headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-3 | March 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. ‘శాంతిపుత్ర’ శతకం: సామాజికాంశాల పరిశీలన

డా. పెనుమాక రాజశేఖర్

ఉపాధ్యాయుడు,
మేరీమాత ఇంగ్లీష్ మీడియం స్కూల్,
తుళ్ళూరు, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9493924634, Email: penumakarajashekhar@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

విశిష్టమైన తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు వారి వారి రచనలతో తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు, నవలలు, కథలు వంటి ఇంకా ఎన్నో రకాల నూతన సాహిత్య ప్రక్రియలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. అటువంటి ప్రక్రియలు అన్నిటిలో శతకం భిన్నమైనది. అందులోనూ ముక్తకలక్షణాలు ఉన్నవి ప్రత్యేకతను కలిగి ఉంటాయి. నేటి ఆధునిక కాలంలో యువ రచయితలు ఎందరో ఎన్నో రచనలు చేస్తున్నారు. వారిలో శతక కారులను, వారి శతకాలను, అందులోని వైశిష్ట్యాన్ని తెలియజేయడం ఈ వ్యాసం ఉద్దేశం.

Keywords: ఆధునికసాహిత్యం, శతకం, ఆధునిక శతక కారుల ప్రస్తావన, శాంతిపుత్ర శతకం, సామాజికాంశాలు.

1. ఉపోద్ఘాతం:

తెలుగు సాహిత్యంలో ఉన్న వివిధ ప్రక్రియలలో శతకం వినూత్నమైనది. ఎందరో కవులు శతక రచనలు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎందరో కవులు పురాణ కథలను వస్తువులుగా స్వీకరించి కావ్యాలతో, అతి వర్ణనలతో, ఊహాలోకంలో విహరిస్తుంటే కొందరు కవులు తమ పాండిత్యాన్ని ఎన్నో శతకాల రూపంలో రచించి సమాజాన్ని అభ్యుదయ పథంలో నడిపించడానికి ఉపకరించారు. నీతి, వైరాగ్య, హాస్య, శృంగారాత్మక నేపధ్యాలతో ఎందరో కవులు ఈ శతకాలను రచించారు. అలాంటి వారిలో కవి చౌడప్ప, కాసుల పురుషోత్తమ కవి, వేమనలు తెలుగు సాహిత్యంలో చెరగని ముద్రను వేసుకున్నారు. మరీ ముఖ్యంగా వేమన అలతి పదాలతో ఆటవెలది ఛందస్సులో రాసిన పద్యాలు ఆబాలగోపాలాన్ని అలరిస్తాయి. మూఢనమ్మకాలతో, వింత ఆచారాలతో, మనుషులలో మూర్ఖత్వం పెరిగిపోయి, మానవత్వం నశించి పోతున్న తీరును విమర్శిస్తూ సమాజాన్ని ఉత్తమ దిశలో నడిపించేలా పద్యాలను కూర్చారు. వీరి స్ఫూర్తితో తదనంతర కాలంలో ఎందరో కవులు వేమన మకుటాన్ని ప్రయోగిస్తూ వేమన వలెనే పద్యాలు రచించగా, మరికొందరు ఆటవెలది పద్యాలతో ముక్తకాలను రచించి పిల్ల వేమనలు అనిపించుకున్నారు. కథలు, వచన కవితలు, హైకు, నానీలు విరివిగా రచించబడుతున్న ఈ కాలంలో పద్య రచన చేసే యువ కవులు చాలా తక్కువనే చెప్పవచ్చు. అలాంటి వారిలో ఒకరు డా. దాసరి రమేష్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.  

2. దాసరి రమేష్ - జీవన రేఖలు:

యువకవి అయిన దాసరి రమేష్ గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలోగల కొండేపాడు గ్రామంలో దాసరి కనకరాజు, మేరీ కుమారి పుణ్య దంపతులకు జూన్ 12, 1986 లో జన్మించారు. వీరి బాల్యం అంతా కొండేపాడులోనే గడిచింది. ప్రాధమిక విద్యాభ్యాసం వీరి స్వస్థలం అయిన కొండేపాడులోని మండల ప్రాథమిక పాఠశాలలోనూ, ఉన్నత విద్యను కోయవారిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొంత వరకు, ఆంధ్ర ప్రదేశ్ గురుకుల బాలుర వసతి గృహ పాఠశాల పల్లపట్లలోనూ, కళాశాల విద్యను ఎన్.టి.ఆర్ కృష్ణాజిల్లాలోని నిమ్మకూరులోగల ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలోనూ, స్నాతకవిద్యను హిందూకాలేజీ గుంటూరులోనూ, స్నాతకోత్తరస్థాయి విద్య, పిహెచ్.డి. విద్యను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ పూర్తి చేశారు. వీరి వివాహం 2018లో జరిగింది. 

3. రమేష్ సాహిత్యం:

రమేష్ కవిగా మొదట గుర్తింపు తెచ్చినది డా. ఎన్. వి. కృష్ణారావు గారి సంపాదకత్వంలో వచ్చిన “కర్మ కాదు క్రియ” వచన కవితా సంపుటి. ఇది 2018లో  ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.  ఆవిష్కరించబడింది. తరువాత వీరి శతకమైన శాంతి పుత్ర శతకం 2020లో ప్రచురణ పొందింది. ఆ తరువాత వారు పని చేసే పాఠశాలలోని విద్యార్థులతో ‘అమ్మ’ అనే అంశం మీద వచన కవితలను రాయడంలో వారిని ప్రోత్సహించి, “అమ్మకు అక్షరాభిషేకం” అనే వచన కవిత సంపుటిని 2022 లో వెలువరించారు. సాహిత్యం పట్ల విద్యార్థులలో కూడా ఆసక్తిని కలిగించి, వారిలో స్వీయ రచన కౌశలాలను అభివృద్ధి చేయడంలో కృషిచేశారు. వీరి రచనా ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది.

4. శాంతి పుత్ర శతకం - సామాజికత:

రమేష్ రచించిన శతకాలలో ఇది మొదటిది. శతక శీర్షికనే మకుటంగా స్వీకరించి, వీరు రచించడం జరిగింది. శాంతి కాంక్ష కలిగిన వ్యక్తిగా తన శతకంలోని శాంతిని, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తూ రచించిన విధానం కనిపిస్తుంది. “ఈ శతకంలోని పద్యాలకు వస్తువు బైబిల్, సమకాలీన సమాజంలోని సమస్యలు, సంఘటనలు హేతువులయ్యాయి. బైబిల్ ను  ఆధారంగా చేసుకొని రచించినా, ఇక్కడ చెప్పబడినవి మాత్రం ప్రాపంచిక సత్యాలు.” (పీఠిక – శాంతిపుత్ర శతకం – పుట: vii) అయితే ఇందులో భక్తి భావం కనిపించే పద్యాలు తక్కువే అని చెప్పాలి. అన్నీ కూడా నీతి పద్యాలే కనిపిస్తాయి. పెడత్రోవ పడుతున్న సమాజానికి హిత బోధ చేసేలా కనిపిస్తాయి.

5. శాంతి పుత్ర శతకం  - నామౌచిత్యం:

శాంతి పుత్ర శతకం అని పేరు పెట్టడంలో, మకుటంగా ఎంచుకోవడంలో శతక కర్త ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రపంచమంతా  శాంతితో వర్ధిల్లాలని ఉద్యమించే ప్రతీ ఒక్కరూ శాంతి పుత్రులే. కాగా అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవారు క్రీస్తు, గౌతమ బుద్ధుడు వంటి వారని శతక కర్త అభిప్రాయం. ప్రపంచంలో శాంతి స్థాపన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని వ్యక్తులను ఉద్దేశించి ప్రయోగించారు.


6. శాంతి పుత్ర శతకం - నీతి ప్రభోదకత:

6.1. మూర్ఖ జన చిత్రణ:

మంచి బుద్ధి కల వారు ఎవరు ఏమి చెప్పినా దానిలో మంచి చెదులను విచక్షణ చేసి, మంచిని గ్రహించి అమలు చేస్తాడు. కాని మూర్కులు ఒకరు చెప్పేది వినిపించుకోరు. మూర్ఖులు వల్ల  సమాజానికి విఘాతం కలుగుతుంది.  అందుకే మూర్ఖుల విషయంలో ఎలా ప్రవర్తించాలనే విషయంలో వివరణ ఇస్తున్న తీరుని మనం ఈ పద్యాల్లో గమనించవచ్చు.

“ఎవ్వరెన్ని జెప్పిరేని మూర్ఖ మదికి
ఎవ్విధముగనైన నెరుక గాదు
నిజము, యట్టి వారిఁ నిర్జించి జీవించు
శాంతి నొసగుమయ్య శాంతి పుత్ర” (శాంతి పుత్ర శతకం - పుట: 11)

మూర్ఖుడి మనసు చాలా కఠినమైనది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని వాదిస్తుంటారు. ఇలాంటి వారిని ఎంత మంది వచ్చి, ఎన్ని మంచి మాటలు చెప్పి వారిని మార్చేందుకు ప్రయత్నించినా వారు మాత్రం నిజాన్ని గుర్తించలేరు. అలాంటి వారిని విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోవటం ఉత్తమమైన పని అని చెప్తున్నారు. అంతేకాక మరొక పద్యంలో-

“ఖరువునకు చబుకు, ఖరమునకు కళ్ళెము
మూర్ఖ చిత్త  నరుని మూపు మీద
వాతలు సరి .........................” (శాంతి పుత్ర శతకం - పుట:11)

కొన్ని కొన్ని సందర్భాల్లో మూర్ఖుడు మాటలకు లొంగనప్పుడు గుర్రం కళ్ళకు గంతలు, గాడిదకు చిక్కం ఎలాగ ఉపయోగపడుతుందో అదే విధంగా మూర్ఖుడి వీపు మీద దెబ్బలు పడితేనే వారిలో మూర్ఖత్వం తగ్గుతుందని సూచించారు. మంచి మాటలు ఎన్ని చెప్పినా వారు చెవికి ఎక్కించుకోరని వాపోయారు. దీనికి సాదృశ్యంగా మరొక పద్యం చూడవచ్చు.

“నదుల జలము లెన్ని నాళ్ళు కలిసినా
జలది నందు నొప్పి చవి తరగదు
మంచి మాట వలన మందుడు మారునా
శాంతి నొసగుమయ్య శాంతి పుత్ర” (శాంతి పుత్ర శతకం - పుట:30)

మరొక సందర్భంలో మూర్ఖురాలైన స్త్రీ గురించి కూడా చెప్పారు. స్త్రీలు మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే తామే నష్టపోతారు. మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల భర్తల వల్ల చేటుని కొని తెచ్చుకున్న వాళ్ళవుతారు. అదే తెలివి గలిగిన స్త్రీ అయితే తమ భర్తలకు, కుటుంబానికి కిరీటం లాగా ఉంటుందని సూచించారు.

“మూఢురాలు తనదు మొగునికి హేయము
తెలివి కలిగి నడుచు  తెఱువ యాస్తి” (శాంతి పుత్ర శతకం - పుట:12) 

స్త్రీ తెలిపి కలిగి నడుచుకుంటూ కుటుంబాన్ని నడిపించాలి. అలా కాకుండా గయ్యాళితనంతో ప్రవర్తిస్తూ, చీటికి మాటికి నోరేసుకొని పడిపోతూ భర్తను విసిగిస్తే నష్టపోయేది వారేనని  గ్రహించాలి. అటువంటి స్త్రీని ఆమె భర్త మాత్రమే కాదు సమాజంలో ఎవరూ వారిని స్వాగతించరు. 

మరొక పద్యంలో రాజు మూర్ఖుడైతే పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా ఉదహరించారు. కుటుంబంలో స్త్రీ మూర్ఖురాలైతే ఇల్లు ఏ విధంగా నాశనమవుతుందో అదేవిధంగా రాజ్యంలో రాజు మూర్ఖుడైతే ఆ రాజ్యం కూడా నాశనమవుతుంది. ఎవరు చెప్పినా వినిపించుకొని మూర్ఖుడి మనస్తత్వం వల్ల  అందరూ ఇబ్బందుల పాలవుతుంటారు. ఎంతసేపు అతను చెప్పింది వినాల్సిందే కానీ, ఇతరులు సలహాలిస్తే వినిపించుకోడు. వయసులో పెద్దవారు తమకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి మంచి సలహాలు ఇస్తుంటారు. కానీ ఎంత వయసున్న రాజైనా అతను మూర్ఖుడైతే ఏమిటి ప్రయోజనం? అలాంటి వాడికన్నా జ్ఞానం కలిగిన వాడు వయసులో చిన్నవాడైనా ఏదో ఒక నాటికి మేలు పొందుకుంటాడు. ఇదే విషయాన్ని ఈ పద్యంలో సూచించారు.

“మూర్ఖుడైన యట్టి ముసలి రాజుల కన్నా
జ్ఞానవంతుడైన పిన్న మేటి
వాడు చెరలోనున్నఁ ప్రభువై పాలించు
శాంతినొసగు మయ్య శాంతి పుత్ర” (శాంతి పుత్ర శతకం - పుట:33)

ఇలా అనేక పద్యాలలో మూర్ఖత్వం కలిగి వల్ల కలిగే అనర్థాలను,  మూర్ఖంగా ప్రవర్తించే వారి స్వభావాన్ని, వారితో ప్రవర్తించవలసిన తీరుని వివరించారు.

6.2 కులతత్వ వ్యతిరేకత:

“సమాజంలో ప్రతీ దేశంలో ఏదో ఒక సమస్య జనుల మధ్య ఘర్షణలకు కారణమౌతుంది. ఒక దేశంలో వర్గాల సమస్య ఉంటే మరొక దేశంలో జాతుల మధ్య గొడవలు, మరొక దేశంలో ఇంకొక సమస్యలు స్పర్థలకు ప్రజల మధ్య విబేధాలకు కారణభూతమవుతున్నాయి. ధనికులు, పేదలు మధ్య  ఘర్షణలు, మతాల మధ్య ఘర్షణలు, కులాల మధ్య ఘర్షణలు ఇలా ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి.”(భారతీయ రాజకీయ పరిణామాలు వ్యాసం - ఆంధ్ర భూమి – పుట:2, తేదీ: 12-03-2014)

అటువంటి కుల సమస్యల మీద కూడా తన కలాన్ని ప్రయోగించారు రమేష్.  కులాలు ఆశ్రయించి జీవిస్తూ వాటి వల్ల లబ్ధి పొందడానికి ప్రయత్నం చేది ప్రధానంగా రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను కులాల పేరుతో రెచ్చగొడుతూ ఉంటారు.  ఓట్ల వేటలో రాజకీయ నాయకులు చేసే ప్రయత్నాల గురించి ఇలా చెప్పారు.

"కులము పేరు చెప్పకుండను గెల్వడు
నాయకుండు, సార నగదు లేక
వేయ రోటు జనులు, విక్రయించను హక్కు
శాంతినొసగుమయ్య శాంతిపుత్ర (శాంతి పుత్ర శతకం - పుట:12)

వృత్తులు వల్ల ఏర్పడిన కులాలు, వారిలోని ఆర్థిక అసమానతల వల్ల మరింత వివక్షతకు కారణమవుతున్నాయి. పేదల పైన చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. అందులోనూ తక్కువ కులాలకు చెందిన ప్రజలపై అగ్రవర్ణాల వారు నేటికీ వివక్షత చూపిస్తూనే ఉంటారు. ఇలాంటి అసమానతలు మన దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నాయి. అందుకే కవి ఇలా అంటాడు-

"పేదవాడివనుచు భేదము చూపకు
కులము పేర జనులఁ ద్రోల వద్దు
ధనికుడైన నరుడు దరిచేరునా దివి
శాంతి నొసగుమయ్య శాంతి పుత్ర” (శాంతి పుత్ర శతకం - పుట: 14)

సమాజంలోని చాలా మంది తమను తాము ధనికులుగా భావించుకొని ఇతరులైన పేదవారి పట్ల వివక్షతను చూపిస్తుంటారు. వారిని తమ దరిదాపులకు కూడా రానివ్వరు. కులాల పేరుతో వారిని దూషించి, అవమానించి హింసిస్తుంటారు. ఇలా చేస్తే వారిని భగవంతుడు దగ్గరకు కూడా రానివ్వడని ప్రబోధించారు. ఇలా పలు సందర్భాలను ఉదహరిస్తూ కుల వివక్షతలు సరికావని, అవి సమాజ ప్రగతికి ఆటంకాలని సూచించారు.

6.3 . విగ్రహ పూజ నిరసన:

ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయించుఁ గాని దుః
ఖిత మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్చదీ భరత మేదిని ముప్పది మూడు కోట్ల దే
వత లెగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే" (గబ్బిలం -  గుర్రం జాషువా, పుట:12)

అని జాషువా చెప్పినట్లు మనిషి ఎదురుగా ఉన్న మనిషిని గుర్తించడం మానేసి దేవతల పెళ్లి పేరుతో కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి, ఎంతో విలువైన ఆహార సంపదను కూడా నేలపాలు చేస్తుంటారు. సాటి మనిషిని మనిషిగా చూడలేరు. తమ మిగులు సంపదను అన్నార్తులు, పేదల కోసం వెచ్చించరు. దేవతలకు అభిషేకాలు పేరుతో, రకరకాల పూజలు పేరుతో పాలు, తేనె, ఇతర ఆహార పదార్థాలను వృధాగా పారబోస్తుంటారు. ఇటువంటి సందర్భాలను కొన్ని రమేష్ కూడా ఉదహరించారు. భారతీయ సంస్కృతిలోని ఎందరో దేవతా మూర్తులు చూడటానికి వింతాకృతిని కలిగి ఉంటారు. ఆ రూపాలను అత్యంత భక్తితో ఆరాధిస్తుంటారు. కానీ వికృత రూపంతో తమకు బిడ్డలు పుడితే మాత్రం భరించలేరు. అవయవ లోపంతో పుట్టిన బిడ్డలు కూడా సమాజంలో తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారని చాటి చెప్పారు.

"వికృత రూప శిలలు వెలుగొందుఁ దేవతై
సకల పూజఁ జేయు జనుల భక్తి
వికృత రూపఁ బుట్టు బిడ్డడు దోషమా
శాంతినొసగుమయ్య శాంతి పుత్ర (శాంతి పుత్ర శతకం - పుట :14)

అదే విధంగా మరొక పద్యంలో కూడా దైవం యొక్క తీరును తెలియజేసే ప్రయత్నం చేశారు.

"పలు విధంబులైన బలి యర్పణములు, పూజ
దైవమెన్నడైన త్రాణ లేదు
ఆయనిచ్చు యాజ్ఞ పాలనే శ్రేష్టము
శాంతినొసగుమయ్య శాంతి పుత్ర” (శాంతి పుత్ర శతకం - పుట: 26)

భగవంతుడికి ఉన్న రూపాలన్నీ మనిషి ఏర్పరచుకున్నవే. భగవంతుడు ఆత్మ స్వరూపడని పెద్దల అభిప్రాయం. అతనిని ఆరాధించే పద్ధతులు కూడా మనిషి ఏర్పరచినవి. రకరకాల పూజలు, బలులు కావాలని వారు కాంక్షించరు. మనిషిని మనిషిలా చూడాలని ఇతరులను కూడా తమలాగే ప్రేమించాలని కోరుకుంటారని అభిప్రాయపడ్డారు.

"రాతి నందు లేడు రక్షకుండెన్నడు
రాతి పూజ నిచ్చు రాతి గుండె
నిజ దైవమిచ్చు నిత్య జీవపు యూట
శాంతినొసగుమయ్య శాంతి పుత్ర” (శాంతి పుత్ర శతకం - పుట: 26)

6.4 నిర్వీర్యమవుతున్న యువతకు ప్రబోధం:

ఏ దేశానికైనా బలమైన శక్తి యువతే. ఏ దేశంలోనైతే యువత చైతన్యవంతంగా ఉంటుందో, ఆ దేశం అభివృద్ధి మార్గంలో పయనిస్తుంది. యువత చాలా ఎక్కువగా కలిగిన దేశం మనది. కానీ చాలా మంది యువత సరైన జీవన విధానాన్ని అనుసరించడం లేదు. నిర్లక్ష్యం, భవిష్యత్తు మీద శ్రద్ధ లేకపోవడం, మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకే శతక కర్త వారిని ఉద్దేశించి మత్తు వలన కలిగి నష్టాలను ప్రబోధించారు.

"మత్తు నందు జగము మసలుతూ నుండి
ఇల్లు గుల్ల కాగా యీసడింపు(
మత్తు వలన మనిషి మర్యాద పోవురా
శాంతి నొసగుమయ్యా శాంతి పుత్ర” (శాంతి పుత్ర శతకం - పుట: 23)

మద్యం సేవించడం, పొగ పీల్చడం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలవ్వడం వల్ల ఇల్లు గుల్ల అవుతుందని, అంతేకాకుండా మన యొక్క మాన మర్యాదలు కూడా కొన్నిసార్లు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇటువంటి వాటి వల్ల తమ సర్వస్వాన్ని కోల్పోయి సమాజంలో అవమానాలు భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరు ఆదాయానికి మించి అప్పులు చేసి వాటిని తీర్చలేక లేదా ప్రేమ విఫలమైందని ఇలా పలు కారణాలతో యుక్త వయసులోనే తమ జీవితాలను అంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నం సరి కాదని సూచించారు.

"ఆత్మహత్య శరణ్యమనుచు చావగనేల
చావ ధైర్యముంటే జడ్డు నెదురు
చచ్చి నీవు యిలను సాధించుచినది యేమి
శాంతినొసగమయ్య శాంతి పుత్ర” (శాంతి పుత్ర శతకం - పుట:17)

6.5 రైతు జన చిత్రణ:

మన భారతదేశం ప్రధానంగా వ్యవసాయధారిత దేశం. రైతులు మన దేశానికి వెన్నెముక వంటి వారు. అటువంటి రైతులు నేడు ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నారు. అటు ప్రకృతి, ఇటు దళారులు రైతులను కుదేలు చేస్తున్నాయి. రైతులను  గురించి, వారి సంక్షేమం గురించి ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. రైతులు పంటలు పండించకపోతే మానవాళి స్థితిగతి నాశనం అవుతుందని గుర్తు చేయలేకపోతున్నారు. అందుకే ఈ శతకంలో రైతుల క్షేమం కోరుతూ కూడా పద్యాన్ని రచించారు.

"రైతు మిన్న సకల రంగము లందును
రైతు లేని దేశం లయము చెందు
రైతు విలువ నెరిగి రాజిల్లు నిత్యము
శాంతినొసగుమయ్య శాంతిపుత్ర” (శాంతి పుత్ర శతకం - పుట: 20)

7. ముగింపు:

  • పై విషయాలు మాత్రమే కాక శతక కర్త అనేక సామాజిక అంశాలను గురించి ప్రస్తావించిన విధానం మనకు కనిపిస్తుంది.
  • సమాజంలోని అనేక రుగ్మతలను గురించి తన కలాన్ని ప్రయోగించారు. మనిషి ఉత్తమ జీవితాన్ని గడపడానికి అనుసరించవలసిన వివిధ విధి విధానాలను ఎన్నటినో ఉదాహరించారు.
  • తెలుగు సాహిత్యంలో వేమన పద్యాలకు ఉన్న సొగసు ఎందరిని ఆకర్షిస్తాయి. వేమన వలెనే తర్వాత ఎందరో కవులు ఆటవెలది పద్యాలతో శతక రచనలు చేసి పిల్ల వేమనలు అనిపించుకున్నారు. అటువంటి పిల్ల వేమనలలో వీరిని కూడా చేర్చవచ్చు.
  • ఎక్కడా అతిపెద్ద సమాసాలు కానీ, కఠిన పదాలు కానీ ప్రయోగించకుండా అలతి పదాలను ఉపయోగించి, చిన్న పిల్లలు సైతం చదువుకునేలా రచించారు. ఈ శతకం నేటి తరం కవులలో వీరికి ప్రత్యేకతను నిలిపిందని చెప్పవచ్చు.

8. పాదసూచికలు:

  1. శాంతిపుత్ర శతకం – పీఠిక,  దాసరి రమేష్, పుట: vii
  2. శాంతిపుత్ర శతకం,  దాసరి రమేష్, పుట: 11
  3. పైదే, పుట: 11
  4. పైదే, పుట: 30
  5. పైదే, పుట: 12
  6. పైదే, పుట: 33
  7. భారతీయ రాజకీయ పరిణామాలు వ్యాసం - ఆంధ్ర భూమి – పుట:2, తేదీ: 12-03-2014
  8. శాంతిపుత్ర శతకం,  దాసరి రమేష్, పుట: 12
  9. పైదే, పుట: 14
  10.  గుర్రం జాషువా రచనలు - గబ్బిలం, గుర్రం జాషువా,   పుట:12
  11. పైదే, పుట: 14
  12. పైదే, పుట: 26
  13. పైదే, పుట: 26
  14. పైదే, పుట: 23
  15. పైదే, పుట: 17
  16. పైదే, పుట: 20

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆంధ్ర భూమి దిన పత్రిక, తేదీ: 12-03-2014.
  2. జాషువా, గుర్రం. గుర్రం జాషువా రచనలు vol. 1: గబ్బిలం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2004.
  3. రమేష్, దాసరి. శాంతి పుత్ర శతకం. మెట్రో ప్రింటర్స్, గుంటూరు, 2022.
  4. రాధాకృష్ణశర్మ, చల్లా. శతకాలు, ఉదాహరణ మొదలగు ప్రక్రియలు – పరిశోధన. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్, 1983. 
  5. వేంకటరాయశాస్త్రి, వేదం. శతక వాఙ్మయ సర్వస్వము – ప్రథమ భాగము, ఆంధ్ర సాహిత్య పరిషత్, విశాఖపట్నం, 1989.
  6. శ్రీరామమూర్తి , కొర్లపాటి. తెలుగు సాహిత్య చరిత్ర (ప్రథమ భాగము), రమణ శ్రీ ప్రచురణ, విశాఖపట్నం, 1991.
  7. సుబ్బారావు, వంగూరి. - శతక కవుల చరిత్రము. కమల కుటీర ప్రెస్, నరసాపురం, 1957.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]