AUCHITHYAM | Volume-5 | Issue-3 | March 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
7. సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రికల్లోని కథానికా వ్యాసాలు: సూత్ర విమర్శ
వేముల హర్షిత
తెలుగు పరిశోధకురాలు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం.
తెలుగు అధ్యాపకురాలు, తెల. సాం. సం. గు. మహిళా డిగ్రీ కళాశాల,
జగద్గిరిగుట్ట, హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9248393960, Email: vemulaharshitha04@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
దినపత్రికల్లో సాహిత్య ప్రచురణ అనేది పత్రికల ప్రారంభం నుండి కనిపిస్తుంది. సుజన రంజని మొదలుకొని నేటి వరకు పత్రికలు సాహిత్యాంశాలకు చోటు కల్పిస్తూ సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. పత్రికల సాహిత్యపుటల్లో కవిత్వం, కథ, నవల, నాటకం వంటి విభిన్న సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన వ్యాసాలు వెలువడుతున్నాయి. వాటిలో కథ ప్రక్రియకు సంబంధించిన వ్యాసాలను విశ్లేషణ పద్ధతి ద్వారా వివరించాను. ప్రముఖ దినపత్రికలయిన సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రిక సాహిత్య పుటలలో కథ సంబంధ వ్యాస ప్రచురణ వివిధ రకాలుగా కనబడుతుంది. వాటిలో ముందు మాటలను సంక్షిప్తం చేసి వ్యాసాలుగా ప్రచురించడం ఒక రకం. ఎలాంటి ముందు మాటలను సంక్షిప్తం చేసి సూత్ర విమర్శ ధోరణి వ్యాసాలుగా ఈ పత్రికలు ప్రచురిస్తున్నాయో తెలపడమే ఈ పత్ర ప్రధాన లక్ష్యం. అందుకుగాను ఈ రెండు పత్రికల్లోని సూత్ర విమర్శ ధోరణిలో ప్రచురిస్తున్న ముందు మాటల సంక్షిప్త వ్యాసాలను స్వీకరించి విశ్లేషణ పద్ధతి ద్వారా వివరించాను. దీనివలన ముందుమాటల ప్రాముఖ్యత, సూత్ర విమర్శ పద్ధతి, దినపత్రికల్లో కథా సాహిత్య వ్యాస ప్రచురణ వైవిధ్యం మొదలైన అంశాల గురించి అవగాహన ఏర్పడుతుంది.
Keywords: సాక్షి, నమస్తే తెలంగాణ, దినపత్రికలు, సాహిత్యపుటలు, కథావ్యాసాలు, ముందుమాట, నిర్వచనాలు, సూత్రవిమర్శ (Theoretical criticism), సూత్ర విమర్శవ్యాసాలు, విశ్లేషణ.
1. ఉపోద్ఘాతం:
దినపత్రికల్లో జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు సాహిత్య సంబంధ విషయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పత్రికల్లో సాహిత్య ప్రచురణా అనేది మొదటి నుండి మనకు కనిపిస్తుంది. పూర్తిగా సారస్వత విషయాలకే ప్రాధాన్యమిచ్చిన “సుజన రంజని” మొదలుకొని ఈనాటి వరకు పత్రికల్లో సాహిత్యానికి చోటు లభిస్తూనే ఉంది. 19వ శతాబ్ది ఉత్తరార్థంలో కవులు, పండితులు స్వయంగా పత్రికలు నడిపారు. తమ వద్దనున్న తాళపత్ర ప్రతుల నుండి వెలికి తీసిన ప్రాచీన కావ్యాలను పత్రిక సంచికలో ధారావాహికగా ప్రచురించేవారు. ఈ విధంగా ప్రారంభమైన, సాహిత్య ప్రచురణ నేటికీ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. నేడు పత్రికలు సాహిత్యానికి ఒక ప్రత్యేక పుటను కేటాయించి, వాటి ద్వారా సమకాలీన సాహిత్యాన్ని భిన్న ప్రక్రియల ద్వారా పాఠకులకు అందిస్తున్నారు. సాధారణంగా సాహిత్యపుటల్లో సాహిత్య సంబంధ వ్యాసాలు, కవితలు, సమీక్ష వ్యాసాలను ప్రచురిస్తూ, సాహిత్య అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని ప్రముఖ దినపత్రికలైన సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు పాటిస్తూ సాహిత్యాభివృద్దికి తోడ్పడుతున్నాయి.
2. సాక్షి, నమస్తే తెలంగాణ దిన పత్రికలు – సాహిత్య పుటలు:
సాక్షి పత్రిక ‘సాహిత్యం’ పేరుతో, నమస్తే తెలంగాణ దినపత్రిక ‘చెలిమె’ పేరుతో సాహిత్య పుటలను ప్రచురిస్తూ విభిన్న సాహిత్య సంబంధ అంశాలకు చోటు కల్పిస్తున్నారు. వీటిలో కథా ప్రక్రియకు సంబంధించిన వ్యాసాల ప్రచురణ గురించి ఈ పత్రంలో వివరించాను. ఈ సాహిత్య పుటలలో కథ సంబంధ వ్యాస ప్రచురణ అనేక రకాలుగా కనిపిస్తుంది. కథాసంబంధ నివేదిక వ్యాసాలు, కథ పుస్తక సమీక్ష వ్యాసాలు, కథ వస్తు సంబంధ వ్యాసాలు, కథ శిల్ప సంబంధ వ్యాసాలు, చర్చ సంబంధ వ్యాసాలు, కథ పుస్తక ముందు మాటల సంక్షిప్త వ్యాసం ఇలా అనేక రకాలుగా కనబడుతున్నాయి. ముందు మాటలను సంక్షిప్తం చేసి సూత్ర విమర్శ ధోరణి వ్యాసాలుగా ప్రచురిస్తున్న విధానాన్ని విశ్లేషించడమే ఈ పత్ర ప్రధాన లక్ష్యం. అందుకుగాను ప్రముఖ దినపత్రికలయిన సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రికల సాహిత్య పుటలలో 2016, 2017 సంవత్సరాల్లో వెలువడిన కథా సంబంధ ముందు మాటల సంక్షిప్త వ్యాసాలను స్వీకరించి విమర్శనాత్మక దృష్టితో విశ్లేషించాను.
3. సాక్షి నమస్తే తెలంగాణ దినపత్రికల్లోని కథా వ్యాసాలు – సూత్ర విమర్శ:
దినపత్రికల్లో కవిత్వం తర్వాత ఎక్కువగా ప్రచురితమవుతున్న సాహిత్య ప్రక్రియ కథ. సాహిత్య పుటల్లోని వైవిధ్య భరితమైన కథాసంబంధ వ్యాసాల్లో చెప్పుకోదగినది ముందు మాటలను సంక్షిప్తం చేసి వ్యాసాలుగా వేయడం. నూతన పుస్తక ఆవిష్కరణ, కవుల జయంతి, వర్ధంతి వంటి ప్రత్యేక సందర్భాలలో విషయ ప్రాధాన్యం కలిగిన ముందు మాటలను సంక్షిప్తం చేసి సూత్ర విమర్శ పద్ధతిలో వ్యాసాలుగా ప్రచురిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రచార సాధనం దినపత్రిక. సాహిత్యరంగంలోని విషయాలను, నూతన పుస్తక వివరాలు, కొత్త సిద్దాంతలను పాఠకులకు పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రధానంగా దినపత్రికల సాహిత్య పుటలపై ఉంది. కావున ఈ రెండు పత్రికలు సాహిత్య అభివృద్దికి తమవంతు కృషి చేస్తున్నాయి.
4. ముందుమాట:
‘Foreword’ అనే ఆంగ్ల పదానికి సమానార్ధకంగా తెలుగులో ‘ముందుమాట’ను వ్యవహరిస్తున్నారు. ముందుమాటకు పర్యాయపదాలుగా పీఠిక, ప్రస్తావన, ఆముఖం, తొలిపలుకు, పరిచయం, మున్నుడి మొదలైనవి వ్యవహారంలో ఉన్నాయి. ప్రాచీన కాలంలో తెలుగు సాహిత్య చరిత్రలో పీఠికలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన కాలంలో కావ్యవతారికలు పీఠికలే అనే అభిప్రాయం పండితుల్లో కలదు. కావ్యవతారికలను కవులు స్వయంగా రాసేవారు కానీ ముందు మాటలను రచయిత లేదా కవుల రచనలపై ఇతరులు రాసే అభిప్రాయ వాక్యాలుగా చెప్పబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రచయిత స్వయంగా ముందుమాటలు రాసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు రాసిన ఏ పేరుతో రాసిన ఒక గ్రంథానికి పీఠిక ఉండడమనేది సర్వసాధారణం. ఈ పీఠిక వచన రూపంలో గానీ పద్య రూపంలో గానీ చంపూ పద్ధతిలో గాని ఉండవచ్చు.
5. ముందుమాట – నిర్వచనాలు:
“ఒక గ్రంథానికి ముందు ఆధారాలు, చరిత్ర, పరిధి, ప్రణాళిక, పద్ధతి, ప్రయోజనం, లక్ష్యం మొదలైన వాటిని వివరిస్తూ సహకరించిన వారికి కృతజ్ఞతలు చెబుతూ ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే అధిక సమాచారాన్ని అందించే ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన రచన పీఠిక. ఇది వచన రూపంలో గానీ పద్య రూపంలో గాని ఉండవచ్చును. దీనిని గ్రంథకర్త గాని, ఇతరులు గాని రాయవచ్చు” అని డి చంద్రశేఖర్ రెడ్డి తెలుగు పీఠిక అనే గ్రంథంలో నిర్వచించారు. (1990: పుట -33).
పీఠిక అనగా “గ్రంథము మొదట వ్రాసెడు దాని పుట్టుపూర్వోత్తరములు” అని శబ్ద రత్నాకరం నిర్వచిస్తుంది.( శబ్ద రత్నాకరం 2012. పుట 587)
“పీఠిక హఠాత్తుగా ఆధునిక సాహిత్యంలో బయటపడింది కాదు. ప్రాచీన కావ్య నాటకాల అవతారికల్లో ప్రస్తావనలలో ప్రోలాగులలో ఆధునిక పీఠిక లక్షణాలు గోచరించడం వల్ల ఆధునిక పీఠిక శతాబ్దాల పరిణామ క్రమంలో రూపుదిద్దుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఎవరి సృష్టి కాదు అన్న విషయం స్పష్టం అవుతుంది” అని డి. చంద్రశేఖర్ రెడ్డి తెలుగు పీఠిక గ్రంథంలో తెలిపారు (1990. పుట. 34).
పైన నిర్వచనాల ఆధారంగా ముందు మాటలు గ్రంథం యొక్క పుట్టుపూర్వోత్తరాలను గ్రంథస్థంశాలను తెలిపేదని చెప్పవచ్చు. గ్రంథ రచన సంవిధానాన్ని తెలుపుట, గ్రంథానికి వ్యాఖ్యానప్రాయముగా ఉండడం, రచయిత ఉద్దేశం వ్యక్తీకరించడం, ప్రజలకు గ్రంథ పరిధిని పరిచయం చేయడం, గ్రంథకర్తృత్వం, రచన కాలము, గ్రంథ నిర్ణయం, నిర్మాణం, ప్రయోజనాలను ప్రస్తావించడం, గ్రంథస్తంశాన్ని పాఠకుడికి సులభంగా అవగతం చేయడానికి తోడ్పడమనేవి ముందుమాటల్లో ప్రధాన లక్షణాలుగా కనబడుతున్నాయి.
ఒక గ్రంథాన్ని పరిచయం చేస్తూ రచయిత లేదా మరొక రచయిత రాసిన పరిచయ వాక్యాలు ముందుమాటలుగా చెప్పవచ్చు. గ్రంథ రచయిత స్వయంగా రాసిన ముందుమాటలో గ్రంథ నేపథ్యం, గ్రంథ రచనకు గల ప్రేరణ, గ్రంథ స్థూల పరిచయం, విషయ ప్రస్తావనకు ఎంపిక చేసుకున్న రచన రీతి, గ్రంథంలోని కొన్ని అంశాలకు తనదైన వ్యాఖ్యానం, తన వ్యక్తిగత జీవిత విశేషాలు చోటు చేసుకుంటాయి. ఇక ఇతరులు రాసిన పీఠికలో గ్రంథ చారిత్రక నేపథ్యం, విషయపరిచయం, రచన లక్ష్యం, రచయిత కాలం, వ్యక్తిత్వం, జీవిత విశేషాలు, రచన శైలి, రచనల ప్రత్యేకతలు, గ్రంధాన్ని పరిష్కరించిన తీరు, కొన్ని సందర్భాల్లో అవసరమైతే ప్రశంసలు చోటుచేసుకుంటాయి. ఇతరులు రాసిన ముందుమాటలు ఒక విధంగా సమీక్ష వ్యాసాలుగా కనిపిస్తాయి. వీటిలో గుణదోష విచారణ, రచయిత ఇతర రచనలకు ప్రస్తుత రచనకున్న భేద సాదృశ్యాలు, ఇతర రచయితలతో వీరి రచనలు గల భేద సాదృశ్యాల చర్చ కనబడతాయి. గ్రంథకర్త రాసిన పీఠికలో గుణదోష విచారణకు వీలుపడదు. ఒకవేళ చేసిన తన గురించి తాను చెప్పుకున్నట్లు అవుతుంది. వారి రచనల్లోని దోషాలు వారికి దోషాలుగా కనిపించక పోవచ్చును. ఇతరులు రాసిన ముందుమాటల్లో గుణ దోష విచారణకు అవకాశం అనేది ఉంటుంది.
ఈ విధంగా నన్నయ అవతారిక రూపంలో వేసిన బీజం నేడు విస్తృతమై పరిశోధనకు సైతం పట్టుబడక పీఠిక అనే మహా వృక్షమే అనేక పేర్లతో సహా విస్తరించింది. ఆధునిక కాలంలో విస్తృతమైన పరిధి కలిగి ఎక్కువ వినిపిస్తున్న మాట పీఠిక. నేటి కాలంలో ఏ గ్రంథానికైనా పీఠిక లేదా ముందుమాట సర్వసాధారణమైంది. ఇటువంటి ముందు మాటల ప్రచురణ అనేది నేడు దినపత్రికల సాహిత్య పుటల్లో కూడా మనకి కనబడుతుంది. విలువైనటువంటి ముందు మాటలని సంక్షిప్తం చేసి వ్యాసాలుగా వేస్తున్నారు.
సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రికల్లో నూతన సిద్ధాంతాలను, ధోరణులను పరిచయం చేస్తూ వ్యాసాలను ప్రచురిస్తున్నారు. వాటిలో ముందు మాటలను సంక్షిప్తం చేసి వ్యాసాలుగా ప్రచురిస్తున్నారు. సైద్ధాంతిక రచయితలను, కొత్త సిద్ధాంతాలను పరిచయం చేయాలనుకున్నప్పుడు ముందు మాటలను వేస్తారు. అవి నూతన సిద్ధాంతాలు, ధోరణులు అయినప్పుడు ఒక వ్యక్తికీ సంబంధించింది కాదు అని భావించినప్పుడు విషయం నైపుణ్యం ఉన్న ముందుమాటలను పత్రికల్లో ప్రచురిస్తున్నారు. దీనిని సూత్ర విమర్శగా చెప్పవచ్చు.
6. సూత్ర విమర్శ (Theoretical criticism)
“ఇది కూడ సాహిత్య రచనకు సంబంధించిన సూత్రములను ప్రతిపాదించునదే అయినను, లక్షణ విమర్శ పేర్కొను శాశ్వత ప్రమాణముల కంటె ప్రక్రియానుగుణమైన సాపేక్ష సిద్ధాంతములను నిర్దేశించును. స్వతంత్రబుద్ధి గల కవులు చేయు కావ్యమీమాంసలో ఇట్టి సూత్రములు గోచరించును. ప్రాచీనాంధ్ర కవుల కావ్యావతారికలు, ఆశ్వాసాంత గద్యలు మొదలగునవి సూత్రవిమర్శకు నెలవులు. నన్నయ, నాచన సోమనాది కవులు తమ కావ్యానుశీలన కనువైన సాపేక్ష ప్రమాణ సూత్రములను పేర్కొనిరి. కావున కవులకే కాక విమర్శకులకును సూత్రవిమర్శ మార్గదర్శక మగుచున్నది. కవులైన పలువురాంగ్ల విమర్శకులు కూడ ఈ విమర్శ మార్గము నవలంబించిర”ని ఎస్. వి. రామారావు తెలుగులో సాహిత్య విమర్శ గ్రంథంలో నిర్వచించారు. (ఎస్వీ రామారావు. 2007. తెలుగు లో సాహిత్య విమర్శ. పుట 10)
పై నిర్వచనమాధారంగా నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించే కావ్య అవతారికలు సూత్ర విమర్శగా చెప్పబడుతుంది. కావున సైద్ధాంతిక రచయితలను, నూతన సిద్ధాంతాలను పరిచయం చేస్తూ దినపత్రికల్లో ప్రచురించే కథ సంబంధ ముందుమాటలను సూత్ర విమర్శగా పేర్కొనవచ్చు. ప్రాచీన కాలంలోని కావ్యవతారికలు పీఠికలే అనే అభిప్రాయం పండితుల్లో కలదు. ఇలాంటి సూత్ర విమర్శ పద్ధతి వ్యాసాలు మనకి ఈ రెండు పత్రికల్లోనూ కనిపిస్తున్నాయి. వీటి ద్వారా మంచి విషయాలను పాఠకులకు అందించాలనే కుతూహలం పత్రికల్లో కనిపిస్తుంది.
ఉదా:1. సామాజిక వాస్తవ చిత్రాలు – దార్ల వెంకటేశ్వర రావు (సెప్టెంబర్ 26, 2016 ‘చెలిమె’)
2. పాతికేళ్ల కథ ప్రయాణం – వాసిరెడ్డి నవీన్ (జనవరి 18, 2016 సాక్షి – సాహిత్యం)
7. సూత్ర విమర్శ వ్యాసాలు – విశ్లేషణ
వ్యాసం 1: ‘సామాజిక వాస్తవ చిత్రాలు’ - దార్ల వెంకటేశ్వర రావు
ఈ వ్యాసం ‘2015 ప్రాతినిధ్య కథ’ సంకలనానికి రచయిత రాసిన ముందు మాటలోని కొన్ని భాగాలు. ఇది నమస్తే తెలంగాణ దినపత్రిక చెలిమె సాహిత్యపుటలో సెప్టెంబర్ 26 2016 న ప్రచురితమైంది. దీనిలో ప్రాతినిధ్య గురించి చెపుతూ రచయిత ‘ప్రాతినిధ్య’ తీసుకొస్తున్న ఈ కథలన్నీ సమాజంలోని అట్టడుగు పొరల్లో కనిపించే వేదనల్నిదృష్యీకరించిన సామాజిక వాస్తవిక చిత్రాలుగా అభివర్ణించవచ్చు. దీనిలో భిన్న వర్గాలకు, భిన్న కులాలకు, భిన్న మతాలకు, భిన్నజెండర్స్ కి, తెలుగు భాషలోని భిన్న మాండలికాలకు ప్రాతినిధ్యం లభించింది’ అని తెలిపారు. ఈ వ్యాసం ప్రక్రియ విమర్శలో భాగంగా వస్తుంది. కానీ దీనిలో విశ్లేషణ ప్రధానంగా ఉంది. రచయిత కథల వరుసను బట్టి కాకుండా వయోపరిమితిని బట్టి కథలను విశ్లేషించారు. భిన్నధోరణులను డయాస్పోరా, ట్రాన్స్ నేషనలిజం వంటి వాటిని చెప్పడం వల్ల ఇది సైద్ధాంతిక విమర్శ అవుతుంది. నూతన ధోరణులను పరిచయం చేసే విమర్శనా వ్యాసాలను ప్రచురిస్తున్నందుకు ఈ పత్రికను అభినందించవచ్చు. దీని వలన కొత్త పాఠకులు కూడా తయారవుతారు. పండితులు కూడా దీనికి ఆకర్షితులవుతారు. లేకపోతే సామాన్యులు మాత్రమే ఉంటారు.
వ్యాసం 2: పాతికేళ్ల కథ ప్రయాణం – వాసిరెడ్డి నవీన్ (జనవరి 18, 2016 సాక్షి - సాహిత్యం)
పాతికేళ్ల కథ ప్రయాణం అనే వ్యాసం సాక్షి సాహిత్యం పుటలో జనవరి 18, 2016 న ప్రచురియితమయింది. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకులుగా కథా సాహిత్య ఆధ్వర్యంలో వచ్చిన 155 గురు కథకుల 336 కథలతో 1300 + 1300 పేజీలతో రెండు బృహత్ సంకలనాలను మనసు ఫౌండేషన్ ప్రచురిస్తుంది. వీటి ఆవిష్కరణ జనవరి 24న ఎన్టీఆర్ కళామందిరం, తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదులో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు భిన్న కార్యక్రమాల మధ్యన జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కథ సంకలనాలకు రాసిన సంపాదకీయ వ్యాసంలోని కొంత భాగం ప్రస్తుత వ్యాసం అని తెలుపుతూ దీనిని ప్రచురించారు.
దీనిలో వ్యాసకర్త కథ జీవితమంతా గొప్పది. సమాజమంతా విశాలమైంది అంటూ 25 సంవత్సరాలల్లో వచ్చిన కథలను వాటిని నేపథ్యలను పరిచయం చేశారు. పాతికేళ్ల కాలంలో సమాజంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని ఈ మార్పులు అన్ని కథల్లోకి తర్జుమా చేయబడిందని పేర్కొన్నారు. ఈ పాతికేళ్ల కాలంలో మొదటి ఐదు సంవత్సరాలు మినహాయిస్తే తర్వాత కాలంలో వచ్చిన కథలో ప్రధానంగా ఇతివృత్తాలు రెండు. ఒకటి గ్లోబలైజేషన్ కారణంగా మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు. రెండోది సమాజంలో వివిధ వర్గాల అస్తిత్వవేదనలు ఇవి స్త్రీవాదం నుండి ప్రాంతీయత వరకు విస్తరించాయంటూ సామాజిక, రాజకీయ మార్పులు కథలో ప్రతిఫలించిన విధానాన్ని తెలిపారు. ప్రపంచీకరణ, అస్తిత్వవాద ధోరణి, డయాస్పోరా వంటి నూతన సిద్ధాంతాలను పరిచయం చేస్తూ వాటిని ప్రతిబింపజేసిన కథల విశిష్టతను తెలియజేశారు. సమాజంలో వచ్చిన సకల మార్పులు ఈ సంకలనంలోని కథల్లో ప్రతిబింబిస్తాయి. సామాజిక చరిత్రకు దర్పణం ఈ సంకలనం అంటూ నూతన సిద్ధాంతాలను తెలియజేస్తూ కథ సాహిత్య గొప్పతనాన్ని అలాగే నూతన గ్రంథ ఆవిష్కరణ వివరాలను పాఠకులకు అందిస్తూ రాసిన ఈ వ్యాసాన్ని సైద్ధాంతిక విమర్శగా చెప్పవచ్చు.
వ్యాసం 3: తెలుగులో మామ్ కథలు (జూలై 04, 2016 సాక్షి - సాహిత్యం)
ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పాఠకుల హృదయాలను రంజింపచేసిన ప్రఖ్యాత కథా రచయిత సోమర్ సెట్ మామ్. తెలుగు కథకులందరికో మార్గదర్శకమైన మామ్ కథలను ఎలనాగ ‘సోమర్ సెట్ మామ్ కథలు’ పేరు తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా ప్రచురితమైంది. ఈ గ్రంథానికి అంపశయ్య నవీన్ ముందుమాట రాశారు. మామ్ కథల గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన ముందుమాటలోని కొంత భాగం ఈ వ్యాసం.
ఈ విధంగా రెండు పత్రికల సాహిత్యపుటల్లో సూత్ర విమర్శ ధోరణిలో వెలువడిన మరికొన్ని ముందుమాటల సంక్షిప్త వ్యాసాలు క్రింది విధంగా ఉన్నాయి.
1. మనకథలు.. మనవెతలు... నందిని సిధారెడ్డి (ఫిబ్రవరి 15, 2016 నమస్తే తెలంగాణ, చెలిమె)
2. జీవనోత్సాహాన్ని తెలిపే కథలు - ఓల్గా (ఏప్రిల్ 25, 2016 నమస్తే తెలంగాణ, చెలిమె)
3. కతల వెతల రణస్థలి - ఏ. కె ప్రభాకర్ (జూన్ 05, 2017 సాక్షి, సాహిత్యం )
4. కాలం కత్తిపై నడుచుకుంటూ – డా. వి. చంద్ర శేఖర్ రెడ్డి (జులై 10, 2017 నమస్తే తెలంగాణ, చెలిమె)
8. ముగింపు:
ఈ విధంగా కథ సంబంధ ముందు మాటలను సంక్షిప్త పరిచి వ్యాసాలుగా ఈ రెండు దినపత్రికలు ప్రచురిస్తున్నాయి. దీని ద్వారా నూతన పుస్తక పరిచయము, ఆవిష్కరణ సంబంధ సమాచారాలు తెలియడంతో పాటు వాటిని చదవాలనేటువంటి ప్రేరణ కలుగుతుంది. అలాగే పుస్తకతాలుకు వివరాలు, గ్రంథ వస్తువు, రచయిత దృక్పథం, గ్రంథ రచన నేపథ్యము, గ్రంథ ప్రత్యేకతలు, నూతన సిద్ధాంతాలపై అవగాహన వంటి అనేక విషయాలు ఈ ముందుమాటల వల్ల తెలుస్తున్నాయి. నూతన సిద్ధాంతాలను, ధోరణులను ప్రతిపాదిస్తూ విలువైన ముందుమాట లను సూత్ర విమర్శ పద్ధతిలో వ్యాసాలు ప్రచురించడం వలన అధిక పాఠకాదరణ లభిస్తుంది. ముందుమాటలను ప్రచురించేటప్పుడు వ్యాసం చివర మూలంలోని కొన్ని భాగాలు అని చెప్పడం వలన మూలాన్ని చూడాలనే భావన పత్రికవాళ్ళు పాటించారు. దీనివలన మూల రచయితను అపార్థం చేసుకోకుండా ఉంటారు. ఇది పత్రికకు సంబంధించిన నైతిక విలువ. దీన్ని ఈ రెండు పత్రికలు పాటిస్తున్నాయి. మూల వ్యాసాలను ఎడిటింగ్ చేసేటపుడు కొంత జాగ్రత్త పడాలి. ఎడిటింగ్ ఇంకా మెరుగుపడాలి. సాహిత్య అంశాలు తెలిసినవారు ఎడిటింగ్ లో ఉంటె ఇది సులభం అవుతుంది. కొన్నిసార్లు వ్యాసాల కంటే మూలవ్యాసాలు బాగుంటున్నాయి. దీనిని నా పత్ర పరిధి దృష్ట్యా వివరించడంలేదు. నేను పరిశీలించిన మేరకు మిగతా అన్ని విలువలను ఈ పత్రికలు పాటిస్తుంది.
9. పాదసూచికలు:
- శబ్ద రత్నాకరం 2012. పుట 587
- తెలుగు పీఠిక1990: పుట -33
- తెలుగులో సాహిత్య విమర్శ. 2007. పుట – 10
10. ఉపయుక్తగ్రంథసూచి:
- చంద్రశేఖర్ రెడ్డి, డి. 1990. తెలుగు పీఠిక. ఆంధ్ర సారస్వత పరిషత్. హైదరాబాద్.
- నమస్తే తెలంగాణ దినపత్రిక - 2016, 2017 చెలిమె సాహిత్య పుటలు.
- రామారావు, యస్. వి. 2007. తెలుగులో సాహిత్య విమర్శ. శ్రీ కళా ప్రింటర్స్. హైదరాబాద్.
- సాక్షి దినపత్రిక - 2016, 2017 సాహిత్య పుటలు.
- సీతారమాచార్యులు, బహుజనపల్లి. 2012. శబ్ద రత్నాకరం. శ్రీ వేంకటేశ్వర బుక్ డిపో. విజయవాడ.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.