headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

14. ఆశ్రమవాసపర్వము: పాండవ ఔన్నత్యం

బుక్కే ధనక నాయక్

పరిశోధక విద్యార్థి, తెలుగు శాఖ,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,
నాగార్జున నగర్, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 8187056010, Email: dhanakanaikbukke111@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగులో అనువదించబడిన ఇతిహాసాలలో మహాభారతం ఒకటి. మహాభారతం అనగానే రాజతంత్రం, కుళ్ళు- కుతంత్రాలు, రక్తపాతం మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ ఇది శాంతిరస ప్రధానమైనది. ఆశ్రమవాసపర్వం ప్రాముఖ్యతను వివరిస్తూ ధృతరాష్ట్రుడి పట్ల ధర్మరాజుకున్న గౌరవం, భక్తి, ప్రేమాభిమానాలను తిక్కన్న వివరించిన నూతనరూపకల్పనను విశ్లేషిస్తూ, రాజ్యపాలన సైతం నిరాకరిస్తూ పెద్దతండ్రి సేవకోసం పాండవులు పడిన తపనను ప్రస్తుతపాఠక లోకానికి కనువిప్పు కలిగించి, పెద్దలపట్ల గౌరవభావాన్ని కలిగి ఉండాలనే భావ సామగ్రిని సమాజంలో మరోసారి స్మరింప చేయాలన్నదే ఈ వ్యాసం ఉద్దేశం.

Keywords: ఆదరాభిమానం, కుటుంబం, మనోపవాసం, ఆశ్రమ వాసం, కర్మ సన్యాసం.

1. ఉపోద్ఘాతం:

మహాభారతంలో ఆశ్రమవాస పర్వానికి ఒక విశిష్టత ఉంది. 18 పర్వాల భారతేతిహాసంలో 15వ పర్వం ఆశ్రమవాస పర్వం. భారత రణరంగంలో  తన వారినందరినీ పోగొట్టుకొని  దిక్కుమొక్కు లేని స్థితిలో అహంకార శూన్యుడై  గాంధారి  సమేతుడై  పాండవుల పంచనా బ్రతుకునీడుస్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. అది దుర్భరమైన స్థితి. అయితే పాండవులు తమ పెద్ద తల్లిదండ్రులని ఎంతో గౌరవంగా చూసుకొంటుంటారు. కానీ, ఎంతోకాలం వీరి పంచన ఉండలేని ధృతరాష్ట్రుడు భార్యయుక్తుడై వాన ప్రస్తాశ్రమాన్ని స్వీకరించి మూడు సంవత్సరాలు ఉగ్రతపం చేసి చివరకు తనువు చాలించడం ఈ పర్వం యొక్క విశిష్టత.

2. పాండవ ఔన్నత్యం:

'యతో ధర్మస్తతో జయః’- అన్నట్టుగా కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు గెలుపును పొంది, వంశపారంపర్యంగా లభించిన కురుసామ్రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ, పెద్దవారైనా గాంధారి ధృతరాష్ట్రుల్నీ భక్తి భావభరితంగా, గౌరవ ప్రపత్తులతో ప్రతినిత్యం తాను, తమ్ములు, కుంతీ, ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూచి మున్నగు రాణివాసంతో కలిసి సేవిస్తున్నాడు. కొడుకులు లేరనే బాధ వారికి కలుగకుండా పాండవులు వృద్ధ దంపతుల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. భీముడు మాత్రం దుర్యోధనుడు తమకు చేసిన కీడును, తాము పడిన బాధలను తలచుకుంటూ ఆ ముసలి దంపతులు కనబడినప్పుడల్లా కోపగించుకునేవాడు. తన పరాక్రమాన్ని వారి ముందు చాటుకునేవాడీవిధంగ.

“అందుని కొడుకుల యందో కరుని దప్పి
                పోనీక త్రుంచితి భూరిశక్తి
దర్పితంబైన మద్బాహు పంజరము సొ
              చ్చినరిపు రాజన్య సింహములకు”
………………………………………………
“నాదు దోర్ధండముల జందనంబలంది
కుసుమ దామముల్ సుట్టి మ్రొక్కుదు మహో ప
కారు లరయంగ దైవముల్ గావె యను ద
దీయ మర్మంబు లెల్ల భేదిల్ల నధిప!   (1-19, ఆశ్రమ పర్వం)

భీముడు ధీరోదత్తుడు కదా! దానికనుగుణంగానే పలికాడు. భీముని ఉపాలంబన కావ్యాలకు ముసలి దంపతులు చాలా నొచ్చుకునేవారు. ఈ విషయం ధర్మరాజు, అర్జునులకు తెలియదు. నకుల సహదేవులకు తెలిసినా సంతోషించే వారే. దుర్యోధనాధుల కన్నా ఎక్కువగా అనురాగాదుల్ని చూపుతున్న ధర్మరాజాదుల పట్ల  గాంధారి ధృతరాష్ట్రలు ప్రేమగానే ఉండేవారు. ఈ విధంగా పదిహేనేళ్లు గడిచాయి.

ఒక రోజున ధృతరాష్ట్రుడు పాండవుల్ని, బందు గణాన్ని సమావేశపరిచి తన వల్ల కలిగిన కౌరవ వినాశనాన్ని పేర్కొని, భీష్ముడు మొదలైన వారి  హితవు విననందుకు పశ్చాతాపపడి, ధర్మరాజు చూపుతున్న ప్రేమాభిమానాలకు ముచ్చటపడి, రాజులకు సమర మరణం కాని, అడవిలో తపోమరణం కానీ ధర్మమని   చెప్పి తనకు వార్ధక్యం కారణంగా గాంధారితో సహా తాను అడవికి వెళ్లి మునులతో కలిసి నార చీరలు కట్టుకొని, కందమూలాలు సేవిస్తూ ధర్మరాజు  శ్రేయస్సును కోరుతూ శేషజీవితం గడపాలని నిశ్చయించుకున్నట్లు చెబుతాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు ఖిన్నుడై-

“తల్లియు తండ్రియున్ గురుండు దైవము  నాకరయంగ నీవభూ
వల్లభ! నీవు కానన నివాసము కోరి చనంగా నెట్టులే
నుల్లము వట్టి హస్తిపురి నుండగ నేర్తు యుయుత్సుని  బెంపుశో
భిల్లగ రాజు జేయు నిను బ్రీతి యెలర్పగ గొల్చి వచ్చేదన్” (1-32, (ఆశ్రమ పర్వం)

అని అంటాడు. నాకు నీవే తల్లి, తండ్రి, గురువు, దైవానివి.  నువ్వు అడవులకు వెడితే నేను హస్తినాలో ఉండలేను.  నీకు ఔరసుడైన యుయుత్సుని రాజుగా చేయ్యి. నేను నీ వెంట వచ్చి నిన్ను సేవిస్తూ జీవిస్తానని బహు విధాలుగా బతిమాలాడు ధర్మరాజు. అనగా ధృతరాష్ట్రుడు లేని హస్తినలో తానుండలేడన్నమాట. తనకు రాజ్యం వద్దని వైరాగ్యం ప్రకటించాడు ధర్మరాజు. పెద్ద తండ్రిపై తనకున్న ఆధరాభిమానాన్ని చాటుకున్నాడు. పదివేల ఏనుగుల బలం కల దృతరాష్ట్రుడు దప్పికతో సొమ్మసిల్లి గాంధారి ఒడిలో పడిపోతాడు.  అప్పుడు ధర్మరాజు చల్లని నీటితో పెద్ద తండ్రికి సేవలు చేసి లేపి కూర్చుండబెట్టాడు. తనకు వనవాస గమనానికి అనుమతిస్తే గాని తాను ఆహారం ముట్టనని ముసలి రాజు భీష్మించుకుని కూర్చున్నాడు. అప్పుడు వ్యాసమహర్షి వచ్చి-

“………….. రాజులకు రణ
మరణ ముండె, దృఢ సమాధి దనువు
విడుచుటో0డే,గాక వృద్ధులై రోగ త
ల్పమున జావు మేలె భరతముఖ్య!”.    (1-48, ఆశ్రమ పర్వం)

అని చెప్పి గాంధారీ ధృతరాష్ట్రుల వనగమనం ధర్మబద్ధమని, ధర్మజునిచే అంగీకరింపజేస్తాడు. ఇక్కడ ధృతరాష్ట్రునకు రాజానుమతి కావాలి. రాజానుమతి లేకుండా ఎక్కడికి పోరాదు. ఏ పని చేయరాదు. ఇక్కడ రాజు ధర్మరాజు. అందుకే అతని అనుమతికై అభ్యర్థించాడు. దానికి వ్యాస వాక్కుధర్మయుతం అయింది. ధృతరాష్ట్రుని కోరిక నెరవేరింది.

ధృతరాష్ట్రుడు అడవికి వెళ్లడానికి ముందుగా ఒకరోజున ధర్మజుని ఏకాంతంగా పిలిచి సప్తాంగమైన (స్వామి-అమాత్యుడు-సుహృత్తు-కోశము-రాష్ట్రము-దుర్గము-బలము-ఇవిసప్తాంగాలు)

రాజ్యపాలనలో ఉన్న కష్టనష్టాల్ని తెలిపి తగిన విధంగా రాజనీతి విశేషాల్ని తెలుపుతాడు. శత్రు రాజుల్ని జయించే పద్ధతుల్ని వివరిస్తాడు. చివరికి-

“నరవర! రాజనీతులు జనస్తుతుడైన నది తనూజుడున్
హరియు బరశరాత్మజుడు నాదిగ గల్గిన పెద్దలెల్లనీ
కరయగ బెక్కు సెప్పిరి మదాత్మయు నీ దేస బ్రీతి పెద్దయుం
బొరయుట నేనుగొన్ని యిటు పోలిన భంగి నేరుంగ జెప్పితిన్” (1-78, ఆశ్రమ పపర్వం)
…………………………..
“నిత్యవిధి సద్వివేకము
సత్యవ్రత శీల ధర్మ సారజ్ఞ్ర భవ
న్మత్యాకలితమ యైనను
నిత్యంబును వృద్ధ సేవ నిష్ఠ జలుపుమీ!”.   ( 1-79 ఆశ్రమ పర్వం)

అని అంటాడు. 'ఓ ధర్మరాజా! భీష్ముడు, కృష్ణుడు, వ్యాసుడు మొదలైన  పెద్దలందరూ ఎన్నో విషయాలు చెప్పారు. అయినా నాకు నీపట్ల ఉండే అభిమానం వల్ల నాకు తెలిసిన విషయాన్ని నీకు చెప్పాను. నిత్యవిధి, సద్వివేకము, సత్యవ్రత శీలం  నీకు సహజ లక్షణాలు. అయినా నీవు వృద్ధ సేవను నిష్టతో ఆచరించు” అని ప్రబోధించాడు. అన్నీ తెలిసినా వారైనప్పటికీ పెద్దల ముందు పిల్లలు పిల్లలే.  ఆ దృష్టితోనే  కురురాజు  ధర్మ రాజుకి  హితవు చెప్పాడు. ధర్మరాజు అలాగే చేస్తానని మాట ఇచ్చాడు. పెద తండ్రి చాలా సంతోషించాడు.

తన తపోవన గమనానికి ధృతరాష్ట్రుడు పురజనుల అనుమతిని కూడా కోరుకున్నాడు. హస్తినాపురం పూర్వ రాజుల వైభవాన్ని, దుర్యోధనుని దుష్టవర్తనాన్ని, ధర్మజుని ధర్మపాలనాన్ని, ప్రజానురక్తిని పురజనులకు తెలిపి పాండవుల పట్ల వినయ విధేయతలతో ఉండమని చెప్పి ధృతరాష్ట్రుడు వనవాస గమనానికి వారి అనుమతిని అడిగాడు.  ప్రజలు ఆయన తపోవన గమనానికి దుఃఖతులై తమ తరుపున మాట్లాడేందుకు ‘శంబువు'అనే బ్రాహ్మణున్ని ప్రతినిధిగా ఉంచి తమ కృతజ్ఞతల్ని చాటుకుంటారు. ఆ బ్రాహ్మణుడు పాండవుల బలపరాక్రమాల్ని  ప్రజానురక్తిని ప్రశంసిస్తూ ఇలా అంటాడు.

“స్వర్గమైనను బాలింప జాలు వారు
వీరలకు భూమి పాలన విధియనంగ
నెంత పని వీరి చేతికి నిచ్చితిపుడు
మమ్ము నెల్ల విధంబుల మనిచి తధిప!”
…………………………………………
“ధర్మ పుత్రుడు దీర్ఘదర్శి మహోదాత్త
          సచివుండు బంధురక్షణ పరుండు
రిపునెడనైనను గృపపెద్ద భావ సం
            శుద్దియు బ్రతిభయు సువ్రతంబు
నితనికి వెన్నతో నిడినవి యొరులను
          దన యట్ల కాజూచుదమ్ములెల్ల
సన్నుతికెక్కిన సకల గుణముల ని
            మ్మహితాత్ము చందాన మమ్ము బ్రోచు
మాత్రయే దేవ విషయ సమంచితాగ్ర
హారసజ్జన మాన్యంబులైన గ్రామ
ములు దగంగ రక్షింతురు వెలయాదారు
నిత్తురూళ్లులు దేవమహీసురులకు”.   (1-102, 103, ఆశ్రమ పర్వం)

'పాండవులు స్వర్గాన్నైనా పాలించగలరు. వీరికి భూమిని పాలించడం లెక్కా? మమ్మల్ని వీరి చేతిలో పెట్టి అన్ని విధాల రక్షించావు. ధర్మరాజు దీర్ఘదర్శి. మహోద్దాత్త సచివుడు. బందు రక్షణాపరుడు. శత్రువుల పాలిట దయాసముద్రుడు. భావశుద్ది,  ప్రతిభాపాటవం అనేవి అతనికి వెన్నతో పెట్టిన విద్యలు. అతని తమ్ముళ్లు శూరులు. శాంత స్వభావులు. గురుభక్తిపరులు. ధర్మరాజు పై భారం ఉంచి నువ్వు నిశ్చింతగా ఉండమని  ప్రజా హృదయాన్ని వారి పక్షాన శంబువు వెల్లడించి, ధృతరాష్ట్రునకు అందరి పక్షాన అనుమతి తెలుపుతాడు.

ధృతరాష్ట్రుడు మృత బంధువులందరికీ విశేషంగా శ్రాద్దక్రియలు నిర్వహించాలని ధర్మజుని కోరతాడు. అందుకు బీముడు అంగీకరించడు. తనను సమ్మతింప జేయడానికి ప్రయత్నించిన అర్జునునితో భీముడిలా అంటాడు.

పాంచాలి నవమాన పరచిన తెరుగును
                నయ్యింతి వెనుకరా నడవి గలయ
ధర్మజు చన్న చందంబును మదిగీరి
                యుండక మరపెట్టు లోలసే నీకు
నాంబికేయుడు తండ్రి యగుట నాడేట బోయే
                భీష్ముoడు మొదలుగా పెద్దవారిn8
బాందవంబెమయ్యే బార్థ! యీ విదురు డే
                రుంగడే వారల భంగి? యనిన
ధర్మజు0డు భీముడగు వచనముల న
దల్చే నరుడు మరియు దగడే పూజ
కాంబికేయు? డిట్టులనకుము మనకు న
గ్రజుని పనుపు సేత వ్రతము గాదె!”.   (1-118, ఆశ్రమ పర్వం)

అని అనునయించి ధృతరాష్ట్రుడు శ్రాద్ధ కార్యాలు నిర్వర్తించేలా చేస్తాడు. హస్తినాపూర్ణంలో అంతఃపురభోగాల్ని, సంసార బంధాల్ని అన్ని తెంచుకొని తపోవన నియమాలకు అనుకూలమైన చిత్తవృత్తితో, నియమనిష్ఠలతో ముని వృత్తిని స్వీకరించి తపస్సులతో కలిసి నివసించే వానప్రస్థశ్రమ జీవన పద్ధతికి ధృతరాష్ట్రుడు సిద్ధపడడం అతనికి వనవాసయోగ్యతను సాధించిపెట్టిన పూర్వరంగం.

కార్తీకమాసంలో కృష్ణపక్ష పాడ్యమినాడు కుంతి భుజంపై గాంధారి చేయి ఉంచగా, గాంధారి భుజాన్ని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు నడుస్తూ రుత్విజులు అగ్నులు చేపట్టి ముందు నడుస్తుండగా, విధురుడు, సంజయుడు వెంట నడవగా ద్రుతరాష్ట్రుని వనవాసయాత్ర సాగింది. ఇది ఉత్తమమైన ప్రస్థానం.  అందరూ వనంలో తీవ్రతపస్సు చేయాలని బయలుదేరారు. పూర్వస్నేహ  వైర భావాలు లేకుండా ఒక సమభావం వారిలో యోగంలా నిలిచింది. అది చూసి ధర్మరాజు 'ఓ రాజా! ఎక్కడికి వెళతావు?’  అని ఏడుస్తూ స్పృహతప్పి పడిపోయాడు.  అర్జునుడు అన్నను  ఓదారుస్తాడు. భీమాదులు, అంతఃపుర స్త్రీలు, పురజనులు అందరూ శోకమజ్ఞులయ్యారు. ఆనాడు అనగా జూదపరాజయానంతరం పాండవులు అడవికి పోయిన దృశ్యం అక్కడి వారందరికీ తలపుకు వచ్చింది.  కృప, యుయుత్సులు  కూడా ధృతరాష్ట్రుని వెంట అడవికి పోవడానికి సిద్ధమయ్యారు కానీ,  వృద్ధరాజు వారిని వారించి ధర్మజునికి అప్పగించాడు.  ధర్మరాజు మా పెద్ద తండ్రితో  అడవికి వెళ్లి వారికి సేవ చేయడానికి అనుజ్ఞనిమ్మని తల్లికుంతిని ప్రార్థిస్తాడు.  కుంతి అతడిని వారించి తానే వారి సేవకై అడవికి వెళ్లడానికి నిశ్చయించుకున్నట్లు చెబుతుంది. ధర్మజుడు ఆమెను వారిస్తాడు.  ఆమె గాంధారిని వదిలి కొంత దూరం పోయి తన దృఢ సంకల్పాన్ని తెలిపి, కర్ణుని మరువవద్దని సహదేవుని అనురాగంతో చూడాలని,  భీమార్జునా నకులున్ని  క్షేమంగా రక్షించాలని, ద్రౌపదిని దృఢమైన ప్రేమానురాగంతో చూడాలని చెప్పి  ధర్మజును ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. ధర్మజుడు కుంతీదేవిని గాంధారి ధృతరాష్ట్రుడితో పంపడానికి అంగీకరిస్తాడు. ఆమెతో పాటుగా ధర్మజునీ  ఒప్పించి  విదుర సంజీయులు కూడా వనగమనానికి బయలుదేరుతారు. అందరూ కలిసి గంగా నది తీరం చేరతారు.  ధర్మ రాజాదులు అక్కడి నుండి వెనుతిరిగి హస్తినకు పోతారు.

ధృతరాష్ట్రుడు గంగను దాటి కురుక్షేత్రంలో శతయూపుడనే రాజర్షి నివసించే ఆశ్రమానికి చేరాడు. ఆతని ప్రార్ధనపై అక్కడనే కుటిరాలు నిర్మించుకొని తపోనిష్టతో కృంగి కృషించి ఎముకల గూళ్ళై జీవితం సాగిస్తుంటారు ముసలి దంపతులు.  మిగిలిన వారంతనూ.  అంతలో ఒకసారి నారదాది మునులు ఆశ్రమానికి వచ్చారు.  శతయూపుడు కూడా ఆ ఆశ్రమానికి వచ్చాడు.  వచ్చిన వారందరకూ కుంతీదేవి అతిధి సత్కారాలు నిర్వహించింది.  ఆ ఆశ్రమంలో పూర్వం శతయూపుని  తాత సహస్ర చిత్యుడు తన పెద్ద  కుమారుడు శతచిత్తునికి రాజ్యం అప్పగించి తపస్సు చేసి ఇంద్రునితో స్నేహం సంపాదించాడు.  ఇంకా బృశద్రుడు శైలాలయుడు  ఈ వనంలో తపస్సు చేసి ఇంద్రలోకానికి వెళ్లారని ఆ వన మహోన్నత్యాన్ని పేర్కొన్నారు.  వ్యాస మహర్షి అనుగ్రహంతో ధృతరాష్ట్రుడు ఆ ఆశ్రమ ప్రాంతంలో నివసించడం దైవానుగ్రహం అని నారదుడు అంటాడు.  తాను ఇంతకు మునుపు  విన్న విషయాన్ని అనగా ఇంద్రుని వల్ల దృతరాష్ట్రుడు మూడేళ్లు ఆశ్రమంలో తపస్సు చేసి దేహాన్ని వదిలి కుబేరుని కడకు చేరతాడని,  గాంధారి అతడిని అనుసరిస్తుందని, కుంతీ స్వర్గ లోకంలో ఉన్న పాండురాజును పొందుతుందని నారదుడు చెబుతాడు.

కొన్నాళ్లకు హస్తినాపురంలో పాండవులు, అంతఃపుర స్త్రీలు,  గాంధారి ధృతరాష్ట్రుల గురించి,  కుంతీదేవి గురించి దిగుగులు పడ్డారు.  సహదేవుడు ఒకరోజున ధర్మరాజుతో వారందరినీ చూచి రావాలని తన కోరికగా విన్నవిస్తాడు. అందుకు ధర్మజుడు ఇష్టపడి బందు సమేతంగా ధృతరాష్ట్రుడు మొదలైన  వారందరినీ చూడడానికి రాజ లాంఛనాలతో శతాయు ఆశ్రమానికి  బయలుదేరి వెళతాడు.  తపోవనంలో ఉన్న తల్లి కుంతిని, పెద్ద తండ్రులని చూసి వారి యోగక్షేమాలు విచారించి వారి కోరిక మేరకు అచటి మునులతో కూడా ఒక నెల రోజులు పాటు అక్కడే ఉంటాడు.  ఒక రోజున విదురుడు దిగంబరుడై ధర్మరాజుకు కనబడి యోగమార్గాన తన జీవిత తేజాన్ని ధర్మరాజులో లీనం  కావించాడు.  దానితో ధర్మరాజు మిక్కిలిగా తేజోవంతుడయ్యాడు.

ఒక రోజున వ్యాసుడు దృతరాష్ట్రుని ఆశ్రమానికి వచ్చి యోగక్షేమాలు విచారించి, అతనికి తపస్సు సంతోషం కలిగించడం లేదని గ్రహించి అతనికొకవరాన్ని ఇవ్వడానికి పూనుకున్నాడు.  ధృతరాష్ట్రుడు దివంగతులైన  తన కొడుకుల్ని బంధువుల్ని చూడాలని,  వారెలా ఉన్నారో తెలుసుకోవాలని కోరాడు.  అలాగే గాంధారి,  కుంతి,  తదితర పాండవ వర్గ  భర్తలను కూలిపోయిన స్త్రీలు తమ తమ వారిని చూడాలని కోరారు.  కుంతీ తాను కన్నెగా ఉన్నప్పుడు జన్మించిన కర్ణుడిని చూడాలని కోరింది.  వ్యాసుడు వారందరినీ, మునిగణాల్ని గంగానది తీరానికి తీసుకొని వెళ్లి మరునాటి ఉదయాన పూర్వం భారతరణంలో  మృతులైన వారందరినీ వారి వారి దివ్యదేహాలతో గంగ నుండి బయటకు వెలబడనట్లు చేశాడు. యోగ దృష్టితో దృతరాష్ట్రునకు చూపునిచ్చాడు.  గాంధారి తన కళ్ళకు కట్టిన వస్త్రాన్ని తీసింది.  వారందరూ పూర్వపు  వైరాలను మాని స్నేహపూరిత ప్రవృత్తులతో మసలడం చూసి ధృతరాష్ట్రాదులందరూ ఆశ్చర్యపడ్డారు.  వారందరూ మరునాటి ఉదయం గంగలో అంతర్హితులయ్యేటట్లు వ్యాసుడు చేశాడు. వారి దర్శనంతో దృతరాష్ట్రుని మోహదృష్టి నశించింది.  సమదృష్టి పెరిగి యోగం పై మనస్సు  రమించింది. మహాద్భుతమైన ఆ సన్నివేశం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఈ సందర్భంలో పితృదేవతలు మొదలైన వారి  దర్శనం ఎంతటి మహిమోపేతము తిక్కన వైశంపాయనుడి నోట జనమే జయరాజునకు ఇలా చెప్పించాడు.

  “జననాథ! యీ ప్రియ సంగమోత్చావ  కథ
                వినిన బటించిన వే విధముల
బరమ ప్రియము లిందుబరలోకమున సంభ
                వించు మనమ్మున కించు భంగి”
……………………………………..
నవ్యయానంద సంప్రాప్తి యావహిల్లు
దత్పరత గొని యాడిన దైవతములు
నీచదశ బొందకుండంగ  గాచి తిరిగి
మేలొనర్తురు భరత భూపాలవర్య!   (2-128, ఆశ్రమ పర్వం)

ధర్మరాజు రాజ్యంపై ఆసక్తి లేక ధృతరాష్ట్రుని సన్నిధిలోనే ఉండిపోవాలని సంకల్పించాడు.  కానీ వ్యాసభగవానుని బోధనతో తిరిగి హస్తినకు వెళ్లి ప్రజా పరిపాలనలో ఆసక్తి కలవాడయ్యాడు.  ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నారదుడు ధర్మరాజును దర్శించి,  గాంధారి ధృతరాష్ట్రులు కుంతి తపోవనంలో కార్చిచ్చుల్లో దహించబడ్డారని చెప్పి  పాండవుల్ని, హస్తినాపురం ప్రజలందరినీ శోకసంద్రంలో ముంచాడు నారదుడు తాను విన్న వివరాలు చెప్పాడు.  గాంధారి ధృతరాష్ట్రులు, కుంతి, సంజయుడు తమ తపస్సును తీవ్రతరం చేశారు. ఆశ్రమాన్ని విడిచి గంగ ద్వారా పరిసర అరణ్యంలో  ఉగ్రతపం ప్రారంభించారు.  ధృతరాష్ట్రుడు గాలిని,  గాంధారి నీటిని ఆహారంగా స్వీకరించారు.  కుంతి మౌనోపవాసాలు చేసింది. సంజయుడు ఏడు భోజనాల కాలంలో ఒక భోజనం చేస్తూ తపస్సును తీవ్రం చేశాడు.  చివరికి ధృతరాష్ట్రుడు అగ్నికార్యం కూడా మానివేశాడు.  అనగా కర్మసన్యాసం కావించాడని భావం. మృత్విజులు  అగ్నిని అడవిలో వదిలి వెళ్ళిపోయారు. ఒకనాడు ధృతరాష్ట్రుడు మొదలైనవారు  గంగలో స్నానం చేసి అడవిలోకి  వస్తుండగా పెద్ద కార్చిచ్చు పెచ్చు పెరిగి వారిని ముట్టడించింది. సంజయుడు ఉదయ పర్వతం పైకెక్కాడు. సంజయ్యుని మాటపై ధృతరాష్ట్రుడు, గాంధారి,కుంతి  తూర్పుకు తిరిగి యోగసమాధిలో కూర్చుండి పోయారు.  దావాగ్ని వారిని దహించి వేసింది. అనగా ధృతరాష్ట్రాదులు  గార్హపత్యాగ్నిలోనే దగ్ధమయ్యారు.  కొడుకులు అగ్నికార్యం చేయాల్సిన అవసరం అతనికి కలగలేదు. దావాగ్నిలో దహించబడిన  అతడు యోగమార్గంలో తనువును విడిచి పుణ్యపురుషులకు తగిన ఉత్తమ లోకాలకు వెళ్ళాడు. గాంధారి భర్తను అనుసరించి వెళ్ళింది.  కుంతీదేవి యోగంలోనే తనువును విడిచి  పాండు మహారాజును చేరింది.  ఇలా అందరూ పుణ్యలోక నివాసాన్ని పొందారు.

ఈ వార్త విని ధర్మరాజు శోకించాడు. నారదునిచే అనునయించబడి శాంతాత్ముడై మరణించిన పెద్దలందరికీ గంగలో తిలోదకాలు యధావిధిగా సమర్పించాడు. పాండవులు పితృయాగాన్ని శ్రద్ధా భక్తులతో నిర్వహించి పవిత్రులు అయ్యారు. వారి అస్థికలను తెప్పించి గంగలో కలిపారు. వారికి ఉత్తమ గతులు కల్పించారు.  ఆపై హస్తినాపురం వెళ్లి  ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశారు.

3. ముగింపు:

ఇక్కడ ఒక్క విషయం, ధృతరాష్ట్రుడు శతాయు ఆశ్రమంలో  ఉండి తపస్సు ప్రారంభించడం, నారదుడు వచ్చి ఆ క్షేత్ర మహత్యాన్ని చెప్పి,  పూర్వ రాజులు ఆ  క్షేత్రంలో తపస్సు చేసి ఇంద్రలోకానికి చేరిన వృత్తాంతాన్ని వివరించడం, దృతరాష్ట్రుడు మూడేళ్ల తపస్సు చేసి, తనవు చాలించి కుబేరుని సన్నిధిలో వైభవంగా ఉండటాడని ఇంద్రుడు చెప్పినట్లు నారదుడు శతాయునికి చెప్పడం, అది విని ధృతరాష్ట్రుడు సంతోషించడం మొదలైనవి  అతనిని ఆశ్రమ వాశానికి తీసుకొని వెళ్లడంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు.

ధృతరాష్ట్ర గాంధారి,  కుంతీ దేవుల దేహా విమోచనంతో అంతమయ్యే ఈ పర్వం కరుణరస తరంగితం.  వ్యాసుడు ద్రుతరాష్ట్రునకు  దివ్య దృష్టిని ఇచ్చి మృతవీరులందరినీ చూడగలిగేటట్లు చేసిన ఈ ఘట్టం అద్భుత రసమయం అయితే  తిక్కన్న సిద్ధహస్తుడే కదా! కురుక్షేత్ర యుద్ధానికి మునుపు ఒకే కుటుంబం కౌరవ, పాండవ పక్షాలుగా వైరాన్ని ప్రదర్శించినప్పటికీ కురుక్షేత్ర అనంతరం   అనగా  దుష్ట సంహరణం తర్వాత కౌరవాధిపతి ధృతరాష్ట్రుడు పాండవ పక్షాన నిలిచాడు. కారణం ఏమైనప్పటికీ కుటుంబం మళ్లీ ఒకటి అయ్యిందని  కళ్ళకి కనిపిస్తుంది. కురుక్షేత్రంలో కౌరవ సైన్యాన్ని తుక్కుతుక్కుగా ఓడించి రక్తపాతాన్ని సృష్టించిన పంచ పాండవులు యుద్దానంతరం పెద్ద తండ్రి దృతరాష్ట్రుడిని కన్నతండ్రితో సమానంగా ప్రేమాభిమానాన్ని పంచుతూ గౌరవించడం మహోన్నతమైన అంశం. ఇక్కడ  పంచ పాండవులందరూ గౌరవ మర్యాదలు కలిగి పెద్ద తండ్రిని ప్రేమించి గౌరవించిన తీరు ఇప్పటి సమాజానికి ఎంతో నేర్పు. ఆశ్రమ వాసపర్వ లో పాండవుల భక్తి, మర్యాదలను ఈతరం వారు ఒక్కసారి మహాభారత పుస్తక పఠనం చేసి మనసు నెక్కించుకుంటారని ఆశిస్తూన్నాను.

4. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కాటంరెడ్డి రామలింగారెడ్డి, అధ్యాపక విజయం (2016). అక్షర కోచింగ్ సెంటర్, కర్నూల్.
  2. కామరాజు, గడ్డ. మహాభారత కథలు. (2017). అధ్యాత్మ యోగాలయ బ్రహ్మవిద్యా ట్రస్ట్, హైదరాబాద్.
  3. చలపతి, గల్లా. కవిత్రయ భారతం ప్రతిపర్వవివేచనం. (2011). వెంకట తిరుపతి పబ్లికేషన్స్, చిత్తూర్.
  4. చిన్నసూరి, దళపతి. మహాభారతం ఒక వరం. (2001). విశాలాంధ్ర పబ్లికేషన్స్, విజయవాడ.
  5. తిక్కన. ఆంధ్రమహాభారతం. (1998.) విశాలాంధ్ర పబ్లికేషన్స్, ఎడిషన్ 8, విజయవాడ.
  6. దామోదర్, కుంటి. శ్రీమద్ మహాభారతం పుట్టుక. (2001). ధాత్రి పబ్లికేషన్స్, కర్నూల్.
  7. దేవిరెడ్డి, రామకృష్ణారెడ్డి. తెలుగు సర్వస్వం ( 2017). బుక్- 2, పెన్నేటి పబ్లికేషన్స్, కడప.
  8. రామచిన్న కిట్టయ్య, దాసరి. ఆశ్రమవాసపర్వవైభవం. (1999). రాఘవేంద్ర పబ్లికేషన్స్, గుంటూరు.
  9. వెంకట కవులు, తిరుపతి. పాండవస్వమేదం. (1989). కుంతీ పబ్లికేషన్స్, చెన్నై.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "OCTOBER-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-SEPTEMBER-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "OCTOBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]