headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

6. ఆధునిక సాహితీ ప్రక్రియలలో “గిరిజన” ప్రస్తావన

ఆచార్య ఎం. గోనానాయక్

ఆచార్యులు, తెలుగుశాఖ,
యూనివర్సిటి ఆఫ్‌ హైదరాబాద్‌,
హైదరాబాద్, తెలంగాణ
సెల్: +91 9849093300, Email: gonanaikou@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ప్రస్తుతం గిరిజన రచయితలు కూడా తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ తెలుగు భాషకు సేవ చేస్తున్నారు. తద్వారా లిపిలేని గిరిజన భాషలోని సాహిత్యాన్ని, వారి జీవన విధానాలను, వారి సంస్కృతి సాంప్రదాయాలను వెలికితీస్తున్నారు. మరుగున పడిన వారి జీవితాలను రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తెలుగు సాహిత్యంలో వచ్చిన వాదాల మాదిరిగానే గిరిజన గళాన్ని సమాజానికి వినిపించడానికి తమవంతుగా రచనల ద్వారా కృషిచేస్తున్నారు. వారి అస్తిత్వాన్ని ఆవిష్కరించడమే ఈ వ్యాసం ప్రధానోద్దేశం. ఈ వ్యాస విషయ సేకరణను వివరణాత్మకమైన పద్ధతిలో వ్రాసాను. రచనలను విశ్లేషించాను. విషయసామగ్రిసేకరణలో గిరిజన రచయితల పుస్తకాలు సేకరించి, వారిని మౌఖికంగా వారి నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. విషయ సేకరణలో కథలు, కవితలు, పదాలు మొదలగునవి నా దృష్టికి వచ్చాయి. తెలుగు సాహిత్యంలో వారి కృషిని వివరణాత్మకంగా చెప్పాను. ఈ విధంగా ఈ పరిశోధనలో రచనలు ఉదహరించండం జరిగింది. ఈ వ్యాసం ద్వారా మరుగున పడిన గిరిజన సాహిత్యాన్ని వెలుగులోకి తేవడం, గిరిజన రచయితలు తెలుగు సాహిత్యం ద్వారా గిరిజన వాదాన్ని బలపరుస్తున్నారని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయ స్థాయిలో గిరిజన సాహిత్యాన్ని పాఠ్యాంశంగా బోధించడం దీనికి ఒక నిదర్శనం. ఈ విధంగా గిరిజన సాహిత్యం వెలుగులోకి వస్తుందని ఆశిస్తున్నాను.

Keywords: ఆధునికసాహిత్యం, ప్రక్రియలు, గిరిజన సాహిత్యం, విశ్లేషణ, పరిశీలన

1. పరిచయం:

జీవితం ఎంత పరిణామాత్మకమైనదో సాహిత్యం కూడా అంతే పరిణామాత్మకమైనది. తెలుగు సాహిత్యం అనేక రూపాలను సంతరించుకుంటు దేశ, కాల పరిస్థితులను బట్టి సమాజహితానికి అక్షర మార్గదర్శనం  చేస్తుంది. తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం వచ్చిన తర్వాత ఛందోబందోబస్తులు లేకుండా సరళంగా, సహజంగా సామాన్యుడి భావవ్యక్తీకరణకు సాహిత్యం దోహదపడిరది. కాలంతో పాటే కొత్త రూపాలను సంతరించుకున్న తెలుగు సాహిత్యంలో అభ్యుదయ, దిగంబర, విప్లవ, స్త్రీవాద, దళితవాద కవితా ఉద్యమాలు వచ్చినంత త్వరగా గిరిజన సాహిత్యం రాలేకపోయింది. దీనికి గల కారణం గిరిజనులలో అక్షరజ్ఞానం లేకపోవటం. గిరిజనుల జీవితాలను, వారి సంస్కృతి, సాంప్రదాయాలను వివిధ కవులు, రచయితలు తమ రచనలలో వివరించినప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో గిరిజన సాహిత్యం తెలుగు సాహిత్యంలో స్థిరపడలేదనేది వాస్తవమైన విషయం.

గిరిజనులలో ప్రత్యేక ‘తెగ’లుండటం, ఆ తెగలకు ప్రత్యేక భాష ఉండటం వలన విద్యలోకి ప్రవేశించటానికి వీరికి చాలా సమయం పట్టింది. తమది కాని భాషలో మాట్లాడటం, రాయటం జ్ఞానసముపార్జనకు అనేక పరిమితులను విధించినట్లయింది. అయినా ఈ పరిమితులన్నీంటిని దాటుకొని పరిమిత సంఖ్యలో మొదటితరం విద్యను అందుకుంది. ఫలితంగా సృజనాత్మక రంగంపై ఆసక్తి పెరిగి సాహిత్యం, కళారంగాలపై దృష్టిపెట్టారు. తమ జీవిత మూలాలను సాహిత్యంగా మార్చటానికి ప్రయత్నిస్తునారు. ఇప్పుడు సాహిత్యంలో వీరు తమ సొంత గొంతుకలను వినిపిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో గిరిజన జీవితాలపై వారి సంస్కృతి, సాంప్రదాయాలపై గిరిజనులు, గిరిజనేతరులైన కవులు, రచయితలు కథ, నవల, కవిత్వం వంటి అనేక రచనలను వెలువచరించారు, వెలువరిస్తున్నారు కూడా.

2. తెలుగు సాహిత్యంలో గిరిజనులు:

తెలుగు సాహిత్య ప్రక్రియలో కథకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులో తొలి కథగా 1910లో గురజాడవారు రచించిన ‘‘దిద్దుబాటు’’ను చెప్పవచ్చు. అయితే కొద్దిమంది విమర్శకులు అచంట వెంకట శాఖ్యయనశర్మగారి ‘లలిత’ బండారు అచ్చమాంబగారి ‘స్త్రీవిద్య’ అనే కథలను కూడా తొలి కథానికలుగా పేర్కొంటారు. కానీ కథానిక లక్షణాలు సంపూర్ణంగా కలిగిన మొదటి కథానికంగా దిద్దుబాటుని ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు.

2.1 కథలు - గిరిజనుల ప్రస్తావన: 

గిరిజన విషయాల కొస్తే గిరిజనుల గురించి, సంచారజాతుల గురించి మొట్టమొదట కథ రాసినది ‘‘చింతాదీక్షితులు’’ ఈయన సుగాలి కుటుంబం (1920), చెంచుదంపతులు(1922), చెంచురాణి (1925) ఈ మూడు కథలను గిరిజన జీవితాల నేపథ్యంగా రాశారు. ‘సుగాలి కుటుంబం’ కథను చూస్తే దీనిని కథ అనడం కన్నా ఒకజాతి జీవన విధానంగా తెలియజేశారు అనుకోవటం సబబు. కథ రచయిత ఈ కథ రాసిన కాలానికి సుగాలిల పరిస్థితులు తెలియుజేస్తున్నా ఈనాటికి వారి జీవన వ్యవస్థలో చెప్పుకొదగ్గ మార్పులు చోటు చేసుకోలేదు.

2.2 కథాసాహిత్యంలో గిరిజనుల పాత్ర:

అస్వతంత్ర భారతంలోగాని, స్వతంత్ర భారతంలోగాని సుగాలిల బ్రతుకులు సుడిగాలిలో అల్లాడే దీపాల్లా కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ కథ విషయానికొస్తే ఈ కథ సుగాలిల జీవన విధానాన్ని తెలియజేస్తున్న ఇందులో ఆకలి ప్రధాన వస్తువుగా వివరించబడిరది. ఆ కుటుంబానికి ఆకలి పెద్ద శాపం.

అలాగే ‘చెంచురాణి’ కథలో కూడ గిరిజన సంస్కృతిని, ఆచారాలను, కట్టుబాట్లకు వివరిస్తుంది. కాలం ఏదైనా ఏ జాతివాడైనా, ఏ దేశస్థుడైనా ఆడదాన్ని అమ్మని చేసి పోవటం అలవాటైన పురుషాధిక్య సమాజం అలనాటి దుష్యంతుని నుండి కథ కాలం నాటి కథలోని ఆంగ్లేయాధికారి దాకా ఒక్కటి బుద్ది. ఆడదాని మనసు కంటే శరీరానికి విలువనిస్తారు. నాటి ఆంగ్లదొరలు గిరిజన స్త్రీలతో సుఖం పొంది వెళ్ళిపోయేవారు అలా మోసపోయిన స్త్రీలను అడవుల్లోని ఆదిమజాతి సముహాలు చేరదీసేవి. అదేస్థితి ఈ కథలో చెంచురాణి అని పిలువబడే ‘‘లచ్చి’’కి జరిగింది. అదే కథాసూత్రంగా తీసుకొని దీక్షితులుగారు ఈ కథను మలిచారు.

చెంచు దంపతులు’ కథ కూడా గిరిజనుల నిర్మల జీవన సరళిని, ప్రేమను తెలియజేస్తుంది. ఈరమ్మ, లింగయ్యలు ఈ కథలో నాయిక నాయకులు. వీరి ప్రేమబడి నుండి ప్రారంభమై వయసుతోపాటు ఎదిగి వర్ధిల్లింది. ప్రేమ ఫలించి పెళ్ళియింది. నిజానికి సంసారిక బంధం అనేది విశ్వాసం అనే పునాది పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ కథలో లింగడు ఈ రమ్మను అడవిలో చెంచువాడి పక్కన చూసి అనుమానం పెంచుకుంటారు. అతని అంతరంగంలో పుట్టిన ఈ అనుమానం చివరికి ఇద్దరి మరణానికి దారితీస్తుంది.

సమ్మేట ఉమాదేవి కూడ గిరిజన జీవితాలను తన రచన ‘రేలపూలు’ కథలలో వివరించారు. ఇందులో ఒకొక్క కథ వేటికవే ప్రత్యేకమైనవి వీరు రచించిన కథలలో ఎక్కువగా స్త్రీమూర్తులే కథానాయికలు. స్వాభిమానం, అత్మనిర్భరత, మంచి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ పాత్రలను చిత్రికరించి సమాజంలో స్త్రీలను చైతన్య పరిచే విధంగా రచనలు చేశారు. ఈ ‘‘రేలపూలు’’ తండావాసుల కథలలో వారి జీవితాలను హృద్యంగా వివరించారు.

ఇలా చెప్పుకుంటు పోతే గిరిజనుల జీవితాలు, సంస్కృతి సాంప్రదాయాలపై గిరిజనులు, గిరిజనేతరులైన కవులు కూడా కథలను రచించారు. వారిలో అట్టాడ అప్పల్నాయుడు - పోడుపోరు, గంటేడ గౌరు నాయుడు- ఏటిపాట, బోయ జంగయ్య - అడవిపూలు, మల్లాపురం జగదీశ్‌ -శిలకొల, గురి. జీవన్‌-ఇప్పపూలు, ఫణికుమార్‌ - గోదావరి కథలు, విద్యాసాగర్‌ - భద్రాచలం మన్యెం కథలు, వాడ్రేవు వీరలక్ష్మి - కొండఫలం, బి.ఎస్‌. రాములు - అడవిలో వెన్నెల, సువర్ణముఖి - సువర్ణముఖి కథలు, గొరపిట్ట, భూషణం - కొత్తగాలి, కొండగాలి కొన్ని కథలువంటి కథలను, కథాసంపుటాలను వివరించారు. ఇవన్నీ గిరిజనుల జీవిత పార్శాలను పట్టి చూపేవి.

2.3 నవలలు - గిరిజనప్రస్తావన:

గిరిజన నవలల విషయానికొస్తే నరహరిగోపాల కృష్ణమశెట్టి రచించిన శ్రీరంగరాజ చరిత్ర దీనికి మరో పేరు సోనాబాయి పరిణయం. దీనిలో గిరిజన జీవితాన్ని వివరించారు. అలాగే చిన్నప్ప భారతి రచించిన ‘‘సంఘం’’ నవలలో ప్రభుత్వాల మోసాలు, రాజకీయనాయకుల అబద్దపు వాగ్దానాలు పోలీస్‌, ఫారెస్ట్‌ అధికారుల దౌర్జన్యం, వడ్డీ వ్యాపారులు గిరిజనులను పట్టి పిడిరచే దుస్థితిని ఇందులో కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.

వీటితో పాటు కొర్రపాటి గంగాధరరావు - లంబాడోళ్ళ రామదాసు, సాహు, అల్లం రాజయ్య - కొమురం భీము, కేశవరెడ్డి - అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, వసంత్‌రావ్‌దేశ్‌ పాండే - అడవి, ఊరు, సాధన - సరిహద్దు, రాగో, అట్టాడ అపల్నాయుడు - పునరావాసం, పులుడు శ్రీనివాస్‌ - అడవి తల్లి, అరుణ - ఎల్లి వంటి నవలలు గిరిజన జీవితాలను చాలా కూలంకషంగా వివరిస్తాయి.

3. ఆధునికకవిత్వంలో గిరిజనులు:

కవిత్వపరంగా చూస్తే, పద్యాల్ని, మాత్ర ఛందస్సుల్ని నిరసిస్తు, ఆధునికాంధ్ర సాహిత్యంలో వచ్చిన కవిత్వ ఉద్యమమే వచన కవితోద్యమం. కాలంతో పాటే కొత్త రూపాలను సంతరించుకున్న తెలుగు సాహిత్యంలో కథ, నవల, నాటిక, నాటకం, మీని కవిత, గేయం, గజల్స్‌, రూబాయిలు వంటి ఇలా ఎన్నో కవితా రూపాలు వచన కవిత్వానికి ఆలంభన అయ్యాయి.

అభ్యుదయ, విప్లవ, స్త్రీవాదం, దళితవాదం వంటి కవితా ఉద్యమాలు వచన కవితను ప్రధాన వాహికగా చేసుకోని వచన కవిత విస్తృతవ్యాప్తికి తోడ్పడ్డాయి. అందుకే చాలా మంది వచన కవిత్వంను ప్రజాస్వామ్యయుగ కవితా వాహికగా పేర్కొన్నారు. ‘వచన కవితా పితామహుడు’ కుందుర్తి కూడా పద్యకవిత్వం ప్రజలకు, కవులకు  మధ్య ఇనుపతెర లాంటిది అంటూ-

              పాతకాలం పద్యమైతే
        వర్తమానం వచనగేయం (నాలోని నాదాలు-10) గర్వంగా వచనకవిత్వాన్ని ఎలుగెత్తి చాట్టాడు. ఈ వచన కవిత్వాన్ని ఆలంబనగా చేసుకొని గిరిజన సమాజం నుండి ఎదిగిన మొదటితరం కవులు తమ సమాజం గురించి తమ అస్థిత్వాలను తెలిపే విధంగా రచనలు చేశారు, చేస్తున్నారు. మొదటితరం గిరిజన విద్యావంతులు తమ అస్థిత్వంకోసం వారి చరిత్రను, సంస్కృతి, సాంప్రదాయాలను జీవన విధానాలను తమ రచనలలో ప్రతిఫలింప చేస్తున్నారు.

4. వివిధకవితాసంకలనాలు- గిరిజన రచయితలు:

‘‘నా కవిత్వంలో నేను దొరుకుతాను’’ అనే ఖండికలో తిలక్‌ “ప్రతి కవిత్వమూ కవి తన మీద తాను రాసుకున్నదే. ఓ విధంగా ఎందుకంటే కవిత్వం అల్టిమేట్‌గా సబ్జెక్టివ్‌ కదా!’’ అంటాడు. పాఠకునికి కవి తన కవిత్వం ద్వారా పూర్తిగా అర్థం కావాలి. అప్పుడే ఆ కవిత్వానికి సరైన సార్థకత ఉంటుంది.

4.1 బతుకు:

ఈ విషయంలో ఆచార్య గోనానాయక్‌ రచించిన ‘‘బతుకు’’ (దీర్ఘకవిత) ముందుంటుంది. అతని జీవితమే ఈ కావ్యం. దానికి  ‘బతుకుగీత’ పేరుతో ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ - “ఈవాళ భారతీయ సాహిత్యంలో ఆదివాసి లేదా గిరిజన కంఠాలు కొత్త ప్రతిభాస్వరాలు వినిపిస్తున్నాయి. తెలుగులో తొలి గిరిజన కవి ఎవరు? అని ప్రశ్నించుకుంటే ఎవరిని తెల్చాలో తెలియదు. వర్తమాన బహుజన నేపథ్యంలో వడపోతలు మొదలయ్యాకా అసలు అస్తిత్వాలు బయటపడుతున్నాయి. అణగిమణిగిన అక్షరాలు కలాల, కులాల కలుగుల్లోంచి బయటికి వచ్చి అక్షరాల ఆత్మాభిమానాన్ని చాటుతున్నాయి”. అన్నారు.

"ఇదిగో ఇప్పుడో కథానాయకుడు తన సుదీర్ఘ జీవన నేపథ్యాన్ని ‘‘బతుకు’’ అద్దంలో మనకు కళ్ళారా చూపిస్తున్నాడు. ఇది మాములు చరిత్రకాదు. కొన్ని తరాల ఆక్రోశం, అక్షరావేశాన్ని ఆవహించుకుని రూపుదిద్దుకుంది. బంజార బతుకు అభినివేశం ఆకలి అక్షరాల అగ్నికోసం ఇది మనకోసం సమస్త సుగాలీల చరిత్ర కోసం లక్షలాది బంజారాల పక్షాన పూరించిన పాంచజన్యం. ఈ దీర్ఘకావ్యంలో ఒక్క గోనా నాయక్‌ కథా నాయకుడు కాదు. కోటాను కోట్ల గోనానాయకుల విజయగాథ. అక్షరాల బాధ, బంజారా సాహిత్యంలోంచి పుట్టిన తొలి దీర్ఘకవిత ‘బతుకు’ కావ్యమంతా ఒక చలన చిత్రంలో మన కళ్ళముందు కదలాడుతుంది. ఈ కావ్య వస్తువు నిండా వ్యక్తులే ఉంటారు. గోనా నాయక్‌ సాఫల్య జీవితం వెనుక వాళ్ళ త్యాగాలుంటాయి. ఈ ‘బతుకు’ కావ్యం ఆత్మకథనాత్మక ప్రక్రియ. యండమూరి చెప్పినట్లు ‘విజయానికి ఐదు మెట్లు’ కాదు. గోనానాయక్‌ వంటి విజేత కొన్ని వేల మెట్లు ఎక్కి ఆచార్యుడిగా, కవిగా ఈ స్థాయికి రాగలిగారు. అతని జీవితమే ఈ కావ్యం. ఈ తరం బంజారాలకు ఒక కొత్త భరోసా ఇచ్చి తన ‘బతుకు’ బాటలో నడిపించే నాయకత్వం ‘‘బతుకు’’ కవితాతత్త్వం" అని వివరిస్తారు.

బతుకు దీర్ఘకవితలో ఎన్నో మలుపులున్నాయి. ‘గంప మాలయ్య కొండ జాతర’ అనే కవితలో-

పగలు పరిసరాలు
రాత్రి అక్షరాలు
నాకు ఆప్తులయ్యాయి
చెప్పులు లేని కాళ్ళు
చెమర్చే కళ్ళు కడుపులో ఆకళ్ళు
నా శరీరంపై మనసుపై
ప్రభావం చూపిన ఆ క్షణాలు
మరువలేని జ్ఞాపకాలయ్యాయి (పుట, ౩౩)

-`అంటు తన బాల్యపు అనుభూతుల్ని అక్షరిస్తాడు కవి. శ్రీశ్రీ ‘‘వడ్డించిన విస్తరి కాదు మా జీవితం’’ అన్నట్టు జీవితంలో ఢక్కామొక్కీలు తిని వచ్చిన జీవితానుభవాలు ఈ ‘బతుకు’ గమనంలో కనిపిస్తాయి.

భవ్యమూర్తి భావ్యా నాయక్‌ (నాయన) కవితలో-

మా నాయన ధన్యజీవి
మా తాత నుండి సంస్కారం
మా అవ్వ నుండి పరోపకారం
పుణికిపుచ్చుకున్న ధీరుడు
ఇంటి కోసం మా కోసం
పొట్ట చేత పట్టుకొని
నిరంతరం శ్రమించిన శ్రామికుడు
సర్వేజన ప్రేమికుడు (పుట, 46)

-అంటు ఈ కవితలో తన తండ్రీని గుర్తుచేసుకుంటాడు.

ఈ బతుకు దీర్ఘకవితలో మట్టిని, పుట్టను, పారుతున్న నీరును, పంట పొలాలను, కొండను, గొర్రెను ప్రకృతిని వివరిస్తాడు. పంట పొలాన్ని నమ్ముకున్న శ్రామిక జీవనంలోంచి వికసించిన ఈ ‘బతుకు’ కావ్యం నిండా మూలాల అన్వేషణ కన్నీటితడి, మమతల పరిమళం, కృతజ్ఞతల పర్వం కనిపిస్తుంది. ఈ కవిత్వం నిండా ఆయన జీవితం తోటికిసలాడుతుంది. వారి కళాత్మక జీవితాన్ని కవిత్వం చేస్తునే జీవితంలో ఎదుర్కొన్న కష్టసుఖాలను సున్నితంగా వ్యక్తం చేశారు.

అడవి నుండి హైదరాబాదు ‘సెంట్రల్‌ యూనివర్సీటి’ దాకా తన జీవితపు సజీవ దృశ్యాన్ని ఈ ‘బతుకు’ దీర్ఘకవితలో ఆవిష్కరించారు.

4.2 బంజార రచయిత్రి డా. సూర్యధనంజయ్‌ ‘బంజార నానీలు’లో-

బంజారాలంటే వన చరులే
అందుకే వారి మాటల్లో
అడవి పరిమళం (పుట, 34)- అంటారు.

‘అడవి పక్షి అలాపన’ కవితలో డా. జి. వెంకట్‌లాల్‌

మాకొ అడవినియ్యండి
మీ అధికార దురహంకారానికి
అనామకులై ఆదివాసీలా
అడవే ఆదెరువుగా
బతుకు భారం మోసేటోళ్ళం (పుట, 55)

-అంటు పొలవరం ప్రాజెక్ట్‌ ముంపుకు గురైన నిర్వాసితులను గురించి ఆవేదన చెందుతాడు.

4.3 ఆదివాసి కవి మిత్రులు కొలాం తెగకు చెందిన ఆత్రం మోతిరాం తన ‘దండారి’ కవితా పుస్తకంలో-

ఆడవి తల్లి బిడ్డలమే
మనుగడకై సమరమే
అవని ఎదపై అల్లిన
అందమైన తీగలం (పుట,49)

-అంటు తమ చుట్టు పరుచుకొని వున్న అడవికి తమకు ఉన్న అనుబంధాన్ని, అడవి యొక్క అందాన్ని వర్ణిస్తాడు. అలాగే అడవిపై అల్లుకున్న అందమైన తీగలమని ప్రకృతితో మమేకం అవుతాడు.

4.4 బంజార మొగ్గలు:

ఖేతావత్‌ సైదులు ‘బంజార మొగ్గలు’ అనే కవిత్వాన్ని రచించారు. తెలుగు సాహిత్యంలో నానీలు, రెక్కలు, ముక్తకాలు వంటి నూతన పక్రియలు వచ్చినట్లుగానే రచయిత డా. భీంపల్లి శ్రీకాంత్‌ కలం నుండి పురుడు బొసుకున్న నూతనప్రక్రియ ‘‘మొగ్గలు’’. ఇది మూడు పాదాల సరళమైన లఘుకవిత్వం. ఈ ‘బంజార మొగ్గలు’లో సైదులు తన బంజార చరిత్రను ఆవిష్కరించాడు. అలాగే ‘‘రప్డ’’ కవిత్వంలో-

నింగిన పూచిన ఇంద్రధనస్సు
గోర్‌ పరివార్‌తో చెలిమి చేసి
యాడి కాళీ టుక్రి, ఫేటియాకి
రంగులై వెలిశాయి (పుట, 65)

-అంటు బంజారాలకు మాత్రమే ప్రత్యేకమైన వేషాధారణ, వస్త్రాలంకరణ విధానాన్ని వివరించారు. అలాగే

‘ఓ జీవి ఏది నీది’ కవితలో-

నాది నాదని పరితపించే
ఓ ఒంటరి జీవి ఏది నీది?
ఓడిన దేహాలు అగ్గిపాలు
కాలిన బూడిద గంగపాలు
మిగిలిన ఆస్తికలు భూమిపాలు
నీదనుకున్న సంపద పరులపాలు
ఒంటరిగా వచ్చావు
ఒంటరిగా పోతావు
మంచి చెడే కదా
చివరికి మిగిలేది (పుట, 24)

-అంటు జననానికి, మరణానికి మధ్య లిప్తకాల సమయమైన జీవితాన్ని జీవన తాత్త్వికతను వివరించాడు.

4.5 అతడు అడవిని కలగన్నాడు:

డా. జరుపుల రమేష్‌ తాను రచించిన ‘‘అతడు అడవిని కలగన్నాడు’’ అనే కవిత సంపుటాన్ని స్మృతి కావ్యంగా మలిచి తండ్రీతో తనకు గల అనుబంధాన్ని ఇలా కవిత్వకరించాడు.

ఏడుస్తూ కన్ను తెరిచిన నన్ను
ఎత్తుకున్న మొదటి వ్యక్తి నాన్నే
రాజ్యం లేకున్న
నన్ను రాకుమారున్ని చేసింది తానే
ఏ కష్టాన్నైనా చిరునవ్వు వినకాలే
దాయగల చార్లీ చాప్లీన్‌ (పుట, 43)  -అంటు గుర్తుచేసుకుంటాడు.

4.6 ‘జీవనయానం’ అనే కవితలో ఇందల్‌సింగ్‌ బంజార ఇలా అంటారు.

గర్భంలో నేను అమ్మతీసుకునే శ్వాస
నేర్చుకున్న నా మాతృభాష (పుట, 34) -అంటు బంజార భాష విశిష్ఠతను వివరిస్తాడు.

ప్రస్తుత కాలంలో గిరిజన కవులు మంచి సాహిత్యాన్ని, కవిత్వాన్ని అందిస్తున్నారు. వారిలో ఎం. గోనా నాయక్‌ - బతుకు (దీర్ఘకవిత), డా. సూర్యధనంజయ్‌ - బంజార నానీలు, డా.జి. వెంకట్‌లాల్‌- అడవి పక్షి అలాపన, రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ - బల్దేర్‌ బండి, వడ్త్యాపంతులు నాయక్‌ - నసాబ్‌, డా. జె.రాజారాం - కాలంబు రాగానే, డా. జరుపుల రమేష్‌ - రెప్పవాల్చని కాలం, అతడు అడవిని కలగన్నాడు. జోదకొబల్‌- తెలంగాణ నా మాతృభూమి, కొర్రా పద్మావతి - బోధివృక్షం, వెంకట్‌లాల్‌ జాదవ్‌- వనాంజలి, డా. జె.ఇందల్సింగ్‌` జీవనయానం, రాథోడ్‌ శ్రావణ్‌` దేశభక్తి కైతికాలు, మురళీజాదవ్‌- మధురవాణి, బట్టు విజయ్ కుమార్ – సింగిడి పువ్వు వంటి రచనలు గిరిజన సాహిత్యాన్ని విస్తృత వ్యాప్తిలోని తెస్తున్నాయనటంలో సందేహం లేదు.

మానవజాతి పురోగమనంలో అక్షరమే ప్రధానం. ఉజ్వల భవితకు అక్షర తోడ్పాటు అత్యావశ్యకం కూడా. ఇప్పుడిప్పుడే అక్షర జ్ఞానాన్ని అలవరచుకుంటున్న ఈ గిరిపుత్రులు తమ మేధాశక్తితో అడవితల్లి వంటి అక్షరాలను అక్కున చేర్చుకొని తమ సంస్కృతి సాంప్రదాయాలను, వేష భాషలను, అడవి అందాలను వారి జీవితాన్ని, బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

గిడుగువారు సవర భాషలో ‘‘సవర వ్యాకరణం’’ రాయటం గిరిజన సాహితీ వాదానికి మూలమని చెప్పవచ్చు. ఇటీవల గిరిజన యువరచయితలు తమ భాషసంస్కృతిలోనే కాకుండా తెలుగు సాహిత్యంలోని కొత్త కవిత్వ ప్రక్రియలు అయినా కూనలమ్మ పదాలు, హైకులు, నానీలు, రెక్కలు, టూమ్రీలు మొదలగునవి. ఈ ప్రక్రియలో కూనలమ్మ పదాల స్ఫూర్తితో బట్టు విజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటి తెలుగుశాఖ, పరిశోధక విద్యార్థి అనే యువరచయిత సింగిడి పువ్వు (బాలచక్రి పదాలు) పదాలను రచించాడు. ఇందులో సామాజిక సమస్యలు, సమాజంలోని సమస్యలను వ్యంగ్యంగా రాశారు. ఇది విజయవాడలో 14-10-2023నాడు ఆవిష్కరించబడిరది. అందులో మచ్చుకు ఒకటి-

మనిషి చెప్పిన నీతి
మరిచిపోవును కోతి
మర్మమెరుగని రీతి
ఓ బాలచక్రి (పుట, 19)

నీతిబోధను విననివాడు కోతితో సమానుడు. ఆ నీతిలోని మర్మ తెలుసుకున్నవాడు జ్ఞాని కాగలడంటూ ఈ ప్రక్రియలో తెలియజేశాడు.

5. ముగింపు:

ఇవేకాకుండా మన పురాణేతిహసాల గ్రంథాలు కూడా ఆయా తెగల భాషలలో రచించడం జరుగుతుంది. గొండి భాషలో గొండిభారతం, గొండి భాగవతం మొదలైనవి రావటం ఒకేత్తయితే కనుమరుగవుతున్న ఎరుకల భాషలోకి మహాభారత కథ అయినా ‘‘ఏకలవ్యుని చరిత్ర’’ను తీసుకొని కర్రె కురియన్‌ అనే తమిళ రచయిత  తమిళ లిపిద్వారా ఎరుకల భాషలో రచించటం హర్షించదగ్గ విషయమే. ఇటీవల కాలంలో బంజార భాషలో రచయితలు విరివిగా తెలుగును అనుసంధానంగా చేసుకొని రచనలు  చేస్తున్నారు. వారిలో మూడ్‌ కృష్ణనాయక్‌ ‘‘బంజార భగవద్గీత’’(బంజార గీతామృత్‌). సంత్‌ సేవాలాల్‌ శతకాన్ని రచించారు. మరోక రచయిత సోమ్లానాయక్‌ భగవద్గీతను బంజార భాషలో రాయటమే కాకుండా ఆ  భాషలోనే వ్యాఖ్యానం కూడా రాశారు. ఈ భగవద్గీతకు తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించడం ప్రత్యేకత. గిరిజన రచయితలు వారి వారి భాషలో ఒక కొత్త ప్రక్రియను ప్రారంభించారని చెప్పవచ్చు. అయితే కథ, నవల, నాటకం, కవిత్వంతో పాటు ఆయా తెగల భాషలలో ఆధ్యాత్మిక సాహిత్యం కూడా రావటం గొప్ప విషయమే. కాబట్టి గిరిజనవాదానికి ఇంతకంటే బలమైన నిరూపణలు ఏం కావాలి? భారతం, భాగవతం, భగవద్గీతలాంటివి ఆధ్యాత్మిక సాహిత్యమే అయినా గిరిజన తెగవారు వారి భాషలలో రచించటం అనేది ఒక కొత్త ప్రక్రియకు నాంది పలికిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. రానున్న కాలంలో తెలుగు సాహిత్యంలో ‘గిరిజన సాహిత్యం’ ఒక బలమైన వాదంగా, ప్రక్రియగా స్థిరపడగలదని భావిస్తున్నాను.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఇందల్సింగ్‌ బంజారా, జే. జీవన యానం, గీత ప్రింటర్స్, ఆదిలాబాద్‌, 2020.
  2. కోబల్‌, జోద. తెలంగాణ నా మాతృభూమి, షైన్ ప్రింటర్స్, హైదరాబాద్‌, 2019.
  3. గోనానాయక్‌, ఎం. బతుకు (దీర్ఘకవిత), కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్,  హైదరాబాద్‌, 2022.
  4. రమేష్‌, జరుపుల. రెప్పవాల్చని కాలం, కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్,   హైదరాబాద్‌, 2021.
  5. రమేష్‌ కార్తీక్‌ నాయక్‌, బల్దేర్‌ బండి, మోబ్డ పబ్లికేషన్స్, హైదరాబాద్‌, 2018.
  6. రాజారాం, జె. కాలంబు రాగానే,  షైన్ ప్రింటర్స్, హైదరాబాద్‌, 2017.
  7. విజయ్‌కుమార్‌, బట్టు. సింగిడి పువ్వు, జయ భాస్కర ప్రింటర్స్, పబ్లికేషన్స్, హైదరాబాద్‌, 2023.
  8. వెంకట్‌లాల్‌, జి. అడవిపక్షి ఆలాపన, దీప్తి ప్రింటర్స్, తెనాలి, 2016.
  9. సూర్య ధనుంజయ్‌. బంజారా నానీలు, రెయిన్బో  ప్రింటర్స్, హైదరాబాద్‌, 2019.
  10. సైదులు, ఖేతావత్‌. ఝుంప్డా, బాలాజీ గ్రాఫిక్స్, గోల్నాక, హైదరాబాద్‌, 2023.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]