AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
13. చెంచుల వాద్యాల తయారీ: గేయసాహిత్యం
డా. కప్పెర కృష్ణగోపాల్
తెలుగు అధ్యాపకుడు,
శ్రీ ఉమామహేశ్వరీ డిగ్రీ కళాశాల, కొండ నాగుల గ్రామం.
బాల్మూ ర్ మండలం, నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ.
సెల్: +91 9490899811, Email: kapperakrishnagopal@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
చెంచుల వాద్యాల తయారీ, గేయ సాహిత్యం. నల్లమల్ల ప్రాంతం లోని గిరిజన జాతి తెగలో ఒకటైన చెంచుల గురించి వారు తయారు చేసిన వాద్యాలు, గేయ సాహిత్యం గురించి ఈ సమాజానికి తెలియాలనే ప్రయత్నమే ఈ వ్యాస ముఖ్య ఉద్దేశం. ఈ వ్యాసం పూర్తిగా చెంచుల ద్వారా సేకరించిన మౌఖిక సాహిత్యం. చెంచుల వాద్యాల తయారీ, గేయ సాహిత్యం విధానమును చెంచుల యొక్క భాషను గేయ సాహిత్యంలో ఎలా వాడుతారు, వారు పాట పాడే విధానము, ముఖ్యంగా జానపద గేయాల కూర్పు, అల్లిక వీరికి వెన్నతో పెట్టిన విద్య. చెంచులు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న కొమ్మలు, వీళ్లలో కొందరు మాత్రమే అక్షరస్యులు. చాలామంది నిరక్షరాస్యులు. నిరక్షరాస్యులు ఉన్నప్పటికీ పుట్టుకతో జానపద గేయాలలో మరియు వారి యొక్క వాద్యాల తయారీలో నిష్ణాతులు. వీరు ఒకరకంగా చెప్పాలంటే చదువు రాని జ్ఞానవంతులు. చీకటిలో చిరుదివ్యలు. చెంచుల వాద్యాల తయారీ విధానము, గేయ సాహిత్యమును, వారిలో ఉండే నైపుణ్యమును, ప్రతిభను, ఈ సమాజమునకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తున్నాను.
Keywords: చెంచుల వాద్యాల తయారీ, గేయ సాహిత్యం
1. ఉపోద్ఘాతం:
చెంచులు ఆదిమ జాతికి చెందిన వారు, ఆదివాసులు,అడవిలో మగ్గిన ఈ అడవి మల్లెలు, ఆహార అన్వేషణ లో అలుపెరుగని బాటసారులు, చీకటిలో మగ్గిన చిరుదివ్వెలు _ ఆదిమ తెగ చెంచులు. ఈ సృష్టిలో చరాచర జీవితోపాటుగా మానవ రూపేణ మొదటిగా ఉద్భవించిన తెగగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదిమ తెగలలో చెంచుల తెగ మొదటిదిగా చెప్పబడుతుంది. ఈ తెగవారు తమను తాము జంతువుల బారి నుండి రక్షించుకోవడానికి, మరియు వినోదం పొందడానికి వాద్యములను తయారు చేసుకున్నారు అని వారి తెగకు చెందిన అప్పపూరం, తోకల చిన్న గురువయ్య 62 సం. చెంచు చెప్పడం జరిగింది. మొదట వాద్యాలను మేము తయారు చేశాము అని పలికాడు.
2. వాద్యం :
వాద్యం అనగా వాయించడం, వాగనం, శబ్దం అనే అర్థాలు వస్తాయి. చెంచుల వాద్యాలు వినోదానికి ఉపకరణాలు. వాద్యాలను, చెంచులు వినోద పరికరాలు అంటారు. ఆట, పాట, వస్తువులు అని కూడా అంటారు. వీరు వాద్యాలను వారి సంస్కృతీ సంప్రదాయాలకు, పాటలకు తగ్గట్టుగా తయారుచేసుకుంటారు. చెంచులు వినోద వాద్యాలలో రేడియో, టేప్‌రికార్డ్‌ర్లు వినియోగించే సాధనాలని చెప్పవచ్చును. ఇవే కాక, తప్పెట, డప్పు, మద్దెల, తబల, గజ్జెలు, నాగబుర్ర, ఢమరుకం మొదలైనవి.
3. చెంచుల వినోదం – పరికరాలు :
చెంచుల వినోదాలలో ముఖ్యమైనది శ్రవణానందాన్ని కలుగచేసేది. వారిని మార్గదర్శకులుగా ముందుకు నడిపేది. విశేషణకారి, విషయచూచి, విజ్ఞాననిధి, చెంచుల అభివృద్ధికారి రేడియో అని చెప్పవచ్చును. చెంచులు ఆర్థికంగా స్థోమతలేనివారు కాబట్టి వారి వినోదకారిగా (1) రేడియో (2) టేప్ రికార్డర్. ఇప్పుడు ప్రస్తుతకాలంలో తక్కువ రేటుకు వచ్చే సెల్‌ఫోన్‌లు వీరి వినోదపరికరాలుగా వాడుతున్నారు.
3.1 రేడియో :
చెంచులు అడవిలో దొరికే వనరులను సమీప గ్రామంలోని జి.సి.సి. వారికి విక్రయించి, డబ్బులు తీసుకొని సమీప మండలానికి వెళ్ళి రేడియోను కొంటారు. ఈ రేడియోను రూ.300/` నుండి రూ.400/` (మూడు వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయల) లోపు కొంటారు. ఈ రేడియో మంచి నాణ్యమైనది, కంపెనీ ఏది అనేది వారు గ్రహించరు. ఏదైతేనేం మాకు రోజు, వార్తలు పాటలు వచ్చేటట్లు ఉంటే చాలు అనుకుంటారు. రేడియోలను, సెల్లులకు మరియు కరెంట్‌కు వచ్చే విధంగా కొంటారు. ఈ విధానాన్ని టు ఇన్‌వన్ అంటారు. ఇది ఎలాగంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతను గుర్తుచేస్తుంది. అడవిలో విద్యుత్ సౌకర్యము లేనందువలన రేడియోలు ఎక్కువశాతంగా సెల్స్ వేస్తే నడిచే (ప్రారంభమయ్యే) రేడియోలను కొంటారు. ఈ రేడియోను వీరు ఉదయం (6) ఆరుగంటల నుండి (8) ఎనిమిది గంటల వరకు రేడియోలో ఏ సమాచారం వచ్చినా వింటారు. తరువాత వారి వారి పనులలో లీనమై సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చిన తరువాత రేడియో పెడతారు. మరికొందరు చెంచులు ఉదయం నుండి సాయంత్రము వరకు రేడియో వింటారు. వీరు పనులకు వెళ్ళినా కాని రేడియోను వెంట తీసుకొని వెళ్తారు. ఈ విధంగా చెంచులకు ప్రధాన వినోదకారిగా రేడియో ఉపయోగపడుతుంది. వీరు ఎక్కువగా చలన చిత్రానికి సంబంధించిన పాటలను, జానపదగేయాలను వింటారు. అప్పుడప్పుడు వార్తలను, వ్యవసాయ విదానాలను వింటారు. ఇప్పుడు ప్రస్తుత కాలములో పోడు వ్యవసాయం మానుకొని అధునాతనంగా ఆధునిక పరికరాలతో వ్యవసాయం చేస్తున్నారు. ఈ రేడియో చలవ వలన.
3.2 టేప్‌రికార్డర్ :
చెంచులకు రెండోవ వినోద సాధనము టేప్‌రికార్డర్. చెంచులు టేప్‌రికార్డర్‌లో సినిమా పాటల క్యాసెట్‌లు వేసుకొని వింటారు. చెంచుల చేతిలో డబ్బు ఉంటే చాలు వినోదానికి ఖర్చు చేస్తారు. అది మొదటి ప్రాధాన్యత మద్యపానానికి, రెండోది టేప్‌రికార్డర్ అని చెప్పవచ్చు. ఈ సినిపాటలలో విప్లవ పాటలైన సిని రచయిత, నటుడు ఆర్.నారాయణ మూర్తి పాటలకు ప్రాధాన్యతనిస్తారు. పాటల క్యాసెట్‌ను వేసుకొని మద్యం సేవించి నృత్యం చేస్తారు. ఈ టేప్‌రికార్డర్ రెండు విధాల ఉపయోగపడుతుంది. బ్యాటరీ సెల్స్ వేసిన ప్రారంభం అవుతుంది, విద్యుత్ కనెక్షన్ వలన కూడా టేప్‌రికార్డర్ వస్తుంది. కాని చెంచులు విద్యుత్ సౌకర్యం లేనందు వలన (3) మూడు బ్యాటరీల టేప్‌రికార్డర్ కాని (5) బ్యాటరీ సెల్స్ రికార్డర్‌ను కాని కొంటారు. వీరు ఈ టేప్‌రికార్డర్‌ను (300) మూడు వందల నుండి (800) ఎనిమిది వందల రూపాయలలోపు కొంటారు. వీరు ఎక్కడికి వెళ్ళినా టేప్‌రికార్డర్‌ను తీసుకొని వెళతారు. అది చెడిపోయేంతవరకు వారి వెంటే ఉంచుకొంటారు. చెంచులు చేతిలో డబ్బు ఉంటే చాలు సమీప గ్రామం వెళ్ళి మద్యం సేవించి ఇంటికి వచ్చి టేప్‌రికార్డర్ మొరాయించినా, నేలకేసో లేక బండకేసో కొట్టి బ్రద్దలు చేస్తారు. ఈ ప్రస్తుతకాలంలో టేప్‌రికార్డర్‌లకు ప్రాధాన్యత కరువైంది. అధునాతనంగా సిడి ప్లేయర్‌లు, వి.సి.డిలు వచ్చాయి. టెక్నికల్‌పరంగా వారికి వీటిమీద అవగాహన లేక వాడటం లేదు ఇది విద్యుత్‌తో నడవడం మూలాన అడవిలో విద్యుత్ సౌకర్యంలేని కారణంగా చెంచులు దీనిని ఇష్టపడటం లేదు. గ్రామాలలోని చెంచులు వీటిని ఉపయోగిస్తున్నారు. ఇదియేకాక టెలివిజన్‌లు (టి.విలు), మరియు సెల్‌ఫోన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో చెంచులకు ప్రభుత్వంవారు వివిధ సంస్థల వారు వినోదం కొరకు టెలివిజన్‌లను (టి.వి) మరియు వి.సి.డి, డి.వి.డిలను ఇస్తున్నారు. చెంచుల ఆరోగ్యరీత్యా ఏదైన ప్రమాదం జరిగినా సమాచారం తెలియడానికి, ఆరోగ్యశాఖ వారి ఫోన్‌నెంబర్లు, పోలీస్‌శాఖవారి ఫోన్‌నెంబర్‌లు, అగ్నిమాపకదళంవారి ఫోన్‌నెంబర్లను మరియు ఇతర ప్రభుత్వ అధికారుల ఫోన్‌నెంబర్లతో సహచెంచులకు ఫోన్‌లను ఇస్తున్నారు. ఐ.టి.డి.ఏ సంస్థ వారు వీరికే కాక, చెంచుల పెంటలకుపోయే ఆరోగ్యశాఖ నర్సులకు కూడా ఐ.టి.డి.ఏ. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్‌వారు (సంస్థ) ఫోన్‌లను ప్రదానం చేస్తున్నారు.
గ్రామాలలో ఉన్న చెంచులు, ఉద్యోగాలలో స్థిరపడ్డవారు వారి ఇళ్ళలో టెలివిజన్‌లు, డి.వి.డిలు, వి.సి.డిలు వినోదానికి ఉపయోగిస్తున్నారు. ఇదియేకాక సెల్‌ఫోన్ మెమోరీ కార్డ్‌లలో అనేక విడియో సినిమాలు, పాటలు, జోక్స్‌లు చూస్తున్నారు, వింటున్నారు.
ఈ విధంగా ఉన్నటువంటివారి ఇళ్ళు, వేషభాషలు కూడా మారి ఈ నాగరికతలో కలిసిపోయారు.
3.3 చెంచుల తప్పెట - ఉపయోగం – తయారీ
చెంచులు తప్పెటను వారి నృత్యాలకు ఉపయోగిస్తారు. ఈ తప్పెట దరువులో తన్మయం చెంది నృత్యం చేస్తారు. తప్పెట శబ్దంతో శుభకార్యాలు చేస్తారు.
1) కొత్త గుడిసె కట్టుకొని ఇంట్లోకి ప్రవేశించినప్పుడు
2) పండుగలప్పుడు తప్పెట మ్రోగిస్తారు. మ్రోగిస్తూ పాటలు పాడుతూ, నృత్యం చేస్తారు.
3) చెంచుల పెళ్ళిళ్ళలో కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది తప్పెట. వీరి పెళ్ళి శుభకార్యములో తప్పెటలోనే రకరకాల శబ్దాలతో తప్పెట కళాకారులు చెంచులు కొడుతూ వుంటే, పురుషులు, స్త్రీలు వృత్తాకారంలో తిరుగుతూ నృత్యం చేస్తారు.
4) ముఖ్యంగా అడవి జంతువుల వేషధారణలో చెంచు కళాకారులు నృత్యం చేస్తూ వుంటే తప్పెట దరువు మ్రోగిస్తారు.
5) చెంచుల తప్పెట దరువుకు దేవుండ్లు సహితం నాట్యం చేశారు అంటారు చెంచులు.
6) చెంచుల ఇంటి దేవరలు దేవుళ్ళ పూజలప్పుడు, దేవుణ్ణి ఊరేగించినప్పుడు తప్పెట మ్రోగిస్తారు.
7) చెంచులు మరణ, దహన సంస్కారాలలో కూడా తప్పెట శబ్దం చేస్తారు.
తయారీ :
ఈ తప్పెట తయారును చనిపోయిన ఆవు లేదా బర్రె, లేదా మేక తోలును ఉప్పుతో ముందుగా ఈ తోలును శుభ్రపరచి ఎండలో ఆరపెడతారు. తోలు తడిలేకుండా ఒట్టిగా ఆరిన తరువాత, తుమ్మ చెక్కలతో, లేక చింతచెక్కలతో, దిరిశన చెక్క లేదా దేవదారి చెక్కలను గుండ్రంగా వృత్తాకారంగా ఒకదాని ప్రక్కల ఒకటి అమర్చి గట్టిగా తోళ్ళ తాళ్ళతో లేదా సీలలతో (మొల) గట్టిగా చెక్కకు చెక్కకు లింకు సంబంధం కలుపుతూ గుండ్రంగా తయారుచేస్తారు. ఈ గుండ్రంగా ఉన్న దానిని కుదురు అంటారు. ఈ కుదురుకు ఎండిన తోలును బిగిస్తారు. ఈ విధంగా తప్పెట తయారుచేస్తారు. ఇది ఎక్కువగా వర్షాకాలంలో, చలికాలంలో తప్పెట, తోలు తేమను గ్రహించడం ద్వారా కర్రలతో శబ్దము చేస్తే శబ్దము కాదు కాబట్టి చెంచులు పెద్ద పెద్ద కర్రలను వేసి మంటపెడతారు. ఈ విధానాన్ని నెగడ్ల మంట అంటారు. మంట వేడిలో తప్పెట్లను సెగచూపించి ఎడమచేతిలో తప్పెటను తమ యదకు ఆనించి ఎడమచేతిలో చిన్నని వెదురు పుల్లదబ్బను, కుడిచేతిలో గుండ్రంగా మొనచెక్కిన చేతికి సరిపోయే వెదురు కర్రకాని, చింతకర్ర లేదా తుమ్మ కర్రతో తప్పెటను మ్రోగిస్తారు. తప్పెటకు రెండు వైపుల తోలుతో తయారుచేసిన తాడును కట్టి మెడకు తగిలించుకొని తప్పెటను మ్రోగిస్తారు. ఈ తప్పెట పాటలకు, నృత్యాలకు ఉపయోగిస్తారు.
3.4 చెంచుల డప్పు - ఉపయోగం - తయారీ:
చెంచులు డప్పును వారి పండగలప్పుడు, పెళ్ళిళ్ళ సమయంలో, ఇంటి దేవుళ్ళ పూజల సమయంలో, చెంచుల సాంస్క ృతిక కార్యకలాపాలప్పుడు, చెంచుల నృత్యాలు చేసే సమయమప్పుడు, కొత్త ఇళ్ళలోకి (గృహప్రవేశం) చేసేటప్పుడు, మరణదహన సంస్కారాలప్పుడు, అడవి జంతువులను వారి గుడిసెల సమీపం రాకుండా ఉండటానికి, డప్పు శబ్దం చేస్తూ కేరింతలు పెడతారు. పైన తెలియజేసిన విషయాలకు ఈ డప్పును వినియోగిస్తారు.
ఈ డప్పును చెంచులు తప్పెట మాదిరిగానే ఉపయోగిస్తున్నారు. తప్పెటను జంతువుల తోలుతో తయారుచేస్తే, డప్పును మందమైన ప్లాస్టిక్‌తో, చుట్టూర ఇనుప స్క్రూలను బిగించి డప్పు తయారుచేస్తారు. చెంచులు ఈ డప్పులను తయారుచేయరు. వీటిని జిల్లాస్థాయిలో లేదా పట్టణస్థాయిలో ఉన్న పెళ్ళిళ్ళ బ్యాన్‌కు సంబంధించిన షాపులలో కొంటారు.
3.5 చెంచుల మద్దెల దరువు - ఉపయోగం - తయారీ:
మద్దెలను కూడా చెంచులు గేయాలలో మరియు నృత్యాలకు ఉపయోగిస్తారు. దైవకార్యాలలో దేవుణ్ణి సేవించుటకు ముఖ్యంగా ఈ మద్దెలను ఉపయోగిస్తున్నారు. కులపెద్దలు అందరు దేవుని కార్యము ఉందనగా సమావేశము అయ్యి, సాయంత్రము సంధ్యవేళలలో వారి ఇష్టదైవాలను స్మరిస్తూ, భక్తి శ్రద్ధలతో మద్దెల దరువు మ్రోగిస్తారు. దీనికి తాళం సరిగా (జతగా) పలికిస్తారు. తమ ఇలవేల్పులైన శివయ్య భ్రమరాంబ, గారెల మైసమ్మ, ఈదమ్మ, వీరభద్రునిపై ఎక్కువగా గానాలు ఆలపిస్తారు. ఈ గానానికి తగ్గట్టుగా మద్దెల దరువు మ్రోగిస్తారు. మరణ సంస్కారాలలో కూడా రాత్రివేళ శవం ఉందంటే అక్కడే కులస్తులు, పెద్దలు కూర్చోని, అతనిని (శవం) స్మరిస్తూ, పాటలు పాడుతూ, చెంచులక్ష్మి జీవితగాథను మరియు శివయ్య జీవిత చరిత్రను కథగా చెప్పుడూ మద్దెల దరువు మ్రోగిస్తూ ఉంటే, మిగిలిన కులస్తులు ఆ రాత్రి మొత్తం మేల్కొని కథలను చెప్పే చెంచు దేవరల పలుకులు వింటూ, చనిపోయిన కుటుంబాన్ని ఒదారుస్తూ అచటనే రాత్రి మొత్తం మేల్కొని ఉంటారు. దీని కంతటికి మేల్కొని ఉండటానికి కారణం మద్దెల దరువు, విషాదం, సానుభూతి, కథగమనం అనేది అర్థమవుతుంది. ఈ విధంగా పైన పురస్కరించుకున్న విషయాలలో మద్దెల దరువును ఉపయోగిస్తారు. ఒకప్పుడు చెంచులు పెళ్ళిళ్ళలో కూడా మద్దెలదరువు ఉపయోగించేవారు ప్రస్తుతం ఆ వ్యవస్థ పోయింది తప్పెటలు మరియు రెంటుకు బ్యాన్‌సెట్‌ను మాట్లాడుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.
మద్దెల తయారీ విధానం :
పెద్ద ఏగ చెట్టును గొడ్డలితో నరికి తెచ్చి దానిని మీటరు పరిణామంలో నరికి పైభాగాన్ని అలాగే ఉంచి మధ్యభాగాన్ని యంత్రం సహాయంతో తొలచి వేస్తారు. ఇప్పుడు ఆ కర్ర బోలుగా తయారవుతుంది. దానిని కుండ అంటారు. ఇది మధ్యలో ఖాళీ ప్రదేశము ఉండటం వలన ఇది కొంత నీళ్ళ కుండ మాదిరిగా కనపడటం చేత దీనిని కుండ అనే నామకరణం చేశారని చెంచులు చెబుతారు. ఆవు చనిపోయిన తోలును మరియు మేక చనిపోయిన తోలును ఉప్పుతో శుభ్రపరచి ఎండలో ఆరపెట్టి వాటిని మద్దెల కుండకు సరిపోయే విధముగా వృత్తాకారంలో కత్తిరిస్తారు. వాటికి వృత్తాకారంలో ఉన్న చెక్క బిళ్ళలకు ఆవు వారు ఆవు తోలుతో తయారుచేసిన తాడు మాదిరిగా కత్తిరించి వారును తయారుచేస్తారు. ఈ వారుతో చెక్కబిళ్ళల రెండిరటికి తోళ్ళు బిగిస్తారు. ఎడమవైపు కలిగిన ముఖానికి ఆవుతోలును బిగిస్తారు. కుడివైపున ఉన్న మద్దెల ముఖానికి ఆవుతోలును బిగిస్తారు. కుడివైపున ఉన్న మద్దెల ముఖానికి ఆవుతోలును బిగిస్తారు. ఈ విధంగా బిగించిన మద్దెల రెండు ముఖాలకు వారుతో (వి) ఆకారంలో, ఆవుతోలుకు మరియు మేకతోలుకు సంబంధము వారు (తాడు) ద్వారా కలిపి గట్టిగా రెండు వైపుల బిగిస్తారు. ఈ విధముగా మద్దెలను చెంచులు తయారుచేస్తారు. ఒకవేళ మద్దెలను తయారుచేయలేని పక్షమున చెంచు భక్త బృందమువారు అందరు కలిసి ఎంతో కొంత డబ్బును కూడబెట్టుకొని పట్టణానికి వెళ్ళి మద్దెలను తయారుచేసే షాపు (దుకాణం)లో కొని తెచ్చుకొని వారును (తాడు) సరిచేసుకొని సరిగా మ్రోగుతుందా లేదా అనేది చూసుకుంటారు.
3.6 చెంచుల గజ్జెల వినియోగం:
చెంచులు నృత్యం చేసేటప్పుడు తమ యొక్క కాళ్ళకు పాదాలపైభాగాన గజ్జెలను కట్టుకొని నృత్యం చేస్తారు. ఈ నృత్యం గానానికి తగ్గట్టుగా ఉంటుంది. పాదాల గజ్జెల శబ్దానికి చెంచు కళాకారుడు ఇంకా రెట్టింపు ఉత్సాహముతో నృత్యం చేస్తారు.
3.7 చెంచుల నాగస్వరం (నాగబుర్ర) వినియోగం:
చెంచులు నాగదేవతను (నాగుపాము) పూజిస్తారు. శివయ్య కంఠాభరణం, ప్రత్యక్షంగా మా కంటికి కనిపిస్తుందని నిజమైన దేవత అని వారి ప్రగాఢ నమ్మకం. కాబట్టి వీరు నాగకాయలు అనగా ఆనపకాయ మాదిరిగా ఉండే దాని జాతికి చెందిన కాయను తీసుకవచ్చి దానిని ఎండబెట్టి (కొన) మొన భాగాన్ని కత్తితో కత్తిరించి దానికి సన్నాయి వెదురు పుల్లలను తొడిగి అంచుల వెంట ఎచట గాలిపోకుండా మైనాన్ని అంటించి ఊదుతారు. అది నాదస్వరనాదమై వినసొంపుగా చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
చెంచులు పెళ్ళిళ్ళ సమయంలో పుట్టమన్ను తేవడానికి వెళ్ళినప్పుడు పుట్టను పూజించి అనగా నాగదేవతను పూజించు నాగస్వరాన్ని ఊదుతూ పుట్టమన్ను గడ్డపార (పలుగు)తో తోడి తట్టలలో వేసుకొని వచ్చి చెంచు మహిళలు పందిరి గుంజలకు పుట్టమన్నును అరుగుగా చతురస్రాకారంలో కట్టలు వేస్తారు. ఇది వారి ఆచారంగా చెప్పవచ్చును.
పుట్టమన్ను తేవడానికి వెళ్ళిన ముందుగా పుట్టకు కుంకుమ, పసుపుబొట్టు పెట్టి పుట్టలో ఆవుపాలుపోసి నాదస్వరం పాడి నాగదేవతకు మొక్కి (నమస్కరించి) భక్తితో పూజించి పుట్టమన్నును పెళ్ళికొరకై గడపలుగులో తోడుతారు. ఇది నాగస్వర వినియోగము.
3.8 చెంచుల ఢమరుకం - ఉపయోగం - తయారీ
ఈ ఢమరుకం శివుని కుడిచేతిలోని త్రిశూలానికి అమరి ఉంటుంది. ఇది లింగమయ్య దేవుని (శివుడు) ఢమరుకనాదం అంటారు. ఈ ఢమరుకం, భిక్షాటనకు పోయినప్పుడు ఇంటింటా ఢమరుకాన్ని వాయిస్తూ భిక్ష స్వీకరిస్తున్నాడు. మరియు ప్రళయ రుద్రుడైనప్పుడు ఢమరుకాన్ని శివుడు వాయిస్తాడు. నృత్యము చేసినప్పుడు ఢమరుక శబ్దంలో నాట్యం చేస్తాడు అని చెంచుల ప్రగాఢ విశ్వాసము. ఈ ఢమరుకం శివయ్య పుత్రులం మేము కాబట్టి వంశాచారంగా ఢమరుకాన్ని మేము మ్రోగిస్తున్నాము అని చెంచు పెద్ద అయిన మహబూమ్‌నగర్ జిల్లా అప్పాపూర్ గ్రామము గురవయ్య చెబుతున్నాడు. ఈ అప్పాపూర్ లింగాల మండలంకు చెందినది.
చెంచులు శివుని యొక్క పూజావిధానంలో నైవేద్యము దేవునికి సమర్పించే కంటె ముందుగా ఢమరుకాన్ని మ్రోగిస్తారు. ఈ శబ్దము ఢమరుకనాదం విని శివయ్య సంతోషంతో నాట్యము చేస్తాడు. నైవేద్యము స్వీకరిస్తాడు అని వారి నమ్మకము. ఢమరుకం ఢమ్, ఢమ్ అనే శబ్దం రావడం చేత ఢమరుకం అనే పేరు శివయ్యనే స్వయంగా పెట్టాడు అని చెంచులు చెబుతారు.
చెంచులు ఇష్టదైవాలైన లింగమయ్య (శివుడు), భైరవునికి, గారెల మైసమ్మకు, ఈరమ్మకు, ఈదమ్మ దేవతలకు పూజచేసే సమయములో ఢమరుకాన్ని మ్రోగిస్తూ పూజచేస్తారు. ఈ ఢమరుక శబ్దం విని దేవతలు దేవుళ్ళు వారిని క్షేమంగా అడవిలో గాలి దయ్యాల నుండి, వన్యమృగాల నుండి రక్షిస్తారు అనే మూఢవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చెంచులు ఇళ్ళళ్ళో, పూజచేసి ఢమరుకం మ్రోగిస్తూ ఇంటిలోకి ఎటువంటి దుష్టశక్తులు, వన్యమృగాలు ఇంటిలోకి రావు అని చెంచుల విశ్వాసము, నమ్మకం.
ఢమరుకం తయారీ :
ఈ ఢమరుకాన్ని కూడా మద్దెలను తయారుచేసినట్లుగానే ఉంటుంది. వాయిద్యాలలో అతి చిన్నది ఢమరుకమే. దీనిని పెద్ద ఏగ కర్రతో తయారుచేస్తారు. పెద్దఏగ ముఖం రెండు వైపుల చెక్కి బోలుగా చేస్తారు. రెండువైపుల మేకతోలును వారు (మేకతోలు దారము)తో లాగి బిగిస్తారు. దానికి మధ్యభాగములో వారు (తాడు)కు ఒక గుండ్రని గోలికాయలాంటి ప్లాస్టిక్ గుండిని అమర్చుతారు. ఇప్పుడు ఢమరుకాన్ని అటుఇటు (ఎడమ G కుడికి) తిప్పినట్లయితే ఢమ, ఢమ అనే ఆర్థనాదము వినిపిస్తుంది. దీనిని చెంచులు శివయ్య దేవుని ముందు భక్తిఓ వాయిస్తారు. ఈ వాయిస్తున్న సమయంలో కొందరికి పూనకం కూడా వస్తుంది.
ఢమరుకం రెండు రకాలుగా కనిపిస్తుంది (1) ఒకటి మైనస్ (`) పైపు గొట్టం మాదిరిగా, (2) (I) ఎక్స్ ఆకారంలో కనిపిస్తుంది.
(మౌఖిక సేకరణ - Dr.కప్పెర కృష్ణగోపాల్, (చెంచుల సాహిత్యం సమగ్ర పరిశీలన) – పుట.119 నుండి 126 వరకు సంగ్రహణ – అముద్రితం – నేను వ్రాసిన Ph.D గ్రంథం.)
(మౌఖికంగా తెలియజేసిన వారుః 1) చెంచు తోకల గురవయ్య-46 సం.లు, 2) చెంచు కలమౌని రాములు-50 సం.లు, మన్ననూర్ గ్రా., అమ్రాబాద్ మం., నాగర్ కర్నూల్ జిల్లా, నల్లమల్ల ప్రాంతం).
4. చెంచుల గేయ సాహిత్యం:
1) జానపద గేయం - నా మొగుడు తాగుబోతు
ఏమి చేస్తురా అంకన్న మామ
నా మొగుడు తాగుబోతు
మాపెళ్ళి చేసిన పెద్దలు
మీకు తప్పదు నా వుసురు
కూలీనాలీచేసి నేను
పొదుపు కడుతుంటే
నామొగుడు తాగి వచ్చి
కొడుతూ ఉంటాడు తిడుతూ వుంటాడు ॥ ఏమి చెస్తురా అంకన్న ॥
గిరిజన సంస్థ వారు నాకు గేదెను ఇస్తేను
దాన్ని కూడ తోలుకపోయి అమ్మివచ్చాడు
ఏమిచేస్తరా అంకన్న మామ నా మొగుడు తాగుబోతు
గవర్నమెంటు వారు నాకు భూమిని ఇస్తెను
నా మొగుడు తాగి వచ్చి ఆ భూమిని గిరువ
బెట్టెను, నా కొంపముంచెను ॥ ఏమి చెస్తురా అంకన్న॥
(మౌఖికంగా పాడిన వారుః చెంచు మల్లమ్మ-56 సం.లు, సున్నిపెంట, శ్రీశైలం ప్రాజెక్ట్, కర్నూల్ జిల్లా, 27-3-2013)
సందర్భం :
మొగుడు తాగుబోతు కావడంతో పెళ్ళి చేసిన పెద్దలను చివాట్లు (తిట్టే) పెట్టే సందర్భంతో పాడిన పాట ఇది.
వివరణ :
పెళ్ళి పెద్ద అయిన ఎంకన్నమామ నా మొగుడు తాగుబోతు అని తెలిసి కూడా నాకు, అతనితో పెళ్ళి చేశావు. నేను కూలీనాలీ చేసి పొదుపు కడుతుంటే, నా మొగుగు తాగి వచ్చి, కూలీ డబ్బులు ఇవ్వు అని కొడుతూ, తిడుతూ ఉంటాడు. నేను ఏమిచేయాలి ? ఎంకన్నమామ. నా మొగుడు తాగుబోతు, గిరిజన సంస్థవారు నాకు ఒక గేదెను ఇస్తే దాన్ని కూడా తాగడానికి డబ్బులులేవని తీసుకవెళ్ళి అమ్మి వచ్చాడు. గవర్నమెంటువారు నాకు భూమిని ఇస్తే నా మొగుడు తాగి వచ్చి భూమిని గిరువ పెట్టాడు. నా సంసారం, కొంపముంచాడు. ఏమి చేతురా ఎంకన్నమామ అని తన బాధను వ్యక్తపరిచింది. జానపద ధోరణిలో సాగే గేయం ఇది.
2) సిన్నదానా ! (జానపదం)
సింత సిగురు సిన్నదానా !
సిన్ని ఒయలు ఉన్నదానా !
నీవు సింగారంగా సిగ్గు పడితివే ఓ సిన్నదానా !
సిగరేకులు ఉన్నదానా !
సింగారపు సొగసుదానా !
సిరిసిల్లా సిన్నదానా !
నా మదిని దోసి, నా మదిని దోసి వెళ్ళిపోతివా ! ఓ సిన్న దానా ! ॥సింత సిగురు॥
జానెడు నడుముదానా !
తుమ్మెద తనువుదానా
సంపెంగ ముక్కుదానా
నీ అందమంతా జుర్రుకుంటనే ’’ ఓ సిన్నదానా ! ॥సింత సిగురు॥
నడుముకు ఒడ్డెనము తెస్తి
నాజూకైన గాజులు తెస్తి
అద్దాల రవిక తెస్తి
కాసింతైన దయచూపవే ॥సింత సిగురు॥
ముక్కుకు ముక్కెర తెస్తి
చెవులకు గెంటీలు తెస్తి
మెడకు ముత్యాలహారము తెస్తి
కళ్ళకు కాటుక తెస్తి ‘‘కాసింతైన సందుచూపవే’’
ఓ నల్లగొండ నెరజానా ! ॥సింత సిగురు॥
(మౌఖికంగా పాడిన వారుః చెంచు నరసింహా-46 సం.లు, అహోబిలం, ఆళ్ళగడ్డ, కర్నూల్ జిల్లా, 28-3-2013)
సందర్భం :
బావ తన మరదలు యొక్క అందాన్ని, జానపదబాణీలో పొగిడిన సందర్భంలో పాడిన గేయమిది.
వివరణ :
ఓ చిన్నదానా ! చింతచిగురుకున్న పులుపు, వగరు వలపు, నీలో వున్నాయి. నీవు నన్ను చూసి సిగ్గుపడితివి, పొడవైన జుట్టు ఉన్నదానా ! నీకు సింగారించుకుంటే నా మది పులకరిస్తుంది. ఈ విధంగా నన్ను నా మనస్సును పులకరింపచేసి నాకు కనపడకుండా వెళ్ళిపోతావా ! ఇది నీకు న్యాయమా! జానెడు నడుము ఉన్నదానా ! తుమ్మెద వంటి సన్నని జానెడు తనువు వున్నదానా ! ఆ తనువుకు తగ్గుట్టుగా నీ అందమైన ముఖమునకు సన్నని పొడవైన సంపెంగ ముక్కు కలిగినదానా ! ఇంత అందము గల నీ అందాన్ని జుర్రుకుంటానే ! ఓ సిన్నదానా ! నీ కోసం నీ నడుముకు ఒడ్డెనము, నాజూకైన గాజులు, అద్దాల రవిక తెచ్చాను కనుక నాపైన కొంచమైనా చొరవచూపవే, దయచూపవే, నీ కోసం ఓ చిన్నదానా ! ముక్కుకు ముక్కెర తెచ్చాను, చెవులకు గెంటీలు తెచ్చాను, నీ మెడకు ముత్యాల హారము తెచ్చాను, కళ్ళకు కాటుక తెచ్చాను, ఇన్ని తెచ్చిన నాపై కాసింతైనా సంధిచూపిస్తావని కోరుతున్నాను. ఓ చింతచిగురు చిన్నదానా ! అని తన మరదలు యొక్క అందచందాలను పొగడటం జరిగింది.
3) జానపదగేయం – నాది రేషన్ చీర
నా పెదవి దొండపండు
ఓ మామ మనస్సు నీమీదుండు - 2
నాదిరేషన్ చీర నా నడుమే పిడికేడుండు
నా పెదవి దొండపండు
ఓ మామ మనస్సు నీమీదుండు - 2
ఇంటి వెనుకల బావి, బంగారు చిలకల బావి
ఆ బావికాడికి రారా బాసచేసిపోరా
నాది రేషన్ చీర నా నడుమే పిడికెడుండు - 2
నా పెదవి దొండపండు
ఓ మామ మనస్సు నీమీదుండు - 2
ఇంటి ముందర బావి విరజాజిమల్లెల సేను
ఇంటి ముందర సేను విరజాజి మల్లెల సేను
ఆ సేను తిరిగి రారా ఓ మామ మొత్తం పూలు తేరా,
కొత్తపూలు తేరా ఓ బావ మొత్తం పూలు తేరా
నాది రేషన్ చీర నా నడుమే పిడికెడుండు
నా పెదవి దొండపండు
ఓ మామ మనస్సు నీమీదుండు -2
కొండ కింద సేను, ఆ సేను కాపల నేను
ఆ సేను తిరిగి రారా ఓ మామ నన్ను తీసుకపోరా
నాది రేషన్ చీర నా నడుమే పిడికెడుండు - 2
నా పెదవి దొండపండు
ఓ మామ మనస్సు నీమీదుండు - 2
(మౌఖికంగా పాడిన వారుః ఏ.పి.టి.డబ్ల్యు.ఆర్.ఎస్. చెంచు పిల్లలు, రాణి, పోతమ్మ, అక్కమ్మ, చెంచు ఉత్సవాలు, 26-2-2013)
సందర్భం :
కోడలు, తన మామతో తన యొక్క అందాన్ని పొగుడుతూ, తన మామ మనస్సు ఆమె మీద ఉండే విధంగా మలుచుకొనే సందర్భంలోనిది ఈ గేయం.
వివరణ :
ఓ మామ ! నా పెదవి దొండపండు, నేను రేషన్ చీర కట్టుకొని నడుస్తూ ఉంటే నా నడుము సన్నగ ఉండి పట్టుకుంటే పిడికెడు ఉంటుంది. నీకు నామీద మనసైతే, మా ఇంటి ఎనకాల బంగారు బావి ఉంది, ఆ బావి దగ్గరకు రారా బాసిచేసి పోరా ! ఒక వేల ఆ బంగారు గిలకల బావి దగ్గరకు రాకపోతే, ఇంటి ముందు బావి ఉంది, ఆ బావి దగ్గర విరజాజి మల్లెల తోట ఉంది. ఆ తోటలోని పూలు తీసుకొని రారా, నేను బావి దగ్గరలోని కొండ కింద సేను కాపలా వెళ్తున్నాను, నీవు విరజాజిపూలు తీసుకొని అచ్చటికి రారా ఓ మామ నాది రేషన్ చీర, నా నడుము పిడికెడు ఉండును, నా పెదవి దొండపండు ఓ మామ ! మనస్సు నీ మీద ఉండును అని తన యొక్క మనసులోని కోరికను ఈ విధంగా పంచుకుంది.
4) జానపదగేయం - లేడికళ్ళు లేతదాన
లేడికళ్ళు లేతదాన
బుంగమూతి బుజ్జిదాన - 2
గారపళ్ళ ఓ చిన్నాదానా
గజము లోతు నడుము దానా - 2
వస్తావ పిల్లో నీవు రంగాపూరు జాతరకు - 2
1) నీకు యాలే రైలు బండినే ఓ పల్లెదానా
యర్రబస్సు నీకు చాలునే ... వస్తావు ॥ లేడికళ్ళు ॥
2) నీకు యాలే మల్లెపువ్వులే
ఓ పిలక జుట్టు నాదు మీసమంతలేదులే-వస్తావు పిల్లో - 2॥ లేడికళ్ళు ॥
3) నీకు యాలే ముక్కుపుడకనే
ఓ చిలుకముక్కు దొండపండు నీకు చాలునే-వస్తావు పిల్లో-2॥ లేడికళ్ళు ॥
(మౌఖికంగా పాడిన వారుః చెంచు ప్రసాద్, 38 సం.లు, ఏ.పి.టి.డబ్ల్యు.ఆర్.ఎస్. టీచర్ మన్ననూర్ గ్రా., అమ్రాబాద్ మం., నాగర్ కర్నూల్ జిల్లా, 10-12-2012)
సందర్భం :
బావ తన మరదలుతో మన్ననూర్ గ్రామము నుండి సమీపంలో ఉన్న రంగాపూర్ జాతరకు పోదాం పదం అని పలికిన సందర్భంలోనిది ఈ గేయం. జానపదబాణీలో సాగుతుంది.
వివరణ :
తన మరదలును పొగుడుతూ ఓ లేడికళ్ళు కలిగిన మృదువైనదానా ! నునుపైన చెక్కిళ్ళు, అందమైన పెదవులు కలదానా ! చిన్ననైన దంతాలు కలిగిన చిన్నదానా ! సన్నని నాజూకైన నడుము కలిగినదానా ! వస్తావ పిల్లా రంగాపురం జాతరకు నీవు కోరిన రైలుబండి ఎందులకు, యర్రబస్సు నీకు చాలును, వస్తావ పిల్లా నా వెంట జాతరకు, నీవు కోరిన మల్లెపూలు ఎందుకే, నా మీసమంత లేదు నీ పిలకజుట్టు, నీవు కోరిన ముక్కుపడక ఎందుకు చిలకముక్కుకు దొండపండు నీకు చాలునే, వస్తావు పిల్లో రంగాపురం జాతరకు అని తన చక్కనైన మాటల మూటను పాటగా మలచి తన మరదలుకు వివరించాడు. ఇది జానపద పదాలతో సాగే గేయం.
5) ఆడపిల్లకు చదువెందుకు?
ఆడపిల్లకు చదువంటేనే
అందరూ భయపడుతుంటారు
ఏమిపాపం చేసితిమేము చందమామ
ఎందుకు చదువు అంటరేమే చందమామ
మమ్ము ఐనోనికి ఇవ్వటం లేదే చందమామ
తాలికట్టినా వాడు కూడా తక్కువ చూపు చూస్తడే చందమామ
మీ ఆడవాళ్ళకు చదువెందువకు అంటడు చందమామ
మాకు విడమరచి చెప్పరాయే చందమామ
ఆడపిల్లకు చదువంటేనే
అందరూ భయపడుతుంటారు
ఏమి పాపం చేసితిమేము చందమామ
మమ్ము ఎందుకు చదివిస్తలేరే చందమామ
ఈ అనిగిమనిగి బ్రతుకెందుకే చందమామ
వీరికి శమదానం లేకపాయే చందమామ
మీరందరూ ఎందుకు తలెత్తరేమే చందమామ - 2
ఆడపిల్లకు చదువంటేనే
అందరూ భయపడుతుంటారు
ఏమిపాపం చేసితిమేము చందమామ
ఎందుకు చదువు అంటరేమే చందమామ
(చెంచు ఉత్సవాలు-2013, శ్రీశైలం ప్రాజెక్ట్, కర్నూలు జిల్లా, పాడిన వారుః చెంచు నరసింహా-46 సం.లు, అహోబిలం, ఆళ్ళగడ్డ, కర్నూల్ జిల్లా, 26-2-2013)
సందర్భం :
ఆడపిల్లకు చదువెందుకు అని కన్నతల్లిదండ్రులు, ఇతరులు అనుకుంటూ ఉంటారు. అది తప్పు, ఆడపిల్ల అన్ని రంగాలలో ముందుంది, ఆడపిల్లను తక్కువ చూపు చూడకంటి అని చెప్పిన సందర్భంలో ఈ గేయం ఆలపించడం జరిగింది.
వివరణ :
ఆడపిల్లకు చదువంటేనే అందరూ భయపడుతుంటారు. మేము ఏమి పాపం చేశాము చెప్పండి. ప్రయోజనకుడు అయినవాడికి మీరు మమ్ములను ఇవ్వడం లేదు. తాలికట్టిన వాడు కూడా చదివించకుండా తక్కువ చూపు చూస్తారు. ఏ విషయానైనా విడమరచి చెప్పరు. అనిగిమనిగి నేను చెప్పినట్లుగా విను అని భయపెడతారు, ఆడపిల్ల చదువుకుంటాను అంటే నీకు చదువెందుకు అంటారు. మేము ఏమి పాపం చేశామో! ఈ సమాజం బదులివ్వాలి. ఆడపిల్లలు కూడా తలెత్తి ఎదురు తిరగాలి. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అని తెలియజేసిన గేయం ఇది.
5. ముగింపు:
చెంచుల వారి వాద్యాల విధానం తయారీ వచాలా గొప్పనైనది. వాద్యాలను తయారీ చేయడంలో ఎంతో నైపుణ్యత సంతరించుకున్నారు చెంచులు. ఆదిమ చెంచులు
ఈ ప్రపంచానికి వాద్యాలను తయారు చేసిన మొదటి వారుగా చెప్పవచ్చు. ఎందుకంటే వారు ఆదిమ జాతి, ఆదిమ తెగ వారుగా గుర్తింపు పొందారు.
ఇక గేయ సాహిత్య విషయానికి వస్తే గేయ సాహిత్యం చాలా గొప్పది. అందులో ఆదిమ చెంచుల గేయ సాహిత్యం ఇంకా గొప్పది. తెలంగాణ ప్రాంతపు చెంచుల వారికి గేయ సాహిత్యంలో అంతగా ప్రవేశం లేదు. ఆంధ్రా, రాయల సీమ ప్రాంతంలో నివసించే వారికి గేయ సాహిత్యంలో ప్రవేశం ఉంది.
వీరు గేయ సాహిత్యం లో మంచి పటుత్వం కలవారు. మంచి నేర్పరులు, వీరిది అందరు మెచ్చుకొనే విధంగా ఉండే పద సాహిత్య నిష్ణాతులు.
వీరి యొక్క సాహిత్యంలో అర్థవంతమైన, నిగూఢమైన అర్థం వచ్చేవిధంగా ఉండే మౌఖిక సాహిత్యం. వీరిలో అక్షరజ్ఞానం ఉన్నవారు చాలా తక్కువ. వరిసేనులో మెరికసేను మాదిరిగా చదువుకున్నవారు ఉంటారు. వీరి యొక్క గేయ సాహిత్యం మౌఖికంగా జాలువారిన జలపాతం లాంటి పదాల అల్లికతో కూడుకొని ఉంటుంది. వీరు చదువుకోని జ్ఞానవంతులు. వీరు పెద్దగా చదువుకోక పోవచ్చును కానీ, వీరు మనుషుల జీవిత పాఠాలనే నేర్చుకున్న సాహితీమూర్తులు.
చెంచులకు పాటలంటే ప్రాణం, వినోదం అంటే నృత్యం అంటే నవనాడులకు పని చెబుతారు. బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకు అన్ని వయసుల వారు , పాడుతూ డప్పుల శబ్ధాల మధ్యలో నృత్యం చేస్తారు. వారు మధ్యం సేవించినప్పుడు పూర్తిగా పాటలలో నృత్యాలలో నీటిలోని బిందువువలె తేలి ఆడతారు.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- అండమ్మ, ఎమ్, 2013: ఖమ్మం కొత్తగూడెం జానపద గేయాలు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
- ఐలయ్య, కంచ, 2017: ఉచిత ఉపధ్యాయులు-ఆదివాసులు, భూమి బుక్ ట్రస్ట్, హైదరాబాద్
- కాంతయ్య బత్తుల, 2007, : దళిత్ ఆవాజ్, అంకుష్ ప్రింటర్, హైదరాబాద్
- కృష్ణగోపాల్ కప్పెర, 2019: చెంచుల సాహిత్యం సమగ్ర పరిశీలన, అముద్రిత పిహెచ్.డి. థీసెస్, హైదరాబాద్
- నదీం హస్‌నైన్, 1995, : భారతీయ గిరిజనులు, ఓరియంట్ లాజ్మన్, హైదరాబాద్
- వసుంధరా రెడ్డి, చింతపల్లి, 2019,: తెలుగు జానపద సాహిత్యము స్త్రీల గేయములలో సంప్రదాయాలు, ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాద్
- శివరామకృష్ణ, 2007, : కొండకొనల్లో తెలుగు గిరిజనులు, శక్తి పబ్లికేషన్స్, హైదరాబాద్
- శ్యామల, కె, 2011: చెంచు జీవన చిత్రణ-ద్రావిడ విశ్వ విద్యాలయం, శ్రీనివాసనగర్, కుప్పం
- సుందరం, ఆర్.వి.యస్, 1983 : ఆంధ్రుల జానపద విజ్ఞానం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
- సూర్యాధంనజయ్ దానావత్,2009,: నల్లగొండ జిల్లా బంజారా సాహిత్యం, రైన్‌బో బుక్ ప్రింట్, హైదరాబాద్
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.