headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

12. పారిజాతాపహరణ, రాధికాసాంత్వన ప్రబంధాలు: తులనాత్మక పరిశీలన

డా. కళ్ళేపల్లి ఉదయ్ కిరణ్

సహాయాచార్యులు (ఒ),
డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం,
ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా, ఆంద్రప్రదేశ్.
సెల్: +91 9494188200, Email: udaykiran188200@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ముద్దు పళని రాధికాసాంత్వనం కేవలం పచ్చి శృంగార కావ్యం అని రూఢిలో ఉంది. దానికి ముద్దుపళని వర్ణనలలో చూపిన తెగింపు ఒక కారణం కాగా, ఆమె వృత్తి రీత్యా వేశ్యాంగాన కావటం మరొక కారణంగా కనిపిస్తుంది. ఈ రెండు విషయాలకు సన్నిహిత సంబంధం ఉండటం చేత ఆమె రచనలో ఇతర విషయాల పట్ల దృష్టి నిలపలేని పరిస్థితి ఏర్పడింది. వర్ణనలను అదీ కొన్నింటిని మాత్రమే వేరు చేసి ఈ కావ్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఉత్తమ కావ్యంగా వెలుగొందగలదనే నా అభిప్రాయానికి రూపంగా ఈ వ్యాసాన్ని రాశాను. పచ్చి శృంగార కావ్యంగా ముద్రపడి, అతి కొద్దిపాటి విషయ వివరణతో తెలుగు సాహిత్య చరిత్రలో స్థానం పొందిన ముద్దుపళని రాధికాసాంత్వనం పిల్ల పారిజాతపహరణముగా పేరొందింది. అయితే పారిజాతపహరణములో ఉన్న ఏ విషయాలతో రాధికా సాంత్వనం కావ్యంలో పోలీకలున్నాయో పరిశీలించటం ఈ వ్యాసంలో ఒక పార్శ్వం. దానిలో భాగంగా కథాపరమయిన పోలికలను స్థూలంగా పరిచయం చేశాను. సందర్భోచితంగా నంది తిమ్మన పద్యాలను రాధికా సాంత్వనంలో ముద్దుపళని ఏ విధంగా కూర్చినదో తెలియజేసే ప్రయత్నం చేశాను. కథా క్రమం ఒకే విధంగా ఉన్నప్పటికీ పారిజాతపహరణములో నాయిక అయిన సత్యభామ అలుక, వేదనల కన్నా పరిస్థితులు, కోల్పోయిన దాని విలువలని బేరీజు వేసినప్పుడు రాధికా సాంత్వనంలో రాధ అలుక వేదనల స్థాయి అధికమని చెప్పడానికి ప్రయత్నించటం వేరొక పార్శ్వం. ప్రథమ భాగం అతి శృంగారంగా ఉన్నా తరువాత కథలో వియోగ కరుణము ప్రధాన భూమిక పోషించినదని నా అభిప్రాయము. పువ్వుని ఇవ్వలేదన్న సత్యభామ కోపం కన్నా, బంధానికి దూరం అయిన రాధ భాధ వర్ణనాతీతం అనే ఉద్దేశ్యాన్ని ప్రకటించటమే నా ఈ వ్యాస ప్రధాన దృక్పథం.

Keywords: సాహిత్యం, పారిజాతాపహరణము, రాధికాసాంత్వనము, కథాసామ్యం, పద్యాల పోలిక, సత్యభామ, రాధాల ఆవేదన వివరణ.

1. ఉపోద్ఘాతం:

తెలుగు సాహిత్యంలో కొన్ని కావ్యాలు తదనంతర కవులకు ప్రేరణగా నిలుస్తూ అదే తరహా రచన చేసే విధంగా పురికొల్పాయి. రామరాజభూషణుని వసుచరిత్ర పిల్ల వసుచరిత్రలకు ప్రేరణ అయినట్టుగానే, నంది తిమ్మన పారిజాతాపహరణము పిల్ల పారిజాతాపహరణాలకి మార్గదర్శక- మయింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో జాషువా గబ్బిలం పిల్ల గబ్బిలాల పుట్టుకకి కారణమయింది.

మిగిలిన సదృశ కావ్యాల వలె కాక నంది తిమ్మన పారిజాతాపహరణంతో పోల్చదగిన ముద్దుపళని రాధికా సాంత్వనం పచ్చి శృంగార కావ్యంగా పేరు తెచ్చుకుంది. శృంగార వర్ణనలనే అంశాన్ని తప్పించి చూసినప్పుడు ముద్దుపళని రచనలో కూడా ముద్దు  పలుకులని గ్రహించగలుగుతాము. ఎందుకు ఈ శృంగార వర్ణనలని తప్పించి చూడాలంటే అవి ఈ రచనకు మాత్రమే పరిమితమయినవి కావు. దక్షిణాంధ్రయుగ సాహిత్యంలో సర్వసాధారణమయిన విషయం. అయితే ఒక స్త్రీ రచనలో ఇంతటి పచ్చి శృంగారం పెక్కుమందికి ఇచ్చగించలేదు.

తెలుగు సాహిత్య చరిత్ర రచించినవారిలో ఎక్కువమంది ముద్దుపళని వృత్తిని దృష్టిలో ఉంచుకుని ఆమె రచనను అంచనా వేయటం గమనించదగ్గ విషయం. కందుకూరి వారి ఆంధ్రకవుల చరిత్రములోని ఈ కింది మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

రామాయణమును తెను(గున రచియించిన ఈ మొల్ల యాతుకూరి కేశనశెట్టి కూతురు. ఈమె తన పుస్తకమునందెక్కడను దనవంశమును గూర్చి చెప్పుకొనక పోయినాను, ఈమె కులాలవంశజాతయని పరంపరగా వాడుకవచ్చుచున్నది.”1  

మొల్లని గురించి ప్రస్తావించవలసినప్పుడు కందుకూరివారి మాటలలో గౌరవం సుస్పష్టంగా కనిపించుచుండగా ముద్దుపళని గురించి చెప్పు సందర్భములో కందుకూరివారు ఈ కింద విధంగా పేర్కొన్నారు.

ఈ ముద్దుపళని వేశ్యాంగన. ఇది రాధికాసాంత్వనమను నాలుగాశ్వాసముల శృంగార ప్రబంధనమును రచించెను. దీని తల్లిపేరు ముత్యాలు. అది తంజావూరు సంస్థాన ప్రభువయిన ప్రతాపసింహుని యుంపుడుకత్తె.2

మొల్లనుద్దేశించినప్పుడు ఈమె అను గౌరవవాచక ప్రయోగం చేసిన కందుకూరివారు ముద్దుపళనిని మాత్రం ‘అది’, ‘ఇది’, ‘దాని’  అని నిమ్న వాచకాలతో సంబోధించటం చేతనే ఆమె వృత్తిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఆమె రచనను పరిచయం చేసినట్టు  అర్థమవుతుంది.
పెద్దవారి వలెనే పిన్నవారు అన్న చందంగా తరువాత వారందరూ కూడా అదే మార్గంలో ప్రయాణం చేశారు. అయినప్పటికీ అక్కడక్కడా ముద్దుపళని రచనలో గొప్పతనాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రస్తావించిన వారు కూడా లేకపోలేదు. 

muddupalani was a poetess patronised by Pratapa simha, Maharastra ruler of topjorc. She composed in 1740, Radhika Santvanam a very popular and charming poem in four cantos. Erotic Sentiment runs through the poem. It is no doubt vulgar in some places, but the Vulgarity is astutely screened by melodious and polite expressions.”3  అని సీతాపతిగారు కొన్ని చోట్ల అసభ్యంగా ఉంది, కానీ అసభ్యతను చాలా తెలివిగా తెరకెక్కించిందని ముద్దుపళనిని కొనియాడారు.

ఇందులో కొన్ని పద్యాలు కథ పెంచడానికి వ్రాసినవే తప్ప కల్పనలు నిండుకున్నవి. ఆ కాలంలో అన్నీ ప్రబంధాలలో కనిపించే అంగాంగ వర్ణనలు వియోగ విరహాలలో మన్మథుణ్ణి సపరివారంగా తిట్టే రొటీను పద్యాలు వంటివి ఒక నూటేభై దాకా తీసేస్తే ఈ కావ్యం వన్నెకేం లోపం రాదు. సరికదా బాగా మెరుస్తుంది.4 అని ఆరుద్రగారు అనటం ఈ కావ్యానికి సవరణలు చేస్తే ఉత్తమ కావ్యం కాగల లక్షణాలు ఉన్నాయని, తెలుగు సాహిత్యంలో మెరవగల శక్తి గల కావ్యమని తెలుస్తుంది.

అటువంటి రాధికా సాంత్వనాన్ని పారిజాతాపహరణము ప్రబంధంతో పోల్చి చూడగా కొన్ని భేద సాదృశ్యాలు కనిపిస్తాయి. వాటిని పరిశీలించినట్లయితే ఈ రాధిక సాంత్వన కావ్యం ఉత్కృష్టత బయలుపడుతుంది. పరిశోధనా వ్యాస పరిమితి దృష్ట్యా కొన్ని విషయములను మాత్రమే ఇందు పొందుపరిచాను.

2. కథాసామ్యం: 

నంది తిమ్మన పారిజాతపహరణ ప్రబంధానికి, ముద్దుపళని రాధికసాంత్వనానికి గల సామ్యాలలో కథ ప్రధానమయినది. కథపరంగా స్థూలంగా ఈ కింది విషయాలలో పోలిక గమనించదగినది.

  1. రెండు కావ్యాలలో నాయకుడు కృష్ణుడే.
  2. పారిజాతాపహరణంలో కృష్ణుడు రుక్మిణికి పారిజాతపుష్పాన్ని బహుకరించటం  సత్యభామ కోపానికి కారణం కాగా, రాధికా సాంత్వనంలో కృష్ణుడు ఇళకు ‘వలపుల దొరసాని’ బిరుదును ఇవ్వటం రాధ కోపానికి కారణం అవుతుంది.
  3. సత్యభామ, రాధలు ఇరువురూ కోపగృహానికి చేరటం.
  4. కృష్ణుడు చూడటానికి రాగా సత్యభామ, రాధలు పరుషోక్తులు పలుకుట.
  5. కృష్ణుడు పాదాక్రాంతుడవటం.
  6. సత్యభామ, రాధలు వామపాదముతో కృష్ణుని వెడద్రోయుట.
  7. కృష్ణుడు అనునయ వాక్యాలు పలుకుట.

3. పద్యాల పోలిక: 

నంది తిమ్మన పారిజాతాపహరణం, సుముఖం వెంకట కృష్ణప్ప నాయకుని ఏకాశ్వాస కావ్యమయిన రాధికా సాంత్వనం రచనలను పరిశీలించినప్పుడు  ముద్దు పళని చాలా పద్యాలు వారి  రచనల నుండి గ్రహించి తన కావ్యంలో పొందుపరిచిందని అవగతమవుతుంది. ముఖ్యంగా పారిజాతపహరణంలో పద్యాలవంటి వాటిని ముద్దుపళని అవసరమయిన  కొన్ని సందర్భాలలో ప్రయోగించింది. రుక్మిణికి పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడు ఇచ్చాడని చెలికత్తె చెప్పినప్పుడు సత్యభామ తనతో శ్రీకృష్ణుడు ఎంత అన్యోన్యంగా మెలిగేవాడో, తన మాట జవదాటక ఎలా మెసలేవాడో  అని తలచుకుంటూ అటువంటివాడు ఈ విధంగా చేశాడని బాధపడుతూ పలికినది ఈ కింద పద్యం.

“కలలోన నైన నవ్వులకైన నా మాట
జవదా(ట వెఱచునో చంద్రవదన!
యే పదార్ధంబు నా యెదుట( బెట్టక మున్న
యెవ్వారి కొస(గ( డో యిగురు(బోడి
చెలులు నాతో నేమి చెప్పుదురో యని
లంచంబులిచ్చునో చంచలాక్షి!
తోడి చేడియలు నా తోడి వంతులకు రా
సయిరింప! జాల(డో సన్నుతాంగి!

తే. యరమరలులేని కూరిమి నన(గి పెన(గి
కొదలు తీఱని కోర్కుల( గూడి మాడి
కపట మెఱ(గని మమతల( గలసి మెలసి
యున్న విభు(డిట్లు సేయునే యో లతాంగి!”5

అని ఎటువంటి దాపరికాలు లేకుండా దాంపత్య జీవితం గడుపుతున్న నా భర్త ఇంతగా నన్ను నిర్లక్ష్యం చేసి రుక్మిణికి పువ్వుని ఇచ్చాడని వాపోతుంది.

అదేవిధంగా ఇళాదేవికి వలపుల దొరసాని అనే  బిరుదును శ్రీకృష్ణుడు ఇచ్చాడని చిలుక ద్వారా తెలుసుకున్న రాధ కూడా పై విధంగానే తన బాధను వ్యక్తం చేసినట్టుగా ముద్దుపళని రచించినది ఈ పద్యం.

“కీరవాణుల చేత( గిల్లాకు లంపితే
శిరసావహించునో సరసిజాక్షి!
నాతియెవ్వతెయైన నా మేర వే(డితే
కనులెఱ్ఱ(జేయువో కంబుకంఠి
యెలమి నాకోసరమెంత వారలనైన(
దెగనాడ( దల(చునో చిగురు(బోడి
యే(జూచి చూడక యే మాట( జెప్పిన
జవదా(ట వెఱచునో సన్నుతాంగి!
తే. యే పదార్థంబులైన నా యెదుట( బెట్ట
కెవరికి నొసంగ(బోవ( డో యిందువదన
చేరి యటులున్న విభు(డిట్లు చేసెనేని
తిరుగ బ్రతుకాన వలెన(టే శరదవేణి”6

ఎట్టి పరిస్థితులలోనైనా తనకు పెట్టకుండా ఏ పదార్థానైనా ముట్టనివాడు నాకోసం ఎంతటివారినైనా ఎదిరించడానికి సిద్ధపడే వాడు ఇళాదేవి ఎడ మిక్కిలి ప్రేమ కలిగి ఉండటమే కాక, ప్రేమ పాఠాలలో కృష్ణునికి అన్నీ తానై ఇళాదేవితో పరిణయం వరకు నడిపినప్పటికీ కృష్ణుడు తనతో గల సుదీర్ఘ అనుబంధాన్ని మర్చిపోయాడని ఆవేదన చెందుతుంది.

పారిజాత పుష్పాన్ని కృష్ణుడు రుక్మిణికి ఇచ్చినప్పుడు నారదుడు సత్యభామ గర్వాన్ని వివరిస్తూ చెప్పిన పద్యంలో ఎవరిని లెక్క చేయని సత్యభామ నీ వైభవాన్ని చూసి కుమిలిపోవటం తథ్యం అని చెప్పిన ఈ కింద పద్యాన్ని ఆధారంగా చేసుకొని ముద్దుపళని తన కావ్యంలో రాధను ఓదార్చే సమయంలో కృష్ణుడు పలికన విధంగా మలిచింది.

“చక్కనిదాన నంచు నెలజవ్వని నంచు, జగంబులోన( బే
రెక్కిన దాన నంచు, బతి యెంతయు నా కనురక్తు(డంచు( దా
నిక్కుచు విఱ్ఱవీ(గుచు గణింపదు కాంతల సత్య యింతకున్
స్రుక్కకయున్నె! నీ మహిమ సూచిన బోటులు విన్నవించినన్”7

అని నారదుడు సత్యభామను నిందించినట్లుగా పలికిన ఈ పద్యాన్ని ముద్దుపళని రాధను కృష్ణుడు పొగుడుతున్నట్లుగా పూర్తి భిన్నమైన సందర్భంలో ప్రయోగించింది.

“చక్కనిదానవంచు, రతిసారమెఱింగిన చానవంచు, నా
యక్కఱ దీర్తువంచు, నను హాయిగ(గౌ(గిట(జేర్తువంచు, నే
నిక్కము నమ్మి వచ్చునెడ, నీవిపుడీ మటుమాయలాండ్ర చే
నక్కట! యొప్పగించిటుల నాఱడి సేతువే రాధికామణీ!”8

చక్కనిదానవని, రతిసారం తెలిసినదానివని, నా అక్కర తీర్చగలదానివని, నీ దగ్గరకు వచ్చానని కృష్ణుడు కోపంగా ఉన్న రాధ అందాన్ని పొగుడుతూ పలికిన మాటలుగా ముద్దుపళని దిద్ది తీర్చింది.

పారిజాతాపహరణంలో కృష్ణుని పై అలకతో మాసిన చీర కట్టుకుని మౌనంగా ఆభరణాలు లేకుండా తలకి వాసెనకట్టుతో కోపగృహంలో ఉన్న సత్యభామను అనునయించడానికి వెళ్ళిన కృష్ణుడు ఆమె ఎందుకు అలా ఉన్నదని ప్రశ్నించిన సందర్భంలో చెప్పినదీ పద్యం. 

“ఇందు నిభాస్య! మైతొడవులేల ధరింపవు? నున్న కావులీ
వెందును మానలేవు, తెలుపేటికి(గట్టితి? వీటికా రుచుల్
కెందలిరాకు మోవి( దులకింప(గ( జేయక యున్కి యేమి? నీ
చందము వింతయయ్యెడు, నిజంబుగ నా కెఱు(గంగ( జెప్పుమా!”9

కృష్ణుని పై అలిగి ఉన్న రాధతో అతడాడినటట్లుగా ముద్దుపళని పలికించిన పద్యం నంది తిమ్మనను  యదాతథంగా  అనుకరించినదని ఈ కింది పద్యాన్ని గమనించితే అవగతమవుతుంది.

“జలకములాడవేమి? నును చల్వల గట్టవదేమి?మోమునం
దిలకము దిద్దవేమి?జిగి దేరెడి సొమ్ములు పెట్టవేమి? మై(
గలపమలందవేమి? వగగా విరిజాజులు, పూనవేమి? నా
వలనను దప్పులేమి? మగువా! వివరింపుమెఱుంగ వే(డెదన్”10

అని అమాయకంగా తనవలన ఏమి తప్పు జరిగిందో తెలియనివాని వలె కృష్ణుడు పలికిన విధం ఒక్క రీతిగానే ఉంది.

పారిజాతపుష్పాన్ని రుక్మిణీదేవికి చేరే సమయంలో  నారదుడు తనను తక్కువ చేసి మాట్లాడాడని తెలుసుకున్న సత్యభామలో ఎంతటి ఆగ్రహ జ్వాల రగిలిందో తెలియజేయు ఈ కింది పద్యాన్ని గమనించండి.

“అన విని వ్రేటువడ్డ యుర గాంగన యుం బలె నేయి వోయ భ
గ్గన దరికొన్న భీషణ హుతాశాన కీల యనంగ లేచి, హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల( గుంకుమ పాత్ర భంగ సం
జనిత నవీన కాంతి వెదచల్ల(గ గద్గద ఖిన్న కంఠియై”11

దెబ్బతిన్న ఆడు పాము వలె, నేతిని పోయగా ఎగయు అగ్ని లాగా కన్నులు ఎరబడగా సత్యభామ కోపంతో స్పందించిందని నంది తిమ్మన చేసిన కోప వర్ణన, ముద్దుపళని తన కథా నాయికకు కూడా ఏ విధంగా ఆపాదించిందో ఈ కింది పద్యం వలన స్పష్టమవుతుంది.

అన(గుబుసంబు నూడ్చిన మహా భుజంగాంగన నా, ముసుంగు తె
ప్పున( జన( జేసి లేచి, ముడి బొమ్మలెసంగ(, గటంబులుబ్బ(గా(
గను దొగలెఱ వాఱె ముఖ కంజము జేవురు దో(ప(, జెమ్మటల్
కన(బడ గావి మోవదర( గామిని పల్కె దూరాప కోపయై”12

కుబుసం విడిచిన మహా సర్పం ఏమో అన్నట్టు కాను బోమలు ముడివేసి, ముఖ్యం ఎరబడగా నిగ్రహించలేనికోపం తో రాధ పలికినదని వర్ణించింది.

“ధనమిచ్చి పుచ్చుకొన్నను
మనమున నోర్వంగ వచ్చు మగ(డింతులకున్
జన విచ్చి పుచ్చుకొన్నను
మనవచ్చునె? యింక నేటి మాటలు చెలియా!”13

తనకే సొంతం అనుకునే భర్త ఇతర స్త్రీలకు ధనం పంచినా బాధఉండదు కానీ చనువుగా మెలిగితే బ్రతకటం కష్టమని సత్యభామ చెప్పిన మాటలు, రాధ చెప్పిన ఈ కింది మాటలు ఎంత సామీప్య సారూప్యాన్ని కలిగి ఉన్నవో గ్రహించితే ముద్దుపళని నంది తిమ్మనను ఎంత దగ్గరగా అనుసరించిందో అర్థమవుతుంది.

“సొమ్ములియ్యవచ్చు సమ్మందమియవచ్చు
నియ్యరాని ప్రాణమియ్యవచ్చు
దనదు విభుని వేఱె  తరుణి చేతికినిచ్చి
తాళవశమె యెట్టి దానికైన!”14

అయితే ఈ రెండు పద్యాలలో నాయిక వేదనను వర్ణించటం ప్రధానమయినప్పటికీ తన చేతులతో ఇళను అలంకరించి, తానే స్వయంగా తన ప్రియుని వద్దకు పంపిన రాధ బాధ కాస్తంత ఎక్కువేనని చెప్పక తప్పదు.

4. సత్యభామ, రాధ పాత్రల మధ్య వ్యత్యాసం:

  1. సత్యభామ అందరిలో తాను ప్రత్యేకమని, తన భర్త తనతోనే ఉండాలని ఆలోచించే సంకుచిత మనస్తత్వం కలిగినది. తనతోపాటు ఏడుగురు భార్యలకు భర్త అయిన కృష్ణుణ్ణి తనతో పాటు కట్టేసుకోవాలనుకునే ఆలోచన ఆమెది.
  2. రాధ స్వయంగా కృష్ణునికి ప్రణయ పాఠాలు నేర్పించినా ఇళతో వివాహానికి ఏర్పాట్లు చేయడమే కాకుండా ముగ్ధ అయిన ఆమెకు కృష్ణునితో ఎలా మసలుకోవాలో తెలియజేసింది. 
  3. పారిజాతపుష్పం తనకు దక్కలేదని, తన పరోక్షంలో తనని తక్కువ చేస్తూ మాట్లాడుకున్నారని సత్యభామ కోపగృహ ప్రవేశం చేసింది.
  4. కేవలం ఒక పుష్పం దక్కకపోవటం చేత సత్యభామ అంతలా విలవిలాడిపోతే, తన ప్రియుడైన కృష్ణుని ఇళతో పంపి కృష్ణుడు తనని మర్చిపోయాడన్న  రాధ బాధ అత్యంత శోకమయమని ఇట్టే అర్థమైపోతుంది.
  5. తన భర్త తనని మాత్రమే ప్రేమించాలని ఏడుగురు సవతులతో కలిసి ఉన్న సత్యభామ కోరుకోవటం అది జరగకపోవటంతో ఆమె బాధపడటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే మానసికంగా ఆమె సవతులతో కలిసి తన భర్తను పంచుకోవటానికి సిద్దపడింది.
  6. రాధకు కృష్ణుడు, కృష్ణుడుకి రాధ మాత్రమే అనే అనుబంధంలో ఉన్న రాధ తప్పని పరిస్థితుల్లో కృష్ణునికి ఇళతో వివాహం జరిపించింది. రాధని  కృష్ణుడు పట్టించుకోకపోవటం ఆమెను  వేదనకు గురి చేసింది కానీ ఇళతో ఉన్నందుకు రాధ బాధపడలేదని గ్రహించాలి.
  7. కష్టపడగలిగినవాడు సుఖాన్ని పొందినా, కష్టాన్ని అనుభవించినా రెండింటినీ స్వీకరించగలడు. కానీ సుఖంగా జీవిస్తున్నవానికి చిన్న కష్టం కూడా భరింప శక్యం కాదు. ఆ విధంగానే సుఖించి విరహమొందుట దుర్భరం. పరిణిత బుద్ధి కలిగిన రాధ భరింపరాని వేదనను అనుభవించినది చెప్పే ప్రణాళికలో భాగంగా ఆమె కృష్ణునితో జరిపిన శృంగారాన్ని అతిగా వర్ణించే ప్రయత్నం చేసింది ముద్దు పళని. రాధ ఎంత ఎక్కువ సుఖం పొందినదో అంతే తీవ్రమైన మనోవేదనకు అనుభవించినది అని స్పష్టపరచటమే ప్రధాన అంశమని గ్రహించినప్పుడు ముద్దు పళని కావ్యంలో ఆ అతి శృంగార వర్ణనల ఆవశ్యకత అర్థమవుతుంది.

5. ముగింపు:

భోజదేవుని శృంగార ప్రకాశికలో రీతిరమ్యతలు, అనురాగభేదములు, ఈర్ష్యామాన విప్రలంభాదుల విస్తారత, పరకీయా భావ ప్రకృష్టత అనన్యములు; అద్భుతములు. దక్షిణాదియందు మాత్రమే లభించు ముద్దుపళని గ్రంథం దీనికి లక్ష్యమనదగియున్నది. చేమకూర యంతటివాడే భోజుని పద్ధతినవలంబించి తన గ్రంథములలో వర్ణయోజనము చేయవలెనని యత్నించియు సఫలుడు కాకపోయెను”15  అని ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ చెప్పిన మాటలు రాధికా సాంత్వనాన్ని విభిన్న దృక్పథంతో పరిశీలించవలసిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. చూసే దృష్టి కోణం మారినప్పుడు రాధికా సాంత్వనం మరిన్ని పరిశోధనలకి ఆధారం అవుతుందనటం అతిశయోక్తి కాదు. 

6. పాదసూచికలు:

  1. ఆంధ్ర కవులచరిత్రము (రెండవ భాగం) – కందుకూరి వీరేశలింగం పంతులు –పుట. 88.
  2. ఆంధ్ర కవులచరిత్రము(మూడవ భాగం) – కందుకూరి వీరేశలింగం పంతులు –పుట. 142.
  3. History of Telugu Literature – G. Sitapati – page no. 44.
  4. సమగ్రాంధ్ర సాహిత్యం(రెండవ సంపుటి) – ఆరుద్ర – పుట. 926. 
  5. పారిజాతాపహరణము – నంది తిమ్మన – ప్రథమాశ్వాసం -94 వ పద్యం, పుట. 60,61
  6. రాధికా సాంత్వనం – ముద్దుపళని – తృతీయాశ్వాసం - 31 వ పద్యం – పుట.99.
  7. పారిజాతాపహరణము – నంది తిమ్మన – ప్రథమాశ్వాసం -66వ పద్యం, పుట. 56
  8. రాధికా సాంత్వనం – ముద్దుపళని – చతుర్ధాశ్వాసం – 26వ పద్యం – పుట.138
  9. పారిజాతాపహరణము – నంది తిమ్మన – ప్రథమాశ్వాసం -115వ పద్యం, పుట. 65
  10. రాధికా సాంత్వనం – ముద్దుపళని – చతుర్ధాశ్వాసం – 49వ పద్యం – పుట.143.
  11. పారిజాతాపహరణము – నంది తిమ్మన – ప్రథమాశ్వాసం -82వ పద్యం, పుట. 59
  12.  రాధికా సాంత్వనం – ముద్దుపళని – చతుర్ధాశ్వాసం – 68వ పద్యం – పుట.148.
  13. పారిజాతాపహరణము – నంది తిమ్మన – ప్రథమాశ్వాసం -97వ పద్యం, పుట. 62.
  14. రాధికా సాంత్వనం – ముద్దుపళని – ప్రథమాశ్వాసం – 74వ పద్యం – పుట.50.
  15. ఆంధ్ర కవయిత్రులు – ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ – పుట. 68.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆరుద్ర, (2012), సమగ్రాంధ్ర సాహిత్యం –  తెలుగు అకాడెమీ, హైదరాబాదు. 
  2. తిమ్మన నంది, (2014),పారిజాతాపహరణము, ఎమెస్కో బుక్స్, విజయవాడ.
  3. ముద్దుపళని (2006), రాధికాసాంత్వనము, ఎమెస్కో బుక్స్, విజయవాడ.
  4. లక్ష్మీకాంతమ్మ ఊటుకూరి, (1980), ఆంధ్ర కవయిత్రులు, శివాజీ ప్రెస్, సికింద్రాబాదు.
  5. వీరేశలింగం పంతులు కందుకూరి,(1978), ఆంధ్ర కవుల చరిత్రము, హితకారిణీ సమాజం, రాజమహేంద్రవరం.
  6. సీతాపతి గిడుగు (1968), History of Telugu Literature, సాహిత్య అకాడెమీ, న్యూ ఢిల్లీ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]