headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

23. సంప్రదాయ తెలుగుసాహిత్యం: భారతీయజీవనసంస్కారం

డా. మోదుగు కాశీంబాబు

తెలుగు రిసౌర్స్ పర్సన్,
భారతీయ భాషాసంస్థ,
మైసూర్, కర్ణాటక.
సెల్: +91 9908683093, Email: kasimtelugu@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

సంప్రదాయ తెలుగుసాహిత్యంలో ఉన్న భారతీయజీవనసంస్కారాన్ని పరిచయం చేసి, సోదాహరణంగా విశ్లేషించడం ఈ పరిశోధకవ్యాసం ప్రధాన ఉద్దేశ్యం. ఈ వ్యాసరచనకు సనాతన ధర్మము- దాని విశిష్టత వంటి ధార్మికగ్రంథం, కవిత్రయ భారతం, నీతిశతకాలు, భారతనీతికథలు మొదలైన పుస్తకాలు ఉపకరించాయి. దానసంస్కారం, ధర్మం-ధర్మవర్తనం, వాక్సంస్కారం, అపకారికి కూడా ఉపకారం చేయగల గుణం, సత్యవర్తనం, ఉన్నత జీవనమార్గాలు వంటి అంశాలను ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: దానసంస్కారం, ధర్మం-ధర్మవర్తనం, వాక్సంస్కారం, అపకారికి కూడా ఉపకారం చేయగల గుణం, సత్యవర్తనం, ఉన్నత జీవనమార్గాలు వంటి అంశాల ప్రస్తుతి.

1. ఉపోద్ఘాతం:

ఒకదేశ సంస్కృతి సంప్రదాయాలు ఆ దేశ వారసత్వ సంస్కారం పై ఆధారపడి ఉంటాయి. భారతదేశానికి గొప్ప సంస్కారధార ఉన్నది. ఇక్కడి మతం అంటే ప్రకృతి. ప్రకృతిని ఆరాధిస్తూ ఒక క్రమబద్ధ జీవితాన్ని వారసత్వంగా నడిపించటం ఇక్కడి ఆచారం. అంటే మనిషిని ప్రకృతి ఎంతగా ప్రేమిస్తున్నదో అంతగా ప్రకృతిని కాపాడుకుంటూ జీవించటం ఇక్కడి నైతిక బాధ్యతగా కనిపిస్తున్నది. ఒక్కమాటలో భారతీయత అంటే సంస్కారవంతమైన జీవితం. వేల సంవత్సరాలుగా ఈ జీవనవిధానాన్ని సాగిస్తూ మన ప్రాచీన సమాజం వేదభూమిగా వర్థిల్లినది. ఆ వారసత్వం ఇప్పటికీ కొనసాగుతున్నది. మన భారతీయసాహిత్యసంపద అయిన వేదాలు, పురాణేతిహాసాలు ఈ అంశాలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అందులోని కొన్ని విషయాలను పరిశీలించటం ఇక్కడి లక్ష్యం.

 2. భారతీయజీవనసంస్కారం:

అతిథిని దేవునిలా భావించిన ఈ దేశం ‘అతిథిదేవోభవ’ అంటూ ఎంతోమంది గొప్ప దానవీరుల్ని కన్నది. ఇక్కడి కటికపేదవాడు కూడా తనకున్నదానిలో కొంత ఎదుటివారికి పెట్టడం అతిసాధారణం. పురాణకాలంనుంచి ఎంతోమంది మహారాజులు ఆస్తుల్ని, వస్తువులతోపాటు తమ దేహాన్ని, ప్రాణాన్ని సైతం దానం చేసిన గొప్ప చరిత్ర ఈ దేశానికున్నది. కర్ణుడి గొప్ప దానగుణంవల్ల దానకర్ణుడిగా ప్రసిద్ధి. శిబి పక్షిప్రాణానికి సమమైన తన శరీరభాగాన్ని ఖండించి ఇచ్చిన మహావ్యక్తి. హరిశ్చంద్రుడు మాటకోసం రాజ్యాన్ని, తన భార్యబిడ్డల్ని సైతం త్యజించిన త్యాగి. అలాంటి గొప్ప చరిత్రకలిగిన ఈ దేశం సక్తుప్రస్థుడు వంటి పేదబ్రాహ్మణుని కథ ద్వారా భారతీయ జీవనవిధానాన్ని ఎలుగెత్తిచాటుతున్నది.

3. సక్తుప్రస్థునికథ:

ఉంఛవృత్తినాశ్రయించి జీవిస్తున్న ఒక పేదబ్రాహ్మణుడు సక్తుప్రస్థుడు. భయంకరమైన కరువు మూలంగా అతని కుటుంబం చాలారోజులు తిండిలేక పస్తులుంటారు. తర్వాత దొరికిన గడ్డిధాన్యం గింజల్ని ఏరుకొని వచ్చి పిండిచేసుకొని తినబోయే సమయానికి, ఆకలితీర్చమని నకనకలాడుతూ వచ్చిన వృద్ధబ్రాహ్మణుడి ఆర్తిని వింటుంది. అతిథిని దేవుడిగా భావించి మొదట ఆ సత్బ్రాహ్మణుడు, తర్వాత తన భార్య, కొడుకు తమ వంతు పేలప్పిండిని అతిథికి సమర్పిస్తారు. అప్పటికీ అతిథి ఆకలి తీరకపోవటంతో కోడలు మామగారి మనోవేదన చూచి తన భాగాన్ని కూడా అతిథికి సమర్పిస్తుంది. అతిథి ఆ పేలపిండిని అందుకొని ఆనందంగా తన ఆకలి తీర్చుకుంటాడు. అతడి ముఖం వికసించి, పరిపూర్ణంగా సంతుష్టి కలుగుతుంది. అతిథి ధర్మదేవతగా మారి, ఆ బ్రాహ్మణకుటుంబం ముందు ప్రత్యక్షమై, సక్తుప్రస్తా! నీ అతిథి సేవనూ, నీ ధర్మబుద్ధినీ పరీక్షించటం కోసమే నేను ఇలా వచ్చాను. నీ దాన నిరతి, ధర్మదీక్ష, నీ సహనశక్తి నాకు ఆనందాన్ని కలిగించాయి. పుణ్యమూర్తివైన నీవూ, అనుకూలవతి అయిన నీ అర్ధాంగీ, యోగ్యుడైన నీ కుమారుడూ, పతివ్రత అయిన నీ కోడలూ అందరూ ధర్మాత్ములే! అందరూ ఆదర్శమూర్తులే! మీదాన మహత్త్వానికి దేవలందరూ మెచ్చుకొంటున్నారు” అంటాడు. మరుక్షణంలోనే వారిమీద ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. దానమహత్త్వంవల్ల వారి కుటుంబానికి పుణ్యలోకం ప్రాప్తించింది. వారిని చూడటానికి సప్తర్షులు సైతం ఆశపడ్డారు. దివ్యలోకం నుంచి రత్న విమానం వచ్చి, వారిని తీసుకెళ్ళింది. ఈ కథంతా ఒక చెట్టు చాటున ఉండి చూసిన ముంగిస ధర్మరాజు సభా మధ్యంలో నిలబడి సభ్యులందరికీ తెలియజేసింది. ఆ కథవిని సభాసదులందరూ ఆశ్చర్యపోతారు.

సక్తుప్రస్థుడు అతిథిదేవుణ్ణి పూజించిన చోటుకు వెళ్ళి, అతడు అతిథి పాదాలు కడిగిన స్థలంలో సంచరించాను. అక్కడ ఏర్పడి ఉన్న బురదలో అక్కడక్కడ పేలపిండి రాలి ఉన్నది. అందులో తలా, ఒళ్ళూ తడిసేటట్లు అటూ-ఇటూ పొర్లాడాను. ఆ పుణ్యాత్ముని పూజా మహత్త్వంవల్ల నా తల అంతా బంగారు కాంతులతో మిలమిలలాడి పోయింది. ఆ పేలపిండి రాలిన నేల సోకినంత వరకు నా దేహం ఒక ప్రక్క అంతా సువర్ణమయం అయిపోయింది. ఇదంతా త్యాగబుద్ధితో సమర్పించిన ఆ పేలపిండి మహత్త్వంవల్లనే అని గ్రహించాను. సంతోషంతో నా దేహంలో మిగిలిన భాగం కూడా సువర్ణమయం అయితే బావుంటుందని ఆనాటినుంచి ఈనాటివరకూ ఎన్ని ఆశ్రమాలకో వెళ్ళాను, ఎన్నో పుణ్యప్రదేశాలు చూశాను. ఎన్నో దానస్థలాలు దర్శించాను. ఎన్నో యజ్ఞశాలలు పరిశీలించాను. కాని ఎక్కడా అంతటి మహత్త్వం కన్పించలేదు. ఎంతదూరం తిరిగినా నా రెండవప్రక్క స్వర్ణమయం కానేలేదు. 

ఇంత కాలానికి ఈ మహాత్ముడైన ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తున్నాడని విని ఇక్కడ నా కోరిక తప్పక సిద్ధిస్తుందని ఎంతగానో ఆశపడి వచ్చాను. కాని ఇక్కడ కూడా నా కోరిక తీరలేదు. ఈ మహాయాగంలో అన్ని స్థలాలూ దర్శించాను. దాన జలధారలుపడి తడిసిన బురద నేలలో పొర్లాడాను. ఒంటికి బురద అంటిందికాని బంగారుకాంతి అంటలేదు. నా కోరిక తీరలేదు. నా దేహంలో మిగిలిన ఈ భాగం సువర్ణమయం కాలేదు. అందువల్లనే ఆ సక్తుప్రస్థుడి దానమహత్త్వం ముందు ఈ ధర్మరాజు అశ్వమేధయాగం గొప్పదికాదని  అంటున్నాను. కాబట్టి అనవసరంగా వట్టి పొగడ్తలు చేయక, నా మాటలు అవునోకాదో ఆలోచించండని బంగారు ముంగిస మానవభాషలో మాట్లాడి అక్కడనుంచి అదృశ్యమయింది.

ఈ కథ మన భారతీయ ఇతిహాసమైన మహాభారతంలోది. ఇది భారతీయ జీవనసంస్కారం. అన్నం పరబ్రహ్మస్వరూపం అని నమ్మి, ప్రతిరోజు అన్నం తినేముందు దైవప్రార్థన చేస్తాం, అందరికీ అన్నం దొరకాలని వేడుకుంటాం. అన్నాన్ని వృధాచేయం. పశుపక్ష్యాదులకు సైతం పెడతాం. ఇంటి అరుగుముందు కూర్చుని బాటసారులను, బంధువులను సహపంక్తికి పిలుస్తాం. ఇప్పటికీ భోజనం చేద్దాం రండన్న పిలుపుల్ని పల్లెటూర్లలో వింటుంటాం. అన్నదానాన్ని మన నిత్యజీవనంలో భాగం చేసుకున్నాం. పండుగలకు, శుభకార్యాలకు అన్నదానాన్ని తప్పనిసరి చేసుకున్నాం. మనతో జీవిస్తున్న సాధుజంతువులకు కూడా అన్నం పెడతాం. పొలందున్నినప్పుడు, పంటకోసినప్పుడు పక్షులకి, క్రిమికీటకాలకి కూడా కొన్ని గింజల్ని వదిలిపెట్టడం మన జీవన సంస్కారంలో భాగం.

4. ధర్మవర్తనం:

మనభూమి వేదభూమి. ఇక్కడి ప్రజలు ధర్మవర్తనులు. ధర్మం అంటే ఏమిటో, ధర్మానికి ఈ భూమి ఎంతటి ప్రాధాన్యమిస్తుందో పరిశీలిద్దాం.

            యస్మిన్ దేశే య ఆచారః పారంపర్య క్రమాగతః!

          ఆమ్నాయై రవిరుద్ధ శ్చ స ధర్మః పరికీర్తితః!!

వేదవిరుద్ధం కానటువంటిది, దేశంలోని ఏప్రాంతంలోనైన పారంపర్యంగా అనుసరింపబడుతూ వస్తున్న సదాచారాన్ని ధర్మమంటారు. కాబట్టి మానవాళి మనుగడకి ధర్మమే ఆధారం. ధర్మబలంచేతనే విశ్వం నడుస్తుంది. ధర్మం పూర్తిగా నశించినపుడు, మానవాళి మనుగడకే ముప్పు కలిగి, విశ్వం కూడ నశిస్తుంది. అందుకే “సత్యంవద, ధర్మంచర” అనే వేదవాక్కు అతి ప్రసిద్ధమైంది. ప్రతి మానవుడు “సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి” అని శ్రుతిమాత ప్రబోధిస్తున్నది. ఇదే మన భారతీయ సంస్కృతికి పునాది”.1

 ‘ధరతి విశ్వం ఇతి ధర్మః విశ్వాన్ని ధరించేది లేక రక్షించేది2. ధర్మం అంటే న్యాయం, ఆచారం, వేదం అని అర్థాలు. ధర్మం అంటే మనిషి ఆచరించదగింది. అది మానవత్వాన్ని రక్షిస్తుంది. మానవత్వం ఎందుకు రక్షించబడాలి? మనిషి ఆదిమజీవితాన్ని వదిలి ఒక క్రమబద్ధమైన జీవితాన్ని ఆచరించాడు కాబట్టి. మళ్ళీ ఆదిమజీవితంలోకి పోకుండా, బలవంతుడు బలహీనుడిపై దౌర్జన్యం చేయకుండా, ధన, మాన, ప్రాణాల్ని హరించకుండా ఉండటంకోసం మానవత్వం రక్షించబడాలి.

మనిషికి నిజమైన ధర్మమంటే ప్రకృతి. ప్రకృతిని చూచి మానవుడు ఆచరించాలి. మేఘుడు ఈ సమస్తజీవరాశులకి వర్షాన్నిచ్చి ఫలితంగా ఏమైనా అడుగుతున్నాడా? గాలి, నీరు, అగ్ని, భూమి, చెట్టు ఇలా ప్రకృతిలో ప్రతిదీ ఏ స్వార్థంలేకుండా ప్రతిజీవరాశికి మేలు చేకూర్చుతున్నాయి. మనిషిమాత్రం సమస్తజీవరాసులకంటే బుద్ధిమంతుడయినా స్వార్థంతో అత్యంత హీనదశకు చేరుకున్నాడు. ప్రాణికోటికి సహకరించకపోగా తనజాతికే అన్యాయం చేస్తూ విలువల్ని మర్చిపోతున్నాడు. అయితే వేదకాలంనుంచి సన్మార్గమానవవర్తనాన్ని నిర్దేశిస్తూ మన పూర్వులు చెబుతూనే ఉన్నారు. మనిషి ధర్మవర్తనుడై సాగాలని వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలోనే ధర్మం అంటే ఏమిటి ధర్మవర్తనజీవనం అంటే ఏమిటో ఈ మాటల్నిబట్టి తెలుసుకోవచ్చు.

          ఒరులేయవి యొనరించిన

          నరవర! యప్రియము దన మనంబున కగు దా

          నొరులకు నవి సేయకునికి

          పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్ (భా.శాం.5-220)

“ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు అదే ధర్మం” అని మానవజీవితాన్ని ఎంతో వడపోసి చెప్పిన ఈ మాటలు అత్యంత ఉత్తమమైనవి. ఇటువంటి జీవనవర్తనం కూడా ఎంతో ఉత్తమమైనది.

భారతంలో ‘ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని కాపాడాలి అలా చేయనినాడు ఆ సమాజానికి నష్టం తప్పదని’ హెచ్చరించిన మాటలు పరమాత్ముడైన కృష్ణుడినోట వినబడుతున్నాయి.

            సారపు ధర్మమున్ విమలసత్యము బాపముచేత బొంకుచేఁ

          బారము బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె

          వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని

          స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్ (భా.ఉ.3-273)

నిజానికి ధర్మం పాపం చేత, సత్యం బొంకు చేత చెడగొట్టబడే ప్రయత్నం తాత్కాలికం. ఆ సందర్భంలో కూడా సమర్థులైనవారు ఉపేక్ష చేస్తే అది వారికే చేటు తెస్తుందన్న సత్యాన్ని సమాజానికి హెచ్చరిక చేస్తూ, ధర్మాన్ని గట్టెక్కిస్తూ, యోగ్యులకు సత్యశుభస్థితిని సమకూర్చుతూ దైవం ఎల్లప్పుడూ ఉండటం ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నది.

5. వాక్సంస్కారం:

మాట ఒక సంస్కారం. నోరుమంచిదైతే ఊరుమంచిదవుతుందని ఆర్యోక్తి. మాటకి ఎంతశక్తైనా ఉంది. మహాత్ముడి వంటివారు వాక్శుద్ధివల్లనే ఈ దేశప్రజల్ని స్వరాజ్యం అన్న ఒక్కమాటతో ఏకం చేసింది. వాక్కు మనిషికి భూషణం వంటిది కూడా. మాటని ఎంతో జాగ్రత్తగా ప్రయోగించకపోతే రక్తసంబంధాలు సైతం తెగిపోవటంతోపాటు సమాజంలో విలువను కోల్పోక తప్పదు. అయితే సజ్జనుడు ఎప్పుడూ మంచిమాటలే ప్రేమగా మాట్లాడుతాడు, కఠినంగా మాట్లాడడు. ఒక్కోసారి కఠినంగా మాట్లాడినా కూడా అవి ఎటువంటి హాని చేయవు. ఎలాగంటే చల్లదనంకోసం మేఘుడు కురిపించిన వడగండ్లు రాళ్ళుగా కాక చల్లటి నీరుగా మారతాయి కదా, అలాగే సజ్జనుని కఠినమైన మాటలు కూడా హానిని చేయవన్నది ఆర్యోక్తి. అంతటి శక్తిగల మాటని గురించి ఈ భారతపద్యం హెచ్చరిస్తుంది.

           తనువున విరిగిన యలుగుల

          ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్

          మనమున నాటిన మాటలు

          విను  మెన్ని యుపాయములను వెడలునె  యధిపా! (భా.ఉ.2-62)

విదురుని బుద్ధి ఎంతో అమోఘమైనది. ఆయన ధృతరాష్ట్రునికి చెప్పిన ప్రతిమాట ఈ ప్రపంచాన్ని హెచ్చరిక చేసినట్లుగా ఉన్నది. “శరీరంలోకి దిగిన బాణాలను అతి కష్టంమీద బయటకు తీయవచ్చు, బాణం చేసిన గాయాలను మాన్పవచ్చు, కాని ఇతరులకు కష్టాన్ని కలిగించేట్లు మాట్లాడిన మాటలను తొలిగించడం మాత్రం ఎన్ని ఉపాయాలచేత కూడా సాధ్యం కాదు” అని చెప్పటం ఈ దేశ వాక్సంస్కారాన్ని ఎత్తిచూపుతుంది. ఈ సమాజంలోని ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

అపకారికి కూడా ఉపకారం చేసే సంస్కృతి మన భారతీయ సంప్రదాయంగా ఉంది. ప్రేమ, కరుణ, జాలి, దయ అనేవి ఆ భావనకు ప్రాతిపదికలుగా ఉన్నాయి. గాంధీజీ వంటి వారు కూడా ఒకచెంపకొడితే ఇంకో చెంపచూపమనడంలో ఆంతర్యం దుర్మార్గుడి మనసులో కూడా ప్రేమను మొలకెత్తించటం. అలాంటి గుణవంతమైన జీవితం ఉన్నతజీవనానికి ఉత్తమ ఉదాహరణ. అదే సమాజానికి స్ఫూర్తి. గుణవంతుడు ఇతరులు తనకు అపకారం చేసినా, తనకు అపకారం చేసిన వారికి కీడుచేయక ఉపకారమే చేస్తాడు. ఎలాగంటే పెరుగును కవ్వంతో ఎంత తరచినా అంత వెన్నను ఇస్తుందికదా అదేవిధంగా పరులకి అపకారం చేయనివాడే నిజమైన గుణవంతుడు. అలాంటి ఉత్తమసంస్కార జీవితాన్ని ఈ పద్యం తెలియజేస్తుంది.

            ఉరు గుణవంతు డొర్లు తన కొండపకారము చేయునప్పుడున్

          బరహితమే యొనర్చు నొకపట్టున నైనను గీడుఁజేయఁగా

          నెఱుఁగడు, నిక్కమేకద! యదట్లెనఁ గవ్వముఁ బట్టి యెంతయున్

          దరవఁగఁ జొచ్చినన్ బెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా!

6. నీతివర్తనం:

తీరందాటిన తర్వాత తెప్ప తగులవేయటం అన్న మాట మన వ్యవహారంలో ఉన్నది. చిన్నప్పుడు కోతి, మొసలి కథ చదువుకున్నాం. కోతి మొసలితో స్నేహం చేస్తుంది. రోజు చెట్టుమీదున్న నేరేడు పళ్ళు కోసి మొసలికిచ్చి, తన ఆకలి తీర్చుతుంది. కానీ మొసలిమాత్రం తన భార్యకోసం కోతిగుండెకాయని కోరుకుంటుంది. ఆ నెపంతో కోతిని చంపాలనుకుంటుంది ఆ కృతఘ్నురాలు. ఈ కథను పసితనంనుంచే మనకు అందిచటంలోని ఉద్దేశం ఒక ఉన్నత వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికే. చేసినమేలు మరువకూడదన్న కనీస సంస్కారాన్ని తెలియజేయటానికే. ఇదే భారతీయజీవన సంస్కారం. అలాంటి ఉన్నత సంస్కారాన్ని గురించి ఎత్తిచూపుతుంది భారతం ఉద్యోగపర్వంలో ఒక పద్యం.       

          ఒకరుని చేతిప్రోపును దదున్నతి ప్రాపును గాంచి, యెల్లవెం

          టకును గొఱంతలేక పొగడందగు సంపద నొంది, యట్టి దా

          తకుఁ దుదిఁ గీడు సేసిన కృతఘ్నుని పీనుఁగునైన రోఁత వు

          ట్టక కబళింపఁ గుక్కలు నొడంబడునే కురువంశవర్ధనా (భా.ఉద్యోగ.2-77)

ధృతరాష్ట్రునికి విదురుడు చేసిన గొప్ప హెచ్చరికా వాక్యమిది. ధృతరాష్ట్రుడు ఒకప్పుడు పాండురాజు పోషణలో ఉన్నాడు. ఆ సమయంలో అతడి ఔన్నత్యాన్ని ఆసరాగా చేసికొని, ఏ విషయంలోనూ లోటులేక మంచి సంపద సంపాదించి చివరికి పాండురాజుకే హాని చేశాడు. అంటే పాండురాజు కుమారులకు అన్యాయం చేశాడు. కాబట్టి నీలాంటి కృతఘ్నుడి శవాన్ని కుక్కలు సైతం అసహ్యించుకొని తినటానికి రావని విదురుడు ధృతరాష్ట్రునికి చెబుతాడు. ఆ ఫలితంగానే ధృతరాష్ట్రుడి మోసానికి అతడి వంశనాశనం జరుగుతుంది. ఈ మాటలు కృతఘ్నులకు ఒక హెచ్చరికగా, నీతివర్తనంతో సంస్కారజీవితాన్ని గడపవలసిన అవసరాన్ని సమాజానికి తెలియజేస్తుంది.

ఈ దేశంలో పుట్టిన ఎంతోమంది మేధావులు, తాత్త్వికులు, కవులు ఎప్పటికప్పుడు ఈ సమాజాన్ని జాగృతం చేస్తూ ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదన్న సత్యాన్ని తెలియజేస్తుంటారు, కానీ స్వార్థపరుడైన మనిషిమాత్రం తాను సృజించుకున్న డబ్బునే దైవంగా బతుకుతున్నాడు, మానవత్వాన్ని మరచిపోతున్నాడు. డబ్బే లక్ష్యంగా రక్తసంబంధాలు, స్నేహాలు వదిలి స్వార్థంహెచ్చి ఆస్తులు సంపాదించుకుంటున్నాడు. ఆస్తికోసం అవసరమైతే ప్రాణాలు తీస్తున్నాడు. మనిషి భూమిమీదకి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేడన్న కనీస సత్యాన్ని ఎరుగలేకపోతున్నాడు.

          ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే

          లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి

          త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా

          రికి లేదో మృతి యెన్నఁడుం గటకటా శ్రీ కాళహస్తీశ్వరా (శ్రీకాళ.శ.67)

డబ్బుకోసమో, పదవికోసమో తోటివ్యక్తిని చంపి వాటిని తా సొంతంచేసుకోవాలని చూస్తారుకానీ ఈ వెర్రిమానవులకు ఆ సంపదలేవీ శాశ్వతంకాదని ఆలోచించరు. మూర్ఖులు తమ భార్యబిడ్డలతో కలిసి శాశ్వత సుఖాలు అనుభవించాలని భావిస్తారని శ్రీకాళహస్తీశ్వరశతకంలో ధూర్జటి మహాకవి ఈ ప్రపంచాన్ని జాగృతపరుస్తాడు. ప్రపంచవిజేతగా చెప్పబడిన అలెగ్జాండర్ కూడా ఈ భూమినుంచే తానేమీ తీసుకెళ్ళట్లేదన్నదానికి సాక్ష్యంగా తన చేతుల్ని పైకెత్తి చూపుతూ సమాధి అయ్యాడని ఈ సమాజాన్ని హెచ్చరిస్తున్నట్లు చెబుతారు.

7. నేర్పు:

రాజకీయ నాయకుడు ఓటుకోసం ఓటరుకి డబ్బిస్తాడు, వాగ్ధానాలు చేస్తాడు మొత్తానికి అతని ఓటు పొందటానికి అనేక తంటాలు పడతాడు. ఇలా ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తారు. ఆ మార్గం వారి అవసరాన్నిబట్టి కూడా ఉంటుంది. అయితే ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటం కూడా ఒక కళ అని చెప్పవచ్చు. ఎదుటివారి నుంచి ప్రయోజనం ఆశించినప్పుడు వారికి ఎటువంటి హాని కలగకుండా మృదువుగా ఆ కార్యాన్ని సాధించాలని చెప్పటం లక్ష్యం. 

          మాలకరి పుష్పములు గోయు మాడ్కిఁ దేఁటి

          పువ్వుఁదేనియఁ గొనియెడి పోల్కి నెదురు

          గందకుండఁగఁ గొనునది కార్యఫలము

          బొగ్గులకుఁ బోలె మొదలంటఁ బొడువఁజనదు (భా.ఉద్యో.57)

మాలలు కట్టేవాడు చెట్టునుంచి పువ్వులను కోసినట్టు, తుమ్మెద పుష్పాలనుంచి మకరందాన్ని పీల్చుకున్నట్టు, ఎదుటివానికి బాధ కలగకుండా కార్యాన్ని సాధించుకోవాలి. అంతేకాని బొగ్గులు కావాలనుకున్నవాడు చెట్టును మొదలంటా నరికి నాశనం చేసినట్టుగా, కార్యాన్ని సమూలంగా నాశనం చేసి ఫలసాధనలో విఫలం కాకూడదన్న ఒక టెక్నిక్ (నేర్పు) ని ఈ పద్యంలో తెలుసుకోవాలి.

8. జీవనవేదం:

తెలుగు సాహిత్యంలో ఒక పేరులేని పాత్రగా, భారతీయ సంప్రదాయ జీవన ప్రతీకగా చెప్పుకోదగిన పాత్ర నిగమశర్మ అక్క. వేదపఠనం చేసి ఉన్నతజీవితాన్ని గడపవలసిన నిగమశర్మ వ్యసనాలకు బానిసై, వేదపాఠం మరచి, తల్లిదండ్రుల్ని బాధిస్తూ నీచమార్గంలో నడుస్తున్నప్పుడు ఇదికాదోయ్ మార్గమని తమ్మునికి బుద్ధి చెప్పటానికి పుట్టింటికి వస్తుంది అక్క.

          ప్రారంభించిన వేదపాఠములకున్ బ్రత్యూహ మౌనంచునో

          ఏరా తమ్ముడ! నన్నుఁ జూడఁ జనుదే వెన్నాళ్ళనోయుండి చ

          క్షూరాజీవ యుగమ్ము వాఁచె నినుఁ గన్గోకున్కి మీ బావయున్

          నీరాకల్ మదిఁ గోరు జంద్రు పొడుపున్ నీరాకరంబుంబలెన్ (పాండు.3-33)

చెడిపోయిన తన తమ్ముడికి బుద్ధిచెప్పే సందర్భంలో అతణ్ణి తిట్టక ‘ఏరా తమ్ముడూ, మా ఇంటికి రావడమే మానేశావు. నీకోసం నేనూ, మీ బావా కళ్ళు కాయలు కాచేట్టు ఎన్నో రోజుల్నించీ ఎదురు చూస్తున్నాము, నెలపొడుపు కోసం సముద్రం ఎదురు చూస్తున్నట్లు. కొత్త వేదపాఠాలేమైనా ప్రారంభించావా? వాటికి ఆటంకం కలుగుతుందనా రావడం మానేశావు. నిన్ను చూసి ఎంత కాలమయిందో గదా! అంటూ ప్రారంభించింది. ఒకపక్క ఆత్మీయతను చూపిస్తూనే, సున్నితంగా ఎత్తిపొడుస్తుంది. అతని మనస్సు నొప్పించక మాట్లాడుతుంది. అతను వేదపాఠాలను పక్కనబెట్టి చాలా రోజులే అయిందని ఆమెకు తెలుసు. అయినా తను రాగానే తిట్లు మొదలుబెడితే అతని మనసు విరిగే అవకాశం ఉంది. అప్పుడు కార్యం చెడిపోతుంది. కాబట్టి అలాకాకుండా తన కొడుకుని ఎత్తుకొమ్మని చేతికివ్వటం, స్వయంగా వడ్డించటం, తల దువ్వటంలాంటి పనులు చేసి వాడిలో అనురాగాన్ని నింపే ప్రయత్నం చేసింది. తల్లి తర్వాత తల్లి అక్క కాబట్టి అక్కకు తమ్ముణ్ణి దండించే అధికారముంది, బుద్ధి చెప్పే స్వతంత్రం కూడా ఉంది. అందువల్ల అక్క తమ తల్లిదండ్రుల ప్రేమను గురించి కూడా గుర్తు చేస్తూ వారి మాటలు పెడచెవిన పెట్టొద్దని చెప్పటం ఈనాటి సమాజానికి సైతం చెప్పినట్లు తోస్తుంది. ఈ సందర్భంలో నిగమశర్మ అక్క ప్రవర్తనమంతా కూడా భారతీయ జీవనవిధానాన్ని పట్టి చూపుతుంది.

మానవుడు ఏఏ సందర్భాల్లో ఏఏ విధంగా ప్రవర్తించాలన్న ఎరుకని కలిగిస్తూ ఉన్నత జీవనవిధానానికి మార్గం చూపిన ఈ సుభాషితాలు జక్కన పెమ్మయ సింగధీమణి మకుటంతో రాసినవిగా ప్రయోగరత్నాకరములో ఉదాహరించబడినట్లు చాటుపద్యమణిమంజరి చెబుతున్నది.

9. వివేకవర్తనం:

          మచ్చికలేనిచోట, ననుమానము వచ్చినచోట, మెండుగాఁ

          గుచ్చితులున్నచోట, గుణకోవిదులుండనిచోట, విద్యకున్

          మెచ్చనిచోట, రాజుకరుణించనిచోట, వివేకులుండిరే

          నచ్చట మోసమండ్రు సుగుణాకర! పెమ్మయసింగధీమణీ

          వాసనలేని పువ్వు, బుధవర్గములేని పురంబు, భక్తి వి

          శ్వాసము లేని భార్య, గుణవంతుడుకాని కుమారుడున్, సద

          భ్యాసము లేని విద్య, పరిహాసము లేని ప్రసంగవాక్యమున్

          గ్రాసము లేని కొల్వు, కోరగానివి పెమ్మయ సింగధీమణీ

పైన చెప్పిన పంక్తులన్నీ ఉన్నత సంస్కారానికి ప్రతీకలు. వివేకవంతులు వాసం చేయలేని చోటుల్ని చెబుతున్న ఆ సందర్భం సామాన్యుల జీవనవిధానాన్ని కూడా మార్పుచేసే విధంగా ఉన్నది. వాసనలేని పువ్వు, విశ్వాసంలేని భార్య, గుణవంతుడుకాని కొడుకు మొదలైన మాటలు కేవలం అవి పనికిరానివేనని చెప్పటంకాక, అందులో ఒక ఎత్తిపొడుపు కనిపిస్తుంది. వాసన ఉన్నప్పుడే ఆ పువ్వుని జనం కోరుకుంటారు. పండితులులేని పట్టణం ధర్మవర్తనంతో సాగదు. భార్యాభర్తల మధ్య విశ్వాసం లేనప్పుడు ఆ కాపురం నిలవదు. గుణవంతుడుకాని కొడుకువల్ల వంశం వర్థిల్లదు ఇలా ప్రతిమాటలోని ఒక నిగూఢతను చెప్పటం కనిపిస్తుంది. ఈ మాటలు సమాజం ప్రవర్తించవలసిన జీవనసంస్కారాన్ని అందిస్తున్నాయి.    

10. ఉత్తమసంస్కారం:

వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచంలోకి ఎంతోమంది వచ్చారు, పోయారు కానీ ఎంతమంది ఇప్పటికీ చరిత్రలో చిరంజీవులుగా నిలిచివున్నారన్నది ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన సత్యం. ఇప్పటికీ మనం చెప్పుకునే చారిత్రక పురుషులు వారు సాగించిన జీవనమార్గంవల్లనే చిరంజీవులుగా నిలిచారు. కాబట్టి సత్యవర్తనం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే, సామాజిక అవసరమే. సత్యాన్ని అర్థంచేసుకోక కొందరు వ్యసనాలకు, తాత్కాలిక సుఖాలకు లోనై ధర్మమార్గాన్ని వదలి ఇష్టప్రవర్తనంతో సమాజానికి నష్టంచేసేవారు ఎప్పటికీ నీచులగానే పరిగణించబడతారు.

          నీతి పథంబునన్‌ బ్రదుక నేర్చుట యుత్తమ భంగి; శౌర్య సం

          జాతములై కరం బలరు సంపద లొందుట మధ్యవృత్తి;

          స్ఫీతములైన భారవహజీవనముల్‌ దలఁపం గనిష్ఠముల్‌

          నీతికి బాహ్యులైన, ధరణీవర! మెత్తురె వారి నుత్తముల్‌? (భా.ఉద్యో.2-71)

“నీతిమార్గంలో బ్రతకటం ఉత్తమం. శక్తియుక్తులతో సంపదలు సంపాదించటం మధ్యమం. బరువుగాలాగే అరకొరలైన బతుకులు అధమం. ఉత్తములైనవారు అవినీతిపరుల్ని ఎప్పటికీ మెచ్చరు” అని ఈ పద్యం చెబుతున్నది. కాబట్టి పై వాటిలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి.

11. ముగింపు:

“గతకాలముమేలు వచ్చుకాలము కంటెన్” అని నన్నయగారి మాట. గతమెంతో వైభవంగా సాగిందని నా భావన. గతంలోనే సత్యవర్తనులైన ఎంతోమంది పురుషోత్తములున్నారు. ధర్మానికి కట్టుబడి బతికిన ఒక జీవనశైలి ఉన్నది. ఆ పునాదులపైనే ఈ సమాజం ఇప్పటికీ కొంతైన సత్యవర్తనంతో సాగుతున్నది.

రాముణ్ణి దేవుడిగా కొలిచినా,  రావణున్ని రాక్షసుడిగా కాల్చి బూడిద చేసినా అది వారు నడచిన జీవనమార్గమే. సత్యవర్తనమే ఈ సమాజానికి అవసరం. ఆ భావనతోనే క్రాంతదర్శులైన కవులు వర్తమాన్నాన్ని వడగడుతూ భవిష్యత్తును కలలుగంటారు, సంస్కరిస్తారు. కాలజ్ఞానం చేస్తారు. ధర్మవర్తనం సాగే సమాజాన్ని భావన చేస్తారు.

ప్రజలు ఆ మార్గంలో నడవటానికి సహకరిస్తారు. పైన చెప్పిన ఆ ఋషిపుంగవుల మాటల్లో మన భారతీయ జీవన సంస్కారం ఉట్టిపడుతున్నది. ఆ బింబంలో భవిష్యత్ సమాజాన్ని సరిదిద్దుకోమని స్ఫూర్తినింపుతున్నది.

12. పాదసూచికలు:

  1. సనాతన ధర్మము- దాని విశిష్టత, పుటలు- 1,2
  2. సనాతన ధర్మము- దాని విశిష్టత, పుట- 1

13. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ప్రభాకరశాస్త్రి, వేటూరి. చాటుపద్య మణిమంజరి, వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, మద్రాస్, 1924
  2. రామశాస్త్రి, జి.ఎస్. నీతికథామాల (మన వారసత్వం), తితిదే, తిరుపతి, 2003
  3. వేంకటేశ్వరరావు, కాటూరి. (సంక.), తెలుఁగు కావ్యమాల, సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ, 1986
  4. స్వామి ముకుందానంద. సనాతన ధర్మము- దాని విశిష్టత, శ్రీ రత్నాప్రింటర్స్, రాజమండ్రి, 2004
  5. సుబ్రహ్మణ్యం, జి.వి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్రమహాభారతం, తితిదే, తిరుపతి, 2013

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]