headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

4. సైద్ధాంతిక వస్తుశిల్పసమన్వయం: ‘కేతు’ కథాసందర్భం

ఆచార్య కె. శ్రీదేవి

ఆచార్యులు, తెలుగుశాఖ,
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం,
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9441404080, Email: kinnerasreedevi65@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఆధునికసాహిత్యంలో కథాప్రక్రియ ఎంతో విస్తృతిని సముపార్జించి, పాఠకలోకంలో ఉత్తమస్థానాన్ని ఆక్రమించింది. గ్రామీణజీవనవిధానాన్ని సహజంగా చిత్రించిన కథకపంక్తిలో ఎన్నదగిన కేతువిశ్వనాథరెడ్డి రచనల్లో వివిధ కథాసందర్భాలను ప్రస్తావిస్తూ, వస్తుశిల్పాలను సమన్వయించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. కేతు విశ్వనాథరెడ్డి నేపథ్యాన్ని, రచనావైశిష్ట్యాన్ని పరిచయం చేసి, వారి రచనల్లో వ్యక్తమయ్యే ప్రాంతీయత, గ్రామీనజీవనం, రైతు జీవన చిత్రణలను ముఖ్యంగా ఈ వ్యాసం చర్చిస్తుంది. వీరి రచనల్లో కరువు ప్రతిఫలనాంశాలు, కళాత్మకత, సామాజికశిల్పాలను వెలికితీసే విశ్లేషణాత్మక ధోరణిలో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది. కేతు వారి రచనలు ఈ పరిశోధనకు ప్రాథమికాకరాలు. వివిధ ప్రామాణికగ్రంథాలు, పత్రికలు, నివేదికలు మొదలైనవి ఈ వ్యాసరచనకు ఉపకరించిన ద్వితీయ విషయసామగ్రి.

Keywords: వస్తువు, శిల్పం, కళాత్మకత, గ్రామీణజీవనం, ప్రాంతీయత, కరువు, కథలు, కేతు విశ్వనాథరెడ్డి.

1. పరిచయం:

ఆధునికసాహిత్యం మౌలికంగా ఉద్యమాల సంపర్కంలోంచి ఎదుగుతూ వచ్చింది. అలాగే ఈ ఉద్యమాల తరువాత భావ ప్రచారం కోసం ఎక్కువగా కవిత్వం మీద ఆధారపడ్డాయి. అందువలన రాశిపరంగా చూసినప్పుడు వచనం కంటే కవిత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. వచనం కొంత విస్మరింపబడినప్పటికీ గురజాడ నుంచి ఇప్పటిదాకా ఉత్పత్తైన వచన సాహిత్యాన్ని ముఖ్యంగా కాల్పనిక సాహిత్యాన్ని పరిశీలించినపుడు అంత నిస్పృహ చెందాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కొద్దిమంది కాల్పనిక సాహిత్యకారులయినా, అద్భుతమైన శక్తితో మంచి కాల్పనిక సాహిత్యాన్ని రాయటం జరిగింది. ఇది మిగిలిన ఏ భారతీయ భాషలలోని సాహిత్యం కన్నా తక్కువకాదు. కొన్ని సందర్భాలలో ఎక్కువ కూడా. ఆ విషయం అలా ఉంచితే తెలుగు కాల్పనిక సాహిత్యాన్ని ముఖ్యంగా కథాసాహిత్యాన్ని పరిపుష్ఠం చేసిన అతి కొద్దిమంది రచయితలలో కేతువిశ్వనాథరెడ్డి ఒకరు.

తెలుగు కాల్పనిక సాహిత్య చరిత్రమీద కొడవటిగంటి కుటుంబరావు ముద్ర అనేది ఒకటుంది. ఆ ముద్ర వస్తు, రూపాలు రెండింటికి సంబంధించినది. నిరలంకారికంగా, జీవితాన్ని సాధికారికంగా వ్యాఖ్యానించే శైలితో మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతికి చెందిన పాత్రల ప్రవర్తనలను, వాటి వెనుకనున్న కారణాలను ముఖ్యంగా ఆర్థిక కారణాలను అద్భుతంగా కొ.కు. చిత్రించారు. తత్ఫలితంగా కొ.కు. సాహిత్యవారసత్వం అనేది ఒకటి ఏర్పడి కొనసాగుతోంది. ఆ వారసత్వపరంపరలో వచ్చిన రచయిత ‘కేతు విశ్వనాథరెడ్డి’.

2. కేతు విశ్వనాథరెడ్డి నేపథ్యం - రచనా వైశిష్ట్యం - విశ్వజనీనత:

కేతు విశ్వనాథరెడ్డి నగరవాసిగా ఉంటూనే గ్రామీణ జీవితాన్ని అందులో ఉండే వైచిత్రిని, వైవిధ్యాన్ని కొ.కు. లాగానే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండానే పట్టుకున్నాడు. కొ.కు పాత్రలు నగరజీవితాన్ని ఆశ్రయించి వుంటే, కేతు విశ్వనాథరెడ్డి పాత్రలు గ్రామీణజీవితం నుంచి ఆవిర్భవించాయి. ఏ రచయితకయినా అతని నేపథ్యం అన్ని సందర్భాలలో సృజనాత్మక రచనకు ఉపయోగపడుతుందన్న గ్యారెంటీ లేదు. కొన్ని సందర్భాలు అతనికి అనుభవంలేక ఆ అనుభవంలోని అవగాహనా రాహిత్యం అతన్ని పేలవమైన రచయితగా మార్చవచ్చు కూడా. ఈ విషయంలో కేతు పూర్తి భిన్నంగా కనిపిస్తారు. ఆయన నేపథ్యం ఆయన సాహిత్యానికి అదనపు శక్తయింది. కేవలం జీవితానుభవమే కాక శక్తివంతమైన సాహితీమూర్తిమత్వం, గొప్ప భావుకత నిండిన రచయిత, మేధావి కావటం వలన ఇతని కథలు సజీవంగా, కళాత్మకంగా వుంటాయి. కవిత్వం అనుభవాన్ని ఒకరకంగా ఉన్నతీకరించి, అంత ఉదాత్తమైన భాషలో ఆవిష్కరింపబడుతూ వుంటే, కాల్పనిక సాహిత్యం జీవితాన్ని గురించి, అందులోని సంఘటనల గురించి, ప్రతిఫలనం చేసి తాత్వికంగా వ్యాఖ్యానిస్తుంది. ఈ తాత్విక వ్యాఖ్యానానికి రచయితకు తప్పకుండా తాత్విక పరిజ్ఞానంతోపాటు, సృజనాత్మకత, భావుకత అనే రెండు అంశాలు అనివార్యం. ఈ రెండు అంశాలు కేతులో పుష్కలంగా వున్నాయి. అవే అతని కథా సాహిత్యంలో ఆవిష్కరించబడినాయి.

రచయిత కేవలం తాత్వికంగా ఆలోచించినంత మాత్రాన కాల్పనిక సాహిత్యంలో సరిపోదు. ఆ తాత్వికత సృజనాత్మక వ్యాఖ్యానంగా మారినప్పుడు మాత్రమే కాల్పనిక సాహిత్యంలో ఉపయోగ పడుతుంది. అలాగే తాత్వికతలో అనివార్యంగా వుండే రాజకీయ స్పర్శ లేక శుద్ధ రాజకీయ భావాన్నుంచి తన కాల్పనిక రచనను కాపాడుకోవటానికి రచయితలకు చాలా ఎక్కువ సంయమనం కావాలి. ఈ సంయమనం కేతు విశ్వనాథరెడ్డికి కొంచెం ఎక్కువగానే ఉంది. తనెంత కమ్యూనిస్టు రాజకీయ ప్రేరణలోంచి రచన చేసినప్పటికీ, ఆ రాజకీయాలు శుద్ధ రాజకీయ వ్యాఖ్యానాలుగా తన కథల్లోకి దిగుమతి కాకుండా వాటిని refine చేసి ప్రవేశ పెట్టడంలో కేతు విశ్వనాథరెడ్డికి గొప్పనేర్పు ఉంది. ఈ నేర్పు ఫలితంగానే ఆయన కథలలోని కథకుడు ఒక విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్నవాడుగా కనబడతాడు. రాజకీయ, తాత్విక ప్రేరణలలోనుంచి వెలువడిన ఏ సాహిత్యమైనా ఆదర్శవంతంగా, అనివార్యంగా ఉంటూ రావటం మనకు కనిపించే లక్షణం. రచయిత ఎంతో unemotional గా, సమతౌల్యంతో ఉంటే తప్ప అది సాధ్యంకాదు. ఇది తెలుగులో ఎక్కువగా సాధించగలిగినవాడు కొడవటిగంటి కుటుంబరావు. అంతే శక్తితో, సామర్ధ్యంతో అనుసరించినవాడు కేతు విశ్వనాథరెడ్డి.

మనిషి అంటిపెట్టుకొని వుండే అత్యంత అమూర్తవిషయం మానవప్రవృత్తికి సంబంధించినది. వందల సంవత్సరాలనుంచి దాన్ని అవగతం చేసుకొనే ప్రయత్నం అన్ని రంగాలలో జరుగుతుంది. వీటిల్లో ఎక్కువ విజయవంతమయింది మాత్రం సాహిత్యం. ముఖ్యంగా కథ నవలలో వల్లంపాటి గుర్తించినట్లుగా, కేతు విశ్వనాథరెడ్డి కూడా కొన్ని కథల్లో వాడిన పదోత్పత్తిని, దాని అమూర్తతను బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. అదలా ఉంచితే ఏ సాహిత్యమయినా మార్పును, దాని సానుకూల అర్థంలో వేగవంతం చేసేదిగా ఉండాలి, రూపొందాలి. ప్రముఖ మార్క్సిస్టు విమర్శకుడు “జార్జ్ లూకాచ్” (Gorge Lukach) మాటల్లో చెప్పాలంటే "There can be no literature without at least the appearance of change or development" సరిగ్గా ఈమార్పును నిరంతరం కేతు విశ్వనాథరెడ్డి తన రచనా శిల్ప విశేషంగా చేసుకున్నారు.

తెలుగు సమాజం మౌలికంగా ఆధునిక యుగంలో కూడా వ్యవసాయక సమాజంగానే ఉన్నప్పటికి, ఆధునిక సాహిత్యం నగర సంబంధిత విషయాలను సాహిత్యవస్తువుగా చేసుకోవటం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆధునిక సాహిత్యం ఉద్యమాల ప్రభావం లోంచి, ముఖ్యంగా విదేశీ భావజాలాల ప్రేరణలోనుంచి రాయబడటం వలన, ఆ ప్రేరణలు కూడా ప్రధానంగా సాహిత్య ప్రేరణలు కావటం వలన తెలుగు రచయితలు ఆధునిక సాహిత్యాన్ని రాయాలని భావించినపుడు, తమకు తెలికుండానే ఆధునిక జీవితానికీ, నగరానికీ బలమైన సంబంధం ఉందనే భావనలోకి ప్రవేశించారు. దీని ఫలితంగానే ఆధునిక సాహిత్యం అంటే, నగర సాహిత్యం అనే భావన సర్వత్రా పాతుకుపోయింది. అయితే, దీని వెలుపల వాస్తవాన్ని గ్రహించి వ్యవసాయిక సంబంధిత విషయాలను, దాన్ని ఆవరించి ఉన్న జీవితాన్ని తమ కాల్పనిక సాహిత్య వస్తువుగా తీసుకున్న రచయితలు మనకున్నారు. ప్రారంభ దినాలలో ఈ రచయితలు తమ రచనల్లో వ్యవసాయ జీవితాన్ని ప్రతిబింబించినప్పటికీ, అది ప్రత్యక్ష జీవితానుభవం కాకపోవటం వలన ఆ సాహిత్యంలో కొంత నాటకీయత అనివార్యంగా కనిపిస్తుంది. ఆ తరువాత కాలంలో వ్యవసాయక కుటుంబాల నుంచి వచ్చిన రచయితలు కొద్దిమందైనా తమ ప్రత్యక్ష అనుభవాన్ని విశ్లేషణాత్మక దృష్టితో కాల్పనిక సాహిత్యంలో ప్రతిఫలింప చేశారు. ఈ క్రమం అంతకు ముందుగా జరగాల్సినప్పటికీ, జరగలేదు. 1970ల తరువాత మారిన తాత్విక, రాజకీయ అవగాహనల నేపథ్యంలో ముందుకు వచ్చిన రచయితలు ఎటువంటి మార్మికత లేకుండా జీవితాన్ని దాని యదార్థ స్థితిలో సాహిత్యంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించిన తక్కువ మంది కథకులలో కేతు విశ్వనాథరెడ్డి అగ్రశ్రేణికి చెందినవారు.

3. కేతు విశ్వనాథరెడ్డి సాహిత్యం ప్రాంతీయ జీవన చిత్రణ:

సాహిత్యవస్తువు ఎంత విశ్వజనీనంగా ఉన్నా వ్యక్తీకరణలో ప్రాంతీయంకాని సాహిత్యమేదీ పాఠకుల్ని కదిలించలేదు.  విశ్వనాథ రెడ్డి సాహిత్యంలో ఈ ప్రాంతీయ ముద్ర అనివార్యంగా ఉంటుంది. మంచి సాహిత్యంగా గుర్తింపబడిన ఏ భాషా సాహిత్యాన్ని పరిశీలించినా ఈ విషయం అవగతమవుతుంది. ప్రాంతీయ సమస్యలనే కాకుండా, ప్రాంతీయ వ్యక్తీకరణ పద్ధతులను సాహిత్యంలోకి ప్రవేశపెట్టగలిగిన రచయితలు అనివార్యంగా మంచి రచయితలుగా గుర్తింపు పొందారు, పొందుతారు. ఈయన కూడా సరిగ్గా ఈ రెండు అంశాలను సమ్మేళనం చేసి అద్భుతమైన కథా సాహిత్యాన్ని సృష్టించారు. కథా రచనలో ఆయన తీసుకున్న ప్రాంతం వస్తువరంగా కడప జీవితం. కడపజిల్లాలోని అత్యంత వెనుకబడిన గ్రామాల నిజస్థితి. అందులోని వ్యక్తుల మధ్యగల సంబంధాలను, ఆ సంబంధాలను నిర్దేశిస్తున్న ఆర్థిక మూలాలను లోతుగా విశ్లేషించే లక్ష్యంతో కేతు అనేక కథలు రాశారు. మొదటి సంపుటి "జప్తు" నుండి ఈ మధ్య వచ్చిన "కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) వరకు వస్తుపరంగా ఇదే విషయాన్ని స్వీకరించాయి.

గ్రామసీమల్లోని సగటు రైతు కుటుంబాలలోని ఆత్మిక, ఆర్థిక సంక్షోభాలు, ఆ సంక్షోభాల ఫలితంగా ఛిద్రమౌతున్న జీవితాలు, వాటి గురించిన వేదన ఆయన కథల్లో ప్రధానంగా చిత్రించటం జరిగింది. ఈ చిత్రించటం అనేది బాహ్యవ్యక్తి దృష్టి నుంచి కాకుండా, తను ఏ జీవితాన్ని తన సాహిత్యంలో ప్రధానంగా చిత్రించటం జరిగిందో అదే జీవితాన్ని ఆయన స్వయంగా చూశారు, అనుభవించారు. అందువలన ఆయన కథల్లో చిత్రించిన జీవితం అత్యంత ఆమోదయోగ్యంగా కనిపిస్తుంది. ఎక్కడ emotionsకు లోను కాకుండా జీవితాన్ని దాని యథార్థ స్థితిలో, విశ్లేషణాత్మక దృష్టితో పట్టుకోవటం ఆయన కథలన్నింటిలోనూ కనిపించే సామాన్యలక్షణం.

4. కేతు విశ్వనాథరెడ్డి సాహిత్యం - గ్రామీణ జీవన చిత్రణ:

కేతు సాహిత్యాన్నే కాక, తత్వశాస్త్రాన్ని కూడా బాగా అధ్యాయనం చేసిన వ్యక్తి. అటువంటి రచయితలు ఎక్కువ సందర్భాలలో నగర జీవితాన్ని అందులోని సంక్లిష్టతలను చిత్రించటం సాధారణంగా జరిగే విషయం. ఎక్కువగా నగర జీవితం గడిపినప్పటికీ ఈ విషయంలో కేతు విశ్వనాథరెడ్డి చాలా విభిన్నంగా కనిపిస్తారు. చాలా చేతనా పూరితంగానే ఆయన నగర జీవితాన్నే కాక పల్లెటూళ్ళ జీవితాలను ఈయన తన కథాంశాలుగా తీసుకున్నారు. తొంభైశాతం పైగా ఆయన కథలు పల్లెటూళ్ళ సమస్యలను, వాతావరణాన్ని వాటిల్లో ఉండే ఉద్రిక్తతలను, ఆత్మీయతలను తన కథల్లో సజీవమైన భాషలో పట్టుకున్నారు. రాయలసీమ మాండలికం ఆయన కథల్లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇప్పటికే చాలామంది విమర్శకులు గుర్తించినట్లుగా ఆయనకు పల్లె జీవితం మీద అచంచలమైన మమకారం ఉంది. ఈ మమకారం ఆయన ప్రతికథలో కనిపిస్తుంది. అలాగే ఆ పల్లెటూర్లలో జీవించే వ్యక్తులమీద, వాళ్ళ బలాలమీద, బలహీనతలమీద ఆయనకు అభిమానం, ప్రేమ ఉన్నాయి. అందువలన ఆయన కథల్లో మూస పాత్రలు కాక సజీవమైన పాత్రలు కనిపిస్తాయి. ఏ రచయితయినా సామాజికంగా జరిగే సంఘటనలనూ యదార్ధంగా చిత్రించే ప్రయత్నం చేస్తే సరిపోదు. ఆయన తాత్వికంగా విశ్లేషించగలగాలి. ఈ విశ్లేషణ రచయిత చేస్తున్నట్లుగా కాక పాత్రలే తమని తాము ఆవిష్కరించుకొంటూ సందర్భానుసారంగా తమ తమ అస్తిత్వ సంబంధ విషయాలను ఆవిష్కరించుకునేట్లు చేయటం జరుగుతుంది. జీవితానుభవమో, తాత్విక దృష్టి మాత్రం ఉంటే సరిపోదు. కేవలం ఈ రెండు అంశాలే ఒక వ్యక్తిని గొప్ప రచయితగా చేయలేవు. వాటితోపాటు ఆ రచయితకు తను చిత్రిస్తున్న జీవితం పట్ల నమ్మకం ఉండాలి. అలాగే ఆ జీవితాన్ని కొనసాగిస్తున్న పాత్రల పట్ల గౌరవం ఉండాలి. వీటితోపాటు విశ్లేషణాశక్తి కూడా ఉండాలి. వీటన్నిటికి అద్భుతమైన సమకాలీన స్థితిలో కొనసాగించటం వలన ఆయన గొప్ప కథకుడు కాగలిగాడు.

1970ల తర్వాత వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులతోపాటు ముఖ్యంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన రైతుల జీవితాల్లోసృష్టించిన భీభత్సం, జరిగిన విధ్వంసం, విచ్ఛిన్నమైన సంబంధాలు ఈయన కథాంశాలు. సామాజిక పరిశీలన, పరిజ్ఞానం లోతుగా వున్న రచయిత సమాజంలో చోటుచేసుకునే ఏ మార్పుకయినా వ్యక్తుల్ని కాక సామాజిక స్థితిగతుల్ని, వాటి మూలాల్ని విశ్లేషిస్తారు. ఆ ఆవిష్కరణలో ఆయా సందర్భాలలోని వ్యక్తుల సంబంధాల్లో, ప్రవర్తనలలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయో చిత్రీకరించారు. అలాంటి సమయంలో వచ్చే ప్రతి మార్పు సానుకూలమైనదేమీ కాదనే విషయం 'నమ్ముకున్న నేల' అనే కథ విశ్లేషిస్తుంది.

5. ‘నమ్మకున్న నేలరైతు జీవితచిత్రణ:

గ్రామీణ ప్రాంతంలో నీటి వనరులు లేక, వర్షపాతం లేక భూములు బీడుల్లాగా మారి వాటి ఉపయోగితా  విలువ (use value) కోల్పోయిన నేపథ్యంలో వాటిని ఫ్యాక్టరీలకు స్థలాలుగా తెగనమ్ముకుంటున్న క్రమాన్ని, ఆ క్రమంలో తలెత్తుతున్న జీవన విషాదాన్ని ఈ కథ సంకేతిస్తుంది.

కథకుడు దిగువ మధ్యతరగతికి చెందిన పేదరైతు కుటుంబానికి చెందినవాడు. పిత్రార్జితంగా మిగిలిన రెండెకరాల తోటను తన దాయాదికి అమ్మి, ఆ దాయాది తనకు పూర్తి డబ్బు ఇవ్వకుండానే ఆర్థికంగా చితికి పోయాడనే విషయాన్ని మిత్రుడి ద్వారా తెలుసుకొని, తన కూతురి పెళ్ళికి ఎలాగైనా, వేరే వాళ్ళకైనా భూమి అమ్మాలనుకొని, పదేండ్ల క్రితం వదలివెళ్ళిన తన ఊరికి బయలుదేరి వస్తాడు. కథకుడి ఊరి ప్రయాణంలోనే, రచయిత మొత్తం ఆ గ్రామంలో గత కొద్దికాలంలో వచ్చిన మార్పులు, అవి తెచ్చిన పరిమాణాలను లోతుగా పరిశీలిస్తారు. మొత్తం గ్రామం వర్ణనలోనే రచయిత తను చెప్పదలుచుకున్న మానవీయ విలువల విధ్వంసానికి కావలసిన కాన్వాసును సిద్ధం చేసుకుంటాడు. ఓ మోస్తరు రైతుగా బతుకుతున్న వీరన్న, ఆ వూర్లో ఫ్యాక్టరీ రాకముందు బతకడం కోసం ప్రొద్దుటూరులో భోగం కంపెనీలో వ్యభిచారం చేస్తున్న అమ్మాయిల కోసం వస్తున్న విటులకు బిర్యానీ పొట్లాలు, మందు అందించేవాడు.

ముఖ్యంగా రాయలసీమ భూస్వామ్య కులాలకు చెందిన వారు వ్యభిచారుల దగ్గర పనిచేయడానికైనా సిద్ధపరచిన పరిస్థితుల దుర్భరత్వానికి ప్రతీక. రచయితలకు ముఖ్యంగా కాల్పనిక సాహిత్యాన్ని సృజించే రచయితలకు సామాజిక శాస్త్రాల పరిచయం తప్పని సరి. అప్పుడు మాత్రమే సమాజంలో వచ్చే మార్పులు, ఆ మార్పులు వ్యక్తుల జీవితాలలో కలిగిస్తున్న అనుకూల అననుకూల విషయాలను శక్తివంతంగా చిత్రీకరించగలుగుతారు లేదా విశ్లేషించగలుగుతారు. ఈ విషయంలో కేతు విశ్వనాథరెడ్డి చాలా శక్తివంతమైన రచయిత. ఎందుకంటే, ఆయన ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా, మార్బిజాన్ని నమ్మిన రచయిత. ఏ మార్కిస్టు రచయితయినా ఆర్థిక, సామాజిక స్థితులే వ్యక్తి జీవితాన్ని, చైతన్యాన్ని నిర్ణయిస్తాయి, నియంత్రిస్తాయి, అనే విషయాన్ని నమ్మటమే కాకుండా తన సాహిత్యంలో దాన్ని విశ్లేషించాలి. 'నమ్ముకున్న నేలలో ఆయన సరిగ్గా ఈ పనిని చేయగలగటం వల్ల ఈ కథ కేవలం ఒక సాదాసీదా కథగా కాక ఒక సామాజిక సందర్భాన్ని, చారిత్రక స్పృహతో అవగతం చేసుకున్న సమాజంలో, ముఖ్యంగా ఆర్థిక క్షేత్రంలో కలుగుతున్న సంచలనాలను రికార్డు చేయటం సాధ్యపడింది. అలాగే ఒక మార్పు సమాజంలో జరుగుతున్నపుడు ఆ మార్పు ఫలితంగా ఏర్పడుతున్న సమస్యలు, సగటు మనిషి అస్తిత్వాన్ని తాకుతున్న వైనాన్ని కూడా చిత్రించటం వలన ఈ కథకు అదనపు విలువ చేకూరి విశిష్ట కథగా మిగిలింది.

6. కరువు ప్రతిఫలనాంశాలు :

రాయలసీమ-కరువు రెండు Synonyms అంటే ఆశ్చర్యం లేదు. రాయలసీమనుండి వచ్చిన ఏ కథకుడైనా కరువు ప్రస్థావన లేకుండా కథ రాయటం దాదాపు అసాధ్యం. కేతు విశ్వనాథరెడ్డి కథల్లో చాలా సందర్భాలలో కరువు చిత్రణ, కరువు వాతపడ్డ వారి దారుణ స్థితి కనబడుతుంది. “నమ్ముకున్న నేల" లాంటి కథలు ఈ కరువును చాలా సమగ్రంగా చిత్రించాయి. పల్లెటూళ్ళలో పొలాలను తెగనమ్మి ఏదో రకంగా తమ అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే బలమైన కోరికతో నగరాలకు చేరి, అక్కడ జీవితం మరింత దుర్భరమవుతున్న సన్నివేశాలు. అలాగే పట్టణాలలో స్థిరపడి అక్కడ మనుగడ సాగించేందుకు పట్నం చేరినవాళ్ళు. అక్కడ కూడా మారిన ఆర్థిక సంక్షోభాల్లో తమ సంతానానికి ఒకదారి చూపించేందుకు ఆర్థికంగా తమ శక్తి చాలక మళ్ళీ పల్లెటూళ్ళలో బీళ్ళుగా మిగిలివున్న పొలంపైనే ఆధారపడుతున్నారు. ఈకథలో కౌలుచేస్తున్న వీరారెడ్డి తన పొలానికి అడ్వాన్సు తీసుకున్నందున, అతడు పొలం అమ్మడానికి ఒప్పుకోడనీ, అయిన కాడికి ఏదో కొంత తగ్గించి అతనికే అమ్మాలనుకుంటాడు కథకుడు. పొలం అమ్ముతానన్నప్పుడు వీరారెడ్డి నుంచి ఎలాంటి వ్యతిరేకత కనిపించదు. పైగా "నేను నీ భూమి చేసుకుంటే, సుబ్బారాయుడి బాకీ, బ్యాంకు బాకీ, నీబాకీ నేనెట్లా తీర్చాలని” అడిగిన ప్రశ్నకు నిరుత్తరుడవుతాడు. పదేండ్లకాలంలో తాను పల్లె విడిచిన తరువాత, పల్లెలో తనకు కనిపించిన దృశ్యాలు ఒక్కటొక్కొటిగా రచయిత మనకు వర్ణిస్తారు. అంటే, తన అస్తిత్వానికి ఊతమవుతుందనుకొన్న పొలం నిరుపయోగమై కౌలు తీసుకున్న వ్యక్తి కూడా భూమి నిరాకరించాల్సిన స్థితి భూమి ఉపయోగితా విలువలో వచ్చిన పరిణామం. భూమి నిరుపయోగమైన నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో నెలకొన్న నిస్సహాయ స్థితిని, ఈ స్థితిని ఆధారం చేసుకొని, పైకెదగడానికి స్థిరంగా వుండే మరొక వ్యాపారి అనైతిక స్వభావాన్ని ఈ కథ చాలా ఆలోచనాత్మకంగా సంకేతిస్తుంది. అంతకంటే ఎక్కువగా వ్యవసాయ యోగ్యమైన భూములు బీడు భూములై క్రమంగా అవి ఫ్యాక్టరీల నిర్మాణం కోసం తప్ప పనికిరాని భూములుగా ఉన్నవి. ఇవి వ్యాపారస్తుల చేతికిపోయి కొత్త విలువను అంటే ఉపయోగితా విలువ (use value) నుండి వ్యాపారవిలువ (Commercial use)ను సంతరించుకొంటున్న నేపథ్యంలో మానవ సంబంధాలలో వస్తున్న మార్పుల్ని కథారచయితగా కళాత్మకంగా నమోదు  చేయగలిగారు. ఒకే ఒక్క వాక్యంలో మానవ విలువలలో జరిగిన విధ్వంసాన్ని సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణం వలన వచ్చిన సంకీర్ణ సంక్షుభిత సంస్కృతిని ఈ కథలలో చిత్రించారు. అభివృద్ధి అనేది కేవలం పారిశ్రామికంగా పరివర్తన (transformation) చెందటమనే ఒక నినాదం వెనుక ఉన్న విషాదాన్ని కూడా ఈ కథ బహిర్గతం చేస్తుంది. అదే సందర్భంలో ఆధునికత తెచ్చిన అభివృద్ధి రాజకీయాలను (developmental politics) కూడా ఈ కథ ప్రశ్నిస్తుంది. ప్రపంచీకరణ వెనుకఉన్న భీభత్సాన్ని ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జీవితాలు ధ్వంసమై అవి పారిశ్రామికంగా, ముందుకు వచ్చిన వర్గాల అభివృద్ధికి సోపానమౌతున్న వైనాన్ని కూడా ఈ కథ తెలియజేస్తుంది.

7. కేతు కథల్లో కళాత్మక, సామాజికశిల్పం:

ఒక సామాజిక సందర్భం మారుతున్న తీరును ఒక సామాజికశాస్త్రవేత్త చర్చించే పద్ధతికి, కాల్పనిక సాహిత్యంలో ప్రతిఫలింపజేసే విధానానికి మౌలికవ్యత్యాసం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాల్పనిక రచయిత సామాజికశాస్త్రాన్ని అవగాహన చేసుకున్న వారిగా ఉండాలి తప్ప, సామాజికశాస్త్రవేత్తలా విశ్లేషించకూడదు. ఈ విషయం కేతుకు బాగా తెలుసు. కాబట్టే, ఒక ఊళ్ళో ఒకటి రెండు దశాబ్దాలుగా వచ్చిన మార్పుల క్రమం మొత్తాన్ని మూడు నాలుగు చిన్న పేరాగ్రాఫులలో చిత్రించారు. ఉదాహరణకు :

"జీపులు మొగం, కార్లమొగం, పెద్దగా చూడని చిలమకూరు రోడ్డుమీద ఇప్పుడు జీపులు, కార్లు అదే పనిగా అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఫ్యాక్టరీ కట్టే చోటుకు రాళ్ళు తీసుకుపోతూ గతుకుల రోడ్డుమీద లారీలు. లారీల్లో ఆ రాళ్ళలాగా ఆడ, మగా... రోడ్డు పక్కల కొత్త అంగళ్ళు, చార్మినారు, సిజర్ తప్ప నిన్న మొన్నటి దాకా మరే రకం సిగరెట్లు దొరకని అంగళ్ళలో రెడ్ విల్స్ దాకా చాలారకాలు కనబడుతున్నాయి. బ్రాందీ షాపులే ఇంకా వచ్చినట్లు లేదు.... ఇన్నేళ్ళ వ్యవసాయం, వానమీద ఆధారపడిన వాణిజ్య పంటలు, రాళ్ళ గనుల వ్యాపారంలో లేని కొత్త మార్పులు ఇప్పుడు కనబడుతున్నాయి”.

కేతు ఈ మార్పుల నేపథ్యంలో చిలమకూరులో సామాజిక సంబంధాలలో వచ్చిన మార్పులను చిత్రించారు. ఈ మార్పులు కలిగిస్తున్న విధ్వంసాన్ని, విషాదాన్ని ఈ మార్పు కథలో సంకేతించారు. ఆ రాళ్ళలాగా ఆడ మగా అని అన్నప్పుడు మనిషి వస్తువుగా మారిన వైనాన్ని సహజంగా మనిషికి ఉండే చైతన్యాన్ని కోల్పోయిన స్థితిని సూచించారు. వర్తమాన సమాజంలో వ్యక్తులు తమ శ్రమను సరుకుగా మార్చుకొని జీవిస్తూ తామే వస్త్వీకరించబడుతున్నారు. ఈస్థితికూడా ఈ చిత్రీకరణలో ప్రతిఫలించింది.

8. విశ్వనాథరెడ్డి సాహిత్య మూర్తిమత్వం:

రచయిత కేవలం ఎటువంటి ప్రత్యేక సాహితీమూర్తిమత్వం (literary personality) లేకుండా చిత్రించినట్లయితే, ఆ రచయిత గొప్పతనమేమీ వుండదు. ప్రత్యేకత కనిపించదు. అటువంటి రచన అనివార్యంగా మూస రచన అవుతుంది. ఈ సందర్భంలో ప్రముఖ ఆంగ్ల మార్కిస్టు విమర్శకుడు Terry Eagleton మాటల్ని గుర్తు చేసుకోవటం అవసరం. ఆయన ఇలా అంటారు. "Every writer is individually placed in society, responding to a general literary from his own terms particular stand - point, making sense of it in his own concrete terms" (Marxism and Literary Criticism, London: Rutledge 1987, P.8)

కేతుకు తనదైన రచనా వ్యక్తిత్వం సంస్కారం వున్నాయి. విషయచిత్రీకరణలో తనదైన ముద్రఉంది. అందువల్లే ఈకథలో అవి అనివార్యంగా ఆవిష్కరించబడ్డాయి.

విశ్వనాథరెడ్డి చిలమకూరులో వచ్చిన మార్పుల్ని కేవలం ఒక మేధావి దృష్టి నుంచి మాత్రమే కాక, ఒక మామూలు వ్యక్తి తన నమ్మకాన్ని, అప్పటి దాకా జీవించిన కనీసం సానుకూలంగా భావించిన విలువలు, స్థితిగతులు తనకళ్ళముందే ధ్వంసమవుతున్నపుడు వాటిపట్ల ఒకానొక nostalgic దృష్టితో స్పందించి, ఆ స్పందననే కథగా మలిచారు. ఈ విషయాన్ని సెంటిమెంట్ అన్నా నష్టంలేదు. తన చిన్నతనంలో ఆ ఊరి అరుగుమీద మామూలుగా కనబడే ఊరి సంఘజీవితం ధ్వంసమయింది. జనం సమూహంగా కూర్చొని కథలు చెప్పుకున్న చోట మట్కా జూదం ఆడే స్థితి దాపురించింది. అంటే, సామాజిక జీవితం (Communitarian life) ధ్వంసమయి దాన్ని వ్యాపార విలువలు ఆక్రమిస్తున్న వైనాన్ని రచయిత ప్రతిఫలింపజేస్తున్నారు.

ఇరవై ఏళ్ళక్రితం తమ భాగస్వామిగా వున్న గ్రామీణజీవితంలోని ఆత్మీయస్పర్శను నగరజీవితంలో కానరాని ఆ ఆనందాన్ని, అనుభూతులను అతను ఎంతో Romantic గా సృష్టించుకుంటున్న జీవితం ధ్వంసమయి దాని స్థానంలో తన కళ్ళముందు కనిపిస్తున్న జీవితాన్ని రెండింటిని పోల్చుకొని రచయిత పడిన వేదన ఈ కథలో ఆవిష్కరింపబడింది. తను జీవించిన జీవితంలో సగం అంతర్ధానమయినట్లు కథకుడు భావించటం అతని వేదనా ఫలితమే. అలాగే రెండు దశాబ్దాల క్రితం స్వయం సమృద్ధిగా ఉన్న (Self-sufficient) ఒక ఊరి ఆర్థిక వ్యవస్థతోపాటు విలువల వ్యవస్థకూడా పతనమయిన క్రమాన్ని రచయిత చిత్రించారు. ఈ క్రమం వ్యాపారీకరణ క్రమంగా వుండటం మరింత విషాదం. అలాగే వ్యవసాయ భూముల్లో పనులు చేసుకుంటున్న కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న చిన్న రైతులు క్రమంగా సిమెంటు ఫ్యాక్టరీ కూలీలుగా మారిన తీరును ఆ క్రమంలో ధ్వంసమయిన మానవ సంబంధాలను కూడా రచయిత పట్టుకోగలిగారు. అలాగే ఆర్థికపతనం మనుషుల సంబంధాలలో తెచ్చిన మార్పులు, ఆ మార్పులు సృష్టించే విలువల పతనం అన్నీ కూడా ఈ కథకుడి దృష్టినుంచి తప్పుకోలేకపోయాయి.

కేతు పై క్రమాన్ని మాత్రమే చిత్రించి ఉంటే, అది ఒక మంచి కథ మాత్రమే అయిఉండేది. గొప్ప కథకుడు ముఖ్యంగా మార్క్సిస్టు పరిజ్ఞానం ఉన్న కథకుడు వర్తమాన విషాదం నుంచి భవిష్యత్తులో వచ్చే సానుకూల మార్పుల్ని చూడగలగాలి, విశ్లేషించగలగాలి. అప్పుడు మాత్రమే అది గొప్ప కథ కాగలుగుతుంది. భవిష్యత్తులో రాబోయే మార్పును ఈ వాక్యంలో "పైన సిమెంటు, ఎముకల పొడి కలసిన రంగులో ఆకాశం. ఆ మూల యెక్కడో యెర్రగావు....” అంటూ రచయిత భవిష్యత్తులో జరిగబోయే కార్మికుల ఉద్యమాన్ని ప్రతీకాత్మకంగా సూచించారు.

9. కథావైవిధ్యం - విస్తృతి - సందేశాత్మకత:

పీర్లసావిడి” కథలో తమ స్వార్థ రాజకీయాల కోసం, ఓట్లు దండుకోవడం కోసం గ్రామ పెత్తందార్లు అమాయకులూ, బలహీనులూ అయిన వాళ్ళను ఎలా మభ్య పెడతారో వారిని పాచికలుగా ఎలా ఉపయోగించుకుంటారో - తమ అవసరం తీరిన తరువాత, మళ్ళీ వాళ్ళను తమ కాళ్ళ కింద ఎలా అణగ దొక్కుతారో పాఠకుల కళ్ళ ముందు బొమ్మ కట్టేలా చిత్రిస్తాడు రచయిత.

దప్పిక” కథలో ఒక రిటైర్డు డిప్యూటీ తాసిల్దారు ప్రభుత్వోద్యోగంలో ఉన్నపుడు ఆక్రమించుకున్న బంజరును ప్లాట్లు చేసి అమ్మితే లక్ష రూపాయలు వస్తుంది. ఆ సొమ్ముతో ఒక ఇల్లు కట్టుకుంటాడు. కొంత భూమికొని గంగన్న అనే రైతు మిత్రుని తోడ్పాటుతో బావి తవ్వించి మోటారు పెట్టిస్తాడు. నీటి సౌకర్యం సమకూరడంతో వరి, చెరుకు సమృద్ధిగా పండుతున్నాయి. రైతులందరితో మంచిగా, స్నేహపాత్రునిగా వుంటూ వాళ్ళ అవసరాలకు 'వడ్డీ'కి డబ్బు ఇస్తూ సాయపడుతుంటాడు. అంతేకాక తన నేల విస్తారమై బాగా పండి సాటి మనుషులకు సాయపడే శక్తిని పెంచుకోవాలనే కోరిక కూడా డిప్యూటీ తాసిల్దారుకు ఎక్కువవుతుంది. ఆ కోరిక పర్యవసానమే గంగన్న పది కుంటల చెరుకు తోట స్వాధీనం. తానేదో రైతులకు సాయం చేస్తున్నాననుకుంటాడు. కానీ అతడు చేస్తున్నది వాళ్ళను బికార్లుగానే కాని..... సాయం ఎంత మాత్రం కాదు.

రైతుల అవసరాలకు డబ్బు లిచ్చి వాటిపై వడ్డీలు, ఆ వడ్డీలపై వడ్డీలు వేసి, అంత మొత్తాన్ని కట్టలేని రైతుల భూమి స్వాధీనం చేసుకుంటాడు. ఇలాగ అతని నేల విస్తారమవుతుంది. అవి బాగా పండి సాటి మనుషులకు సాయపడడమంటే కూలీల శ్రమను అధికంగా వాడుకుని, ఎంతో కొంత కూలీగా ముట్టచెప్పడం కూడా తన స్వలాభం కాక కూలోళ్ళకు పని కల్పించి సాయపడుతున్నానంటాడు. మరి నీళ్ళు, కరెంటు, డబ్బులు అన్నీ కూడా అప్పుగా మాత్రమే ఇస్తాడు. ఎంతో ఉదారతతో ఇచ్చినట్టుగా ఖరీదు కట్టి జాణతనంతో వాళ్ళను భూమి లేని బికార్లుగా చేస్తూ పైగా వారికి తనెంతో సాయపడుతున్నట్లూ తన వల్లనే వాళ్లు సుఖపడుతున్నట్లూ విర్రవీగే వాళ్ళ స్వార్థపూరిత ఆలోచనల్లో గల లొసుగుల్ని ఈ కథలో విశ్వనాథరెడ్డిగారు చాలా నిగూఢంగా చెబుతారు.

అధికారులలో గల కులాభిమానాన్ని తమ స్వార్థం కోసం వాడుకోవాలనుకున్న యాజమాన్యపు ఎత్తులను చిత్తు చేస్తూ ప్రాంతీయ, కుల, మత భేదాలు మరచి కార్మికులంతా తమ హక్కుల కోసం, సుందరమైన భవిష్యత్తు కోసం కార్మిక నాయకుల నాయకత్వాన జరిగే సామూహిక పోరాటంలో ఐక్యమైన వైనాన్ని 'శ్రుతి' అనే కథలో చిత్రించారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, పదవులలో వున్న వాళ్ళలో రాజ్యమేలుతున్న విలువలను విశ్వనాథరెడ్డిగారు. 'శ్రుతి' కథలో ఎండగట్టారు.

"కూలివాళ్ళ సమస్యలు చూసినంత మాత్రాన సులభంగా అర్థమయ్యే సమస్యలు కావు” అని 'శ్రుతి', 'మార్పు’ మొదలైన కథలలో అంటాడు రచయిత. ఈ మాట చాలా లోతైనది. కూలోళ్ళకు జరుగుతున్న అన్యాయం అర్థం కావాలంటే ప్రత్యేకమైన తాత్వికఆలోచన వుండాలి. ఎందుకంటే లోకంలో ముందే స్థిరపడిన కొన్ని విలువలు ఉన్నాయి. ఉదాహరణకు: మనకెంత ప్రాప్తముంటే అంతే పొందగలమన్న కర్మసిద్ధాంతం లాంటివి. మనం పుట్టినప్పటి నుండి ఎరిగిన నీతి, న్యాయం, ధర్మం అన్నీ మనం ముందుగా నమ్మిన సిద్ధాంతాలను అనుసరించే వస్తాయి. ఈ భావ జాలాన్ని లొంగదీసి వాస్తవ స్వరూపాన్ని దర్శించ కలిగే శక్తిని అలవరుచుకోవాలి. శ్రమ విలువ, అదనపు విలువకు గల సంబంధాన్ని గుర్తించే సామర్థ్యం వుంటే గాని దోపిడీశక్తుల మూలాలపట్ల అవగాహన కలగదు. అందుకే పాఠకున్ని లోతుగా ఆలోచించమని చెబుతూ, అది ఆషామాషీగా అర్థమయ్యేది కాదని సూచిస్తారు.

డబ్బు చేసే మాయలు చాలా కథలలో ఎక్కడో ఒకచోట వ్యక్తమవుతూనే వుంటాయి. పాఠకుడికి ఒక దృష్టి కోణాన్ని అందిస్తాయి. మన వైభోగమింతే కదా! అన్న ఆలోచనలో పడవేస్తాయి.

నీ నల్లరేగడి మీద తుంగభద్ర నీళ్ళు పారనీ! నాలుగు పెద్ద ఫ్యాక్టరీలు రాని, అన్నీ డబ్బు చుట్టూ జీవితాలేనని తెలిసి వస్తుంది" వెనకా ముందూ జరిగిన జీవితమంతా అంతే అంటాడు. 'వెనకా ముందు' కథలో మాధవ పాత్రధారి.

పెద్దల అభీష్టం మేరకు పిల్లలు తమ అభిరుచులను, ప్రవర్తననూ ఏర్పరచు కోవాలనుకోవడం వలన జరిగే దుష్పరిణామాల గురించి తెలియచేసే కథ 'తలాడించే బొమ్మ'. ఈ సమాజం మనకందించిన కృత్రిమమైన విలువలను ఉన్నతంగా ఊహించుకుని మన పిల్లలు కూడా అలాగే అనుసరించాలని వారి అభిరుచులకు గండికొట్టి, వారి అభివృద్ధికి సోపానాలు వేస్తున్నామనుకొంటూ మురిసిపోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు ఇష్టమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరగనిచ్చివారిలో మానసిక వికాసం, వ్యక్తిత్వం కలిగేట్లు ప్రవర్తించాలన్న స్పృహను ఈ కథలో విశ్వనాథరెడ్డిగారు చాలా సమర్థవంతంగా వివరించగలిగారు.

10. సింహావలోకనం:

రాయలసీమ గ్రామీణ వాతావరణంలో వస్తున్న మార్పుల్ని 'తేడా' కథలో విశ్వనాథరెడ్డిగారు స్పష్టంగా చిత్రించగలిగాడు. పట్టణ జీవితాన్ని, అందులోని సంఘర్షణ, వైరుధ్యాలను విస్మరించలేదు. అందుకు నిదర్శనంగా అధ్యాపకునిగా తన అనుభవాన్ని, అనుభూతిని అద్భుతంగా ప్రకటిస్తూ 'తలాడించే బొమ్మ', 'రెక్కలు' మొదలైన కథలు వ్రాశారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న సూత్రం రచయితకు స్పష్టంగా తెలుసు. కాని తన కథలలో ఎక్కడా దాన్ని వాచ్యంగా చెప్పడు. అనుబంధాలూ, ఆత్మీయుతలూ, ప్రేమాలూ ఇలాంటి వాటన్నిటిని శాసించేది డబ్బేనన్న చేదు నిజం రచయితకు తెలుసు.

రచయితకు ఒక తాత్విక దృక్పథం ఉంది. జీవితాన్ని నడిపించే ఆర్థికసూత్రాల గురించి రచయితకు స్పష్టమైన అవగాహన వున్నప్పటికీ, సాంకేతిక పదజాలంతో ఎక్కడా పాఠకుణ్ణి కన్ఫ్యూజ్ చెయ్యడు. ఆయన కథలలోని పాత్రలు కూడా ఎక్కడా కథనానికి సంబంధం లేని ఉపన్యాసాలు ఇవ్వవు. చర్చలు చెయ్యవు. కథనంలో, పాత్ర చిత్రణలో, విశ్లేషణలో తనకున్న తాత్వికకోణాన్ని విశ్వనాథరెడ్డి చాలా సున్నితంగా వ్యక్తం చేస్తారు.

శిల్పరీత్యా రచయిత సాధించిన నైపుణ్యానికి 'వెనుకా ముందూ', 'ఆత్మరక్షణ', 'ప్రేమరూపం', 'ఎవరు మీరు', 'దూరం' మొదలైన కథల్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక వస్తువు విషయంలో విశ్వనాథరెడ్డి కథలలో పేలవమైన కథావస్తువులకు చోటు లేదు. అందుకు రచయిత అవగాహనా 'స్థాయి'ని అనుభవ పరిధిని అవలోకించిన పాఠకుని హృదయం స్పందించక మానదు. “కథ చదవక ముందు, చదివిన తర్వాత పాఠకుడు ఒకే తీరుగా వుంటే అది మంచి కథ కాదు" అన్నారు కొడవటిగంటి కుటుంబరావు. ఈ కథలు చదివిన తర్వాత పాఠకుల మెదళ్ళు ఆలోచనల పుట్టలౌతాయి.

కథకులు రెండు రకాలుగా ఉంటారు. ఒక తరగతికి చెందిన కథకులు అనుభవంలోకి వచ్చిన విషయాలను తాత్వికంగా విశ్లేషించుకొని వాటిని కథల్లో కొన్ని పాత్రల ద్వారా ఆవిష్కరించే వాళ్ళు. ఇక్కడ వైయక్తిక అనుభవానికి ప్రాధాన్యత ఉంటుంది. రెండవ తరగతికి చెందిన వాళ్ళు తమ కళ్ళముందు సమాజంలో జరిగే మార్పులను, సంఘటనలను పరిశీలించి, ఆ పరిశీలనలను విశ్లేషణాత్మకంగా చిత్రించే వాళ్ళు. కేతు విశ్వనాథరెడ్డి ఈ రెండవ వర్గానికి చెందిన రచయిత. ఆయన కథలు అనుభవ ఆవిష్కరణలుగా కాక సమాజ సందర్భాల విశ్లేషణలుగా ఉంటాయి. ఇక్కడ వైయక్తిక అనుభవం కంటే సామాజిక చలన పరిశీలన కీలకంగా ఉంటుంది. ఒక కథా రచయితగా కేతు విశ్వనాథరెడ్డి మార్క్సిజాన్ని తన విశ్లేషణా పరికరంగా కోరుకుంటున్న రచయిత. అందువలన ఈయన పరిశీలన, ఆ పరిశీలనకు ఆయనిచ్చే ప్రాధాన్యత ఆయనకున్న మార్క్సిస్టు సిద్ధాంత పరిధిలో ఉంటుంది. ఇందుకు మంచి ఉదాహరణ “నమ్ముకున్న నేల.” కథ విస్తృతమైన జీవితానుభవమే కాక, నిర్దిష్టమైన సైద్ధాంతిక బలం ఉంటే తప్ప “నమ్ముకున్ననేల” లాంటి కథ రాయటం సాధ్యంకాదు. ఈ రెండు లక్షణాలు కేతు విశ్వనాథరెడ్డికి పుష్కలంగా ఉన్నాయి. అందువలన ఆయన తన కథను అద్భుతమైన వస్తు శిల్ప సమన్వయంతో రాయగలిగారు.

11. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గుప్తా, పి. సి. లిటరేచర్ అండ్ సొసైటీ. ప్రోగ్రసివ్ పబ్లికేషన్స్, హైదరాబద్, 1992.
  2. బాలు రావ్, ఎస్.  ట్రెడిషన్ అండ్ ఎక్స్పరిమెంట్ ఇన్ ఇండియా ఇన్ ఇండియన్ లిటరేచర్ మార్చ్-ఏప్రిల్
  3. వాఙ్మయి త్రైమాసిక పత్రిక, జూలై .పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, సెప్టెంబర్
  4. వెంకటసుబ్బయ్య వల్లంపాటి, కథాశిల్పం" విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1995.
  5. స్వామినాథన్. ఎం.ఎస్. S. Swaminathan Report on Indian Agrarians- The National Commission on Farmers (NCF) submitted four reports in December 2004, August 2005, December 2005, and April 2006 respectively.  The fifth and final report was submitted on October 4, 2006.  The reports contain suggestions to achieve the goal of "faster and more inclusive growth" as envisaged in the Approach to 11thFive Year Plan.
  6. స్వామినాథన్ కమిషన్ - ది నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ విత్ ఇన్ ద బ్రాకెట్ ఎన్సిఎఫ్ వాస్ కాన్స్టిట్యూట్ ఆ నవంబర్ 18, 2004 అండర్ ద చైర్మన్ ది నేషనల్ కమిషన్ అండ్ ఫార్మర్స్ సబ్మిటెడ్ ఫోర్ రిపోర్ట్స్ ఇన్ డిసెంబర్ 2004 ఆగస్టు 25 డిసెంబర్ 25 అండ్ ఏప్రిల్ 2006 రెస్పెక్టివ్లీ ఫిఫ్త్ అండ్ ఫైనల్ రిపోర్ట్ -  కాజెస్ ఫర్ ఫార్మర్స్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]