AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
11. 'కాకాని చక్రపాణి' నవలలు: మహిళ
ఉదయశ్రీ మల్లెంబాక
8-4-3, మనుమసిద్ది నగర్,
ఓల్డ్ మినీ బైపాస్ రోడ్డు,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7993170901, Email: udayarao1998@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
నేటి సమకాలీన పరిస్థితుల్లో సమాజాన్ని నైతికంగా ధర్మంగా నడిపించాల్సిన భాధ్యత అమ్మదే. అమ్మ అంటే మహిళ... కానీ మహిళ పడుతున్న ఈతిబాధలను మరియూ ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్న విధానమును తెలుగు సాహిత్యం ద్వారా స్ఫూర్తిని పొందగలం. ఆ క్రమంలో తెలుగు ప్రజలందరికీ నవల చిరపరిచితం. అలాంటి నవలల్లోని మహిళపాత్రల తీరుతెన్నులను చర్చించుకోవాల్సిన ఆవశ్యకత కలదు. అందులో భాగంగా ఆధునిక నవలా రచయిత కాకాని చక్రపాణి నవలలను క్షుణ్ణంగా చదవడం ద్వారా, మహిళల ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని సహనగుణాలను అవలోకనం చేసుకోవాల్సిన ఆవశ్యకత కలదు. సమాజం లో మహిళ ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, బాధ్యతలు, భావోద్వేగాలను విహంగా వీక్షణం చేయడమే ఈ వ్యాస రచన ముఖ్య ఉద్ధేశ్యం. మహిళ తనకెదురైన భవబంధాలను వెలికి తీసి వాస్తవ ప్రపంచానికి తెలియజేసే మహిళా పాత్రలను అందరికీ అందుబాటులోనున్న నవలల్లోని పాత్రల ద్వారా పరిచయం చేయడమే ఊహా ప్రణాళిక. ఇందుకుగాను నేన్నెంచుకున్న పరిశోధనాపద్ధతి- అధ్యాపకుడు, అనువాదకుడు మరియు నవలారచయిత కాకాని చక్రపాణిచే విరచితమైన 11 నవలలను క్షుణ్ణంగా చదివి, వాటిలో మహిళా కేంద్రీకృతమైన పాత్రలను ఎంపిక చేసుకొని సంగ్రహంగా చర్చించడం. సమాజంలో సగమే కావచ్చునేగానీ, ప్రకృతే తానుగా, సంచరించే ‘మహిళ’ పాత్రను, 5 నవలల్లోని 5 పాత్రల ద్వారా విజ్ఞులైన పాఠకుల దృష్టికి తీసుకురావడమే ఈ వ్యాసరచనాఫలితం.
Keywords: స్ఫూర్తి, విశిష్టాద్వైతం, భాగవతోత్తముడు, స్త్రీ - ప్రేమ, శీలము - లింగాతీతం.
1. ఉపోద్ఘాతం:
మహిళ, జనాభాలో సగం... ఆకాశంలో సగం... ఇది మనం తరచూ వినే, చదివే పదం. తరచి చూస్తే, నిశితంగా పరిశీలిస్తే ఇది సత్య దూరమని అర్ధమౌతుంది. ఎలాగంటే, ఆకాశంలోని నాలుగు ఆవరణలతో పాటు భూమి పై నున్న వాతావరణం, వెరసి ఐదింటి సమాహారమైన ప్రకృతి విశ్వం లోని భూమికి మాత్రమే ప్రత్యేకమైనది. ప్రకృతి, స్త్రీ రెండూ పర్యాయ పదాలే గానీ, వేర్వేరు కావు. ప్రకృతి సహజ సిద్ధ లక్షణాలైన త్యాగం, ప్రేమ, దయ, సహనం, క్షమ, పునరుత్ధానం, ధీరత్వం లాంటి వన్నిటినీ పుణికి పుచ్చుకున్న మహిళ సమయ సందర్భానుసారంగా, వ్యక్తీకరిస్తుంది. ఈ క్రమం లోనే తనకొక ఆటవిడుపుగా సృజించుకున్న మగజీవి పట్ల తన సహజ లక్షణాలన్నింటినీ వినియోగిస్తుంది. తద్వారా సృష్ఠికార్యాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగే విభిన్న దశలను విభిన్న మహిళల నవలా రచయిత కాకాని చక్రపాణి తన ఐదు నవలల్లోనూ విభిన్న కోణాలలో వ్యక్తీకరించారు. హైదరాబాద్ లోని ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాలలో ఆంగ్ల ఉపన్యాసకులుగా ముప్ఫైయేళ్ళపాటు బోధించి ఉద్యోగ విరమణ చేశారు. వృత్తిరీత్యా ఆంగ్లోపన్యాసకులే గానీ, ప్రవృత్తి రీత్యా తెలుగు సాహితీ సేవకుడు మరియు అనువాదకుడు కూడాను. పురాణేతిహాసాలను తన ఊపిరిగా చేసుకున్న ఈ ఆంగ్ల భాషాధ్యాపకుడు, ప్రవృత్తి గా రచించిన ఐదు నవలలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ‘‘స్త్రీ గొప్పతనాన్ని’’ ఆస్వాదించగలము.
“కాకాని చక్రపాణి” యొక్క రచనా పటిష్టతను, సౌరభాన్ని మొదటగా గుర్తించి ప్రోత్సహించిన వారి సహాధ్యాయుడు డాక్టరు డి . చంద్రశేఖర్ రెడ్డి, సహ రచయిత గోవింద రాజు చక్రధర్ రావు, పి. స్. నారాయణ లు లాంటి ఆధునిక రచయితలు మనమధ్యనుండటం ముదావహమైన విషయం. ఎంతో ప్రతిష్టాత్మకమైన “ఎమెస్కో ప్రచురణ సంస్థ” కాకాని చక్రపాణి 11 నవలలను ప్రచురించి తెలుగు పాఠక లోకానికి అందించడం కాకాని చక్రపాణి గొప్పతనానికి తార్కాణం.
2. ఆదర్శ మహిళ [సుజాత పాత్ర ] :
1992 - 93 ఆంధ్రప్రభ, వార్తపత్రికలో ధారావాహికంగా వెలువడి పాఠకులలో ఆలోచనలు రేకెత్తించిన నవల ‘‘గోరంత దీపం’’. “భార్య సహధర్మచారిణే కానీ బానిస కాదు! అన్న సంపూర్ణ వక్తిత్వం గల మహిళ సుజాత”. సాటి స్త్రీకి తన భర్త వలన కలిగిన అన్యాయాన్ని సరిదిద్దే క్రమంలో తన వైవాహిక జీవితాన్ని కూడా త్యాగం చేసిన ఆదర్శ మహిళ సుజాత. “‘పనిమనిషి లచ్చిమిని లక్ష్మీగా’’ మార్చే క్రమంలో ఒక మహిళ స్వావలంబన పథకాలను ఎలా ఆలంబన చేసుకోవచ్చో ‘‘గోరంత దీపం’’ నవలలో సుజాత పాత్ర ద్వారా రచయిత కాకాని చక్రపాణి చక్కగా వివరించారు. ఈ నవల చదివిన తరువాత ‘‘స్త్రీ కి స్త్రీ యే మిత్రువు కాకపోతే ఎలా, కాపాడేది ఎవరు?"
రచయితే ముందు మాటలో స్వయంగా పేర్కొన్నట్లు .. ”గోరంతదీపం’’ నిండా కొండంత వివాదం కూడా ఉంది. అసలు ఇలా జరుగుతుందా! అనేది వదిలేసి, జరిగితే... అనే కోణం నుంచి చూడటం ప్రారంభిస్తే ఈ నవలిక ఓ జయింట్ వీల్ ఎక్కిన అనుభూతి కలిగిస్తుంది. ముక్కూమొగం తెలియని నిరుపేద, నిరక్షరాయసి అయిన లచ్చిమిని తన భర్త మోసం చేశాడని, కావున తానైనా ఆమెకు సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో,తన సాంసారిక జీవితాన్ని కాలదన్నుకున్న సుజాత లాంటి మహిళలను కేవలం నవాలల్లోనే చదవగలము. నిజ జీవితంలో చూడలేము.
3. సహనశీలి [రంగనాయకమ్మ పాత్ర]:
1994 'చతుర'లో వెలువడింది ‘‘నూరు శిశిరాలు’’ నవల. విశిష్టాద్వైతం మత ప్రాశస్త్యము మరియు సాంప్రదాయవిద్య, ఆంగ్లవిద్యకూ గల బేధమును గూర్చి చర్చించిన అంశములను ఈ నవలలో చదవగలము. విశిష్టాద్వైత మతసిద్ధాంత ప్రాధాన్యతను వివరించే భాగవతోత్తముడు కృష్ణమాచార్యులు సాంప్రదాయవిద్యను దిస్తుంటాడు. తన గారాలపట్టి రంగనాయకిని నరసింహాచార్యులుకి ఇచ్చి బాల్యవివాహం జరిపిస్తాడు. అప్పటి నుండి రంగనాయకమ్మ పడే సంసారం బాధలను హృదయం కదిలేటట్లుగా అక్షరీకరించాడు రచయిత కాకాని చక్రపాణి. ‘‘నూరు శిశిరాలు’’ నవల చదివిన తర్వాత రంగనాయకమ్మ సుదీర్ఘ సంసార జీవితంలో నూరు శిశిరాలున్నాయే గానీ, ఒక్క శరత్ కూడా లేకపోయెనే అంటూ మూగగా రోదిస్తారు సగటు పాఠకుడు.
రంగనాయకి కృష్ణమాచార్యుల గారాలపట్టి తొమ్మిదేళ్ల వయస్సులోనే ఉగ్రనరసింహాచార్యులకు భార్యగా మారింది. అది మొదలు చివరి క్షణాల వరకు ఆమె జీవితమంతా కష్టాల మయమే. ‘ఆమె సమగ్ర జీవన గమనమే ఈ నూరుశిశిరాలు కథావస్తువు’. ఒక కుమార్తెగా, ఒక ఇల్లాలుగా, ఓ తల్లిగా, ఓ అత్తగారిగా, ఓ బామ్మగా మరీ ముఖ్యంగా ‘మానవత్వాన్ని వర్షించే మనీషిగా’ ఆమె ప్రదర్శించిన వ్యక్తిత్వమే సుసంస్కత వైభవమే ఈ నవల.
ఒక కుమార్తెగా తప్ప ఆమె మరే పాత్రలోనూ సుఖించలేదు. పాత్ర ఏదైనా సరే కష్టాలే! కర్కశక్లేశాలే!మరీ బామ్మ పాత్రలో ఓ అవ్యక్త మధురమైన ఆవేదనను మౌనంగా అనుభవించిన పాత్ర ఆమె ది!! తిని తినక పిల్లల్ని పెంచుకుంటే, ప్రయోజకుల్ని చేసుకుంటే, కోడళ్లను తెచ్చుకుంటే ఆమె శ్రమకు ఆమె త్యాగానికీ మిగిలింది ఆక్రోశమే! ఆవేదనే!
రంగనాయకమ్మకు కష్టాలు కోడళ్ల రూపంలో ఎదురయ్యాయి. వయస్సుకు గూడా గౌరవం ఇవ్వకుండా సూటి పోటీ మాటలతో, అమర్యాదగా ప్రవర్తించారు నలుగురు కోడళ్ళు. తల్లిని వృద్ధాప్యంలో పోషించడానికి నలుగురు కొడుకులు నెలకొక్కరు చొప్పున పంచుకొనుట రంగనాయకమ్మ మరొక ప్రారబ్ధం.
న ఉదర పోషణకై కొడుకు కోడళ్ళు మధ్య పోట్లాట, తాను నెలకొక్కసారి ఇంటికి వెళ్ళాల్సి రావడం తనపై తనకే అసహ్యం కలిగింది. భగవంతుడా ఏమిటి నాకీ జీవితం
అంటూ ఆక్రోశించే రోజుల్లో, శ్రీ కృష్ణుడు ఆమె మొర ఆలకించాడే మో! అన్నట్లుగా ఆమె చివరి కొడుకు కోడళ్ళకు కలిగిన సంతానం నందకిశోరుడి సంరక్షణా భారం కొరకు ఆమెను తమ ఇంట్లోనే ఉంచేసుకున్నారు. వారిద్దరూ ఉద్యోగులే మరి తప్పని పరిస్థితి.
అలా రంగనాయకమ్మ చివరి సంవత్సరాల్లో, మనుమడు నందకిషోర్ తో గడిపిన జీవితం హృద్యమైనది. ఆనందభరితమైనది. ఈ జీవితాన్ని ఆమె బాల్య జీవితం ఒక్కటేనన్నట్లుగా భావించింది. రంగనాయకమ్మ తన మనవడిలో ‘బాలకృష్ణుని’ దర్శించుకుంది.
అంతకుముందు ఎక్కే గడపా ; దిగే గడపా ; అయిన తన బతుక్కి ఇంత స్థిరత్వం కలిగించిన నందకిశోరుడంటే రంగనాయకమ్మకు ప్రాణం. ఆ బాలకృష్ణుడే తన్నుద్ధరించడానికి ఆ ఇంట్లో అవతరించినట్లు గా ఆమె భావించేది. పిల్లవాడి పనంతా రంగనాయకమ్మ చూసుకొనేది. పొద్దున్నే నీళ్లు పోసి పడుకోపెట్టేది. తన చిన్నికాళ్ళూ చేతులూ కదిలిస్తూ, బోసి నోటితో వాడు ఆమె వంక చూసి నవ్వితే ఆమె హృదయం పరవశించిపోయేది.
‘‘కరవనిందానే పదారవిందాం
ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయనం
బాలం ముకుందం మనసాస్మరామి’’.1 (నూరు శిశిరాలు, పు: 277) అని స్మరించుకునేది ఆమె.
నందుడికి పాకటం.. తొట్రుపాటు నడక వచ్చేంత వరకు ఆమెకసలు తీరిక లేకుండా చేసాడు వాడు. ఏ వస్తువు కింద ఉండనిచ్చేవాడు కాదు. తడబడు అడుగులతో నడుస్తుంటే.....
‘‘కింకిణి కిణికిణి రభసై రంగణ
భువిరింగణై: సదాటంతం
కంకణ కుణు కుణు పద యుగళం
కర భూషణం హరిం వందే’’. 2 (నూరు శిశిరాలు, పు: 280)
కృష్ణుడి కే కష్టాలు తప్ప లేదు.ఇక రంగనాయకమ్మ ఎంత ? ఒకరోజు చిన్నకోడులు తన కొడుకును అదే నందకిశోరుడిని మరింత మెరుగైన శిక్షణ. విద్య కొరకు నాగార్జున సాగర్ లోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పిస్తున్నానని చెప్పింది.
ఆ నిర్ణయంతో రంగనాయకమ్మ వణికి పోయింది. నందుడితో వచ్చిన స్థానం నందుడు ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో తనూ వెళ్ళిపోవాలని ఆమెకు అర్థమైంది. తన్నింకో ఇంటి కి పంపిస్తారు. ఎక్కడైతేనేం తన జీవితం గడపడానికి!
చెప్పలేక, చెప్పలేక చెప్పసాగాడు రంగనాధం. మేము అన్నదమ్ములం ముగ్గురమూ కలిసి మాట్లాడుకున్నాం, నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాలని’ అంటూ అమ్మ రంగనాయకమ్మ కి చెప్పాడు.
‘‘సరే నాయనా! అట్లాగే చేర్పించు’’ అని పక్కకు తిరిగి పడుకొని ఉండిపోయింది రంగనాయకమ్మ. మర్నాటికల్లా రంగనాయకమ్మకు ఒళ్ళు తెలియనంత జ్వరం వచ్చింది. అపస్మారకంలోకి వెళ్ళిన రంగనాయకమ్మ వైకుంఠానికి చేరుకుంది.
‘‘పశ్యమే శరద: శతకం, జీవమే శరద: శతం, శృణుయామ శరద: శతం’’ అని ఆశ గొల్పి తీసుకొచ్చినవాడు అర్ధాంతరంగానే పోయాడు. బతికున్నప్పుడు బతుకులో తీపి ఆమెకి తెలిసేట్టు మనలేదు అతడు (నంద కిషోరుడు). ‘‘ఆమె చవిచూసింది నూరు శరత్తుల జీవితం కాదు ! నూరు శిశిరాల ఒద్దికల బతుకు !’’ (నూరు శిశిరాలు పు. 287 - రచయిత అభిప్రాయం)
తండ్రి చాటు, భర్త నీడన సంతానం ఆదరణలో తన జీవనాన్ని సాగించే సగటు మహిళ పాత్రగా “రంగనాయకమ్మ” ను మనం ఈ నవాలలో చదివాము. తండ్రి చాటు బిడ్డ గా ఎదిగిన తొమ్మిది సంవత్సరాల బాల్య జీవితంలో మాత్రమే ఆనందాన్ని చవిచూసిన రంగనాయకమ్మ, మిగిలిన భార్య జీవితం, తల్లి మరియు అత్త పాత్రలలో తన చివరి శ్వాస వరకు కష్టనష్టాలను, అవమానాలను ఉచ్చ్వాసనిశ్వాసాలుగా మార్చుకుంది. అయనాసరే ఎవ్వరి మీదా తన ఆవేశాన్ని కోపాన్ని ప్రదర్శించలేదు అందుకనే “రంగనాయకమ్మ కు సహనశీలి” అన్న గుణాన్ని ఆపాదించదమైనది.
4. మనోవిశ్లేషణాత్మక నవల [సుధావల్లి] :
2000 వ సంవత్సరంలో ఆంధ్ర భూమి మాసపత్రికలో ‘‘నువ్వు నా కొద్దు’’ నవల ప్రచురితమైంది. ఒక స్త్రీ కి ఒక పురుషునికీ మధ్య దాంపత్య బంధం ఉన్నా ఆకర్షణ ఎందుకు కలగదో విశ్లేషించి చూపే ప్రయత్నం చేశాడు చక్రపాణి. ఇదో చక్కటి ‘మనోవిశ్లేషణాత్మక నవల’. ఈ నవలలో జరిగింది ఓ పురుషుడు ఓ స్త్రీ మధ్య జరిగిన పోరాటం కాదు. రెండు మనస్తత్వాల మధ్య జరిగినది. ఇదొక చక్కని ‘మనోవిశ్లేషణాత్మక నవల’.
‘‘నువ్వు నా కొద్దు’’ నవలలో పరమేశ్వరం సుధావల్లి భార్యాభర్తలు. వివాహమైన రెండో రోజు నుండే తన భార్య కు దూరంగా ఉంటున్నాడు భర్త. కారణం తన మేనత్త కూతురైన సుధావల్లిని చిన్నప్పటి నుండి తన చేతుల మీదుగా పెంచాడు.
ఉమ్మడి కుటుంబ ప్రయోజనాల రీత్యా కుటుంబపెద్దైన తన పెదనాన్న బలవంతం పై ఆమెనే వివాహమాడాల్సి వచ్చింది. తన చేతులపై నడయాడిన పరమేశ్వరానికి మధురోహలేమీ కలుగలేదు. తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పలేకపోయాడు. దాంతో పెద్దల బలవంతంపై అయిష్ఠంగానే సుధావల్లిని వివాహం చేసుకున్న పరమేశ్వరం ఇంటి నుండి పారిపోయాడు.
పెద్దల సలహా సూచనల మేరకు సుధావల్లి తన మేనమామ మరియు భర్త అయిన పరమేశ్వరాన్ని వెదుక్కుంటూ వచ్చి అతను పని చేస్తూ ఉన్న డిగ్రీ కళాశాల మరియు ఇంట్లో కి అతని అభీష్ఠానికి వ్యతిరేకంగా ప్రవేశించడంతో నవల ప్రారంభమౌతుంది.
సుధావల్లి అతను పని చేసే కళాశాలలో పరమేశ్వరం అర్ధాంగినని పరిచయం చేసుకొని వారి నైతిక మద్దత్తు పొందడం.. తనకు అభీష్ఠంగా ఇంటిని ‘ఆక్రమించడం’,తనను అస్వతంత్రుణ్ణి చేసాయని భావించిన పరమేశ్వరం వెంటనే ఆమె తిరుగు ప్రయాణానికి ఖర్చులు ఇచ్చి, తన స్నేహితునితో విజయవాడ కు పారిపోయే క్రమంలో ఆస్పత్రి పాలు కావడం... మనసా,, వాచా,, కర్మేణా,, ఏడడుగులు నడిచిన భర్తచే తిరస్కరింపబడి తనువు చాలించేందుంకు సిద్ధపడిన సుధావల్లికి స్నేహితుని ద్వారా భర్త స్థితి తెలియడంతో అనాలోచితంగానే భర్త వద్దకు చేరి సపర్యలు చేస్తుంది సుధావల్లి. ఈ సందర్భంలోనే.. ‘‘మనం ఒక మనిషిని ఎందుకు ప్రేమిస్తాం లేదా మనం ఓ మనిషిని ఎందుకు ప్రేమించలేమో చెప్పు అన్న సుధావల్లి ప్రశ్నకు పరమేశ్వరం సమాధానం చెప్పలేకపోవడంతో ‘‘సాన్నిహిత్యం వల్ల ప్రేమ జన్మిస్తుంది...’’ అంటూ ప్రేమలోని ద్వంద్వాతీతాలను.. దైవీ భావాన్ని విశదపరిచింది.
పరమేశ్వరం పెళ్ళిచేసుకుంది మొదలు ఆమె నుండి పారిపోతూనే వచ్చాడు. ఇప్పుడూ అదే ప్రయత్నం చేశాడు ఆ విషయం అతనికీ తెలుసు. సుధావల్లి ప్రశ్నించింది సైతం దీనినే.. ఇదే మాటను సైకాలజిస్టు ఇలా చెప్పాడు ‘‘హానికరమైన ప్రతి కాంటాక్ట్ నుండి జీవి విడుదల పొందాలని ప్రయత్నిస్తుంది.
అది ‘‘సహజాతం - ఇంస్టింక్ట్’’. చాలా సింపుల్ అనిపించే ప్రవర్తన రూపాల ద్వారా ఓ రకమైన స్వేచ్ఛను పొందాలని జీవి ప్రయత్నిస్తుంది. వీటినే ‘‘రిఫ్లెక్సివ్’’ అంటాం. మనిషి ప్రవర్తనకు ఒక కారణం ఉండదు. భిన్న కారణాలు ఉంటాయి. కొన్ని వ్యక్తికి తెలుస్తాయి. కొన్ని అంత: చేతనలో సుషుప్తంగా ఉంటాయి’’.
చివరికి తన మేనకోడలూ మరియు భార్య సుధావల్లిని ప్రేమతో అనురాగంతో పరమేశ్వరం దగ్గరకు తీసుకుంటాడు.
విద్ద్యాధికుడైన తన బావ పరమేశ్వరం చేత తిరస్కరణకు గురైన మేనకోడలు సుధావల్లి, ఓర్పు తో నేర్పు తో మరియు భూదేవంత సహనంతో పరమేశ్వరానికి భార్యగా దగ్గర కావడం ఒక గడుసరి మహిళ విజయంగా అర్ధం చేసుకోవచ్చును.
5. నిప్పుకు చెద [మృదుల పాత్ర]:
2001 సంవత్సరంలో ధారావాహికంగా ‘ఆంధ్రప్రభ’ వారపత్రిక లో వెలువడింది ‘నిప్పు’ నవల. దివ్య, తపతి, మృదుల ప్రధాన పాత్రలు. ‘‘శీలము అనగా నేమి? అది ఎవరికి చెందింది? స్త్రీలకా? పురుషులకా? శీలం శరీర సంబంధమా? లేక మానసిక భావనా? అనే సార్వజనీన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చే ప్రయత్నం చేసినప్పటికినీ చివరకు దానిని ‘శేషప్రశ్న’గానే మిగులుస్తాడు రచయిత. అలాగే, తమను తాము స్త్రీ వాదులుగా వీరావేశంతో ఊగిపోయే స్త్రీల అనైతిక ప్రవర్తనను దివ్య పాత్ర ద్వారా పాఠకులకు ఆవిష్కరించాడు. ఎంచుకున్న కథాంశానికి అనుగుణంగా ఈ నవలను ‘‘ఉత్తమ పురుష’’ లో చర్చించాడు. సగటు భారతనారి నైతిక నియమావళిని గూర్చి చర్చను, ఒక స్నేహితురాలు మరియు కథకుడు మధ్య నడుపుతాడు. స్త్రీ వాదుల ఆలోచనా సరళిని గూడా ప్రస్తావిస్తాడు. దివ్య, తపతి పాత్రల ద్వారా ‘శీలం’ను ప్రధానంగా ప్రస్తావవింప చేసి, చివరకు ‘నిప్పు’కు చెదలు పట్టదన్నంత అసత్య నానుడి తెలుగు భాషలో తప్ప మరెక్కడా చదవలేము అంటూ నవలను ముగించాడు రచయిత.
‘ఉత్తమపురుష కథనం’లో సాగిన ఈ నవలలో మూడు ముఖ్యమైన స్త్రీ పాత్రలు కలవు. తపతి, దివ్య లిరువురూ వదినా మరదళ్లు. దివ్య అవివాహితురాలు, ఉద్యోగి. తపతి, మృదుల లిరువురూ స్నేహితురాళ్లు, గృహిణులు.
తపతి గృహిణి. సగటు భారతీయ స్త్రీ. నరనరాన సంస్కృతి సాంప్రదాయం జీర్ణించుకొని ఉంటుంది. సాంప్రదాయపు వివాహాలను ఇష్ఠపడుతారు. భర్తతోడిదే లోకంగా భావిస్తుంది భారత గృహణి. దురదృష్టవశాత్తు ఎక్కడైనా చిన్న పొరపాట్లు చేస్తే, తనను తాను సక్రమ మార్గంలోకి మళ్ళించుకుంటుంది. తపతి కూడా ఇలాంటిదే. కథకుడు ఇలా అంటాడు.. ఎందుకొచ్చిన శీలం? మనసొకరితో, తనువొకరితో పంచుకోవడం తప్పు కదా? అలాకాక, తనను ఎంతగానో ఆకర్షించిన, ఇష్ఠపడిన ప్రభుతో శయ్యాసుఖం పొందివుంటే ఇరువురూ ఆనందించేవారు గదా! ప్రభూ హైదరాబాదులో ఉన్న ముప్పై రోజులు ఇరువురూ శృంగారానుభవం పొందివుండవచ్చు. ఆ అనుభూతితో ఎవరికి వారు విడిపోయి తమ తమ జీవితాలను హాయిగా కొనసాగించుకొని ఉండవచ్చు. ఇంతోటిదానికి భర్తను విడిచిపెట్టడమెందుకు? ఆ ఫలితమే కదా సేతు మాధవన్ మృత్యువు అంచుకు చేరుకున్నది అంటూ తపతిని తప్పు పట్టాడు కథకుడు.
వెంటనే మృదుల కథకుని అభిప్రాయాన్ని ఖండించింది. ‘శీలం పోయాక జన్మ ఎందుకు? స్త్రీకి శీలమే ప్రాణం. తపతి సంగతి నాకు బాగా తెలుసు. సాంప్రదాయానికి, భర్త నమ్మకానికి విలువనిచ్చింది. కాబట్టే ప్రభును హద్దుల్లో ఉంచింది. ప్రభుతో పంచుకున్న ప్రతీ క్షణాన్నీ, సంఘటననూ నాతో సవివరంగా చెప్పేది తపతి. తపతి నైతికంగా దిగజారలేదు అంటూ కథకుడికి ఘాటుగా బదులిస్తూ తపతి గొప్పతనాన్ని చెప్పింది మృదుల. కథకునికి 'పఠాభి పంచాంగం’ లోని పదం గుర్తుకొచ్చి ఇలా వివరించాడు మృదులకు..
"చాలా మంది నీతిమంతులుగా ఉండటం
చాలినంత ధైర్యం లేకపోబట్టి
అవినీతికి అతి సాహసం కావాలి’’3 (నిప్పు - పు : 254)
"స్వార్ధంతో వ్యవహరించే స్త్రీ కంటే నీతి తప్పి చరించే ఆడదాన్నే నేను ప్రశంసిస్తాను. జారిణి అయినా ఫర్లేదు. బుద్ధి లేనిది అవ్వకుంటే చాలు’’4 అన్నాడు కథకుడు. (నిప్పు - పు : 254)
“ఉత్తమపురుష” లో వ్రాయటమే ఈ నవల విజయానికి ఒక కారణం రచయిత అభిప్రాయం పై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు ముఖ్యంగా స్త్రీ వాదుల నుండి వ్యతిరేకత రావొచ్చు అయనాసరే తెలుగు లోని “నిప్పుకు చేద పట్టదు” అన్న తెలుగు సామెతను, ఒక మహిళ యొక్క లైంగిక స్వేచ్చ కు ముడి పెట్టడం ఈ నవల ప్రత్యేకతగా భావించవచ్చును.
6. హేతువాది[అనసూయమ్మ పాత్ర]:
1980-90 ల మధ్య తెలంగాణ రాష్ట్రంలోని మూఢనమ్మకాలకు బలైపోయే అభాగ్యురాళ్ళ జీవితాలను దినపత్రికల వార్తలాధారంగా చేసుకొని ‘శీలపరీక్ష’ నవలను చిత్రించాడు.
నిమ్నకులాల్లోని నిరక్ష్యరాస్యులు ఆచరించే మూఢనమ్మకాలను గూర్చి చర్చిస్తూ వ్రాయబడ్డదీ నవల. పురుషాహంకారంతో శీలం స్త్రీలకే పరిమితం చేసి, 'కాలుతున్న నిప్పు కొర్రులు’ పట్టుకోవడమనే దానిలోని అశాస్త్రీయతను వివరంచాడీ నవలలో. 'శీలపరీక్ష' కేవలం స్త్రీలకే కాదనీ పురుషులు కూడా ఆచరించాలనీ తెలిపే అగ్రవర్ణీకులైన అనసూయమ్మ, ఎర్రంనాయుడు పాత్రల ద్వారా ‘శీలపరీక్ష’ నవలలో తెలియజేశాడు రచయిత కాకాని. తెలంగాణ భౌగోళిక ప్రాంతం1920-2000 కాలవ్యవధిని ఎంచుకున్న నవల ఇది.
2008లో ఫిబ్రవరి ‘చతుర’ మాసపత్రికలో ప్రోత్సాహక బహుమతితో ప్రచురించబడింది. నవలలోని కథా కాలం 1925 - 2008 కాలం నాటిది.
భూస్వామ్య వ్యవస్థ మాటున దాష్టీకాలకు, వ్యతిరేకంగా ఏర్పడిన కమ్యూనిస్టు పోరాటాలు, నిజాం రాజుల దౌర్జన్యాలను చిత్రిస్తూనే, స్వాతంత్య్ర పోరాటం, స్వతంత్య్ర సిద్ధి తద్వారా ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలన, ఓటు ప్రాధాన్యతలో కులాల హీనత కనుమరుగైపోయిన తీరును వరుస క్రమంలో 1920వ దశకం నుండి 2008 సంవత్సరము వరకూ జరిగిన అంశాలను కాలచక్రంలో చదవగలము.
ఈ నవలలో అనేకమైన పురుష స్త్రీ పాత్రలు గలవు. కానీ నవలా శీర్షిక అయిన ‘శీలపరీక్ష’ కు తగ్గట్టు ప్రధానమైనవి అనసూయమ్మ, మరియమ్మ, రేణుకలు స్త్రీ పాత్రలు. కాగా, విజయరామారావు, ఎర్రంనాయుడు, నారాయణరావు, దేవదానం లు తమ తమ కులాల మతాలకు ప్రతినిధులుగా వారి పోకడలను చదవగలము. ‘శీలపరీక్ష’ శీర్షికకు తగినట్లుగానే 'శీలం’ కేవలం స్త్రీకి మాత్రమే పరిమితమా? అనే మీమాంసతో ప్రారంభమై, మగవాని అభిజాత్య ప్రవర్తనల కారణాన స్త్రీలు ఎలా సమిధిలుగా మారిపోతున్నారో అగ్రవర్ణీకురాలైన అనసూయమ్మ, నిమ్నకులస్థురాలైన రేణుక పాత్రలుగా ‘శీలం’ స్త్రీకి మాత్రమే ఆభరణంగా, పురుషులు చిత్రించిన విధానాన్ని చూడగలం.
అలాగే, అనసూయమ్మ భర్త ఎర్రంనాయుడులోని పోరాట చైతన్య భావపరం పరల కారణాన తన భార్యకు లేని దాంపత్య జీవనం, తనకు మాత్రం ఎందుకు? అనే భావనతో జీవితాంతం బ్రహ్మచారిగానే తన జీవితాన్ని చాలించాడు. మరి ‘శీలం’ పురుషునికి కూడా ప్రామాణికమైనదేనన్న విషయాన్ని ఎర్రంనాయుడు పాత్ర ద్వారా రచయిత తెలియజేస్తాడు.
మొగుడు అనే బొమ్మతో తాళి కట్టించుకున్న బాలిక అనసూయకు ఆ క్షణాన తెలవదు తన జీవితం తండ్రి, భర్తల అహంభావానికి గురై ఫలించకనే మోడుబారి పోతుందని. తనున్న ‘జమీ’లో తాను పంజరంలోని చిలకలా మారిపోయానని తెలుసుకునేప్పటికీ తన జీవితం, అహంతో కూడిన కులం, సాంప్రదాయపు చెరలో చిక్కుకుపోయిందని ఆలస్యంగా తెలుసుకొని చింతించడం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయురాలిగా తన యవ్వన జీవితాన్ని చివరివరకూ మోడువార్చుకుంది.
ఇక, సామాజికంగానూ, ఆర్ధికంగానూ నిమ్నకులస్థురాలైన రేణుక, వయస్సు ఆకర్షణతో ఒకసారి, భర్త దౌష్ఠ్యానికి మరొక సారి తన జీవితాన్ని కడగండ్ల పాలు చేసుకుంది. తాగుబోతు, తిరుగుబోతు అయిన భర్త నారాయణ దుర్మార్గపు ప్రవర్తనకు సమిధిగా మారేందుకు, తన కులపు కట్టుబాట్లు కూడా తోడవ్వడంతో సాటి కులస్థులు, బంధువుల సమక్షంలో, 'ఎల్లమ్మ’ సాక్షిగా ఎర్రగా కాలే కొర్రులను చేతబూని తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటే గాని తాను శీలవతినన్న విషయాన్ని ఋజువు పరచుకునే సందర్భాన్ని, పాఠకుల హృదయాలను కదలించే విధంగా అక్షరీకరించాడు రచయిత కాకాని.
అదృష్టవశాత్తు, ప్రకృతి కరుణతో అకాల వర్షం పడటంతో ఎర్రటి కొర్రులు కాస్త చల్లబడటంతో,అప్పటివరకు వినోదార్ధులైన సాటి కులస్థులు, బంధువులు రేణుకను శీలవతిగా నిర్ధారించారు. బహుశా కుల దేవత కరుణాకటాక్షమేమో! వెంటనే దుర్మార్గుడైన నారాయణకు కూడా శీలపరీక్ష నిర్వహించాల్సిందేననే ఆలోచన ఆ సమూహానికి రావడం, వారి ఆలోచనను ముందుగానే పసిగట్టిన నారాయణ భయంతో పారిపోవడంతో ‘శీలపరీక్ష’ నిలిచిపోయింది.
అంటే "శీలపరీక్ష" కేవలం స్త్రీలకు మాత్రమే కాదని, పురుషులకు కూడా వర్తిస్తుందని ఎవరికి వారే, తమ తమ అంతరాత్మలకు జవాబుదారీతనం వహించడమే నిజమైన శీలపరీక్ష అంటూ రచయిత కాకాని చక్రపాణి స్పష్టీకరించాడు.
పత్రికలో వచ్చిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రచయిత తన ఊహకు నవలా రూపాన్నిచ్చాడు. ఇందులో భౌగోళిక పరిమితి (తెలంగాణ), నక్సల్స్ పోరాటాన్ని, కులాల పుట్టుకను, ఆధిక్యతను ; పురుష అహం భావాన్ని అక్షరీకరించే క్రమంలో, లైంగిక స్వేచ్చ లేని సగటు మహిళ అణచివేతకు గురయ్యే తీరును అనసూయమ్మ, రేణుక పాత్ర ల ద్వారా చదవగలం అంతేగాక, కుగ్రామాలలోని దళిత వర్గ ప్రజలలోని మూఢాచారాలను పరిష్కరించే క్రమంలో, తన తెలివితేటలను ప్రకృతికి అనుగుణంగా మలుచుకొని విజయం సాధించిన “అనసూయమ్మ” పాత్రలో హేతువాదిని అర్ధం చేసుకోగలము.
7. ముగింపు:
ఎమెస్కో వారు కాకాని చక్రపాణి నవలలను గుర్తించి ముద్రించి పాఠకలోకానికి అందించారు. 5 నవలల్లోనూ 5 విభిన్న అంశాలను చర్చించాడు. వేర్వేరు నేపధ్యాలు విభిన్నమైన పాత్రలతో నడిచిన ఈ 5 నవలల్లోనూ శైలి విభిన్నమైంది.
పైన పేర్కొన్న విశేషించిన 5 నవలల్లోనూ రచయిత కాకాని చక్రపాణి తన కలం నుండి వెలువడ్డ మహిళను క్రింది విధంగా విభజించి విశ్లేషించడం నేటి మహిళా లోకానికి ఎంతో నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది.
‘‘వేగుచుక్క’’, "ఏడడుగులు’’, "అగ్నితీర్ధం’’ అనే మూడు నవలల్లోనూ మహిళా సాధికారితను, ఆత్మవిశ్వాసాన్ని, పోరాట స్ఫూర్తిని.. విపులంగా వివరించడం జరిగింది. స్థలాభావం రీత్యా సంబంధిత మహిళా పాత్రల తీరుతెన్నులను వివరించలేకపోతున్నాను.
‘‘సంస్కార పూరిత ధిక్కారము ఉండే స్త్రీ పాత్ర చిత్రణ ఇతని నవలల్లో కనిపిస్తుంది’’. కాకాని విరచిత నవలల్లోని మహిళల్లో.... త్యాగం, క్షమ, సహనం, ఆదర్శం, ధర్మం, ధిక్కారం, ప్రతీకారం, హేతువాదం వంటి స్త్రీ వాద దృక్పథాలను పరిశీలించగలము.
8. పాదసూచికలు:
- నూరు శిశిరాలు. పు. 277
- నూరు శిశిరాలు పు. 280
- నూరు శిశిరాలు పు. 287
- నిప్పు పు. 254
- నిప్పు పు. 254
9. ఉపయుక్తగ్రంథసూచి:
- గోరంతదీపం (1992) - ఎమెస్కో ప్రచురణ సంస్థ - విజయవాడ.
- నూరు శిశిరాలు (1994) - ఎమెస్కో ప్రచురణ సంస్థ - విజయవాడ.
- నువ్వు నాకొద్దు (2000) - ఎమెస్కో ప్రచురణ సంస్థ - విజయవాడ.
- నిప్పు (2001) - ఎమెస్కో ప్రచురణ సంస్థ - విజయవాడ.
- శీలపరీక్ష (2008) - ఎమెస్కో ప్రచురణ సంస్థ - విజయవాడ.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.