AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
17. శ్రీరంగం నారాయణబాబు ‘గడ్డిపరక’ కవిత: అభ్యుదయదృక్పథం
డా. పట్టపు శివకుమార్
తెలుగు అధ్యాపకుడు,
శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల తి.తి.దే.
తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9492032640, Email: pattapu.siva@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
శ్రీరంగం నారాయణబాబు రచనలలో ‘రుధిరజ్యోతి’ పేర్కొనదగినది. ‘రుధిరజ్యోతి’ కవితా సంపుటి నారాయణబాబు మరణానంతరం, ఆరుద్ర పర్యవేక్షణలో 1972లో వెలువడింది. శ్రీరంగం నారాయణబాబు గారి ‘గడ్డిపరక’ కవితలోని అభ్యుదయ దృక్పథం, పౌరాణిక ప్రతీకలను గురించి పరిశీలించటం ఈ వ్యాసంలోని ముఖ్య ఉద్దేశ్యం. ఈ వ్యాసంలో ప్రస్తావించిన వివిధ విషయాల ద్వారా ‘గడ్డిపరక’ కవితలోని నారాయణబాబు అభ్యుదయ దృక్పథం, కవితా ఖండికలోని పురాణ ప్రతీకల ద్వారా వెల్లడవుతున్న ధ్వని వ్యంగ్య రూపాల ప్రయోగం అనేవి వెల్లడవుతాయి.
Keywords: శ్రీరంగం నారాయణబాబు, అభ్యుదయ కవిత్వం, రుధిరజ్యోతి, గడ్డిపరక, అభ్యుదయ దృక్పథం, పితృకార్యం నాటి సంప్రదాయం, పురాణ ప్రతీకలు, గరుత్మంతుని కథ, కాకాసురుని కథ
1. ఉపోద్ఘాతం:
ఆధునిక తెలుగు సాహిత్యంలో భావ కవిత్వం పై తిరుగుబాటు చేసి సరికొత్త ప్రయోగాలను చేసిన శ్రీశ్రీ, శిష్ట్లా, పఠాభి వంటి అభ్యుదయ కవులలో శ్రీరంగం నారాయణబాబు కూడా ప్రసిద్ధుడు. శ్రీరంగం నారాయణబాబు 1906లో విజయనగరం నందు జన్మించి, 1962లో దివంగతులైనారు. శ్రీరంగం నారాయణబాబు రచనల్లో ‘రుధిరజ్యోతి’ పేర్కొనదగింది. ‘రుధిరజ్యోతి’ కవితా సంపుటి నారాయణబాబు మరణానంతరం, ఆరుద్ర పర్యవేక్షణలో 1972లో వెలువడింది. ఈ కవితా సంపుటి శ్రీశ్రీకి అంకితం చేయబడింది.
2. అభ్యుదయ కవిత్వం – నారాయణబాబు:
శ్రీరంగం నారాయణబాబు విశాఖ కవితా సమితిలో సభ్యుడుగా ఉన్నప్పుడు, ఆకాలం నాటి యువకవులు అందరిలాగే ఆయన కూడా భావకవిత్వాన్ని అభిమానించాడు. కాని కాలక్రమంలో భావకవిత్వంలో చైతన్యం లేదని దాన్ని వదిలిపెట్టాడు. ఆ తర్వాత నారాయణబాబు వాస్తవికత – అధివాస్తవికత మరియు అభ్యుదయ మార్గాల్లో కవిత్వం రాయటం మొదలుపెట్టాడు. పాశ్చాత్య కవితా సంప్రదాయాల్ని జీర్ణించుకొన్న శ్రీరంగం నారాయణబాబు కవిత్వంలో భారతీయ సంప్రదాయాలు కూడా ప్రతిఫలించటం గుర్తించదగిన విశేషం. తెలుగులో భావకవిత్వంపై తిరుగుబాటు అనేది కేవలం కవితా వస్తువు, ఛందో వ్యాకరణాలను అధిగమించడంతో మాత్రమే ఆగలేదు. అది విప్లవ మార్గాలను కూడా అనుసరించింది. నారాయణబాబు కవితా రచన రీతిలో, వస్తువులో కూడా కొత్తదనం కనిపించడం దానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
నారాయణబాబు తన కవితా దృక్పథాన్ని గురించి ‘ప్రవర’ అనే పేరుతో ‘రుధిరజ్యోతి’కి రాసిన ముందుమాటలో, “మా కవిత్వంలో ఉండకూడని వస్తువు, వాడకూడని భాషా లేనేలేదు చాకలాడు సంత బయలు కుక్క గాడిద, కుళ్లు కాలువ, ఫేక్టరీ కూత మర ఫిరంగి మందుగుండు బీదవాడు, భిక్షువర్షీయసి అన్నీ అవేమిటి ఇవేమిటి లోకంలో ఉన్న వన్నీ; పలాయనత్వం పనికిరాదు, నల్లమందు నిషా పనికిరాదు జీవితం ఎంత సహారా ఎడారి ఐనా మేము మాత్రం మరి ఉష్ట్రపక్షులమై సంచలించలేము యదార్థంగా జీవితాన్ని దర్శిస్తాము.” (రుధిరజ్యోతి. (ప్రవర – ముందుమాట) నారాయణబాబు, శ్రీరంగం. పుట. 2.) అని పేర్కొన్నారు.
అభ్యుదయ కవితా దృక్పథాన్ని గురించి నారాయణబాబు పేర్కొన్న పై మాటల వల్ల అభ్యుదయ కవులకు కవితా వస్తువు పట్ల గల విశాలమైన దృక్పథం వెల్లడవుతున్నది. అంతేకాకుండా లోకంలోని ఏ అంశమైనా కవితా వస్తువు కాదగినదే అనే భావన కూడా ఈ మాటల్లో ధ్వనిస్తున్నది. దీనికితోడు నారాయణబాబు ప్రస్తావించిన ‘చాకలివాడు, సంతబయలు, కుక్క, గాడిద, కుళ్లు కాలవ, ఫేక్టరీ కూత’ మొదలైనవన్నీ కూడా శ్రీశ్రీ పేర్కొన్న ‘కాదేదీ కవితకనర్హం’ అనే కవితను స్ఫురింపజేస్తున్నాయి. అందువల్లనే నారాయణబాబు తన కవిత్వంలో ‘గడ్డిపరక’కు కూడా స్థానం కల్పించాడు. భాష విషయంలో కూడా ‘వాడకూడని భాషా లేదు’ అనే నారాయణబాబు మాటల్లో అభ్యుదయ కవులకు గల స్వేచ్ఛా ప్రియత్వం మనకు వినిపిస్తున్నది. అదేవిధంగా ‘కవిత్వంలో పలాయనత్వం, నల్లమందు నిషా పనికిరావని’ అనడంలో నారాయణబాబు అభ్యుదయ మనస్తత్వం, సమాజం పట్ల కవికి గల బాధ్యత అనేవి తెలుస్తున్నవి.
3. రుధిరజ్యోతి – అభ్యుదయ దృక్పథం:
నారాయణబాబు రచించి, ఆరుద్ర చేత ప్రకటించబడిన ‘రుధిరజ్యోతి’ కవితా సంపుటిలో 40 కవితా ఖండికలు ఉన్నాయి. వాటిలో ‘గడ్డిపరక’ ఖండిక కూడా ఒకటి. ఈ కవితా ఖండిక నవశక్తి పత్రికలో 1939లో ప్రచురితమైంది. 1930వ దశకంలో ఆనాటి సమాజంలోని సామాన్య మానవుడిని అడుగడుగునా వేధిస్తున్న ఆకలి, నిరుద్యోగం మొదలైన సమస్యలు అన్నిటికీ ఒక వ్యక్తీకరణ అనేది అవసరమైంది. అందువలన ఆనాటి అభ్యుదయ కవులు అందరికీ అవి కావ్య వస్తువులై ఒక కొత్తదైన కావ్యసృష్టి జరిగింది. అటువంటి కావ్యకర్తల్లో గుర్తించదగిన వ్యక్తి శ్రీరంగం నారాయణబాబు. ఆనాటి సమాజంలోని కుళ్లును, చెడును ఎక్కడికక్కడ వాస్తవిక దృక్పథంతో విమర్శించటం నారాయణబాబు కవిత్వంలో మనకు అడుగడుగునా కనిపిస్తుంది. అంతేకాకుండా సామాజిక సమస్యలను కూడా అంతవరకూ ఇతరులు ఎవరూ చిత్రించని ఒక కొత్త మార్గంలో చిత్రీకరించటం నారాయణబాబు కవిత్వంలో కనిపిస్తుంది.
అభ్యుదయ కవిత్వంలోని ప్రధాన లక్షణం శ్రామిక జనుల పక్షం వహించడం. వర్గపోరాట సిద్ధాంతం అనేది అభ్యుదయకవి యొక్క తాత్త్విక సిద్ధాంతం. ఇక అభ్యుదయ కవుల ప్రాపంచిక దృక్పథం మార్క్సిజం అని చెప్పవచ్చు. వర్గరహిత సమాజ స్థాపన అభ్యుదయ వాదుల ముఖ్య లక్ష్యం. ఈ వ్యవస్థను నిర్మూలించడానికి దోహదం చేసే సాహిత్య కృషి అభ్యుదయ కవుల యొక్క ప్రాథమిక కర్తవ్యం. శ్రీరంగం నారాయణబాబు అభ్యుదయ దృక్పథానికి ‘గడ్డిపరక’ అనే ఈ వచన గేయం చక్కని నిదర్శనం.
4. గడ్డిపరక – అభ్యుదయ దృక్పథం:
ఆధునిక సమాజంలో అణచివేతకు, దోపిడీకి గురవుతున్న సామాన్య పేద ప్రజానీకానికి ప్రతీక ‘గడ్డిపరక’. ఈ కవితా ఖండికలో సమాజంలోని బడుగు జీవులైన పేదలు, వారి జీవితాలపై నిర్దాక్షిణ్యంగా నడిచిపోతున్న ధనికులు కనిపిస్తారు. ఈ రెండు వర్గాల మధ్య గల సంఘర్షణను నారాయణబాబు మధురంగా కవిత్వీకరించాడు. ఈ కవితా ఖండికలో ‘గడ్డిపరక’ పీడనకు గురవుతున్న పేదలకు సంకేతం. పేదల కృషి ఫలితంగానే ధనవంతులు భోగాలను అనుభవిస్తున్నారు. అయితే తమ విలాసవంతమైన జీవితాలకు కారణమైన ఆ పేద వారిని మాత్రం ధనవంతులు తమ ఉక్కు పాదాల కింద తొక్కి నలిపేస్తున్నారు. అంతేకాకుండా ధనవంతులు పేదలను ఎదురు తిరగలేని అశక్త జీవులుగా కూడా చేస్తున్నారు. ఇటువంటి అంశాలను నారాయణబాబు ఈ కవితా ఖండికలో ‘గడ్డిపరక’ యొక్క స్వగతంగా వర్ణించారు.
“నడవండి !
నడవండి !
నా మీంచి నడవండి
గడ్డిపరకను !
గడ్డిపరకను !” (నారాయణబాబు, శ్రీరంగం. రుధిరజ్యోతి. పుట. 29)
అంటూ ఈ కవిత ప్రారంభం అవుతుంది. గడ్డిపరకలు ప్రకృతికి అందమైన పచ్చని రంగును, నేలకు మృదుత్వాన్ని చేకూర్చేవి. గడ్డిపరకలు చాల సుకుమారమైనవి. వాటిమీద నడిచే వారికి గడ్డిపరకల యొక్క కోమలత్వం తెలుస్తుంది. అందుకే గడ్డిపరక తన మీది నుంచి నడవమని కోరుతున్నది. ఈ విధంగా కోరటంలో గడ్డిపరక ఎదుటివారి పాదాలకు తన సున్నితత్వాన్ని అందించాలనే అనుకుంటున్నది. అయితే చాలామంది మాత్రం తమ కఠినమైన పాదాలతో వాటిని తొక్కి నలిపేస్తారు.
మనుషుల పాదాల కింద నలిగినంత మాత్రాన గడ్డిపరకకు ఉండే పూజ్యత అనేది ఎంతమాత్రం పోదు. ఎందుకంటే పూజ చేసే సమయంలో దాని అవసరం తప్పక ఉంది. కానీ మనుషులు వారి అవసరం తీరిన తరువాత చులకనగా దూరంగా పడ వేయటం అనేది మాత్రం గడ్డిపరకకు ఎంతో వేదన కలిగిస్తుందని కవి భావన. ఇది మనుషుల్లో ఉండే స్వార్థపరాయణత్వాన్ని తెలుపుతుంది. అంటే పూజ చేసినంత సేపు మాత్రం గడ్డిపరకను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ పూజ అయిపోగానే అనగా వారి అవసరం తీరిపోయిన వెంటనే దానిని దూరంగా పారవేసి, చులకనగా చూస్తారు. ఈ మాటల ద్వారా కవి స్వార్థపరులైన ధనవంతులు పేదలైన బడుగు జీవుల పట్ల వ్యవహరించే తీరును తెల్పుతున్నాడు. అందుకే గడ్డిపరక అటువంటి స్వార్థపరులను కూడా తన మీది నుంచి నడవమని ఆహ్వానిస్తున్నది.
మనుషుల కాళ్ల కిందపడి నిత్యం నలిగిపోతున్న గడ్డిపరక పలికిన ఈ కింది మాటలు దానిలోని మరొక పార్శ్వాన్ని మనకు తెలుపుతున్నాయి.
“పల్లకీ
దిగినట్టి
పెండ్లి కొడుకులు మీరు,
పట్టు తివాసీని నేను
నడవండి
నడవండి
నా మీంచి నడవండి!” (నారాయణబాబు, శ్రీరంగం. రుధిరజ్యోతి. పుట. 30)
అంటూ పలికింది గడ్డిపరక. ఇక్కడ పల్లకీ దిగిన పెళ్ళికొడుకులు అంటే, పెళ్ళికి అన్నీ సిద్ధం చేసి మండపానికి పల్లకీలో మోసుకొని వస్తే అందులో నుంచి దిగే పెళ్ళికొడుకు ఏ కష్టం తెలియకుండా సుఖంగా వచ్చి దిగుతాడు. అటువంటి పెళ్ళికొడుకు కాళీ కింద పట్టు తివాచీని నేను అని గడ్డిపరక భావిస్తున్నది. కవి ఉద్దేశంలో పెళ్ళికొడుకు అంటే సమాజంలోని ధనవంతులు, భూస్వాములు, పెట్టుబడిదారులు అని భావించాలి. వాళ్ళు పేదల కష్టాలు అనే పల్లకీలో పెళ్ళికొడుకు వంటి భోగాలను అనుభవిస్తున్నారని, గడ్డిపరక అనే ఆ కష్ట జీవులు మాత్రం ధనవంతుల కాళ్ల కింద పట్టు తివాచీల మాదిరిగా నలిగిపోతూ, వారి పాదాలకు మెత్తదనాన్ని కలిగిస్తున్నారని ఇందులోని అంతరార్థం.
ఆ తర్వాత గడ్డిపరక తాను ‘పశువుల నోటికి పాయసాన్నని’ చెప్పుకుంది. నిజానికి ఇక్కడ అది తన ఆత్మశక్తిని గ్రహించు కుంటున్నది అని తెలుసుకోవాలి. అంతేకాకుండా గడ్డిపరక తాను పశువులకు ఆహారాన్ని అని కాకుండా ‘పాయసాన్ని’ అని చెప్పడంలో, నోరులేని మూగ జీవులకు ఆహారం కావడంలో ఉన్న సంతృప్తిని వ్యక్తపరుస్తున్నది. మనుషుల పాద ధూళి స్పర్శ కూడా మృదువైన గడ్డిపరకకు ఉల్కాపాతం వంటిది. అయితే ఇంత తేలికగా నలిగి, కృశించిపోయే గుణం కలిగిన గడ్డిపరక శక్తిహీనమైనది మాత్రం కాదు అని గ్రహించాలి. ఎందుకంటే పేదలు, బడుగు జీవులను కేవలం అల్పులు అని భావిస్తే, వారిలోని నిద్రాణమైన శక్తి చైతన్యత్వం పొంది ఎప్పుడైనా మేల్కోవచ్చు.
5. పితృకార్యం – పారణవిధి:
అయితే మానవుడు ఇంకా కూడా గడ్డిపరకను తన కాళ్ల కింద అణచి పెడుతున్నాడు. అందుకే గడ్డిపరక ఈ అణచివేతను ఎదిరిస్తూ-
“నేటికి మీ పితృ కార్యంనాడు
పారణమీద మీ చేతిమీద
మరకత
అంగుళీకమ్ము
గతులు కల్పించేటి
గడ్డిపరకలము” (నారాయణబాబు, శ్రీరంగం. రుధిరజ్యోతి. పుట. 31)
అంటూ తన ఆత్మాభిమానాన్ని సగర్వంగా ప్రకటించుకున్నది. పితృకార్యం అనేది తమ పూర్వీకులకు ఉత్తమ గతులు కల్పించడం కోసం చేసేది. అందులో భాగంగానే చేతి వేలికి దర్భ గడ్డి ఉంగాన్ని ధరిస్తారు. అది లేకపోతే ఆ పితృకార్యానికి అర్థం లేదు. కాబట్టి మనుషులు ఎంత చులకనగా చూసినప్పటికీ పితృకార్యం నాడు గడ్డిపరక కూడా ప్రాధాన్యత ఉంటుందని, దానికి వేరే ప్రత్యామ్నాయం లేదని మనకు తెలుస్తున్నది. అందుకే గడ్డిపరక ‘మీకు ఉత్తమ గతులు కల్పిస్తున్నానని’ కూడా తనకు పితృకార్య సందర్భంలో గల ప్రాధాన్యతను చాటుకుంటుంది. అయితే పేదలను ధనికులు ఎంత హీనంగా చూసినా, వారిని ఎదుర్కొనే సమయం ఏదో ఒకరోజు రాకపోదని కవి చేసిన హెచ్చరిక ఇది. రోజులు మారి, పేదల కష్టాలు తీరి సమస్త లోకానికి వారే అధినాథులయ్యే శుభ సమయం రాకపోదని ఇక్కడ వ్యంగ్యంగా తెలుపబడింది.
ఈ సందర్భంలో గడ్డిపరక మాటల్లో ధిక్కార స్వరం వినిపిస్తుంది. ఎంతో కాలంగా అణచివేతను సహించి అలసిపోయిన పేదల గొంతుకను గడ్డిపరక ప్రతిధ్వనిస్తుంది. ఈ మాటల్లో మనకు తిరుగుబాటుకు చిహ్నమైన ఒకానొక ఆత్మగౌరవ చైతన్య పతాక కనిపిస్తుంది. అదేవిధంగా ‘గతులు కల్పించేటి గడ్డిపరకలము’ అనడంలో కూడా సంఘటితమైన శక్తి ఒకటి మనకు స్పష్టంగా తెలుస్తుంది. విడిగా ఉన్నప్పుడు అల్పమైన, చులకనైన గడ్డిపరకలు కూడా సంఘటితమైతే ఒక శక్తిగా మారుతాయని, అంటే గడ్డి పోచలు కలిపి తాడుగా పేనితే ఏనుగును కూడా బంధించవచ్చు అనే ఐతిహ్యం ఇందులో స్ఫురిస్తుంది. ఇది నారాయణబాబు అభ్యుదయ దృక్పథానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
అయితే గడ్డిపరక తన ఆత్మాభిమానాన్ని ఇంత సగర్వంగా ప్రకటించుకుంటున్నా మనిషి దానిని చూసి సహించలేదు. అందుకే గడ్డిపరక, ‘మిన్ను విప్పిన రక్త పతాకం మన్ను సత్తువె తెలిపింది’ అని తాను పుట్టిన మట్టి లోని అసలైన సత్తువ లోకానికి తెలిసే విధంగా హెచ్చరిస్తుంది. ఇక చివర్లో గడ్డిపరక తనను కాళ్లతో తొక్కి నలిపి వేసిన వారిని ఉద్దేశించి, కాకాసురుని కథ జ్ఞాపకానికి రాగా, ‘నన్ను నేను తెలుసుకున్నాను. ఆగండి, ఆగండి’ అని చిరకాలం సాగిన దౌర్జన్యం ఇక సాగదని హెచ్చరిస్తుంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలలో ఒక్కసారిగా పెల్లుబికిన చైతన్యానికి ఈ వాక్యం చక్కని నిదర్శనం. ‘నన్ను నేను తెలుసుకున్నాను’ అని గడ్డిపరక అనడంలో పేదలు ఐకమత్యంతో కలిసి మెలిసి తమ సంఘటిత శక్తిని దోపిడీ ధనిక వర్గానికి హెచ్చరిక చేసినట్లుగా ఇక్కడ తెలుస్తున్నది. అందుకు నిదర్శనంగానే గడ్డిపరక ‘ఆగండి! ఆగండి!’ అని అనడంలో ఇంతకాలం జరిగిన అన్యాయాలు, దౌర్జన్యాలు ఇకపై జరగవు అనే హెచ్చరికగా మనకు వినిపిస్తుంది.
అదేవిధంగా ‘గడ్డిపరక’ కవితలో రక్త పతాకంగా పేర్కొన్న ‘ఎర్ర జెండా’ అనేది శక్తికి ప్రతీక. ‘ప్రాభాత పశ్చిమానిలం పాడిన పాట’ ఆనాటి రష్యా విప్లవానికి సంకేతం అని భావించవచ్చు. నారాయణబాబు గడ్డిపరక ద్వారా పేదల ఐకమత్యాన్ని, సంఘటిత శక్తిని నిరూపించడానికే దీనిని ప్రస్తావించాడు అని చెప్పవచ్చు.
6. పురాణ ప్రతీకలు:
నారాయణబాబు తన కవితల్లో పౌరాణిక గాథలను చక్కని భావంతో కూర్చి, వాటి మధ్య రసోదయం కావిస్తాడు. ఈ పౌరాణిక ప్రతీకల పరిశీలన వలన నారాయణబాబు కవిత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. నారాయణబాబు అతి సాధారణమైన గడ్డిపరకలో కూడా వర్గ సంఘర్షణను ఊహించాడు. అంతేకాకుండా ‘గడ్డిపరక’ కవితలో గరుత్మంతుని కథ, పారణ మీద పితృకార్యం నాటి సంప్రదాయం, కాకాసురుని కథ అనే వాటిని కవి ప్రయోగించిన తీరు ఎంతో గొప్పగా ఉంది. ఈ విధంగా పౌరాణికాంశాలను లౌకికార్థంలో అన్వయించి చెప్పటం నారాయణబాబు కవిత్వం లోని ప్రత్యేకత అని చెప్పవచ్చు.
7. గరుత్మంతుని కథ:
గరుత్మంతుడు తన తల్లి వినత దాస్య విముక్తి కోసం స్వర్గలోకం నుండి అమృత కలశం తెచ్చిన సందర్భంలో దర్భ గడ్డి పాముల నాలుకలను చీల్చిన గాథ ఉంది. ఈ వృత్తాంతం భారతం లోనిది.
“మాతృవర్గంవాడు
మా అన్న
పన్నగమ్ముల
రసన లుత్తరించిన
మిన్న” (నారాయణబాబు, శ్రీరంగం. రుధిరజ్యోతి. పుట. 31)
అని గడ్డిపరక తన పూర్వీకుల వృత్తాంతం మనకు వినిపిస్తుంది. నేటి మానవుడు చులకనగా, తేలికగా భావించే గడ్డిపరకలే పూర్వం పాముల నాలుకలను రెండుగా చీల్చినవి అని గడ్డిపరక తన పూర్వీకుల గొప్పదనాన్ని గుర్తు చేస్తూ, గరుత్మంతుని కథను ప్రస్తావిస్తుంది. పూర్వం దర్భ గడ్డి పాముల నాలుకలు కత్తిరించిన విధంగా దోపిడీదారుల నాలుకలు కూడా తెగ కోస్తాననేది ఇందులోని ధ్వని. ఇందులో పాములు దోపిడీదారులకు, దర్భ గడ్డి దోపిడీకి గురవుతున్న పేదలకు ప్రతీకలుగా భావించవచ్చు.
8. కాకాసురుని కథ:
కాకాసురుని కథ రామాయణంలో ఉంది. కాకాసురుడు రాక్షసుడు. మందాకినీ నది తీరంలో నిద్రిస్తున్న సీత దగ్గరకు కాకి రూపంలో వచ్చి పయ్యెద తొలగించి, తన గోళ్ళతో ఆమె వక్షోజాలను స్పృశించి బాధను కలిగించాడు. రాముడు అది చూసి వాడిపై బాణం ప్రయోగించాడు. ఆ బాణానికి భయపడిన కాకాసురుడు చివరికి రాముడిని శరణు వేడినాడు. తన బాణం అమోఘమని ఒక్క అంగమైనా ఇస్తే గాని దాని బలం ఆగదని రాముడు అన్నాడు. అందుకు కాకాసురుడు తన కన్ను ఇచ్చాడు. నారాయణబాబు గడ్డిపరకతో పలికించిన ‘కాకాసురుని కథ జ్ఞాపకం తెచ్చింది’ అనే ఈ పౌరాణిక ప్రతీకలో సీత సమాజంలోని పేదవారికి సంకేతం కాగా, కాకాసురుడు పీడించే వారికి ప్రతీకగా కనిపిస్తాడు. ఇక సంఘటితమైన పీడితుల శక్తికి ప్రతీక రామబాణం. అది తిరుగు లేనిది. అదేవిధంగా పీడితులలో కలిగే ఐకమత్యం కూడా తిరుగులేనిదని నారాయణబాబు భావనగా ఇక్కడ మనం గ్రహించవచ్చు.
నారాయణబాబు పౌరాణిక కథలను చక్కగా అవగాహన చేసుకొని వాటిని తన ఇతివృత్తానికి ఏవిధంగా అన్వయించుకుంటున్నాడో గ్రహించిన పాఠకుని హృదయానికి ఈ కవిత చక్కగా హత్తుకుంటుంది. పౌరాణిక గాథలను కవితలకు అన్వయించుకునే ఈ సూత్ర రచన ‘గడ్డిపరక’ కవితలో అంతటా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా శ్రీరంగం నారాయణబాబు ‘గడ్డిపరక’ అనే కవితలో నిరుపేదల దుస్థితిని, దాని ఫలితంగా వారిలో రగిలిన ఆవేదనను, కలిగిన చైతన్యాన్ని ఈ పౌరాణిక ప్రతీకల ద్వారా వ్యంగ్యంగా ధ్వనింపజేసినాడు.
9. ముగింపు:
ఆధునిక తెలుగు కవిత్వంలో వాస్తవికతకు జీవం పోసిన అభ్యుదయ కవులలో శ్రీరంగం నారాయణబాబు ప్రముఖుడు. ఆయన ఆనాటి పాశ్చాత్య కవుల సంప్రదాయాలను కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు. అంతేకాకుండా వాటిని తన అభ్యుదయ దృక్పథానికి అనువుగా కూడా మార్చుకున్నాడు. సామాన్య మానవుడిని అడుగడుగునా వేధించే ఆకలి, నిరుద్యోగం మొదలైన సమస్యలకు ఒక వ్యక్తీకరణ అవసరమైన సందర్భంలో, అవి ఆనాటి అభ్యుదయ కవులకు కావ్యవస్తువులై నూతన కావ్య సృష్టికి ఎంతగానో దోహదం చేశాయి. ఆ పరంపరలోనే శ్రీరంగం నారాయణబాబు ‘రుధిరజ్యోతి’ వెలువడింది. ఆ విధంగా అభ్యుదయ దృక్పథంతో ‘గడ్డిపరక’ వంటి ఉత్తేజకరమైన కవితా రచన చేసి, ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీరంగం నారాయణబాబు చిరస్మరణీయుడు అని చెప్పవచ్చును.
శ్రీరంగం నారాయణబాబు ‘గడ్డిపరక’ కవిత – అభ్యుదయ దృక్పథం అనే ఈ వ్యాసంలో పేర్కొన్న అనేక అంశాల ద్వారా ఈ కింది ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఆధునిక తెలుగు కవిత్వంలో వస్తువును గ్రహించే విషయంలో అభ్యుదయ కవులకు గల విశాల దృక్పథం, సమదృష్టి వెల్లడవుతున్నవి. కవిత్వంలో ప్రయోగించే భాష విషయంలో నారాయణబాబు వంటి అభ్యుదయ కవుల అభిప్రాయం తెలుస్తున్నది.
అభ్యుదయ కవులు సమాజంలోని పీడితులు, బలహీనుల పక్షాన నిలిచిన తీరు ఈ కవితలో కనిపిస్తున్నది. అల్పమైన గడ్డిపరకలో కూడా వర్గ సంఘర్షణను చూడగలిగిన శ్రీరంగం నారాయణబాబు అభ్యుదయ భావాలు ఈ కవితలో మనకు కనిపిస్తున్నవి.
గడ్డిపరక కవితా ఖండికలోని అలతి అలతి పదాలు నారాయణబాబు తన కవిత్వంలో శబ్దానికి, అనుభూతికి ఇచ్చిన ప్రాముఖ్యతను వెల్లడిస్తున్నవి. అదేవిధంగా ఈ కవితలోని వ్యంగ్య గర్భితమైన కవితా రచన, ప్రస్తావించిన పురాణ ప్రతీకలు కవితా రచనలో నారాయణబాబుకు గల ప్రతిభా వ్యుత్పత్తులను తెలుపుతున్నాయి.
10. ఉపయుక్తగ్రంథసూచి:
- గోపాలకృష్ణ మూర్తి, శ్రీపాద. (2000). అర్ధశతాబ్దపు ఆంధ్రకవిత్వం. తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, హైదరాబాదు.
- నరసింహమూర్తి, యు.ఎ. (2008). శ్రీరంగం నారాయణబాబు కవితా వైశిష్ట్యం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- నాగయ్య, జి. (1976). తెలుగు సాహిత్య సమీక్ష. (సంచిక -2) నవ్య పరిశోధక ప్రచురణలు, తిరుపతి.
- నారాయణబాబు, శ్రీరంగం. (1972). రుధిరజ్యోతి. నవోదయ పబ్లిషర్సు, విజయవాడ.
- నారాయణరెడ్డి, సింగిరెడ్డి. (1988). కవితా నా చిరునామా. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- రంగనాధాచార్యులు, కె.కె. (సం.) (1979). తెలుగు సాహిత్య వికాసం. ఆంధ్ర సారస్వత పరిషత్, తిలక్ రోడ్, హైదరాబాద్.
- పైదే. (సం.) (1981). తెలుగు సాహిత్యం మరోచూపు. ఆంధ్ర సారస్వత పరిషత్, తిలక్ రోడ్, హైదరాబాద్.
- పైదే. (సం.) (1982). ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు. ఆంధ్ర సారస్వత పరిషత్, తిలక్ రోడ్, హైదరాబాద్.
- శాస్త్రి, ద్వా.నా. (2004). తెలుగు సాహిత్యచరిత్ర. ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాద్.
- శ్రీశ్రీ. (2003). మహాప్రస్థానం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.