headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

20. తెలుగుకావ్యాలు: జాతి, వార్తా, చమత్కారాలు

వేపాడ మమత

పరిశోధక విద్యార్థిని,
ఆంధ్ర విశ్వవిద్యాలయం,
చోడవరం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7981758590, Email: mamatha.vepada@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్యం ఉద్భవించిన క్రీ.శ.11 శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు తెలుగు సాహిత్యంసమకాలీన, సామాజికజీవితానికి కావలసిన విలువలను వివరించి చెప్పడానికి ప్రయత్నించింది. నన్నయ, తిక్కన యుగాల వరకు వెలసిన 'ఆంధ్ర మహాభారతం' తలమానికం. వీరు చిత్రించిన పాత్రల్లో తెలుగువారి స్వభావాలు గోచరించే అవకాశం ఉంది. ఇవేవీ సమకాలీన సమాజంలోని జీవిత వాస్తవికతను ప్రత్యక్షంగా కావ్య దర్పణంలో చూపించే ప్రయత్నాలు కావు. జీవితంలోని ఉత్తమ విలువలను అనుసరించడం లేదా తిరస్కరించడం వలన కలిగే లాభనష్టాలను సాహిత్య మర్యాదను ఆశ్రయించి చెప్పేది కావ్యేతిహాసం. ప్రజలు ఆ కాలంలో జీవించే బ్రతుకు తీరుతెన్నుల కంటే ప్రజలు ఏ కాలంలోనైనా జీవించవలసిన బ్రతుకు చింతలను రేకెత్తించడానికి కవిత్రయ సాహిత్యం కృషి చేసింది. శ్రీనాథ యుగం లో వచ్చినన్ని సాహితీ ప్రక్రియలు మరి ఏ యుగంలోని రాలేదంటే అతిశయోక్తి కాదేమో! జాతి, వార్త, చమత్కారాలకు ఈ యుగంలోనే భీజాలు పడ్డట్టు కనిపిస్తుంది. అంతవరకు సామాన్య ప్రజలను పట్టించుకునే నాధుడే లేడు. సామాన్య ప్రజల సాంఘిక జీవితానికి సంబంధించినవి, కవి తాను స్వయంగా చూసిన విషయాలు సాహిత్యంతో మేళవించి చెప్పడమే జాతి, వార్త, చమత్కారాలు. ప్రాచీన కావ్యాలలో ఉన్న జాతి, వార్త, చమత్కారాలు గురించి వివరించడమే ఈ వ్యాసం / పరిశోధన ముఖ్య ఉద్దేశం.

Keywords: జాతి, వార్త, చమత్కారాలు, తీరుతెన్నులు, నిర్వృతయే, క్రాంత దర్శి, ప్రకృష్టమైన, సంధాయకుడ, birth, race, caste, అవస్థా విశేషం, రసాహ్వయా, వెలది, వెలవెట్ట, నీదండ, national integrity.

1. ఉపోద్ఘాతం:

ఆదికవి నన్నయ ఆంధ్ర మహాభారతం ఇతిహాసానికి చెందినది. పాల్కురికి సోమన దేశీ కవిత్వం, శతకం వైపు మొగ్గు చూపినప్పటికీ ఇతడు రాసిన బసవ పురాణము,పండితారాధ్య చరిత్రలో కొన్ని సమకాలీన అంశాలను, ప్రజల జీవనాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. తిక్కన సోమయాజి ఆంధ్ర మహాభారతం, నిర్వచన రామాయణాలు ఇతిహాస, పురాణాలకు సంబంధించినవి. ఎర్రన కూడా వీరి బాటలోనే నడిచాడు. శ్రీనాథ యుగ కాలానికి ప్రక్రియ వైవిధ్యంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ యుగంలోనే సమకాలీన సామాజిక, సాంఘిక పరిస్థితులపై కావ్యాలు రాయడం మొదలుపెట్టారు. అందుకే శ్రీనాథ యుగ కాలాన్ని చాలా ప్రత్యేకమైన సంధి కాలంగా చరిత్రకారులు కొనియాడుతారు. ఈ పరంపర రాయల యుగానికి కూడా దారితీసింది. అత్యద్భుతమైన ప్రబంధ కావ్య రూపాన్ని దాల్చింది.

2. కావ్యం:
“కావ్యం యశసే అర్థకృతే, వ్యవహార విదే శివేతర క్షతయే
సద్యః పర నిర్వృతయే కాంతా సమ్మిత తమోపదేశయుజే” - మమ్ముటుడు
కావ్యం యశస్సును కలిగించడంతోపాటు వ్యవహార దక్షతను అందిస్తుంది. అర్థకృతం, శివేతర క్షితి, సత్య పరానివృత్తి కలిగిస్తుంది. కావ్యం కాంతా సమ్మితంగా ఉపదేశం చేస్తుంది.

కవి అనే శబ్దం 'క్రాంతదర్శి' అనే నానుడి నుండి ఏర్పడిందంటారు. చర్మ చక్షరుంద్రియాలకు అతీతమైన విషయాన్ని చూడగలిగే వాడే కవి. కవి అంటే ఉన్న సత్యాన్ని చూసేవాడు. కావ్యం లోని విషయాన్ని కవి స్వయంగా సృష్టించుకుంటాడు. కావ్యాన్ని మనం చదువుతున్నంత సేపు మన మనసులోని కవి మెదుల్తాడు. కావ్యాన్ని బాగా పరిశీలిస్తే కవి అంతరాత్మ కూడా మనకు దర్శనం అవుతుంది. ముందుగా' కావ్యం ' సంస్కృత సాహిత్యంలోనే వెలిసింది. తరువాతే తెలుగులోనికి వచ్చింది.

కావ్యానికి ఆనందం ప్రధాన ప్రయోజనం. కావ్యం లో ఆనందంతో పాటు ఉపదేశం కూడా ఉంటే మంచిది. అందుచేతనే ఆంధ్ర చింతామణి కర్త 'విశ్వశ్రేయ: కావ్యం' అన్నాడు. ప్రాచీన కవులలో మొదటివాడు భరతుడు ఈయన తన నాట్యశాస్త్రంలో…

'ఇతి వృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం' (ఇతివృత్తమే కావ్యానికి శరీరం) అన్నాడు.          ఈ పరంపరలో చివరి కవి జగన్నాథ పండితురాయని ఉద్దేశంలో…

'రమణియార్ధ ప్రతిపాదక శబ్ద: కావ్యం'  అన్నాడు.  కావ్యానికి అవసరమైన ఆలంకారిక రసప్రధాన్యం, వస్తు సామగ్రిని గురించి ఎంతోమంది లాక్షణికులు విపులంగా వివరించారు.

ఉదా: “నగరార్ణవ శైలర్తు చంద్రార్కోదయ వర్ణనైరి
ఉద్యాన సలిలక్రీడా మధుబాల రథోత్సవైః
విపులంభై ర్వివాహైశ్చ కుమారోదయ వర్ణనైః
మంత్ర దూత ప్రయాణాజి నాయకాఅభ్యుదయై రపి”1

అనే అష్టాదశ వర్ణనలు ఉన్న కావ్యం మహాకావ్యమని సంస్కృత అలంకారికులు (లాక్షణికులు) పేర్కొన్నారు.

కావ్యం యొక్క విస్తృత స్వరూపాలే కథాకావ్యాలుగా ప్రబంధాలుగా తెలుగు సాహిత్యంలో వెలిసాయి. కావ్యంలో ఉండే వర్ణనలు, శృంగారాది రసాలు, అలంకారాలు, శైలి, కవిలోని ప్రతిభ, పాటవాల రూపంలో దాగి ఉంటాయి. శిల్ప సౌందర్యం లేని కావ్యం సర్వాంగ సుందరంగా కనిపించదు. కవిత్రయం వారిలాగే కథాకావ్యాలు రాసిన కవులు కూడా కావ్య శిల్పం దృష్టిలో పెట్టుకొని కావ్యాలను అద్భుతంగా రాసి కథా సంవిధానాన్ని నడిపించారు.

3. ప్రబంధం:

ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధం కలిగినది అని అర్థం. 'ప్రబంధయుగం' అని రాయల యుగానికి ప్రత్యేకంగా పేరు ఉంది. అష్టాదశ వర్ణనలో ఉన్న కావ్యం మహాకావ్యమని సంస్కృత లాక్షణికులు పేర్కొన్నారు. కావ్యము యొక్క విస్తృత స్వరూపమే కథాకావ్యాలు, ప్రబంధాలు మొదలైనవి. ఇదే కావ్యానికి, ప్రబంధానికి మధ్య ఉన్న సారూప్యాన్ని, బేధాలను తెలియజేస్తున్నాయి. సాహితీ సమరాంగణ, సార్వభౌముడుగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు తానే స్వయంగా ‘ఆముక్తమాల్యద’ అనే కావ్యాన్ని రాసి తెలుగు సాహిత్య కళామతల్లి మెడలో మాలగా బాసిల్లాడు.ఆముక్తమాల్యదలో రాయలు ‘జాతి’ అనే పదాన్ని వాడుతూ తన ఇతర రచనల గురించి ఈ క్రింది పద్యంలో పేర్కొన్నాడు.

సీ:  “ పలికితుత్ర్పేక్షోపదుల జాతి  పెంపక్క
        రసికులౌనన మదాలస చరిత్ర”2

4. జాతి, వార్త, చమత్కారాలు:

ఆధునికులలో జి.వి. సుబ్రహ్మణ్యం జాతి, వార్త, చమత్కారాల గురించి ‘సాహిత్య చరిత్రలో చర్చినీయాంశాలు’ అనే గ్రంథంలో వివరించే ప్రయత్నం చేశారు. జాతి, వార్త, చమత్కారాలు పరస్పర సంబంధం కలిగినవి. నన్నయ ‘వార్త యందు జగతి వర్ధిల్లుచుండును’ అన్నాడు.  ‘వార్త’ అనే పదాన్ని ‘వాణిజ్యం’ అనే అర్థంలో వాడాడు. జాతి, వార్త, చమత్కారాలు అనే పదాలు నన్నయ నుండి ప్రబంధ యుగం వరకు ఏక సూత్రంగా ఏ కవి వాడలేదు. దక్షిణాంధ్ర యుగ కవి అయిన చేమకూర వేంకట కవి జాతి వార్త చమత్కారాల గురించి తొలిసారి ప్రస్తావన చేశాడు.

“తారసపుష్టియై ప్రతిపదంబున జాతియు వార్తయున్ జమ
త్కారము నర్థగౌరవము గల్గుననేక కృతుల్ ప్రసన్న గం
గంభీర గతిన్ రచించి మహి మించినచో నిక శక్తులెవ్వర
య్యా! రఘు నాథ భూప రసికాగ్రణికిన్ జెవిశోక చెప్పcగాన్” 3

ఆ తరువాత కాలంలో వచ్చిన కావ్యాలలో చేమకూర వేంకట కవి తర్వాత జాతి, వార్త, చమత్కారాలకు ప్రాధాన్యం ఇచ్చిన కవి సవరం చిన నారాయణ కవి. తనను తాను “కువలయాశ్వ చరిత్ర” ఆశ్వాసాంత గద్యలో ‘జాతి వార్తా కవి జనామోద సంధాయకుడ’ అని చెప్పుకున్నాడు.

“ఒకచో శబ్ద నిగుంపనంబు, లోకచో యుక్తి క్రియా గౌరవం
బొకతో నద్భుత జాతి వార్త, లోకచో నుజ్జృంభితత్త ద్రశ
ప్రకరంబుం గనిపించినన్ మదికి సంభావింప నరహంబుగా
కకటా! యేమియులేని కబ్బమది యాహ్లాదంబు గావించునే”4

తరువాత కాలంలో బైచరాజు పంచతంత్రం అవతారికలోనూ గణపవరపు వెంకట కవి శ్రీ ప్రబంధ రాజ వెంకటేశ్వర విజయ విలాసం కావ్యం లోను జాతి వార్తల గురించి పేర్కొన్నారు.

4.1 జాతి:

జాతికి “Birth, race, caste”5 అనే అర్థాలు ఉన్నాయి. “సమాజంలో కవి చూసిన వాస్తవాన్ని వాస్తవంగా వాజ్మయంలో రికార్డు చేయటం. ఇది 15వ శతాబ్ది సాహిత్య చైతన్యంలోని శక్తివంతమైన ధోరణి. దీనిని తరువాత కాలంలో జాతి అని పిలిచినట్లు తెలుస్తుంది.

ఉదా: శ్రీనాధుని చాటుపద్యం

       'చిన్ని చిన్ని రాళ్లు చిల్లర దేవుళ్ళు    
      నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
      సజ్జ జొన్న కూళ్ళు సర్పంచులను తేళ్లు
      పల్లనాటి సీమ పల్లెటూళ్ళు”6

అనే పద్యం వాస్తవ కథనం. పలనాడులోని అప్పటి పల్లెటూరు స్వభావాన్ని చెప్పిన పద్యం ఇది.

ఇదే పుస్తకంలో మరొకచోట జాతి వార్తలను ఆధునిక కావ్యాలలో చూపించిన సందర్భంలో ‘సమాజంలోని  ఒకానొక అవస్థా విశేషాన్ని వాస్తవంగా ఉక్తి చమత్కారంతో ఆవిష్కరించేది జాతి’8 అంటూ ఉత్పల సత్యనారాయణ చార్యుల కావ్యం నుండి ఉదాహరణలు ఇచ్చారు.

“సినిమాల ఖర్చుకై తన పుస్తకాలమ్మి
డింభాలి డబ్బు గడించి చోటు
సోమకాసురు బోలు చోరులకీనాడు
వ్యాపార రంగమైనట్టి చోటు”7

“స్వాభావికమై కృత్రీమంకాని వర్ణనలు జాతి” అని డాక్టర్ ఎం. కులశేఖర రావు చేమకూర కవితా వైభవంలో పొందుపరిచారు.8

జాతి శబ్దం శబ్దాన్ని ఉద్దేశించి తాపీ ధర్మారావు” దీనినే స్వభావోక్తి అంటారు. జాతికీ స్వభావోక్తికీ స్వల్పమైన బేధము లేకపోలేదు”.9


‘జాతి’- వర్ణన:

కం: “పడతికి cగన్యాధర్మం
బెడలినc గోర యగునే వెండి యెవ్వరికైనం
గడివోయిన పువ్వులు మరి
ముడుచునె రసికుcడగువ cడమోఘ వివేకా!”10

పైన ఉదాహరించిన పద్యంలో, స్త్రీకి కన్యత్వం ధర్మమనీ, కన్యత్వము లేని స్త్రీ జీవితం వాడిపోయిన పువ్వు లాంటిదని అంటాడు అనంతామాత్యుడు. మరి ఏ రసికుడు ఇష్టపడడని వివాహ సమయం వరకు స్త్రీ కన్యగానే ఉండాలన్నది నియమం అంటూ కన్యాధర్మ వివరణచేస్తాడు. ‘జాతి’ అను పదాన్ని చెడిన పూలతో కన్యత్వాన్ని పోల్చి చెప్పటం జరిగింది.

4.2 వార్త:

“సామాజిక సాహిత్య స్పృహతో రచించే కవిత్వంలో ఉండవలసిన మరొక లక్షణం 'వార్త'. 'వార్త' అంటే సమకాలీన సమాజంలోని జనజీవన విధానానికి సంబంధించిన వివరణ”11.

‘కప్పుర భోగిమంటకము కమ్మని గోధుమ పిండివంటయున్
గుప్పెడు పంచదారయును గ్రొత్తగా గాచిన యాలనే పెస
రప్పును గొమ్ము నల్ల నల్లటి పండ్లను నాలుగైదు నంజులన్
లప్పల తోడ గ్రొంబెరుగు లక్ష్మణవజ్షల యింట రూకకున్’

ఒక రూకకే షడ్రుచులతో కూడిన వంటలతో పూటకూళ్ళావిడ విందు పెట్టినట్టు శ్రీనాధుడు క్రీడాభిరామంలో చెప్పుకున్నాడు.

జాతి ఒక వ్యవస్థను వ్యక్తం చేసినట్లే వార్త ఒక వ్యవస్థను వివరిస్తుంది. ఈ రెండు కవిత్వంలో ఎంత ముఖ్యమో వాటిని చమత్కారంగా వ్యక్తీకరించడం కూడా అంతే ముఖ్యం”12. “స్వభోవోక్తిని జాత్యాలంకారం అనే పేరున్నది. 16వ శతాబ్దంలోని కావ్యాలంకార సంగ్రహ (నరస భూపాలయం) కర్త స్వభావముక్తి అనటానికి బదులు 'జాతి' అని అన్నాడు”13 నన్నయ్య 'వార్త' అనే పదాన్ని 'వాణిజ్యం'కి బదులుగా వాడాడు.

“వార్త యందు జగము వర్ధిల్లుచున్నది
అది లేని నాడ అఖిల జనులు
నందకార మగ్నులగుదురు గావున
వార్త నిర్వహింపవలెను పతికి”14

వార్త - వర్ణన

సీ. “గంధర్వుల్పదునాల్గు దోషములు దక్కం దాళమానంబులర్
గాంధర్వంబు  ధ్రువా ప్రబంధ శరణిం గావింపcగా వాద్యముల్
ధిం ధిం ధిక్క ధిమిక్కతక్క ధికతోం ధిక్కత్తకో ఝింకిణిం
ధింధాం ఝంకకు ఝెక్కు ధిగ్ధిగుడ ధాధీ యంచు మ్రోసెన్వెసర్”
కం: “జంభారి యెదుర నాట్యా
రంభమ్మున నూర్వశీ పరాజయ కృత సం
రంభయు నూరుద్వయ జిత
రంభయునై రంభ నిలిచె రంగస్థలిపై”15.

15వ శతాబ్ద కాలంలో అంటే కొరవి గోపరాజు జీవించిన కాలంలో నాట్య ప్రదర్శనలు పోటీలు జరిగేవనటానికి పై పద్యాలు నిదర్శనాలుగా ఉన్నాయి. రంభ, ఊర్వసుల మధ్య ఇంద్రుడు పోటీ పెట్టి మేటి ఎవరో చెప్పమని విక్రమార్కుడుని కోరినప్పుడు వారి నాట్యం గురించిన పద్య మిది.

4.3 చమత్కారం:

“ఆనందః సహజసైతస్య వ్యజ్రతీ,స కధాచన
వ్యక్తిః సా, తస్య, చైతన్య చమత్కార రసాహ్వయా”16

చమత్కారాన్ని నిర్వచించిన అలంకారికులలో ప్రముఖులైన వారు ఆనంద వర్ధనుడు, క్షేమేంద్రుడు భట్టనాయకుడు, కుంతకుడు, విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు మొదలైనవారు. “పూర్వీకుడైన నారాయణుడు చమత్కారాన్ని చిత్తవిస్తారమని రసానందానికి మూలమని తెలిపినట్లుగా”17 రాఘవన్ గారు వివరించారు.విశ్వేశ్వర కవి రాసిన కావ్యము ‘చమత్కార చంద్రిక’. ఆ గ్రంథంలోని శ్లోకం క్రింద విచారిస్తే

“సప్తైతాని చమత్కార  కారణం బ్రువతీ బుధాః
గుణాధీనం వ్యాఖ్యాశోభాకృతోతౌ సాధర్మ్య యోగతః”18

శబ్దాలను ఆశ్రయించి ఉండే చమత్కారానికి గుణ, రీతి, రస, వృత్తి, పాక, శయ్య, అలంకారాలు కారణం అవుతాయని అవి ఏడు రకాలని విశ్వేశ్వరుడు పేర్కొన్నాడు.

'చమత్ కరోతీతి చమత్కారః' అని శబ్దకల్ప ద్రుమం చెబుతోంది. ఇది 'చమ్' ధాతువు యొక్క వర్తమానకాల అసమాపక క్రియ రూపం. “భూమిపై ఉన్నదానిని ఉన్నట్లు చెప్పినా మాటల తేటలు బహుళంగా ఉండేటట్లు చెప్పినా అది 'మహితోక్తి' కావాలి. సహృదయ హృదయంగమై ఉండాలి. ప్రబంధ కవులు అలంకారంగా గ్రహించిన జాతిని సమాజంలో చూసిన దానికి చూసినట్లు చమత్కారంగా, అర్ధ గౌరవంతో, సహృదయ రంజికంగా చెప్పే సామాజిక స్పృహగా గ్రహించారు శ్రీనాథ యుగ కవులు”19

చమత్కార - వర్ణన: ఉదా:

1) “పగలెల్లను దమునేcచిన
పగలెల్లను cదలించి యిరులు
పవుcజులు దనపై దెగి యెత్తి వచ్చునని రవి
పగబెడిన భంగి సపర వనధి నంణంగెన్”20

విక్రమార్కుడు నాగ కన్యకు ఒక దీపపు సమ్మె చేత కథ చెప్పిస్తాడు. నాగ కన్య ఎవరితోనూ మాట్లాడదు. ఆమె ఆ కథ విని మాట్లాడింది. ఇంతలో సూర్యాస్తమయం అవుతుంది. రాత్రిని పారద్రోల లేక పగలంతా తాను దీక్షను ప్రకటించినందుకు వైరాన్ని తనపై చీకటి పూనిందనీ, అందకే తనపై దండెత్తి వస్తుందని రాత్రికి భయపడి సూర్యుడు పశ్చిమ సముద్రంలో దాకున్నాడు. అని అలంకారిక చమత్కారాన్ని చూపించాడు జక్కన.

ఉదా :

2) ఆముక్తమాల్యదలో మధురానగరవర్ణన మత్యద్వ జుని వృత్తాంతంలో పుష్పలావికల వర్ణన లో చమత్కారం ధ్వనిస్తుంది.

సీ: “వెలది, యీ నీదండ వెల ఎంత?
నాదండ, కును వెలవెట్ట నవ్వనితరంబు?21

ఈ పద్యమంతా పుష్పలావికలు (పూలు అమ్మే స్త్రీలు) సరస సల్లపాలకు సంబంధించినవి. పద్యంలో మొదటి అర్థభాగం వీటిని ప్రశ్న అయితే రెండవ సగం పుష్పలావికల సమాధానం. శృంగారర్ధాన్ని మర్మంగా ఉంచి మాట్లాడటమే ఈ పద్యంలో కీలకాంశం .ఆనాటి స్త్రీలకు కంచుక దారుణం లేదు కనుక దండలు స్పష్టంగా కామోద్రేకంగా కనిపించవచ్చు .అందుకని ఈ సంభాషణ పుట్టింది .దండ అంటే ఆమె చేతిలో పూలదండ. మరొక అర్థంలో భుజకీర్తులు పెట్టుకునే కింద భాగం.

విశ్లేషణ:

మన తెలుగులో కావ్య సాంప్రదాయం కానీ ప్రబంధ సాంప్రదాయం కానీ ఒక విశిష్టమైన ఒక పద్ధతిలో వెలువడింది. అవి సమకాలీన సమాజాన్ని ప్రతిఫలిస్తూనే విశ్వజనీనమైన భావాలను చెప్పిన సాహిత్యం తెలుగు సాహిత్యం. కాబట్టి ఆ సాహిత్యానికి సంబంధించిన జాతి, వార్తా చమత్కారాలలో తెలుగు లిఖిత సాహిత్యం ఆవిర్భావం నుండి చేమకూర వేంకట కవి వరకు ఈ ప్రయాణం కొనసాగింది. కవులందరూ సాధారణంగా సంస్కృత మర్యాదను అనుసరించి తెలుగు కావ్యాలను రచించారు. మన తెలుగు కవుల ఆలోచన భావనలు చాలా విశాలవంతమైనవి. అవి సంస్కృతంలో వచ్చినప్పటికీ యావద్భారత సంస్కృతిని దృష్టిలోకి తీసుకున్నారు. జాతీయ సమగ్రతకు (national integrity) కారణభూతమయ్యే విషయానికి దోహదం చేసే అంశంగా మన తెలుగు సాహిత్యం ఆనాడు నుండి ప్రయత్నం చేస్తుంది.

5. ముగింపు:

నాటి భరతుని సిద్ధాంతాల నుండి మిగతా సిద్ధాంతాల వరకు అదే పరంపర కొనసాగింది. కాబట్టి విశిష్ట అధ్యయనం భారతీయ సమగ్రతకు, సంస్కృతికి ఏ విధంగా దోహదం చేస్తాయో మన తెలుగు కావ్యాల ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ లక్ష్యం కోసం నేను పరిశోధన చేస్తున్నాను.ఈ కావ్యాలను అధ్యయనం చేసే పద్ధతులలో కేవలం అందులో ఉన్నటువంటి కథలను, చంధస్సును, రసాలను విడివిడిగా పరిశీలించడం మాత్రమే కాదు.

ఆ కవుల లక్ష్యాలను పట్టుకోవడానికి, వారు ఆశించినటువంటి ప్రయోజనాలను గుర్తించడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుంది.

6. పాదసూచికలు:

  1. దండి, కావ్యాదర్శః,1.16,17
  2. ఆముక్త మాల్యద, 1-13
  3. విజయ విలాసము,1-31
  4. కువలయాశ్వ చరిత్రము, 1-12
  5. The student sankskrit English dictionary page - 503
  6. సుబ్రహ్మణ్యం. జి.వి., సాహిత్య చరిత్రలో చర్చినీయాంశాలు, పుట- 157
  7. సుబ్రహ్మణ్యం జి.వి., సాహిత్య చరిత్రలో చర్చినీయాంశాలు, పుట. 660
  8. కులశేఖర రావు. ఎం. చేమకూర కవితా వైభవం, పుట- II
  9. ధర్మారావు తాపీ- హృదయోల్లాస వ్యాఖ్య, పుట- 60
  10. అనంతామాత్యుడు- భోజరాజీయం,అ.4., పుట-77
  11. సుబ్రహ్మణ్యం. జి.వి., సాహిత్య చరిత్రలో చర్చినీయాంశాలు, పుట- 157
  12. సుబ్రహ్మణ్యం జి.వి., సాహిత్య చరిత్రలో చర్చినీయాంశాలు, పుట- 157
  13. సుబ్రహ్మణ్యం జి.వి., సాహిత్య చరిత్రలో చర్చినీయాంశాలు, పుట- 157
  14. నన్నయ, ఆంధ్రమహాభారతం, సభాపర్వం, ప్రథమ - 51
  15. గోపరాజు. కొరవి, సింహాసన ద్వాత్రింశిక, అ.ఈ. 129-130
  16. అగ్ని పురాణం, అ.339-2 శ్లోకం
  17. రాఘవన్- 1973. 294
  18. చమత్కార చంద్రిక- 1.7 విశ్వేశ్వర కవి చంద్రుడు
  19. సుబ్రహ్మణ్యం జి.వి.- సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు, పుట.158
  20. జక్కన - విక్రమార్క చరిత్ర, 6-63
  21. కోటేశ్వరరావు తుమ్మపూడి - ఆముక్త మాల్యద, సౌందర్య లహరి వ్యాఖ్య. 19వ పద్యం, ప్రథమ భాగం, ద్వితీయ అధ్యాయం. పుట.175

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అనంతామాత్యుడు, వీరరాఘవాచార్యులు కొండూరు. 1969. భోజరాజీయం.  శ్రీ కొండూరు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్.
  2. కులశేఖరరావు, ఎం. 1975- చేమకూర కవితా వైభవం ,సికింద్రాబాద్, యువభారతి.
  3. గోపరాజు కొరవి. రామకృష్ణ శర్మ, గడియారం (పీ.) 1982- సింహాసన ద్వాత్రింశిక . హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ
  4. చిన్ని కృష్ణయ్య, దేవళ్ళ. 1982 - కువలయాశ్వ చరిత్ర, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ.
  5. జయప్రకాష్ , ఎస్. 2018. పరిశోధనావిధానం. నవచేతన పబ్లిక్సింగ్ హౌస్.
  6. ధర్మారావు, తాపీ.1986- విజయ విలాసము హృదయోల్లాస వ్యాఖ్య , హైదరాబాదు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
  7. రామచంద్రారెడ్డి, రాచమల్లు. 1976. సారస్వత వివేచన,  విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
  8. శ్రీకృష్ణదేవరాయలు. కోటేశ్వరరావు. తుమ్మపూడి (వ్యా.).2001. ఆముక్తమాల్యద, ప్రధమభాగం, సౌందర్యలహరీ వ్యాఖ్యానం,  మలయకూట పబ్లికేషన్స్.
  9. సుబ్రహ్మణ్యం, జి.వి.ఎస్. 1991. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. తెలుగు అకాడమీ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]