AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
16. చాటుపద్యాలు: సామాజిక స్పృహ
డా. తంగి ఓగేస్వరరావు
తెలుగు అధ్యాపకులు,
వి.వి.గిరి ప్రభుత్వ కళాశాల,
దుంపగడప, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9959753832, Email: t.ogeswararao@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
చాటుపద్యాలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు భాషలో కొన్ని చాటుపద్యాలను పరిచయం చేస్తూ, అవి రాసిన కవుల గురించిన విషయాలు, ఆ కాలంనాటి సామాజికపరిస్థితులు ఆ చాటుపద్యాల్లో నిక్షిప్తమైన తీరును విశ్లేషనాత్మకంగా వివరించడం ఈ పరిశోదనా వ్యాసం లక్ష్యం. ఈ పరిశోదన వ్యాసరచనకు అవసరమైన సమాచారాన్ని https://archive.org నుండి మరియు వి.వి.గిరి ప్రభుత్వ కళాశాల, దుంపగడప గ్రంథాలయం నుండి స్వీకరించాను.
Keywords: చాటువు, సామాజికస్పృహ, పద్యాలు, సాంఘిక, రసికత, కవి, సాహిత్యం.
1. ఉపోద్ఘాతం:
మన ఆంధ్ర కవులు ఎన్నో ఏళ్ల నుండి కవితామృత ధారాలతో తెలుగు రసిక హృదయ కేదారంలో పసిడిపంటలు పండిస్తున్నారు. వాళ్ళకి కోపం, తాపం, అనురాగం, ఆనందం, అవహేళన భావాలు కలిగినప్పుడు తమ అనుభూతులను అప్పటికప్పుడు పద్యాల రూపంలో చెప్పారు. వాటినే చాటుపద్యాలని వ్యవహరిస్తున్నాం. సామాన్య ప్రజల హృదయాలలో నిలచిపోయేలా, వారి ఆలోచనలను ప్రభావితం చేసేలా మన పూర్వీకులు ఇచ్చిన చద్ది మూటలు చాటుపద్యాలు. సామెతకున్న సంక్షిప్తత, సూటితనం, జనప్రియత్వం, స్ఫూర్తి, ప్రాచుర్యాన్ని సంపాదించుకునే శక్తి చాటువుకూ ఉంది. సూక్తిని చమత్కృతం చెయ్యడం చాటువు లక్షణం. ఆశువు కంటే చాటువుకు ఆయుష్షు ఎక్కువ. చాటువులో అందమైన వస్తువు కంటే అందంగా చెప్పడానికే ప్రాధాన్యం.
చాటుపద్యాలు మౌఖిక సాహిత్య పరిధిలోనికి వస్తాయి. ఇక్కడ ఒకసారి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి మాటలను గుర్తు చేసుకోవాలి. “తీరుతీయములు గల భాషావాహినియందు సుకవుల కవితామృతము ప్రబంధరూపమున కాక చాటురూపమునను జాలువాఱును. వీనులకు విందులై డెందమును దనుపార్చుచుఁ జాటురచనములొక్కొకయెడఁ బ్రబంధరచనముల సయితము మీఱియుండునని చెప్పుట భాషావేదుల కనుభవవునరుక్త మగును. గ్రంథములుగా నేర్పడమిచేఁ దొల్లింటియాంధ్ర కవీశ్వరులు రచించిన చాటుపద్యము లెన్నేని యునికి తప్పినవి."1 దీని బట్టి నన్నయకి పూర్వం నుండి చాటుపద్యాలు ఉన్నాయి. నాటి కవులు ప్రజలకు అర్ధమైన రీతిలో చాటుపద్యాలను చెప్పారు.దురదృష్టవశాత్తు అవి గ్రంథస్తం కాకపోవడం వలన చాలావరకు అంతరించాయి.
నేడు లభిస్తున్న చాటువులు సి.పి.బ్రౌన్, శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి మరియు దీపాల పిచ్చయ్య శాస్త్రి గార్ల కృషిఫలితం. వారు ఎన్నో కష్టానష్టాలను భరించి చాటుపద్యాలను సేకరించారు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు చాటుపద్య మణిమంజరిగా, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు చాటుపద్య రత్నాకరంగా గ్రంథస్తం చేశారు.
2. చాటుపద్యాలు - నిర్వచనం:
చాటువు అనే పదం ‘చాటు' అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. చాటు ధాతువు యొక్క తత్సమ రూపమే చాటువు. చాటువు అనే మాటకు ప్రియమైన మాట, ఇచ్చకపు మాట, స్తుతి వాక్యం అనే అర్ధాలు ఉన్నాయి. చాటువు గురించి ఆచార్య సి.నారాయణరెడ్డి గారి మాటలను చూద్దాం. “చాటువు అంటే ప్రియమైన మాట. ఇది అచ్చమైన సంస్కృత శబ్దం. మనవాళ్ళలో కొందరు ఈ శబ్దాన్ని చదర, చాప అన్న ధోరణిలో ముచ్చటగా ఉచ్చరిస్తుంటారు. ఈ శబ్దం తెలుగు భాషలో ఎంత బాగా జీర్ణమై పోయిందో దీనిని బట్టి తెలుస్తుంది. చాటుపద్యమంటే కవి సరదాగా చెప్పిన పద్యమన్నమాట. ఒక భోగి చేత సత్కరింపబడినప్పుడో, ఒక లోభిచేత సీత్కరింప బడినప్పుడో, అందమైన దృశ్యం కనబడినప్పుడో, డెందం గాయపడినప్పుడో, అనిష్టం తొంగి చూసినప్పుడో, హాస్యం లాస్యం చేసినప్పుడో అనేక సందర్భాల్లో చిత్రమైన చిత్తవృత్తుల్లో ఛందోరూపంలో జుమ్మని చిమ్ముకొని వచ్చే కవితారూపాలే చాటు పద్యాలు.”2 దీనిని బట్టి చాటువులు ప్రణాళికాబద్ధమైన రచనలు కావు అని, సందర్భానుగుణంగా కవి హృదయం నుండి వెలువడే భావాల అక్షరాకృతే అని తెలుస్తుంది.
చాటువులు గత చరిత్రకు ప్రతిబింబాలు. కొంత అతిశయోక్తి ఉన్నా, కొన్ని చారిత్రక విషయాలను వీటి ఆధారంగ ఊహించవచ్చు. సాంఘిక చరిత్ర రచనకి చాటువులు తోడ్పడును. చాటువుల వలన నాటి మనుషుల ప్రవర్తనలు, కవుల తత్వాలు, రాజుల మనస్తత్వాలు తెలుస్తాయి. చరిత్రలో కాలనిర్ణయానికి చాటువులు దోహదపడతాయి. ఉదాహరణకు వేములవాడ భీమకవి ఉనికిని తెలుసుకొనుటకు చాటువులే ఆధారం.
3. లక్షణాలు:
చాటుకవిత్వానికి ప్రాచీన కాలం నుండి ఆదరణ ఎక్కువే. కవులలో పలువురు తాము చాటుకవులమని చెప్పుకొన్నారు. కూచిమంచి జగ్గకవి, పింగళి సూరన మొదలగు వారు ఇందుకు ఉదాహరణ. లాక్షిణికులు పలువురు లక్షణ గ్రంథాలలో ప్రామాణికత కొరకు చాటువులను ఉదహరించారు. సకలనీతి సమ్మతం, ప్రబంధ మణిభూషణం వంటి సంకలన గ్రంథాలలోనూ చాటువులు ఉన్నాయి.
విన్నకోట పెద్దన ‘కావ్యాలంకార చూడామణి’ లో చాటు ప్రబంధాలుగా ముక్తకాలను చెప్పాడు.
కం// “ఇటువలెనే ముక్తకాది
స్ఫుటతర చాటుప్రబంధముల లక్షణముల్
బటుమతి నెఱుగుట సుయశో
ఘటనంబులకెల్లఁ గుదురు కవి నృపతులకున్”3
ముక్తకం అనగా ముందు, తరువాత పద్యాలతో సంబంధం లేక స్వతంత్ర అర్ధం కలిగిన పద్యం. చాటువులు ఈ ముక్తక లక్షణం కలిగి ఉంటాయని పెద్దన పేర్కొన్నాడు. కవియిత్రి మొల్ల తన రామాయణంలో “శయ్యలు రీతులుఁ జాటు ప్రబంధములు”4 తనకు తెలియదని చెప్పింది. పింగళి సూరన ‘రాఘవ పాండవీయం’లో తాను “చాటుప్రబంధరచనాపాటవ కలికితుఁడను”5 అని చెప్పుకొన్నాడు. కూచిమంచి జగ్గకవి తన ‘చంద్రరేఖా విలాపము’ లో “ఉచ్చరించితిని విద్వచ్చయంబునుతింపఁ జాటు ప్రబంధముల్, శతకములును”6 అని చెప్పుకొన్నాడు.
ఈ కవులందరు ప్రబంధాలు, శతకాల వలె చాటువులను ఒక రకమైన కావ్యాలుగా పేర్కొన్నారు. దీనిని బట్టి మనం ఈనాడు చాటువులుగా చెబుతున్నవాటికి, ప్రాచీన కావ్యాలలోని చాటు ప్రబంధాలకు భేదం ఉందని స్పష్టం అవుతుంది. ఆధునిక కాలంలో చాటు పద్యాలు అనగా సందార్భాన్ని బట్టి అప్పటికప్పుడు చెప్పేవి. కావ్యాల మాదిరిగా ప్రణాళికా బద్దమైనవి కావు. డా.సంగనభట్ల సరసయ్యగారు ‘తెలుగులో చాటుకవిత్వం’ అనే గ్రంథంలో చాటువుల లక్షణాలను ఈ విధంగా రాశారు.
చాటుపద్యాలు 1. ముక్తకలక్షణాన్ని కలిగి ఉంటాయి.
2. ఆశుకవితలు.
3. సందర్భాని బట్టి పుడతాయి.
4. లఘురూపంలో ఉంటాయి.
5.కర్తృత్వ నిర్ధారణ కష్టం.
6. కర్త జీవిత అనుభవాలను వెల్లడిస్తాయి.
4. చాటుపద్యాలు –సామాజిక స్పృహ:
చాటుకవిగా, తిట్టుకవిగా పేరొందిన వేములవాడ భీమకవి నన్నయ కాలం వాడు. ఇతని రచనలేవీ లభించడం లేదు. ఇతనివిగా చెబుతున్న చాటువుల వలననే ఇతను తెలుగు సాహిత్యంలో జీవించి ఉన్నాడు. ఇతని చాటువుల వలన ఇతను ఉగ్రకోపి, శాపానుగ్రహ శక్తి కలవాడని తెలుస్తుంది. ఇతని చాటువులు నాటి సామాజిక పరిస్థితులకు ప్రతిబింబాలు. కోమట్లను మోసబుద్ది కలవారిగా తిట్టిన చాటువులు దీనికి ఉదాహరణ.
చ// “ గొనకొని మర్త్యలోకముఁ గోమటి పుట్టఁ గఁ దోడ పుట్ట బొం
కును గపటంబు లాలనయుఁ గుత్సిత బుద్ధియురిత్త భక్తియున్
జనవరి మాటలున్ పరధనంబును గ్రక్కున మెక్కఁ జూచుటల్
కొనుటయు నమ్ముటల్ మిగుల గొంటు తనంబును మూర్ఖవాదమున్”7
భూమిపై కోమటితో పాటు అబద్ధం, కపటం, మోసబుద్ధి పుట్టాయి. ఇతనికి దేవునిపై భక్తి శూన్యం. మోసపు మాటలతో ఇతరుల సంపదను దోసుకొంటారు. కొన్నప్పుడు, అమ్మినప్పుడు తూకంలో మోసం చేస్తారు. ఎవరైన ప్రశ్నిస్తే మూర్ఖంగా వాదిస్తారని భీమన ఈ చాటువులో చెప్పాడు. భీమన కాలంలో కోమట్లు ప్రజలను మోసం చేసేవారని తెలుస్తుంది. ఈ చాటువు సర్వకాలికం. నేడు కొందరు కోమట్లు పై రీతిగానే ప్రవర్తిస్తున్నారు.
శ్రీనాథ కవిసార్వభౌముడు 15వ శతాబ్ధికి చెందినవాడు. ఇతను బహుగ్రంథ కర్త. 15వ శతాబ్ధి యుగకర్త. ఆంధ్రదేశంలో ఇతను తిరగని ప్రాంతంగాని, దర్శించని రాజస్థానంగాని లేదు. శ్రీనాథుని జీవిత చరిత్ర అనగా 15వ శతాబ్ధి ఆంధ్రుల చరిత్ర. ప్రాచీనకాలంలో ఇతనిలా దేశాటనం చేసిన మరో కవి లేడు. ఈ దేశాటనమే అతని లోకజ్ఞత విస్తృతికి కారణం. శ్రీనాథుని చాటువులు చరిత్ర దృష్టితో చూసినా, కావ్య దృష్టితో చూసినా తెలుగు సాహిత్యానికి మకుటాయమానం. ఈ కవి లోకజ్ఞతకు చాటువులే నిదర్శనం. శ్రీనాథుడు నిర్విరామంగా తిరిగిన ప్రాంతాలలో పల్నాడు ఒకటి. శ్రీనాథుడు పల్నాడు ప్రాంతంలో ఎదుర్కొన్న కష్టాలు, ప్రజల సాంఘిక ఆచారాలు, కష్టసుఖాలు, వేషభాషలను తన చాటు పద్యాల ద్వారా వ్యక్తం చేశాడు.
ఉ// “అంగడియూరలేదు వరియన్నములేదు శుచిత్వమేమిలే
దంగనలింపులేరు ప్రియమైన వనంబులులేవు నీటికై
భంగపడంగఁ జాల్పడుకృపాపరు లెవ్యరులేరు దాత లె
న్నంగను సున్న గాన పలనాటికిఁ మాటికిఁ బోవనేటికిన్”8
పలనాడు గ్రామాల్లో దుకాణాలు లేవు. తినడానికి వరి అన్నం దొరకదు. ప్రజలలో పరిశుభ్రత లేదు. అందగత్తెలు, అందమైన వనాలు కనపడవు. మంచి నీళ్ల బావులు తవ్వించేవారు లేరు. అక్కడి వారిలో దాన గుణం శూన్యం అని శ్రీనాథుడు పై చాటువులో స్పష్టం చేశాడు. పలనాడు ప్రాంతంలోని కరువు పరిస్థితులకు ఈ చాటుపద్యం నిదర్శనం.
పోతన శ్రీనాథుని సమకాలికుడు. పోతన చాటుపద్యలు ఇతను శ్రీనాథునికి భిన్నమైన వ్యక్తిత్వం కలవాడని స్పష్టం చేస్తున్నాయి. పోతన “బాల రసాల సాల నవపల్లవకోమల కావ్యకన్యకన్”9 అనే చాటువు వలన అతను భాగవతాన్ని రాజులకు అంకితం ఇవ్వడానికి తిరష్కరించాడని తెలుస్తుంది. రాజులు ఇచ్చిన ధనంతో జీవించడం కన్న వ్యవసాయం చేయ్యడం ఉత్తమమని భావించాడు. రాజులను ‘కూళలు’ అని నిందించాడు. దీనిని బట్టి నాటి రాజులు శృంగారంలో మునిగితేలేవారని, క్రూర స్వభావం కలవారని తెలుస్తుంది. ఎక్కువమంది కవులు తమ కావ్యాలను రాజులకి, ధనవంతులకి అంకితం చేసి వారు ఇచ్చిన ధన, మాన్యాలతో జీవనం సాగించేవారని స్పష్టం అవుతుంది. శ్రీనాథుడు, పోతన వృత్తాంతాలను బట్టి నాడు బ్రాహ్మణులు కూడా వ్యవసాయం చేసేవారని తెలుస్తుంది
రెడ్డి రాజుల తరువాత ఆంధ్ర సరస్వతి విజయనగర రాజుల కాలంలో మహోన్నత ఆదరణ పొందింది. ప్రబంధ కన్యల సోయగాలు తెలుగుసీమను సాహిత్యపరిమళాలతో గుబాళింపజేశాయి. విజయనగరరాజుల కీర్తిని ఇనుమడింపజేస్తూ, ఆనాటి ప్రజల విలాస జీవితాలను వర్ణిస్తూ చెప్పిన చాటువులు అనేకం లభిస్తున్నాయి. చాటువులు ఎక్కువుగా రాజస్థానాలలో పుట్టడం ఈ కాలపు ప్రత్యేకత.
అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయలపై చెప్పిన చాటుపద్యాలైన “ఎదురైనచోఁ దన మద కరీంద్రము నిల్పి”10 మరియు “రాయరాహుతి మిండ రాచయేనుగు వచ్చి”11 అనే వాటివలన అష్టదిగ్గజాలకు రాయలు ఇచ్చిన గౌరవం, అతని ఉన్నత వ్యక్తిత్వం తెలుస్తుంది. రాయలు గజపతులపై విజయం సాదించి, సింహాచలం వద్ద విజయస్తంభం నెలకొల్పిన విషయం ఈ చాటువులు స్పష్టం చేస్తున్నయి. తెనాలి రామకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయల కీర్తిని ప్రశంసిస్తూ “నరసింహకృష్ణ రాయని కరమరుదగు కీర్తి”12 అనే చాటుపద్యం చెప్పాడు. రాయలకీర్తి శివుని వాహనమైన నందితోనూ అతని నివాసమైన కైలాసంతో సమానమైంది. ఇంద్రుని ఆయుధమైన వజ్రాయుధం, అతని వాహనాలైన ఐరావతం, ఉచ్చైశ్రవం వలె కమనీయమైనదని భావం. పై చాటువుల వలన రాయల కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. శ్రీకృష్ణదేవరాయలు, పెద్దనను కవిత్వం చెప్పమనగా, పెద్దన చెప్పిన చాటుపద్యం-
చ. “ నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె మాత్మ కింపయినభోజన ముయ్యెలమంచ మొప్పు త
ప్పరమురసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికినఁ గాక యూరక కృతుల్ రచియింపు మనంగ శక్యమే”13
జనసమ్మర్ధం లేని ప్రాంతం, మధ్య మధ్య ప్రియురాలు దూతికాచే పంపించే కప్పూర తాంబూలం, మనస్సుకు నచ్చిన భోజనం, కూర్చొని ఊగడానికి ఊయాల మంచం, రచనలో తప్పొప్పులను విచారించగల రసజ్ఞులు, కవి ఆశయాన్ని ఊహాతో గ్రహించగల లేఖకుడు,ఉత్తమ పాఠకుడు ఉంటేగాని, ఊరికే కావ్యం రాయడం సాధ్యం కాదని పెద్దన చమత్కారంగా జవాబు చెప్పాడు. దీని బట్టి అష్టదిగ్గజ కవుల భోగలాలసత తెలుస్తుంది. రాయలు కవులను గొప్పగా ఆదరించిన విషయం స్పష్టమవుతుంది.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని మంగలి, చాకలి మొదలైన పనివారికి కూడా మంచి పలుకుబడి ఉండేది. కందుకూరి రుద్రకవి రాయల ఆస్థాన ప్రవేశం కోసం చేసిన ప్రయత్నాలకు మంత్రులు ఎవరు సహకరించలేదు. రాయల సన్నిహితుడైన మంగలి కొండోజి సహకారంతో అతనికి రాజ దర్శనం కలిగింది. రుద్రకవి
కం// “ఎంగిలిముచ్చు గులాములు
సంగతిగా గులము చెరుపఁ జనుదెంచిరయా
ఇంగిత మెరిగిన ఘనుడీ
మంగలి కొండోజి మేలు మంత్రుల కన్నన్”14
అని కొండోజిని ప్రశంసించాడు. ఇది నాటి రాజాస్థనంలో కులవృతులవారికి దక్కిన గౌరవం.
అష్టదిగ్గజకవులలో ఒకేఒక శూద్రకవి రామరాజ భూషణుడు. తెనాలి కృష్ణుడు ఇతని కవిత్వాన్ని “కాపు కవిత్వపు కూతల”15ని విమర్శించాడు. ఇతనిని “ఊరకుక్క”16, “లంజల కొడక”17అని దూషించాడు. దీనిని బట్టి నాటి సమాజంలో కుల వివక్ష ఉందని తెలుస్తుంది. అది బ్రాహ్మణ ఆధిపత్య సమాజం. బ్రాహ్మణులలో కూడా వైదిక, నియోగి భేదాలు ఉండేవి. నియోగ ఆడిదము సూరకవి, వైదిక రేకపల్లి సోమనాథకవి మధ్య విజయనగర సంస్థానంలో జరిగిన వాగ్వీవాదం చాటువులలో నిక్షిప్తమైంది. దూర్జటి ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’ ఆధారంగా శైవ, వైష్ణవ ఘర్షణలుఈ కాలంలోనూ ఉన్నట్లు తెలుస్తుంది.
శ్రీకృష్ణదేవరాయలు దూర్జటి కవిత్వాని ప్రశంసిస్తూ “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెనో యతులిత మాధురీహహిమ”18 అనగా రామకృష్ణుడు వెంటనే లేచి అతిలోకసుందరి అయిన వారవనిత యొక్క అధరామృత రసాన్ని ఆస్వాదించడం చేతనే ఆయన కవిత్వానికి అంతటి మాధుర్యం వచ్చిందనే అర్ధం వచ్చేల పద్యపూరణం చేశాడు. దీని ఆదారంగా ధూర్జటికి వారకాంత సాంగత్యం ఉందని తెలుస్తుంది.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో సమాజంలో వేశ్యరికం ఒక వృతిగా ఉండేది. విజయనగరంలో వేశ్యవాడలు ఉన్నవని చరిత్రకారుల భావన. వేశ్యాల నుండి రాజులు పన్నులు వసులు చేసినట్లు తెలుస్తుంది. అష్టదిగ్గజ కవులలో ధూర్జటి కొంత వైరాగ్యం కలవాడు. అతనికీ వారకాంత సాంగత్యం ఉన్నదంటే, నాటి సమాజంలో వేశ్యాలంపటత్వం సహజమనే విషయం తెలుస్తుంది.
అల్లసాని పెద్దన “కృష్ణరాయలతో దివి కేఁగలేక బ్రతికి యున్నాఁడ జీవచ్ఛవంబు నగుచు”19 అనటాన్ని బట్టి శ్రీకృష్ణదేవరాయల తరువాత ఆంధ్రదేశంలో తెలుగు సాహిత్యానికి ఆధారణ తగ్గిన విషయం స్పష్టం అవుతుంది. ఆంధ్ర సరస్వతి దక్షిణ దేశానికి తరలివెళ్లింది. అక్కడ తంజావూరు నాయకరాజుల ఆధారణలో మరోసారి స్వర్ణయుగాన్ని అనుభవించింది. క్షేత్రయ్య చెప్పిన ఈ క్రింది చాటువు దీనికి నిదర్శనం.
కం// "తము తామె వత్తురర్ధులు
క్రమమెరిగిన దాతకడకు రమ్మన్నారా?
కమలంబులున్న చోటికి
భ్రమరంబుల నాచ్యుతేంద్ర రఘునాథ నృపా!"20
పద్మాలు ఉన్న చోటికి తుమ్మెదలు వచ్చినట్లే, దాతల వద్దకు యాచకులు వస్తారని భావం. రఘునాథ నాయకుడు క్షేత్రయ్యను తన ఆస్థానానికి ఎందుకొచ్చావని అడిగినప్పుడు క్షేత్రయ్య చెప్పిన పై చాటువు రఘునాథనాయకుని సాహిత్య పోషణకు నిదర్శనం.
18వ శతాబ్ధికి ఫ్రెంచివారు, ఆంగ్లేయులు, ముస్లీములు ఆంధ్రప్రాంతంలో స్థిరపడ్డారు. వీరి వలన స్థానిక ప్రజల ఆచారాలలో మార్పులు వచ్చాయి. అడిదము సూరకవి నాటి ఆచారాలలో వచ్చిన మార్పులను ఈ క్రింది చాటువులో వివరించాడు.
"అగ్రహారములు నామావశిష్టములయ్యె
మాన్యంబులన్నియు మంటగలిసె
భత్యంబునకు దొంటిపడికట్టు తప్పెను
బుధజనంబుల రాకపోకలుడిగె
వర్షాశనంబులు వరదపాలైపోయె
మలవతీలను ప్రజల్ మాసిచనిరి
నశించిపోయె వంతరులు తురుష్కులు
గజ తురగములు తాకట్టుపడియె
ధార్మిక స్థానమున కిట్టి తళ్ళుబుట్టె
కఠిన చిత్తుని రాజ్యాధికారి జేసి
యిoత పీడించితివి సత్కవీంద్ర కోటి"21
అగ్రహారములు ప్రాబల్యం కోల్పోయాయి. రాజులు ఇచ్చిన మాన్యాలు ఇతరులపరం అయినవి. మడికట్టు వంటి ఆచారాలు బ్రాహ్మణులు విడిచారు. కవుల రాకపోకలు తగ్గాయి. వర్షాశనాలు ఇచ్చేవారు కరువైయ్యారు. తురుష్కులు మరియు ఫ్రెంచ్ వారి ప్రాబల్యం తగ్గింది. అనగా ఆంగ్లేయులు రాజ్యాధికారులు అయ్యారు. యుద్ధాలలో ఏనుగులు, గుర్రాల వాడకం తగ్గింది. విదేశీ పాలకులు ప్రజలను ధనం కోసం పీడించేవారని తెలుస్తుంది.
5. ముగింపు:
చాటుపద్యాలు సందర్భాన్ని బట్టి కవులు ఆశువుగా చెప్పినవి.వీటి ద్వారా ఆయా కాలాల సాంఘిక, ఆర్ధిక, రాజకీయ వివరాలు తెలుసుకోవచ్చు. నాటి మత పరిస్థితులను మన కళ్ళముందు ఉంచుతాయి. సామాన్య ప్రజల జీవన విధానం, వృత్తులు, పండగలు, ఆచార వ్యవహారాల గురించి సమాచారం అందిస్తాయి. నాటి ప్రభువుల కళాపోషణ, దానగుణం, ఔదార్యములను తెలియజేస్తాయి.
చాటుపద్యాలను పరిశీలనాత్మక దృష్టితో చూస్తే అనేక నూతన చారిత్రకాంశాలను తెలుసుకోవచ్చు. శ్రీనాథుడు అటు విజయనగరం నుండి ఇటు గంజాం వరకు, రాచకొండ మొదలుకొని తమిళదేశం వరకు సంచరించి, ఆయా ప్రాంతాలలోని సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులను తన చాటుపద్యాలలో పేర్కొన్నాడు. వాటిని విశ్లేషిస్తే ప్రస్తుత మన చరిత్రలోని అనేకాంశాల వాస్తవికతను నిర్ధారించవచ్చు. అదేవిధంగా చరిత్ర పునర్నిర్మాణానికి కూడా చాటుపద్యాలు దోహదం చేస్తాయి.
ఆంధ్రదేశాన వేములవాడ భీమకవి మొదలు ఆధునిక కవుల వరకు తమ చాటుపద్యాలతో తెలుగు సాహిత్యాన్ని రసమయం చేశారు. వారి చాటువుల వలన ఆంధ్రదేశ సామాజిక పరిస్థితులు తెలుసుకోవచ్చు. వాటిని ప్రస్తుత కాలంతో పోల్చవచ్చు. మార్పులకు దారితీసిన పరిస్థితులను అంచనావేయవచ్చు. మన సంస్కృతిని సంస్కరించుకొని, పరిరక్షించుకోవడానికి చాటువులు దోహదపడతాయి.
6. పాదసూచికలు:
- చాటుపద్య మణిమంజరి, శ్రీ ప్రభాకరశాస్రి వేటూరి, తొలిపలుకునందు
- తెలుగు సాహిత్య చరిత్ర, డా.ద్వా.నా.శాస్త్రి, పుట. 206
- కావ్యాలంకార చూడామణి, పెద్దన వెన్నకోట, చతుర్దోల్లాసం, 8వ పద్యం.
- మొల్ల రామాయణం, మొల్ల ఆతుకూరి, బాలకాండము, 12 వ పద్యం
- రాఘవ పాండవీయం, సూరన పింగళి, పీఠిక, 12వ పద్యం.
- చంద్రరేఖా విలాపం, తిమ్మకవి కూచిమంచి, ప్రధామ ఆశ్వాసం, 14వ పద్యం.
- తెలుగులో తిట్టుకవిత్వం, డా.మలయవాసిని.కె, పుట. 32
- చాటుపద్య మణిమంజరి, శ్రీ ప్రభాకరశాస్రి వేటూరి, పుట. 136, పద్యం 324
- తెలుగులో చాటుకవిత్వం, డా.నరసయ్య సంగనభట్ల, పుట 69
- చాటుపద్య మణిమంజరి, శ్రీ ప్రభాకరశాస్రి వేటూరి, పుట. 166, పద్యం 424
- చాటుపద్య మణిమంజరి, శ్రీ ప్రభాకరశాస్రి వేటూరి, పుట. 167, పద్యం 425
- చాటుపద్య మణిమంజరి, శ్రీ ప్రభాకరశాస్రి వేటూరి, పుట. 164, పద్యం 412
- చాటుపద్య మణిమజరి, శ్రీ ప్రభాకరశాస్రి వేటూరి, పుట. 159, పద్యం 390
- తెలుగులో చాటుకవిత్వం, డా.నరసయ్య సంగనభట్ల, పుట. 30
- చాటుపద్య మణిమంజరి, శ్రీ ప్రభాకరశాస్రి వేటూరి, పుట.186, పద్యం 487
- చాటుపద్య మణిమంజరి, శ్రీ ప్రభాకరశాస్రి వేటూరి, పుట.186, పద్యం 489
- చాటుపద్య మణిమంజరి, శ్రీ ప్రభాకరశాస్రి వేటూరి, పుట.185, పద్యం 482
- తెలుగులో చాటుకవిత్వము, డా.నరసయ్య సంగనభట్ల, పుట. 27
- చాటుపద్య మణిమంజరి, శ్రీ ప్రభాకరశాస్రి వేటూరి, పుట.166, పద్యం 424
- తెలుగులో చాటుకవిత్వం, డా.నరసయ్య సంగనభట్ల, పుట. 35
- ఆంధ్రుల సాఘిక చరిత్ర, ప్రతాపరెడ్డి సురవరం, పుట. 290
ఉపయుక్తగ్రంథసూచి:
- తిమ్మకవి, కూచిమంచి. (1920). చంద్రరేఖ విలాపము, బ్రిటిష్ మోడల్ ప్రెస్, మద్రాస్.
- నరసయ్య, సంగనభట్ల. (2006). తెలుగులో చాటుకవిత్వము,ఆనందవర్ధన ప్రచురణలు, ధర్మపురి, కరీంనగర్ జిల్లా.
- పెద్దన, విన్నకోట. (1964). కావ్యాలంకార చూడామణి, వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మద్రాస్.
- ప్రతాప రెడ్డి, సురవరం. (2017). ఆంధ్రుల సాంఘిక చరిత్ర, క్లాసిక్ బుక్స్, విజయవాడ.
- ప్రభాకరశాస్త్రి, వేటూరి. (1952). చాటుపద్య మణిమంజరి, మణిమంజరి ప్రచురణలు, హైదరాబాద్.
- మలయవాసిని, కె. (2017). తెలుగులో తిట్టుకవిత్వము, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.
- మొల్ల, ఆతుకూరి. (1937). రామాయణము, రామా అండ్ కో, ఏలూరు.
- శాస్త్రి, ద్వా.నా. (2013). తెలుగు సాహిత్య చరిత్ర, ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్.
- సూరన, పింగళి. (1932). రాఘవ పాండవీయము, ఆనంద ప్రెస్, మద్రాస్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.