headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   


"సామల సదాశివ యాదిలో" - ప్రత్యేకసంచిక

AUCHITHYAM | Volume-04 | Issue-06 | May 2023 (Special Issue) | ISSN: 2583-4797

2. అమలిన ప్రేమాస్పదం: సదాశివ "నిరీక్షణం"

DrKLavanya
డా. ఆర్. మహేందర్ రెడ్డి

తెలుగు సహాయచార్యులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) సిద్ధిపేట,
సిద్ధిపేట, తెలంగాణ.
సెల్: +91 9959525955. Email: ra.mahi.1947@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఆధునిక తెలుగు సాహిత్యచరిత్ర లో పాశ్చాత్యులకు చెందిన కాల్పనికవాద ప్రభావంతో కృష్ణశాస్త్రి మొదలుకొని ఎందరో కవులు అమూల్యమైన రచనలు వెలువరించారు. రాయప్రోలు సుబ్బారావు ప్రతిపాదించి ప్రచారం చేసిన అమలిన ప్రేమ సిద్ధాంతాన్ని చాలామంది సమకాలీన కవులు తమ రచనలలో అభివ్యక్తం చేశారు. కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతగా, సంగీతసాహిత్య సారస్యాన్ని తెలిసిన వ్యాసకర్తగా పేరెన్నికగన్న సామల సదాశివ నవయువకుడిగా కాల్పనికవాదాన్ని, అమలిన ప్రేమభావాన్ని మేళవించి 1952 లో రాసిన చక్కని ఖండకావ్యం “నిరీక్షణ”. నిరీక్షణ సమగ్రఅధ్యయనం, కాల్పనికవాదం, అమలిన ప్రేమభావం వంటి అంశాల అధ్యయనం ద్వారా ఇందులో ప్రతిపాదించబడిన అంశాలను విశ్లేషించడం జరిగింది. సదాశివ గారు తెలిపిన భౌతికమైన శారీరక సుఖం కన్నా మానసికమైన అమలిన ప్రేమ భావనతో పాటు సంయోగ సుఖాన్ని మించి ప్రియుని ఎడబాటు, నిరీక్షణలు గొప్ప ఉదాత్తమైన ప్రేమ భావనకు నిలయాలని తెలియజేసిన విధానాన్ని చెప్పడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

Keywords: ఆధునిక తెలుగుకవిత్వం, కాల్పనికవాదం, అమలినప్రేమ, భౌతిక,మానసిక సాన్నిత్యం, ఖండకావ్యం, నిరీక్షణం, ఎడబాటు, విప్రలంబం, వియోగం.

ఉపోద్ఘాతం:

బహుభాషాకోవిదునిగా, సంగీతసాహిత్యాల సారస్యాన్ని అలవోకగా అందించిన వ్యాసకర్తగా, తెలుగు ఉర్దూ పలుకుబళ్ళ కలబోతతో హాయి గొల్పే ప్రసంగకర్తగా పేరెన్నికగన్న కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు గ్రహీత సామల సదాశివ. వారు కవిగా తొలినాళ్లలో రాసిన రచన “నిరీక్షణ”. తెలుగు సాహిత్యంపై విశేష ప్రభావం చూపిన భావకవితాధోరణికి కొనసాగింపుగా వచ్చిందీ ఖండకావ్యం. 1952లో ముద్రణ పొందిన ఈ ఖండకావ్యంలో రాయప్రోలు సుబ్బారావు ప్రతిపాదించిన అమలినశృంగార భావనను సదాశివ కాల్పనిక కథాంశంతో, చక్కని శైలి రమ్యతతో, వియోగంలో ప్రేమాస్పదాన్ని చూపించారు. 

కాల్పనికవాదం - అమలిన ప్రేమ: 

భౌతికమైన శారీరకసుఖం కన్నా మానసిక సాన్నిహిత్యమే గొప్పదిని చెప్పేది అమలినశృంగారం. దీన్ని ప్రతిపాదించిన రాయప్రోలు సుబ్బారావు - “రతిస్థాయి అయిన శృంగారం కంటే విశిష్టమైనది, స్వచ్ఛమైనది అమలిన శృంగారం. ఇది స్నేహప్రవృత్తి స్థాయి భావం కాగల జీవితరసం” (రాయప్రోలు సుబ్బారావు వినూత్న ప్రతిపాదనలు-వారసత్వం, ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం) అని నిర్వచించారు. ఆధునికయుగం ప్రారంభం అయిన తర్వాత తెలుగుసాహిత్యంపై మొదట పాశ్చాత్యులకు చెందిన కాల్పనికవాద ప్రభావం ఎక్కువగా పడింది. వాస్తవిక అంశాల కన్నా ఊహాత్మకమైన ఇతివృత్తానికి ప్రాధాన్యతనివ్వడం కాల్పనికవాదంలో కనిపించే ప్రధానాంశం. దీనితోపాటు ప్రకృతి ఆరాధాన, ప్రియవియోగం మొదలైన అంశాలకు ఇందులో ప్రాధాన్యత కనిపిస్తుంది.  కృష్ణశాస్త్రితో మొదలుకొని చాలామంది కవులు కాల్పనికవాద దృష్టితోనే కావ్యాలు రాశారు.

నిరీక్షణం -ఇతివృత్తం:

కాల్పనికవాదాన్ని, అనుభవైకవేద్యమైన అమలిన శృంగారభావనను మేళవించి సామల సదాశివ గారందించిన విశిష్టరచన “నిరీక్షణ”. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన అతికొద్ది ఖండకావ్యల్లో నిరీక్షణ ఒకటి. విషాదాంత ఇతివృత్తంతో విలక్షణమైన ప్రేమ భావాన్ని వినూత్నంగా వ్యక్తీకరించడం హృద్యంగా అనిపిస్తుంది. ఇందులో నిరీక్షణ, అంబపాలి, మీరాబాయి అనే మూడు ఖండికలలో శారీరకసుఖం కన్నా మానసికమైన అమలిన ప్రేమభావన గొప్పదని ప్రతిపాదించారు. సదాశివ “నిరీక్షణ” ఖండకావ్యాన్ని మిక్కిలి ప్రేమాస్పదంగా అందించారు. ఇందలి కథాంశం పరిశీలిస్తే ఇతివృత్తం కన్నా భావనాత్మకమైన వినూత్న వ్యక్తీకరణ శైలికి ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తుంది.
చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన గీత తండ్రి ఆదరణలో పెరుగుతుంది. ఎవరూ లేని తనకు ఎవరో ఒకరు తోడు కావాలని ఆరాటపడుతుంది ఆ తోడు కోసం తనకు తెలియకుండానే ప్రతిరోజు నదిని దాటి ఒక చెట్టు కింద నిరీక్షిస్తుంది. ఆ నిరీక్షణలో - 

...వృద్ధపిత యొక్కరుడు తప్ప నితరులెవరు
లేరు తనవారానందగు వారాలనుచు
ఎరిగియును నా నిరీక్షణము ఎవరి కొరకు
” (నిరీక్షణ.పుట.సం.2) అని సందేహిస్తుంది. 

ఆ నిరీక్షణ ఫలితమన్నట్లుగా చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి యుద్ధంలో పనిచేస్తూ జీవితం మీద విరక్తుడైన విజయుడనే యువకుడు ఒకసారి నది ప్రాంతానికి వస్తాడు. అతన్ని చూసి - 

...అతడు తనవాడేయని భావించె గీత హృదయమునందున్” (నిరీక్షణ.పుట.సం.5)

అక్కడ తొలిచూపుల్లోనే వారి మధ్య అనురాగం కలుగుతుంది. ఇన్నాళ్లుగా వ్యర్థం అనుకున్న తన నిరీక్షణ సార్థకమయ్యిందని గీత సంతోషించింది. చిన్నప్పటినుండి బంధుత్వ అనుబంధాలు ఎరుగని ఇరువురు తొలిచూపులోనే పరస్పర సాన్నిత్యాన్ని అభిలషిస్తారు. కానీ విజయుడు తన ఆశ తీరదని భావించి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అతన్ని గీత రక్షిస్తుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ప్రేమమయ జీవితాన్ని అర్థం చేసుకుని పరస్పర అనురాగభరితులవుతారు.

నీదు పరిచయంబు లభింపనేడపూర్వ
మైన జీవితాపేక్షలీ యవనిలోని
భోగభాగ్యములన్నిటి పొందుకాంక్ష
లుప్పతిలుతుండె...
” (నిరీక్షణ.పుట.సం.4) అని గీత అనురాగంతో మాట్లాడగా విజయుడు ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటాడు.

...అతి పవిత్ర ప్రేమ వెలయునట్లు /చుంబనంబొనరించె నయ్యంబుజాక్షి” (నిరీక్షణ.పుట.సం.8) ఇరువురు పరస్పరానురాగంతో ప్రకృతిలోలీనమై పరవశించిపోతారు.

విజయుని స్నేహితులు వచ్చి కర్తవ్యాన్ని గుర్తుచేయగానే “ఈ వనలక్ష్మి సాక్షి మనమిద్దరమిచ్చట పెళ్లియాడినాము.... నన్ను మరచిపోవకుమెన్నటికైన వచ్చెదన్... నను బంపుము ప్రీతి తోడుతన్” (నిరీక్షణ. పుట.సం. 9) అని యుద్ధానంతరం తాను తిరిగి వచ్చి నీ పవిత్ర సాహచర్యం పొందగలనని చెప్పి ఊరడించి వెళ్ళిపోతాడు.

స్త్రీ పురుషులను జంటగా కూర్చే వివాహ సంప్రదాయానికి హైందవధర్మంలో ప్రాధాన్యత ఎక్కువ. అయితే మానసికంగా ఇరువురు కలిసినప్పుడే భౌతికమైన సంప్రదాయానికి విలువుంటుంది. అలా మానసికంగా ఒక్కటిగా మెలగడమనేది అత్యంతావశ్యకం. అలా అయితేనే ఆ జంట సంసారికజీవనం చక్కగా సాగుతుంది. ఇక్కడ విజయుని మాటల్లో మానసికంగా ఒక్కటైన మనకు భౌతికమైన వివాహా సంప్రదాయం అవసరం లేదని ప్రకృతి సాక్షిగా పరిణయం జరిగినట్టేనని భావించడంలో వారి నిర్మలిన ప్రేమ ద్యోతకమవుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన గీత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా విజయునితో తన భవిష్యజీవితాన్ని ఊహించుకొని ఉవ్విళ్లూరుతుంది. ప్రతిరోజు విజయుని కోసం నిరీక్షించి కృంగి కృశించిపోతుంది. కొంతకాలానికి తండ్రి మరణిస్తాడు. ఉన్న ఒక్క అనుబంధం కోల్పోయిన గీత విజయుని రాకకై పరితపించిపోతుంది. ఒకరోజు అతని స్నేహితుల వలన విజయుడు యుద్ధంలో గాయపడి గీత కోసం పరితపించి పరితపించి మరణించాడని తెలుసుకుంటుంది. ఆ మాటలు విన్న గీత మిక్కిలి దుఃఖిస్తుంది.

నా నిరీక్షణము లీనాటికి వ్యర్థoబులై చనె స్వర్గంబునందు నుండి/ నా కొరకై నీవనారతంబును నిరీక్షణమొనర్చదవేమో...” (నిరీక్షణ.పుట.సం.19) అని భావించి ఆత్మార్పణం చేసుకుంటుంది.

అమలిన ప్రేమాస్పదం-గీత-విజయుల ప్రణయం:

బంధుత్వాలకు దూరమై ఒంటరిగా కలుసుకున్న యువతి,యువకుల ప్రేమకథతో కూడిన ఈ ఇతివృత్తంలో ఎక్కడ భౌతిక శృంగారభావన వర్ణించబడలేదు. పరస్పర ఆకర్షణ గురించి చెప్పినప్పటికీ అది ఆత్మీయానుబంధమే తప్ప శారీరక ఆకర్షణ కాదు. ఇరువురు అనుబంధం నిలబడాలని ఆరాటపడ్డారే కానీ అవకాశం వచ్చినప్పటికి శారీరక సుఖాన్ని కోరుకోలేదు. తనకు తెలియకుండానే మనసుకు కావాల్సిన ప్రేమ కోసం నిరీక్షించి, ఆరాటపడి ఆ బంధాన్ని కడవరకు నిలుపుకోవాలని కోరుకుంది గీత. కానీ విధివశాత్తు విజయునికి దూరమైంది. తాను కోరుకున్న అనుబంధం దక్కలేని లోకంలో ఉండలేక తనువు చాలించడం విషాదాంతం. కథ విషాదాంతమే అయినప్పటికీ కథనంలో ఒకరి కోసం ఒకరు ఎదురుచూసిన విధానాన్ని వర్ణించడం హృద్యంగా కనిపిస్తుంది. సదాశివ నవయువకుడిగా రెండుపదుల వయసులో రాసిన ఈ ఖండకావ్యంలో ఇంతటి ఉదాత్తమైన భావనలను చిత్రీకరించడం గొప్ప విషయం.

ప్రాకృతిక ప్రేమ:

కాల్పనిక కథాంశం అయినప్పటికీ ఇందులో అమలినప్రేమాస్పద భావనను చక్కని ఆలంకారిక శైలిలో వ్యక్తం చేసాడు. “అనిలసంచలితంబులగు శిరోజముల-నంచితరీతి కొప్పుగా చేర్చి చేర్చి/... కోమలాంగులచే కోసి కోసి/... వ్రాలెడు తేటుల తోలి తోలి...” (నిరీక్షణ.పుట.సం.3) వంటి పద్యపాదాలు ప్రబంధ నాయికల సౌందర్యాన్ని గుర్తుచేస్తాయి. విజయున్ని తొలిసారి చూసిన గీత గురించి “...ఆతని నవలోకించె నతిభీత హరిణేక్షణయై” (నిరీక్షణ.పుట.సం.3) అని చెప్పడంలో ప్రబంధ నాయికల ముగ్ధత్వం కనిపిస్తుంది.

“పిల్లగ్రోవిని స్వకల్పితరాగ తాళాల- వరలు సంగీతమవార్యలీల
పాడుచు పసుల కాపరులు పొలము నుండి – యాల దోల్కొని పల్లె కరుగుచుండ
కలకలారవములు గడలనించుచు పక్షు –లెరగొని గూండ్లకు ఎగురుచుండ
అర్కుండు ముదిమి మైన పరాశ దిరుగుచు-విశ్రామ స్థానంబు వెతుకుచుండ...” (నిరీక్షణ.పుట.సం.3)

వంటి పద్యాలు స్వభావోక్తి అలంకారంతో వాస్తవిక పల్లె ప్రకృతిని అందమైన చిత్రంగా రూపు కట్టిస్తాయి. మనసును కథాగత పల్లెప్రాంతానికి తీసుకెళ్తాయి.

గీత-విజయుల అమలినమైన పవిత్రప్రేమను చూసి ప్రకృతి పరవశించింది. -

“ప్రకృతి అంతయు నాయువ ప్రణయలీల
లరసి ప్రమదంబు చెందినట్లయ్యె దలప
నగుమొగంబుల లేతీవలెగసి యప్పు
డెలమి వంగి జోతలు సమర్పించుచుండె”
(నిరీక్షణ.పుట.సం.8)

గాలికి కదులుతూ వేలాడుతున్న తీగల చిగుర్లు వారి ప్రణయాన్ని చూసి ప్రణామాలు చేశాయని భావించడం ఉదాత్తమైన గొప్ప భావచిత్రం. చంద్రుడు అమృత బిందువులు కురిపించడం, పిల్లగాలులు పూలపొడి వర్షించడం, నదీ జలాలు ఉప్పొంగడం మొదలైన వర్ణనలు గీతా విజయుల అమలిన ప్రణయ రాగ పరవశత్వాన్ని, నిర్మలినమైన ఇటువంటి ప్రేమా సదా సర్వత్రా ఆమోదయోగ్యమని అంతరార్థాన్ని ప్రకటిస్తాయి.

వియోగ శృంగార వైవిధ్యత :

విజయున్ని విడిచి ఉండలేక గీత విలపించినప్పుడు అతను -

 “...పూరుషుడు గాన చిత్తంబు పొదివిపట్టి/ తిరిగి యోదార్చె నిటువలె ధీరుడగుచు” (నిరీక్షణ.పుట.సం.10) అని,

“ప్రేయసి అనుమతిని బడసి మనసు వెనుకకు కాళ్లు ముందునకు సాగ” (నిరీక్షణ.పుట.సం.13) విజయుడు బయలుదేరాడని చెప్పడంలో స్త్రీ పురుషుల సహజ స్వభావసిద్ధమైన మనోచాంచల్యము, భావగాంభీర్యాలు సహజంగా వ్యక్తమవుతాయి. విజయనికై నిరీక్షిస్తున్న గీతను ఎవరు అడిగినా సమాధానం చెప్పదు కానీ తన బాధలను -

“...తన వెతల ప్రశ్నించినట్టి ప్రకృతి సతికిని; తనదు భావంబులందు మెలగు ప్రియ విజయునకును..” (నిరీక్షణ.పుట.సం.16) 

మాత్రమే చెప్పుకుందని చెప్పడంలో మాటలతో స్పందించే వారి కన్నా మనసుతో స్పందించే వారి పట్ల ఆత్మీయతాభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.
విజయుడు గీతను ఊరడిస్తూ “... దుఃఖంబేల బేలా! సుసామాన్యంబీ యెడబాటు; ప్రేమకిదే సుమా గీటురాయారయన్” (నిరీక్షణ.పుట.సం.11) అని చెప్పిన మాటలు పూర్వలాక్షణికులు చెప్పిన విప్రలంభ శృంగారభావనను మనుషులు దూరంగా ఉన్నప్పుడే మానసికంగా మరింత దగ్గరవుతారనే మనోవిజ్ఞానశాస్త్రభావాన్ని వెల్లడిస్తాయి. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికి ఇరువురి మధ్య సాన్నిత్యం కొనసాగడమే నిజమైన ప్రేమకు నిదర్శనమని, ఎడబాటు ప్రేమ స్వచ్ఛతను నిర్ధారించే గీటురాయని చెప్పడంలో ఉపమానాత్మకమైన ఉదాత్తత కనిపిస్తుంది.

“హృదయ దయితుని ఎడబాసి యిందువదన
అఖిల లోకంబు తనకు శూన్యంబటంచు
తలచి వలపోత తానెంతొ కలుగుచుండె
ప్రియ విరహతాపమునుభవవేద్యమగును” (నిరీక్షణ. పుట.సం.14)

ఈ మాటల్లో విప్రలంబభావనతో కూడి, ఆత్మీయానురాగం వ్యక్తంచేస్తున్న నాయికరూపం మనసును ఆర్ద్రపరుస్తుంది. జీవితభాగస్వామికి దూరమైన వ్యక్తికి లోకమంతా శూన్యoగానే కనిపిస్తుంది. ఏ విషయమైనా దూరమైనప్పుడే దానిపట్ల వాంఛ మరింత అధికమవుతుంది. ఇష్టమైన వారికోసం ఎదురుచూడడం కూడా గొప్ప విషయమనే భావాన్ని వెల్లడించారు. ఇది అనుభవైకవేద్యమే తప్ప వర్ణించడానికి వీలుకాదని చెప్పిన మాటలు అక్షరసత్యాలు.
ఆశ లోకాన్ని నడిపిస్తుంది ఆశ లేకపోతే ఏ జీవికి భవిష్యత్తు జీవనమే ఉండదు. ఈ అంశాన్ని గురించి తెలియజేస్తూ -

అనవరత దుఃఖహతులైన జనులు భావి
ఆశ చే దుఃఖవిస్మృతి నందుచుండ్రు
గతము, వర్తమానము దుఃఖయుతములైన
భావి సుఖమందగలమని బ్రతుకవచ్చు” (నిరీక్షణ పుట.సం.17)

అని చెప్పిన సదాశివ మాటలు క్లిష్టపరిస్థితుల్లో కూడా మనిషి జీవితాన్ని ముందుకు నడిపించే ఆశ ప్రాధాన్యతను తెల్పుతాయి.
కామ విరహిత సుప్రేమ కలితులగుచు
అన్య లభ్యంబుగాని మహా సుఖంబు
గాంత్రు ప్రియజనుల్ తమ వియోగమున కూడ
అతివ మన వియోగంబు దుఃఖార్హమగునె”

“ఒనర ప్రియజనులెల్ల సంయోగ సుఖము
పడయజాలరు కాల ప్రభావ గతిని
ముదిత కొన్నాళ్లు మనము సంయోగ సుఖము
గాంచలేకున్న మన ప్రేమ కొంచెమవునె” (నిరీక్షణ.పుట.సం.11)

పద్యాలలో సామల సదాశివ అమలిన ప్రేమభావన అభివ్యక్తమవుతుంది. కామమోహితమైన భౌతికశృంగారభావన కంటే మానసికమైన అమలిన ప్రేమభావన, విప్రలంబశృంగార భావన చాలా గొప్పది, అది స్త్రీపురుషుల ప్రేమలో ఉదాత్తమైనది ఉత్తమోత్తమమైనది అని తెలియజేస్తాడు. 

అనిమేష నిరీక్షణముల
యనవరతము చూచుచును రవంత విసుగు లే
క నిరాశ చెందబోక ప్రి
యుని చింతన చేయునితర మొల్లక మదిలోన్” (నిరీక్షణ.పుట.సం.18)

అనే మాటలు భౌతికంగా ఒకరి దగ్గర మరొకరు ఉన్నప్పుడు పొందే ప్రేమ కన్నా దూరంగా ఉన్నా కూడా ఒకరి గురించి ఒకరు నిరంతర అనురాగంతో తాపత్రయ పడడం గొప్ప భావమని అది స్త్రీ పురుషుల బంధాన్ని మరింత బలపరుస్తుందని చెప్తాడు. దీనికి కొనసాగింపుగా స్త్రీ పురుషులు పరస్పరం “...నీ ప్రేమయే నా హృత్కమలములో మెలగుచు కన్నుదోయిలో ఉండవలెన్” (నిరీక్షణ.పుట.సం.11) అని భావించాలంటాడు. అప్పుడే పరస్పరానురాగం మరింత ఉన్నతమై ఆ బాంధవ్యం బలపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తాడు.

భౌతికాతీతమైన ప్రేమ భక్తి :

నిరీక్షణ ఖండకావ్యంలో గీత-విజయుల అమలిన ప్రేమాస్పదమైన కథతో పాటు అంబపాలి, మీరాబాయి ఖండికలలో కూడా అమలినప్రేమ సిద్ధాంతాన్ని వ్యక్తంచేశారు. బింబిసారుని వేశ్య అయినా ఆమ్రపాలి తొలుత - “క్షణకాల వియోగమైన సైపనలవిగాకవర్ణ్యమగు బాధ కృషించెడునట్టి” (నిరీక్షణ.పుట.సం.23) శారీరకసౌఖ్యమే అన్నింటికన్నా గొప్పదని భావిస్తుంది కానీ బుద్ధుని బోధనలు విన్న తర్వాత తన తప్పును తెలుసుకుంటుంది. 

శరీరయుక్తమైన పాపం కన్నా మనసుతో చేసిన పాపమే చెడ్డదని దాని నుండి ప్రాయశ్చిత్తం పొందాలని వేశ్యవృత్తిని విడిచిపెట్టి భిక్షుకిగా మారుతుంది. చిన్ననాటి నుండి కృష్ణ భక్తిలో పరవశించిపోయిన మీరాబాయి అంతఃపుర సకలసౌభాగ్యాలను, శారీరక సౌఖ్యాలను వదిలిపెట్టి బృందావనం చేరి కృష్ణుని ఆరాధించడంలో కనిపించే అమలిన భక్తి భావనను ఇందులో అత్యంత ఆత్మీయంగా వ్యక్తం చేశాడు.

ముగింపు:

ఈ విధంగా నవయువకుడుగా ఉన్నప్పుడే సామలసదాశివ స్త్రీపురుష సంబంధాలను ఇంత ఉదాత్తంగా చిత్రించడంవిశేషం. సంప్రదాయధోరణిలో రాసిన ఈ రచనలో నవనవోన్మేషమైన ఇతివృత్తంతోపాటు, చారిత్రక అంశాలను ప్రబంధశైలితో మేళవించి తాను విశ్వసించిన అమలిన ప్రేమాస్పద భావాన్ని అందించారు. చిన్న చిన్న కారణాలతో మానవసంబంధాలు విచ్చిన్నమవుతున్న నేటి సమాజానికి సున్నితమైన అమలిన ప్రేమభావనలను ఆత్మీయంగా అందించిoదీ నీరీక్షణ. ప్రేమ అనే భావన శారీరక అవధులు దాటి మానసికంగా ఎదగాలని విరహమైనా, వియోగమైనా, అది మనుషుల్ని వేరు చేస్తుందే తప్ప మనసుల్ని కాదనే భావాన్ని నిరీక్షణ ఖండకావ్యం ద్వారా వ్యక్తం చేసిన సదాశివ భావాలు సదా అనుసరణీయాలు.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. గోపి. ఎన్. (సం.), వివేచన. ఆధునిక మహాకవులు అందించిన వారసత్వం, తెలుగుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం. హైదరాబాద్: 1996. 
  2. తెలుగు అకాడెమీ, తెలుగులో కవిత్వోద్యమాలు, హైదరాబాద్:  2006. 
  3. నారాయణ రెడ్డి. సింగిరెడ్డి. ఆధునికాంధ్ర కవిత్వం- సంప్రదాయములు, ప్రయోగములు.  విశాలాంధ్ర పబ్లికేషన్స్. హైదరాబాద్: 1999.
  4. సదాశివ సామల. నిరీక్షణము. హైదరాబాద్: 1952.
  5. సదాశివ సామల. యాది  హైదరాబాద్. విశాలాంధ్ర పబ్లికేషన్స్. హైదరాబాద్: 2005.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]