headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

25. అన్నమయ్య సంకీర్తనలు: అభ్యుదయదృక్పథం

డా. ఎన్. శిల్పారాణి

ఉపాధ్యాయురాలు,
వేమాపురం, తిరుపతి
తిరుపతిజిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9502375155, Email: silparanimay26@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

అన్నమయ్య తొలి సామాజిక ఉద్యమకారుడు. తొలి సంఘసంస్కర్త. తొలి ప్రజాగాయకుడు. ఆయన సంకీర్తనల్లోని కొన్ని అంశాలను పరిశీలించి ఆయనను అభ్యుదయవాదిగా నిరూపించటం ఈ పత్రోద్దేశం. ఈ పత్రరూపకల్పనలో అన్నమయ్య సంకీర్తనలతోపాటు, కొండవీటి గురు జ్యోతిర్మయి అన్నమయ్య దివ్యశక్తి సంకీర్తనలు, పొన్నా లీలావతమ్మ పదకవితా వైజయంతి, జి.నాగయ్య తెలుగు సాహిత్య సమీక్ష వంటి గ్రంథాలు నాకు ఉపకరించాయి. ఈ గ్రంథాలను ఆధారంగా చేసుకొని అన్నమయ్య సాహిత్యంలోని అభ్యుదయభావాలను ఎత్తిచూపాను. ప్రధానంగా అన్నమయ్య భక్తి ఉద్యమకారుడే అయినా అంటే భక్తిని ప్రచారం చేసినా, సమాజంలో క్రిందిస్థాయివరకూ వెళ్ళి సామాజిక దురాచారాలకు భక్తిని అనుసంధానం చేసిన తీరును ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: అంటరానితనం, అస్పృశ్యత నిరాకరణ, స్త్రీ అణచివేత పై తిరుగుబాటు, గిరిజన చైతన్యం కలిగిస్తూ వారికి విద్య, సంఘంలో ప్రాధాన్యత వంటి విషయాలపై అన్నమయ్య చేసిన సిద్ధాంతాలను ఆయన సంకీర్తనలద్వారా తెలియజేయటం.

1. ఉపోద్ఘాతం:

అభ్యుదయమంటే మార్పు, సామాజిక చైతన్యం. ప్రాచీనకాలం నుండి ఎంతోమంది కవులు అభ్యుదయ భావజాలంతో తమ చుట్టూ వున్న సమాజాన్ని చైతన్యపరచారు. ఎన్నో అసమానతల్ని, దురాచారాల్ని ఖండించి సమసమాజ స్థాపనకి దోహదం చేసారు. అటువంటి వారిలో అన్నమయ్య మొదటివారు. అన్నమయ్యను తొలిసామాజిక ఉద్యమకర్తగా, తొలి సంఘసంస్కర్తగా, తొలిప్రజాగాయకుడిగా చెప్పవచ్చు. అన్నమయ్య సంకీర్తనల్లోని అభ్యుదయమార్గాన్ని ఎత్తిచూపటం ఈ పత్రంలోని ప్రధానాంశం.

అన్నమయ్య పరమభక్తుడు. అతని రచనలకు మూలం భక్తి. సమాజంలోని పేద ధనిక వర్షాలను, కుల మత భేదాలను వ్యతిరేకించాడు. మానవుడు ఈ లౌకిక బంధాలను త్యజించుకోవాలని ప్రబోధించాడు. భూమ్మీద అశాశ్వతమైన ఎన్నో విషయాలకోసం ఆరాటపడే మానవుడి అజ్ఞానాన్ని శాశ్వతమైన భగవంతుని సన్నిధివైపు మళ్ళించటమే అన్నమయ్య అభ్యుదయ మార్గంగా తోస్తుంది. ఆయన కవిత్వమంతటా భగవంతుని ఆరాధనాభావమే పరచుకొని ఉంది. “అందరికీ శ్రీహరే అంతరాత్మ” అన్న భావాన్ని సామాన్యుడికి సైతం తెలియజేయాలనుకున్నాడు. పాటని సామాన్యుడి చిరునామాగా భావించి, పండితలోకం చులకనగా చూసినా, తన కవిత ప్రతి ఒక్కరికి చేరాలన్న లక్ష్యంతో పాటనే తన కవితకి ఆయుధంగా చేసుకొని ప్రజాకవి అయ్యాడు. సమాజంలోని అన్ని కోణాలను స్పృశించి సాహిత్యానికి విశేష కృషి చేశాడు. పదకవితాపితామహుడిగా భావితరాలకు మార్గదర్శకుడయ్యాడు.

2. కులనిరసనం:

అన్నమయ్య వివిధ సామాజికాంశాలను ఆధ్యాత్మిక విషయాలతో సమన్వయించి చెప్పటం కనిపిస్తుంది. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవేంకటేశ్వరునికి మనుషులంతా ఒక్కటేనన్న సర్వమానవ సమానత్వాన్ని తెలియజేస్తాడు. భగవంతుడు సృష్టించిన ఈ లోకంలో హెచ్చుతగ్గులు, భేదభావాలు లేవని చెబుతాడు. అసమానతలు మనిషికేకాని నిద్రకుకాదని రాజునిద్ర, బంటునిద్ర ఒక్కటేనంటాడు. బ్రాహ్మణుడు, చెప్పులు కుట్టుకునే చండాలుడు తిరిగే భూమి ఒక్కటేనని సూచించాడు. దేవతలకైనా పశుపక్ష్యాదులకైనా కామసుఖం ఒక్కటేనని తెలిపాడు. ధనవంతుడుకి, పేదవాడికి రాత్రి, పగలు సమానమేనని, దుర్వాసన మోసేగాలి, సువాసనను మోసే గాలి ఒక్కటేనని, ఏనుగుమీద కాసే ఎండ, కుక్కమీద కాసే ఎండా రెండూ ఒక్కటేనన్నాడు. అలాగే పుణ్యాత్ముల్నీ, పాపాత్ముల్నీ సమానంగా చూసే వేంకటేశ్వర నామం కూడా ఒక్కటే అని అన్నమయ్య సూచించిన ఈ ఏకసూత్రతా భావం ఈ జాతికి మేలుకొలుపుగా కనిపిస్తుంది.

అన్నమయ్య కులమత నిరసనం చేసాడు. భగవంతుడికి కులం లేదు. తాను సృష్టించిన మానవుడికీ కులం లేదంటాడు. అజ్ఞానంతో కొందరు మూర్ఖులు మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలు కట్టి సమాజాన్ని చిన్నాభిన్నం చేసినట్లు అన్నమయ్య పదాల ద్వారా తెలుస్తుంది.

            “ఏ కులజుడేమి యెవ్వడైన నేమి

          ఆకడ నాతడె హరినెఱిగినవాడు” (1-292)

          “ ఎక్కువ కులజుడైన హీనకులజుడైన

          నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు” (1-318)

అంటూ మనిషికి కులం కంటే గుణం అలంకార శోభితం అన్న విషయాన్ని తెలియజేస్తాడు. సత్యసంపన్నుడు, పరనిందచేయనివాడు, భూతదయగలవాడు, పరులను తనలాగే చూసేవాడు, ధర్మబుద్ధి గలవాడు, కర్మమార్గాలు వదలనివాడు, హరి భక్తి మరువనివాడు, జగతికి మేలు చేసేవాడు, అజాతశత్రువుగా జీవించేవాడు, ఆత్మతెలిసినవాడు, శ్రీవేంకటేశ్వరునికి దాసుడైనవాడు ఏకులస్థుడైనా ఒకటేనంటాడు. అలాగే వేదాలు చదివి హరిభక్తిలేని సోమయాజి కంటే, వేదాంత పఠన చేసే హరిభక్తిలేని సన్యాసి కంటే విష్ణుపాద సేవనాసక్తి గలిగిన కులహీనుడైన, కడజాతి కులస్థుడైనా నిత్యం విష్ణుచింతలో ఉన్న వాడే గొప్పవాడని కులప్రాధాన్యాన్ని తగ్గిస్తాడు. అన్నమయ్య చేసిన ఇటువంటి ప్రతిపాదనలు తర్వాతి కాలంలోని కులనిర్మూలనకు సూచికలుగా పేర్కొనవచ్చు.

అన్నమయ్య జాతిభేదాలను కూడ ఖండిస్తాడు. మానవుడి ప్రగతికి జాతిభేదం పెద్ద అడ్డంకి అంటాడు.

            విజాతులన్నియు వృథా వృథా

          అజామిళాదుల కది యేజాతి” (2-383)

అన్న ఈ సంకీర్తనలో మనిషికి జాతిభేదాలు శరీరంలాంటి గుణాలని, అవి ప్రాణంపోయిన తర్వాత శరీరం నశించినట్లే నశిస్తాయిగానీ ఆత్మలాగ పరిశుద్ధమైనవి కావని అంటాడు. అందరికీ అంతరాత్మ శ్రీహరే కాబట్టి ఆయన మీద భక్తిభావాలు కలిగివుండటమే సజాతి అని జాతిభేదాలు పాటించే వారిని మేల్కొలుపుతాడు.

3. స్త్రీ సమానత్వం:

స్త్రీ, పురుష సమానత్వాన్ని కోరిన తొలి స్త్రీవాదిగా అన్నమయ్య కనిపిస్తాడు. ఆనాడు సమాజంలో స్త్రీలపైన జరుగుతున్న దురాచారాలపై విప్లవాత్మక మార్పుకోసం పోరాడినట్లుగా తెలుస్తుంది. తన కీర్తనల ద్వారా స్త్రీలను చైతన్యపరుస్తాడు. కుటుంబంలో, సమాజంలో స్త్రీకి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. సమాజంలో స్త్రీ పై గౌరవాభిమానాలు కలగటానికి తన సంకీర్తనలలో స్వామివారి కంటే అమ్మవారి గొప్పతనానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. అన్నమయ్య స్త్రీపట్ల ఆదరాభిమానాలు కలవాడని చెప్పటానికి తన భార్య తాళ్ళపాక తిమ్మక్కే ప్రత్యక్ష్య సాక్ష్యం. ఆనాటి సమాజం స్త్రీవిద్యను ప్రోత్సహించకపోయినా, స్త్రీ విద్య సమాజాభివృద్ధికి, ప్రయోజనకరమని భావించిన అన్నమయ్య తిమ్మక్క పాండిత్యం సంపాదించి, కవయిత్రిగా ఎదగటానికి దోహదపడ్డాడు.

            పొలతులు జీవులే పురుషులు జీవులే

          తలప భావ భేదములే కాని

          బలిమి స్వతంత్రముఁ బరతంత్రమొకరికి

          యెలమి నిందులోఁ జెల్లే హీనాధికములే”

అన్న సంకీర్తనద్వారా స్త్రీ పురుషులిద్దరూ సమానమేనన్న సమానత్వ ప్రతిపాదన చేస్తాడు. స్త్రీకి పురుషునితోపాటు సమానగౌరవం ఉండాలని పురుషులు స్త్రీలపట్ల పూజ్యభావంతో నడచుకోవాలన్న మానవతావాదిగా కనిపిస్తాడు. “స్త్రీపురుషుల సమానత్వానికి పురుషుని మనఃప్రవృత్తిలో మార్పురావాలి. సామాజిక మార్పురావాలి. త్రికరణశుద్ధిగా పురుషుడు ఈ సమానత్వానికి పాటుపడాలి”1

            ఆటఁది రాజ్యమేలితే అది మంచిదే కాదా

          చాటువగా మాకు నిన్ను సాధించనేటిఁకి”

అనే సంకీర్తన ద్వారా స్త్రీ ఆధిపత్యం, రాజ్యాధికారం మంచిదేనన్న భావాన్ని వ్యక్తపరుస్తాడు. స్త్రీ పురుషునికి ఏవిధంగా సేవచేసుకుంటుందో అలాగే పురుషుడు కూడా స్త్రీ సేవ చేయాలని కాంక్షిస్తాడు. స్త్రీ పురుష అధికార భాగస్వామ్యం ద్వారా సమాజానికి ప్రగతి ఏర్పడుతుందన్న ప్రగతిశీల భావంతో సమాజాన్ని మేలుకొలుపుతాడు. భక్తులు స్వామివారిని, అమ్మవారిని తల్లిదండ్రులుగా భావించి కొలిచినట్లుగానే, స్త్రీమూర్తి పై వివక్ష చూపించకుండా పురుషునితోపాటే సమానంగా ప్రాథమిక సూత్రం ద్వారా గౌరవించాలన్న సమాజానికి హితవు పలుకుతాడు అన్నమయ్య.

4. గిరిజన చైతన్యం:

అన్నమయ్య గిరిజనులను చైతన్యపరుస్తాడు. గిరిజనుల వేషభాషలను అభిమానించాడు. వారి జీవనచర్యలపై అభిమానంగా ఎన్నో గేయాలు రాసాడు. ఆయన రాయలసీమప్రాంతంలో జీవించే గిరిపుత్రుల నివాస ప్రదేశాలను దర్శించినట్లుగా తెలుస్తున్నది. గిరిజనులు భక్తి, జ్ఞాన, ముక్తి మార్గాలను పొందాలని కాంక్షించాడు.

            పొడవైన శేషగిరి బోయనాయఁడు

          విడువ కిందరిఁ గాచు నెడబోయ నాయఁడు”

          పొలసి మీసాల పెద్దబోయ నాయఁడు

          మలిగి వీఁపునఁ గట్టే మంకు బోయ నాయఁడు

          పొలము రాజై తిరిగే బోయ నాయఁడు

          వెలయమోటున నుండే వేఁట బోయ నాయఁడు”

-అంటూ బోయలవేషధారణను, గుణగణాలను వివరించాడు. బోయల మీసాలు, పొట్టిపొట్టి అడుగులు, వారి మంకుతనం, మోటుతనం, పగసాధించే తత్త్వం, వేట ప్రియత్వం, వారి హావభావాలు మొదలైన విషయాలను పరిశీలనగా చూసి, విష్ణుమూర్తి దశావతార విశేషాలను బోయీలకు సమన్నయించి, శేషాచలపతియైన శ్రీ వేంకటేశ్వరుడే బోయిల నాయకుడని అభివర్ణిస్తాడు. అలాగే బోయ స్త్రీ వేషధారణను లక్ష్మీదేవికి కూడా ఆరోపించి ఎన్నో సంకీర్తనలు రచించాడు. అహోబల నారసింహస్వామిని వర్ణించే సంకీర్తనలలో చెంచుల ప్రసక్తిని తెలియజేస్తాడు. చెంచెతా శ్రీకృష్ణుల అనురాగాన్ని వర్ణిస్తూ కూడా సంకీర్తనలు రాసాడు. వీటన్నిటిని బట్టి నాగరికి సమాజానికి గిరిజనుల ప్రాముఖ్యతను తెలియజేసినట్లు తోస్తుంది. గిరిజనుల గొప్పతనాన్ని తెలియజేసి వారిలోని చైతన్యాన్ని పురిగొల్పినట్లు అనిపిస్తుంది.

5. వ్యవసాయం, వృత్తివిద్యల ప్రోత్సాహం:

అన్నమయ్య వ్యవసాయదారులను, చేతివృత్తులవారిని అభిమానించాడు. వారిలోని భక్తిభావాల్సి పెంపొందింపజేయాలనుకున్నాడు. వ్యవసాయంలోని, చేతివృత్తులలోని వున్న సమస్యలను, బాధలను చిత్రిస్తూ వారిని చైతన్యపరుస్తూనే విష్ణుతత్వాన్నీ బోధిస్తాడు. వారిపట్ల సమాజానికి ఒక అభిమానాన్ని కలిగిస్తాడు.

            పంటల భాగ్యులు వీరా బహు వ్యవసాయము

          అంటి ముట్టి యిట్లు కాపాడుదురు ఘనులు”

-అంటూ మనిషికి అత్యవసరమైన పంటని గురించి ఎక్కువగా తెలియజేస్తాడు. రైతు పంటని తన బిడ్డలా ఎలాగైతే కాపాడుకుంటాడో భగవంతుడు కూడా భక్తులను ఆవిధంగా కాపాడుకుంటాడనే సత్యాన్ని చాటుతాడు.

            వాడల వాడల వెంట వాఁడివో వాఁడివో

          నీడ నుండి చీరలమ్మే నేత బేహారి

          పంచభూతములనెడు పలువన్నె నూలు

          చంచలపు గంజివోసి చరిసేసి

          కొంచపు కండెల నూలి గుణముల నేసి

          మంచి మంచి చీరలమ్మే మారు బేహారి”2

పంచభూతాలను అనేక రంగులతో కూడిన దారాలుగా, గుణాలు చేతలను నూలు కండెలుగా, కుచ్చులుగా నేత వృత్తిదారులు భావిస్తారని సరిపోల్చుతాడు. నేతకారుల ప్రాధాన్యాన్ని, సమాజానికి వారి అవసరాన్ని తెలియజేస్తాడు. ప్రతినేతబేహారి (వ్యాపారస్తుడు) శ్రీవేంకటేశ్వరుడేనని వృత్తిదైవంతో సమానమన్న భావాన్ని వ్యక్తపరుస్తాడు. కమ్మరి, కుమ్మరి, సోది, వైద్యవృత్తి, వర్తకులు, చేతివృత్తుల వారందరి జీవనవిధానాన్ని తెలియజేస్తూ సమాజానికి మూలం చేతివృత్తులేనన్న భావాన్ని తెలియస్తాడు. వీరందరిలో భగవంతుడు ఉన్నట్లుగా భావించి ఆరాధించాలని పేర్కొంటాడు. వ్యవసాయం, చేతివృత్తుల ధ్వంసం సమాజాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుందోనన్న విషయాన్ని ముందుగానే పసిగట్టి, వారిని ఆదరించాలన్న సూచన చేసిన దార్శనికుడిగా, అన్నమయ్య కనిపిస్తాడు.

6. విద్యాసంస్కారకాంక్ష:

మానవుడు విద్యద్వారా మంచి సంస్కారాన్ని అలవరచుకుంటాడు. ఉన్నతవ్యక్తిత్వాన్ని కలిగివుండి సమాజానికి మార్గదర్శకుడవుతాడు. కానీ అలాంటి చదువుకున్న విద్యావంతులు కూడ చదువులేని మోటువారిలా అజ్ఞానంతో ప్రవర్తించటం అన్నమయ్యను బాధిస్తుంది.

            తన కేడ చదువులు తన కేడ శాస్త్రాలు

          మనసు చంచల బుద్ధి మానీనా”

-అనే సంకీర్తనలో మానవుడు చదువుతోపాటే తన దురాశని పెంచుకోవటం మూర్ఖత్వమే అంటాడు. తద్వారా సంసార భవబంధాల్లో చిక్కుకొని అలమటిస్తాడు. ప్రశాంత జీవితం గడపలేడు. కాబట్టి చదివిన చదువు తన ప్రగతికి ఉపయోగపడాలని సూచిస్తాడు.

అన్నమయ్య సమాజంలోని దురాచారాలను ఖండిస్తూ విశేషంగా సంకీర్తనలు రాశాడు. తన సంకీర్తనలద్వారా సమాజాన్ని మేలుకొలుపుతాడు.

7. భక్తిచైతన్యం :

            మొక్కరో మోసపోక మీకు దిక్కుదెస అయిన ఆదిదేవునికి

          (మారుచే) తులియవద్దు మారుగాళ్ళీయవద్దు

          బీర(రా?)న గుండెలు గోసిపెట్టవద్దు” (4-2-62)

-అనే సంకీర్తనలో అన్నీ తానైవున్న ఆదిదేవునికి నమస్కరించాలి. కానీ మూఢభక్తితో మారుగాలళ్ళివటం, గుండెలు కోసివ్వటం, జీవాలను బలివ్వటం వంటి దురాచారాలు మానాలని తెలియజేస్తాడు. భగవంతుడిచ్చిన ఈ జన్మ ఆయనను భక్తితో సేవించాలే గానీ, మూర్ఖత్వంతో తిరిగి ఆయనకే బలిచేసుకోవటం మానవత్వం అనిపించుకోదని పండుగ సందర్భాల్లో దేవుళ్ళకిచ్చే మొక్కుబడులనుద్దేశించి అంటాడు.

            “ఉన్న విచారము లేల వోహో సంసారలాల

          యిన్నిటికితఁడే రక్షయిదే మికు మనరో”

- అన్న సంకీర్తనలో పేదసంసారుల కష్టాలను తీర్చేది భగవంతుడేనని చెబుతాడు. పేదలు డబ్బులేక బాధపడుతుంటే ధనికులు ఆరోగ్యం లేక, మనశ్శాంతి లేక క్షోభపడుతుంటారు. కాబట్టి భవరోగ వైద్యుడైన భగవంతుని సేవే భువిరోగాలకు మందు అంటూ చైతన్యపరుస్తాడు.

            భక్తినీవై దొకటె పరమ సుఖము

          యుక్తి చూచిన నిజం బొక్కటీ లేదు

          కులమెంత గలిగెనది కూడించు గర్వంబు

          చలమంత గలిగెనది జగడమే రేఁచు (3-322)

అనే సంకీర్తనలో కులం గర్వాన్ని, పంతం జగడాన్ని ధనం లోభాన్ని, విద్య అహంకారాన్ని, స్త్రీ సాంగత్యం తాపాన్ని, సంపదలు చింతని కలిగిస్తాయేకానీ వాటివల్ల మనిషికి సుఖం ఉండదని నిజమైన సుఖమంటే దైవభక్తియేనని సమాజానికి సూచిస్తాడు.

            “తన కోపమే తన శత్రువు -తన శాంతమే తనకు రక్ష” అన్నట్లుగా కోపం వలన కలిగే దుఃఖాలు, నష్టాలను తెలియజేస్తాడు.

            కోపము మానితేనే కోటి జపాలు సేయుట

          పాపము సేయకుంటేనే బలు తపము” (21-241)

మానవుడు దానవుడుగా మారకుండా సద్గుణాలు కలిగివుంటే జపతపాలు, పుణ్యకార్యాలు చేసినంత ఫలమని చెబుతాడు. పరస్త్రీలను తాకడం, దురుసుగా వ్యవహరించడం వంటివి పాపాలను కలిగించేవి. కాబట్టి అలాచేయక సన్మార్గంలో నడవాలని సమాజానికి హితవు పలుకుతాడు.

          వెరతు వెరతు నిండు వేడుక పడనిట్టి

          కురచబుద్ధుల నెట్టు గూడుదునయ్య”

          దేహమిచ్చినవాని దివిరి చంపెడువాడు

          ద్రోహిగాక నేడు దొరయట

          ఆహికముగనిట్టి అధము వ్రిత్తికినే

          సాహసమున నెట్టు చాలుదునయ్య”

అనే సంకీర్తనలో నీచస్వభావులు బుద్ధితక్కువతో తనకు శరీరాన్నిచ్చిన వారిని, తోడబుట్టినవారిని, కన్నబిడ్డలని, తల్లిదండ్రులని అశాశ్వతమైన సంపదకోసమో, ఇతరమైన భోగభాగ్యాలకోసమో అల్పబుద్ధితో చంపి పాపం చేస్తుంటారు. అటువంటి వారు తగిన శిక్ష అనుభవిస్తారన్న నిజాన్ని తెలియజేస్తూ, ఆ నీచులలో మార్పుని కోరతాడు.

మానవుడి నీచాతినీచమైన జీవనాన్ని నిందిస్తాడు అన్నమయ్య. మనుషులు సంపడకోసం, సుఖంకోసం, ఎంతకైనా దిగజారుతారని అంటాడు.

            ఛీ ఛీ నరుల దేటి జీవనము

          కాచుక శ్రీహరి నీవే కరుణింతు గాక”

- అనే సంకీర్తనలో మనిషికంటే అడవిలో నివశించే మృగాలు, పశుపక్ష్యాదులు, సరీసృపాలు మొదలైనవి ఎంతో మేలని తన లాభం కోసం, తన క్షేమం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కుతాడు, ఎంతనీచానికైన దిగజారుతాడని చెప్పటం ద్వారా సమాజంలో మనిషి మసలుకోవాల్సిన తీరుని తెలియజేస్తున్నాడు.

8. ముగింపు:

అన్నమయ్యది కేవలం భక్తిమార్గమేకాదు. అందులో మానవుని ఈ ఐహికసుఖాలు శాశ్వతంకాదని శాశ్వతమైనది పరమాత్ముడేనని బోధ. తన కీర్తనల నిండా సమాజ చైతన్యం కనిపిస్తుంది. సర్వమానవ సమానత్వం ఆయనను ప్రజాకవిని చేసింది. ఆయన పాట కడజాతివాని నోటా పలికింది. చైతన్య పరచింది. తన కలానికి కులమత భేదం లేదు. మనుషులు స్వార్ధం కోసం సృష్టించిన ఈ కుల,మత,జాతిభేదాల్ని పక్కన పెట్టి సామాన్యుడికోసం ఆడాడు, పాడాడు. ఆయన గిరిజనుణ్ణి, హరిజనుణ్ణి మనసార తాకాడు.

స్త్రీ అభివృద్ధిని కాంక్షించాడు. తనలాగే గౌరవించాడు. రాజ్యాధికారాన్ని ఆహ్వానించాడు. దేశానికి రైతే వెన్నుముక అనే భావన ఏనాడో చేసాడు. చేతివృత్తులు దేశానికి మూలమన్న సిద్ధాంతంతో ముందుకు సాగాడు. విద్యనేర్చి అజ్ఞానులైన మూర్ఖుల్ని నిందించాడు. మంచిసంస్కారం అలవరచుకోవాలన్న భావన కలిగించాడు. కుఠిల మనస్సుల నీచబుద్ధి సమాజానికి నష్టమని చెప్పాడు.

సంసారసాగరంలో పడి భక్తి మార్గాన్ని వీడొద్దని సూచించాడు. మనిషిలోని అంతఃశత్రువులను నశింపజేసుకోవాలని తెలియపరచాడు. ఇలా సమాజంలోని అన్ని కోణాలను స్పృశించి, ప్రభావితం చేసిన అన్నమయ్య అంతిమంగా వీటన్నిటిని భగవంతుడితో సమన్వయిస్తాడు. సమాజంలో ఉన్న అన్ని అసమానతల్ని దురాచారాల్ని రూపుమాపి సర్వమానవ సమానత్వం అన్న భావన కలిగించటానికి దైవాన్ని ముందుంచి ఈ సమాజాన్ని అభ్యుదయ మార్గంలో నడిపించాడు.

9. పాదసూచికలు:

  1. గంగప్ప ఎస్., అన్నమాచార్య సంకీర్తన సుధ, పుట.214
  2. లీలావతమ్మ పొన్నా, పదకవితా వైజయంతి, పుట.18

10. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గంగప్ప ఎస్., అన్నమాచార్య సంకీర్తన సుధ, శశీప్రచురణలు, గుంటూరు, 1995
  2. గురు జ్యోతిర్మయి కొండవీటి, అన్నమయ్య దివ్యశక్తి సంకీర్తనలు, ఎమ్మెస్కోబుక్స్‌, హైదరాబాద్‌, 2010.
  3. నాగయ్య జి., తెలుగు సాహిత్య సమీక్ష, నవ్యపరిశోధక ప్రచురణలు, ప్రథమసంపుటం, తిరుపతి
  4. లీలావతమ్మ పొన్నా, పదకవితా వైజయంతి, పొన్నా పబ్లికేషన్స్‌, పానకం, 1993
  5. శ్రీరంగాచారి అంగలూరు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుని శృంగారసంకీర్తనలు - మధురభక్తి, శ్రీ రాజేశ్వరి ప్రింటర్స్ & స్టేషనర్స్, హైదరాబాద్, 1995

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]