AUCHITHYAM | Volume-5 | Issue-3 | March 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
6. జానపద విజ్ఞానం: బతుకమ్మ పండగ
డా. రాపోలు శ్రీనివాస్
అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
తారా ప్రభుత్వ కళాశాల(స్వ.ప్ర), సంగారెడ్డి.
సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, తెలంగాణ.
సెల్: +91 9848050694, Email: srinivas.rapolu42@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
మానవ జీవనానికి మూలం జానపదమేనని చెప్పవచ్చు. జానపదులకు సంబంధించినది జానపదం. జానపదులు నేడు కేవలం పల్లెల్లోనే ఉండడంలేదు. నగరాలల్లోనూ ఉంటున్నారు. కావున నేడు జానపదం అంతటా ఉంది. జానపద విద్వాంసుడు అలెన్ డండస్ చెప్పినట్లు జానపదులంటే ఏదైనా ఒక్క విషయంలోనైనా భావసామ్యం కలిగిన జనసముదాయం. జానపద జీవితంలో అంతర్భాగంగా ఉన్న ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు, మతం, కులం, వర్ణం, సంస్కృతి అంతా జానపద విజ్ఞానం అవుతుంది. జానపద విజ్ఞానంలో పండుగలు ఒక భాగం. జనపద విజ్ఞానం అంటే ఏమిటో వివరిస్తూ, అందులో భాగమైన పండుగలు, ఆ పండుగలలో బతుకమ్మ పండుగ వైశిష్ట్యాన్ని, సందేశాన్ని తెలియజేయడం ఈ వ్యాసం ఉద్దేశం.
Keywords: జానపద విజ్ఞానం - గుంపు మనస్తత్వం - జానపదుల పండుగలు - సాంఘికాచారాలు - బతకమ్మ పండుగ - పూలపూజ - అమ్మదేవతలు - బొడ్డెమ్మ ఆట.
1. ఉపోద్ఘాతం:
జనపదం అంటే మనుషులు నివసించే చోటు, పల్లె అని అర్థం. జనపదాలలో నివసించేవాళ్ళు జానపదులు. జానపదులకు సంబంధించినది జానపదం. అది వస్తురూపంలో, భావరూపంలో, ప్రదర్శన రూపంలో ఉండవచ్చు. పల్లీయులు, గ్రామీణులు ఎక్కడ ఉంటే అక్కడ జానపదత్వం ఉంటుంది. వారు ఈనాడు కేవలం గ్రామాల్లోనే ఉండడంలేదు. నగరాల్లోనూ ఉంటున్నారు. అందువల్ల జానపదం ఈనాడు అంతటా ఉంది. మానవ జీవనానికి మూలం జానపదమేనని చెప్పవచ్చు.
జానపద విద్వాంసులు జానపదులంటే విద్యావిహీనులు, కర్షక జనులు, గ్రామీణులని నిర్వచించారు. సంస్కృతిలో మూడు దశలున్నాయి. అరణ్యజీవన స్థితి, అనాగరిక స్థితి, నాగరిక స్థితి. అనాగరిక స్థితికి చెందినవారు జానపదులని వీరి అభిప్రాయం. అంటే జానపదులు అటు ఆటవికులు కాదు. ఇటు నాగరికులూ కాదు. పల్లెటూళ్ళల్లో నివసించేవారన్నమాట. ప్రసిద్ధ జానపద విద్వాంసుడు అలెన్ డండస్ విస్తృతార్థంలో జానపదులంటే ఏదైనా ఒక్క విషయంలోనైనా భావసామ్యం కలిగిన జనసముదాయం అని చెప్పారు. వీరు ఒకే భాష, ప్రాంతం, జాతి, మతం, వృత్తికి సంబంధించినవారు కావచ్చు. తమదేనని చెప్పుకోవడానికి కొన్ని సంప్రదాయాలు వీరికి ఉంటాయి.
పదిమంది ఒక గుంపు. గుంపు మనస్తత్వమే జానపదం. జానపద జీవితంలో అంతర్భాగంగా వున్న ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు, మతం, కులం, వర్గం సంస్కృతి అంతా జానపద విజ్ఞానం (Folk Lore) అవుతుంది. సంస్కృతికి సంబంధించిన విషయాలు, సంప్రదాయికంగా ప్రసారమయ్యే విషయాలు, వివిధ రూపాంతరాలు గలవి, మౌఖికంగా ఒక తరం నుండి మరో తరానికి సంక్రమించేవి జానపద విజ్ఞానంలో చేరుతాయని ఆర్వీయస్ సుందరంగారు పేర్కొన్నారు.
జానపద విజ్ఞానాన్ని ప్రధానంగా రెండు భాగాలుగా పేర్కొనవచ్చు. 1. శాబ్దిక లేక వాగ్రూప జానపద విజ్ఞానం, 2. శాబ్దికేతర లేదా వాగ్రూపేతర జానపద విజ్ఞానం. మౌఖికంగా శబ్దరూపంలో వెలువడేది శాబ్దిక జానపద విజ్ఞానం కాగా, తదితరమైన నమ్మకాలు, ఆచారాలు, దుస్తులు, అలంకారాలు, ప్రదర్శన కళలు మొదలైనవి శాబ్దికేతర జానపద విజ్ఞానంలో చేరతాయి.
జానపద విజ్ఞానంలో సాంఘికాచారాలు ప్రధాన భాగమైతే, అందులో జానపదుల నమ్మకాలు, దేవతలు, పండుగలు, వైద్యం, ఆటలు-వినోదాలు మొదలగునవి వివిధ భాగాలు.
2. జానపదుల పండుగలు:
పండుగలు, పబ్బాలు, నోములు, వ్రతాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, జాతరలు, కొలువులు తరతరాలుగా సమాజంలోని వివిధవర్గాల వ్యక్తుల్ని ఒక్క చోటుకి చేరుస్తాయి. ఇటువంటి ఉత్సవ సంప్రదాయాలను గురించిన ప్రస్తావనలు తెలుగు కావ్యాలలో పెక్కుచోట్ల కనిపిస్తున్నాయి. శివరాత్రి మాహాత్మ్యంలో వివిధ ఋతువులలో వచ్చే పండుగలను గూర్చి చెప్పబడింది.
‘చలి ప్రవేశించు నాగుల చవితినాడు / ముఱయు వేసవి రథసప్తమీ దినమున
అచ్చ సీతు ప్రవేశించు పెచ్చుపెరిగి / మార్గశిర పౌష మాసాల మధ్యవేళ
ఇండ్ల మొదలను నీరెండ నీడికలను / అనుగుదమ్ముడు నన్నయు నాటలాడు
అత్తయును కోడలును గుమ్ములాడు కుమ్ము / గాచు చోటికి మకర సంక్రాంతి వేళ’ (ఆ4 - 25, 27) (1)
సింహాసన ద్వాత్రింశికలో దివ్వెల పండుగను గురించి ఉంది (2వ భాగం-పు.39) (2). తెలంగాణాలో నేటికీ దివిలి పండుగ అన్నపేరు వాడుకలో ఉంది. పున్నమకు, అమవాస్యకు చేసే పూజలు, పండుగలు అనేకం ఉన్నాయి. నూలిపున్నమ (శ్రావణ పూర్ణిమ) అనే వాటిని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు.
ఉత్సవాలు, జాతరలు పెక్కు ప్రాచీనకావ్యాలలో వర్ణించబడ్డాయి. ఆ కాలంలో రాజులు, మంత్రులు ఉత్సవ కాలంలో రూకలు చల్లి బీదలకు దానం చేసేవారట. శ్రీకాకుళం తిరునాళ్ళకు ప్రసిద్ధమై ఉండేదని మంచన కేయూరబాహుచరిత్రలో వర్ణించాడు (1-45) (3). ‘నలువుగ కాకుళేశు తిరునాళులలోపల గుండమంత్రి నిర్మలమతి బిట్టు వేగముగ మాడలు రత్నచయంబు చల్లె’ నని గుండమంత్రి వితరణశీలి అనే విషయాన్ని తెలిపాడు. కాకతీయుల కాలంలో శ్రీకాకుళం తిరునాళ్ళకు ప్రసిద్ధమై ఉండేదని క్రీడాభిరామమంలో ఉంది.
పండుగ సాంఘిక సంక్షేమంకోసం సంబంధించిందనీ, విశేష సందర్భాలలో వీటిని జరుపుతారు. మహాత్ముల జన్మదినాలుగానో, విశేష తిథివార నక్షత్రాలలో వస్తాయన్న కారణంగానో పండుగ అనగానే ఏదో ఒక విశేషం స్ఫురిస్తుంది. పండుగలకు మూలం ప్రాచీన కాలపు కర్మకాండలని చెప్పవచ్చు. ఒకప్పుడు మత సంబంధమైన ఆచరణలుగా ఉన్న పండుగలే తర్వాతి కాలంలో జనులు ఆనందం కోసం ఆచరించే పండుగలయ్యాయి. ప్రాచీన యుగాలలో సమాజంలోని ఇతరులకోసం యుద్ధాలలో, సాహస కార్యాలలో అసువులు బాసిన అమరవీరులు, గ్రామంకోసం, ప్రజా సంక్షేమం కోసం ఆత్మబలికి కూడా సిద్ధమైన నారీమణులు ప్రజలచేత పూజలందుకున్నారు. ఇటువంటి మహానీయుల సంస్మరణ కోసం కూడా కొన్ని పండుగలు రూపుదాల్చాయి. మత సంప్రదాయాలను, నీతి నియమాలను బోధించిన ఉన్నత వ్యక్తులు, ధార్మిక మహాపురుషుల గౌరవం కోసం కూడా కొన్ని పండుగలు ఉద్భవించాయి.
సమాజంలోని వ్యక్తుల మధ్య పరస్పరాభిప్రాయ వినిమయం జరగడంవల్ల, జనజీవనానికి సంబంధించిన అనేక విషయాలు ఈ సందర్భంలో ప్రస్తావనకు వస్తాయి. కొంగ్రొత్త సంబంధా లేర్పడి బలపడతాయి. సాంస్కృతికమైన స్ఫూర్తిని కలిగించడంలో ఇవి ప్రధాన పాత్రవహిస్తాయి. జానపదుల రస దృష్టికీ, ఉత్తమాభిరుచులకు తార్కాణంగా పండుగలు ఉంటాయి.
3. బతుకమ్మ పండుగ:
జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేలయేండ్ల పూర్వపువి. ఒక్కో జాతికి, ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ తెలంగాణాకే పరిమితమైంది. ప్రపంచంలో మరెక్కడా లేని పూలపూజ తెలంగాణ సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మనిషి మూలాలను ఎరుకపరిచే మంచి సంప్రదాయం. బతుకమ్మ అచ్చతెలుగు మాట.
జానపదులు తమ సంతు దక్కాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టినపిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే, పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని ‘పెంటమ్మ లేదా పెంటయ్య’ అని పేరు పెట్టుకుంటారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చి ‘బిచ్చంగా’ తిరిగియ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు ‘భిక్షపతి, భిక్షమ్మ’ లని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి, బుచ్చమ్మలుగా పిలువబడు తుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే ‘బతుకనిపిల్ల బారెడనే’ సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్న వాళ్ళు ఇపుడు కూడా వున్నారు.
4. బొడ్డెమ్మ ఆట:
ఈ పూలపండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుంది. తెలంగాణ ప్రత్యేకతను చాటే పండుగలు ‘బొడ్డెమ్మ’, ‘బతుకమ్మ’ పండుగలు. లక్ష్మీ పార్వతుల పూజలు తెలంగాణలో బతుకమ్మ పండుగగా రూపుదాల్చినవి. ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుండి మహర్నవమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. దీనికి ముందు తొమ్మిది రోజులు బొడ్డెమ్మ పండుగ జరుగుతుంది. ఇది మహాలయామావాస్యతో పూర్తవుతుంది. బొడ్డెమ్మ పిల్లల పండుగ. ఇందులో పెద్దలు ప్రేక్షకపాత్ర మాత్రమే వహిస్తారు. పుట్టమన్నుతొ ఒక బొడ్డెమ్మను భాద్రపద బహుళ పంచమినాడు చేస్తారు. దానిపై ఒక కలశము పెడతారు. ఆ కలశముపై ఒక కొత్త రవికెబట్టను ఉంచి పసుపు గౌరమ్మను ఉంచి, పసుపుకుంకుమ పెట్టి రుద్రాక్ష, గోరంట, బీర పువ్వులతో అలంకరిస్తారు. ఇది వాడకొక్క ఇంటివారైనా చేస్తారు. సాయంకాలం ఇంటిముందు అలికి ముగ్గులుపెట్టి బొడెడ్మను నిలుపగానే ఆ వాడలో ఉండే ఆడపిల్లలందరు అక్కడ చేరుతారు. పెద్దలు ఈ ఆటను చూడడానికి వస్తారు. వచ్చిన పెద్దవారిలో ఒక స్త్రీ పాట చెబుతుండగా పిల్లలు చప్పట్లు కొడుతూ బొడ్డెమ్మ చూట్టూ తిరుగుతూ పాడుతారు. చీకటిపడే దాకా ‘బొడ్డెమ్మ’ ఆటలాడుకొని తరువాత ‘ఫలహారములు’ పంచిపెటి బాలికలు మళ్ళీ ఆ బొడ్డమ్మను దాచిపెడతారు. కన్యలు తమకు వివాహము కావాలని, మంచి భర్త లభించాలనీ గౌరీదేవిని బొడ్డెమ్మ రూపంగా పూజిస్తారు. తొమ్మిదోరోజు ఈ పండుగ ముగుస్తుంది. ఆరోజు బొడ్డెమ్మను పూజించి కలశములో పిల్లలందరు ప్రతిరోజు తెచ్చిపోసిన బియ్యముతో పరమాన్నము వండి పంచిపెడాతారు. ఒక బావి వద్దకు వెళ్ళి
‘‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ బిడ్డలెందారె-బావిల పడ్డావారికి బారిద్దరమ్మా
చెర్లాబడ్డా వారికి చెరిద్దరమ్మా-కుంట్ల బడ్డావారికి కోరిద్దరమ్మా
నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా-నిద్రకూ నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నినుగన్న తల్లికీ నిండ నూరేండ్లు ... ’’ అని పాడే పాట సంతానం గురించినదే.
నాటి రోజుల్లో నీళ్ళాడే(ప్రసవ) సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి. నీటి రేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమసంతు బతికినందుకు ప్రతీకగా నీటివారన పెరిగే తంగేడు, గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసివుంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మపండుగగా మారివుంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం తెలంగాణ సంస్కృతికి సాక్ష్యం. ఎవ్వరికన్న ఐదారుగురు కన్నా ఎక్కువమంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను కల్పించింది. పూజించింది. అమ్మదేవతలపూజల్లో ఒక ఆరాధనారూపమే బతుకమ్మ.
బొడ్డమ్మ పండుగ తరువాత బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. తెలంగాణమంతటా ఈ పండుగను ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకుంటారు. స్త్రీలందరూ మైదాన ప్రదేశంలో ఒకచోట చేరి ఈ ఆట ఆడతారు. స్త్రీలంతా ఒకచోట చేరడానికి, పరస్పరం కలుసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. వెదురు లేదా దుసేరు తీగెలతో అల్లిన సిబ్బిలోగానీ, వెడల్పయిన గుండ్రని పల్లెంలోగానీ గుమ్మడిపూలు పరచి వానిపై తంగెడు, పైడితంగెడు, గునుగు, నువ్వు, రుద్రాక్ష, కట్ల, గట్టుగొరిమిడి, కాకర, బీర, గన్నేరు, పొట్ల, కట్లాయి పూలతో బతుకమ్మను పేర్చి దానిపై గౌరమ్మను నిల్పుతారు. పసుపు కుంకుమలతో పూజలు చేసి, పీటపైపెట్టి దేవుడి దగ్గర పూజగదిలో ఉంచుతారు. సాయంకాలము నాలుగు గంటల వరకు పెద్దలు, పిన్నలు తమకున్న విలువైన వస్త్రాలు, నగలు ధరించి బతుకమ్మలను తమ చేతులలోపట్టుకుని ఊరిబయట చెరువవద్దనో, కాలువ దగ్గరికో, గుడి సమీపములోనో గుమికూడి బతుకమ్మలను మధ్యన నిలిసి చుట్టు తిరుగుతూ చపట్లుకొడుతూ పాటలు పాడతారు. బతుకమ్మ ఆటను చూడడానికి మగవారుకూడా వచ్చి దూరముగా ఉండి చూస్తారు.
5. బతుకమ్మ పాటలు:
తెలంగాణ ప్రజలు బ్రతుకమ్మలో దైవాన్ని దర్శించారు. ఈ దర్శనం కారణంగానే ఎన్నో బతుకమ్మ పాటలు ప్రాదుర్భవించాయి. నిత్యజీవితంలోని సంఘటనలూ పాటల్లో కనిపిస్తాయి. పౌరాణికాంశాల్లోనూ ప్రస్తుత కుటుంబ జీవన సంఘటనలూ చొచ్చుకొని వచ్చాయి. పౌరాణిక, చారిత్రక, స్థానిక, సామాజికాంశాలనెన్నో ఈ పాటలు ప్రతిబింబించాయి. ఒకరు పాట చెబుతుండగా మిగిలిన వారు చుట్టూ తిరుగుతూ పాడుతూ ఈ ఆట ఆడతారు. స్త్రీలంతా ఎవరికి వచ్చిన పాటలు వారు పాడతారు. ఈ పాటలు లక్ష్మీ పార్వతుల స్తోత్రాలు మాత్రమేకాక, పౌరాణిక గాధలు ఎన్నో ఉంటాయి. సీత, అనసూయ, చంద్రమతి, శశిరేఖ, సత్యభామ, సావిత్రి, కన్యకాపరమేశ్వరి మొదలైన వారి గురించిన పాటలు పాడతారు. ముఖ్యంగా 1. కష్టాలు కడతేర్చే దైవ మహిమలు, 2. దానధర్మాలు చేసిన వ్యక్తులు, 3. పురాణాల్లోని సీత పుట్టుకవంటి సంఘటనలు, సీతారాములు వనగుంతలు (వామన గుంతలు), పర్ణశాల, సీతాపహరణం, మాయ లేడి, 4. త్యాగశౌర్యాలు ప్రదర్శించిన వారి జీవితాలు, 5. జనగామ/జడ్చర్లవంటి రైలు ప్రమాదాలు, 6. అత్యాచారానికి గురైన నక్క అండాలమ్మ వంటి వారి కథలు, 7. అత్త ఆరళ్లకు బలి అయిన బ్రతుకులు, 8. వ్రతకథలు, పతి వ్రతల కథలు, 9. ఇలవేల్పుల కథలు, 10. షణ్మతాలకు సంబంధించిన కథలు 11. దేశ స్వాతంత్య్రంలోని ఘట్టాలు, 12. ఇందిరాగాంధీ హత్యవంటి సంఘటనలు, 13. నిజాం/రజాకార్ల దురంతాలు, 14. దుబాయి-మస్కట్లలో మోసపోయిన వారి కథలు, 15. స్థానిక దేవాలయాలకు సంబంధించిన అంశాలు, 16. కుటుంబ సంబంధి సరసాలు/విరసాలు, 17. స్త్రీల ఆత్మహత్యలు-పురుషుల కష్టాలు, 18. దేశభక్తుల జీవితాలు, 19. కల్లు సారా త్రాగడంవల్ల పాడైన కుటుంబాల కథలు, 20. నైతిక విలువల ప్రబోధాలు. ఇలా ఎన్నో ఇతివృత్తాలను పాటల నిర్మాణానికి జానపదులు స్వీకరించారు. తెలంగాణా ఉదాత్త వైవిధ్యభరిత జీవితాన్ని పాటల్లో నింపారు. ఈ పాటలలో ప్రతి చరణము చివరన కోలు, ఉయ్యాలో, చందమామ, గౌరమ్మ మొదలైన పదాలలో ఒకటి వస్తుంటుంది.
‘‘ధరచోళ దేశాన ఉయ్యాలో / ధర్మాంగుడనురాజు ఉయ్యాలో...’’ అనే బతుకమ్మ పాటలో బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాలున్నాయి. శ్రీలక్ష్మియే బతుకమ్మ అనీ, ప్రతియింటా శ్రీలక్ష్మి (వైభవం, సంపద, ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం) ఉండాలనీ ఈ పాట పరమార్థం. ఆ ఉయ్యాల పాటలోని కథనం యిది.
‘‘చోళదేశాన్ని ధర్మాంగుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య సత్యవతి. వారికి నూరుమంది సంతానం. వారందరూ రాజ్య రక్షణలో శత్రువుల చేతిలో మరణించారు. దేశం పోయింది, రాజ్యం పోయింది. ఆ దంపతులు చింతించారు. విచార సాగరంలో మునిగిపోయారు. దు:ఖంలో ఉన్నా చివరికొక నిర్ణయం తీసుకున్నారు. లక్ష్మీదేవిని గురించి సత్యవతి తపస్సు చేసింది. ఆ తల్లి ప్రత్యక్షమయి వరం కోరుకొమ్మన్నది. సత్యవతి లక్ష్మీదేవికి దండంపెట్టి తన గర్భాన జన్మించుమని కోరుకొన్నది. ఆ తల్లి దయదలిచింది. వరమిచ్చింది. సత్యవతి గర్భాన జన్మించింది. ఆ తల్లిని చూడ్డానికి మునులు వచ్చారు. కవులు, గాయకులు వచ్చారు ఆ పాపను చూచి ‘‘బ్రతుకు గనె ఈ తల్లీ చందమామ బ్రతుకమ్మ’’ అన్నారు. ఇక అప్పటినుండి ఆ పేరుతోనే తల్లిదండ్రులు పిలిచారు, అలాగే అందరూ పిలిచారు.
శ్రీమహావిష్ణువు చక్రాంకుడనే పేర జన్మించాడు. ఆ రాజు ఇంటికి ఇల్లరికం వచ్చాడు. బతుకమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఆరువేలమంది సుందరాంగులు జన్మించారు. సత్యవతీ ధర్మాంగులు సంతసించారు’’. శ్రీమహాలక్ష్మే బ్రతుకమ్మ అన్నా, దానికి ఆధారంపై కథ (పాట) అయినా, పసుపు ముద్దను గౌరమ్మగా భావించి (గౌరమ్మగాచేసి), బతుకమ్మ పూల గోపురంలోపెట్టి, బతుకమ్మయే గౌరీదేవిగా పార్వతిగా సంభావించి పండుగ జరుపుకొనే సంప్రదాయముంది. అందువల్ల బ్రతుకమ్మ అంటే జగజ్జనని పార్వతి అమ్మవారనే నమ్మమూ ఉంది. అంతేగాక లక్ష్మీపార్వతీ దేవతల త్రిమూర్త్యాత్మక స్వరూపం బ్రతుకమ్మ అనీ తెలంగాణలో బహుళ ప్రచారంలో ఉన్న క్రింది పాట ద్వారా తెలుస్తున్నది.
‘‘శ్రీలక్ష్మి నీ మహిమలూ-గౌరమ్మ-చిత్రమై తోచునమ్మా
భారతీ సతివయ్యు బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశు రాణివై
పరగ శ్రీలక్ష్మివయ్యూ-గౌరమ్మ-భార్యవైతివి హరికినీ
ముక్కోటి దేవతలు చక్కనీ కాంతలు, మక్కువతొ నునుగూర్చి పెక్కునోములు నోచి
ఎక్కువా వారైరిగా-గౌరమ్మ-ఇహలోకముల యందునా’’ ... అని గౌరీదేవిని స్తుతిస్తారు.
శ్రీలక్ష్మీ పార్వతులే కాక సరస్వతి కూడా బతుకమ్మే అనే విశ్వాసం పెంచింది ఈ పాటనే. ఆ జగన్మాతే బతుకమ్మ. ముగురమ్మల మూలపుటమ్మ అనే భావన ఏర్పడిరది. మరొక కథనం కూడా ఉంది. అది కాకతీయ రాజుల ఇలవేల్పునకు సంబంధించినది. కాకతీయ రాజుల పూర్వీకుల్లో గుండన ఒకరు. ఆ గుండన పొలం దున్నుతుంటే ఓ దేవతా విగ్రహం లభించింది. గుమ్మడితోటలో దొరికిన ఆ దివ్యమాతయే కాకతి. సంస్కృతంలో గుమ్మడిని కాకతి అంటారు. బతుకమ్మను గుమ్మడి పువ్వులతో పూజిస్తారు. కాళిరూపంలో ఉన్న కాకతిని కూడా గుమ్మడి పువ్వులతో పూజిస్తారు. ఈ బంధంతో కాకతే బతుకమ్మగా పూజింపబడుతూ వచ్చింది.
ఇలా శ్రీమహాలక్ష్మి, పార్వతి, సరస్వతి, కాకతి దేవతల సమాహార స్వరూపంగా బతుకమ్మ స్థిరపడి తెలంగాణలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమికి ఒకరోజు ముందునుండి నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నది. దేశమంతటా దేవీనవరాత్రి ఉత్సవాలు జరుపుకొంటుంటే, వాటితోపాటు దేవీ ఉత్సవాలలో అంతర్భాగంగా బతుకమ్మ పండుగ దివ్యంగా, భవ్యంగా, సుందరంగా, శోభాయమానంగా తెలంగాణలో జరుగుతున్నది.
బతుకమ్మ ఒక సామూహిక ఉత్సవం. వృత్తి, వర్ణ వర్గ కులప్రాంత మత సంప్రదాయ భేదాలకతీతంగా జాతిలో సమతాభావాన్ని పెంపొందించింది. ప్రకృతిలో లభించిన వివిధ పుష్పాలనొక చోటచేర్చి పూలగోపురం నిర్మించిన విధంగానే, రంగు-రూపు-వృత్తి భేదాలతో కనిపించే అందరినీ (ముఖ్యంగా మహిళలను) ఒకచోట చేర్చిన ఘనత ఈ ఉత్సవానికున్నది.
6. ముగింపు:
బతుమ్మను ఆయా రోజుల్లో బావిలో వేసినా, లేదా చివరిరోజే అందరూ సామూహికంగా ఆడిన ఆట-పాటల అనంతరం వేసినా, బ్రతుకమ్మ అందించిన సందేశం పచ్చగ బ్రతకాలనే. నిమజ్జనం ఇచ్చే సందేశం కూడా ఎంత పచ్చగ బతికామో, అంత ప్రశాంతంగా వెళ్లిపోవాలనే. జీవితం శాశ్వతం కాదు, పైనుండి పిలుపు వచ్చినప్పుడు అన్నిటినీ తృణప్రాయంగా విసర్జించి వెళ్లిపోవాల్సిందే.
జానపదుల జీవితంలో పైన పేర్కొన్న పండుగలు, వ్రతాలు, ఉత్సవాలు, జాతరలు భాగమైపోయాయి. ఇటువంటి పండుగలు ప్రాచీనకాలంనుంచి ఉన్నవే. ఆదిమవాసుల జీవితంలో కర్మకాండలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. నగర జీవితానికి దగ్గరగా ఉండే జానపదుల జీవితంలో పండగలపాలు ఎక్కువైతే, అటవీ జీవితంలో దగ్గరి సంబంధం ఉండే జానపదులకు కర్మకాండలపై నమ్మకం ఎక్కువ. మానవుని సాంస్కృతిక వికాసంలో పండుగలు వహించిన పాత్ర మరువలేనిది.
7. పాదసూచికలు:
- శివరాత్రి మాహాత్మ్యం (ఆ4 - 25, 27)
- సింహాసన ద్వాత్రింశిక (2వ భాగం-పు.39)
- కేయూరబాహుచరిత్ర (1-45)
8. ఉపయుక్తగ్రంథసూచి:
- మోహన్, జి.ఎస్. (2001). జానపద విజ్ఞానాధ్యయనం, శ్రీనివాస పబ్లికేషన్స్, బెంగుళూరు.
- రాధాకష్ణమూర్తి, మిక్కిలినేని. (1992). తెలుగువారి జానపద కళారూపాలు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
- రామరాజు, బిరుదురాజు. (1978). తెలుగు జానపద గేయ సాహిత్యం, జానపద విజ్ఞాన ప్రచురణలు, హైదరాబాద్.
- వెంకట సుబ్బారావు, తంగిరాల. (1975). జానపద సాహిత్యం - వీరగాథలు, ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడెమి, హైదరాబాద్.
- సుందరం, ఆర్వీయస్. (1983). ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.