headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

19. శ్రీమద్రామాయణ కల్పవృక్షం బాలకాండ: గంగకథ

డా. దాసరి రాంప్రసాద్

టీజీటీ (తెలుగు),
ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాల,
సతివాడ, నెల్లిమర్ల, విజయనగరం.
సెల్: +91 8985918757, Email: dasariramprsd11@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

కావ్యరాజమైన రామాయణంలో అనేక ఉపకథలున్నాయి. అందులో గంగకథ అనేది బాలకాండలోని ఒక ఉపకథ. ఇది రామలక్ష్మణులచే ప్రశ్నించబడి విశ్వామిత్ర మహర్షి చేత వివరింపబడుతుంది. మూలమైన వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణంలోని గంగకథకు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్రామాయణ కల్పవృక్షంలోకి గంగకథకు అనేక మార్పులు ఉన్నాయి. ఆ మార్పులని తెలియజేస్తూ శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో గంగకథ ఎలా ఉందో వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

Keywords: విశ్వనాథ వర్ణనావైచిత్రి, విశ్వనాథ వారు కథలో చేసిన మార్పులు, విశ్వనాథవారి రచనా విధానం, విశ్వనాథ వారి పాండితీ ప్రతిభ.

1. ఉపోద్ఘాతం:

శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రచించారు. దీని రచన 1932-1962 మధ్యకాలంలో జరిగింది. ఇది చంపూ కావ్యము. దీనికి 1970లో జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. తెలుగులో మొదటి జ్ఞానపీఠ పురస్కారం పొందిన గ్రంథమిదే. విశ్వనాథవారు కూడా రామాయణంలోని యుద్ధకాండ వరకు ఉన్న ఆరు కాండలనే రచించారు. ఉత్తర కాండను రాయలేదు. శ్రీమద్రామాయణ కల్పవృక్షం ఎనిమిది సార్లు ముద్రించబడింది.

2. రామాయణకల్పవృక్షంలో గంగకథ - మార్పులు చేర్పులు:

రామాయణ కల్పవృక్షంలో గంగ కథ బాలకాండలోని 275వ పద్యంనుండి 414వ వరకు ఉన్న 139 పద్యగద్యాలలో ఉంది. గంగకథను యధామూలకంగా అనువదించినా కొన్ని మార్పులని కూడా చేశారు. మూలమైన శ్రీమద్రామాయణంలోనూ, తెలుగులోని ఇతర రామాయణాలలోనూ గంగ, ఉమాదేవీ పుట్టుక కథ, కుమార స్వామి, జననం కథలను రెండు వేరు వేరు ఉపాఖ్యానాలుగా చెప్పగా శ్రీమద్రామాణ కల్పవృక్షంలో ఆ రెండు ఉపకథలను కలిపి ఒకే కథగా విశ్వనాథ చెప్పారు. ఇలాంటి మార్పులు చాలా విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలోని గంగ కథలో కన్పిస్తాయి.

3. గంగకథలో విశ్వనాథవారి వర్ణనావైచిత్రి: 

శ్రీమద్రామాయణంలో లేని కొన్ని అంశాలను, మనం శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో గమనించవచ్చు. మూలంలో దేవతలు హిమవంతుణ్ణి అడిగి అతని పెద్దకుమార్తె అయిన గంగను స్వర్గానికి తీసుకుపోయినట్లు మాత్రమే చెప్పగా విశ్వనాథ వారు గంగను దేవతలు తీసుకువెళ్ళిన విధానాన్ని కూడా ఈ కింది పద్యంలో ఇలా వర్ణించారు.

"గీ॥ తొణికిసలగంగ జేతుల దూసికొంచు
మణిసరుల గంగ భుజముల మార్చుకొంచు
మోసికొని పోయిరి నిలింపులు
తలంపులాస కొసలంట గంగ స్వర్గాభిముఖులు"1

పై పద్యములో గంగను చేతులతో సరి చేసుకుంటూ భుజాలను మార్చుకుంటూ దేవతలు స్వర్గానికి తీసుకుపోయినట్లు విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షంలో మూలంలో లేని చక్కని కల్పనను చేశారు. సాధారణంగా నీటిని పాత్రలతో తీసుకువెళ్తాం. అప్పుడు నీరు తొణికిసలాడడం సాధారణంగా జరుగుతుంది. అంతే కాకుడా స్వర్గంవరకు గంగను మోసుకుని వెళ్తున్న దేవతలు వారు గంగను వారి భుజాలపై మోస్తూ ఒకరికి భారమైనప్పుడు వేరొకరు తమ భుజాలపైకి ఎత్తుకుంటూ స్వర్గానికి తీసుకువెళ్ళినట్లు చెప్పడం లోక పరిశీలనకు చక్కని తార్కాణం.

4. విశ్వనాథ వారు కథలో చేసిన మార్పులు:

శ్రీ మద్రామాయణంలో విశ్వామిత్రుడు గంగా, ఉమల పుట్టుక కథను చెప్పిన తరువాత రామలక్ష్మణులు ఆ కథా విశేషాల్ని మెచ్చుకుని తిరిగి గంగను గురించి ప్రశ్నించినట్లు శ్రీమద్రామాయణ కర్త చెప్పాడు.

"ఉక్తవాక్యే మునౌతస్మిన్ ఉబౌ రామలక్ష్మణౌ!
ప్రతినంద్య కథాం వీరౌ ఊచతుర్ముని పుంగవమ్
ధర్మయుక్త విదం బ్రహ్మన్ కథితం పరమంత్వయా
దుహితు: శైలరాజయ్య కృష్ణాయా వక్తుమర్హసి
విస్తరం విస్తరజ్ఞోసి దివ్య మానుష సంభవమ్
త్రీన్ పథో హేతునా కేన ప్లావయే ల్లోకపావనీ"2

విశ్వామిత్రుడు ఇట్లు గంగా వృత్తాంతమును తెలిపిన పిమ్మట వీరులైన రామలక్ష్మణులు ఇరువురును ఆ కథా విశేషములను మెచ్చుకొనుచు ఆ మునీశ్వరునితో ఇట్లు అనిరి. ఓ మహాత్మా! ఉత్తమోత్తమము, ధర్మయుక్తము. అయిన వృత్తాంతమును మీరు తెల్పితిరి. హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎఱిగినవారు మీరే. కావున దివ్యలోకమునందున మానవలోకమునందున జరిగిన ఆ నదీ.వృత్తాంతవిశేషములను విపులముగా వచింపుడు. ఆ లోక పావని మూడు లోకములలో ప్రవహించుటకు గల కారణమేమి?

పై శ్లోకాల్లో రామలక్ష్మణులు గంగ గురించి తెలుసుకోవాలన్న కుతూహాలంతో అనేక ప్రశ్నలు వేసినట్లు కనిపిస్తుంది. అయితే ఇదే సన్నివేశాన్ని విశ్వనాథవారు తన శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో మరో విధంగా రచించారు. గంగ, ఉమల కథను చెప్పిన విశ్వామిత్రునితో శ్రీరాముడు కింది విధంగా ప్రశ్నించినట్లు చెప్పారు. విశ్వనాథవారు.

"అనినన్ రాముడు మీకిదిన్ శ్రమముగా నౌనేమో? రేయెల్లబ్రొ
ద్దును నట్లే కథజెప్పునయది. యెందున్ మేము సౌఖ్యంబుగా
వినుటే కష్టము కాదనన్ మునియు నవ్వెన్ నవ్వి కాదోయి। నీ
వినుటే బ్రహ్మ రథంబు నాకనియె, నవ్వెన్ రాముడు త్సాహియై"3

గంగ, ఉమల పుట్టుకను గురించిన కథను చెప్పిన విశ్వామిత్రునితో రాముడు "రోజంతా మీరు చెప్పిన కథను సుఖముగా వినడానికే మాకు కష్టంగా ఉండే, అలాంటిది మీరు ఎంత కష్టపడుతున్నారో అని అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు నవ్వుతూ రామునితో "నీవు వినటమే నాకు గొప్ప గౌరవము, ఆనందదాయకము' అని అనగా రాముడు కూడా నవ్వి ఉత్సాహముతో కథ వినడానికి పూనుకుంటాడు. పైపద్యములో రాముడు సుగుణశీలుని గాను, సాధుజనుల కష్టాన్ని చూసి భరించలేనివాడిగాను మనకు కనిపిస్తాడు. ఇది విశ్వనాథవారి స్వీయ కల్పన. శ్రీరాముణ్ణి గొప్ప సుగుణ సంపన్నునిగా చూపించే ఆలోచనతో విశ్వనాథవారు ఈ కల్పన చేసినట్లు తెలుస్తోంది. ఇది విశ్వనాథవారి కల్పనా శక్తికి మచ్చుతునక.

శ్రీమద్రామాయణంలో కుమారస్వామి జననం కథలో శివుడు, పార్వతి దేవతల కోరికను అనుసరించి, తపస్సు చేసుకుంటుండగా దేవతలు తమకు సేనాధిపతి లేదని బాధపడి బ్రహ్మవద్దకు వెళ్ళి తమకు సేనాధిపతిని ఇవ్వమని ప్రార్థించినట్లు ఉంది.

"తప్య మానే తపో దేవే దేవాస్సర్షి గణాః పురా
సేనాపతిమ్ అభీప్సింతః పితామహ ముపాగమన్"4

పరమేశ్వరుడు ఇట్లు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు, ఋషులతో గూడి సేనాధిపతిని గోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి.

శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో మాత్రం దేవతలను వృత్రాసురుడు ఓడించి తమ తమ సేనలకు సేనాధిపతి లేకపోవడంవలనే తాము ఓడిపోయామని దేవతలు గ్రహించి బ్రహ్మదేవునివద్దకు వెళ్ళి సేనాధిపతిని ఇమ్మని ప్రార్ధించినట్లు విశ్వనాథవారు చెప్పారు.

"చ. జడిజడిగా సురభ్రసమజంబులకై వడి దోలె వృత్రుండున్
మడకలుగా సుపర్వులు సమాజము మేల్పడ వాలు లేకయున్
నడుపగ వేల్పు సైన్యములు నాథుడు లేక కృశించు చుండి బి
ట్టడలుచు బద్మ యోనిగని సాగ్ని పురోగములై సురావళుల్"5

వృత్రాసురుడు దేవతలను అందరినీ తమ బలంతో ఓడించి తరిమాడు. దేవతలు వారి సేనలకు సేనాధిపతి అయిన శివుని సహాయం లేకపోవడం వల్ల సైన్యాన్ని నడిపే సేనాధిపతి లేక సేనలు నాశనం అయి పోతుండడంతో అగ్నిని తమ ముందుంచుకుని బ్రహ్మవద్దకు వెళ్ళారు.

ఈ వృత్రాసురుని వృత్తాంతం మూలంలో చెప్పలేదు. కుమారస్వామి పుట్టుకకు ప్రధానకారణం వృత్తాసురుడు దేవతలను ఓడించి, హింసించడం. ఇది మూలంలో లేదని గుర్తించిన విశ్వనాథవారు ఈ అంశాన్ని శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో చేర్చారు.
విశ్వనాథ వారి రచనా విధానం: సాధారణంగా మన పురుషస్వామ్య సమాజంలో కొడుకు పుడితే తల్లీదండ్రుల ఆనందం వర్ణనాతీతం. ఈ విషయాన్ని చెప్పడానికి శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథవారు ఈ కింది పద్యాన్ని రాశారు.

"సీ॥ జడముడి వేలుపు సంబరంపడే రామ
ప్రమద మందెను శైలరాజ దుహిత
ధారణీదేవి మోదము పట్టరాదయయ్యే
లలినగ్నియుని సుబలాట పడియె
మందాకినీ దేవి చిందాడె దెలి నీళ్ళు
రెల్లుతోటయు గందరిల్లి పోయె
ఒక్కొక్కతె యెదంద యుగ్రాణములు
గాగ గందళించి కృత్తికా చయంబు
"గీ॥ ఒక్క తనయుందు కలిగిన నుర్విజనుల
యుబ్బు పట్టంగ వచ్చునబోయి స్వామి
స్వామి గలుగ నిందరకును సంబరంబు
తనుక గొడుకన్న వస్తువెంతటి ప్రియంబో”6

ఓ రామా! కుమారస్వామి పుట్టడంతో శివుడు సంబరపడ్డాడు. పార్వతీదేవి సంతోషించింది. భూదేవి పట్టరాని ఆనందాన్ని పొందింది. అగ్నిదేవుడు కూడా చాలా ఆనందించాడు. గంగ ఆనందంతో తెల్లని నీళ్ళతో చిందులు వేసింది. రెల్లుతోట కూడా సంతోషించింది. కృత్తికలు స్థన్యం పొంగగా ఆనందించారు. ఒక్క కుమారుడు పుడితే మానవులు ఆనందం పట్టలేరు. కాగా కుమారస్వామి పుట్టడంతో ఇంతమందికి ఆనందం కలిగింది. కొడుకు అనే వస్తువు మానవులకు ఎంతో ప్రియమైన వస్తువు కదా!

పై అంశం మూలంలో లేదు. ఇది విశ్వనాథవారి స్వీయ కల్పన. జనులకు కుమారులు అంటే చాలా ఇష్టం. అందుకే కుమారస్వామి పుట్టడంతో అతని పుట్టుకకు కారకులైన శివుడు, పార్వతి, గంగ, అగ్ని, భూమి, రెల్లుగడ్డి, కృత్తికలు తమకు కుమారుడు పుట్టాడని భావించి ఎంతో ఆనందించినట్లు విశ్వనాథవారు చెప్పారు.

సగర పుత్రులు తండ్రి భూమిని తవ్వి యగాశ్వాన్ని వెతకమనడంతో భూమిని తవ్వుతారు. అలా తవ్వుతూ వీరూపాక్షము, మహాపద్మము మొదలైన నాల్గు దిగ్గజాలను చూసి ప్రదక్షణానమస్కారాలు చేస్తారు. దీన్ని శ్రీమద్రామాయణ కల్పవృక్ష కర్త ఈ కింది విధంగా చెప్పాడు.
"మేథిని॥ గుములగ దూర్పు దిక్కుబడి గొచ్చుచున్ విరూపా
క్షము తొలి దిగ్గజంబు శిరసా ధరన్ వహింపన్
శ్రమమున మస్తకంబు గదురన్ గదల్ప భూకం
పము గలిగెన్ సభూద్రవనపాళి బిట్టుతూలన్"'

"కం॥ సంగరసుతుల్ గజరాజున,
కగలిచని ప్రదక్షిణించి యంజలియిడి వ
నగ ద్రవ్వుకొంచుబోయిరి,
పెగులని బండలను దండ వ్రేటుల గూలన్"

"మేథిని॥ గుములుగ దక్షిణంపుదిశ క్రొచ్చుచున్ మహా ప
ద్యము యమునిక్కు నేనుగని మానవేంద్రుపుత్రుల్
సుమహిత శైల మూర్తి క్షితి సాక్కి మోయుదానినిన్
తమకము విస్మయంబు నరుదార గాంచి యంతన్'

క॥ సగర సుతుల్ గజరాజన,
కగలించి ప్రదక్షిణించి యంజలియిడి ప్ర
క్కగ ద్రవ్వుకొంచుబోయిరి,
నగులని బండలను గోళ్ళనొక్కి విద్రుచుమన్

 "మేథిని॥ గములుగ బశ్చిమమ్ము దెస గ్రాచ్చుచున్ జనన్ గొ
మ్ము మెదపు కొంచు సౌమనసము గనంబడెన్ బ
శ్చిమ దిశ యేన్లు దాని వెను చేవ గాంచియాశ్చ
ర్యముంగని దంతపుంగొననె రాచి పట్టధాత్రిన్'

క॥ సగరసుతుల్ గజరాజున,
కగలిచని ప్రదక్షిణించి యంజలి యిది వీ
లుగ ద్రవ్వుకొంచుబోయిరి,
తగిలిన బందలను గాలదాచుచు వొకన్

"మేథిని॥ నుత్తరంబుదిశ గ్రొచ్చికొంచు భద్ర
మ్మమరగ దద్దిశాగజము నందుగాంచి దానిన్
హిమమృదు పాందురంబు క్షితినెత్తి కుంభసీమన్
గమల సుమంబు వోలె సుఖకాంతి బూనుదానిస్

క॥ సగర సుతులు గజరాజున,
కగలిచని ప్రదక్షిణించి యంజలి యిడిముం
దగ దవ్వుకొంచు బోయిరి
రగిలిన బందలను నార్పరాంచి కరములన్”7

పై పద్యాలలోని కంద పద్యాలలో "సగర సుతుల్ గజరాజున కగలిచని ప్రదక్షిణించి యంజలి యిది ప్రక్కగ దవ్వుకొంచు బోయిరి” అనే వాక్యము నాలుగు పద్యాలలోను పునరావృతమైంది.

ఈ అంశాన్ని శ్రీమద్రామాయణ కల్పవృక్ష కర్త నన్నయ్య మహాభారతంలోని ఆదిపర్వంలోని ఉదంకోపాఖ్యానంలో ఉదంకుని నాగస్థుతుల్ని అనుకరించి రచించినట్లు అనిపిస్తుంది. ఉదంకుడు వాసుకి, అనంతుడు మొదలైన నాగేంద్రుల్ని స్తుతించిన మట్టంలో "మాకు ప్రసన్నుడయ్యెడున్" అనే పదబంధాన్ని వరుసగా నాల్గు పద్యాలలో చివర్లో పునరావృతం చేశాడు. నన్నయ్య ఈ పద్యాలే తర్వాత వచ్చిన శతక ప్రక్రియకు ప్రధాన లక్షణమైన మకుట నియమానికి ఆధారంగా పండితులు చెబుతారు. శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథవారు నన్నయనే అనుసరించారు. అక్కడా భారతంలోని ఉదంకోపాఖ్యానంలోనూ, ఇక్కడి రామాయణంలోని సగర చరిత్రలోనూ సన్నివేశం పాతాళమే అయితే ఉ దంకోపాఖ్యానంలో ఉదంకుడు నాగుల్ని స్తుతిస్తాడు. సగర చరిత్రలో నగరపుత్రులు దిగ్గజాలకు ప్రదక్షిణానమస్కారాలు చేస్తారు.

5. విశ్వనాథవారి పాండితీప్రతిభ: 

శ్రీమద్రామాయణంలో సగరుల్ని వెతుకుతూ వెళ్ళిన అంశుమంతుడు వారి భస్మరాశులను చూసి దుఃఖిస్తాడు. తర్వాత తేరుకుని వారికి తర్పణాలు ఇవ్వడానికి జలాలకోసం వెతుకుతుండగా గరుత్మంతుడు కనిపించినట్లు, అతడు అంశుమంతునితో సాధారణ జలాలతో సగరులకు తర్పణాలు ఇవ్వరాదని వారు కపిలుని కోపాగ్నిలో భస్మం అయినారు కనుక వారి భస్మాన్ని ఆకాశగంగ ముంచివేస్తే గాని వారు పవిత్రులై స్వర్గాన్ని పొందరని చెప్పినట్లుగా ఉంది.

అయితే శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో అంశుమంతుడు నీటికోసం వెతుకుతూ నీరు లభించకపోవడంతో గరుత్మంతుణ్ణి ఎలుగెత్తి పిలిచినట్లు ఉంది. అంతే కాకుండా గరుత్మంతుడు అంశుమంతుణ్ణి ఓదార్పు వచనాలతో ఊరడించినట్లు విశ్వనాథవారు ఈ కింది విధంగా చెప్పారు.

"చ॥ కుమిలి యెడంద లోన నొక కొంతకు చేరి నివాసవారి దా
నమరగ చిన్న తండ్రులకు హర్షము సేయగ నెందు జూచినీ
రము కనరాక చొచ్చికని రాజిత దూర వియత్తు ఱెక్కలన్
దెమలుచు వైనతేయు నరుదెమ్మని విర్జనలేక పెట్టినన్'

కం॥ అతడును మిన్ను డిగినన్,
దాతా యని యావటిల్లె దాగరుడి వృథా
చేతము నొవ్వకు దైవము,
రీతికి దైవంబు బరిహరింతురె యెవరేన్''

వ॥ నాకు మాత్రము మేనల్లుండ్రు కారా? నేను మాత్రము దుఃఖించలేనా? వీరప్రమేయుడైన కపిలుని చేత దగ్ధులైరి అలౌకిక జలపరి ప్లుతులై కాని వీరు సద్గతి బొందరు. హిమగిరి జ్వేష్ట దుహిత గంగానది గాని వీరిని బరిషుతులు జేయజాలదు."8

మూలంలో గరుత్మంతుడు సగర పుత్రులకు స్వర్గం ప్రాప్తించాలంటే ఏం చేయాలో అంశుమంతునితో చెప్పినట్లుండగా శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో గరుత్మంతుడు అంశుమంతున్ని ముందుగా ఓదార్పు మాటలతో ఊరడించినట్లు విశ్వనాథవారు చెప్పారు. అంతే కాకుండా ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని బంధువులు దుఃఖిస్తున్నప్పుడు వారిలో వారు ఓదార్పు మాటలు మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఊరడించుకుంటారు. ఈ సన్నివేశంలోని గరుత్మంతుని మాటలు కూడా ఇలానే ఉన్నాయి. ఇది కూడా విశ్వనాథవారి మూలంలో సగరుడు తన బిడ్డల మరణవార్తను తన మనవడైన అంశు మంతుని ద్వారా విని దు:ఖించి, తర్వాత యజ్ఞం పూర్తి చేసినట్లు సగరులకు మోక్షాన్ని కల్గించడానికి ఏ విధంగా గంగను భూమిపైకి తీసుకురావాలో తెలియక బాధపడినట్లు మాత్రమే ఉంది. శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథవారు సగరుడు దుఃఖించిన విధానాన్ని ఈ కింది పద్యాలలో ఇలా వర్ణించాడు.

కం॥ "ఆ పెద్ద కొడుకు నట్లై
యీ పిన్నలు వేలమంది యిటై యథా
త్రీపతీ అంపపు గోతయు,
నాపయయిన నప్తగాంచినన్ దీండునే

కం॥ అమలమతిదల్లి హరుసతి,
నుమ నైనందపము సేసి యుర్వికి రప్పిం
తుముగాక వేయి యరలయం
దమరులు దాచిన సురాంబువా? యిటవచ్చున్"9

సగరుని పెద్దకొడుకైన అసమంజసుడు దుర్మార్గుడై నగరం నుండి వెలివేయబడ్డాడు. మిగిలిన అరవైవేలమంది పుత్రులు ఇలా కపిలునిని క్రోదానికి దగ్ధమైపోయారు. సగరునికి కల్గిన ఈ రంపపు కోతవంటి బాధ ఏ విధంగాను తీరదు.

అంతే కాకుండా మలినం లేనిదయిన శివుని భార్య పార్వతిదేవిన తపస్సుద్వారా మెప్పించి భూమిపైకి తీసుకురావచ్చు. కాని తన కుమారులు స్వర్గాన్ని చేరడానికి అవసరమైన గంగను దేవతలు అనేక అరల్లో దాచి ఉంచినారు. అటువంటి గంగను భూమిపైకి తీసుకురావడం సాధ్యమవుతుందా! సాధ్యం కాదు.

పై పద్యాలలో సగరుని ఆవేదన, అతని దుఃఖం ఎంతో కరుణ రసాత్మకంగా చిత్రించబడింది. మూలంలో సగరుని దుఃఖాన్ని ఇంత వివరంగా వర్ణించలేదు.
మూలంలో గంగ ఆకాశంనుండి శివుని తలపై పడి అతన్ని తన వేగంతో పాతాళలోకానికి తీసుకుపోవాలని భావిస్తుంది. దాన్ని గ్రహించిన శివుడు గంగను తన జడలతో బంధిస్తాడు. అని చెప్పగా శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో గంగ వేగాన్ని తన భర్తయైన శివుడు భరించగలదో లేదో అని పార్వతీదేవి కలత చెందినట్లు కింది పద్యంలో విశ్వనాథవారు చెప్పారు.

"చ॥ గణగణ వచ్చుచున్న సురగంగను గాంచి భవాని స్వామికిన్
బెణుకులుపుట్టునో మెడను వేగవశంబున స్వామియంగముల్
వణకి యిలా స్థలిన్ జదికిలబడునోయని యప్పగారి యా
తొణికిసలేవగించుకొనే దూకుడు మానదటంచునెప్పుడన్"10

పార్వతీదేవి గణగణ శబ్దముతో శివుని తలపై పడుతున్న గంగ వేగాన్ని చూసి తన భర్త తలపై గంగ పడేటప్పుడు అతని మెద బెణుకుతుందేమోనని, గంగ వేగానికి తన భర్త అవయవాలు వణికిపోయి నేలపై చతికిలబడతాడేమో అని భయపడింది. పార్వతి తన అక్క అయిన గంగ తొణికిసలాడే స్వభావాన్ని వదులుకోవడం లేదని గంగను అసహ్యించుకుంది.

పై పద్యాలలో విశ్వనాథం వారు పార్వతీదేవిని సాధారణ మానవనీ వలె తన భర్త కష్టాన్ని భరించలేనిది గాను, తన భర్తను కష్టపెట్టేవారు. సొంతవారైనా, వారిని అసహ్యించుకొనేదిగాను చిత్రించారు.

శ్రీమద్రామాయణంలో నగర పుత్రుల భస్మరాశుల్ని గంగ ముంచివేయగానే బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథునితో మీ తాతలైన సగరపుత్రులు స్వర్గాన్ని చేరారు. భూమి మీద గంగ ఉన్నంత కాలం వారు స్వర్గంలో ఉంటారు అని చెప్పినట్లు ఉంది. దీన్ని మార్చి శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో గంగ సగర పుత్రుల భస్మరాశుల్ని ముంచేసిన వెంటనే అరవైవేలమంది సగర పుత్రులు దివ్యరూపాలతో దేవ విమానాలపై నిలిచి ఆకాశంలో తిరుగాడుతూ తమకు సురగంగా స్నాన భిక్ష పెట్టిన భగీరథుణ్ణి పొగిడినట్లు విశ్వనాథవారుచెప్పారు.

చ|| "అఱువది వేల రాజసుతు అద్భుత దేహులు తైజసంబులై
మెఱసెడి మేనులం దిరుగ మింట విమానములన్ భగీరథున్
దిఱుపము పెట్టినావు సు తీర్ధము పుత్రుడవాదు వీన యీ
యరువది వేల యేండ్లకును నైన నటంచును మెచ్చుచుండగన్"

6. ముగింపు:

ఈ విధంగా శ్రీ మద్రామాయణ కల్పవృక్షంలో గంగకథ మూలమైన వాల్మీకి విరచిత శ్రీ మద్రామాయణంలోని గంగ కథను కాస్త పెంచి అవసరమైన చోట్ల కొన్ని అంశాలను అదనంగా చేర్చినతీరును గుర్తించవచ్చు.

కొన్ని సందర్భాలలో వర్ణాణావైచిత్రిని మూలానికి భిన్నంగా ప్రదర్శిస్తూ, మార్పులు చేర్పులతో శ్రీ మద్రామాయణ కల్పవృక్షంలోని బాలకాండలో చోటు చేసుకుంది.

7. పాదసూచికలు:

  1. శ్రీమద్రామాయణ కల్పవృక్షం - బాలకాండ - 278వ పద్యం
  2. శ్రీమద్రామాయణం-బాలకాండ - 36వ సర్గము-1-3వ శ్లోకాల
  3. శ్రీమద్రామాయణకల్పవృక్షం - బాలకాండ - 283వ పద్యం
  4. శ్రీమద్రామాయణం-బాలకాండ - 37వ సర్గ -1వ శ్లోకం
  5. శ్రీమద్రామాయణకల్పవృక్షం -బాలకాండ - 275వ పద్యం
  6. శ్రీమద్రామాయణకల్పవృక్షం - బాలకాండ - 305వ పద్యం
  7. శ్రీమద్రామాయణకల్పవృక్షం - బాలకాండ - 332 నుండి 339వ పద్యం వరకు
  8. శ్రీమద్రామాయణకల్పవృక్షం - బాలకాండ - 351, 352 పద్యాలు, 353వ వచనం
  9. శ్రీమద్రామాయణకల్పవృక్షం - బాలకాండ - 357, 358వ పద్యాలు
  10. శ్రీమద్రామాయణకల్పవృక్షం - బాలకాండ - 376వ పద్యం

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. వాల్మీకి. శ్రీమద్రామాయణము. గీతాప్రెస్, గోరఖ్ పూర్, 2019.
  2. శ్రీరామరాజు, నడుపల్లి. అక్షరవిశ్వనాథ. వాగ్దేవీ ప్రచురణలు, హైదరాబాద్, 1997.
  3. సంపత్కుమారాచార్య, కోవెల. విశ్వనాథ సాహిత్య దర్శనం. అభినవ ప్రచురణలు, హైదరాబాద్, 2004.
  4. సత్యనారాయణ, విశ్వనాథ. శ్రీమద్రామాయణకల్పవృక్షం (ఆరు కాండలు). వల్లీ పబ్లికేషన్స్, విజయవాడ, 1976.
  5. సూర్యనారాయణమూర్తి, కోటి (సంకలనం). జ్ఞానపీఠవిశ్వనాథ శ్రీమద్రామాయణ-కల్పవృక్ష కావ్యవైభవము వ్యాససంపుటి. కోటి భ్రమరాంబాదేవి, పెద్దాపురం, తూ.గో. జిల్లా., 1992.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]