AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
9. విశాఖ జిల్లా ఏజెన్సీ గిరిజన పండుగలు: ప్రాధాన్యం
డా. పెనుమాక రాజశేఖర్
తెలుగు ఉపాధ్యాయుడు,
మేరీ మాత ఇంగ్లీష్ మీడియం,
తుళ్ళూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9493924634, Email: penumakarajashekhar@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ఆధునికంగా ఎంతో అభివృద్ధి పథంలో ఉన్న మనిషి జీవితానికి మూలాలు ఆదిమానవుడి జీవితం అని చెప్పవచ్చు. ఆటవికుడుగా ఉన్న మనిషి కుటుంబ వ్యవస్థలో చేరిన క్రమంలో కుటుంబ సంరక్షణ కోసం సంఘంలో ఒకడుగా నలుగురితో కలిసి జీవించడం, గుంపులుగా బ్రతకడం మొదలు పెట్టాడు. గుంపులో ఒకడుగా జీవించేటప్పుడు ఆ గుంపు నియమాలాను పాటిస్తూ, ఇతర సభ్యులతో కలిసి తన ఆనందాన్ని, బాధను పంచుకుంటాడు. ఈ క్రమంలో తమకు కష్టాలు కలగకుండా ఉండేలా తమ ప్రకృతి మాతను పూజిస్తూ ఉంటారు. ఆటవికుడుగా, తెగలోని వ్యక్తిగా తమ దేవుళ్లను పూజిస్తూ వాటి ఉత్సవాలలో పాల్గొంటూ ఉంటాడు. భారత దేశంలోని ఆంధ్ర ప్రాంతంలోని విశాఖ పట్నంలో ఇలాంటి గిరిజనుల తెగలు చాలా ఎక్కువుగా కనిపిస్తాయి. అందులోని ఒక తెగ కోదు తెగ. మధ్య ద్రావిడ భాషలో ఒకటైన కువి అనే భాషను మాట్లాడే తెగ ప్రజలు జరుపుకునే పండుగలును గురించి సంక్షిప్తంగా వివరించడం ఈ వ్యాసం ఉద్దేశం.
Keywords: గిరిజనులు, విశాఖ ఏజెన్సీ, కోదు తెగ, పండుగలు, పద్దతులు
1. ఉపోద్ఘాతం:
మానవజాతి పరిణామానికి, వికాసానికి అనాది, పునాది అరణ్య ప్రాంతమే. ఆ అటవీ ప్రాంతంలో నివసించే ఆదిమ జాతులే నేటి మానవజాతికి పూర్వీకులుగా చెప్పవచ్చు. క్రమ పరిణామంతో, వికాసంతో ఆదిమ జాతులు నాగరిక జాతులై మనుగడ సాగిస్తుండటం అనేది చారిత్రక సత్యం. నాగరికతను పొందిన మనిషి శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య, వైజ్ఞానిక మొదలైన అనేక రంగాలలో నైపుణ్యం కనబరిచి, తన జీవితాన్ని అభివృద్ధి పథంలో సాగిస్తూ సుఖవంతం చేసుకున్నాడు. అయితే ఆ అదృష్టాన్ని అవకాశాన్ని పొందని, పొందలేని అనేక ఆదిమ జాతులు ప్రపంచంలో ఇంకా ఉన్నాయి. ఇందుకు భారతదేశం అందులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతీతమైనవి ఏమీ కావు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా నాగరికత వృద్ధి చెందని, అభివృద్ధికి నోచుకోని ఎన్నో ఆదిమ జాతులు, తెగలు అరణ్య ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. అటువంటి తెగలు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఉన్నాయి.
2. విశాఖ ఏజెన్సీ కోదు గిరిజనుల పండుగలు – ప్రాముఖ్యత:
ప్రపంచంలోని అన్ని మతాల, కులాల, జాతుల వారు జరుపుకుంటున్నట్లు విశాఖ ఏజెన్సీ ప్రాంత కోదు గిరిజనులు కూడా తమ పండుగలను ఎంతో ఆనందంగా అందంగా తమ సంస్కృతి సాంప్రదాయాలు వుట్టి పడేలా నిర్వహించుకుంటారు. ఈ గిరిజనులు జరుపుకునే పండుగలు వివిధ రకాలుగా ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం పండుగలు వ్యవసాయానికి సంబంధించినవి. వీరు జరుపుకునే కొన్ని పండుగలు గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు జరుపుకునే పేర్లు కలిగి ఉన్నప్పటికీ వీటి మధ్య వ్యత్యాసం ఉన్నది.
గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు పండుగలు వారి క్యాలెండర్ ప్రకారం ప్రారంభమవుతాయి. అలాగే కోదు గిరిజన ప్రజల పండుగలు వారి క్యాలెండర్ ప్రకారం ప్రారంభమైనప్పటికీ ఎక్కువగా ఈ గిరిజనులు వారి దిసరి అంటే పూజారి నిర్ణయించిన ముహూర్తాలకే వారి వారి పండుగలు జరుపుకుంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే తెలుగు నెలలు, ఆంగ్ల నెలలు వలె గిరిజనులకు కూడా కొన్ని ప్రత్యేక నెలలు ఉన్నాయి. ఆ నెలల పేర్లు:
1. ఇటింగ్ - ఏప్రిల్
2. బైనగ్ - మే
3. లండి జెడ్ - జూన్
4. ఆషడ్ - జులై
5. బంధవన్ - ఆగస్టు
6. ఓషా - సెప్టెంబర్
7. దొశర - అక్టోబర్
8. సవితి - నవంబర్
9. వల్కామ్ - డిసెంబర్
10. సంకురాతిరి - జనవరి
11. శివరాతిరి - ఫిబ్రవరి
12. పోగోన్ - మార్చి
ఈ గిరిజనుల నెలలు తెలుగు నెలల వలె ఏప్రిల్ నుండి ప్రారంభమై మార్చితో ముగుస్తాయి.
3. గిరిజనుల పండుగలు:
విశాఖ ఏజెన్సీ గిరిజనుల పండుగలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఈ వ్యాసంలో వివరించడం జరిగింది. అవి ఏమనగా ఇటుకల పండుగ, భీముడు దోషం, అమ్మవారి దోషం, సల్ది తినడం, కోర్ర కొత్త, జోల్ద పండుగ, దానెం కోత్తలు, సంకురాతిరి, కుడుపుల పండుగ, హోలీ మొదలైనవి.
3.1 ఇటుకల పండుగ:
గిరిజనుల నెలల్లో మొదటిగా వచ్చే ఇంటింగ్ నెలలో ఇటుకల పండుగను గిరిజనులు జరుపుకుంటారు. వ్యవసాయ పనులను ఈ పండుగ అనంతరం ప్రారంభిస్తారు. ఈ పండుగ హోళి పండుగను పోలి ఉంటుంది. హోళి పండుగను ఒక్కరోజు మాత్రమే రంగులతో జరుపుకుంటే ఇటుకల పండుగలు మాత్రం నెల రోజుల పాటు గిరిజనులు జరుపుకుంటారు. ఈ పండుగలో భాగంగా నెల రోజులపాటు నీరును ఒకరిపై ఒకరు పోసుకోవడం జరుగుతుంది.
ఈ పండుగను సాధారణంగా గురువారం ప్రారంభిస్తారు. ఆ రోజున కోళ్లు కోసి నాగలికి పూజ (ఆయుధ పూజ) చేస్తారు. మరుసటి రోజున (శుక్రవారం) పర్వతానికి వెళ్లి పెద్ద వెదురు కర్ర లేదా ఒక అడ్డ ఒడ్డు (అడ్డాకులు తీగ)తో ఉయ్యాలను కట్టి గ్రామంలోని మహిళలు, పిల్లలు ఎక్కువగా ఊగుతారు. ఇలా ఊగేటప్పుడు పండుగ సందర్భానికి గల పాటలను పాడుతారు. ఇది గిరిజనేతరులు జరుపుకునే అట్లతద్దె నాడు ఉయ్యాలను ఊగటం వలె ఉంటుంది.
ఈ పండుగ రోజుల్లో వచ్చే సంత రోజున గిరిజన సంప్రదాయం ప్రకారం తాచేరును అడుగుతారు. తాచేరు అనగా సంత రోజున ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న రహదారికి అడ్డంగా ఒక కర్రను పెట్టి మనుషులు వెళ్లినా, వాహనాలు వెళ్లినా వారిని ఆపి డబ్బులు గానీ, ఏదైనా వస్తువు గాని లేదా తినుబండారాలు కానీ అడుగుతారు. దీనిని మహిళలు మాత్రమే అడుగుతారు. ఇది నిర్బంధం కాదు ఇది ఆచారం ప్రకారం సరదాగా అడిగే ఒక సాంప్రదాయం మాత్రమే. ఇలా సేకరించిన డబ్బుతో అందరూ కలిసి విందు చేసుకుంటారు.
ఈ పండుగలో భాగంగా ఆదివారం జరుపుకునే పనులలో వేటకు వెళ్లడం ఎంతో ఆనందభరితంగా ఉంటుంది. దీనిని వేట తేలడం అంటారు. వేటకు వెళ్లే ముందు గ్రామంలోని అందరూ గ్రామం బయటకు వచ్చి అక్కడ ఆయుధాలకు పూజ చేస్తారు. అనంతరం గిరిజనుల ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ “థీంసా” నృత్యాన్ని చేస్తారు. దీన్ని గిరిజన వ్యవహారిక భాషలో “గుమ్మాలాట” అని పిలుస్తారు. ఈ ఉత్సవం జరిగిన తర్వాత వచ్చే మూడు రోజులు (సోమ, మంగళ, బుధ)లలో గ్రామంలోని పురుషులు అందరూ వేటకై అడవికి వెళతారు. వేటకు వెళ్ళిన పురుషులు ఏదో ఒక అడవి జంతువును (తినుటకు వీలుపడేది) వేటాడి తీసుకురావలసింది ఉంటుంది. అలా తీసుకురాని పురుషులను మహిళలు ఎందుకు పనికిరాని వారిగా చూస్తూ ఎగతాళి చేస్తారు. వారికి స్నానానికి నీళ్లు పెట్టేటప్పుడు కూడా మహిళలు ఏ విధంగా స్నానం చేస్తారో ఆ విధంగా స్నానాలకు ఏర్పాట్లు చేస్తారు. నీళ్ళతో పాటు పసుపు కూడా పెడతారు. ఎవరూ చూడకుండా అడ్డంగా ఏదో ఒక దాన్ని దడిగా కడతారు. ఈ పండుగ బాగా చేస్తే పంటలు బాగా పండుతాయని వీరు నమ్ముతారు.
3.2 భీమడు దోషం:
ఈ పండుగను వ్యవసాయ పనులను ప్రారంభించడానికి ముందు వర్షం బాగా పడాలని బైసంగ్ అంటే మే నెలలో నిర్వహిస్తారు. ఈ పండుగలో ముందు పూజ చేస్తారు. ఈ పూజ కోసం కొబ్బరికాయ, అరటి పళ్ళు, ఊ దోత్తులు తదితర పూజా సామాగ్రితో పాటు నల్లని మేకను కూడా తీసుకొని పర్వతం దగ్గరకు తీసుకువెళ్తారు. అక్కడ పూజలు నిర్వహించి మేకను భరిస్తారు.
3.3 అమ్మవారి దోషం:
దీనిని అమ్మవారి పండుగగా కూడా పిలుస్తారు. దీనిని లండిజెట్ లేదా ఆషాడ్ (జూన్ లేదా జూలై) నెలలో జరుపుకుంటారు. సాధారణంగా ఆది, సోమ, మంగళ వారాలు మూడు రోజులు ఈ పండుగను జరుపుతారు. ఈ పండుగ ప్రారంభంలో గ్రామస్తులందరూ, మరియు ఆ గ్రామ పూజారి (దిశరీ) కలిసి ఆ గ్రామంలోని ఒక బావి దగ్గరికి వెళతారు. ఆ బావి వద్ద దిశరి పూజలు నిర్వహిస్తాడు. ఆ బావి నుండి కంచు చెంబుతో నీటిని తోడి దానిలో మూడు మామిడి ఆకులు, సంపంగి పువ్వులు వేసి మంత్రాలు జపిస్తాడు. గ్రామంలోని అన్ని ఇళ్లకు వెళ్లి ఆ ఇళ్లల్లో ఆ నీటిని జల్లుతాడు. ఆకుల డొప్పలలో (విస్తరులకు ఉపయోగించే ఆకులను బుట్టవలె కుట్టినవి) ఈ నీటిని పోసి గ్రామస్తులు అందరి చేత తాగించడం జరుగుతుంది. ఈ డొప్పుల్లో నీరు తాగడం వలన జబ్బులు తగ్గుతాయని నమ్మకం. చివరి రోజున (మంగళవారం) ఒక రథాన్ని తయారుచేసి ప్రతి ఇంటికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఇలా తిప్పినప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు వారి ఇంటి లోపల ఉన్న పాడైపోయిన చీపురు, బుట్ట, తదితర వస్తువులను రథంలో పడవేస్తారు. ఈ గ్రామంలో ఊరేగింపు పూర్తైన అనంతరం ఆ గ్రామ పొలిమేరలు దాటించి అవతల గ్రామం పొలిమేరలో వదిలిపెడతారు. ఈ పూజ వలన గ్రామంలో ఎటువంటి కష్టాలు ఉండవని, అమ్మవారి దీవెనలు ఉంటాయన్నది వారు నమ్మకం.
3.4 సల్ది తినడం:
ఈ పండుగ జూన్ నెలలో జరుగుతుంది. ఈ పండుగను పంట పొలాల్లోనే జరుపుకుంటారు. పొలంలోనే వ్యవసాయ పనిముట్లను, పశువులను పూజించి, పొలాల్లోనే సల్ది తినడం జరుగుతుంది. కాబట్టి దీనికి సల్ది తినడం అనే పేరు పెట్టారు. ఈ పండుగ రోజున ఉదయాన్నే సాధారణంగా దుక్కి దున్నడానికి వెళతారు. వెళ్లిన అనంతరం పశువులను శుభ్రం చేస్తారు. వారు కూడా స్నానం చేస్తారు. ఈ సందర్భంగా ఒక వంటకం తయారు చేస్తారు. ఈ వంటకాన్ని గిరిజన ప్రాంతంలో లభించే పిండి దుంపలు, ఈత దుంపలు, ఈత పురుగులు, కూరగాయలు తదితరాలను కలిపి తయారుచేస్తారు. దీనితో పాటు గిరిజనులకు అధికంగా లభించే అంబలి (రాగి మాలు) ఉంటుంది. ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని ఆ ఆహార పదార్థాలను మొదట పశువులకు తినిపిస్తారు. తర్వాత వారు కూడా తిని అందరు ఇంటికి తిరిగి వస్తారు.
3.5 కొర్ర కొత్త:
గిరిజన పండుగలలో అధిక ప్రాథాన్యత సంతరించుకున్న పండుగల్లో ఈ కొర్ర కొత్త పండుగ ఒకటి. ఈ పండుగ బంధవన్ నెలలో (ఆగస్టు) జరుగుతుంది. ఇది ప్రధానంగా రైతులకు పండిన కూరగాయలు తదితర పంటలను మొదటిసారిగా తీసుకువచ్చేటప్పుడు జరుపుకునే పండుగ. ఈ పండుగ జరిగిన అనంతరం మాత్రమే కొత్తగా పండిన పంటలను వాడతారు. ఈ పండుగకు ఊరులో గల ‘చలాని’ (తలయారి) ప్రతి ఇంటికి వెళ్లి కొద్దిగా బియ్యం, కొంత డబ్బులు సేకరిస్తాడు. ఈ బియ్యంతో కోడిని కొంటారు. మిగిలిన బియ్యంతో గుమ్మడి ఇగురు కలిపి గ్రామ పెద్ద కొత్త పిడత (చాలా చిన్న కుండ)లో బోనం వండుతారు. తర్వాత వారి గ్రామంలోని గ్రామదేవతకు, సంకుదేవుడుకు, పోతురాజు దేవుళ్ళకు కోడిని కోసి, కొబ్బరికాయను కొట్టి పూజ చేస్తారు. బోనం పెడతారు. ఆ తర్వాత మాత్రమే వారు భోజనం చేస్తారు. అంతవరకు ఉపవాసం ఉంటారు.
3.6 జోల్డా పండుగ:
గిరిజనులు జరిపే వ్యవసాయ పండుగలో జోల్డా పండుగ ఒకటి. జోల్డా పండుగ ఉదయాన్నే ప్రారంభమవుతుంది. ఆ రోజు వేకువ జామునే పర్వతానికి వెళ్లి జోల్డ కొమ్మలు తీసుకువస్తారు. జోల్డ కొమ్మలు అంటే ఒకే మొక్కల జాతికి చెందిన కొమ్మలు కాకుండా కోసిమీ కొమ్మ, సీతమ్మ కర్ర, జీలుగు, బాపన కర్ర, అడ్డాకులు వంటివి తీసుకొస్తారు. గ్రామ చలాని ప్రతి ఇంటికి వెళ్లి కొంత బియ్యాన్ని, కొంత డబ్బును సేకరిస్తాడు. సేకరించిన డబ్బుతో కోడిని కొనడం జరుగుతుంది. గ్రామ పెద్ద పోతురాజు సంకుదేవుడుల వద్ద కోడిని కోసి రక్తాన్ని బియ్యంలో కలిపి పూజలు చేస్తాడు. గ్రామంలోని ప్రతి ఇంటివారు బియ్యాన్ని తీసుకువెళ్లి జోల్డ కొమ్మలలోని ప్రతి కొమ్మకు బియ్యాన్ని కడతారు. ఈ కొమ్మలను మరియు మిగిలిన కొమ్మల్లో కట్టిన భోజనాన్ని పొలాలకు తీసుకువెళ్లి దాని నైవేద్యంగా పెట్టి, కొమ్మలను పొలాల్లో పాతుతారు. ఆ తర్వాత నైవేద్యాన్ని తిని, తిరిగి ఇంటికి వస్తారు. పొలంలో ఒక దిష్టి బొమ్మను ఏర్పాటు చేస్తారు. ఈ పండుగ చేయడం వల్ల పొలంలోని పంటలకు చీడ పురుగులు పట్టకుండా ఉంటాయని వారి నమ్మకం.
3.7 ధాన్యం కొత్తలు:
మెట్ట పంటలు పండిన తర్వాత ఇంటికి తీసుకురావడానికి జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ గురు లేదా శుక్రవారం జరుపుకుంటారు. దీనిలో కూడా మిగిలిన పండుగల వలె ప్రతి ఇంటి నుండి బియ్యం, డబ్బులు పోగు చేసి బోనం వండి గ్రామ దేవుళ్లకు పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఈ పండుగ సాయంత్రం వేళల్లో నిర్వహిస్తారు. కావున పూజ చేసే వ్యక్తి ఆ రోజు పూజ చేసే వరకు ఉపవాసంతో ఉంటాడు.
3. 8 సంకురాతిరి:
దీనిని సంక్రాంతి పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి పండుగ గిరిజన ప్రాంతంలో జరిగే తీరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జరిగి తీరుకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతంలో వలే పంచాంగం ప్రకారం కాకుండా ఈ పండుగను గ్రామంలోని దిశరి నిర్ణయించిన ముహూర్తం బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి జరుగుతుంది. గిరిజనుల నెలల్లో సంకురాతిరి నెల ఉండటం ఇక్కడ ప్రత్యేక విషయం. ఈ గిరిజనుల ప్రాంతంలో సంక్రాంతి పండుగ నెల రోజులకు పైగా సాగుతుంది.
ఈ పండుగను దిసరి కనీసం వారం రోజులు ముందుగా నిర్ణయిస్తారు. దీనిని గ్రామ ప్రజలకు చాటింపు ద్వారా తెలియజేస్తారు. ఈ పండుగను దాదాపుగా మంగళ, బుధవారాల్లో చేస్తారు. మంగళవారం రోజున కోళ్లను కోయడంతో ఈ పండుగ ప్రారంభమవుతుంది. బుధవారం పులగం వండుతారు వీటితో పాటు కుడుములను వండి, నాగల దుంపను, గుమ్మడి ముక్కలను ఉడకబెడతారు. ఆ రోజు ఉదయం అన్ని పశువుల కొమ్ములకు ఎర్రటి రంగును పూసి, వీపు భాగంలో నూనెను రాసి, పూజ చేసి, పులగాన్ని, దుంపలను, కుడుములను వాటికి కడతారు. వీటిని పిల్లలు తెంపుకొని తినవచ్చును. ఈ పండుగలలో మరొక ముఖ్యమైన సందర్భంగా “బుడియా దండటం” జరుగుతుంది. బుడియా దండటం అంటే ఇంటింటికి వెళ్లి (జోగి మాదిరిగా) అడగడం జరుగుతుంది. ఇందులో పిల్లలు, పెద్దలు (పురుషులు మాత్రమే) పాల్గొనడం విశేషం. ఇటుకల పండుగ అప్పుడు మహిళలు మాత్రమే తాచేరు అడగితే, ఈ పండుగ నాడు పురుషులు మాత్రమే బుడియా అడగటం ఒక ప్రత్యేకత.
ఈ విధంగా వీరు సేకరించిన వాటితో ఒక విందు ఏర్పాటు చేసుకుంటారు. విందు అనంతరం గ్రామ చావడి వద్ద ప్రజలందరూ కూర్చొని ఊర్లోని కష్టసుఖాలను మాట్లాడకుంటారు. ఈ సందర్భంలోనే గ్రామానికి అవసరమగు గౌడు, చలాని (గ్రామ పెద్దల)లను ఏర్పాటు చేసుకుంటారు.
3.9 కుడుముల పండుగ:
విశాఖ ఏజెన్సీ గిరిజనలు పండుగల్లో కుడుముల పండుగ ఒకటి. ఈ గిరిజనులు వారు పండించిన పప్పు ధాన్యాలు మరియు అలసందలు, పనస ఆకులు మొదలైన వాటిని ఉడకబెట్టి, వాటిని ముద్దలుగా చేసి కుడుములుగా తయారుచేసి వాటిని తమ గ్రామ, గృహ దేవుళ్ళకు పూజ చేసి నైవేద్యంగా పెట్టి చివరకు తాము కూడా తింటారు. ఈ కుడుముల పండుగ నేటి నాగరికలు జరుపుకునే వినాయక చవితి వలే ఉంది.
3.10 హోళి:
మైదాన ప్రజలు జరుపుకునే హోళి పండుగ వంటిది కాదు వీరి హోళి పండుగ. ఇది పేరుకు మాత్రమే హోళి కానీ ఇది సంక్రాంతి ముందు జరుపుకునే భోగి పండుగను పోలి ఉంటుంది. ఈ పండుగ సందర్భంగా అడవికి వెళ్లి పొడవు చెట్టు కొమ్మలను తీసుకువచ్చి గ్రామంలోని చావడి వద్ద నిలువుగా నిలబెట్టి కాల్చడం జరుగుతుంది. ఆ రాత్రి అంతా అందరూ కలిసి సంబరం చేసుకుంటారు.
ఈ విధంగా అనేక పండుగలను ఈ గిరిజనులు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా జరుపుకుంటుంటే నేటి నాగరికులుగా చెప్పుకునే వారు ఇంకా కుల, మత, వర్గ, లింగ బేధాలను పాటించడం ఎంతో సోచనీయం. అంతేకాకుండా ఒక జాతి ఔన్నత్యాన్ని, సంస్కృతి, సాంప్రదాయం తెలియజేసే పండుగలను నేటి నాగరికల్లో కొంతమంది నిర్లక్ష్యం చేయడం ఎంతో బాధాకరం.
4. ముగింపు:
ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలకు నిలయం మన భారతదేశం. ఈ సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచారాలు అన్నీ కూడా ఇప్పటి నాగరికుడిగా పిలవబడే ఒకనాటి ఆదిమ మానవుడు నుండి సంక్రమించినవి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే నేటి ప్రపంచంలో మారుతున్న పరిస్థితులతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇవి స్వాగతించాల్సిన విషయమే కానీ ఎందులో మార్పులు కావాలి? అక్షరాస్యత, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో గణనీయమైన అభివృద్ధి లేదా మార్పు రావాలి. దీనిని ప్రతీ ఒక్కరు స్వాగతించాలి. ఎంతో ఔన్నత్యం కలిగిన మన సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పండుగలు, పబ్బాలు పాటించి మన జాతి మనగడను కాపాడాల్సిన బాధ్యత మనదే. కానీ ప్రస్తుత ప్రపంచీకరణ ప్రభావం ఏజెన్సీ ప్రాంతాల్లోని సంస్కృతి, సాంప్రదాయాలపై కూడా ప్రభావం చూపడం వల్ల ఏజెన్సీ ప్రాంత సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో మార్పులు వచ్చి నేటి తరానికి తెలియని స్థితిలో ఉన్నాయి. ఇలా అయితే భావితరాలు ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఎంతవరకు ఆచరిస్తాయో అనేది సందేహమే. ఇదే జరిగితే నిజంగా బాధాకరం. అయితే భావితరాల వారు ఈ ఆచారాలు పాటించకపోయినప్పటికీ కనీసం వారి సంస్కృతి సంప్రదాయాలు ఇలా ఉంటాయని తెలుసుకోవాలనేది ఈ వ్యాస ఉద్దేశం.
5. పాదసూచికలు:
- కొండ కోనల్లో తెలుగు గిరిజనులు – డా. పిరాట్ల శివరామ కృష్ణ – పుట:62
- ఆంధ్రుల చరిత్ర సంస్కృతి – ఆచార్య కండవల్లి లక్ష్మీ రంజనం – పుట: 176
- ఆంధ్ర శబ్ధ రత్నాకరం – బహుజనపల్లి సీతారామాచార్యులు – పుట:432
6. ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పారావు, జర్రా. విశాఖపట్నం జిల్లా గిరిజన విజ్ఞానం – ఒక పరిశీలన - అముద్రిత సిద్ధాంత గ్రంథం, 1998.
- అశోక్. యం. భారతీయ గిరిజన సంస్కృతి. తెలుగు అకాడమీ, హైదరాబాద్, 2006.
- తెలుగు- కువి పదకోశం. కోదు ఉపాధ్యాయ బృందం. గిరిజన విద్య విభాగం, హైదరాబాద్, 2011.
- రామరాజు, బిరుదురాజు. మన సంస్కృతి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ, హైదరాబాద్, 2010.
- లక్ష్మీ రంజనం, ఖండవల్లి. ఆంధ్రుల చరిత్ర సంస్కృతి. బాల సరస్వతి బుక్ డిపో, కర్నూల్, 1951.
- శివరామ కృష్ణ పిరాట్ల - కొండ కోనల్లో తెలుగు గిరిజనులు, శక్తి ప్రచురణ, 2007.
- సంపాదకమండలి. గిరిజన, గ్రామీణ సమాజ శాస్త్రం – దూరవిద్యా విభాగం, గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం, 2012.
- సీతారామాచార్యులు, బహుజనపల్లి. శబ్ధరత్నాకరం మద్రాసు స్కూల్ బుక్ ప్రచురణ, 1885.
7. విషయ సేకరణలో సహకరించిన కోదు ప్రజల వివరాలు:
- కిల్లో సీతారామ్ – వయసు:26 సం. లు, కిన్నెర్ల గ్రామం, చింతపల్లి.
- కొర్రా కామేశ్వరరావు – వయసు:30 సం.లు, బాంది పుట్టు, ముంచంగి పుట్టు.
- పాంగి శంకరరావు – వయసు:32 సం. లు, బాంది పుట్టు, ముంచంగి పుట్టు.
- మువ్వ లస్సి – వయసు: 21 సం. లు, బొడం గూడ గ్రామం, అరకు లోయ.
- వంతాల మసురు – వయసు:46 సం. లు, మాల గుమ్మి, ముంచంగి పుట్టు.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "OCTOBER-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-SEPTEMBER-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "OCTOBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.