headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797

11. సత్యవతి కథల్లో స్త్రీ

dr_dilleswararao
డా. ఢిల్లీశ్వరరావు సనపల

తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పురుషులు),
శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
సెల్: +91 9441944208. Email: eswar.dilli820@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్యంలో జాతీయోద్యమ, కాల్పానిక, అభ్యుదయ, విప్లవ కవిత్వోద్యమాల తర్వాత అత్యంత ప్రభావం చూపిన ఉద్యమం స్త్రీవాద కవిత్వోద్యమం. 1975 తర్వాత రూపుదిద్దుకొని, 1985 నుంచి స్థిరపడి క్రమంగా అన్ని ప్రక్రియలకూ విస్తరించిన ఉద్యమం స్త్రీవాద కవిత్వోద్యమం. సత్యవతిగారి కథల్లో సమాజంలోనూ, కుటుంబంలోనూ, పనిలోనూ స్త్రీలు గురవుతున్న అణిచివేత, దోపిడీకి సంబంధించిన అవగాహనతో పాటు స్త్రీ అస్తిత్వానికి, పోరాటానికి సంబంధించిన అంశాల విశ్లేషణ వ్యాస ముఖ్య ఉద్దేశం. పాత్ర చిత్రణ, సంభాషణలు, కథా నేపథ్యాన్ని విశ్లేషిస్తూ ఆయా సన్నివేశాలు ద్వారా రచనలో గల వివిధాంశాల విశ్లేషణ. కథల నేపథ్యానికి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించడం, వివిధ గ్రంథాల్లో గల సంబంధిత విషయాలు క్రోడీకరించి విశ్లేషణ చేయడం. సత్యవతి కథల్లో స్త్రీ పాత్రలు సమాజంలో సగటు స్త్రీకి దర్పణంగా ఆగిపిస్తాయని తెలియజేయడం. ఆధునిక స్త్రీ ఏమి ఆశిస్తుంది? దేన్ని కోరుకుంటుంది? అనే అంశాన్ని విశ్లేషిస్తూ స్త్రీకి కూడా కోరికలు, ఆశలు, ఆశయాల ఉంటాయని, వాటిని గౌరవిస్తూ సమాజంలో వారూ సగభాగమనే విషయాన్ని తెలియజేయడం. సత్యవతి గారి కథల్లో పాత్రలు సంభాషణలు సమాజాన్ని ప్రశ్నించడంతోపాటు ఆలోచనని కూడా కలిగింపజేస్తాయని తెలియజేయడం.

Keywords: స్త్రీ వాద కవిత్వం, అస్తిత్వం, జెండర్ వివక్ష, గృహ హింస, సూపర్ మామ్ సిండ్రోమ్.

1. రచయిత్రి పరిచయం:

తెలుగు కథా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మహిళా రచయితల్లో పి సత్యవతి ఒకరు.1940వ సంవత్సరం జులైలో గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించిన వీరు కథా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో ఎం.ఏ పట్టా పొందిన వీరు ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేసి ఉద్యోగం విరమణ పొందారు. సత్యవతి చదువుకున్నది ఆంగ్ల సాహిత్యమైనప్పటికీ సమాజాన్ని నిశితంగా పరిశీలించిన పరిశీలకురాలు. 1985 నుండి స్త్రీవాద ఉద్యమం ప్రారంభమైన నుండి స్త్రీవాద రచయిత్రిగా అనేకమైన మంచి కథలను అందించిన రచయిత్రి సత్యవతి.ఇంట, బయట స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎత్తిచూపుతూ మహిళా చైతన్యాభిలాషతో కూడిన కథలను వెలలువరించిన ఘనత ఈమెది. "ఒక కథ చదివిన తర్వాత మనసు చెలించాలి. మళ్లీ చదివేంప జేయాలి. ఈ కథ బాగుంది అని పదిమందికి చెప్పించగలగాలి. మరో పదేళ్లో యిరవై ఏళ్ళో పోయింతర్వాత చదివినా అదే అనుభూతి, స్పందన కలగాలి. అప్పుడే అది గొప్ప కథ అవుతుంది" అని అంటారు వాకాటి పాండురంగారావుగారు. అటువంటి గొప్ప కథలను ఎన్నింటినో రాసిన రచయిత్రి సత్యవతిగారు.

2. నేపథ్యం :

"కల్పానిక ఉద్యమం స్త్రీలను కొత్త రూపంలో దర్శించింది. అభ్యుదయ కవితోద్యమం స్త్రీ పురుష సమానత్వం గురించి పాక్షింగానైనా ప్రస్తావించింది. అయితే ఈ ఉద్యమాలేవీ స్త్రీల సమస్యలకు కారణమైన పితృస్వామ్య వ్యవస్థ స్వరూప స్వభావాలను అర్థం చేసుకోలేదు. అధ్యయనం చేయలేదు. కవిత్వీకరించలేదు. ఆ కారణంగా స్త్రీల చైతన్యం గురించిన వారి అవగాహన అసమగ్రంగా, అసంతృప్తిగా ముగిసింది. ఈ నేపథ్యంలో తనకు పూర్వం ఉన్న ఉద్యమాల నుండి స్ఫూర్తిని అందుకొని ప్రపంచాన్ని కొత్త చూపులో స్త్రీ దృక్పథం నుంచి దర్శించిన కవితోద్యమం స్త్రీవాదం" అని పేర్కొన్న ఆచార్య సి. మృణాళిని మాటలు ఆలోచన కలిగించక మానవు. (తెలుగులో కవిత్వోద్యమాలు పుట.184).

జెండర్ వివక్ష, పితృస్వామ్య వ్యవస్థ, స్వేచ్ఛ హననం, వ్యక్తిత్వ హననం, సమానత్వ వ్యత్యాసం, ఆర్థిక అసమానత్వం, లైంగిక దాడి, గృహ హింస, వివాహ వ్యవస్థలో వ్యత్యాసాలు మొదలైన అంశాలతో కూడిన వస్తు నేపథ్యంతో కథలను రాశారు సత్యవతి. భార్యగా, తల్లిగా, బిడ్డగా, తోబుట్టువుగా భిన్నమైన పాత్రల్లో కనిపించే స్త్రీ మూర్తుల ఉనికి మాత్రం అంతంతమాత్రంగానే ఉన్న సమాజపు అంతరాలను ఎత్తిచూపుతూ తన కథల్లో స్త్రీ సమస్యలను చిత్రించిన తీరు ఆలోచనను కలిగిస్తుంది. గృహింస, ప్రాతినిధ్య లోపం, పురుషాధిక్యత మొదలైన విషయాలు స్త్రీ జీవితాన్ని నానాటికి సంక్లిష్ట పరుస్తున్న తరుణంలో స్త్రీల అవసరాలు, ఆలోచనలు, వ్యక్తిత్వం, సామాజిక గుర్తింపు వంటి అంశాలను కథా వస్తువుగా చేసుకొని ఈమె రచనలు చేశారు. "50 సంవత్సరాల కాలంలో స్త్రీల జీవన విధానంలో పరిస్థితుల్లో గమనించదగ్గ మార్పులే వచ్చాయి అవి పూర్తిగా ప్రగతిశీలమైన మార్పులని చెప్పుకోలేని మార్పులు ఒకప్పుడు మతమూ సమాజమూ ఏర్పరిచిన సంప్రదాయాలు, నీతి నియమాలు స్త్రీల జీవితాలని నియంత్రిస్తే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు, అవసరాలు, మార్కెట్ కూడా వాటికి తోడయ్యాయి. చదువు, ఆలోచన, అవగాహన, అర్జన స్త్రీల జీవితాన్ని సుగమం చేయకపోగా మరింత సంక్లిష్టం చేశాయి" (నా మాట ఒకటి పుట. 2) అంటారు రచయిత్రి. ఒకనాటి సమాజంలో స్త్రీ ఇంటికే పరిమితం కాగా నేటి మహిళ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నప్పటికీ గృహపరమైన, కుటుంబపరమైన పనుల్లో అత్యధిక శాతం తానే నిర్వహించాల్సిన నేపథ్యంలో స్త్రీ గోడదెబ్బ చెంప దెబ్బ రెండూ అనుభవించాల్సిన సంక్లిష్టమైన స్థితి ఏర్పడింది.

వృత్తి వ్యాపారాలలో ఎంతో రాణిస్తూ, సమాజాభివృద్ధికి తాను అవిశ్రాంతంగా శ్రమిస్తున్నప్పటికీ లైంగిక పరమైన వేదింపులు, జెండర్ వివక్ష నేటికీ కనుమరుగు కాలేదనేది కాదనలేని వాస్తవం. మహిళా సాధికారత కొంత సాధించినప్పటికీ సమాజంలో స్త్రీకి సముచిత స్థానం ఉంది అని చెప్పలేం. తన అస్తిత్వాన్ని కోల్పోతూ ఆశల్నీ, ఆశయాల్నీ, ఆలోచల్నీ, కలల్నీ, కళల్నీ, కుటుంబానికే అంకితం చేసి సమస్తాన్ని కోల్పోతున్న మహిళలు నేటికీ మన సమాజంలో దర్శనమివ్వక మానరు. తాను ఉనికిని కోల్పోతన్నా కుటుంబ ఉన్నతే పరమావధిగా, కుటుంబ శ్రేయస్సే తన శ్రేయస్సుగా సాగుతున్నప్పటికీ కుటుంబాల్లోనూ, సమాజంలోనూ తగిన గౌరవం లభిస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ సమస్యలన్నీ సత్యవతిగారి కథల్లో దర్శనమిస్తాయి.

3. కథా పాత్రలు పరిచయం:

ఆశలు పల్లకిలో వచ్చి బంధాలు బంధిఖానాలోపడి జీవిత నౌకను సాగించి, పరిస్థితులు చేజారి మునిగిపోడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో జీవితనౌకను గాడిలో పెట్టిన స్త్రీ నేనొస్తున్నాను... కథలో పేరులేని పాత్రలో కనబడుతుంది. ఇల్లలకడమే జీవిత పరమావధిగా, భర్త పొగడ్తే జీవిత సాఫల్యంగా భావించి ఆశల్నీ, ఆశయాల్నీ మరచిపోయి తన ఉనికినే కోల్పోయిన వ్యక్తి ఇల్లలకగానే పండుగౌనా! కథలోని శారద. కుటుంబ చట్రంలో చిక్కి జీవితం చీకటి గదికి అంకితం కాకుండా చూసుకుంటూ స్నేహాలు, సరదాలు వేటినీ విడవకుండా సమన్వయంతో ముందుకు సాగే మహిళ ప్రమీల (ఇల్లాలకగానే పండుగౌనా!). ఉద్యోగం చేస్తూ, కుటుంబ అవసరాలును తీరుస్తూ ఇంటి బయట పని ఒత్తిడికి సతమతమౌతూ సమన్వయం చేసుకుంటూ సాగే వ్యక్తులకు ప్రతీక సంధ్యారాణి, పుష్పలత, సునంద (గోధూళి వేళ). పతిపూజే పరమావధిగా భావించి పంటిబిగువతో పదిళ్ళలో పాచిపని చేస్తూ భర్త చేసే పూజకు సమిధగా మారిన మంగ (పతిభక్తి). అన్నింటిలోనూ తన కుటుంబం ఉన్నతంగా ఉండాలని భావించి అన్నీ తానై వ్యవహరించి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శరీరం మొత్తం ఛిద్రం చేసుకుని మరణించిన అనురాధ (సూపర్ మామ్ సిండ్రోమ్).

ముప్పై ఏళ్ల వైవాహిక జీవితంలో అనుమానాలు, అవమానాలు, ఛీత్కారాలు, చీదరింపులు తప్ప తనకంటూ గుర్తింపు, గౌరవం లేని జీవితాన్ని మరణంతో ముగించాలని బలవన్మరణానికి పాల్పడిన అరుంధతి (అరుణ సంధ్య). ఎంతో ప్రతిభ, మరెంతో సామర్థ్యం, చదువులో చురుకుదనం, లెక్కల్లో కాలేజీ ఫస్ట్ సాధించిన అమ్మాయి కుటుంబ పరిస్తితుల దృష్టా చదువుకు దూరమై బాధ్యతలకు బంధీగా మారిపోయిన సగటు మధ్యతరగతి మహిళ సరస్వతి (గాంధారి రాగం) మొదలైన పాత్రలు సత్యవతి కథల్లోని స్త్రీ పాత్రలకు కొన్ని ఉదాహరణలు. ఇలా ప్రతి కథలోనూ వాస్తవిక సమాజ చిత్రణతో కూడిన స్త్రీ పాత్రలు సత్యవతి కథల్లో అడుగడుగునా అగుపిస్తాయి.

4. కథల్లో స్త్రీ పాత్రల విశ్లేషణ:

స్నేహాలు, అభిరుచులు, జ్ఞాపకాలు, ఆశయాలు, సరదాలు, నైపుణ్యాలు ఇలా అనేకమైన అంశాలను మేళవించికుంటూ తమదైన వ్యక్తిత్వంతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన అనేకమంది స్త్రీలు తమ జీవితంలో వాటన్నింటినీ కోల్పోయి చివరకు తనకు తానే భిన్నంగా కనబడే స్థితి అనేక చోట్ల దర్శనమిస్తుంది. ఏ కుటుంబం కోసం తాను ఆరాటపడిందో ఆ కుటుంబమే తనని అక్కరచేయక ఒంటరిని చేసే స్థితిలోకి నెట్టివేస్తుంది. తనను తాను సమస్తమూ కోల్పోయిన విధానం "నేనొస్తున్నాను" కథలో కనబడుతుంది. అవతల ఒడ్డుకి ప్రయాణం అవుతూ అద్దంలో చూసుకుంటే తన ముఖం తనకే ముద్దొచ్చే అమ్మాయి తన స్నేహాలు, అభిరుచులు, జ్ఞాపకాలు, ఆశయాలు, సరదాలు, నైపుణ్యాలు తనకు మాత్రమే సంబంధించిన ఇంకా కొన్ని విశేషాలతో గంపెడ ఆశతో పాటని పెదాల మీద ఉంచుకొని చిరునవ్వుతో జీవితం అనే పడవెక్కి ఆవలి ఒడ్డుకై ప్రయాణమైన అమ్మాయికి కాలగమనంలో తన జీవిత భాగస్వామి సంపాదన, నూతన ఆశయాలు, ఆలోచనలు అనే సంబంధాల్లో చిక్కుకొని, తనదైన పనిలో తాను తలమునకలై తనని నమ్మి వచ్చిన ఇల్లాలిని ఒంటరిని చేసిన సందర్భంలో ఆ ఇల్లాలు ఒంటరిగా మారిపోయిన స్థితి ఏర్పడుతుంది. జీవిత నౌకని ప్రారంభించిన తొలినాల్లో ఆ పురుషుడు ఆ ఇల్లాలికి చేసిన బాసలన్నీ నీటి మూటలుగా మారిపోయాయి. ఆ ఇల్లాలు తన సమస్తాన్నీ కోల్పోయిన స్థితితోపాటు తనని తాను వెతుక్కున్న సందర్భంలో తాను తన అస్తిత్వాన్ని కోల్పోయానని తెలుసుకుంటుంది. ఈ కథలో ఆ ఇల్లాలు సగటు కుటుంబ స్త్రీకి ప్రతినిధిగా దర్శనమిస్తుంది. కుటుంబ పోషణకై పురుషుడు ధనార్జన మాత్రమే చేయగా మహిళలు కుటుంబ అవసరాలు, పిల్లల పెంపకం, పిల్లలు చదువులు, కుటుంబ నిర్వహణ వంటి అనేక కుటుంబ బాధ్యతలు తాను మోస్తూ తననితాను కోల్పోతుంది. జీవిత గమనంలో తొలినాటి ఆత్మీతానురాగాలను సైతం కోల్పోతుంది. "నన్ను పడవలోకి వెలుగు కళ్ళతో ఆహ్వానించినవాడు నన్ను చేయబట్టి పడవలోకి ఎక్కిస్తానన్నవాడు ముసిముసి నవ్వులతో ముచ్చటగా ఉన్నవాడు నాకు తిండివేల తప్ప కనిపించడమే లేదు. ఆ నవ్వులు లేవు ఆ ముచ్చట్లు లేవు అవేవో తెచ్చి పడవ నింపటం తయారు చేయడంలో నిమగ్నమైపోయాడు" అనుకుంటుంది ఆ ఇల్లాలు. (నేనొస్తున్నాను కథ పుట.4) పురుషుడు గృహ అవసరాలకై సంపాదనలో పడిపోగా పురుషుడుతో ప్రయాణంలో ఒంటరైన మహిళా తన చిన్ననాటి అభిరుచులు వైపు ప్రయాణం సాగించాలని అనుకున్న తరుణంలో కాలప్రవాహంలో కొట్టుకోవడం మూలంగా వాటికి ఆమడదూరంలో ఉన్నట్లు ఆలస్యంగా గ్రహిస్తుంది.

"ఇక తనతో కాదని నా పూర్వ స్నేహితులు జ్ఞాపకాల సరదాలతో నా జీవితాన్ని కొనసాగిద్దామని నేను తెచ్చుకున్న వెలుగు పూల సంచులు విప్పుకుందామనుకుంటూ వాటికోసం వెతికాను పడవ అంతా కలయ తిరిగాను ఒక్క సంచి కనపడలేదు." (పుట4) పై మాటల్లో ఆశలు, ఆశయాలు, అలవాట్లు ఆ ఇల్లాలి నుండి ఎంతలా దూరమయ్యాయో చెప్పకనే తెలుస్తుంది.

తన స్నేహాలు, జ్ఞాపకాలు, అనుభవాలు, నైపుణ్యాలు ఎక్కడని ఆలోచించిన తరుణంలో తనపై మోహంతో ప్రేమతో తనను తాను మర్చిపోయిన స్త్రీమూర్తికి ఒకనాటికి తాను అనుకున్న సమస్తాన్ని కోల్పోయినట్టుగా తెలుస్తుంది. పురుషుడు తన అవసరాలకు, ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించిన సందర్భంలో తనను నమ్మి వచ్చిన స్త్రీ మూర్తి పరిస్థితిని ఏమాత్రం పట్టింపుచేయని పరిస్థితిలో ఆ స్త్రీ మూర్తి ఒంటరిగా మిగులుతుంది.

"మనం సేకరించిన ఈ సంపద అంతా పడవలో నింపే క్రమంలో అవి అడ్డం వచ్చి ఉంటాయి. నదిలో గిరాటేసి ఉంటాను అన్నాడు నా సఖుడు చాలా తేలిగ్గా" అనే మాటలు పురుషుడు తన అవసరాలకు ఇచ్చిన విలువ తనని ఇష్టపడి తనకే జీవితాన్ని అర్పించిన స్త్రీ మూర్తి అవసరాలకు అభిప్రాయాలకు సమచిత గౌరవం ఇచ్చినట్లుగా కనిపించదు. ఎన్నో ఊహలతో జీవిత నౌకనెక్కిన స్త్రీ మూర్తి కాలగమనంలో తనని ప్రేమించిన, తాను ప్రేమించిన సమస్తాన్ని కోల్పోయి నిరర్థక వ్యక్తిగా నిలిచిపోవడం సమాజంలో నేటికీ దర్శనమిస్తుంది.

"పడవ బరువు పెరుగుతుంది శబ్దాల హోరు ఎక్కువైంది. పాటమ్మ ఏమైందో అయిపు లేకుండా పోయింది. సఖుని దర్శనం అపురూపమైంది. అసలు నేనెక్కడికి బయల్దేరాను? ఏ ఉద్దేశంతో బయల్దేరాను? ఏ గమ్యం చేరుకున్నాను? అతను పిలిచీ పిలవగానే సమ్మోహితురాలినై ఈ పడవలో ఎందుకు ప్రవేశించాను.... అతనితో పంచుకున్న అనుభవాలు, చెప్పుకున్న ఊసులు, అన్నీ ఒక్కొక్కటే అదృశ్యమైపోయాయి" (పుట. 5) అనడంలో సగటు స్త్రీ మూర్తి ఆవేదన వ్యక్తమౌతుంది. కుటుంబమనే నావను పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న స్త్రీ మూర్తికి ఒకానొక సందర్భంలో తానే ఆ కుటుంబానికి భారమైన సందర్భాలు అనేకం.

అలాంటి అనుభవం ఎదురైన సమయంలో తన పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారుతుంది. "నేను ఒక పరిమితమైన బరువు వరకే పడవని తేలిగ్గా పోనివ్వగలను ఇప్పుడు నువ్వే నాకు బరువు దిగి ఈదుకుంటూ పోతావో మునిగిపోతావో నీ ఇష్టం. త్వరగా కానీ. లేకపోతే నాతో సహా మొత్తం మునిగిపోతుంది అంది పడవ నడిపే యంత్రం." (పుట.6)

పై మాటల్లో తాను దేన్నయితే కాపాడుకుంటూ తనదనుకుంటూ ప్రయాణం సాగించిందో అదే తన ఉనికిని ప్రశ్నించి, తన ఉనికే నిరర్థకమని పలికిన నేపథ్యంలో సగటు స్త్రీ మూర్తి గమనం అగమ్యం. ఇలా నిత్య జీవితంలో అనేక మంది స్త్రీమూర్తులు సమస్తాన్ని కుటుంబాలకు కట్టుకున్న వాడికి అంకితం చేసే నిరార్ధక జీవులుగా ప్రశ్నార్ధకప్పు వ్యక్తులుగా మిగిలిపోవడాన్ని ఈ కథలో ఎత్తి చూపారు రచయిత్రి. తాను ఒంటరి అయిపోతున్న తరుణంలో తనని తాను నిలుపుకోవడంతోపాటు తాను నమ్మి వచ్చిన వ్యక్తులను సైతం సక్రమమైన మార్గంలో నడిపించడం స్త్రీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఈ కథలో వ్యక్తం చేశారు రచయిత్రి.

"నన్ను తన పడవలోకి స్వాగతించిన వాణ్ణి తిరిగి తెచ్చుకోవడానికి, నా వెలుగుపూల సంచుల్ని మళ్లీ తయారు చేసుకోవడానికి పడవలో అవసరానికి మించిన ఆర్బాటలన్నీ గిరాటేసి మళ్లీ సంతృప్తికరమైన ఒక సుందర జీవితానికి నాంది పలకడానికి అక్కర్లేని వస్తువులు తయారు చేయకుండా జీవితంలో కొంచెం విశ్రాంతి కొంచెం భావుకథ ఎంతో ప్రేమ ఇతరుల గురించిన ఆలోచన ఉండేలా చూసుకోవడానికి వెలుగుపూల సంచుల్ని విలువలతో నింపుకోవడానికి నాకు నా పాటకి ఆసక్తి సామర్ధ్యాలు ఉన్నాయని మాకిద్దరికీ ఎనలేని నమ్మకం." కష్టాలు, సుఖాలు, బరువులు, బాధ్యతలు, అవసరాలు, కోర్కెలు, యాతనలు మొదలైన వాటితో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న జీవిత నౌకను మరలా గాడిన పెట్టాల్సిన బృహత్తర కార్యానికి నాంది పలకగలిగే శక్తి కేవలం స్త్రీ మూర్తికే గలదనే విశ్వాసాన్ని ఈ కథలో వ్యక్తం చేస్తారు రచయిత్రి.

ఈ దేశంలో వివాహ బంధం స్త్రీ పురుషులకు భిన్నమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యం కల్పిస్తుంది. ఏది ఏమైనాప్పటికీ వివాహబంధంలో పురుషుడికి ఉన్నంత స్వేచ్ఛ స్త్రీకి లేదు. అయితే ఇక్కడ వివాహ బంధం మంచి చెడులను విశ్లేషించడం ఉద్దేశం కాదు. సత్యవతి కథల్లో స్త్రీ పాత్ర చిత్రణ ఈ వ్యాస ప్రధానం. వివాహ అనంతరం తమ ఆశలు, ఆశయాలు, ఆలోచనలు అన్నింటిని మరిచిపోయి తమ ఉనికినే కోల్పోయే పరిస్థితి అనేక మంది స్త్రీలది. అదే విషయాన్ని "ఇల్లలకగానే పండుగౌనా!" అనే కథలో సత్యవతిగారు చక్కగా చిత్రించారు.

అనేక ఆశలతో, ఆశయాలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన శారదకు ఇల్లలకడమే పరమావిదిగా అనేక సంవత్సరాలు సాగిపోయిన నేపథ్యంలో తన పేరునే మర్చిపోయి తన పేరును తెలుసుకోవడం కోసం పరితపించిన విధానం కథలో ప్రధాన వస్తువు. ఇంటికి ఇళ్ళాలిగా వచ్చిన అమ్మాయిని తన భర్త ఇల్లు నీది అని చెప్పి ఇంటిని అందంగా ఉంచడం నీదే బాధ్యత అని చెప్పడంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి ఇళ్లలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. "ఎల్లప్పుడు ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దింది. ఆ విధంగా ఆమె జీవితం మూడు అలకు గుడ్డలు ఆరు ముగ్గు బట్టలుగా సాగిపోతూ వచ్చింది. కానీ ఒకనాడు ఇల్లాలు ఇల్లలకుతూ అలుకుతూ నా పేరేమిటి చెప్మా అనుకుంది. అలా అనుకొని ఉలిక్కిపడింది" అనే మాటలు ఏళ్ల తరబడి ఇంటికే పరిమితమై పనికే అంకితమైన నేపథ్యంలో అస్తిత్వాన్ని కోల్పోయిన విధానం తెలియజేస్తుంది. 

స్త్రీలు తమ ఉనికిని ఎంతలా కోల్పోతున్నారో క్రింది మాటలు తెలియజేసేవిగా ఉన్నాయి."ఒరేయ్ పిల్లలూ నా పేరు మీకు తెలుసా? అని అడిగింది. వాళ్లు తెగ ఆశ్చర్యపడిపోయి నువ్వు అమ్మవి నీ పేరు అమ్మే. మేము పుట్టినప్పటినుంచి మాకు తెలిసింది అదే నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి ఆయన్ని అంతా పేరుతో పిలుస్తారు కనుక మాకు తెలుసు నీ పేరు నువ్వు మాకు ఎప్పుడూ చెప్పలేదు కదా పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేసారు వాళ్ళు."

ఈ మాటలు సగటు స్త్రీ ఉనికినీ కుటుంబంలో తన స్థానాన్ని ప్రశ్నిస్తున్నవిగా ఉన్నాయి. ప్రతిభా పాటవాలు కలిగిన మహిళ వివాహానంతరం గృహిణిగా మార్పు పొంది గృహ అవసరాలు తీర్చడంలో లీనమైపోయిన తరుణంలో తన చదువు, తెలివి సమస్తమూ మరుగున పడిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. తన భర్త గుర్తు చేసేంతవరకు తాను చదువుకున్నాననే విషయాన్నే మర్చిపోయింది ఆ ఇల్లాలు.

"ఇల్లాలు సర్టిఫికెట్ల కోసం హోరాహోరీ వెతికింది బీరువాలో పట్టుచీరలు, సిఫాన్ చీరలు, నేత చీరలు, వాయిల్ చీరలు వాటి మ్యాచింగ్ జాకెట్లు, లంగాలు, గాజులు, పూసలు, ముత్యాలు, పిన్నులు, కుంకుమభరినలు, గంధం గిన్నెలు, వెండికంచాలు, బంగారం నగలు అన్ని పొందికగా అమర్చి ఉన్నాయే కానీ అందులో ఎక్కడా సర్టిఫికెట్లు జాడలేదు."(పుట10). అనే మాటలు తన ప్రమేయం లేకుండానే అనేక అంశాలు తన జీవితంలో ప్రాధాన్యత పొందిన విధానం చెప్పుకునే తెలుస్తుంది.

తన పేరును కనుక్కోవడానికి పుట్టింట్లో ఉన్న సర్టిఫికెట్లను వెతకడానికి పుట్టింటికి వచ్చిన శారదకు తల్లిదండ్రులు ఆప్యాయంగా పలకరిస్తున్నా అందులో కొంత సందేహాన్ని జోడించి పలకరిస్తారు. ఇల్లలకడంలో ఆనందం పొందుతూ పేరును మర్చిపోయిన శారద అమ్మా నా పేరేమిటి చెప్పమ్మా అని తల్లిని అడిగిన సందర్భంలో "అదేమిటమ్మా నువ్వు మా పెద్దమ్మాయివి నీకు బి.ఏ దాకా చదువు చెప్పించి 50,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. రెండు పురళ్ళు పోశాం. ప్రతిపురుడికి ఆసుపత్రి ఖర్చులు మేమే భరించాం. నీకు ఇద్దరు పిల్లలు. మీ ఆయనకి మంచి ఉద్యోగం" అంటుంది

తల్లి. బి.ఏ. వరకు చదివిన ఒక అమ్మాయికి వివాహమై ఇద్దరు బిడ్డల తల్లిగా ఒక ఉద్యోగి భార్యగా గుర్తింపే తప్ప తనకంటూ స్వతంత్రగుర్తింపు లేని సగటు స్త్రీ పరిస్థితి శారదది. అత్తవారింటిలోనే గాక పుట్టింట్లో కూడా స్త్రీ చదువుకి, విఙ్ఞానానికి సముచిత స్థానం లేదు అనేది ఈ కథలో శారద పాత్ర ద్వారా తెలియవస్తుంది. "ఏమోనమ్మా ఈ మధ్యన అలమరాల్లో పాత కాగితాలు ఫైళ్ళు అన్ని ఖాళీ చేసేసి గాజు సామాన్లు సర్దించాం. కొన్ని కొన్ని ముఖ్యమైన ఫైళ్లు అటక మీద పడేసాం. వెతికిద్దాంలే ఇప్పుడు వాటికేం తొందర" అంటుంది శారద తల్లి. 

శారద స్నేహితురాలైన ప్రమీల తాను గృహిణిగా అన్ని పనులు చేస్తూనే తన ఉనికిని కాపాడుకుంటూ అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న పరిస్థితిని రచయిత్రి చక్కగా చిత్రించారు. రెండు విధాలుగా సాగే అస్తిత్వ పోరాటంలో మొదటిది అస్తిత్వం కాపాడుకోవడం రెండోది అవకాశాలు అందిపుచ్చుకుని తననితాను నిరూపించుకోవడం. కుటుంబం, పిల్లల పెంపకం, కుటుంబ గౌరవం పేరుతో స్త్రీ బందీగా మారిన విధానం సత్యవతి కథల్లో కనిపిస్తుంది. ఆడది తన ఆశల్ని, ఆశయాల్ని, కూర్చుని, కౌశలాన్ని మర్చిపోయి ఇంటికే పరిమితమైపోవాల్సిన పరిస్థితి సమాజంలో నేటికీ దర్శనమిస్తుంది. నేటి సమాజంలో స్త్రీలు కుటుంబాన్ని, సమాజాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలనే అభిప్రాయాన్ని ప్రమీల మాటల్లో రచయిత్రి వ్యక్తపరుస్తూ

"అరచి ఆక్రోసించి ఎట్టకేలకు ఓ మిత్రురాలిని కలిసి తన పేరు సంపాదించింది. ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకొని తనలాగే పెళ్లి చేసుకుని తనలాగే బ్రతుకు ఇల్లలకడం కాకుండా ఇల్లలకడం బ్రతుకులో ఓ భాగంగా బ్రతుకుతూ తన పేరును తన స్నేహితురాల పేర్లను కూడా గుర్తుంచుకున్న వ్యక్తి".

వివాహానికి ముందు మంచి విద్యావంతులుగా ఉండి చక్కని ప్రతిభను కనబరిచినప్పటికీ వివాహానంతరం సాధారణ గృహిణిగా ఇంటిపని, వంటపనికి పరిమితమైపోయిన పరిస్థితులు అనేకమందికి ఎదురవుతున్న నేపథ్యంలో వాటిని అధిగమించి ముందుకి సాగాలనేది ఈ కథలో తెలియవస్తుంది. "అవును ప్రమీల నువ్వు చెప్పింది నిజం నేను శారదని నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం రాలేదు నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే కేంద్రీకృతం అయిపోయాయి. ఇంకేం గుర్తులేదు. నువ్వు కనబడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది అంది శారద." (పుట.12)

చిన్న చిన్న పనులకై విలువైన సమయాన్ని విలువైన జ్ఞానాన్ని వెచ్చించి నిరర్థక వ్యక్తులుగా స్త్రీలు మిగిలిపోతున్నారనే విషయాన్ని తెలియజేస్తూనే అలా నినార్ధక వ్యక్తులుగా నిలిచిపోక గృహిణిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే తనదైన ప్రతిభతో ముందుకు సాగాలని తెలియజేశారు.

తనకి తాను కొవ్వొత్తిలా మారి తన చుట్టూ ఉన్న కుటుంబానికి వెలుగునింపి తాను మాత్రం కరిగిపోయిన ఇల్లాలు కథ "సూపర్ మామ్ సిండ్రోమ్". కుటుంబం పట్ల అతి జాగ్రత్త, పిల్లల చదువులు, విదేశీ అవకాశాలు, భర్త అడుగులకు మడుగులొత్తడం, ఇంటాబయటా ఒత్తిడితో కూడిన పని వీటన్నింటినీ సమన్వయం చేస్తూ చివరకు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయని కారణంగా అనురాధ అకాలమరణం పొందుతుంది. అనురాధ సూర్యోదయానికి ముందే లేచి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత తాను ఉద్యోగానికి బయలుదేరుతుంది.

"అనురాధ లేచి సగం పనులు పూర్తి చేస్తే గాని సూర్యుడు ఉదయించడు. వంట ఇల్లు మేల్కోదు. వాకిట్లో ముగ్గు పడదు. వంట ఇల్లు ఈలలతో గోలలతో చైతన్యవంతం కాదు. ఒకటేమిటి లోకమే సుషుప్తి నుంచీ చైతన్యంలోకి రాదు" (సూపర్ మామ్ సిండ్రోమ్ కథ పుట. 46) అనే మాటల్లో అనురాధ దినచర్య ఏ సమయానికి మొదలౌతుందో తెలియవస్తుంది. "ఇరవై ఎనిమిదేళ్ల సాహచర్యం. అన్నీ ఇచ్చింది. స్నేహం - ప్రేమ - ధనం - సేవ - ఆఖరికి ఇప్పుడు ప్రాణం" అంటూ స్వాగతించిన సూర్యారావు మాటల్లో అనురాధ త్యాగశీత, నేర్పరితనం, సమయస్ఫూర్తి దర్శనమిస్తుంది.

"సూర్యారావునిసహాయుడు. అతనికేం చేతకాదు. హౌస్ కీపింగ్ దగ్గర నుంచి మనీ మేనేజ్మెంట్ దాకా - ఆమె - షేర్లు కొనడం, అమ్మడం, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొనడం, ఒకటేమిటి - ఇవాళ సూర్యరావు సంసారం ఇంత పైకి రావడానికి కారణం ఆవిడే కదా?" అనే మాటల్లో ఇల్లాలిగా అనురాధ నేర్పరితనం, బహుముఖ ప్రజ్ఞ, కార్య దక్షత, దీర్ఘ దృష్టి కనిపిస్తాయి. తన ఇల్లు తన పిల్లలు తన భర్త సర్వస్వం అనుకుని నిస్వార్థంతో తనకి తాను సమెతగా కొలిమిలో కాలిపోయిన నిస్వార్థ స్త్రీ మూర్తికి ప్రతీక అనురాధ.

తన తల్లికి సూపర్ మామ్ సిండ్రోమ్ ఎలా వచ్చిందో చెప్పమని ప్రకాష్ రావు ని రజని అడిగిన సందర్భంలో "మా అనురాధకి ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరికన్నా తాను చాలా తెలివిగల దాన్ని, సమర్ధురాలననీ గట్టి నమ్మకం. ఆవిడ దృష్టిలో తెలివీ సమర్థత అంటే మంచి ఇల్లు కట్టుకోవడం, దాన్ని తళతళలాడేలా ఉంచుకోవడం. తగినంత డబ్బు దాచుకోవడం, కష్టపడి పనిచేయడం, పిల్లల్ని గొప్పవాళ్ళని చేయడం, గొప్ప వాళ్ళని చేయడం అంటే డాక్టర్లనో, ఇంజనీర్లనో చేసి స్టేట్స్ కి పంపడం. ఇదే ఆవిడ జీవిత ధ్యేయం. ఆ ధ్యేయసాధనకి ప్రతిక్షణం శ్రమించింది. ఈ ధ్యేయసాధనలో మీ అమ్మ తన మనసుకేం కావాలో తన శరీరంకేం కావాలో చూసుకోలేదు" అనే మాటలు సగటు మాతృమూర్తి ఆశలు, ఆశయాలు, కోర్కెలు ఎంత నిస్వార్ధంగా ఉండి, తన జీవితమంటే తన కుటుంబ సభ్యుల అభ్యన్నతే అనే నిస్వార్థ భావజాలాన్ని తెలియజేయడంతో పాటు తన మానసిక, శారీరక ఒత్తిడిని, శ్రమని లెక్కచేయని స్థితి తెలియవస్తుంది. 

సత్యవతి కథల్లో వ్యసనపరుడైన భర్తను బాగు చేయాలనుకుని కష్టమంతా తనకు ధారపోసి వ్యసనాలను ఉండి భర్తను మార్చలేక ఓడిపోయిన మంగ (పతిభక్తి కథ), ముప్పై ఏళ్లగా అవమానాలు, ఛీత్కారాలుతో సాగిన దాంపత్య జీవితం గడిపిన అరుంధతి (అరుణ సంధ్య కథ), తరతరాల అంధకారాన్ని ప్రశ్నించకుండా ముందుకు సాగిపోవడాన్ని సమర్థిస్తూ పాతివ్రత్య ధర్మాలు బోధించిగాంధారి రాగం పలకమనే సరస్వతి తల్లి, గుడ్డి మొగుడికి దారిచూపించాల్సిందిపోయి తాను కూడా గంతలు కొట్టుకోవడమేమిటని ప్రశ్నించి అంధకారం నుండి వెలుగులోకి రావాలని బలమైన కోరిక కలిగిన సరస్వతి (గాంధారి రాగం కథ), ఆర్థిక స్వాలంబన పొందినప్పటికీ ఇంటా బయటా ఒకటే పని ఒత్తిడితో అలసిపోయి కాలంతో పరుగులు తీస్తూ గృహిణిగా, ఉద్యోగిగా ద్విపాత్రాభినయం చేస్తూ శ్రమకోర్చి జీవన సమరాన్ని సాగిస్తున్న సంధ్యారాణి, పుష్పాలతో, సునంద (గోధూళి వేళ కథ) సమాజంలో సగటు స్త్రీకి ప్రతీకలుగా దర్శనమిస్తారు.

5. ముగింపు:

 సత్యవతి కథల్లో వైవిధ్య భరితమైన స్త్రీ పాత్ర చిత్రణ అగుపిస్తాయి. వీరి కథల్లో నేల విడిచి సాము చేసే స్త్రీ పాత్రలు కానీ కృతకమైన పాత్ర చిత్రణ కలిగిన స్త్రీ పాత్రలు గానీ అగుపించవు. ప్రతి కుటుంబంలోనూ, కుటుంబాల సమూహమైన సమాజంలోనూ ప్రతినిత్యం కనిపించే సహజమైన కష్టాలు, నష్టాలు, ఆరాటాలు, పోరాటాలు, ఆశలు, ఆశయాలు, అవమానాలు, అనుమానాలు, అనుభవాలు, అసహ్యాలు, కోర్కెలు, త్యాగాలు, దాస్యాలు, దయనీయతలు కలిగి నేటికీ తన అస్తిత్వాన్ని పదిలపరుచుకోడానికి పరితపిస్తున్న సగటు స్త్రీకి ప్రతీకలుగా సత్యవతి కథల్లో స్త్రీ పాత్రలు కనిపిస్తాయి. భిన్న పరిస్థితిలో ఉద్యోగినిగా ఉండే స్త్రీ పాత్రలు, గృహిణిగా ఇంటికే పరిమితమైన స్త్రీలు పాత్రలు, ఆధునిక భావజాలం కలిగిన పాత్రలు, పురుషాధిపత్యానికి బలై ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ స్త్రీ పాత్రలు దర్శనమిస్తాయి. కథలో సంభాషణలు సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఆలోచింపజేస్తాయి.

6. పాదసూచికలు:

  1. తెలుగులో కవిత్వోద్యమాలు- తెలుగు అకాడమీ ప్రచురణ పుట. 184
  2. సత్యవతి కథలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ పుట 2.
  3. నేనొస్తున్నాను కథ పుట 4.
  4. ఇల్లాలకగానే పండుగౌన! కథ పుట10
  5. తెలుగు సాహిత్య చరిత్ర - డాక్టర్ ద్వా.నా.శాస్త్రి పుట 590

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఓల్గా (2015). రాజకీయ కథలు, స్వేచ్ఛ ప్రచురణలు: హైదరాబాద్.
  2. ఓల్గా (2016).విముక్త కథలు, స్వేచ్ఛ ప్రచురణలు: హైదరాబాద్.
  3. చంద్రశేఖరరెడ్డి. రాచపాళెం, (2015). మన నవలలు మన కథానికలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్: విజయవాడ.
  4. దక్షిణామూర్తి. పోరంకి,(1988). కథానిక స్వరూపస్వభావాలు, శ్రీ బి నాగేందర్, శివాజీ ప్రెస్: సికింద్రాబాద్.
  5. నాగయ్య.జి, (2009)తెలుగు సాహిత్య సమీక్ష రెండవ సంపుటము, సి.యన్. ప్రింటర్స్ ప్రకారం రోడ్డు: తిరుపతి.
  6. మంజులత, ఆవుల. & సుధాదేవి, తెన్నేటి (సంపా.) (2015). తెలుగులో కవిత్వోద్యమాలు, తెలుగు అకాడమీ ప్రచురణ. హైదరాబాద్.
  7. వెంకటసుబ్బయ్య. వల్లంపాటి, (1996). కథాశిల్పం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్: విజయవాడ.
  8. శాస్త్రి, ద్వా.నా. (ముద్రణ 2014). తెలుగు సాహిత్య చరిత్ర, ప్రగతి పబ్లికేషన్, ఎల్.బి.నగర్: హైదరాబాద్.
  9. సత్యనారాయణ.పోలప్రగడ, (1999). తెలుగు కథానిక, తెలుగు అకాడమీ ప్రచురణ: హైదరాబాద్.
  10. సత్యవతి.పి, సత్యవతి కథలు, (2016), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్: విజయవాడ.
  11. సత్యవాణి, జొ.వెం. (2012) తెలుగులో ప్రక్రియా వైవిధ్యం, నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణ, తెలుగు అకాడమీ: హైదరాబాద్.

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]