AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. మహాభారతం: సంస్కృతీవిన్యాసం
డా. డి. మస్తానమ్మ
రాష్ట్ర సభ్యులు,
అధికార భాషాసంఘం (ఆ. ప్ర),
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9948016904, Email: masthana2002@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ఏ జాతి అయినా తమ సంస్కృతి సంప్రదాయాలను ఇతరులను చూసి నేర్చుకోదు. అది తమ నరాల్లోనే రక్తరూపంలో ఇమిడిపోయి ఉంటుంది. అయితే ఇతర జాతుల సంస్కృతీ సంప్రదాయాలు ఆచరణీయంగా ఉంటే వాటిని పాటించుటలో తప్పులేదు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ముగ్ధులైన విదేశీ యువతులు మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో మనదేశానికి వచ్చి వివాహం చేసుకుంటున్నారు. ఇటీవల విదేశీ యువతీ యువకుల జంట పుట్టపర్తికి వచ్చి మన సాంప్రదాయ రీతిలో వివాహం చేసుకున్నారు. ఏ జాతికైనా గత సంస్కృతి వైభవం రెండు మార్గాల ద్వారా తెలుస్తుంది. అందులో ఒకటి సాహిత్యం, రెండోది ఆచరణ. అయితే గత సంస్కృతి అంతా ఆచరణలో ఉండకపోవచ్చు. అందువల్ల గత ప్రామాణిక సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే దాని సమగ్రత బోధపడుతుంది. ఈ దృక్పధంతో మహాభారత ఇతిహాసాన్ని పరిశీలించిన తరతరాలకు తరగని చెరగని అవిచ్ఛిన్నంగాని మన సంస్కృతీ వైభవం ఎలాంటిదో తెలుస్తుంది. ఈ చర్చా పత్రంలో మహాభారతంలో చెప్పబడిన సంస్కృతీ విన్యాసం విశ్లేషించబడింది.
Keywords: మస్కారసంస్కృతి, గురుశిష్యుల అనుబంధసంస్కృతి, సత్యసంస్కృతి, నీతిసంస్కృతి, త్యాగసంస్కృతి, శరణాగతరక్షణ సంస్కృతి, అతిథిసంస్కృతి, భార్యాభర్తల అనుబంధసంస్కృతి.
1. ఉపోద్ఘాతం:
సంస్కృతి అంటే ఒకజాతి సమీకృత జీవన విధానం. వారి ఆచార వ్యవహారాలు, వారు పాటించే సాంప్రదాయాలు వంటివన్నీ సంస్కృతిలో భాగమే. ఈ సంస్కృతి పాలనలో ఒక జాతి వారికి మరోజాతి వారికి ఎన్నో భేద సాదృశ్యాలుండవచ్చు. అంతేగాకుండా ఒక జాతిలోనే ఎన్నో వర్గాల ప్రజలు భిన్న సంస్కృతులను పాటిస్తూ ఉండవచ్చు. మనది భారత జాతి. అందులో భాషాపరంగానూ, ప్రాంతపరంగానూ, సామాజిక పరంగాను భిన్న సంస్కృతులవారున్నారు. ఉదాహరణకు తెలుగువారి సంస్కృతి వేరు, తమిళుల సంస్కృతివేరు, అయితే స్థూలంగా చూస్తే మనదంతా అఖండ భరతజాతి.
2. నమస్కార సంస్కృతి:
పెద్దలు మనవద్దకు వచ్చినా పెద్దల వద్దకు మనం వెళ్ళినా వారికి మొట్టమొదటిగా నమస్కారం చేయాలి. ఇది సనాతన భారతీయ సంస్కృతి. అదే విధంగా తల్లిదండ్రులకు, గురువులకూ నమస్కరించాలి. ఈ సంప్రదాయం భారతంలో పాటించబడినట్లు స్పష్టంగా తెలుస్తున్నది.
నైమిశారణ్యంలో మహామునులందరూ చేరి కులపతియైన శౌనకుని పర్యవేక్షణలో పన్నెండు సంవత్సరాలు చేయవలసిన వ్రతం చేస్తున్నారు. లోమ హర్షుని కుమారుడైన ఉశ్రవుడనే పౌరాణికుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. అక్కడ సుఖంగా ఆశీనులైన మునులకు వినయపూర్వకంగా “నమస్కరించాడు". ఆ మునులు చూపిన ఆసనం మీద నమ్రతతో కూర్చున్నాడు. కుశల ప్రశ్నలనంతరం వారు ఆ మునిని మహాభారత కథలు వినిపించమని కోరారు. అప్పుడు ఆ పౌరాణికుడు సకల భువనాలకు ప్రభువైన పరమాత్మకు, శ్రీమహావిష్ణువుకు నమస్కరించి సర్వలోక పూజ్యుడు మహాత్ముడు అయిన వ్యాస మునీంద్రుడు చెప్పిన ఇతిహాసాన్ని వారికి వివరించాడు. ఉగ్రశ్రవసుడు గొప్ప పౌరాణికుడు. పైగా మునులకే భారతాన్ని వినిపించటానికి వచ్చాడు. అంటే అతడు వారికి గురుదశలో ఉంటాడు. అయినా అక్కడికి రాగానే వారికి నమస్కారం చేశాడు. వారు చూపిన ఆసనం మీద వినయంగా కూర్చున్నాడు.
పాండవుల వద్దకు రాయబారిగా వెళ్లి వచ్చిన సంజయుడు వారి యోగక్షేమాలు చెప్పి తక్కిన అంశాలు రేపు సభలో వివరిస్తానని వెళతాడు. అతని మాటల ద్వారా పాండవులు తన కొడుకులైన కౌరవులకంటే మిన్నగా ఉన్నారని ధృతరాష్ట్రుడు గ్రహిస్తాడు. అప్పుడు అతనిలో మనో వేదన కలుగుతుంది. దానినుండి కొద్దిగా ఉపశమనం పొందడానికి విదురున్ని పిలిపించుకుంటాడు. అన్న వద్దకు వచ్చిన విదురుడు ధృతరాష్ట్రునికి నమస్కరిస్తాడు. అతడు చూపిన ఆసనంపై వినయంగా కూర్చుంటాడు.
ఈ రెండు సంఘటనలు మనకు ఏమి తెలియజేస్తున్నాయి, పెద్దలకు నమస్కారం చేయాలని. ఈ సాంప్రదాయాన్ని నేడు త్రికరణ శుద్ధిగా పాటిస్తే వ్యక్తుల మధ్య ఉన్న అంతరాలు తగ్గుతాయి. మనస్పర్ధలు పుట్టనే పుట్టవు. అహంకారానికి ఆస్కారమే ఉండదు. దాని ద్వారా మంచి సభ్యతగల ఆదర్శ సమాజం రూపుదాలుస్తుందని గట్టిగా చెప్పవచ్చు. నమస్కారం చేయడమనేది ఎదుటి వ్యక్తిని గౌరవించడం కోసమన్నది ఒక కోణమైతే, నమస్కారం చేసిన వారి సంస్కారానికి అది నిదర్శనంగా నిలుస్తుంది. దాని ద్వారా వారి గౌరవం మరింత ఇనుమడిస్తుందేగాని తరగదు, నమస్కారం చేయకపోవడం అహంభావానికి, చేయడం ఆత్మౌన్నత్యానికి నిదర్శనాలుగా భావించవచ్చు.
3. గురుశిష్యుల అనుబంధ సంస్కృతి:
తల్లితండ్రి తరువాతి స్థానం గురువుదే. అజ్ఞానమనే చీకటిని తొలగించువాడు గురువు. ప్రాచీన కాలం నుండి కూడా గురువుకు మన సమాజం ఉన్నత స్థానాన్నిచ్చింది. విద్యాబుద్ధులు చెప్పిన వారేగాక జ్ఞాన బోధకులందరినీ కూడా మనం గురువులుగానే భావిస్తున్నాం. ఆ పరంపరలో వాల్మీకి, వ్యాసులను గురువులుగా పూజిస్తున్నాం. మంచి గురువు మాత్రమే శిష్యులను ఉత్తములుగా తీర్చగలడు. రామకృష్ణ పరమహంస అందుకు ప్రబల నిదర్శనం. ఆయన బోధనల చేత ప్రభావితుడైన స్వామి వివేకానంద ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందాడు. అయితే గురువుగారి జ్ఞానాన్ని తెలుసుకొనే చురుకైన విద్యార్థి కూడా ఉండాలి.
శ్లో॥ యథాఖనన్ ఖనిత్రేణ। నరో వార్యధి గచ్ఛతి ।
తథా గురు గతాం విద్యాం। శుశ్రూషు రథిగచ్ఛతి॥1
గునపంతో బావి త్రవ్వి మానవులు భూమి నుంచి మంచి నీటిని పొందునట్లుగా శిష్యుడు శుశ్రూష చేసి గురువు వద్దనుంచి విద్యలను పొందాలని మనుస్మృతి తెలుపుతుంది. ఇది ప్రాచీన విద్యాభ్యాస కాలానికి అద్దం పడుతుంది. అయితే నేడు గురువుగారి జ్ఞానాన్ని పొందాలనే తపన విద్యార్థికి ఉంటే చాలు. గురువు నుంచి విద్యను అవలీలగా తెలుసుకుంటాడు.
గురువు కుల మతాలకు అతీతంగా ఉండాలి. ఆశ్రయించి వచ్చిన శిష్యునికి విద్యాబోధన చేయాలి. చివరికి శత్రువు కొడుకైనా అభ్యంతరం చెప్పకూడదు. అయితే భారతంలో అభ్యంతరం చెప్పిన సంఘటనలు కొన్ని కనిపిస్తాయి. నిషాదుడైన ఏకలవ్యునికి ద్రోణుడు, సూతకుల సంజాతుడైన కర్ణునికి పరుశురాముడు విద్యాబుద్ధులు చెప్పుటకు నిరాకరించారు. దానికి కారణాలు ఏవైనా ఈ రెండు సంఘటనలు సమర్థనీయాలుకావు. నాడున్న రాజరికవ్యవస్థ కట్టుబాట్లకు వాటిని సాక్షీ భూతాలుగానే చూడాలి. నేడు ఆ పరిస్థితి సమాజంలో పూర్తిగా మారింది.
అయితే కచున్ని మాత్రం శుక్రాచార్యుడు శిష్యుడిగా స్వీకరించాడు. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. దేవతలకు రాక్షసులకు వైరముండేది. ఆ స్థితిలో కూడా విద్య నేర్పమని కోరివచ్చిన కచున్ని శిష్యునిగా స్వీకరించాడు. చంద్రిక పంపగా వచ్చిన కచుడు-
"దేవహితార్థంబు వృషపర్వు పురంబునకుంజని యచ్చట వేదాధ్యయన శీలుండయి సకల దైత్య దానవ గణోపాధ్యా యుండయి యున్న శుక్రుంగని నమస్కరించి యిట్లనియె" అంటాడు నన్నయ మహాకవి. శత్రువు కొడుక్కి కూడా విద్య నేర్పుటకు అంగీకరించి రాబోయే తరాల గురువులకు ఆదర్శమూర్తిగా నిలిచాడు. పైగా ఇలా అంటాడు "నిన్ను గౌరవించినచో నీతండ్రి గారైన బృహస్పతిని పూజించినట్లు అవుతుంది కాన నీకు. తప్పక విద్యలు నేర్పుతాను. తగిన వ్రతమును పాటించుము” అంటాడు. కచుడు కూడా మృత సంజీవని విద్యనుపొందాక గురవును బ్రతికించి కృతజ్ఞత చూపాడు.
ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవ వీరుల మహిమను అర్జునుడు పేరు పేరునా శ్లాఘించాడు. ఆపరంపరలో మొట్టమొదటగా తన గురువైన ద్రోణుని గూర్చి గొప్పగా చెప్పాడు.
సీ. “కాంచన మయ వేదికా కన త్కేత నోజ్జ్వల విభ్రమము వాడు కలశజుండు
సింహలాంగూల భూషిత నభో భాగ కేతు ప్రేంఖణము వాడు ద్రోణ సుతుడు
కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట, ధ్వజ సముల్లాసంబు వాడు కృపుడు
లలితకంబు ప్రభాకలిత పతాకా విహారంబు వాడు రాధాత్మజుండు
తే. మణి మయోరగరుచిజాల మహితమైన, పడగవాడు కురుక్షితి పతి మహోగ్ర
శిఖర ఘనతాళ తరువగు సిడమువాడు, సురనదీసూడు డ్రేర్పడఁ జూచి కొనుము”
అర్జునుడు మొదట ద్రోణుని ప్రశంసించి అటు తరువాత అశ్వత్థామ, కృపాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనులను శ్లాఘించి చివరిగా భీష్ముని కీర్తించాడు. యుద్ధసమయంలో గూడా గురువుకు అగ్రపీఠాన్ని వేశాడు అర్జునుడు.
4. సత్య సంస్కృతి:
మనిషి ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి. అసత్యాన్ని పలకరాదు. అసత్యం పలికినవారిని గానీ ఎదుటివారిని గాని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. మనస్వార్థం కోసమైనా సరే అసత్యాన్ని పలకరాదని మన పురాణాది గ్రంథాలు చెబుతున్నాయి. నలుడు, హరిశ్చంద్రుడు సత్యపాలనకు కట్టుబడి ఎన్నో కష్టాలు అనుభవించారు. అందుకే వారి కీర్తి అజరామరంగా ఈ భూమిపై నిలిచి ఉంది.
శ్లో॥ సత్య మేవేశ్వరో లోకే సత్యే ధర్మః ప్రతిష్ఠితః॥
సత్యమూలాని సర్వాని, సత్యాన్నాస్తి పరంపదమ్॥ 2
లోకము నందు సత్యమే దైవం. సత్యము నందే ధర్మం ప్రతిష్ఠితమై ఉంది. జగత్తంతా సత్య మూలకమే. సత్యమును మించిన పరమపదమింకొకటి లేదని రామాయణం తెలుపుతున్నది. మహాభారతంలో కూడా శకుంతల దుష్యంతునికి సత్యమహిమను తెలుపుతుంది.
తే. సర్వ తీర్థాభి గమనంబు సర్వవేద,
సమధి గమము సత్యంబుతో సరియుఁ గాన
యెఱుగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు
సర్వ తీర్థాలు తిరిగితే కలిగే ఫలితమూ, సర్వవేదాలు చదివిన కలిగే ఫలితమూ రెండూ కూడా సత్యముతో తులతూగవంటారు నన్నయ. ఆవిషయాన్ని శకుంతల చేత చెప్పించాడు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అసత్యం పలకవచ్చునన్నారు కవీశ్వరులు.
కం. చను బొంకఁగఁ బ్రాణాత్యయ
మున, సర్వధనాపహరణమున, వధగా వ
చ్చిన, విప్రార్థమున, వధూ
జనసంగమమున, వివాహసమయము లందున్3
ప్రాణాపాయ సమయములందు, సర్వధనాపహరణ సమయమునందు, వధగావచ్చిన విప్రార్థమునందు, స్త్రీలతో సంభోగించే సమయములందు, వివాహ సమయంలోనూ అసత్యం పలకవచ్చునంటుంది భారతం. ఈ ఐదు చాలు క్లిష్ట పరిస్థితులను సూచిస్తాయి. అప్పుడు మాత్రం అసత్యం చెప్పుటకు మినహాయింపు ఇచ్చారు. ఈ రోజుల్లో సత్యము పలికే వారే కరువవుతున్నారు. ఇది సమాజానికి శ్రేయస్కరము కాదు. ప్రతిరోజూ ఎన్నో అసత్యాలు పలుకుతుంటాము. వాటిని గ్రహించి మనపిల్లలు అనుసరిస్తారు. దాని ద్వారా సమాజము అక్రమ మార్గంలో నడుస్తుంది. ఆ కారణంగా సామాజిక జీవనం అస్తవ్యస్తమవుతుంది. ఇది ఏకాలంలోనూ హర్షించదగ్గ పరిణామం కాదు. నేటితరం వారు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి.
5. నీతి సంస్కృతి:
ఏ సమాజమైనా నీతి మార్గంలో నడిస్తేనే పురోగతి ఉంటుంది. నీతి బాహ్యమైన సమాజం సమాజమే కాదు.
శ్లో॥ సప్తదోషాః సదా రాజ్ఞా హాతవ్యా వ్యసనోదయాఃI
ప్రాయశో మైర్వినశ్యన్తి కృతమూలా అపీశ్వరాఃI
స్త్రీయో చక్షా మృగయా పానం వాక్పారుష్యం చ పంచమమ్I
మహచ్ఛ దండపారుష్య మర్ధ దూషణ మేవచ॥4
స్త్రీలంపటత్వం, ద్యూతం, వేట, మద్యపానం, పరుషంగా మాట్లాడటం, తీక్షణంగా దండించటం, ఇతరుల ధనం కాజేయటం- ఈ ఏడు దోషాలనురోజు పరిహరించాలి - అంటూ విదురుడు సప్త వ్యసనాలను పేర్కొన్నాడు. ఈ ఏడు వ్యసనాలు ఇతరులను బాధిస్తాయేగాని, మేలు చేకూర్చవు. పరస్త్రీ వ్యామోహం పనికిరాదు. ఇది సర్వకాలాలకు వర్తించే నీతి. నేడు అక్రమసంబంధాల కారణంగా ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. జూదం రెండవది. జూదం ఆడుట ద్వారా ఎందరో ఆస్తులు అమ్ముకున్నారు. లక్షాధికారు భిక్షాటన స్థాయికి దిగజారారు. నేడు గుర్రపు పందేలు, క్రికెట్ బెట్టింగ్లను జూదం కింద లెక్కగట్టవచ్చు. వేటాడటం మూడవది. దీని మూలంగా అరుదైన వన్యమృగాలు అంతరించిపోతున్నాయి. నేడు ధనికులు సరదాకోసం వేటాడుతున్నారు. దీన్ని నిషేధిస్తూ ప్రభుత్వం కఠినమైన చట్టాలను తెచ్చింది. దాంతో కొంతమేర వేటాడటం తగ్గిందని చెప్పవచ్చు. మద్యపానం నాల్గవది. ఈ వ్యసనం మూలంగానే లక్షలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ధనవంతులు - బికారుల వుతుండగా, పేదలు మాత్రం ఏ రోజు కూలి డబ్బును ఆ రోజు తాగుడుకు ఖర్చు చేస్తూ భార్యాబిడ్డలను గాలికొదులుతున్నారు. మద్యం పైన్నే ప్రభుత్వానికి అధిక ఆదాయం కూడా వస్తున్నది. మద్యపానం వల్ల అరాచకాలు గూడా ఎక్కువవుతున్నాయి. పరుషంగా మాట్లాడేది కూడా వ్యసనంగా పరిగణించింది భారతం. అట్లా మాట్లాడితే ఎదుటివారు బాధపడతారు. వారిని బాధించకూడదు. ఇతరులతో సౌమ్యంగా మాట్లాడాలి. అదేవిధంగా దందన చేయుటకూడా తీక్షణంగా ఉండరాదు. ఇతరుల ధనాన్ని సమా? అపహరించరాదు.
నేడు ఏడవ వ్యసనం యధేచ్ఛగా సాగుతున్నది. దొంగతనాలు, లూటీలు, చైన్ తెంచుకొని పోవడాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. దీనికి పాల్పడుతున్న వారు చదువుకొన్నవారు కావడం గర్వించదగ్గ విషయం. ఈ ఏడు వ్యసనాలు సమాజానికి చేటు కలిగించేవి. ఇవి లేని సమాజాన్ని మనం ఊహిస్తే ఎలా ఉంటుందో చెప్పటానికి మాటలు చాలవు. పోల్చటానికి ఉపమానాలు ఉండవు.
6. త్యాగ సంస్కృతి:
మనకున్నదానిలో కొంత ఇతరులకిస్తే అది దానం అవుతుంది. ఉన్నదంతా ఇచ్చేస్తే అది త్యాగం అవుతుంది. దానమూ, త్యాగమూ అను ఈ రెండింటి గూర్చి భారతం చాలా ఉన్నతంగా చెప్పింది. దానం చేయుటలో కర్ణుని కీర్తి, త్యాగం చేయుటలో శిబిచక్రవర్తి కీర్తి దిగంతాల వరకు వ్యాపించింది. బ్రాహ్మణ వేషంలో వచ్చి అడిగిన దేవేంద్రునికి కర్ణుడు కవచకుండలాలు దానం చేశాడు. దేవతలకు దధీచి తన వెన్నెముకనే త్యాగం చేశాడు.
కృతయుగంలో క్రూరులైన దానవులుండేవారు. కాలకేయులను పేరుగల ఆ దానవులు వృత్తాసురుని బలం చూచుకొని ఇంద్రాది దేవతలను బాధించారు. ఆ దేవతలందరూ బ్రహ్మదేవుని ప్రార్ధించగా- 'మీరు దధీచి మహర్షి వద్దకు వెళ్ళి అతని ఎముకల నిమ్మని ప్రార్ధించండి. లోక క్షేమార్థం అతడు ఇస్తాడు. వాటితో వజ్రాయుధం నిర్మించుకొని వృత్రాసురుని సంహరించవచ్చును అని బ్రహ్మదేవుడు చెప్పగా దేవతలు నారాయణుని ముందు ఉంచుకొని దధీచ్యాశ్రమానికి వెళ్లి ఆమునిని ప్రార్ధించారు. అతడు వెంటనే అంగీకరించి ప్రాణాలు విడవగా ఆ అస్థులతో త్వష్ట వజ్రాయుధం తయారు చేశాడు. ఇంద్రుడు అత్యధికమైన తేజస్సుతో వృత్తాసురునిపై వజ్రం ప్రయోగించగా అతడు హతుడై నేల కూలాడు.
'పరోపకారార్థ మిదమ్ శరీరమ్' అన్నట్లు పరుల కోసం దధీచి లిచ్చాడు. నేడు సమాజంలో దాన, త్యాగ గుణాలు ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. ఎక్కువ మంది దోచుకోవటం మొదలు పెట్టారు. ప్రజల జీవితాలను నేడు డబ్బు శాసిస్తున్నది. ఆ డబ్బుకోసం చేయరాని అక్రమ పనులన్నీ చేస్తున్నారు. వడ్డీ వ్యాపారం, చిట్టీల వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగం నేడు సమాజం మీద దండయాత్ర చేస్తున్నాయి. వాటి మధ్య ఇరుకున్న సామాన్య జనులు దిక్కుతోచక విలవిలలాడిపోతున్నారు. దాంతో సామాజిక జీవనం అతలాకుతలమవుతున్నది. దాన్నుంచి బయట పడాలంటే నేడు ప్రజలు త్యాగబుద్ధిని అలవరచుకొని కార్యరూపంలో చూపాలి.
7. శరణాగతరక్షణసంస్కృతి:
సమస్యల వల్లనో, కష్టాల వల్లనో, మరేవో కారణాలచేత ఎవరైన వచ్చి మనలను ఆశ్రయిస్తే వారికి శరణాగతి రక్షణ కల్పించడం గొప్ప సంస్కృతిగా చెప్పబడుతున్నది. చివరికి శరణు గోరినవాడు శత్రువైనా ఆశ్రయమివ్వాలంటుంది భారతీయ సంస్కృతి. ఆశ్రయమివ్వడమే కాదు అలా చేసినందువల్ల ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని, ప్రాణాన్ని ఫణంగా పెట్టటానికైనా సిద్ధపడాలి. అలాంటి సంస్కృతికి నిలువెత్తు నిదర్శంగా నిలుస్తున్నది శిబిచక్రవర్తి వృత్తాంతం. తనను శరణుగోరి వచ్చిన పావురాన్ని కాపాడటానికి చివరికి తన శరీరాన్ని కూడా త్యాగం చేయటానికి పూనుకుంటాడు.
చ. “అనిన ననుగ్రహించితి మహా విహగోత్తమ యంచు సంతసం
బున శిబి తక్షణంబ యసి పుత్రిక నాత్మ శరీర కర్తనం
బన ఘుడు సేసి చేసి తన యంగములం గల మాంస మెల్లఁబె
ట్టినను గపోత భాగమ కడిందిగ డిందుచునుండె నత్తులన్
కం. దానికి నచ్చెరు వడి ధరణీ నాధుడు తనువు నందు నెత్తురు దొరుగం
దానతుల యెక్కినంతన్, వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహముల్ “
పావురాన్ని కాపాడటం కోసం తన శరీరాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు శిబిచక్రవర్తి. నేడు సమాజంలో శరణాగతి రక్షణ కల్పించు వ్యక్తులే లేరని గట్టిగా చెప్పవచ్చు. ఒక వేళ ఎవరైనా ఆశ్రయించి వచ్చినా వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒంటరి మహిళలు కనిపిస్తే వారిని రేప్ చేసి చంపేస్తున్నారు. చివరికి మూగ, పిచ్చి స్త్రీలను గూడా వదిలి పెట్టకుండా అత్యాచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి రోజూ లెక్కకు మిక్కుటంగా స్త్రీలు లైంగిక దోపిడీకి, అత్యాచారాలకు, హత్యలకు గురి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో శరణాగతి రక్షణకు స్థానమెక్కడుంటుంది? ఆడవారు అర్ధరాత్రిలో ఒంటరిగా నడచివెళ్లడం మాట అటుంచితే పట్టపగలు కూడా స్వేచ్చగా వెళ్లలేకపోతున్నారు. ఈ స్వతంత్ర భారతదేశంలో మలి పురాణాది గ్రంథాలు చెబుతున్న నీతులు ఎటుపోతున్నాయో! మేధావులంతా ఆలోచించాలి.
8. అతిథి సంస్కృతి:
తిథి వార నక్షత్ర యోగ కరణములనే పంచాంగములను పాటించకుండా వచ్చేవారు అతిథులు. అలా వచ్చిన అతిథులకు మర్యాదలు చేయవలసిన బాధ్యత అభ్యాగతిదే. అతిథులను లింగవయో భేదం పాటించకుండా గౌరవించాలి. అతిథి సత్కారం విషయంలో ప్రపంచానికే మన సంస్కృతి మార్గదర్శిగా ఉంటున్నదని గట్టిగా చెప్పవచ్చు. అన్ని గ్రంథాల్లోనూ అతిథి పూజా విధానాన్ని గూర్చి విశిష్టంగా చెప్పబడింది.
శ్లో॥ మాతరం పితరం పుత్రం, దారా నతిధి సోదరాన్॥
హిత్వా గృహీ నభుంజీత, ప్రాణైః కంఠగతైరపి॥
తల్లిదండ్రులు భార్యాబిడ్డలు సోదరులు అతిథులు- వీరిని వదిలిపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గృహస్థు భుజించరాదని ఆర్య ధర్మం తెలుపుతున్నది.
ఇక మనుషులేగాకుండా పక్షులు కూడా అతిథి సత్కారం చేసినట్లు భారతంలో అద్భుతంగా చెప్పబడింది. అరణ్యంలో వర్షానికి తడిసి గజగజ వణుకుతూ ఆకలికి నకనకలాడుతూ తాము నివసిస్తున్న మర్రి వృక్షం కిందున్న బోయవానికి పావురాల జంట చూసి చలించిపోయాయి. అతన్ని తమ అతిథిగా భావించాయి. అతనికి ఆతిధ్యమివ్వాలని నిశ్చయించుకొని చెట్టులోని ఎండు పుల్లలను తమ ముక్కుతో విరిచి కిందకు వేసాయి. వాటితో అతడు చలి కాచుకుంటుండగా ఆ అగ్నిలో పడి ఒక మగపావురం ప్రాణాలు విడిచింది. అతిథి అయిన అతనికి తన శరీరం ఆహారంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో పది అలా చేసింది. ఆ పావురాల అతిథిసత్కారానికి అతనిలో పరివర్తన వచ్చింది. తానింక స్త్రీలను వేటాడనని ప్రతిన పూనాడు. పక్షులను పట్టే చిక్కం, ఇతర సాధనాలను అక్కడే వదిలేసి వెళ్లాడు. భర్తపోయిన పిమ్మట తాను మాత్రం ఎందుకు జీవించాలని ఆడ పావురం అగ్గిలోనే దూకి అసువులు బాసింది.
విమానం మీద తనకై నిరీక్షిస్తున్న భర్తతో స్వర్గానికి వెళ్లింది. బోయవాడు కూడా అరణ్యంలో చెట్లలో, పుట్లలో తిరుగుతూ చివరికి ప్రాణాలు విడిచి స్వర్గం చేరాడు.
9. భార్యాభర్తల అనుబంధ సంస్కృతి:
భార్యాభర్తల బంధం పవిత్రమైంది. అచంచలమైంది. అనిర్వచనీయమైంది. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా కలిసిమెలసి ఉంటామని ప్రమాణం చేసి మూడు ముళ్ళ బంధంతో ఒక్కటవుతారు. ధర్మార్థ కామమోక్షాల సాధనకు జంటగా కృషిచేస్తామని ప్రతిన చేస్తారు. ఆవిధంగా ఉండాలనే పెద్దలు పెళ్లి చేస్తారు. అటు తర్వాత వారి సాంసారిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. వాటిని అధిగమించాలి. కలిసికట్టుగా నిలబడాలి. అప్పుడే ఆ దాంపత్య బంధానికి సార్ధకత ఉంటుంది. మరొకరు భర్తను నిందించినా భార్యను దూషించినా సహించరాదు. వారి విధానాన్ని వెంటనే ఖండించాలి. ద్రౌపది ఆపనే చేసింది. పాండవులు విరాటుని కొలువు కూటంలో ఉన్నప్పుడు తాము అనుభవిస్తున్న కష్టాలన్నింటికి అన్న ధర్మరాజేనని భీముడు నిందిస్తాడు. అప్పుడు ద్రౌపది అతని అభిప్రాయాన్ని ఖండిస్తుంది. భర్త ఔన్నత్యాన్ని ఘనంగా కీర్తిస్తుంది.
సీ. "ఎవ్వని వాకిట నిభమద పంకంబు, రాజ భూషణ రజోరాజినడఁగు
నెవ్వని చారిత్రమెల్ల లోకములకు నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
నెవ్వని కడగంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపద లీను చుండు
నెవ్వని గుణలత లేదు వారాసుల, కడపటి కొండపైఁ గలయ బ్రాకు
తే. నతడు భూరి ప్రతాప మహా ప్రదీప, దూర విఘటిత గర్వాంధకారవైరి
వీర కోటీర మణి ఘృణి వేష్టి తాంఘ్ర, తలుదు కేవల మర్త్యుడే ధర్మసుతుడు
ఈ పద్యంలో ధర్మరాజు గుణగణాలు అద్భుతంగా చెప్పబడ్డాయి. సతులందరూ ద్రౌపదిని ఆదర్శంగా తీసికొని నడుచుకోవాలి. అదే విధంగా పతులు కూడా భార్యను పరుల వద్ద హీనంగా మాట్లాడటం, చూడటం చేయరాదు. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి పొరపచ్చాలను గడ్డిమంటలాగా భావించాలి, గడ్డి మంట ఎంత త్వరగా అరిపోతుందో, అంతే త్వరగా భార్యాభర్తల మధ్య ఉన్న కోపం తొలగిపోవాలి. అప్పుడే ఆ కుటుంబంలో సుఖసౌఖ్యాలు ఉంటాయి.
10. ముగింపు:
ఈ విధంగా భారతంలో నమస్కారం, గురుశిష్యుల అనుబంధం, సత్యం, నీతి, త్యాగం, శరణాగతి రక్షణం, అతిథి సత్కారం, భార్యాభర్తల అనుబంధం వంటి సంస్కృతీ విన్యాస అంశాలు చక్కగా చిత్రించబడ్డాయి. ఇవే గాక స్నేహ సంస్కృతి, ధర్మ సంస్కృతి, అర్థ సంస్కృతి వంటి ఎన్నో విషయాలు భారతంలో చెప్పబడ్డాయి. ఆ గ్రంథంలో చెప్పబడిన సాంస్కృతికాంశాలు సర్వకాలాలకు ఉపయోగపడేవి. వాటిని మనం ఆచరించిన ప్రశాంతంగా జీవించగలుగుతాము. మంచి ఆదర్శ వంతమైన సాంస్కృతిక సమాజాన్ని భావితరాలకు అందించిన వారమవుతాము.
11. పాదసూచికలు:
- మనుస్మృతి
- వాల్మీకి రామాయణం
- ఆంధ్రమహాభారతం- ఆదిపర్వం - తృతీయాశ్వాసం 178వ పద్యం
- మహాభారతం ఉద్యోగ పర్వం-33-91,92 శ్లోకాలు
12. ఉపయుక్తగ్రంథసూచి:
- నారాయణాచార్యులు, పుట్టపర్తి. మహాభారతవిమర్శము. ప్రథమభాగము. పుట్టపర్తి నాగపద్మిని. హైదరాబాద్, 2001.
- రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. శ్రీనివాసులు, సూరం. (వచనం) వ్యాసమహర్షి. శ్రీమహాభారతము. గీతాప్రెస్, గోరఖ్ పూర్, 2018.
- రామకోటిశాస్త్రి, సూరి. భారతీయసంస్కృతి (పరిచయం). శ్రీరామకృష్ణాశ్రమం, హైదరాబాద్. 1997.
- సుబ్రహ్మణ్యం, జి.వి. (సంపా.) కవిత్రయ విరచిత భారతము. పదిహేను భాగములు, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి. 2012.
- సుబ్రహ్మణ్యం, భాగవతుల. మనుస్మృతి. నవరత్నబుక్ హౌస్, విజయవాడ, 2016.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.