AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. ‘ఆచార్య అనుమాండ్ల భూమయ్య’: భౌమమార్గవిమర్శ
డా. సిహెచ్. సుశీలమ్మ
ప్రొఫెసర్ & రిటైర్డ్ ప్రిన్సిపాల్,
పూర్వ ఉపసంచాలకులు, తెలుగు అకాడమీ, ఆంధ్రప్రదేశ్.
గుంటూరు, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9849117879, Email: cbrlprincipal@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ఆధునిక సాహిత్యవిమర్శ గురించిన వివిధ విమర్శకుల అభిప్రాయాలను అధ్యయనం చేస్తూ, ఆచార్య అనుమాండ్ల భూమయ్య నూతన విమర్శ విధానం "భౌమమార్గవిమర్శ"ను పరిశోధించడం ఈ వ్యాస పరమోద్దేశ్యం. విమర్శకు సంబంధించిన సమాచారం, ప్రముఖుల అభిప్రాయాలు పుస్తకాలలో సేకరించడం జరిగింది. భూమయ్య ఈ విధానంలో రచించిన 7 పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి, వివరించడం వల్ల, రాబోయే విమర్శకులు తమ రచనలలో ఈ 'నవ్యత'ను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందన్నది ఈ వ్యాస ఉద్దేశ్యం.
Keywords: భౌమవిమర్శ, Down to earth approach, అనుభూతివాదవిమర్శ, భావవిపంచిక.
1. ఉపోద్ఘాతం:
ప్రాచీన కాలం నుండి ఒకరు కథలు చెప్పడం, మరొకరు వినడం, మధ్య మధ్యలో సందేహాలను అడగడం సంప్రదాయం ప్రకారం వస్తున్న ప్రక్రియ. ఉపనిషత్సాహిత్యం సంభాషణాత్మకంగా సాగినదే. జనమేజయుడికి భారత కథను వైశంపాయనుడు చెప్పాడు. భాగవత కథను శుక మహర్షి పరీక్షిత్తుకు చెప్పాడు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య- పద్యం, గేయం, అనువాదం, పరిశోధన, విమర్శ, వ్యాఖ్యానం, పద్యపఠనం, ప్రసంగం అన్నింటిలో నిష్ణాతులు. వారి వ్యక్తిత్వం, పలుకు ఎంత సున్నితంగా ఉంటాయో - వారి కావ్యరచనా పద్ధతి కూడా అంతే సౌమ్యం గా ఉంటుంది. నిరాడంబరంగా ఉంటుంది.
వారి రచనావ్యాసంగం మూడు విధాలుగా పరిఢవిల్లింది. ఒకటి పరిశోధన. ఇది పండితుల మెప్పు పొందింది. రెండోది కావ్యరచన. ఇది సరళంగా తేటగీతి పద్యాలలో సాగడం వల్ల సులభ గ్రాహ్యంగా ఉండి ఏమాత్రం సాహిత్యాభిమానం ఉన్నవారినైనా ఆకర్షిస్తుంది. (దీనిలో కొన్ని ప్రత్యేక రచనలు జ్వలిత కౌసల్య, త్రిజట, మకర హృదయం, పారిజాతావతరణ మొ.) మూడవది విమర్శా రచనలు. అయితే భూమయ్య అనుసరించిన విమర్శావిధానం విభిన్నమైనది. ఆచార్య చేకూరి రామారావు మాటల్లో చెప్పాలంటే - "భౌమమార్గవిమర్శ".1
2. భౌమమార్గవిమర్శ:
భౌమమార్గమంటే భూమయ్య ప్రవేశపెట్టిన మార్గమని అర్ధమున్నా, నిజానికి "Down to earth approach". ఆకాశం నుండి భూమికి దిగడం. విమర్శ క్లిష్టమార్గంలో కాకుండా, సరళంగా, సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో చెప్పడం. "భౌమ" అంటే 'భూసంబంధమైనదని, భూమిలో ఉన్నదని, మట్టి తో చేసినదని నైఘంటికార్ధాలున్నాయి. అంటే ప్రాధమిక దశకు చెందినదని చెప్పవచ్చు.
"సంప్రదాయవిమర్శ, చారిత్రకవిమర్శ, భౌతికవాదవిమర్శ ఇత్యాది మార్గాలు విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ భౌమమార్గవిమర్శ భూమయ్య ప్రవేశపెట్టిన 'అనుభూతివాదవిమర్శ' అని చెప్పుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల విమర్శకు ఒక నూతనత్వం కలిగింది. ఆస్వాదనీయతకు పెరిగింది. విమర్శకు భావుకత్వం తోడై శ్రోతలో ఆసక్తిని పెంచింది. విమర్శ రంగంలో ఇదొక నూతన విధానంగా స్థిరపడుతుంది"2 అంటారు ఆచార్య గల్లా చలపతి. పాఠకున్ని భాగస్వామిగా మార్చిన ఈ నూతన ప్రక్రియ మంచి సృజనాత్మకమైనది. విశిష్టమైనది.
భౌమమార్గవిమర్శలో- (అనగా సంభాషణాత్మకంగా) ఆచార్య భూమయ్య ఏడు కావ్యాలు రచించారు. అవి:
- నాయనితో కాసేపు - జనవరి 2000
- ఆధునిక కవిత్వంలో దాంపత్యం - మే 2000
- కర్పూర వసంత రాయలు కథా కళా ఝంకృతులు- జులై 2000
- తెలంగాణ భావ విపంచిక- అక్టోబర్ 2000
- వేమన అనుభవసారం -మే 2012
- సౌందర్యలహరి భావమకరందం - 2013
- శివానందలహరి భావమకరందం - 2018
తనకంటే ఒక తరం ముందున్న కవుల కావ్యాలను విశ్లేషించి, తన తర్వాతి తరం సాహిత్యాభిలాషులకు అందించాలన్న లక్ష్యంతో ఈ పద్ధతిని ఎన్నుకున్నారు ఆయన. తనకు నచ్చిన విషయాన్ని తనకు నచ్చిన పద్ధతిలో రాసుకుంటూ పోతే పాఠకుడికి ఆసక్తి కలగకపోవచ్చు. అందుకే పాఠకున్ని శ్రోతగా, గ్రంథంలో భాగస్వామిగా చేశారు. దానివల్ల ప్రశ్నా-జవాబుల రూపంలో, సంభాషణాత్మకంగా కొనసాగటం వల్ల పాఠకుడికి విసుగు పుట్టదు. ఆసక్తి పెరుగుతుంది. కావ్యం గురించి, కవి వ్యక్తిగత విషయాలు, సమకాలీన విషయాలతో పాటు తన విషయాలను చెప్పవచ్చు. మధ్య మధ్యలో శ్రోతకు ప్రశ్నలు వేస్తూ, ఉత్తేజపరుస్తూ, ఆసక్తి పెంపొందిస్తూ విషయాన్ని సమగ్రంగా చెప్పవచ్చు.
2.1 నాయనితో కాసేపు:
నాయని సుబ్బారావు రచనలపై పరిశోధన పూర్తి చేసి విశ్వవిద్యాలయానికి సమర్పించినా, నాయని వారి గురించి మరిన్ని విశేషాలు చెప్పాలని, అదికూడా సాధారణ పాఠకుడికి అర్ధమయ్యేలా, ఆసక్తి కలిగేలా చెప్పాలనుకున్నారు భూమయ్య. ఒక నూతనమైన పద్ధతి, ప్రణాళిక అయితే బాగుంటుందని యోచించారు. ఆ అంతర్మధనం నుండి ఉద్భవించిందే "భౌమ మార్గ విమర్శ".
నాయని వారి సౌభద్రుని ప్రణయయాత్ర, మాతృగీతాలు, వేదనా వాసుదేవం, భాగ్య నగర్ కోకిల, విషాద మోహనం, జన్మభూమి వంటి కావ్యాలను తన శిష్యునితో సంభాషిస్తూ వివరిస్తారు. ప్రతిరోజూ శిష్యుడు వస్తే, అతనితో ముచ్చటిస్తూ, నాయని వారి వంశవృక్షం తో పాటు - మహాభారతం, ఆర్షధర్మం, దాంపత్యం, భక్తి మొదలైన విషయాలు ముచ్చడిస్తారు.
2.2 ఆధునిక కవిత్వంలో దాంపత్యం:
కవితా వైజయంతిని ఏర్పాటు చేసి ఏటా కవులకు, కళాకారులకు సన్మానాలు చేస్తున్న 'పట్టపగలు వెంకటరావు' అనే సాహిత్యాభిమాని తో సంభాషిస్తూ ఆధునిక కవిత్వలో కవులు ఆదర్శవంతమైన దాంపత్యాన్ని ఎలా వర్ణించారో తెలియజేశారు ఆచార్య భూమయ్య.
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం రచన "క్రొత్త గోదావరి"లో యశోధర గురించి, కట్టమంచి రామలింగారెడ్డి "ముసలమ్మ" గురించి, 'సంపత్' కలం పేరు గల శంఖవరం రాఘవాచార్యుల కావ్యం "విశ్వనాథవిజయం", విద్వాన్ విశ్వం "పెన్నేటి పాట" గురించి, సి.నా.రె. "ఋతుచక్రం" గురించి శిష్యునితో సంభాషణాత్మకంగా "భారతదేశంలోని పవిత్రమైన" దాంపత్య ధర్మం గురించి చెప్పారు.
2.3 వేమన అనుభవసారం:
తన ఎదురుగా కూర్చుని వింటున్న శిష్యునికే కాదు మనకూ వేమన తత్త్వసారాన్ని భూమయ్య పంచారు అనిపిస్తుంది. పదిహేను భాగాలుగా వింగడించి, ఒక పటిష్టమైన ప్రణాళికతో, ప్రతి అధ్యాయానికి శీర్షికగా వేమన పద్యపాదాలను ఉంచడం మరో ప్రత్యేకత. ఒక్కో అధ్యాయంలో ఆశ, కామము, ధనాపేక్ష, జీవుడు, చదువుల సారం, నిక్కమైన విద్య, ఎరుక, ఆత్మ, ముక్తి వంటి విషయాల్ని వివరిస్తూ భూమయ్య తన అభిమానవిషయమైన "ఉపనిషత్తుల" చెంతకు శ్రోతను తీసుకువెళతారు.
ముండకోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తుల్లో నాటి ఋషుల అనుభవాన్ని వేమన అనుభవాలతో పోల్చి, "చదువులందు లేదు శాస్త్రములను లేదు/ వేదములను విరివిగా తానేర్చి/ వాదమాడు వాడు వట్టివాడు/ సారమైన గుర్తు సాక్షిగా నెరుగుము"3 అని వేమన తత్త్వాన్ని విశ్లేషిస్తారు.
2.4 కర్పూర వసంత రాయలు - కథా కళా ఝంకృతులు:
ఆధునిక తెలుగు సాహిత్యంలో గేయకథాకావ్యాలలో సినారె కర్పూరవసంతరాయలు విశిష్టమైనది. దానిలోని ఐదు ఆశ్వాసాలను భూమయ్య భౌమమార్గపద్ధతిలో సంభాషణాత్మకంగా వివరించారు. లకుమ అందం, నాట్యవిన్యాసం, రాజు పరవశం, వారిరువురు అహోబిలం, భీమేశ్వరాలయం దర్శించడం, వారి ప్రేమ ద్విగుణీకృతం కావడం, రాజు పూర్తిగా లకుమ మైకంలో పడిపోవడం, లకుమ త్యాగం - చరిత్రను, సినారె భావుకతను వర్ణించారు భూమయ్య.
రచయిత తన విద్యార్ధికి సి.నా.రె. గురించి, కావ్యం గురించి సుదీర్ఘమైన 'నేపథ్యాన్ని' వివరిస్తారు. తర్వాత కథ లోనికి ప్రవేశిస్తారు. లకుమ అందాన్ని, నృత్యాన్ని చూసి పరవశంతో కూడిన రాజుకు కనులు మూసినా తెరిచినా లకుమ రూపమే కన్పిస్తుంది. ఎందుకన్న ప్రశ్నకు రాజు దగ్గర సమాధానం కన్పించడం లేదు.
“వెండి గజ్జెల రవళియే క/ వ్వించునా నన్నింతగా/ గుండె గజ్జెల లోన చొరబడి/ యుండెనేమో వింతగా!”4 వారిరువురి రసరమ్యసామ్రాజ్య కళాసౌందర్యాన్ని వర్ణిస్తూ భూమయ్య అంటారు -
"ఆయమ వసంతరా/యని మానస సరోవ/రాంతరాళ విహారమైన రాజ మరాళి
ఆయమ వసంతరా/ యని/ జీవనాడులకు/ స్యందనము కల్పించు చైతన్య రసకేళి."5
2.5 తెలంగాణ భావవిపంచిక:
ముడుంబై రాఘవాచార్యులు 1934లో "నిజాం రాష్ట్రములో తెలుగు కవులే లేరు" అని ప్రస్తావించడంతో సురవరం ప్రతాపరెడ్డి ఎంతో ప్రయాసపడి నిజాం రాష్ట్రంలో 354 మంది కవులు ఉన్నారంటూ వారి కవిత్వం, వివరాలను సేకరించి "గోలకొండ కవుల సంచిక" తీసుకువచ్చారు. మళ్లీ 66 ఏళ్ల తర్వాత ఆచార్య భూమయ్య గోలకొండ కవుల సంచికను ఈతరం వారికి తెలియజెప్పారు. ప్రతాపరెడ్డి 11 విభాగాలు చేస్తే భూమయ్య 7 విభాగాలలో - ఆధునిక పద్యతరంగిణి, తెలంగాణా మహోజ్వల చరిత్ర, ఉద్యమ చైతన్యం, భావ విపంచిక, మహిళా చైతన్యం, శతావధానులు - కవి సార్వభౌములు- జంట కవులు, దాంపత్య కథాలహరి అని వివరంగా చెప్పారు. ఈ భౌమ మార్గ విమర్శ లో సౌలభ్యమేమంటే తాను విద్యార్ధికి బోధించవలసిన విషయముతో పాటు గతం లోను, సమకాలీనం లోని విశేషాలను, ఇంకా చెప్పాలంటే అప్పుడు జరుగుతున్న విషయాలనూ మేళవిస్తూ, విద్యార్ధికి ఆసక్తి కలిగేలా చెప్పవచ్చు. అతనికి తెలిసిన విషయాలను ఉదాహరణలుగా చెప్పడం వల్ల అతనిలో ఉత్సాహం కలుగుతుంది. ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది.
"తెలంగాణ శిల్ప వైభవానికి పెట్టింది పేరనడానికి నిదర్శనం ఓరుగల్లు కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి. ఓరుగల్లు కోట లోని కీర్తి తోరణం మాడల్ ఎన్.టి.రామారావుగారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు హైదరాబాదు ట్యాంక్ బండ్ మీద అటూ ఇటూ నిర్మింపజేసినాడు. చూసి ఉంటావు. ఓరుగల్లు కోట లోని ఈ కీర్తి తోరణం మాడల్ మన కాకతీయ యూనివర్సిటీ రెండు ద్వారాల దగ్గర నిర్మింపబడి ఉండడం నీవు చూసిందే.మన జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ఉంది కదా"6
తను చూస్తూ ఉన్న కట్టడాల గురించి గురువు చెప్తూ ఉంటే శిష్యుడు మరింతగా నిమగ్నమై వింటాడు. అదే ఈ భౌమ మార్గ విమర్శ ప్రత్యేకత.
"ఇంత విశ్లేషణాత్మకంగా చక్కని పని డా. భూమయ్య చాలా బాగా చిత్రించినాడు. ఆ చిత్రణ లో కూడా పాఠకులకు ఆసక్తి పెంపొందే విధానం ఎన్నుకుని సఫలీకృతుడైనాడు" (పుస్తకం, పుటసంఖ్య.) అని ప్రశంసించారు ఆచార్య బి. రామరాజు.
2.6 శివానందలహరి భావమకరందం:
శ్రీ శంకరభగవత్పాదులు రచించిన శివానందలహరి, సౌందర్యలహరి, వాటి తత్వమును సాధారణ పాఠకులకు అందించేందుకు, అనువైన తన భౌమమార్గవిమర్శన ద్వారా గురు శిష్య సంవాద రూపంలో ఆచార్య అనుమాండ్ల భూమయ్య మనకందించారు. "కలాభ్యాం..." అనే ప్రారంభ నమస్కార శ్లోకం నుండే భూమయ్య శంకరాచార్యుని భక్తితత్త్వాన్ని, శివుని రూపవర్ణన, గుణవర్ణనలను సవివరంగా చెప్తూ, "కవితా దృష్టితో ఒకసారి, భక్తితో ఒకసారి, మొత్తం మూడు సార్లు చదవమని, మననం చేసుకోమని” (పుస్తకం, పుటసంఖ్య.) శిష్యునికి బోధిస్తారు.
శంకరాచార్యుల వారి శ్లోకాలకు అద్భుతమైన విశ్లేషణ అందించారు ఆచార్య భూమయ్య.
“కంచిత్కాల ముమామహేశా భవతః పాదారవిందార్చనైః/ కంచిద్ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్కథాకర్ణనైః/ కంచిత్కంచి దవేక్షణైశ్చ నుతిభిః/ కంచిద్దశామీదృశీం/ యః ప్రాప్నోతిముదా త్వదర్పితమనా/ జీవన్సముక్తః ఖలు” (శివానందలహరి-81)
జీవన్మక్తుని లక్షణాలను చెప్తున్నాడు. కొంతకాలం శివపాదార్చనలో, కొంతకాలం ధ్యానంలో, కొంతకాలం సమాధిలో, నమస్కారం చేస్తూ, శివ కథలను వింటూ, స్తుతి చేస్తూ, శివుని యందే మనసు నిలిపి ఉండేవాడు జీవన్ముక్తుడు. అర్చనాదులను వరుసగా చెప్పి, ఇవి చేసే వాడు జీవన్ముక్తుడు అని చెప్పవచ్చు. కానీ కొంతకాలం శివపాదార్చన, కొంతకాలం... అని చెప్పడం వల్ల దేని ప్రత్యేకత దానిదే అని తెలియడం తో పాటు వాటి మీద ప్రత్యేక దృష్టి ఏర్పడుతుంది పాఠకుడికి. లేదా శ్రోతకు. 'కంచిత్ ' శబ్ద ప్రయోగం వల్ల రచన అందగించింది.7
శివానందలహరి, సౌందర్యలహరి సాధారణపాఠకులకు తేలికగా అర్థం కావు. కనుక వాటిని వివరించడానికి భూమయ్య ఒక పటిష్టమైన ప్రణాళిక వేసుకున్నారు. రోజుకు పది శ్లోకాలుగా పది రోజుల్లో వంద శ్లోకాలను విద్యార్ధికి బోధించడం. దీని వల్ల విద్యార్ధి భారంగా భావించకుండా, చక్కగా అర్థం చేసుకుని, రాత్రి చదువుకుని, కంఠస్థం చేసుకుని, మర్నాటి పాఠానికి తయారై వస్తాడు.
మధ్య మధ్యలో పోతన పద్యాలు, ఉపనిషత్తుల ప్రశస్తి, పాల్కురికి నుండి తిమ్మన వరకూ పద్యాల ప్రసక్తి తెస్తూ శిష్యునికి 'శివ' దర్శనం గావిస్తారు.
2.7 సౌందర్యలహరి భావమకరందం:
శ్రీ శంకరాచార్యుల సౌందర్యలహరిలో అమ్మవారి వర్ణనతో పాటు "శ్రీవిద్యోపాసన" అంతర్లీనంగా ఉంటుంది. దానిలో ఉన్న యోగశాస్త్రరహస్యాలు, కుండలినీప్రక్రియ, షట్చక్రాలు, వేదాంత, మంత్రశాస్త్రాలు మొదలగు వాటిని ఎంతో పరిశోధించి, తాను మనసా భావన చేసుకుని, అందలి తత్త్వాన్ని రోజుకు పది శ్లోకాలుగా శిష్యునికి వివరిస్తారు భూమయ్య. అమ్మవారి నవరాత్రుల ఆరాధనా పరిపుష్టమైన 'విజయదశమి' రోజు నుండి శిష్యునికి బోధించ ప్రారంభించడం మరొక శుభ పరిణామం.
అమ్మవారిని స్తుతింప పూనుకున్న శంకర భగవత్పాదులు తానేదైనా పుణ్యం చేశానా, చేయనప్పుడు తనకు సాధ్యం కాదు కదా అనుకుంటూ మొదటి శ్లోకం చెప్పాడు. రెండో శ్లోకం "తనీయాంసం..." అంటూ అమ్మవారి పాదవర్ణన చేసాడు. దీనికి భూమయ్య భక్తి పూర్వకమైన విశ్లేషణ చేసారు.
"అమ్మవారి పాదాన్ని 'పంకేరుహభవ' అంటున్నాడు. పాదం కమలం. కమలంలో పుప్పొడి అమ్మవారి పాదధూళి. దాన్ని మన బ్రహ్మగారు ఎట్లాగో సంపాదించారు. దీనితో ఆయన లోకాలను సృష్టి చేస్తున్నారు. ఏమాత్రం లోపం లేకుండా. జగత్ సృష్టికి మూలశక్తి ఈ అమ్మవారన్నమాట. విష్ణువు అమ్మవారి పాద కమల రాజోరేణువు అతి చిన్నదాన్ని సంపాదించి, మోయలేక మోయలేక అతి కష్టం మీద మోస్తున్నాడు. ఒక తలకాదు వేయి తలలతో. అమ్మవారి ఈ చిన్ని పాదరేణువును మోయటానికి విష్ణువుకు వెయ్యి తలలు కావలసి వచ్చాయట. విష్ణువు పాన్పు ఆదిశేషువు కదా. ఆయనకు వేయి తలలు మరి. అమ్మవారి ఈ చిన్ని రేణునే శివుడు పొడిపొడిగా చేసి విభూతిగా తన శరీరానికి పూసుకుంటున్నాడు. అమ్మవారిని సేవించే తీరు ఇది. అలా చేయటానికి ఆయనకు ఎంత ఆనందంగా ఉందో కదా! ఆనందతాండవం చేసి ఉంటాడేమో! ఈ త్రిమూర్తులు అమ్మవారి పాదసేవకులై ఆజ్ఞాబద్ధులై ప్రవర్తిస్తున్నారు అన్నమాట. అంతా చేస్తున్నది ఆ లోకమాతయే. ఒక్క పాదరేణువు శక్తి ఇంతటిదైనప్పుడు ఆ అమ్మ శక్తి ఎంతటిదై ఉంటుందో! ఆమె విరాట్ స్వరూపం ఎటువంటిదో!
ఒక ఇంతసేపు కనులు మూసి భావిద్దాం. అమ్మ మనకేమైనా పని చెప్తుందో చూద్దాం త్రిమూర్తులకు చెప్పింది కదా" అంటారు. విద్యార్థి "అట్లాగే సార్. ఈ కనులు మూసి, లోపలి కన్నుతో చూచే ప్రయత్నం చేస్తాను" అంటాడు.8 ఇదే కదా భౌమమార్గ ప్రయోజనం!
'సర్వశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని సేవించి ఇహపర సుఖాలను పొందుదాం' (పుస్తకం, పుటసంఖ్య.) అంటూ సౌందర్యలహరి కావ్యానికి ఫలశ్రుతి "ప్రదీపజ్వాలా...." (సౌ.ల.-100) శ్లోక వివరణతో మంగళాశాసనం పలికారు ఆచార్య భూమయ్య.
గురుశిష్యసంభాషణ లాంటి "భౌమమార్గం"లో కావ్యాన్ని వివరించడంతోపాటు, మధ్యమధ్యలో ప్రశ్నలు వేస్తూ, తత్సంబంధ కావ్య, లౌకికవిషయాలు ముచ్చటిస్తూ, విద్యార్ధికి ఆసక్తికరం బోధించవచ్చు. అయితే అంతా తానే చెప్పాలన్న ఉద్దేశం ఆచార్యుల వారికి లేదు. "ఇక్కడ ఆపేస్తాను. నీవే చదువుకుని ఆనందించాలి. గురువు యొక్క బాధ్యత దారి చూపించడం వరకే. మిగిలినది అనుభవైకయోగ్యం" (పుస్తకం, పుటసంఖ్య.) అంటారు భూమయ్య. ఇలా సంభాషణాత్మకంగా ఇన్ని వివరాలు 'ఆసక్తికరం'గా చెప్పడానికి "భౌమమార్గ"మే సరియైనదని చెప్పవచ్చు.
మొదట విడివిడిగా ప్రచురించిన ఈ 7 "భౌమమార్గ విమర్శ" గ్రంథాలను ఇటీవల 2023 సెప్టెంబర్లో తానే ఒకే గ్రంథంగా 635 పేజీలతో వెలువరించడం వల్ల భౌమమార్గవిమర్శ అనగా నేమి, ఏమేమి ఉన్నాయి అని అన్వేషించే వారికి ఒకేచోట లభ్యమయ్యే అవకాశం ఉంది. రచయిత స్వంత ప్రచురణ కనుక వారి వద్ద, నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ లోను ఈ గ్రంథాన్ని పొందవచ్చు.
3. ముగింపు:
- భూమయ్య స్వతహాగా కవి. తర్వాత విమర్శకులు. కాబట్టి వారి విమర్శ లో కవిత్వం, భావుకత్వం ఉంటుంది. కవిత్వం విమర్శనాత్మకంగా సాగుతుంది. భౌమమార్గ విమర్శ లో ఈ 7 కావ్యాలను వారు రచించిన తీరులో అది స్పష్టంగా కనిపిస్తుంది.
- గురువు తన శిష్యులకు ఆయా కావ్యాలను సంభాషణాత్మక రూపంలో చెప్తున్నారు. ఈ విషయాన్ని మరింత సవివరణాత్మకంగా రాస్తే, దానినే ఎం.ఫిల్.గానో పిహెచ్.డి. గానో సమర్పించవచ్చు అన్న ఉత్సుకత విద్యార్ధిలో కలుగుతుంది.
- కావ్య పరిచయమూ, విశేషాంశాలూ, పరిశోధనకు సూచనలు చేసారు ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఈ భౌమ మార్గ విమర్శ లో. గొప్ప ఆలోచన, ప్రయోగం అని చెప్పవచ్చును.
4. పాదసూచికలు:
- ఆచార్య అనుమాండ్ల భూమయ్య - సమగ్ర సాహిత్యం "భౌమమార్గ విమర్శ". ఆధునిక కవిత్వంలో దాంపత్యం పుట.101
- ఆచార్య అనుమాండ్ల భూమయ్య - సమగ్ర సాహిత్యం "భౌమమార్గ విమర్శ". ముందుమాట. పుట. 16
- భౌమమార్గ విమర్శ. వేమన అనుభవ సారం. పుట.465
- భౌమ మార్గ విమర్శ. కర్పూర వసంతరాయలు కథా కళా ఝంకృతులు - పుట 176
- భౌమ మార్గ విమర్శ. కర్పూర వసంతరాయలు - పుట 189
- భౌమ మార్గ విమర్శ. తెలంగాణ భావ విపంచిక - పుట 295
- భౌమ మార్గ విమర్శ. శివానందలహరి - పుట 621
- భౌమ మార్గ విమర్శ. సౌందర్య లహరి - పుట 471
5. ఉపయుక్తగ్రంథసూచి:
- నారాయణరెడ్డి, సి. ఆధునికాంధ్ర సాహిత్యం- సంప్రదాయములు, ప్రయోగములు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 2015
- ప్రతాపరెడ్డి, సురవరం. (సంపా) గోల్కొండ కవుల సంచిక. గోలకొండ పత్రికాకార్యాలయం, హైదరాబాదు - దక్కన్,1934.
- భూమయ్య, అనుమాండ్ల. అంతర్వీక్షణ సార్వభౌమం. శ్రీ మనస్వినీ ( స్వీయ) ప్రచురణలు, 2003.
- కవిరత్న ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి అభినందన సంచిక. ఆలాపన ప్రచురణ, హైదరాబాదు, 2013
- విమర్శ విద్యా సార్వభౌమం. శ్రీ మనస్వినీ ప్రచురణలు, వరంగల్, 2013
- సప్తతి ప్రత్యేక సంచిక, సిస్టర్ నివేదిత పబ్లికేషన్స్, హైదరాబాద్, 2020
- సాహితీ వైజయంతి. సమ్మానోత్సవ విశేష సంచిక. అజో విభో కందాళం ఫౌండేషన్, 2021.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.