headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-10 | September 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

4. గద్దలాడతండాయి నవలపై సందేహాలు: విశ్లేషణ

బుక్కే ధనక నాయక్

పరిశోధకులు, తెలుగు & ప్రాచ్యభాష విభాగం,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నాగార్జున నగర్,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8187056010, Email: dhanakanaikbukke111@gmail.com



డా. ఎన్. వి. కృష్ణారావు

అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు & ప్రాచ్యభాష విభాగం,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నాగార్జున నగర్,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9490218173, Email:vkraonarisetty@yahoo.com
DOWNLOAD PDF


వ్యాససంగ్రహం:

“గద్దలాడతండాయి” నవలకి పూర్తి విశ్లేషణ తెలిపిన కే. ఎల్. ప్రభాకర్ ప్రకారం ఈ వ్యాసం “గద్దలాడుతుండాయి” నవల పాఠ్యానికి కొత్త అర్థం నిర్ణయం చేసే సాహసం కాదు. దాని అసలు అర్థం అన్వేషించే ఒక అసమగ్రప్రయత్నం లేదా సందేహాలను పరిశీలించే పూనిక మాత్రమే. విమర్శ అంతకన్నా కాదు. గద్దలాడుతుండాయి రాయలసీమ ప్రాదేశికి, గ్రామీణవాద, వ్యవసాయ, మాండలిక, బహుజన, రాయలసీమ దళిత బహుజననవల. రాయలసీమ కరువులు, రాజకీయలు, కుటుంబ తగాదాలు వ్యవసాయంలో దోపిడీ దళితులపై అగ్రకులాల అరాచకాల గురించి నడిచిన ఈ నవలలో కొన్ని విషయాలను రచయిత గూడంగానే దాచి ఉంచడం జరిగింది. సందర్భానుసారం ఆ గూడార్థాన్ని, సందేహాలను పరిశీలించి రేపటి తరం పరిశోధకులకి, పాఠకులకు అర్థమయ్యే విధంగా విశ్లేషించి చెప్పడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

Keywords: సందేహం, దళితులు, కొడిపిల్లలు, గద్దలు, రయకీయ వర్గములు, పీనుగలు.

1 ఉపోద్ఘాతం:

గడ్డలాడతండాయి నవల రచయిత బండి నారాయణ స్వామి. రాయలసీమ గ్రామీణ పరిభాషలో గద్దలాడ్డమనేది ఒక సంకేతం. అది ఒక సాంకేతిక పదం. మెతుకు దొరకని ఆకలి గడ్డ కాబట్టి సీమ కరువు బతుకులపై ఎప్పుడూ డేగకళ్ళు పడుతుంటాయి.

“బడుగు జీవులైన రైతులూ రైతుకూలీల కష్టార్జితాన్ని కాజెయ్యడానికి, వాళ్ళ ధనమానప్రాణాల్ని కొల్లగొట్టడానికి అడుగడుగునా గద్దలాడుతుంటాయి. ఇక్కడి నిచ్చెనమెట్ల సమాజంలో నువు రైతైనా రైతుకూలీ ఐనా ఆడమనిషివైనా మనుగడ సాగించడం అంత సలీసు కాదు”1) ఇక్కడ బతకాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి.

“గద్దలు ఆడుతున్నాయంటే నీ ఇంటి ముందు తిరుగుతున్న కోడిపిల్లల్ని తన్నుకుపోతాయి జాగ్రత్త అని ఒక హెచ్చరిక”2) ఒకచోట గద్దలు ఆడుతున్నాయంటే పీక్కు తింటానికి అక్కడ ఒక వేట పడి ఉండాలి.

ఒక చచ్చిన శవం పడుండాలి. డేగకళ్ళు ఉత్తినే పడవు మరి. గద్దలు ఊరికే ఆడవు మరి. నీ రెక్కల కష్టం వెచ్చించి మాంసం ముక్కలు కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటున్నపుడు వాటిని గద్దలు తన్నుకుపోకుండా నువు చాలా జాగ్రత్తగా ఉండాలి. గద్దచూపు ఒక్క కోడిపిల్లపై మాత్రమే ఉంటుంది. మాంసం ముక్కపై మాత్రమే ఉంటుంది. అది దొరికితే దాని ఆకలి తీరిపోతుంది. కానీ మనిషిచూపు అనే గద్దచూపుకు అదనంగా స్వార్థం ఉంటుంది. దానికి గతం గుర్తుంటుంది. పగ ప్రతీకారేచ్ఛ రగులుతుంటుంది. అందువల్ల అది చాలా ప్రమాదకారి. దీన్ని సంకేతిస్తూ జాగ్రత్తగా బతకమని సందేశిస్తూ సీమ మాండలికంలో బండి నారాయణస్వామి రాసిన ‘గద్దలాడతండాయి’ నవల మళ్ళీ మళ్ళీ పఠనీయం, చర్చనీయం అయింది.

2  గద్దలాడతండాయి నవల పుట్టుక:

గద్దలాడతండాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్ళ నాటి సీమ సామాజిక జీవితంలో వచ్చిన అలజళ్ళను, పొంతనలేని వైరుధ్యాలను కథనం చేసింది. అప్పట్లో కాంగ్రెస్‌లో ఉంటూ రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యస్థానంలో ఉండేది. ఇతర సామాజికవర్గాలు, రెడ్లలోనే అవకాశాలు రానివాళ్లూ దిక్కు తెలియని ఒక శూన్యతలో నిరాశానిస్పృహల్లో ఉండేవాళ్ళు. అప్పుడున్న రాజకీయపరమైన ఖాళీని పూరించిన తెలుగుదేశం పార్టీ రూపంలో ఒక ఆసరా దొరికేసరికి వాళ్ళంతా అందులోకి దూకారు. అప్పటికీ అవకాశాలు రానివాళ్ళు పదే పదే పార్టీలు మార్చారు. ఈ ఉరవళ్ళలో ఎప్పుడూ కరువు తాండవించే అనంతపురంజిల్లా సామాజిక జీవితంలో ఒక సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితుల్ని కథనం చెయ్యాలని రచయిత అనుకోవడం వల్ల గద్దలాడతండాయి ఇతివృత్తం అనివార్యంగా సాంఘికేతివృత్తం అయ్యింది. అందువల్ల ఇందులో మనకు ఒక నాయకుడు, ఒక నాయిక అంటూ కనబడరు. సామాజిక జీవితం ఎలా ముక్కలుగా ఉంటుందో అలా ఇతివృత్తం కూడా శకలాలు శకలాలుగా ఉంటుంది. ఆనాటి సమాజం అంతటినీ ఒక కట్టకట్టి ఒక చిన్న నవలికగా మలచడం నారాయణస్వామికే సాధ్యమైంది.

2.1 విభిన్న కోణాల్లో గద్దలాడతండాయి నవలా పరిశీలన.

2.1.1 పరిశోధక దృష్టి కోణం నుంచి:

రచనకు రచయిత దృష్టికోణమే కాక పాఠకులదృష్టి కోణం ఒకటి ఉంటుంది. పాఠకుల ఆశయానికి అనుగుణంగా కథ దానిలో పాత్రలు నడుస్తాయి లేదా రచయిత నడుపుతాడు కానీ ఈ రచయిత ఆ వైపు చూడలేదు. పాటకుల ఆశయానికి విరుద్ధంగా నవల్లో అనేక ఘటనలు చోటు చేసుకుంటాయి.

బోయ నాగేంద్రప్ప వడ్డే లింగన్న ఇద్దరిలో ఎవరో ఒకరు ధర్మం వైపు నిలబడతారని మాదిగ వాడలో ఏపు లాంటి వారెవరో సామాజిక దుర్నయం మీద తిరగబడతారని శంకర్ రెడ్డి లైంగిక దుర్మార్గానికి రాములమ్మ రాజకీయ ఆర్థిక ఆధిపత్యానికి భీమప్ప లొంగిపోవుకపోతే బాగుండునని పాఠకులకు సహజమైన ఆశ.

మంచి గెలవాలని చెడు ఓడిపోవాలని ఆశించడం తప్పు కాదు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నవల్లో ఎక్కడా తిరగబడే పాత్రలు లేవు. అవసరార్థం అవకాశవాదులుగా మారిపోయేవాళ్లు పోరాడకుండానే ఓడిపోయేవాళ్లు ప్రతిఘటించి రాజీ పడిపోయేవాళ్లు పాఠకుల ఆశయానికి గండి కొడతారు.

పాత్రల్ని తెలుపు నలుపుగా చూడడానికి రచయిత ఇష్టపడలేదు. అందువల్ల గద్దలాడుతుండాయి యదార్థస్థితిని మాత్రమే వర్ణించిన ఫిర్యాదు నవల అని ఎవరైనా భావించడానికి అవకాశం ఏర్పడింది. కానీ వాళ్లందర్నీ అలా రూపొందించిన దృశ్యశక్తుల్ని యధాతధంగా దృశ్యమానం చేయడమే రచయిత ఉద్దేశమని సమాజంలో లేని చైతన్యం పాత్రలకి ఆపాదించడం శిల్పరీత్యా నేరంగా భావించాడని అర్థం చేసుకోవాలి యధార్థత మరోలా ఉన్నప్పుడు అది రచనలు అసంభావ్యతని కోరుకోదు లేని చలనాన్ని చిత్రించదు.

పల్లెటూర్లలో సంఘటనలు జరగడానికి అవకాశాలు తక్కువ అని సామాజికవేత్తలు అంటారు నిజమే. పట్టణాల్లో ఉన్నంత సామాజిక చలనం పల్లెల్లో కనిపించదు. అలా అని అసలు కదలికే ఉండదు అనుకోరాదు దాన్ని గుర్తించడానికి నిచితమైన చూపు అవసరం. పట్టణాల్లో చలనం వేగంగా ఉంటుంది సంక్లిష్టతతో కూడుకొని ఉంటుంది. అక్కడ ప్రతి చలనం వ్యాపారంతో ముడిపడి ఉంటుంది. అది గ్రామాల్లోకి ప్రవేశించినప్పుడు మారే విలువల్ని అర్థం చేసుకోవడానికి విమర్శనాత్మక వైఖరి కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నవల్లో నాగేంద్రప్ప నామిని నామిని మూలింటామెలో వసంత తెచ్చిన మార్పులు పల్లెల్లో చోటు చేసుకునే విలువల విధ్వంసానికి కొత్త నిర్వచనాన్ని సమకూర్తున్నాయి అది బండి నారాయణస్వామి లో పుష్కలంగా ఉంది.

2.1.2 నవలపై సందేహాలు, చర్చ:

ఎ) ప్రసిద్థ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి గారు తనకు కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు తెచ్చిపెట్టిన ‘మన నవలలు మన కథానికలు’ గ్రంథంలో మొదటి వ్యాసం నారాయణస్వామి గారి గద్దలాడతండాయి పైనే రాశారు. "నిచ్చెనమెట్ల సమాజానికి నిలువెత్తు రూపం గద్దలాడతండాయి”3) అనే శీర్షికతో ఉన్న ఆ వ్యాసంలో చంద్రశేఖర్‌ రెడ్డి గారు నవలని చక్కగా విశ్లేషించారు. ఈ వ్యాసం చదివి, నవలని చదివితే నవలపైనా రచయితపైనా కొన్ని సందేహాలు, ప్రశ్నలు పాఠకునికి కలుగుతాయి.

బి) నవల్లో ప్రస్తావితమైన సమస్యలకు రచయిత పరిష్కారాలు చూపించాడా? అనేది దీనిని చదివినవాళ్ళకు వచ్చే మొదటి సందేహం. నిజమే గద్దలాడతండాయిలో చిలుకూరి దేవపుత్ర గారి ‘పంచమం’లో లాగా, ‘అద్దంలో చందమామ’లో లాగా చైతన్యం ఉన్న పాత్రలు గానీ, ఉద్యమించిన పాత్రలు గానీ లేవు. “స్కూలు అయ్యవారిలో కొంచెం చైతన్యం ఉన్నా అతడు అనుభవం చాలని పిల్లయ్యవారు. ‘‘ఎంత కష్టం జేసినా కడుపు కోసరమే కదా, అయ్యవారూ!, కడుపు నిండినంక యాల కష్టపడల్ల?’’4). (గద్దలాడతండాయి మార్మిక సంకేతాల హెచ్చరిక, వ్యాసం, కవిత శ్రీ)

సి) రచయిత మాదిగల భౌతికవాద తాత్వికత ముందు అతడు డంగైపోతుంటాడు. ఆర్‌.డి.టి. వాలంటీరుగా పల్లెల్లో చైతన్యం తీసుకురావడానికే వచ్చిన చలపతి స్ర్తీవ్యామోహంలో పడి కొట్టుకుపోతాడు. అతడు చైతన్యం తీసుకు వచ్చే దిశగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు కూడా రచయిత చూపలేదు. ఆ ప్రయత్నాలు ఆచరణలో ఇలా వ్యక్తిగత బలహీనతలవల్ల విఫలం చెందుతాయి అని చూపడానికే రచయిత పరిమితమయ్యారు. ఇక్కడ అది గమనించాల్సివుంది.

డి) ఈ నవల ఉద్దేశం దాని పేర్లోనే ఉంది. ఎదురుగా నిలబడి దోచుకుంటూ ఉండి కూడా కనిపించని సమస్యని దాని చీకటి ముడులు విప్పి వేలెత్తి చూపడమే దాని పని. జాగర్త అని హెచ్చరించడమే దాని కర్తవ్యం. ఆ ఆడుతున్న గద్దల బారిన పడకుండా తన పిల్లల్ని కాచుకోవడం వాటి తల్లికోడి పని. వాటి యజమాని పని. రచయిత ఈ నవల్లో ఏ సామాజిక వర్గం వైపూ పూర్తిస్థాయిలో మొగ్గిన దాఖలాలు కూడా లేవు. నిమ్మకు నీరెత్తినట్లు కనబడ్డారు. అటు ఆధిపత్య కులాలదైన సంపన్న వర్గానికీ, ఇటు అట్టడుగు వర్గానికీ చెందని రచయితల్లో ఇలాంటి బహుళతాత్వికమైన ఊగిసలాట సహజమే.

ఇ) 1984, 85 ప్రాంతాల్లో పెద్ద కులాలవాళ్ళు, అధికారులూ దళితుల పట్ల ఈ నవల్లో మాట్లాడుకున్నంత పచ్చిగా మాట్లాడతారా? అనేది మనకు కలిగే రెండవ సందేహం. దీనికి 1984, 85 కాదు కదా, ఎస్సి ఎస్టి అట్రాసిటీస్‌ చట్టంపై గొప్ప చైతన్యం వచ్చి, దాని వినియోగ దుర్వినియోగాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ కాలంలో ఈ 2020, 21ల్లో మన పల్లెసీమలకు పోయినా కూడా సమాధానం దొరుకుతుంది. చలపతి కట్నం సంగతి మరిచిపోయి జయమ్మని లేపుకుపోవడం ఎలా కుదురుతుంది? అనేది పాఠకునికి సందేహం కలిగించే మరో సంఘటన. దీనికి సమాధానం సులభంగానే ఊహించుకోవచ్చు. తండ్రి వద్ద దెబ్బలు తిన్న జయమ్మ ఆవేశంలో చలపతి వద్దకు పోయి తను వట్టి మోసకారి అనీ, కట్నాన్ని తప్ప తనను చూడ్డం లేదనీ ఎనెన్నో నిందలు వేసుంటుంది. తన నిజాయితీని నిరూపించుకోడానికి ఆ ఆవేశంలో చలపతి జయమ్మని లేపుకుపోయాడు. ఇది చాలా ప్రేమ వ్యవహారాల్లో జరిగేదే. నిత్యం పేపర్లో వచ్చేదే. విమర్శకులతో బాటు పాఠకులు కూడా దీన్ని పసిగట్టగలంతటి గడుసర్లే అని రచయిత భావించాడు. అందుకే దాన్ని వాచ్యం చెయ్యలేదు.

ఎఫ్) వెంకటేశులు భార్య రాములమ్మ శంకరరెడ్డికి లొంగిపోయినట్లు చెప్పడం, లింగప్ప కోడలు గౌరమ్మ అత్తమామలు, మొగుడు బాధపడలేక బళ్లారిలో డ్రైవర్‌ తో లేచిపోయిందని చెప్పడం కథలో ఎంతో అవసరం. కాని వడ్డె లింగప్పకు ఈడిగ రంగమ్మకు మధ్య ఒక గడ్డిమోపు కోసం వివాహేతర సంబంధం కల్పించడం ద్వారా రచయిత ఏ నైతిక విలువల్ని ప్రతిపాదించదలచుకున్నాడు? అనేది పాఠకుని వచ్చే మరో సందేహం. ఈడిగ రంగమ్మ లింగప్పతో సంబంధం పెట్టుకోవడంలో చాలా అవసరాలున్నాయి. లింగప్పతో సంబంధం వల్ల గడ్డికట్ట లాభంగా వస్తుంది (ఒక్కటి కాదు రోజుకొక్కటి). చాలా చిన్నదే ఐనా కరువు కాలంలో అది ఎంతో ప్రయోజనం. రంగమ్మ భర్త ప్రవాసంలో ఉన్నాడు. లింగప్ప భార్య ప్రవాసంలో ఉంది. అందువల్ల రంగమ్మకే కాకుండా లింగప్పకు కూడా శారీరకావసరం ఉంది. ఇది అసలు కారణం.

ఇంతకన్నా పెద్దదైన సాహిత్యావసరం ఒకటి రచయితకున్నది. దీని ద్వారా సీమ బతుకుల్లోని న్యూనస్థితిని సూచించవచ్చు. దానితోనే ముందు ముందు నాగేంద్రప్ప లాంటి గద్ద చేతిలో లింగప్ప లాంటివాడు కోడిపిల్లై ఐదువందలు అప్పనంగా ముట్టజెప్పి బలి కావడాన్ని కథనం చెయ్యొచ్చు. అందువల్ల నవల్లో రంగమ్మ రంకు వ్యర్థం కాదు. అనర్థం అంతకన్నా కాదు. నవలకు ఉన్న ఆయువుపట్టుల్లాంటి అనేక సంఘటనల్లో ఇదీ ఒకటి. నాగేంద్రప్ప చెయ్యని నేరానికి అపరాధం వసూలు చేసి తన్నుకుపోయిన ఈలగద్ద లింగప్ప ఐతే, ఆ గద్దని ఆడించిన నెఱజాణ రంగమ్మ. అది నిజమైన నెఱజాణతనం కాదు. అది కరువు బతుకుల్లోని ఒక నిస్సహాయతలోంచి, ఒక అనివార్యతలోంచి పుట్టుకొచ్చింది. అందుకే రంగమ్మ చావు దెబ్బలు తిని అభాసుపాలయ్యింది. తనూ తన మొగుడు శీనప్పా సిగ్గూశరం లేని లండబతుకు బతకాల్సి వచ్చింది. ఇలాంటివి చూడ్డానికి ఆభాసాలుగా కనబడుతున్నా అవి సీమబతుకుల్లో భాగమై ఉన్నాయి. అవి అనుక్కోకుండా రచయిత దృష్టిలో పడుతున్నాయి. అందుకే స్వామి రచనల్లో చిన్నచిన్న అవసరాలకోసం చేలగట్లలో, గడ్డివాముల్లో, ధాన్యపు గరిసెల్లో కొంగు పరచిన నిస్సహాయ స్ర్తీల ఉదంతాలు తరచుగా కనబడుతుంటాయి.

రచయిత తన తాత్త్విక దృక్పథాన్ని ఎందుకు బయట పెట్టలేదు? తాను ఏ పాత్రలోనూ కనబడకుండా ఎందుకు అంత అంతర్ముఖీనం అయ్యాడు?”5) (మన నవలలు కథానికలు) 

అనే ప్రశ్నలు కూడా సందిగ్థావస్థలో పడేస్తాయి. ఐతే ప్రభుత్వం నిమ్నకులాలకు చేసే సాయంపై విభిన్న కులాలవాళ్ళు వ్యక్తం చేసే అభిప్రాయాల్లో రచయిత ఉన్నాడు. ప్రభుత్వ సబ్సిడీ సొమ్ము తినడంలో ‘‘తిక్కోని పెండ్లిలో తినిండేవాడే బుద్థిమంతుడు’’ అంటూ శంకర్‌ రెడ్డి లాంటి రెడ్లు,

‘‘సర్కారు సైడు మాదిరి నాలుగు ఎకరాలు ఉన్నోల్లంతా లక్షాధికారులు కారు’6) 

అని నాగేంద్రప్ప లాంటి బీసీలు చెప్పుకునే సమర్థనల్లో ఉన్నాడు. బావులు బోర్లు నీళ్ళు లేక ఎండిపోవడంపై, ప్రభుత్వం బి.టి. ప్రాజెక్టు కట్టిన ఉద్దేశంపై, వాన రాకడపై, కరువుపై, కూలివలసలపై, అడవులు తరిగిపోవడంపై, జంతుజాలం కనుమరుగైపోవడంపై చేసే చర్చల్లో ఉన్నాడు.

“పొలాలు తోటలూ కలిగి ఉండడం, సేద్యాలు చెయ్యడం, అవి గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకోవాల్సి రావడం లాంటి బాదరాబందీలు లేకుండా ఎప్పటికప్పుడు కూలి చేసుకుని ఉన్నంతలో తింటూ నిమ్మలంగా బతకడం అలవాటుగా ఆచారంగా చేసుకున్న మాదిగల తాత్వికత లో రచయిత తాత్విక దృక్పథం ఇమిడి ఉంది”7) 

దాన్ని అర్థం చేసుకుని తమ ఉద్యోగాల్ని నిలుపుకోవడం కోసం హరిజనుల్ని బలవంతంగా చదివించి పాడు చెయ్యరాదు అనుకొన్న స్కూలు అయ్యవారులో రచయిత దాగి ఉన్నాడు. రెడ్లు చేసే రాజకీయాల్లో వారి కనుసన్నల్లో జరిగే ఎన్నికల ప్రక్రియని వర్ణించడంలో రచయిత వ్యంగ్య తాత్వికత దృశ్యమానం అవుతున్నది. రైతు పండించిన పంటల ధరలపై జరిగే చర్చల్లో రచయిత కనబడుతున్నాడు. రైతుకు లాభించని పంటలు వ్యాపారులకు ఎలా అంతలేసి లాభాలు తెచ్చిపెడుతున్నాయి? అని చేసే తర్కాల్లో కనబడుతున్నాడు. రెడ్ల ఆధిపత్యంపై బోయల్లో జరిగే చర్చల్లో ముఖ్యంగా భీమన్న మాటల్లో కనబడుతున్నాడు. రచయిత తత్వానికీ అతడు బహిర్గతం కావడానికీ ఇంతకన్నా సాక్ష్యాలు అవసరం లేదు.

జీ) “ నవల చివర్లో జయమ్మ శవం పిల్లను ప్రసవించినట్లు చెప్పడం ద్వారా రచయిత ఏమి చెప్పదలచుకున్నాడు? ఆ సంఘటనతో నవలను ముగించాడంటే రచయిత దృష్టిలో దానికి చాలా ప్రాముఖ్యత ఉండాలి కదా! మరి దానిని ఎందుకు ఎస్టాబ్లిష్‌ చెయ్యలేదు? అన్న సందేహం పాఠకునికి తప్పకుండా కలుగుతుంది”8) 

కానీ దాని వెనుక ఒక నిగూఢమైన మర్మికార్థం దాగి ఉంది. అదే ఈ నవలకు ఆయువుపట్టు. అదే ఈ నవల ఇచ్చిన సందేశం. ఎలా అంటే... అంతకు మునుపు కథ మధ్యలో వెంకటేశులు నాటిన వంగచెట్లు విత్తనాల వ్యాపారి చేసిన మోసం వల్ల చిన్న చిన్న గోలీకాయల్లాంటి కాయల్ని కాసి అతనికి తీరని నష్టం కలిగించాయి (వాటిని ‘కుక్కమూతి పిందెలు’ అంటారు). అది అతని వ్యక్తిగత నష్టమే ఐనా దేశంలోని రైతులందరికీ వెంకటేశులు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇక ఇక్కడ కథాంత ఉదంతంలో జయమ్మలోని ‘జయ’ శబ్దాన్ని తీసుకుంటే దానికి భారతం అని అర్థం. జయమ్మ తన తండ్రికి సమ్మతం కాని వాడితో లేచిపోయి, గతిలేక ఇంటికి తిరిగివచ్చి కన్నది వికృతమైన బిడ్డని. ఆ చచ్చిన పిల్ల కోసం కూడా పల్లెపై గద్దలు ఆడుతూ ఉన్నాయి. బడుగువర్గాల అభ్యున్నతి కోసం ప్రజా సమ్మతి లేకుండా దేశస్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు అన్నీ క్షేత్రస్థాయిలో

"చిత్తశుద్ధి లేని యంత్రాంగం వల్ల శవం పిల్ల వంటి వికృతమైన ఫలితాలనే ఇస్తున్నాయని ఆ వికృతమైన ఫలితాన్నీ కూడా తన్నుకుపోవడానికి అసాంఘిక శక్తులు కాచుకొని ఉన్నాయి అప్రమత్తంగా ఉండాలి"9)

అని స్వామి హెచ్చరిస్తున్నారు. ఇదీ చరమార్థం. జయమ్మ పేరు వెనుక ఇంత మార్మికార్థం దాగుందా? దాన్ని రచయిత ఉద్దేశపూర్వకంగానే పెట్టారా? లేక అది యాదృచ్ఛికంగా జరిగిందా? అనేది రచయితకే తెలియాలి. ఐనా మనకు దానితో పనిలేదు. అది అలా జరిగింది. అది ఇచ్చిన మిగతా అంతర్లీనమైన సందేశం అక్షరాలా వాస్తవం. కథాస్థలం పేరు పాపంపల్లె కాబట్టి దాని పాపం పండి జయమ్మ కనిన శవంపిల్లతో ఇక రాబోయే అనర్థాలకు ముందస్తు అపశకునంగా కూడా సంప్రదాయవాదులు భావించవచ్చు. ఇలాంటి కళాత్మకమైన వస్తు శిల్పాల్ని రచయితలు కథనంలో అంతర్లీనం చెయ్యడం, వాటిని విమర్శకులు గుర్తించి వెల్లడి చెయ్యడం కొత్త కాకపోయినప్పటికీ శ్రీరామకవచం సాగర్‌ వాటిని ‘ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు’ అని ప్రతిపాదిస్తూ ఒక విమర్శా గ్రంథం రాశారు. వారి ప్రతిపాదనని మనసారా స్వాగతిద్దాం.

3 ముగింపు:

ఈ నవలలో రైతులు మాట్లాడిన మాటలే ఇప్పుడు రాయలసీమ అస్తిత్వ వాదానికి నినాదంగా మారాయి. నవల ఆత్మే కాదు రచయితగా సామాజిక కార్యకర్తగా స్వామి ఆస్తిత్వం కూడా ఇక్కడే ఉంది. “నేను రాయలసీమ వాడ్ని కాకపోతే ఈ నవలను అస్సలు రాసేవాడిని కానుగాక కాను”10) అని అంటారు బండి నారాయణస్వామి. 

నీటి సమస్య మాత్రమే కాదు స్థూలంగా దేశంలో, సూక్ష్మంగా సీమ నేలపై పార్లమెంటరీ రాజకీయాల్లోని కుల సమీకరణలను రచయిత లోతుగా అర్థం చేసుకున్నాడు. దాదాపు 35 సంవత్సరాల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెసుని సినిమా చరిస్మాతో మట్టికరిపించి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో నవల మొదలవుతుంది. తొలిసారి కాంగ్రెసేతర పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక రాజకీయాల్లో వస్తున్న మార్పులు అధికారం చుట్టూ తిరిగే పార్టీ ఫిరాయింపులు అందుకు కారణం అవుతున్న భిన్న పోలరైజేషన్లు ఓటు బ్యాంకు గుణాంకాలు అన్ని నవలల్లో సహజంగా చోటుచేసుకున్నాయి. సంక్షేమ కార్యక్రమాలలో, పాలన వ్యవహారాల్లో వచ్చిన మార్పులు భిన్న సందర్భాల్లో చర్చకు వస్తాయి.

మార్పు మంచిదే అనే బుద్ధి జీవులు కూడా కొందరు భావించారేమోగానీ ఊళ్ళల్లో, పరిస్థితుల్లో మార్పు ఏమీ లేదు. ముఖ్యంగా కులాధిపత్యాలు అణిచివేతలు అధికారుల అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలు అయ్యాయి. రాయలసీమ స్థలం కాల పరిమితులకు లోబడి నవల అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాతిక 30 సంవత్సరాల తర్వాత కొన్ని ఆలోచనలు అర్థరహితంగా అనిపించవచ్చు.

సంఘటనలు, సందర్భాలు, సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు వాటి లోతులు రాయలసీమ పాఠకులకు సైతం అప్పుడు ఇప్పుడు ఒకేలా గోచరించాలనేం లేదు. ప్రతి పాఠకునికి ఈ పరిమితులు ఉంటాయి అయితే జీవితం పట్ల రచయిత ధార్మికత రచన శిల్పం పై ఆ రచనని స్థలకాన్ని అధిగమించి సార్వ కాలినం సార్వజనేనం చేస్తాయి. రచయిత ప్రాపంచిక దృక్పధం అందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. అది సూటిగానో సూచ్చంగానో వాచ్చంగానో పాఠ్యంలో వ్యక్తం అవుతుంది. రాయలసీమ ప్రాంతంలో రాజకీయ కుల కరువు విషయాలను కొన్నింటిని గూడంగా దాచి నవల రాసినప్పటికీ కొన్నింటిని పరిశోధించి విశ్లేషించానని అభిప్రాయపడుతున్నాను.

4. పాదసూచికలు:

  1. బండి నారాయణ స్వామి, గద్దలాడతండాయి, భాగం23, పుట. 103
  2. బండి నారాయణ స్వామి, గద్దలాడతండాయి, భాగం23, పుట. 105
  3. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, నిచ్చెన మెట్ల సమాజానికి నిలువెత్తు రూపం గద్దలాడతండాయి వ్యాసం ఈనాడు పత్రిక, పుట ఎడిటోరియల్, 2019.
  4. కవితశ్రీ, గద్దలాడతండాయి మార్మిక సంకేతాలు హెచ్చరిక వ్యాసం, ఆంధ్రజ్యోతి ABN, అంతర్జాలం.
  5. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, మన నవలలు కథానికలు విమర్శ గ్రంధం పుట. 26
  6. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, మన నవలలు కథానికలు విమర్శ గ్రంధం పుట. 28
  7. వల్లంపాటి సుబ్బయ్య , నవలా శిల్పం, పుట. 48
  8. సత్య రెడ్డి బాల రామయ్య, గద్దలాడుతుండై రథశిల్పం, భాగం8, పుట. 88
  9. బండి నారాయణస్వామి, నా ఆలోచన వ్యాసం, భావవీణ జూన్ 2021
  10. బండి నారాయణ స్వామి, గద్దలాడతండాయి నవల నామాట, పుట. 43.

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కనకలింగేశ్వరరావు, బందా. (2015). AIR రేడియో ప్రసారం, హైదరాబాద్.
  2. కవితశ్రీ. (2021). గద్దలాడుతుండాయి. మార్మిక సంకేతాల హెచ్చరిక. జనవరి 1, ఆంధ్రజ్యోతి ABN.
  3. కాటంరెడ్డి, రామలింగారెడ్డి. (2014). తెలుగు అధ్యాపక విజయం. అక్షర తెలుగు కోచింగ్ సెంటర్, కర్నూల్.
  4. చంద్రశేఖర్ రెడ్డి రాచపాలెం, (2018). మన నవలలు కథానికలు. విశాలాంధ్ర పబ్లికేషన్స్(న్యూ ఎడిషన్). విజయవాడ.
  5. నాగయ్య, జి. (1995). తెలుగు సాహిత్య సమీక్ష. ద్వితీయ సంపుటము. నవ్య పరిశోధక ప్రచురణలు, హైదరాబాద్.
  6. నారాయణస్వామి, బండి. (2022). గద్దలాడతండాయి. అన్వీక్షికి పబ్లికేషన్స్, హైదరాబాద్.
  7. రామకృష్ణ రెడ్డి, దేవిరెడ్డి. (2017). తెలుగు సర్వస్వం. పెన్నేటి పబ్లికేషన్స్, కడప.
  8. శాస్త్రి, ద్వానా. (2019) తెలుగు సాహిత్య చరిత్ర. ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్.
  9. సత్యనారాయణ మన్నె,(2011) మాలిక పత్రిక, ఆగస్టు 11.
  10. సుబ్బయ్య వల్లంపాటి (2021) నవలా శిల్పం. నవ చైతన్య పబ్లికేషన్, విజయవాడ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]