headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-3 | March 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

2. తెలుగులో ప్రత్యామ్నాయ జర్నలిజం : ప్రయోజనాలు, సమస్యలు

ఆచార్య వెంకటరామయ్య గంపా

తెలుగు ఆచార్యులు,
ఆధునిక భారతీయభాషలు & సాహిత్య అధ్యయన శాఖ,
ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ - 110 007.
సెల్: +91 9958607789, Email: gvramaiah@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగులో ప్రత్యామ్నాయ జర్నలిజం గురించి పేర్కొనడం జరిగింది. జర్నలిజానికి ప్రత్యామ్నాయ జర్నలిజానికి ఉన్న సారూప్యతలను, భేదాలను వ్యాసంలో చర్చించడం జరిగింది. అంతర్జాలం వ్యాప్తి చెందిన తర్వాత ప్రత్యామ్నాయ జర్నలిజం అంటే ఏమిటి? అది తెలుగులో ఎలా ఉంది? ప్రత్యామ్నాయ జర్నలిజంవలన ఉన్న ప్రయోజనాలు ఏమిటి? సమస్యలు ఏమిటి? అనే అంశాలను వివరించడం జరిగింది. తెలుగులో జర్నలిజం ప్రారంభం కావడానికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? పత్రిక వ్యవస్థలోకి బహుళ జాతి సంస్థలు అడుగుపెట్టిన తర్వాత కలిగినటువంటి ప్రయోజనాలు సమస్యలు ఏమిటి? ప్రసారమాధ్యమాల ఫలితంగా కలిగిన మంచి చెడులు ఏమిటి? ప్రత్యామ్నాయ జర్నలిజం బహుళ జాతి సంస్థల పత్రికలను ఏ విధంగా ఎదుర్కొంటుంది అనే అంశాలను ఆధారంగా చేసుకొని వ్యాసరచన జరిగింది. పరిశోధనకు సమాచార సేకరణ, విశ్లేషణ పద్ధతిని అనుసరించడం జరిగింది. ప్రత్యామ్నాయజర్నలిజం అంతర్జాతీయ, జాతీయ సమస్యల కంటే స్థానికసమస్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఆయా ప్రాంతాల్లో స్థానికనాయకుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నట్టు ఇబ్బందుల గురించి ప్రజలకు అవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంది. ప్రతిభ ఉన్న ప్రతిప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. సంప్రదాయ పత్రికలు చేయలేని పనిని ప్రత్యామ్నాయ జర్నలిస్టులు చేస్తున్నారు.

Keywords: తెలుగుసాహిత్యం, జర్నలిజం, ప్రత్యామ్నాయ జర్నలిజం, ప్రసారమాధ్యమాలు, అంతర్జాలం.

1. ఉపోద్ఘాతం:

జర్నలిజం అనే ఆంగ్ల పదానికి తెలుగులో పత్రికా రచన, వార్తా రచన మొదలైన పదాలను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాసంలో జర్నలిజం అనే పదాన్ని ఉపయోగించే ప్రయత్నం జరిగింది. తెలుగులో పత్రికా రంగానికి సంబంధించి పలు పరిశోధన గ్రంథాలు పుస్తకాలు లభిస్తున్నాయి. ప్రముఖమైన అన్ని విశ్వవిద్యాలయాలలో పత్రికలకు సంబంధించిన అంశాల పైన పరిశోధనలు జరిగాయి. అలాగే చాలా మంచి పుస్తకాలు కూడా పత్రికారంగం పైన లభిస్తున్నాయి. ఆ కారణం వలన తెలుగులో మొదటి పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరు ప్రారంభించారు? ప్రారంభంలో ఉన్నటువంటి పత్రిక విధానం ఏ విధంగా ఉండేది? తెలుగులో ముఖ్యమైనటువంటి పత్రికాధిపతులు, సంపాదకులు ఎవరు? వారి ఏ రకంగా కృషి చేశారు? పత్రికా రంగానికి వారు చేసిన సేవ ఏమిటి? అనేటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. తెలుగు జర్నలిజంలో నూతన ధోరణిగా భావించే ప్రత్యామ్నాయ జర్నలిజం గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. ప్రత్యామ్నాయ జర్నలిజం అంటే ఏమిటి? అది తెలుగులో ఏ విధంగా ఉంది? ప్రత్యామ్నాయ జర్నలిజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనే అంశాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది.

ప్రత్యామ్నాయ జర్నలిజం గురించి మాట్లాడే సందర్భంలో గతంలో వార్తాపత్రికలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఏ విధంగా పేర్కొన్నారు ఆ సమాచారం ఏ రకమైన మార్పులు వచ్చాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం కోసం గత పరిశోధకులు వ్యక్తపరచిన అభిప్రాయాలను కొన్నింటిని ఇక్కడ పేర్కొనడం జరిగింది.

పత్రిక అంటే ఏమిటి పత్రిక ఎలా ఉండాలి పాఠకులు ఎలా ఉండాలి మొదలైన అంశాలను పూర్వకాలం నుంచి ఎంతోమంది పండితులు ఏదోక రూపంలో పేర్కొంటూ వస్తున్నారు. వార్త అంటే ఏమిటో ధర్మరాజు కూడా ఏనాడో చెప్పాడు.

“భూమే ఒక కుండ, ఆకాశమే దానిపైన మూకుడు,  సూర్యుడే నిప్పు, పగలూ రాత్రి కట్టెలు, నెలలూ, రుతుపులూ తెడ్లు, వీటితో కాలం మొత్తం ప్రాణి కోటినే వండేస్తుంది. ఇదే వార్త” అన్నాడు! (సుబ్రహ్మణ్యం, జీవి & శ్రీనివాసాచార్య తిరుమల. (సంపా.) పాతికేళ్ల పత్రిక రచన, పుట-2)

పత్రికకు సంబంధించి కొక్కొండ వెంకటరత్నం పంతులు గారి వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిశోధకులు పేర్కొంటూ ఉంటారు. వారి పద్యాలను చాలామంది పరిశోధకులు తమ పరిశోధన గ్రంథంలో పేర్కొన్నారు.

2. పత్రికాలక్షణము:

పత్రముద్రాసౌష్ఠవంబు సద్భాషయు ధర్మనీతి న్యాయ తత్త్వదమగు
వ్యాసము స్వాశయ వార్తాళి వివిధ వా ర్తలకల్మి కృతి విమర్శన ముదార
సల్లేఖకౌఘంబు శాస్త్ర సదాచార సిద్ధాంత మర్థ సంసిద్ధి కృత్య
మనెడునీ నవలక్షణావళి దేనియం దిరవొందు సుగుణంబు వర మణియ
నది వృత్తాంత పత్రిక యా సలక్ష
ణం బిటులుగాని దవలక్షణ ప్రవృత్తి
పత్రికయని యనం బడుం బడు నిజముగ
గుగుణమౌమణి విబుధులు కోరి కొండ్రె? (రామచంద్ర, తిరుమల. తెలుగుపత్రికలసాహిత్య సేవ, పుట-15).

‘నాణ్యత కలిగిన కాగితం, చక్కనిభాష, ధర్మం, నీతి, న్యాయతత్త్వప్రతిపాదకమైన వ్యాసం, రకరకాల వార్తలు, కావ్యవిమర్శ, మంచిలేఖల సమాచారం, శాస్త్రాల్లో చెప్పిన మంచి ఆచారాలు, తన ఆశయాన్ని ప్రతిబింబించేవార్తలు, అర్ధలాభం కోసం తగిన క్రియలు’ గా పత్రిక లక్షణాలుగా, మరొక పద్యంలో ‘పాండిత్యం, లోకజ్ఞత, ధైర్యం, స్థైర్యం, సత్ప్రవర్తన, ధనం, ఉచితజ్ఞత, సూక్తిచతురత్వం’ అనేవి విలేకరి లక్షణాలుగానూ ‘వార్తలోని సారాంశాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. వార్తను సంగ్రహంగా రాయాలి. విషయ వివరణ స్పష్టంగా ఉండాలి. సందర్భం, అర్థం సక్రమంగా ఉండాలి. ఎవరినీ నొప్పించకూడదు. అబద్ధపు పొగడ్తలు పనికిరావు. వాస్తవమైన వార్తనే రాయాలి’ అనేవి ఉపసంపాదకుడి లక్షణాలుగా పేర్కొన్నారు.

దాదాపు ఈ లక్షణాలన్నిటిని గతంలో పత్రికాసంపాదకులు విలేకరులుగా ఉన్నవారిని గమనించి  చెప్పినట్లు మనం భావించవచ్చు.  అందుకు గల కారణం మొదటి నుంచి తెలుగు పత్రిక సంపాదకులు పాండిత్యంతో పాటు వ్యవస్థ పట్ల బాధ్యత వ్యవహరించినట్లు కనిపిస్తుంది. ప్రారంభంలో పత్రిక నిర్వహణ అనేటువంటిది లాభదాయకమైన ఆదాయం కంటే సేవాభావంగాను, సమాజం పట్ల బాధ్యతగాను భావించారు. అందుకోసం-

“పంతొమ్మిదో శతాబ్ది ఉత్తరార్థంలో ప్రతి గొప్ప పండితుడూ, కవీ కూడా ఏదో ఒక సాహిత్య పత్రికను నిర్వహించారు. ఆరోజుల్లో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకొన్న ప్రతి పండితుడు నాటకరచన చేసినట్లుగా పత్రికా నిర్వహణం చేశాడు. కొక్కొండ వేంకటరత్నం, కందుకూరి వీరేశలింగం పంతులుగార్ల వంటివారేకాక వేదం వేంకట్రాయశాస్త్రి. దాసు శ్రీరాములు, వాలిలాల వాసుదేవశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం, జనమంచి శేషాద్రిశర్మగారి వంటి వారు కూడా పత్రికా నిర్వహణకు పూను కోటం గమనార్హం. ఆనాటి పత్రికల్ని కేవలం సాహిత్యపరులు, పండితులే ప్రోత్సహించే వారనడానికి కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. సుజనరంజని ఆంధ్రభాషా సంజీవని, అముద్రిత గ్రంథ చింతామణిలాంటి పత్రికలు వీటికి ఉదాహరణలు. ఈ పత్రికల్లో భాషకు ఎక్కువ ప్రాధాన్యం వుండేది. వివేవకర్ధని పత్రికలో వీరేశలింగంగారు ఈ పత్రికల గురించి రాస్తూ, ‘కేవలం సాహిత్యపరులు వృత్తాంత పత్రికాలేఖనకు పూనుకొనుట వలన వారి వ్రాతయందు గూఢపదములును, దీర్ఘసమాసములను, క్లిష్టార్థ వాక్యములును, యమకాదులను తప్ప ఉపయుక్త విషయములంతగా కానరాకున్నవి’” (రామచంద్ర, తిరుమల. తెలుగు పత్రికల సాహిత్య సేవ, పుట-2)

ముద్రణ రంగాని కంటే పూర్వం ఉన్నటువంటి పత్రిక పద్ధతులకు ముద్రణ తర్వాత పత్రికలకు ఎంతో మార్పు ఉంది. పత్రికలలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పత్రికా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత మాసపత్రికలు స్థానంలో వారపత్రికలు, వారపత్రికల స్థానంలో దినపత్రికలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దినపత్రికలలో ఆయా ప్రాంతాలకు చెందినటువంటి వార్తలను ప్రచురించడం కోసం జిల్లా ఎడిషన్లనూ  తీసుకొచ్చారు. పత్రికలలో ఒక్కొక్క పుటకు ఒక్కొక్క అంశాన్ని జోడిస్తూ ప్రత్యేక విషయాలను ప్రస్తావించడం మొదలుపెట్టారు. ప్రజల ఉపయోగపడే సమాచారంతోపాటు ప్రజల అభిరుచికి అనుకూలంగా వార్తలను ముద్రించడం ప్రారంభించారు. ఈ సమాచారం పత్రికలకు సంబంధించినటువంటిది అయితే ప్రసారమాధ్యమాలలో 24 గంటల వార్తా ఛానళ్లు ప్రవేశించాయి. ఫలితంగా ప్రతి ప్రాంతంలో జరుగుతున్న సమాచారం ప్రజలకు ప్రసారమాధ్యమాల ద్వారా వెంటనే తెలుస్తుంది. సమాచారాన్ని వేగంగా చేరవేసే క్రమంలో సంచలనాల కోసం వార్తా కొన్నిసార్లు అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న సందర్భాలు ఉన్నాయి.

ప్రారంభంలో పత్రికారంగం అనేటువంటిది కొంత సేవాభావం అనేటువంటిది ఉన్నప్పటికీ వ్యక్తుల లాభాపేక్షతోనే నడిచింది. ముఖ్యంగా స్వాతంత్రం తరువాత ముఖ్యమైన పత్రికలన్నీ సంపన్నుల చేతిలో ఉండడం, వారి ఆలోచన విధానాలు పత్రికల పైన ఉండడం అనేటువంటిది సహజంగా జరిగిపోయింది. అనంతర కాలంలో వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలలోకి  బహుళజాతి సంస్థలు ప్రవేశించాయి. ఫలితంగా ప్రజలకు ఏది నిజమైన వార్త? ఏది కాదు? అనే పరిస్థితి ఏర్పడింది.

ఇటువంటి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలు ప్రత్యామ్నాయ జర్నలిజంగా మారడం అనేటువంటిది ముఖ్యమైన అంశం. సామాజిక మాధ్యమాలను  న్యూ మీడియా అనీ,  పౌరుల  మాధ్యమం  అనీ పేర్కొంటున్నారు. అంతర్జాలం ప్రధానంగా మారిన తర్వాత పత్రిక, ప్రసార మాధ్యమాల స్థానంలో సామాజిక మాధ్యమాలు ముఖ్యపాత్ర పోషించడం అనేటువంటిది సమాజంలో వచ్చిన పెద్ద మార్పు. సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది సామాన్యుడికి అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవస్థలో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. పత్రికా రంగం, ప్రసార మాధ్యమాలు ఇటువంటి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయో అటువంటి పాత్రను ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు పోషిస్తున్నాయి. ప్రస్తుతం వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాల కంటే ఎక్కువగా సామాజిక మాధ్యమాలను ప్రజలు చూస్తున్నారంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

అంతర్జాలం (ఇంటర్నెట్):

అంతర్జాలం (ఇంటర్నెట్) కంప్యూటర్, కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇది ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా  సమాచార వ్యాప్తికి ఒక మాధ్యమం. సమాచార మౌలిక సదుపాయాల పరిశోధన, అభివృద్ధికి  అంతర్జాలం అత్యంత విజయవంతమైన ఉదాహరణలలో ఒకటి. ప్రస్తుతం,  అంతర్జాలం 180 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించింది.

సామాజిక మాధ్యమాలు:

సామాజిక మాధ్యమాలు అనేది వ్యాపార లక్ష్యాలను చేరుకోవడానికి, ఇతరులు వారి లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడటానికి వ్యక్తులతో కనెక్ట్ కావడానికి వెబ్ ఆధారిత సాధనాలను ఉపయోగించే ప్రక్రియ. సాంప్రదాయ పద్ధతిలో వ్యక్తిగతంగా వ్యక్తులు ఒకరికొకరు  కలవడం లేదా టెలిఫోన్ ద్వారా మాట్లాడటం అనే పద్ధతిలో కాకుండా అంతర్జాల మాధ్యమం ద్వారా  ఏదైనా ఉద్యోగ శోధన, నిర్వహణ ప్రణాళిక, అమ్మకాల ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగం. ఈ రోజుల్లో మనిషి చేసే ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలు  ప్రపంచంతో పంచుకోవడం, తద్వారా ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్ళడం అనేది మనిషి లక్ష్యం, లక్షణం. అందుకు సామాజిక మాధ్యమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని భావించవచ్చు.

3. భారతదేశంలో సామాజిక మాధ్యమాల పాత్ర:

సామాజిక మాధ్యమాలు భారతదేశంలో ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుత యుగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సామాజిక మాధ్యమాలు ఆర్థిక, రాజకీయ, మతపరమైన సాంస్కృతిక పరిస్థితులను మార్చాయి. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొదలైనవి భారతదేశంలో పాపులర్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లుగా (సామాజిక మాధ్యమాలు) మారాయి.  ప్రభుత్వ సంస్థలు, సుప్రసిద్ధ వ్యక్తులు ఫేస్ బుక్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లో యూజర్లుగా చేరారు. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు ద్వారా తమ సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు. చాలా మంది  నేతలు ఇతర మాధ్యమాల కంటే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా పాపులర్ అయ్యారు. చాలా మంది తమ మంచి అనుభవం, సామాజిక సేవ మొదలైన వాటిని పంచుకుంటారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, వాటి పనితీరుపై యూజర్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.  అంతేకాకుండా "సోషల్ మీడియాను వినియోగించేవారే వార్తలను అతి త్వరగా తెలుసుకోగలుగుతున్నారు. ట్వీట్, రీ ట్వీట్, లైక్, షేర్, సెల్ఫీ, ఫ్రెండ్, అనెండ్... ఇలా అనేక పదాలు జర్నలిజంలో ప్రవేశించాయి. యువత విభాగానికి వస్తే వారు ఎక్కువగా సోషల్మీడియా ద్వారానే వార్తలను తెలుసుకొంటున్నారు." (చెన్నయ్య జె. (సంపా.) తెలుగు పత్రికలు ప్రసారమాధ్యమాల భాషా స్వరూపం. పుట-237) కొలకలూరి శ్రీధర్ జర్నలిజంలో సామాజిక మాధ్యమాలు అనే వ్యాసంలో పైన పేర్కొన్న  విషయం వాస్తవం.

3.1 ప్రత్యామ్నాయ జర్నలిజం – సామాజిక మాధ్యమాలు:

పత్రికలు ప్రారంభం నుంచి కూడా ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలోనే నడిచాయి. ప్రతి పత్రిక కూడా ఎంతో కొంత లాభాపేక్షతోనే పనిచేసింది. కానీ తర్వాత కాలంలో లాభాపేక్ష స్థానంలో పూర్తిస్థాయి వ్యాపార ధోరణి ప్రారంభమైంది. పత్రిక, ప్రసార మాధ్యమాల వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉండటం వలన పెట్టుబడిదారులు పత్రికల  స్థాపనలోకి అడుగు పెట్టారు. పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నంతకాలం పత్రిక ఎక్కువగా ఏదో ఒక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించేది.  చాలా సందర్భాలలో పత్రికలు సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి వర్గాల సమస్యలపై దృష్టి పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. ప్రపంచీకరణ ఫలితంగా వ్యాపార ధోరణి పెరిగినప్పటికీ నియంత్రణ ద్వారానికి ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకునే అవకాశం అంతర్జాలం ద్వారా ప్రజలకు లభించింది.

పత్రికల ప్రారంభం నుంచి దాదాపు చాలా కాలం వరకు సమాజంలోని కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు మాత్రమే జర్నలిస్టులుగా ఉంటూ ఆయా వర్గాలకు చెందిన సమస్యలపై దృష్టి పెట్టి వార్తలను ప్రచురించడం జరిగేది. సామాజిక మాధ్యమాలనేటువంటిది జర్నలిజంలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ప్రక్రియ అనే దానిని అనేకమంది అనేక రకాలుగా నిర్వచించే ప్రయత్నం చేశారు.  ‘ఒక నిర్దిష్ట సమూహంలోని  సభ్యుల మధ్య  అర్థవంతమైన లేదా ఉపయోగకరమైన ఒక ప్రత్యేక పద్ధతిలో భావాలను లేదా ఆలోచనలను కళాత్మకంగా వ్యక్తపరచడాన్ని ప్రక్రియ అని పేర్కొనవచ్చు’. ఆ ప్రక్రియలు సామాజికపరమైనవి, ఆలంకారకమైనవి, చారిత్రకమైనవి, సాంస్కృతికమైనవి,  భావజాలపరమైనవి... ఇలా అనేక రకాలుగా విమర్శకులు విభజించారు. అలాగే వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేటువంటి ఒక రకమైనటువంటి ప్రక్రియ సామాజిక మాధ్యమాలు. సంప్రదాయబద్ధమైన పత్రిక ప్రసార మాధ్యమాలకు భిన్నమైనటువంటిది ప్రత్యామ్నాయ జర్నలిజం లేదా సామాజిక మాధ్యమాలు.

తక్కువ ప్రాతినిధ్యం ఉన్నవారికి ప్రాముఖ్యత ఇవ్వడం ప్రత్యామ్నాయ మీడియా ముఖ్య లక్షణంగా పేర్కొనబడింది.. ప్రత్యామ్నాయ జర్నలిజంలో వాణిజ్య పరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ ప్రేరణతో, కొత్త జర్నలిజం ఆలోచనతో  పాత్రికేయులు సాంప్రదాయ పాత్రికేయ పద్ధతుల నుండి విడిపోయి కొత్త వ్యక్తిత్వ, సృజనాత్మక పద్ధతిలో తమ వాక్  స్వేచ్ఛను ఉపయోగించారు.

4. సంప్రదాయ జర్నలిజానికి ప్రత్యామ్నాయ జర్నలిజానికి మధ్య తారతమ్యాలు:

కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు చెప్పిన అభిప్రాయం ప్రకారం సంప్రదాయ జర్నలిజం ఎలా ఉండాలో చెప్పిన అంశాలను ప్రత్యామ్నాయ జర్నలిజానికి అన్వయం చేస్తే కనిపించేటువంటి తారతమ్యాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోవచ్చు. 

4.1 నాణ్యత కలిగిన కాగితం:

వెంకటరత్నం గారి అభిప్రాయం ప్రకారం ముఖ్యమైన పత్రికకు నాణ్యమైన కాగితం ఉండాలని అది చదువులను ఎంతో ఆకట్టుకుంటుందని భావించవచ్చు. ముఖ్యంగా వారపత్రికలు, మాసపత్రికలలో నాణ్యత ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. కానీ ప్రస్తుత ప్రత్యామ్నాయ జర్నలిజానికి కాగితం అవసరం లేదు. సమాచారం అంతా అంతర్జాలంలో ప్రచురించడం, వీడియో రూపంలోనూ, ఆడియో రూపంలోనూ లభిస్తూ ఉంది. చాలా స్పష్టమైనటువంటి వీడియోలు, ఆడియోలు అంతర్జాలం ద్వారా ప్రజలకు చేరుతున్నాయి. నిరక్షరాస్యులు సైతం ప్రత్యామ్నాయ జర్నలిస్టులు చెబుతున్న విషయాలను అర్థం చేసుకొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

4.2 చక్కనిభాష:

పత్రికలకు ప్రసార మాధ్యమాలకు ముఖ్యమైనటువంటి అంశం చక్కని భాష వాడకం. పత్రికల్లో భాషకు సంబంధించిన అంశాల పైన చాలా పెద్ద చర్చ జరిగినట్లు కనిపిస్తుంది.

తెలుగు పత్రికల్లో భాష, ప్రయోగం, గ్రాంధికం నుండి వ్యవహారికానికి మళ్లుతున్న కొద్దీ సామాజిక రంగాల మీద దృష్టి పెరగడం కనిపిస్తుంది. తెలుగు పత్రికారచన సంక్లిష్ట సమాసాలతో నిండి సామాన్యుడికి కొరకరాని కొయ్యగా మారిన స్థితిలో 1872లో ఉమారంగనాయకులు ప్రారంభించిన పురుషార్థ ప్రదాయిని పత్రిక వాడుక భాషను స్వీకరించి ఎక్కువ మంది పాఠకులను సంపాదించుకోగలిగింది. ఈ మార్పు వల్ల పత్రికలు పండితుల గుప్పెట నుండి బయటపడ్డాయి.” (రామదాసు, కె. తెలుగు దినపత్రికలు సాహిత్య సేవ. పుట-2)

ప్రస్తుతం పత్రికలు ఆధునిక భాషను ముఖ్యంగా వ్యవహారిక భాషను ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత వివిధ ప్రాంతాలలో ఉన్న మండలిక భాషను కాకుండా పత్రికా భాష అనే ఒక దానిని రూపొందించి అందరూ ఆ భాషనే పత్రికలలో ఉపయోగించేలా ఒక అనధికార చట్టాన్ని పత్రికలు పత్రికాధిపతులు కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రత్యామ్నాయ జర్నలిజంలో అటువంటి సమస్య లేదు. ఎవరికి నచ్చిన భాషలో వారు రాయొచ్చు. వారికి నచ్చినటువంటి అంశాలను నచ్చిన పద్ధతిలో చెప్పవచ్చు. నచ్చిన మాండలికంలో భావాలను వ్యక్తపరచవచ్చు. ఎటువంటి యాసనైన తమ రచనల్లో ఉపయోగించవచ్చు. అలాగే అవసరానికి అనుకూలంగా కొత్త భాషా పదాలను సృష్టించుకోవడమూ అవసరమే.

ఉదాహరణకు “ఆనాడు తెలుగులో పత్రికా అనుభవం కలవారు లేరు కాబట్టి పత్రికకు సంబంధించిన ప్రధాన పరిభాషను పత్రిక విలేఖకుడు, సంపాదకుడు మొదలైన పారిభాషిక పదాల్ని వంగభాష నుంచి గ్రహించారు” (రాంబాబు, వేదగిరి, తెలుగులో వార మాస పత్రికలు. పుట-7)

అలాగే ప్రస్తుతం కూడా అవసరమైన పారిభాషక పదాలను వివిధ భాషల నుంచి తయారు చేసుకోవడం అవసరమే ప్రస్తుతం ప్రత్యామ్నాయ జర్నలిజంలో ఈ పారిభాషిక పదాల అవసరం ఎంతైనా ఉంది. ఈ పదాలను రూపొందించుకోవడం ద్వారా చక్కని భాషను జర్నలిజంలో ఉపయోగించవచ్చు

4.3 ధర్మం, నీతి:

కొక్కొండ వెంకటరత్నం పంతులుగారి అభిప్రాయం ప్రకారం పత్రిక నిర్వహణలో ధర్మం నీతిని కొనసాగించాలని చెప్పారు. ధర్మం నీతి అనేది కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ధర్మాధర్మాలను అన్వయం చేయడం చాలా కష్టంతో కూడుకున్న విషయం. ముఖ్యంగా వ్యాపార యుగంలో పత్రికలు లేదా ప్రసారమాధ్యమాలు ధర్మం నీతి గురించి చెప్పడం అనేటువంటిది ఎప్పుడో మర్చిపోయినట్లు ఉన్నాయి. ప్రత్యామ్నాయ జర్నలిజంలో వ్యక్తులు తమకు ధర్మం అనిపించినవి ప్రజలకు ఉపయోగపడతాయని అనిపించిన విషయాలను ఎటువంటి భయం లేకుండా ప్రజల కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా బహుళ జాతి సంస్థలు నిర్వీర్యం చేస్తున్నటువంటి ధర్మాన్ని కొంతవరకు ప్రత్యామ్నాయ జర్నలిజం కొనసాగిస్తుందేమో అనేటువంటి అభిప్రాయం ఉంది.

4.4. న్యాయతత్త్వప్రతిపాదకమైన వ్యాసం:

పత్రికలలో విశ్లేషణాత్మకమైన వ్యాసాలు ఉండడం అనేటువంటివి చాలా అవసరం. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కలిగించేటువంటి చట్టపరమైనటువంటి అంశాలను పత్రికలు ప్రచురించాలి. కానీ పత్రిక రంగంలోకి బహుళ జాతి సమస్యల ప్రవేశించిన తర్వాత ఒక వర్గానికి చెందినటువంటి ప్రజల ప్రయోజనాలు తప్ప అందరికీ అవసరమైనటువంటి అంశాలను వ్యక్త పరచడం లేదు ముఖ్యంగా తెలుగులో ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైనటువంటి పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రయోజనాలకు అవసరమైన వార్తలని వ్యాస రూపంలో ప్రచురిస్తున్నారు. ప్రజలకు కూడా ఏది న్యాయబద్ధమైనది ఏది కాదు అని తెలుసుకోవడం కష్టమైపోయింది. కానీ ప్రత్యామ్నాయ జర్నలిజంలో ఇటువంటి సమస్యలే ఉన్నప్పటికీ కొంతమంది ఎటువంటి రాజకీయ పార్టీలకు అనుకూలంగా కాకుండా మధ్యస్థంగా ఉంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

4.5 రకరకాల వార్తలు:

పత్రికలు ప్రసార మాధ్యమాలు అన్ని రకాల వార్తలను పరిశీలిస్తున్నారు. సంప్రదాయ పత్రికలు వయోలింగ భేదం లేకుండా అందరికీ అవసరమైన సమాచారాన్ని ప్రత్యేక శీర్షికల కింద ప్రచురిస్తున్నారు. సినిమాలకు సంబంధించిన విషయాలు, రాజకీయ వార్తలు, క్రీడలకు సంబంధించిన సమాచారం, స్త్రీలకు సంబంధించిన సమాచారం, విద్యార్థులకు సంబంధించిన సమాచారం, భక్తికి సంబంధించిన విషయాలు, సాహిత్య సంబంధ వార్తలు, చివరికి వంటకు సంబంధించిన సమాచారం.. ఇలా అనేక అంశాలను దాదాపు అన్ని సంప్రదాయపత్రికలు కొనసాగిస్తున్నాయి. అయితే ప్రత్యామ్నాయ జర్నలిజం ఇటువంటి పద్ధతిని కొనసాగించడం లేదు. ప్రత్యామ్నాయ జర్నలిస్టులకు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మాత్రమే ఎన్నుకొని ఆ అంశాల పైన దృష్టి పెట్టి వాటిని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల సంఖ్య పరిమితంగా ఉండడం వారి లక్ష్యం కూడా భిన్నంగా ఉండడం అందుకు కారణం కావచ్చు.

4.6 కావ్య విమర్శ:

పత్రికల ప్రారంభం నుంచి నేటి వరకు కూడా కొన్ని పత్రికలు సాహిత్యానికి సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా ప్రచురిస్తూ ఉన్నారు. ప్రముఖుల చేత కావ్యాలకు సంబంధించిన విశేషాలను వ్రాయించి, వాటిని పత్రికలలో ప్రత్యేక అంశాలుగా ప్రచురించేవారు. ఇప్పటికీ కొన్ని పత్రికలు వారంలో ఒకరోజు ఒక పుటను సాహిత్య కోసం కేటాయించారు. ప్రత్యామ్నాయ జర్నలిజంలో ఏ రంగానికి చెందినటువంటి వార్తలు ఆ రంగం వారే ప్రచురిస్తున్నారు. ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించి కొన్ని ప్రత్యేక సమూహాలు అంతర్జాలంలో ఉన్నాయి ఈ సమూహాలలో తమకు నచ్చినటువంటి సాహిత్య అంశాలను చర్చిస్తూ ఉన్నారు. బ్లాగుల రూపంలో ఎంతోమంది తమ సాహిత్యాన్ని పాఠకులకు అందిస్తున్నారు. అంతర్జాలంలో ప్రత్యేకమైన సాహిత్య పత్రికలు కొనసాగుతున్నాయి. గతంతో పోల్చి చూసినప్పుడు సాహిత్య పరంగా అంతర్జాలంలో లభిస్తున్న సమాచారం వాసిలో ఎక్కువగానే ఉంది. ఎక్కువమంది కవులు/ రచయితలు, విమర్శకులు కనిపిస్తున్నారు. కానీ నాణ్యత విషయం గురించి ఎక్కడ చర్చించకూడదు.

4.7 మంచిలేఖల సమాచారం:

లేఖాసాహిత్యాన్ని ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా పేర్కొనవచ్చు. ఎంతోమంది ప్రముఖుల లేఖలు అపురూపమైనవిగా భావించబడుతున్నాయి. ఇప్పటికీ ఆ లేఖలను పుస్తక రూపంలో ప్రచురిస్తున్నారు. ఒకప్పుడు పత్రికలు ఈ లేఖా సాహిత్యానికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది కానీ ప్రస్తుతం సాహిత్య లేఖలు కనిపించడం అనేది చాలా తగ్గిపోయింది. ప్రత్యామ్నాయ జర్నలిజంలో ప్రతిరోజు కొన్ని వందలమంది సాహితీవేత్తలు అంతర్జాలసమూహాలలో తమ అభిప్రాయాలను అంతర్జాల లేఖలుగా వ్యక్తపరుస్తున్నారు. సంఖ్య ఎక్కువ కావడం వలన వీటన్నిటిని ఒక చోట చేర్చి ముద్రించేటువంటి అవకాశం కూడా తక్కువగానే ఉంది.

4.8 శాస్త్రాల్లో చెప్పిన మంచి ఆచారాలు:

సంప్రదాయ పత్రికలు గతంలో ఉన్న మంచి విషయాలను సనాతన ధర్మాన్ని కొనసించాలని పేర్కొంటూ ఉంటాయి కానీ ప్రత్యామ్నాయ జర్నలిజం చాలా వరకు ఈ అంశాలను కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. ముఖ్యంగా సామాజికంగా వెనుకబడినటువంటివారు ప్రత్యామ్నాయ జర్నలిజంలో మార్పును కోరుకుంటున్నారు. తమ అణచివేతకు ప్రత్యామ్నాయ జర్నలిజాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకొని గతంలో కొనసాగిన పెత్తనాన్ని సవాల్ చేస్తున్నారు.

4.9 తన ఆశయాన్ని ప్రతిబింబించే వార్తలు:

సంప్రదాయ పత్రికలు ప్రసార మాధ్యమాలు చాలా సందర్భాలలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అందుకోసం పత్రికను కొనసాగించడం జరుగుతూ ఉంది. అయితే బహుళ జాతి సంస్థలు పత్రికలలో ప్రవేశించిన తర్వాత వాళ్ళ లక్ష్యాలలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు ప్రధానంగా మారాయి. ఆర్థిక అవసరాల రీత్యా పత్రిక ఆశయాలు కంటే నిర్వహణ ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమైపోయాయి. ప్రత్యామ్నాయ జర్నలిజంలో ఆర్థికపరమైన అవసరాలు ఉన్నప్పటికీ భావజాలం, సామాజిక బాధ్యత, సమూహ నిర్ణయాలు ప్రధానం కావడం వలన చాలా సందర్భాలలో ప్రత్యామ్నాయ జర్నలిస్టులు తమ ఆశయానికి సంబంధించినటువంటి వార్తలను ప్రజలకు అందిస్తున్నారు.

4.10. అర్ధలాభం కోసం తగిన క్రియలు:

గతంలో సంప్రదాయ పత్రికలు నిర్వహణకు అవసరమైన మేరకు ఆర్థికపరమైన అవసరాలను సమకూర్చుకునేవారు. అవసరమైన సందర్భంలో విరాళాల రూపంలో ధనాన్ని సమకూర్చుకునేవారు. చందాదారులను ఎక్కువగా చేర్చుకోవడానికి ప్రయత్నం చేసి పత్రికను నిర్వహించేవారు. బహుళ జాతి సంస్థలు పత్రికా రంగం లోకి ప్రవేశించిన తర్వాత పూర్తిగా పత్రిక నిర్వహణ వ్యాపారమైపోయింది. ముఖ్యమైన వార్తలను మొదటి పేజీలలో ప్రచురిస్తూ లోపలి పేజీలలో పత్రిక ప్రకటనలను ముద్రించేవారు. కానీ గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. పత్రికల ప్రాధాన్యత రిత్యా మొదటి పేజీలోనే వ్యాపార ప్రకటనలు చేరుతున్నాయి. వార్తల కంటే కూడా వ్యాపార ప్రకటనల ప్రచారమే ఎక్కువ అయిపోయింది. ప్రత్యామ్నాయ జర్నలిజంలో ఇటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా యూట్యూబ్ లాంటి ఛానల్ లో వీక్షకుల సంఖ్యను బట్టి మాత్రమే ఆదాయం ఉంటుంది. వీక్షకుల ఎక్కువగా తమ వార్తలను చదవడం కోసం అవసరమైన అంత మేరకు ఉత్తమమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలి. అందించిన సమాచారాల్లో ఏదైనా తప్పులు ఉంటే వీక్షకులు ప్రశ్నించే అవకాశం ఉండడం వలన చాలావరకు ఆర్థిక లాభం కంటే వార్తలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

5. విలేఖరి, ఉపసంపాదకుడి లక్షణాలు- ప్రత్యామ్నాయ జర్నలిస్టు లక్షణాలు:

‘పాండిత్యం, లోకజ్ఞత, ధైర్యం, స్థైర్యం, సత్ప్రవర్తన, ధనం, ఉచితజ్ఞత, సూక్తిచతురత్వం’ అనేవి విలేకరి లక్షణాలుగానూ ‘వార్తలోని సారాంశాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. వార్తను సంగ్రహంగా రాయాలి. విషయ వివరణ స్పష్టంగా ఉండాలి. సందర్భం, అర్థం సక్రమంగా ఉండాలి. ఎవరినీ నొప్పించకూడదు. అబద్ధపు పొగడ్తలు పనికిరావు. వాస్తవమైన వార్తనే రాయాలి’ అనేవి ఉపసంపాదకుడి లక్షణాలుగా కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు పేర్కొన్నారు.

ఇందులో కొన్ని అంశాలు అటు సంప్రదాయ పత్రికలలోనూ, ఇటు ప్రత్యామ్నాయ జర్నలిజంలోను కనిపించడం లేదు. గతంలో తెలుగును చదువుకున్న వారు మాత్రమే చాలావరకు తెలుగు విలేకరులుగా పని చేశారు కానీ ఈరోజు జర్నలిజం విభాగాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన వారు జర్నలిస్టులుగా కొనసాగుతూ ఉన్నారు. . కొంతమంది పట్టు కనిపించదు. అదే పరిస్థితి ప్రత్యామ్నాయ జర్నలిస్టులో కూడా కనిపిస్తుంది. వార్తలను ప్రజలకు చేరబోయాలని ఆలోచన మాత్రమే ముఖ్యంగా కనిపిస్తుంది. ప్రసారం మాధ్యమాలలో మంచి తెలుగు భాషతో కూడిన వార్తలను వినడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతున్న సంఘటన. ప్రస్తుతం యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేటువంటిది కొన్ని సందర్భాలలో కొన్ని పత్రికలలో ఉన్నట్లు కనిపించదు. అదే పరిస్థితి ప్రత్యామ్నాయ జర్నలిజం లో కూడా కనిపిస్తుంది. 'ఎవరినీ నొప్పించకూడదు, అబద్ధపు పొగడ్తలు పనికిరావు, వాస్తవమైన వార్తనే రాయాలి' అనే అంశాలను ప్రస్తుతం జర్నలిజంలో ఊహించడం కష్టం. సంప్రదాయ పత్రికలలోను ప్రత్యామ్నాయ జర్నలిజం లోను రెండింటిలో ఈ విషయాలను పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైన వార్తలను రాయించుకోవడం వ్యతిరేక వర్గానికి వ్యతిరేకంగా వార్తలను ప్రచారం చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. కొంత మంది నాయకులను పత్రికలు దైవంశ సంభూతుడిగా పేర్కొంటూ వార్తలు రాస్తూ ఉన్నారు. ఎదుటివారిని నొప్పించకపోవడం అనేటువంటి వార్త రాయడం చాలా కష్టంగా మారింది. భాషలోనూ పరుష పదజాలం ఎక్కువగా కనిపిస్తుంది ఇటువంటి పరిస్థితి జర్నలిజంలోనూ ఉంది.

5.1 ప్రత్యామ్నాయ జర్నలిజం ప్రత్యేక లక్షణాలు:

  • ప్రత్యామ్నాయ జర్నలిజం సాంప్రదాయక జర్నలిజానికి భిన్నంగా పనిచేస్తుంది. 
  • ప్రత్యామ్నాయ మీడియా ప్రచురణకర్తలు వాణిజ్యేతరులు కావచ్చు, సామాజిక బాధ్యతపై దృష్టి పెట్టవచ్చు లేదా ప్రత్యామ్నాయంగా స్వీయ గుర్తింపు కోసం ప్రయత్నం చేయవచ్చు. ప్రత్యామ్నాయ జర్నలిజం ద్వారా ఎంతోమంది సామాన్యులు తమ ప్రతిభకు గుర్తింపు పొంది సమాజంలో ముఖ్యమైన వ్యక్తులుగా మారారు.
  • ప్రత్యామ్నాయ జర్నలిజం ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలను సమాజం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రజల యొక్క కనీస అవసరాలు సమాజానికి దూరంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా పాఠకుల యొక్క అభిప్రాయాలకు అనుకూలంగా తమ వార్తలను అందిస్తుంది. అవసరమైన చోట్ల తమ సేవలను కిందిస్థాయి వారికి అందించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది.
  • సామాజిక బాధ్యత భావనలకు దగ్గరగా ఉండే జర్నలిజానికి ప్రత్యామ్నాయ మీడియా అవకాశం కల్పిస్తుంది ప్రత్యామ్నాయ జర్నలిజం సాంప్రదాయక జర్నలిజానికి భిన్నంగా పనిచేస్తుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలను సమాజం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రజల యొక్క కనీస అవసరాలు సమాజానికి దూరంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా పాఠకుల యొక్క అభిప్రాయాలకు అనుకూలంగా తమ వార్తలను అందిస్తుంది. అవసరమైన చోట్ల తమ సేవలను కిందిస్థాయి వారికి అందించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ప్రత్యామ్నాయ మాధ్యమం ముఖ్యంగా సామాజిక కలిసి పని చేయడానికి సిద్ధపడడం, కొన్ని సందర్భాలలో సంప్రదాయ జర్నలిస్టులతో కలిసి పని చేయడం రెండింటిని గమనించవచ్చు.
  • ప్రత్యామ్నాయ మాధ్యమంలో పనిచేసేవారు సంప్రదాయ పద్ధతిలో ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులకు ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు, కానీ వారు ప్రధాన స్రవంతి కాని, సముచిత మార్కెట్లో భాగం కావాలనుకుంటున్నారు.
  • ప్రత్యామ్నాయ మీడియా పాత సామాజిక ఏర్పాట్లను, సమాజం, సంస్కృతి మరియు రాజకీయాలు చేసే ఆధిపత్యం  ఆశించిన లేదా ఆమోదించిన మార్గాలను సవాలు చేయడానికి ప్రయత్నిస్తుంది. 
  • ప్రత్యామ్నాయ జర్నలిజం పద్ధతులు స్థానిక, సాధికార ప్రజా రంగాలను ఎలా నూతనంగా సృష్టించగలవో నిరూపించడానికి సాక్ష్యాలను సేకరించే ప్రయత్నం చేస్తుంది. 
  • సంప్రదాయబద్ధమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులను  ప్రతిఘటించి, అవసరమైతే ఆయా విషయాలలో జోక్యం చేసుకుని ప్రయత్నం చేస్తుంది.
  • సాధారణంగా వినియోగదారులు మరియు కంటెంట్ సృష్టికర్తలు వ్యాఖ్యానించడం, లైక్ చేయడం మరియు భాగస్వామ్యం చేయడం ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి.
  • సాధారణంగా సామాజిక మాధ్యమాలలో వెలువడే సమాచారాన్ని సమాచార సృష్టికర్తలు మరియు వినియోగదారులు ఒకరికొకరు వ్యాఖ్యానించుకోడానికి, నచ్చిన వాటిని లైక్ చేయడానికి ఆ సమాచారాన్ని ఇతరులకు చేరవేయడానికి అవకాశం ఉంది. ఆయా అంశాలపై తర్వాత ఇతరులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చేటువంటి సౌలభ్యం ఉంది.
  • ప్రత్యక్ష ప్రసారంలో (లైవ్ స్ట్రీమింగ్) కామెంట్ సెక్షన్ల ద్వారా ఇతర వినియోగదారులు సామాజిక మాధ్యమాన్ని నిర్వహిస్తున్న వారితో కమ్యూనికేట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
  • కొత్త మాధ్యమం సామర్థ్యాలు కమ్యూనికేషన్ యొక్క కొత్త శైలి అభివృద్ధికి దారితీసే అవకాశం ఉంది.

6. ప్రత్యామ్నాయ జర్నలిజం - సామాజిక మాధ్యమాలు: సమస్యలు- పరిష్కారాలు:

పత్రికలలో వచ్చే సమాచారాన్ని ప్రభుత్వం ఎప్పుడు పరిశీలిస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు పత్రికలను నియంత్రించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

“జేమ్స్ అగస్టన్ హీకీ 1780 లో 'బెంగాల్ గెజెట్' వెలువరించాడు. దానికే 'కలకత్తా జనరల్ అడ్వర్ టైజర్' అనికూడా పేరు. ఆ పత్రిక తనని తాను తెలివిగా ఇలా అభివర్ణించుకుంది. అన్ని పార్టీలకీ అవకాశమిస్తూ, ఏ పార్టీ ప్రభావమూలేని రాజకీయ, వాణిజ్య వారపత్రిక అని. అయితే, హికీ అన్నిరకాల వ్యాపార ప్రకటనలు, వాణిజ్య వార్తలు, ప్రభుత్వ, రాజకీయ పక్షాల కబుర్లూ కలగలిపి ప్రచురించడం ప్రభుత్వానికి నచ్చలేదు. అందుచేత రెండేళ్లు గడవగానే హికీ జైల్లో పడ్డాడు.” (సర్కార్, చంచల్.  మన వార్తాపత్రికల కథ (అనువాదం- గోదావరి శర్మ). పుట-8) అలాగే మన దేశంలో

“1857లో మీరట్లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సంగ్రామానికి పత్రికలు రెచ్చగొట్టాయని భావించి అంతకుముందు సడలించిన నిబంధనల్ని ప్రభుత్వం తిరిగి విధించింది. 1857 జూన్ 13న ‘గాగింగ్ ఆక్ట్’ అనే కఠినమైన ఆంక్షలతో కూడిన శాసనం అమలులోకి వచ్చింది. పాత్రికేయులనేకులను శిక్షలకు గురిచేశారు. ఆంక్షలవల్ల అనేక పత్రికలు మూతబడ్డాయి." (చెన్నయ్య. జె. తెలుగు దినపత్రికలు భాషా సాహిత్య స్వరూపం పుట-22. రవి కిరణ్ పబ్లికేషన్స్ హైదరాబాద్ 1998). ఇంకా స్వాతంత్ర్య  అనంతరం ప్రభుత్వం కొన్ని సందర్భాలలో వార్తలను నియంత్రించే అధికారాలు ఉన్నాయి.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 సహేతుకమైన పరిమితితో భావ ప్రకటనా స్వేచ్ఛను అందిస్తుంది. అయితే ప్రత్యామ్నాయ జర్నలిజం వివిధ రకాలుగా సమస్యలను సృష్టించాయి. ఫొటోలు, వెబ్ సైట్లు వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, కొన్ని ఫొటోలు మతాన్ని, మన విశ్వాసాలను కించపరిచేలా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు.

  • భారత పార్లమెంటు జూన్ 2000 లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టాన్ని రూపొందించింది.  ఆ చట్టం ప్రకారం  అభ్యంతరకరంగా భావించే సందేశాలను పంపడాన్ని నేరంగా పరిగణించింది. కొన్ని మార్పుల తర్వాత  అంతర్జాలంపై ఆంక్షలు విధిస్తూ భారత్ చట్టం తీసుకువచ్చింది. దాని ప్రకారం ‘ఐక్యత, సమగ్రతకు ముప్పు కలిగించే ఏదైనా ప్రకటన; భారతదేశ రక్షణ, భద్రత లేదా సార్వభౌమత్వం, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు భంగం కలిగించేలా ఉన్న సమాచారాన్ని నిషేధించారు. 
  • ఏదైనా అభ్యంతరకరమైన విషయాలను ప్రదర్శించే ఏదైనా సైట్ ను బ్లాక్ చేసే అధికారం డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంది. 
  • కొత్త నిబంధనల ప్రకారం  అంతర్జాలం వాక్ స్వేచ్ఛను చాలా వరకు తగ్గించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో భావ ప్రకటనా స్వేచ్ఛకు విధించిన పరిమితి ఇది. ఈ పరిమిత భావ ప్రకటనా నిబంధనలను కొంతమంది  న్యాయవాదులు,  అంతర్జాల వినియోగదారులు కొందరు వ్యతిరేకిస్తున్నారు.
  • వేగంగా పెరుగుతున్న  అంతర్జాలం వినియోగంపై ఈ ఆంక్షలు వ్యక్తి స్వేచ్ఛను తగ్గిస్తాయని కొత్త నిబంధనలను విమర్శించేవారు అంటున్నారు.

7. ప్రత్యామ్నాయ జర్నలిజం :  ప్రయోజనాలు:

కొత్త మాధ్యమాల నుండి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇది కొన్ని వ్యక్తుల సమూహంలో భాగంగా మారింది. అంతర్జాలం నుండి ప్రతికూల కోణం ఉన్నప్పటికీ, సమాజాన్ని మార్చాలనుకునే సమాజానికి నూతన మాధ్యమం ఒక ఆయుధం అని ప్రజలు మరొక వివరణ చెబుతారు.

7.1 ప్రతిఘటన స్వభావం :

ప్రజలు తమ గొంతులు ప్రభుత్వానికి వినిపించడానికి సామాజిక మాధ్యమాలు ఒక గొప్ప ఆయుధంగా ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలను విని పరిష్కరించే దిశగా ఉండేలా సామాజిక మాధ్యమాలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. వాటిని విస్మరించలేం. కొన్ని సందర్భాలలో ప్రజలందరూ లేవనెత్తిన సమస్యలను, ఆందోళనలకు ప్రభుత్వాలు అందించడమే కాకుండా పరిష్కారం దిశగా కూడా ఆలోచిస్తున్నాయి. గతంలో ఉన్నంత నియంతృత్వ ధోరణిలో ప్రజల పైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి.

  • అంతర్జాలం కొంత వరకు ప్రజాస్వామిక విలువలను స్పష్టంగా ప్రచారం చేస్తుంది, పరోక్షంగా వ్యాప్తి చేస్తుంది. ఈ అభిప్రాయాలు ప్రధానంగా కొన్ని ప్రభుత్వ సంస్థలపై వైఫల్యాలపై సమూహాల ద్వారా వ్యాపించాయి. ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే కొన్ని విలక్షణమైన అంశాలను  ఎంచుకుని వాటిని దృశ్య, శ్రవ్య మాధ్యమాలలో ఉంచుతున్నారు.
  • ప్రజాస్వామ్యానికి భిన్నమైన భావజాలం కలిగిన రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను అంతర్జాలం నిర్వీర్యం చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి మరియు ఉదాహరణలను ఉదహరించడానికి అనుమతిస్తాయి.
  • అనేక యూట్యూబ్ ఛానెళ్ళు బహుళజాతి సంస్థలు పత్రికా, ప్రసారమాధ్యమాలలో ఉన్న నిరంకుశత్వాన్ని సవాల్ చేసేవిధంగా  పాఠకులు ఉన్నారు. కొన్ని సందర్భాలలో సమాచారం ప్రతికూలంగానూ   మరియు సానుకూలంగానూ ఉంటుంది.
  • మన చట్టాలలో లోపాలు ఉన్నాయని ఎంతోమంది విద్యావంతులు చెబుతున్నారు పత్రికలలోనూ ప్రసార మాధ్యమాలను ఈ సమాచారం ఎక్కువగా వస్తూ ఉంటుంది.  కానీ ఈ సమాచారం ప్రజలకు చేరవేయడంలో పత్రికలు ప్రసారమాధ్యమాల కంటే సామాజిక మాధ్యమాలు చాలా తొందరగా ప్రజలకు చేరవేస్తున్నాయి.
  • అంతర్జాలంలో సమాచారం అనంతం. గత ఏడాది చివరి వరకు కొన్ని  లక్షలకు పైగా సమాచార వనరులు సేవలు అందిస్తున్నాయి.  అంతర్జాలంలో సమాచారం విపరీతంగా పెరిగిపోతోంది.

8. ప్రత్యామ్నాయ జర్నలిజం- తెలుగు సాహిత్యం:

తెలుగులో పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు ఎక్కువగా సాహిత్యంతో పరిచయం ఉన్నవారు కావడం వలన వారు రాసేటువంటి విషయాలలో తెలుగు సాహిత్యపు విషయాలు చోటు చేసుకునేవి. చాలా సందర్భాలలో పాత్రికేయులు ముఖ్యమైన శీర్షికకు సాహిత్యంలో ఉన్నటువంటి అంశాలను జోడించి చెప్పేవారు. ముఖ్యంగా ప్రముఖమైనటువంటి రచయితలు ఇప్పటికి కూడా అదే పద్ధతిలో రచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ముఖ్యమైన పత్రికలలో ప్రముఖమైన సాహితీవేత్తలు సంపాదకులుగా ఉపసంపాదకులుగా ఉంటున్నారు. క్రమంగా కొంతమంది రచయితలు తమ వాక్ స్వేచ్ఛకు చోటు లేదని భావించినప్పుడు బయటకు వచ్చి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. ఒక ప్రముఖ పత్రికను ఎంత మంది చదువుతున్నారు అంతమంది వినియోగదారులు కొంతమంది ప్రముఖుల సామాజిక మాధ్యమాలను అనుసరిస్తున్నారు. వారు చెబుతున్న సమాచారం కూడా ప్రజలకు చాలా వేగంగా సులభంగా సామాజిక మాధ్యమాల ద్వారా చేరుతుంది. జర్నలిజంలో చెప్పేటువంటి అంశం ప్రజలకు చాలా సూటిగా స్పష్టంగా అర్థం కావాలి. అదే విధంగా సాహిత్యం కూడా ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఉండాలని ఆధునిక సాహితీవేత్తలు అందరు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో కొన్ని వందల సంఖ్యలో గేయాలు గాన రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువయ్యాయి.

ఉదాహరణకు చౌరస్తా బ్యాండ్ వారి గేయం:

“చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా
ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులొచ్చేదాకా నిమ్మళంగా ఉండరా
సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు
బ్రతికుంటె చూసుకుందాం ఇప్పుడైతే బందుపెట్టు

ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నయిరా
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా
యుధ్ధానికి సిద్ధమా? రోగం తరిమేద్దమా?
ఆయుధాలు లేవురా...హృదయముంటే చాలురా
కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా
మంచిరోజులొచ్చేదాకా ఓపిక్కొంత పట్టరా

నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనక రాత్రనక సైనికులై కదిలినరు
ప్రాణాలే పణం పెట్టి మన కోసం పోరుతుంటే
బాధ్యత లేకుండా మనం వారికి బరువవుదామా?
లోకమంటే వేరు కాదు నువ్వే ఆ ఆలోకం రా” 

(రామ్, మిరియాల. చేతులెత్తి మొక్కుతా, పాట. Youtube)  (https://www.youtube.com/watch?v=DJSRl_3rSy0).

ఒక సంప్రదాయ జర్నలిస్టు చేయలేని పనిని ఒక వ్యక్తి తన గేయం ద్వారా ప్రజలను చైతన్య పరిచాడు. మరొక గేయం “పిల్ల జెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో… నా ముసలి తల్లి ఏమివెట్టి సాదుతుందో.. ” (రవి, ఆద్దశ్. ముసలితల్లి  పాట. YouTube)లో ప్రజలను చైతన్య పరచడంతో పాటు ప్రభుత్వాన్ని సూటిగా ప్రచురించిన కనిపిస్తుంది.

ప్రభుత్వ వైఫల్యం ప్రజల దీనస్థితి ఈ గేయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత గొప్ప దేశంలో పేదవారి బ్రతుకు దీన స్థితిలో ఉందని చెబుతూ, ముసలి తల్లి చిన్న పిల్లలకు తిండి కూడా పెట్టలేకపోయే స్థితి కనిపిస్తున్నట్లు పాట ద్వారా వ్యక్తం చేస్తారు గేయ రచయిత. ఒక పత్రిక సూటిగా ప్రశ్నించలేని సందర్భంలో అంతర్జాలం ద్వారా ఎంతో మంది పేద ప్రజల ప్రతినిధిగా గాయకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు గేయంలో కనిపిస్తుంది. కరోనా కాలంలో వచ్చిన ఉత్తమ రచనల్లో ఈ గేయం ఉంటుంది.

అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలలో స్థానికంగా ఉన్న సమస్యలను వివరిస్తూ ఎంతోమంది గాయకులు కవులు తమ ఆలోచనలను పాటల రూపంలోనూ ఇంటర్వ్యూ రూపంలోనూ వ్యక్తపరిచారు. iDreamMedia, sumantv,  వంటి కొన్ని ప్రముఖమైన ఛానళ్లకు యూట్యూబ్లో లక్షల మంది వీక్షకులుగా ఉన్నారు. వ్యాసంలో పరిమిత దృష్ట్యా ఆ గేయాలను ఇంటర్వ్యూలోను ఇక్కడ పొందుపరచడం లేదు.

9. ముగింపు:

  • ప్రత్యామ్నాయ జర్నలిజం అంతర్జాతీయ, జాతీయ సమస్యల కంటే స్థానిక సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక నాయకుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నట్టు ఇబ్బందుల గురించి ప్రజలకు అవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంది.
  • ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. సంప్రదాయ పత్రికలు చేయలేని పనిని ప్రత్యామ్నాయ జర్నలిస్టులు చేస్తున్నారు.
  • కొన్ని సందర్భాలలో స్థానికంగా ప్రత్యామ్నాయ జర్నలిస్టులు చేస్తున్న సమాచారం రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. అందుకు గల ముఖ్య ఉదాహరణ కరోనా సమయంలో ఎంతోమంది ప్రత్యామ్నాయ జర్నలిస్టులు స్థానిక సమస్యలను జాతీయ దృష్టికి తీసుకువచ్చారు.
  • ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ జర్నలిస్టులు చెబుతున్న అభిప్రాయాలను జాగ్రత్తగా గమనిస్తూ అవసరమైన సందర్భంలో ఆయా సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తుంది.

10. పాదసూచికలు:

Youtube
రవి, ఆద్దశ్. ముసలితల్లి  పాట. YouTube Uploaded by Mictv, May 11, 2020. https://youtu.be/10FbxvaHJKM

రామ్, మిరియాల. చేతులెత్తి మొక్కుతా పాట. Youtube uploaded by Chowraasta, 26 Mar 2020.   https://www.youtube.com/watch?v=DJSRl_3rSy0 

11. ఉపయుక్తగ్రంథసూచి:

  1. చెన్నయ్య జె. (సంపా.) తెలుగు పత్రికలు ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం. హైదరాబాద్: తెలంగాణ సారస్వత పరిషత్తు. 2016.
  2. చెన్నయ్య. జె. తెలుగు దినపత్రికలు భాషా సాహిత్య స్వరూపం. హైదరాబాద్: రవి కిరణ్ పబ్లికేషన్స్, 1998.
  3. రాంబాబు, వేదగిరి. తెలుగులో వార మాస పత్రికలు. హైదరాబాదు: తెలుగు అకాడమీ, 2012. 
  4. రామచంద్ర, తిరుమల. తెలుగు పత్రికలు సాహిత్య సేవ. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1989.
  5. రామదాసు, కె. తెలుగు దినపత్రికలు సాహిత్య సేవ. హైదరాబాదు: తెలుగు అకాడమీ, 2012.
  6. సర్కార్, చంచల్.  మన వార్తాపత్రికల కథ (అనువాదం- గోదావరి శర్మ). ఢిల్లీ: నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, 1986.
  7. సుబ్రహ్మణ్యం, జీవి & శ్రీనివాసాచార్య తిరుమల (సంపా.)  పాతికేళ్ల పత్రిక రచన. హైదరాబాదు: యువభారతి, 1982.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]