headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. 'కె. గీత' కథలు: భిన్నసంస్కృతుల చిత్రణ

ఆచార్య డా. అయ్యగారి సీతారత్నం

ప్రొఫెసర్ & ఛైర్పర్సన్ బోర్డు ఆఫ్ స్టడీస్,
తెలుగు శాఖ, ఆంధ్ర విశ్వకళాపరిషత్
వాల్తేరు, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9885144879, Email: ayyagarisitaratnam@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

సిలికాన్ లోయ సాక్షిగా’ అనే కథలసంపుటి డా. కె. గీత రచన. ఇది డయోస్ఫోరా సాహిత్యరచనగా గుర్తించడం, డయోస్ఫోరా సాహిత్యలక్షణాలు, అమెరికా, ఆంధ్రాల సాంస్కృతిక భేదసాదృశ్యాలు, సంక్లిష్టత పరిశీలించడం ఈ పత్రముఖ్యోద్దేశం. కె. గీత కథాసాహిత్యం ఈ వ్యాసానికి ప్రాథమిక విషయసామగ్రి. వివిధ ప్రామాణికగ్రంథాలు, పత్రికావ్యాసలు, అంతర్జాలవనరులు ఈ పరిశోధనకు ద్వితీయవిషయసామాగ్రి. ఎంపిక చేసుకున్న కథాసాహిత్యంలో భిన్నసంస్కృతుల ప్రస్తావనలను విశ్లేషించే పధ్దతిలో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది.

Keywords: డయోస్పోరా, అస్తిత్వం, సంస్కృతి, వర్గ వివక్ష, జండర్ స్పృహ, హోమ్ లెస్, సంక్లిష్టత

1. ఉపోద్ఘాతం:

డా. కె. గీత "సిలికాన్ లోయ సాక్షిగా"అనే పేరుతో ప్రచురించిన కథల సంపుటిలో అమెరికాకు వెళ్లిన తెలుగువారి జీవితం అక్కడ వారి జీవితం, సంస్కృతి, ఇతర వలసల వారి జీవనం తెలుపుతూ రచించిన కథలను పరిశీలించి విశ్లేషించడం ద్వారా వేర్వేరు సంస్కృతిలో భేదసాదృశ్యాల్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ప్రపంచీకరణం తర్వాత ఇతర దేశాలకు వలస వెళ్లడం సాధారణమైపోయింది. దీనివల్ల డయోస్పోరా సాహిత్యసృజన మొదలైంది. డయోస్ఫోరా సాహిత్య సృజన కోవలోకే ఈ 'సిలికాన్ లోయ సాక్షిగా 'కథలు వస్తాయి.

2. డయోస్ఫోరా సాహిత్యం:

డయోస్పోరా అనే పదం మొదట ఇజ్రాయెల్ నుండీ‌ తరిమివేయబడిన యూదుల విషయంలో ఉపయోగించారు. అనంతర కాలంలో మాతృదేశాన్ని వదిలి వెళ్ళిన వారిని డయాస్పోరా అంటున్నారు. మొదట మనం డయోస్పోరా అనకుండా ప్రవాసులుగా, పిలిచేవాళ్ళం. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివసించే వారి రచనలని ప్రవాససాహిత్యంగా పిలిచేవారు. నేడు ప్రవాస సాహిత్యానికి , డయోస్ఫోరా సాహిత్యానికి భేదంస్పష్టం గా గుర్తించగలం.

ప్రవాసులు వారి అస్తిత్వాన్ని నిలబెట్టుకుందికి, తమ సొంత దేశాలకి-తాము నివసిస్తున్న ప్రాంతానికి ఉన్న సాంస్కృతిక జీవన విధానాన్ని పోల్చుకుంటూ భిన్న సంస్కృతిని ప్రతిబింబించే రచనలనే డయోస్ఫోరా సాహిత్యంగా గుర్తించాలి. కేవలం మాతృదేశం గురించి రాసిన లేదా కేవలం వెళ్ళిన దేశం గురించి రాసిన డయోస్ఫోరా సాహిత్యం కాదు. అది కేవలం ప్రవాస సాహిత్యం. వలస వెళ్లిన దేశ సంస్కృతి, మాతృదేశ సంస్కృతి భేదసాదృశ్యాలు, అలాగే అక్కడ వేరొక సంస్కృతికి అలవాటుపడే దశని వర్ణించే సాహిత్యాన్ని మాత్రమే డయోస్ఫోరా సాహిత్యంగా గుర్తించాలి.

"భారతీయ ప్రవాస్ దివస్ అని జనవరి 8న రెండు సంవత్సరాలకు ఒకసారి భారత ప్రభుత్వమే జరుపుతుంది. దక్షిణాఫ్రికా నుండి మహాత్మా గాంధీ జనవరి 8న వచ్చారు. దానికి గుర్తుగా ఆ రోజున 'ప్రవాస్ దివస్ 'జరుపుతారు. ఈ సంవత్సరం 1923న ప్రవాస్ దివస్ థీమ్ "డయాస్పోరా అమృతకాల్ లో భారతదేశం యొక్క పురోగతి కోసం విశ్వసనీయ భాగస్వాములు. భారతీయ సంతతికి చెందిన భారతీయ డయోస్ఫోరా జ్ఞానాన్ని,నైపుణ్యాన్ని, మాతృభూమికి తీసుకురావడానికి, భారతీయ డయోస్ఫోరాను అనుసంధించడానికి జరుపుకుంటున్నామని చెప్పగలం." (jagaranjosh.com/general knowledge/pravasi-bharatiya divas). మూలాల్ని మర్చిపోని వారిని మాత్రమే డయోస్ఫోరా అని పిలవాలి. మూలాలను మర్చిపోయిన వారు కేవలం ప్రవాసులు.

డయోస్ఫోరా సాహిత్యంలో పరాయీకరణ, మూలరహితం, ఒంటరితనం, అస్తిత్వ రాహిత్యం, గుర్తింపు సంక్షోభం కన్పస్తాయి.

3. రచయిత్రి పరిచయం

కవిత్వం, కథ, వ్యాసం, కాలమ్స్ సీరియల్స్ రచించే అచ్చమైన తెలుగు రచయిత్రి. ఈమె ప్రస్తుతం అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటున్నారు. నెచ్చెలి అనే అంతర్జాతీయ పత్రికను స్థాపించారు. ఈమె తల్లి కే. వరలక్ష్మి ప్రముఖ రచయిత్రి. ఈమె బాల్యం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో సాగింది. ఎంఏ తెలుగు, పి.హెచ్.డి ఎం.ఏ ఇంగ్లీషు, కూడా ఆంధ్ర కళాపరిషత్ లో చేసారు. ఆంధ్రాలో లెక్చరర్ గా పనిచేసి భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం కారణంగా అమెరికా వెళ్లారు. అక్కడ కొన్నాళ్ళు పనిచేసి తర్వాత ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ముగ్గురు పిల్లల ఆలనాపాలన చూస్తూనే రచయితగా, ఉద్యోగినిగా, నిర్వాహకురాలిగా, ఎడిటర్ గా ఎదిగారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, అజంతా అవార్డు, రంజని కుందుర్తి అవార్డు దేవులపల్లి అవార్డు మొదలగునవి అందుకున్నారు.

ఈమె ద్రవభాష, శీత సుమాలు, శతాబ్ది వెన్నెల, సెలయేటిదివిటీ మొదలైన కవితా సంపుటాలు 'గీతాకాలం ''అనగనగా అమెరికా 'మొదలగు కాలమ్స్ రచించారు. 'సిలికాన్ లోయ సాక్షిగా కథలు, 'వెనుతిరిగిన వెన్నెల' నవల రచించారు. నెచ్చెలి పత్రిక, తెలుగు వికాసం సంస్థ, తెలుగు రచయిత, అనే వెబ్సైట్ సంస్థాపకులు.

ఈ కథా సంపుటిలో 18 కథలున్నాయి. ఈ కథలలో డయాస్పోరా దృక్కోణమే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కథల్ని పరిశీలిస్తే అమెరికా గురించి మనం వింటున్న డాలర్ సౌఖ్యం మాత్రమే గాక అక్కడ సంస్కృతి, వ్యవస్థీకృత లక్షణాలు, సమస్యలు, మనకి వాళ్ళకి ఉన్న భేద, సాదృశ్యాల్ని గుర్తించగలము. అంతే కాదు ఈ డయోస్పోరా సాహిత్యం లోని భాష కూడా గుర్తింపదగినది.

4. కథల వస్తుతత్వం:

సమాజాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూనే ఒక సాహితీవేత్తగా పాత్రల సంచలనం ద్వారా పాఠకుడు మనసులో ఒక దయ, ఆలోచన నింపుతారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను మరొకటో సూచించరు. కేవలం మధ్యతరగతి మనిషిగా మంచిగా ఉండాలని సూచిస్తూనే వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవడం స్పష్టం అవుతుంది.

ఇది కథల సంపుటిగా పేర్కొంటున్నారు గానీ నిజానికి ఇది ఒక నవలికగా అన్పిస్తుంది. ఇందులోసూర్యతో సుప్రియ అమెరికా వెళ్ళడం, అక్కడ చిన్న ఇంట్లో,మొదటి నివాసం, తర్వాత వేరొకింటికి వెళ్ళడం, మధ్యలో స్నేహాలు, డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర నుంచీ వైద్యం, ఉన్నతవిద్యలలో భారతదేశానికి, అమెరికాకీ ఉండే భేదాలు చెబుతూ.. వారిద్దరిజీవనం చిత్రించారు. వారిద్దరూ డ్రైవింగులైసెన్సు తీసుకోవడం, ఒక ఇల్లు కొనుక్కోవడం… స్థిరపడడంవరకు.. ఒక ఆరు సంవత్సరాల జీవనం చిత్రించారు. అందుకే నవలికగా అన్పిస్తుంది.మొత్తంచూస్తే నవలిక‌ దేనికి దానికి చూస్తే కథానికలు. సంక్షిప్తతే ప్రధానంగా రచించారు. ఎంత సంక్షిప్తంగా రాసినా కథ తనదైన ముద్ర పాఠకుడి మనసులో బలంగానే ముద్రించింది.

ఇక్కడ సంస్కృతి వదులుకోలేక అక్కడ సంస్కృతిని ఇముడ్చుకోలేక ఉండే ఒక అనిశ్చిత స్థితి, ఇక్కడ అక్కడా కూడా ఉండే వర్గవివక్ష, జెండర్ వివక్షా, ఫుడ్ వేస్టేజ్, గృహ రాహిత్యం, దరిద్రం… వీటన్నిటినీ కూడాతగిన సన్నివేశకల్పనతో రచించారు. సృజన కన్నా ఫోటోగ్రఫీగా అన్పిస్తుంది. మధ్యతరగతి వారి స్వభావం స్పష్టంగా తెలుస్తుంది. వివక్షలకి బాధపడుతూనే, తమ జీవితంలో వివక్షచూపించకుండా ఉంటూ సమాజంలో వివక్షను చూసి చాలా బాధపడుతూ ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉన్న విధానాన్ని పాత్రలద్వారా స్పష్టం చేసారు.

5. కథాశీర్షిక:

ఈ 18కధల శీర్షికలూ ఒకటి తప్ప ఇంగ్లీషు పద శీర్షికలు.ఏ దేశం వెళ్లి నివసిస్తున్నారో, దేని గురించి రాస్తున్నారో ఆ భాషా ప్రభావం తప్పదు.డయోస్ఫోరాసాహితీలక్షణాలలో ప్రధానమైనది ఇది.ఇవి డయోస్ఫోరా కధలు కనుక ఈమె కూడా ఫుడ్డు-వేస్టుఫుడ్డు, హోంలెస్, ఓపెన్ హౌస్, చైల్డ్ కేర్, ఫీనిక్స్,... ఇలా అన్నీ ఇంగ్లీషు పదాలే ఉపయోగించారు.కథలలో కూడాఇంగ్లీషు పదాలు చాలా ఉంటాయి.

6. అమెరికా జీవనసంస్కృతి కి భారత సంస్కృతి కి గల పోలికలు:

అమెరికాలో వర్ణ వివక్ష, తెల్ల వాళ్ళు నల్ల వాళ్ళు అనేది మాత్రమే ఉంటుందనుకునే వారికి అక్కడ వర్గ వివక్ష కూడా చాలా ఉందని స్పష్టం చేశారు. మొదటి కథలోనే స్పానిష్యు-ఉష్షూ కథలో కొత్తగా వెళ్లిన సుప్రియ వాళ్ళు అద్దెకి దిగుతారు. ఆమెకు ఎవరో తెలియకపోయినా సామాను పైకి పెట్టడంలో సాయం చేస్తారు. అలాగే అలీసియా అనే కూడా అమితస్నేహంగా ఉంటుంది అయితే వాళ్ళంతా చాలా తక్కువ వాళ్ళు వాళ్ళని ఇండియన్ పేరెంట్స్ స్పానిష్ వాళ్ళు చదివే స్కూల్స్ లో కూడా చదివించకూడదంటారు. స్పానిష్ వాళ్ళు చవకగా పనిచేసే శ్రమజీవులు. అమెరికాలో కూడా ధనిక వర్గంగా భావించే కాకేషియన్లు కూడా వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు.

సుప్రియతల్లి ఫోన్ చేయగానే 'ఇంత దూరం ఎందుకు వచ్చాను' అని ఏడుస్తుంది. ఆమె మూలరాహిత్యంతో, పరాయికరణకి లోనవడం ఒక చిన్న ఫోన్ సన్నివేశంతో చిత్రించారు. అప్పుడు ఆమెని అలీసియా దగ్గరికి తీసుకుని ఓదారుస్తుంది. భాష తెలియకపోయినా ఆమె చూపిన ఓదార్పుకి ఊరడిల్లుతుంది. అలాంటి అలీసియాని అందరూ తక్కువగా చూస్తుంటే చాలా బాధపడుతుంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయత, వేదన కనిపిస్తుంది. వరలక్ష్మీవ్రతం తెలుగు వాళ్ళు పిలిచి ఇచ్చిన తాంబూలం అలీసయా చేతిలో పెట్టి నమస్కరించి తనకి వర్గ వివక్ష లేదని చెప్పకనే చెబుతుంది.

ఇక్కడ లాగే నెట్వర్క్ బిజినెస్ మోసాన్ని చాలా చక్కగా 'వర్క్ ఫ్రం హోం' అనే కథలో తెలియజేశారు. ఇంటి నుండి ఏదో పని చేయవచ్చని చాలా ఆశపడి ఆ చైన్ బిజినెస్ గురించి తెలుసుకొని వస్తుంది. భర్త అందులోని మోసం తెలియ చెప్పిన తర్వాత అది విరమించుకుంటుంది.

7. అస్తిత్వరాహిత్యం:

తమ ఉనికి కోసం తాపత్రయం, విపరీతమైన ఒంటరితనాన్ని గురవడం డిపెండెంట్ అమెరికా కథలు చిత్రించారు ఉద్యోగం చేసే వేసా లేదు. స్నేహితులు లేరు. ఒంటరితనం అక్కడ కేథరిన్, ప్రశాంతి పరిచయం అవుతారు. ఉద్యోగం చేసే అవకాశం లేక చాలా దిగులుగా నిరాశతో మిగిలిపోతుంది. డిపెండెంట్ వీసాతో తాను ఏమి చేసినా తన భర్త ఉద్యోగానికి కూడా ప్రమాదమే అనే విషయం తెలుసుకుంటుంది. ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఉద్యోగం చేసే అవకాశం లేక చాలా దిగులుగా నిరాశకి గురవుతుంది. భర్త పార్టీకి తీసుకొని వెళ్ళిన ఏదో ఒంటరితనమే. తను ఏమీ చేయటం లేదనే ఒక నిరాశ. అమెరికా దేశం స్వర్గధామంగా చెప్పేవాళ్లు ఇక్కడ సమస్యలు ఉంటాయి అని ఏవైనా చెప్పేవాళ్లున్నారా?... (సిలికాన్ లోయ సాక్షిగా -కె. గీత పేజీ37) ఆఖరికి నిబంధనలను నిర్బంధంగా ఫీల్ అవ్వడం వల్ల అలా అనుకుంటున్నానా అని ఆలోచించి "డిపెండెంట్ ఫోరం"లో కలుస్తుంది."వేల వేల ప్రశాంతిలు వేల ప్రియలు…. అవే ప్రశ్నలు అవే ఎదురుచూపులు" (సిలికాన్ లోయ సాక్షిగా -కె. గీత పేజీ37) అనే ముగింపు వాక్యం నిజంగా పాఠకుడు మనసుని వదలదు. ఎంతమంది స్త్రీలు అస్తిత్వరాహిత్యానికి గురవుతున్నారో అనే భావన బాధ ఆలోచన పాఠకుల్లో కలుగుతాయి.

8. దారిద్ర్యావస్థ:

కరుణ, ప్రియ లైబ్రరీకి వెళ్తారు.అక్కడ బెనర్జీ అనే వ్యక్తి కనిపిస్తాడు. అతను ప్రియకి ముందే తెలుసు. అతను నేపాల్ నుంచి వచ్చాడు. ఐదేళ్ల కిందట యాక్సిడెంట్ లో వెండి కు బాగా దెబ్బ తగిలి ఎక్కువ సేపు ఎక్కడ పని చేయలేడు. ఏదో అమెరికా వెళ్లి సంపాదిస్తాడని ఆశపడే తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్ళలేక ఇంటి వద్ద కట్టుకోలేక పాత కారులోనే రాత్రిపూట సామానంత అట్టపెట్టెల్లో పెట్టుకొని జీవిస్తూ ఉంటాడు. పగలు లైబ్రరీలో గడుపుతాడు. రిసెషన్ వలన పార్ట్ టైం ఉద్యోగం కూడా దొరకదు. అక్కడ ఉన్న విపరీతమైన చలికి కారులో చాలా అవస్థ పడుతూ ఉంటాడు. నేపాలి కాబట్టి మొదటే గ్రీన్ కార్డు వస్తుందిట. హోమ్ షెల్టర్లు ఉంటాయని అయితే ఎన్నో ఏళ్ల బట్టి అప్లికేషన్ లైన్లోనే ఉండి రాలేదు. అమెరికాలో ఉద్యోగాలు పోయినప్పుడు ఇంటిఅద్దె భరించలేక ఈ.ఎమ్.ఐ యిల్ కట్టలేక కుటుంబాల్ని కారులోకి మార్చుకున్న దుర్భర పరిస్థితిని కళ్ళకి కట్టించారు గీత.

అలాగే అతనికి సాయం చేద్దామన్నా పేయింగ్ గెస్ట్ గా ఉన్న కరుణకి అవదు. బొటాబొటిగా ఉన్న ప్రియ కి అవదు. కేవలం ఇద్దరూ నిస్సహాయంగా బాధపడడం మాత్రమే చేస్తారు. ఇల్ హెల్తు-ఇన్సూరెన్సూ కథలో ఇన్సూరెన్స్ లేని జార్జి లాంటి వ్యక్తులు తమ శరీరాన్ని తామే కుట్టుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని తెలిసి మనసు కలిచి వేస్తుంది.

జార్జి లాంటి వాళ్ళు సుమారు 50 మిలియన్ వరకు ఉన్నారని మిక్కిలి బాధతో ఏమి చేయలేని నిస్సహాయతతో ప్రియా బాల్కనీలోకి వస్తుంది. ఇన్సూరెన్స్ లేనిదే వైద్యం లేదు. ఇన్సూరెన్స్ కట్టుకునే శక్తి లేదు. అటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే అమెరికాలో ఉన్న నిజ స్థితి తెలుస్తుంది.

9. అమెరికా జీవనసంస్కృతికి భారతజీవనసంస్కృతికి గల భేదాలు:

9.1 ఉన్నతవిద్య

భారత దేశంలో కన్నా అమెరికాలో కష్టతరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య.సామాన్యులకి అక్కడ ఫీజులు అందుబాటులో ఉండవు. కమ్యూనిటీ కాలేజీలు ఉంటాయి ఫీజులు తక్కువ కానీ అక్కడ డిప్లమోవే తప్ప డిగ్రీలు ఉండవు‌. క్యాంపస్ ఉద్యోగాలు స్కాలర్షిప్లు ఫారిన్ విద్యార్థులకే తప్ప సాధారణ ప్రజలకు ఉండవు. ప్రైవేట్ కాలేజీలో ఫీజు నియంత్రణ ఉండదు. దాంతో ఉన్నత విద్య చాలా కష్టమైపోతుంది. ముఖ్యంగా అక్కడ స్థిరపడాలని వచ్చిన పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాల్లో అంటే క్లీనర్ గానో రెస్టారెంట్లలోనో పని చేస్తుంటారు. మంచి ఉద్యోగాలు ఉండవు. ఉన్నత చదువు ఉండదు. చదివించే శక్తి ఉండదు. "మాదేశంలో ఉన్నత విద్య మరీ మీరు అనుకున్నట్టు భారం కాదు కాబట్టే చాలామంది విద్యావంతులు కాగలుగుతున్నారు" అని సుప్రియచెబుతుంది. (సిలికాన్ లోయ సాక్షిగా -129వపేజీ -కె.గీత)

9.2 డ్రైవింగ్ లైసెన్స్, యాక్సిడెంట్:

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం, మనదేశంలో కన్నాఎంత కష్టమో తెలిపారు. అలాగే యాక్సిడెంట్ అయితే అధిక మొత్తంలో జరిమానా కట్టడం మాత్రమే కాకుండా మళ్లీ ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది.

9.3. వివాహం:

అక్కడ సంస్కృతి వలన కూడా ఉన్నత విద్యకి కొంత దూరం అవుతారు. కాలేజీ వయసులోనే వేరు కాపురాలు పెడతారు. ఆ సంసారం జంజాటంలో పెద్ద ఉద్యోగాలు తెచ్చుకోలేరు. పెద్ద చదువులు చదవలేరు. మనదేశంలో ఆ వయసుల్లో పార్టనర్లను వెతుక్కునే స్థితి లేదు.

9.4 ఒంటరి మహిళలు:

నిబద్ధతలేని స్త్రీ పురుష సంబంధాలతో వంటలు మహిళలుగా కష్టాలు పడక తప్పని వైనం అమెరికాలో కనిపిస్తుంది అలీసియా కూతుర్లు ఇద్దరు. పురుషులు తో ఇద్దరు బిడ్డలని కనీ ఒంటరిగా పెంచుకోవాల్సి వస్తుంది. అందుకే అలిసియా "ఆర్థికస్థితి కన్నా బాధించేది ఇక్కడ సంస్కృతి"(సిలికాన్ లోయ సాక్షిగా -కె.గీత) అంటుంది. అలీసియా ఇద్దరు కూతుర్లులలో ఒకరు ఇద్దరు బిడ్డలతో డైవర్స్ తీసుకుంటుంది. మరొకరు సహజీవనంతో ఇద్దరు బిడ్డలను కని సింగిల్ మామ్ గా మిగులుతుంది. 'సింగిల్ మామ్' కథలో మెడిల్డా అనే ఆమె సహజీవనంతో ఇద్దరు బిడ్డల్ని కని తర్వాత విడిపోవడంతో ఒంటరిగానే ఇద్దరు బిడ్డల్ని పెంచవలసి వస్తుంది. అయితే ఆమె "ప్రొటెక్షన్ కోసం పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పైగా విడిపోయినప్పుడు లాయర్లు తలకాయ నొప్పులు… నా పిల్లలు నాకు పూర్తిగా సొంతం…. కొంచెం ఇబ్బంది ఉన్నా సమాజ పరంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు.అమెరికాలో నాలాంటి వారు సగానికి పైగా ఉన్నారు" అంటుంది. (సిలికాన్ లోయ సాక్షిగా - కె. గీత – 78వ పేజీ) పిల్లల బాధ్యత మొత్తం స్త్రీలు మోస్తుంటే పురుషులు హాయిగా ఉంటున్నారు అనిపిస్తుంది కానీ దానివల్ల అంగీకరించరు.  కానీ వాళ్ళు దానిని అంగీకరించరు. అక్కడే పెరిగిన జీనా దాన్ని విమర్శిస్తే తట్టుకోలేదు.

9.5 యాంత్రికత:

ఫీనిక్స్ కథలో చైనా నుండి వచ్చిన 75 సంవత్సరాల పెద్దావిడ లీ. ఆమె కొడుకు తండ్రి పోయిన తర్వాత ఆమెను తీసుకొచ్చి గ్రీన్ కార్డుకి అప్లై చేస్తాడు. గ్రీన్ కార్డు వచ్చేదాకా అక్కడే ఉండాలంటాడు. తర్వాత సిటిజన్షిప్ కోసం అప్లై చేస్తాను అది ఐదు సంవత్సరాలు అక్కడే ఉండాలంటాడు. ఆమె పరాయి దేశంలో ఉండలేక ఎంతో పరాయికరణకి గురవుతుంది. ఆమె చక్కగా వ్యాయామం నృత్యం చేస్తూ ఉంటుంది. సుప్రియతో మాట్లాడుతుంది. ఉద్యోగాల నుండి వచ్చాక కూడా కొడుకు కోడలు మనవడు ఎవరి డివైస్ వాళ్ళు పట్టుకుని భోజనాలు కూడా కలిసి చేయరు. అందుకనే "వీళ్లంతా యంత్రాలుతో పని చేస్తున్నారని అనుకుంటున్నారే గాని యంత్రాలగా మారిపోయారు" (సిలికాన్ లోయ సాక్షిగా -కె. గీత 121వ పేజీ) అని బాధపడుతుంది. భారతదేశంలో మానవ సంబంధాలు కి ఎక్కువ విలువ ఇస్తారని మనం గుర్తించగలం.

ఇలా ఈ కథలన్నింటిలోనూ డయాస్పోరా లక్షణాలు మనం గుర్తించగలం. చక్కని కథనంతో వచనంలో కూడా అలంకారాలు ఉపయోగించటం మెచ్చుకోదగిన విషయం.

"'లీ'నృత్యాన్ని చూస్తుంటే కోనేటిలో మోకాటి లోతుకు దిగి తామరాకుల మీది నీటి బొట్లుని తాకినప్పటి అనుభూతి నా మనసు నిండా"(సిలికాన్ లోయ సాక్షిగా -కె. గీత-120వ పేజీ). అలాగే 'జ్ఞాపకాల తేనెటీగలు'లాంటివి గుర్తించగలం.

10. ముగింపు

ఇలాగా అనేక ఖండాల నుంచి వచ్చిన స్త్రీలు అన్ని వయసుల వారు అమెరికా సంస్కృతిలో పూర్తిగా ఇమడలేక, ఇమడక తప్పని స్థితి ని తెలియజెప్పిన మంచి కథలు.అమెరికాలోకూడా అసమానతలు, పేదరికం, జీవన పోరాటం తప్పని వైనం స్పష్టం చేసిన కథలు.

11. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గీత, కె. సిలికాన్ లోయ సాక్షిగా. నవచేతన పబ్లిషింగ్ హౌస్, 2018.
  2. చిరంజీవిరావు, పలివెల. “అమెరికా డయాస్ఫోరా తెలుగు కథలు– పరిణామ వికాసం.” ఔచిత్యమ్. సంపుటి 1, సంచిక 2. నవంబర్ 2020.
    https://auchithyam.com/articles/drpcr.php
  3. యాకూబ్. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, 2018.
  4. Jacob Shai, Diaspora Literature and Stereotypes Concerning Contemporary Art in Africa. 25.10.2023. https://osf.io/arjtb/download
  5. Martien A. Halvorson Taylor. Diaspora Literature. 25.10.2023.
    https://behappyhuman.bibleodyssey.org/people/related-articles/diaspora-literature/

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "OCTOBER-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-SEPTEMBER-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "OCTOBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]