headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

4. ‘వేటూరి’ వారి పీఠికలు: బహుముఖప్రజ్ఞ

డా. యస్. చంద్రయ్య

తెలుగు పరిశోధకుడు &
ఏ‌పి నిఘావిభాగం, తిరుపతి,
తిరుపతి జిల్లా. ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8801883119, Email: chandra.singamala@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగులో పరిశోధన రంగంలో ప్రామాణికపరిశోధనకు బీజాలు పడుతున్న సందర్భంలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి తాళపత్ర గ్రంథసేకరణ, పరిష్కరణ దిశగా అడుగులు వేశారు. ఆయన పరిశోధన గ్రంథసేకరణ, పరిష్కరణలకే ఆగిపోకుండా వీటికి విలువైన పీఠికలు రాసి ప్రచురించడంతో పరిపూర్ణమైంది. వారికి పీఠికలు ఏవో మొక్కుబడిగా రాసినవి గాకుండా లోతైన విశ్లేషణలతో, సహేతుకమైన వివరణలతో సాగుతాయనడంలో అతిశయోక్తి లేదు. పీఠికను ‘తొడిమ’గా ఆయన అభివర్ణించారు. ఈ పీఠికలు ఆయా కావ్యాలలోని సాహిత్య, భాష, సామాజిక, సాంస్కృతిక, చారిత్రకాంశాలను తెలియజేస్తున్నాయి. వాటిని విశదీకరించడమే వ్యాసోద్దేశం ఇందుకోసం తి.తి.దే. వారు ప్రచురించిన వేటూరి వారి పీఠికలు రాయడంలోని నిబద్ధతను, కవికాలాదులను వివరించే క్రమంలో ఆయన ప్రతిభను, కావ్య వివరణలో వారు ప్రతిపాదించిన విషయాలను ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు

Keywords: అన్నమయ్య కీర్తనలు, తిమ్మక్క, ధర్మదీక్ష, విశ్లేషణ, పీఠికలు, కవులు, రచయితలు, చారిత్రక ఆధారాలు, క్రీడాభిరామం, చారుచర్య, సంకలనగ్రంథాలు, శైలి, భావగాంభీర్యత.

1. ఉపోద్ఘాతం:

ఉత్తమపరిశోధకులు, కవి, రచయిత, శాసన పరిశోధకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వేటూరి ప్రభాకరశాస్త్రికి తాళపత్ర గ్రంథసేకరణ, పరిష్కరణ అంటే మక్కువ ఎక్కువ. తాను సేకరించిన తాళపత్ర గ్రంథాలను పరిష్కరించడమేగాకుండా, విపులమైన పీఠికలు రాసి కత్తిమీద సాము లాంటి కార్యాన్ని సవ్యసాచిలా చేశారు. పరిష్కరణ ఒక ఎత్తు అయితే, దానికి పీఠిక రాయడం అంతకు మించిన ఎత్తు. ఆ గ్రంథవిషయాన్ని విశదీకరిస్తూ కవి హృదయాన్ని ఆవిష్కరించాలి. పాఠాంతరాలు శోధించాలి. గ్రంథపాతాల వివరణ ఇవ్వాలి. పూరణలను సమర్థించుకోవాలి. మొత్తం పైన ఆ పీఠిక ఋజుమార్గంలో నడవాలి. భవిష్యత్తు పరిశోధకులకు వాకిలి తెరవాలి. అప్పుడు పరిష్కరించిన గ్రంథం ప్రచురణకు అర్హమౌతుంది. ఈ విషయంలో వేటూరి ప్రభాకరశాస్త్రి సమర్థులుగా నిలిచారు. వారు పరిష్కరించిన ప్రతి గ్రంథానికి సమగ్ర పీఠికలు రాశారు. రాసిన ప్రతి పీఠిక పాఠకులను, పండితులను ఎంతగానో ప్రభావితం చేసింది.

ఆధునికకాలంలో కవులు, రచయితలు తమ కావ్యాలకు, రచనలకు పీఠికలు రాయమని- కోరడం సహజం. కానీ వందల సంవత్సరాల క్రితం రాయబడిన కావ్యాలకు పీఠికలు రాయడమనేది తేలికైన పనికాదు. అయినా వాటిని పరిశీలించి పీఠికలు రాసిన ధన్య పరిశోధకుల్లో వేటూరి ఒకరు. పీఠికాకర్తలందరిలో ఒకరుగా కాకుండా తాను ఎంచుకున్న శోధనామార్గంలో పయనించి సత్యాన్వేషణ తత్పరతతో గ్రంథపరిష్కరణ చేసి పీఠికలు రాశారు. వేటూరి రాసిన ప్రతి పీఠిక కూడా అద్భుతమే. అందుకే వాటిని కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘తెలుగు సాహిత్యానికి పేటిక’ లన్నారు.

2. వేటూరి వారి పీఠికలు- వైశిష్ట్యం:

వేటూరి ప్రభాకరశాస్త్రి మొత్తం 57 గ్రంథాలకు పీఠికలు రాశారు. అవి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీఠం తి.తి.దే. పక్షాన రెండు సంపుటాలుగా ప్రచురించింది. తంజావూరి ఆంధ్రరాజులచరిత్ర, బసవపురాణం, క్రీడాభిరామం. ఉద్భటారాధ్యచరిత్ర, హరవిలాసం, అన్నమాచార్యచరిత్ర, పావులూరి మల్లనగణితం, ధనుర్విద్యావిలాసం, సుభద్రకల్యాణం, మనుచరిత్ర, ఉత్తరహరివంశం, రంగనాథ రామాయణం, వేంకటేశ్వరలఘుకృతులు, తాళ్ళపాక వాజ్మయ పరిశోధన లాంటి గ్రంథాలకు పీఠికలు సంతరించారు. సుమారు 57 గ్రంథాలను పరిశీలించి, పరిష్కరించడమంటే సామాన్య విషయం కాదు. ఈ పీఠికలన్నీ మొక్కుబడులుగా రాసినవి కావు. ఆయన రాసిన పీఠికలన్నీ సుదీర్ఘమైనవి. ఎన్నో చారిత్రక ఆధారాల్ని సేకరించి, సాహిత్య చరిత్రని వీక్షించి, సప్రమాణంగా, విమర్శనాత్మకంగా వారు తెలియజేశారు. ఆ పీఠికలన్నీ ఆయా గ్రంథాలకంటే గొప్పవిగా రాశారు. నిడివిలో కుడా గ్రంథం కంటే ఎక్కువ పుటల్లో వీరు రాసిన కొన్ని పీఠికలు విస్తరించి ఉండటం విశేషం. లోగడ ఒక పరిహాసికుడు పండితునికి నిర్వచనం ఇస్తూ ‘విషయం కంటే ఉపోద్ఘాతం ఎక్కువ చెప్పగాలిగినవాడు పండితుడు’ అని అన్నాడని మనం వింటుంటాం. వేటూరి వారి పీఠికలు ఆ వ్యాఖ్యకు చురకవంటివని ఘంటాపథంగా చెప్పవచ్చు. పుటలు నింపేశానన్న ఆత్మసంతృప్తికోసం కాకుండా, కొన్ని మౌలికమైన విషయాలతో ప్రణాళిక బద్ధంగా పీఠికలురాయడం ప్రభాకరశాస్త్రి విశిష్టత.

3. వేటూరివారి పీఠికాలక్ష్యాలు: 

ప్రభాకరశాస్త్రి పీఠికలు అధ్యయనం చేస్తే వారి పీఠికారచన ప్రణాళికలో కింది విషయాలు లక్ష్యాలుగా సాగుతాయి.

 

  1. తాను పరిష్కరిస్తున్న గ్రంథానికి లభ్యమౌతున్న,వీలైనన్ని ప్రతులు సేకరించి పరిశీలించడం. 
  2. పాఠాంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సరైన పాఠనిర్ణయం చేయడం.

  3. కవికాలాన్ని, రచనా కాలాన్ని ఆధారాలతో నిర్ణయించడం.

  4. గ్రంథకర్తృత్వ నిర్ణయంలో వివాదాలు తలెత్తినప్పుడు అనేక ఉపపత్తులతో, ఉదాహరణలతో నిరూపించడం.

  5. కవిప్రయోగించిన విశేషాంశాల గురించి ప్రస్తావించడం. అవి పూర్వకవుల ప్రయోగాల్లో వున్నాయేమో తర్కించడం.

  6. అప్పటి వరకు నిఘంటువుల్లో చేరని గ్రంథంలోని పదాలకు అర్థ వివరణలు ఇవ్వడం.

ఇంతటి ప్రణాళికబద్దంగా పీఠికారచన చేశాడు కాబట్టే, అవి సాహిత్య చరిత్రలు అధ్యయనం చేసేవారికి కల్పతరువులయ్యాయి . ప్రభాకరశాస్త్రి రాసిన పీఠికల్లో చెప్పిన అంశాలకు ప్రమాణం తప్పనిసరిగా సూచిస్తారు.

4. పీఠికలు - ప్రతిపాదనలు:

వేటూరి ప్రభాకరశాస్త్రి తొలిదశలో అంటే 1914లో తంజావూరి చరిత్రకు పీఠిక రాశారు. దానికి ‘తొడిమ’ అని పేరు పెట్టారు. వేటూరి ఈ పీఠిక రాయడం వల్ల అప్పటి వరకు దక్షిణాంధ్రయుగ సాహిత్యం పట్ల వున్న చులకన భావన తొలగిపోయింది. తంజావూరు, మధుర, చెంజి రాజ్యాల్లో వచ్చిన వందలాది ప్రబంధాలు వెలుగులోకి వచ్చాయి. నాయిక రాజుల సాహిత్యసేవ ఎలా సాగిందో ప్రపంచానికి తెలిసింది. దక్షిణదేశంలో వచ్చిన కావ్యాలు ప్రచారంలో లేకపోవడం కొందరు పండితులు అపోహ పడ్డారని అభిప్రాయపడ్డారు. ఈ పీఠిక “తంజావూరి చరిత్ర” గ్రంథం దక్షిణదేశ సాహిత్య చరిత్రను విశదం చేస్తుంది.

ప్రాచీన కవులు రాసిన రసవంతమైన పద్యాలను గుర్తుపెట్టుకోవడం, నెమరువేసుకోవడం సహజం. వేటూరి కంటే ముందే మానవల్లి రామకృష్ణకవి మూడు సంకలన గ్రంథాలు వెలుగులోకి తెచ్చివున్నారు. “ప్రబంధరత్నాకరం” అనే సంకలన గ్రంథం తంజావూరులో ప్రభాకరశాస్త్రికి లభించింది. దాని సంధాత పెదపాటి జగన్నాథకవి. కాకినాడలో తుది మొదలు లేని మరో సంకలనగ్రంథం లభ్యమైతే వాటిని ఉదాహరణ పద్యాలుగా ప్రచురించారు. శాస్త్రి వాటిని అకారాది క్రమంలో ముద్రించానని, భాషాచరిత్రను అధ్యయనం చేసే వారికి ఇది మిక్కిలి దోహదపడుతుందని ప్రభాకరశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ సంకలనగ్రంథం వల్ల అప్పటికి కవులచరిత్రలో చేరని అన్నమాచార్యుడు, యకలంకుడు లాంటి వారి పద్యాలను చేర్చాడు. నన్నెచోడుడు, సోమనకు సమకాలీకుడని ప్రతిపాదించారు. కవిజనాశ్రయం వేములవాడ భీమకవి రచన కాదని, మల్లియ రేచన దని రుజువు చేశారు.

1922లో ప్రచురించిన ‘చారుచర్య’ ఉపోద్ఘాత౦ (వేటూరి వారి పీఠికలు, మొదటి భాగము. పుట. 58)లో దానికిమూలం సంస్కృతంలో భోజమహారాజు రాసిన ‘చారుచర్య’ అని, దానిని అప్పనమంత్రి రచించాడని ప్రతిపాదిస్తూ, అది వైద్యనీతిని తెలిపే ధర్మశాస్త్రమని వివరించారు. ‘శ్రీకాకుళ శ్రీహరిశతక’ పీఠిక రాస్తూ, ఆ క్షేత్రచరిత్రను కూలంకషంగా చర్చించారు. ఈ క్షేత్రం ఎప్పుడూ ఆంధ్రుల రాజధానిగా లేదని నిర్ధారించారు. ఈ ఆంధ్రనాయకుడు స్థానిక దేవత అయి ఉంటాడని, కొన్ని ఇతర క్షేత్రాల దేవతల పేర్లు ఉపపత్తులుగా చూపించాడు. బౌద్ధమతాన్ని వెక్కిరిస్తూ వేదమతాన్ని ప్రచారం చేయడం కోసం రాయబడిన ‘భగవదజ్జుక’ మనే సంస్కృత ప్రహసనాన్ని చక్కగా తెలుగులోకి అనువదదించి పీఠిక రాశారు వేటూరి. ఈ విషయాన్ని వారు సుదీర్ఘంగా చర్చిస్తూ రామానుజుడు ఆదరించిన బోధాయనుడు కవి కాదని, మరొకరై ఉంటారని ప్రతిపాదన చేశారు.

1925లో ప్రచురించబడిన ‘ఉద్భటారాధ్యచరిత్ర’ తెనాలి రామలింగడు రచించినది. రామలింగడు వైష్ణవమతాన్ని స్వీకరించి తర్వాత రామకృష్ణుడయ్యాడు. ఆ విషయాన్ని 1918లో ప్రచురించబడిన ప్రబంధరత్నావళిలో “రామకృష్ణుడు వేరు, రామలింగుడు వేరుగా మానవల్లి రామకృష్ణ కవిగారు వ్రాసినారు. సత్యము కాకపోవచ్చు1 అని ప్రభాకరశాస్త్రి అభిప్రాయపడ్డారు. దాన్ని ధ్రువీకరిస్తూ ఇద్దరూ ఒకటేననే తన అభిప్రాయాన్ని సిద్ధాంతీకరించారు. ఇందుకు ప్రమాణంగా తెనాలి రామకృష్ణకవి మనముడైన రామభద్రకవి ‘ఇందుమతీపరిణయం’ అవతారిక పద్యాలు ఉటంకించి, చూపి స్పష్టం చేశారు.(వేటూరి వారి పీఠికలు, మొదటి భాగము. పుట. 82)

1926లో ప్రచురించబడిన ‘మనుచరిత్ర’కు వేటూరి వారు పీఠిక రాశారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు గురించి చక్కని విమర్శ చేశారు. కవితాలక్షణాలైన శైలి, ఔచిత్యం, కల్పనా- చాతుర్యం, లోకజ్ఞత, పూర్వకవుల అనుసరణ, కథాసంవిధానం మొదలైన అంశాలతో పెద్దన చేసిన కొన్ని మెళుకువలు సంస్కృత వ్యాకరణ విరుద్ధప్రయోగాలను మొహమాటం లేకుండా తెలియజేశారు. (వేటూరి వారి పీఠికలు, మొదటి భాగము. పుట. 98)

1926 నాటి ‘బసవపురాణ పీఠిక’ వేటూరి వారు రాసిన పీఠికల్లో పేరెన్నిక గన్నది. దీనిలో సమకాలీనచరిత్రను విస్తృతంగా చర్చించారాయన. ఈ పీఠిక ప్రభాకర శాస్త్రికి ఉన్న చరిత్రజ్ఞానానికి, న్యాయదృష్టికి, విమర్శనా దృక్పథానికి, శాస్త్ర వైదుష్యానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. పాల్కురికి సోమన గురించి, శైవమత విషయాల గురించి అనేక విషయాలు ఇందులో చర్చించారు ప్రభాకరశాస్త్రి. (వేటూరి వారి పీఠికలు, మొదటి భాగము. పుట. 163) తెలుగునాట వీరశైవులు తొలుత లింగదారులు కారని ప్రతిపాదించారు. ఇది విమర్శలకు తావిచ్చినా, అది ముమ్మాటికి నిజమని నిరుపించారు.

ప్రభాకరశాస్త్రి పూనుకొని ప్రచురించకుంటే ‘క్రీడాభిరామం’ తెలుగు వారికి కనిపించకుండా కనుమరుగయ్యేదనడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు. ఈ గ్రంథానికి ఒకే ఒక తాళపత్ర ప్రతి అప్పటికి లభించింది. అది కుడా క్రిమిద్రష్టం, గ్రంథకర్తృకంలో వివాదం నెలకొని ఉంది. దానిని పరిష్కరించి ప్రకటిస్తూ, వేటూరి రాసిన పీఠిక విశిష్టమైంది. శ్రీనాథుని ఇతర కృతులను ఆధారంగా చూపి క్రీడాభిరామం శ్రీనాథుని కృతేనని, వినుకొండ వల్లభరాయునిది కాదని సిద్ధాంతీకరించారు. వేటూరి వారు అందుకోసం సంస్కృత మహాకావ్యాల నుండి, నాటకాల నుండి సాక్ష్యాలు చూపించారు. కాకతీయుల చరిత్ర గురించి ఈ క్రీడాభిరామంలో ఉన్న విషయాలను పీఠికలో పొందుపరిచారు. కానీ అప్పటికే మానవల్లికవి వినుకొండ వల్లభరాయులు ‘క్రీడాభిరామం కర్త’ అని ప్రతిపాదించి ఉన్నప్పటికీ, సహృదయులైన వేటూరి తన పీఠికలో “‘వారి యనజ్ఞ గొనియే నేనీ గ్రంథమున సంస్కరించి యుపోద్ఘాతము రాసి యచ్చున కిచ్చితిని’’2 అన్నారు. కాకతీయుల ఇలవేల్పు కాకతమ్మ అని ప్రతిపాదించారు. ఓరుగల్లుకు సంబంధించిన సాంఘికచరిత్రను విశదం చేశారు.

బాలసాహిత్యం విలువను వేటూరి సుమారు 80 ఏళ్లకిందటే గుర్తించారు. ‘ఉన్నత కవితా వాహినికి బాల వాజ్మయం ,మూటపట్టని చెప్పవచ్చునని‘’3 అని అందుకు తగిన విధంగా తెలుగు వాచకాలుండాలని అభిప్రాయపడ్డాడు. బాల్యంలో కవితాత్మక సృజనాత్మక మెళకువలు నేర్పకపోతే తెలుగు పలుకుబళ్ళు, సంగీతచ్ఛాయలు, పాటలు, పద్యాలు చక్కగా చదవలేకపోతున్నారని ‘బాలభాష’ పీఠికలో చురకలంటించాడు.

నాచన సోమన రాసిన “ఉత్తరహరివంశానికి” వేటూరి వారు రాసిన పీఠిక పరిమాణంలో చిన్నదైననప్పటికీ, విషయవ్యక్తీకరణలో మహత్తరమైనది. నన్నయభట్టు ధారాశుద్దీ, తిక్కన భావగాంభీర్యత కొన్ని చోట్ల శయ్యా సౌభాగ్య౦ అతిమాత్రమై అర్థ సౌలభ్యం కొరవడిందని ధైర్యంగా చెప్పారు. సోమన కాలాన్ని ప్రామాణికంగా నిర్ధారించారు. ప్రాచీనాంధ్రకవికృతుల్లో కష్టమైన శైలి అవలంభించిన వారిలో నాచన సోమనాథుని ప్రధానమైనకవిగా తెలుపుతూ ఆంధ్రకవులలో చిత్రకవిత్వమును వెలయించిన వారిలో నీతడే ప్రథముడుగా గానవచ్చుచున్నాడు అని ప్రశంసించారు శాస్త్రి. 

వేటూరి 1939లో శ్రీనాథుని ‘హరవిలాసానికి’ పీఠిక రాసిన ప్రభాకరశాస్త్రి శ్రీనాథుని జన్మస్థలం కాశీపట్టణంగా పేర్కొన్నారు. కాళిదాసు కుమారసంభవాన్ని అనుసరించే సన్నవేశాల్లో ప్రథమ, ద్వితీయాశ్వాసాల్లో ఏ విధంగా ‘పాడు’ చేసిందీ, ‘పాడి’ చేసింది. హృద్యంగా వివరించారు. శాస్త్రి ‘కోహళి’ అనే పదాన్ని గురించి చర్చిస్తూ ఈ పద ప్రయోగం శ్రీనాథుడు, నాచన సోమనలు మాత్రమే చేశారని, దీనికి సంస్కృతంలో ‘మురారి’ నాటకశ్లోకభాగం మూలమని నిరూపించారు. కందుకూరి రుద్రకవి రాసిన ‘సుగ్రీవవిజయాని’కి ‘మధురకవిత’ల పేరిట పీఠిక రాశారు. తెలుగు సాహిత్యంలో దేశిసాహిత్యాల స్థానాన్ని విశదీకరించారు.

దేశి రచనలలో నుండి సింగి, సింగడి, కోణంగి, దరువు అనునవి నటీ నటులుగను, విదుషకుడును, ధ్రువగను సంస్కృత నాటకముల జేరెనేమో యని కుడా యోజింపదగి నట్టున్నది’’4 అని ద్రావిడభాషల ప్రభావం సంస్కృతం పైన కూడా ప్రసరించకుడదా? అనే కొత్త ప్రతిపాదన భాషావేత్తల కంటే ముందుగానే ప్రభాకరశాస్త్రి సిద్ధాంతీకరించారు. గిడుగు సీతాపతి ‘భారతి శతకాని’కి ఉపోద్ఘాతం రాస్తూ వ్యావహారిక భాషావాదాన్ని సమర్థించారు.

5. తాళ్ళపాక కవుల సాహిత్యశోధన :

తెలుగు సాహిత్యంలో తాళ్ళపాక కవులది కొంత, తక్కిన కవులది కొంత అనే అభిప్రాయముంది అని అంటారు వేటూరి. 19వ శతాబ్దంలో ఒక్కో మహాపురుషుడు ఒక్కో మహత్కార్యంకోసం పుట్టినట్లు అనిపిస్తుంది. తెలుగువ్యాకరణ శాస్త్రాన్ని తన బాలవ్యాకరణంతో చిన్నయ్యసూరి పరిపూర్ణం చేస్తే దానికి ‘రమణీయమ’నే వ్యాఖ్యను దువ్వూరి వెంకటరమణశాస్త్రి రాసి ఖ్యాతి వహించాడు. అలాగే శ్రీవే౦కటేశ్వర స్వామిపై పదకవితలల్లి పాడిన వాగ్గేయకారుడుగా అన్నమయ్య, వారి కుటుంబాన్ని తెలుగు జాతి మరిచి పోకుండా జగద్విఖ్యాతి చేసిన ఘనత కుడా వేటూరి వారికే దక్కుతుంది. 

తాళ్ళపాక తిరువేంగళనాథుడు రాసిన ‘అన్నమాచార్యచరిత్రకు’ 133పుటల సుదీర్ఘ పీఠికను వేటూరి వారు సంతరించారు. అన్నమయ్య జనన మరణ తేదీలను, తిరుమలకొండ చరిత్రను విశేషాలను విశదీకరించారు. వేటూరి ప్రభాకరశాస్త్రి తాళపత్ర సేకరణలో భాగంగా శ్రీకాళహస్తి సంస్థానంలో దొరికిన ‘సుభద్రాకల్యాణం’ రాతప్రతిని పరిష్కరించి ప్రచురించారు. దానికి రాసిన పీఠికలో ప్రథమాంధ్ర కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్కేనని ధైర్యంగా ప్రకటించారు. వేటూరి అప్పట్లో దీనిపై పెద్ద దుమారం రేగినా, సద్దుమణుగక తప్పలేదు. ఎందుకంటే వేటూరి వారు ఏదైనా ఒక ప్రతిపాదన చేశారంటే అందులో సత్యాన్వేషణ ఉంటుంది. అన్నమాచార్య సంకీర్తనల్లో 4వ సంపుటానికి ప్రభాకరశాస్త్రి రాసిన పీఠికలో తొలుత అన్నమయ్యకీర్తనలు ప్రచురించి, తర్వాత ఆయన పుత్ర పౌత్రులవి ప్రచురించాలని ప్రతిపాదన చేశారు. తాళ్ళపాక కవుల కీర్తనలను నిరంతరం శ్రమపడి , పరిష్కరణ చేసినా ప్రచురణకు మరో పది సంవత్సరాలు పడుతుందని ఆ పీఠికలో అభిప్రాయపడ్డారు. లభిస్తున్న రాగిరేకుల్లో వచనములు ఎన్ని ఉన్నాయో వివరించారు. ఇంకా వే౦కటేశ్వర వచనములకు ‘వే౦కటేశ్వర లఘుకృతులు’ ‘ఆంధ్రామరుకము’ లాంటి తాళ్ళపాక కవుల రచనలకు పీఠికలు వెలయించారు శాస్త్రి.

ప్రభాకరశాస్త్రి ప్రాచీన కావ్యాలకే గాకుండా కృష్ణమాచార్యులు రాసిన ధనుర్విద్యావిలాసం, శ్రీపాదకృష్ణమూర్తి రాసిన శ్రీకృష్ణభారతము, తుమ్మల సీతారామమూర్తిచౌదరి రాసిన ధర్మజ్యోతి, బయిరెడ్డి సుబ్రహ్మణ్యం రాసిన గాంధీశతకం, ముదివర్తి కొండమాచార్యులు రాసిన ధర్మదీక్ష వంటి పలు ఆధునిక కావ్యాలకు కూడా పీఠికల రూపంలో సమీక్షలు, అభిప్రాయాలు, ఆమోద ప్రోత్సాహాకాలు కూడా అందించారు.

6. ముగింపు:

‘గ్రంథం కంటే పీఠిక విలువైనది’ అనే దృక్పథం వేటూరి వారి పీఠికల అధ్యయనం వల్ల బోధ పడుతుంది. పీఠికలంటే గ్రంథ సారాంశాన్ని రాసేవి కావని, గ్రంథం బాగా చదివి న్యాయబద్ధంగా, పీఠికలు రాయాలని, లోతైన విశ్లేషణలతో సాగాలని వేటూరి వారి పీఠికలను చుస్తే అర్థమౌతుంది.

వేటూరి వారి పీఠికలు ఆయా గ్రంథాలకు జీవనాడులుగా భాసిస్తాయి. ప్రభాకరశాస్త్రి రాసిన పీఠికలు వర్తమాన పరిశోధకులందరూ ప్రశంసించడానికి కారణం వారు కలం పట్టినప్పుడంతా కలకాలం నిలిచే సత్యాన్ని చెప్పడంతోపాటు, గ్రంథంపట్ల అంతవరకు వున్న గాసటబీసటను తొలగించి సప్రమాణాలతో, సహేతుకంగా వింగడించి విమర్శించడమేనని ఘంటాపథంగా చెప్పవచ్చు. 

7. పాదసూచికలు:

  1. వేటూరి వారి పీఠికలు మొదటి భాగం, పుట – 6 
  2. వేటూరి వారి పీఠికలు - రెండో భాగం, పుట - 5
  3. బాల భాష - ప్రభాకరశాస్త్రి వేటూరి, పుట -2
  4. వేటూరి వారి పీఠికలు - రెండో భాగం, పుట – 165

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. చెన్నప్ప, మసన. వేటూరి వారి వచనరచనలు. తెలుగుశాఖ ఉస్మానియా విశవిద్యాలయం.
  2. ప్రభాకరశాస్త్రి, వేటూరి. నన్నెచోడుని కుమారసంభవము వ్యాఖ్య – విమర్శ. పాఠపరామర్శ హైదరాబాద్.
  3. ప్రభాకరశాస్త్రి, వేటూరి. వేటూరి వారి పీఠికలు. రెండు భాగములు శ్రీవేటూరిప్రభాకరశాస్త్రి వాజ్మయపీఠం, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2012
  4. ప్రభాకరశాస్త్రి, వేటూరి. (సంపా.). ప్రబంధరత్నావళి. శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం, తితిదే, తిరుపతి, 2014.
  5. శేషగిరిరావు, పోచిరాజు. వేటూరి వారి సారస్వత వరివస్య-పెద్దాపురం, తూ.గో.జిల్లా, 1986

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]