AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
18. ‘రాజపాళయం’ యక్షగానాలు: చారిత్ర్రక సాంస్కృతిక దృక్పథం
సి. ఇ. గాయత్రీదేవి
పరిశోధక విద్యార్థిని,
మద్రాసు క్రైస్తవ కళాశాల,
ఈస్ట్ తాంబరం, చెన్నై, తమిళనాడు
సెల్: +91 9705302398, Email: cherukurigayathri@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ఆంధ్రదేశానికి సుదూరప్రాంతంలో ఉన్న తమిళనాడులోని రాజపాళయంలో వెలువడిన తెలుగు గ్రంథాలను గురించి, రాజపాళయం కవులు సాహిత్యానికి చేసిన ఎనలేని కృషిని గురించి ఆంధ్రదేశంలోని సాహిత్యాభిమానుల అవగాహనకు తేవడం, వీరి యక్షగానకావ్యాలలోని చారిత్రక, సాంస్కృతిక అంశాలను విశ్లేషించడం, తమిళనాడులో ఉన్నప్పటికీ తెలుగు సాహిత్య సంప్రదాయాన్ని, కావ్యాలలో పాటిస్తున్న తీరును గుర్తించడం ఈ వ్యాసరచన ప్రధానోద్దేశం. తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న ఈ అయిదు యక్షగానాలు రాజపాళయంలో లభించాయి. వీటిని మొట్ట మొదటిసారిగా ప్రసిద్ధ పండితులు శ్రీ ముదునూరి జగన్నాథరాజుగారు పరిష్కరించి, వాటిని గ్రంథరూపంలో తెలుగు సాహిత్యాభిమానులకు అందించారు. రాజపాళయం యక్షగానాల మీద ఇంతవరకు విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలు ఒకటి రెండు తప్ప అధికంగా జరగలేదు. ఈ పరిశోధన వలన తమిళనాడులో మదురై, తంజావూరు, పుదుక్కోట మొదలైన ప్రాంతాల్లోనే కాక రాజపాళయంలో కూడ తెలుగు సాహిత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిఢవిల్లిందనీ, రాజపాళయంలోని రాజకుటుంబాలు తెలుగు సాహిత్యాన్ని పోషించడమే కాక, స్వయంగా తెలుగు కావ్యాలు రచించారని కూడ తెలియవస్తున్నది. అంతేగాక ఈ ప్రాంతంలో యక్షగానాలు అధికంగా లభించి నందువల్ల ఇవి ఆ రోజుల్లో ప్రదర్శింపబడుతూ ఉండేదని ఊహించవచ్చు.
Keywords: రాజపాళయం, యక్షగానాలు, చారిత్రకాంశాలు, సాంస్కృతికాంశాలు, సంప్రదాయాలు, తమిళభాషా ప్రభావం
1. ప్రవేశిక :
తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు క్షేత్రానికి పది కిలోమీటర్ల దూరంలో ‘రాజపాళయం’ అనే పట్టణం ఉంది. నాయకరాజుల కాలంలో సైనిక దళాధికారులుగా వచ్చిన క్షత్రియులు కొందరు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఈ పట్టణాన్ని నిర్మించారు. వీళ్లు రణరంగంలోనే కాదు సాహితీరంగంలో కూడా ప్రసిద్ది చెందారు. రాజపాళయానికి చెందిన గొట్టుముక్కల కుమార పెద్దిరాజు ‘సావిత్రి చరిత్రము’, గొట్టుముక్కల కృష్ణంరాజు ‘సీతా కళ్యాణము’, గొట్టుముక్కల సింగరాజు ‘పారిజాతాపహరణము’ అనే యక్షగానాలను రచించారు. ఈ రాజకవులే కాక ఈ ప్రాంతానికి చెందిన నందవరపు శేషాచల మంత్రి ‘నాచ్చారు పరిణయం’, తిరుమెక్కొళ తిరువెంగళాచార్యులు ‘కూరత్తాళ్వారు చరిత్ర’ అనే యక్షగానాలను రచించారు.
ఈ వ్యాసంలో పైన పేర్కొన్న ఐదు యక్షగానాలలో కనిపించే చారిత్రక, సాంస్కృతిక అంశాలను చర్చించడం జరిగింది. దీని ఆధారంగా తమిళనాడులో 17వ శతాబ్దానికి చెందిన తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉండేవో తెలుసుకోవడానికి వీలవుతున్నది.
2. చారిత్రకాంశాలు :
2.1. భగవద్రామానుజులు తన ప్రియమైన శిష్యుడు కూరత్తాళ్వారులను పిలిచి ‘‘మీరు మా శిష్యులందరిలో మహాత్ములు, ధార్మికులు. అక్షయపాత్ర ఉపాదానమెత్తి మోక్షార్ధివై తిరుముడి కారగింపు’’1 చేయమని ఆజ్ఞాపించాడట. దాని ప్రకారం కూరత్తాళ్వారు ప్రతిరోజు భిక్షాటనం చేసి ఆ విధంగా వచ్చిన సొమ్ములతో భాగవతులకు తదీయారాధన చేస్తూ ఉండేవాడని తెలియ వస్తున్నది. ఈ విషయం మనకు మరి ఏ ఇతర గ్రంథాలలోనూ కనిపించదు.
2.2. నాచ్చారు పరిణయంలోని యక్షగానంలో చారిత్రక వ్యక్తులైన పెరియాళ్వారులు, గోదాదేవి చరిత్రలు ప్రస్తావించబడ్డాయి.
2.3. తాతా-మనమలు ఇరువురు కవులుగా ప్రఖ్యాతి చెందడం తెలుగు సాహిత్యంలో కనిపిస్తుంది. రాజపాళయం కవుల్లో కూడా తాత అయిన కుమార పెద్దిరాజు మనుమడైన సింగరాజు ఇరువురూ యక్షగానాలు రచించినట్లు తెలుస్తున్నది.
3. సాంస్కృతికాంశాలు:
రాజపాళయం యక్షగానాలను పరిశీలించినప్పుడు 17వ శతాబ్దం నాటి రాజపాళయం ప్రాంతానికి చెందిన సాంస్కృతిక అంశాలు తెలియ వస్తున్నాయి.
3.1. దొంగల వేషధారణ :
ఆ రోజుల్లో దొంగలు ఎలాంటి వేషధారణ కలిగి ఉండేవారో, ఏవిధంగా దొంగతనానికి బయలు దేరేవారో తిరుమెక్కళ తిరువెంగళాచార్యులు తన కూరత్తాళ్వారు యక్షగానంలో వివరంగా పేర్కొన్నారు. దొంగలు కన్నం వేయడానికి అనుకూలంగా నల్లని వస్త్రాన్ని ధరించి, కన్నపు కత్తి చేపట్టి, మొలలో బాకును దోపుకుని బయలుదేరుతారు. ప్రజలు ఎవరైనా తమను చూసి కేకలు వేయకుండా ఉండేటందులకై మాట్లాడనీయకుండా చేసే భస్మాన్ని, గాలిని శరీరాన్ని దృష్టిని కదలనీయకుండా స్తంభింపజేసే బంధనాలను, రాజులను వశ్యం చేసుకోగల రాజవశ్యమును, ప్రజలను వశ్యం చేసుకునే మోహన భస్మము, సొక్కపొడి మొదలైన మందులను వేర్వేరు తిత్తులలో పెట్టుకుని దాచుకుంటారు. చేతిలో చిలికి కఠారు పట్టుకొని, ముఖంలో కావు బొట్టుపెట్టి, తలకు పాగా కట్టుకొని, చేతిలో ఇనుప గుదియను పెట్టుకొని, నల్లనివస్త్రము మొలకు కట్టుకొని బయలుదేరే ముందు శ్రీ రంగనాథునికి మొక్కి బయలుదేరుతారట.
ఘననీలికాశయు గట్టి కన్నపుకత్తి
చేపట్టి మొల బాకు చేర్చి కట్టి
వాకట్టు భూతియు వాయు బంధనమును
తనువు బంధనమును ధాత బంధ
... ... ... ... ... ...
యాదిగా గల్గు మంత్ర యంత్రములు గొనుచు
ఘన తరంబైన మందుల కాశలోన
బెట్టి చికిలికఠారి చేబట్టి వేగ
కడువడి నదృశ్య చోరుండు వెడలె నపుడు.2
3.2. ఎరుకత వేషం:
ఆ రోజుల్లో ఎరుకతెలు గురి చెబుతామంటూ ఊళ్లో ప్రవేశిస్తూ ఉండేవాళ్లు. ఆ ఎరుకతెల వేషధారణ ఎలా ఉండేదో, నాచ్చారు పరిణయం యక్షగానంలో పేర్కొనబడింది.
ఎరుక చెప్పే యువతి చంకలో బుట్టతో మొలక నవ్వులు కురిపిస్తూ, పువ్వుల కోల చేతిలో తిప్పుకుంటూ తన చిన్న కుమారుని మూపులో కట్టుకొని, ముఖంలో పచ్చబొట్లతో, చేతిలో కంకణాలు కదలాడుతుండగా ‘‘ఎరుక ఎరుకరో’’ యని కేకలు వేసుకుంటూ ఊళ్లో ప్రతి ఇల్లూ తిరుగుతుంది.
వచ్చె నెరుకత రాజవీధుల వాడవాడల చూచుచు
వెలయ చంకను బుట్టి నిడికొని వింతమాటల తేటలా
మొలకనవ్వుల జిగి మెరుంగులు మోముపై విలసిల్లగా
కులుకు నడకలను చెలగ పువ్వుల కోల చేతను ద్రిణతు
వదనమున జిగి పచ్చబొట్టుల వైభవము మనరారగా
కరములను నవరత్నమయ కంకణ రవంబుల నగుడగా
ఎరుక ఎరుకో యనుచు భూమీసురుని మందిరమునకును
గరిమతో చనుదెంచె నెరుకత...3
3.3. భిక్షగాళ్ల వేషం:
ఆ రోజుల్లో వైష్ణవ భక్తులైన భిక్షగాళ్ల వేషధారణ ఎలా ఉండేదో కూరత్తాళ్వారు యక్షగానంలో చెప్పబడింది.
వేకువజామునే లేచి, కావేరిలో స్నానం చేసి, నీరు కావి ధోవతులను కట్టుకొని, ద్వాదశ ఊర్ధ్వ పుండ్రములు దిద్దుకొని, వక్షస్థలములో తిరుమణి వడములు దండలు వేలాడుతుండగా, ద్రావిడాగమములైన యతిరాజ వింశతి, ఆళవందారు స్తోత్రము, గద్య త్రయము, ముకుందమాల, గోదాస్తుతి మొదలైన గ్రంథాలను పఠిస్తూ, అడియడను, అపరాధిని, దాసుడను అని నైచ్యానుసంధానం చేస్తూ భిక్షకు బయలుదేరేవాళ్లు.
అక్షయపాత్రంబు దక్షిణహస్తమున దనరారుచుండంగ
రక్షకా యని నామకరమున రమణ ‘విశిరి’ చెలంగగా
కూరవిభుడు వుపాదనంబు గూడ యెత్తుక వెడలెనూ
సారెకును తిరునామధారులు స్వామిస్వామని మ్రొక్కగా
అరయగా యతిరాజవింశతి యాళవందరుస్తోత్రము
గరిమెతో గద్యత్రయంబును కంఠపాఠము చదువుచూ
అడియడను దాసుడను అపరా ధనుచు వైష్ణవజనములో
పొడగనిన శేషత్వనైచ్ఛము పొందు మీరగ బల్కుచూ- కూరవిభుడూ.4
3.4. జాతకర్మలు:
ఆ రోజుల్లో బిడ్డ పుట్టిన తరువాత జాతకర్మ, నామకరణం, ఉపనయనం మొదలైన సంస్కారాలను ఎలా జరిపించేవారో ఈ యక్షగానాల వల్ల తెలుస్తున్నది. సీతాకల్యాణంలో దశరథుడు తనకు కుమారులు జన్మించిన వెంటనే ఆనందంతో వస్త్రభూషణ హేమాదులను, వస్తు వాహనాదులను దానం చేశాడట. జాతకర్మలైన తరువాత పన్నెండోరోజు నామకరణ మహోత్సవం జరిపించాడు. కొంత పెద్దవాళ్లైన తరువాత ఉపనయనాదులు జరిపించాడు.
సుతులు నలువురు బుట్టిరని రాజునకు జెప్పన్ చెప్పిన
హితుల కొసగెను వస్త్రభూషణ హేమరాసుల్
కనకములు దెప్పించి రాసులు గాగ బోసి ద్విజులకు
తనయ నిచ్చెను వస్తువాహన తతులతోడన్
భూరివిభవముతోడ రాజకుమారులకును వేడుక
లూర నప్పుడె జాతకర్మము లొప్ప జేశెన్.5
పిల్లలను తొట్టెలో వేసి లాలి పాటలు, జోల పాటలు పాడేవారు. బంగారు తొట్టెలో మంచి శుభలగ్నంలో పడుకోబెట్టి పడతులు-
లాలియని పాడరే లలన లిరుగడల,
చెలువమర పాడుచును చేడియలు వేడ్క,
ఘల్లు ఘల్లు మనుచు కంకణములెసంగా
లలిత కరముల బట్టి లాలి పాడుచును.6
మరికొందరు
‘‘జో జో మహాలక్ష్మి జోజో జగన్మాతా!
జో జగన్నుత శీల జో చిన్నిబాల’’7
అని జోలపాటలు పాడారు. ఈ కార్యక్రమము అయిన తరువాత ముత్తైదువులకు వాయినాలు ఇచ్చారు. పచ్చని కదళీ ఫలములు, పనస తొనలు, మామిడి పండ్లు, కస్తూరి మొదలైన సుగంధ పరిమళములు, ఒక్కలు, తెల్లని తమలపాకులు, ఏలకులు, కర్పూర గుళికలు, మృదు వస్త్రములు, పుష్పాలు మొదలైనవాటిని పెట్టిన పళ్లెరములను వాయినాలని పిలిచేవాళ్లు.
3.5. బాల్యక్రీడలు:
ఆ రోజుల్లో బాలికలు ఎలాంటి ఆటలు ఆడుకునేవారో నాచ్చారు పరిణయం యక్షగానంలో పేర్కొనబడింది.
‘‘తోడిచేడియలతో నాట్లాడున్
బొమ్మల పెండ్లిల్ల ఇమ్ముగా చేయును
చిలుకకు పద్యము చెప్పదొడగును
పువ్వుల పదములు పొందుగా గట్టును
బంగారు ఉయ్యెలలో బాగుగా నూగును
పడతుల కూడుక బంతుల నాడును’’ 8
సీతాకల్యాణంలో దశరథుడు తనకు కుమారులు జన్మించిన వెంటనే ఆనందంతో వస్త్రభూషణ హేమాదులను, వస్త్రవాహనాలను దానంచేశాడు. జాతకర్మలైన తరువాత పన్నెండో రోజు నామకరణ మహోత్సవం జరిపాడు. కొంత పెద్దవాల్లైన తరువాత వారికి ఉపనయన సంస్కారం గావించాడు.
3.6. వివాహం:
రాజపాళయం యక్షగానాలైన సీతాకళ్యాణం, నాచ్చారు పరిణయం ఈ రెండింటిలోనూ, వివాహ మహోత్సవ వర్ణనలు సుదీర్ఘంగా చేయబడ్డాయి.
... ... వనజనేత్రుడు సీతగళమున నునిచె మంగళసూత్రము
రామసీతల కపుడు తగ తలబ్రాలు బోయగ మౌక్తికంబులు
రామ లిరువంకలను బట్టిరి రాజసమునన్
రాముడంతట సీతశిరసున బ్రాలు నించెన్
... ... సీత శిగ్గున రామభూవిభు శిరసున
తలబ్రాలు బోశెన్9
ఇవి ఆనాటి తెలుగు ప్రజల వివాహ పద్ధతులకు అద్దం పడుతున్నాయి. 17వ శతాబ్దంలో రాజపాళయానికి చెందిన తెలుగు ప్రజల వివాహ సంప్రదాయాలు ఎలా ఉండేవో ఈ యక్షగానాల వలన మనకు తెలుస్తున్నాయి.
పెళ్లి సాధారణంగా పెళ్లికూతురు స్వగృహంలో జరుగుతుంది. ఈ ఆచారం ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతూ ఉంది. జనకుడు వచ్చిన పెళ్లివారిని సముచిత ప్రకారం ఎదుర్కొని వాళ్లకు విడుదులు ఏర్పాటు చేశాడు. గణపతి పూజ అయిన తరువాత వరుని తలకు సంపెంగ నూనె అంటి మంగళస్నానాలు చేయించి నూతన వస్త్రాభరణాలతో పెళ్లి కుమారునిగా అలంకరించారు. అక్కడ వధువు సీతాదేవికి కూడా మంగళస్నానాలు చేయించారు. నలుగులు పెడుతూ, సువ్వాల పాటలు, అల్లోనేరేడు పాటలు, శోభనం పాటలు, ధవళాలు పాడుతూ మంగళహారతులు ఇచ్చారు. పట్టు పుట్టములతో, రత్నాభరణాలతో వధువును అలంకరించారు. శ్రీరాముడు భద్రగజము అధిరోహించి ఊరేగింపుగా వచ్చి పెండ్లి మంటపం చేరుకుంటాడు. త్రోవలో పౌరకాంతలు లాజ అక్షతలు చల్లి దీవించారు. శ్రీరాముడు వివాహవేదికపై ఆసీనుడైన తరువాత జనకుడు బంగారు కలశంలోని నీళ్లతో వరునిపాదాలను ప్రక్షాళనం చేస్తాడు. చెలికత్తెలు సీతాదేవిని వివాహ మంటపానికి పిలుచుకొని వస్తారు. వధూవరుల నడుమ తెర వేలాడ దీయబడి ఉంటుంది. కన్యాదానం చేసిన తరువాత తెర తీయబడుతుంది. వధూవరులు పరస్పరం చూసుకుంటారు. సుమూహుర్తంలో శ్రీరాముడు సీత మెడలో మంగళసూత్రం కట్టాడు. వధూవరులు ఇరువురు తలంబ్రాలు పోసుకుంటారు. పురోహితుడు అగ్నిని ప్రజ్వలించి లాజహోమం మొదలైనవి సాంగోపాగంగా జరిపిస్తాడు. రాజులందరూ కట్నాలు చదివించారు. జనకుడు అల్లునికి కూతురికి లక్ష ఏనుగులు, లక్ష గుర్రాలు, వందలాది గ్రామాలు, అమూల్యమైన వస్త్రాభరణాలు అరణంగా ఇచ్చాడు. ముత్తెదువులు మంగళహారతులు ఎత్తారు. శోభనమైన నాలుగోరోజు నాగవల్లి ఉత్సవాన్ని ఘనంగా జరిపించారు. కుమార్తెకు బుద్ధిమాటలు చెప్పి సకలవస్తు సంభారాలతో, మంచి ముహూర్తంలో సీతాదేవిని తండ్రి సాగనంపుతాడు. నాంచారు పరిణయం కావ్యంలో వధూవరులు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు యువతులు తలుపుల దగ్గరచేరి పేర్లు చెప్పమని అడగడం కనిపిస్తుంది. వధూవరులు బువ్వమారగించే ఘట్టాన్ని కూడా వివరించారు శేషాచలామాత్యుడు. పైన పేర్కొనబడిన వివాహ సంప్రదాయాలు తెలుగు ప్రజలలో అనుక్రమంగా కనిపిస్తుండడం విశేషం.
4. కావ్య సంప్రదాయం:
రాజపాళయం యక్షగాన కవులు తమిళదేశానికి చెందిన వారైనప్పటికీ తెలుగు కావ్య సంప్రదాయాలను తు.చ. తప్పకుండా పాటించారు.
4.1. సావిత్రి చరిత్రము
కృత్యవతారిక : ఈ యక్షగానానికి శ్రీరాముడే కృతిభర్త కాబట్టి గొట్టుముక్కల పెద్దరాజ కవి శ్రీ సీతారాములను సంస్తుతిస్తూ ఈ యక్షగాన కావ్యాన్ని ప్రారంభించాడు. కావ్యం భగవత్ప్రార్థనతో ప్రారంభమవుతున్నది. కావ్యాన్ని శ్రీతో, మగణంతో ప్రారంభించడం శుభదాయకమనే సంప్రదాయాన్ని ఈ కవి కూడా పాటించాడు. మొదటి పద్యం శార్దూల వృత్తంతో కూడుకొని ఉంది.
‘‘శ్రీ సీతాంగణ తోడ యొడ్డి సొగటల్ చెల్వొవ్వగా నాడుచో’’10
4.2. పారిజాతాపహరణం
కృత్యవతారిక : కృతికర్త అయిన గొట్టుముక్కల సింగరాజు ప్రాచీన కావ్య సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని పారిజాతాపహరణ యక్షగాన కావ్యాన్ని మంగళప్రదమైన శ్రీతో, మగణంతో ప్రారంభమయ్యే శార్దూల విక్రీడిత వృత్తంతో ప్రారంభించాడు.
శ్రీ సీతారమణీ పయోధర లస త్పిందూర పంకాంక వ
క్షో సౌందర్య విలాసలాలన కలా ... ... రద్రన్న సం
భాసాలంకృతుడై తనర్పి జగముల్ పాలించి లాలించు నా
కౌసల్యాత్మజు డైనరాము డొసగున్ కల్యాణసాకల్యముల్.11
తన ఇష్టదైవమైన శ్రీరాముడు తనకు కళ్యాణ సాకల్యముల్ కలుగజేయాలని మొదటి పద్యంలోనే కవి ప్రార్థించాడు. ఇష్ట దేవతాస్తుతిలో బ్రహ్మ, పరమేశ్వరుడు, గణనాథుడు, శ్రీమహాలక్ష్మి, సరస్వతి, గౌరి మొదలైన వాళ్లను వరుసగా నుతించాడు.
పూర్వకవి స్తుతిలో వాల్మీకి, వ్యాస, నారద, కాళిదాసు, దండి, మయూరుడు, భవభూతి, బాణభట్టు మొదలైన సంస్కృత కవులను భక్తితో నమస్కరించాడు. నన్నయ, తిక్కన మొదలైన తెలుగు సప్తకవులకు మ్రొక్కి తండ్రి అయిన కృష్ణభూపాలుని, పితామహుడైన కుమార పెద్దిరాజు సుకవిని మనసులో స్మరించుకొని తన గురువైన పరాశరభట్టరాన్వయుడైన వేంకటాచార్యులను నుతించి, పన్నిద్దరాళ్వారులను సంస్మరించుకొని, సుందర దేశీకులను ప్రస్తుతించి, వేంకటక్షితీశ్వరునకు ప్రణతులర్పించి తన తల్లిదండ్రులైన పెద్దమాంబ కృష్ణనృపతులకు కైమోడ్పులొసంగి తన యక్షగాన కావ్యాన్ని ప్రారంభించాడు.
తిక్కన, పోతన మహాకవులలాగా ఈ కవి కూడా కృత్యవతారికలో స్వప్న వృత్తాంతాన్ని చెప్పుకున్నాడు. స్వప్నంలో ఒకనాడు సత్యభామా శ్రీకృష్ణులు ప్రత్యక్షమై నువ్వు రచించబోయే పారిజాతపహరణ యక్షగాన కావ్యాన్ని సీతారామాంకితం కావించాలని చెప్పి, అంతరార్థం చెందారు. ఆ విధంగా సింగరాజు శ్రీరాముని భక్తితో సంస్తుతిస్తూ తన యక్షగాన రచన ప్రారంభించాడు. శ్రీరాముని సంస్తుతించే సందర్భంలో రామాయణ ఇతివృత్తాన్ని సంగ్రహంగా పొందుపరచడం కవి వర్ణనా నైపుణ్యాన్ని సూచిస్తున్నది. షష్ఠ్యంతములు అయిన తరువాత కవి కథ చెప్పడం ప్రారంభించాడు.
4.3. సీతా కళ్యాణం
కృత్యవతారిక: సీతాకల్యాణం యక్షగానానికి కృతి భర్త శ్రీరాముడు కాబట్టి కృతికర్త అయిన గొట్టుముక్కల కృష్ణమరాజు సీతా సమేతుడైన శ్రీరామచంద్రుని సంస్తుతిస్తూ తన కావ్యాన్ని ప్రారంభించాడు. కావ్యాన్ని శ్రీ తో ప్రారంభించాలనే కావ్య సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీతో, మగణంతో ప్రారంభమయ్యే శార్దూలవిక్రీడితపద్యంతో ఈ యక్షగానం ప్రారంభమైంది.
‘‘శ్రీవైదేహి నిజాంగలిప్త నవకాశ్మీరాంతనాధోరువ
క్షో విభ్రాజిత ... ... ... ... ... ’’12
శ్రీరాముని స్తుతించిన తరువాత ఇష్టదేవతలైన బ్రహ్మ, మహేశ్వర, విఘ్నేశ్వర, మొదలైన దేవతలను భక్తితో కొలిచాడు.
ఇష్ట దేవతా ప్రార్థన అయిన తరువాత పూర్వీకుల స్తుతితో వ్యాస, వాల్మీక, కాళిదాసాది సంస్కృత కవులను తుంబుర, నారదాది సంగీత జ్ఞానులను, తిక్కన మొదలైన ఆంధ్రభాషాను కవులను ప్రణుతి చేసి, చతుర కావ్యాలు చెప్పే చతుర కల్పనా కవులను అంజలి ఘటించి, వర్తమాన, బావి కవులను మనసులో స్మరించుకున్నాడు. తన గురువులైన అగణిత గుణధుర్యుడైన లక్ష్మణాచార్యులను మదిలో నిలుపుకొని, తన వంశ ప్రసస్తిని చెప్పడం ప్రారంభించాడు.
తాను ధనంజయ గోత్రుడననీ, వరదరాజు వేంకటాంబల పుత్రుడననీ, సుగుణ నిధి అయిన వేంకటపతికి తమ్ముడననీ తన పేరు కృష్ణమరాజు అని తన గురించి చెప్పుకున్నాడు.
తిక్కన పోతన మహాకవుల లాగ కృష్ణమరాజు కూడా కావ్యావతారికలో స్వప్న వృత్తాంతాన్ని ప్రస్తావించాడు. ఒకనాడు శుచి ప్రదేశములో నిద్రిస్తుండగా కలలో కపిల జటాభార కలితుడైన దేహకాంతులు మెరుస్తుండగా విభూదిని శరీరమంతా అలదుకొన్న హరిహరనాథుడు ప్రత్యక్షమై ‘‘వత్సా! లెమ్ము. వాణి నీ నాలుకలో కొలువుంటుంది. రమ్యమైన సకల గుణ గణాలతో కూడిన కవిత్వం ఇక చెప్పగలవు. కాబట్టి నువ్వు సీతావివాహాన్ని యక్షగానంగా లోకంలో ప్రఖ్యాతి చెందే విధంగా చెప్పు. ఈ యక్షగానాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చెయ్యి’’ అని చెప్పి అంతరార్థం చెందాడు.
‘‘కృతీశ్వరుడైన రాఘవేశ్వరుని నీలమేఘస్వామ నిజకాంతి జితసోము, శ్రీల సద్గుణ ధాము శ్రీరాము గొలుతున్’’ అని మ్రొక్కి
ప్రమదమున కడుమించి భార్గు విల్లుంద్రుంచి
రమణ విలసిల్లు దశరధరామునికి
పక్షి వాహనమెక్కి ఫణి ఫణాగ్రము ద్రొక్కి
రక్షకుండైన దశరథరామునికిని
ఆజి లోపల బట్టి అసురులగొట్టి
రాజిల్లునట్టి దశరథ రామునికిని" 13
అని షష్ఠ్యంతములు చెప్పి తన యక్షగానాన్ని ప్రారంభించాడు.
4.4. నాచ్చారు పరిణయం:
కృత్యవతారిక: నాచ్చారు పరిణయం యక్షగానాన్ని కవి తన ఇష్టదైవమైన శ్రీరామునికి అంకితం చేశాడు కాబట్టి బుధజన మందారుడు, మహనీయ కీర్తిధముడు, జగదాధారుడు అయిన శ్రీరామచంద్రుని సంస్తుతిస్తూ కవి తన కావ్యాన్ని ప్రారంభించాడు. కావ్యాన్ని మంగళప్రదమైన శ్రీతో ప్రారంభించాలనే కావ్య సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీతో, తగణంతో ప్రారంభమయ్యే కందపద్యంతో ఈ యక్షగానం ప్రారంభమైంది.
‘‘శ్రీరాముడు, బుధజన మం
దారుడు మహనీయ కీర్తిధాముడు జగదా
ధారుడు సర్వాభీష్టము
లారూఢగి మాకు నొసగు నధిక ప్రీతిన్’’14
శ్రీరాముని స్తుతించిన తరువాత కృతి రచనాపరుడైన మన్నారుదేవుని దశావతారవర్ణనతో కీర్తించాడు కవి. మీనమై జలరాశి లోపల సోమకుని కొట్టి వేదములను రక్షించడం, కమఠరూపము దాల్చి దేవతలకు అమృతం ఇవ్వడం కోసం మందరాచలమును పైకెత్తడం, పందిరూపంబెత్తి మేదిని క్రిందుజేసిన హేమ కశిపుని కూల్చడం, నర మృగేంద్రాకృతితో హిరణ్య కశిపుని నఖములతో చించడం, పొట్టియై యాచించి బలి తలమెట్టి పాతాళానికి అదమడం, ధరణీపతులను కొట్టి వసుమతిని ధారుణీసురులకు ఇవ్వడం, రవికులంలో జన్మించి దశరథరాముడై రాక్షసకోట్లను సంహరించడం, హలము పూని ప్రలంబము రక్కసుని నవని గాంచి జగంబు రక్షించడమూ, బుద్ధరూపంబున దురాత్ముల పొలయజేసి సమస్త సురముని సిద్ధసాద్యుల బ్రోవడం, కలికియై మ్లేచ్ఛులను యమపురికి పంపించి జగములను రక్షించడం మొదలైన అపూర్వ కార్యములను నిర్వహించిన వేదవేద్యుని, భావజుని కన్నట్టి వటపత్రసాయి అయిన శ్రీరంగ మన్నారు దేవుని, త్రిభువనములకు తల్లి అయిన శ్రీదేవి యగు మన్నారు రాణిని ప్రస్తుతించాడు. ఆ తరువాత సరస్వతీ లక్ష్మీ పార్వతులను ఈ కింది విధంగా ప్రార్థించాడు.
‘‘వాణిని నుత గీర్వాణుని గొలుతున్
కమలాలయ యను కనుల భజింతున్
భవుని దేవియగు పార్వతి నెంతున్
సకలదేవతల సన్నుతి నేతున్’’15
సకల దేవతలను ప్రార్థించిన తరువాత కవి కృతిభర్త అయిన శ్రీరామచంద్రుని అంకిత పద్యంతో స్తుతించి తన యక్షగానాన్ని ప్రారంభించాడు.
‘‘రాతిని మెట్టిన యంతనె
నాతినిగా జేసినట్టి నలినాక్షుకు ఖ
ద్యోత కులాంబుధి శశికిన్
సీతాప్రాణేశునకును శ్రీరామునకున్’’16
4.5. కూరత్తాళ్వారు చరిత్ర:
కృత్యవతారిక : ‘‘ఆశీర్మమన్క్రియా వస్తు నిర్దేశో వాపి తణ్ముఖమ్’’ ` కృతిని ఆశీర్వాద, నమస్కార, వస్తు నిర్దేశాలలో ఏదైనా ఒకదానితో ప్రారంభించాలనే శాస్త్ర సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుమెక్కొళ వెంగళాచార్యులు తన యక్షగానాన్ని దైవస్తుతితో ప్రారంభించాడు.
‘‘శ్రీరామా మణినాధ భూరిగుణ సచ్చిన్మాత్ర లోకేశ శృం
గారాకార శరీర యాదవ సతీ గర్భాబ్ది చంద్రోదయా
కారుణ్యాకర నాయెడన్ వెలయుమీ కావింతు మీపై కృతుల్
ఘోరారీ హర ధన్విపట్టణ నిలయా గోదా మనోవల్లభా!’’17
శ్రీవిల్లి పుత్తూరులో నెలకొని ఉన్నవాడునూ, గోదామనోవల్లభుడునూ, భక్తులపై కరుణావర్షాన్ని కురిపించేవాడునూ అయిన తన ఇష్టదైవం శ్రీరంగమన్నారుని సంస్తుతిస్తూ కవి తన యక్షగానాన్ని ప్రారంభించాడు. కావ్య రచనా సంప్రదాయాన్ని పాటిస్తూ కవి తన కావ్యాన్ని మంగళప్రదమైన ‘శ్రీ’కారంతో ప్రారంభించాడు. కావ్యం ‘మ’గణంతో ప్రారంభం కావడమనే సంప్రదాయాన్ని కూడ పాటిస్తూ కవి ‘‘శ్రీరామ’’ అంటూ మగణంతో కూరత్తాళ్వారు యక్షగానాన్ని ప్రారంభించాడు.
కావ్యాధిని ‘శ్రీ’ కారము నిలిపిన సకల దోషములు తొలగిపోతాయని శ్రీకార ప్రభావాన్ని అప్పకవి ఈ కింది విధంగా వివరించాడు.
వేదముల కెల్ల నోంకార మాదియైన
కరణి గృతులకు నెల్ల శ్రీకారమాది
గాన గవి వరులెల్లరు దాని దక్క
నితర వర్ణంబు లిడరు సత్కృతుల మొదల 18
అదే విధంగా పద్యారంభ గణములలో ‘మభసత’ శుభకరములని, తక్కినవి వర్జనీయములని లాక్షణికులు నిర్దేశించారు. ‘‘క్షేమంబగు సర్వగురుర్దత్తే మగణో భూమి దైవతః’’ అని చమత్కార చంద్రిక పేర్కొన్నది.
"జగతి గణంబుల కెల్ల్లను
మగణము గారణముగాన, మగణము గదియన్
నిగిడిరచు గణము లెల్లను
దగ శుభ మొనరించు గీడు తగుందు దానన్’’19
అని కావ్య చింతామణిలో చెప్పబడినదిగా రంగకవి చూపిన పద్యమును బట్టి నుగణము యొక్క ప్రాశస్త్యము తెలియవస్తున్నది. తిరువేంగళాచార్యులు పైన పేర్కొన్న లాక్షణికుల నియమానుసారం తన యక్షగాన కావ్యాన్ని శ్రీతో, మగణంతో ప్రారంభించడం సముచితంగా ఉంది.
ఇష్టదేవతా సంస్తుతిలో మొదట శ్రీరంగమన్నారుని స్తుతించిన తరువాత వైష్ణవ సాంప్రదాయాను సారంగా విష్వక్సేనుని, అనంతుని, గరుత్మంతుని, స్వామి పంచాయుధాలైన శంఖచక్ర గథాదులను, పన్నిద్దరాళ్వారులను, భట్టాచార్యాది గురువరులను భక్తితో స్మరించి నుతించాడు.పూర్వకవి స్తుతిలో సంస్కృత కవులైన వ్యాస, పరాశర, వాల్మీకాదులను భక్తితో స్మరించుకున్నాడు. చదువుల తల్లి అయిన భారతీదేవిని నుతించిన తరువాత కృతి నాయకుడైన కూరత్తాళ్వారులకు వినయంగా తన ప్రణతులను సమర్పించుకున్నాడు.
కావ్యాన్ని అంకితం చేయడమనే సంప్రదాయం తెలుగులో ప్రాచీనకాలం నుండి కనిపిస్తూ ఉంది. ఇష్టదైవానికి గాని, తల్లిదండ్రులకు గాని, తన గురువులకు గాని, తనను పోషించిన రాజులకు గాని, తన ప్రియమైన వారికి గాని, తాము రచించిన కృతులను అంకితం చేస్తుంటారు కొందరు కవులు. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ తిరుమెక్కొళ తిరు వేంగళార్యుడు తన యక్షగాన కావ్యాన్ని ధన్వి పూరాధీశ్వరుడైన రంగమన్నారుకు అంకితం చేశాడు.
మేరుశైలాకృతికి మేదినీ వరధృతికి
ధారుణీసుర నుతికి ధన్విపుర పతికిన్
భూనుతోన్నత మతికి దీనజన సమ్మతికి
దానవాంతకుడైన ధన్విపుర పతికిన్
వాసవామరనుతికి భాసురజ యోన్నతికి
దాన రక్షకుడైన ధన్విపుర పతికిన్. 20
5. తమిళ భాషాప్రభావం:
కూరత్తాళ్వారు చరిత్ర, నాంచారు పరిణయం రెండూ తమిళనాడులోని శ్రీరంగం శ్రీవిల్లి పుత్తూరు క్షేత్రాలను కథాస్థలాలుగా కలిగిన ఇతివృత్తాలు కాబట్టి ఈ యక్షగానంలో తమిళ భాషా సాహిత్య సంప్రదాయాల ప్రభావం కనిపించడం సహజమే.
5.1. వివాహానికి పూర్వమే అంటే శివధనుర్భంగ జరిగిన ఘట్టానికి పూర్వమే సీతారాములు ఒకరినొకరు చూసుకున్నట్లు, ఇరువురిలోనూ పరస్పరం ప్రేమానురాగాలు మొలకెత్తినట్లు సీతా కల్యాణం యక్షగానంలో వర్ణింపబడింది. ఇది తెలుగు రామాయణాల్లో ఎక్కడా కనిపించదు. కవి గొట్టుముక్కల కృష్ణమరాజు తమిళ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఈ ఘట్టాన్ని తమిళ కంబ రామాయణం నుండి తీసుకున్నాడు.
5.2. వైష్ణవ భక్తులు స్నానంచేసి ద్రావిడాగములైన యతిరాజ వింశతి, ఆళనందారు స్తోత్రము మొదలైనవి పఠిస్తూ ఉంటారట.
5.3. వైష్ణవులు వినయంగా ప్రవర్తించాలనీ, అహంకార దూరులై తమను తాము భక్తులకు దాసుడిగా (అడియన్) భావించాలనే వైష్ణవ సంప్రదాయం ఈ యక్షగానంలో కనిపిస్తుంది.
5.4. వైష్ణవంలో తమను తాము అపరాధులుగా, నీచులుగా భావించుకోవడమనే సంప్రదాయం కనిపిస్తుంది. దీనినే ‘నైచ్యాను సంధానం’ అంటారు. కూరత్తాళ్వారు కూడ వైష్ణవులు ఎదురైనప్పుడు నైచ్యానుసంధానం చేసేవాడని కూరత్తాళ్వారు యక్షగానంలో పేర్కొనబడింది.
5.5. వైష్ణవుల సంభాషణలో తరచూ ప్రసక్తమయ్యే తమిళపదాలు ఈ యక్షగానాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని మాత్రమే ఇక్కడ పేర్కొనడం జరిగింది. పెరియతిరువడి, పిరాట్టి, తిరుమణి వడియము, తిరుమాళిఘలు, అడియడు.
6. ఉపసంహరం :
6.1. నాయకరాజుల కాలంలో యక్షగానాలు అధికంగా వచ్చాయి. రాజపాళయంలోని కవులపై ఈ ప్రభావం కనిపిస్తున్నది. అందుకే లభించిన ఆరు గ్రంథాలలో అయిదు యక్షగాన ప్రక్రియకు చెందినవిగా కనిపిస్తున్నాయి.
6.2. యక్షగానాలు ప్రదర్శన యోగ్యంగా ఉండడం వల్ల ఆరోజుల్లో యక్షగానాలు ఈ ప్రాంతంలో ప్రదర్శింపబడుతూ ఉండేదని తెలుస్తున్నది.
6.3. యక్షగాన రచయితలు రాజ కుటుంబానికి చెందినవారుగా, అందులోనూ గొట్టుముక్కల వంశానికి చెందినవారుగా కనిపిస్తున్నారు.
6.4. ఒకే కుటుంబానికి చెందిన తాతామనుమలు కవులుగా ఉండడం రాజపాళయం యక్షగానంలో కనిపిస్తున్నది.
6.5. గొట్టుముక్కల వంశానికి చెందిన క్షత్రియ కుటుంబాలు ఇప్పటికీ రాజపాళయంలో కనిపిస్తున్నారు.
6.6. రాజపాళయం సమీపంలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన గోదాదేవి ఇతివృత్తాన్ని తీసుకొని యక్షగానం రాయడం గుర్తించదగిన అంశం.
6.7. సంభాషణలు చాలావరకు సరళ గ్రాంథికంలోనూ కొన్నిచోట్ల వ్యవహారికంలోనూ కనిపిస్తున్నాయి.
6.8. కూరత్తాళ్వారు ఇతివృత్తంలో పేర్కొనబడిన ‘తిలఘాతకి’ ఇతివృత్తం తెలుగు, తమిళ, సంస్కృత గ్రంథాలలో కనిపించదు. ఇది కవి స్వకపోల కల్పితము.
7. పాదసూచికలు:
- కూరత్తాళ్వారు చరిత్ర, పు.ట.5
- కూరత్తాళ్వారు చరిత్ర, పు.ట.20
- నాచ్చారు పరిణయం, పు.ట.16
- కూరత్తాళ్వారు చరిత్ర, పు.ట.6
- సీతా కల్యాణం, పు.ట. 12
- సీతా కల్యాణం, పు.ట. 10
- నాచ్చారు పరిణయం, పు.ట.11
- నాచ్చారు పరిణయం, పు.ట.12
- సీతా కల్యాణం, పు.ట. 47
- సావిత్రి చరిత్రము, పు.ట.105
- పారిజాతాపహరణం, పు.ట.57
- సీతా కల్యాణం, పు.ట. 3
- సీతా కల్యాణం, పు.ట. 13
- నాచ్చారు పరిణయం, పు.ట.1
- నాచ్చారు పరిణయం, పు.ట.3
- నాచ్చారు పరిణయం, పు.ట.3
- కూరత్తాళ్వారు చరిత్ర, పు.ట.1
- అప్ప కవీయము, పు.ట.354
- ఆధారం తెలుగు కావ్యావతారికలు, పు.ట.21
- కూరత్తాళ్వారు చరిత్ర, పు.ట.2,3
8. ఉపయుక్తగ్రంథసూచి:
- కూరత్తాళ్వారు చరిత్ర. తెలుగు విద్యాలయం ప్రచురణ, రాజపాళయం-1987
- జగన్నాథరాజా, ము. రాజపాళయం క్షత్రియరాజాక్కళ్ వరలారు - రాజపాళయం-2002
- జోగారావు. యస్.వి. ఆంధ్రయక్షగానవాఙ్మయచరిత్ర. ఆంధ్రవిశ్వకళాపరిషత్ ప్రచురణ. 1961.
- నాచ్చారు పరిణయం. తెలుగు విద్యాలయం ప్రచురణ, రాజపాళయం-1987
- ప్రసాద్, యం. శ్రీ ముదునూరి జగన్నాథరాజాగారి సాహిత్యానుశీలన (అముద్రిత సిద్ధాంతగ్రంథం) మదురై కామరాజ్, విశ్వవిద్యాలయం-2016
- రాజపాళయం రాజకవుల యక్షగానములు - తెలుగు విద్యాలయం ప్రచురణ, రాజపాళయం-1987
- రాధాకృష్ణమూర్తి, మిక్కిలినేని. తెలుగువారి జానపదకళారూపాలు, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ. 1992.
- శేష సూర్య భ్రమరాంబ. రాజపాళయం కవుల యక్షగానాల సవిమర్శక పరిశీలన (అముద్రిత లఘ సిద్ధాంతగ్రంథం) తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి 1990.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.