AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
14. ‘ఆదూరి వెంకట సీతారామమూర్తి’ నవలలు: సామాజికచైతన్యం
డా. వడిత్యా అన్నామణి
తెలుగు పరిశోధకురాలు,
పి.యం. పాలెం, విశాఖపట్నం,
విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9491627175, Email: vadityaannamani@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
సమాజంలో ఉన్న స్థితిగతులను ఉన్నది ఉన్నట్లుగా చిత్రించేది నవల. అటువంటి నవలా రచన ఆధునిక కాలంలో అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. వివిధ కాలాల్లో వచ్చిన నవలలను పరిశీలించడం వలన, ఆయా కాలం నాటి పరిస్థితులు తెలుసుకొనే వీలుంది. నవల చదవడమంటే గది తలుపులు రెండూ తెరుచుకుని గులాబీ పువ్వుతో పాటు తక్కిన పువ్వులనూ, మొక్కలనూ, తోట మొత్తాన్ని చూడటం వంటిది. ఆదూరి సీతారామమూర్తి వ్రాసిన ‘రాగవీచికలు’, ‘తీపిగురుతు’, ‘ఈశ్వర్ అల్లా తేరే నాం’, ‘చైతన్యదీపాలు’ అనే నవలలు ఇందుకు ఉదాహరణలు. ఈ నవలల్లో రచయిత ఏ ప్రక్రియను చేపట్టినా అందులో ఒక ప్రత్యేకతను, వైవిధ్యాన్ని చూపిస్తారు. ఒక మధ్య తరగతి కుటుంబానికి ఎదురయ్యే ఆటుపోట్లు, వాటిని సమయస్ఫూర్తితో దాటుకుపోయే విధానం, బలవంతుల చేతిలో బలహీనులు అణచివేయడుతున్నప్పటికీ రాయి, రాయి పోగై గొప్ప కొండగా మారినట్టు బలహీనులు ఏకమై బలవంతుని ఎదుర్కోవటం, తరతరాలుగా స్త్రీలు అణచివేయబడుతున్న స్థితి నుండి చైతన్యవంతులుగా మారడం ఈ పత్రం యొక్క ముఖ్యోద్దేశ్యం. “ఆదూరి” వారి రచనల పై ఆంధ్రవిశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతగ్రంథం “ఆదూరి వెంకట సీతారామమూర్తి నవలలు- పరిశీలన”- 2022 (అముద్రితం) ఈ పరిశోధన వ్యాసానికి ప్రధానభూమిక.
Keywords: స్త్రీఅణిచివేత, దళారులు, రైతులు,యజమాని,బాధ్యతారాహిత్యం, సకలమతసమ్మేళనం
1. రచయిత పరిచయం:
ఆదూరి వెంకట సీతారామమూర్తి శ్రీకాకుళం జిల్లాలోని ఖద్దరుకు ప్రసిద్ధి చెందిన పొందూరులో 24/04/ 1947న నియోగ బ్రాహ్మణ కుటుంబంలో రెండో సంతానంగా జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి సత్యవతి, శ్రీ పేర్రాజు గార్లు. తండ్రి కి రైల్వేలో ఉద్యోగం కావడం వల్ల తరచుగా బదిలీలుండేవి. అందుచేత సీతారామమూర్తి బాల్యమంతా పొందూరులోనూ, తరువాత వాల్తేరు లోను, తదుపరి వంశధారలో గడిచింది. ప్రాథమిక విద్యనభ్యసించే సమయంలో సరైన స్కూలు లేక ఇంటి వద్ద తండ్రి శిక్షణలోనే జరిగింది. హై స్కూల్ చదవంతా కూడా విశాఖపట్నంలోని మిస్సెస్ ఎ.వి.ఎన్. కాలేజ్ హైస్కూల్లో కొనసాగించారు. తనకంటే ఒక సంవత్సరం పెద్దదైన తన అక్క సూర్యకాంతం అకస్మాత్తుగా మరణించడం, తల్లి అనారోగ్యం, తదితర కుటుంబ సమస్యల వల్ల ఒక సంవత్సరం చదువు కుంటుపడినా తర్వాత కాలేజీలో చేరి తన బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు. తన తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత తన మీద పడింది. తన తల్లి, తన కన్నా చిన్నవాడైన తమ్ముడు, చెల్లెళ్ల బాధ్యతను స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీ.ఎస్సీ. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలోనే స్థానిక విశాఖపట్నం ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లో ఉద్యోగం కొరకు తన పేరును నమోదు చేయించుకుంటారు సీతారామమూర్తి . అయితే సరిగ్గా డిగ్రీ ఆఖరు సంవత్సరం పరీక్ష మరో నెల రోజులు ఉందనగ, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ వారి ఫైనాన్స్ విభాగం నుండి ఉద్యోగం ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. మొదటి ప్రయత్నంలోనే అదృష్టం కలిసొచ్చి ఉద్యోగం వచ్చింది. 1989 సంవత్సరం మే 23న రత్నమాంబ, రామారావుల కుమార్తె అయిన సత్యవతీ దేవితో వివాహం జరిగింది. సత్యవతి దేవి కూడా సాహిత్యాభిలాష ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారు కావడం వలన ఆమెలో కూడా రచన వ్యాసంగం పట్ల చిన్నతనం నుండి ఉత్సుకత ఉండేది.
2. రచనావ్యాసంగం:
ఆదూరి సీతారామ్మూర్తి తండ్రి సాహిత్యాభిమాని, తెలుగు సాహిత్యానికి, సంస్కృతికి సంబంధించిన ఎన్నో పుస్తకాలను కొని చదివే వారాయన. ఆయనలోని ఆ సాహిత్యాభిరుచే తనలో సాహిత్య బీజాన్ని నాటిందంటారు సీతారామమూర్తి . తండ్రి శిక్షణలో ఆయా తరగతులకు సంబంధించిన అచ్చు పుస్తకాలతో పాటు తెలుగు వ్యాకరణం నేర్వడంతో పాటు, పంచతంత్రంలోని కథలు వినడం, చదవడం కూడా అలవాటు చేసుకున్నారు. వేమన, సుమతి శతక పద్యాలతో పాటు కరుణశ్రీ పుష్పవిలాపం, ఉదయశ్రీలలోని పద్యాలను కంఠతా పట్టేవారు. ఆ విధంగా తనలో పడిన సాహితీ బీజాన్ని తర్వాతి కాలంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు చదివి క్రమంగా పెంచి, పోషించి వినియోగించుకున్నారు ఆదూరి. మొదటినుంచి కథా ప్రక్రియనే ఇష్టపడి కథలు రాసి స్థిరపడ్డ ఆదూరి వారు, నవలప్రక్రియలో కూడా తన కలాన్ని నడిపించి రెండు సీరియల్ నవలలనూ, మరో రెండు నవళికలను, గొలుసు నవలలను రచించారు. అవి వరుసగా 1. రాగవీచికలు, 2. చైతన్య దీపాలు, 3. ఈశ్వ ర్ అల్లా తేరే నాం, 4. తీపిగురుతు. సీతారామమూర్తి నవలలతో పాటు నాలుగు నాటికలు, ఒక నాటకాన్ని కూడా రచించారు.
3. సృజనాత్మకప్రక్రియలు- సామాజికచైతన్యం:
కథగాని, నవల గాని ఏదైనా సరే నేల విడిచి సాము చేయకుండా పాఠకుని ఆలోచనను పక్కకు మళ్లనీయకుండా ఆయా రచనలతో మమేకమయ్యే విధంగా ఉంటాయి సీతారామమూర్తి సంభాషణలు. “ఏ గతి రచింయించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా”! అన్న చేమకూర వారి మాటలు ఆదూరి సీతారామ్మూర్తికి వర్తించిందనే చెప్పాలి.
సమాజంలో ఏదో ఒక రుగ్మతను తీసుకొని కథను రాయడమైంది. ఇవి స్త్రీ చైతన్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన నవలలు. సమాజంలో స్త్రీ ఎన్ని విధాలుగా అణచబడుతుందో, మోసపోతుందో అన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. నేటి సమాజంలో వివిధ తరగతుల జీవన విధానాన్ని గూర్చిన అవగాహన పుష్కలంగా ఉన్న రచయిత. పై తరగతుల వారు, దిగువ తరగతుల వారు కూడా తమ జీవితాన్ని బాగానే గడుపుతున్నారు. ఎటొచ్చి మధ్యతరగతి వారే తమ చుట్టూ గౌరవ ప్రతిష్టలనే గిరులు గీసుకొని అష్ట కష్టాలు పడుతూ, తమపై తామే జాలి ప్రకటించుకుంటూ బతకలేక చావలేక చచ్చినట్టు బతుకుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. సమాజంలోని మనుషుల మస్తిష్కాలలో కదలాడే ఆలోచనలూ, కోరికలూ, ఆశలూ, ఆశయాలూ, అలవాట్లు ఇలా ఒకటేమిటి అన్ని రకాల భావాలను ఈ రచనలో పొందుపరచడమైంది.
3.1 రాగవీచికలు:
ఆదూరి వెంకట సీతారామమూర్తి రాసిన నవలలో ‘రాగవీచికలు’ మొదటిది. ఇందులో ‘24’ సన్నివేశాలున్నాయి.
3.1.1 ఇతివృత్తం:
వర్ధని, ధనం మంచి స్నేహితురాళ్ళు. చదువు కోసం వర్ధని వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళిపోతుందన్న వార్త ‘ధనం’ విని తట్టుకోలేక పోతుంది.. కన్నీటితోనే బాగా చదువుకోమని తనను మర్చిపోవద్దని చెప్తుంది. స్నేహితురాలని కలిసి ఇంటికి వచ్చిన వర్ధని ముఖం చూసిన తల్లి మాణిక్యమ్మ కూతురు మనసులోని భావాన్ని అర్థం చేసుకుంటుంది.
మాణిక్యమ్మ, రంగారావుల కుమార్తె ‘వర్ధని’. వర్ధనికి ప్రసాద్ అనే అన్నయ్య, వాసు, కృష్ణ అనే తమ్ముళ్ళు ఉన్నారు. వ్యసనాలకు బానిసై సంసార సాగరాన్ని ఈదలేక బాధ్యతలకు భయపడి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు రంగారావు. అప్పటినుండి కుటుంబ పోషణ బాధ్యతలు తల్లి మాణిక్యమ్మ చేపట్టింది. మాణిక్యమ్మకు తన తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, మాధవరావులు కొంత సహాయం చేసేవారు. పెద్దకొడుకు ప్రసాద్ డిగ్రీ వరకు చదివి పట్నంలో చిన్న ఉద్యోగంలో చేరతాడు. వర్ధనిని కూడా డిగ్రీ చదివించాలనే ఆలోచనతో పట్నానికి పంపాలనుకుంటుంది మాణిక్యమ్మ.
తల్లిని, తమ్ముళ్లను, స్నేహితురాళ్ళను వదిలి పట్నానికి వెళ్లడానికి సందేహిస్తుంది వర్దని. కానీ వెళ్ళక తప్పదని, అన్నయ్యలా నువ్వు కూడా చదువుకోవాలని తల్లి చెప్పడం వలన పట్నానికి బయలుదేరుతుంది వాళ్ళ అమ్మమ్మ తాతయ్యతో కలిసి. వర్ధని మేనమామ అయిన రాజశేఖరం వర్ధని పట్ల బాధ్యత వహించి పల్లెటూరు నుంచి పట్నానికి రప్పిస్తారు. వర్ధనిని పిలిచి నీవు బాగా చదువుకోవాలని, ఇంటిని ఇల్లాలిని విడిచి బాధ్యతరాహిత్యంగా తిరిగే మీ నాన్న గురించి చెప్పేది ఏమీ లేదని, మీపైనే ఆశ పెట్టుకున్న మీ అమ్మను సుఖపెట్టే బాధ్యత మీదే అని వర్ధని మావయ్య అయిన రాజశేఖరం అంటారు. వర్ధనిని మంచి కళాశాలలో చేర్పించి బాగా చదువుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను రాజశేఖరం కల్పిస్తారు.
తన భవిష్యత్తుకు పూలబాట వేయాలనుకున్న మావయ్య నిజంగా దేవుడు అనుకుంటుంది వర్ధని. వర్ధని అన్నయ్య ప్రసాద్, రజనీకాంత్ మంచి స్నేహితులు. పక్కపక్క గదుల్లోనే అద్దెకుంటారు. ఆస్తి, అంతస్తులున్నప్పటికీ గర్వం లేని మంచి మనసున్న కవి రజనీకాంత్. సిరిసంపదలు లేనప్పటికీ మంచితనం కలిగి చిన్న ఉద్యోగం చేసుకునే ప్రసాద్ అంటే రజనీకాంత్ కి గౌరవం. అందుకే ఇద్దరూ మంచి మిత్రులవుతారు.
వర్ధనిని ట్యుటోరియల్ కాలేజీలో చేర్పిస్తారు. రాజశేఖరం వర్ధని కష్టపడి చదువుకుంటుంది. పరీక్షలు ప్రారంభానికి ముందు రోజు వర్ధనికి జ్వరం వచ్చి ఆరోగ్యం క్షీణిస్తుంది. అయినప్పటికీ అత్త, మామయ్యల ప్రోత్సాహంతో పరీక్షలు బాగా రాస్తుంది. చదువులో తనకు వచ్చే సందేహాలను తన చిన్న మావయ్య అయిన ఆనందరావు నివృత్తి చేస్తుంటాడు. ఏదేమైనా వర్ధని పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతుంది. తను పాస్ అయిందని విన్న వర్ధనికి పట్టరాని సంతోషం కలుగుతుంది. అత్తయ్య, మావయ్యలు, అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతారు. ఇంత సంతోష సమయంలో తన తల్లి మరణించిందన్న దుర్వార్తను విన్నవర్ధని, తనకు మంచి భవిష్యత్తు ఉండాలని తపించిన తల్లి తన భవిష్యత్తును చూడకుండా మరణించినందుకు ఎంతో దుఃఖిస్తుంది. తిరిగి మామూలు మనిషి కావడానికి చాలా సమయం పడుతుంది. వర్ధని బాధలోంచి తేరుకొని తన తమ్ముళ్ల బాధ్యతను కూడా చేపడుతుంది. రాజశేఖరం వర్ధనిని పై చదువులు చదివించేందుకు ఏర్పాట్లు చేసి తన కాళ్ళ మీద నిలబడేంత వరకు పట్టు వదలక షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగం వేయిస్తాడు. ఇక్కడ తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ తన చెల్లి బిడ్డల పట్ల మావయ్యగా రాజశేఖరం బాధ్యత వహిస్తారు. అంతా జీవితంలో స్థిరపడేలా ఎవరి స్థాయి ఉద్యోగాలు వారు చేసుకుంటూ అన్నయ్య ప్రసాదు, తమ్ముళ్ళు కృష్ణ, వాసు వర్ధని అంతా వారి వివాహ బంధాలలో స్థిరపడతారు.
3.1.2 పాత్రల చిత్రణ:
ఆడవారికి చదువెందుకనే పాతతరం వారి ఆలోచనలను- "ఆడపిల్లలకు చదువెందుకురా! ఎవడనో ఒకడిని చూసి ముడిపెట్టి పంపేయ్యక..."1 అని పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలున్న ప్రతి ఇంటిలోనూ పెద్దవాళ్లు, ప్రధానంగా పాతతరం వాళ్లు నేటికీ అనడం ముఖ్యంగా పల్లెటూర్లలో కనిపిస్తుంది. ఈ విషయాన్ని మాధవరావు తన మనవరాలైన వర్దని గురించి తరచు అనే మాటలివి. అందుకు కారణం తన కాలానికి స్రీ చైతన్యం అంతగా లేదనుకోవచ్చు. కనుకనే ఆలోచనలూ, మాటలు తాను జీవించిన, సంచరించిన కాలాన్ని, పరిస్థితులను బట్టి వస్తాయంటారు.
“..... మిగిలిన తతంగాలన్నీ జరపాలని లేదు జరిపినంత మాత్రాన ఎక్కడో ఉన్న అమ్మ ఆత్మకు శాంతి లభిస్తుందని నేననుకోను.
మహాలక్ష్మమ్మ: నలుగురి కోసమైనా మనం చేయక తప్పదురా.
ప్రసాద్: ఒకరి కోసం చేయాల్సినవి కాదమ్మమ్మా యివన్నీ. బ్రతికినన్నాళ్లూ శాంతి లేకుండా బ్రతికింది. చనిపోయాక మాత్రం యింకెక్కడ ఉంటుంది? ఆమె కోరికలేం తీరాయని ఆమె ఆత్మ సంతోషిస్తుంది? ఈ మంత్రాలు, ఈ దానాలు ఆమెకు నిజమైన శాంతిని కలుగజేయవు. సరి కదా మరింత క్షోభను కలుగజేస్తాయి.”2 అంటూ ప్రసాద్ చేత నగ్నసత్యాన్ని తెలియజేస్తారు రచయిత.
3.2 చైతన్య దీపాలు:
3.2.1 ఇతివృత్తం:
ఆదూరి సీతారామమూర్తి నవలల్లో రెండవది చైతన్య దీపాలు. సాయంత్రం ఐదు గంటలు వందల కొద్ది విద్యార్థులతో కాలేజీ ఆవరణమంతా కళకళలాడుతుంది. ఆరోజు ఆ కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా వింత వింత దుస్తుల్లో ఎక్కడబడితే అక్కడ విద్యార్థులున్నారు. అందరిలోకి అక్కడున్న అందరినీ విశేషంగా ఆకర్షిస్తోన్న ఒకే ఒక అమ్మాయి ‘సమీర’. ఆమె ఆ కళాశాల మొట్టమొదటి మహిళా కార్యదర్శి. బి.ఏ. ఆఖరి సంవత్సరం చదువుతుంది. ఆ కళాశాల వార్షికోత్సవానికి వచ్చిన అతిధులలో ఆ జిల్లా కలెక్టర్ అమృతవల్లి కూడా ఉన్నారు. అందరూ మాట్లాడిన తర్వాత సమీర స్టేజి ఎక్కి మైకు అందుకునే ప్రసంగిస్తుండగా వెనక నుండి బాణసంచా కాలుస్తూ అల్లరి మూకలు అల్లరి ప్రారంభించారు. దానికి కారణం స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో సమీరాకు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సురేంద్ర. "సమీరా మైకందుకుని స్టేజ్ ఎక్కి మన కళాశాలకు అతిథులుగా వచ్చిన వారి ముందు విజ్ఞత గల వ్యక్తులుగా వ్యవహరించాలని పశువుల్లా కాదని” అంటుంది. ఆ మాటలకు అల్లరి ఒక్కసారిగా సద్దుమనుగుతుంది. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం జరుగుతుంది. సభ ముగిసాక కలెక్టర్ అమృత వల్లి సమీరను పిలిచి నీ వంటి ధైర్యవంతురాలు ఉండాలని, అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తుంది.
కాలేజీ ఫంక్షన్ అనంతరం ఇంటికి బయలుదేరేసరికి చాలా రాత్రి అవుతుంది. సమీరాతో పాటు తన ముగ్గురు స్నేహితురాళ్ళు మొత్తం నలుగురు కలిసి ఆటో ఎక్కుతారు. సమీర ప్రత్యర్థి అయిన సురేంద్ర వీరిని తప్పుదోవ పట్టించాలని, (భయపెట్టాలని ఉద్దేశంతో) ఆటోడ్రైవర్ కి చెప్పి వేరే మార్గంలోకి మళ్ళిస్తాడు. సమీర తన స్నేహితులు కం పడిపోయి ఇటు ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అని గట్టిగా అరిచినా పట్టించుకోకుండా ఆటో నడుపుతుంటాడు. చివరికి సమీర తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఫోల్డింగ్ గొడుగు తీసి దాని స్టీల్ రాడ్ పెద్దదిగా చేసి ఒక్క దెబ్బ డ్రైవర్ తల మీద వేస్తుంది. ఆ దెబ్బకి ఆటో ఆగుతుంది. ఆటో దిగి నలుగురు పెద్దపెద్ద కేకలతో అటు వచ్చే లారీని ఆపడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ అదే ఆటో స్పీడ్ గా మీదికి వచ్చి నలుగురులో ఒకరైన 'వాసంతి'ని అపహరించుకుపోతారు. చివరికి వేశ్యా గృహానికి తరలించేస్తారు. ఆ రాత్రి సమయంలో రోడ్డు మీద ఒంటరిగా మిగిలిన ఈ ఆడపిల్లలకు 'వీరయ్య' అనే ముసలి తాత అండగా నిలబడి ధైర్యం చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్లడానికి మార్గం చూపుతాడు. సమీర, వాసంతి జాడ కోసం ఎంత ప్రయత్నించినా ఆచూకీ తెలియదు. ఇది జరిగిన కొన్ని రోజులకే మరొక అమ్మాయి హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకుంటుంది. స్త్రీల ప్రాణాలకు, మానాలకు ఎటువంటి రక్షణ లేదని సమీరా న్యాయం కోసం ఉద్యమం చేస్తుంది. కొంతమంది విద్యార్థులు ర్యాలీలు నిర్వహిస్తారు. ఎటువంటి ఫలితం ఉండక పోయేసరికి సమీరా చాలా నిరాశ పడిపోతుంది. వాసంతి వదిన తను కావాలనే అలా చేసిందని, స్త్రీలు ప్రతిఘటిస్తే కానిది ఏముందని, సాటి స్త్రీ అని కూడా ఆలోచించకుండా నిందలు వేస్తుంది. సమీర తన చివరి పరీక్ష రాసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తుంది. సాటి స్త్రీగా మహిళా అభ్యుదయం కోసం ఉడతాభక్తిగా కృషి చేయాలనుకుంటుంది. సమీరా తను అనుకున్నట్టుగా ‘స్త్రీ సమాఖ్య’ను ప్రారంభించి ఎంతోమంది అభాగ్యులైన స్త్రీలకు బాసటగా నిలుస్తుంది. చదువుకున్న మహిళలు తమ స్వశక్తి మీద బ్రతికేలా, జిల్లా కలెక్టర్ సహాయంతో “స్త్రీల ఉపాధి కల్పనా కేంద్రాలు” ఏర్పాటు చేయిస్తుంది. స్త్రీ చైతన్య సమాఖ్యలు ఎంతో ముఖ్యమనేది ఈ నవలలో చెప్పడమయినది. ఎవరో ఉద్దరిస్తారని చూడకుండా ప్రతి స్త్రీ స్వశక్తి మీద నిలవాలనేది రచయిత ఆకాంక్ష.
3.2.2 పాత్ర చిత్రణ:
‘సమీర’: ధైర్యం కల స్త్రీ మూర్తి సమస్యలకు భయపడక, ఆటోలో తమపై జరిగిన దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న ధీరురాలు. వాసంతి అపహరించబడిందని తెలుసుకొని ఎంతో తెలివిగా, చాకచక్యంతో వ్యవహరించిన ధీరవనిత సమీర.
3.2.3 సంభాషణ వైచిత్రి:
"స్త్రీకి మానం కంటే ప్రాణం అధికం కాదన్నమాట ఎంత స్వార్థం? శీలం పోగొట్టుకున్న మగవాడు మహారాజుల బ్రతకొచ్చు, ఊహించని పరిణామానికి శీలం పోగొట్టుకున్న స్త్రీ సంఘానికి పనికిరాని వస్తువైంది. తినివిసిరేసే ఎంగిలాకు..."3 అంటూ స్త్రీలలో పిరికితనాన్ని నూరిపోసే ఆత్మహత్య చేసుకోవడానికి తోడ్పడ్డారంటూ స్త్రీపురుషుల మధ్య బేధాన్ని ఖండిస్తారు.
“స్త్రీల కోసం స్త్రీలే నడిపే పత్రిక ఉండటం ఎంతైనా అవసరం. అలంకరణకు సంబంధించిన విషయాలే కాకుండా స్త్రీ హక్కులనూ, బాధ్యతలనూ తెలుపుతూ ఆమెలో చైతన్యాన్ని తీసుకురాగల సమర్థమైన పత్రిక”4 అంటూ స్త్రీ అభ్యుదయానికి పాటుపడే పత్రికల అవసరాన్ని ఇక్కడ చెప్పడమైనది.
3.3 ఈశ్వర అల్లా తేరే నామ్:
3.3.1 ఇతివృత్తం:
1985 ‘మే’ నెలలో ‘యువ’ మాసపత్రికలో పూర్తి నవలగా ప్రచురించబడింది. తన కళ్ళముందే రాక్షసత్వానికి బలైన భార్యను స్వీకరించలేని బలహీనతతో కృంగి తన బిడ్డ కాదనుకున్న సమత నుండే మమతానురాగాన్ని పొందిన కాశ్యప్ కారుణ్య గాధ ఇందలి ఇతివృత్తం. తరతరాలుగా స్త్రీ జాతికి అన్యాయం జరుగుతూనే ఉంది. తండ్రి వల్ల, భర్త వల్ల, బిడ్డల వల్ల కూడా. ఆడపిల్లను ఏదో విధంగా వదిలించుకోవాలనే తాపత్రయంతో ముసలిమొగుడికి కట్టబెట్టే తండ్రులున్నారు. కట్నకానుకలు తేలేదని, అనవసరమైన అనుమానాలతో భార్య ప్రాణాల్ని సహితం తీయగల భర్తలున్నారు. ఆడపిల్లల్ని అంగడిలో కనిపించే బొమ్మలుగానే చూసే స్వార్ధపరులున్నారు. ఆడపిల్ల యిష్టాయిష్టాలను లెక్కచేయకుండా తమ పెద్దరికం సాకుగా చూపి పిల్లల జీవితాలతో చెలగాటమాడే పెద్దవాళ్ళ కర్కశత్వానికి బలైన స్త్రీలు ఎంతోమంది ఆత్మార్పణ చేసుకోవడం చూస్తున్నాం.
ప్రేమించి వర్ణాంతర వివాహం చేసుకున్న జంట అది. తమ జీవితాలలో ప్రేమను వెన్నెలనూ పండించుకొని, మూఢాచారాల మసక చీకట్లో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి ఆదర్శప్రాయులు కావాలనుకున్నారు. కానీ ఒకానొక దుర్ఘటనతో వేరవుతారు.
కాశ్యప్, అరుంధతి భార్యాభర్తలు. ఇద్దరివి వేరువేరు కులాలు. ప్రేమ అనే రెండక్షరాల మహత్తర శక్తి వారిద్దరినీ ఒకటి చేస్తుంది. ఎన్నో సమస్యలు చిక్కులని ఛేదించి ద్విజవంశంలో పుట్టిన అరుంధతి అబ్రాహ్మణుడైన కాశ్యప్ ను వివాహం చేసుకుంటుంది. వారి ప్రేమకు గుర్తుగా పుట్టిన బిడ్డ గౌతమ్. కాశ్యప్, అరుంధతీల పెళ్లిరోజు ఆరోజు, సంతోషంగా బయటికి వెళ్లి, భోజనం ముగించుకొని తిరిగి వచ్చి నిద్రకు ఉపక్రమిస్తారు ఆ రాత్రి. ప్రతిరోజు తప్పనిసరిగా వేసే పెరటి వైపు ఉన్న తలుపులను ఆరోజు హడావుడిలో వేయకపోవడంతో ఆ రాత్రి దొంగ జొరపడ్డాడు వాళ్ళింట్లో. వాడు బంగారం డబ్బుతో సహా కాశ్యప్ భార్య అరుంధతి యొక్క మానాన్ని కూడా దోచుకెళ్తాడు. అప్పటికే బంధీగా మారిన కాశ్యప్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు. అరుంధతి ఎంతగానో దుఃఖిస్తుంది. తాను చేయని నేరానికి బలైపోతుంది. అరుంధతి తప్పేమీ లేదని తెలిసినా కాశ్యప్ మాత్రం అరుంధతిని తిరిగి తన జీవితంలోకి ఆహ్వానించలేకపోతాడు. “ఎన్ని అవాంతరాలు వచ్చినా ఒకరిని విడిచి మరొకరు ఉండేది లేదని ప్రమాణం చేసుకుంటారు” కానీ ఒకానొక మానవబలహీనతకు లోనైనా కాశ్యప్ తను ఇచ్చిన మాటను మీరుతాడు. అరుంధతి తన శరీరానికి జరిగిన గాయం కంటే, మానసికంగా అయినా గాయం చాలా పెద్దదిగా భావిస్తుంది. గౌతమ్ తర్వాత పుట్టిన బిడ్డ ‘సమత’ తన బిడ్డగా స్వీకరించలేక పోతాడు కాశ్యప్.
3.3.2 పాత్రల సంభాషణ వైచిత్రి:
హిందూ స్త్రీకి ఎన్నో కట్టుబాట్లు - ఎన్నో ఆంక్షలు ఎన్నో నియమాలు అంటూ… “సంఘ కట్టుబాట్లను తప్పడం కంటే జీవితం నుంచే తప్పుకోవడం మేలని శాసించే సంఘ తీర్పు, ప్రాణం కంటే విలువైనది. దైవం కంటే విలువైనవాడు, సేవించదగ్గవాడూ భర్త. శీలం పోయిన, భర్త పోయినా స్త్రీకి జీవితం లేదు, ఉండకూడదు....”5 అని సమాజంలో పేరుకుపోయిన విశ్వాసాలను నాయకుడు ఆలోచనలతో మే ళ వించి చెప్తాడు రచయిత.
ఒంటరితనాన్ని గురించి-
“ఒంటరితనం ఘోరమైన శాపం… చిన్నతనంలో తల్లీదండ్రి; యౌవనంలో జీవిత భాగస్వామి, వార్ధక్యంలో పిల్లలూ కలిసి జీవితంలో ఒంటరితనం అనే బాధను రాకుండా చేయాలి”6 అంటూ మన సంస్కృతిలోని ఉన్నతమైన ఆచారాలలో ఒకటైన కుటుంబ వ్యవస్థలోని నిండుతనాన్ని తెలియజేస్తారు. కనుకనే మానవుడు సంఘ జీవన్నమాట ఉదయించింది.
మనసుకి అద్దానికి దృష్టాంతం చెప్తూ-
"..... శరీరానికి పట్టిన పంకిలం, అద్దానికి పట్టిన మసి లాంటిది. కానీ మనసుకి పట్టిన వ్యాధి మాత్రం అద్దంలోని బీట లాంటిది. అది తుడిచేస్తే శుభ్రం కాదు. దానిపై ప్రసరించే ఎటువంటి కిరణమైన వక్రించక మానదేమో..”7 అంటూ శరీరానికి పట్టిన బురదగాని, అద్దానికి పట్టిన మసిగాని తుడిచేస్తే పోతుంది కానీ మనసుకు పట్టిన వ్యాధి అంత తేలికగా పోదని కాశ్యప్ మనసులో ఏర్పడిన అనుమానాన్ని సుందరంగా వర్ణించడమైంది.
3.4 తీపి గురుతు:
3.4.1 నవలానేపథ్యం:
వ్యవసాయమే ప్రధానంగా కలిగిన మన భారతదేశంలో రైతుల పరిస్థితి అత్యంత దీన స్థితి. అందుకు కారణం అనేక సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. నిజాయితీగా రైతులకు అండగా నిలిచే సంస్థగాని, ప్రభుత్వంగాని లేకపోవడం వల్ల రైతులు పండించే ఉత్పత్తులకు తగిన ధర లేకపోవడంతో కనీసం పెట్టుబడి కూడా లభించక, అనేక మంది రైతులు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రైతులు నాటిన విత్తనాలు సరిగ్గా మొలవకపోవడం మొలిచినా సరైన దిగుబడి రాకపోవడం, అందుకు కారణం కొనే విత్తనాల దగ్గర నుండి ఎరువులూ, పురుగుల మందుల వరకు అన్ని నాసిరకాలే ఎక్కువవడం వల్ల రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. ముఖ్యంగా చెరుకు రైతుల దీనస్థితి ఇంకా అద్వాన్నంగా తయారైంది. చెరుకు పండించి దేశానికి తీపినందిస్తున్న రైతులకు మాత్రం మిగిలేది చేదు అనుభవాలే. అందుకు కారణం గుంటనక్కల్లాంటి దళారులు తాము పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాక రాబందుల్లాంటి వ్యాపారుల మోసాలకు బలయ్యే కోడిపిల్లల్లాంటి సన్నకారు, చిన్నకారు చెరుకు రైతుల దుస్థితిని తెలియజేసే ఉద్దేశ్యంతో రాయబడినదే ‘తీపి గురుతు’ నవల.
3.4.2 పాత్రల సంభాషణ:
అనాదిగా రైతులు పండించిన పంటకు ధర నిర్ణయించేది వ్యాపారస్తులు, దళారీలు. ఆరుగాలం కష్టించి పంటను పండించిన రైతు మాత్రం నిమిత్తమాత్రుడుగానే ఉండిపోతున్నాడు. అదే విషయాన్ని వివరిస్తూ-"...... పంట బాగా చేతికందిన్నాడు కూడా రైతు అప్పునుండి బయటపడగలడేమో గానీ మళ్ళీ పెట్టుబడికి అప్పు చేసే పరిస్థితి నుండి మాత్రం తప్పించుకోలేడు..”8 అని చెప్పడం ద్వారా రైతు ఎంత పంటను పండించిన అప్పు చేయడం మాత్రం తప్పదన్న విషయాన్ని చెప్పడమైంది. రైతుల పండించిన పంట మీద లాభాన్ని పొందేది మాత్రం దళారీలు, వ్యాపారస్తులే.
"........ యీ కులాల తారతమ్యాలు, యీ ఆర్థిక అసమానతలూ పంటకు సోకే తెగుళ్లలా జాతి మనగడకే ముప్పుతెస్తాయి. అవి విత్తులోనే కడతేర్చకపోతే ఎప్పటికైనా నష్టమే"9 అంటూ సంగమయ్య పాత్ర ద్వారా పలికిస్తాడు రచయిత. మనుషుల్లో కులాల తారతమ్యం నశించనంత కాలం, ఆర్థిక అసమానతలు తొలగినంత కాలం, సామాజిక న్యాయం జరగదనేది జగమెరిగిన సత్యం. చీడపట్టిన చేను ఏ విధంగా పాడైపోతుందో, అదేవిధంగా ఆర్థిక అసమానతలూ, ప్రాంతీయ బేధాలు, కుల దురాహంకారం, అంటరానితనం, ఆధిపత్య పోరు మొదలైన కుటిల ఆలోచనలు మనుషుల్లో తొలగనంత కాలం సామాజిక అభివృద్ధి సాధ్యం కాదు.
4. ముగింపు:
సమాజంలోని మధ్యతరగతి కుటుంబాలలో చోటుచేసుకునే ఆర్థిక అసమానతలు, కుటుంబ బాధ్యతలు నడుమ కొట్టుమిట్టాడుతున్న చిరుద్యోగులు, బతుకు పోరాటానికి వారు పడే తాపత్రయాన్ని వివరించడమైంది. అంతేకాక మధ్య తరగతి మనుష్యుల మనస్తత్వాలను, వారి ఆలోచనా విధానాలను సైతం రాగవీచికలు నవలలో విశదపరిచారు.
ప్రతిరోజు ఏదో ఒక మూల స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు వార్తాపత్రికలు ద్వారా చదువుతూనే ఉన్నాం. కొన్ని సంఘటనలు మన కళ్ళముందు జరిగినా మనకెందుకులే, మనవాళ్లు కాదుగా అనుకుంటూ ముఖం చాటేసుకు వెళ్లిపోయే స్వార్ధపరులను గురించి, పైకి సమాజోద్ధరణ కోసం పాటుపడుతున్నామని తమ ప్రసంగాలలో గొప్పలు చెప్పుకుంటూ కనిపించే కుహనా మేధావులను, సమాజం కోసం తమ జీవితాలను అర్పించిన త్యాగమూర్తుల జీవితాలను కూడా నేపథ్యంగా తీసుకుని రాయడమైనది.
తరతరాలుగా స్త్రీ జాతికి అన్యాయం జరుగుతూనే ఉంది. తండ్రి వల్ల, భర్త వల్ల, బిడ్డల వల్ల కూడా. ఆడపిల్లను ఏదోలా వదిలించుకోవాలన్న తాపత్రయంతో ముసలిమొగుడికి కట్టబెట్టే తండ్రులున్నారు. కట్న కానుకలు తేలేదని, అనవసర అనుమానాలతో భార్యాప్రాణాల్ని సహితం తీయగల భర్తలు ఉన్నారు. ఆడపిల్లల్ని అంగడిలో కనిపించే బొమ్మలు గానే చూసే స్వార్ధపరులున్నారు. ఆడపిల్ల ఇష్టాయిష్టాలను లెక్కచేయకుండా తమ పేదరికాన్ని సాకుగా చూపి పిల్లలు జీవితాలతో చెలగాటమాడే పెద్దవాళ్లు కర్కశత్వానికి బలైన స్త్రీలు ఎంతోమంది ఆత్మార్పణ చేసుకోవడం చూస్తున్నాం.
వ్యవసాయమే ప్రధానంగా కలిగిన దేశంగా పిలవబడే మన భారతదేశంలో రైతుల పరిస్థితి అత్యంత దీనస్థితి. అందుకు కారణం అనేక సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. నిజాయితీగా రైతులకు అండగా నిలిచే సంస్థగానీ, ప్రభుత్వం గానీ లేకపోవడం వల్ల రైతుల పండించే ఉత్పత్తులకు తగిన ధర లేకపోవడంతో కనీసం పెట్టుబడి కూడా లభించక, అనేక మంది రైతులు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలకు దారితీస్తుండటం వలన ప్రభుత్వం అండగా నిలబడాలి.
5. పాదసూచికలు:
- రాగవీచికలు, పుట. 221
- పైదే, పేరు, పుట. 224
- చైతన్యదీపాలు, పుట. 239
- పైదే, పుట. 244
- ఈశ్వర్ అల్లా తేరేనామ్, పుట. 249
- పైదే, పుట. 252
- పైదే, పుట. 252
- తీపి గురుతు, పుట. 258
- పైదే, పుట. 268
6. ఉపయుక్తగ్రంథసూచి:
- ఆనందరామం, సి. తెలుగు నవలల్లో కుటుంబజీవనం. నవజ్యోతి పబ్లికేషన్స్, విజయవాడ, 1984.
- పైదే. ఈశ్వర్ అల్లా తేరేనామ్. యువ పత్రిక- సీరియల్. మహాలక్ష్మి బుక్ ఎంటర్ ప్రైజెస్ విజయవాడ.
- పైదే. తీపిగురుతు. స్పందన ప్రింటర్స్, మచిలీపట్నం, ఆంధ్ర సచిత్ర వారపత్రిక - సీరియల్ నవల, 1992.
- పైదే. రాగవీచికలు. నవయుగ బుక్ సెంటర్, విజయవాడ, ఆంధ్ర పత్రిక వీక్లీ సీరియల్, july-1976.
- మన నవలా పరిశీలన - వ్యాససంకలనం, చైతన్య సాహిత్, వరంగల్, 1979.
- వెంకట సీతారామ మూర్తి, ఆదూరి. చైతన్యదీపాలు. ఆంధ్ర పత్రిక- సీరియల్. శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజెస్, విజయవాడ, 1998.
- వేంకటేశ్వర్లు, పుల్లాభొట్ల. తెలుగు నవలా సాహిత్య వికాసం. వై.యస్. ప్రెస్, ఖమ్మం, 1984.
- శ్రీరామమూర్తి, కోడూరి. తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ. కిరణి కిషోర్ పబ్లికేషన్స్, బొబ్బిలి, 1979.
- సంజీవమ్మ, పి. తెలుగు నవల సామాజిక చైతన్యం. అభ్యుదయ రచయితల సంఘం, కడప, 1985.
- సాంబశివరావు, కందిమళ్ళ. తెలుగు నాటక రంగం నూతన ధోరణులు - ప్రయోగాలు. కాకతీయ ప్రచురణ, చిలకలూరి పేట, 1995.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.