AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
15. కథాకథనశిల్పం: రాయలసీమ కథల సమన్వయం
డా. భీమినేని శివసాయిప్రసాద్
పాఠశాల సహాయకులు,
నల్లమోతు చెంచు రామానాయుడు పురపాలక ఉన్నత పాఠశాల,
తెనాలి, గుంటూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9866573450, Email: sivasaiprasadprem@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
కథ - వస్తు, రూపాల సమ్మేళనం. రచయిత ఎన్నుకున్న వస్తువును పాఠకుడి హృదయానికి హత్తుకునేలా చేయడానికి అతను వేసుకున్న ప్రణాళికే రూపం. వస్తువును గౌరవిస్తూనే రూపాన్ని కాపాడాలి. ఉత్తమకథకు వస్తువూ శిల్పం రెండూ అభిలషణీయమే. రూపంలో భాగంగా కథాకథనం ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ కథాకథనంలో వాస్తవిక కథాకథనం, లేఖాకథనం, అంతరార్థకథనం ముఖ్య భూమిక పోషిస్తాయి. రాయలసీమ రచయితలు వస్తువుకు ప్రాధాన్యత ఇస్తూ కథాకథన పద్ధతుల్ని తమ కథలతో ప్రతిబింబించిన తీరును తెలియజేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. వైవిధ్యమైన కథాకథన శిల్ప పద్ధతిని సజీవ రూపంలో వివిధ సామాజికాంశాలతో రచయితలు తమ కథలలో చిత్రించిన తీరు... సీమ దుర్భరపరిస్థితులను, జీవన స్థితిగతులను సీమ భౌగోళికాంశాల నేపథ్యం... సీమ సాంఘిక, ఆర్థిక, రాజకీయాంశాలను స్థల, కాల, భాషా నేపథ్య అంశాల పరిశీలనలు ఈ వ్యాసంలో చర్చించడమైనది. ఉత్తమకథాంశంతో, ఉన్నత ప్రమాణాలతో, వైవిధ్యమైన శిల్పంతో ఉన్న కథలు ఈ పరిశోధనవ్యాసానికి ముఖ్య ఆధార విషయాలు. పరిశోధనకు అవసరమైన సామగ్రిని గ్రంథలయాలు, పూర్వ పరిశోధకుల సలహాలు, సాహితీవేత్తల విశ్లేషణల నుండి సేకరించడమైనది. వాస్తవికతకు, సామాజికస్పృహకు, ప్రాంతీయతకు ప్రాధాన్యమిచ్చి వర్తమానాన్ని చిత్రించడంతో పాటు రాబోయే కాలవైపరీత్యాలను కూడా శిల్ప వైవిధ్యంతో సీమ కథకులు ఆవిష్కరిస్తారని ఆశించడమైనది.
Keywords: కథ, కథాశిల్పం, కథాకథనం, వాస్తవిక కథాకథనం, లేఖాకథనం, అంతరార్థకథనం.
1. ఉపోద్ఘాతం:
కథ ఆధునిక వచనప్రక్రియ. కథలో వస్తువు, రూపం అనే రెండు ప్రధానభాగాలుంటాయి. రచయిత ఏమి చెబున్నాడన్నది వస్తువైతే, ఎలా చెప్తున్నాడన్నది రూపం లేదా శిల్పం. సాహిత్యం స్థల కాలబద్ధమై సామాజికవైరుధ్యాలకు ప్రతిబింబం కావున వస్తువు కూడా సామాజిక జీవనం నుండే స్వీకరించబడుతుంది. విషయం, విధానం రెండు కలిస్తేనే రచన. విషయం ఎంత గొప్పదైనా తగిన రూపంలో అభివ్యక్తం కానప్పుడు ప్రయోజనం నెరవేరదు. కావున వస్తువును గౌరవిస్తూనే రూపాన్ని కాపాడాలి. కథకు వస్తువూ, శిల్పం రెండు కళ్ళు. ఉత్తమకథకు రెండూ అభిలణీషయమే. యదార్థ జీవితం కళారూపంగా పరిణామం చెందడంలో గోచరమయ్యే కళ మార్మికతనే శిల్పం అనవచ్చు. రచయిత ఎన్నుకున్న వస్తువును పాఠకుడి హృదయానికి హత్తుకునేలా చేయడానికి అతను వేసుకున్న ప్రణాళికే రూపం. శిల్పం ఇలా ఉంటుందని ఎన్ని సిద్ధాంతాలు చేసినా ఏ సిద్ధాంతమూ కథా శిల్పానికి నూటికి నూరు శాతం నిర్వచించనూ లేదు, నియంత్రించనూ లేదు.
“శిల్పం ప్రతి కథకూ మారుతుంది. ప్రతి రచయితకు మారుతుంది. సాహిత్యంలో వస్తురూపాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి గంతకు తగిన బొంతలా ఉంటే ఆ రచన గొప్పదవుతుందని”1 రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
శిల్పం కథకు ఊపిరి. “వస్తువులో కథ, కథాంశం, ఉద్దేశం అనే మూడు అంగాలు ఉంటాయి. ఇవి వస్తువుకు సంబంధించిన అంగాలు కాగా, కథా సంవిధానం, పాత్రలు, నేపథ్యం, దృష్టి కోణం, కథాకథనం, అనుభూతి ఐక్యత మొదలైనవి రూపానికి సంబంధించిన అంగాలుగా”2 వల్లంపాటి వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు.
2. కథాకథనం-పద్ధతులు:
కథాకథనం అంటే కథను చెప్పే విధానం. రచయిత వాస్తవ ప్రపంచాన్ని కళ ద్వారా పాఠకులకు అందించడానికి, మరోరకంగా వాస్తవ ప్రపంచంతో తన రచన ద్వారా సంబంధం కల్పించుకోవడానికి కథనం చేస్తాడు. “చెప్పే తీరు తేటతెల్లంగా సూటిగా ఉండాలి”3 అని ఆరుద్ర పలికారు.
కథాంశాన్ని కథగా ఆవిష్కరించడానికి కథనం చాలా ముఖ్యం. కథను పాఠకునికి అందించే వాహిక కథనమే. ఇది రచయిత స్వీయంగానో, ఒక పాత్రద్వారానో, స్వగతంగానో ఎలా అయినా చెప్పవచ్చు. అయితే ఈ కథనాన్ని కథాంశం ఆధారంగా ఎంచుకోవడం కూడా శిల్పంలో భాగమే. ఈ కథనాన్నే ‘కంఠస్వరంగా’ కూడా కొద్ది మంది వ్యవహరిస్తారు. కథాంశం, ఎత్తుగడ, కంఠస్వరం ఈ మూడు పరస్పరం సమతుల్యతను కలిగి పాఠకున్ని కట్టి పడేసే విధంగా ఉండాలి. కథను చెప్పడంలో కథకులు అనేక పద్ధతుల్ని అనుసరించారు. అవి: 1. వాస్తవిక కథాకథనం, 2. లేఖా కథనం, 3. అంతరార్థ కథనం.
2.1. వాస్తవిక కథాకథనం (Reality Narration):
కథాసాహిత్యంలో అత్యధికులు అనుసరిస్తున్న పద్ధతి. ఇంద్రియ గోచరమవుతున్న సమాజ జీవితాన్ని మానవాతీత విషయ ప్రమేయం లేకుండా మానవ, మానవీయ విధానంలో చిత్ర విచిత్ర కల్పనల జోలికి పోకుండా వాస్తవాలనిపించే పాత్రల ద్వారా, జీవితానుగుణమైన భాషలో కథను చెప్పడం వాస్తవిక కథాకథనం. నైరూప్యత, అసంభావ్యత, యాదృశ్చికతలకు స్థానంలేని కథన పద్ధతి ఇది. వాస్తవిక కథన పద్ధతిలో పురోగమిశీలము, చైతన్య గుణములుంటాయి. పాఠకుని మీద తక్షణ ప్రభావం కలిగించే స్వభావం ఉంటుంది. వాస్తవిక కథన పద్ధతిలో కథాకథనం ఉన్నట్లే ఉండినా, అది వస్తువు మీద ఆధిపత్యం చెలాయించడానికి పూనుకోదు. ఎక్కువ కథా రచయితలు ఈ వాస్తవిక కథాకథన పద్ధతిని అనుసరిస్తున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు.
2.1.1. వినిపించని ఏడ్పులు (షేక్ హుస్సేన్ సత్యాగ్ని):
కథాంశం: జెహరాభి కడప దగ్గరలో దోశలు పోసుకొని జీవిస్తూ ముగ్గురు ఆడపిల్లలను పోషిస్తుంది. జెహరాభి పెద్దకూతురు అందంగా ఉండడంతో కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని ఆ జిల్లా చైర్మన్ బావమరిది నమ్మించాడు. పెళ్లి చేసుకుని బ్రోకర్ ద్వారా బొంబాయిలో మంచి రేటుకు అమ్మి అక్కడి నుండి గల్ఫ్ దేశాలకు పంపించాడు. చైర్మన్ బావమరిది తప్పు చేయడమే కాక జెహరాభినే తన కూతురిని గల్ఫ్ దేశాలకు అమ్మిందని పోలీసు స్టేషన్ లో కేసు పెట్టాడు.
“మా అంతస్థుకు తగినది కాకపోయినా పెండ్లి చేసుకున్నందుకు గొప్ప అవమానం జరిగింది. కఠినంగా శిక్షించాలని ఎస్సై కు హుకుం జారీ చేయడంతో తన బిడ్డ ఏమవుతుందో తెలియక జెహరాభి కూలబడింది"4
విశ్లేషణ: ఇక్కడ జెహరాభి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని, అందంగా ఉన్న జెహరాభి కూతురుని పెళ్లి చేసుకొని ముంబైలో వ్యభిచారం చేయించి, గల్ఫ్ దేశాలలో ఉన్న తన అక్క వ్యభిచార కేంద్రానికి పంపించిన చైర్మన్ బావమరిది దాష్టికం చక్కటి వాస్తవిక కథనంతో, అనేక ఎత్తుగడలతో ముందుకు సాగుతుంది. ఇక్కడ కథాంశం, ఎత్తుగడ, పాత్రల కంఠస్వరాలు పరస్పరం సమతుల్యత కలిగి పాఠకుడిని కట్టిపడేస్తాయి. చైర్మన్ పోలీసు యంత్రాంగానికి హుకుం జారీ చేయడంతో ఎస్సై జెహరాభిపై రెచ్చిపోయాడు. కథంతా పోలీస్ స్టేషన్ లోనే నడుస్తుంది. పాత్రల సంభాషణ ప్రవర్తన ద్వారా మాత్రమే కథ మొత్తం పాఠకుడికి అర్థమవుతుంది. పోలీసులు, పెద్దమనుషులు కుమ్మక్కయి ఒక ముస్లిం వితంతువును ఎలా నేరస్థురాలిగా చిత్రిస్తారో కథకుడు సూటిగా చాలా నేర్పైన కథనంతో నడిపించి పోలీసు వ్యవస్థ పట్ల ఆగ్రహం కలిగించేలా చేయడంలో అనుభూతి ఐక్యత కూడా గోచరిస్తుంది. యాదృచ్ఛికాలకు తావు లేకుండా పురోగామి చైతన్య పద్ధతిలో వాస్తవిక కథాకథనం రచయిత ప్రవేశపెట్టాడు.
పోలీస్ స్టేషన్ లోకి అడుగుపెట్టడంతో కథ ప్రారంభమై జెహరాభిని విచారించే క్రమంలో కథాంశాన్ని చక్కటి కథాకథనాలతో సంవిధానంతో నడిపించి, ముగింపులో జెహరాభిని దోషిగా తేల్చి కథను ముగించడంతో రచయిత వాస్తవిక కథాకథనంతో పేదవారిపై ఉన్నత వర్గాల దాష్టికాన్ని పురోగమి పద్ధతిలో ఎండగట్టారు.
ఇనాక్- ‘ఊరబావి’, సింగమనేని- ‘ఉచ్చు’, సత్యాగ్ని- ‘యంత్రం’, రాసాని- ‘నాలుగో నాటకం’ మొదలగు కథలు వాస్తవిక కథాకథనంలో సాగాయి.
2.2. లేఖాకథనం(Letter Narration):
పాత్రలు పరస్పరం రాసుకునే ఉత్తరాలే కథగా రూపొందడం లేఖాకథనం. ఇందులో భావ ప్రకటనలాగే తీవ్రత, నిర్మొహమాటం ఉంటాయి. ఇక్కడ పాత్రలు కలుసుకోవు. సంఘటనల వివరణ, వాటి మీద పాత్రల వ్యాఖ్య ఉంటాయి గానీ, సంఘటనలు ప్రత్యక్షంగా జరగవు. లేఖాకథనాన్ని అర్థం చేసుకోవడంలో పాఠకుడికి కొద్దిగా శ్రమ కలుగవచ్చునని అధికుల అభిప్రాయం.
2.2.1. కరువు పీల్చిన మనుషులు (పి.రామకృష్ణ):
కథాంశం: చిన్ననాటి మిత్రుడు తన స్నేహితునికి అనంతపురం జిల్లా విశేషాలేమిటో తెలపమని ఉత్తరం రాయగా, అనంతపురం జిల్లాలోని కరువు రక్కసిని విశ్లేషించిన కథ ఇది.
విశ్లేషణ: అనంతపురం జిల్లాలోని కరువు మనిషిలోని మానవత్వాన్ని పీల్చి ఆకలి దప్పికల డొల్లల్ని మిగిలిస్తుంది. దళారీలు, దోపిడీదారుల వల్ల రైతు చావులు అధికమయ్యాయి. కరువులో అధికంగా నష్టపోయేది స్త్రీలు, పిల్లలే. “కరువు నష్టాన్ని ప్రభుత్వం ఏడాదికేడాదికి అంచనా వేస్తుంది, కానీ కరువు వల్ల మనిషికి జరిగిన నష్టం, శతాబ్దాలు నుండి సంస్కృతి విలువలకీ, నాగరికతకు కలిగిన నష్టం ఎంతో? ఎవరు చెల్లిస్తారో?”5 అని రైతు వాపోయాడు. ఆదిమ దశ నుండి ప్రకృతితో పోరాడి ఇంత అభివృద్ధిని సాధించిన మనిషి మళ్ళీ ఆదిమ ప్రాకృతిక దశ లేదా ఆకలి దప్పికల అనాగరిక దశకు పడిపోతాడని తన మిత్రునికి కరువు గురించి తిరుగులేఖ రాసి పంపించడం ద్వారా రచయిత ‘లేఖాకథన శిల్పము’ను పోషించడంలో సఫలీకృతుడైనాడు.
2.2.2. నన్ను క్షమించు కన్నా! (జి. ఆర్. మహర్షి):
కథాంశం: సీమ కరువు పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని విద్యాసంస్థలు పేదవారిని దోచుకోవడమే అంతిమ లక్ష్యంగా సాగిన కథ ఇది.
విశ్లేషణ: ఒక పల్లెటూరి అబ్బాయి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయినప్పటికీ కోరిన కోర్సులో సీటు రాకపోవడంతో నిరాశ చెంది తన తండ్రి స్థితి మంతుడై ఉంటే తనకు డొనేషన్ కట్టి చదివించి ఉండేవాడు కదా అని తలచాడు. “నువ్వు బాగా చదువుకొని గొప్పవాడివి కావాలని ఆశ. కానీ నాకు ఇప్పుడు ఆ చదువుల మీద భ్రమలు తొలగిపోయాయి. డబ్బుంటే మరింత చదువు చదువంటే మరింత డబ్బు, ఇదొక సూత్రమయిపోయింది”6 అని తండ్రి వాపోయాడు. తన డబ్బు సంపాదించలేకపోవడానికి కరువు పరిస్థితులే కారణమని తండ్రి లేఖ ద్వారా సమాధానం పంపడంలో రచయిత లేఖా కథాకథన శిల్పం గోచరిస్తుంది.
యం.ఆర్. అరుణకుమారి- ‘పోస్ట్ చేయని ఉత్తరం’, పి.రామకృష్ణ- ‘కరువు పీల్చిన మనుషులు’, మధురాంతకం రాజారాం- ‘ఇక్కడ మేమంతా క్షామం’ మొదలైన కథలు లేఖాకథన రూపంలో సాగాయి.
2.3. అంతరార్థకథనం(Aliegary):
ఊహా కల్పన వంటి మరో కథాకథన విధానం. దీనిని ఆంగ్లంలో ‘అలిగరి’ అంటారు. పైకి చెప్పబడుతున్నది ఒక కథావస్తువు, లోపల అర్థమవుతున్నది మరో ‘కథావస్తువు’ అయితే అది అంతరార్థ కథనం. ఈ పద్ధతి కత్తి మీద సాము వంటిదే తప్ప నల్లేరు మీద బండి నడక కాదు. కథనం ఉన్న కథలోని ప్రధాన పాత్రలూ, సంఘటనలూ, భావాలూ; ఇతర వ్యక్తులకూ, సంఘటనలకూ, భావాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ప్రాతినిధ్యం వహించడం ఒక పాత్రకో, సంఘటనకో, భావానికో పరిమితంగా ఉండదు. కథ ప్రారంభం నుండి చివరి వరకూ ఈ అంతరార్థం కొనసాగుతూనే ఉంటుంది. ఒక ప్రతీకనో, రూపకాన్నో మొదటి నుండి చివరి వరకూ కొనసాగిస్తే అది కూడా అంతరార్థ కథనం అవుతుంది.
2.3.1. ఫిరంగిలో జ్వరం (సింగమనేని నారాయణ):
కథాంశం: వెంకటరాముడు, వీరారెడ్డి సారా కాంట్రాక్టుల కోసం పోటాపోటీగా తలపడుతూ సైన్యాలను నిర్మించుకొని ప్రజలను సమిధులను చేస్తూ, పరస్పర దాడులు కొనసాగిస్తూ ఫ్యాక్షనిస్టు ముఠాలుగా రూపొంది గ్రామీణ జీవితాన్ని అల్లకల్లోలం గావిస్తున్నారు. వెంకట నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొంది వీరారెడ్డిని బలహీనపరిచాడు. “నాయుడేం తక్కువ తిన్నాడా? ఎంతమంది గడ్డివాములు కాల్పీ లేదు! ఎందరి చెట్లు నరికీ లేదు. ఇంక మనుషుల్ని యాటికాటికి కీళ్లు ఇరిపీ లేదు. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అని ప్రజలు భయపడసాగారు.”7
ఎన్టీఆర్ మద్య నిషేధం సమయంలో ఎక్సైజ్ దాడుల నుండి తప్పించుకోవడానికి సుగాలీ తాండాల నాయకుడు గణే నాయక్ వెంకట నాయుడు పంచన చేరి ఇద్దరూ సారా వాటాలను పంచుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మద్యపాన నిషేధం పాక్షికంగా సడలించడంతో బ్రాందీ షాపుల లైసెన్సులు వెంకటనాయుడు చిక్కించుకున్నాడు. చీప్ లిక్కర్ ప్రవాహానికి నాయక్, నాయుడు దొంగసారా ఆటంకం అవడంతో మిత్రులు సైతం శత్రువులై, శత్రువులైన వీరారెడ్డి, వెంకటనాయుడు మిత్రులైనారు. వెంకట నాయుడు చీని చెట్లను గణేనాయక్ నరికించడంతో గణేనాయక్ అంతానికి వెంకట నాయుడు ప్రతిన బూని తాండాలపైకి నడిచాడు. “నాయుడూ, గణేనాయక్ నీకే కాదు, నాకు శత్రువే. ఇలాంటి వాణ్ణి ఏ రూపంలో నిర్మూలించినా నా సహాయం అందిస్తాను. పాత పగలు పక్కనపెట్టి నిన్ను బలపరుస్తానని.”8 వీరారెడ్డి చెప్పడంతో నాయుడికి కొండంత ధైర్యం వచ్చింది.
విశ్లేషణ: ‘ఫిరంగిలో జ్వరం’ కథలో వెంకట నాయుడు అనే ఫ్యాక్షనిస్టు చీనీ తోటను గణే నాయకే నరికించాడని తెలియడంతో కథ ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభం అంతర్గతంగా న్యూయార్క్ లోని ప్రపంచవ్యాపార సంస్థ భవనాల మీద జరిగిన దాడిని స్ఫురింప చేస్తుంది. ఒకప్పుడు వీరారెడ్డికి వ్యతిరేకంగా నాయుడు, నాయక్ మిత్రులయ్యారు. ఒకప్పుడు వ్యతిరేకంగా అమెరికా బుష్, లాడెన్ మిత్రులయి ఆయిల్ ని దోచుకున్నారు. ఇక్కడ సారా (ఆయిల్) వాళ్ళ మిత్రత్వానికి గానీ శత్రుత్వానికి గాని కారణం. ఈ శత్రుత్వం కారణంగా వెంకట నాయుడు (అమెరికా) చీని చెట్లను (W.T.O.) నాయక్(లాడెన్) అంతం చేయడంతో, సుగాలీ నాయక్ ను (లాడెన్) పట్టుకోవడానికి వెంకట నాయుడు (అమెరికా) సుగాలి తాండాలు (ఆఫ్ఘనిస్తాన్) పై పడినాడు అనడంతో కథ ముగిస్తుంది.
గణే నాయక్ పై వెంకట నాయుడి ప్రతిజ్ఞ సెప్టెంబర్ 11 తర్వాత బిన్ లాడెన్ పై అమెరికా సామ్రాజ్యవాదుల ప్రతిజ్ఞను, తాండాలు తగలబెట్టడం ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ పై అమెరికా కురిపించిన పాశవిక బాంబుల వర్షాన్ని గుర్తుకుతెస్తాయి. ఆధిపత్య రాజకీయాలకు గ్రామంలో అయినా అంతర్జాతీయస్థాయిలో అయినా ఒకే తీరుగా నడవడం అవగతమవుతుంది. రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ పోరాటంలోని ఆధిపత్యభావజాలానికీ, ఈనాటి అంతర్జాతీయ రాజకీయాలలో ఆధిపత్య భావజాలానికీ మధ్య ఉన్న సమాంతరలక్షణాలు చిత్రించడానికి ఈ కథ ప్రయత్నించింది. ఇలా ‘ఫిరంగిలో జ్వరం’ కథ పై మూడు పాత్రల ద్వారా అనేక ఎత్తుగడలు, ఉత్కంఠలతో కొనసాగుతూ పైకి ఒక కథ, అంతర్గతంగా మరో కథను స్ఫురిస్తూ అంతరార్థ కథనం (అలిగరి) పాటించబడింది.
3. ముగింపు:
- రాయలసీమ కథలలో శిల్పం వైవిధ్యంగా ఉంటుంది. వైవిధ్యమైన శిల్ప ప్రదర్శనతో సీమ రచయితల ప్రతిభ వెల్లడవుతోంది. కథా వస్తువు ఎంపిక నుండి ఎత్తుగడ, నడక, ముగింపు వరకూ రచయితలు నేర్పును, ప్రత్యేకతను చూపించారు.
- ఈ కథలలోని పాత్రలు, సన్నివేశాలు, పరిస్థితులు, పరిసరాలు, సంభాషణలు అన్నీ ఒకదానితో ఒకటి సజీవంగా అలరింపబడి పాఠకుల హృదయాన్ని తాకుతున్నాయి. వర్తమానమును చిత్రించడంతో పాటు రాబోయే కాల వైపరీత్యాలు, ప్రపంచీకరణ ప్రభావాలు సైతం చక్కని శిల్పంతో కథలుగా ఆవిష్కరించారు. ఇది సాహిత్యానికి, కళకు అభిలషణీయం.
- వాస్తవికతకు, సామాజిక స్పృహకు, ప్రాంతీయతకు ఈ కథల్లో ప్రాధాన్యం పెరిగింది. సీమ రచయితలు అధికంగా వాస్తవిక కథాకథనంతో శాస్త్ర సాంకేతికాల విప్లవాల ఆధారంగా మానవ జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, ప్రపంచీకరణ ప్రభావాలను సీమకథల ద్వారా ఆవిష్కరించారు.
- వాస్తవిక కథాకథనంతోపాటు సందర్భానుసారంగా లేఖా కథనం, అంతరార్థ కథనాలను కూడా సీమ రచయితలు తమ కథలలో అద్భుతంగా చిత్రించి శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించారు.
4. పాదసూచికలు:
- చంద్రశేఖరరెడ్డి, రాచపాళెం. సాహిత్య వస్తురూపాల నిర్మాణం - పుట. 31-34
- వెంకటసుబ్బయ్య , వల్లంపాటి. కథాశిల్పం - పుట. 11,12.
- సదాశివశంకరశాస్త్రి, భాగవతుల (ఆరుద్ర). కాబోయే కథకులకు పనికివచ్చే చిట్కాలు. పుట 159.
- హుస్సేన్, షేక్ (సత్యాగ్ని). పాచికలు (ముస్లిం స్త్రీల కథలు) - పుట. 88
- రామకృష్ణారెడ్డి, పి (తులసీ కృష్ణ). ఇండియా టుడే, 2003 - పుట. 64
- మహర్షి, జి.ఆర్. రైతుకథల సంకలనం (సాకం నాగరాజు) - పుట. 67
- నారాయణ, సింగమనేని. సింగమనేని నారాయణ కథలు - పుట. 257
- నారాయణ, సింగమనేని. సింగమనేని నారాయణ కథలు - పుట. 271
5. ఉపయుక్తగ్రంథసూచి:
- చంద్రశేఖర్ రెడ్డి, రాచపాళెం. కథాంశం (తెలుగు కథానిక సాహిత్యవిమర్శ). అనంతపురం, 2006.
- దక్షిణామూర్తి, పోరంకి. కథానిక స్వరూపస్వభావాలు. శివాజీ ప్రెస్, సికింద్రాబాద్,1985.
- నారాయణ, సింగమనేని. సింగమనేని నారాయణ కథలు. పబ్లికేషన్స్, హైదరాబాద్, 2005.
- మల్లయ్య, కాలువ. నూటాపదేళ్ళ తెలుగు కథ- విభిన్న ధోరణులు. తెలుగు అకాడమీ, హైదరాబాద్, 2012.
- రహమదుల్లా, షేక్ బేపాది (శశిశ్రీ). రాయలసీమసాహిత్యం. తెలుగు అకాడమీ, హైదరాబాద్, 2012.
- రామకృష్ణారెడ్డి, పి. పెన్నేటి కతలు. సీమ సాహితీ ప్రచురణ, నంద్యాల, 1997.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. కథాశిల్పం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1995.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. రాయలసీమలో ఆధునిక సాహిత్యం- సామాజిక సాంస్కృతిక విశ్లేషణ. విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2006.
- హుస్సేన్, షేక్ (సత్యాగ్ని). పాచికలు (ముస్లిం స్త్రీల కథలు). అనుపమ ప్రింటర్స్, హైదరాబాద్. 1989.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "OCTOBER-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-SEPTEMBER-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "OCTOBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.