AUCHITHYAM | Volume-04 | Issue-10 | September 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. “విముక్త” కథలో ‘ఊర్మిళ’ పాత్రచిత్రణ: విశ్లేషణ
డా. రామరాజు మాధవీలత
అస్సిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్
వెలగపూడి, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 8374810111, Email: ramarajumadhavilatha2@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఓల్గా రాసిన “విముక్త” కథలో ప్రధానపాత్ర అయిన ఊర్మిళ మనోగతాన్ని, ఆ పాత్రచిత్రణ ద్వారా పురాణ స్త్రీల ఉన్నత భావాలను రచయిత్రి చిత్రించిన విధానాన్ని విశ్లేషించడం ఈ వ్యాసలక్ష్యం. సీతాదేవికి దిశానిర్దేశం చేయగలిగే ఔన్నత్యాన్ని 14 సంవత్సరాల సుదీర్ఘసంఘర్షణతో ఊర్మిళ పొందగలిగిందని ఊహా ప్రతిపాదన. ఇందుకోసం మన పురాణాలలో ఊర్మిళ పాత్రకు దక్కిన పరిధిని, స్త్రీల పాటల్లో ఆమె సుదీర్ఘ నిద్రని వర్ణించిన వైనాన్ని పరిశీలించి, విముక్తకథలో ఆమె తపోదీక్షతో తన ఆవేదనను, ఆగ్రహాన్ని ఎలా జయించి విముక్తురాలయ్యిందో ఈవ్యాసం చర్చిస్తుంది. చివరగా ఊర్మిళ పాత్ర తెలుగు సాహిత్యంలో మరుగున పడిపోయిన ఒక ఆదర్శవంతమైన స్త్రీ పాత్రగా, నేటి తరానికి సైతం స్ఫూర్తివంతమైన పాత్రగా నిరూపించటం ఈ వ్యాసోద్దేశం.
Keywords: కథాసాహిత్యం, చిత్రణ, పురాణం, స్త్రీపాత్ర, ఊర్మిళ, ఆధునికకథలు, ఓల్గా.
1. విముక్తకథాసంపుటి – కథావస్తువు:
ఓల్గా రాసిన విముక్త కథాసంపుటి 2015 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. ఇందులో సమాగమం, మృణ్మయనాదం, సైకతకుంభం, విముక్త, బంధితుడు కథలు ఉన్నాయి.
“విముక్త” కథాసంపుటిలోని కథలు రామాయణ కథానేపథ్యంలో నడిచేవి. రామాయణంలోని ప్రధానమైన ఐదు స్త్రీ పాత్రలయిన సీత, ఊర్మిళ, అహల్య, శూర్పణఖ, రేణుకలను కేవలం పాత్రలుగా కాకుండా, వారిలోని అంతర్లీన భావ ప్రకంపనల్ని స్పృశిస్తూ రచించిన ఈ కథలన్నింటిలో 'సీత' ఒక ప్రధానమైన భావన. ఈ మూల భావనతోనే పురాణ కథలను తీసుకొని స్త్రీవాద దృక్కోణంతో మాత్రమే గాక, వారి అంతఃసంఘర్షణను ఒక మానసిక శాస్త్రవేత్తలాగా సవివరంగా విశ్లేషించి, ఆ పాత్రను సునిశితంగా రూపొందించటం ఓల్గా ప్రత్యేకత.
పౌరాణిక పాత్రల్లోని
ఉదాత్తత, సహనశీలత, సంపూర్ణత, వారి జీవితాల్లోని ఆయా సందర్భాల్లో వారనుభవించిన మౌన సంఘర్షణ లోంచి
రూపుదిద్దుకున్న వాస్తవ జీవితాలకు ఈ కథలు ప్రతీక. సామాజిక కట్టుబాట్లు, నైతిక, నిర్దేశిక సూత్రాలననుసరించి
పితృస్వామ్య ఆధారిత భారతీయ సనాతన కుటుంబ వ్యవస్థ తన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఆదేశిక సూత్రాల
అంతర్వాహినియే ఆయా పాత్రల గుణగణాలుగా రచయిత్రి కథలను తీర్చిదిద్దారు.
2. విముక్తకథ
– ప్రత్యేకత:
విముక్త కథ వర్తమానసమాజంలో స్త్రీల వేదనలకు
ప్రాతినిధ్యం వహించే కథ. ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ, అవమానలకూ, హింసలకూ గురై, వాటినధిగమించి లేస్తున్న
స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలు
మరికొందరు.
3. విముక్త కథ – ఊర్మిళపాత్రవైశిష్ట్యం:
అందులో ప్రత్యేకంగా విముక్తకథలోని ‘ఊర్మిళ’ పాత్రను విశ్లేషించినపుడు విలక్షణ వ్యక్తిత్వం, ఉన్నత భావాలూ గల ఒక రాణి వాసపు స్త్రీ జీవన అంతర్మధనం గుర్తించవచ్చు. తమను హింసించే భర్తల నుండి విముక్తం కావాలనే స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తునే, అసహ్యించుకుంటునే వారిని గట్టిగా పట్టుకునే స్త్రీలు, ద్వేషంతో తమను తాము హింసించుకోడం అలవాటైన స్త్రీలు, మొత్తానికి సమాజంలో స్త్రీలందరి అస్తిత్వ వేదనలు ఊర్మిళ పాత్రలో ప్రతిబింబిస్తున్నాయి.
4. ఓల్గా
గారి ఊర్మిళ:
ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు. వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు తమ స్త్రీల పాటల రూపంలో దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది. కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు. అలా ఒంటరిగా వదిలివేయబడ్డ ఊర్మిళా, అడివికి వెళ్ళిపోతున్న లక్ష్మణుడూ ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకిస్తాడు. ఊర్మిళ తన మెలకువని లక్ష్మణుడికిస్తుంది. తన భర్త అడివిలో ఉన్న పధ్నాలుగేళ్ళూ ఊర్మిళ నిద్రపోతుంది. లక్ష్మణుడు ఆ పధ్నాలుగేళ్ళూ పూర్తిగా మెలకువగానే ఉంటాడు. ఊర్మిళ భర్తృవిరహాన్ని అనుభవించనక్కర్లేకుండా, లక్ష్మణుడు తన భార్య జ్ఞాపకాన్ని మరిచిపోనక్కర్లేకుండా ఈ చమత్కారమైన ఊహ చేశారు తెలుగు ఆడవాళ్ళు. ‘ఊర్మిళ దేవి నిద్ర’ పేరుతో రాసిన పాటను పాఠశాల స్థాయి తెలుగు వాచకంలో పొందుపరిచారు. ఎలాంటి విషాదం లేకుండా భర్త తిరిగివచ్చే వరకు నిద్రాదేవి వొడిలో సేదతీరే ఉర్మిళ మాత్రమే పరిచయమైన పాఠకులకు ఒక విశిష్ట వ్యక్తిత్వాన్ని సుదీర్ఘ అంతర్మధనం తరువాత పొంది సీతాదేవికి సైతం ప్రేరణగా నిలిచిన వినూత్న ఉర్మిళను ఓల్గా పరిచయం చేసారు.
పధ్నాలుగేళ్ల వనవాసాన్ని, అనేక కష్టాలను దాటి
అయోధ్యకు తిరిగి వచ్చిన సీతారామలక్ష్మణులను స్వాగతించటానికి అంతఃపురమంతా కదలి వచ్చింది ఒక్క ఊర్మిళ తప్ప.
అటువంటి సమయంలో ఊర్మిళ కోసం సీత ఎంతగానో ఆరాటపడుతూ వెతుకుతుంది. ఎక్కడా ఆమె జాడ దొర్కకపోగా, వారు అడవికి
వెళ్లాక ఊర్మిళ ఎవరికీ కన్పించలేదు. తన మందిరంలోంచి బైటికి రాలేదు. ఎవరినీ లోపలకు రానివ్వలేదని తెలిసి
ఆవేదనకు గురవుతుంది జానకి. తమతో పాటు లక్ష్మణుడిని తీసుకునివెళ్ళి తప్పు చేసామేమో అని బాధతో వనవాసంలో ఊర్మిళ
ప్రస్తావన తెచ్చినప్పుడు మౌనం వహించిన లక్ష్మణుడు, తనను సముదాయించి రాణీవాసపు స్త్రీ యొక్క బాధ్యతలను ఊర్మిళ
నిర్వహించాలని చెప్పిన రాముడి మాటలను గుర్తుకు తెచ్చుకుంటుంది. చివరకు ఎలాగైనా ఉర్మిళను కలవాలని ఆమె
మందిరానికి స్వయంగా వెళుతుంది.
5. ఊర్మిళ పాత్రచిత్రణ - విశ్లేషణాత్మక అంతర్మధన౦:
తనకు తెలిసిన సహోదరిగా కాక వినూత్న వర్ఛస్సుతో, తనకంటే మానసికంగా ఎదిగిన ఉర్మిళను చూసి విస్తుపోతుంది సీత. ఊర్మిళ గడచిన జీవితాన్ని గురించి సీత అడిగిన ప్రశ్నలకు ఊర్మిళ ఇచ్చిన సమాధానాలు ఆమె అనుభవించిన సంఘర్షణను, ఆమె పడిన వేదనను చివరగా ఆమె పొందిన మనోవికాసాన్ని తెలియచేస్తాయి.
తనను ఒక మనిషిగా గుర్తించకుండా, కనీసం తనతో మాట మాత్రం చెప్పకుండా అన్నా వదినల వెంట లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు ఊర్మిళ మొదట కోపంతో రగిలిపోయింది రగిలిపోయి ఆగ్రహంతో మందిరంలో తనను తాను బంధించుకున్నటు చిత్రించిన రచయిత్రి, స్త్రీ-పురుష సంబంధాల్లో అధికారం ఎవరిది అనేది ప్రధానంగా వచ్చే సమస్య అని, ఎవరి మీద ఎవరికి అధికారం ఉంటుంది అనే సమస్యను ఊర్మిళ ఈ పద్నాలుగు సంవత్సరాల్లో అన్వేషించి, జయించింది. తనలోని వేదననుండి మమతానురాగాలనే సుడిగుండాలనుండి విముక్తయ్యేందుకు పరితపిస్తుంది. అశాంతి, ద్వేషంతో రగిలిపోయే వాళ్ళకు ఊర్మిళ తనలోని శాంతిని, ఏకాంతంలోని గుట్టుని చెప్పాలనుకుంటుంది. తన జీవన సత్యాన్వేషణలో తనలో తనే తీవ్రంగా సంఘర్షణ పడుతుంది. సుదీర్ఘ మధనం అనంతరం భావ బంధాలనుండి విముక్తురాలవుతుంది.
“నీ జీవితంలో నాకొచ్చినటువంటి పరీక్షా సమయం వస్తే అప్పుడు ఆ పరీక్ష నిన్ను మామూలు తనంలోకి, మురికిలోకి నెట్టకుండా, ద్వేషంతో, ఆగ్రహంతో నిన్ను దహించకుండా, నిన్ను నువ్వు కాపాడుకో. నీ మీద అధికారాన్ని నువ్వే తీసుకో. ఇతరులపై అధికారాన్ని ఒదులుకో. అప్పుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు. మనకు మనం మిగలటమంటే మాటలు కాదక్కా!” [1] అని ఊర్మిళతో సీతకు చెప్పించడం వినూత్నంగా, ఆలోచనాత్మకంగా ఉంది.
ఊర్మిళ తన భర్తకు దూరమై పధ్నాలుగు సంవత్సరాలు తాను పడిన బాధ, బాధ వల్ల కలిగిన ఆగ్రహం, ఒంటరితనం వీటన్నింటినీ అధిగమించి తాను పొందిన తపశ్శక్తి తద్వారా కనుగొన్న సత్యాలను “విముక్త” కథలో ఎంతో గొప్పగా వివరించారు.
“అధికారం తీసుకోవడం, ఇవ్వడం అనవసర ప్రయత్నాలు. మనతో మనమే యుద్ధం చేయాలి, మనకు ఏది ప్రశాంతతను ఇస్తుందో అదే స్వీకరించాలి. నాది అనుకుంటే దూరమైన ప్రతిసారీ బాధ తప్పదు కానీ, నాకు నేనే నాలో నేనే అనుకుంటే ఎంతో ప్రశాంతత” [2] అని ఊర్మిళ సీతతో వనవాసానంతరం చెప్పిన ప్రతి అంశం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం.
అందుకే రాముడు తన పిల్లలను స్వీకరించాక తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసిన అవసరం లేకుండా పోయింది. తన ఇష్టం, తనకు ఏది కావాలో అదే చేసి చూపించింది సీత, అదీ శాంతస్మిత వదనంతో. ఎంతో తపస్సు చేస్తే తప్ప అంతటి నిగ్రహం రాదు కానీ ఊర్మిళ మాటలతో సీత దాన్ని సాధించగలిగినట్లుగా ఓల్గాగారు ఎంతో చక్కగా వివరించారు. ఊర్మిళ చేత చెప్పించిన మాటలు ఎవరు చదివినా, విన్నా ఎంతో శక్తి వస్తుంది. ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కోగల శక్తి లభిస్తుంది.
ఒక స్త్రీగా తన పరమావధి ఏమిటి? తాను తన జీవితాన్ని ఎలా మలచుకోవాలి? చిన్ననాటి నుండి తండ్రి అని, సోదరుడని, భర్త అని, కొడుకులని ఎవరి పంచన ఉంటే వారి వ్యక్తిత్వపు ఆలోచనలే తనవా? లేదా తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలా? అనే ప్రశ్నలు ఎంతమంది మహిళలకు వస్తాయి. వచ్చినా తనకంటూ సాధికారతను సాధించడానికి ఎందరు స్త్రీలు ప్రయత్నాలు చేస్తున్నారు? తరతరాలుగా స్త్రీ ఇలా ఉండాలి, అది చేయకూడదు, ఇది చూడకూడదు అని హద్దులు గీసి తన ఆలోచనలకూ, ఆచరణలకూ బంధాలు బిగించారు. వాటిని తొలగించి విశ్వంలోకి తొంగిచూసి తాను ఏది చేయాలో నిర్ణయాలు తీసుకునే అధికారం తనకే ఉంది అని చెప్పడమే కాక అందుకు చక్కని ఉదాహరణలుగా పురాణ స్త్రీలను, గారి చరిత్రలను ఆసరాగా తీసుకుని చక్కని కథలుగా అల్లి ప్రతి మహిళను చైతన్యపరచి, పరిమళించే విధంగా ఓల్గా విముక్త కథలు కొనసాగుతాయి.
సీత మహాసాధ్వి, శక్తిమంతురాలు, రాముని పట్టమహిషి. ఇలా చెప్తూ పోతే తనకు లేని గుణగణాలు, నైపుణ్యాలు కానరావు. విలువిద్య లో మేటి. అటువంటి శక్తివంతురాలు తనను తాను రావణాసురిడి నుండి కాపాడుకోలేదా? రాముని ఇచ్చిన మాట మీరేలేక అతని రాకకై ఎదురు చుసిన సీత, చివరికి రామునిచే పరిత్యజించబడి, ఒంటరిగా పిల్లలను పెంచేటప్పుడు మరోసారి ఉర్మిళను కలుస్తుంది. కలిసే ముందు చాలారోజులు ఊర్మిళ పొందిన విముక్తిని, ఆమె పాత్రలోని ఉన్నతి సీత అంతరంగంపై ప్రభావం చూపినట్లుగా రాయటం వలన ఊర్మిళ పాత్ర పొందిన ఔన్నత్యం పాఠకునికి మరింత సూక్షంగా అర్ధం అవుతుంది.
ఊర్మిళ సత్యాగ్రహమో, తపస్సో ఏదో చేసి తనను తాను కాపాడుకుంది. "అధికారాన్ని తీసుకో. అధికారాన్ని ఒదులుకో. అప్పుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు. మనకు మనం మిగలాలి” [3] ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఊర్మిళ ఈ మాటలే మళ్లీమళ్లీ చెప్పింది.
అవి తనకు ఊర్మిళ గురించిన అశాంతిని తగ్గించాయి. మరి ఇప్పుడు తన మాటేమిటి? తను సత్యాగ్రహం ప్రారంభించాలా? ఆగ్రహం తగ్గేదెప్పుడు? సత్యం బోధపడేదెన్నడు? రాముని మీద ఎనలేని అనురాగం. అయినా ఎప్పటికప్పుడు వియోగం. రాముడి నుంచి తనకు విముక్తి ఎప్పుడు దొరుకుతుంది? ఎలాంటి పరీక్ష ఇది? అగ్ని పరీక్ష ఏపాటిది దీనిముందు. తనకు యుద్ధవిద్యలన్నీ వచ్చినా ఎన్నడూ ఎవరిమీదా యుద్ధం చెయ్యలేదు. కాని ఇప్పుడు తనమీద తనే యుద్ధం చేసుకోవాలి.
భార్యలేకుండా రాముడు ఎలా యజ్ఞాన్ని చేస్తున్నాడో, తన స్థానాన్ని ఎవరైనా భర్తీ చేస్తున్నారేమో అనే దిగులుతో ఉన్న సీతని కలిసిన ఊర్మిళ, సీతకు దిశానిరేశం చేసే స్థాయికి ఆమె పాత్రను ఉన్నతంగా ఓల్గా తీర్చి దిద్దారు. ఆ సందర్భంలో;
“యాగం శ్రీరామచంద్రుడే చేస్తున్నాడా?'' అడిగింది సీత.
"మరెవరు చేస్తారు? చక్రవర్తులే గదా చెయ్యాలి.''
"నేను లేకుండా ఎలా -''
"ఆ
ప్రశ్న నీకెందుకు రావాలి? వస్తే రాముడికి రావాలి. యాగం చేయించే వారికి రావాలి. అనవసరమైన ప్రశ్నలతో అశాంతి
పడటం అవివేకం కదా?'' సీతకంటే పెద్దదానిలా పలికింది ఊర్మిళ.
"నీకు
తెలుసు. చెప్పు ఊర్మిళా రాముని పక్కన కూర్చునేదెవరు?''
"నేను నీకు
సమాధానం చెప్పి నీ అగ్నిని తాత్కాలికంగా చల్లార్చటానికో మరింత ప్రజ్వరిల్ల చేయటానికో రాలేదు. అనవసరమైన
ప్రశ్నలతో నిన్ను నువ్వు హింసించుకోవద్దని చెప్పటానికే వచ్చాను.'' అసలది నీ మనసులో ప్రవేశించనే వద్దు.
నువ్వు రాముడి నుంచి విముక్తం కావాలి.''
"ఊర్మిళా -'' సీత వెక్కి
వెక్కి ఏడ్చింది.
"ఎన్ని పరీక్షలు
ఊర్మిళా...'
"ప్రతి పరీక్షా నిన్ను రాముడి నుంచి విముక్తం
చెయ్యటానికే. నిన్ను నీకు దక్కించటానికే. యుద్ధం చెయ్యి. తపస్సు చెయ్యి. లోపలికి చూడు. నీవనే యధార్థం
కనపడేదాకా చూడు.''
"చాలా కష్టంగా ఉందమ్మా'' సీత గొంతులోంచి మాట
కష్టంగా వచ్చింది.
"చాలా హాయిగా కూడా ఉంటుందక్కా. ప్రయత్నించు మరి
నే వెళ్తాను'' ఊర్మిళ లేచింది.[4]
తనను రాముడు అడవులపాలు చేసిన తరువాత కూడా సీత రాముడిని తలచుకుంటోంది. అక్కడి పరిస్థితులను ఊహించుకుంటూ వేదన చెండితోంది. అది అనవసరమని, ప్రస్తుత స్థితినుండి పురోగమించడానికి నిన్ను నువ్వు తెలుసుకోమంటూ సీతకు మార్గం చూపించింది ఊర్మిళ.
ప్రయత్నిస్తే మనల్ని మనం తెలుసుకోవటం సులువైన విషయామేనని, పైగా అదే జీవన పరమార్ధమనే వాస్తవాన్ని తెలియచేసిన ఊర్మిళ మాటలను అనుసరించి, అప్పటివరకు బేలగా మాట్లాడిన సీత తదనంతరం రాముని నుండి వచ్చే ఆహ్వానాన్ని తృణప్రాయంగా తిరస్కరించగలిగే దృఢత్వాన్ని పెంపొందించుకున్నట్లు చూపుతూ కథను ముగిస్తారు రచయిత్రి.
ఊర్మిళ పాత్ర తనుపొందిన అస్తిత్వాన్ని, ధృడత్వాన్ని అంతిమంగా తమ ఉనికిని కాపాడుకోవడానికి తామే ప్రయత్నించాలనే దిశానిర్దేశాన్ని సీతతో పాటు స్త్రీలందరికీ అందించిందని గమనించవచ్చు.
6. ముగింపు:
తెలుగు సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన రచనలపై, పురాణాలపై, పాత్రలపై పున:కథనం చేయడమో, వాటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి రాయడమో కొత్త విషయం కాదు. ఆ రచయిత లేదా రచయిత్రిని బట్టి, వారి దృష్టికోణాన్ని బట్టి ఆ రచన కొత్త స్ఫురణలు తీసుకొస్తుంది.
తెలుగు కథల్లో పురాణ పాత్రలను ఆవిష్కారించటం కొత్త విషయం కాకపోయినప్పటికీ, సనాతన భావజాలానికి అతీతంగా ఈ పునఃసృజనలో ఓల్గా ఊర్మిళ పాత్రను నేటి స్త్రీలోకానికి ప్రతీకలాగ, పురాణ స్త్రీపాత్రలకు ఉన్న ఔన్నత్యాన్ని మరింత పెంచుతూ, ఆదర్శవంతంగా రూపొందించారని గ్రహిస్తూ, నిర్మోహత్వన్ని, నిశ్చల తత్వాన్ని ఒక సుదీర్ఘ సత్యాన్వేషణ ద్వారా పొందిన ఊర్మిళ పాత్ర పురాణాలలో దక్కని విశిష్టతను విముక్త కథ ద్వారా పొందిందని చెప్పవచ్చు.
7. పాదసూచికలు:
- విముక్త కథావిశ్లేషణ. ఆదివారం, ఆంధ్రజ్యోతి దినపత్రిక. హైదరాబాద్, 2010. పుట. 11.
- పైదే. పుట11.
- పైదే. పుట12.
- పైదే. పుట12.
8. ఉపయుక్తగ్రంథసూచి:
- --, --. విముక్త కథా విశ్లేషణ. ఆదివారం, ఆంధ్రజ్యోతి దినపత్రిక, హైదరాబాద్, 2010.
- --, --. సాహిత్య పీఠo పై కన్నీటి కెరటాల 'విముక్త' (వ్యాసం). వార్త తెలుగు దినపత్రిక, హైదరాబాద్, 28 డిసెంబర్ 2015.
- --, --. స్త్రీవాద ద్పక్పథానికి జాతీయ పురస్కారం (వ్యాసం). ప్రజాశక్తి దినపత్రిక, ప్రజాశక్తి పబ్లిషింగ్ హౌస్, 23 డిసెంబర్ 2015.
- నారాయణరావు, వెల్చేరు. ఊర్మిళా దేవి నిద్ర-ఒక ఆలోచన. ఈమాట - అంతర్జాల పత్రిక.
https://eemaata.com/em/issues/201201/1895.html, 2012. - లలిత కుమారి, పోపూరి (ఓల్గా). విముక్త కథలు. స్వయం ప్రచురణ, హైదరాబాద్, 2016.
- శ్రీలత, ఎం. విముక్త కథలు (వ్యాసం). భూమిక, హైదరాబాద్, 6 నవంబర్ 2018.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.