AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
6. రంగనాయకమ్మ ‘అంధకారం’ నవల: సమాజ చిత్రీకరణ
డా. యజ్జల ప్రవీణ్ కుమార్
టీచర్ మరియు రైటర్,
లిటిల్ స్టార్ హైస్కూల్,
గాయిత్రి హిల్స్, హైదరాబాదు, తెలంగాణ.
సెల్: +91 9959979363, Email: pvn.hcu@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
సమాజ జీవితాన్ని అర్థం చేసుకోవడంలో సాహిత్యం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందులో కథ, నవల సాహిత్య ప్రక్రియలు మానవ జీవితాలకు నీడల్లా నిలుస్తాయి. రంగనాయకమ్మ సమాజాన్ని పరిశీలన దృష్టితో గమనించి సాహిత్యాన్ని సృష్టి చేస్తారు. ఆ పరిశీలన ఈ అంధకారం నవలలో ఎలా ప్రతిధ్వనింతచింది అనేది ఈ వ్యాసోద్దేశ్యం. ఆ ధ్వనిలో సమాజం తెలుసుకోవలసిన విషయాలు ఈ నవల ద్వారా తెలుసుకుంటే ముందు చూపుతో వ్యవహరిస్తారని, రాజేశ్వరిలా ఆచరిస్తారని నా ఉద్దేశ్యం. ఇలాంటి నవలల్ని సాహిత్య విద్యార్థిగా గుర్తించడం వల్ల, ఇతరలకు ఇలా అందించడం వల్ల సమాజంలో సజీవంగా ఉన్న అనేక మానసిక రుగ్మతులు తెలుసుకుని చదువుతారని నా అభిలాష. ఈ వ్యాసం రాయడానికి నేను ఎమ్మెల్ ఎ స్టైల్ రీసెర్చ్ మెథడాలజీ ఫాలో అయ్యాను. దీనివల్ల విషయం సులభంగా చదువరులకు చేరుతుంది.
Keywords: నవల, సమాజచిత్రణ, సమకాలీనవైనం, పరిశోధన, వ్యాసం.
1. ఉపోద్ఘాతం:
రంగనాయకమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేద్దు. సమాజంలో జరుగుతున్న అనేక అసాంఘిక సంఘటనల పట్ల కథలు, నవలు, విమర్శ వ్యాసాలు రాస్తూ ఇప్పటికీ అలుపెరుగని దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ‘మార్క్సే నా టీచరు’ అని పుస్తకం రాసి మరీ ఆమె ఐడియాలజీ ఏమిటో చెప్పిన ధీర రచయిత్రి. ఎందుకీ మాట అంటున్నానంటే? కవులు, రచయితలు తమ ఐడియాలజీ, తమ స్టాండ్ ఏమిటనే స్పష్టత కోల్పోయిన రోజుల నుండి ఈ రోజు వరకూ మార్క్సే నా టీచర్, మార్క్సే నా ఫ్యూచర్ అని చెప్పిన కరాఖండి ఆమె. తెలుగునాట నిజాయితీ, నిబద్ధత, నిలకడత్వం ఈ మూడింటి కలగలపు రచయిత్రులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేసుకంటే అందులో మొదటి స్థానం ‘రంగనాయకమ్మే అనడంలో ఎటువంటి సందేహం లేదు. రచయిత్రులే కాదు రచయితలు కూడా ఆ మూడు లక్షణాలు కలిగిన వారు ఉండడం చాలా అరుదు.రంగనాయకమ్మ రచనలన్నా సంప్రదాయ పరంపరను నమ్మే కవులకు, రచయితలకు గిట్టవు. ఒక ‘స్త్రీ’ ని ఒప్పుకోవడంలో వాళ్ళలో తరతరాలుగా జీర్ణించుకుపోయిన పురుషాంకారం అడ్డొస్తూనే ఉంటుంది. అందుకే ఎక్కడ ఆమె ప్రస్థావన వచ్చినా? గుంటనక్క తెలివి ప్రదర్శించి ‘ఆమో మార్క్సిస్టు’ అని ముద్రవేసి పక్కన పడేద్దామని తొలినాటి నుండీ కలలు కంటున్నారీ కపట బుద్దులు కొందరు. కానీ, అంతకంత బలంగా తయారై ‘రామాయణవిషవృక్షం’, ‘ఇదండీ మహాభారతం’, ‘వేదాలు ఏం చెప్పాయి?’ అనే మూడు విమర్శా- గ్రంథాలు రాసి, మూఢ విశ్వాసాలలో మగ్గుతున్న ఎన్నో బతుకులకు ప్రశ్నించే తత్వంనేర్పిన నేర్పరి ఆమె.
సంకుచిత భావాలతో కుచించుకు పోతున్న సమాజానికి స్వేచ్ఛా, చైతన్యం రుచి చూపిన మాస్టర్ చెఫ్ ఆమె. ఆమె రచనలు సమాజ ఉనికిని ప్రశ్నిస్తూ అనేక చర్చలకు దారితీస్తాయి. నేర్పిన నేర్పరి ఆమె. సంకుచిత భావాలతో కుచించుకు పోతున్న సమాజానికి స్వేచ్ఛా, చైతన్యం రుచి చూపిన మాస్టర్ చెఫ్ ఆమె. ఆమె రచనలు సమాజ ఉనికిని ప్రశ్నిస్తూ అనేక చర్చలకు దారితీస్తాయి. నేర్పిన నేర్పరి ఆమె. సంకుచిత భావాలతో కుచించుకు పోతున్న సమాజానికి స్వేచ్ఛా, చైతన్యం రుచి చూపిన మాస్టర్ చెఫ్ ఆమె. ఆమె రచనలు సమాజ ఉనికిని ప్రశ్నిస్తూ అనేక చర్చలకు దారితీస్తాయి. ఆమె సృష్టించిన సాహిత్యం ఆమెను శిఖర స్థాయిలో నిలబెట్టింది.
అలాంటి రచయిత్రి ‘అంధకారంలో’ వేశ్యా వృత్తిని నేపధ్యంగా తీసుకొని ఈ నవల రాశారు. ఇది 1969 ‘జయశ్రీ’ మాస పత్రికలో సీరియల్గా వచ్చింది. పుస్తకంగా 1972లో అచ్చయింది. అప్పటి నుండి 7 ముద్రణలు పొంది, మూడుసార్లు స్వయంగా రచయిత్రే సవరించారు. 8వ ముద్రణ 2018 సెప్టెంబర్లో వచ్చింది. ఇక ఈ నవలలో ఎటువంటి సవరణలు ఉండవని ముందుమాటలో చెప్పారు. ఆ మార్పులు తాలూకా ముందు మాటల్ని కూడా నవల చివరిచ్చారు. ఇలా ఇవ్వడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఏ రచయిత తన గతకాలం (అజ్ఞానం) గురించి మాట్లాడానికి ఇష్టపడరు. ఇలా ఇవ్వడం నిజాయితీగా మనం గుర్తించాలి.
2. కథ, పాత్రల పరిచయం:
‘అంధకారంలో’ నవల ఒక చిన్నసైజు మహాభారతంలా ఉంటుంది. ప్రధానకథ చుట్టూ అల్లుకున్న అనేక ఉపకథలు ఉంటాయి. మనుషుల తాలూకా స్వార్థాలకి, అల్పత్వానికి ఈ నవల పరాకాష్ఠగా నిలుస్తుంది. ప్రధాన పాత్ర వేశ్యావృత్తి చేసుకుంటూ పొట్ట పోషించుకునే ‘రాజేశ్వరి’. ఆమె చుట్లూ అల్లిన పాత్రల్లో రాధ, మహాలక్ష్మమ్మ, లలిత, సుందరమ్మ, శకుంతల, సీత, పార్వతమ్మ, దుర్గ, రామచంద్రం, శేఖరం, కృష్ణారావు, ప్రకాశం, నరసయ్య, రాఘవరావు, వెంకటాద్రి, రాముడు, పెద్దిరాజు, రమణ, దూదేకుల సాయిబు ఇలా అనేక పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్ర సమాజం చేత పీడింబడినవో లేక పీడించినవో ఉంటాయి.! వీటికిగల కారణాలు కూడా చక్కగా విశ్లేషణ చదివినట్టు నవలలో ఉండడం రంగనాయకమ్మ ప్రత్యేక శైలిగా చెప్పుకోవచ్చు. వేశ్యావృత్తి ఎలా దినదినాభివృద్ది చెందుతుందో? దానికి గల కారణాలు? దాని అంతానికి తీసుకోవల్సిన జాగ్రత్తలూ ఇందులో రాయడం ఆలోచించ దగ్గది. నవలలో కొన్ని పాత్రలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. హృదయం ఉన్న ప్రతీ మనిషికీ కళ్ళు తడవాల్సిందే. ఏకబిగువున చదివే నవలయినా చదవడం నావల్ల కాలేదు. ఎందుకంటే ఆ కారిన కన్నీళ్ళే కారణం.! రచయిత్రి చెప్పిన విషయాలు గమనిస్తే ఎంత అధ్యయనం, సమాజాన్ని ఎంత సునిశిత దృష్టితో పరిశీలిస్తున్నారో అర్థమైతే ఆశ్చర్యంతో కూడిన సిగ్గు వేయాల్సిందే! ప్రతీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి సమాజంలో మనుషుల మనస్తత్వాలకి అద్దం పట్టారు ఆమె. కృష్ణారావు, రమణ, లలిత పాత్రల్లో రంగనాయకమ్మ ఆత్మ దాగుంది. అందుకే శేఖరం వదిలేసినా లలిత చక్కగా మరో పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో హాయిగా ఉంటుంది. రమణ తండ్రి చేసిన తప్పును ఎత్తి చూపి, విద్యా వ్యవస్థలో ఉన్న డొల్ల తనాన్ని బయటపెట్టి, మార్పు రావాలి, చైతన్యం కావాలని ఆశిస్తాడు. కృష్ణారావు మొదట నుండి ఆదర్శవంతమైన జీవితం జీవిస్తూ వంకర బుద్ధిగల ప్రకాశాన్ని మారుస్తాడు. పెట్టుబడిదారి వర్గం ఉన్నంత కాలం ప్రజలు దోపిడీకి గురవ్వుతూనే ఉంటారు. వేశ్యావృత్తి లాంటి అనేక వ్యవస్థలు రంగులు మార్చుకుంటూ కాలానుగుణంగా కొనసాగుతాయని ఈ నవలలో రంగనాయకమ్మ తేల్చి చెప్పారు.
ఈ నవల చదువుతుంటే రాధ, రాజేశ్వరి, మహాలక్ష్మమ్మ, శకుంతలు, సుందరమ్మ, దుర్గ అనేక పాత్రల మీద జాలి కలుగకమానదు. మనం గమనించాల్సింది ఏమిటంటే జాలిపడటంతో పాటు వాళ్ళలా తయ్యారవ్వడానికి మన పాత్ర ఎంత ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొంతమంది స్త్రీలు వేశ్యావృత్తి ఎంచుకోవడంపై స్త్రీలకే సరైన అవగాహణ ఉండదు. అందువల్ల వాళ్ళను చాలా చులకనగా లెక్కగట్టి నోటికొచ్చినట్టు మాట్లాడం గమనించవచ్చు. అలాగే మగవాళ్ళు కూడా వేశ్యల దగ్గర నుండి సుఖం పొందినా వాళ్ళను లకార బూతులు తిట్టడం మాత్రం మానరు.
‘‘ఎబిశారం ముండలు బాబూ! మొగోణ్ణి కాలు కదపనివ్వరు. వొలేసి పట్టుకు పోతారు’’(పుట:12). ఇలా రిక్షా అప్పన్న అంటాడు. ‘‘ఇందాక రోడ్డు పక్క నించున్నారే, అలాంటి వాళ్ళొద్దు! తలమాసి నెదవలు గానీ ఆళ్ళ దగ్గిరి కెవరు బోతారు బాబూ? అరనిమిశం బోగం, ఆర్నెల్లు రోగం. మీ కెందు కూరుకోండి. పండులాంటి మనిషి కాడికి తీసుకుపోతాను’’(పుట:12). అని సమాజంలో కొంతమంది హోదాలకోసం, హుందాలకోసం తప్పు దారులు పట్టే మాణిక్యాంబలాంటి ఇళ్ళకి తీసుకుపోయి ‘‘పెద్దమ్మగోరూ! మీ ఇంటికెవరో సుట్టాలొచ్చినారండీ! అని గట్టిగా కేక పెట్టాడు. కాసేపటికి ఒకావిడ తలుపులు బార్లా తీసుకుని బయటి కొచ్చింది - నువ్వా అప్పన్నా, ఎవరో అనుకున్నాను అంది గట్టిగా. కంఠం తగ్గించి దిగి రమ్మను అంది మెల్లిగా’’ (పుట:13). ఇలాంటి మనుషులు ఉన్నారని రచయిత్రి మనకు చూపిస్తుంది.
అక్కడ అప్పన్న నిర్వాకం ఒకసారి చూడండి. ‘‘మొహంలో మొహం పెట్టి, పల్లిటూరోడు! పదిరూపాయలడగండి. నేకపోతే పొమ్మనండి! నావొంతు రొండ్రూపాయలు! ఇప్పుడే సెప్పినాను’’ (పుట:13). అని రిక్షా అప్పన్న అంటాడు. ఎవరి మీదైతే రెండు రూపాయలు సంపాదించుకుంటున్నాడో వాళ్ళ గురించి గౌరవంగా మాట్లాడం చేతకాదు. ఇలాంటి ముసుగు మనస్తత్వాలను సమాజాల్ని ఉద్దేశించి రచయిత్రి ఇలా అంటుంది.
‘‘విశాఖపట్నం అంతా తెల తెలవారుతోంది. భళ్ళున తెల్లారేసరికి మాణిక్యాంబా, సీతారత్నం, నాగవేణీ, సత్యవతమ్మా ఇంకా చాలా మంది ఆడవాళ్ళు, మాన మర్యాదలుగల ఇల్లాళ్ళవుతారు! భర్తలతో అన్యోన్యంగా కాపరాలు చేసుకుంటోన్న సంసార్లవుతారు. సింహాచలం కొండెక్కిన శేషగిరీ, రామావతారం, హోటలు గదుల్లో దూరిన వెంకట్రావూ, సుబ్బరామయ్యా అంతా, పరువు ప్రతిష్టలుగల కుటుంబీకులవుతారు! ఉద్యోగాలూ, వర్తకాలూ చేసుకుంటూ దైవ చింతనతో మునిగి తేలే ఉత్తములైపోతారు! మళ్ళీ చీకటిపడే వరకూ విశాఖపట్నం మహా పతివ్రత!’’ (పుట:20).
ఇలా చెప్పడంలో వాస్తవం ఉంది. ఆ వాస్తవం ఒప్పుకోవడంలో రచయిత్రికి స్త్రీలు ఏమీ అతీతం కాదని చెప్పవచ్చు. అలానే మరో చోట లాయర్ ‘సరోజ’ గురించి రాయడం గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ‘‘ఆడంబరాలతో, సుతారంగా కాలం గడపాలని ఆమె కోరిక. ఇల్లు దాటాల్సివస్తే ఎయిర్ లోనే ఎగరాలి. కాలికి మట్టి తగిలే జీవితం అంటే ఆమెకు చెడ్డ కంపరం. ఇంకా ఆమెకి చాలా ఆలోచనలున్నాయి - ప్రపంచ సుందరి పోటీలో ఒకసారి విజయం సాధించి దేశ దేశాల వార్తా పత్రికల్లో కెక్కాలనీ, హాలీవుడ్ సినీ ఫీల్డులో ఎలిజబెత్ టైలరంత ఫేమస్ స్టార్ కావాలనీ, పార్లమెంట్కి నిలబడి ఎమ్.పీ.గా నెగ్గి మినిస్ట్రీలోకి పోవాలనీ, కనీసం అమెరికాలో టెక్సాస్లో ఏ ముసలి కోటీశ్వరుణ్ణయినా పెళ్ళి చేసుకుని వాడి ఆస్తి అంతా తన పేర రాయించుకుని, వాడిని విడాకులిచ్చెయ్యాలనీ, ఇంకా, ఇంకా అలాంటివే ఎప్పుడూ లగ్జరీస్ మీదా, బ్యాంక్ ఎకౌంట్స్ మీదే!’’ (పుట:22).
లేనిపోని ఆడంబరాలకు పోయే కొందరి ఆడవాళ్ళ దురాశల చిట్టా గురించి రాయడంలో రంగనాయకమ్మ సందేహించలేదు. సరోజ, మిస్. కాంచన ఎమ్.ఎ, డాక్టర్ మిసెస్ జానకీదేవి ఇలా చదువుకున్న ‘విద్యాధిక వేశ్యలు’ కూడా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఈ మాటలు1969 లో రాసిన ఇప్పటి సమాజానికి అద్దం పట్టడం ఆశ్చర్యం.! వీళ్ళ చదువంతా అవినీతి మార్గాల్లో డబ్బు సంపాదించి నేను ఎక్కువా, నువ్వు తక్కువా అనే సామాజిక, ఆర్థిక కోణాల్లో భేదాలు చూపిస్తూ మనుషులమని మర్చిపోవడానికి ఉపయోగపడుతుంది. రకరకాల ఆకర్షణలో పడి లగ్జరీలకూ కనీస అవసరాలకూ తేడాతెలియకుండాపోతుంది. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు/మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు/నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు/యాడ వున్నాడోగాని కంటికీ కానరాడు’’ (గేయం-అందేశ్రీ). ఈ గేయ వాక్యాలు అబద్దాలని మనం భావించగలమా? ఒకసారి ప్రశ్నించుకోవాలి.!
3. సహజ సమాజచిత్రణ:
ఈ సమాజంలో ఉన్న ధనవంతుడు, దరిద్రుడు అనే భేదం ఏనాటి నుండో వేశ్యా వృత్తిలోకి ఆడవాళ్ళను దింపడంలో ఘనమైన పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. అలానే రాజేశ్వరి కూడా ఈ వేశ్యాబాట పట్టింది. ‘‘రాజేశ్వరి చెక్కిళ్ళు గులాబీ రంగుతో ఎరుపెక్కక ముందే, ఆమె ఊహాలోకం ఒళ్ళు విరచి మేలుకోక ముందే, ఆమెలో మధురమైన వాంఛలేవీ తల ఎత్తక ముందే, పురుష సహచర్యాన్నికామె నిరీక్షించక ముందే, ఆమె, దారుణంగా అమానుషంగా దోపిడీ అయింది! ఆనాటి నుంచీ, ఆమె మూగ మనసుతో, దోపిడీ అవుతూనే వుంది’’ (పుట:27). అసలు రాజేశ్వరి ఈ వృత్తిలోకి ఎలా వచ్చిందో? ఎలా దోపిడీ కాబడిందో మనకు ముందుకెళ్ళేకొద్ది తెలుస్తుంది. వేశ్యలు సమాజంలో భాగంగా ఉన్నా సమాజంలో జరిగే అనేక సాంఘిక, రాజకీయ విషయాలు అర్థంకావనడానికి ‘‘ఏటేటా స్వాతంత్ర్యదినం ఎందుకంత ఘనంగా చేస్తారో ఆ స్వాతంత్ర్యం ఎవరి కొచ్చిందో, ఎవర్ని ఉద్ధరిస్తుందో, ఆమెకేమీ అర్థంకాదు. అవన్నీ మన ఊరు గొడవలు కావు, భారతదేశం సంగతులంట అంది దుర్గ ఒకసారి. అవును కామోసనుకుంది రాజేశ్వరి’’(పుట:29). చక్కని ఉదాహరణ. వేశ్యలకే కాదు రెక్కాడితేగానీ డొక్కాడని శ్రమజీవులకు కూడా అర్థంకావు.
అసలు ఈ వేశ్యావృత్తిలోకి ఎలా వస్తారనుకుంటే కుటుంబ వ్యవస్థలోని లోపాలే కారణాలని చెప్పవచ్చు అది చూద్దాం!
‘‘దుర్గ తండ్రి బెజవాడ లోకోషెడ్ లో క్లీనర్గా ఇప్పుడూ చేస్తూనే ఉన్నాడు. తన తాగుడుతో ఇల్లు నరకం చేశాడు. తాగిన మైకంలో భార్య కష్ట సుఖాలు గ్రహించలేనంత కామాంధుడై ప్రవర్తించేవాడు. ఆ భార్య నిండు నెలలతో ప్రాణాలు వదిలింది. ఎదిగిన ఆడపిల్లలిద్దరు. దుర్గ రెండోది. ఒక స్నేహితుణ్ణి నమ్మి తిరిగింది. పెళ్ళి ప్రసక్తి ఎత్తితే...ఆ ప్రియుడి భార్యాబిడ్డలు బయట పడ్డారు.! అంతలోనే తల్లి పోయింది. ఒక భయంకరమైన రాత్రి ఆమె తండ్రి తాగివచ్చి పెద్దకూతురి మీద అత్యాచారం చేశాడు. ఆ దారుణం వరసగా కొన్ని రోజులు జగగటంతో ఆ పెద్ద పిల్ల రైలు కింద పడి చచ్చిపోయింది. భరించలేని దు:ఖంతో, భయంతో దుర్గ తండ్రి దగ్గిర్నించి పారిపోయింది. ఇప్పుడు దుర్గకి ముప్పై సంవత్సరాలంటాయి. ఎవర్నీ నమ్మక నిశ్చింతగా బతుకుతోంది’’ (పుట:34).
ఇలా పేదవాళ్ళ ఇల్లల్లోనే జరుగుతుందని భావిస్తే తప్పు. సమాజంలో పరువు, ప్రతిష్ట, గౌరవం, కులం, మతం ఉన్నాయని నమ్మే ప్రతీ ఇంటిలో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువని చెప్పవచ్చు. ఈ మధ్యన జరిగిన ‘మారుతీరావు’ సంఘటన కూడా ఇలాంటిదే.! ఈ నవలలో మోతుబరి రైతు ‘నరసయ్య’ కూడా ఇలాంటి మారుతీరావే! నరసయ్య భార్య చనిపోతే ఒకామెను ఉంచుకొని ఇల్లు కట్టిస్తాడు. అదే కూతురు రాధ విషయంలో సహించ లేకపోతాడు.
4. కుటుంబ వ్యవస్థలో లోపాలు:
రాముడుతో లేచిపోయిన రాధ ఒక పాపకి జన్మనిస్తుంది ఆ పాపే మన కథానాయికి రాజేశ్వరి. తరువాత యాక్సిడెంట్లో ‘రాముడు’ చనిపోతే గత్యంతరం లేక తండ్రి నరసయ్యకు ఉత్తరం రాస్తుంది. కనీసం ఉత్తరం కూడా చూడడు. సూరన్న సద్దిచెప్పబోతే అతని మీద మండిపడినంత పనిచేస్తాడు. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమిస్తేనే పెద్దరికం, లేకపోతే పెద్దవాళ్ళు ఎలా అవుతారు? రాధ తండ్రి మాట వినలేదు వదిలేసాడు అనుకుందాం? మరి చిన్న కూతురు శకుంతల తండ్రి చెప్పినవాణ్ణే పెళ్ళి చేసుకుంటుంది. మరి శకుంతల జీవితం ఏమైనా బాగుంటుందా? అత్తింట్లో తనపై జరిగే అరాచకాల్ని చెబితే గుట్టుగా సర్దుకుపోవాలి అని చెబుతాడు తప్పా శకుంతల స్థానంలో ఉండి ఆలోచించే ప్రయత్నం చెయ్యడు నరసయ్య. ఇక అత్తగారింట్లో బాధలు భరించలేక నూతిలో పడి చనిపోతుంది శకుంతల. ఇక్కడ మనం అర్థం చేసుకోవల్సింది తండ్రి మాట విన్నా శకుంతల ఏమి సుఖపడిపోయింది? ప్రేమించిన పాలేర్ని పెళ్ళి చేసుకొని రాధ ఏమి నాశనమైపోయింది.? ఇక్కడ ఎవరి జీవితాలకు ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. ఉన్నంతలో శకుంతలతో పోల్చితే, రాధే సుఖపడింది. నరసయ్య కొడుకు గోపాలం తక్కువ కులం అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే నరసయ్య ఏమీ మాట్లాడడు. ఇంతకాలం తండ్రి సంపాదించిందంతా ఖర్చుపెడుతుంటే ఏమీ అనడు. భారతీయ కుటుంబ వ్యవస్థలో ఆడపిల్లలకో న్యాయం, మగపిల్లవాడికో న్యాయం! ఇలాంటి లోపాలవల్లే ఆడపిల్లలు మరో గత్యంతరంలేక వేశ్యావృత్తిని ఆశ్రయిస్తున్నారు. చివరికి గోపాలం వాళ్ళ అక్కలకు తండ్రి చేసిన అన్యాయానికి బాగా గడ్డిపెట్టి నరసయ్యని ఇంట్లో నుండి బయటకు నెట్టే స్థాయుకి దిగుతాడు.
నరసయ్య చేసిన దారుణం ఇక్కడితో ఆగలేదు. రాధకు వేశ్యగా మారడం ఇష్టం లేక సుబ్బమ్మ సలహా మీద పెద్దిరాజుకు ఉంపుడిగత్తె కింద చిన్నారి ‘రాజేశ్వరి’ని తీసుకుని వెళ్తుంది. పెద్దిరాజు ఊళ్ళో పెద్దమనిషి, రాజకీయాల్లో తిరుగుతూ గాంధీజీ చేస్తున్న ఉద్యమాల ద్వారా ప్రేరణ పొందుతుంటాడు. దానికి తోడు కాస్త శృంగార పురుషుడు కూడాను. పెద్దిరాజు భార్య ‘మహాలక్ష్మమ్మ’ ఎప్పుడూ పూజలూ పునస్కారాలు అంటూ భర్తని దగ్గరకు రానియ్యకపోవడంతో ఆమె అంగీకారంతో రాధను ఉంచుకుంటాడు. రాధకి పెద్దిరాజువల్ల ‘రమణ’ పుడతాడు. రాజేశ్వరికీ పెళ్ళీడొస్తుంది. రాధ రాజేశ్శరికి పెళ్ళి చేయాలని చెబుతున్నా పెద్దగా పట్టించుకోడు పెద్దిరాజు. అలా కొంత కాలానికి రాధ అనారోగ్యంతో చనిపోతుంది. పెద్దిరాజు తాగివచ్చి మీ అమ్మలేని లోటు నువ్వు తీర్చు అని రాజేశ్వరిని బలవంతం చేయబోతే వద్దు నాన్నగారు అని బతిమాలుకుంటుంది.
‘‘ఛీ! అలా పిలవకు నేను నీకు నాన్నని కాదు. మీ నాన్న వేరు తప్పులేదు. అంటూ రాజు మృగంలాగా ఎగబడ్డాడు. రాజేశ్వరికి నాన్నగారి ప్రవర్తన పూర్తిగా అర్థమైంది. గజ గజ వణికిపోతూ, ఇదేమిటి నాన్నగారూ? వదిలిపెట్టండి! నేను మీ కూతుర్నండీ! నాన్నాగారూ! అంటూ పెనుగులాడింది. మృగం ఆలోచించే స్థితిలో లేదు. హఠాత్తుగా దొరిగిన కొత్త ఆడపిల్ల శరీరం కోసం అది వెయ్యేనుగుల బలం తెచ్చుకుంది. పదహారేళ్ళ పసి రాజేశ్వరి ఏనుగు పాదం కింద పడ్డ పూల మొక్కలాగ నలిగిపోయింది’’ (పుట:107). అలా పెద్దిరాజులో తలెత్తిన ప్రశ్నలకు వాడే సమాధానం చెప్పేసుకొని రాజేశ్వరిని రోజూ బలవంతం చెయ్యడం మొదలుపెడతాడు. ఇలా మొదటిసారి దోపిడీ కాబడుతుంది. ఇక అక్కడ ఉండలేక ‘సత్తెమ్మ’ సహాయంతో ఆ మృగం నుండి మృగాల సమూహంలోకి పారిపోయి వచ్చేస్తునట్టు ఆ పదహారేళ్ళ రాజేశ్వరికి ఏం తెలుసు.?
ఇక్కడ మనం గమనిస్తే దుర్గ కన్నతండ్రి, రాజేశ్వరి పెంపుడు తండ్రి పెద్దిరాజు ఇద్దరూ చేసిన అత్యాచారం ఒక్కటైనా? ఇద్దరి సమాజ హోదాల్లో సమాజిక వర్గాల్లో చాలా తేడా ఉంది. ఇలాంటివి మా కులాల్లో, మా మతల్లో, మా ఇల్లళ్ళో జరగవు. మాకు ఇంత చరిత్రుంది, మాది అంత గొప్ప వంశవృక్షం అని కూతలు కూసేవాళ్ళు ముందు కళ్ళుతెరవాలి. పెద్దిరాజు భార్య పాతివ్రత్యం పేరుతో తననితాను దైవ స్వరూపిణిగా సమాజం ముందు నిలబెట్టుకోవడానికి తనలో ఉన్న సహజ కోరికల్ని చంపుకొని కొంతకాలం నిగ్రహించు కుంటుంది. ఇక ఉండలేక కులం, మతం పట్టించు కోకుండా మహాలక్ష్మమ్మ దూదేకుల సాయిబుతో శారీరక సుఖం పొందుతుంది. ఇంతకాలం నన్ను, మా ఆయన ఈ మూఢ భక్తిలో పడేసి ఏ సుఖమూ లేకుండా చేశాడని గమనించి ఆ సాయిబుతో శారీరక సంబంధం కొనసాగిస్తూ ఉంటుంది. అసలు సమాజ ఆవిర్భావం తొలినాళ్ళలోనే అనేక లోపాలు ఉన్నాయి. అందులో భాగంగా కంచ ఐలయ్య గారి అభిప్రాయం ఒకసారి చూద్దాం.
‘‘వాత్సాయనుడు ‘కామసూత్ర’ అనే పుస్తకాన్ని క్రీ.పూర్వం ఒకటొవ శతాబ్దంలో రాయడమంత అన్యాయం ఇంకొకటి లేదు. గ్రీకులో ప్లేటో ‘రిపబ్లిక్’ తత్వశాస్త్రం రాస్తున్నాడు. అరిస్టాటిల్ ‘పాలిటిక్స్’ రాస్తున్నాడు. ఈయన మాత్రం కామసూత్రాల పుస్తకం రాసాడు. భార్యతో సంబంధం కేవలం రుతు సమయంలో పిల్లల్ని కనడానికే పెట్టి, నాగరికుడు అనే ఒక క్యారెక్టర్ని సృష్టించాడు. ఈ నాగరికుడంటే పైనుండి వచ్చినవాళ్ళు, గొప్పవాళ్ళు. ఈ నాగరికుడు తప్పకుండా గ్రణికతో (వేశ్య) 64 పద్దతుల్లో సెక్సు చెయ్యాలని బొమ్మలతో సహా వేసి పుస్తకం రాసాడు. అసలు ఎందుకు రాయాల్సివచిందిదీ? సెక్కు అనేది జంతువులకు కూడా తెలుసుకదా? మానవులకోసం ఇంత గ్రాఫిక్ ఎందుకూ? ఇక్కడే మనం పర్వర్ట్ (వక్రీకరించబడ్డాం) అయ్యాం. దురదుష్టవశాత్తూ ఈ పుస్తకం మీద చాలా పుస్తకాలు వచ్చాయి. ఇప్పటికీ పవన్ వర్మలాంటి వాళ్ళు ఇంకా రాస్తున్నారు. ఇలాంటి పుస్తకాలే ఇండియా నుండి హైయెస్ట్ సేల్స్ లో ఉన్నాయి’’ (కంచ ఐలయ్య. మీ ఐడ్రీమ్ నాగరాజు ఇంటర్వ్యూ.13 డిసెంబర్ 2019. వీడియో2:20:00 అందులో 51:నిషా.54:నిషా) అని అన్నారు. ఇలాంటి వాస్తవాలు అర్థమయినప్పుడు మన ఉనికి ఒక ప్రశ్నలా మిగులుతుంది.! ఆ అరవై నాలుగు పద్దతుల గురించి రాసిన రాతలూ బొమ్మలే ఈనాటి ‘ఫోర్న్ఇండస్ట్రీ’కి ప్రేరణని కూడా అనుకోవచ్చు. ప్రపంచ దేశాలకు మనుషుల బలహీనతలతో వ్యాపారం చేసే నీలిచిత్రాల ఆలోచనలలో మన వాత్సాయన ‘కామసూత్ర’ పాత్ర లేదని మనం అనుకోలేము!
5. రాజేశ్వరి ఆదర్శం:
రాజేశ్వరి వేశ్యావృత్తి వదిలేసి తన దగ్గరకి వచ్చే రాఘవరావుని పెళ్ళి చేసుకుంటుంది కానీ, సమాజం ఇరుగు పొరుగు, పార్వతమ్మ, వెంకన్న రూపాలలో రాజేశ్వరిని పీక్కు తింటూనే ఉంటుంది. వెంకన్న ఎంత చెప్పినా వినకుండా రాజేశ్వరి ఇంట్లోకి వచ్చేస్తాడు.
‘‘నే నిప్పుడా వృత్తి చెయ్యటం లేదండీ! పూర్తిగా మానేశాను. మీ దయవల్ల భర్తతో సుఖంగా బతుకుతున్నాను. నా మాట మర్చిపోండి! మీ చెల్లెల్లాంటిదాన్ని అనుకోండి.! అదేం మాట రాజమ్మా? ఎంత మొగుడుంటే మాత్రం, సాటు మాటు ఎవ్వారాలుండవా? ఎవడో చేరదీసినంత మాత్రాన సీతమ్మవారివి అయిపోయావా?’’ (పుట:209). ఇంతలో రాఘవరావు వీళ్ళు మాట్లాడుకోవడం చూసి రౌద్రంగా ఇంటిలోకి వెళ్తాడు.
‘‘బిక్కచచ్చిపోయి నించున్న రాజేశ్వరిని ఛెళ్ళు ఛెళ్ళున లెంపకాయలు వేసి, తలని గోడకేసి కొట్టి, తూలిపడిపోయినదాన్ని బూటు కాళ్ళతో తన్ని తన్ని, కొంత కోపం తగ్గిన తర్వాత వదిలిపెట్టాడు రాఘవరావు. నోరు పట్టని బూతులు తిట్టడం మొదలెట్టాడు. – ఇదా నువ్వాడుతున్న భాగోతం? బజారు లంజని తీసుకొచ్చి సంసారంలో పెట్టాను. నీ కుక్క బుద్ది ఎక్కడికి పోతుందే? ఉల్లి మల్లి అవుతుందా అంటారు. నీకేం పొయ్యేకాలం? విశ్వాసం లేని ముండా’’ (పుట:209).
ఇలాంటి అవమానాల మధ్య కూడా తమాయించుకొని కాపురం చక్కబెట్టుకుంటుంది రాజేశ్వరి. ఈసారి రాఘవరావు సత్యనారాయణ్ణి తీసుకొచ్చి ఇంట్లో రాజేశ్వరి దగ్గర వదులుతాడు. ‘‘మీకు కట్టుకున్న భార్య లేదూ? పరువుగా బతికే ఆడదాని మీద మీకెందుకింత మోజు? మీ భార్యని ఎవరైనా పిలిస్తే ఎలా ఉంటుంది మీకు? నోర్ముయ్! నా భార్యా నువ్వూ ఒకటేనన్న మాట! నీ సంగతంతా నాకు తెలవదనుకోకు’’ (పుట: 215). అని అంటాడు. ఈ విషయం అంతా రాఘవరావుతో చెబుతాడు. వాడు వచ్చి మళ్ళీ రాజేశ్వరిని నోటికొచ్చినట్టు తిట్టీ కొట్టి చివరికి డబ్బులేదు ఎలా బతుకుదామంటాడు?. అప్పుడు రాజేశ్వరి ‘‘ఛీ! ఇదేనా మీకు కనపడ్డ దారి? బతకాలంటే మీకింకో దారే ఉండదా? తాగుడు మానెయ్యండి! పేకాట మానేయ్యండి! సిగరెట్టూ, కిళ్ళీలూ అన్నీ మానెయ్యండి! పదండి కూలి పనికి పోదాం అంది రాజేశ్వరి’’ (పుట:215).
అప్పటికే వ్యసనాలకు బానిసైపోయిన రాఘవరావు రాజేశ్వరి మాట వినకుండా వేశ్యావృత్తి చెయ్యమని బలవంత పెడుతుంటాడు. ఇక రాఘవరావుని భరించలేక రాఘవరావు వల్ల వచ్చిన గర్భంతో తన పాత జీవితంలోకి పారిపోతుంది. కొన్ని నెలల తరువాత రాజేశ్వరి పాపను కంటుంది. ‘రాధ’ అని వాళ్ళ అమ్మ పేరు పెడుతుంది. ఒకసారి ‘రమణ’ వేశ్యాల దగ్గరకి వచ్చి, అక్కడున్న రాజేశ్వరిని సెలెక్ట్ చేసుకొని రూములోకి తీసుకెళ్తాడు. మెల్లగా రాజేశ్వరికి రమణని తన తమ్ముడని గుర్తుపడుతుంది. రమణ చాలా పశ్చాత్తాపపడతాడు. రాజేశ్వరి తన జీవితం ఇలా నాశనం అయిపోవడానికి పెద్దిరాజు తనపై చేసిన అత్యాచారమే కారణమని తమ్ముడికి తన బాధలు చెప్పుకుంటుంది. అక్కడ్నుంచి రమణ వెళ్ళిపోతుంటే ‘‘నీ ఆరోగ్యం పాడుచేసుకోకు రమణా! ఇలాంటి ఇళ్ళల్లోకి ఇంకెప్పుడూ రాకు. ఆకలి బాధ చల్లార్చుకోవడానికి వృత్తి చేసుకునే వాళ్ళ శరీరాల్లో ఏం ఆనందం ఉంటుంది బాబూ? నీకింకా తెలీదు. భయంకరమైన రోగాలూ, బతికినన్నాళ్ళూ పీడించే జబ్బులూ ఉంటాయి. చచ్చిపోతే తప్ప వదలని బాధలు’’ (పుట:225). అని చెబుతుంది. చిన్నారి రాధను ‘అప్పలకొండకి’ అప్పచెప్పి రాజేశ్వరి చివరికి ఆ జబ్బులతోనే చనిపోతుంది. ఈ సమాజం కులాలతో, మతాలతో, ప్రాంతాలతో, ధనికులతో ముక్కలు ముక్కలు అయినంతకాలం భారతదేశం అభివృద్ది చెందే దేశాల జాబితాలోనే ఉంటుంది. ‘ఇప్పుడు రాష్ర్టాలను కులం పాలిస్తుంటే, దేశాన్ని మతం పాలిస్తుంది’. సామాజిక స్పృహతో ఏమైనా మాట్లాడితే అది దేశద్రోహం అంటున్నారు. ఈ కులమత రాజకీయ కొట్లాటల్లో భారత రాజ్యంగ స్పూర్తి నిర్వీర్యం అయిపోతుంది.
6. విద్యావ్యవస్థలో లోపాలు:
ఇలాంటి దారుణాలు జరగడానికి సమాజంలో విద్యా వ్యవస్థ ఫెయిల్యూర్ కారణంగా చెప్పవచ్చు. దాన్ని రమణ మాటల్లో ఒకసారి చూద్దాం.
‘‘కాలేజీలు చూడు! ఎన్ని దుర్గంధాలు అక్కడ! పెద్ద పెద్ద డిగ్రీలున్న ఆ లెక్చరర్లూ, ఆ ప్రొఫెసర్లూ, అబ్బ! ఎంత అల్పులు! ఎంత సంకుచితులు! ఎన్ని దురభిమానాలు వాళ్ళకీ! వాళ్ళా మాకు చదువులు చెప్పేది? ఏం చెప్తున్నారు? వాళ్ళ మురికిభావాలే మా మీద రుద్దుతున్నారు తప్ప... మా మనసులేం విశాలం చేస్తున్నారు? అసలు వాళ్ళు చెప్పటానికేం ఉంది ఆ పుస్తకాల్లో? ఆ కాలేజీ గోడలు దాటి బయటికి వస్తే ఎంత మందో నీలాంటి అక్కలూ, అనాధలూ, దీర్ఘరోగులూ, బిచ్చగాళ్ళూ, దొంగలూ, ఆకలీ, దరిద్రం... అడుగడుగునా ఇదంతా గుండెల్ని కోస్తోంటే, ఇవేవీ పట్టని ఆ పిరికి లెక్చరర్ల ముందు కూర్చుని ఆ చెత్త పుస్తకాలు ఏం చదవమంటావు? ఆ దొంగ పుస్తకాలు చదివి చదివి చివరికి దొంగలై మళ్ళీ పిల్లల్ని దొంగల్ని చెయ్యటం తప్ప ఏం సాధిస్తాం జీవితాల్లో?’’ (పుట:233-34).
ఈ మాటలు 1969 లో అంటే? ఈనాటికి సమాజంలో ఎంత కరుడు కట్టిన విష భావజాలం పేరుకుపోయి ఉంటుందో ఊహించగలమా? ఇప్పుడు కులాల, మతాల, దేశభక్తి పేరుతో జరుగుతున్న అనేక మారణహోమాలు చూస్తే ఇది కాదనగలమా? మనం చదివే చదువులో అంత చైతన్యం, విశాలత్వం ఉంటే ఈ రోజు దేశం పరిస్థితి ఇంత దారుణంగా ఉండేదా? ఇలాంటి సమాజపు డొల్లతనం పుస్తకాలుగా రాస్తున్నారు కాబట్టే రంగనాయకమ్మంటే ఈ వితండవాదులకు, నూతిలో కప్పలకు నచ్చదు. ఈ వాక్యాల్ని నమ్మడానికి మరో ఆధారం చూద్దాం ‘‘ఒక దేశాన్ని ధ్వంసం చేయాలంటే అణుబాంబులు అక్కర్లేదు, క్షిపణులు అసలే అనవసరం. కేవలం బట్టీపట్టి, కాపీలు కొట్టేదానిగా ఆ దేశపు విద్యావిధానాన్ని దిగజార్చు. ఆ దేశపు డాక్టర్ల చేతులో రోగులు హరీ అంటారు. ఆ దేశపు ఇంజనీర్లు కట్టిన భవనాలు కుప్పకూలిపోతాయి. ఆ దేశపు ఆర్థిక శాస్త్రవేత్తలు, గణాంక నిపుణుల చేతుల్లో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఆ దేశపు మత ప్రచారకుల చేతుల్లో మానవత్వం మంట కలుస్తుంది. ఆ దేశపు న్యాయమూర్తుల చేతుల్లో న్యాయం ఉరి వేసుకుంటుంది. పతనమైన విద్యావిధానం అంటే ఆ దేశపు అధ:పతనమే.’’ (దక్షిణ ఆఫ్రికా విశ్వవిద్యాలయ ప్రవేశ ద్వారం వద్ద రాసివున్న వాక్యాలు. తెలుగు అనువాదం: కొత్తపల్లి రవిబాబు).
7. ముగింపు:
ఈ పై ఉదాహరణలు భారతదేశవిద్యావ్యవస్థ చక్కగా సరిపోతాయి. ఈ మాట ఎందుకంటున్నానో విజ్ఞులకు సులభంగా అర్థమౌతుంది. ఇప్పటి రాజకీయాల్లో జరుగుతున్న సాంఘిక, ఆర్థిక పరిణామాల్ని గమనిస్తున్న వాళ్ళకు ఖచ్ఛితంగా అర్థమౌతుంది. అది అర్థం కాని వాళ్ళకు నేనింకో పది పేజీలు విశ్లేషణ రాసినా అర్థం కాదని నా విశ్వాసం. ఇంకా నవలలో అనేక విషయాలు ఉన్నాయి. అవి రాయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. దయచేసి ఈ నవల అందరూ చదివి తెలుసుకోవల్సిన జీవిత పాఠ్యాంశమనవచ్చు.
1969లో రాసినా ఎక్కడా సమకాలికత కోల్పొలేదు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా! చివరిగా స్త్రీ స్వేచ్ఛ కోసం తన స్వేచ్ఛని కోల్పోయిన మహానుభావుడు ‘చలం’ రాసిన వాక్యాలతో ముగిస్తున్నాను. ‘‘స్ర్తీకి కూడా శరీరం ఉంది/ దానికి వ్యాయామం యివ్వాలి. ఆమెకి మెదడు ఉంది/ దానికి జ్ఞానం యివ్వాలి. ఆమెకి హృదయం వుంది/ దానికి అనుభవం యివ్వాలి.’’. (చలం. ‘స్త్రీ’ వ్యాస సంపుటి ముందుమాట. 2.12.1930)
8. ఉపయుక్తగ్రంథసూచి:
- జయప్రకాష్, ఎస్. పరిశోధన విధానం. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. 2011
- మధుసూధనరావు, త్రిపురనేని. సాహిత్యంలో వస్తు–శిల్పాలు. హైదరాబాద్: పర్ స్పెక్టివ్ ప్రచురణలు, 1997.
- రంగనాయకమ్మ, అంధకారంలో, నవల. హైదరాబాద్: స్వీట్ హోమ్ పబ్లికేషన్స్.2018
- రాల్ఫ్ ఫాక్స్. నవల ప్రజలు. అనువాదం వల్లంపాటి. విజయవాడ: విశాలాంధ్ర పబ్లిషంగ్స్.2015
- వీరభద్రయ్య, ముదిగొండ. విమర్శ, కళాతత్త్వ శాస్త్రాలు. హైదరాబాదు: తెలుగు అకాడమి. 2012
- వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. విమర్శాశిల్పం. హైదరాబాద్: విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్.1997.
- వెంకటేశ్వరరావు, దార్ల. బహుజన సాహిత్య దృక్పథం. హైదరాబాదు: సొసైటీ ఎడ్యుకేషన్ ట్రస్టు. 2012
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.