headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

21. డి.కె. చదువుల బాబు ‘వజ్రాలవాన’ బాలకథాసంపుటి: పరిశీలన

గంధం అశోక్ కుమార్

పరిశోధక విద్యార్థి,
యోగివేమన విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ,
వేమనపురం, కడప, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9542414559, Email: ak5774747@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఏ ఇజాల జోలికి పోకుండా సహృదయస్నేహసామ్రాజ్యంలో తన పని తాను చేసుకుపోతూ తన పరిధిలో కృషి చేస్తున్న బాలసాహితి తేజోమూర్తి డి.కె. చదువుల బాబు గా సుపరిచితులైన దూదేకుల కాశీం సాహెబ్ గారికి 2023 సంవత్సరం తెలుగు బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య పురస్కారం ఆయన రాసిన వజ్రాల వాన బాలల కథా సంపుటికి వరించింది. ఈ కథా సంపుటిలో జానపద సాంఘిక కాల్పనిక కథలు ఉన్నాయి ఇందులోని కథలన్నీ నేటి సమాజం లో పిల్లల సమస్యలు, తల్లిదండ్రుల పాత్రను తెలుపుతూ, పిల్లలు తెలుసుకోవలసిన ముఖ్యమైన సామాజిక అంశాలకు సంబందించిన కథల సమాహారంగా కథా సంపుటిని తీర్చిదిద్దారు. డి.కె. చదువుల బాబు వజ్రాలవాన బాలకథాసంపుటి ఈ వ్యాసానికి ప్రథమవిషయసామగ్రి. పత్రికావ్యాసాలు ఈ పరిశోధనకు ద్వితీయ సామగ్రి. ఎంపిక చేసుకున్న బాలకథా సంపుటిలోని జానపద అంశాలు, సాంఘిక, నైతిక విలువల గురించి విశ్లేషించే పద్ధతిలో ఈ వ్యాసం రూపుదిద్ధుకుంది

Keywords: డి కె చదువుల బాబు, తెలుగు, బాలసాహిత్యం, కేంద్రసాహిత్యఅకాడమీ, వజ్రాలవాన

1.ఉపోద్ఘాతం:

‘వజ్రాలవాన’ కథా సంపుటిలో 27 బాల కథలు బొమ్మలతో పిల్లలకు ఆకర్షణీయంగా, ఆకట్టుకునే విధంగా ఉంటాయి . ఇందులో కథలు సాంఘీక, జానపద కథలు కలగలసి ఉంటాయి . సాధరణంగా ఏ రచయిత అయిన కథ రాసిన తరువాత దానికి పేరు పెట్టుకుంటారు, కానీ ఇక్కడ చదువుల బాబు తన కథా సంపుటి కి పేరు ఎంచుకునే సందర్బం లో వచ్చిన ఆలోచనతో ‘వజ్రాలవాన’ అనే పేరు ముందుగా పెట్టి ఆ తర్వాత అదే పేరుతో కథ రాయడం జరిగిందట . అలా తెలుగు బాల సాహిత్యంలో నిలిచిపోయేలా కేంద్రసాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.

2. రచయిత పరిచయం:

డీకే చదువులు బాబు కడప జిల్లాకు చెందిన బాల సాహితీవేత్త. తెలుగు ఉపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నారు. ఈయన రచన ప్రస్థానానికి 1986 ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివే సమయంలోనే బీజం పడింది. అప్పుడు ఆయన రాసిన 'బల్లి తన పాటేరుగదు' కథను బొమ్మరిల్లు పత్రికలో ప్రచురించారు. అలా తొలి కథ ప్రచురణ ప్రోత్సాహంతో మొదలైన రచన ప్రస్థానం 40 సంవత్సరాలపాటు నిరంతరాయంగా సాగింది. నేడు జాతీయ స్థాయిలో తెలుగు విభాగంలో ఉత్తమ బాల సాహిత్య రచయితగా స్థానం లభించింది. ఇప్పటివరకు సుమారుగా 700 పైగా బాల కథలు రాశారు. బాలల కథలు, విజయ రహస్యం, బం కల, చిన్నారి మనసు, కరాళకథలు, మాయావిసనకర్ర, దేశభక్తి, వజ్రాల వాన లాంటి అనేక బాలకథా సంపుటాలు వెలువరించారు. 50కి పైగా బాలగేయాలు కూడా రాశారు. చిన్నారి మనసు, నవ లోకం, ఆకుపచ్చ ఆయుధం తదితర నాటకాలు కూడా రాశారు. శిల్ప సుందరి, కామరూపిణి అనే బాల నవలలు రచించారు. ఇప్పటికీ నిరంతరాయంగా రచన చేస్తూ ఉన్నారు.

బాలలను దేశ అభ్యున్నతికి అనుకూలంగా తీర్చిదిద్దడంలో మంచి సమాజాన్ని రూపొందించడంలో బాలసాహిత్యం ప్రముఖపాత్ర వహిస్తుంది. ఏ దేశంలో బాల సాహిత్యం ఉన్నత ప్రమాణాలు సంతరించుకుంటుందో ఆ దేశ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. సమాజం సన్మార్గంలో నడవాలంటే బాలల నడవడికను మంచిగా కీడు చేయాని, బాధ్యత కలిగిన వ్యక్తిత్వం కలవారిగా ఆత్మస్థైర్యంతో జీవించడం నేర్పాలి. ఇలాంటి అంశాలన్నీ కలగలిపి రచించడం వల్లే డి కె చదువుల బాబు వజ్రాల వాన కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది .

వజ్రాల వాన కథా సంపుటిలో 27 బాలల కథలు ఉన్నాయి. ప్రతి కథలోను బాలలను నీతి, నిజాయితీ, నైతిక సామాజిక అంశాల గురించి ప్రస్తావన చేస్తూ బాలలు సన్మార్గంలో నడిపించే విధంగా ఉంటాయి. ఇందులో ప్రతి కథా ప్రారంభంలో కథ యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ ‘కథ చదివి తెలుసుకుందాం రండి’ అంటూ ఆసక్తిని పెంచుతూ కథను పిల్లల చేత చదివించే విధంగా ఉంటాయి.

 3. అమ్మ గొప్పతనం :

అమ్మ గొప్పతనం పిల్లలు తెలుసుకోవాలని ఉద్దేశంతో రచయిత మొదటగా అమ్మ కథతో ప్రారంభించాడు. ఈ కథలోకి వెళ్తే “ అవంతిపురాన్ని పాలించే ధర్మనందుడనే రాజు హోలీ పండుగ సందర్భంగా ప్రదర్శనకు అతి విలువైన తెచ్చి పెట్టమన్నాడు. మరొక సందర్భంలో పనికిరానివి ప్రదర్శనకు తెచ్చి పెట్టమన్నాడు. ఒక అమ్మాయి రెండు ప్రదర్శనలలోనూ అమ్మ చిత్రపటం ఉంచి బహుమతి పొందుతుంది. మొదటిసారి బహుమతి పొందిన విలువైన చిత్రపటంలో ఒక స్త్రీ ఐదుగురు పిల్లలకు అన్నం పెడుతూ ఉంటుంది. కాగా రెండవసారి బహుమతి పొందిన పనికిరాని చిత్రపటంలో కూడా అమ్మ బొమ్మే ఉంచి కూడా బహుమతి పొందడానికి గల కారణమే ఈ కథ యొక్క గొప్పదనం. రెండోసారి ప్రదర్శనలో పనికిరాని అమ్మ బొమ్మను చూసిన రాజు ‘ఎవరు గీసారు ఈ చిత్రాన్ని’ అంటూ గట్టిగా అరిచాడు. ‘నేనే మహారాజా’! అంటూ ముందుకు వచ్చింది ఆ అమ్మాయి. గతంలో విలువైనదని అమ్మ బొమ్మ పెట్టింది నువ్వే కదా! మరి ఇప్పుడు పనికిరాని వాటిని తెచ్చి పెట్టమంటే బహుమతి పొందిన అమ్మ బొమ్మను తెచ్చి పెడతావా? అన్నాడు. ‘క్షమించండి మహారాజా! ఆ అమ్మ తన పిల్లలకు అన్నం పెడుతున్న అమ్మ. ఈ అమ్మ ఒక్క కొడుకు కూడా అన్నం పెట్టకుండా పనికిరాదని వదిలేస్తే భిక్షం ఎత్తుకుంటున్న అమ్మ’. తల్లిని పెంచిన దైవం ఉంటుందా?. ఆ నిజం తెలిసిన దేవుడికి పూజ చేస్తారు కానీ కళ్లేదుటే ఉన్న తల్లిని పట్టించుకోరు. తను తిన్నా, తినకపోయినా తమ పిల్లలు తింటుంటే చూసి ఆనందించే తల్లిని పెళ్ళైయి, పెద్దవాళ్ళు అయ్యాక పట్టించుకోక మర్చిపోయి వదిలేస్తారు. పిల్లల సంతోషమే తన సంతోషంగా భావించే తల్లి ప్రేమను వెలకట్టగలమా? కానీ ఇప్పుడు రెక్కలు వచ్చిన కొడుకులకు పనికిరానిదైంది’ అని రాజుతో ఆ అమ్మాయి చెప్పింది. రాజుకు విషయం అర్థమై బహుమతి ప్రకటించాడు”. ( వజ్రాల వాన - అమ్మ -పుట 7 )

ఈ కథ ద్వారా పిల్లలకు చిన్నతనం నుంచే తల్లి ప్రేమ గురించి తెలియజేయడం తల్లి పిల్లలను పెంచడం కోసం పడే కష్టాలను వివరించే ప్రయత్నం రచయిత చేశాడు. నేటి సమాజంలో పిల్లల పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో ఉంటూ, పెళ్లిళ్లు చేసుకుని తల్లిదండ్రులనువృద్దాశ్రమాల్లో వదిలేసి, కన్న వాళ్ళని దూరం పెడుతున్నారు. సమాజంలో ఇలాంటి పోకడలు తగ్గాలంటే పిల్లలకు చిన్నతనం లోనే తల్లిదండ్రుల ప్రేమను రాగాల గురించి తెలియజేయాలి. అలాగే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో వదిలేయకుండా తమతోనే ఉంచుకొని చిన్నతనంలో తమకు ఎలా అయితే యోగక్షేమాలను చూశారో అలాగే వారిని వృద్ధాప్య దశలో వదిలేయకుండా వారి యోగక్షేమాలను చూస్తూ ప్రేమానురాగాలను పంచాలి.

4. చాకచక్యంతో వ్యవహరించడం:

నేటి సమాజంలో బెదిరింపులు మోసాలు దొంగతనాలను సహజమైపోయాయి. వీటి బారినబడి ప్రజలు నానా అవస్థలు పడుతూ, బాధలుకు గురౌతున్నారు. వీటి బారిన పడకుండా తప్పించుకుని ప్రయత్నం చేయాలని, ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైన తెలివైన ఆలోచనతో ఎలా బయటపడాలనే అంశంతో ‘చాకచక్యం’ అనే కథ ద్వారా రచయిత తెలియజేశారు.

ఈ కథను పరిశీలిస్తే “యశోదమ్మ తన కొడుకు రాముడు, నారాయణ అనే పాత్రలు ఉంటాయి. ఒక రోజు యశోదమ్మ రాముడికి బియ్యం తీసుకురమ్మని డబ్బు, సంచి ఇచ్చి పంపిస్తుంది. రాముడు బియ్యం తీసుకుని వస్తూ ఉండగా దారిలో కోతి ఆడిస్తూ ఉన్న ఒకచోట ఆగి, ఆటను చూస్తూ ఉండిపోతాడు. ఆట చూడటంలో మునిగిపోయి బియ్యం సంచి గురించి మర్చిపోతాడు. పక్కనే ఉన్న నారాయణ అనే వ్యక్తి ఆ బియ్యం సంచిని తీసుకొని అదే పరిమాణం కలిగిన ఇసుకతో ఉన్న సంచిని అక్కడ ఉంచి వెళ్తాడు. రాముడు కోతి ఆట అయ్యాక సంచితో ఇంటికి వెళ్లాక సంచిని చూస్తే అందులో బియ్యం ఉండవు. బియ్యం సంచి దొంగతనం చేసి దాని స్థానం ఇసుక సంచి ఉంచారని రాముడికి అర్థమైంది. రాముడు భయపడకుండా కోతి ఆట జరిగిన వీధిలోకి పోయి కొంతమందికి జరిగిన చెప్పి బియ్యం పోతే పోయాయి, ఆ ఇసుక సంచిలో నాకు బం ఉంగరం దొరికింది అంటూ చెప్తాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి క్షణాల్లో నారాయణకు తెలిసింది. వాడు బియ్యం సంచి తీసుకొని పరుగున రాముడు ఇంటికి వెళ్లి ‘పొరపాటున సంచులు తారుమారయ్యాయి ఇదిగో నీ బియ్యం సంచి, నా ఇసుక సంచి నాకివ్వు’ అన్నాడు. సంచి తెచ్చిచ్చాడు రాముడు. ఇందులో ఉన్న ఉంగరం అన్నాడు నారాయణ. ‘ఉంగరం దొరికిందని వీధిలో చెప్పినదంతా కట్టుకథ నేను పోగొట్టుకున్న బియ్యం సంచిని తిరిగి సంపాదించుకొనేకి నేను ఆడిన నాటకం’ అన్నాడు. నారాయణకు రాముడి చాకచక్యం అర్ధమైంది. మారు మాట్లాడకుండా ఇంటిదారి పట్టాడు. రాముడు తెలివిగా ఆలోచించి, తన చాక చక్యంతో తాను పోగొట్టుకున్న సంచిని సంపాదించుకున్నాడు”. (వజ్రాల వాన – చాకచక్యం -పుట 12)

పిల్లలకు విద్యార్థి దశలోనే క్లిష్ట పరిస్థితులకు అసాధారణ సమస్యల్లో ఎలా తెలివిగా ఆలోచించి ఎలా చాకచక్యంగా వ్యవహరించాలో ఈ కథ తెలుపుతుంది. ప్రతి వ్యక్తికి ఏదో ఒక దశలో కష్ట పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిని అధిగమించి వాటి నుండి బయట పడాలి కానీ భయపడి పారిపోకూడదు.

చెట్లు, పచ్చదనం వలన లాభాలు, మద్యం- అవినీతి వలన నష్టాలను తెలియజేయడం :

దేశం అభివృద్ధి చెందాలంటే పాలకులు అధికారుల అవినీతి, ప్రజల తప్పులు గురించి ‘ఐదు ప్రశ్నలు’ అనే కథలో తెలియజేయడం జరిగింది. ఈ కథలో “నందుడు అనే మంత్రి కొడుకు రాజ్యసభలో రాజ్యంలో పట్టిపీడిస్తున్న సమస్యలు, క్లిష్టపరిస్థితులపై చర్చిస్తున్న సందర్భంలో అక్కడున్నవారికి ఐదు ప్రశ్నలు వేసి వాటిని వివరించి వాటితోనే సమస్యలకు పరిష్కారం చూపుతాడు.

 ఆ ఐదు ప్రశ్నలు ఏంటంటే-

 “ఈ ప్రపంచంలో దెయ్యం పట్టిన రాజ్యం ఏది?

 ఈ భూమి మీద రోజు రోజుకు పెరిగిపోతున్న ఎత్తైన తాటి చెట్టు ఉన్న రాజ్యం ఏది?

 ఈ భూమ్మీద ముసళ్ళకు చిలుకలను ఆహారంగా వేస్తున్న దేశం ఏది?

 కాళ్ళు చేతులు తెగిపడుతూన్న తల్లులు ఉన్న దేశం ఏది?

 ఈ ప్రపంచంలో ఆకుపచ్చ ఆయుధాన్ని ఆదరించిన రాజ్యం ఏది”?

అంటూ ఐదు ప్రశ్నలు సంధించాడు నందుడు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పలేకపోయారు కొంతసేపటికి నందుడే వాటికి సమాధానం చెబుతూ వీటన్నిటికీ సమాధానం మన రాజ్యమే అని బదులిచ్చాడు.

వాటికి వివరణ ఇస్తూ ‘మహారాజా! నేను గురుకులంలో విద్యాభ్యాసం చేసుకుని వచ్చాక మన రాజ్య పరిస్థితులు పరిశీలించాను. మన రాజ్యానికి త్రాగుడు దెయ్యం పట్టింది. యువకులు, వృద్దులు అనే తేడా లేకుండా త్రాగి ఊగుతున్నారు. మన రాజ్యంలో అవినీతి అనే తాటిచెట్టు రోజురోజుకి హద్దులు లేకుండా పెరిగిపోతోంది. చిన్నచిన్న ఆడపిల్లలను కన్యాశుల్కం పేరుతో మొసళ్ళు లాంటి ముసలివారికి ఇచ్చి బాల్యవివాహాలు జరిపిస్తున్నారు. తిండిని, గాలిని, నీడను, ఇచ్చే తల్లి లాంటి చెట్లను మన స్వార్థానికి బలై వేళ్ళు, కొమ్మలు తెగి నేలకులుతున్నాయి. వర్షాలనిచ్చి, కరువు కాటకాల నుండి ఈ భూగోళాన్ని కాపాడేది ఏకైక ఆకుపచ్చ ఆయుధం చెట్టు. అలాంటి ఆయుధాన్ని ఆదరించడం లేదు మహారాజా!. తాగుడు దయ్యం పట్టి కుటుంబాలు సమస్యలతో నాశనమవుతున్నాయి. అలాంటప్పుడు రాజ్యంలో ఆత్మహత్యలు ఎలా అగుతాయి. బాల్యవివాహాలతో ఎందరో చిన్నారుల మరణాన్నికి కారణం అవుతున్నాయి. అవినీతి పెరిగిపోయి ప్రజల ధన, మాన ప్రాణాలతో చెలగాటమాడుతోంది. చెట్లను నరికే దేశంలో మొక్కలు పెంచి పెద్ద చేసి ఆదరించని రాజ్యంలో కరువు కాటకాలు కాక పూల వానలు కురుస్తాయా? ఈ అవలక్షణాలన్నీ ఉన్న మన దేశంలో పతనాన్ని కాక సుభిక్షాన్ని ప్రగతిని ఎలా సాదిస్తుంది మహారాజా!’ అన్నాడు.

నందుడు చెప్పిన ఇవన్నీ అక్షర సత్యాలను గ్రహించిన రాజు మద్యాన్ని అవినీతిని బాల్యవివాహాలను అరికట్టేందుకు చర్యలు తీసుకొని చెట్లను పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేశాడు”.( వజ్రాల వాన – ఐదు ప్రశ్నలు -పుట 13)

ఈ కథ ద్వారా మద్యం, అవినీతి,పచ్చదనం, చెట్ల యొక్క విలువలను గురించి అమూల్యమైన విషయాలు చెప్పడం జరిగింది. సమకాలీన సమాజంలో కూడా మద్యం, అవినీతి, కాలుష్యం, వర్షాభావ పరిస్థితులతో ప్రజల సతమవుతున్నారు. వీటిని పారద్రోలాలంటే పిల్లలకు బాల్య దశలోనే ఇలాంటి వాటి దుష్ప్రభావాల గురించి వివరించాలి. అలాగే వాటిని ఆచరించే విధంగా ప్రోత్సహించాలి.

6. మంచి మిత్రుడు:

కొంతమంది పిల్లల్లో చిన్నతనం నుంచి బాగా డబ్బు ఉందని బాగా చదువుతామని అహంకారం గర్వం ఉంటాయి. మనిషి ఎంత ఎదిగిన తోటి వారి పట్ల అహంకారాన్ని ప్రదర్శించరాదు. అలాంటి సందేహాన్ని ‘మంచి మిత్రుడు’ కథ ద్వారా తెలియజేశారు రచయిత. ఈ కథలో “ కిరణ్ చందు ఇద్దరు ఒకే తరగతికి చెందిన బాగా చదివే విద్యార్థులు. కిరణ్ అన్ని పరీక్షల్లో ప్రతిమ స్థానంలో నిలిచేవాడు. చందు ఎంత ప్రయత్నిన రెండో స్థానంతో ఆగిపోయేవాడు. కిరణ్ ను ఉపాధ్యాయులు ప్రశంసించేవారు దాంతో కిరణ్ కు అహంకారం పెరిగి, గర్వం తలకెక్కి తోటి విద్యార్థుల పట్ల చిన్నచూపు హేళన భావం ఉండేది. ఒకసారి కిరణ్ చందు చూచిరాత పుస్తకాలను రాసి ఉపాధ్యాయుడితో చందు దెబ్బలు తినేలా చేశాడు. అయినా చందు కిరణ్ పట్ల సదాభిప్రాయంతో మంచి మిత్రుడుగా ఉంటాడు. పలు సందర్భాల్లో కిరణ్ చందుని, తోటి మిత్రులని హేళన చేస్తూ ఉండేవాడు. అలా జరుగుతూ ఉండగా పాఠశాలలో ఒక రోజు కిరణ్ కూర్చున్నా ప్రదేశంలోకి పెద్ద తేలు వచ్చి కిరణ్ కుట్టబోతుంది. చందు చూసి కిరణ్ పక్కకు లాగి ప్రమాదం నుండి కాపాడాడు. కిరణ్ చందు వైపు కృతజ్ఞతగా చూస్తూ ‘నేను ప్రతి విషయంలో నిన్ను చిన్న చూపు చూశాను అందరి వద్ద గర్వంగా ప్రవర్తించాను. నీకు తెలియని విషయాలు అడిగితే ఎ రోజు నేను చెప్పలేదు. అయినా అవేవీ మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు కృతజ్ఞతలు చందు’ అంటూ కౌగిలించుకున్నాడు. అప్పటినుంచి కిరణ్ అందరు విద్యార్థుల పట్ల స్నేహపూర్వకంగాఉంటాడు”. (వజ్రాల వాన – మంచి మిత్రుడు - పుట 29)

ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల సదాభిప్రాయం కలిగి ఉండాలని ఈ కథ తెలుపుతుంది. మనిషి ఎంత ఎదిగిన తోటి వారి పట్ల సానుభూతి కలిగి ఉండి, వారిలో మంచిని చూడటం, చేతనైన సాయం చేయడం లాంటివి మనిషికి సహజ లక్షణాలు వీటన్నిటినీ పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారు.

7. ఉచితాలు - అనర్థాలు :

ఈ కథ సంపుటిలో ముఖ్యమైన కథ ‘వజ్రాల వాన’. సామాజిక, సాంఘిక అంశాలతో కూడుకొని నేటి సమాజంలో జరుగుతున్నట్టు ఉంటుంది ఇందులోని అంశం.

కథను పరిశీలిస్తే ఇందులో “అమరసేనుడు పాలిస్తున్న రాజ్యానికి మహా తపస్శక్తి సంపన్నుడై రుశ్యంతుడనే మునీశ్వరుడు వస్తాడు. రాజు మునీశ్వరున్ని అతిధి మర్యాదలతో, గౌరవంగా ఆహ్వానించి సపర్యలు చేస్తాడు. రాజు యొక్క ఆతిథ్యానికి, వినయ విధేయతలు, భక్తికి, రాజు పరిపాలన నైపుణ్యానికి సంతోషించి మునీశ్వరుడు ‘ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా రెండు కోర్కెలు కోరుకోమన్నాడు’. రాజు సంతోషంతో ఆయన నమస్కరించి ‘మహర్షి! నా అధీనంలో ఉన్న రాజ్యంలో ప్రతిరోజు వజ్రాల వాన కురిసేలా అనుగ్రహించండి.’ అని కోరాడు. మునీశ్వరుడు ‘రాజా మీ కోరిక సమంజసంగా లేదు మరి ఏదైనా కోరుకోండి’ అన్నాడు. అప్పుడు రాజు ‘మీరు కోరుకోమన్నారు నేను కోరుకున్నాను. రాజు దగ్గరే మాత్రమే కాకుండా నా ప్రజల దగ్గర కూడా సంపద ఉండాలని నా కోరిక మీరు సమంజసం గానే ఉందనిపిస్తే కనీసం మాసానికి ఒక్కసారైనా వజ్రాల వాన కురిసేలా అనుగ్రహించండి’ అన్నాడు. ‘అలాగే మీ కోరిక తీరుస్తాను ప్రతినెలా పౌర్ణమి నాడు వెన్నెల్లో వజ్రాల వాన కురుస్తుంది. రెండో కోరిక అత్యవసర పరిస్థితుల్లో నన్ను స్మరించుకో తీరుస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు మునీశ్వరుడు. అప్పటినుండి ప్రతినెల వజ్రాల వాన కురవసాగింది. ప్రజలు ఎవరి శక్తి కొలది వాళ్ళు వజ్రాలను తెచ్చి ఇళ్లల్లో ఉంచుకున్నారు. అప్పటినుండి రైతులు పంటలు పండించడం మానుకున్నారు. అన్ని వృత్తుల వాళ్ళు వాళ్ళ పనులు మానుకున్నారు. పోరుగు రాజ్యాల కెళ్ళి గుర్రం, బండ్ల మీద నిత్యవసర సరుకులు తెచ్చుకో సా ఇంటినిండా వజ్రాలు ఉంటే ఉద్యోగంతో పనేముందని సైనికులు అధికారులు వాళ్ళ ఇళ్లల్లో ఉండిపోయారు. భూములు బీళ్లయ్యాయి. చిన్నచిన్న వస్తువులకు కూడా పోరుగు రాజ్యాలకు పరిగెత్తడం కష్టంగా మారింది. ప్రతి అవసరానికి పక్కరాజ్యం పైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది.

అదే సమయంలో పోరుగు దేశం రాజుకు వజ్రాల వాని గురించి తెలిసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటే సంపదకు కొరత ఉండదని భావించి యుద్ధం ప్రకటించాడు. సైనికులు లేకపోవడంతో రాజుకు ఏం చేయాలో తోచలేదు. రాజు మంత్రులు యుద్ధం గురించి చెప్పి సైన్యాన్ని సైన్యంలో చేరవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తులు చేసినా ఎవరో పట్టించుకోలేదు. ఇంటినిండా వజ్రాలు ఉంటే ప్రాణాలకు తెగించి యుద్ధంలో చేయాల్సిన పనేముంది. రాజు ఎవరైతే ఏంటి కూర్చొని తినటానికి సంపద వజ్రాలు ఉన్నాయి కదా అని ప్రజలు ఎన్నకుండిపోయారు. అమర సేన రాజుకి ఏం చేయాలో తోచకపోవడంతో దండయాత్రకు వచ్చిన రాజుతో ‘రెండు మాసాల సమయం ఇస్తే మీ రాజ్యంలో కూడా వజ్రాల వాన కురిసేలా చేస్తాం’ అని గడువు తీసుకొని యుద్ధ పరిస్థితులను సద్దుమణిగేలా చేశాడు. తన రాజ్యంలోని పరిస్థితులను గమనించి రుష్యంత మునీశ్వరున్ని ప్రార్థించాడు. ‘జీవుల ప్రాణాలు నీరు ఆహారం మాత్రమే కాపాడగలవని వీటిని సమకూర్చిన వర్షం చినుకులు వజ్రాల కంటే విలువైనవని నీటిని మించిన సంపద లేదని అర్థమైంది మహర్షి! నా రెండువరంగా ఈ వజ్రాల వానను నిలిపిసి వర్షాన్ని ప్రసాదించాలని’ వేడుకున్నాడు. ఆ మాసం నుండి వజ్రాల వాన ఆగిపోయింది వర్షం కురవసాగింది ప్రజలు రెండు మాసాలుగా ఎదురు చూశారు వజ్రాల వాన రాలేదు. ఉన్న వజ్రాలతో ఆహార ధాన్యాలు కొందామన్నా వర్షాలు సరిగా పడక ఏ రాజ్యంలో పంటలు ఆ రాజ్య ప్రజలకే సరిపోతున్నాయి. నిత్యావసర వస్తువులు దొరకడం కష్టమైంది. ప్రజలకు పరిస్థితులు గ్రహించి, బీడు భూములను బాగు చేసుకుని వ్యవసాయం చేపట్టారు. అన్ని వృత్తుల వాళ్ళు ఎవరి పని వారు చేయసా సైనికులు ఉద్యోగులు వారి పనుల్లో చేరారు అనతి కాలంలోనే రాజ్యంలో పరిస్థితులు చక్కబడ్డాయి అమరసేన రాజు రాజ్య పరిస్థితులను చూసి సంతోషించారు”.( వజ్రాల వాన -వజ్రాల వాన -పుట 40).

ఈ కథ నేటి సమకాలీన సమాజానికి అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత హామీలు పేరుతో ఇస్తున్న ధనం, వస్తువుల వలన చెకూరే అనార్థాల గురించి తెలిపేలా ఉంది. ప్రజలకు ఉపాధి మార్గం చూపాలి వారికి ఉచితంగా ఇవ్వడం వలన పనులు చేయక సోమరులుగా మారి దేశ పరిస్తితులు తారుమారై అభివృద్ధి కుంటుపడుతుంది. అందుకే ఉచితాల పేరుతో ప్రజలకు ధనం, వస్తువుల ఇవ్వకుండా వారికి ఉపాధిని చూపించాలి. మెరుగైన జీవనం విధానాన్ని అవలంబించే విధంగా చూడాలి. విద్యార్థులకు కూడా ఉచితంగా పొందే వాటి వల్ల జరిగే అనర్థాల గురించి తెలియజేసే విధంగా ఈ కథ ఉంది. కష్టేఫలి అంటారు. కష్టపడకుండా వచ్చిన వాటికి విలువ ఉండదని గ్రహించుకోవాలి.

8. ఆరోగ్య సమస్యలు గురించి:

చాలామంది పిల్లలు దొరికిందల్లా తింటూ చిన్న వయసులోనే ఉబకాయులుగా మారి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చిన్న వయసులో వారికి వాటి ద్వారా కలిగే దుస్ప్రభావాలు అర్థం కావు. కానీ పెద్దయ్యాక సమస్యలు వచ్చాక అప్పుడు అర్థమవుతుంది. అలాంటి వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని రచించినట్టుగా ‘తిండిపోతు శంకరయ్య’ కథ ఉంటుంది. ఇందులో “రామనాథం కొడుకు అయిన శంకరయ్య దొరికిందల్లా తింటూ తిండిపోతు గా మారి ఏ పని చేయకుండా సోమరిగా ఉంటాడు. శంకరయ్యకు పెళ్లి వయసు వచ్చింది. ఎవరూ పిల్లనివ్వడానికి ఇష్టపడేవారు కాదు. రామనాథం కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాడు.

ఒకరోజు పట్నంలో వ్యాపారం చేస్తున్న మిత్రుడు జగన్నాథం వచ్చాడు. రామనాథం తన కొడుకు గురించి చెప్తాడు. మిత్రుడి బాధ చూసి శంకరయ్యను తన వద్ద ఉద్యోగంలో చేర్చుకుంటాను అన్నాడు. జగన్నాధం శంకరయ్యను ఉద్యోగంలో చేర్చుకొని ‘నీకు కష్టమైన పనేది చెప్పను కొత్త కదా పట్నం అంతా చూస్తూ ఖాళీగా తిరుగు నీకు కొన్ని చిరునామాలు ఇస్తా వారి దగ్గర బాకీలు వసూలు చేసుకురా అంతే ఇందులో కష్టమేముంది. బాకీలు వసూలు అయ్యేవరకు తిరుగుతూ ఉండు అంతే’ అన్నాడు. పట్నం కొత్త కావడంతో శంకరయ్య సరే అని అన్నాడు. ఆరు నెలల వరకు జీతం ఇవ్వని ముందే షరతు పెట్టాడు జగన్నాధం. శంకరయ్య తన భారీకాయంతో రోజు తిరగుతూ, బాకీలు వసూలు చేస్తూ ఉండేవాడు అలా రోజు బాకీల కోసం తిరగడం దినచర్యగా మారింది. ఆరు నెలలు గడిచింది జగన్నాథం పెట్టిన భోజనం తప్ప చిరుతిల్లు తినడానికి డబ్బు లేకపోవడం వల్ల శంకరయ్య సన్నగా తయారయ్యాడు తనకు తెలియకుండానే తన శరీరంలో జరిగిన మార్పులను చూసుకొని శంకరయ్య సంతోషించాడు. అప్పటినుంచి తిండి మీద ధ్యాస తగ్గి పనిలో నిమగ్నం అవుతూ ఉన్నాడు. శంకరయ్య యొక్క పనితనాన్ని మెచ్చుకున్న జగన్నాథం తన కూతుర్నే ఇచ్చి వివాహం చేసి పట్నంలోనే ఒక వ్యాపారంపెట్టించాడు.” (వజ్రాల వాన -తిండిపోతు శంకరయ్య -పుట 44)

ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో వ్యాయామానికి శరీర ఆరోగ్యానికి కొంత సమయం కేటాయించుకొని అమూల్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు ముఖ్యంగా పిల్లలు ఇలాంటి కథలు తెలియజేయడం వల్ల సరైన జీవన విధానాన్ని మెరుగైన ఆరోగ్యానికి పునాదులు వేసిన వారవుతాము.

 9. ముగింపు:

వజ్రాల వాన కథా సంపుటికి లో సందేశం విలువలతో కూడిన కథలు కేవలం మానవ పాత్ర ద్వారానే కాకుండా జంతువుల పాత్ర ద్వారా కూడా రచయిత తెలియజేశాడు. నేర్చుకున్న విద్య ద్వారా అందుకున్న లాభాలను నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి అందించి వారికి చేదోడుగా నిలవాలని  'కోతి వైద్యం' కథ ద్వారా తెలియజేశారు. శత్రువుల నుండి ప్రమాదం ఉన్నప్పుడు మనం ఎదుర్కోలేకపోయినా వారికి తగిన బుద్ధి చెప్పేవారు ఉంటారు. అలాంటి వారి చేతనే వారికి గుణపాఠం చెప్పించాలని తెలివైన లేడి కథ ద్వారా తెలియజేశారు. అలా వజ్రాల వాన కథా సంపుటిలో  ప్రతి కథ ద్వారా సందేశాలను తెలియజేయడం, నైతిక సామాజిక అంశాలు బోధిస్తూ, మానవవిలువలను గుర్తు చేసే ప్రయత్నం చేశారు చదువుల బాబు గారు. బాల కథాసంపుటాల్లో కథలు పిల్లలు మాత్రమే కాదు పెద్దవారు కూడా చదివి ఆచరించాలి అనే విధంగా ఉంటాయి. బాల కథలు బాలలను ఉద్ధేశించి రచించడం వలన అవి బాలలకే పరిమితం అయ్యాయి. సందేశం, విలువలతో కూడిన కథలు ఏవైనా ఆదరించి ఆచరించవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది.

వజ్రాలవాన కథాసంపుటిలోని కథలు చదివిన వారిని ఆలోచనలో పడేసేవిధంగా ఉన్నాయి. చదువుల బాబు తన రచనా ప్రస్తాన్నని నిరంతరం కొనస్సాగిస్తూ మరెన్నో సాహిత్య పురస్కారాలు అందుకొని నేటి నవ రచయితలకి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను.

10. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోనున్న చదువుల బాబు, ప్రభ దినపత్రిక, అక్టోబర్ 29-2023. ప్రొద్దుటూరు.
  2. చదువుల బాబు డి .కె . వజ్రాల వాన(2019), రవీంద్ర -తిలక్ ప్రచురణలు, ప్రొద్దుటూరు.
  3. దేవదాసు, పి.ఎస్‌, దేవదానం. పి. బాలసాహితమాల(1963), ఆంద్రప్రదేశ్ పౌరగ్రంధాలయ శాఖ.
  4. వెంకటప్పయ్య వెలగా. బాల సాహితి వికాసం (1982), సిద్దార్థ పబ్లిషర్స్, విజయవాడ .
  5. వెంకటప్పయ్య వెలగా. మహీధర జగన్మోహనరావు. ఆంధ్రవాజ్మయసంగ్రహసూచిక- బాల వాజ్మయం, (1929) ఆంద్రప్రదేశ్ గ్రంధాలయ సంగం, విజయవాడ.
  6. సహృదయ బాలసాహితీమూర్తి, సాహితీ గవాక్షం, ఆంద్రప్రభ దినపత్రిక. 06-11-2023.

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]