headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

2. జానపదవిజ్ఞానపరిశోధక బ్రహ్మ: 'ఆర్.వీ.యస్. సుందరం'

ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి

తెలుగుశాఖ పూర్వాధ్యక్షుడు
కాశీ హిందూ విశ్వవిద్యాలయం,
వారణాసి - 221005, ఉత్తరప్రదేశ్.
సెల్: +91 94538842928318891225, Email: sreeramachalla@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

జానపద సాహిత్యాన్ని అర్ధం చేసుకోవడానికి, దాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రీయ అవగాహన అవసరం. ఈ రెండు లక్షణాలు పుష్కలంగా కలిగిన ఆచార్యుడు ఆర్వీయస్ సుందరం. విద్యార్ధులకు దాదాపు రెండు దశాబ్దాలు జానపద విజ్ఞానాన్ని బోధించిన అనుభవం సుందరంగారి సొత్తు. అంతేకాకుండా తెలుగు, కన్నడ భాషలలో నిబిడీకృతమైన జ్ఞానపద విజ్ఞాన రహస్యాలను వెలుగులోకి తెచ్చిన సాహితీ కృషీ వలుడు. జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనుకొనే ముందుతరాలవారికి శాస్త్రీయ దృక్పధాన్ని కలిగించిన పరిశోధక పరమేశ్వరుడు మన ఆర్వీయస్ సుందరం. జానపదవిజ్ఞానంలో భాగమైన సాహిత్యంలో వివిధ అంశాలపై సుందరం కృషిని పరిచయం చేసి, సోదాహరణంగా విశ్లేషించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం.

Keywords: జానపదం, సాహిత్యం, గేయం, సుందరం, సామెతలు, పొడుపుకథలు

1. ఉపోద్ఘాతం:

సరళ సుందర పదగుంఫనలతో మొదలు పెట్టిన రాళ్ళపల్లి వంశోద్భవుడైన సుందరం గారి సాహితీ వ్యవసాయం 1969 నుండి ప్రారంభమైంది. చిన్నారి పొన్నారి చిరుతకూకటి నాడు రచనలు ప్రారంభించిన శ్రీనాథునిలా సుందరం గారి రచనలు నేటికీ నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి. ఇంచుమించుగా శతాధిక రచనలు పుర్తిచేసిన నిగర్వి మన సుందరం గారు. సమాజాన్ని అతి దగ్గరగా గమనించేవారు ఎందరో వుంటారు. కాని సంఘటనలకు స్పందించే గుణం ఉన్నవారు కొందరే. ఇంకొందరు వాటికి తమ కవితా శక్తిని జోడిస్తారు. మరికొందరు సంవేదన శీలులవుతారు. వీరికి సమాజంలోని సమస్యలకు పరిష్కారాలను సూచించేలా సొంతగొంతుగల కవితలతో అక్షరబద్ధం చేస్తుంటారు.  కవులలోని భావుకుడు దీనితో వెలికి వస్తాడు. కవితలుగా, వ్యాసాలుగా, కథలుగా, నవలలుగా, విమర్శనాత్మక ధోరణులువంటి సాహితీ సృజనలతో సమస్యల గుట్టు విప్పగలుగుతారు. రాళ్ళపల్లి సుందరం గారి రచనలు అన్నీ ఈ కోవలో రచించినట్టు చెప్పుకోదగ్గవి. కవిత, నవల, కథ, విమర్శ, జానపద విజ్ఞానం, సంపాదకత్వం, జీవిత రేఖాచిత్రాలు, విజ్ఞాన సర్వస్వాలు, అనుసృజనలు, సాహితీ వ్యాసాలు, గ్రంథ పరిష్కరణ శాస్త్రాలు, కన్నడ భాషా సాహిత్యాల వివేచనలు, స్వీయ రచనానుభవాలు, భాషాశాస్త్ర విజ్ఞాన విశేషాలు వంటి వివిధ ప్రక్రియల విశేష రచనలు సుందరం గారి సాహితీ సృజనకు నికషోపలాలు.

1970 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతిపొందిన సుందరం గారి రచన “తెలుగు సాహిత్యంలో దేశీ కవిత”. దీనితో వారి ఆలోచన దృష్టి పరిశోధనలవైపు మరలింది. దాని ఫలితంగా “కవిలో తపన, ఉత్సాహం, ఉద్రేకం, కలలు, కన్నీళ్ళు” ఉంటాయనే అభిప్రాయాన్ని కలిగించాయి. ఈ మాటలు ఆత్మనివేదనంలో వివరించారు.(సుందర రచనలు పుట 25) ఈ లక్షణాలు జానపదుల మనసులకు ప్రతిబింబాలవుతాయి. ప్రస్తుత వ్యాసం ఈ కవి రచించిన జానపద విజ్ఞాన సాహితీ కృషికి పరిమితం.

జానపద సాహిత్యాన్ని అర్ధం చేసుకోవడానికి, దాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రీయ అవగాహన అవసరం. ఈ రెండు లక్షణాలు పుష్కలంగా కలిగిన ఆచార్యుడు ఆర్వీయస్ సుందరం. విద్యార్ధులకు దాదాపు రెండు దశాబ్దాలు జానపద విజ్ఞానాన్ని బోధించిన అనుభవం సుందరంగారి సొత్తు. అంతేకాకుండా తెలుగు, కన్నడ భాషలలో నిబిడీకృతమైన జ్ఞానపద విజ్ఞాన రహస్యాలను వెలుగులోకి తెచ్చిన సాహితీ కృషీ వలుడు. జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనుకొనే ముందుతరాలవారికి శాస్త్రీయ దృక్పధాన్ని కలిగించిన పరిశోధక పరమేశ్వరుడు మన ఆర్వీయస్ సుందరం. ఈ రంగంలో వీరి సాహితీ కృషిని గుర్తించినందులకే Ph.D, D.Litt. డిగ్రీలు లభించాయి.“పల్లె తల్లి వంటిది. పట్టణం ప్రియరాలు వంటిది. పల్లె రమ్మంటుంది. పట్టణం తెమ్మంటుంది”. అని తెలిపిన దేవులపల్లి కృష్టశాస్త్రి గారి మాటలిక్కడ గుర్తు చేసుకోవాలి. అందుచేతనేనేమో సుందరం గారి మనసు జానపద విజ్ఞాన రంగ పరిశోధనకు పరుగులు తీసింది. జానపద అధ్యయన జిజ్ఞాసువులకు వీరి పరిశోధక గ్రంథాలు నేడు దిశానిర్దేశనం చేస్తాయి. జానపద విజ్ఞాన పరిశోధక పితామహుడుగా పేరు పొందిన స్వర్గీయ ఆచార్య బి.రామరాజు గారి కృషికి సుందరం గారి రచనలు కొనసాగింపులే.

2. జానపద విజ్ఞానం- పరిచయం:

జానపద విజ్ఞానం అనేది అంగ్లంలో Folklore జానపద సాహిత్యాన్ని Folk Literature అనీ అంటారు. ఈ రెండిటినీ సమానార్ధకాలుగా తెలుగులో వాడుతున్నారు. జనపదం అనగా గ్రామం అని అర్ధం. జానపదులు అంటే పల్లెటూరి వారు. కేవలం వారికి సంబంధించిన సాహిత్యమే జానపద విజ్ఞానం అని చెప్పటం సబబు కాదు. నేడు నగరాలలో కూడా చదువు రాని జానపదులు నివశిస్తున్నారు. వారి స్వీయ ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, వేషధారణ, భాష, ఆహారాదుల వంటివి నేటికి కొనసాగిస్తూనే, నగరాలలో నివశిస్తున్న గ్రామీణులు ఎందరో అగుపిస్తారు. అందువల్ల గ్రామీణులైన అనాగరులు జానపదులు అని నిర్వచించటం కూడా తప్పు. ఎక్కడ నివశిస్తున్నప్పటికీ వారి ఆచారాలు, వేషభాషలు వంటివి కొనసాగిస్తూ తమ ఉనికిని నిరంతరం పాటించే జాతి జనుల జీవన విధానం కలవారే జానపదులు.

3. జానపద సాహిత్యం- సుందరం ముద్ర:

జానపద విజ్ఞానం అన్నది విస్తృత విశాల క్షేత్రం. జానపద విజ్ఞానంలో జానపద సాహిత్యం ఒక భాగం మాత్రమే. జానపద విజ్ఞానాలు వాగ్రూపమైనవి లేక మౌఖికమైనవి, వాగ్రూపంకానివి. (Verbal Folklore   and  Non-Verbal Folklore)గేయాలు, కథలు, సామెతలు మొదలైన వాటిని Verbal Arts అని పిలుస్తారు. వాగ్రూప ప్రచారాన్ని పొందే కళలు మాత్రమే జానపద విజ్ఞానం అనే తప్పు అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. కాని నమ్మకాలు, ఆచారాలు, దుస్తులు, అలంకారాలు మతం వగైరాలు అన్నీ జానపద విజ్ఞానంలోకే చేరుతాయి.

సుందర జానపదం అనే పుస్తకంలో అర్వీయస్ సుందరం జానపద సాహిత్యంలోని గేయాలను వాటిలోని అంతర్గత విశేషాలను లోతుగా అధ్యయనం చేశారు. వీటిలో ముందుగా జానపద సాహిత్యాన్ని ఇలా వింగడించారు. 1.జానపద కవిత్వం 2.గద్యకథనాలు 3.సామెతలు 4.పొడుపుకథలు. ప్రస్తుతం జానపద గేయ సాహిత్యాన్ని పరిశీలించుట జరుగుతున్నది. ఇవి 1. గేయాలు 2. కథాగేయాలు 3. గద్య కథనాలు 4. సామెతలు 5. పొడుపుకథలు.

3.1. జానపద గేయ లక్షణాలు :-

జానపద గేయ లక్షణాలకు సుందరం అందించిన నిర్వచనాలు ఇలా ఉన్నాయి.“ అజ్ఞాత కర్తృకం, సామూహిక ప్రచారం. వాక్సంప్రదాయం, జన ప్రియత్వం, సారళ్యం, అనేకుల మనస్సుల నాకర్షించి సంపాదించిన జాతీయత”. వీటిని ఎవరు రచించారో తెలియదు. జానపదుల నోళ్ళలో ఈ గేయాలు ఎల్లవేళలా నానుతుంటాయి.

పాడటానికి అనువుగా సందర్భాలు సమకూర్చుకుంటారు. మాటలను పాడటానికి అనువైన రీతిలో లయబద్ధంగా కూర్చే శక్తి జానపదుల సొత్తు. ఈ గేయాలకు ప్రత్యేక కవి, నియమిత స్వరూపం లేక పోవటమే జానపద గేయ మరొక లక్షణం. కలాలు, కాగితాలు అవసరం లేకుండా తోచిన భావాలకు తక్షణ రూపం ఇవ్వడమే ఆశురచన.ఈ ఆశురచన జానపద గేయాలకున్న మరొక లక్షణం. జానపద గేయాల పుట్టుక, వికాసాలను గూర్చి శాస్త్రీయ అవగహన ఏర్పడాలంటే మానవ శాస్త్రాన్ని, జీవశాస్త్రాన్ని, మనస్తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అవసరం.

3.2. జానపద గేయాలు – ఆవిర్భావ వికాసాలు :-

జానపదులకు సంతోషం కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, దు:ఖం కలిగినప్పుడు భావావేశాన్ని వ్యక్తం చేయడానికి తగిన లయాత్మకమైన పదాలు వాటంతటవే వస్తాయి.“తన మనోభావాన్ని

ఎదుటివారితో చెప్పడం ఎప్పుడైతే మానవుడు నేర్చుకున్నాడో, అప్పట్నుంచే కవిత్వం పుట్టుకొచ్చింది. మలమల మాడ్చే ఎండలు, హోరున కురిసే వర్షాలు, ముడుచుకుపోయే చలి, ఆనందంతో హృదయాన్ని ఉర్రూతలూగించే పంటపొలాలు, శరీరాన్నంతటినీ కదలింపజేసే కష్టమైన పనులు, చావులు, పుట్టుకలు, పెళ్ళిళ్ళు, పేరంటములు, పండుగలు, పబ్బాలు ఒక్కటేమిటి ప్రతీ సంఘటన, ప్రతీ సన్నివేశము పల్లెటూరివారి కవితావేశానికి మూలకందాలవుతూ వచ్చాయి”. అని చెప్పిన నేదునూరి గంగాధరం గారి మాటలను సుందరం గారు సమర్థించడాన్ని గుర్తు చేసుకోవాలి. పనికి - పాటకు ఉన్న సంబంధం జానపద గేయాలు వెలువడటానికి కారణ మయింది. శ్రామికులైన మానవులు తమ శ్రమను మరచిపోయేందుకు పాటలను అలంబనగా చేసుకొన్నారు. వారి సంతోషాలు, దు:ఖాలు, మానవాతీత శక్తులకు విన్నవించుకోవడానికి లయాత్మక గీతాలు వెలువడ్డాయి. దేవుడు ఉన్నాడనే భావంతోపాటు, మానవాతీత శక్తులపై వీరికి విశ్వాసం ఎక్కువ. ఈ గీతాలు లౌకిక, పారమార్ధిక గీతాలుగా సుందరం గుర్తించి, మరింత లోతుగా పరిశీలించి నాలుగు రకాలుగా ఇలా విభజించారు. 1. పురుషుల గీతాలు 2. స్త్రీల పాటలు 3. ఉభయుల గేయాలు 4. పిల్లల పాటలు . ఎంతగా లెక్కవేసినా మానవులలో మనకు కనిపించే వర్గాలు మూడే. పురుషులు, స్త్రీలు, పిల్లలు అనేవి. ఈ వర్గాలకు సంబంధించిన పాటలు, స్త్రీ పురుషు లిరువురు చేరి పాడే పాటలు. ఒక్కొక్కసారి స్త్రీల పాటలనే పురుషులు పాడవచ్చు. పురుషుల పాటలను స్త్రీలు పాడవచ్చు. అలాగే పిల్లలకోసం లాలిపాటల్ని పెద్దవారు పాడతారు. వలపు, హాస్య, శోక, శ్రమ, క్రీడ, నృత్య వంటి గేయాలు ఎన్నో ఉన్నాయి. జానపద గేయాలను సృష్టించిన వారిని గూర్చి సుందరం గారు చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. జానపదులు జీవితంలోని సుఖ దు:ఖాలను, అనందపుటంచుల్నీ, దు:ఖపు లోతుల్నీ తరచి చూశారు. సంసారంలో ఆనందాన్నీ దు:ఖాన్ని, వివేచనల్ని హృదయాంతరంగాలలో దాగివుండే భావాలను అంతర్లీనంగా చూసే శక్తి జానపదులకు వెన్నతోపెట్టిన విద్యలు. జానపద గేయాలకు భాషా భేదాలు లేవు. తెలుపు, నలుపు, ఈ జాతి, ఆ జాతి అనే సంకుచిత దృష్టి లేదు. అన్నిటినీ సమదృష్టితో చూచే యోగులు జానపద కవులు. రవీంద్రుడు చెప్పినట్లు జానపదుల గీతాలు మనస్సునూ హృదయాన్నీ తెలుసుకోడానికి సహాయకారులై ఉన్నాయి.“వేరు వేరు ప్రదేశాల పల్లెపాటల్లో కనిపించే సమాన గుణాలవల్ల ఆద్యంతం మానవ స్వభావాల్లోని వైవిధ్యంలో ఏకత్వాన్ని మనం చూడగలం. అన్ని దేశాల జానపద గీతాలను సేకరించి, ఒక దానితో మరొక దానిని పోల్చి చూస్తే సర్వ మానవ కులాల సామాన్యమైన మనస్సు, హృదయం వాటిలో కలిగి ఉండడాన్ని చూడవచ్చు”. అని పలికిన రాళ్ళపల్లి సుందరం గారి పలుకులు,వారి జానపద గేయ విజ్ఞాన పరిశోధన పటిమకు నిదర్శనము.

3.3. కథా గేయాలు:

జానపద సాహిత్యంలో ప్రధానమైన భాగంగా కథా గేయాలు చెప్పుకోవాలి. జానపద కథా గేయాలను కొందరు వీరగాథలు(Ballads)అనీ పిలుస్తారు. కథాగేయాలు భావాత్మకాలు.వీటికి బాహ్యస్వరూపంలో LYRIC ను, అంత: స్వరూపంలో EPIC ను పోలి ఉంటాయని విమర్శకుల భావన. మొత్తం మీద వాగ్రూపమైన సంప్రదాయంలో తరాలంతరాల ప్రభావంతో రకరకాల పాఠాంతరాలతో, మార్పులతో సామూహికమైన వికాసం కలిగిన కథాగేయాలన్నీ జానపదుల సొత్తే. కథాగేయలకు సహజ శైలి, ఆశు రచన ప్రత్యేక లక్షణాలు. వీర రస ప్రధానమైనవి. నిర్దిష్ట కవి అంటూ ఎవరూ ఉండరు. కొన్ని కథలలో ఒక సన్నివేశం నుంచి మరొక సన్నివేశానికి వెళ్శిపోవడం, మధ్య మధ్య కథాగతిలో ఏదో వెలితి ఉండడం కథాగేయాలలో కనిపిస్తూంది. కొన్ని పడిగట్టు పదాలు దొరలడం. శ్రోతల మనసులకు హతుకొనేట్లుగా ఉంటూనే, పునరుక్తి లక్షణాలు ఉండటం వీటి స్వభావం. ఈ జానపద కథాగేయాలకు లక్షణ గ్రంథాలను అనుసరించే ఛంధోనియమాలు ఉండవు. కథ చెప్పే తీరే వీటికి ఉన్న బలం. గాయకులు, వాద్యసహకారులు వీరికి అవసరం. వీటిని సాంప్రదాయిక కథాగేయాలు, జనప్రియ కథాగేయాలు, సాహితీ కథా గేయాలు అని విభాగించ వచ్చును.కథాగేయాల సేకరణ పాశ్చాత్య దేశాలలో17వ శతాబ్దంలోనే ప్రారంభమయింది. తరువాత వీటి అధ్యయనం మొదలయింది. క్రీ.శ 1842లో సి.పి.బ్రౌను, ఒక జంగమ దేవరను నెలరోజుల పాటు తన ఇంట్లో ఉంచుకొని బొబ్బిలి కథ, రాముడి కథ, కాకమ్మ కథలను పాడించి, రాసి, భద్రపరచడం మనం స్మరించుకొని తీరాలి. 1874 లో J.A BOYLE దొర, సర్వాయిపాపని కథను సేకరించారు. డా. బిరుదురాజు రామరాజు, డా నాయని కృష్టకుమారి, డా టి.వి సుబ్బారావు ప్రభృతులు తెలుగులో జానపద కథాగేయాలను గూర్చి చేసిన కృషిని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి.

జానపద కథాగేయాలకు ఇతిహాసాలే మూలకందాలు. సహజత్వమే ప్రమాణంగా అవతరించిన రసగుళికలు. ఇవి సాంఘిక ప్రయోజనాన్ని సాధించడంలో కూడా మహత్తర పాత్రను వహించే శక్తి కలిగినవి. రష్యాలో విప్లవ సాధనకు జానపద కవిత్వ పద్ధతులను వాడుకున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. “సర్వజనాకర్షణశక్తి, సంఘ సంచాలక శక్తి, విచిత్రానుభూతిదాయక శక్తి కథాగేయాలకు ఉండే మూడు మహత్తర శక్తులు” అనే తంగిరాల వేంకట సుబ్బారావు గారి మాటలను

సందర్భానుసారంగా సుందరం సమర్ధించారు. ఈ కథాగేయాల సేకరణ అధ్యయనం వాటిని సాంఘిక ప్రయోజనానికి తగినట్టుగా మలచిన పద్ధతి సుందరం గారి జానపద విజ్ఞాన పరిశోధనా శక్తికి తార్కాణంగా నిలుస్తాయి.

3. 4. గద్యకథనాలు :-

కథనం అనగా చెప్పటం. మానవుల సంస్కృతీ, సంప్రదాయాల గూర్చి అధ్యయనం చేయటానికి ఉపకరించే సాధనాల్లో గద్య కథనాలు ముఖ్యమైనవి. కథ చెప్పాలి అనే అత్రుత, వినాలి అనే కూతూహలం మానవుల స్వభావం.పురాణాలకు,ఇతిహాసాలకు నమ్మకాలు ప్రధానం.అందువల్లనే పురాణాలు ,ఇతిహాసాలు, కథలు అనే ఈ మూడిటిని జానపద సాహిత్యంగా పరిగణిస్తారు. ఈ గద్య కథనాలు వచన రూపంలో ఉంటాయి. స్వతంత్రమైన, స్వయం సంపూర్ణమైన కథతో గద్య కథనాలను జానపదులు అల్లుతారు. దేవతలు, రాక్షసులు, మానవాతీత శక్తులు, బ్రహ్మ రాక్షసి, మాంత్రికుడు, పిశాచాలు, దేవతలు మొదలైన పాత్రలు, మంత్ర దండము, ఆకాశంలో ఎగరటానికి ఉపయోగించే చాప మొదలైన వస్తువులు వీటితో అల్లే కథనాలు వంటివన్నీ గద్య కథనాలే. వ్యక్తులు, స్థలాలు, వస్తువులకు సంబంధిచిన కథనాలు అన్నిటినీ ఐతిహ్యాలుగా పరిశోధకులు గుర్తించారు. వీటిలో కథా వస్తువు సరళంగా ఉంటుంది. ఈ కథనాలు స్వర్గ, మర్త్య, పాతాళాది లోకాల కన్నింటికి సంబంధించినవై వుంటాయి.సాధారణంగా వీటి ప్రారంభం “అనగా అనగా ----, ఒకానొక కాలంలో –--, కథ కంచికి - మనం ఇంటికి----, తరువాత వాళ్ళు సుఖంగా ఉన్నారు”. ఇలా గద్య కథనాలు ప్రారభంలో కాని, ముగింపులో కాని కనిపిస్తుంటాయి.

ధార్మిక సంబంధమైన ప్రాచీన కర్మకాండలే జానపద కథలకు మూలం. స్వప్నాలను మనస్తత్వ శాస్త్ర పరంగా విశ్లేషించిన తరువాత, కొందరి అభిప్రాయాలను విషయ వివేచనలకు అనుగుణంగా సుందరం ఖండించిన తీరు కథా గేయ విమర్శకు నిండుదనాన్ని పంచిందని  చెప్పవచ్చు.

పురాణ కథలు, ఐతిహ్యాత్మక కథలు, వినోద కథలు, అద్భుత కథలు, ప్రాణి కథలు, సమస్యాత్మక కథలు, జానపద కథలు వంటివాటి గురించి జరిగినంత కృషి జానపద సాహిత్యంలోని మరే ప్రక్రియలోనూ జరుగలేదు. నిశిత పరిశీలనా దృష్టిగల ఈ మాటలు జానపద విజ్ఞాన పరిశోధక బ్రహ్మగా రాళ్ళపల్లి సుందరం గారిని బలపరిచి, నిరూపించేవే. వీటన్నిటికీ సేకరణ, పరిష్కరణ, విశ్లేషణలనే మూడు దశలు

గద్య కథనాలకు అవసరం. ఈ పరిశోధన సాంస్కృతికంగా, భాషశాస్త్ర పరంగా, వర్ణనాత్మకంగా, తులనాత్మకంగా చారిత్రాత్మకంగా  ప్రచురణాత్మకంగా లోతైన అధ్యయనం జరగాలనేది సుందరంగారి సూచన. మానవాభ్యున్నతిని అధ్యయనం చేయడానికి  జానపద కథలు గొప్ప దోహదాలవుతాయి.

3.5. సామెతలు :-

సామెత అనే మాట సామ్యత నుంచి వచ్చింది. సంస్కృత భాషలో సుభాషితమనీ, సూక్తి అని పిలుస్తారు. జానపద విజ్ఞానంలో సామెతలు సాంప్రదాయికమైనవి. వివేకపూర్ణత, సంక్షిప్తత సులభవ్యక్తీకరణాలు వంటివి ముఖ్యలక్షణాలు. మొదటిది వీటి పుట్టకను,రెండవది వీటి స్వరూపాన్ని గురించి తెలుపుతాయి. అల్పాక్షరాలలో అనల్పార్థ రచనలు కలిగి ఉండేవి కావటం చేత వీటికి విలువ ఎక్కువ. సామెతలు ఒకే వాక్యంలో ఉండవచ్చు. లేక సమతూకం కలిగిన రెండు వాక్యాలు గాని, లేక ఒకే వాక్యంలో రెండు భాగాలుగా గాని ఉండవచ్చు.ఉదా; పిల్లికి చెల్లగాటం ఎలుకకు ప్రాణసంకటం. సామెతలు మానవానుభవసారాలు రంగరించిన కవితా రసగుళికలు. లయబద్ధమైన ప్రాచీన కవిత గుణాలు కలవి. మానవశాస్త్రం, భాషాశాస్త్రం ప్రకారం ప్రాచీన మానవ సంస్కృతిని ప్రతిబింబించే లయాన్వితమైనవి. మానవుని వివేక దీపిక సామెత. వైవిధ్యం సామెతలలో కనిపించే అసాధారణ లక్షణం. సామెతలు కొన్ని కథలలో నుంచే కాక, పురాణేతిహాసాలు, రామాయణ, మహాభారతాలు, పంచతంత్రాల నుండి రూపొందాయి. మరికొన్ని స్థలపురాణాలు, దేశ చరిత్రల విశేషాల నుంచి సామెతలు పుట్టడానికి కారణమయ్యాయి. నిత్య జీవితంలో మనం కన్నవీ, విన్నవీ, అనుభవించినవీ సామెతల రూపంలో వెలువడ్డాయి. ఈ సామెతలు సరళంగా, అలంకార శోభితంగా, జానపదుల అనుభవ సారాలుగా, హాస్య పూరితాలుగా, చెణుకులుగా వెలువడు తుంటాయి. పలువురి జ్ఞానం ఒక్కని వివేకం. ఇది సామెతకు మూల సూత్రం. ఈ సామెతలు జన ప్రియమైన సామెతలు, గ్రంథస్థమైన సామెతలు అనీ రెండు రకాలు.

సామెతలు మానవ సమాజంపై మంచి ప్రభావం చూపగలవని మేధావుల నమ్మకం. వేదకాలపు ఋషుల మాటలలో కూడా సామెతలు కనిపిస్తాయి. ఈ సామెతల సేకరణ, పరిష్కణ విశ్లేషణ జరిపి, శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది.

3.6. పొడుపు కథలు :-

జానపద విజ్ఞానంలో పొడుపు కథలు ఇతర శాఖల కంటే ఎక్కువ వైవిధ్యం కలవి. పొడుపు కథలు బొమ్మలుగా గీయవచ్చు, రకరకాల భంగిమలుగా ప్రదర్శించవచ్చు, కథాగేయాల రూపంలో, గద్య కథల రూపంలో, పొడుపు కథలున్నాయి. అందువల్ల వీటిని ప్రత్యేకవిభాగంగా గుర్తించి అధ్యయనం చేయాలి. ఆదిమ మానవుని చిత్తవృత్తిని, బుద్ధి వికాసాన్ని అతని మాటల తహతహలను, అభివ్యక్తి శక్తిని పొడుపు కథలు ప్రతిబింబిస్తున్నాయి. ఇతరుల బుద్ధికుశలతకు పరీక్షగా అవతరించినవే పొడుపు కథలు. మానవుల చాతుర్యం, హాస్య ప్రియత్వం, సమస్యల్ని పరష్కరించాలనే కోరికే పొడుపు కథలను కళాత్మకంగా తీర్చిదిద్దాయి. ఇంగ్లీషులో దీన్ని RIDDLE అంటారు. వీటిని వేదకాలం నుండి ‘ప్రహేళికలు’ అనే పేరుతో పిలిచేవారు. పొడుచుట, విప్పుటలో ఆనందమును వెల్లివిరియించేవే పొడుపు కథలు. కథలో వివరణాత్మక గుణం ఉంటుంది. వీటిలో ఒకటి గూఢ భావన, మరొకటి వ్యతిరేక భావన. బుద్ధి ప్రధానమైనది, ఊహాతీతమైనది. గూఢంగా ఉండే వస్తువు తెలియగానే ఎదుటి వానికి దిగ్భ్రమ కలిగేట్లు చేయడం పొడుపు కథల గంభీరత. పొడుపు కథల్లో వ్యాజోక్తి, వక్రోక్తి, గూఢోక్తి, పదగూఢత, వస్తుగూఢత, అన్వయగూఢత మొదలైన ప్రత్యేకతలు కనిపిస్తాయి. హాస్యం,వినోదం వీటి గుణాలు. ఎత్తిపొడుపు కూడ కనిపిస్తుంది. నవ్వించే గుణం దీనికి ఉంది. కొన్ని సందర్భాలలో అశ్లీలత దోబూచులాడుతుంది. జానపదుల బుద్ధి కుశలతల వికాసానికి పొడుపు కథలు తోడ్పడుతాయి. విద్వాంసుల దృష్టిని అకర్షించడానికికూడా ఇదేకారణం. పిలల్ల మనోవికాసానికి పొడుపు కథలు సహకరిస్తాయి.

పాచీన కాలపు పొడుపు కథల్లో వినోదంతో పాటు ధార్మిక చింతన కూడా ఉంటుంది. ఆదిమవాసుల జీవితాలను, అనుభవాలను, ఆలోచనలను తెలుసుకోవడానికి పొడుపు కథల వివేచన సహకరిస్తుంది. అవి 1. జానపదుల పొడుపుకథలు, 2.సాహిత్యపరమైన పొడుపుకథలుగా చెప్పవచ్చు. వినోదం కోసం ఏర్పడినప్పటికీ, తాత్వికమైనవిగా, ధార్మికమైనవిగా, కొన్నిప్రశ్నోత్తర రూపకమైనవిగా ఉంటాయి. నేత్రావధానం మొదలైన వాటిని నేర్చుకొని, చిత్రాల ద్వారా సూచించే పాడపుకథలను దృశ్య సంబంధమైన పొడుపు కథలుగా చెప్పాలి.కొన్నిబుద్థికి పదునుపెట్టే తర్కసంబంధమైనవిగా ఉంటాయి. భాషాశాస్త్రపరంగా పరిశీలించినచో ఈ పొడుపు కథలు సామన్య వాక్యాలు, సంకీర్ణ వాక్యాలు, వ్యతిరేకార్ధక వాక్యాలు పద్య రూపాలుగాను, కథారూపాలు గాను విభాగించి పరిశీలించుకొనవచ్చును. పొడుపు కథలు కేవలం కాలక్షేపానికే కాక రాజకీయంగా, తాత్వికంగా, మతపరంగా, సాంస్కృతికంగా కూడా ఉపకరిస్తాయి. బుద్ధివికాసానికి దోహదం చేసేవే. పొడుపుకథ వినడం, విప్పడం పిల్లలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తాయి. పొడుపు కథలో ఆదిమ మానవుని ఆచారాలు, సంప్రదాయాలు, ప్రతిబింబితమై ఉంటాయి.

4. ముగింపు:

జానపద సాహిత్యంలో ప్రధాన శాఖలైన గేయం, కథాగేయం, కథ, సామెత, పొడుపుకథ, అనే ప్రక్రియల సంక్షిప్త వివరణలే కాక సంగీతం, నృత్యం, నాటకం, భౌతిక సంస్కృతి, ఆచార సంప్రదాయాలు మొదలైనవి జానపద విజ్ఞాన విస్తృతిని,వైవిధ్యాన్ని తెలుపుతాయి. అర్ధశతాబ్దం పైగా నిత్యసాహిత్య కృషీ వలుడైన రాళ్ళపల్లి సుందరంగారు తన జానపదవిజ్ఞాన పరిశోధనలతో ముందుతరాల వారికి మార్గదర్శకుడిగా నిలిచాడు. కర్ణాటక ప్రాంతంలో నివశిస్తున్నందున. కన్నడభాష పట్ల మక్కువ, ప్రేమ, ఆదరణ, వాత్సల్యం, అనురాగం, ఆత్మీయత వంటివి ఆయనలో పెనువేసుకు పోయాయి. తెలుగు - కన్నడ కావ్య రచన, వ్యాసరచన, సంపాదకీయలు, అనుసృజనలు, భాషాశాస్త్ర వైదుష్యాలు వంటివి సుందరంగారి సాహిత్యకృషిలోని భాగాలు. తెలుగు - కన్నడ భాషా సాహిత్య విషయాల పరస్పర వినిమయానికి, తులనాత్మక అధ్యయన కోణంలో నిరుపమాన సేవలు అందించిన మేరునగధీరుడు.జానపద విజ్ఞాన పరిశోధనల్లో అపర మేధాసంపత్తిని సంతరిచుకున్న జానపద విజ్ఞాన పరిశోధక బ్రహ్మ బ్రహ్మశ్రీ రాళ్ళపల్లి సుందరం. 

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గంగప్ప, యస్. జాతికి ప్రతిబింబం జానపదసాహిత్యం. 1980.
  2. మోహన్, జి.యస్. జానపద విజ్ఞానవ్యాసావళి. శ్రీనివాస పబ్లికేషన్స్, బెంగళూరు, 1981.
  3. మోహన్, జి.యస్. జానపద విజ్ఞానాధ్యయనం. శ్రీనివాస పబ్లికేషన్స్, బెంగళూరు, 2001.
  4. రామరాజు, బిరుదు రాజు. తెలుగు జానపద గేయ సాహిత్యం. జానపద విజ్ఞాన ప్రచురణలు, హైదరాబాద్. 1958.
  5. వెంకట సుబ్బారావు, తంగిరాల. జానపద సాహిత్యం వీరగాథలు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, హైదరాబాద్, 1975.
  6. సుందరం, ఆర్.వి.ఎస్. ఆంధ్రుల జానపదవిజ్ఞానం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీప్రచురణ, హైదరాబాద్, 1983.
  7. సుందరం, ఆర్.వి.ఎస్. జానపద సాహిత్యం. స్వీయప్రచురణ, మైసూర్, కర్ణాటక. 1982.
  8. సుందరం, ఆర్.వి.ఎస్. సందర జానపదం. స్వీయప్రచురణ, మైసూర్, కర్ణాటక. 2017.
  9. సుబ్రహ్మణ్య శాస్త్రి, వేదుల. జానపద గేయ సాహిత్యప్రభ, స్వీయప్రచురణ, విశాఖపట్నం. 2018.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "OCTOBER-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-SEPTEMBER-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "OCTOBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]