headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797

10. శేషేంద్ర శేషకీర్తి విశేషాలు: అనుశీలన

dr_j_seetapatirao
డా. జె. సీతాపతిరావు

అసిస్టెంట్ ప్రొఫెసర్
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,
నూజివీడు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9951171299. Email: seethuphd@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

నోబెల్ కు నామినేట్ అయిన తెలుగు భాష కవి శేషేంద్ర. పద్య కవిత్వం నుంచి ఆధునిక కోణంలో వినూత్న కవిత్వాన్ని అందించిన ప్రవృత్తి కలిగిన శేముషీ కవి శేషేంద్ర. శేషేంద్ర శర్మ రచనల కవిత్వపు పోకడ, అలంకారితా విన్యాసం, వివిధ విషయాల సంగ్రహ అనుశీలన ఈ వ్యాస ఉద్దేశం. శేషేన్ జీవితపు దశలు, వ్యాసంగం, కళా దృష్టి, కవిత్వ శక్తుల ఆధారంగా అనుశీలించడం పరిశోధన ప్రణాళిక. నేటి కవిత్వ దిశా నిర్దేశనం, కవిత్వ భాష, ఊహాశక్తి, కొత్త భావుకతలను అందించి భావి తరానికి మార్గ నిర్దేశనం శేషేంద్ర కవిత్వఝరిని విశ్లేషించడం ఈ వ్యాస పరిధి.

Keywords: శేషేంద్ర రచనలు, కవిత్వ స్థితి, వివిధ విమర్శక వ్యాసాలు, శేషేంద్ర కవిత్వపాటుత్వం, భావుకత, ఆశించిన ప్రయోజనం

1. ఉపోద్ఘాతం:

శేషేన్! అంటే చాలు. ఎక్కడా లేని ఉత్సాహంతో ఉరుకులేసే చురుకుదనంతో కనబడడం శేషేంద్ర సొంతం. సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అన్న మాటలు జాషువా చెప్పినా శేషేంద్రలో అక్షర సత్యాలు. మాటలు- వాడినా, వేడి సెగలు చిందినా, గుండెలకు బంధువయినా, గుండెల బరువును దింపినా, గొరిల్లాలా ఆక్రోశించినా, సముద్రంలా ఘోషించినా, నెమలితో చెలిమి చేసినా, ప్రేమ లేఖలు రాసినా, ఆర్మీలా ఆవేశించినా వెరసి శేషేంద్ర అని చెప్పక తప్పదు. కవిత్వంలో నూతనత్వం, భావనలో గాంభీర్యం, సొగసులో సోయగాలద్వారా కవిత్వపథాన్ని నూత్న పంథాకు చేర్చిన నిండైన కవితా విపంచి శేషేంద్ర. 

2. పద్యంతో హృదయాల్లోకి:-

“సొరాబు” (సొర అంటే వ్యాకులత అని, జపాన్ భాషలో ఆకాశం అని అర్థాలు ) పద్యంతో మొదలు పెట్టి... ఆధునిక మహాభారతాన్ని ఆవిష్కరించారు. కరుణారసాన్ని రంగరించిన యోధ గాథ సొరాబు. మహావీర శేఖరుల పితృ పుత్రుల విషాద సమాగామాన్ని ఇతివృత్తంగా తీసుకొని పారశీక భాషలో ప్రకటించిన సొరాబు కావ్యం కొన్నాళ్ళకు మాత్యూ అర్నాల్డు అనువాదంతో విశ్వవిఖ్యాతమైంది. కథాక్రమానికి వెళ్తే తండ్రి రుస్తుం  జగదేక వీరుడు. కానీ విజయాన్ని పొందలేకపోయాడు. అతని కొడుకు వీర పంచాననుడు సొహరాబు విజితుడు కాలేదు. వీరికి లభించింది భరింపరాని దుఖఃభారం. ఎవరైతే కష్టంలో కృంగిపోతారో వారికి ఈ కథనం కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. భారతంలో అర్జునుడు, భభ్రువాహనుడు ఇలాంటి సంఘనలకు కొంచెం సమంగా నిలుస్తాయి ఈ పాత్రలు. జైమిని భారతంలో వీరఘట్టాలు మనకూ లేకపోలేదు. ఇది ఆసియాదేశంలోని అప్పటి కాలాన్ని దర్శింప జేయడానికి ఉపకరించే తత్త్వం ఈ కావ్యంలో నిండా ఆవిష్కృతం అయ్యింది. 1947సం. గుంటూరు లో బి.ఏ., చదువు తున్నప్పుడు ప్రారంభించి, కొంత కాలం ఆగి పూర్తి చేశారు.

3. రామాయణ రహస్యాల ఆవిష్కరణ:-

“షోడశి రామాయణ రహస్యములు” తెలిపినప్పుడు ధ్వని, రీతి మొదలైన సిద్ధాంతాలను అనుసరించి రహస్యాలు చర్చించి, విశ్లేషించారు. ధ్వని నివృత్త్యాత్మకం, రీతి ప్రవృత్యాత్మకం. ధ్వనిలో శబ్దవ్యాపారం క్రమంగా తగ్గుతుంది. శబ్దాశ్రియ అర్థాలు క్రమంగా క్షీణిస్తాయి. దానికంటే అతీతమైన తార్తీయిక మైన ధ్వని గోచరిస్తుంది. అప్పుడు రసోత్పత్తి అవుతుంది. శబ్దాలు మనస్సుతో కలిస్తే జీవుడిలో ఆవరించిన అజ్ఞానం తొలగి స్వస్వరూప జ్ఞానం సాక్షాత్కారం అవుతుంది. భావకుడు, భావితము, భావన అన్న మూడూ తాదాత్మ్యం చెంది ఏకరూపతను కాలినవవుతాయి. ఇదే రసావస్థ. దీన్ని ఆధారంగా కార్య కారణ సంబంధాలను అన్వేషిస్తూ సాగిన విమర్శ వ్యాసాలే “రామాయణ రహస్యములు”. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1980 సం. లో ముద్రించారు.

4. స్వర్ణహంసగా శ్రీహర్షుడి హంస:-

“స్వర్ణహంస” పేరుతో హర్ష నైషధ కావ్య పరిశీలన చేశారు. దీన్ని ఆంధ్రప్రభ దినపత్రిక 9-2-1964 నుంచి 20-12-1964 వరకు ముద్రించింది. ఈ రెండు శేషేంద్రను ఉత్తమ విమర్శకుడిగా, వ్యాసకర్తగా, మంచి పరిశీలనా దక్షునిగా నిలబెట్టాయ్. “నైషధం విద్వదౌషధం” అన్న ఆర్యోక్తిని ఆధారంగా చేసుకొని కాస్త పాండిత్యం ఉన్న పాఠకునికి అవగాహనను పెంపొందింపజేసే దిశలో ఈ విమర్శ కొనసాగింది. తెలుగు విశ్వవిద్యాలయం డి.లిట్., ప్రదానానికి(అక్టోబరు,27,1994) ఇది ఒక కారణం.  
హంస ఆకాశమున పోవుచు/ఒక కుండను ఒక పండును
ఒక కొండను చూచెనట!/దమయంతి, శ్రీః, చంద్ర/కల ఒక్క టేనట!” అంతేకాదు దమయంతి మహాత్రిపుర సుందరియే అని వివిధ గ్రంథాలను, వ్యుత్పత్తులను ఆధారంగా చూపిస్తూ నిరూపించారు.

ఇందులో విభిన్న అంశాలను మేళవించి, శ్రీహర్షుడి కవితా తత్త్వాన్ని శాస్త్రీయ కోణాల్లో ఆవిష్కరించారు.  వాల్మీకి రామాయణంలోని సుందర కాండకు ఒక నూత్న తాంత్రిక భాష్యం షోడశి కాగా, స్వర్ణహంస నైషధీయరచనకు తాంత్రిక వ్యాఖ్యానంగా విమర్శకులు చెప్పారు. ఇక మిగిలింది, ప్రధానమైనది నోబుల్ అవార్డు కు నామినేట్ అయిన తొలి తెలుగు రచన “ఆధునిక మహాభారతము”.

5. ఆధునిక మహాభారతం-ఆలంకారికత- ఆధునిక యుగీన జీవనం:-

ఈ రచనావిధానాన్ని చెప్పాల్సి వస్తే ముందు మనకు కొన్ని విషయాలు తెలియాలి. సంస్కృతంలో దశకుమార చరిత్ర కథన శైలి, ఆధునిక రచయితలు శైలి, శ్లోకంలో ఉన్న ఛందో విధానం, కమ్యూనిస్ట్ ల భావ స్ఫురణ, ఎలా మాట్లాడతామో అలాగే రాయడం (ఫొనిటిక్ రైటింగ్), భాషాధ్వని, అలంకార తత్త్వం, స్వేచ్ఛా భావనాశక్తి నిండిన కవితా తత్త్వం ఇందులో చూడొచ్చు.

నా దేశం నా ప్రజలు అని ఆధునిక మహాభారతానికి మరో పేరు. దీని గురించి గ్రీకు మహాకవి నిఖి ఫోరస్ వృత్తాకోస్ “Personally I would compare the pain and the aguish of the poet with the one of Loutre Mont (the founder of surrealism in his lyric MALD – AURORE). The difference is that Seshendra protest is not made in the void. He walks firmly on the soil. At times we observe in his poem, a biblical and prophetic ton which attracts us” అని చెప్పారు.

ఆధునిక మహాభారతానికి ఫలశ్రుతి మరో ఆకర్షణ. కాలనుగతంగా ధర్మం పుడుతుంది. లోకధర్మాన్ని చూపించే పురాణ ఇతిహాస కావ్యశాస్త్రాదులు పుడతాయి. వ్యాసభారతం ప్రాచీన ప్రజలకోసం ఉత్తర భారతదేశంలో పండిత భాషలో భూమి కోసం యుద్ధమార్గాన్ని పట్టి, పుట్టింది. ఉన్నత కుటుంబాలు భూమిని హస్తగతం చేసుకోడానికి యుద్ధం కారణమయ్యింది. ఈ ఆధునిక మహాభారతం ఆధునిక యుగీన ప్రజలకోసం దక్షిణ దేశంలో ప్రజల భాషలో పుట్టింది. ఇది కూడా భూమికోసం జరిగిన యుద్దమే. ఇక్కడ ప్రజానీకం భూమిని హస్తగతం చేసుకోడానికి యుద్ధం చేస్తారు. పారాయణం చేయండి ప్రజలకు వినిపించండి అని కవి విజ్ఞప్తి చేసారు.

మానవ జీవితమే మహాభారతం. అన్ని జీవితాల్లో అరణ్య, అజ్ఞాత వాసాలు ఉంటాయ్. అవి యుద్ధానికి రూపాంతరాలుగా భావించాలి. మనిషి జీవన హక్కుల కోసం లేదా వాటిని అనుభవించడం కోసం శస్త్రధారణ చేయడమే ప్రస్తుతకాలంలో ధర్మం. ఆత్మగౌరవంతో తనను తాను రక్షించుకోవడం కాల ధర్మం. జీవన సంగ్రామంలో ఆత్మస్థైర్య మనే గాండీవం ధరించాలి. అదే శక్తి అయి ప్రగతి చిహ్నం కావాలి. ‘జీవన సంగ్రామాన్ని ఎదుర్కొనే శక్తి ఇచ్చే గ్రంథమే తరుణోపాయ దర్శకమైన జ్యోతి. కవి మానవుడి మార్గాన్ని తాను సృష్టించిన అలంకారంతో ప్రదీప్తం చేస్తాడు’ అని శేషేంద్ర తన కవితా మార్గాన్ని, లక్ష్యాన్ని సూచించారు.

లేస్తోంది ఉషః కాంతుల్లోనించి ఒక హస్తం! ఆ హస్తం కాలం అనే నిరంతరం శ్రామికుడి సమస్తం; మనిషి పొలాల్లో ప్రవహించే చెమటలో రక్తంలో మునిగి లేస్తోంది. దూర దూరాలకు సిందూర కాంతులు చిందుతూ ఉంది..” (ఆధునిక మహాభారతము, పుట: 12)

వ్యాస భారతంలో నాయకత్వం వహించింది కాలం. కాల స్వభావం సహజతత్త్వం.  శ్రామికుడి స్థితి కష్టానికి ప్రతీక. సిందూర కాంతి విప్లవస్వరూపం. ఉషః కాంతి చైతన్య శక్తికి సాధనం. తద్వారా అభివృద్ధి జరిగే కాలం ఇంకా దూరంగా ఉన్నది. ఆ విప్లవ తత్త్వం మనిషికి కాలిక స్పృహను కలిగిస్తుందని ధ్వని.

ఒక్కో పేరాలో ఒక్కో స్థితిని వర్ణించడం అందులో విధానం ఏదో ఒక అంశంలో వైవిధ్యాన్ని సంతరించుకుంటూ నూతనత్వాన్ని సూచించడం కనిపిస్తుంది.

శబ్దార్థౌ మూర్తిరాఖ్యాతౌ జీవితం వ్యంగ్య వైభవమ్
హారాది వదలంకారాస్త్రత్ర స్యురుపమాదయః
శ్లేషాదయో గునాస్త్రత్ర శౌర్యాదయ ఇవ స్థితాః
ఆత్మోత్కర్షావహస్త్రత్ర స్వభావా ఇవ రీతయః
శోభామాహార్యికి ప్రాప్తా వృత్తయో వృత్తయో యథా
పదానుగుణ్య విశ్రాంతిః శయ్యా శయ్యేవ సమ్మతా
రసాస్వాదప్రభేదాః స్యుః పాకాః పాకాః ఇవ స్థితాః
ప్రాఖ్యాతా లోకవదియ సామాగ్రీ కావ్యసంపదః” (ప్రతాపరుద్రీయం- 2.2- 2.5శ్లోకాలు)

అని పూర్వుడైన ప్రతాపరుద్రీయ కర్త ‘శబ్దార్థాలు కావ్యానికి శరీరం. వ్యంగ్యం జీవితం. ఉపమాదులు హారాదులు. శ్లేషాదులు గుణాలు, శౌర్యాలూను. రీతులు స్వభావాలు. ఆహార్యమైన శోభను కలిగిన వృత్తులు వృత్తులు. పదాలకు అనుగుణమైన విశ్రాంతి శయ్య. కావ్యాల్లో ఉండే పాకాదులు లౌకిక పాకాలలా రసవిషయంలో ఆస్వాద జనకాలు. ఇలా శరీరానికి ఉపయోగపడే సామాగ్రిలా కావ్యంలో కూడా ఉండే దాన్ని కావ్య సంపద అంటార’ని పేర్కొన్నాడు.

అయితే శేషేంద్ర కవిత్వంలో అది పద్యం అనడానికి వీలుకాదు. ఛందస్సుకు లోబడదు. అది  అలంకారమో, ధ్వనో అని విడదీసి చెప్పలేం. కానీ ఒక కొత్త అనుభూతిని మాత్రం మిగులుస్తుందని మాత్రం చెప్పవచ్చు.

హైదరాబాదు శయ్యలో తెల్లవారి పువ్వులా నిద్ర లేస్తా. దాని రోడ్ల మీద నడుస్తూ అప్పుడే ప్రేలబోతున్న అగ్ని పర్వతంలా మారిపోతా...” (ఆంధ్ర మహాభారతము పుట: 193) నిద్ర లేవడం తాజాగా ఉండాలి. ధూళి దూసరమైన  నగరంలో ఉత్తమమైన శయ్యలా తాజా పరిమళాలను వెదజల్లే రోజులు రావాలని కవి కాంక్ష.

6. కావ్య సేన దిశా వేత్తగా శేషేంద్ర: -

మనిషితత్త్వాన్ని కావ్యతత్త్వంలో మిళితం చేసిన మహాకవి శేషేంద్ర. దేశ చరిత్ర  ఆదేశానికి చెందిన పౌరుడి ఆత్మకథే అని నిరూపిస్తూ సాహితీ మూర్తిమత్వాన్ని కలిగించాడు. ఆధునిక కవులకు కులగురువుగా  కవిసేనకు మార్గనిర్దేశనం చేస్తూ ముందుండి నడిపిన కవితా తత్త్వ సేనాధిపతి శేషేంద్ర. అదే అతనిని ప్రపంచకవిగా విశ్వసాహితీవేత్తగా నిలబెట్టినది.  ఆ రచనే కవిసేనమేనిఫెస్టో.

ఆధునిక విమర్శకు దిశానిర్దేశనం చేస్తూ, వైజ్ఞానిక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సిద్ధాంత గ్రంథం, సునిశిత కవిత్వ విమర్శకు కలికితురాయి కవిసేన మేనిఫెస్టో. దీన్ని ‘ఆధునిక కావ్యశాస్త్రమ్’ అన్నా, భావి నిర్దేశనం అన్నా దానికే చెల్లుతుంది. ఈ మానిఫెస్టో 30 పేజీల్లో రాద్దామని మొదలుపెడితే 350 పేజీల ఆధునిక కావ్యశాస్త్రమైంది. సంప్రదాయం ఒక వైపు, ఆధునికత మరోవైపు ‘పురాపి నవంలా’ కనిపిస్తూనే ఒరవడిని సృష్టించి మనముందు గుంటూరు శేషేంద్రశర్మను నిలబెట్టినదీ మేనిఫెస్టో.

కవిత్వం రాయాలంటే ప్రతిభా అభ్యాస, వ్యుత్పత్తులు కూడా అవసరం. పైన చెప్పిన అన్ని సరంజామాలు తప్పవు.

కవిత్వం పైకి అత్యంత శక్తిమంతమైన శబ్ద యోజనగా కనిపిస్తుంది. అలంకారం, బింబం, ప్రతీకలు, మొదలైనవి లోపల ఉండే కావ్యసామగ్రి. అందువల్లనే కవిత్వానికి ఆకర్షణ. ఆ శక్తి అయస్కాంతానికి కూడా ఉండదు. ఈ శక్తే జంతు దశలో ఉన్న అసభ్య మానవుడిని సభ్యుడిగా, సంస్కారవంతుడిగా మార్చింది. యుగయుగాలుగా మానవ సమాజంలో సంస్కృతినీ, నాగరికతనూ సృష్టించింది కవులే.

కవి గొప్ప శాస్త్ర వేత్త గొప్ప అని పరీక్ష పెడితే అది తేలుతుంది. శాస్త్రవేత్తకు తన ఊహా శక్తితో ముందుకు వెళ్ళి కొన్ని ప్రయోగాలు చేస్తాడు. అక్కడితో అతడికి విఫలమో, సఫలమో వస్తుంది. కానీ కవి ఊహకు ఒక అందమైన సృష్టిని ఊహాచిత్రాన్ని అందింపజేస్తూ ఆ భవనాశక్తి ఎన్ని మార్లు తలచున్నా ఆనందం, అద్భుతం సాక్షాత్కరిస్తుంది. శాస్త్రవేత్త వల్ల ప్రకృతికి ఎంతోకొంత నష్టం తప్పదు. కవి వల్ల ప్రకృతి సంవృద్ధిగా మారుతుంది. అందువల్ల కవి శాస్త్రవేత్త కంటే గొప్పవాడికి పాఠకలోకం గుర్తించింది. ఈ కవులే లేకపోతే మానవ సమాజం మృగ్యమైపోతుంది. ఈ విధంగా చూస్తే కవిది  సమాజంలో సర్వోన్నతస్థానంగా నిలబెట్టే రచన కవిసేనమేనిఫెస్టో.

శేషేంద్ర ఆలంకారికుడుగాను, అతని మనస్సు కవితా ప్రయోగశాలగాను కనబడుతుంది. అనుభవాన్ని వడపోయడం, పద్యాలను చిత్రిక పట్టి పదభావచిత్రాదులతో కొంగొత్త కవిత్వవ్యక్తిత్వాన్ని చొప్పించడం పైగా అది సారభూతంగా  మార్చడానికి చేసే పరిశ్రమే కవిసేనమేనిఫెస్టో.

ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ, శేషేంద్ర, సమకాలికులు. మరోవైపు సినారె. సినారె పాటలతో ప్రభంజనం సృష్టిస్తూనే, ‘విశ్వంభర’ తో జ్ఞానపీఠం పొందారు. శేషేంద్ర, శ్రీశ్రీలు, సినారెలు ముగ్గురూ భాషను సరళం చేసి, అభివ్యక్తికి పదునుపెట్టి, తాత్వికతను అద్ది, వచనాన్ని కవిత్వంగా మలిచారు.  శ్రీశ్రీ, శేషేంద్రలు ప్రాచీనులు చెప్పిన  చమత్కారాన్ని కాస్త వెటకారానికి గురిచేస్తూనే, పామరులుగా ప్రాచీనులు చెప్పిన వ్యవహారిక భాషను అందలానికి ఎక్కించి శ్రోతకు అందించాడు. శ్రీశ్రీ విప్లవాన్ని కావ్య కన్యా వస్తువుగా ప్రవేశపెడితే, శేషేంద్ర కొత్త ఆలోచనలనే అలంకారాలతో కొత్తబట్టలు కట్టి కావ్యం దిశగా చూపును మరలించేలా చేశారు. ఆ వచన కవిత్వానికే పట్టం గట్టించగల అనుభవ సారమే కవిసేన.

శేషేంద్ర ఒక డైనమెట్ శక్తిని, ఒక గొరిల్లా యుక్తిని, ఒక సైనికుడి దేశభక్తిని, ఒక ప్రేమిక ప్రేమ తత్త్వాన్ని తీసుకొని కవిత్వం అనే వెన్ను ముకలోనికి కొత్త అభివ్యక్తీకరించి ఎక్కించాడు. శేషేంద్ర కవిత్వంలో పాశ్యాత్య సాహిత్యం భారతీయ అంలంకారశాస్త్రం శరీరం ఆత్మలా కనిపిస్తాయ్. తెలుగులో అభ్యుదయసాహిత్యం విమర్శగ్రంథ రాకకు ఒక కారణంగా చెప్పవచ్చు. పాశ్చాత్యుల ప్రతీకవాద ప్రభావం ప్రబలంగా శేషేంద్రపై ఉన్నట్లు ఈ గ్రంథాన్ని చదివితే అనిపిస్తుంది. అంతేకాదు రాబోయే అనుభూతి వాదానికి ఒక శాస్త్రీయ పునాది. కవిసేన వచ్చిన తర్వాత కవుల్లో ఒక మంచి మార్పు వచ్చింది. పూర్వం తెలుగుకవిత్వంలో కవిత్వం తక్కువ ఆడంబరం ఎక్కువ.
ఈ ఉద్యమం ప్రారంభమయ్యాక కవిత్వ లక్షణమైన సహజత్వాన్ని ఇచ్చే అలంకారాలు, కొత్తగా తాజాగా ఆలోచించే గుణాలు కలిగిన కవిత్వాన్ని యువతరం రాయడం గమనించదగింది. ఆ ఒరవడి నేటిదాకా కొనసాగింది. ఇప్పుడు వస్తున్న కవిత్వం అంతాకాకపోయినా కొంతైనా కవిసేనలో కాస్తయినా మునిగి వస్తున్నదే. కవి అన్నవాడు నిరంకుశుడే. ప్రజా పక్షపాతే. ఊహల్లో విహరిస్తూ అలాగే ఉండిపోవడం కాదు. ధర్మానికి కట్టుబడి ప్రజాపక్షాన్ని నిలబడాలి. ఇలాంటి సిద్ధాంతాల ఆధారంగా కవిసేన ఆధునిక తెలుగు వచనకవిత్వానికి కావ్యగౌరవం కల్పింస్తూనే,  భారతీభాషల్లోని, ప్రపంచ కవిత్వంలో తెలుగుకు ఒక వెలుగును, కవులకు ఒక గుర్తింపును సాధించి పెట్టింది. తద్వారా తెలుగు కవిత్వం అంతర్జాతీయ వేదికకు వెళ్లగలదు అని నిరూపించింది. 

7. ఊహాల్లో శేషేంద్ర: -

శేషేంద్ర రాసిన వ్యాసాల పుస్తకం ఊహల్లో. దీనిలో ఒక శాస్త్రవేత్తకు ఉండవలసిన అంశాలూ, కవికి, విమర్శకుడికీ ఉండవలసిన నిశిత దృష్టి ఇందులో కనిపిస్తాయ్.

వందేమాతరం...
శకలాం వికలాం బహుకుల సంకులాం
శోకం వ్యాకులాం మాతరం
భూరి నిరాశా నామక యామినీం
జీర్ణద్రుమ జీవిత శోభినీం
విలాపినీ విచార ప్రాపిణీమ్
భయదామ్ జ్వరదామ్ మాతరం
అభ్రంకష నిష్ఫల నినాద సనాధకరాళే
పీడిత జన బాష్ప ధారా విహార మరాళే
విభ్రాజిత్ ప్రాభవ దుర్మద జనాళే
దుర్భర దారిద్రానలకాతరాం మాతరం”  (ఊహల్లో పుట: 16)అంటూ భారతదేశ దీనావస్థను సూచించాడు.

బాధల్లో చికాకుల్లో సైతం ఒక్క నిమిషం సేపైనా చదవడమో, ఆలోచించడమో మంచిది. శంకరాచార్యులు మడుగులో స్నానంచేస్తూ మకరగ్రస్తుడై మృత్యుముఖంలో ఉన్నా ఆత్మాభ్యుదయానికి అవసరమైన దాన్ని ఉపేక్షించలేదు. కష్టాల్లో ఉన్నప్పుడే కవులు, కళాకారులు, రాజ్యభారదురంధరులు మహత్కార్యాలు చేశారు. చరిత్రలో నెపోలియన్ యుద్ధశిబిరాల్లోనే శాస్త్రవేత్తలు, కవులు, వేదాంతులతో వ్యాసంగాలు చేసేవాడట. అలాగే రోమన్ సైన్యాధిపతి మార్కస్ అరీలియస్ యుద్ధరంగంలో రచనలు చేసేవాడట. ఉద్యోగాలు వస్తే పుస్తకం చదవడం అనే ప్రక్రియ చెడ్డ అలవాటుగా, పనికి మాలిన పనిగా భావించడం దురదృష్ట కరణమని నిరూపించారు. ఇలా చాలా అంశాల సమాహారంగా పుస్తకం పఠనం వ్యాధులకు పరమౌషధం అని నిర్ధారణలు, నిరూపణల ఆధారంగా తేల్చారు.

ఈ ఊహల్లో వ్యాసాలు శేషేంద్ర ద్రష్టత్వాన్ని నిరూపిస్తాయ్. పూర్వం ఋషులకు చెప్పిన తప్పస్సును మరపిస్తాయి.  బాధకు మానవజాతి భవిష్యత్తుకు సంబంధాన్ని వివరించడం, ఈ విజ్ఞానానికి కర్త ఎవరో ఆలోచించడానికి కావల్సిన వనరుల్ని సూచించడం ఇలా ఎన్నో....
అపరిచిత లోకంలో మానవులు అజ్ఞాత విరుద్ధ పరిస్థితులను ఎదుర్కొని వాటిని లొంగదీసి సాధించిన ఘన విజయాలే సంప్రదాయాలుగా తెలిపారు. ఈ పూర్వుల సంప్రదాయాలు వారివారి అనుభవ పాఠాలుగా ఉదాహరణ పూర్వకంగా నిరూపించారు.

మరో ప్రత్యేకతగా చెప్పదగింది, ప్రతి వ్యాసానికి చివర్లో ఒక కవిత రాయడం అదనపు సొబగు. నక్షత్రాలే అలసిపోతే అనే సైన్స్ వ్యాసంలో నక్షత్రాలకు సంబంధించి చాలా విషయాలను రాస్తూ చివర్లో-

“ఎవడో చాకలి ఆకలిన్ మరచి
తానే వన్యమల్లీలతా
నివహక్రోడపుటీతటాకముననో
నిత్య శ్రమ జీవన
వ్యవసాయంబొనరించుచున్న
ధ్వనియే వ్యాపించె ప్రాపంచిక
వ్యవహార ప్రవిహీన విశ్వ హృదయ
వ్యాపార మెమోయనన్”( నక్షత్రాలే అలసిపోతే పుట: 12)

అని దేన్ని ఎవరు ఎందుకు మరచారో పాఠకులే ఆలోచించాలి. మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలుగా మారడాన్ని వ్యంగ్యంగా సూచిస్తున్నారు.

స్వాతంత్ర్యానంతర సాహిత్యం అన్న వ్యాసంలో ‘స్వాతంత్ర్యానంతర ప్రజల్లో కనిపించే నైతిక పతనమే సాహిత్యంలో కనిపిస్తున్నదని, అది రచయితల్లో కీర్తి కండూతి రూపంలో మారింద’ ని తెలిపారు. సవిమర్శగా చూస్తే  సాహిత్యంలో మూడు వంతులు కేవలం ప్లేగియారిజం  గా ఉన్నట్లు నిశితంగా పరిశీలించి వివరించారు. తెలుగు సాహిత్యంలో భావపుష్టి కంటే బాయసౌందర్యం మీద వ్యామోహం ఎక్కువ అని తేల్చారు. చివరిగా మానవకృషి వైవిధ్యంతో ప్రగతి సర్వతోముఖాభివృద్ధి జరగాలని ఆశించారు.

8. ముగింపు:

ఇలా శేషేంద్ర జీవితంలో చాలా సందర్భాల్లో పొగరుగా, విప్లవం మూర్తీభవించిన వారిగా కవిత్వంలో కనిపించినా వ్యక్తిగతంగా గౌరవం ఇస్తూ హాయిగా మాట్లాడడం వీరి సొంతం. ఉదయకాలంలో ఒక సారైనా సూర్యుణ్ణి చూసి ఆనందం పొందడం వీరి అలవాటు. ఎక్కువగా నిద్ర పట్టకపోవడం వల్ల దాన్ని సద్వినియోగంగా పుస్తక పఠనంకోసం వెచ్చించడం వీరి కృత్యాల్లో ఒకటి.  శేషేంద్ర గురించి ఎన్ని చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయ్. శేషేంద్ర మే డే కార్మికుల దినోత్సవం అయితే ఆ నెల చివరి రోజులు అంటే మే,30, 2007 నుంచి ప్రజల నాలుకపై, ఉద్యమ తత్త్వాలపై, చైతన్యపు అంచులపై నిల్చుని ప్రకృతిలో మిళితం అవ్వడం ఆయన కార్మికుల పక్షం అని మరో మారు సూచించారు. ఒక్క మాటలో చెప్పాలంటే శేషేంద్ర నిరంతర కావ్య కళాతపస్వి.

9. పాదసూచికలు:

  1. From Japanese 空 (sora) or 昊 (sora) which both mean "sky".
  2. R is for rational, the way you think.
    U is for useful, always to others.
    S is for sensational; you know how to make a splash!
    T is for treasure, of your friendship.
    U is for understanding, you show for others.
    M is for mighty, your inner strength.
    Your name in reverse order is "Mutsur".
  3. Plagiarism = Literary theft. Plagiarism occurs when a writer duplicates another writer's language or ideas and then calls the work his or her own. Copyright laws protect writers' words as their legal property.

10. ఉపయుక్తగ్రంథసూచి:

  1. రామమూర్తి, కలువ కుంట, శేషేంద్ర కవిత- నవ్యత (శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంత గ్రంథం, తంగిరాల పబ్లికేషన్స్, హైదరాబాదు 1997. 
  2. పద్మావతి, యస్. ఆధునికాంధ్ర కవిత్వం కావ్య బింబ పరిశీలన, అనుపమ ప్రింటర్స్, హైదరాబాదు, 1986
  3. వీరభద్రయ్య ముదిగొండ, నాదేశం నా ప్రజలు విప్లవ కావ్య విమర్శ, నల్లగొండ, స్వర్ణ మాధురి ప్రచురణ, 1985 
  4. శివరామకృష్ణ పెన్నా, శేషేంద్ర కవితవానుశీలనం పద్మావతి ఆర్ట్ ప్రింటర్స్, 1993, హైదరాబాద్(పరిశోధన గ్రంథం, కేంద్ర విశ్వవిద్యాలయ౦ హైదరాబాదుకు సమర్పించిన సిద్ధాంత గ్రంథం) 
  5. శేషేంద్ర శర్మ, గుంటూరు. ఆధునిక మహాభారతము, భరద్వాజ్  ప్రింటర్స్, హైదరాబాద్, తృతీయ ముద్రణ 1993. 
  6. శేషేంద్ర శర్మ, గుంటూరు. షోడశి రామాయణ రహస్యములు- ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రకటితం, 1978  
  7. శేషేంద్ర శర్మ, గుంటూరు, రామాయణ రహస్యములు- తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రణ: 1980
  8. శేషేంద్ర శర్మ, గుంటూరు. స్వర్ణ హంస 1999 
  9. శ్రీనివాసాచార్యులు, ముక్తవరం, నా దేశం నా ప్రజలు ఒక అధ్యయనం(యం. ఫిల్, కాకతీయ విశ్వవిద్యాలయానికి సమర్పించారు) కీర్తి ప్రింటర్స్, విజయవాడ, 1995.

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]