AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
13. వివిధ సంగీతరీతులలో 'మానసబోధ' రచనలు: సాహిత్యసంగీతాంశముల సమగ్రవిశ్లేషణ
ప్రియంవద పొన్నాన
పరిశోధకురాలు, సంగీతం & నృత్యవిభాగం,
ఆంధ్రవిశ్వకళాపరిషత్. వాల్తేరు, విశాఖపట్నం.
సంగీత ఉపాధ్యాయిని, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9848068389, Email: priyamvadabrahmaji@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
మనసును సంబోధిస్తూ సాగేవి 'మానసబోధ' రచనలు. ఇటువంటి రచనలను మన భారతీయ సంగీతంలో వివిధ రీతుల సాహిత్యాలలో గమనించవచ్చు. ఏ సంగీతరీతిలో గల ఏ రచనలో ఈ ‘మానస బోధ’ అనేది ఏ విధంగా సాగిందనే విషయాన్ని ఉదాహరణలు- వాటి సాహిత్య సంగీతాంశముల విశ్లేషణతో సహా నా ఈ పరిశోధనా వ్యాసం చూపుతుంది. శ్రీ చిలకపూడి వెంకటేశ్వరశర్మ నవవిధభక్తి మార్గములకు అన్వయంగా రాసిన 'శ్రీ త్యాగరాజు - మానస బోధ'1 అనే శీర్షికనే ప్రధాన ఆధారంగా చేసుకుని ఆ విధమైన మానస బోధ వివిధ సంగీత రీతులలో ఏ విధంగా ఉందనే విషయాన్ని పరిశీలించి ఫలితాన్ని అందించటమే ఈ వ్యాసముఖ్యోద్దేశం. ప్రాథమికగ్రంథాలద్వారా, అంతర్జాలంలో లభించిన ప్రామాణిక విషయసామగ్రిని విశ్లేషించడం ద్వారా ఈ పరిశోధన వ్యాసం రూపుదిద్దుకుంది.
Keywords: మానసబోధ, శాస్త్రీయసంగీతం, భక్తిసంగీతం, లలిత సంగీతం, జానపదసంగీతం, తత్త్వగీతములు, చలనచిత్ర సంగీతం.
1. ఉపోద్ఘాతం:
ఇంద్రియాలకు మనసు అధికారి లాంటిది. మనిషి పురోగతికి, తిరోగతికి మనసు ఎంచుకునే ఎంపికలే కారణమవుతుంటాయి. సంగీతరచనల సాహిత్యంలో మనసుకు ప్రధానపాత్ర ఉంది. మనిషి యొక్క ఏ పని అయినా మనసుతోనే ముడిపడి ఉంటుంది. కనుక ఎందరో వాగ్గేయకారులు2, గేయ రచయితలు ఎంతో అనుభవ పూర్వకంగా ‘మానస బోధ’ను చేస్తూ అనేక సంగీత రచనలను చేయటం జరిగింది. ఆ అనుభవ పూర్వక రచనల సాహిత్యాలను పరిశీలించినప్పుడు మనసు, దాని స్వరూప స్వభావాలు, జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాలలో మనసు యొక్క తీరుతెన్నులు ఎలా ఉంటాయనే విషయం మనకు అవగాహనకు వస్తుంది.
ఇటువంటి 'మానస బోధ' భారతీయసంగీతములో గల వివిధ రీతులైన శాస్త్రీయ, భక్తి, లలిత, జానపద, చలనచిత్ర సంగీతాలలో ఏ విధమైన భావజాలంతో వస్తుందనే విషయాన్ని ఆయా రచనల యొక్క భావం, ఆ రచనలలో గల సాహిత్య-సంగీతాంశముల విశ్లేషణా సహితంగా ఈ వ్యాసంలో చూద్దాం.
2.1 శాస్త్రీయ సంగీతం- మానస బోధ:
సామవేద జనితమైన శాస్త్రీయ సంగీతం హిందుస్థానీ, కర్ణాటక సంగీత బాణీలుగా ఉంది. వీటిలో కర్ణాటక సంగీతం మన దక్షిణ భారతదేశమునకు చెందినది. ఈ సంగీత రీతిలో రచనలు ఎక్కువగా తెలుగులోనూ, తర్వాత సంస్కృతం, తమిళం, కన్నడం వంటి వివిధ ప్రాంతీయ భాషలలో కనబడుతుంటాయి.
18వ3 శతాబ్దానికి చెందిన త్యాగయ్య, శ్యామశాస్త్రులు, ముత్తుస్వామి, దీక్షితులు కర్ణాటక సంగీతమునకు త్రిమూర్తుల వంటి వారు. వీరి రచనలే నేటి శాస్త్రీయ సంగీతం అనేంతగా వీరి రచనలైన కృతులు, కీర్తనలు సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ఈ ముగ్గురిలో త్యాగరాజస్వామి యొక్క రచనలు అప్పటి సామాన్య ప్రజలకు, సామాజిక పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల విశేష ఆదరణను పొందాయి. త్యాగయ్య పరమ రామభక్తుడు. ఉంఛవృత్తి చేస్తూ జీవనం గడిపేవాడు. ఐహిక సుఖములను వదిలి రాముని పరబ్రహ్మగా భావించి నాదోపాసన ద్వారా తరించాడు. ఆయన రచించిన అనేక కృతులలో 'మనసా!' అని సంబోధిస్తూ, మనసునకు వివిధ విషయముల గురించి బోధిస్తూ సాగే రచనలు చాలానే ఉన్నాయి. ఇటువంటి రచనలను శ్రీపాద పినాకపాణి సంగీత సౌరభంలోనూ, అరిపిరాల సత్యనారాయణ సంగీత కళా ప్రదర్శనలోనూ, కె.వి. శ్రీనివాస అయ్యం ADI TYAGARAJA KIRTANAM (Telugu) అను గ్రంథాలలోనూ మనం చూడవచ్చు.
ఈ ‘మానసబోధ’ శాస్త్రీయ సంగీతమున ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలుసుకోటానికి త్యాగయ్య 'ఉండేది రాముడొకడు' అను కృతి4ని ఉదాహరణగా తీసుకొని అందులో మానస బోధ, సంగీత సాహిత్యంశములు ఈ కృతిలో ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిద్దాం.
కృతి సాహిత్యం: "ఉండేది రాముడొకడు"
(హరికాంభోజి - రూపక తాళం)
పల్లవి: ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకే మనసా!
అనుపల్లవి: చండ మార్తాండ మధ్య మండలమునను చెలంగి
చరణం: తామసాది గుణ రహితుడు ధర్మాత్ముడు సర్వసముడు
క్షేమకరుడు త్యాగరాజ చిత్తహితుడు జగము నిండి
(సంగీత సౌరభం పుట: 179, 180)
త్యాగరాజ స్వామిచే రచింపబడిన పై కృతియందు త్యాగయ్య మనసుకు పరబ్రహ్మ తత్వమును రామునికి అన్వయం చేస్తూ చెప్పడం కనిపిస్తుంది. పరబ్రహ్మ స్వరూపమైన రాముడు ఈ చరాచర ప్రపంచం అంతటా తానే ఉన్నాడు. కనుక చంచలత్వాన్ని వీడి స్థిరంగా రాముణ్ణి ధ్యానించమని, దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్య మండలం మధ్యన సూర్యనారాయణ స్వరూపంగా వెలుగొందుతున్నాడని, సత్త్వ, రజః, తమో గుణములు లేనివాడు, ధర్మాచరణమే నియమంగా కలవాడు, అందరినీ సమదృష్టితో చూసేవాడు, అందరి శుభములను కోరేవాడు, ఎల్లప్పుడూ త్యాగరాజు హృదయంలో కొలువై మేలును కూర్చేవాడైన రాముడు ఈ ప్రపంచం అంతటా నిండి ఉన్నాడు. అని చెప్పడంలో సగుణమైన రామునికి నిర్గుణమైన పరబ్రహ్మ తత్వాన్ని ఆపాదించి మనసుకు బోధిస్తున్నాడని తెలుస్తుంది.
సాహిత్య - సంగీతాంశములు:
పై కృతి పల్లవి, అను పల్లవి, చరణం అను భాగాలతో ఉంది. 4 తాళావృతములు ఒక పాదం. పల్లవి, అను పల్లవి ఒక్కోపాదం, చరణం 2 పాదాలను కలిగి ఉన్నాయి. పల్లవిలో మొదటి ఆవృతం మొదటి అక్షరానికి మూడో ఆవృతం మొదటి అక్షరానికి యతి మైత్రి. అనగా ‘ఉ-ఊ’లకు. పూర్వ పూర్ణాను స్వర ‘డ’కారం రెండవ అక్షరం గా వచ్చి ప్రాస నియమం పాటించబడింది. అనుపల్లవిలో ప్రాసాక్షరమైన ‘oడ’ యే 3వ ఆవృతం యొక్క 2వ అక్షరంగా వచ్చి ప్రాస యతి కుదిరింది. చరణం మొదటి పాదంలో ‘త-థ’ లకు వర్గయతి రాగా, ముద్ర గలిగిన చివరి భాగమునకు ఛందో నియమముల నుండి సడలింపు ఉంటుంది. ‘మ’ ప్రాసాక్షరం. (సత్యనారాయణ, అరిపిరాల. సంగీత కళాప్రదర్శిని (థియరీ) పుట. 15)
"ఉండేది రాముడొకడు" అనుకృతి 28 వ మేళ కర్త హరి కాంభోజి రాగంలో ఉన్నది.
సరిగమపదనిస- సనిదప మగరిస దీని ఆరోహణ, అవరోహణ. బాణ-భూ దీని మేళ సంకేతం. అంటే 5వ చక్రంలో 4వ రాగం అన్నమాట. షడ్జ, పంచమాలు కాక చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం, కైశికి నిషాదములు ఈ రాగంలో వస్తాయి. ఇది గొప్ప జనకరాగం. దీని జన్యం అయిన కాంభోజి దీనికంటే ప్రసిద్ధమైన రాగం, ప్రాచీనమైన రాగం కూడా. ఇది మూర్ఛనా కారకమేళం5. ‘రి’తో నఠభైరవి, ‘గ’తో చ్యుత పంచమతోడి, ‘మ’తో ధీర శంకరాభరణం, ‘ప’తో ఖరహరప్రియ, ‘ద’తో హనుమత్తోడి, ‘ని’తో మేచకళ్యాణి రాగాలు వరుసగా ఏర్పడతాయి. ఈ రాగాన్ని వెంకటమఖి సాంప్రదాయంలో ‘హరికేదార గౌళ’గా చెప్తారు. (చిన్న సత్యనారాయణ, నూకల. రాగలక్షణ సంగ్రహం (‘హరికాంభోజి’) పుట. 437)
ఈ కృతి రెండు ఘాతలు, ఒక ఉసితో వచ్చే రూపక తాళంలో ఒక అక్షరం జాగాతో నడుస్తుంది.
త్యాగరాజుల వారి రచనా శైలిలో ప్రత్యేకమైనది సంగతుల కూర్పు. సంగతులు ఒక క్రమ పద్ధతిలో, నిర్మాణమౌతూ వచ్చి కృతి యొక్క సాహిత్యం వినేవారి మనసులలో నిలిచేటట్టు చేస్తాయి. పై కృతి పల్లవిలో 1,3 ఆవృతాల ధాతువు6 క్రమంగా వృద్ధి చెందుతూ సాహిత్యం ఒక పంక్తే అయినా త్యాగయ్య చెప్పదలచిన విషయాన్ని నేరుగా మన ముందుకు తీసుకురాగలిగాయి.
అనుపల్లవిలో ‘చండ మార్తాండ మధ్య మండలమునను చెలంగి’ అనే సాహిత్యంలో ‘చండ మార్తాండ మధ్య’ అను భాగానికి మాత్రమే సంగతి మార్పు వచ్చి మన దృష్టి ఆ పరమాత్ముడు ఎక్కడైతే ఉంటాడో ఆ స్థానంలో నిలపాలనే విషయాన్ని సూచిస్తుందా అన్నట్టు ఉంటుంది.
చరణం లో 2,3 ఆవృతాలలో వచ్చే గుణరహితుడు, ధర్మాత్ముడు, క్షేమకరుడు అను పదాలకు సంగతిలో మార్పులు వచ్చి రాముని ఏ గుణగణాలను మనం గ్రహించాలో తెలిపే విధంగా ఉంటాయి. (వ్యాసకర్త పరిశీలనాత్మక స్వీయ వ్యాఖ్య)
శాస్త్రీయ సంగీతంలో గల ఈ కృతి మానస బోధ గల రచనకు ఒక మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. దీనిలో త్యాగయ్య పరబ్రహ్మ స్వరూపమైన రాముణ్ణే ధ్యానించమని, అది మాని అటు ఇటు పోవడం వృధా ప్రయాసే తప్ప ఏమీ ప్రయోజనం లేదని, నిర్మొహమాటంగా మనసుకు బోధించుట స్పష్టంగా కనబడుతుంది.
2.2 భక్తి సంగీతం - మానస బోధ:
'’రామభక్తి సామ్రాజ్యం ఏ మానవులకబ్బేనో!’'7 అంటారు త్యాగయ్య . '’పాతకములను దీర్చి నీ పద భక్తి సంతత మీయవే’'8 అంటారు శ్యామశాస్త్రులు.
మన భారతీయ జీవనశైలిలో దేవునిపై భక్తి ఒక భాగం. అయితే మనిషి ఏ మార్గంలో నడవాలన్నా దానికి మనసు సహకారం కావాల్సిందే. చిన్నప్పటినుండి రామ భక్తుడైన త్యాగయ్య '’మనసు స్వాధీనమైన యా ఘనునికి మరి మంత్రమేల తంత్రమేల’'9 అన్నాడంటేనే అర్థమౌతుంది మనసు ఎంత ప్రధానమైనదో.
తెలుగు నాట పల్లెకో రామ మందిరం. వారం వారం భజనలు. ఆ భజనల్లో తప్పకుండా వినవచ్చేవి రామదాసు కీర్తనలు. 1620 - 8010 కాలమునకు చెందినవాడైన కంచెర్ల గోపన్న తన భక్తియుత రచనల ద్వారా భక్త రామదాసుగా పేరుగాంచాడు.
రామదాసు కీర్తనలు సంస్కృత, తెలుగు భాషలలో లభిస్తున్నాయి. వీటిలో తెలుగు కీర్తనలే ఎక్కువ. ఈయన కీర్తనల్లో మానస బోధన చేసే రచనలు కూడా ఉన్నాయి. అయితే రామదాసు తన మనసుకు కేవలం రాముని పై భక్తిని, వైరాగ్యాలనే కాకుండా సామాజిక బాధ్యతను కూడా బోధించాడు. అటువంటి మానస బోధ కలిగిన రచనకు ఒక చక్కని ఉదాహరణ 'శ్రీరాముల దివ్య నామ స్మరణ'.
కీర్తన సాహిత్యం: శ్రీరాముల దివ్య నామస్మరణ
(సావేరి రాగం - ఆదితాళం)
పల్లవి: శ్రీరాముల దివ్య నామ స్మరణ సేయుచున్న చాలు
ఘోరమైన తపములను కోరనేటికే మనసా!
అనుపల్లవి: తారక శ్రీరామ నామ ధ్యానము చేసిన చాలు
వేరు వేరు దైవములను వెదకనేటికే మనసా!
1. చరణం: భాగవతుల పాదజలము పైన జల్లుకొన్న చాలు
భాగీరథికి పొయ్యేననే భ్రాంతి యేటికే
భాగవతుల వాగామృతము పానము జేసిన చాలు
బాగుమీర నట్టి యమృత పానమేటికే మనసా!
2. చరణం: పరుల హింస సేయకున్న పరమధర్మమంతే చాలు
పరుల రక్షింతునని పల్కనేటికే
దొరకని పరుల ధనముల దోచక యుండితే చాలు
గురుతుగాను గోపురము గట్టనేటికే మనసా!
3.చరణం: అతిథి వచ్చి యాకలన్న అన్నమింత నిడిన చాలు
క్రతువు సేయవలననే కాంక్ష యేటికే
సతతము మా భద్రగిరి స్వామి రామదాసుడైన
ఇతర మతములని యేటి వెతల వేటికే మనసా!
(కృష్ణమూర్తి, నేదునూరి. సంగీత కళానిధి. భద్రాచల రామదాసు కీర్తనలు. Vol-1, page -173 “http:\\badhrachalaramadasu.com/volume-I/”)
చక్కని తెలుగును ఉపయోగిస్తూ అందరికీ అర్థమై ఆచరించే విధంగా సాగింది రామదాసుల వారి ఈ కీర్తన.
ఎప్పుడూ లేనిదానికై వెంపర్లాడటం, ఢాంబికాల వైపుకే మళ్లటం మనసుకో అలవాటు. అటువంటి మనసుకు సులభంగా తరించే మార్గాన్నీ, సమాజంలో మెసలవలసిన విధాన్ని తెలియజేస్తున్నాడు రామదాసు.
రామనామ స్మరణే తరించేందుకు సులభ మార్గమని, దాన్ని వదిలి తపస్సులు చేయలేకపోతున్నామనే బాధ వద్దనీ, ఆ దైవం ఈ దైవం అంటూ ఎటూకాకుండా పోయే బదులు ఒక దైవాన్ని గట్టిగా నమ్ముకొనమనీ, పూర్వపుణ్యం చేత మహా భక్తులు ఉత్తములు అయిన వారి సేవ చేసుకున్నా చాలని, ఎక్కడో ఉన్న గంగానదికి పోలేదనే బాధ ఎందుకనీ, పుణ్యాత్ముల మాటే అమృతము కంటే గొప్పది కనుక అది విని తరించమని మనసుకు చెప్తున్నాడు.
ఏమీ చేయకపోయినా నేనది చేస్తానిది చేస్తానని లేని గొప్పలు పలుకుతావు. ఇతరులకు నీ వల్ల ఏ కష్టం కలగకపోతే అదే వారికి చేసే గొప్ప మేలు. .పరాయి వాళ్ళ ధనం మీద ఆశపడి, వాటిని దోచి, పేరు రావడానికై గుళ్ళు గోపురాలు కట్టించినా నిష్ఫలమని,
ఆకలితో నీ ఇంటికి వచ్చే వానికి ఇంత అన్నం పెట్టినా అదే యజ్ఞం అవుతుంది. ఈ విధంగా మెలుగుతూ ఆ శ్రీరామచంద్రుని నామస్మరణ భక్తితో చేసుకుంటే చాలు. ఇక తరలించటానికి ఏ మార్గాలను వెతుక్కునే పని లేదు అంటూ మనసుకు బోధిస్తాడు రామదాసు.
సాహిత్య - సంగీతాంశములు: భక్తి సంగీతం శాస్త్రీయ సంగీతము నందు ఒక శాఖ వంటిది. శాస్త్రీయ సంగీతం గానరస ప్రధానమైనది కాగా ఇది భక్తి రసమే ప్రధానంగా గల మాతువు11కు ప్రాధాన్యతనిస్తుంది. ఈ రచనల్లో కూడా శాస్త్రీయ సంగీతం వలనే ఛందో నియమాలు ఉంటాయి.
పల్లవి మొదటి పాదంలో ‘శ్రీ-స్మ’లకు ఊష్మయతి12, 2వ పాదంలో ‘ఘో-కో’లకు వర్గయతి. ‘ర’ ప్రాసాక్షరం. పల్లవి, అనుపల్లవులకు ఒకటే ప్రాసాక్షరం. మొదటి చరణంలో వరుసగా ‘భా-ప్ర’, ‘భా-భ్రాం’, ‘భా-పా’, ‘బా-పా’లకు యతి మైత్రి, ‘గ’ ప్రాసాక్షరం.
2వ చరణం 4 పాదాలలో ‘ప-ప’, ‘ప-ప’, ‘దో-దో’, ‘గు-గ’లకు యతి మైత్రి, ‘ర’ ప్రాసాక్షరం.
3వ చరణం లో ‘అ-ఆ’, ‘క్ర-కాం’, ‘స-స్వా’లకు యతి మైత్రి. 3వ పాదంలో ‘భద్రగిరి’13 అను రామదాసు ముద్ర ఉన్నది. ఈ చరణం లో ‘త’ ప్రాసాక్షరం. 4వ పాదంలో ‘త-త’లకు ప్రాసయతి.
కర్ణాటక శాస్త్రీయ సంగీతాన ప్రపంచ స్థాయి విద్వాంసులైన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి 108 రామదాసు కీర్తనలను స్వరపరిచారు. ఆ అష్టోత్తర శత కీర్తనలలో ‘సావేరి’ రాగంలో స్వరపరచబడ్డది ఈ కీర్తన.
సావేరి 15వ మేళకర్త మాయామాళవగౌళ జన్యం. సరిమపదస- సనిదపమగరిస దీని ఆరోహణ, అవరోహణ. న,పలు గాక శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదములు వస్తాయి. ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో 7 స్వరాలు వస్తాయి. కనుక ఇది ఔడవ - సంపూర్ణ రాగం, భక్తి, కరుణ రసాలను పోషిస్తుంది.
“సావేరి గాంధారం అంతర గాంధారానికి ఒక శ్రుతి తక్కువగా పలుకుతుంది. అందుకే సావేరి గాంధారం అంటారు. గాంధారం దీర్ఘంగా ఉన్నప్పుడే అట్లు పలుకుతుంది. శ్రుతులలో భేదంగా పలికిన రాగాలను అర్థభాషాంగాలు అని కూడా అంటారు. దీన్ని కూడా అర్థభాషాంగ రాగం అనవచ్చు.” అని మహా మహోపాధ్యాయ డాక్టర్. నూకల చిన్న సత్యనారాయణ తన రాగలక్షణ సంగ్రహం పుట. 409 లో చెప్పారు.
ఆదితాళంలో రెండు అక్షరముల జాగాకి మొదలై చిత్రతర మార్గం14లో ఉంటుంది ఈ రచన నడక.
ఈ కీర్తన సంగీత ప్రియుల, రామభక్తుల ఆదరం పొంది పుస్తకములు, వెబ్ సైట్స్, సిడీలు, యూట్యూబ్ల ద్వారా ప్రచారంలోకి వచ్చి చిన్న, పెద్ద సంగీత కళాకారుల చేత సంగీత సభలలో, భజన గోష్ఠులతో పాడబడుతుంది.
మనసుకీ మనిషికీ మార్గ నిర్దేశనం చేయగల ఈ కీర్తన సాహిత్యపరంగా రామదాసుచే గావించబడిన ఒక గొప్ప ‘మానస బోధ’.
2.3 లలిత సంగీతం-మానస బోధ:
గ్రామఫోన్ రికార్డులు, రేడియోల ద్వారా జనబాహుళ్యంలోనికి చేరిన సంగీత రీతి లలిత సంగీతం. శాస్త్రీయ సంగీతానికి భిన్నంగా నూతనంగా ఉండే ఈ సంగీతం జనాకర్షణను విశేషంగా పొందింది. ప్రకృతి, ప్రేమ నుండి భక్తి, వైరాగ్యం దాకా ఈ రీతి స్పృశించని అంశం లేదనే చెప్పాలి. అన్ని విధములైన సంగీత, సాహిత్య ప్రయోగములకు ఈ లలిత సంగీతమే వేదిక. ఎందరో కవుల భావుకతలను, ఇంకెందరో సంగీత దర్శకుల స్వర రాగ ప్రయోగాలను, మరెందరో గాయకుల సంగీత సౌజన్యాలను తనలో ఇముడ్చుకోగలిగింది ఈ లలిత సంగీత భామిని. ఈమె సుందర సుకుమార లావణ్య రూపానికి దాసులు కాని కళాభిమానులు ఆనాడు లేరంటే అతిశయోక్తి కాదు.
"శాస్త్రీయ సంగీతంలోని కృతుల లాగా విద్వత్ప్రదర్శన ప్రధానంగా కాకుండా సాహిత్య రస భావానుగుణమైన రాగ రచనతో ఆధునిక కవుల గేయ రచనలను పాడే సంగీతాన్ని తొలి రోజులలో గీతావళి అనీ, ఆ తరువాత లలిత సంగీతమనీ వ్యవహరించటం పరిపాటి అయింది" (శ్రీ బాలాంత్రపు రజినీకాంతరావు. ఆంధ్రవాగ్గేయకారచరిత్రము. రెండవ భాగం పుట: 315) లలిత సంగీతం యొక్క లక్షణాన్ని తెలిపారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరధి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, బసవరాజు అప్పారావు, నండూరి వెంకట సుబ్బారావు, అడవి బాపిరాజు, బాలాంత్రపు రజినీకాంతరావు వంటి రచయితలు, పాలగుమ్మి విశ్వనాథం, సాలూరి రాజేశ్వరరావు, చిత్తరంజన్ వంటి స్వరకర్తలు.., ఘంటసాల, బాలమురళి, రావు బాల సరస్వతి, అనసూయ, సుశీల, శ్రీరంగం గోపాలరత్నం వంటి గాయక శిఖామణులు లలిత సంగీతానికి పరిపుష్టిని కూర్చారు. శ్రోతల హృదయాలను రసపూర్ణం చేశారు.
ఆనాటి మధుర గీతాలలో 'మరపురాని కలలుకని' అను లలిత గీతం శ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావు చే రచింపబడిన ఒక మానస బోధగీతం అవుతుంది.
లలిత గీతం సాహిత్యం: "మరపురాని కలలు కని”
పల్లవి: మరపురాని కలలు కని మరు దినమ్ము మేలుకుని
నిరాశలే మిగులునని తెలుసుకొంటివా మనసా! అలసియుంటివా!
1. చరణం: ప్రేమ నిన్న రోజుగని నేడు కరిగి పోయననీ
వేకువయే వేసటని తెల్లమాయెనా!
గుండెలు తల్లడిల్లేనా! మనసా! అలసియుంటివా!
2. చరణం: చిగురు ఎండి రాలునని ఎగిరిపోవు కోయిలని
క్షణికమే వసంతమని కనుల కట్టెనా!
అశ్రులు కరగి రాలెనా మనసా! అలసటాయెనా!
(సాహిత్యసేకరణ: http://youtube.com/watch?v=W5uSFaKCtfg&feature=shared)
ఈ గీతాన్ని శ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావు రచించగా, శ్రీ మహాభాష్యం. చిత్తరంజన్ స్వరపరిచి, పాడటం జరిగింది. 1975లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి విడుదలైన ఈ పాట అందరి హృదయాలను ఆర్ద్రమయం చేసింది.
ప్రేమ సఫలమైనప్పుడు ఎంత ఆనందాన్నిస్తుందో విఫలమైనప్పుడు అంతకు మించిన దుఃఖాన్ని ఇస్తుంది. అది తట్టుకోవడం యువతీ యువకులకు చాలా కష్టం అనిపిస్తుంది. ప్రేమలో ఉండగా కలిసిన మనసులు ఎన్నో ఊహా విహారాలు చేస్తాయి. ఆ ఊహలతోనే ఊసులూ బాసలూనూ. కానీ అనుకోని కారణాలతో ఆ జంట విడిపోవలసి వచ్చినప్పుడు వారు పడే బాధ వర్ణించలేనిది. ఆ బాధనే భావగీతంగా మలిచారు మల్లవరపు విశ్వేశ్వర రావు .
ఒకసారి ఒకరిని ప్రేమించిన మనసు వారి నుండి మరలడం, వారిని మరవటం కష్టం. నిన్నటి వరకు ఉన్న ప్రేమను ఒక్కసారిగా కోల్పోవలసి వస్తే ఆ ప్రేమికులకు లోకమంతా అంధకారమైనట్టు అనిపిస్తుంది. ఆ సందర్భంలో ప్రేమికులు ఎంతో బాధ, నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. ‘చిగురు ఎండి రాలునని ఎగిరిపోవు కోయిలని క్షణికమే వసంతమని’ అను పంక్తులు చదివినప్పుడు వారి బాధ నేరుగా మన మనసులను తాకుతుంది.
ప్రేమలో విఫలమైనప్పుడు మనసు పడే బాధని కవి చక్కగా వర్ణించారు. ఒకరి పై ప్రేమ కలగడానికైనా లేదా ఏ విధమైన భావన కలగాలన్నా మనసుదే ముఖ్య పాత్ర గనుక ఈ లలిత గీతంలో ప్రేమ విఫలమైనప్పుడు కలిగే బాధని మనసే పడుతున్నట్టు భావించి కవి ఈ గీతాన్ని రాసినట్టు తెలుస్తుంది.
సాహిత్య - సంగీతాంశములు:
లలిత గీతములు భావ ప్రధానమైనవి. భావుకతే ప్రధానం కనుక వీటికి పాదం, యతి, ప్రాస వంటి ఛందో నియమాలు ఏవి ఉండవు. ఉండనవసరం లేదు. పల్లవి, చరణం అనే భాగాలు మాత్రం ఉంటాయి. ఆకట్టుకునే భాష అందంగా రసయుతంగా అల్లగలిగితే చాలు. ఎక్కువ సంఖ్యలో లలిత గీతములను, వాని సాహిత్యాలను పరిశీలించినప్పుడు మనకు ఈ విషయం అర్థమవుతుంది. నేటి అంతర్జాల యుగంలో ఎక్కడికో వెళ్ళనవసరం లేకుండానే వేల కొలదీ లలిత గీతములు మనకు అందుబాటులోనే ఉన్నాయి.
ఈ ఆర్ద్రమయ గీతాన్ని చిత్తరంజన్ చక్రవాకం రాగంలో స్వరపరిచారు. చక్రవాకం 16వ మేళకర్త. దీక్షితార్ సాంప్రదాయంలో తోయవేగ వాహిని. హిందుస్థానీలో ఆహిర్ భైరవ్. సరిగమపదనిస- సనిదపమగరిస దీని ఆరోహణ, అవరోహణ. షడ్జ పంచమాలు గాక శుద్ధ రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం, కైశికి నిషాదములు వస్తాయి.
లలిత గీతాలు భావగీతాలు కనుక రసపోషణ ముఖ్యం. ఈ పాటలకు రస వివేచన చేయవచ్చు. ఈ పాటలో కరుణరసం పలుకుతుంది. కరుణ రసమునకు శోకము స్థాయీభావము15.
ప్రేమ దూరమై మనసు పడే బాధ స్థాయీభావం కాగా ఆ విఫలమైన మనసుపై జాలి, సానుభూతి చూపి ఓదార్పు మాటలు పలకటం సంచారీభావం16 అయి కరుణరసం పండుతుంది.
ఈ రాగంలో గల శుద్ధ రిషభం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం, కైశికి నిషాదములు ఈ పాటలో రస పోషణకు దోహదం చేశాయి. ఆధార షడ్జం నుండి మొదలైన ఈ పాట ఇటు మంద్ర నిషాదం నుండి అటు తార రిషభం మధ్యలో నడుస్తుంది. చరణంలో వచ్చే
, సగామ దాద- పనిదప మగ మా
, మదాని సా సని- నిసరి నిసా, అను స్వరకూర్పులు స్థాయీభావమగు శోకమును చూపిస్తున్నాయి.
నినీని నిసరీస-సా అను స్వరకూర్పు జాలి చూపుట అనే సంచారీభావాన్ని పలికించగలిగింది.
లలిత సంగీతానికి ప్రత్యేకంగా తాళ ప్రదర్శన అంటూ ఉండకపోయినా లయను వేస్తూ పాడటం ఉంటుంది. అయితే ఈ లలిత గీతం కర్ణాటక సంగీతంలో 2 ఘాతలు 1 ఉసిగా వేసే రూపకతాళానికి సరిపోతుంది. ఈ పాట తకిట-తకిట నడకలో నడుస్తుంది. నెమ్మదిగా నడిచే విధంగా ఉన్న ఈ పాట లయ కూడా ఈ గీతాన్ని రక్తి కట్టించింది.
సంగీత సాహిత్యాలు సమపాళ్లలో కుదిరిన ఇటువంటి పాటలు అజరామరాలుగా ఆపాత మధురాలుగా శ్రోతల హృదయాలలో నిలిచిపోతాయి.
‘మరపురాని కలలు కని’ అను ఈ గీతం మనసుని సంబోధిస్తూ ఓదార్చుతూ సాగే లలిత సంగీత రీతిలోని ఒక మానస బోధ రచనగా చెప్పవచ్చు. (వ్యాసకర్త పరిశీలనాత్మక స్వీయ వ్యాఖ్యానం)
2.4 జానపద సంగీతం - మానస బోధ:
"మానవుడు నాగరికతా సౌధనిర్మాణమునకు పునాదులు త్రవ్వునప్పుడు అప్రయత్నముగా అనాలోచితముగా నాతని నోటి నుండి వెడలిన పృథ్వీగంధ సంవాసితములైన మాటలు గంధవహుడు నడిచిన బాటలందు పాటలై నడచి దేశ పరిభ్రమణమున నొకచో విరిగి మరియొకచో తరిగి ఇంకొక చోట పెరిగి జానపద గీత మయ్యెను." ( బిరుదరాజు. రామరాజు - తెలుగు జానపద గేయ సాహిత్యము- పుట:8)
జానపదులు శ్రమజీవులు. ప్రొద్దంతా కాయకష్టాలను చేసి సాయంత్రం అయ్యేటప్పటికి ఇల్లు చేరి, అందరూ రచ్చబండల వద్దకూడి కబుర్లతో కాలక్షేపం చేయటం పల్లెల్లో మనం నిత్యం చూసేదే. ఆ సమయంలో సరదాగా ఒక పాట ఎవరో ఒకరిచే ఆశువుగా అల్లబడుతుంది. ఉత్సాహవంతులైన మరొకరు దానిని అందుకుని మరికొంత పెంచడం జరగొచ్చు. ఆ విధంగా ఒక మంచి జానపద గేయం రూపుదిద్దుకుంటుంది. ఇది సహజ సంగీతం.
2.4.1 తత్త్వసాహిత్యం - మానసబోధ:
ఈ జానపద గీతాలు సాధారణంగా అకర్తృత్వాలుగా పల్లెల్లో లభిస్తాయి. అంటే ఆ పాటను రచించిన వారి వివరాలు తెలియవు. కానీ కొన్ని జానపద శైలిలో ఒక రచయితచే రచింపబడతాయి. ఇటువంటి వాటిని కర్తృత్వ జానపదాలు అనవచ్చు. ఇవి కూడా పల్లెల్లో బుర్రకథలు, హరిదాసులు, యాచకుల వద్ద మనకు వినవస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి వానిలో ఎక్కువగా జ్ఞాన, వైరాగ్యాలను చూపే తత్త్వసాహిత్యాన్ని కలిగి ఉండటం గమనించాలి.
బ్రహ్మ విద్య అతి పవిత్రం మరియు అతి గోప్యమను భావము వలన పెద్దలు ఆ విజ్ఞానాన్ని నిగూఢార్థాలు కలిగిన రచనలుగా చేసి మనకు అందించారు. పూర్వం పల్లెలలో ఎక్కడెక్కడ నుండో వచ్చిన సాధు పుంగవులు అచ్చట స్థిర నివాసములు ఏర్పరచుకొని, వారి సాధనను చేసుకుంటూ ప్రజలకు ధర్మ బోధలు, ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ సమాజం చైతన్య మార్గంలో నడుచుటలో తమ వంతు కృషిచేసేవారు.ఆ బోధనలు ప్రజల్లోనికి సులభంగా చేరుటకు సరళ వ్యవహారిక భాషలోనే రచనలు చేసి విషయాన్ని సామాన్య ప్రజల్లోనికి తీసుకెళ్ళగలి.ఇటువంటి పరబ్రహ్మమును గూర్చిన విజ్ఞానమును సాహిత్య వస్తువుగా కలిగిన సంగీత పరమగు గీతములు 'తత్త్వగీతములు' అనబడ్డాయి.ఇంతటి విజ్ఞానాన్ని వాటి యందు నీబిడీకృతం చేసుకున్న ఈ గీతములు నాగరిక సమాజంలో కంటే జనపదములలో ఎక్కువగా కనబడుట గమనించదగ్గ విషయం.
తత్త్వగీతముల యందు బాహ్యార్థము ఒకటి అంతరార్థం వేరొకటిగా యుండును.వానిని పాడుచున్న ఆ పల్లె ప్రజలకు వాని అర్థములు, భావములు అసలు తెలుసునో లేదో అనేది కూడా సందేహమే.ఆయా ప్రాంతములలో గల ఆయా గురువుల మీద నమ్మికతో ,నిర్మల భక్తితో వారి ప్రబోధాలుగా వచ్చిన తత్త్వగీతాలను గుర్వానుగ్రహంగా భావించి పాడుకుంటూ ఉంటారు. పల్లె ప్రజలలో అక్షరజ్ఞానం లేనివారు సైతం మౌఖికంగానే వాటిని ధారణ చేసి భక్తిగా గానం చేస్తూ ఉంటారు.
ఉదా:
- సందమామ సందమామ సందమామా నీ సంది తెలిపే ఙ్ఞానులెవరే సందమామ -సిద్ధయ్య. (ఉత్తరాంధ్ర జిల్లాలో బుర్రకథలలో ఎక్కువగా వినిపించే పాట)
- కోటలాటి కోట జగతిలో ఏ కోట లేదు- వీరబ్రహ్మేంద్రస్వామి. లేటు చెరుకూరి వెంకట లక్ష్మీ నరసమ్మ వద్ద సేకరించినది)
- కల్ల కాదు నిజము నిజమురా సద్గురుని కరుణ
(ఈ గీతం రచయిత ఎవరో తెలియరాలేదు. చివరి చరణంలో మాత్రం 'సుబ్రహ్మణ్యం' అనే పేరు కనపడుతోంది. బహుశా అది ముద్ర అయిఉండొచ్చు)
ఈ పాటలు సాధారణ పదాలలో గొప్పఙ్ఞానాన్ని దాచుకున్నవి. "ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనుచు" అను జానపద గేయం కూడా ఈ కోవకు చెందినదే.
జానపద బాణీలలో గల మానసబోధ రచనల కోసం వెతికినప్పుడు 2015లో సంగీత ఉపాధ్యాయిని ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మణి అను తోటి విద్యార్థిని నుండి ఇటువంటి పాటను వినిన గుర్తుచే ఆమెను మరలా సంప్రదించగా తన వద్ద సాహిత్యం పూర్తిగా లేదని తెలిసి పాట మొదటి పంక్తితో అంతర్జాలమున శోధించగా అను లింకుతో sathsang అను ఛానల్ ద్వారా పై పాట లభించింది. ఈ పాట సాహిత్యాన్ని పరిశీలించిన పిదప ‘యాగంటి దాసు’ ముద్రను చూసి గ్రంథ పరిశోధన చేయగా ‘ఆంధ్రుల కీర్తన వాఙ్మయ కళాసేవ’ అను ఊటుకూరి. లక్ష్మీకాంతమ్మ గ్రంథంలో పుట- 107లో ఇది యాగంటి లక్ష్మప్ప రచనగా తెలియవచ్చింది.
జన సామాన్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తత్త్వాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. వీనితో పాటు వారి మనవరాలు గోవిందమ్మ, శిష్యులు సిద్ధయ్య, యాగంటి లక్ష్మప్ప వంటి వారి గేయాలు కూడా ఎవరివి ఏవి అని తెలుసుకోలేనంతగా మిళితమై ఉన్నాయి.
పై జానపద గేయమైన “ఇల్లు వాకిలి నాది, ఇల్లాలు నాదనుచు..” గేయాన్ని, దానిలో మానసబోధ ఏమి ఉద్దేశించి జరిగిందనే విషయాన్ని పరిశీలిద్దాం.
జానపద గీతం సాహిత్యం: ఇల్లు వాకిలి నాది
ఇల్లు వాకిలి నాది, ఇల్లాలు నాదనుచు
ఏల భ్రమసితయ్య మనసా?
కాలుని వలలోనా కానకను జిక్కితిని
కడతేరుటే త్రోవ మనసా
తనయులు చుట్టాలు తన వారాలని నమ్మి
తలపోయేకే వెర్రి మనసా
తనువు విడిచి వెళ్లే సమయంబు లోపల
తన వెంట రారెవరు మనసా
ఆరు మూడింటి తేరి ఆపేస్తేజము గని
ఆనందమును కనుగొనవే మనసా
మేటి స్థానములోను, మేటి స్థానము నందు
సూటి తప్పక చూడు మనసా
వాటముగా బింబము తేటగా గనపడును
తెలివిగలిగి బ్రతుకు మనసా
సత్తు చిత్తుల కంటి సారంబు కనుగొన్న
సారవీడు నేమో మనసా
సంసారియై నీవు సారినీ కనుగొన్న
హింసలు తొలుగవే మనసా
రూపు చూపులు లేని ఖేచరంబున జూచి
దాపు చేరవే వెర్రి మనసా
పాపను మేల్కాంచి బయలుదెలుసుకొని
గోప్యముగా నుండవే మనసా
అంటి అంటని పండు ఆరింట వెలుగుచూ
మింటిలోనున్నదే మనసా
ఒంటరిగా యాగంటి దాసుని మదిలోన
జంట బాయక ఉండు మనసా
జీవునికి పరమావధి అయిన మోక్షమును పొందటానికి వివిధ మార్గాలలో సాధన చేసే వారికి మనసును నిగ్రహించటం తప్పనిసరి. తను పురోగతి పొందాలన్నా అధోగతి పాలవ్వాలన్నా మనసును తన త్రోవలోకి తెచ్చుకోవాలి. ఆ క్రమంలో ఇటువంటి మానస బోధ సహజం.
ప్రాపంచిక సుఖాలలో భాగాలైన ఇల్లు, వాకిలి వంటి వాని మీద మనసు ఎప్పుడూ తగులుకుంటుంది. కనీసం మరణ సమయంలోనైనా ఈ వ్యామోహాలను వదిలితే కొంత ప్రయోజనం ఉండొచ్చు. ఈ శరీరంతో వచ్చిన ఏ బంధాలైనా దీనితోనే పోతాయి తప్ప ఆత్మ ప్రయాణంలో వెంట రావు. కనుక వీటి నుండి బయటపడే మార్గాన్ని ఆలోచించు.
షట్ చక్ర సాధన చేసి సహస్రారాన నిలిచి పరంజ్యోతిని చూడు. అదే బ్రహ్మానందం. ఈ ప్రపంచం అంతా అసత్యం. సత్యాన్వేషణ, విజ్ఞాన శోధన చేస్తే అయినా ఈ మాయ నుండి బయట పడతావేమో ప్రయత్నించు.
నిర్గుణమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని అటువైపుగా ఆలోచన చేయు దానికి కుండలినీ సాధన వంటివి ఉండనే ఉన్నాయి. మౌనంగా ఉండి ధ్యానం చేయు.
షట్ చక్రములలో ప్రతి చక్రంలోనూ దృష్టిని ఉంచి సాధన చేసుకుంటూ చివరికి సహస్రారాన్ని చేరితే అక్కడ పరమ శాంతి లభిస్తుందని యాగంటి లక్ష్మప్ప తన మనసుకు జ్ఞానమార్గాన్ని బోధిస్తున్నాడు. తద్వారా మనకే ఆ సాధనా రహస్యాలను చెప్తున్నారని అర్థం చేసుకోవాలి.
సాహిత్య- సంగీతాంశములు:
జానపద సంగీతం పల్లె ప్రజలలో ఆశువుగా పుట్టిన సహజ సంగీతం కనుక దీనికి ఛందో నియమాలు ఏవి వర్తించవు. పల్లవి, అనుపల్లవి, చరణాలను భాగాలు కూడా ఉండనవసరం లేదు. పై గేయంలో గల సాహిత్య భాగాలను ఖండికలు అనవచ్చు. ప్రతి ఖండికలో గల పంక్తుల సంఖ్య సమానంగా ఉండాలని కూడా లేదు. చివరి ఖండికలో మూడవ పంక్తిలో ‘యాగంటి దాసు’ అని ముద్ర మాత్రం కనిపిస్తున్నది.
జానపద సంగీతం తన ప్రయాణంలో ఎన్నో మార్పులకు లోనవుతుంది. అందుకే జానపదులు పాడే ఒక పాట అనేక స్వరమెట్లతోనూ, ఒకే స్వరమెట్టుతో అనేక పాటలునూ వినపడుతుంటాయి. ఆ స్వరకూర్పులలో ఏది సరిగా ఉందను విషయాన్ని మన సర్వజ్ఞానమును ఉపయోగించి పాటలో ఏయే స్వరాలు వస్తున్నాయో అవి ఏ రాగానికి సరిపోతున్నాయో సరిచూసుకోవాలి.
Sathsang అను youtube channel ద్వారా నేను విన్న ఈ గీతంలో శంకరాభరణ రాగ స్వరాలు కనబడుతున్నాయి. అయితే ఆధార షడ్జం నుండి మధ్య పంచమం వరకే పాట మొత్తం తిరుగుతుంది. న,పలు కాక చతుశ్రుతిరిషభం,అంతరగాంధారం,శుద్ధమధ్యమ స్వరాలు మాత్రమే ఈ పాటలో వస్తున్నాయి కనుక ఇది శంకరాభరణ రాగమే అని చెప్పటం కూడా కుదరదు. అన్ని ఖండికలు ఒకే విధమైన స్వర కూర్పుతో ఉన్నాయి. సాహిత్యంలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు తప్ప చెప్పుకోదగ్గ మార్పులేవీ లేవు.
“ససరి- మమ మమ -మమమ - మ మమ మ
గమ మగ - గరి రిరి - గరిగరిసా-,;
రిరిరి- రిరిరిరి - గాపపగ-గరిసరి
గమ పమ - గరిస - సస సా,” అనే స్వరకూర్పుతో ఈ పాట వస్తున్నది.
జానపద గేయాలకు కూడా తాళ ప్రదర్శన ఉండదు. సహజంగా వచ్చే లయ మాత్రం ఉంటుంది. ‘తకిట - తకిట – తకిట’ అను త్రిశ్ర నడకలో ఈ పాట సాగుతుంది.
ఇటువంటి జానపద గేయములు జ్ఞానభాండారములు. ఇవి ఇప్పటి మనకు కేవలం పాటలే అయినా శాస్త్ర జ్ఞానం మెరుగుపడ్డాక వీటి అవసరం తరువాత తరాల వారికి ఉండొచ్చు. కనుక వీటిని స్వర, సాహిత్య సహితంగా భద్రపరచడం మన బాధ్యత. (వ్యాసకర్త పరిశీలనాత్మక స్వీయ విశ్లేషణ)
2.5 చలనచిత్ర సంగీతం- మానస బోధ:
పద్యాలతో ప్రారంభమై నవరసాలనూ ఒలికిస్తూ అనేక బాణీలను రీతులను తనలోకి తీసుకుంటూ శాస్త్రీయ, లలిత, జానపద, సంగీతాలకు ధీటుగా బహుజనాదరణే ధ్యేయంగా చలనచిత్ర సంగీతం ఆవిర్భవించింది.
సినీ గేయ రచయితలలో ఒకరైన ఆత్రేయ కి ‘మనసు కవి’ అని పేరు. ‘మనసు’నే ప్రధాన కవితా వస్తువుగా తీసుకొని ఎన్నో పాటలు రాశారాయన. వాటిలో ఆనందపరిచేవి, ఆలోచింపజేసేవి కూడా ఉన్నాయి. వాటిలో మనసు యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని చక్కగా చూపిన పాట గుప్పెడు మనసు17 చిత్రంలో ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా!’
పాట సాహిత్యం: ‘మౌనమే నీ భాష’
పల్లవి: మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌవుతావు.
1. చరణం: చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
2.చరణం: కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు.
(సాహిత్య సేకరణ: http://youtube.be/zPv2SJ5Q2KY?si=mEMD5n/k2HGxKsUB)
తను చెప్పినట్టు నడుచుకునే అన్ని ఇంద్రియముల తోడు ఉండి కూడా బుద్ధి చెప్పే మాటలను వినకుండా తనకు సుఖమనిపించే వాటినే చేస్తూ మనకు ఇబ్బందులు తెచ్చి పెట్టడం మనసుకు ఉండే ఒక స్వభావం. మానసిక ఘర్షణలకు మనిషి లోనైనప్పుడు మనసు తీసుకునే ఎంపికల ఫలితాలే మనిషి అనుభవించే సుఖదుఃఖాలు.
మనసు ఎంచుకునే ఎంపికలు పరిణామం దుఃఖంగా మారినప్పుడు దాని స్వభావాన్ని నిందిస్తూ సంబోధనలో తను, మనసు వేరు వేరని చూపుతూ, బాధను అనుభవించేటప్పుడు తను, మనసు ఒకటే అనే భావాన్ని చూపుతూ ఆత్రేయ ఈ గీతాన్ని రాశారు.
“ఓ మనసా! నీ విషయ వాంఛల కారణంగా నీ యజమానికి కష్టాన్ని తెస్తావు. నీకు ఒక రూపం అంటూ ఉండదు. ఆలోచనలే ఆసరాగా చేసుకొని రూపు కడతావు. ఎప్పుడూ స్వేచ్ఛగా తిరగాలనే ఆలోచనలో కట్టుబాట్లని వదిలేయడానికే చూస్తావు.
ఒక కోరిక మరో కోరికకు కారణం అన్నట్టు ఎప్పుడూ నీలో ఏదో ఒక కోర్కె పుడుతూనే ఉంటుంది. ఏది సరైనదో తెలుసుకోకుండా నీకు నచ్చినదే మంచిదనే భ్రాంతిలో ఉంటావు. ఎప్పుడు అందుబాటులో ఉన్నదాన్ని తిరస్కరిస్తూ అందని దానికై ఆరాటపడతావు. కష్టాలను కోరి తెచ్చుకుంటావు. అనవసరమైన ఆశలను పెంచుకొని అవి అడియాసలవగానే తప్పు తెలుసుకొని దోషిలా నిలబడతావు” అని కవి యొక్క భావం.
సాహిత్య- సంగీతాంశములు:
సినీ సంగీత సాహిత్యాలకు సాధారణంగా ఛందో నియమాలు ఉండవు. వినే వారి మనసు చేరేలా ఆయా సందర్భాలకు తగినట్టు పాటలు రాస్తారు. పల్లవి, చరణాలనే అనే భాగాలు మాత్రం ఉంటాయి. ఇక సంగీతం విషయానికొస్తే ఇంత సున్నితమైన పాటకు అంతే సున్నితమైన ‘సామ’రాగంలో జీవం పోశారు M.S. విశ్వనాథన్.
సరిమపదసా- సదపమగరిస దీని ఆరోహణ, అవరోహణ. షడ్జం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతాలు వస్తాయి. ఈ రాగంలో నిషాదం లేదు. 29వ మేళ కర్త ధీర శంకరాభరణం జన్యం. కొందరు ఈ రాగాన్ని శ్యామ అని కూడా పిలుస్తారు. చిన్న రాగమే అయినా నిర్దిష్టమైన రూపం కలది. కరుణ, భక్తి రసాలను పోషిస్తుంది. నిందించడం సంచారీ భావం, శోకము స్థాయీభావంగా ఉండి కరుణ రసం ఈ పాటలో పలుకుతుంది.
ఇటువంటి పాటకు ‘సామ’ను ఉపయోగించడం లలిత సంగీత చక్రవర్తి M.S. విశ్వనాథన్ లాంటి అనుభవజ్ఞులైన సంగీత దర్శకునికి ఆటవిడుపే అయినా సామ వంటి అచ్చమైన శాస్త్రీయ రాగాన్ని శ్రోతల ముందు ఉంచడానికి కర్ణాటక సంగీతంలో అప్పటికే తనదైన ముద్రను వేసిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ18 గాత్రం అవసరమైంది. బాలమురళి పాడిన ఈ పాట ప్రేక్షకులను చేరింది. మనసు స్వరూపాన్ని నిందాపూర్వకంగా చూపే ఈ పాట చలనచిత్ర సంగీత రీతిలో మానస బోధ రచనకు ఒక ఉదాహరణ.
3. ముగింపు:
ప్రతీ మనిషికీ మనసు ముఖ్యమైనదే. అనుకూల పరిస్థితుల్లో కంటే ప్రతికూల పరిస్థితుల్లోనే దాని ఉనికిని మనం గుర్తిస్తాం. ఆ ప్రతికూల పరిస్థితికి కారణం మనసు చేసుకునే విషయ ఎంపిక అని గుర్తించినపుడు మరలా అటువంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు మనసుని ఒక దారిలో పెట్టే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగమే ఈ మానసబోధ.
త్యాగరాజు.. పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. మరి అటు ఇటూ చంచలంగా తిరిగే బదులు స్థిరంగా ఉండి ఆ రామ బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకోమని చెప్పినా... రామదాసు సమాజమూ పరబ్రహ్మ స్వరూపమే కావున ముందు సమాజంలో సరిగా నడుచుకోమని అనవసర ఢాంబికాలకు పోకుండా రామనామ స్మరణా చేస్తూ తరించమన్నా... మల్లవరపు విశ్వేశ్వరరావు వంటి భావ కవి ప్రేమలో విఫలమైన మనసుని ప్రేమగా ఓదార్చే ప్రయత్నం చేసినా... జ్ఞాన ఘనుల వంటి తత్త్వ గీతాలను జానపద శైలిలో మలచి యాగంటి లక్ష్మప్ప పల్లె ప్రజల చేత కూడా “మనసా!” అంటూ వైరాగ్య గీతాలను పలికించిన. క్షణికానందాల వైపు మళ్లే మనసును, దాని స్వభావాన్ని ఎత్తిపొడుస్తూ ఆత్రేయ వంటి కవి నిందించినా... అవన్నీ వివిధ అవస్థలలో మనసుకు చేసే బోధలే అవుతాయి.
శాస్త్రీయ సంగీతంలో త్యాగయ్య కాక మరికొందరు వాగ్గేయకారులు కూడా ఈ మానసబోధ రచనలు చేశారు.
“సంకల్పమెట్టిదో”19 అను పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ కృతి, “భజన సేయరాదా”20 అనే మైసూరు వాసుదేవాచార్యుల కృతి ఇటువంటివే. అలాగే భక్తి సంగీతంలో కూడా ఉన్నాయి.
“రామ నామామృతమే నీకు”21 అను తూము నరసింహదాసు రచన ఇటువంటిదే. ఈ మానసబోధ రచనలు తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ఉన్నాయి.
“భజ్ మన్ చరణ్ సుఖ్ దాయి”22- తులసీదాస్ భజన్.
“స్మర సదా మానస బాల గోపాలం”23- స్వాతి తిరునాళ్ మహరాజ్.
ఈ మానస బోధ సాహిత్యాలు చదివినపుదు మనసు గురించి కొంత అవగాహన వస్తుంది. ఈ రచనలను సాధారణంగా అనుభవ పూర్వకంగా చేస్తారు. వారి అనుభవాలు మనకు పాఠాల్లాంటివి. ఈ రచనల్లో గల సారాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే మన లక్ష్యాలను సులభంగా చేరవచ్చు. మనకు స్ఫూర్తిని, మానసిక బలాన్నిఇవ్వగలిగే ఈ 'మానస బోధ’ రచనలపై అన్ని కోణముల నుండి పరిశోధన జరిపి ఫలితాలను సమాజానికి అందించవలసిన అవసరం ఉంది.
4. పాదసూచికలు:
- శ్రీ చిలకపూడి. వేంకటేశ్వర శర్మ- శ్రీ త్యాగరాజు- మానసబోధా శ్రీ త్యాగరాజస్వామి శత వార్షికోత్సవ ప్రత్యేక సంచిక పుట. 113
- అరిపిరాల. సత్యనారాయణామూర్తి- సంగీత కళా ప్రదర్శిని - పుట. 120
- అరిపిరాల. సత్యనారాయణామూర్తి- సంగీత కళా ప్రదర్శిని - పుట.220
- అరిపిరాల. సత్యనారాయణామూర్తి- సంగీత కళా ప్రదర్శిని - పుట. 107
- అరిపిరాల. సత్యనారాయణామూర్తి- సంగీత కళా ప్రదర్శిని - పుట. 28
- డా. వి. లలిత అన్నప్పారావు - సంగీత శాస్త్ర చంద్రిక – పుట. 2
- 7.కల్లూరి వీరభద్రశాస్త్రి - త్యాగరాజు కీర్తనలు విశేష వివరణము(ద్వితీయ సంపుటము) పుట. 150
- టి. ఎస్. పార్థ సారథి, భావరాజు నరసింహారావు - శ్యామశాస్త్రి కృతులు – పుట. 3
- కల్లూరి వీరభద్రశాస్త్రి - త్యాగరాజు కీర్తనలు విశేష వివరణము(ద్వితీయ సంపుటము) పుట. 91,92
- అరిపిరాల. సత్యనారాయణామూర్తి - సంగీత కళా ప్రదర్శిని - పుట. 209
- డా. వి. లలిత అన్నప్పారావు -సంగీతశాస్త్ర చంద్రిక - పుట. 2
- బులుసు వేంకటా సత్యనారాయణమూర్తి- అప్పకవీయం (తృతీయాశ్వాసం) -104వ పద్యం - పుట. 52
- అరిపిరాల. సత్యనారాయణమూర్తి - సంగీత కళా ప్రదర్శిని - పుట.129
- అరిపిరాల.సత్యనారాయణమూర్తి - సంగీత కళా ప్రదర్శిని పుట. 129
- పోచన పెద్ది. వేంకతా మురళీకృష్ణ (వ్యాఖ్యాత) - కావ్యాలంకార సంగ్రహం- పుట.126
- జమ్ములమడక మాధవరామశర్మ (భావాలోకము)- భావ ప్రకాశనము- పుట. 140, 141
- Guppedu Manasu – Wikipedia- http://en.m.wikipedia.org/wiki/Guppedu-Manasu
- బాలాంత్రపు. రజనీకాంతరావు- ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము- రెండవ భాగం- పుట. 310
- శ్రీపాద పినాకపాణి - సంగీత సౌరభం vol-IV పుట. 179
- శ్రీపాద పినాకపాణి - సంగీత సౌరభం vol- III పుట. 150
- Dr. మంగళగిరి. పూర్ణచందర్- తూమునరసింహదాసు సంగీత సాహిత్యాలు- సమగ్ర పరిశీలన
- తులసీ భజనామృత్ Album- Bhajan sangrahalaya- https://youtube.be/ZN-mLu2N4OM?Si=dr1iWDxx98_eUKmx
- Carnatic Classical – Manorama Music- http://youtube.be/1s2r7JOupc?Si=2QtVAMWYBEv1mthb
5. ఉపయుక్త గ్రంథసూచి:
- చినసత్యనారాయణ, నూకల. రాగలక్షణ సంగ్రహం. స్వీయ ముద్రణ, సికింద్రాబాదు. 2001.
- పార్థసారథి, టి.ఎస్.నరసింహారావు, భావరాజు. శ్రీ శ్యామశాస్త్రి కృతులు. త్రివేణి పబ్లిషర్సు, మచిలీపట్నం. 1976.
- పినాకపాణి, శ్రీపాద. సంగీత సౌరభము (నాలుగవ సంపుటము). తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1999.
- పినాకపాణి, శ్రీపాద. సంగీత సౌరభము (ప్రథమ సంపుటము). తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 1995.
- పినాకపాణి, శ్రీపాద. సంగీత సౌరభము (మూడవ సంపుటము). తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 1998.
- పినాకపాణి, శ్రీపాద. సంగీత సౌరభము (రెండవ సంపుటము). తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 1997.
- పూర్ణచందర్, మంగళగిరి. తూము నరసింహదాసు సంగీత సాహిత్యాలు సమగ్ర పరిశీలన.
- మాధవరామశర్మ, జమ్మలమడక. శారదాతనయ విరచిత భావప్రకాశనము. ఆంధ్రప్రదేశ్ సంగీతనాటక అకాడమీ, హైదరాబాదు. 1978.
- రజనీకాంతరావు, బాలాంత్రపు. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము (మొదటి భాగము). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ. 1958.
- రజనీకాంతరావు, బాలాంత్రపు. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము (రెండవ భాగము). పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, హైద్రాబాదు. 2001.
- రామచంద్ర, కే. త్యాగరాజ కీర్తన హారము. వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి.1956.
- లక్ష్మీకాన్తమ్మ, ఊటుకూరి. ఆంధ్రుల కీర్తన వాఙ్మయ కళాసేవ. స్వీయ ముద్రణ, హైద్రాబాదు, 1982.
- లలిత, వి. అన్నప్పారావు. సంగీతశాస్త్ర చంద్రిక. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాదు. 2008.
- వీరభద్రశాస్త్రి, కల్లూరి. త్యాగరాజు కీర్తనలు విశేష వివరణము (ద్వితీయ సంపుటము). తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 2015.
- వేంకట మురళీకృష్ణ, పోచనపెద్ది. కావ్యాలంకారసంగ్రహము (నరసభూపాలీయము). రామరాజ భూషణ ప్రణీతము, రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి. 1991.
- వేంకట సత్యనారాయణమూర్తి, బులుసు. అప్పకవీయం (తృతీయాశ్వాసం) వళి, ప్రాస ప్రకరణములు. రోహిణి పబ్లికేషన్సు, రాజమండ్రి. 1998.
- సత్యనారాయణమూర్తి, అరిపిరాల. సంగీత కళా ప్రదర్శిని మొదటి భాగము (థియరీ). స్వీయప్రచురణ, విజయవాడ. 1979.
- సుబ్బారావు, ఏకా. క్రొత్త సంగీత విద్యాదర్పణము. శ్రీ మహాలక్ష్మి బుక్ కార్పొరేషన్, విజయవాడ. 2017.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "OCTOBER-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-SEPTEMBER-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "OCTOBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.