headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-9 | August 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

6. పిరదౌసి కావ్యం: జాషువా కవిత్వతత్త్వం

డా. తంగి ఓగేశ్వరరావు

తెలుగు అధ్యాపకుడు,
వి.వి.గిరి ప్రభుత్వ కళాశాల,
దుంపగడప, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9959753832, Email: t.ogeswararao@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

జాషువా రాసిన ఖండకావ్యాల్లో ప్రఖ్యాతిగాంచిన కావ్యం పిరదౌసి. మధ్యయుగం నాటి ప్రముఖ పారశీక కవి ఫిరదౌసి వృత్తాంతాన్ని తీసుకొని 'ఫిరదౌసి' కావ్యం రాశారు. ఈ కావ్యాన్ని పరిశీలిస్తే సత్యం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ధనవంతుడైన గజనీ మహ్మద్ ఇచ్చిన మాట తప్పి చరిత్రలో అసత్యవాదిగా నిలిచిపోయిన వైనం, అదేవిధంగా దుర్భర దారిద్ర్యంలో మగ్గి, మరణించిన పిరదౌసికి తాను రచించిన కావ్యం ద్వారా చరిత్రలో శాశ్వత కీర్తి పొందిన విధానాన్ని జాషువా ఈ 'పిరదౌసి' కావ్యంలో కరుణరసాత్మకంగా అక్షరబద్దం చేశారు. ఈ కావ్యం ద్వారా జాషువా కవిత్వతత్వాన్ని ఈపరిశోధనా పత్రంలో వివరించే ప్రయత్నం చేశాను. జాషువా జీవితం, సాహిత్యంపై పరిశోదన చేసిన డా.బి.ప్రభాకర చౌదరి 'జాషువా జీవితం, కవితా ప్రస్థానం' 'జాషువా కృతుల సమాలోచన' పేర రెండు గ్రంథాలను వెలువర్చారు. జాషువా సాహిత్యంపై పరిశోదన చేసిన ప్రొ. ఎండ్లూరి సుధాకర్ 'జాషువా సాహిత్యం - దృక్పథం - పరిణామం' పేరుతో తన పరిశోధనను గ్రంథస్థం చేశారు. జాషువా సాహిత్యంలోని మానవతా విలువలను ముప్పిడి శామ్యూల్ ప్రభాకరరావు 'జాషువా సాహిత్యం - మానవతా వాదము' పేరుతోనూ, డా. పి. విజయ్ కుమార్ 'జాషువా సాహిత్యం - మానవత్వం- విలువలు' పేరుతోనూ తమ పరిశోధనలను గ్రంథస్థం చేశారు. మనసు ఫౌండేషన్, బెంగూళూర్ వారు జాషువా రచనలను ‘జాషువా సర్వలభ్య రచనలు’గా పుస్తకరూపలో భద్రపరిచారు. పై గ్రంథాలను ఈ పరిశోధనా పత్ర రచనలో ఉపయోగించుకున్నాను.

Keywords: జాషువా, పిరదౌసి, మానవత్వం, కులవ్యవస్థ, కవిత్వం, పద్యం.

1. ఉపోద్ఘాతం:

మాతృభూమిక మరవని విశ్వమానవ దృష్టి. సంప్రదాయ సంస్కారం వదలని ఆధునిక సృష్టి. ఆస్తికత్వాన్ని తిరస్కరించని హేతువాదం. ద్వేషపూరితం కాని ఆగ్రహ ప్రకటన అన్నీ కలిసి మహాకవి జాషువా. కవితావస్తువులోను, రూపంలోను, సంప్రదాయ దృక్పథంగల కవులున్నారు. వస్తురూపాలు రెండింటిలోనూ ఆధునికత ప్రదర్శించిన కవులున్నారు. రూపంలో ప్రాచీనత, వస్తువులో ఆధునికత పాటించిన కవులున్నారు. ఈ మూడో వర్గంలో చేరతాడు జాషువా. ఒక వైపు హేతువాదోద్యమం. మరోవైపు భావకవితా ప్రభంజనం వీస్తున్న ఈ శతాబ్ది పూర్వభాగంలో కలం పట్టినవాడతను. అటువంటి సంక్లిష్ట సందర్భంలో వాదాల, ఉద్యమాల వరవడిలో అనుకరణప్రాయమైన కవితాస్రవంతిలో కొట్టుకుపోకుండా సర్వతంత్ర స్వతంత్రమైన, సృష్టితో తమ ప్రత్యేకతను నిలుపుకొన్న కవులు కొందరే. వాళ్లల్లో మొదట చెప్పదగినవాడు జాషువా. జాషువా రచించిన లఘు కావ్యాల్లో గబ్బిలం, ముంతాజ్‌మహల్, పిరదౌసి, క్రీస్తుచరిత్ర, స్వప్నకథ సుప్రసిద్ధమైనవి.

జాషువా 1895, సెప్టెంబరు 28న వినుకొండలో గుర్రం వీరయ్య లింగమాంబలకు జన్మించాడు. కవి కావటానికి అనుకూల పరిస్థితులు లేని వ్యవస్థను ఎదుర్కొని నిలబడి మహాకవిగా పేరు పొందాడు. కులం రీత్యా నాటకాలు చూడటానికి, స్కూలులో వేదిక ఎక్కి పద్యాలు చదవడానికి ఆనాటి సమాజంలో అవకాశం లేదు. అయినా అన్ని కష్టాలను, అవమానాలను సహించి వటవృక్షంలా నిలబడగలిగాడు జాషువా. ఈ ప్రయత్నంలో చివరికి తన కులం వారిచేత కూడా మాటలు పడ్డాడు. మాల మాదిగల పట్ల భేదభావాన్ని సహింపలేకపోయాడు. జాషువా ప్రాధమికోపాధ్యాయునిగా ఉద్యోగం ప్రారంభించాడు. ఆనాటి మూకీ చిత్రాలకి వ్యాఖ్యాతగా ఊరూరా తిరిగినప్పుడు కందుకూరి, చిలకమర్తి, తిరుపతి వెంకట కవుల ప్రోత్సాహం పొందాడు. ఉభయ భాషాప్రవీణుడై, తెలుగు పండితుడై బురదలో పుట్టిన కమలంలా వికశించాడు. ఆకాశవాణి, మద్రాసు కేంద్రంలో తెలుగు ప్రొడ్యూసరుగా పనిచేశాడు. కవి కోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ, నవయుగ కవిచక్రవర్తి మొదలైన బిరుదులు పొందాడు. కళాప్రపూర్ణ, పద్మభూషణలచే సత్కరింపబడ్డాడు. ఇతని ‘క్రీస్తుచరిత్ర’ కావ్యానికి కేంద్రసాహిత్య అకాడమీ బహమతి లభించింది. రాష్ట్ర శాసన మండలిలో సభ్యుడయ్యాడు. ఇలా తెలుగు సమాజానికి, సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన జాషువా 1971, జులై 24న కీర్తిశేషులయ్యారు.

"జాషువా కవిత్వాన్ని అతని వ్యక్తిత్వం నుంచి విడదీసి చూడలేము. అవి ఒకదాని కొకటి కారకాలు. ఉపస్కారకాలు. అవిభాజ్యంగా కలిసి మండిన అనల జ్వాలలు"1 అని పలికారు సి.నా.రె.
"ఆధునికాంధ్ర సాహిత్యరంగంలో తొలితరం కవుల్లో అన్ని విధాలా విలక్షణంగా ప్రపన్నమయ్యే మహనీయ మూర్తి జాషువ. వారిది రాపిడి పడ్డ జీవితం. రాపిడిలో రాణించిన ప్రతిభ. ప్రతిభతో గుబాళించిన కవిత. " కులమత విద్వేషంబుల్ తల సూపని కళారాజ్యం" కోసం కలలు గన్న ఆశావాది, సమతావాది, మానవతావాది జాషువా"2 అని ప్రశంసించారు జి.ఎన్. రెడ్డి.

"జాషువా ఖండకావ్యాలకు సార్వజనీనత సిద్ధించింది. వస్తునవ్యత, వస్తు వైవిధ్యం, వ్యథా భరితమైన హృదయం నుండి పొంగి పొరలిన భావావేగం, క్షుద్ర వస్తువులో కూడా ఉదాత్తతను చూడగల సహృదయం వాటికొక ప్రశస్తిని చేకూర్చినాయి. వాటికి తోడు నిమ్నోన్నతాలు లేని శైలి, సామాన్య ప్రజల వ్యవహారంలో బాగా నలిగిపోయిన పదప్రయోగం, కొన్ని శతాబ్దాలుగా తెలుగువారికి సన్నిహితమైపోయిన వాృద్యమూ, సంప్రదాయ బద్ధమూ ఐన పద్యరచన జాషువ కావ్యఖండికలకు మెరుగులను దిద్దాయి"3 అని వివేచన చేశారు బి. భాస్కరచౌదరి.

'బాగా అదును పదును గల నెలలోంచేగాక, రాతి పగుళ్ళలోంచి కూడా విత్తనాలు మొలకెత్తుతాయి. అలాంటి సాంఘిక, ఆర్ధిక రాతి పగుళ్ళలోంచి మొలకెత్తిన సాహితీ విత్తనము జాషువా. అప్పటిదాకా తన ముందటి సాహితీ పరులలో కొందరు తమ సామాజిక బాధ్యతతో, సానుభూతితో కొద్ది కొద్దిగా సిద్ధం చేసిన వాతావరణాన్ని వాడుకొని వ్యతిరేక పవనాలను అనుకూలంగా మార్చుకొని ఎదిగాడు. అవమానాలను అనుభవాలుగా మార్చుకొని, సంస్కరణ జాతీయ ప్రగతిశీల భావజాలంతో సాహిత్య సృష్టి చేశాడు' అంటూ విశదపరిచిన రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాటలు జాషువాలోని సానుకూల దృక్పథానికి ప్రతీకలు. జాషువా తన జీవితం ప్రస్థానంలోనూ, సాహిత్యం ప్రస్థానంలోనూ అనే సంఘర్షణలను ఎదుర్కోన్నాడు. అవన్నీ అతని రచనలలో ప్రతిధ్వనిస్తాయి.

గుఱ్ఱం జాషువాని సాహిత్యలోకం ‘కవి’గా గుర్తించిన ఖండకావ్యం ‘పిరదౌసి’.ఒక చారిత్రక సంఘటనను తీసుకొని ఒక రసభరిత కావ్యంగా తీర్చిదిద్దిన ఖండకావ్యం ‘పిరదౌసి’. ఇది మూడాశ్వాసాల కావ్యం. దీన్ని జాషువా1930లో రాశారు. 

గజనీని పరిపాలించిన చక్రవర్తి ‘మహమ్మద్ ఘజనీ’ నవంబరు 2, 971లో పుట్టి, ఏప్రిల్ 30, 1030 లో మరణించాడు. అరబిక్, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం ఉన్నవాడు. మొట్టమొదటిసారిగా ‘సుల్తాన్’ బిరుదు పొందిన చక్రవర్తి. భారతదేశంపై సుమారు పద్దెనిమిది సార్లు దండయాత్రలు చేసి హిందూ దేవాలయాల్ని దోచుకున్న చక్రవర్తిగా ముస్లిం ప్రజలలో ప్రఖ్యాతి పొందాడు. పిరదౌసి క్రీ.శ. 940లో పుట్టి, 1020 వరకు జీవించాడు. పిరదౌసి అసలు పేరు మన్సూర్ ఇబిన్ అహ్మద్. ఒక భూస్వామి ఇంట్లోనే పుట్టి పెరిగిన కవి. ఘజనీమహమ్మద్ సుమారు 60సంవత్సరాలు, పిరదౌసి సుమారు 70సంవత్సరాలు పైగా బతికారు. ఇరువురూ చారిత్రక పురుషులే.

పిరదౌసి ‘షానామా’ రాయడానికి గత చరిత్రను తవ్వాడో లేదో గానీ, సుమారువెయ్యి సంవత్సరాల తర్వాత ఆ చరిత్రను ‘పిరదౌసి’ కావ్యంగా రాయడానికి జాషువా ఆ పని చేసే ఉంటాడు. జాషువా ఈ కావ్యాన్ని సింగరాటు లక్ష్మినారాయణకి అంకితం ఇచ్చారు.

2. పిరదౌసి కావ్యం - ఇతివృత్తం :

క్రీస్తుశకం 11వ శతాబ్దిలో పర్షియా దేశపు రాజు గజనీ మహమ్మదు పద్దెనిమిదిసార్లు భారతదేశం మీద దండయాత్రలు చేశాడు. దోపిడీ చేసిన అపార ధనరాసులు దోచుకొని గజనీ పట్టణం చేరాడు. తన పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నాడు.

‘‘క్షణము గడచిన దాని వెన్కకు మఱల్ప
సాధ్యమే మానవున కిలాచక్రమందు?
దాఁటిపోయిన యుగములనాఁటి చరిత
మరలఁ బుట్టింపఁ గవియ సమర్థుఁడగును’’ (పిరదౌసి కావ్యం, ప్రథమాశ్వాసం, 14వ పద్యం)

అని భావించి “పారసీక సుకవిశ్రేణీ శిరోభూషణం”4 అయిన పిరదౌసిని రప్పించాడు. తరతరాల తన వంశచరిత్రను గొప్ప కావ్యంగా రచించమని కోరాడు.

“ఒక్కొక్క పద్దియంబున
కొక్కొక బంగారు రూక యొసగెదను కవీ!
మక్కామసీదు తోడని
వక్కాణించెన్ మహా సభామధ్యమునన్” (పిరదౌసి కావ్యం, ప్రథమాశ్వాసం,15వ పద్యం)

పిరదౌసి ముప్పయ్యేళ్లు శ్రమించి గజనీ వంశానికి చెందిన 16 మంది రాజుల చరిత్రను 'షానామా' అనే మహాకావ్యంగా రచించాడు. 50వేల పద్యాల ఉద్గ్రంథం అది. అయితే రాజు ఆడిన మాట తప్పి 60వేల బంగారు నాణాలకు బదులుగా వెండి నాణాలు కవికి పంపించాడు. పిరదౌసి ఆశాభంగం పొంది, ఆ ధనం రాజుకు తిప్పి పంపించి, ఒకలేఖ నిందాపూర్వకంగా రాశాడు. అది చదివిన గజనీ కోపించి కవిని పట్టి చంపమని భటులకాజ్ఞాపించాడు. అది తెలిసిన పిరదౌసి బాధతో మసీదు గోడ మీద ఒక పద్యం రాసి భార్య, కుమార్తెతో గజనీ పట్టణం వదలిపెట్టి, స్వస్థలమైన తూసు పట్టణం చేరాడు. కొంతకాలానికి సాహిత్యాభిమానులు, తన శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు విని, కనువిప్పు గలిగిన గజనీ మహమ్మదు మసీదు గోడ మీద పిరదౌసి రాసిన పద్యం కూడా చదివి ఎంతో విచారించాడు. వెంటనే 60వేల బంగారు నాణాలు ఒంటెల మీద ఫిరదౌసి కవికి పంపాడు. కాని అప్పటికే దుర్భర దారిద్య్రంతో పిరదౌసి మరణించాడు. తన తండ్రిని కష్టపెట్టిన ధనాన్ని కూతురు స్వీకరించలేదు. గజనీ మహమ్మదు పశ్చాత్తాపంలో కవి ఋణం తీర్చుకోడానికై తూసు పట్టణంలో ఒక సత్రశాల కట్టించాడు. కవికి కీర్తి రాజుకు అపకీర్తి నిలిచిపోయాయి. ఎక్కడో పర్షియా దేశంలో ఎన్నడో జరిగిపోయిన ఈ కథావస్తువును గ్రహించి తెలుగు పాఠకులకు ఆత్మీయం చేయగలిగాడు జాషువా.

ఒక వాస్తవ ఘటనను ఆధారంగా చేసుకుని తన భావనా గరిమతో పిరదౌసి లాంటి కవితాసౌధాన్ని నిర్మించుకోగలిగాడు జాషువా. కథ చారిత్రకమైందే. చరిత్ర చదివిన వారందరికి దాదాపు సుపరిచితమే. కానీ అందరికీ తెలిసిన కథను జాషువా కావ్యంగా మలిచి, ప్రశంసలు పొందిన తీరు ప్రశంసనీయం. అతని ప్రతిభ మొత్తం ఆ కథను ఆశ్వాసాలుగా విడగొట్టిన పద్ధతిలో ఉంది. ఇక్కడే జాషువా తన బలాబలాలను నేర్పుగా అంచనా వేసుకున్నాడు. గజనీ మహమ్మదు రాజ్య విస్తార కాంక్షని, విజయాలని అతడు పిరదౌసిని 'షానామా' రచించమని అడగడం మొదలుకుని, పిరదౌసికి జరిగిన అవమానమూ తదనుభవానికి విచలితుడై కవి మసీదు గోడల మీద రాజుని నిందిస్తూ పద్యాలు రాయడం వరకూ మొత్తాన్నీ ఒకే ఆశ్వాసంలో ముగించాడు జాషువా. అడవి దారుల్లో తూసీ నగరానికి ప్రయాణమయ్యాక మార్గ మద్యలో ఎదురైన కష్టాలు, అడవి మార్గంలోప్రకృతి వర్ణనలు రెండవ ఆశ్వాసంలో జాషువా పొందుపరిచాడు. ఇక అడవి మార్గంలో దారితప్పి ఇబ్బంది పడుతున్న ఫిరదౌసినినిషాదులు తూసు పట్టణం వైపు చేర్చడం, అక్కడ దుర్భర దారిద్ర్యంతో పిరదౌసి మరణించడం, గజనీ మహమ్మదు తన తప్పుతెలుసుకొని పిరదౌసికి ఇవ్వవలసిన బంగారు నాణేలను తూసు పట్టణానికి పంపడం, అవి చేరే సమయానికి పిరదౌసి మరణించడం, అతని కుమార్తె ఆ ధనాన్ని తిరస్కరించడం మొదలైన సంఘటనలను జాషువా మూడవ ఆశ్వాసంలో కరుణ రసాత్మకంగా వర్ణించాడు. ఇలా కథను మూడు ఆశ్వాసాల్లో విస్తరించడం కాకతాళీయం కాదనీ, తాను చెప్పదలచుకున్నదేమిటో జాషువాకు సుస్పష్టంగా తెలుసు కనుకే ఇంత జాగరూకతతో కథాక్రమాన్ని మలచుకున్నాడనీ పాఠకులకు సులభంగానే అర్థమవుతుంది.

3. పిరదౌసి కావ్యం - జాషువా కవిత్వతత్వం :

 

3.1 విశ్వమానవ ఏకత్వం: 

“దేశచరిత్ర లెన్నియో యుండ విదేశీయుని చరిత్ర మన కేల?" యని కొంద ఱూహింప వచ్చును. ఖండాం తరవాసులైన షేక్ స్పియర్, కీట్సు, బైరన్ మొదలయిన కవుల జీవితచరిత్రములు మనకు పఠనీయము లగుచుండఁగా కళావీరుఁడగు పిరదౌసికవి చేసిన పాపమేమి : జాతిమత భేద ములను పరిగణింపక విశ్వమానవ సోదరత నెఱపు దివ్యపురుషు లిక్కవిజీవితము ననాదరింపరని విశ్వసించి నే నితని చరిత్రను పద్యకావ్యముగా రచించితిని5 అని జాషువా చెప్పుకున్నాడు.

"కులమతాలు గీచుకొన్న గీతల చొచ్చి
 పంజరాన కట్టువడను నేను
 నిఖిలలోక మెట్లు నిర్ణయించిన, నాకు
 తిరుగులేదు, విశ్వనరుడ నేను"6

అని జాషువా తన గురించి చెప్పుకున్న మాటలకు ఈ పిరదౌసి కావ్యం నిదర్శనం. జాషువా కుల మతాలకే కాదు దేశ, ప్రాంత, భాషా సరిహద్దులకు అతీతుడని చెప్పడానికి ఈపిరదౌసి కావ్యమే సాక్ష్యం. నిజానికి జాషువా ప్రపంచ కవి. మనుషుల, దేశాల మధ్య వివిధ అంతరాలతో అశాంతి నెలకొన్న ప్రస్తుత ప్రపంచంలో శాంతిని నెలకొలపడానికి అతని సాహిత్యాన్ని అధ్యాయనం చేయవలసిన అవసరం ఉంది.

 పంచముఖుడైన కవిగా సామాజిక నిరాదరణతో ఎంతో వేదన అనుభవించాడు జాషువా. అట్టడుగు పేదరికాన్ని చవిచూశాడు. నిరుపేద అయిన పిరదౌసిదీ వేదనామయ జీవితమే. బహుశా ఈ సారూప్యమే ఆ కథావస్తువును గ్రహించేటట్టుచేసి ఉండాలి. పిరదౌసి కావ్యం చదువుతుంటే పిరదౌసి, జాషువా ఇద్దరూ కలగలసిన ఒకే ఒక కవి స్వరూపం మన కళ్లముందు కదలాడుతుంది. పిరదౌసి వ్యక్తిత్వాన్ని ఆత్మీకరించుకున్నాడు జాషువా. నిజానికి ఇద్దరి ఆత్మా ఒక్కటే.

3.2 ధనానికి కవిత్వం అతీతం :

‘‘ఇంక విషాద గతములకే మిగిలెన్ రసహీనమై మషీ
పంకము నాకలమ్మున, నభాగ్యుడు నైతి; వయః పటుత్వమున్
గ్రుంకె, శరీరమం దలముకొన్నది వార్ధకభూత; మీనిరా
శాంకిత బాష్పముల్ ఫలములైనవి ముప్పది యేండ్ల సేవకున్’’ (ప్రథమాశ్వాసం, 49వ పద్యం)

అని పిరదౌసి చేసిన ఆక్రోశం కేవలం పిరదౌసి దేనా? జాషువాది కూడా అనిపిస్తుంది. జాషువా, పిరదౌసి ఇద్దరూ ఆయా భాషాల్లో గొప్ప కవులుగా కీర్తిగాంచారు. కాని కవిత్వం ద్వారా వారు సంపాదించిందేమీ లేదు. పిరదౌసితో పోలిస్తే కుల మత వివక్షత జాషువా విషయంలో అదనం. అతని జీవితం చివరి దశ వరకు ఈ వివక్షత వలన జాషువాకు అతని సామార్ధ్యానికి తగిన గుర్తింపు రాలేదు.

పిరదౌసి గజనీ మహమ్మదుకు రాసిన లేఖా సారాంశమంతా కవిగా జాషువాపడిన వేదనా సారాంశమే అన్పిస్తుంది. అయితే పిరదౌసి దౌర్భాగ్యానికి కేవలం గజనీ మహమ్మదే కారణమా! అనే సందేహం తలెత్తక మానదు. కాసుకోసం కవిత్వాన్ని అమ్ముకోదలచిన పిరదౌసి దురాశ కూడా కొంతవరకు కారణమే. ఇదే విషయాన్ని-

“పూని కరాసికి స్మనుజభుక్తి యొసంగెడు రాతిగుండె సు
ల్తానుల కస్మదీయకవితాసుధఁ జిందిన పాతకంబు నా
పై నటనం బొనర్చినది వాస్తవ మిట్టి స్వయంకృతైక దో
షాకలదగ్ధమై చనిన యర్థము ము నాకు లభింపఁబోవునే?” (ప్రథమాశ్వాసం, 48వ పద్యం)

అని పిరదౌసి ముఖంగా జాషువా వ్యక్తంజేశాడు. ఈ సందర్భంలో జాషువా దృక్పథం సహజకవి బమ్మెర పోతనను గుర్తుకు తెస్తుంది. పిరదౌసి కావ్యాన్నిపరిశీలిస్తే ధనం, సంపదను పొందడానికి కవిత్వాన్ని సాధంగా ఎంచుకునే కవులకు జాషువా పూర్తి వ్యతిరేకమని స్పష్టమౌతుంది.

 "బూటుల్ కోటులు నున్నతోన్నత పదంబుల్ జూచి యాశించి, ము-
ప్పూటల్ బోయి ప్రదక్షిణించి కవితాపుష్పాంజలుల్ సల్లి, యా-
రాటంబుం బడుచున్న శుష్కిత కవీంద్రా! యెండగు ఱ్ఱాలలో
నూటల్ రావు రసజ్ఞమూర్తులగువా రున్నారు ప్రచ్ఛన్నులై"7

అని జాషువా ధనంపై ఆశతో కవిత్వం రాసే కవులను విమర్శించాడు.

పిరదౌసి కావ్యం చదువుతున్నప్పుడు "రాజుల్ మత్తుల్ వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నంభోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదులాత్మవ్యథాబీజంబుల్" అన్న ధూర్జటి మాటలెంత నిష్ఠురసత్యాలో అనిపించక మానదు. దురదృష్టవశాత్తూ అది తెలుసుకునేలోపే తన జీవితంలో అత్యంత విలువైన ముప్పైయేళ్ళు కోల్పోయాడతను. ఆ బాధే, ఆ వంచనకు గురైన వేదనే జాషువా కావ్యంలోని అక్షరమక్షరంలో ప్రతిఫలించి మన మనస్సులు కలించివేస్తుంది. విషాదాంతమైన ఒక కథను ఎంత బలంగా చెప్పే వీలుందో, అంత బలంగా చెప్పాడు జాషువా. లలితమైన వర్ణనలూ, తేనెలొలికే భాష, పట్టి కుదిపే కథనం, శబ్దకాఠిన్యమూ అన్వయ క్లిష్టతా లేని అపురూపమైన కవిత్వమూ పిరదౌసి కావ్యాన్ని ఏ కాలానికైనా అజరామరంగా నిలబెడతాయి. మహమ్మదు రాతి విగ్రహాల యందైనా ఉండగలడా అన్నది సందేహమే కానీ, ‘ప్రజల నాల్కల యందు’ ఈ సుకవి జీవించి తీరుతాడు.

కవి రాజులు, ధనవంతుల కన్న అధికుడని జాషువా నమ్మాడు. అతని రచనలలో కూడా ఇది కనిపిస్తుంది.

 ‘‘కవినిఁ గన్న తల్లి గర్భంబు ధన్యంబు;
 కృతినిఁ జెందువాఁడు మృతుఁడు గాఁడు;
 పెరుగుఁ దోటకూర, విఖ్యాత పురుషులు;
 కవిని వ్యర్థజీవిగాఁ దలంత్రు’’ (ప్రథమాశ్వాసం, 12వ పద్యం)

అని జాషువా కవి గొప్పతనం వివరించాడు.

3.3 సత్యం గొప్పతనం :

మూప్పదేండ్లు అవిరామమంగా నిద్ర, విశ్రాంతి, సుఖం అన్న మాటే మరచి కావ్యరచనచేసిన పిరదౌసి హృదయం వయోభారంతో అలసిపోయింది. అలసట తీర్చుకోవాలనిపిస్తుంది. కానీ అతని కష్టానికి రావలసిన ప్రతిఫలం మాత్రం రాలేదు. ఆశాపహతుడైన పిరదౌసికి ఇక నిర్మలమగు చిత్త శాంతికి తావెక్కడ... అవిరామమైన విశ్రాంతి కోరుకుంటున్నాడు. వెలకట్టలేని వెన్నల కురిపించే తన కవిత్వం అసత్యవాదివైన గజినీకిలభించిందని ఫిరదౌసి వ్యాకులంచెందుతున్నాడు.

"అల్లాతోడని పల్కి నాపసిఁడి కావ్యద్రవ్యము న్వెండితో
జెల్లింప దొరకొన్న టక్కరివి: నీచేఁ బూజితుండైనచో
నల్లా కున్సుఖమే? మహమ్మదు నృపా లా! సత్య వాక్యం బెవం
డుల్లంఘింపఁడో వాడెపో నరుఁడు,ధన్యుం డిద్ధరామండలిన్" (ప్రథమాశ్వాసం, 51వ పద్యం)

అని పిరదౌసి ముఖంగా జాషువా సత్యం యొక్క గొప్పతనం వివరించాడు. జాషువా చెప్పిన పై పద్యం ఆంధ్రమహాభారతం, ఆదిపర్వం నందలి శకుంతలోపాఖ్యానంలో నన్నయ చెప్పిన ఈ క్రింది పద్యం జ్ఞప్తికి వస్తుంది. 

"నుతజలపూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత-
వ్రత! యొకబావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స -
త్క్రతు వది మేలు తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు త -
త్సుత శతకంబుకంటె నొకసూనృత వాక్యము మేలుసూడగన్"

స్వభావాన్నిబట్టి జాషువాది హృదయ ప్రధానమైన కవిత్వం. బుద్ధిప్రధానం కాదు. మానవ భావావేశాల్ని అతను వ్యక్తీకరించినంత మృదువుగా, గాఢంగా వ్యక్తీకరించిన ఆధునిక కవులు తక్కువ. అతని కవిత్వం ఎంతో ఆర్ద్రంగా, ఆత్మీయంగా మన గుండె తలుపులు తెరచి లోపలికి ప్రవేశిస్తుంది. ఆ ఉద్ధృతిని ఎవరూ అడ్డుకోలేరు. ఈ కావ్యంలో పిరదౌసి వేదన జాషువా వేదనగా, అంతిమంగా మన వేదనగా పర్యవసిస్తుంది. జాషువాలోని భావావేశానికి మచ్చుతునకైనా పద్యం…

"అలసట దీర్చుకొందును మహమ్మదురాజులతో సమాధిశ

య్యలపయి ముప్ప దేఁడుల ప్రయాసకు డెందము గందిపోయె ని

ర్మలమగు చిత్త శాంతి కిఁకమార్గములే దెన లేని పండు వె

న్నలగురియించు నా కవిత నీకు లభించె నసత్యవాదికిన్" (ప్రథమాశ్వాసం, 54వ పద్యం)

3.4. కీర్తి శాశ్వతం :

     కొన్ని పొరపాట్లను ఎప్పటికీ సరిచేసుకోలేము. గజనీ మహమ్మదు తన తప్పు తెలుసుకొని పిరదౌసికి బంగారు దినారాలు ఇవ్వాలని నిర్ణయించుకొని, తూసు పట్టణానికి వాటిని పంపిస్తాడు. కానీ 

"సుకవిదేహంబు ప్రేతభూమికి లభింప

 అర్ధమప్పుడె శూన్యగేహమును జేరె,

 నిమిషభేదంబు నడుమ సంధింపఁబడిన

 ఈ రహస్యంబుఁ గనుగొన నెవరితరము?" ( తృతీయాశ్వాసం, 28వ పద్యం)

    చివరికి అతని కుమార్తె కూడా ఆ ధనాన్ని తీసుకోవడానికి ఇష్టపడదు. 

 

"ఇది నా తండ్రికి కష్ట పెట్టిన శరం భీస్వాపతేయంబు ము

 ట్టుదునా,నా జనకుండు కంటఁ దడిఁబెట్టున్ స్వర్గమందుండి,నా

 ముదితండ్రిన్ దయతోడ నేలిన నవాబుండైన మీ స్వామికిన్

 బదివే లంజలులంచుఁ బల్కుడని బాష్పస్విన్న దుఃఖాస్యయై" (తృతీయాశ్వాసం, 29వ పద్యం)

    అని తిరస్కరిస్తుంది. తన తండ్రి ఆత్మగౌరవాన్ని, దుఃఖాన్ని గజనీ మహమ్మదుకు తేలిసేలా చేస్తుంది. పారశీక దేశ చరిత్రలో -

 "మహమ్మదుగారికి నపశయంబు,

నిండు సత్కీర్తి కవికి నిలిచిపోయె." (తృతీయాశ్వాసం, 37వ పద్యం)

ఈ సంఘటన గురజాడ అప్పారావు గారి "పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్” అనే మాటలను గుర్తుకు తెస్తుంది. 

ఆలోచనకు హేతువు నివ్వటం జాషువాకి తెలుసు. భావానికి లోతు నివ్వటం తెలుసు. అభివ్యక్తిని ఉన్నతీకరించటం తెలుసు. పిరదౌసి గజనీ పట్టణం వదలివెళ్తూ మసీదు గోడ మీద రాసిన వాక్యాలు, జాషువా మన గుండెలమీద రాసిన వాక్యాలే.

"రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమెక్కె
రాజు జీవించే రాతి విగ్రహములందు
సుకవి జీవించే ప్రజల నాలుకల యందు"8

   అన్నది పిరదౌసి కావ్యంలోని పద్యం. జాషువా నిజంగా సుకవి. ఇప్పటికీ ప్రజల నాలుకల మీద మాత్రమే కాదు, హృదయాలలో కూడా సజీవంగా వున్నాడు. అసలైన 'కీర్తి' శేషుడు జాషువా. అతనిలోని ఆ విశ్వమానవతా దృక్పథానికి ప్రతిఫలం ఫిరదౌసి కావ్యం. అది విషాదాంతం కరుణ రసాత్మకం.

4. ముగింపు:

  • జాషువా అభ్యుదయవాది. వర్గ సంఘర్షణ, ఆర్ధిక వ్యత్యాసాల నిర్మూలన, దోపిడి వర్గాలపై తిరుగుబాటు జాషువా కావ్యాలలో ప్రధానంగా కనిపిస్తాయి. 
  • జాషువా మానవతావాది. కులమతాలు మనుషుల మధ్య అడ్డుగోడలని, మానవత శాశ్వతమని నమ్మి కవిత్వం రాశాడు. 
  • జాషువా వాస్తవికవాది. ఊహాలోకంలో విహరించే కవిత్వాన్ని తీవ్రంగా విమర్శించాడు. అతని కవిత్వంలో సామాజిక స్పృహ తొణికిసలాడుతుంది.
  • సంఘసంస్కరణ జాషువా కావ్యలక్ష్యం. కులమతాలు, ఆర్ధిక అసమానతలు లేని సమతాలోకాన్ని ఆకాంక్షించి, దీనికోసమై కలం పట్టిన కవి జాషువా.
  • జాషువా కవితాకంఠం విలక్షణమైంది. ప్రజలందరి సుఖసంతోషాల కోసం, ఎవరు అవమానాలకు గురికాకూడదన్న లక్ష్యం కోసం జాషువా కవితా ఆక్రోశిస్తుంది. 
  • కులవివక్షత వలన కలిగే మానసిక క్షోభను చిన్నతనం నుంచి అనుభవించడం వలన జాషువా కవిత్వంలో కులవ్యవస్థపై నిరసన వాస్తవికంగా ఉంటుంది.

5. పాదసూచికలు:

  1. తెలుగు సాహిత్య చరిత్ర, పుట. 386
  2. ఇదే, పుట. 386
  3. జాషువా జీవితకవితా ప్రస్థానం, పుట. 203
  4. పిరదౌసి కావ్యం, ప్రథమాశ్వాసం,10వ పద్యం
  5. ఇదే, పీఠిక పుట. 1
  6. జాషువా సర్వలభ్య రచనల సంకలనం, ఖండకావ్యములు, ఐదవ భాగం, నేను ఖండిక, 2వ పద్యం
  7. జాషువా సర్వలభ్య రచనల సంకలనం, ఖండకావ్యములు,నాలుగవ భాగం,కవి ఖండిక,1వ పద్యం
  8. జాషువా సమగ్ర రచనలు - మానవత – విలువలు, పుట. 237

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. జాషువా, గుర్రం. పిరదౌసి, ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయము, బెజవాడ, 1942
  2. జాషువా సర్వలభ్య రచనల సంకలనం, మనసు ఫౌండేషన్, బెంగుళూరు, 2008
  3. జాషువా రచనలు (నాలుగు సంపుటాలు), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2005
  4. జాషువా, గుర్రం. ‘నా కథ’, ఎమెస్కో ప్రచురణ, విజయవాడ, 2004
  5. జాషువా, గుర్రం. గబ్బిలం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, డిసెంబర్, 2004
  6. నాగయ్య, జి. తెలుగు సాహిత్యసమీక్ష (రెండవ సంపుటం), నవ్యపరిశోధనప్రచురణలు, తిరుపతి, 2004
  7. భాస్కరచౌదరి, బి. జాషువా జీవితకవితా ప్రస్థానం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2009
  8. విజయకుమార్, పెంకి. జాషువా సమగ్రరచనలు - మానవత- విలువలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, 2016
  9. శాస్త్రి, ద్వా. నా.  తెలుగు సాహిత్యచరిత్ర, ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్, 2007

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]