headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

11. బాపిరాజు గారి ‘హిమబిందు’ నవలలో ప్రధానస్త్రీపాత్రలు: విశ్లేషణ

కొపనాతి ఉష

పరిశోధక విద్యార్థిని, తెలుగుశాఖ,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7901698893, Email: kopanathiushaprasad97@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

అనంతమైన తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు, రచయితలు తమ విశిష్టమైన కృతులతో పాఠక లోకంలో చెరగని ముద్ర వేసుకున్నవారు అనేకులు. వారిలో సుప్రసిద్ద నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు, శిల్పి ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించిన అడవి బాపిరాజు సాహిత్యంలో ఎంతగానో పేరెన్నిక గల వాడుగా చెప్పవచ్చు. అతని సాహిత్యంలో నవలలకు విశిష్ట స్థానం ఉంది. ఎంతో అద్భుతమైన కథనంతో మళ్ళీ, మళ్ళీ చదవాలనిపించే విధంగా రచనలు చేయడంలో బాపిరాజు గారి ప్రత్యేకత వేరు. వారి నవలల్లో హిమబిందు నవల ప్రత్యేకమైనది. వారికి మంచి కీర్తిని తెచ్చిపెట్టిన నవలల్లో ఇది ఒకటి. ఈ నవల ఇతివృత్తాన్ని పరిశీలించి, అందులోని ప్రధానమైన స్త్రీ పాత్రలను గురించి పరిశీలించడమే ఈ వ్యాస ఉద్దేశం.

Keywords: ఆధునిక సాహిత్యం, నవల, అడవి బాపిరాజు, హిమ బిందు, ప్రధాన స్త్రీ పాత్రలు

1. ఉపోద్ఘాతం:

తెలుగు సాహిత్యం సముద్రం వంటిది. సాగరంలో అనేక నదులు కలిసి సముద్రాన్ని పరిపుష్టం చేసినట్లుగా తెలుగు సాహితీ సాగరంలో ఎన్నో సాహిత్య ప్రక్రియలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నాయి. నాన్న కాలం నుండి నేటి వరకు ఎందరో రచయితలు వివిధ ప్రక్రియలలో రచనలు చేసి చరిత్రలో కీర్తి పతాకలయ్యారు. తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారు. సాహిత్య ప్రక్రియలలో నవల సాహిత్యం ఎక్కువ ప్రజాదరణ కలిగిన ప్రక్రియ అని చెప్పవచ్చు. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించిన ఈ ప్రక్రియలో రచనలు చేసి ఘన కీర్తినార్జించిన అనేకుల్లో  అడవి బాపిరాజు ఒకరు.  వారి కాలం నుండి జాలువారిన నవలల్లో “హిమబిందు”  అనే చారిత్రక నేపథ్యమున్న నవల ఇది. ఉత్కంఠ భరితమైన కథాంశంతో, అలనాటి శాతవాహనుల కాలం నాటి వైభవాన్ని ఆవిష్కృతం చేసిన రచన ఇది.

2. అడవి బాపిరాజు – జీవితం:

చిత్రకళా రంగానికి కులపతిగా ప్రసిద్ధికెక్కిన రచయిత అడవి బాపిరాజు తెలుగు సాహిత్య చరిత్రలో కేవలం నవలాకారుడుగా మాత్రమే కాక, కథకుడుగా, చిత్రకారుడుగా, గాయకుడుగా ప్రసిద్ధి. వీరు సాంఖ్యాయన గోత్రంలో నియోగి బ్రాహ్మణ వంశంలో జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతానికి దగ్గరలో ఉన్న సరిపల్లె అనే గ్రామంలో 1895 లో అక్టోబరు 8 వ తారీఖున కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు.” (అడవి బాపిరాజు సాహిత్యానుశీలనము – డా. మన్నవ సత్యనారాయణ, పుట:11) పుట్టుకతో ధనవంతుల కుటుంబంలో జన్మించినా, తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బి. ఏ చదివే రోజుల్లోనే వీరికి సుభద్ర అనే ఆమెతో వివాహం జరిగింది. బి. ఏ., బి. ఎల్., పూర్తిచేసి న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి   తరువాత ఎన్నో పదవులను చేపట్టారు. ఏ రంగంలో అడుగుపెట్టినా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బందరు జాతీయ కళాశాలలో చదివే రోజుల్లో ప్రమోద్ కుమార్ ఛటోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సైతం పాల్గొని ఎన్నో సార్లు జైలు పాలయ్యారు. అలా జైలులో ఉన్న రోజులలోనే హిమబిందు నవలను ప్రారభించారు.  వారి రచనలలో హిమబిందు నవల చారిత్రక నవల.

3. హిమ బిందు నవల- ఇతివృత్తం:

అడవి బాపిరాజు గారు రచించిన నవలల్లో హిమబిందు నవల చాలా విశిష్టమైనది. ఇది  చారిత్రక నేపధ్యమున్న నవల. ఆంధ్రదేశాన్ని  పాలించిన గొప్ప రాజవంశం శాతవాహన వంశం. ఆ వంశంలో గొప్ప రాజు శ్రీముఖుడు. శ్రీ ముఖ శాతవాహనుడి కాలం నాటి ఆంధ్ర దేశ వైభవాన్ని చూపించిన  నవల ఇది. శ్రీముఖ శాతవాహనుడు శత్రు రాజులందరినీ జయించి జంబూ ద్వీపం మొత్తానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడుగా అవడానికి దారి తీసిన పరిస్థితులు, జరిగిన సంఘటనలు కనిపిస్తాయి.

ఇతివృత్తం :-

ఆంధ్ర చక్రవర్తి  శ్రీ ముఖ  శాతవాహనుడి జన్మదిన వేడుకలు రాజ్య వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఎద్దుల బండి పందెములు నిర్వహించబడుతున్నాయి. వాటిలో పాల్గొనేందుకు ఎన్నో సామంత రాజ్యాల నుండి ప్రతినిధులు, ఔత్సాహికులు పాల్గొంటున్నారు. ఈ పోటీలో వణిక్ సార్వభౌముడిగా  కీర్తి గడించిన చారుగుప్తుని మేనల్లుడు సమదర్శికి, మహాశిల్పి  ధర్మనంది కుమారుడు సువర్ణ శ్రీకి మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. హోరాహోరీగా జరిగిన ఈ  పోటీలో చివరకు సువర్ణ శ్రీకుమారుడు విజయం సాధిస్తాడు. విజయం సాధించిన సువర్ణ శ్రీకి ఘన సన్మానం చక్రవర్తి చేతులు మీదుగా జరిగింది. సన్మాన కార్యక్రమంలో భాగంగా జరిగిన నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చారుగుప్తుని కూతురు హిమబిందుని చూసి సువర్ణశ్రీ ఆకర్షితుడయ్యాడు. హిమబిందు కూడా సువర్ణశ్రీని చూసి మనసుపడుతుంది.

సమదర్శి కూడా చిన్ననాటినుండి  హిమబిందుని తన భార్యగా ఊహించుకుంటాడు. పందెంలో గెలిచి హిమబిందు ముందు తన గొప్పతనాన్ని చాటుకోవాలనుకున్నాడు. కాని పరాజితుడవడం వల్ల ముఖం చూపించుకోలేకపోయాడు. సమదర్శి ఆంతర్యం గ్రహించిన చారుగుప్తుడు అతనిని అల్లుడుగా చేసుకోవడం ఇష్టం లేక యుద్ధం  పేరుతో రాజుగారి ఆజ్ఞగా చెప్పి దూరంగా పాటలిపుత్రం పంపిస్తాడు. హిమబిందు తన చెలికత్తె  బాలనాగి సహాయంతో సువర్ణశ్రీని కలుసుకొని తన ప్రేమ విషయాన్ని చెప్తుంది. సువర్ణశ్రీ కూడా ఆమెను చూసిన నాటనుండి ఆమె రూపాన్ని శిల్పంగాను, చిత్రలేఖనంగాను చిత్రించుకొని ప్రేమిస్తుంటాడు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో గాఢంగా ప్రేమించుకుంటారు. ఇదిలా ఉండగా చారుగుప్తుడు ఒక సమయంలో శ్రీముఖ శాతవాహనుడి కుమారుడు, యువరాజైన శ్రీకృష్ణ శాతవాహనుడికి హిమబిందునిచ్చి వివాహం చేయాలనుకుంటున్న  విషయం, చక్రవర్తి అందుకు అంగీకరించినట్లు హిమబిందుతో చెప్తాడు. తన కోరికను  నెరవేర్చుకోడానికి, రాజుగారి మెప్పుని  పొందడానికి శత్రురాజ్యాలతో శ్రీముఖుడు చేస్తున్న దండయాత్రల్లో తాను పాలు పంచుకుంటాడు.

హిమబిందు తండ్రి కోరిక విని  నిశ్చేష్టు రాలవుతుంది. తండ్రి కోరిక  కోసం తాను ప్రేమించిన సువర్ణ శ్రీని మర్చిపోవాలనుకుంటుంది.  జరిగిన విషయాన్ని సువర్ణశ్రీకి వివరిస్తుంది. ఆనాటినుండి ఇద్దరు వైరాగ్య జీవితాన్ని అనుభవిస్తుంటారు. సామ్రాజ్ఞి  కాబోతున్న హిమబిందు జీవితానికి తాను అడ్డుకాకూడదనుకున్నాడు. చారుగుప్తుడు శ్రీముఖ శాతవాహునుడి అభిమానాన్ని సంపాదించడానికి యుద్ధాలకయ్యే ఖర్చులన్నీ భరించడానికి ముందుకువస్తాడు. యుద్ధానికి వెళ్తూ తన కూతురిని ఆమె అమ్మమ్మ, అత్తయ్యల సంరక్షణలో ఉంచుతాడు.

ఆంధ్ర రాజుల  పోషణ వల్ల బాగా వ్యాప్తి చెందుతున్న బౌద్ద మతాన్ని అణచి, వైదిక ధర్మ పునరుద్దరణకు కంకణం కట్టుకున్న స్థౌలతిష్యమహార్షి  ఆంధ్ర  రాజ్యానికి, అందులోనూ ధాన్యకటకానికి చేరుకుంటాడు. శ్రీముఖుడు అతనిని ఆదరించి, ఆశ్రమానికి కావలిసిన ఏర్పాట్లు  చేయిస్తాడు. కొంతకాలం తర్వాత రాజు గారి రెండవ కొడుకు మంజుశ్రీని చోరులు అపహరించి తీసుకువెళతారు. చక్రవర్తి ఎంత వెదికించినా జాడ దొరకదు. అందరికీ స్థౌలతిష్యుల మీదనే అనుమానం  ఉన్నా, అతనిని బంధింప సాహసింపరు. శ్రీముఖ శాతవాహనుడిని ఎదుర్కోవడానికి అతనికి అండగా ఉన్న చారుగుప్తుడిని మానసికంగా దెబ్బ తీయడానికి గాను అతని కుమార్తెని, ఆమె అమ్మమ్మను కూడా అపహరించి ఒక గుహలో బంధిస్తారు మాళవులు, మాగధులు.

హిమబిందుని వెతకడానికి సువర్ణ శ్రీ కుమారుడు కూడా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో తన మిత్రుడైన గోండు యువరాజు మహాబలుడి సహాయంతో గోండులను, రాక్షసులను కూడగట్టుకొని వారి సహాయంతో ఆడవులన్నీ గాలిస్తారు. చివరకు నర్మదా నది దగ్గర  ఒక గుహను కనుగొని అక్కడ నిర్భంధించబడిన హిమబిందు, ఆమె అమ్మమ్మ ముక్తావళి దేవిని, యువరాజు మంజుశ్రీని కూడా రక్షిస్తాడు. చక్రవర్తికి సువర్ణ శ్రీ మీద అభిమానం పెరుగుతుంది.

స్థౌలతిష్య మహర్షి యువరాజు శ్రీకృష్ణ శాతవాహనుని అంతమొందించి అతని అతని స్థానంలో అతని తమ్ముడు మంజుశ్రీని వైదిక మతాభిమానిగా చేసి పట్టాభిషేకం చేయాలని చేసిన ప్రయత్నం విఫలమైనది. ఇందులో మరొక ప్రయత్నంగా తన మనుమరాలు చంద్ర బాలని విషకన్యగా మారుస్తాడు. శ్రీకృష్ణ శాతవాహనుడు యుద్ధానికి వెళ్ళే మార్గంలో ఆమెను వివస్త్రగా చేసి వదిలేసి వెళతాడు. అడవిలో నిస్సహాయ స్థితిలో ఉన్న విష కన్యని చూసి శ్రీకృష్ణ శాతవాహనుడు  ప్రేమిస్తాడు. ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి తనతో పాటు తీసుకువెళతాడు. ఆమెలోని విషం తొలగిపోయేందుకు వైద్యుల చేత చికిత్స చేయిస్తాడు.

శ్రీముఖ చక్రవర్తి చారుల ద్వారా శ్రీక్రిష్ణ శాతవాహనుడు విష కన్యను ప్రేమిస్తున్నాడని, సువర్ణ శ్రీ హిమబిందులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని తెలుసుకొని చారుగుప్తుడికి విషయం చెప్పి వారి వివాహాలకు అంగీకరించేలా చేస్తాడు. హిమబిందు కూడా తండ్రి మాటకు కట్టుబడలేక, సువర్ణ శ్రీని మరచిపోలేక అతని వెతుక్కుంటూ కాశీకి వెళ్ళిపోతుంది. చారుగుప్తుడు తన కుమార్తెని మహా సామ్రాజ్ఞిని చేయాలని కన్న కలలు, చేసిన ప్రయత్నాలు, వేసిన ఎత్తుగడలు, సంపాదించిన సంపద అంతా వృధా అయిందని బాధపడతాడు. చివరకు మనస్సు మార్చుకొని వారి వివాహానికి అంగీకరిస్తాడు. సువర్ణ శ్రీ తన చెల్లెలు నాగ బంధునిక చారుగుప్తుడి అల్లుడైన సమదర్శిని ప్రేమిస్తుందని తెలుసుకొని ఆమె కోరిక మేరకు ఆమెను సమదర్శికి అంగరక్షకురాలిగా నియమింపచేస్తాడు. నాగబంధునిక పురుషుడి వేషంలో అతని దగ్గర చేరి, అతనితో కలసి యుద్ధంలో పాల్గొంటుంది. సమదర్శి కూడా ఆమెను ప్రేమిస్తున్నాడని తెలుసుకొని వారి వివాహానికి ఏర్పాట్లు చేస్తాడు.

చక్రవర్తి శ్రీముఖ శాతవాహనుడు సువర్ణశ్రీని హిమబిందు, మంజుశ్రీ రాకుమారులను రక్షంచిన  విషయంలోనే కాక అతని జైత్ర యాత్రలో కూడా అద్భుతమైన యుద్ధ ప్రదర్శన చూపి, నేర్పుగా విజయాన్ని సాధించేలా చేసినందుకు ప్రతిఫలంగా సువర్ణ శ్రీని కళింగ ప్రాంతానికి అధిపతిగా చేస్తాడు. సువర్ణ శ్రీ హిమబిందు, నాగబంధునిక సమదర్శిల వివాహం, విషబాల  అమృత బాలగా మారడం శ్రీకృష్ణ శాతవాహనుల కలయికలతో  కథ సుఖాంతమౌతుంది.

4. హిమబిందు నవల -  స్త్రీ పాత్ర చిత్రణ:

అడవి బాపిరాజు గారు రచించిన నవలల్లో ఎంతో విశిష్టమైన నవల ఇది. ఇందులోని స్త్రీ పాత్రలు ఇతివృత్తానికి ప్రధానమైన వారుగా కనిపిస్తారు. నాయకుడికి ఎంత ప్రాధాన్యత ఉందో, నాయికలకు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

ఈ నవలలో ప్రధాన పాత్రధారి స్త్రీ. ఆమె పేరు మీదుగానే ఈ నవలకు హిమబిందు అని నామకరణం చేశారు. కథ మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుంది. ఇదే కాక మరి కొన్ని పాత్రలు కూడా ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ నవలలోని ప్రధాన స్త్రీ పాత్రలను ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. అవి:

1. హిమ బిందు
2. చంద్ర బాల
3. నాగబంధునిక

4.1 హిమబిందు:

నవలలో కీలకమైన పాత్రధారి హిమబిందు. ఈ పాత్రను తీర్చిదిద్దడంలో రచయిత చక్కని నేర్పుని ప్రదర్శించాడు. సామాన్యమైన నాయికలా కాకుండా శృంగార రసాధిదేవతగా, అత్యంత అందచందాలతో ఆకర్షణీయమై అలరారు పాత్రగా రూపొందించాడు. హిమబిందు పాత్రయే మొత్తం నవలకు కేంద్ర బిందువుగా కనిపిస్తుంది.

శ్రీముఖ శాతవాహనుడు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో వణిక్ సార్వభౌముడుగా పేరు పొందిన చారుగుప్తుడు, ప్రజాపతి మిత్రల ఏకైక పుత్రిక. ఈమె పుట్టిన రెండు సంవత్సరాలకే మాతృ వియోగం కలగడం వల్ల అమ్మమ్మ, తాతయ్యలు ముక్తావళి దేవి, కీర్తి గుప్తుని సంరక్షణలో అల్లారుముద్దుగా పెరిగింది. చారుగుప్తుడు ధన సంపాధనలో చక్రవర్తికి ఏమాత్రం తీసిపోనివాడు. కాబట్టి కూతురుని యువరాణిలాగా పెంచారు.

స్నిగ్ధ శ్వేత కాంతి భాసమాన హిమబిందువా బాలిక! ఆ తెలుపు ఎరుపులు ఔత్తరాహికములు. ఆమెలో గాంధార రక్తమున్నది. రోమక, యవన జాతులు ఆర్య రక్త సమ్మిశ్రితములై మహోత్తమ మూర్తి తాల్చినట్లున్నది.” (హిమబిందు నవల – అడవి బాపిరాజు పుట:45)

తన చిన్న తనంలో తండ్రి వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్ళినప్పుడు తల్లి దగ్గరనే ఉండేది. ఏ బాధ కలిగిన తల్లికి చెప్పుకునేది. ఆమె చేతితో నిమిరితే సంతోషించేది. ఇప్పుడు తల్లి లేకపోయిన ఏ లోటు లేకుండా పెరిగింది.

తన తండ్రి యొక్క పెంపుడు ఎద్దులు చక్రవర్తి జన్మదిన వేడుకల నాడు శకట పోటీలలో పాల్గొంటుండగా ఆమె కూడా ఆ సభకు వెళ్ళింది. ఆమె బావ సమదర్శి తమ ఎడ్ల బండికి సారధ్యం వహిస్తున్నాడని తెలిసి అతనిదే విజయం అనుకున్నది. కాని ఎడ్ల శకట పరీక్షలో తన బావ ఓడిపోవడం చూసి బాధపడింది. కాని పరీక్షలో నెగ్గిన సువర్ణ శ్రీ కుమారుని అందం, వీరత్వం ఆమెను ఆకర్షించాయి. తండ్రి ఎద్దులు ఒడిపోవడానికి కారకుడైన వాడి  మీదనే ఆమెకు రక్తి కలిగింది. మనసులో అతని పట్ల ఏదో తెలియని అనుభూతి కలిగింది. తల్లి విగ్రహం దగ్గర కూర్చొని తన మనసులో మాటను చెప్పుకొంది.

నాకిట్లు ఆతని చూడ యీ విపరీత కోర్కెలేమి అమ్మ! ఆతని చూడకపోయిన నేను బ్రతుకలేనను భయము కలుగుచున్నది”  (హిమబిందు నవల – అడవి బాపిరాజు పుట: 45) అని  బాధపడింది.

ఆ సమయంలో తల్లి ఓదార్చినట్లు భ్రమ కలిగినది. సంతోషంతో హిమబిందు ఆ యువకుడిని చూడాలని ఆమె మిత్రురాలు నాగబంధునిక కోసం అన్నట్లుగా అతని ఇంటికి వెళుతుంది. అక్కడ సువర్ణ శ్రీ కుమారుడు చెక్కిన తన ప్రతిమలు, చిత్రించిన తన రూపం చూసి ఆశ్చర్యపోతుంది. అతనికి కూడా ఆమెపై ప్రేమున్నదని ఊహిస్తుంది. తన చెలికత్తె బాలనాగి సహాయంతో అతనిని తన తోటకు పిలిపించుకొని తనలోని ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఇద్దరు ప్రేమ మైకంలో విహరిస్తారు. కొంతకాలం తర్వాత ఆమె తండ్రి ఆమెను యువరాజు శ్రీకృష్ణ శాతవాహనునికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడని తన మనసులో మాటను చెప్తాడు. ఆమెను మహారాణిని చేయాలనే ఉద్దేశంతో చిన్ననాటి నుండి మహారాణికి కావలసిన అర్హతలన్నీ ఉండేలా చూశాడు. అన్ని విద్యలు నేర్పించాడు.

ఆంధ్ర, ప్రాకృత,సంస్కృత, పాళీ, మాగధి, శూరసేన మొ. భాషలలో పండితురాలు. సకల శాస్త్రాలు శ్రద్ధతో అధ్యయనం చేసింది. బౌద్ధ మత సంబంధమైన త్రిపీఠకాలు, ధర్మ చక్ర ప్రవర్తన సూత్రాలు, మహాపరి నిర్వాణ సూత్రాలు మొదలగు వాఙ్మయాలను, బౌద్ధ జాతక కథలను ఇతర గ్రంధాలను చదివింది. యుద్ధ సంబంధమైన అశ్వారోహణము, కత్తి సాము విలు విద్య, రథ చోదకత్వం మొదలగు వాటిలో ఆరితేరిన అతివ. సంగీత, సాహిత్యాలలోను చిత్ర లేఖనం, నాట్యాలలో కూడా అపారమైన అభినివేశం ఉంది.”  (హిమబిందు నవల- అడవి బాపిరాజు పుట:120) కాని తండ్రి కోరిక విన్నాక ఆమెకు కన్నుల నీరు తిరిగినది. నిశ్చేష్టురాలై మైకంతో  పడిపోయింది.

తండ్రి ఆజ్ఞను జవదాటలేక, మనసిచ్చిన ప్రియుడిని మరచిపోలేక ఎంతగానో పరితపించి పోయింది. అతని ఎడబాటుతో శారీరకంగా, మానసికంగా క్రుంగి, కృశించిపోయింది.  అటువంటి సమయంలోనే ఆమెను కొందరు దుండగులు ఆమె అమ్మమ్మ ముక్తావళి దేవితో సహా అపహరించుకుపోయి ఒక గుహలో బంధించారు. అక్కడ ఆమెను రక్షించడానికి వచ్చిన సువర్ణ శ్రీ కుమారుని చూసి ఆనందంతో కౌగిలించుకుంది. అతనితోనే ఆమె జీవితమని దృఢ నిశ్చయానికి వచ్చింది. సువర్ణ శ్రీ కుమారుడు వైరాగ్యంతో కాశీకి వెళ్లాడని తెలుసుకొని తండ్రి కోరికను నెరవేర్చడం కన్నా తన ప్రాణనాధుని కోసమే జీవించాలని నిర్ణయించుకొని, అతని కోసం తాను కూడా కాశీకి వెళ్ళిపోతుంది. అక్కడ సువర్ణ శ్రీ ని కలుసుకొని తన మనోరథాన్ని వివరిస్తుంది. తాను కూడా సర్వ సంపదలు త్యజించి అతనితోపాటే సన్యాసిగా మారాలనుకుంటుంది. కాని ఆమె తండ్రి చారుగుప్తుడు తన ఆలోచనను మార్చుకొని వారి వివాహానికి అంగీకరిస్తాడు. వీరిరువురి వివాహంతో కథ సుఖాంతమౌతుంది.

ఈ హిమబిందు పాత్రలో రచయిత ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, రమణీయతను చిత్రించారు. హిమబిందు సౌందర్య నిధిగా, ప్రేమకు అధిదేవతగా కనిపిస్తుంది. చక్రవర్తితో సమతూగగల సంపదలున్నా, మహా రాణి కాగల పరిస్థితులున్నా  వాటన్నింటినీ కాదనుకుంది. ఒక దశలో తానంత సిరిగల వారింట ఎందుకు పుట్టానా? అని బాధ పడిన తీరు కనిపిస్తుంది. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేనప్పుడు ఎంత సంపాదలున్న ఆమెకు తృప్తి అనిపించలేదు. ప్రేమకు మనసులు ప్రధానం కాని ఆస్థిపాస్థులు ప్రధానం కావని నిరూపించిన పాత్రగా కనిపిస్తుంది. కల్మషం లేని ప్రేమ ఎన్ని అవరోధాలనైనా అధిగమించగలదని ఋజువు చేసిన పాత్రగా రూపొందించారు.

సువర్ణ శ్రీ తన నాథుడై, తానతని శిల్పము, చిత్రలేఖనము చూచుచూ ఆనందమున దివ్యపథములకు బోవుచు, తన అద్భుత గాంధర్వమున ఆతని నోలలాడించుచు, ఆతనిచే  చైత్యములు నిర్మాణము చేయింపుచు ఈ జన్మమునకు మహదానంద ప్రవాహము చేసుకొనగలుగుటయే చరితార్థత!”  (హిమబిందు నవల – అడవి బాపిరాజు పుట:268) అని అనుకొన్నది.

ఈ మాటల్లో ఆమె ఆంతర్యంతో పాటుగా, రచయిత తన అభిప్రాయాన్ని, లలితకళల పై మక్కువను చెప్పకనే చెప్పారు.

4.2 చంద్రబాల :

నవలలో విషకన్యగా పిలువబడిన స్త్రీ. అసలుపేరు చంద్ర బాల. ఈమె స్థౌలతిష్య మహర్షికి మనమరాలు. గతం మరచిపోయి అమృతపాదులుగా పిలువబడిన నందిదత్తుడికి కుమార్తె. స్థౌలతిష్యుడు ఒక మహా కార్యాన్ని సాధించడానికి అన్నట్లుగా ఈమెను విషకన్యగా మార్చాడు. ఈ నవలలో అత్యంత ఉత్కంఠను కలిగించే పాత్రగా చంద్రబాల కనిపిస్తుంది. కీలకమైన పాత్ర ఇది. ఆర్ష ధర్మాన్ని ఆంధ్ర ప్రాంతంలో పునరుజ్జీవింపజేయడానికి, బౌద్ధ ధర్మాన్ని  భూస్థాపితం చేయడానికి కాబోయే మహారాజైన శ్రీ కృష్ణ శాతవాహనుడిని చంపి, అతని స్థానంలో అతని తమ్ముడు, బాలుడైన మంజుశ్రీకి పట్టాభిషేకం చేసి ఆర్ష ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి వేసిన ఎత్తుగడ. అందుకు తన మనమరాలిని అస్త్రంగా ఉపయోగించాలనుకున్నాడు.

శ్రీ కృష్ణ శాతవాహనుడిని సైతం అలరించే అందం గల ఆమెను చిన్న నాటి నుండి విషకన్యగా  మారుస్తూ వచ్చాడు. చిన్న నాటి నుండి పాములతో ఆడుకునేది. విషయం కలిసిన నీటిలో స్నానం చేసేది. ఆమె ఆడుకునే ఆట వస్తువులలో కూడా క్రూర జంతువులే ఉండేవి.

బొమ్మల పెళ్ళిళ్ళు, బిడ్డ బొమ్మలు, గుజ్జన గూళ్ళు ఆ పాప చిన్న నాటి నుండియు నెరుగదు. ఆమె ఆట పాటలన్నింటిలో వీర, భయానక, రౌద్రములే మెదిపి ఉంచిరి. ఆమె చూపులకు విలయ పయోద నీలిమలు కాటుకలైనవి. ఆమె యూర్పులు మృత్యు విన్యాస భుగభుగలతో సహాధ్యాయనము చేసినవి.” (హిమబిందు నవల – అడవి బాపిరాజు పుట:11) ఆమె వయస్సు పెరిగే కొలది ఆమెలోని విషత్వాన్ని  పెంచుతూ వచ్చాడు.

చంద్ర బాలకు పన్నెండవ ఏట తొమ్మిది రోజులు జపతపాది హోమంబులు చేసి, స్థౌలతిష్యులు మహా విషమైన కాలకూటమును, దక్షిణ దండకాటవీ మహా నాగ దంష్ట్రాంచిత కాకోలమును చంద్ర బాల యందు ప్రవేశింపచేసినాడు. ఆ భయంకర ముహూర్తము నుండియు ఆమె విష కన్యకయైనది.”  (హిమబిందు నవల – అడవి బాపిరాజు పుట:90)

ఆమె చేయి తగిలితే మల్లెలు కూడా మాడిపోగలవు. ఆమె ఉచ్చ్వాస నిశ్వాసలలో కూడా విష వాయువులున్నాయి. ఆమెలో మానవత్వం తొలగిపోయి క్రూర పశుత్వ స్థితికి  చేరినది.

విషకన్య నిండు యవ్వనానికి వచ్చే నాటికి ఆమెకు స్త్రీ పురుష భేదాన్ని తెలియజేస్తూ వచ్చారు. తన కార్యం నెరవేరాలంటే స్త్రీ పురుష సంయోగ స్థితి మీద అవగాహన ఉండాలి. అందుకోసం పాముల కలయికలు, క్రూర జంతువుల సంయోగాన్ని గమనిస్తుండేది. తాతగారి దగ్గర ఎన్నో విద్యలను కూడా నేర్చుకున్నది. అనేక భాషలు మాట్లాడగలదు. పూర్తిగా ప్రయోగించడానికి సిద్దమనుకున్న సమయంలో ఆమెను ఇతర తన శిష్యులకు పరిచయం చేస్తాడు మహర్షి. అక్కడ నాగులకు సామంతుడైన మలయనాగుడనే వాడు మత్తుడై  అందరూ చూస్తున్నారన్న విచక్షణ కూడా లేకుండా ఆమెపై  బలవంతం చేయబోయాడు. కాని విష కన్య శ్వాస నుండి వచ్చిన విష వాయువుల ధాటికి అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ సంఘటన ఆమెను ఎంతగానో కలవరానికి గురిచేసింది. తన చేయి తగిలి ఎన్నో పక్షులు, కుందేళ్ళు మరణించినప్పుడు ఆనందించినది. కాని ఇప్పుడు ఆమె అతని మరణానికి కొంత బాధపడింది. ఆమె ఆలోచనల్లో జాలి చేరింది. అప్పుడప్పుడే యవ్వనత్వపు ఆలోచనలు పెరుగుతున్న దశలో తనను ముట్టుకున్న ఏ పురుషుడైనా ఇలాగే నాశనమవుతాడని గ్రహించి బాధతో క్రుంగిపోయింది. నెమ్మది నెమ్మదిగా ఆమెకు పెళ్లి చేసుకోవాలని, సంతానవతి కావలెనని కోరికలు కలిగేవి కాని అవి అసాధ్యమని బాధపడేది.

విషబాల  ప్రతి రాత్రి ఆశ్రమంలోనుండి రహస్యంగా భయటికి వెళ్ళి దగ్గరలో ఉన్న ఒక వట వృక్షం మీద కూర్చొని ఆలోచనల్లో ఉండేది. ఒకనాడు అక్కడి ఒక పొలంలో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న దుగ్గ స్వామి, బాపి శ్రీ అనే దంపతుల ప్రణయాన్ని రహస్యంగా గమనిస్తూ ఉండేది. వారి ప్రణయ గాధ ఆమె హృదయాన్ని హత్తుకునేలా చేసింది. తన జీవితంలో ఎలాంటి సుఖాలకు, ప్రేమలకు తావులేనందుకు బాధ పడింది.

స్థౌలతిష్యుడు ఒక రోజున చంద్ర బాలకు గాధ నిద్ర కలుగ చేసి నిర్జనారణ్యంలో ఆచ్చాదనంగా వదిలేసి వెళ్ళాడు. చంద్ర బాల కళ్ళు తెరచి చూసేసరికి అడుగు తీసి అడుగు వేయలేని ముళ్ళ పొదల మధ్యన వివస్త్రయై పడి ఉంది. శ్రీకృష్ణ శాతవాహనుడు ఆ దారిన వచ్చేనాటికి ఆమె స్పృహ లేక పడిపోయింది. అతని దగ్గరున్న విష వైద్యుల సహాయంతో వారి వెంట తీసుకెళ్ళి వైద్యం చేయించాడు. ఏ వ్యక్తి నాశనం కోరి ప్రయోగింపడినదో ఆ వ్యక్తినే ఆమె ప్రేమించడం మొదలు పెట్టినది. స్థౌలతిష్యుడు మనసు మార్చుకున్నాక మరలా ఆమెను అమృత కన్యగా మారుస్తాడు. ఈమె  భవిష్యత్తులో మహా సామ్రాజ్ఞి కాగలదని దీవించారు.

ఈ నవలలో విష బాలగా చంద్ర బాలను స్థౌలతిష్యుడు శారీరకంగా మార్చాడు కాని ఆమె మనసు మాత్రం అమృతమయం. అతని శక్తులు, కుయుక్తులు, మంత్ర తంత్రాలు ఆమె మనసుని మార్చలేకపోయాయి. ఎంతో రమణీయంగా, ఉత్కంఠగా పాత్రను నడిపించడంలో బాపిరాజు విజయుడయ్యాడని చెప్పవచ్చు. సంస్కృత సాహిత్యంలో కనిపించే “ముద్రారాక్షసం” లోని విష కన్యను దృష్టిలో పెట్టుకొని బాపిరాజు గారు ఈ పాత్రను సృష్టించారనడం నిర్వివాదాంశం. అంతే కాక ఇన్నాళ్ళూ తన తాతగారే తనకు బందువు అనుకున్న ఆమెకు బౌద్ధ మత గురువు అమృతపాదులు తన తండ్రి అని తెలియడం వల్ల కథ కొత్త మలుపు తిరిగింది. ఆమెలోని  మంచి గుణాలు అతని వారసత్వంగా అనిపించగలవు.

ఇలా ఈ నవలలో చంద్ర బాలను విష బాలగా మార్చిన తీరు, తరువాత విష బాల అమృత కన్యగా మారిన తీరును చాలా చక్కగా చిత్రీకరించారు రచయిత.

4.3 నాగబంధునిక:

హిమ బిందు నవలలో మరొక ముఖ్య పాత్ర ధారి నాగబంధునిక. ధర్మనంది అనే మహా శిల్పికి , శక్తిమతికి జన్మించిన పెద్ద కూతురు. సువర్ణ శ్రీ కి చెల్లెలు. పదిహేడు సంవత్సరాల వయస్సు. పొడుగ్గా, బంగారు వర్ణంతో అందంగా ఉంటుంది. వీరుడివలే దేహాపుష్టి కలిగినది. ధనుర్విద్య, పరుగు పందెం, కత్తి సాములలో పురుషులతో సమానంగా తలపడగలదు.

నాగబంధునిక కడ హొయలు కురిపించు శృంగార లక్షణముల కన్నా నిశిత కృపాణ సదృశమగు వీరవనితా లక్షణములు పెక్కులున్నవి.”  (హిమ బిందు నవల – అడవి బాపిరాజు పుట:17)

ఆమె తోటి బాలికలు శృంగార శాస్త్రాలు చదువుతూ, భవిష్యత్తులో రాబోయే వరుడు గురించి కలలు కంటూంటే నాగబంధునిక మాత్రం ఆంధ్ర వీర గాథలు, రామాయణ, భారతాది కథలు, భూర్జపత్ర గ్రంధములు చదివేది. శిల్పాచార్యుడికి కూతురు గనుక శిల్పము, చిత్రలేఖనం బాగా వచ్చు.

నాగభయందునిక  అల్లరిపిల్ల  అన్నగారితో కలిసి  ఆశ్వాన్ని అదిరోహించగలదు. కత్తి సాము చేయగలదు. బుద్ద భగవానుని బోధ ఆమెకు విసుకు. అన్నయ్య పాడే ప్రేమ పాటలు ఆమెకు ఇస్టముండవు. తన అన్నయ్య హిమబిందు ప్రేమలో పడ్డాడని ముందుగానే పసి గట్టింది. వారి ప్రేమకు తాను కూడా సాయం చేసింది. స్త్రీలు అబాలులుగా ఉండకూడదని ,దైర్యం కలిగి ఉండాలని ఆమె అభిప్రాయం. తమ ఇంట్లోనే ఉంటూ తన సోదారుడిలా మెలిగే  గోండు యువరాజు మహా బలుడి దగ్గర ఆటవిక విద్యలన్నీ నేర్చుకుంది. అప్పుడప్పుడు పురుష వేషం వేసుకొని యుద్ధ విద్యలు నేర్చుకుంది.

అటువంటి నాగబంధునిక హిమబిందు బావయైన సమవర్తిని ప్రేమించింది. శకట పరీక్షనాడు రెండో స్థానంలో నిలిచిన అతనిని చూసి మనసుపడింది. హిమబిందునడిగి సమవర్తి విషయాలను తెలుసుకుంది. అతని ఊహాల్లో జీవితాన్ని గడిపింది. అటువంటి సమయంలోనే హిమబిందును ఎవరో అపహరించుకుపోయారని తెలిసి బాధపడుతున్న అన్నకు ధైర్యం చెప్పి, ఆమెను వెదికేందుకు వెళ్ళమని ధైర్యం చెబుతుంది. తన అన్న హిమబిందును రక్షించాడని, మగదను చేజిక్కించుకోవడంలో చక్రవర్తికి  ముఖ్యుడైనాడని  తెలుసుకొని తల్లి, చెల్లెలతో సహా తాను కూడా ప్రయాణమై యుద్ధ శిబిరాలకు చేరుకుంది. తాను సమవర్తిని  ప్రేమిస్తున్నట్లు అన్నతో చెప్పి అతను యుద్ధం చేసే చోటకు అతని అంగరక్షకుడిగా తనకు పని ఇప్పించమని అడిగింది. తన అన్న సాయంతో పురుష వేషంలో వెళ్ళి సమదర్శి  దగ్గర  అంగరక్షకుడిగా చేరింది.

ఆ బాలకుడు సమవర్తిపై  ఈగనైన వాలనీయడు. తన్ను తోడివీరులు పరిశీలించుచుండ అతడు తన చిన్న విల్లును సువ్వున లాగి కోట గోడల నుంచి  బాణములు కేరసేయుచుండెను.” (హిమబిందు నవల – అడవి బాపిరాజు పుట: 243)

యుద్ధం జరుగుతున్నంతసేపు కిరీటాలు, కవచాలు తీయదు. ఒకనాడు ఆమె గుర్రం  చచ్చిపోయిన గుర్రానికి తగలడం వల్ల ఆమె కిందపడింది. కిరీటం జారిపోయి, జడ బయటపడే సరికి ఆమె స్త్రీ అని తెలుసుకున్నాడు. ఆమె సువర్ణ శ్రీ పోలికలలో ఉండడం వల్ల అతని చెల్లెలని గ్రహించాడు. ఆ సమయంలో నాగబంధునిక అతనిని మైకంలో గట్టిగా హత్తుకుంది.

ఆ తరువాత సమదర్శి కూడా తనను  ప్రేమిస్తున్నాడని తెలుసుకుంది. తన అన్న చేత పెళ్లి రాయబారాలు జరిపింది. అచిరకాలంలోనే  సమదర్శిని వివాహమాడింది. చక్రవర్తి తన భర్తకు భరుకచ్చము పట్టణానికి రాజ ప్రతినిధిగా నియమించగానే అతనితో వెళ్ళిపోయింది. నాగబంధునిక సమదర్శికి భార్యగా మాత్రమే కాక  మంత్రిగాను, అంగరక్షకురాలిగా, అన్ని విషయాలలో తన సహకారాన్ని  అందిస్తూ వచ్చింది.  నాగబంధునిక  మాట సమదర్శికి చక్రవర్తి  శాసనము వంటిది. దూరదేశాలతో వ్యాపారాల  విషయంలో సమదర్శిని ప్రోత్సహించింది. ఆమె గర్భము  ధరించినా పుట్టింటికి పోకుండా  అత్తగారి సేవలోనే ఉన్నది. పుట్టిన బిడ్డ  సంరక్షణ  భాధ్యతలను తల్లికి  అప్పగించి మరల సమదర్శికి అంగ రక్షకురాలిగా  వెళ్ళేది.

ఈ  నవలలోని  పాత్రలలలో  ఇతర నాయికల వలె శృంగార దేవతలు లాగా చిత్రించకుండా వీర వనితలా తీర్చిదిద్దారు  రచయిత. స్త్రీలు యుద్ధాల్లో  పాలుపంచుకోని కాలంలోనే ఆమె పురుష వేషంలో వెళ్ళి అటు యుద్ధాన్ని, ఇటు తన ప్రేమను దక్కించుకుంది.  భర్తకు అన్ని విధాల చేదోడు  వాదోడుగా ఉన్నట్లుగా పాత్రను రూపుదిద్దారు. మిగతా నాయికలు వలె కేవలం గృహిణి ధర్మమే కాక రాజకార్యాలు, మంత్రాంగంలో, ఆర్థిక విషయాల్లో కూడా తన నేర్పును ప్రదర్శించిన స్త్రీగా కనిపిస్తుంది. ఈమె పాత్ర ఎందరో స్త్రీలకు ఆదర్శం. 

5. ముగింపు:

ఎంతో విశిష్టమైన ఇతివృత్తంతో సాగిన ఈ నవలలో  కథంతా కల్పితం, పాత్రలు కూడా కల్పితమైనవే. చారిత్రకంగా పరిశీలించినప్పుడు శ్రీముఖశాతవాహనుడు అతని తరువాత అతని సోదరుడు శ్రీ కృష్ణశాతవాహనులు పరిపాలన చేసినట్లుగా తెలుస్తుంది. కాని నవలలో రచయిత వారిరువురిని తండ్రి కొడుకులగా చిత్రించారు. 

నవలలో  కనిపించే ఇతర పాత్రలన్నీ రచయిత చేసిన సృష్టి. నవల చదువుతున్నంత సేపు పాఠకులను శాతవాహనుల కాలంనాటి స్థితిగతుల్లోకి, కాలంలోకి ప్రయాణం చేయించగలిగారు. ఆనాటి సమాజాన్ని ఆవిష్కృతం చేశాడు. మొత్తం తెలుగు సాహిత్యంలో హిమబిందు నవల చారిత్రక నవలల్లో ప్రథమ స్థానంలో ఉంటుందనడంలో సందేహం లేదు. 

పాఠకులకు విసుగులేకుండా రసాస్వాదన కలిగిస్తూ పాఠనాభిలాషను పెంచుతుంది. మొదలి నాగభూణ శర్మ గారు అన్నట్లు-

ఈ నవలలో అడుగడుగునా బాపిరాజు అమృత హస్తం మనకు కనిపిస్తుంది.”  (తెలుగు నవలా వికాసం – మొదలి నాగ భూషణ శర్మ పుట:157)

మొత్తం 116 భాగాలుగా కల ఈ నవలను 1922 లో ప్రారంభించి, కొంత పూర్తి చేసి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడం వల్ల జైలు పాలయ్యి మధ్యలో వదిలేశారు. అనంతరం 1945 లో మిగతా భాగాన్ని పూర్తి చేశారని ప్రతీతి. నవల పూర్తి కావడానికి అంతా విరామం వచ్చినా కథాంశంలో ఎక్కడా అలాంటి సంవిధాన లోపం కనిపించదు. 

ఈ నవలను రచయిత తన తల్లికి అంకితమిచ్చి తల్లి ఋణం తీర్చుకున్నారు. కళాకారుడిగా ఆయనకున్న శిల్పం, చిత్ర లేఖన ప్రీతిని ఈ నవలలో సువర్ణ శ్రీ పాత్ర ద్వారా నిరూపించుకున్నారు.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. నాగభూషణశర్మ, మొదలి. తెలుగు నవలావికాసం, వేంకటరామ అండ్ సన్స్, మద్రాసు, 1971.
  2. బాపిరాజు, అడవి. హిమబిందు, విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2004 .
  3. రమాపతిరావు, అక్కిరాజు. తెలుగు నవల, ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ, సైఫాబాద్, 1975.
  4. వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. నవల శిల్పం, నవ చేతన పబ్లిషింగ్ హౌస్, 2021.
  5. వెంకటేశ్వర్లు, పుల్లాభొట్ల. తెలుగు నవలాసాహిత్యవికాసము, తెలంగాణ సాహిత్య అకాడమీ, 2018.
  6. సత్యనారాయణ, మన్నవ. అడవి బాపిరాజు సాహిత్యానుశీలనము, సుప్రీమ్ ప్రింటర్స్, విజయవాడ 2008.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "OCTOBER-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-SEPTEMBER-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "OCTOBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]