"సామల సదాశివ యాదిలో" - ప్రత్యేకసంచిక
AUCHITHYAM | Volume-04 | Issue-06 | May 2023 (Special Issue) | ISSN: 2583-4797
5. సామల సదాశివ జీవితం: సాహిత్యం
జంగిటి వేణు
పరిశోధక విద్యార్ధి, తెలంగాణ విశ్వవిద్యాలయం.
తెలుగు ఉపన్యాసకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్ధిపేట (స్వయం ప్రతిపత్తి),
సిద్ధిపేట, తెలంగాణ.
సెల్: +91 9502585333. Email: venuhcu444@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
కవిగా, రచయితగా, అనువాదకుడిగా, చిత్రాకారుడిగా, తెలంగాణ సాహిత్యానికి ఎనలేని సేవచేసిన గొప్పమహనుభావుడు సామల సదాశివ. ఈయన జీవితాన్ని, రచనలను వాటిలోని అంశాలను స్థూలంగా పరిచయం చేయడమే ముఖ్య ఉద్దేశ్యం. తన జీవితంలో పడిన కష్టాలు వాటిని అధిగమించిన సామల ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వైనం ఈ తగిన ఉదాహరణలతో ఈ వ్యాసంలో చర్చించడమైనది. సంగీత, సాహిత్య సమ్మేళనంతో రాసిన స్వరలయలు వంటి రచనా విశేషాలతో పాటు, తన జీవితవిశేషాల్ని యాది చేసుకున్న “కళారత్న” శ్రీ సామల జీవనప్రస్థానాన్ని ఈ వ్యాసం ఆవిష్కరిస్తుంది.
Keywords: పరిచయం, జీవితం, సాహిత్యం,అనువాదం,చిత్రకారుడు.
ఉపోద్ఘాతం:
తెలుగు సాహితీ వనంలో ఆయనకు తోటమాలి తన రచనల పూలమాలతో తెలంగాణ తల్లిని అర్చించిన సారస్వతమూర్తి సామల సదాశివ. చిన్నతనం నుండే సాహిత్యాన్ని ఔపోసన పట్టి ఉపాధ్యాయ వృత్తితో పాటు ప్రవృత్తిగా తెలుగు రచనలు చేస్తూ, తెలుగులో సాహిత్య రచనలు చేస్తూ ఇతర భాషల్లో వెలువడ్డ సాహిత్యాన్ని తెలుగు సాహితీ ప్రపంచానికి అందించడానికి అనువాదకుడిగా మారిన బహుభాషా వేత్త. ఈయన పేరు చెప్పగానే పాఠకులకు గుర్తుకు వచ్చే రచనలు యాది, స్వరలయలు, మలయమారుతాలు. సంగీత సాహిత్యాలని మేలవించి చెప్పిన “స్వరలయలు”తో పాటు సాహిత్యంతో తన జీవిత అనుభవాన్ని “యాది” చేసుకున్న విశేషాలను తెలియజెప్పడమే ఈ వ్యాస ఉద్దేశం.
విమర్శకుల దృష్టిలో సామల:
వదులు పైజమా, ఫైతాబు, జూతాలు తొడుక్కుని, మెడలో రుద్రాక్షలు ధరించే ఆయన గురించి విన్నప్పుడల్లా అభినవమొల్లగా ప్రసిద్ధి పొందిన శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ రాసిన ప్రశంసా పద్యం -
“కమ్మని ఉర్దు భాషయను కాచిన తీయని పాలలోన
నం
తమ్ముగ దాగియున్న పరతత్త్వ మహత్తర నూత్న ప్రేమ
త
త్త్వమ్మును దీసి తెల్గు కవితానవనీతము జేసి
ఆంధ్రలో
కమ్మున బంచిపెట్టిన యఖండ యశో విభావ సదాశివా!”
గుర్తొస్తుంది.
బహుభాషాకోవిదుడు, బహుముఖ
ప్రజ్ఞాశాలి, అక్షర తపస్వి, భారతీయ సంగీత, సాహిత్యాలను అవపోసనపట్టి పుంభావ సరస్వతిగా యాది కి వచ్చే కేంద్ర
సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత డాక్టర్ సామల సదాశివ.
జననం - బాల్యం:
తెలుగుభాషాసాహిత్యానికి ఇతర భాషలకు వారధిగా నిలిచిన సామల తెలంగాణలోని నేటి కొమురం భీం ఆసిఫాబాద్ (పూర్వపు అదిలాబాద్) జిల్లాలో దహెగాం మండలంలోని తెనుగు పల్లెలో 1928 ఆగస్టు 9న జన్మించారు. (జన్మపత్రిక ప్రకారం మే 11 న జననం) (సదాశివ సామల – రాజవర్ధన్ సామల తెలుగు అకాడమి-2017, హైదరాబాద్ పుట- 01) సామల సదాశివ వారి కుటుంబీకులు విద్యావంతులే కాబట్టి ఆయన చిన్నతనంలోనే మహాభారతం, బసవపురాణం, కళాపూర్ణోదయం, చదివే ప్రయత్నం చేశారని వారాల ఆనంద్ తీసిన తెలంగాణ “సాహితీమూర్తులు” అనే డాక్యుమెంటరీ చిత్రంలో తానే చెపుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా వారు మా మాస్టారు అని పిలుచుకునే సామల ఉర్దూ మీడియంలోనే చదువుతూనే తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఫారసీ, మరాఠీ (ఆయన భార్య శ్రీమతి సులోచన మహారాష్ట్రకు చెందిన స్త్రీ కావడం వల్ల సామలకు మరాఠా సాంప్రదాయాలు, సాహిత్యం అలవడింది.) భాషల్లోకూడా ప్రావీణ్యం సంపాదించి తెలుగు కవుల్ని ఇతర భాషా సాహిత్యాలకు, ఇతర భాషా కవులను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన బహుభాషావేత్త సామల.
ఉద్యోగం - వివిధ హోదాలు:
సామల తండ్రి నాగయ్య అనివార్య కారణాల వల్ల
ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి రావడంతో తన 19వ యేటనే ఉపాధ్యాయ ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి ఉన్నత
విద్యనభ్యసించి (M.A,B.ED లు పూర్తి చేసి) భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీవిరమణ
చేశారు. తన 21 సంవత్సరాల వయసులో ప్రభాతము అనే పద్యకావ్యాన్ని రాసి సాహిత్య లోకంలోకి ప్రవేశించారు
సామల.
కవి, రచయితగా సామలసదాశివ:
సదాశివ తాను రాసిన పద్యాల్లో దోషాలు తెలుసుకోవడానికి ఆంధ్రబిల్హణ బిరుదాంకితులు శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి దగ్గరికి వెళ్లడం, ఆయన సామల శైలిని& ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ సదాశివ పుస్తకాలకు ముందుమాటలు రాస్తూ వచ్చారు. అప్పటినుండే సదాశివ లక్ష్మణ శాస్త్రిని గురుతుల్యులుగా భావిస్తూ వచ్చారు. సామల 1950లో సరిగ్గా వంద పద్యాలతో సాంబశివ శతకాన్ని రాశారు. ఈ శతకంలోని కవిత్వము భక్తితో కూడుకొని ధారాళంగా కనిపిస్తుంది. “భాష, శబ్ద సౌష్టవము, ఛందోవ్యాకరణాంశాలకు లోటు లేదని” లక్ష్మణశాస్త్రి కితాబిచ్చారు. “సదాశివ హృదయావేదనే ఈ సాంబ శివ శతకము, దీని నిండా ఆత్మార్పణ పూర్వకమైన భావోద్వేగం, నిష్కపట నివేదన, నిర్మాల్య ముద్ర, చిత్తశుద్ధి కనిపిస్తాయి. అందుకే ఈ శతకం పాఠకుడికి హృదయాన్ని ఆకట్టుకుంటూ, సదాశివ వ్యక్తిత్వ ముద్రతో స్పష్టంగా కనిపిస్తుంది” అని ఆచార్య బన్న ఐలయ్య అన్నారు. (జయంతి సాహిత్య త్రైమాసిక పత్రిక ఏప్రిల్ సెప్టెంబర్ 2012, పుట 203).
కులవ్యవస్థ నిరసన:
1949లో “ప్రభాతము” అనే లఘుకావ్య సంపుటిలో ఉన్న “ధర్మవ్యాధుడు” అనే కావ్యంలో 94 తేటగీతిలలో కులవ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ కులం అనేది ఆధిక్యతా, న్యూనతా కాదని, మనుషులందరూ సమానమేనని అర్థాన్ని బోధించినట్టు అవగతమవుతుంది.
ఇతర రచనలు - వివిధ సాహిత్యప్రక్రియలు:
“నిరీక్షణము” ఉర్దూలో “ముస్ ద్దస్” (షట్పాదగీతి)లో వెలువడిన రచన. గీత అనే అమ్మాయి విజయుడు అనే సైనికుడిని ప్రేమించి, పెళ్ళిచేసుకోవడం,తర్వాత విజయుడు యుద్ధరంగానికి వెళ్లడం, తన భర్త కోసం గీత ఎదురు చూపులే ఈ నిరీక్షణము. గీత ఆలోచనలను అద్భుతంగా చిత్రించారు మన సామల. 41 పద్యాలతో అంబాపాలి రచన చేస్తూ అంబాపాలి (ఆమ్రపాలి) అనే సర్వాంగ సుందరి, తెలివిగల వేశ్య. బుద్ధుని ప్రత్యక్ష భోదనల ప్రభావం వల్ల వేశ్యా వృత్తిని వదిలి సన్యాసిగా మారే వృతాంతమే అంబాపాలి. దీనిలోని పద్యాలు నేటి పద్యకవులకు ఏ మాత్రం తీసిపోవంటే అతిశయక్తికాదు. ఇంకా సర్వస్వ దానము, పశ్చాత్తాపము, విశ్వామిత్రము, నారద గర్వభంగం, మీరాబాయి, మంచిమాటలు, మిర్జా గాలిబ్ వృతాంతం మొదలగు రచనల్లో సామల శైలి అద్భుతంగా కన్పిస్తుంది.తన మిత్రుడు వి. హనుమంతరావుతో కలిసి “వృషభగిరి నివాస వెంకటేశా” అనే మకుటంతో 102 పద్యాలు గల ఆర్తి శతకాన్ని రాశాడు. ఇవే కాక రేవతీ నవల, రాముడు (ఫిలాసఫీ ఆఫ్ రామ), సాఖీనామ (సూఫీ భావాలను తెలిపే పద్యాలు) మొదలగు అముద్రితరచనలు సామల చేసినట్టు తెలుస్తుంది.
సదాశివ వ్యాసాలు భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి,
వార్త, గీటురాయి, సియాసత్ (ఉర్దూ పత్రిక లో 300 వ్యాసాలు) అనే పత్రికలలో ప్రచురింపబడ్డాయి. సురవరం
ప్రతాపరెడ్డి సూచనతో పద్య కవిత్వాన్ని వదిలి అనువాద రంగంలో అరంగేట్రం చేశారు సామల.
అనువాదకుడిగా సామల:
సాహిత్య సృజన చేసి ఇతర భాషా సాహిత్యాల ను తెలుగుకు
పరిచయం చేయడం కోసం అనువాదకుడిగా మారాడు సామల. హిందీ భాష నుండి తెలుగులోకి 1963లో డాక్టర్ ఎహాతెషామ్ హుసేన్
రాసిన "ఉర్దూ సాహిత్య కా ఇతిహాస్", హజ్రత్ అమ్జద్ హైదరాబాద్ రూబాయిలను తెలుగులోకి అనువాదం చేయగా, ఈ
రుబాయిలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనగా సత్కరించింది. 1967లో పారసీలో జలాలుద్దీన్ రూమీ రాసిన
"మస్నవి"ని మౌలానా రూమి ముస్నలిగా ఆంధ్రీకరించారు. మరాఠీ కవి కేశవ సూక్తి జీవితాన్ని తెలుగులోకి
అనువదించారు.
భాష
ఏదైనా తన రచనలను ముచ్చట రూపంలో పాఠకుడికి అందించడమే సామల సదాశివ ప్రత్యేక శైలి గా చెప్పవచ్చు. సామల సదాశివ
రాసిన అనువదించిన రచనలు చాలానే ఉన్నా అందరి హృదయాల్లోకి చొచ్చుకొనిపోయినవి యాది,స్వర లయలు,మలయమారుతాలు అనే
రచనలు. ఇవి సదాశివ ని తెలుగు సాహిత్యంలో ఉన్నత స్థితికి చేర్చాయనడంలో అతిశయోక్తి లేదు. సామల సదాశివ 1974
నుండి 1994 వరకు కేవలం ఉర్దూ రచనలు మాత్రమే చేశారు. (పత్రికాధిపతుల ప్రవర్తన మానసికంగా సహించుకోలేక పోయాను
అని యాదిలో రాసుకున్నారు) అనంతరం తెలుగు సాహితీ పాఠక ప్రపంచానికి కనుమరుగయ్యారు సామల.
ఆనాడు ఆంధ్రప్రభ వారపత్రికలో సంపాదకుడిగా ఉన్న వాకాటి పాండురంగారావు సదాశివని వెతికి పట్టుకుని హిందుస్థానీ సంగీత ఘారానాలు, గాయకుల పాండిత్యపు వ్యాసాలు రాయించి మలయమారుతాలుగా ప్రచురించారు. వీటి ద్వారా సామల పేరు మళ్లీ తెలుగు సాహితీ లోకంలో మార్పు మ్రోగింది. సంగీత సాహిత్య విషయాల్ని చాలా సరళంగా చెప్పడం ఈయన ప్రత్యేకత. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అన్నట్లు.. మనిషి లోని ప్రేమ మానవత్వం అంతరిస్తున్న సమయంలో మనిషిలో మానవత్వాన్ని, మనసులో లాలిత్యాన్ని నింపి సంగీతసాహిత్యాల తత్వాన్ని మలయమారుతాలలో నింపిన గొప్పకవి సామల. అనేక పత్రికలకు వ్యాసాల్ని పంపించడం,అవి జనాదరణ పొందడం ఆయన పాండిత్యానికి నిదర్శనం.
సామల ఉర్దూ వ్యాసాలను ఆదరించిన పాఠకులకోసం కె.రామచంద్రమూర్తి (ఆనాటి వార్త పత్రిక సంపాదకులు) సామలని ఆయన జ్ఞాపకాలను రాయమని అభ్యర్థించడం, వెనువెంటనే సామల రాయడం, వాటికి తెలిదేవర భానుమూర్తి “యాది” అనే శీర్షిక నిర్ణయించడం, 2005లో గ్రంథస్తం కావడంతో యాది అంటేనే సామల గుర్తొచ్చే విధంగా ఈ వ్యాసాలు తెలుగు సాహిత్యంతో పాటు పాఠక లోకంలో అద్భుతం సృష్టించాయి. సాహితీ ప్రపంచానికి తెలియని చాలా విషయాల్ని యాది వ్యాస సంకలనం ద్వారా పాఠకులకు అందించిన మహనీయుడు సామల.
సదాశివ ఏడవ తరగతిలో ఉన్నప్పుడే జల్ జంగల్ జమీన్ నినాదం తో పోరాడిన విప్లవ వీరుడు కొమురం భీం చనిపోవడం తన స్కూల్ ప్రక్కనే ఉన్న ఆస్పత్రిలో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచారని తెలిసి వెళ్లి ఆ సంఘటనను కళ్ళారా చూసిన వ్యక్తి సామల. ఆ సంఘటన జీవితాంతం మరవలేదు. 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తక ప్రచురణ సంస్థ నుండి ఏడవ తరగతి తెలుగు వాచకం రాసే అవకాశం సదాశివకు రావడంతో కొమురం భీం పాఠాన్ని పొందుపరిచి ఆయన పోరాట ప్రతిమను తెలంగాణలో మరుగునపడిన వీరున్ని ప్రపంచానికి పరిచయం చేశానని యాదిలో చెప్పుకున్నాడు.
ఎం.ఎస్ 55 గుడ్డతో కుట్టిన వదులు పైజమాలు, ఫైతాబులు, జూతాలు తొడుక్కునే వాడు, మెడలో రుద్రాక్షలు ధరించేవాన్నని యాది లో చెప్పుకున్నాడు సామల. ఆలాగే తన జీవితంలో జరిగిన జ్ఞాపకాల్ని, గురు శిష్యుల ప్రేమలు, సంఘ సేవకులతో ఉన్న సంబంధం, స్నేహ బంధాలు, పరభాషా మిత్రుల జ్ఞాపకాలు, తన జీవితంలో జరిగిన ప్రధాన ఘటనలు, తెలంగాణ భాష యాస, ఆయన చూసిన మనుషులు ఎలా ఉండేవారో తెలుపుతూ, అన్ని సందర్భాలకు ఆయన ఉదహరించిన తీరు ప్రతి పాఠకుడికి కన్నీరు తెప్పిస్తుంది.
అన్ని రచనల కన్నా యాది ప్రత్యేకం. దీనికి ఆయన కేంద్రసాహిత్యఅకాడమీ పురస్కారం అందుకున్నారు. ఆయన రాసిన ఏ రచన ఎవరికి అంకితం ఇవ్వకుండా యాదిని తన పెద్ద మనవడు చిరంజీవి సామల నాగకార్తీక్ కు ప్రేమతో అంకితం ఇచ్చాడు. దాదాపు సంవత్సరం పాటు రాసిన వ్యాసాలన్నీ సంగీతశిఖరాలు అనే పేరుతో ముద్రించి తన మనుమడు (సదాశివ రెండవ కుమారుడు రాజవర్ధన్ పుత్రుడు) నాగ కౌశిక్ కి అంకితమిచ్చాడు. (సదాశివ సామల, రాజవర్ధన్ సామల తెలుగు అకాడమి-2017, హైదరాబాద్ పుట. 42)
2007 సంవత్సరంలో సదాశివ కి గుండెపోటు రావడం నాగపూర్లోని పాటిల్ ఆసుపత్రిలో చేర్పించడం, డాక్టర్ మనోజ్ పాటిల్ సామలను మృత్యుంజయుడు గా తిరిగి పంపించడంతో పాటు, ఆరోగ్యంపై భరోసా ఇచ్చారు. ఆ సమయంలోనే సదాశివ స్వరలయలు రాయడం జరిగింది. ఈ గ్రంథాన్ని డాక్టర్ల బృందానికి అంకితం ఇవ్వడంతో సేవా నిరతి చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులకు అంకితం ఇచ్చానని సామల మురిసిపోవడం, దానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడంతో, సామల జీవితంలో మధురానుభూతుల్ని సంపాదించుకున్నాడని చెప్పవచ్చు.
ఈయన కథానిక రచయితగా, లేఖకునిగా, నవలా (అపశృతి,
రేవతి) రచయితగా, పాఠ్య పుస్తక (1972 లో ఐదవ తరగతి తెలుగు 1982 లో ఏడవ తరగతి తెలుగు) రచయితగా, సంగీత
విద్వాంసుడిగా, చిత్రకారుడిగా (దివంగత ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య సదాశివ దగ్గర 1949లో నూనె రంగులు ఏ
విధంగా వేయాలో నేర్చుకొని శిష్యుడయ్యాడు), సదాశివ 1968 నుండి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉర్దూ
అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా, 1991 నుండి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గా పనిచేశాడు.
“సామల సదాశివ తెలుగు సాహిత్యానికి చేసిన కృషికిగాను 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,
2002లో కాకతీయ విశ్వవిద్యాలయలు డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సాహితీ రంగంలో సామల సదాశివ పొందిన పురస్కారాలు
అనేకం. సామల సదాశివ గురించి చాలా పరిశోధనలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఉర్దూ భాషలో విశేషమైన కృషి చేసి,
ముస్లిం సాహితీ మూర్తులతో అనుబంధం పెంచుకున్నందుకేనేమో పవిత్ర రంజాన్ మాసంలో స్వర్గస్తులైనారు” అని
సదాశివ ద్వితీయ పుత్రుడు రాజవర్ధన్ అన్నారు.
ముగింపు:
ఈ విధంగా కవిగా, రచయితగా, అనువాదకుడిగా ఆనాటి నుండి నేటి వరకు మహా పండితుల విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ, చిత్రకారుడిగా పేరుగాంచిన సామల జీవితం సాహిత్యం సదా ఆదర్శప్రాయం. తెలంగాణ మాగాణంలో సాహితీ శిఖరంగా పేరుగాంచిన కళారత్న సామల సదాశివ పై ఇంకా సమగ్రమైన పరిశోధనలు జరగవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది.
ఉపయుక్తగ్రంథసూచి:
- రామచంద్రమూర్తి. కె., వార్త పత్రికవ్యాసాలసంపుటి, హైదరాబాద్: 2005
- సదాశివ, సామల. నిరీక్షణము: హైదరాబాద్: 1952.
- సదాశివ, సామల. యాది హైదరాబాద్. విశాలాంధ్ర పబ్లికేషన్స్. హైదరాబాద్: 2005
- సదాశివ, సామల. రాజవర్ధన్ సామల తెలుగు అకాడమి. హైదరాబాద్: 2017.
- సదాశివ సామల వికీపిడియా. https://te.wikipedia.org/wiki/సామల_సదాశివ
- జయంతి సాహిత్య త్రైమాసిక పత్రిక, ఏప్రిల్-సెప్టెంబర్. 2012.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.