AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
8. ఆధునిక తెలుగు సాహిత్యం: అంతర్వాహినిగా గిరిజనకవిత్వం
డా. కళ్ళేపల్లి ఉదయ్ కిరణ్
సహాయాచార్యులు (ఒ),
డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం,
ఎచ్చెర్ల , శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9494188200, Email: udaykiran18200@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అనేక ప్రక్రియలు, ధోరణులు, ఉద్యమాలు సుసంపన్నం చేసాయి. అటువంటివాటిలో భావ, అభ్యుదయ, దిగంబర, విప్లవ, దళిత, స్త్రీవాద, మైనారిటీ, బి. సి., ప్రాంతీయవాద కవిత్వాలు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే దాదాపుగా అన్నీ రకాల కవిత్వాలలో భాగమయిన గిరిజన సంబంధిత కవిత్వం ప్రత్యేకంగా ఒక వాదంగా లేదా ధోరణిగా తెలుగు సాహిత్యంలో లేకపోవటానికి గల కారణాలను ఊహించటం ఈ వ్యాస ప్రధానోద్ధేశ్యం. దిగంబర సాహిత్యం వెలువడిన కాలం నుండి విరివిగా గిరిజనులను అనుభవిస్తున్న బాధలని, ఎదుర్కొంటున్న సమస్యలని, పీడనని, వారి తిరుగుబాటుని కవితలలో ప్రస్తావించటం గమనిస్తాం. అందుకు తగినట్టుగా దిగంబర, విప్లవ, దళిత కవిత్వాలలో గిరిజనులకు సంబంధించిన కవితలు ఏ విధంగా కలిసిపోయాయో కొన్ని ఉదాహరణాల ద్వారా వివరించే ప్రయత్నం చేసాను. అందరిలాగా గిరిజనులు తమ కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలపలేకపోవటానికి గల కారణాలని వివరించే ప్రయత్నం చేసాను. 1989 లో వెలువడిన ఛాయరాజ్ రచన శ్రీకాకుళం ఉద్యమ కావ్యంలో గిరిజన భాషా విస్తృత ప్రయోగాలు, ప్రాంతాలు, ప్రతీకలు, వారి కష్టానష్టాలు అన్నింటినీ స్పృశించే ప్రయత్నం చేసాను. ఆ గిరిజన పోరాట కావ్యాన్ని ఊతగా తీసుకుని మరిన్ని కావ్యాలు తెలుగు సాహిత్యంలో వచ్చి ఉంటే అన్నీ వాదాలతో పాటు గిరిజన వాదం కూడా తెలుగు సాహిత్యంలో చోటు దక్కించుకునేదని, ఆ విధంగా జరగకపోవటం వలన గిరిజన సాహిత్యం ఆధునిక తెలుగు సాహిత్యంలో అంతర్వాహినిగా మాత్రమే దర్శనమిస్తోందని చెప్పటంతో ముగింపు పలికాను.
Keywords: ఆధునిక తెలుగు సాహిత్యం, గిరిజన కవిత్వం, ఇతరవాదలలో గిరిజన అంశాలు, ఛాయరాజ్, శ్రీకాకుళం, కథాకావ్యం, గిరజన ప్రతీకలు.
1. ఉపోద్ఘాతం:
19వ శతాబ్దం నుండి తెలుగు సాహిత్యం కొత్త పుంతలు తొక్కింది. ఆంగ్ల భాషా ప్రభావం, సంఘసంస్కరణోద్యమాలు తెలుగు భాషా సాహిత్యాలలో నవ చైతన్యానికి ఊపిరులుదాయి. అది మొదలు భావ, అభ్యుదయ, విప్లవ, స్త్రీవాద, దళిత, మైనారిటీ కవిత్వాలు ఉద్యమ రూపం దాల్చి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాయి.
ఇన్ని ఉద్యమ కవిత్వ ధోరణులు తెలుగులో వచ్చినా నేటికీ “గిరిజన కవిత్వం” ఎక్కడా ఒక ఉప్పెనలా ఎగసి కొంత కాలమైనా సాహిత్యంలో తనదైన ముద్రను వేయకపోవడాన్ని ప్రధానంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
“ఒక వాదం లేక ధోరణి ఉద్యమంగా రూపుదిద్దుకోవాలన్నా పిలవబడాలన్నా ఒక నిర్దిష్ట తాత్త్విక దృక్పథం, భౌతిక సామాజిక పరిస్థితులు, నిబద్ధతగల నాయకత్వం, సంస్థాగత నిర్మాణ స్వరూప స్వభావాలు ఉండి తీరాలని సాహితీవేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు.” ఆధునికాంధ్ర సాహిత్యం – గమనం – గమ్యం (వ్యాసం) – డా. టేకుమాళ్ళ వెంకటప్పయ్య , పుట. 59. గమ్యం – గమనం (వ్యాస సంకలనం) – ప్రపంచ తెలుగు రచయితల సంఘం (ప్రపంచ తెలుగు రచయితల 5 వ మహాసభల ప్రచురణ) అన్న డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య మాటలు తెలుగు సాహిత్యంలో గిరిజన సాహిత్యం ప్రత్యేక ధోరణిగా కనిపించకపోవటానికి కారణాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో కుల తత్వానికి వ్యతిరేకంగా పోరాడే దళితులు ఒక వర్గంగా సాహిత్యాన్ని సృష్టిస్తే, వర్గపోరాటంలో వర్ణపోరాటాన్ని భాగంగా భావిస్తూ రచనలు చేసే వేరొక వర్గం గిరిజనులను కూడా దళితులుగా పరిగణించడం వల్ల కూడా వారి గూర్చిన కవిత్వం దళితవాదంలో భాగమైపోయింది. “దళిత జీవుల్ని విప్లవ పోరాటంలో నడిపించిన తొలి దళిత విప్లవ పోరాట కవిగా సుబ్బారావు పాణిగ్రాహిణిని పేర్కొనవచ్చు.
"కొండల పక్కన బండలు కొట్టే
గిరిజనుడా ఇటు రావయ్యా
ఓ గిరిజనుడా ఇటు రావయ్యా
పుట్టల పక్కన కట్టెలు కొట్టే
గిరిజనుడా ఇటు రావయ్యా
ఓ గిరిజనుడా ఇటు రావయ్యా!” దళితవాద వివాదాలు – డా. ఎస్వీ సత్యనారాయణ (సం) – పు. 4.
పై గేయంలో కవి సుబ్బారావు పాణిగ్రాహి గిరిజనుల ఆలోచనలకు పదును పెట్టాడు. ఇటువంటివి కూడా దళిత సాహిత్యంలో భాగంగానే పరిగణించబడ్డాయి. అయితే ఎవరు దళితులు అంటే “హరిజన, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు సంబంధించిన జీవన విధానానికి సంబంధించిన సాహిత్యం దళిత సాహిత్యమవుతుంది. దళిత వర్గాలు సృష్టించిందే దళిత సాహిత్యం అనే భావన సమంజసమైంది కాదు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం అగ్రవర్ణాలవారు సృష్టించిన సాహిత్యం కూడా దళిత సాహిత్యమే అవుతుంది.” తెలుగు సాహిత్య చరిత్ర – ఆచార్య వెలమల సిమ్మన్న –పుట. 561. అన్న ఆచార్య కొండపల్లి సుదర్శనరాజుగారి మాటలు దళితులు ఎవరో స్పష్టంగా నిర్వచించాయి.
2. గిరిజన కవిత్వం అంతర్వాహినిగా ఉండటానికి కారణాలు:
మిగిలిన వారి కన్నా గిరిజనులు ప్రత్యేకం. ఎందుకంటే తమకంటూ భాష ఉన్నా లిపి లేక వారి బాధలని ప్రపంచానికి చాటిచెప్పలేని దుస్థితి వారిది. దళితులుగా గిరిజనులు కూడా పరిగణించబడున్నప్పటికీ దళిత సాహిత్యంలో వారి బాధకు ఎక్కువ చోటు లేదనిపిస్తుంది. కులవ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చిన దళిత ఉద్యమసాహిత్యంలో వారికెటువంటి సంబంధం ఉండనిపిస్తుంది. దానికి కారణం దళితులు లాగా వీరు సమాజంలోనే ఉంటూ అసమానతల్ని, అస్పృశ్యతని ఎదుర్కొనకపోవడమే. అదే విధంగా తమ గిరిజన సమాజం తప్ప మరే విషయం తెలియని వీరు వివక్షకు గురికావటం అరుదుగా కనిపించే అంశం. సమాజంతో మమేకమైనా వీరు దళితులంతటి తీవ్ర అస్పృశ్యతను ఎదుర్కొనకపోవటం కూడా గమనించదగిన విషయమే.
దళిత మేధావుల మాటలను గమనిస్తే హరిజన, గిరిజన, మైనారిటీ మొదలైన వారందరూ దళితులే. అయినప్పటికీ తెలుగు సాహిత్యంలో మైనారిటీ కవిత్వం ప్రత్యేకంగా ఉద్భవించింది. అంటే దళిత కవిత్వంలో ముస్లింలు దళితులుగా పరిగణించబడుతున్నా మతధిక్కారానికి వారు పూనుకోలేదు. అది వారిని దళితుల నుండి వేరు చేసింది. తమకంటూ గల ప్రత్యేక సంస్కృతిని విస్తృతం చేసే భాష, సృజనాత్మకత, కవిత్వ రచనాపటిమ వారికి ఉండటం చేత మైనారిటీవాదం రూపుదిద్దుకోగలిగింది. ఆ అవకాశం గిరిజనులకు లేకపోవటానికి కారణం లిపి, సృజన, చైతన్యం, ఆసక్తి ఇత్యాదులు వారిలో పూర్తిగా లేకపోవటమే. అదే కనుక వారికి సాధ్యమై ఉంటే దళిత, మైనారిటీ, వెనుకబడినవర్గాల సాహిత్యం లాగానే తెలుగు సాహిత్యంలో “గిరిజన సాహిత్యం” పురుడుపోసుకునేదే. వారి సాహిత్యం కూడా వివిధ ప్రక్రియలలో తనదయిన ముద్ర వేసేదే.
“ప్రాచీన సాహిత్యంలో కంటే ఆధునిక సాహిత్యంలో గిరిజన జీవితం, సాహిత్యం ఎక్కువగా కనిపిస్తుంది. అది “కథాసాహిత్య ప్రక్రియ”లో మెరుగ్గా కనిపిస్తుంది. “నవలా సాహిత్యప్రక్రియ”లో కొంత కనిపిస్తుంది. “గేయ సాహిత్యప్రక్రియ”లో ఫరావాలేదనిపిస్తుంది. కానీ నాటక ప్రక్రియ, కవిత్వప్రక్రియలో చాలా తక్కువ కనిపిస్తుంది.” ఆధునిక తెలుగు సాహిత్యం గిరిజన జీవన చిత్రణ (సిద్ధాంత గ్రంథం) – ముదావత్ వెంకటేష్ – పు. 159. అన్న పరిశోధకుని మాటలు గిరిజన సాహిత్యం వివిధ ప్రక్రియలలో కొంత ఉన్నదని స్పష్టం చేస్తున్నాయి.
దళిత కవిత్వంలో గిరిజనులను కూడా దళితులుగా భావిస్తూ లెక్కించదగ్గ కవితలు మాత్రమే రావటం వలన వారి వెతలు సంపూర్ణంగా కళ్ళకు కట్టవన్న విషయం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా గిరిజనులు తమ గురించి తామే విరివిగా రచనలు చేసుకోలేకపోవటానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి.
- నిరక్షరాస్యత
- గిరిజన భాషలకు లిపి లేకపోవటం
- సమాజానికి దూరంగా జీవిస్తుండటం.
- తమ కష్టసుఖాల్ని వారు కవిత్వీకరించలేకపోవటం.
- కొండ ప్రాంతాలలో నివసించే వారి దైన్యస్థితి మైదాన ప్రాంతాలవారికి పూర్తిగా తెలియకపోవటం.
- సృజనాత్మక రచనల పట్ల ఆసక్తి చూపకపోవటం.
- అస్పృశ్య సమస్యను ఎదుర్కొనకపోవటం.
ఇటువంటి అనేక సమస్యలు తెలుగు సాహిత్యంలో గిరిజనసాహిత్యం పరిమితంగా వెలువడటానికి అడ్డుతగిలాయి.
3. ఆధునిక తెలుగు సాహిత్యంలో గిరిజనుల ప్రస్తావన:
తెలుగు సాహిత్యంలో దిగంబర సాహిత్యం నుండి గిరిజనుల ప్రస్తావన మనకు ఎక్కువగా కనిపిస్తుంది. దేశంలో అవినీతి, అరచకానికి బాధపడి, రగిలిన హృదయంతో తెలగుసాహిత్యంలో కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు దిగంబర కవులు.
“ఆదిమ వాసుల్లా
ఎవరిగోడల పంచనో
ఈ అరణ్యాల్లో పొగరాజగొడుతూ
దుమ్ముకు దాసులై
పాటలు పాడుతూ
రోట్లో జీవితపు కారం దంచుతున్న
లంబాడీ సుందరీమణుల మధ్య
వజ్రాల గనిలో పాతుకుపోయినవాడ!
అంత డల్ గా వున్నావేమిటి?
విప్పేయ్ నీ మర్యాద దుస్తులు” దిగంబరకవులు – పుట. 41. అంటూ ‘నీరవ నిఖిలేశ్వర్’ కవితలో నిఖిలేశ్వర్ గిరిజనుల దుస్థితిని వివరించాడు.
తదనంతర కాలంలో విప్లవ సాహిత్యం గిరిజనుల అసలు సిసలైన కష్టాలని ప్రజల ముందుంచింది. కమ్యూనిస్ట్ పార్టీ మొదటగా గిరిజనులు దోపిడికీ గురవ్వడాన్ని గుర్తించింది. కనుకనే వారికి బాసటగా ఉద్యమాలను లేవదీసింది. మాటలతో తమ గోడును చెప్పుకోలేని గిరిజనులు తుపాకులతో జత కట్టటం వలన విప్లవసాహిత్యంలో వీరి ప్రస్తావన అధికంగా కనిపిస్తుంది.
“రంగ్ మేటియా బుడార్సింగ్ పర్వతాలిప్పుడు నవజవా – జటాయువులు
గోండ్లు, పరధాన్లు, జాతాపులు, సవర్లు, కోయలు, చెంచులు వీరాంజనేయుళ్ళు
పోడూ సాగూ పొలంపని కలిపిన చేతులు కత్తులకైనా తెగని గట్టి లంకెలు” సూరీడు మావోడు – కె. వి. ఆర్. పుట. 105 అన్న పై కవితలో వివిధ గిరిజన జాతుల ప్రస్తావన మాత్రమే కాదు వారి జీవన విధానం కూడా తెలుస్తుంది.
“నా వుద్వేగం అడుగున అభంగ పాతాళ గంగ
నెత్తుర్లోడే గుండె అరలో ఒరదీస్తున్న ఖడ్గ శంప
నీతోడు! నీలో కలిసి ప్రవహిస్తుంది భావం వేడి
మోదుగు చెట్టు మోపు తాటి గొడ్డలిని గూడెం గుబగుబని
పొదరొదని కోదుజనం సందడిని గెరిల్లా దళం కదాన్ని” సూరీడు మావోడు – కె. వి. ఆర్. పుట. 127
అని కవి చెప్పిన దానిలో గిరిజనుల కోసం పోరాడదలిచి వారిలో మమేకమయిన వ్యక్తులు, వారి భావాలు స్పష్టంగా తెలుస్తాయి. అలాగే తమ హక్కుల కోసం గిరిజనులు కూడా కలిసి రావటం కూడా కనిపిస్తుంది.
సమాజంలో అస్పృశ్యత, కుల వివక్షతలను ఎదుర్కొంటూ దీనమైన జీవితాన్ని గడుపుతున్న దళితులు, తమ ప్రాణాలు సైతం అగ్రవర్ణాల వారి దాష్టీకానికి బలి అవుతుంటే సహించలేక తెలుగు సాహిత్యంలో ఉద్యమంగా కదిలి సృష్టించింది దళిత కవిత్వం. విప్లవ సాహిత్యంలో సాయుధపోరాట పరంగా గిరిజనులు, వారి కష్టాలు ప్రస్తావితమయినట్లే అణగారిన వర్గాలలో ఉండటం, సంఘ వివక్ష మొదలైన కారణాల వలన గిరిజనుల కష్టాలకి దళిత సాహిత్యంలో చోటు దక్కింది. అయితే దళితులు సంఘంలోనే ఉంటూ ఎదుర్కొంటున్న వివక్ష ప్రధాన కారణం కావటం వల్ల వారి వెతలకే ఎక్కువ ప్రాధాన్యం లభించింది. గిరిజనులు సమాజానికి దూరంగా ఉండటం వలన వారి కష్టాలని కవిత్వీకరించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వలేదు. అందువల్లనే దళిత సాహిత్యంలో అక్కడక్కడా వీరి గురించిన కవిత్వం కనిపిస్తుంది.
“తల్లిని అవమానించిన ఏ రాజ్యం బతకలేదు సుమా?” అనే కవితలో కత్తి పద్మారావు గిరిజన స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలని ఇలా ఖండించారు.
“మీరూ అడవుల్లో ఎవరిని వెతుకుతున్నారు?
గుడిసెల్లో తుపాకులతో జొరబడే
వారికి మీరిచ్చే భరోసా ఎంత పాశవికమైంది
వారు మాపై అత్యాచారం చేశారు అని వీళ్ళంటే
ఆనవాళ్ళు చూపించండని మీరంటున్నారు” దళితకవులు – సంఘటనాత్మక కవిత్వం (సిద్ధాంత గ్రంథం) – డా. సుమతీ కిరణ్ – పుట. 139
అని గిరిజనుల ఆశక్తతని, పోలీసుబలగాల దౌర్జన్యాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు.
ఇలా అడపాదడపా గిరిజనుల గురించి తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్నా విస్తృతంగా సవర భాషా పదాలని పరిచయం చేస్తూ కావ్యం అంతటా వారి బాధలని వివరించింది ఛాయరాజ్ “శ్రీకాకుళం” ఉద్యమ కథాకావ్యం.
ఛాయరాజ్ “శ్రీకాకుళం” రచనలో విశిష్టత: ఎన్నో గిరిజన ప్రాంతాలని, వారి కష్టాల్ని పరిచయం చేయటం, గిరిజన భాషా పదాలని విస్తృతంగా ప్రయోగించటం ఈ కావ్యంలోని గల కొన్ని ప్రత్యేకతలు.
“కొండంత బరువున్న
మనసున్న మనుషుల్ని చూడాలంటే
అడవుల్లో కాళ్ళెట్టి గూడేల్లో కళ్ళెట్టి
గుడిశల్లో గుండెట్టి చూడాలబ్బీ
.... .. .. .. .. .. .. .. .. .. .. .. .. ..
.... .. .. .. .. .. .. .. .. .. .. .. .. ..
ఆకంటె! ఆకా! అని ఆకులై చూస్తారు.
పువ్వంటె!పువ్వా! అని పువ్వులయి చూస్తారు.
పువ్వనీ, ఆకనీ
నువ్వెందుకంటావొ అర్థమయ్యిందాక
మనసుల్ని విప్పరు బరువుల్ని దించరు” శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 23
అని కవి గిరిజనుల అమాయకత్వాన్ని, నిర్మలమైన మనసుని, ఎవరినీ త్వరగా నమ్మని వారి మనసతత్త్వాన్ని చెబుతూ, తమను దగా చేయటానికి వచ్చారనే భావన నుండి బయటపడి నమ్మిన తరువాత మనతో స్నేహం చేస్తారని హృద్యంగా వివరించాడు.
“రింగి గుడ్డయి లేచి
గిరిజనుడి మొలచుట్టు గోచీలా చుడుతుంది.
.... .. .. .. .. .. .. .. .. .. .. .. .. ..
.... .. .. .. .. .. .. .. .. .. .. .. .. ..
పసుపు దుంపల్లాంటి ‘దంగ్ డీ’ల తోటి
పోడుల్లో మడులన్నీ పులకించి వుంటాయి.” శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 25
పై కవితలో ‘రింగి’ అంటే గాలి అని, ‘దంగ్ డీ’ అంటే యువతి అని అర్థం. అర్థమయినప్పటి భావమాధుర్యం కంటే అర్థంకాని ఆ పదాలు కవితలో చేసే అల్లరి, రేకెత్తించే ఉత్సాహం కొత్త అనుభూతిని కలిగిస్తాయి. తమ భాషా పదాలు తెలుగుకవితలో మిళితమై వినపడుతుంటే ఆనంద పరవశులవుతారు గిరిజనులు.
‘‘.... ... .. జంగా బాడ ఆయుధాల్ పట్టుకొని
సామూహికంగా బెంత చేసే సవరోళ్ళు
శ్రీకాకుళం అడవుల్లో పిడికిళ్ళు పైకెత్తి
భూస్వామి
వ్యాపారి
కర్ణమూ
పోలీసు
జంతువుల్ని వేటాడి
సొప్ప సముద్రాల్ లేపి
దీనులై వీరులై.... ... ..’’ శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 28.
పై కవితలో జంగా ‘బాడ’ అంటే విల్లు, నాటుతుపాకీలు. ‘సొప్ప’ పదానికి అర్థం నెత్తురు. మొక్కుబడిగా కాకుండా సందర్భానికి తగినట్టు ఆ గిరిజన భాషా పదాలని ప్రయోగించటానికి కవికి ఎంతో నిబద్ధత కావాలి. అది ఛాయరాజ్ కవిత్వంలో పుష్కలంగా కనిపిస్తుంది. అదే విధంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత కూడా గిరిజనులు స్వేచ్ఛను పొందలేకపోయారని వారిపై దోపిడీ జరిగిన, జరుగుతున్న విధానాన్ని కళ్ళకు కడుతుందీ కవిత.
“పల్లం చిల్లర వ్యాపారస్తులు
సంపదంతా కొల్లగొడితే..
భూస్వామ్య భల్లూకాలు
భూముల్ని కాజేస్తే..
అడవి బతుకులన్నింటిని
ఆస్థిపరులు సాగు చేస్తే..
కమ్యూనిస్టు యింకా
అడవుల్లో ఉదయించక ముందు
చూద్దామా!గిరిజనులను
రాజ్యాంగం పట్టని మానవులను” శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 32.
అంటూ ఎందరి చేతుల్లో గిరిజనులు మోసపోతున్నారో వివరించాడు కవి. ఇదే కవిత ముగింపులో గిరిజన కార్పొరేషన్లు కూడా గిరిజనులకు సంపూర్ణ న్యాయం చేయట్లేదని వాపోతాడు కవి.
“అడవుల్లో అగ్గిపుట్టి
గూడలు బూడిదలయినప్పుడు
బొంగుల్లో దాచిన
భూమి శిస్తు రసీదులు బుగ్గయినప్పుడు
భూమిహక్కు పోయినట్టె
భుక్తి హక్కు పోయినట్టె
నెత్తురు సత్తుం భూములు
వర్తకులకు ధారాదత్తం..
మెత్తాను సాగుకు తెస్తే
ఫారెస్టు వాళ్ళ పెత్తనం..
ఎక్కడ గిరిజనుడడిగితే
అక్కడ పీడకులు ప్రత్యక్షం” శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 35,36.
అని గిరిజనుల కష్టాన్ని రాబందుల్లా పీక్కుతింటున్న సమాజాన్ని నగ్నంగా దర్శింప చేసాడు కవి.
ఇక శ్రీకాకుళంలో ప్రారంభమయిన గిరిజన రైతుల సాయుధ పోరాట వర్ణనలో ఎన్నో గిరిజన గ్రామాల పేర్లను, వాటి గొప్పతనాన్ని స్పృశించటం ఈ కావ్యంలో మరొక ప్రత్యేకత.
“.... భద్రగిరి కొండెక్కు కాంవిరే
గుమ్మలచ్చింపురమెల్లు, వత్తాడ చదును గూడెల్లు
సప్ప గొత్తిలి, నాగలి, బారతింగెల్లు
లండగొర్లి, జొంగర, పెద్ద కరజెల్లి
కుక్కిడి కొండ గుహల్లో నువు కోపమై కూర్చోవు....
.... .. .. .. .. .. .. .. .. .. .. .. .. ..
.... .. .. .. .. .. .. .. .. .. .. .. .. ..
బారువ కొబ్బరి నీడల్ల నిలబడి
అటు సోంపేట ఇటు బొడ్డపాడు మధ్యన బారసాచి
ఉప్పలాడ,కొతిగాం, జీల్లిబద్రలనందుకో
వర్గ ఉద్యమ ప్రాంతాల ఊరూర తిరిగి ఉర్రూగిపోయి
చారిత్రాత్మక ఉద్యమ కథాకథనం కోసం
శ్రీకాకుళంలో లీనమైపోతావు” శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 22.
అనటంలో ప్రతీ ప్రాంతానికి ఉద్యమ చరిత్ర ఉన్నదని కవి స్పష్టంగా చెప్పాడు.
4. ముగింపు:
గిరిజనుల గురించి ఎన్నో వైవిధ్య అంశాలని స్పృశిస్తూ, సవర భాషా పదాలకి స్థానం కల్పిస్తూ 1989లో వెలువడిన “శ్రీకాకుళం” కావ్యం సంపూర్ణ గిరిజన కవిత్వానికి ప్రతీక. అయితే దురదృష్టవశాత్తూ ఈ విధంగా ఇతర కవుల తమ రచనల ద్వారా గిరిజన కవిత్వాన్ని మరింత ముమ్మరం చేయలేదు. అందువల్ల నేడు గిరిజన కవిత్వం దిగంబర, విప్లవ, దళిత సాహిత్యాలలో అంతర్వాహినిగా మాత్రమే దర్శనమిస్తోంది. వర్ణ వివక్షపరంగా వారు దళిత పక్షం ఉద్యమాల పోరుబాటలో వారు విప్లవపక్షం సంఖ్యాపరంగా వారు అల్పసంఖ్యాక వర్గ౦ అని గ్రహించినప్పుడు అన్ని ఉద్యమాలలో, అందరి ఉనికిలో గిరిజనులు కూడా మమేకమయి ఉంటారు. అందువల్లనే నేడు వారి కవిత్వానికంటూ తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం లేకుండాపోయింది.
అనుభవించేవారే సరిగ్గా రాయగలరు. నిజమే కానీ ఆధునిక సాహిత్యంలో వచ్చిన ఎన్నో ఉద్యమాలు దానిని అనుభవించినవారు రాయటంతోనే ప్రారంభం కాలేదనేది అందరికీ తెలిసిందే. కనుక ఆ స్ఫూర్తితో కవులు ఆలోచన చేయగలిగితే “గిరిజన కవిత్వం” తెలుగు సాహిత్యంలో మరింత విరబూసే అవకాశం ఉంది.
5. పాదసూచికలు:
- ఆధునికాంధ్ర సాహిత్యం – గమనం – గమ్యం (వ్యాసం) టేకుమాళ్ళ వెంకటప్పయ్య, పుట. 59.
- దళితవాద వివాదాలు – ఎస్వీ సత్యనారాయణ (సం) – పు. 4.
- తెలుగు సాహిత్య చరిత్ర – వెలమల సిమ్మన్న –పుట. 561.
- ఆధునిక తెలుగుసాహిత్యం-గిరిజనజీవనచిత్రణ (సిద్ధాంత గ్రంథం). ముదావత్ వెంకటేష్ పు. 159.
- దిగంబరకవులు – పుట. 41.
- సూరీడు మావోడు – కె. వి. ఆర్. పుట. 105
- సూరీడు మావోడు – కె. వి. ఆర్. పుట. 127
- దళిత కవులు – సంఘటనాత్మక కవిత్వం (సిద్ధాంత గ్రంథం) – డా. సుమతీ కిరణ్ – పుట. 139
- శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 23
- శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 25
- శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 25
- శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 32.
- శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 35,36.
- శ్రీకాకుళం – ఛాయరాజ్ – పుట. 22.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- కె. వి. ఆర్., (1986).సూరీడు మావోడు, ఝంఝ పబ్లికేషన్స్, కావలి.
- ఛాయరాజ్, కొంక్యాన(2013). శ్రీకాకుళం, జనసాహితి, విజయవాడ. నగ్నముని, నిఖిలేశ్వర్(2016). దిగంబరకవులు, సాహితీ మిత్రులు, విజయవాడ.
- వెంకటప్పయ్య, టేకుమళ్ళ.(2022). గమ్యం – గమనం (వ్యాస సంకలనం), ప్రపంచ తెలుగు రచయితల సంఘం, విజయవాడ.
- వెంకటేష్, ముదావత్.(2018), ఆధునిక తెలుగు సాహిత్యం గిరిజన జీవన చిత్రణ (సిద్ధాంత గ్రంథం)
- సత్యనారాయణ, ఎస్వీ.(2004). దళితవాద వివాదాలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- సిమ్మన్న, వెలమల(2021). తెలుగు సాహిత్య చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- సుమతీ కిరణ్. దళిత కవులు – సంఘటనాత్మక కవిత్వం (సిద్ధాంత గ్రంథం)
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "OCTOBER-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-SEPTEMBER-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "OCTOBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.