వదనకును హేమాంగికి బృందారక ముని వందితకు
చందన గంధికి జలజాయతాక్షికి కందర్ప జననికి కల్యాణికిని’’ ॥శోభన శోభనమె॥ (పుట.32)

అభ్యంగన స్నానమైన తరువాత యువతులు సువ్వాలె పాటలు పాడారు.

‘సువ్వి సువ్వి సువ్వాలె
సువ్వి  విష్ణుచిత్తసుతకు సువ్వి సర్వలోక నుతకు
సువ్వి విశద సూక్ష్మ మతికి సుగుణమతికి ॥సువ్వి॥
కొంచమైన కుందనంపు కుంద నమరగాను వుంచి
చంచలాక్షు లపుడు గూడి సంతసంబున ॥సువ్వి॥ (పుట.33)
సువ్వాలె పాడిన తరువాత కొందరు పుణ్యాంగనలు ఈ కింది విధంగా ‘‘అల్లో నేరెళ్లు’’ పాడారు.
అల్లో నేరేడల్లో నాచ్చారు పరిణయము నాగరికమాయె ॥అల్లో॥
శ్రీవిల్లిపుత్తూరు చెలగి వేడుకల
దేవాది దేవులకు దేవియై మిగుల
భావమున చెలువొంది భాశిల్లె చాలా
దేవి నాచారమ్మ ఠీవిచే చాలా ॥అల్లో॥
(పుట.34)

మంగళస్నానాలు అయిన తరువాత ముత్తైదువలు నాంచారమ్మను సర్వాభరణ భూషితురాలిగా అలంకరించి గౌరీదేవికి మొక్కించారు. ఆ సమయంలో శ్రీ రంగనాధుడు పురవీధులలో విహారం చేశాడు.

‘‘అంత పెళ్లి కుమారు డతి వైభవమున
దంతావళము నెక్కి తగ వచ్చు నపుడు
భూసుర సతులగు పుణ్యాంగనలును
శాసలు దీవించి చల్లిరి వేడ్క
పాడిరి గంధర్వపతులు మోదమున
ఆడిరి అప్సరస లదిక వైఖరుల
తుంబుర నారద స్తుతి గీతములను
అంబర వీధిని అధికమై చెలగ...’’
(పుట.35)

పుర విహారమైన తరువాత సీమంతినులు హారతి ఇవ్వగా రాజీవనేత్రుడైన శ్రీ రంగనాధుడు వివాహవేదికపై ఎక్కి ఆసీనుడయ్యాడు. వివాహానికి నానా దేశాల జనులు తండోప తండాలుగా తరలివచ్చారు. ‘పాండ్య భూపతి బహు ధనంబులు కానుకలు’ తీసుకువచ్చారు. అవనిలో ఉన్న రాజులందరూ ఉపహారములు, కానుకలు తీసుకొని ఆనందంగా వచ్చారు. వచ్చిన వాళ్లందరికీ విష్ణుచిత్తుడు విడుదులు ఏర్పరచి తగు రీతుల గౌరవించాడు.

తరువాత పురోహితుల యనుమతితో విష్ణుచిత్తుడు శ్రీ రంగనాధులకు పాద ప్రక్షాళనం చేశాడు. బంగారు పళ్లెరంలో తన భార్య మూడు నదుల జలాలను ఇవ్వగా తీర్థపాదుడైన శ్రీ హరిపాదాలకు అభిషేకం చేశాడు. వధూవరుల నడుమ జిలుగు దువ్వలున తెరలను చెలులు పట్టుకున్నారు. అప్పుడు విష్ణుచిత్తుడు త్రిజగదాధారుడైన శ్రీమన్నారునకు తన కుమార్తెను కన్యాదానం చేశాడు. శ్రీరంగనాధుడు నాచ్చారు కంఠంబున మంగళ సూత్రధారణ కావించాడు. ఆ తరువాత నూతన వధూవరులు ఈ కింది విధంగా తలంబ్రాలు పోసుకున్నారు.

‘‘అంత నాంచారమ్మ యుత్కంఠాస్యయై ప్రియమౌళి యందును
పంతమలరగ నిక్కి తగ తలబ్రాలు పోసెన్‌
యెంతయును కడు వేడ్క నవ్వొలయగ శ్రీమన్నారు విభుడును
యింతికిని తలబ్రాలు పోశెన్‌ యింపుతోడన్‌...’’ (పుట.38)
అప్పుడు విప్రుల భార్యలు ధవళం పాటలు పాడారు.
జయా జయా సుగుణాల వాలా
జయా జయా దశవిధలీలా
జయ జయ హాటక చేలా
జయజయ రాజగోపాలా
జయ జయ సుభగ చరిత్రా
... ... ... ... ... ...
జయ జయ శ్రీధన్వినిలయా!’’
(పుట.39)

తెర తొలగించిన తరువాత వధూవరులు అన్యోన్య వీక్షణంబులు చేశారు. ఆ మధుర దృశ్యాన్ని కవి ఈ కింది విధంగా వర్ణించాడు.

‘‘తరుణి ముఖపద్మమున మధురిపు తరళ దృష్టులు మధుకరంబులు
వెలయ తేనియ గ్రోలు విధమున గలయ నిలిచెన్‌
సరసిజాక్షి ముఖావలోకన సంభ్రమంబున సారె సారెకు
మురిపెమున శిగ్గునను చూడ్కులు ముగుద నిలిపెన్‌...’’
(పుట.40)

ఆ తరువాత పురోహితులు మంత్ర పురస్సరంబుగా హోమం కావించారు. వధూవరులు హవ్య వాహనునకు ప్రదక్షిణంగా వచ్చి స్వర్ణపీఠంలో ఆసీనులయ్యారు. అప్పుడు విప్రుల భార్యలు హారతులెత్తుతూ ఈ కింది విధంగా మంగళం పాడారు.

మంగళం మౌనిసుత మండిత పదాబ్జునకు
మంగళం త్రైలోక్య మందిరునకు
మంగళం శతకోటి మార్తాండ తేజునకు
మంగళం శ్రీరంగ మన్నారుకును
॥జయ మంగళం, శుభ మంగళం॥
(పుట.40)

మంగళహారతులు ఎత్తిన అనంతరం వధూ వరులు కులదేవతా సందర్శనానికై ఇంట్లోకి ప్రవేశించినపుడు యువతులు వాకిట తలపుల దగ్గర చేరి పేర్లు చెప్పమని చెప్పకపోతే తలుపు తీయమని చెబుతారు. మొదట వధూవరులు సిగ్గుతో తమ పేర్లు చెప్పలేదు. ఆ తరువాత నాచ్చారమ్మ

‘‘వారిజాక్షులు మరియు పోరాడ మెల్లనే
కూరిమిని రంగమన్నారనుచు చెప్పెన్‌
హరియు తన సతి పేరు అతివలందరు యడుగ
సరసుడై పలికె నాచారనుచు వేడ్కన్‌...’’ (పుట.42)

ఇంటికి వచ్చిన వధూవరుల చేత దేవతా నమస్కారాలు చేయింపజేసి, స్థాలిపాక హోమంబు నిర్వర్తించిన తరువాత విష్ణుచిత్తుడు వచ్చిన బంధు మిత్రులందరికీ ధరణిలోగల పదార్థముల నెల్ల తెప్పించి చక్కటి విందు భోజనం ఏర్పాటుచేశాడు. వివాహానంతరం వధూవరులిరువురికీి యువతులు నలుగులు పట్టింపుచు ఈ కింది విధంగా పాటలు పాడారు.

‘‘శ్రీ రాజగోపాల! శ్రీ లక్ష్మీ విహార!
సారసదళ నేత్ర! స్వామి సర్వేశా!’’
(పుట.46)

నలుగు పాటలు ముగిసిన తరువాత నాలుగోరోజు నాగవెల్లి ఉత్సవం జరిపారు. నాగవెల్లి ఉత్సవం పూర్తి అయిన తరువాత వధూవరు లిరువురూ నగరంలో ఊరేగింపుగా వచ్చారు. శ్రీ రంగనాధుడు ఏనుగు మీద అధిరోహించగా, నాచ్చారు దేవి బంగారు పల్లకిలో ఆసీనురాలై ఇరువురూ పురవీధులలో విహరించారు. వచ్చిన అతిథు లందరినీ విష్ణుచిత్తుడు యథోచితంగా సత్కరించి గంధమాల్యాద్యనేక ఉపచారముల సంతుష్టులను గా చేసి పంపించాడు. ఈ విధంగా నాచ్చారు శ్రీ రంగనాధుల వివాహ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించాడు భాస్కర శేషాచలామాత్య కవి వరేణ్యుడు.

3.4. అలంకార శిల్పము :

అలంకారమంటే సౌందర్యం ‘‘సౌందర్య మలంకారః’’ అని వామనుడు నిర్వచించాడు. ‘‘కావ్యం శోభాకరాన్‌ ధర్మానలంకారాన్‌ ప్రచక్షతే’’ అని దండి నిర్వచించాడు. అంటే కావ్య శోభకరములైన ధర్మాల్ని అలంకారాలుగా అతడు భావించాడు. నాట్యశాస్త్రాన్ని రచించిన భరతుడు శబ్దాలంకారాలైన యమకం, అర్ధాలంకారాలైన ఉపమ, రూపకం, దీపకం వీటిని మాత్రమే అలంకారాలుగా భావించాడు. సంస్కృతాంధ్ర లాక్షణికులైన దండి 34 అలంకారాలను, ముమ్మటుడు 59 అలంకారాలను, విద్యానాధుడు 66 అలంకారాలను, చంద్రాలోక కర్త 101 అలంకారాలను, అయ్యప్ప దీక్షితులు 124 అలంకారాలను, భట్టుమూర్తి  66 అలంకారాలను పేర్కొన్నారు. ప్రసిద్ధ విమర్శకులు ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు తన తిక్కన కావ్య శిల్పము గ్రంథంలో అలంకారం గురించి చెబుతూ వర్ణ్య వస్తువు యొక్క తత్కాలము నందలి స్వరూప స్వభావములను సహృదయుని బుద్ధియందు సముద్దీపింప జేయునదిగాను, మరియు కథా సంబంధి యనగా అంగి విషయ సంబంధి పరమార్థమును స్ఫురింప జేయునదిగాను’’  ఉండాలని ఆశించారు. నాచ్చారు పరిణయము నందలి అలంకారాలు వర్ణ్య వస్తువు స్వరూప స్వభావాలను ఏ విధంగా ఆవిష్కరించాయో ఇక్కడ పరిశీలించ బడిరది.

3.4.1. ఉపమాలంకారం :

ఉపమానమునకు ఉపమేయమునకు సామ్యము చెప్పబడి నట్లయితే అది ఉపమాలంకారము. ఉపమాలంకారంలో ఉపమేయము (వర్ణింపదలచిన వస్తువు) ఉపమానము (సదృశ్య వస్తువు), సమాన ధర్మం, ఉపమావాచకం అనే నాలుగు అంగాలుంటాయి.

‘‘భానుండు పూర్వాద్రి భాసిల్లు కరణి
మానుగ శ్రీరంగమన్నారు యొప్పె’’ (పుట.56)

తూర్పు కొండపై దేదీప్యమానంగా విరాజిల్లుతున్న సూర్యుని లాగ శ్రీ రంగనాధుడు విరాజిల్లుతున్నాడు.

ఉపమేయము : శ్రీ రంగనాధుడు
ఉపమానము : పూర్వాద్రి భానుడు
సమాన ధర్మం : భాసిల్లు
ఉపమావాచకం : కరణి

మరొక ఉదాహరణ :

అంజనాచలముపై హర్యక్ష మున్నట్లు
కంజాక్షు డొప్పె నక్కరి మూపునందు (పుట.48)


ఉపమేయము : కంజాక్షుడు శ్రీ రంగనాధుడు (ఏనుగు మీద ఆసీనుడై ఉన్న)
ఉపమానము : హర్యక్షము, సింహము (అంజనాచలముపై ఉన్న)
సమాన ధర్మం : ఒప్పె. ప్రకాశించెను
ఉపమావాచకం : ఉన్నట్లు

3.4.2. అతిశయోక్తి అలంకారం :

శ్రీ విల్లి పుత్తూరులోని ఎత్తైన గోపురాలను కవి వర్ణిస్తున్నాడు. అవి మేరు మందరముల వలె అంటే మేరు పర్వతాల వలె ఎత్తుగా ఉన్నాయట.

‘‘మేరు మందరముల మించి యున్నతపు
చారు గోపురమలు’’ (పుట.3)


3.4.3. స్వభావోక్తి అలంకారం :

ఎరుకత ఆకారాన్ని ఎంతో సహజంగా ఉన్నది ఉన్నటుగా వర్ణించాడు కవి. స్వభావోక్తి అలంకారానికి ఇది చక్కని ఉదాహరణ.

‘‘వెలయ చంకను బుట్టి నిడికొని వింత మాటల తేటలా
మొలక నవ్వుల జిగి మెరుంగులు మోముపై విలసిల్లగా
వలుద కుచములు సంకు పూసల నలర పయ్యద బిగువునా
ముదముతో తన చిన్ని బురుకని మూపునందున గట్టుకా...’’ (పుట.16)

3.4.4. వృత్యను ప్రాసాలంకారము :

ఉదా : శ్రీకరము సజ్జన వశీకరము భువన భాషావరము
శుభకరము సంపంగి వనము (పుట.7)

‘ము’ అంతంగా ఉన్న పదాలు వరుసగా ఆవృతమయ్యాయి.

ఉదా : హరినీల గాత్రునకు అంబుజనేత్రునకు
సురవర స్తోత్రునకు శుభ చరిత్రునకు. (పుట.50)

ఈ పద్యంలో పదాంతంలో` ‘త్రునకు’ వరుసగా ఆవృతమయ్యాయి.

3.4.5. అంత్యాను పాసాలంకారము :

పద్యంలోని ప్రతిపాదం చివర ఒకే పదం అవృతమైతే అది అంత్యాను ప్రాసాలంకారము. ఉయ్యాలలో ఉన్న పాపను కవి వర్ణిస్తున్నాడు.

శ్రీరాజితం బైన శృంగార తొట్ల
యీరేడు భువనముల కిరవైన తొట్ల
భూరి రత్నోజ్వల స్ఫురితమగు తొట్ల
శ్రీ రమాదేవి చెలువారు తొట్ల (పుట.10)

పై పద్యంలో ప్రతిపాదంలో చివర ` ‘తొట్ల’ అనే పదం అవృతమైనది.

మరొక ఉదాహరణ :

పరమాత్ముడగు శ్రీరామ భద్రుని పేర
కాకుత్‌ స్ధుపేర భార్గవ వంశు పేర
శ్రీకంఠ వర ధనుచ్చేదను పేర
జానకీ ముఖ పద్మ జలజాప్తు పేర
మౌనిహృత్పం కజ మార్తాండు పేర
అకలంక శుభలక్షణాన్వితు పేర (పుట.55)

పైపద్యంలో ప్రతిపాదము చివర ‘పేర’ అనే పదం ఆవృతమైనది.

4. ఉపసంహారం:

రాజపాళయంలో లభించిన ఐదు యక్షగానాలలో ఇది ఒకటి. రాజపాళయం సమీపంలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన గోదాదేవి, శ్రీరంగనాధుని వివాహం ఇతివృత్తాన్ని తీసుకొని యక్షగానంగా రాయడం గుర్తించదగిన అంశం. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యదను కావ్యంగా రచించారు. దానిని భాస్కర శేషాచలామాత్యులు యక్షగాన కావ్యంగా రచించారు. రాజకవులే కాక రాజపాళయం ప్రాంతానికి చెందిన ఇతర కవులు కూడ యక్షగానాలు రచించినట్లు తెలుస్తున్నది.  నిడదవోలు వెంకటరావుగారు, ఆరుద్రగారు నష్టగ్రంథంగా పరిగణించిన తరువాత నాచ్చారు పరిణయం తెలుగు విద్యాలయం, రాజపాళయానికి చెందిన శ్రీముదునూరి జగన్నాథరాజుగారు  ప్రచురించారు.

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యము (12వ సంపుటం) తెలుగు అకాడమీ, హైదరాబాద్, 2004.
  2. జగన్నాథరాజా, ము. రాజపాళయం క్షత్రియరాజాక్కల్‌ వరలారు, రాజపాళయం, 2002.
  3. ప్రసాద్‌, యం. శ్రీ ముదునూరి జగన్నాథ రాజాగారి సాహిత్యానుశీలన(అముద్రిత సిద్ధాంత గ్రంథం), మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం, 2016.
  4. వెంకటరావు, నిడదవోలు. దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం మద్రాసు విశ్వవిద్యాలయం, 1978.
  5. శేషయాచలామాత్యుడు. నాచ్చారు పరిణయం, రాజపాళయం. తెలుగు విద్యాలయం ప్రచురణ,  హైదరాబాద్, 1987

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]