headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. మధ్యయుగంలోని రాయలసీమ సమాజం: పరిశీలన

డా. అంకే శ్రీనివాసులు

తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ కళాశాల(స్వ.), అనంతపురం,
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్,
సెల్: +91 9652471652, Email: ankesreenivas@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

విజయనగర సామ్రాజ్యకాలంలో రాయలసీమ అంతటా విశేషంగా చెఱువుల్ని నిర్మించారు. చిన్న చిన్న వాగులకు, వంకలకు, నదులకు అడ్డంగా వీటిని నిర్మించి విస్తారమైన వ్యవసాయ క్షేత్రాల్ని ఏర్పాటు చేశారు. ఈ చెఱువులే విజయనగర సామ్రాజ్యానికి అపారమైన సంపదను, సాహిత్యాన్ని సృష్టించాయి. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత ఈ చెఱువుల్ని ఆశ్రయించుకొనే పాలెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. రాయలసీమలోని పాలెగాళ్ల వ్యవస్థ మిగిలిన దేశంలోని భూస్వామ్య వ్యవస్థకన్నా భిన్నమైనది. పాలెగాళ్లలో అత్యధికులు వెనుకబడిన కులాలకు చెందినవారు. వీరు క్షత్రియులమని ప్రకటించుకోవడానికి ఉబలాటపడ్డారు. కొందరు పాలెగాళ్లు కావ్యాలు కూడా రాశారు. వీరి దృక్పథానికి భిన్నంగా తత్త్వసాంప్రదాయం ఏర్పడింది. సామాజిక సమానత్వాన్ని కోరుకుంటూ తత్త్వాలు ఆవిర్భవించాయి.

Keywords: పాలెగాళ్ల వ్యవస్థ, భౌగోళికత, రాయలసీమ, తత్త్వం, సంకీర్తన, ప్రబంధం, సాంప్రదాయ నీటి వనరులు

1. ఉపోద్ఘాతం:

మధ్యయుగంలో రాయలసీమలో ఉన్న భూస్వామ్య వ్యవస్థ మిగిలిన ఆంధ్ర దేశంలోని భూస్వామ్య వ్యవస్థకన్నా చాలా వైవిధ్యమైనది. విజయనగర సామ్రాజ్యకాలంలోని అమరనాయంకర వ్యవస్థ కాస్తా, విజయనగర సామ్రాజ్య పతనం తరువాత పాలెగాళ్ల వ్యవస్థగా పరిణమించింది. చెఱువులు, నదులు వంటి నీటి వనరులను కేంద్రాలుగా చేసికొని బలపడింది. నిరంతర అంతఃకలహాలవల్ల సంక్షుభితమైన వాతావరణాన్ని సృష్టించింది. అయినప్పటికీ దిగువ కులాలు అగ్రవర్ణాలుగా ఎదగాలనుకున్నాయి. అందుకోసం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని ప్రయత్నాలను చేశాయి. ఈ సామాజిక చలన సూత్రాలను ఆనాటి సాహిత్యం స్పష్టంగా అభివ్యక్తం చేసింది. మిగిలిన ఆంధ్రదేశంలోని భూస్వామ్య వ్యవస్థకన్నా భిన్నమైన సామాజిక వ్యవస్థని పాలెగాళ్ల వ్యవస్థ సృష్టించింది. తత్ఫలితంగా భిన్న సాహిత్య ప్రక్రియలు కూడా ఆవిర్భవించాయి .

శాసనాలు బ్రాహ్మణ క్షత్రియ వర్గాల గురించి, రాజులు దండయాత్రలు, నిర్మాణాలు వారి పాలన గురించి తెలియజేస్తాయి. కైఫీయత్తులు  గ్రామాల్లోని స్థానిక పరిస్థితుల గురించి అనేకమైన సామాజిక విషయాలను తెలియజేస్తాయి.

2. మధ్యయుగరాయలసీమ - నేపథ్యం:

రాయలసీమ భూస్వామిక వ్యవస్థ గొప్ప సాహిత్యాన్ని ఆవిష్కరించింది. 14,15,16వ శతాబ్దాల సాహిత్యమంతా భూస్వామ్యవ్యవస్థ ప్రోత్సాహ ఫలితంగానే జన్మించింది. రాజకీయంగా నెల్లూరు జిల్లా చాలాభాగం రాయలసీమలో భాగమే. భాషా శాస్త్రపరంగా కూడా నెల్లూరు ప్రాంతం రాయలసీమలో భాగంగానే భాషా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. 13వ శతాబ్దంలోనే తిక్కన సాహిత్యాన్ని స్థానిక భూస్వామ్య వ్యవస్థ ఆదరించింది. తిక్కన నుండి 18వ శతాబ్దం చివరి దాకా ఈ ప్రాంతం నుండి వచ్చిన సాహిత్యమంతా భూస్వామ్య వ్యవస్థనే సమర్ధించింది. దాన్నే ఆశ్రయించుకొని బ్రతికింది. "నిరుపహతి స్థలము రమణీ ప్రియదూతికా తెచ్చియిచ్చెడి కప్పురవిడెము..." లాంటివన్నీ వుంటే తప్ప కవిత్వం రాయనన్నాడు కవి. ధూర్జటి, అన్నమయ్య వంటి వారు ఆనాటి సామాజిక వ్యవస్థను విమర్శించినప్పటికీ, దానికి ప్రత్యామ్నాయమైన మరొక వ్యవస్థను గురించి వారు ఆలోచించలేదని మనం గుర్తించు కోవాలి. వేమన, పోతులూరి వీరబ్రహ్మన్నలు సరికొత్త సామాజిక వ్యవస్థ నిర్మాణాన్ని గురించి తాత్వికమైన చర్చ చేశారు.

ఉర్వి వారికెల్ల నొక్క కంచము బెట్టి
పొత్తు గుడిపి కులము పొలయజేసి
తలను చేయి పెట్టి తగనమ్మ జెప్పరో” - అని వేమన

విశ్వజనీనమైన భావనను వ్యక్తీకరించాడు. ఆనాటి భూస్వామిక వ్యవస్థ గురించి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి 'రాయలనాటి రసికత' వ్యాసం ఇందుకు పెద్ద నిదర్శనం. నాటి కవులు పాలకుల్ని భగవంతుని అవతారమని కీర్తించేవారు. ఉదయగిరి ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతం కృత్యాదిలో సాళువ నరసింహరాయల్ని అర్జునునితో పోల్చాడు. కాని కావ్యం మధ్య భాగంలోకి రాగానే అదే సాళువ నరసింహున్ని కృష్ణుని అవతారమేనని చెప్పాడు (8-214), శ్రీకృష్ణుని అవతారమే శ్రీకృష్ణదేవరాయలు అని కావ్యసృజన చేసిన ప్రబంధ కవులు కూడా వున్నారు.

అయితే తెలుగు సాహిత్య ఆవిర్భావం నుండీ క్రీ.శ.1800 వరకూ మొత్తం ఆంధ్రదేశంలో ఈ ప్రాంతం నుండీ వచ్చినంత ఉధృతంగా మరెక్కడా సాహిత్యం ఆవిర్భవించలేదు. ఒకవిధంగా చెప్పాలంటే తెలుగు ప్రాచీన సాహిత్య చరిత్రంతా కొన్ని మినహాయింపులతో రాయలసీమ సాహిత్య చరిత్రే అంటే ఆశ్చర్యం లేదు. ఇందుకు నన్నయ, పాల్కుర్కి సోమన లాంటి ప్రధానకవులు ఒకరిద్దర్ని మినహాయించాలి. తెలంగాణ వాడైన పాల్కురికి సోమన వంటి వీరశైవ కవుల్ని చాలాకాలం పాటు కవులుగానే పరిగణించలేదు. 15వ శతాబ్దం మధ్యభాగం నుండీ తెలంగాణ ప్రాంతం నుండీ సాహిత్యం ఎక్కువ ఆవిర్భావం జరిగినప్పటికీ, అదీ రాయలసీమ భూస్వామ్య వ్యవస్థ ప్రభావంతోనే!

ఉత్తరాంధ్ర మాండలికం 11వ శతాబ్దం నాటికి ఒక ప్రత్యేక రూపాన్ని సంతరించుకున్నట్లు కందప్పచెట్టి చెప్పారు. దీనికి సంబంధించిన మూడు నాలుగు అంశాల్ని ఆయన చెప్పివున్నారు. మధ్యాంధ్ర, తెలంగాణ ప్రాంతాల భాషలో పెద్ద తేడా లేదని కూడా తేల్చారు. రాయలసీమ భూస్వామ్య వ్యవస్థ తెలుగుభాషకు ఇచ్చిన అపురూపమైన కానుక 'రాయలసీమ మాండలికం." భద్రిరాజు కృష్ణమూర్తి గారు నెల్లూరు ప్రాంతానికి చెందిన తిక్కన భారతంలో "కపిల" (ఆశ్రమ 1.72) అనే ప్రయోగం వుందని, ఈ మాటకు బదులుగా "మోట" అనే వాడుక మిగిలిన ఆంధ్రదేశమంతా వుందని వివరించారు(1). అయితే ఎందుకో రాయలసీమ ప్రాంత ప్రాచీన మాండలిక నిర్మాణం మీద పెద్దగా పరిశోధన జరగలేదు. క్రీ.శ. 11వ శతాబ్దం నాటికే రాయలసీమ భాషలో ఒక ప్రత్యేకమైన భాషోచ్ఛారణ, మాండలిక నిర్మాణం జరిగినట్లు నిర్దిష్టమైన ఆధారాలున్నాయి. అనాటి ఆంధ్రదేశ మంతటా భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ, ఒక్క రాయలసీమ భూస్వామ్య వ్యవస్థ మాత్రమే తనదైన భాషానిర్మాణాన్ని రూపొందించుకున్నది. ఉత్తరాంధ్ర మాండలిక నిర్మాణం ప్రత్యేకంగా రూపొందించడానికి ప్రధాన కారణం, ఒరియా మాతృభాషగా గలిగిన పాలకుల పాలనలో శతాబ్దాల పాటు నివసించడమే నని కందప్ప చెట్టి గారే చెప్పివున్నారు(2). మొత్తం సాహిత్య చరిత్రలో ఒక ప్రాంత మాండలికానికి ఆస్థాన గౌరవం లభించడం కూడా రాయలసీమ లోనే జరిగింది. జానపదాన్ని జ్ఞానపదంగా చేసినవాడు అన్నమయ్య. తర్వాత కాలంలో వేమన, పోతులూరు వీరబ్రహ్మం వంటి వారు మాండలికానికే పట్టాభిషేకం చేశారు.

3. రాయలసీమ భౌగోళిక నిర్మాణం:

రాయలసీమ (భౌగోళిక నిర్మాణం చాలా విలక్షణంగా వుంది. మిగిలిన ప్రాంతాలకన్నా భిన్నమైనది. రాయలసీమ పీఠభూమి పడమర నుండి తూర్పునకు చాలా ఏటవాలుగా వుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆగ్నేయ దిశకు వాలుగా వుంటుంది. రాయలసీమ పడమటి ప్రాంతాలు సముద్రమట్టానికి వున్న ఎత్తును గమనించాలి.

మడకశిర - 676 m (2221 ft)
కళ్యాణదుర్గం - 656 m (2152 ft)
రాయదుర్గం - 543 m (1781 ft)
ఉరవకొండ - 459 m (1506 ft)
మంత్రాలయం - 321 m (1053 ft) (రాయల ప్రపంచ అట్లాసు పేజీ సంఖ్య 21)

రాయలసీమ తూర్పు ప్రాంతాలైన చిట్వేల్, పెనగలూరు, గోపవరం, పోరుమామిళ్ళ ప్రాంతాలు తూర్పు కనుమల్లోని ప్రాంతాలు. కాబట్టి ఎత్తులోనే పరివేష్టితమైనట్లు లెక్క అందువల్ల వీటిని కాకుండా పీఠభూమిలోనే వున్న తూర్పు ప్రాంతాల్ని పరిశీలించాలి.

బనగానపల్లి - 209 m (686 ft)
అవుకు - 194 m (636 ft)
జమ్ముల మడుగు - 184 m (604 ft)
ఖాజీపేట - 127 m (404 ft)
కడప - 138 m (453 ft)
వీటి సగటు ఎత్తు - 150 m (492 ft)
పడమటి ప్రాంతాల సగటు ఎత్తు - 550 m (1804 ft)
తూర్పు ప్రాంతాల ఎత్తు - 150 m. (492 ft)
400 m (1312 ft)       (రాయల ప్రపంచ అట్లాసు పేజీ సంఖ్య 21)

పర్వత కొండ ప్రాంతాల ఏటవాలుని మినహాయిస్తే ఇది తీవ్రమైన ఏటివాలు. మొత్తం దక్కన్ పీఠభూమిలోనే ఇది అత్యంత ఎక్కువ ఏటవాలు కలిగిన ప్రాంతం. మొదటి పట్టికను గమనిస్తే దక్షిణం నుండి ఉత్తరం వైపుకు కూడా కొంత వాలున్నట్లు అర్ధమవుతుంది. అందుకే ప్రారంభంలో హంద్రీ ప్రయాణం ఆ దిశగా సాగి  తూర్పునకు మలుపు తిరుగుతుంది. రెండవ పట్టికలో కూడా ఉత్తరం నుండి దక్షిణం వైపునకు వాలున్నట్లు కనిపిస్తోంది. అయితే అది వాస్తవం కాదు. ఎందుకంటే చిత్రావతి, పాపాగ్ని నదులు ఆ దిశగా ప్రవహించడం లేదు. అంటే ప్రాథమికంగా వాయువ్యం నుండి ఆగ్నేయం వైపునకే వాలు వుంది. రాయలసీమ పడమటి ప్రాంతాలు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో వున్నాయి! దాదాపు నాలుగు వందల మీటర్ల ఎత్తు! ఇది అర్ధం కావాలంటే తిరుపతి కన్నా తిరుమల కేవలం 123 మీ. ఎత్తులోనే వుంది. రాయలసీమ తూర్పు పడమరల సరాసరి దూరం 230 కి.మీ. ఈ 230కి.మీ. మధ్యదూరంలో దాదాపు 400 మీటర్ల ఏటవాలు వున్నదని అర్ధం. ఈ ఏటవాలు వలన రాయలసీమ పీఠభూమిలో నీరు స్థిరంగా నిలిచే అవకాశమే లేదు. అందుకే అనేకమైన చెఱువుల నిర్మాణం జరిగింది. అనేక నదులకు కాలువలు తవ్వి మరీ చెఱువులు నింపడం జరిగింది. ఒక చెఱువు నిండిన తర్వాత మరో చెఱువులోకి నీరు ప్రవేశించే విధంగా లింక్ ట్యాంక్ కన్ స్ట్రక్షన్ జరిగింది.

మధ్యయుగ రాయలసీమ సమాజం అర్థం కావాలంటే, రాయలసీమ భౌగోళిక నైసర్గికత కూడా తెలియాలి. సమాజం మీద స్థల ప్రభావం ఎక్కువగా వుంటుంది. శివాజీ ఎదగడంలో, బలపడడంలో పశ్చిమ కనుమల పాత్ర ఎంత ప్రాధాన్యత కల్గివుందో విజయనగర సామ్రాజ్య విస్తృతికి, పాలేగాళ్ళ వ్యవస్థ నిర్మాణానికి, రాయలసీమ భౌగోళిక నిర్మాణం కూడా అంతే ప్రాశస్త్యాన్ని కల్గివుంది. విజయనగర చరిత్రను, పాలేగాళ్ళ వ్యవస్థను రాయలసీమలోని చెఱువుల నుండి విడదీసి చూడడం సాధ్యం కాదు. దక్షిణ భారతదేశంలో మూడులక్షల సాంప్రదాయ నీటి వనరులున్నాయి. ఇందులో కేవలం ఎనిమిది చిన్న జిల్లాలున్న రాయలసీమలో 37 వేల సాంప్రదాయ నీటివనరులున్నాయి. వీటినన్నటినీ నిర్మించినది మధ్యయుగ భూస్వామ్య వ్యవస్థ. రాయలసీమలో ఉన్న పెద్ద చెఱువులు మరెక్కడా లేవు. రాయలసీమలోని చెఱువుల సాంద్రత చాలా ఎక్కువ. బుక్కపట్నం, ధర్మవరం, పోరుమామిళ్ళ, అనంతపురము, చింతకుంట చెఱువులు ఇందుకు మంచి నిదర్శనాలు. తెలంగాణలోని రామప్ప చెఱువు, లక్కవరం చెఱువు వంటివి వీటికన్నా చిన్నవే.

4. సామాజికనిర్మాణం:

మన కవులంతా నీరు సమృద్ధిగా వున్న ప్రాంతాలనే పాలకుల నుండి అడిగి మరీ ఇప్పించుకున్నారు. (.... అడిగిన సీమ లందు నిచ్చే... అల్లసాని పెద్దన చాటువు) ఈ నదులు, చెఱువులు, కాలువల్ని ఆశ్రయించుకొనే మధ్యయుగంలోని రాయలసీమ భూస్వామిక వ్యవస్థ స్థిరపడింది. వాటి నుండి సంపదను సృష్టించుకుంది. నీటిమీద అధికారమున్న వాడే అధిక సంపన్నుడని భావించేవారు. అందుకే పాళేగాళ్ళ మధ్య సయోధ్య లేకపోయింది. వారి స్పర్ధలన్నీ, యుద్ధాలన్నీ నీళ్ళతోనే ప్రారంభమయ్యాయి. అందుకు రాయలసీమ కైఫీయత్తులు సజీవ సాక్ష్యాలు. ఈ చెఱువులే మధ్యయుగ రాజకీయ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేశాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో బంగారు, వజ్రవైఢూర్యాలు వీధుల్లో రాసులుగా పోసుకొని అమ్మేవారని ప్రతీతి. ఆ సంపద సృష్టికర్తలు సాంప్రదాయ నీటివనరులే. అందుకే పవిత్రమైన 'సప్త సంతానాల్లో' చెఱువు నిర్మాణం కూడా ఒకటి. అలాగని అ రోజుల్లో కరువులు లేవని కాదు. పన్నుల వ్యవస్థ కూడా తీవ్రంగా వుండేది. పన్నులు చెల్లించలేక ప్రజలు గ్రామాలను వదలి వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళిన ప్రజల్ని తిరిగి గ్రామానికి రప్పించిన సంఘటనలు కూడా వున్నాయి. అనంతపురము జిల్లా ఉరవకొండ సమీపంలోని చాబాల దగ్గర దొరికిన శాసనం ఒకటి ఈ విషయాన్ని చెప్పింది(3)  ఇది సదాశివరాయల కాలం నాటి సంఘటన, అలాంటిది మరొకటి కూడా వుంది(4).  32 గ్రామాలలోని పంచానం వారు (శిల్పులు, కమ్మర్లు, ఇత్తడి పనివారు, వడ్రంగులు, కంసాలులు) అనంతపురం జిల్లా కనగానపల్లి సమీపం నుండి కల్యాణదుర్గం ప్రాంతంలోని కుందుర్పి ప్రాంతానికి, చిత్తూరు జిల్లా పాకాల ప్రాంతానికి వలస పోయారు. అధిక పన్నులు చెల్లించలేక! పన్నులు తగ్గించి ఈ ప్రాంతానికి వారిని తిరిగి రప్పించారు. ఈ సంఘటనలు నాటి పన్నుల పీడనను తెలియజేస్తాయి. అయితే ఇలా వెనక్కు పిలిపించడం చాలా అరుదు.

నిచ్చెనమెట్ల వ్యవస్థలో బ్రాహ్మణులను అత్యున్నతమైన వర్గంగా, వర్ణంగా పరిగణించడం వేదకాలం నుండి వున్నదే! వారిని భూమి మీద నడిచే దేవతలుగా (భూసురులు) భావించే వారు (అటజని గాంచె భూసురుడు - మనుచరిత్ర) అందుకు రాయలసీమ కూడా మినహాయింపేమీ కాదు. అయితే ఈ వ్యవస్ధకు అపవాదంగా కొన్ని సంఘటనలు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. కొసినేపల్లి(5) వెంకట్రాజపురం(6) అర్కటవేముల(7) కైఫీయత్తులు బ్రాహ్మణుల్ని తీవ్రంగా ఎదిరించడాన్ని వివరిస్తున్నాయి. ఈ సామాజిక వ్యవస్థలో నడయాడిన వేమన, పోతులూరి వీరబ్రహ్మం బ్రాహ్మణ వ్యవస్థను వ్యతిరేకించడంలో ఆశ్చర్యమేమి లేదు. అందుకే భూస్వాములు బ్రాహ్మణ కవులతో సమానంగానే శూద్ర కవిపండితుల్ని ఆదరించారు. ఈ పరిణామం రాయలసీమలో ప్రారంభమై క్రమంగా మిగిలిన ఆంధ్రదేశమంతా వ్యాపించింది. నీటి వనరులు సృష్టించిన సంపదవల్ల పాలెగాళ్లు కూడా పద్యాన్ని, సేద్యాన్ని, ప్రోత్సహించారు.

దేశంలో దళితుల స్థితిగతుల గురించి ఆధునిక యుగం ప్రారంభం దాకా ఏ ఒక్క పాలకుడూ పట్టించుకోలేదు. కనీసం మనుషులుగా కూడా పరిగణించలేదు. మధ్యయుగ రాయలసీమ వ్యవస్థలో దీనికి కొంత విరుద్ధమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. చెఱువులు కాలువల పరిరక్షణలో వీరిపాత్ర ఎక్కువ. కైఫియత్తుల్లో వందల సందర్భాల్లో దళితుల ప్రస్తావన వుంది. మహాజనాలుగా పరిగణించే కుల పెద్దల్లో దళిత కులపెద్దలు కూడా వుండేవారు. వారికీ కొంత భూమిని ఇచ్చేవారు. మాదిగ, మాల, ఆదియాంధ్ర, గోసంగుల, యెడ్డగావి, అనకల, మాతంగి, తమ్ముల వంటి దళిత ఉపకులాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. మాదిగ పెద్దిని, మాలచిన్నడు అంటూ పేర్లు చెప్పడమే కాకుండా వారిని, వారి సంతతిని భూమికి హక్కుదార్లుగా ప్రకటించడం కూడా వుంది. మొత్తం మధ్యయుగ భారతీయ చరిత్రలోనే ఇది చాలా ప్రత్యేకమైన అంశం. ఈ సామాజిక వ్యవస్థ నుండి మాల దాసరి సరాసరి ఆముక్తమాల్యద కావ్యంలోకి ప్రవేశించాడు. అన్నమయ్య “మెండైన బ్రాహ్మణుడి మెట్టుభూమి ఒకటే చండాలుండేటి సరిభూమి ఒకటే” అనడానికి ప్రధాన కారణం ఇక్కడి సామాజిక వ్యవస్థే! ఇది వీరశైవ, విశిష్టాద్వైతాల ప్రభావం. అలాగని వారిలో పేదరికం, అంటరానితనమే లేదని కాదు. ఆ కాలంలో నామాల సింగడు, దివిటీల మల్లుడు, మన్నేటి వెంకట, వన్నూరమ్మ వంటి దోపిడీ దొంగలున్నారు. వీరి అనుచరులంతా యానాదులు, మాల, మాదిగ వంటి నిమ్న కులస్తులే! వీరిలో కొందరు భూస్వాముల్ని, ధనవంతుల్ని, వ్యాపారస్తుల్ని దోచి పేదల కడుపులు నింపేవారు. అటువంటివారు జానపదుల నాలుకల మీద ఇంకా జీవిస్తున్నారు.

5. మత పరిస్థితులు:

ఏ సమాజమైన తన అస్తిత్వాన్ని నిలబెట్టే సాహిత్యాన్నే అభివ్యక్తం చేస్తుంది. అది ప్రతి సమాజంలో జరిగే నిరంతర ప్రక్రియ. దీనికి సమాంతరంగా కూడా ఆ సమాజాన్ని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ మరొక సరికొత్త సమాజాన్ని ఏర్పాటు చేయాలనుకొనే వర్గం కూడా తనదైన సాంస్కృతిక అభివ్యక్తిని వ్యక్తం చేయడం కూడా సమాజలక్షణమే. తెలుగు ప్రబంధకవులు భూస్వామిక వ్యవస్థను కీర్తిస్తూ రచనలు చేశారు. అన్నమయ్య, ధూర్జటి వంటివారు రాజుల్ని, వర్ణవ్యవస్థను మాత్రమే విమర్శించారు. అంతకన్నా భిన్న సమాజాన్ని గురించి ఆలోచించలేదు. వారి తరువాత కొంతకాలానికి ఆలోచనాపరులైన వీరబ్రహ్మం, వేమన వంటివారు ప్రబంధ సాహిత్యానికి ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృష్టించారు. ఈ రెండు వర్గాలు ఒకే సామాజికవ్యవస్థలోనే జీవించారు. అయితే భిన్న దృక్పథాలను కలిగివున్నారు. “పరస్పరం సంఘర్షించిన శక్తుల నుండీ చరిత్ర పుట్టెను” అన్న శ్రీశ్రీ మాట ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే ఈ సాంస్కృతిక వ్యక్తీకరణలోని వైవిధ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రశ్నించే వర్గానికి పునాది వీరశైవ ఉద్యమం. వీరశైవ ఉద్యమం కన్నడ దేశానికి సరిహద్దు ప్రాంతమైన రాయలసీమ మీద తీవ్రంగా ప్రభావాన్ని చూపింది. అన్నమయ్య, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, పింగళిసూరన వంటి ప్రసిద్ధకవులంతా ప్రాథమికంగా శైవులు. అయితే వారి రచనలన్నీ వైష్ణవ సంబంధమైనవి. అల్లసాని పెద్దనకు చెందిన కోకటంలోని రెండు శాసనాలలో ‘రామానుజాయనమః’ అనేమాట వుంది. ఇవి శైవుల మీద, శైవసాహిత్యం మీద వైష్ణవాధికత్యను తెలియజేస్తాయి. తెనాలి రామలింగడు రామకృష్ణుడిగా మతాంతరీకరణ చెందాడనే వాదనను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే అనాటి సామాజికస్థితి స్పష్టంగా అవగతమవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా విశిష్టాద్వైతానికి మద్ధతుగా ఆముక్తమాల్యదను రాశాడు. అంతేగాక వీరశైవాన్ని వెఱ్ఱిశైవమని తీక్షణంగా విమర్శించాడు కూడా! ఇటువంటి సంఘటనలు శైవులకు అవమానంగా తోచాయి. అందుకే ధూర్జటి రాజస్థానం నుండీ బయటకు వచ్చి రాజుల్ని, రాజుల్ని ఆశ్రయించుకొనే బ్రతికే పండిత కవుల్ని తీవ్రంగా విమర్శించాడు. ఇది ఆనాటి సంఘర్షణాత్మకమైన సామాజిక పరిస్థితి.

తెలుగు గ్రామ నామాలలో ‘పాడు’ అనే మాట విస్తృతంగా కనిపిస్తుంది. ఉదా: పెద్దనపాడు, పెంచికలపాడు. సాధారణంగా గ్రామనామాల్లో ‘పాడు’ ప్రత్యయం ద్వితీయావయవంగా వుంటుంది. ఈ మాట పాడుబడిపోయి తిరిగి జరిగిన గ్రామ పునర్నిర్మాణాన్ని తెలియజేస్తుంది. వీరశైవ ఉద్యమ ఉధృతిలో జరిగిన జైనమతంపై జరిగిన విధ్వంసాన్ని ఇటువంటి గ్రామనామాలు సూచిస్తాయి.
ఆశ్చర్యమేమిటంటే 15, 16 శతాబ్దాలలో కూడా అక్కడక్కడ జైనమతస్థులు జీవించేవున్నారని అసంఖ్యాకమైన రాయలసీమ కైఫీయత్తులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయితే జైన బసదీలు మాత్రం అతిస్వల్పం. వీరశైవ కేంద్రాలుగా శ్రీశైలం, కూడల సంగమేశ్వరం వంటి క్షేత్రాలు దక్షిణ భారతదేశంలో విశేషంగా కనిపిస్తాయి. అయితే దక్షిణ భారతదేశంలో జైన క్షేత్రాలు చాలాచాలా తక్కువ. అందువల్ల జైనమతానికి మధ్యయుగంలో ప్రాతినిధ్య సాహిత్యమే తెలుగులో లేదు. పన్నెండవ శతాబ్దంలో సారసంగ్రహ గణితం వంటి శాస్త్ర గ్రంథాల్ని రాసిన జైనమతస్తులు పదనాల్గవ శతాబ్దం నుండీ ఆంధ్ర వాఙ్మయంలో కనిపించరు. ఈ కాలంలో వీరశైవ ప్రముఖులు మాత్రం విస్తృతంగా రాయలసీమ అంతటా కనిపిస్తారు. శైవంలో ప్రధానమైన ఒకశాఖ అయినటువంటి ‘అఘోరీ’ శాఖ కూడా రాయలసీమలో విశేషంగా ఆదరణ పొందింది. పుష్పగిరిలో అఘోరశివాచార్యులు అనే గురువు వుండేవాడు. ఇతనికి సంబంధించిన శాసనాధారాలు కూడా వున్నాయి(8).  ఇతనికి ప్రముఖ కవులు శిష్యులుగా కూడా ఉండేవారు. ఆయన శిష్యులమని గర్వంగా చెప్పుకున్నారు కూడా! కైఫీయత్తుల్లో కూడా అఘోరీల ప్రస్తావన ఎక్కువగా ఉంది. వైష్ణవానికి పాలకుల మద్ధతు, శ్రీరంగం తిరుపతి వంటి క్షేత్రాల అండ వుంది. అందువల్ల వీరశైవ ఉధృతిని ధీటుగా ఎదుర్కోగలిగింది. ఈ విధమైన మద్దతు జైనమతానికి లేనందువల్ల శాశ్వతంగా ఈ ప్రాంతం నుండీ అదృశ్యమైంది. పెనుగొండలోని జైన దేవాలయాలు, గ్రామనామాల్లోని ‘పాడు’ వంటి ప్రత్యాయాలు ఈ ప్రాంతంలోని ఒకనాటి జైనం వైనాన్ని గురించి నేటికీ సాక్ష్యమిస్తున్నాయి.

6. సాంస్కృతిక అభివ్యక్తి: 

అద్వైతం, వీరశైవం, విశిష్టాద్వైతం, జైనం వంటి భిన్న మత దర్శనాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నప్పటికీ భిన్నమైన సాంస్కృతిక వ్యక్తీకరణ జరగలేదు. ఇవి కుల, మతాలకు సంపూర్ణంగా మద్దతిస్తూ తమ ఉనికి చాటుకున్నాయి. వాటిని ఆలంబన చేసుకొనే ఈ మత దర్శనాల ఉత్తాన పతనాలు జరిగాయి. ఇవి కులానికి వ్యతిరేకంగా ఆవిర్భవించినప్పటికీ క్రమంగా కులానికి మద్దతుగానే మాట్లాడాయి. అందువల్లనే ఈ కాలంలో కులం, మతం ప్రధాన సామాజిక ఆయుధాలుగా పాలకులకు ఉపయోగపడ్డాయి. ఈమతాల యొక్క ఆదర్శాల మధ్య నిరంతరం వాదనలు, చర్చలు జరిగేవి. ఆముక్తమాల్యదలోని విష్ణుచిత్తుడు ఆ వాదనల నుండి జన్మించినవాడు. ఈ మతదర్శనాల తాత్వికతలు నిరంతరంగా సంఘర్షిస్తున్నప్పటికీ, సామాజిక ఆదర్శాలు మాత్రం ఒక్కటే! ఆనాటి సమాజంలోని మతదర్శనాల దృక్పథాలలోని ప్యూడల్ స్వభావమే ఈ కావ్యాలలో కూడా కనిపిస్తుంది. దక్షిణ భారతదేశమంతా ఒకేవిధమైన సామాజిక వ్యవస్థ నిర్మాణమవుతుంటే రాయలసీమలో మాత్రం పాలేగాళ్ళవ్యవస్థ ఆవిర్భవించింది. 1800 తర్వాత ఆంగ్ల ప్రభుత్వం ఆంధ్రదేశమంతా జమిందారీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే రాయలసీమలో మాత్రం రైత్వారీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సంఘర్షణాత్మక సామాజిక పరిణామల దాడికి ఆ మత దర్శనాలకు, ఆదర్శాలకు 17,18 శతాబ్దాల నాటికి కాలం చెల్లింది. అందుకే వేమన, పోతులూరి వీరబ్రహ్మం యాగంటి లక్ష్మయ్య వంటి కొత్తకవులు రాయలసీమలో 17వ శతాబ్దంనుండి కనిపిస్తారు. ఆనాటికి వీరు అతి పెద్ద తిరుగుబాటుకవులు. వేమనను పాలక వర్గం బట్టలు కూడా కట్టుకోనంతటి పిచ్చివాడిగా చిత్రించడంలో ఆశ్చర్యమేముంది. అది వారి అసహనం. వీరబ్రహ్మానికి కుటుంబం వుంది. ఆయనకు ఐదుగురు కొడుకులు, మనమరాలైన ఈశ్వరమ్మలు వీరబ్రహ్మం దారిలోనే నడిచారు. అందువల్ల ఆయనను పిచ్చివాడుగా చిత్రించే అవకాశమే లేదు. వేమనకు కుటుంబం లేదు. వారసత్వం అంతకన్నా లేదు. అందుకే పిచ్చివాన్ని చేశారు. 

ఈ తిరుగుబాటు కవులు తమదైన ఒక ప్రత్యేకమైన సాహిత్య ప్రక్రియను సృష్టించుకున్నారు. అది ‘తత్త్వము’. ఈ తత్త్వ ప్రక్రియ కూడా సంకీర్త ప్రక్రియ లాగా ఇది కూడా పాట! పల్లవి, చరణం అనే సాధారణ లక్షణాలున్నప్పటికీ వస్తురీత్యా సంకీర్తనకు భిన్నమైనది. తత్త్వం ఆత్మని, ఆత్మజ్ఞానాన్ని, గురూపదేశాన్ని ప్రధానంగా వ్యక్తీకరిస్తుంది. వేమన ఆటవెలదులలో విగ్రహారాధనను విమర్శించారు. వీరబ్రహ్మం తన తత్త్వాలలో, కాళికాంబ శతకంలో కూడా విగ్రహారాధనను వ్యతిరేకించాడు. ఈ తిరుగుబాటు కవులంతా దిగువ కులాలకు చెందినవారు. బ్రాహ్మణ కవులు వాడుకభాషలో సంకీర్తన ప్రక్రియను చేరదీస్తే, దానికి విరుద్ధంగా ఈ దిగువకులాల కవులు కూడా వాడుకభాషలోనే తత్త్వాన్ని సృష్టించుకున్నారు. తత్త్వ ఆవిర్భావానికి సంకీర్తనే స్ఫూర్తి. అయితే తత్త్వం అనతికాలంలోనే తన ప్రత్యేకతను చాటుకుంది. వీరిలో దిగువ కులాలకు చెందిన వారితో పాటు దూదేకుల వర్గానికి చెందిన వారు కూడా వున్నారు. వీరబ్రహ్మం శిష్యుడు సిద్ధప్ప దూదేకుల వర్గానికి చెందినవాడు. ఆయన రాసిన తత్త్వాలు కూడా జనాదరణ పొందాయి. అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోదగిన గ్రంథం ‘తారకామృతసారము’ రాయలసీమలో పుట్టిన ప్రసిద్ధ తత్త్వాల రచన. 19వ శతాబ్దం ప్రారంభం నుండి నేటికీ విశేషంగా జనాదరణ పొందుతోంది. ఇందులో ముగ్గురు తత్త్వ రచయితల తత్త్వాలున్నాయి. ఫీరుమొహిద్దీన్ దూదేకుల సామాజిక నేపథ్యం వున్నవాడు. మిగిలిన ఇద్దరూ వెనుకబడిన కులాలకు చెందినవారు. వీరి వారసులు తరువాత కాలంలో కోస్తా ప్రాంతానికి వలసపోయారు. వీరి తత్త్వాలు ప్రబంధాలకన్నా, సంకీర్తనలకన్నా అసాధారణమైన జనాదారణ నందుకున్నాయి. ప్రబంధాలు, సంకీర్తనలు పండిత కవులు సృష్టించి ప్రచారం చేసిన సాహిత్య ప్రక్రియలు. 

శ్రామిక శూద్ర కులాల సాహిత్య ఆవిష్కరణ తత్త్వాలు. ఇందుకు కారణం ముందు చెప్పుకున్న సామాజిక వైవిధ్యమే ప్రధానకారణం. అనేక సందర్భాలలో బ్రాహ్మణాధిక్యతను తీవ్రంగా తత్త్వకారులు ప్రతిఘటించారు. వీరబ్రహ్మం పుష్పగిరిలో బ్రాహ్మణుల మీద వాదనలో గెలిచాడు కూడా! ఈ సంఘటనతో పుష్పగిరి అగ్రహారం పునాదులే కదిలిపోయాయి. తొలికవి జంట నందిఘంట కవులు, మాదయ్యగారి మల్లన, నంది తిమ్మనలను అందించిన అగ్రహారం కాస్తా శాశ్వతంగా అదృశ్యమైపోయింది. కొసినేపల్లి, వెంకట్రాజపురం, అర్కటవేముల కైఫీయత్తులు ఇటువంటి పరిణామాలకు చారిత్రకంగా సాక్ష్యమిస్తున్నాయి. ఈ గ్రామాల్లో జరిగిన సంఘటనలకు తత్త్వకారులే సామాజికంగా తాత్త్వికపునాదిని కలిగించి వుండవచ్చు.

వేమన, ఈ తత్త్వకారులు సామాజిక కవులుగా కనిపిస్తున్నారు. కేవలం పాలకుల్ని తిట్టడం ద్వారా అన్నమయ్య, ధూర్జటి వంటి వారిని సామాజిక కవులుగా పరిగణించలేం. వారు కేవలం ఆస్థానేతర కవులు మాత్రమే!

ధర్మవరం పాలేగాడు పోచిరాజ నరసరాజు అయ్యలరాజు రామరాజును ఆదరించాడు. అనంతపురం, గుత్తి పాలేగాడు నాదిండ్ల అప్పయ్య మాదయ్యగారి మల్లనను చేరదీశాడు. అవుకు పాలేగాడు పింగళి సూరన, భట్టుమూర్తి వంటి వారికి చేయూత నిచ్చాడు. మట్లి అనంతరాజు, కట్టావరదరాజు వంటి పాలేగాళ్లు తమ భూస్వామిక వర్గానికి చెందిన ప్రాతినిధ్య సాహిత్యాన్నే ఆవిష్కరించారు. వీరి సాహిత్యమంతా వర్ణవ్యవస్థను సంపూర్ణంగా సమర్థిస్తూ, స్త్రీపురుష సమానత్వాన్ని వ్యతిరేకిస్తూ వుంటుంది. వీరంతా చెఱువులు, నదులు, కాలువల వలన లభిస్తున్న ఆధాయం ఆధారంగానే సాహిత్య సృజనను కొనసాగించారు. ఈ సాంప్రదాయ నీటివనరుల కేంద్రంగానే పాలేగాళ్లంతా పాలించారు. చెఱువు గట్టుమీద నిలబడి అధికారాన్ని చెలాయించారు. తూముల వద్ద తలభాగంలో పాలేగాళ్లను ఆశ్రయించుకొని జీవిస్తున్న సాంప్రదాయ పండిత కవులకు మాన్యాలుండేవి. దీనికి విభిన్నంగా చెఱువుల వల్ల సరిగా నీరు అందక, పొలాల్లో నిరంతరంగా శ్రమిస్తున్న శ్రామిక కులాల నుండి తత్త్వకారులు పుట్టుకొచ్చారు. తత్త్వకారులు వర్ణవ్యవస్థను వ్యతిరేకిస్తూ తత్త్వాలు రాశారు. దూదేకుల సిద్ధయ్య ‘ఏ కులమని నన్నివరములడిగితే ఏమని చెప్పుదు లోకులకు, పలుగాకులకు’ అని కులంమీద తన అసహనాన్ని తెలియజేశాడు. పొలాల్లో తమతో సమానంగా పనిచేస్తున్న స్త్రీలను చూస్తూ స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకున్నారు. వీరబ్రహ్మం మనుమరాలు ఈశ్వరమ్మ తాత మార్గంలోనే తత్త్వాలు రచించింది. వీరిలో కొందరు “చిల్లర రాళ్ళను మొక్కుతు వుంటే చిత్తము చెడురా ఒరే” అని విగ్రహారాధనను వ్యతిరేకించారు. ఇటువంటి వీరబ్రహ్మం, యాగంటి లక్ష్మయ్య హేతువాదులని నాస్తికులని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. అన్నమయ్య తరువాత ఒక్క పదకవి (సంకీర్తనాకారుడు) రాయలసీమలో లేడు. వున్న సారంగపాణి తత్వ దృక్పథంతోనే పదాలు రాయడం గమనార్హం. ఆయన రాయలసీమలో జీవించినప్పటికి, కార్వేటినగర జమీందారి పాలనలోని వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రామదాసు, త్యాగయ్య, క్షేత్రయ్యలు రాయలసీమలో కాకుండా బయటి ప్రాంతాల్లో వున్నారు. కానీ ఇక్కడ వేమన, వీరబ్రహ్మన, యాగంటి లక్ష్మన, తారాకామృత సార తత్వకారులు జీవించారు. ఈ వరసలో యోగినారాయణ చివరి తత్వకారుడు. యోగి నారాయణ జీవించిన సమయంలోనే రాయలసీమలో పాలేగాళ్ళ వ్యవస్థ సంపూర్ణంగా అదృశ్యమయ్యింది.

మధ్యయుగ ప్రారంభంలో ఆంధ్రదేశంలో రెడ్డిరాజులు, కమ్మకాకతీయులు, వెలమలు రాజులుగా అధికారాన్ని స్థాపించారు. మధ్యయుగ మధ్యభాగం నుండి రాయలసీమలో దిగువ కులాలైన బోయ, కురబ, పట్ర, ముతరాసి వంటి వెనుకబడిన కులాలు అధికారాన్ని చేజించుకున్నాయి. రాయలసీమ పాలేగాళ్లలో 80% వరకు దిగువ కులాలకు చెందిన వారే, తమ అధికారం స్థిరపరచుకోవడానికి సాంప్రదాయ నీటివనరుల మీద వీరు ఆధారపడ్డారు. నిరంతరం తగాదాలతో, యుద్ధాలతో బలహీనపడిపోయారు. దేశం బయటినుండి వచ్చిన బలమైన శత్రువైన క్రైస్తవం వీరిని చాలా సులభంగా ఓడించింది. ఒకనాడు వ్యవసాయోత్పత్తి కులాలైన కమ్మ, రెడ్డి, వెలమలు క్షత్రియులమని ప్రకటించుకోవడానికి బ్రాహ్మణ పండిత కవుల్ని చేరదీసినట్లే, వీరు కూడా బ్రాహ్మణ పండిత కవుల్ని ఆదరించారు. అగ్రవర్ణంగా, క్షత్రియులుగా ప్రకటించుకోవడానికి చాలా తాపత్రయ పడ్డారు. పాలేగాళ్లు, కవులూ అయిన కట్టా వరదరాజులు, మట్లి అనంతరాజు క్షత్రియులమని ప్రకటించుకున్నారు కూడా. వీరు బ్రాహ్మణులచుట్టూ, చెఱువుల చుట్టూ తిరుగుతుంటే, తత్త్వకారులు ప్రజల చుట్టూ తిరిగారు. ప్రజల్లో కలిసిపోయారు. అందుకే వేమనను క్రైస్తవులైన ఆంగ్లేయులు నెత్తిన పెట్టుకున్నారు. కారణం తమ మత ప్రచారానికి ఈ తత్త్వకారులు చాలా ఉపయోగపడతారని వారు నమ్మడమే. కానీ మతాన్ని, కులాన్ని వ్యతిరేకిస్తున్న వీరు మరో మతంలోకి ఎలా చేరతారు? పాలేగాళ్ళ వ్యవస్థను తెల్లవాళ్లు అణచివేయడంతో, వారి ప్రత్యర్థులైన తత్త్వకారుల అవసరం రాయలసీమ సమాజానికి కూడా లేకపోయింది. క్రీ.శ. 1800 తరువాత చెప్పుకోదగ్గ ఒక్క తత్వకారుడు ఈ ప్రాంతంలో లేడు. ఆశ్చర్యం ఏమిటంటే సాహితీ చరిత్రకారులు 17, 18 శతాబ్దాలలోని తెలుగు సాహిత్యాన్ని క్షీణయుగంగా ప్రకటిస్తారు. కానీ అది వాస్తవం కాదు. కేవలం పండిత కవిత్వానికి మాత్రమే క్షీణయుగం. రాయలసీమలో శ్రామిక దిగువకులాలకు చెందిన తత్వకారులు సరికొత్త సాహిత్య వస్తువుతో ఈ కాలాన్ని కాంతివంతం చేశారు. నిమ్న వర్గాల సాంస్కృతిక అభివ్యక్తికి ప్రతినిధులుగా నిలబడ్డారు. మనమిప్పుడు చెప్పుకుంటున్న ప్రత్యామ్నాయ సాహిత్యానికి పునాది వేసింది వీళ్ళే! తొలి ప్రతినిధులూ వీళ్ళే.

పాలేగాళ్ల వ్యవస్థ అంతరించినప్పటికీ వారిని సమర్థించిన భూస్వామ్య సాహిత్యం మాత్రం అంతరించలేదు. కానీ వారిని ఎదిరించిన తత్త్వకారుల అవసరం సమాజానికి లేకపోయింది. ఎందుకంటే పాలేగాళ్ల పాలన స్థానంలో ఈస్ట్ఇండియా కంపెనీ పాలన వచ్చింది. బ్రిటీష్ వారికి పాలనలో బ్రాహ్మణ పండిత వర్గాలు సహాయం చేయడం వల్ల వారి భూస్వామిక సాహిత్యం కూడా ఆ తరువాత చాలా కాలం పాటు కొనసాగింది. ఆశ్చర్యమేమిటంటే పాలేగాళ్లు వారి ప్రత్యర్థులైన తత్త్వకారులు వెనుకబడిన కులాలకు చెందినవారే. కానీ రెడ్లు, కమ్మలు ఆర్థికంగా స్థిరపడినట్లు పాలేగాళ్లు స్థిరపడలేదు. థామస్ మన్రో వీరిని అణచివేయడానికన్నా ముందే తమలో తాము నిరంతరం యుద్ధాల వల్ల బలహీనపడిపోయారు. ఆంగ్లేయులు ప్రణాళిక బద్ధంగా రాయలసీమలోని సాంప్రదాయ నీటివనరుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం వహించారు. ఈ నీటివనరుల్ని ఆశ్రయించుకొని పాలేగాళ్లు తిరిగి పునరుత్తేజితమైతే ఆంగ్లేయుల ఉనికికే ప్రమాదం కాబట్టి! మన్రో పాలేగాళ్ళను అణచివేస్తున్న సమయంలోనే బ్రౌన్ వేమనను నెత్తిన పెట్టుకోవడం ఈ ప్రణాళికలో భాగమే. బ్రౌన్ పండిత సాహిత్యాన్ని సేకరించడం కూడా ఈ ప్రణాళికలో భాగమే. అయితే సాంప్రదాయ నీటివనరుల పట్ల ఆంగ్లేయులు చూపిన నిర్లక్ష్యం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా దారుణ వెనుకబాటుకు గురైంది.

7. ముగింపు:

  1. పాలెగాళ్లు నిరంతరం తమలో తాము తగువులాడుకుంటూ అస్థగతను సృష్టించారు. వారి కాలానికి సంబంధించిన వివరాలను శాసనాలకన్నా కైఫియత్తులు ఎక్కువగా తెలియజేస్తున్నాయి. పాలెగాళ్లలో అత్యధికులు దిగువ కులాలకు చెందినవారు. వీరు క్షత్రియులుగా ఎదగడానికి తీవ్రంగా ప్రయత్నించారు. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత కనీసం ఒకటిన్నర శతాబ్దంపాటు రాయలసీమను పాలించారు. నీటి వనరులే పాలెగాళ్ళ వ్యవస్థ ఏర్పడటానికి ప్రధాన కారణం. నీటి వనరుల పరిరక్షణకు దళితకులాల్ని కూడా పాలెగాళ్లు ఉపయోగించుకున్నారు. గ్రామ పరిరక్షణలో వెనుకబడిన కులాల సహాయం తీసుకున్నారు. 
  2. 17, 18 శతాబ్దాల రాయలసీమ సాహిత్యం దిగువకులాల తిరుగుబాటును ప్రతిబింబిస్తుంది. ప్రబంధ, సంకీర్తన ప్రక్రియలకు ప్రత్యర్థిగా తత్త్వప్రక్రియ ఆవిర్భవించింది. పండితకవుల సాహిత్యం కన్నా వాడుకభాషలో రాసిన వీరి కవిత్వానికి సామాన్య ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తత్త్వం దిగువ కులాల సాంస్కృతిక అభివ్యక్తి. పాలేగాళ్ళకు పండిత కవులకు వారిని ఎదిరించిన తత్త్వకారులకు నీటివనరులే ఆధారం కావడం యాదృశ్చికమేమి కాదు. నీళ్లే నాగరికత, నీళ్లు కళల పరిమళం, నీళ్లే సంపద, నీళ్ళే సంస్కృతి.

8. పాదసూచికలు:

  1. తెలుగుభాషా చరిత్ర, పుట. 415
  2. తెలుగుభాషా చరిత్ర, పుటలు 134-135. 
  3. The inscriptions of Vijayanagara Rurals in Ananthapur District, page. 74.
  4. The inscriptions of Vijayanagara Rurals in Ananthapur District, page.100.
  5. The Inscriptions of Andhra Pradesh, Kadapa District-II, pages 68, 168.
  6. మెకంజి కైపియత్తులు వైయస్సార్ జిల్లా ఏడవ భాగం, పుట. 329
  7. మెకంజి కైపీయత్తులు కడప జిల్లా నాలుగో భాగం, పుట. 211
  8. మెకంజి కైపియత్తులు కడప జిల్లా మూడో భాగం, పుట. 93

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆరుద్ర, సమగ్ర ఆంధ్రసాహిత్యం 2,3 సంపుటాలు, తెలుగు అకాడమి, 2012.
  2. నాగయ్య, జి. తెలుగు సాహిత్యసమీక్ష (రెండవ సంపుటం), నవ్యపరిశోధకప్రచురణలు, హైదరాబాద్, 2011. 
  3. నాగయ్య, జి. దాక్షిణత్య సాహిత్యసమీక్ష (ప్రథమ సంపుటం), ఫ్రీడమ్ ప్రెస్, మద్రాసు-9, 1976.
  4. నారాయణస్వామి, బండి. రాయలసీమ సమాజం-సాహిత్యం, పర్ స్పెక్టివ్, హైదరాబాద్,2019.
  5. ప్రతాపరెడ్డి, సురవరం. ఆంధ్రుల సాంఘికచరిత్ర, సాహిత్యవైజయంతీప్రచురణ, హైదరాబాద్ 1950.
  6. బలరామమూర్తి, ఏటుకూరి. ఆంధ్రుల సంక్షిప్తచరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1989. 
  7. బాష, ఎస్.ఎం. అనంతపురం సాంప్రదాయ నీటివనరులు, కదలిక ప్రచురణలు, అనంతపురం 2004.
  8. రాయల ప్రపంచ అట్లాసు రాయల ఏజెన్సీస్'17. సుంకు రామచెట్టి వీధి, చెన్నై, 2001.
  9. శ్రీనివాసులు, అంకే. అనంతపురం సాహిత్యం-కరువు, డాక్టరేట్ సిద్ధాంతగ్రంథం, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం, 2011 (అముద్రితం).
  10. సత్యనారాయణ, కంబంపాటి. ఆంధ్రుల సంస్కృతి చరిత్ర, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2020. 
  11. హనుమంతరావు, బి.యస్.యల్. ఆంధ్రుల చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]