headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. 'మనిషి' కథలో పాత్రలు: మనస్తత్త్వవిశ్లేషణ

వి. పద్మ

తెలుగు ఉపాధ్యాయురాలు,
జెడ్పి బాలికల ఉన్నత పాఠశాల,
వినుకొండ, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
సెల్: +91 9866623380, Email: vodithepadma@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

"శిల్పం, భాష కథారచనకు మూల పరికరాలు. ముడి పదార్థం జీవితం." అంటారు కొడవటిగంటి కుటుంబరావు.1" కథకి గొప్పదనం పట్టాలంటే కథ చిత్రించే జీవితం భూమి నుంచి పైకి లేవాలి " అన్నారు చలం. కథను, జీవితాన్ని విడదీసి చూడలేం. జీవితానుభవం నుంచే ఎన్నో గొప్ప కథలు పుడతాయి. జీవితానుభవం నుంచి పుట్టే కథల్లో ప్రాణమున్న కథలు చిరస్థాయిగా నిలచిపోతాయి. "మనిషి" కథలో కూడా ప్రాణముంది. అందుకే 42 ఏళ్ళు గడిచినప్పటికీ ఈ కథ నూతనంగా ఉంటుంది. అందులోని పాత్రలు కథ కోసం సృష్టించిన పాత్రలుగా అనిపించవు. సమాజంలో ఎప్పటికీ ఉండే అభాగ్యుల జీవితాల్లా కనిపిస్తాయి. మనిషి కథను సయ్యద్ సలీం తన 21వ ఏట రచించారు. 1981 సెప్టెంబర్ 10న ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో అచ్చయింది. మనిషి కథలోని పాత్రలు, వారి జీవిత నేపథ్యాలు, మానసిక పరిస్థితి గురించి విశ్లేషణ చేయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

Keywords: కథ, పాత్రలు, విశ్లేషణ, మనస్తత్వం, నేపథ్యం

1. ఉపోద్ఘాతం:

మంచి కథల్లో నుంచి గొప్ప కథలను విడదీయడం చాలా కష్టం. కథా రచయితలు రాసేవన్నీ మంచి కథలే. అందులో నుంచి రెండో, మూడో గొప్ప కథలుగా పాఠకుల హృదయాల్లో నిలిచిపోతాయి. "కొన్ని కథల్లో పాత్రలు ప్రాణంతో నడిచి వస్తాయి. స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. పాఠకుడు పాత్రల సమాజంలోకి వెళ్లిపోతాడు. పాత్రలతో కలిసి నవ్వుతాడు. ఏడుస్తాడు, పోరాడతాడు, ఓదారుస్తాడు, వెరసి జీవిస్తాడు. కథ చదవడం పూర్తికాగానే అప్పటిదాకా తనతో మాట్లాడిన వారేమైపోయారా అని వెతుక్కుంటాడు. తీయని అనుభవాన్ని పొందేందుకు మరలా మరలా సంసిద్ధుడు అవుతాడు. కథ చివరి పేజీ నుండి మొదటి పేజీకి వచ్చేస్తాడు. కథలోని పాత్రలు రచయిత సృజన అన్న స్పృహ పాఠకుడికి ఉండదు." అని గొప్ప కథ గురించి వివరిస్తాడు వి. కాంతారావు.3 ఇలాంటి కోవలోనే పాఠకున్ని వెంటాడే గొప్ప కథ "మనిషి". కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సయ్యద్ సలీం రచించిన కథ మనిషి. సాహిత్య ప్రపంచంలో కథా, నవలా రచయితగా సలీం గుర్తింపు పొందారు. సలీం రాసిన మూడు వందల పైచిలుకు కథల నుంచి గొప్ప కథల జాబితాలో చేర్చదగ్గర కథ మనిషి.

2. రచయిత పరిచయం :

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి అతి సమీపంలో ఉండే త్రోవగుంట అనే గ్రామంలో 1959 జూన్ 1న సయ్యద్ సలీం జన్మించారు. తల్లి అన్వర్ బీ, తండ్రి జాఫర్. మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండే సలీం, కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల నుంచి బీఎస్సీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఆ తరువాత ఐ.ఆర్.యస్. అధికారిగా ఎంపికైయ్యారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. సాహిత్యం పట్ల మక్కువతో ఇంటర్ చదివే రోజుల్లోనే "సమరభారతి" అనే సాహిత్య సంస్థకు కార్యదర్శిగా పనిచేశారు. సలీం రాసిన సుమారు 150 కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఇప్పటి వరకు 300 కథలు రాశారు. వీటిలో ఎక్కువగా మానవత్వాన్ని గుర్తుచేసే కథలు, మంచితనాన్ని తట్టి లేపే కథలే ఎక్కువ. సలీంకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది ఆయన రచించిన నవలలే. సలీం ఇప్పటి వరకు 30 నవలలు రచించారు. ఆయన రచించిన కథలు, నవలలు పలు భారతీయ భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. 2010 సంవత్సరానికి గాను సలీం రచించిన "కాలుతున్న పూలతోట" నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

3. "మనిషి" కథ -  పరిచయం :

అమాయకత్వం, పేదరికంలో ఉన్న మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి దించే ఓ వ్యక్తి పేరు ఎల్లప్ప. ఎల్లప్పను 'కఠినాత్ముడు, దుర్మార్గుడు, రాక్షసుడు' అంటూ మహిళలు తిడుతూ ఉండేవారు. ఆ తిట్లు అతనికి బిరుదుల్లాంటివి. ఎల్లప్పకు చాలా మంది పెద్దమనుషులతో పరిచయాలు ఉన్నాయి. పగలు పెద్దమనుషుల్లా కనిపించే చాలామంది బుద్ధిమంతులకు రాత్రుల్లో ఎల్లప్ప లాంటి వారితోనే పని పడుతూ ఉంటుంది.

నలభై ఏళ్లు పైబడిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఎల్లప్పతో ఇరవై ఏళ్ల పరిచయం ఉంది. తెల్ల చొక్కా, చేతినిండా డబ్బుతో సమాజంలో గౌరవంగా బతుకుతూ మంచి పేరు పొందిన ఆ ఉద్యోగి పనిమీద పట్టణం వెళ్ళినప్పుడల్లా ఎల్లప్పను కలవకుండా తిరిగిరాడు. ఆ మధ్య పట్టణం వెళ్లినప్పుడు బజారులో ఓ పడుచుపిల్లను చూసి మనసు పడతాడు. ఈ విషయం ఎల్లప్పకు చెబుతాడు. ' అదేముంది సారూ.. ఈసారి వచ్చినప్పుడు ఆ పిల్లని మీ ముందు ఉంచుతాలే, అయినా ఆ పిల్ల ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి ' అని ఎల్లప్ప చెబుతాడు.

కొన్ని రోజుల తర్వాత మళ్లీ పనిమీద పట్టణం వచ్చిన ఆ పెద్దమనిషి కంట్లో ఆ పిల్ల పడుతుంది. కానీ ఈ సారి ఎల్లప్పతో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆ సాయంత్రం తాను ఎదురు చూస్తున్న పిల్ల ఆచూకీ తెలిసిందని ఎల్లప్పకు చెబుతాడు. ' ఎవరు సారూ ' అంటూ ఆత్రుతగా అడిగిన ఎల్లప్పకు ఉదయం నీతో మాట్లాడుతున్న ఆ పడుచు పిల్లేనని బదులిస్తాడు. ఆ మాట విన్న ఎల్లప్ప ఒక్కసారిగా నిచ్చష్టుడైపోతాడు. కాళ్ళ కింద భూమి కదిలినట్టు, తలంతా గిర్రును తిరిగినట్లు, ఏదో ఆలోచిస్తూ, శూన్యంలోకి చూస్తూ, అక్కడి నుంచి మారు మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు. దుర్మార్గుడిగా పేరుపడిన ఎల్లప్ప కంటి నుంచి ఎవరికి కనిపించకుండా ఓ కన్నిటి బొట్టు రాలిపడుతుంది.

ఆ తరువాత, తెలిసిన విషయం ఏమంటే.. ఆ పడుచు పిల్ల ఎల్లప్ప కూతురని. కానీ, ఆ పెద్దమనిషి నమ్మడు. ఎందుకంటే ఎల్లప్పతో అతనికి ఇరవై ఏళ్ల పరిచయం. ఎల్లప్పకు పెళ్ళికాలేదని తెలుసు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదనీ తెలుసు.అయినా ఇలాంటి నీతిమాలిన పనులు చేసే వాళ్ళకి పెళ్లి, పిల్లలు, కుటుంబం, మానవత్వం ఉంటుందా ? ఆ పిల్ల ఎవరో తెలుసుకోవాలనే ఆలోచనతో ఆ పెద్దమనిషి నేరుగా ఎల్లప్ప ఇంటికి వెళతాడు. అమాయకంగా ఆ పిల్ల కనిపిస్తుంది. ' ఎవరు కావాలి సారూ ' అంటూ ఆ పిల్ల అడుగుతుంది. ఏం సమాధానం చెప్పాలో తెలియక వెను తిరుగుతుండగా ఆ ఇంటి గోడకి వేలాడదీసిన ఫోటో అతని కాళ్ళను కట్టిపడిస్తుంది. ఆ ఫోటో కమలది. ఇరవై ఏళ్ళ క్రితం తనకు పరిచయం ఉన్న కమలది. ఇప్పుడు అర్థమవుతుంది. కమల, ఆ పడుచు పిల్ల అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. అంటే, ఈ పిల్ల కమల కూతురు. తిరుగు లేదు. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాదు.

ఇరవై ఏళ్ల క్రితం నాటి సంగతులు గిర్రున తిరిగి తన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయు. ఓ రోజు పనిమీద పట్టణం వస్తే కమలను ఎల్లప్ప పరిచయం చేస్తాడు.' నిన్ను పెళ్లి చేసుకుంటాలే ' అంటూ మాయ మాటలు చెప్పి కమలకు దగ్గరవుతాడు. కొన్నాళ్లకు కావాలనే కమలకు దూరం అవుతాడు. ఆ తరువాత కమల ఏమైందో తెలియదు.

"జీవితంలో మిమ్మల్నే నమ్ముకుంది సారూ.. పిచ్చిపిల్ల. పాప పుట్టాక ఆత్మహత్య చేసుకుంది.."  అంటూ ఓ సారి కమల గురించి చెబుతాడు ఎల్లప్ప. ఒక క్షణం గుండె కలుక్కుమన్నా అదేమీ తన మనసుకు పట్టలేదు. ఇప్పుడు తాను మనసు పడ్డ పిల్ల కమల కూతురు. అంటే తన కూతురు. చిన్నప్పట్నుంచీ తన సొంత కూతురుగా ఎల్లప్ప పెంచుకున్నాడు. ఇదంతా తెలిసినా ఆ పెద్దమనిషిలో ఏ మాత్రం బాధ కనపడదు...  అంటూ రచయిత కథ ముగిస్తాడు.

4. మనిషి కథలో పాత్రలు - మనస్తత్వాలు :

మనిషి కథలో నాలుగు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. పేరులేని పెద్దమనిషి, ఎల్లప్ప, కమల, కమల కూతురు. ఈ నాలుగు పాత్రలు నాలుగు భిన్నమైన మనస్తత్వాలకు సంకేతాలు. మనిషి ఎలాంటి వారో మనిషిని చూసి చెప్పలేం. మనిషిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, మనస్తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనిషిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలం. ఇదే విషయం మనిషి కథలో కనిపిస్తుంది.

4.1 ఎల్లప్ప :

"సన్నగా గాలి కొడితే ఎగిరిపోయేట్టు ఉంటాడు ఎల్లప్ప. తమాషాగా ఉండే మెల్లకన్ను, మొహం నిండా అలముకున్న స్పోటకపు మచ్చలు, అసహ్యమైన నలుపు"4 మనిషి కథలో ఎల్లప్ప పరిచయం ఇది. అమాయకమైన మహిళలను నయానో, భయానో లోంగదిసి చెడు రొంపిలోకి దింపే వృత్తి ఎల్లప్పది. ఆ పనిలో అతనిది ఆరితేరిన చెయి. " మనిషి ఎంత వికృతంగా మొరటుగా కనిపిస్తాడో అతని ప్రవర్తన కూడా అలాంటిదే. "ఆడవాళ్ళ పాలిట రాక్షసుడు అంటారు ఎల్లప్పని. మనిషి కథలో ఎల్లప్ప మనస్తత్వాన్ని  స్థూలంగా రచయిత పరిచయం చేసిన విధానం ఇది. చూడడానికి వికృతంగా, ప్రవర్తన రాక్షసంగా కనిపించే ఎల్లప్ప మనస్తత్వం కథ సగం దాకా చెడుగానే కనిపిస్తుంది. కథలో ఊహించని మలుపు  ఉన్నప్పుడే పాఠకుడిని కథ కట్టి పడేస్తుంది. కథ మీద ఆసక్తి రేకెత్తాలంటే మనం ఊహించనిదేదో కథలో మన ముందుకు రావాలి. మనిషి కథలో ఎల్లప్ప పాత్ర కూడా అంతే. మనం మొదటి చూసిన ఎల్లప్ప, కథ మధ్యలో కనిపించే ఎల్లప్ప ఒకటి కాదని అర్థమవుతుంది. మనిషిలో ఎన్నో భిన్నమైన మనస్తత్వాలు, కోణాలు ఉంటాయని ఎల్లప్ప పాత్ర ద్వారా అర్థమవుతుంది. పైకి రాక్షసుల్లా కనిపించే మనిషి అంతర్గత ప్రవర్తనలో ఎవరూ ఊహించని భావాలు ఉంటాయి. కథ చదువుతూ సగానికి వచ్చినప్పుడు ఎల్లప్ప లో కూడా ఇంత మంచితనం ఉందా అనిపిస్తుంది. చెడు నీచమైన పనులు చేసే వారిలో కూడా మెండైన మానవత్వం ఉంటుందని అర్థమవుతుంది. ఎల్లప్ప కంటి నుంచి కన్నీరు రాలినప్పుడు పాఠకుల మనసు కూడాకూడా ఒక్క క్షణం కలుక్కుమంటుంది. ఆహార్యం, ఆలోచనలు, మనసు, ప్రవర్తన ప్రతి మనిషిలో వేటికవే వేరువేరుగా ఉండొచ్చని ఎల్లప్ప పాత్ర ద్వారా మనస్తత్వ పరిశీలన చేయవచ్చు. ఆడవాళ్ళ పాలిట రాక్షసుడిగా పేరుపడ్డ ఎల్లప్ప, ఓ వేశ్యకు పుట్టిన చిన్నారిని తన సొంత కూతురుగా పెంచి పెద్దచేయడం,  ఆమె కోసం కన్నీరు కార్చడం వంటి సంఘటనలు భిన్నమైన మనస్తత్వానికి నిదర్శనం.

4.2 పెద్దమనిషి :

నలభై ఏళ్లు పైబడిన వయస్సు. సమాజంలో పలుకుబడి, మంచి పేరు ఉన్న స్థానం. చేతినిండా డబ్బు. ఆదర్శమైన కుటుంబం, వ్యాపారం. ఇవి మనిషి కథలోని ప్రధాన పాత్ర గురించి రచయిత చెప్పిన విషయాలు. ఈ కథలో ప్రధాన పాత్రకు పేరు లేదు. కథ మొత్తం ప్రధాన పాత్ర  స్వాగతంలో జరుగుతూ వుంటుంది కాబట్టి ప్రధాన పాత్ర కు పేరు అవసరం పడదు. అతని వర్ణనను బట్టి సమాజంలో గౌరవం ఉన్న పెద్దమనిషిగా కథ చదివే పాఠకులు భావిస్తారు.

పెద్దమనిషి మనస్తత్వం చాలా విభిన్నమైనది. పైకి కనిపించే అంత గొప్పవాడేం కాడు. సమాజంలో మంచి ప్రవర్తన కలిగి ఉన్నా, అతని వ్యక్తిగత అలవాట్లని పరిశీలిస్తే అతనిప్రవర్తన భిన్నంగా కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు మాత్రమే పరిశీలించి మనిషి ప్రవర్తన అంచనా వేయడం చాలా కష్టమని పెద్దమనిషి పాత్ర ద్వారా. " సక్రమమైన మార్గంలో వెళ్లే వాళ్ల విషయం నాకు తెలియదు కానీ, చట్ట విరుద్ధమో, అక్రమమో అయిన పనులు చేసే వాళ్లకు కావాల్సింది " నమ్మకమైన " వ్యక్తులే"5 అంటూ నమ్మకాన్ని గురించి కొత్త అర్ధాన్ని చెబుతాడు పెద్దమనిషి.
అక్రమ మార్గాలు తొక్కేవారిలో భయం ఎక్కువగా ఉంటుంది. నమ్మకమైన మనుషుల పరిచయం తోనే ఈ భయం పోతుంది. అందుకే పెద్దమనిషి కి, ఎల్లప్పకు ఇరవై ఏళ్ల పరిచయం ఉంది. ఎల్లప్ప ఎవరో.., పెద్దమనిషి ఎవరో.., ఇద్దరూ చెడుదారుల్లో నడిచే వాళ్లే. కానీ, వాళ్లను కలిపింది " నమ్మకం". మరో విషయాన్ని పరిశీలిస్తే.. కమల అనే అమాయకురాలైన మహిళను లొంగదీసుకోవడానికి అబద్ధం కూడా ఆడడానికి వెనుకాడని పెద్దమనిషి సమాజంలో గౌరవాన్ని మాత్రం పొందుతూనే ఉంటాడు. "సుఖపడడానికే జీవితం అని నమ్మే నాకు కమలను పూర్తిగా మర్చిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు" అంటూ కమల గురించిన అభిప్రాయాన్ని చెబుతాడు.6 సంఘటనలు, మనుషులు, అవసరాలను బట్టి మనిషి ప్రవర్తన మారిపోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మనిషి తాను అనుకున్నది దక్కించుకోవడానికి ఎంతకైనా పాల్పడతాడని చివరికి నటించడానికైనా సిద్ధపడతాడని పెద్దమనిషి పాత్ర ద్వారా తెలుస్తుంది. అలాగే పెద్దమనిషి ఇష్టపడ్డ ఓ అమ్మాయి చివరకు తన కూతురే అని తెలిసినా ఆ పెద్దమనిషికి ఏమాత్రం బాధ కలగదు. దానిని ఇలా సమర్ధించుకుంటాడు.."కానీ ఆ సంఘటన నాలో పెద్ద మార్పు ఏమీ తీసుకురాలేదు. సినిమాల్లోలా, కథల్లోలా ఆమెను నా కూతురు అంటూ చదివించి పెళ్లి చేయించలేను. డిగ్రీ చదువుతున్న నా కూతురు ఆమె భవిష్యత్తు సంఘంలో నా పలుకుబడి గౌరవం ప్రాక్టికల్ గా ఆలోచించడానికి అలవాటు పడ్డ నా మనసు ఇవన్నీ గుర్తొచ్చి ఏమి ఎరగనట్లే ప్రవర్తిస్తున్నాను."7 అని పెద్దమనిషి చెబుతాడు. సమాజంలో మంచి పేరు కోసం మనిషి ప్రవర్తన ఎలా మారిపోతుందో పెద్దమనిషి పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు. పరిశీలించాలే కానీ ఇలాంటి పెద్ద మనుషులు ఊరికి పడిమందైనా తారస పడుతూనే ఉంటారు.

4.3 కమల:

నిజాయితీకి, నమ్మకానికి, అమాయకత్వానికి, నిస్సహాయతకు నిలువెత్తు నిదర్శనం కమల. కమల మనస్తత్వం భిన్నమైనది. పాఠకులకు కంట కన్నీరు తెప్పించే పాత్ర కమల పాత్ర . కమల పుట్టింది ఓ వేశ్య కడుపున. తండ్రి ఎవరో తెలియదు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. నువ్వైనా పెళ్లి చేసుకుని ఈ నరక కూపం నుంచి బయటకు వెళ్ళమ్మా, నాలాగా జీవితాన్ని ముగించకు అని తల్లి చెప్పే మాటలను మనసులో నాటుకుంది. నరక కూపంలాంటి వాతావరణంలో కమల పెరిగినా తులసి మొక్కలా నైతిక విలువలకు కట్టుబడి ఉంటుంది. కమల మనస్తత్వం అరుదుగా కనిపించే మనస్తత్వం. "ఎవరు వీరు/ దేశమాత పెదవిపై/ మాసిన చిరునవ్వులు/మనసు లేని పిడికిలిపులో/నలిగిపడిన పువ్వులు.."8 అంటూ సి.నారాయణరెడ్డి రాసిన పాటలోని భావంలా అమాయకత్వం, ఏమీ చేయలేని సహాయత, ఈ రెండూ కలగలిసిన మనస్తత్వం కమలలో కనిపిస్తుంది. తాను గడిపే తాను పుట్టి పెరుగుతున్న నరక కూపం నుంచి బయటపడాలని, ఎవరైనా తనను రక్షిస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమనిషి పరిచయం అవడం, అతన్ని నమ్మడం జరుగుతుంది. కానీ నమ్మకానికి కొందరి దగ్గర విలువ ఉండదు. నమ్మకం అంటే కొత్త అర్థాలు చెప్పే పెద్ద మనుషులు సమాజంలో ఎందరో ఉన్నారు. అందుకే కమల ఓడిపోతుంది. పెద్దమనిషికి కమలకి పుట్టిన చిన్నారిని పక్కనపెట్టి ఆత్మహత్య చేసుకుంటుంది. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొనలేక ఓడిపోయిన మనస్తత్వం కమలది. ఈ పాత్ర ద్వారా ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు. మంచి, మానవత్వం, ప్రేమ, ఆప్యాయతలు మనసుకు సంబంధించినవి కానీ పెరిగిన వాతావరణం, నివసించే ప్రాంతాన్ని బట్టి ఉండవని కమల పాత్ర ద్వారా అర్థమవుతుంది. సమాజంలో అబలగా తమ జీవితాలను ముగించే స్త్రీల మనస్తత్వాలు కమలపాత్రలో కనిపిస్తాయి.

5. ముగింపు:

"ముగింపులో పాఠకున్ని విస్మయ చెకితున్ని చేసే అంశం నెలకొని ఉండడం సాధారణంగా మంచి కథల లక్షణం " అంటాడు మధురాంతకం రాజారం తన "కథన రంగం" అన్న వ్యాసంలో. దీన్ని మరో రకంగా " కొసమెరుపు " అనవచ్చు.9 మనిషి కథలో కూడా కొసమెరుపు, ముగింపు చదివే పాఠకున్ని విస్మయపరుస్తుంది. పాఠకుని ఊహకు కూడా అందకుండా కథ నడపడం సలీం గొప్పతనం. మనిషి కథలో సలీం అనుసరించిన శైలి పరిశీలిస్తే అంతకుముందు ప్రముఖ కథా రచయితల  శైలిని గుర్తుకు తెస్తుంది. పాత్రలు, వర్ణన, కథనం, పాత్రలోని మనస్తత్వాలు అన్నీ కలిసి మనిషి కథ గొప్ప కథగా నిలిచిపోయింది. మనిషి కథ పుట్టి నలభై రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ అందులోని పాత్రల మనస్తత్వాలు ఇప్పటికీ సజీవంగానే ఉంటాయి. పరిశీలించాలే కానీ, అలాంటి మనస్తత్వాలు సమాజంలో తారస పడుతూనే ఉంటాయి. అందుకే మనిషి కథలో జీవం ఉంటుంది. అందులోని పాత్రలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.

6. పాదసూచికలు:

  1. అందాల తెలుగు కథ,  కోడూరి శ్రీరామమూర్తి,  పుట 10
  2. తెలుగు సాహిత్య, చరిత్ర వెలమల సిమ్మన్న, పుట 695
  3. కథకు శతమానం, సంపాదకులు, డాక్టర్ గిరిజా మనోహర్ బాబు, పుట 44
  4. మనిషి, సలీం, పేజి 1
  5. మనిషి, సలీం, పేజి 2
  6. మనిషి, సలీం, పేజి 1
  7. మనిషి, సలీం, పేజి  5
  8. మనిషి, సలీం, పేజి 5
  9. సి.నారాయణరెడ్డి గీతం, మల్లెపువ్వు సినిమా
  10. కథా శిల్పం, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, పుట 17

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. మనోహర్ బాబు గిరిజా, సంపాదకులు, "కథకు శతమానం"
  2. వెంకటసుబ్బయ్య వల్లంపాటి, కథాశిల్పం, 2016, నాలుగవ ముద్రణ, విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్.
  3. శ్రీరామమూర్తి కోడూరి, అందాల తెలుగు కథ, 2013, మొదటి సంపుటి, విశాలాంధ్ర పబ్లికేషన్
  4. సలీం సయ్యద్, స్వాతి చినుకులు, 1996, శ్రీ విజయ పబ్లికేషన్
  5. సిమ్మన్న వెలమల, తెలుగు సాహిత్య చరిత్ర, విశాలాంధ్ర పబ్లికేషన్స్
  6. హజీబ్ మీరా, సలీం రచనలు - పరిశీలన, 2018, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పీహెచ్. డి. డిగ్రీ కోసం సమర్పించిన సిద్ధాంత గ్రంథం.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]