headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

26. ప్రబంధాలలో మానవరూపారోపణలు (ఆంత్రోమార్ఫిజం): ప్రాముఖ్యం

డా. తన్నీరు నాయబ్ రసూల్

తెలుగు అధ్యాపకుడు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాడేరు,
అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9490170661, Email: rasoolnt2@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ప్రాచీనసాహిత్యంలో మనుష్యపాత్రలతో పాటు జంతువుల, పక్షుల, నదుల, పర్వతాలపాత్రలు కూడా అధికంగా కన్పిస్తుంటాయి. అవి అచ్చం మనిషి ప్రవర్తన కలిగి, మానవ సంభాషణలు చేస్తూ, మనిషి మేధస్సుకు సమానమైన మేధస్సును కలిగిఉండే పాత్రలుగా కన్పిస్తాయి. మానవ భావోద్రేకాలను కలిగిఉండి మనిషిలాగే వ్యవహరించే జంతు, పక్షి మొదలైన పాత్రలు ఇతిహాస, పురాణ, కావ్య, ప్రబంధాలలో, జానపద కథల్లో, పంచతంత్రకథల్లోనూ ఇంకా అనేక రచనల్లో మనకు విరివిగా కన్పిస్తాయి. తెలుగు వారి ప్రత్యేకమనదగిన ప్రబంధాలలో ఎంపిక చేసుకున్న కొన్ని ప్రబంధాలలో ఈ జంతు, పక్షుల, నదుల, పర్వతాలపాత్రలను Anthropomorphism అనే ఆంగ్లసాహిత్యపద్ధతి ననుసరించి ఏవిధంగా చిత్రించారో పరిశీలించడం ఈ వ్యాసపరిధి. ప్రపంచంలోని అనేక దేశాల సాహిత్యాలలో జంతువుల, పక్షుల పాత్రలు అచ్చం మానవుడిలా వ్యవహరించే విధానం మనం చూడవచ్చు. కేవలం ప్రాచీనసాహిత్య లోనే కాదు ఆధునిక సాహిత్యంలోనూ ఈ విధమైన పాత్రచిత్రణ ఉంది. ముఖ్యంగా ఆంగ్లసాహిత్యంలో ఈ పద్ధతిననుసరించి విరివిగా రచనలు వెలువడ్డాయి. ప్రబంధాలపై అనేక పరిశోధనలు చేసిన వారు ఆయా ప్రబంధాలలోని జంతు పాత్రలను విశ్లేషణచేశారే కాని మానవరూపం (Anthropomorphism) అన్వయించి చర్చించడం పెద్దగా జరగలేదు. ప్రబంధాలలో జంతువులు, పక్షులు, పర్వతాలు, నదులు అచ్చం మనిషిలా ఎలా ప్రవర్తించాయో Anthropomorphism ను అన్వయించి తెలుసుకోవడాన్ని ఈ వ్యాసం చర్చిస్తుంది

Keywords: Anthropomorphism, మానవరూపం, personification, మానవీకరణ, ప్రబంధం

1. పరిచయం:

ఆంధ్రమహాభాగవతంలో ఎనిమిదవ స్కంధంలో గజేంద్ర మోక్షం ఉంది. మదించిన ఏనుగును నీటిలోని మొసలి పట్టుకుంటుంది.దానినుండి తప్పించుకోవడానికి ఏనుగు ప్రయత్నం చేసి చివరకు దైవ సహాయం కోరుతుంది.ఆ సహాయంతో మొసలి బారి నుండి బయట పడుతుంది.ఇందులో ఏనుగు దేవుడిని సహాయం చెయ్యమనే సందర్భాన్ని ఒక సారి పరిశీలిస్తే ఏనుగు మానవ సంభాషణలో దేవుడిని సహాయం అడుగుతుంది.ఇక్కడ మనకు కలిగే అనుమానమేమంటే ఏనుగు మనిషిలా ఎలా మాట్లాడింది.మనిషిలా దుఃఖించి,మానవ స్వభావమైన అనుమానం వ్యక్తం చేయడం మొదలైన విషయాలు ఏనుగు అచ్చం మానవుడిలా ప్రవర్తించినదని మనకు అర్థమవుతుంది.ఇలా సాహిత్యంలో మనుషులు కాని వాటికి మానవ లక్షణాలు ఆపాదించడం చాలా ఎక్కువగా కన్పిస్తుంటుంది.ఈ విధమైన విధానాన్ని “Anthropomorphism” అని అంటారు. తెలుగులో దీనిని మానవ రూపం అని అనవచ్చు.

“లావొక్కింతయు లేదు” (ఆ.మహా.భా.8-90) అనే పద్యంలో ఏనుగు తన దీనావస్థను తెలియజేస్తూనే రావే ఈశ్వర! కావవే వరద! మొదలైన మాటలతో అచ్చం మానవుడిలా అర్థించడం ఈ మానవ రూపంలో భాగంగానే జరిగింది. మానవలక్షణాలను జంతువులకు, వస్తువులకు, దేవుళ్ళకు ఆపాదించడం ఈ మానవ రూపం ప్రత్యేకత. ఈ Anthropomorphism Anthropos మరియు Morphe అనే రెండు గ్రీకు పదాల వల్ల ఏర్పడింది. Anthropos అంటే మనిషి Morphe అంటే రూపం. ఈ Anthropomorphism ప్రపంచంలోని అనేక సాహిత్య రచనల్లో మనం చూడొచ్చు. గ్రీకు పురాణగాథలైన ఇలియడ్, ఒడిస్సీ దగ్గరనుండి భారతీయ ఇతిహాస పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, జానపదకథలు, పంచతంత్రకథలు, కథాసరిత్సాగరం, చందమామ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు ఇంకా అనేక రచనల్లో మనం ఈ మానవ రూపాన్ని చూడొచ్చు.
ఆంగ్లసాహిత్యంలో కూడా ఈ Anthropomorphism చాలా విస్తృతంగా వాడడం జరిగింది. ప్రసిద్ది చెందిన Animal Form ఇందుకు ప్రధాన ఉదాహరణ. కొన్ని రచనల్లో పాత్రలన్నీ జంతువులే ఉండి మానవ లక్షణాలను ప్రదర్శిస్తాయి, మరికొన్ని రచనల్లో మానుషపాత్రలతో పాటు జంతువులు కూడా పాత్రధారులుగా ఉండి మనిషిలాగే ప్రవర్తిస్తాయి. అనేక ఆంగ్ల సినిమాలు ఈ సాహిత్య ప్రక్రియను ఆధారంగా చేసుకుని వస్తున్నాయి. యానిమేషన్ ద్వారా వచ్చే సినిమాలలో ఈ మానవ రూపాన్ని  చూడొచ్చు. ఇటీవల కాలంలో వచ్చిన Lion King ఇందుకు ఉదాహరణ.

కేవలం సాహిత్యగ్రంధాలలోనే కాకుండా మత సంబంధమైన గ్రంథాలలో కూడా ఈ  Anthropomorphismను విరివిగా వాడటం జరిగింది. అనేక మత గ్రంథాలలో దేవునికి ఈ మానవరూపాన్ని ఇవ్వడం మనకు కన్పిస్తుంది. మానవ అలవాట్లను, అభిరుచులను, మాటలను దేవునికి ఆపాదించడం ఈ మత గ్రంథాలలో ఉండే ఒక అసాధారణ అంశం. ఈ విధంగా మానవరూపం అనేక రచనల్లో వాడబడింది. ఈ మానవరూపం, ఆలంకారికంగా వాడే Personification రెండూ ఒకటే అనుకునే ప్రమాదం ఉంది. Anthropomorphism ఒక సాహిత్య విధానంకాగా, Personification ఆలంకారికభాష. Personificationలో మానవ మాటలను ఉపయోగించడం ఉండదు. Anthropomorphism మానవరూపంకాగా Personification మానవీకరణ.

2. ప్రబంధాలలో మానవరూపారోపణలు:

ఈ Anthropomorphism మన తెలుగు సాహిత్యంలో కూడా చాలా విరివిగా చోటు చేసుకుంది. అనువాద రామాయణ, భారతాలలోనూ, అనువాద పురాణాలలోనూ, అనువాద, తెలుగు కావ్యాల్లోనూ, ప్రబంధాలలోనూ, జానపదకథల్లోనూ ఈ మానవరూపాన్ని మనం చూడొచ్చు. తెలుగు సాహిత్యపు ప్రత్యేక రచన ప్రబంధాలలో ఈ మానవరూపంను చాలా ఎక్కువగా చూడొచ్చు. మొదటి ప్రబంధమైన మనుచరిత్ర నుండి, ఆతర్వాత విస్తృతంగా వెలువడిన అనేక ప్రబంధాలలో మనకు ఈ మానవ రూపం కనబడుతుంది.ఈ మానవ రూపాన్ని ఎంతగా ఉపయోగించారంటే ప్రధానకథకు అత్యంత ప్రధానమైన మలుపుగా, కథాకథనంలో ముఖ్యమైన ఘట్టంగా వాడుకున్నారు. ఈ మానవరూపం ఉన్న ఘట్టాలను, సన్నివేశాలను తొలగిస్తే మొత్తం ప్రబంధం పేలవంగా మారిపోతుంది. అందుకనే ప్రబంధకవులు ఈ మానవరూపాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని కథా సంవిధానాన్ని పరిపుష్టం చేశారు. ప్రబంధకారులు ఎక్కువగా పక్షులను, నదులు, పర్వతాలను, అడవి జంతువులను ఉపయోగించి ఈ మానవరూపాన్ని సాధించారు. దేవుని పాత్రలకు సైతం ఈ మానవ రూపాన్ని ఇవ్వడం ప్రబంధాలలో కన్పిస్తుంది. ప్రబంధాలలో ఈ మానవరూపంను ప్రధానంగా చేసుకుని ప్రబంధాన్ని నిర్మించారో, ఆ మానవరూపం  కథకు ఎంతటి కీలక మలుపో కొన్ని ప్రబంధాలను పరిశీలించి తెలుసుకుందాం.

2.1 మనుచరిత్ర: 

మనుచరిత్రలో అల్లసాని పెద్దన కొన్ని జంతు పాత్రలను ప్రవేశపెట్టి వాటికి మానవరూపం ఇవ్వడం మనం గమనించవచ్చు. స్వరోచి, మనోరమ మొదలైన భార్యలతో కూడి విహరిస్తూ ఒక సరస్సు చెంతనున్న ఉద్యానవనంలోకి వెళ్లి విహరిస్తుంటాడు. సరస్సులో హంసలు, చక్రవాకాలు విహరిస్తుంటాయి. స్వరోచి తన ముగ్గురు భార్యలతో కూడి ఉండటాన్ని చూసిన ఒక ఆడ హంస తనకు దూరంగా ఉన్న చక్రవాకాన్ని పిల్చి “పరికించితె యెంత తపంబొనర్చిరీ, యిందు నిభాస్యులుం బతియు నేకమతిం గవగూడి యుండఁగాన్” (వ.చ.8-65) అని అంటుంది. ఈ స్త్రీలు ముగ్గురు పతితో కలసిమెలసి ఉండటం కోసం ఎంత తపస్సు చేశారో. ఇంకా ఇలా అంటుంది.

“మెలఁతకుఁబతిపై నైనను
మెలఁతుకపైఁబతికినైన మేలగుటెందుం
గలయది మెలఁతకుఁబతికిన్
వలపు సమంబగుట జన్మ వాసన చెలియా” (వ.చ.8-66). 

భార్యపై భర్తకు గాని భర్తపై భార్యకు గాని ఎక్కువ ప్రేమ ఉండటం సహజం, కాని ఒకరిపై ఒకరికి సమానమైన ప్రేమ ఉండటం మాత్రం పూర్వజన్మ సుకృతం. ఈ విధంగా మాట్లాడుతున్న హంసను చూసి నవ్వి ఆ చక్రవాకం ఇలా అంటుంది.

చ. “ముదమున నిమ్మహీశుఁడొక ముద్దియ చూడఁగ నొక్క కాంతతో
      సదమదమై కడంగి రతి సల్పుట తెల్లమిగా నెఱింగియున్
      మది వివరించి రోయకభిమానము దక్కిన వీరి కూరుముల్
      వదలక పెద్ద సేసెదవు వందిగతిం దగవీవిచారముల్”.(మ.చ.8-69)

ఈ రాజొక స్త్రీతో భోగించుట తెలిసికొని అసహ్యించుకోక అభిమానం లేని వీరి ప్రేమలను పెద్దగా పొగుడుతున్నావే. ఇంకా నీ మాటలు చాలించు. ఇక్కడ చక్రవాకం ఒక పురుషుడికి ఒక స్త్రీ అనే మానవ సంబంధమైన విషయాన్ని నొక్కి చెప్పడమే కాక స్వరోచి, అతని భార్యల మధ్య ఉన్న ప్రేమను శంకిస్తుంది. పైగా రాజుల ప్రేమ అబద్ధమంటుంది. రాజుమీద ప్రేమ ఉన్న స్త్రీ పర స్త్రీలతో రాజు కూడితే సహించదని, ప్రేమలో తారతమ్యాలు ఉంటాయని, మానవప్రేమలో ఉండే లోపాలను ఎండగడుతుంది. ఆ స్వరోచి కంటే అతని భార్యలకంటే, “నేనుమద్విభుండిలఁ గల ధన్యుడంచు నెలుఁగెత్తి వరూధిని పట్టి ముందట బలుకు రథాంగ మానవతి”(వ.చు.8-75) అని హంసకు స్పష్టం చేస్తుంది. చక్రవాకం, హంస మానవ భాషలో మాట్లాడిన తీరు ఇక్కడ మనకు కన్పిస్తుంది. హంస, చక్రవాకంలు అచ్చం మనుషుల్లా వ్యవహరించినట్లే ఉంది. మానవవులకు చెందిన ప్రేమలను,అందులో ఉండే డొల్లతనాన్ని పక్షులు మాట్లాడుకోవడం, మనుషులు మాత్రమే చెప్పగల నీతి విషయాలను హంస పలకడం, మనుషులలో ఉండే అసూయ పక్షుల ద్వారా వ్యక్తం చేయడం మొదలైన వాటిని గమనిస్తే పెద్దన పక్షులకు మానవరూపాన్ని ఆపాదించి పైన పేర్కొన్న కథను చెప్పాడు. కేవలం పక్షులతో మాత్రమే కాకుండా మగలేడిని ఉపయోగించుకుని మరొక చోట ఈ మానవరూపాన్ని చెప్పాడు.

తనదగ్గరకు వస్తున్న అడ లేళ్ళను చూసి నేను స్వరోచిని కాను. ఎప్పుడూ భార్యలతో క్రీడింపను.మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీరు క్రీడించడానికి మరొక మగలేడిని చూసుకోండి. ఇక్కడ లేడి మనుష్య భాషణం చేయటమే కాకుండా, మానవులకు చెందిన అసహ్యాన్ని ప్రకటించడంకూడా మానవరూపంలో భాగమే. ఈ రెండుసందర్భాల ద్వారా కవి స్వరోచికి జ్ఞానోదయం కల్గించడానికి ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ కవి మానవరూపాన్ని ఆపాదించాడు. మను చరిత్ర లోగా వసుచరిత్రలో కూడా ఇలాంటి మానవరూపాన్ని చూడొచ్చు.

2.2 వసుచరిత్ర:

వసుచరిత్ర భట్టుమూర్తి రచన. ఉపరిచర వసువు కథ అందులోని ఇతివృత్తం. మనుచరిత్రలో కీలక మలుపు కోసం మానవరూపం వాడుకుంటే, వసుచరిత్రలో ప్రధానమైన ఒక కథనంతా మానవరూపంతో నింపేశాడు. ఆ కథ రెండవ ఆశ్వాసంలో ఉన్న శుక్తిమతి, కోలాహలుల కథ. శుక్తిమతి అనే పేరుగల నది, పర్వతరాజు హిమవంతుని కుమారుడిగా చెప్పబడ్డ కోలాహలమనే పర్వతం ఇందులోని పాత్రలు. “ఒక చాయననపాయ పికగేయ సముదాయము”(వ.చ.2-7) అనే పద్యంలో కోలాహలంతో ఉంది కాబట్టి కోలాహలమనే పేరు పర్వతానికి వచ్చిందని కవి చెప్పాడు. ఈ నదీ,పర్వతాలకు మానవ సంబంధమైన ప్రేమ, కోపం, ఆవేశం, అనురాగం, బలాత్కారం, సంతానం మొదలైనవి ఆపాదించడం, ఆ రెండు మానవ మాటలతో నాటకీయతను కల్గించడం ఇందులో చూడవచ్చు. శుక్తిమతి మీద మొహం పెంచుకున్న కోలాహలుడు ఆమె  ఇంటికి వెళ్ళిన సందర్భంలో, అతనికి తగు మర్యాదలు చేసి శుక్తిమతి ఇలా అంటుంది.

చం. “విలసిత రత్న కూటములు వేలుపు కన్నెల కూటముల్సదా
      కలిత సరః కృపీటములు కామిత నూతన వస్తు జాలదో
      హల సుర భూజావాటములొకప్పుడు వాయక కల్గునీకు
    నవ్వల నొక యర్థనీయమగు వస్తువు గల్గునె ముజ్జగంబులన్”.(వ.చ.2-123)

కావాల్సినంత సంపదలు ఉన్నవాడివి.ఇతరులను అర్థించడం తెలియని వాడవు.నాలాంటి వారి ఇంటికి ఏమి ఆశించి వచ్చారో అని నర్మగర్భంగా పలుకుతుంది.నది అయిన శుక్తిమతి మాట్లాడుతుంది.ఆ మాటల్లో తన చాతుర్యాన్ని చూపించడం ఇక్కడ మనం గమనిచవచ్చు.నది మాట్లాడం అద్భుతరస పోషణ అయినప్పటికీ,మానవరూపాన్ని ఉపయోగించడం ద్వారా  నది మనుష్యగా కన్పిస్తుంది.
కోలాహలుడు కూడా శుక్తిమతిని “సరసాగ్ర గణ్యవు” అని తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తాడు.శుక్తిమతి గొప్పతనాన్ని పొగుడుతాడు.ఇంకా ఇలా అంటాడు.

ఉ. “నావలనం బ్రియంబెరిగినన్నొక మాఱును బల్కింపకీ
      వే వెస నోరఁజేసికొని యేగుదు గాని సరీల్లలామ ని
      న్నేవగఁజేరవత్తు మదికింపగు నీదు నవోదితామృం
      బేవగఁగ్రోలఁగాంతుననియే నెపుడుం దలపోయు చుండుదున్”.(వ.చ.2-128) 

ఓ నదీ! నీపై నాకున్న ప్రేమనెరిగి నీవు నన్నెప్పుడు పలుకరించకుండా తొలగిపోతున్నావు. నిన్నెట్లా చేరగలను, నీ జలాన్ని ఎలా తాగగలనో అని చిరకాలం నుండి ఉవ్విళ్ళూరుతున్నాను. పై పద్యంలో కోలాహలుడు శుక్తిమతిని సరిల్లలామ అని పిలవడంలోని మానవరూపాన్ని మనం గమనించవచ్చు. కోలాహలుడు తనప్రేమను వ్యక్తీకరించిన విధానాన్ని కూడా గమనించవచ్చు. మానవుల మధ్య కలిగే ప్రేమను నదీ, పర్వతాలయందు ఆపాదించడం, ఆ రెండిటికి మధ్య సంభాషణలు నడిపించడం తద్వారా కథను నడిపించడం ఇక్కడ ఇమిడి ఉన్నాయి. కథానాయిక గిరిక పుట్టాలంటే వీరిద్దరి కలయిక కథా ప్రకారం అవసరం. అందుకే కవి కోలాహలుణ్ణి ఇష్టపడని శుక్తిమతిని కోలాహలుడు బలాత్కరింప జేశాడు. ఆ సమయంలో శుక్తిమతి సాధారణ స్త్రీలాగా రక్షింపమని  వసురాజును వేడుకుంటుంది. చివరకు వసురాజు కోలాహల పర్వతాన్ని తన కాలి బొటన వేలితో పక్కకునెట్టి శుక్తిమతిని రక్షిస్తాడు.కోలాహలుడు శుక్తిమతిని కలవడం వల్ల ఇద్దరు పిల్లలు పుడతారు.

మానవ సంబధమైన విషయాలతోపాటు మాటలను ఆపాదించడం, ఆ మాటల్లో చాతుర్యాన్ని ప్రదర్శించడం ఇక్కడ గమనించవచ్చు.కవి ఇక్క మనుష్య పాత్రలను పెట్టికూడా కథను నడిపించవచ్చు, కాని నదీ,పర్వతాలకు మానవరూపాన్ని ఆపాదించి కథను నడపంలోని ఒక ప్రత్యేకత మనుష్య పాత్రలను పెట్టి నడపడంలో రాదు. అద్భుత రసావిష్కరణ జరగదు. అందువల్లే వసుచరిత్రలోని ఈ శుక్తిమతి, కోలాహలుల కథ కీర్తి వహించింది.అందుకు కారణం మానవ రూపం.

2.3 కళాపూర్ణోదయం:

తెలుగు సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేసిన మరొక ప్రబంధం కళాపూర్ణోదయం. దీనిని రచంచిన పింగళి సూరన కూడా మానవరూపాన్ని సమర్థవంతంగా పోషించాడు. అందుకు ఆయన ఉపయోగించుకున్నది చిలుకను. సరస్వతి, చతుర్ముఖుల కథలో ఈ చిలుకకు మానవరూపాన్ని కవి ఆపాదించాడు. సరస్వతి, చతుర్ముఖుల మధ్య ఏర్పడిన ప్రణయకలహం వల్ల బ్రహ్మ తన పెంపుడు చిలుకను కథ చెప్పమని అడుగుతాడు. “ఆ చిలుక తనకు కథలు చెప్పడం చేతకాదని,అతడు చెప్తే వినగలనని చెబుతుంది” (కళాపూర్ణోదయంసంపూర్ణ కళావిర్భావవిశ్లేషణ పేజి -126).  బ్రహ్మ తన శృంగారచేష్టలను కథగా అల్లి కళాపూర్ణుడి కథను చెప్తాడు. కొంత సమయం తర్వాత రంభ సరస్వతి దర్శనం కోసం వస్తుంది. చిలుక ఆ సమయంలో కళాపూర్ణుని కథను రంభకు చెబుతుంది. ఇక్కడ కవి చిలుకకు మానవసంభాషణలను ఆపాదించి కథను చెప్పించాడు. ఈ చిలుకే తర్వాతి జన్మలో కలభాషిణి. కేవలం చిలుకకేకాదు దేవతలైన సరస్వతి, బ్రహ్మల మధ్య కలహం కలిగిందని చెప్పడం, బ్రహ్మ మానవభాషలో చిలుకను కథ చెప్పమని అడగటం కూడా కవి మానవరూపాన్ని ఉపయోగించడంగా భావించవచ్చు.

2.4 ప్రభావతి ప్రద్యుమ్నం:

పింగళి సూరన రచించిన మరొక ప్రబంధం ప్రభావతిప్రద్యుమ్నం. ఇందులో కూడా సూరన హంస పాత్రకు మానవరూపాన్ని ఆపాదించి, కథాకథనాన్ని సమర్థవంతంగా నడిపించాడు. ప్రథమ, ద్వితీయ ఆశ్వాసాలలో ఈ హంస పాత్ర ఉంది.శ్రీనాధుని శృంగారనైషధంలోని హంసకు సాటియైన హంస ఇది. దేవతలతో సైతం మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నది. గూఢచర్యం చేయగల దిట్ట. ఈ హంస పేరు శుచిముఖి. ఇంద్రుడు వజ్రనాభుని రహస్యాలన్నింటిని తెలుసుకుని చెప్పవలసిందిగా హంసను కోరతాడు.వజ్రపురంలో తాను విన్న విషయాలన్నింటిని ఇంద్రునికి విన్నవిస్తుంది. ఆ విషయాలలో ప్రద్యుముడు ప్రభావతికి భర్త అవుతాడన్నది ముఖ్యమైంది. ఆ తర్వాత ఇంద్రుని ప్రేరణతో శ్రీకృష్ణుని వద్దకువెళ్ళి,తాను ఇంద్రుడు పంపగా వచ్చానని చెప్పి తన ప్రసంగాన్ని మొదలుపెడుతుంది.

చం. “బలవిభావాభి శోభితుఁడ భంగుర శౌర్య ధురంధరుండు కా
       వలసిన మాయలన్ దిజవైరుల కంటెఁగారంబు నేర్చు నీ
       పలుకుల చందమరయఁబ్రభావతికిం పతి గాఁగలాఁడని
       శ్చలముగ రుక్మిణీసుతుఁడు చంపునవశ్యమువజ్రనాభునిన్”. (ప్ర.ప్ర.2-25).

ప్రద్యుమ్నుడు బలసంపన్నుడు, తిరుగులేని పరాక్రమవంతుడు, రాక్షసులకంటే ఎక్కువ మాయలు నేర్చిన వాడు, నీ మాటల రీతి పరిశీలింపగా ప్రభావతికి భర్త కాగలడు, వజ్రనాభుడిని తప్పక వధిస్తాడు అని అంటుంది. ఎవరూ చొరబడలేని వజ్రపురికి ప్రద్యుమ్నుడు ఎలా వెళ్ళాలో కూడా శ్రీకృష్ణుడికి చెబుతుంది. తన తిరుగు ప్రయాణంలో నగరం బయట ఆడుకుంటున్న ప్రద్యుమ్నుడు ఆకాశంలో ఎగురుతున్న హంసలను చూసి, వాటినిప్రశంసించి, దేవతా హంసలుగా భావించి మీరేమీ మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి అని అన్నప్పుడు శుచిముఖి అఖిల జన మనోహరమైన మధుర స్వరంతో పెద్దగా ఇలా అంటుంది.

ఉ. “ఇచ్చట మేము వేఱెమఱి యెవ్వరితోడను మాటలాడఁగా
వచ్చెదమచ్యుతాత్మజ దివస్పతి పంపునఁగృష్ణ పాలికిన్
వచ్చి యతండు వీడ్కొలుప వారల యిద్దఱ యాజ్ఞలన్ గడున్
హెచ్చరికన్ ధరించి యిపుడేఁగెడులాగిది యెక్క చోటికిన్”. (ప్ర.ప్ర.2-44) 

అని మొదలు పెట్టి తన వంశావళిని ప్రద్యుమ్నుడికి చెబుతుంది. ఇంకా ప్రద్యుమ్నుడి ప్రస్తావన వచ్చిన సందర్భాన్ని చెప్పి, పనిలో పనిగా ప్రభావతి అంగాంగవర్ణన చేస్తుంది. ఈ శుచిముఖి కవి కూడా. సరస్వతిదేవి పెంపకంలో అన్ని విద్యలను నేర్చుకున్న హంస అద్భుతమైన 44 పద్యాలలో   ప్రభావతిని వర్ణిస్తుంది. మానవులకు మాత్రమే సాధ్యమైన కవిత్వం, వ్యాకరణం నేర్చుకున్నానని, అందుకే సరస్వతి తనకు శుచిముఖి అనే పేరు పెట్టిందని చెబుతుంది. తన గొప్పతనాన్ని ప్రద్యుమ్నుడి ముందు తానే పొగుడుకుంటుంది. ఇక్కడ ఉదాహరించిన అంశాలను గమనించిన శుచిముఖి అనే పేరుగల హంస యొక్క నేర్పరితనం, ఆత్మస్తుతి, మాటల చాతుర్యం, కవితావైదుష్యం, వ్యాకరణ పాండిత్యం, దూత లక్షణాలు మనకు కన్పిస్తాయి. ఈ లక్షణాలన్నింటిని కవి హంసకు ఆపాదించి కథాకథనాన్ని చక్కగా పోషించాడు. ఇక్కడ హంసను కాకుండా మనిషిని పాత్రధారిగా చేసి కూడా కవి ఈ ఘట్టాన్ని చెప్పవచ్చు, కాని ఇక్కడ హంస పాత్రను ఉపయోగించి చెప్పినప్పుడు కలిగే అద్భుతరసం మనిషిపాత్ర ద్వారా కలగదు, పాఠకుడికి అంతగా ఆసక్తిని కలిగించదు. కాబట్టి ఇక్కడ కవి మానవరూపాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడని మనం గ్రహించవచ్చు.

2.5 పాండురంగ మాహాత్మ్యం:

ప్రబంధ కాలంలో వచ్చిన మరొక ముఖ్యమైన ప్రబంధం పాండురంగ మాహాత్మ్యం.ఇది భక్తి కోవకు చెందిన ప్రబంధం.ఇందులో తెనాలి రామకృష్ణ కవి కాకి,హంస,చిలుక,పాము,తేనెటీగలను పాత్రధారులుగా చేసుకుని సుమారు 56 పద్యాలలో కథను చెప్పాడు.ఈ పక్షులు తమకు తెలియకుండానే చేసిన పనులకు ముక్తిని సాధించినట్లు చెప్పాడు.మానవ సంబంధమైన ముక్తిని పైన పేర్కొన్న జంతువులు కాంక్షించడం కోసం చేసిన పనులు మానవ సంబంధమైనవే తప్ప వేరేవి కావు.జంతువులన్నింటికి మానవ లక్షణాలను ఆపాదించి కవి ఇక్కడ మానవ రూపాన్ని సాధించాడు.

2.6. శ్రీకాళహస్తి మాహాత్మ్యం:

ధూర్జటి విరచిత శ్రీ కాళహస్తి మాహాత్మ్యం లో సాలీడు,పాము.ఏనుగులు ముక్తి పొందిన వైనాన్ని కవి పేర్కొన్నాడు.ఈ ప్రబంధం కూడా భక్తి కోవకు చెందినది.భక్తి స్పృహలేని జంతువులకు,పక్షులకు కూడా భక్తి భావాన్ని కల్గించి,వాటి చేష్టల ద్వారా ముక్తిని పొందే విధానాన్ని కవులు తమ ప్రబంధాల్లో ప్రముఖంగా చిత్రించడం మనం చూడవచ్చు.జంతువుల పేర్ల మీదుగానే కవి ఈ ప్రబంధానికి శ్రీకాళహస్తి మాహాత్మ్యం పేరు పెట్టినట్లు తెలుస్తున్నది.శ్రీ అంటే సాలీడు,కాళ అంటే పాము,హస్తి అంటే ఏనుగు.
సాలె పురుగు తన పూర్వ జన్మ వాసనా ఫలితంగా శివుడిని పూజించనెంచి,అందులో భాగంగా తన దారాలతో ప్రాకారాలు,గోపురాలు,కొలువుకూటాలు,నాట్య మందిరాలు మొదలైన వాటిని అనేకం కట్టింది.అయితే శివుడు సాలీడు కట్టిన నిర్మాణాలన్నింటిని  కాల్చి వేస్తాడు.అప్పుడు ఆ కీటకం “హృద్భూత వ్యథా క్రోధమై”.

క. “ఇది పెక్కేడులు పట్టెన్
    సదనంబులు గట్ట నాకు శంభుని కొఱకన్
    దుదిఁగుమ్మరి కొక యేఁడును
    గుదెకొక పెట్టన్న మాటకుఁసరివచ్చెన్”. (శ్రీకాళహస్తిమాహాత్మ్యం 2-100) అని అంటుంది. వెంటనే మంటల్లో పడి చావడానికి సిద్ధపడగా శివుడు కరుణించి,దానిని రక్షించి నీవు ఎందుకోసం నన్ను వేడుకుంటున్నావనగా సాలీడు కైవల్యం కావాలని అడుగుతుంది. శివుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ సాలీడుకు మానవరూపాన్ని ఇవ్వడం మనం చూడవచ్చు. సాలీడు దుఖించడం, చావడానికి సిద్ధపడటం, మాటల్లో తన భాదను వ్యక్తం చేయడం, ముక్తిని అడగటం మొదలైనవి అందుకు ఆధారాలుగా మనకు కన్పిస్తాయి. కేవలం సాలీదే కాదు పాము,ఏనుగులు శివునికి పూజలు చేయడం, మత్సరం పెంచుకోవటం, కోపంతో తన పనిని చెడగొట్టిన వారి పట్ల ద్వేషం, విషాదాన్ని ప్రకటించడం, స్వగతంలోసంభాషించడం, పాము, ఏనుగులు ఒకదాన్ని ఒకటి చంపు కోవడానికి సిద్ధపడగా శివుడు ప్రత్యక్షమవ్వగా శివుడిని ఆ రెండు స్తుతించడం మొదలైన మానవ సంబంధమైన భావోద్వేగాలను, సంభాషణలను పాము, ఏనుగులకు ఆపాదించి మానవ రూపాన్ని సాధించినట్లు మనం గ్రహించవచ్చు. శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో నత్కీరుని వృత్తాంతం లో కూడా మనకు మానవ ఆరోపణ కన్పిస్తుంది. పేద బ్రాహ్మణునికి శివుడు పద్యం రాసి ఇవ్వడం, ఆ పద్యం తప్పన్న నత్కీరునితో శివుడు సంవాదించడం, చివరకు కోపంతో నత్కీరుని శపించడం మానవరూపంలో భాగమే.

2.7 శుకసప్తతి:

ప్రబంధయుగానతరం వచ్చిన కథాప్రబంధాలలో కూడా ఈ మానవరూపం కన్పిస్తుంది. అలాంటి వాటిల్లో పాలవేకరి కదిరీపతి రాసిన శుకసప్తతి, అయ్యలరాజు నారాయణామాత్యుడు రాసిన హంసవింశతి ఈ కోవకు చెందిన ప్రబంధాలు. కథాకావ్యాల్లో మెండుగా ఉండే ఈ మానవరూపం కథా ప్రబంధాల్లో కూడా మెండుగానే చోటుచేసుకోవడం కవులకు మానవరూపం పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. శుకసప్తతి అంటే చిలుక డెబ్భై రోజుల్లో చెప్పిన డెబ్భైకథలు. చిలుక మనిషికి కథలు చెప్పడమేమిటని ప్రశ్న వేసుకుంటే కథల్లో అద్భుత రసావిస్కరణ కోసం విరివిగా ఈ మానవ రూపాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా చిలుకకు మానవరూపాన్ని ఆపాదించి కథలు చెప్పించడం జరిగింది. ఈ చిలుక యజమానికి నమ్మిన బంటు. అతను వ్యాపార నిమిత్తం వెళుతూ భార్యను చిలుకకు అప్పగించి వెళతాడు. యజమాని భార్య రాజుపై అనురక్తితో అతని పొందు కోరి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు, తనవంతు కర్తవ్యంగా ఆ చిలుక యజమాని భార్యకు తాను స్వామీ ద్రోహం సహించలేనని చెబుతుంది.రాజు పొందు తగదని అనేక నీతి విషయాలను, పతిభక్తి విలువలను చెబుతుంది. అలా చెబుతూ రాజు వద్దకు ఆమెను వెళ్ళకుండా చేయడానికి ఆమెను అనునయించి తన యజమాని వచ్చేదాకా డెబ్భై రాత్రులు డెబ్భై కథలను ఆమెకు చెబుతుంది.ఇక్కడ చిలుక పోషించిన పాత్ర మానవరూపమే. కథలను చెప్పడమనే మానవ లక్షణంతో ఈ ప్రబంధం మొత్తాన్ని రాశాడు కదిరీపతి.

2.8 హంసవింశతి:

హంసవింశతి కూడా శుకసప్తతి లాంటి కథా ప్రబంధమే. వ్యాపారనిమిత్తం వేరే దేశానికి వెళ్ళడానికి సిద్దపడిన విష్ణుదాసుడు తాను చిన్నప్పటి నుండి పెంచుకుంటున్న హంసకు, తన భార్యకు చెప్పి వెళ్తాడు. అతను వెళ్ళిన తర్వాత అతని భార్య హేమవతి రాజు పొందు కోరి అతని వద్దకు ప్రయాణం కడుతుంది. వెళ్ళే సమయంలో ఆ విషయాన్ని హంసకు చెబుతుంది. అప్పుడు హంస చింతించి ఆ హేమవతితో ఇలా అంటుంది.

ఉ. “అక్కట!భర్త కాఁపురము నాఱడి పుచ్చి నృపాలమౌళితోఁ
జొక్కి రమించు నందులకుఁ జొచ్చినఁ దావక బంధువర్గముల్
తక్కువ సేతురమ్మా!చరిత వ్రతముల్ చెడునమ్మ! జాతికిన్
  బక్కన నిందఁ జెంది తలవంపులు దెత్తురఁటమ్మ!మానినీ!”. (హ.వి.1-124)

హంస పతి సేవను బోధించి, ప్రేమగా మాట్లాడి, నీతి విషయాలను తెలిపి, రాజుల పొందు ఎంత ప్రమాదకరమో చెప్పి ఆ హేమవతి రాజు వద్దకు వెళ్ళకుండా చేయడానికి హంస ఇరవై రాత్రుల్లో చెప్పిన ఇరవై కథలే హంసవింశతి. ఇందులో కూడా మానవ లక్షణాలు హంస యందు ఆరోపించి మానవరూపాన్ని చక్కగా వాడుకోవడం గమనించవచ్చు. హంసను మనిషికి ప్రతీకించడం  మానవరూపంలో భాగమే.

3. ముగింపు:

తెలుగు ప్రబంధాలలో జంతువులకు మానవ రూపాన్ని ఆపాదించడం మనుచరిత్ర నుండి మొదలై ఆతర్వాత అనేక ప్రబంధాలలో వెల్లివిరిసింది.

పైన పేర్కొన్న విషయాలను గమనించినట్లైతే జంతువులకు మానవ లక్షణాలైన మాట్లాడటం, ఆలోచించడం, నేర్పరితనం, చాతుర్యం, కార్యాలను నెరవేర్చే విధానం, కోపం, అసూయ, ద్వేషం, కవిత్వం రాయడం, చదువుకోవడం, వ్యంగ్యాన్ని ప్రదర్శించడం మొదలైన వాటిని ఆపాదించి కథను నడపడంతో పాటు అద్భుత రసాన్ని పోషించడం జరిగింది. 

జంతువుల, పక్షుల పాత్రల స్థానంలో మనిషి పాత్రలను పెట్టి కథను నడపవచ్చు, కాని పాఠకుడిలో ఎక్కువ ఆసక్తిని కల్గించి, కథను రక్తి కట్టించాలంటే జంతు, పక్షుల పాత్రలే సరైనవి అన్న భావన కవులకు ఉండటం, ప్రబంధ లక్షణాల్లో ఒకటైన  ప్రాచీన పురాణ, ఇతిహాసాలనుండి కథలను తీసుకోవాలన్న దాని వల్ల, ఇతిహాస, పురాణాల్లో జంతు,పక్షుల పాత్రలు కూడా ఉండటం వల్ల ప్రబంధ కవులు ఆ విధంగా జంతు, పక్షుల పాత్రలను తీసుకుని మానవరూపాన్ని ఆపాదించారని మనం భావించవచ్చు. 

కేవలం జంతువులకే కాకుండా దేవతలకు కూడా ఈ మానవరూపాన్ని ఆపాదించడం పారిజాతాపహరణం లాంటి ప్రబంధాలలో కన్పిస్తున్నది. కేవలం కథకు ఉపయోగపడే విధానమే కాకుండా మానవ ఆధిపత్యాన్ని చూపించడానికి కూడా ఈ మానవరూపాన్ని కవులు పోషించినట్లు తెలుస్తుంది. ఈ విధంగా తెలుగులో అనేక ప్రబంధాలలో కవులు మానవరూపాన్ని ఒక ముఖ్యమైన విషయంగా భావించి తమ రచనల్లో ఉపయోగించారన్న సంగతి పై పరిశీలన వల్ల తెలుస్తున్నది.

4. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కదిరీపతి, పాలవేకరి. శుకసప్తతి, ఆంధ్రప్రదేశ్, సాహిత్య అకాడెమీ, హైదరాబాద్, 1977. 
  2. కృష్ణారావు జి.వి., జాస్తి జవహర్లాల్ (అను.) కళాపూర్ణోదయం సంపూర్ణ కళావిర్భావవిశ్లేషణ. ఎమెస్కో, హైదరాబాద్, 2014.
  3. ధూర్జటి. శ్రీకాళహస్తి మాహాత్మ్యం. వావిళ్ళ రామశాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి, 1966. 
  4. నారాయణామాత్యుడు, అయ్యలరాజు. హంసవింశతి, ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడెమీ హైదరాబాద్, 1979.
  5. పెద్దన, అల్లసాని. మనుచరిత్ర, వావిళ్ళ రామశాస్త్రులు అండ్ సన్స్, మద్రాస్. 1951.
  6. పోతన, బమ్మెర. ఆంధ్ర మహాభాగవతం, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి, 2010.
  7. రామకృష్ణ కవి, తెనాలి. పాండురంగమాహాత్మ్యం, వావిళ్ళ రామశాస్త్రులు అండ్ సన్స్ మద్రాస్, 1952.
  8. రామరాజభూషణుడు. వసుచరిత్ర, శ్రీసత్యనారాయణ బుక్కు డిపో, రాజమహేంద్రవరం 1929.
  9. సూరన, పింగళి. కళాపూర్ణోదయం, వావిళ్ళ రామశాస్త్రులు అండ్ సన్స్, మద్రాస్, 1930.
  10. సూరన, పింగళి. ప్రభావతి ప్రద్యుమ్నం వెంకటరామ గ్రంధమాల విజయవాడ 1962.
  11. Cambridge Advanced Learner Dictionary-2022
  12. Oxford Dictionary-Vol-3,1997.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]