headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

1. సూక్తినిధి నన్నయ

డా. బేతవోలు రామబ్రహ్మం

కేంద్ర సాహిత్య అకాడమీ “భాషా సమ్మాన్‌” పురస్కారగ్రహీత
విశ్రాంతాచార్యులు, తెలుగుశాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 9848169769, Email: bethavolu1948@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

నన్నయ సూక్తినిధిత్వాన్ని గురించిన పూర్వవిమర్శకుల అభిప్రాయాలను స్పృశిస్తూ... వివిధ సూక్తుల సమాహారంగా ఆలంకారికులు, కావ్యప్రబంధకారుల హృదయానుగతంగా సూక్తిపద పరిశీలనం గావించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. రాజశేఖరుడ నుండి రామకృష్ణుని వరకు.., విశ్వనాథ నుండి ఇంద్రగంటి వరకు వారు వెలిబుచ్చిన అనేక విషయాలను సూక్ష్మంగా వివేచించి, చతురవచోనిధిత్వం, ఉభయవాక్ప్రౌఢి, ఆలంకారికోక్తి, నీత్యుక్తులు - "సూక్తినిధిత్వానికి" ఆలంబనగా నిలిచే అంశాలను ఈ వ్యాసం చర్చిస్తుంది. ఆలంకారికవిమర్శ, విశ్లేషణాత్మక పరిశోధనపద్ధతిలో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది. నిఘంటువులు, విమర్శనగ్రంథాలు, లక్షణశాస్త్రాలు, పత్రికావ్యాసాలు ఈ పరిశోధనకు ఆకరాలు. ఆదికవి కవితాగుణమైన "సూక్తి" పదాన్ని "చుతురోక్తి"కి పర్యాయపదంగా, కవితామయోక్తిగా ప్రతిపాదించడం ఈ వ్యాసరచన పరమావధి.

Keywords: సూక్తి, నన్నయ్య, చతురోక్తి, కవితామయోక్తి, వచోనిధి, వాక్ప్రౌఢి

1. ఉపోద్ఘాతం:

భారతాంధ్రీకరణకు పూనుకొన్న నన్నపార్యుడు తన కవిత్వానికి మూడు ప్రధానలక్షణాలను చెప్పుకున్నాడు. ప్రసన్న కథాకలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థసూక్తి నిధిత్వమూను. వీటిలో మొదటివి రెండూ కవితాగుణాలు కాగా, మూడవది సాక్షాత్తూ నన్నయకే విశేషణంగా ఆ పద్యంలో కనబడుతోంది (సారమతిం గవీంద్రులు...) అయితే కవికీ కావ్యానికీ అభేదావధ్యసాయంతో ఈ మూడింటినీ భట్టారకుని కవితాగుణాలుగానే విమర్శకులు అందరూ పరిగణించారు.

వీటిలో ప్రసన్నకథాకలితార్థయుక్తి, కవితార్థయుక్తి అనే పాఠభేదాలతో కొంత విమర్శ జరిగింది. విశ్వనాథ వారు ఈ కవితాగుణాన్ని ఆవిష్కరిస్తూ ఒక పుస్తకమే రాశారు. రెండవదయిన అక్షరరమ్యత మీద ఒక సిద్ధాంతగ్రంథం వెలువడింది.

కాగా సూక్తినిధిత్వాన్ని గురించి ఇప్పటిదాకా ప్రస్తావించిన వారందరూ (నాతో సహా) సూక్తి అంటే ఉపదేశాత్మకమయిన మంచిమాట, సుభాషితము లేక నీతివాక్యము అనే వ్యవహరించారు. ‘క్రోధిగా దపస్వికిజన్నే’ ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ ఇలాంటి నానావిధాలయిన రుచిరార్థ-బోధకాలయిన నీతివాక్యాలు నన్నయ రచనలో కోకొల్లలు. కాబట్టి అతడు ‘‘నానారుచిరార్థ సూక్తినిధి’’ అని నిరూపణచేస్తూ వచ్చారు. సూక్తిముక్తావళి, సూక్తిసుధాకరం మొదలయిన చోట్ల ఉన్న సూక్తిపదానికీ ఈ సూక్తినిధిలోని సూక్తిపదానికీ తేడాలేదనే వీరిభావన.

2. సూక్తి - అలంకారము:

శోభనా చ సా ఉక్తిశ్చ సూక్తిః అనేది దీని వ్యుత్పత్తి.

శోభనత్వము అంటే సౌందర్యం. ఉక్తికి సంబంధించిన సౌందర్యం రెండు రకాలుగా  ఉంటుంది. ఆంతరము, బాహిరము. అర్థ సౌందర్యం ఆంతరముకాగా, వర్ణ లేక అక్షర సౌందర్యం బాహిరము. ఇటువంటి సౌందర్యంతో కూడిన ఉక్తులను మాత్రమే సూక్తులు అనాలి. “సౌందర్యమలంకారః” అన్నారు కాబట్టి సూక్తి అనేమాట శబ్ద- అర్థ అలంకార పర్యాయం అవుతోంది. శబ్దసూక్తి శబ్దాలంకారం. అర్థసూక్తి అర్థాలంకారం. అప్పుడు నన్నయభట్టారకుడు నానారుచిర- అర్థాలంకార నిధి అవుతున్నాడు. బాహిరమయిన సౌందర్యాన్ని అక్షర రమ్యతగా స్పష్టంచెయ్యడం జరగనే జరిగింది. కాబట్టి ఇక్కడ అర్థాలంకార సౌందర్యమే గ్రాహ్యం.

నా నేర్చు విధంబున నిక్కావ్యంబు రచించెద’ అంటూ ఇతిహాసానికి కావ్యత్వాన్ని సంభావించి నన్నయభట్టు నానారుచిరార్థ సూక్తినిధి అనే దళాన్ని తనకే విశేషణంగా చెప్పుకోవడంలో దీనికి ఒక ప్రత్యేక ప్రాధాన్యాన్ని అపేక్షించి ఉండవచ్చు. అది తన అర్హతనూ అధికారాన్నీ చాటుకోవడమే కావచ్చు.

3. కథాకలితార్థయుక్తి :

ఉపదేశంతో కూడిన రసానందమే కావ్యకథా ప్రయోజనం కాబట్టి ప్రసన్న కథాకలితార్థయుక్తి అనేది రసప్రస్థానానికి పర్యాయం అవుతోంది. శృంగారాది రసాలు పాత్రలద్వారా కథాశ్రితాలు. పాత్రచిత్రణ రసపోషణ ఇత్యాదులన్నీ కథాకథనంతో ముడిపడే ఉంటాయి. ఈ రకంగా ఇది చాలా విస్తృతార్థము కలిగిన విశేషణం. ఈ విస్తృతిని విశ్వనాథవారు ఒక భంగి స్పష్టపరిచారు. కథాకలితార్థ ‘యుక్తి’ అని “యుజ్‌” దాతువు నుండి ఏర్పడిన క్తిన్నంత రూపాన్ని ప్రయోగించడంలో కూడా ఒక విశిష్టత ఉంది. ‘విభావానుభావ వ్యభిచారి సంయోగాత్‌ రసనిష్పత్తిః’ అనే భరత సూత్రానికి ఇది జ్ఞాపిక.

ప్రసన్నమయిన కథ(ల) యందు కలితమయిన అర్థము అంటే అది తప్పనిసరిగా రసమే. అదే కావ్యపరమార్థ్ధం. ఉద్దిష్టమయిన ఉపదేశాన్ని మనఃఫలకాలపై గాఢంగా ముద్రించే శక్తి దానికే ఉంది. కావ్యానికి ఉత్తమత్వాన్ని సంపాదించి పెట్టేదీ అదే. అది విభావ - అనుభావ సంచారి భావాల సమ్మిళిత స్వరూపం.

‘‘విభావానుభావ వ్యభిచారిణామేకస్య తు రసాంతర

సాధారణతయా నియత రస వ్యంజకతానుపపత్తేః 

సూత్రే మిళితానా ముపాదానమ్‌.

ఏవం చ ప్రామాణికే మిశ్రితానాం వ్యంజకత్వే, యత్ర

క్వచిదేకస్మాదేవాసాధారణాత్‌ రసోద్బోధః తత్ర

ఇతర ద్వయమాక్షేప్యమ్‌, అతో నానైకాంతికత్వమ్‌’’       (రసగంగాధర, ప్రథమ-131)

ఈ సమ్మిళిత స్వరూపముయొక్క యుక్తి-ప్రసన్న కథా కలితార్థయుక్తి. అటుపై దీనిని కవీంద్రులు సారమతితో మేలు అనాలి అని కోరుకున్నాడు. భావించి అనే మాటకు ‘లోనారసి’ అనేది అచ్చమయిన తెనుగుసేత. అంటే సమ్యక్‌ యోగాత్‌, భావుకత్వ వ్యాపారేణ భావనాత్‌’ అనే భట్టనాయక మతానికి ప్రతిఫలనంగా దీనిని మనం పరిగణించవచ్చు.

నన్నయభట్టారకుడు ఏయే ఘట్టాలనూ ఏయే ఉపాఖ్యానాలనూ రసోల్బణంగా ప్రత్యేక కావ్యాలుగా రూపొందించి జీవం పోశాడో తులనాత్మకంగా చూసి తేలికగా గుర్తించవచ్చు. ఇతడు సంతరించిన మూడు పర్వాలనూ ‘మూడు కృతులుగా’ తిక్కయజ్వ సంభావించడంలోని ఆంతర్యం ఇదికాకపోదు. ఇతిహాసాన్ని కావ్యమార్గానికి తెచ్చిన ఈ రసాభ్యుచితరీతిని ఎడమియ్యకుండా అందిపుచ్చుకొని నడిపించిన మహితాత్ముడు ఈ తిక్కన. ఒక్కమాటలో చెప్పాలంటే కవిత్రయం వారి కైవాడంలో భారతామృతం వడకట్టబడింది.

ఆంధ్రమహాభారతానికి లభిస్తున్న ప్రతులలో చాలావాటిలో కనిపిస్తున్నదనీ, కన్నడ భారతానికీ అనుకూలంగా ఉన్నదనీ ‘కవితార్థయుక్తి’ అనే పాఠాన్ని సంశోధిత ముద్రణంవారు ప్రామాణికంగా స్వీకరించారు. దీనిని ప్రసన్న కథార్థయుక్తి, ప్రసన్న కవితార్థయుక్తి అని శ్రీహనుమదింద్రగంటి రెండుగా విభాగించారు. ఈ విరుపులో తొలిగణుపులో రసస్ఫూర్తి లేకపోలేదు (సారమతి నన్నయ).

కాబట్టి ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే దళం రసప్రస్థానానికీ, అక్షరరమ్యత అనేది శైలీరామణీయకానికీ ప్రతినిధులుకాగా, సూక్తినిధి అనేమాట అలంకారప్రస్థానానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇలా ఆ నాటికి కావ్యశాస్త్రంలో ప్రాచుర్యం పొందిన ప్రస్థానత్రయాన్ని నన్నపార్యుడు తన కవితాగుణాలుగా కవిత్వధోరణిలోనే ప్రకటించాడు.

4. రాజశేఖర సూక్తి :

ఈ సూక్తిపదాన్ని పైని పేర్కొన్న విశేషార్థంలో రాజశేఖరుడు తన ‘విద్ధసాలభంజికా’ ప్రస్తావనలో ప్రయోగించాడు.

            పాతుం శ్రోత్ర రసాయనం, రచయితుం వాచస్సతాం సమ్మతాః

             వ్యుత్పత్తిం పరమామవాప్తు, మవధిం లబ్ధుం రసస్రోతసః

             భోక్తుం స్వాదు ఫలం చ జీవిత తరోర్యద్యస్తి తే కౌతుకం

             తద్‌ భ్రాతః శ్రుణు రాజశేఖరకవే: సూక్తీః సుధాస్యందినీః

         సుభాషితము లేక నీతివాక్యము అనే అర్థంలో ఇతడు సూక్తిపదాన్ని ప్రయోగించలేదు. ‘వాచః సతాం సమ్మతాః’ అనే మాటలతో ఆ అర్థాన్ని ప్రథమ పాదంలోనే ముగించాడు. కాబట్టి సూక్తిః అంటే ‘సుందరోక్తులను’ అనే గ్రహించాలి. సుధాస్యందినీః అనే విశేషణం కూడా దీన్నే బలపరుస్తోంది. “పాతుం శ్రోత్ర రసాయనం అనే మాటలతో శబ్దసౌందర్యం సంగ్రహించ బడుతోంది. కాబట్టి ఇక్కడ ఆంతరమయిన అర్థసౌందర్యం పరామృష్టమై ఈ సూక్తిపదం సుధాస్యందిని అనే విశేషణబలంతో అర్థాలంకార లేక ఉక్తి చమత్కారపర్యాయం అవుతోంది. సూక్తిపదాన్ని కవిత్వపర్యాయంగా ఇతడు తన కావ్యమీమాంసలోనూ చాలాసార్లు ప్రయోగించాడు. “కస్త్వంభో: కవిరస్మి…” - అనేశ్లోకంలో కూడా ఈ విశేషమే కనిపిస్తుంది.

5. రామకృష్ణ సూక్తి :

నన్నయ గారి ‘సూక్తినిధి’ అనే ఈ సమాసం మళ్ళీ పాండురంగమాహాత్మ్యంలో కనబడుతోంది.

నను రామకృష్ణ కవిఁ గవిన సహకారావళీ వసంతోత్సవ సూ

క్తినిధినిఁ బిలిపించి యర్ధాసనమునఁ గూర్చుండఁ బనిచి చతురత ననియెన్‌  (1-22)

కవిజనులు అనే మామిడితోపునకు వసంతోత్సవ ప్రాయాలయిన సూక్తులకు నిధి అని కదా అర్థం! ఇక్కడ సూక్తులంటే ఉపదేశాత్మకాలయిన నీతివాక్యాలే అయినపక్షంలో అవి అసామాన్యులైన కవిజనులకు వసంతోత్సవాలు కాగలవా! కావు-కాలేవు. రసనిష్యందు లయిన కావ్యాలలో ఉపదేశాలను గవేషించేవారు కవీశులు కాదు. కాబట్టి సూక్తి అంటే సుందరోక్తి అనే ఇక్కడ రామకృష్ణుని భావన. కాగా ‘నానా రుచిరార్థ్ధ’ అనే పద సంపుటిని ప్రాబంధిక శైలిలో మరింత కవితామయంగా ఈ పద్యాన రామకృష్ణుడు పలికాడు.

6. సూక్తి సూక్తమ్‌ :

సూక్తి అన్నమాట ఈనాడు ఇంచుమించు నీతివాక్యం అనే అర్ధంలో స్థిరపడిపోయింది. త్రికాలాబాధ్యమయిన ఒక సత్యాన్ని చెప్పి లేక ఒక ప్రబోధాన్ని అందించి ఉక్తికి శాశ్వతత్వాన్ని సంతరించడం కూడా ఒక విధంగా శోభనత్వమే. ఈ మార్గాన సూక్తిపదం యోగరూఢం అవ్వాలి. అయితే శబ్ద ‘కల్పద్రుమం’లోకిగానీ ‘ఆప్టే’లోకి గానీ ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’లోకిగానీ సూక్తిపదం ఎక్కకపోవడం గుర్తించదగిన విశేషం. శబ్దకల్పద్రుమంలో ‘సూక్తమ్‌’ ఉంది. ‘సుష్ఠు ఉక్తమ్‌’ అనే యౌగికార్థంలో మంత్రపర్యాయంగా (ఉషస్సూక్తమ్‌, శ్రీసూక్తమ్‌) అది రూఢం. సూక్తి కూడా ఇల్లాగే యోగరూఢమయిన పక్షంలో ఇది నిఘంటువుకి ఎక్కకపోవడానికి కారణం కనబడదు.

‘బ్రౌణ్యం’లో సూక్తి ఉంది. “సు+ ఉక్తి” అని పదవిభాగం చూపించి ‘A good word, a fair or friendly speech, మంచిమాట’ అనే అర్థాలను ఇచ్చాడు. దీనికి ఇతడు చూపిన ప్రయోగం వసుచరిత్రలోది. ..... ద్విజసూక్తిఁ బతి రాక తెలిసి మోమెత్తి రాత్రి వహించు కాశ్మీరనఁగ...’’ (వసు, 4-7). సాయం సంధ్యను వర్ణిస్తున్న సీసపద్యంలో నాల్గవపాదం ఇది. ఇక్కడ ‘ద్విజసూక్తిన్‌’ అంటే ఒక అర్ధంలో పక్షుల కలకూజితాల వలన. వేరొక  అర్థంలో బ్రాహ్మణుల సంధ్యావందన మంత్రాలవలన అనీ సమన్వయం. మొదటి అర్థం యౌగికం, రెండవది రూఢం.

వాచస్పత్యంలో సూక్తమ్‌ దగ్గరే ‘క్తిన్‌ సూక్తి: సుష్ఠూక్తౌ స్త్రీ’ అనే వివరణ ఉంది. మోనియర్‌ విలియమ్స్‌ Beautiful verse or stanza అనే విశేష అర్ధాన్నిచ్చింది. కాగా ఇవన్నీ యౌగికార్ధాలే తప్ప వీటిలో రూఢలేదు. ఉన్న రూఢ మంత్రపర్యాయంగానే కనబడుతోంది.

నీతివాక్యం అనే అర్థం లో సూక్తిపదాన్ని యోగరూఢంగా అంగీకరించినప్పటికీ నన్నయ ప్రయోగంలో దీని సమన్వయం దుస్సాధమే అవుతోంది. ఉక్తికి శోభనతా సంపాదకమయిన శాశ్వతత్వం ఆర్ధికసాధ్యం కాబట్టి ‘రుచిరార్థసూక్తి’ అనే చోట అర్థపునరుక్తి  వేడినిప్పు వంటిది అవుతోంది. కాబట్టే కొందరు విమర్శకులు రుచిరార్ధ నిధి-సూక్తినిధి అంటూ ప్రత్యేకాన్వయం ప్రవచించారు. సూక్తినిధిత్వానికి లక్ష్యాలుగా వీరంతా చూపుతున్న నన్నయగారి నీతివాక్యాలలో అధికభాగం వ్యాసభగవానుడివే. అవిపోగా నిధిత్వానికి చాలినన్ని స్వతంత్ర సుభాషితాలను నన్నయ రచనలో ఏరడం శ్రమైకసాధ్యం.

ఇక్కడ ఇంద్రగంటి వారు రుచిరార్థ్ధం అంటే ధర్మప్రబోధమనీ, సూక్తి అంటే స్వానుభవంతో పలికిన లోకోక్తి అనీ సమన్వయించి మచ్చుకి ఒక పదిహేడు లోకోక్తులను ఉదాహరించారు. కానీ వీటిలో కూడా చాలాభాగం వ్యాసుడివే కావడం విశేషం (సారమతి నన్నయ).

అందుచేత ఇక్కడ సూక్తిపదం రూఢార్థకం కాదనీ, పర్యాయ పద వినిమయ సహిష్ణువయిన సమస్త పదమనీ అంగీకరించక తప్పదు.

7. సూక్తినిధి - చతుర వచోనిధి:

దీని అస్వపద విగ్రహ వాక్యంలో వినబడుతున్న శోభనా (సు) ఉక్తిపదాలకు రెండిరటికీ పర్యాయపదాలను అనంతర కవులు యథేచ్చగా వినియోగించుకున్నారు. మధుర, చతుర, చాటు ఇత్యాదులు శోభనపర్యాయాలు కాగా, వచస్‌, వాక్‌ ఇత్యాదులు ఉక్తి పర్యాయాలుగా కొత్త సమాసాలనునిర్మించుకున్నారు.                                                                           

........సరస మధుర వచో గుంభన ...... (నిర్వచన 1-10) అనేది ఈ మార్గాన రూపొందిన తిక్కనగారి వచోగుంభన. నన్నయ పేర్కొన్న కవితాగుణాలను మూడింటినీ సత్కవీంద్ర మార్గంగా కవిబ్రహ్మ ఈ కందంలో పొందుపరిచాడు.

“........చతుర వచో నిధివి.........(మను. 1-15) అనే పెద్దన కూర్పు నిస్సందేహంగా సూక్తినిధికి పర్యాయపదాలతో చేసిన విస్తరింపు. నిధి శబ్దసన్నిధి దీనిని మరింత దృఢపరుస్తోంది.

ఆంధ్రసాహిత్యంలో ఉక్తి వైచిత్రికీ అలంకారాడంబరతకూ వసంతోత్సవ సమయం ప్రబంధయుగమే. దీనికి పురోహితుడయిన శ్రీనాథుడు ఈ కవితాగుణాన్ని ప్రబంధ పరమేశ్వరునిలో స్ఫుటంగా దర్శించాడు. ‘‘పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు’’ (కాశీ. 1-13). ఇక్కడ సూక్తివైచిత్రి పదంతో శ్రీనాథుడు ఉద్దేశించినది నీతివాక్య ప్రయోగ వైచిత్రి కాదనడం స్పష్టం. అది అనంతర ప్రబంధాలలో విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఆలంకారిక శైలి.

8. సూక్తి - ఉభయవాక్ప్రౌఢి:

ఇలా నన్నపార్యుడు కంఠోక్తిగా చెప్పుకున్న అక్షర రమ్యత్వాన్నీ, నానారుచిర- అర్ధాలంకార నిధిత్వాన్నీ శ్రీనాథుడు ఉభయ వాక్పౌఢిగా క్రోడీకరించాడు. ‘‘భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు’’ (కాశీ. 1-13). వాక్ప్రౌఢి అంటే పలుకుల గడుసుదనం. ఆ ప్రౌఢిమ శబ్దవిన్యాసవిశేషమయినా కావచ్చు. అర్ధవిన్యాసవిశేషమైనా కావచ్చు. ఒకటి శబ్దసౌందర్యము, రెండవది అర్థసౌందర్యము, ఈ ఉభయమయిన వాక్ప్రౌఢినీ భట్టారకమార్గంగా-ప్రాధాన్యదృష్టితో- శ్రీనాథుడు ప్రస్తుతించాడు.

ఇటువంటి ప్రౌఢకవులందరికీ అత్యవసరమని ...... ఇంపారెడు పల్కులంబడయ, నప్పలుకుల్‌ సరిగ్రుచ్చునట్లుగాఁ జేరుప నేరగా వలయు....’’ (నిర్వచన. 1-5) అని తిక్కన కూడా ఉపదేశించాడు.

‘వాక్‌’ శబ్దాన్ని పదపర్యాయంగా స్వీకరించి సంస్కృత పదప్రయోగ ప్రౌఢినీ, ఆంధ్రపదప్రయోగ ప్రౌఢినీ ఉభయ వాక్పౌఢిగా సమన్వయించి అది నన్నపార్యుని కవితామార్గంగా శ్రీనాథుడు అనుసరించాడు అనడం కన్నా పై సమన్వయంలో ఔచిత్యాతిశయం సహృదయలకు తోచకపోదు.

ఇది ఏదీ కాదు పొమ్మని సుశబ్దాదుల్లోలాగా సూక్తిలోని ‘సు’ అనేది నిర్దుష్టతా బోధకమే అనుకున్నప్పటికీ అది నీతివాక్య పర్యాయం కానేరదు.

9. ముగింపు:

నానావిధాలయిన రుచిరార్ధాలకూ నిర్దుష్ట శబ్దాలకూ నిధి అని మాత్రమే అర్థం లభిస్తుంది. కాబట్టి నానారుచిరార్థ సూక్తినిధి అంటే నీతివాక్యాలకూ లోకోక్తులకూ సుభాషితాలకూ నిధి అని సమన్వయించడం సముచితం కాదనీ, అది అలంకారప్రస్థానానికి సంసూచకమనీ సారాంశం. కాగా నన్నయ రచన నుంచి ఆయా అర్ధాలంకారాలనూ వాటి వైచిత్రులనూ ఉద్ధరించి చూపి దీనిని నిర్ధారించవలసిన అవసరం అంతగా లేదని నా నమ్మిక. నన్నయగారి అలంకారాలపై ఒక సిద్ధాంతగ్రంథం వెలువడనే వెలువడింది.

మూలంలో నిరలంకారంగా ఉన్న వాక్యాలను సాలంకృతాలు చేసిన సందర్భాలు, అస్ఫుటంగా ఉన్న అలంకారాలకు సావయవంగా పరిపుష్టిని కలిగించిన సన్నివేశాలూ, కావ్యశాస్త్రంలో క్రమపరిణతివశాన కొత్తగా నిర్వచింపబడిన అలంకారాలకు లక్ష్యాలు సమకూర్చిన వైనాలూ నన్నయ భారతభాగంలో చాలానే   ఉన్నాయి. ఇవి ఈ కొత్త సమన్వయానికి సమర్థకాలు.

దీని కోసం ఎక్కడిదాకనో పోనవసరం లేదు. ‘సారమతిం గవీంద్రులు’ అనే ఈ పద్యమే చాలు. మూడు నాలుగు అలంకారల పోహళింపు కనబడుతూంది. కవీంద్రులు అనేది అనుభయ అభేదరూపకం. సారమతి అనేది వారికి సార్థకమైన విశేషణం. కనుక పరికరాలంకరం. (“అలంకారః పరికర సాభిప్రాయే విశేషణే:”) ‘లోనారసి’ అనేది కూడా ఇలాగే సార్థకమైన అసమాపకక్రియాపదం.

ఇతరులు అనే పదానికి కవీంద్రులతో సాపేక్షంగా పామరులు అని అర్థ నిర్ణయం చేస్తున్నాం. అంత శ్రమ అవసరం లేదు. “కవిర్మనీషీ విపశ్చిత్‌” అంటూ పర్యాయ పదాలు చెప్పింది అమరనిఘంటువు. అంచేత ఇక్కడ కవీంద్రులు అంటే కావ్యకర్తలని సంకుచితార్థం చెప్పే కన్నా పండితోత్తములని విశాలార్థం చెప్పడం సబబు. కవులు కాని పండితులెందరో భారతాన్ని లోనారసి మెచ్చుకున్నారు. ఇతరులంటే – “ఇతరో అన్యశ్చ పామరఃఅని మేదినీ నిఘంటువు. కాబట్టి కవీంద్రులు కానివారు పామరులు అని శ్రమపడి చెప్పవలసిన అవసరం లేదు.

సూక్తులకు నిధి అనడంలో అతిశయోక్తితో తాద్రూప్యరూపకమూ స్ఫురిస్తోంది. రెండూ కలిపి రూపకాతిశయోక్తిగానూ సమన్వయించుకోవచ్చు. భారతాంధ్రీకరణకు హేతువు ‘‘జగద్ధితంబుగన్‌’’ అన్నాడు కనుక ఇది కావ్య లింగం (సమర్ధనీయా స్యార్థస్య కావ్యలింగం సమర్థనమ్‌). ఇలా ఇన్ని రుచిర అర్థ+ సూక్తులు = అర్థాలంకారాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ పద్యమే - నానారుచిరార్థ సూక్తి నిధి!

ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ‘‘నన్నయ నానారుచిరార్థ సూక్తి నిధిత్వం’’ అనే వ్యాసంలో (లక్ష్మీరంజన వ్యాసావళి) సూక్తి పదాన్ని చుతురోక్తికి పర్యాయపదంగా సమన్వయించారు. సూక్తులకన్నా చతురోక్తులు విస్తృతాలు అన్నారు. నీతులు అనలేదు కాబట్టి నా వ్యాసానికి వీరి వ్యాసం ఒక ఉపశ్రుతి. అయితే - సూక్తి = చతురోక్తి అన్నాక రుచిరార్థ అనే విశేషణం ఎందుకు అనే ప్రశ్న పుడుతుంది. అందుకని విస్తరించదలుచుకుంటే సూక్తి = కవితామయోక్తి అనడం మేలు.

కాప్యభినవా సూక్తి: కవితాసఖేపఠ్యతామ్‌.!!

10. ఉపయుక్తగ్రంథసూచి:

  1. జయదేవుడు. (మూలం వెంకట సత్యనారాయణ ,మూర్తి బులుసు. (వ్యాఖ్యానం). రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి, 1995.
  2. తిక్కన. నిర్వచనోత్తర రామాయణము. వావిళ్ళరామస్వామి సన్స్.1941.
  3. పెద్దన. మనుచరిత్ర. వావిళ్ళరామస్వామి సన్స్, మద్రాసు, 1951.
  4. భరతముని. శ్రీరామ అప్పారావు, పోణంగి. భరతముని ప్రణీతమైన నాట్యశాస్ర్తం. హైదరాబాద్, 1988.
  5. రమణారెడ్డి, కె.వి. "జగద్ధితంబుగన్" (వ్యాసం). శంభుప్రసాద్, శివలెంక (సంపా.) భారతి మాసపత్రిక, (సంపుటం. 55, సంచిక. 5) మే 1978.
  6. రామకృష్ణ, తెనాలి. పాండురంగమాహాత్మ్యము. కొండపల్లి వీరవెంకయ్య పబ్లిషర్స్. 1934
  7. రామరాజభూషణుడు. వెంకట శేషాద్రి కవులు. (వ్యాఖ్య). వసుచరిత్ర (సవ్యాఖ్యానము). నందిగామ, 1929.
  8. వెంకట రామయ్య, జనమంచి (అను.). రాజశేఖరుడు (మూలం). విద్ధసాల భంజిక. రాజమండ్రి, 1940.
  9. శ్రీనాథుడు. శ్రీకాశీఖండం. వావిళ్ళరామస్వామి సన్స్, మద్రాసు, 1957.
  10. సుబ్రహ్మణ్యం, జి.వి. (సంపా.) కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ, తిరుపతి, 2013.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "OCTOBER-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-SEPTEMBER-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "OCTOBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]