headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797

9. నన్నయ సూక్తులు: సార్వకాలికవిలువలు

dr_k_balakrishna
డా. కానుకొల్లు బాలకృష్ణ

తెలుగు అధ్యాపకుడు,
SWR ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మహిళలు),
కంచికచర్ల , యన్.టి.ఆర్. జల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9440064705. Email: bkkanukollu@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగువారందరూ ఆంధ్రమహాభారత అవతరణ సహస్రాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న శుభతరుణంలో నన్నయగారు మహాభారతంలో నిక్షేపించిన సూక్తిసుధలను స్మరించుకోవడం అవశ్యం. వాగనుశాసనుని వాక్ప్రౌఢిమను ఆనంతరకవులు ముఖ్యంగా తిక్కన, ఎఱ్ఱన, మారన, శ్రీనాథుడు, రామరాజభూషణుడు, విశ్వనాథ మొదలైనవారు ప్రస్తుతించారు. ఆధునికకాలంలో ఖండవల్లి, దివాకర్ల, తిప్పాభట్ల, నాగయ్య తదితర సాహితీవేత్తలు నన్నయభారతంపై విశేష పరిశోధనలను వెలువరించారు. ఆయా సాహితీవేత్తల పరిశోధనల స్పూర్తితో నన్నయసూక్తులలోని విశేషాలను ప్రస్తావిస్తూ వాటిలో నేటికీ అనుసరించదగిన, ఆచరించదగిన అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించే ప్రయత్నం చేశాను.

Keywords: ఆంధ్రమహాభారతం, నన్నయ, సూక్తులు, సత్యనిష్ఠ, శాసనాలు, అరిషడ్వర్గాలు, అర్థం, మద్యపానం, హింస

1. ఉపోద్ఘాతం:

కావ్యం విశ్వానికి శ్రేయస్సును కలిగించాలని సాహితీవేత్తల ఆకాంక్ష. భారతీయ సంస్కృతిలో అవిభాజ్యమైన భారత భాగవత రామాయణాలు మానవునికి సన్మార్గ నిర్దేశనం చేయగల మహాకావ్యాలు. సాహితీవేత్తల ఆకాంక్షలకు కవిత్రయభారతం నిలువుటద్దం.

వ్యాకరణం ప్రత్యేకంగా నేర్చుకోని మాతృభాషా వ్యవహర్తల భాషణం కూడా వ్యాకరణబద్ధంగానే ఉంటుంది. అలాగే సమాజంలో మానవీయ విలువలు ఒక తరంనుంచి మరొక తరానికి నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి. ఈ ప్రక్రియ సంప్రదాయాలు, ఆచారాలు, అనుభవాల ద్వారా జరుగుతుంది. అయితే అది సమాజ ప్రతిఫలనాలైన మహాకావ్య రచనలద్వారా స్థిరీకృతమౌతుంది. దీనికి కవి ప్రతిభ తోడైతే ఆ విలువలు సర్వకాల సర్వావస్థలలో అమోదయోగ్యాలైన ఆదర్శాలుగా, ఆచరణీయాలుగా, ఉన్నత మూల్యాలుగా గౌరవాన్ని పొందుతాయి. నన్నయగారు ప్రవచించిన సూక్తులలోని కొన్ని సామాజిక విలువలను ప్రస్తావించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం.

1.1 నన్నయ ప్రతిభ:

సంస్కృతభారత కర్త అయిన వ్యాసమహర్షి హృదయాన్ని ఆవిష్కరిస్తూనే సమకాలీన అవసరాలనూ, ప్రయోజనాలనూ దృష్టిలో ఉంచుకొని అపూర్వ శిల్పచమత్కృతితో నన్నయ తెలుగులో భారతాన్ని మహాకావ్యంగా మలిచాడు. నన్నయ సంహితాభ్యాసుడు, అవిరళ జపహోమతత్పరుడు, బ్రహ్మాండాది నానాపురాణ విజ్ఞాన నిరతుడు కావడంతోపాటు మహాకవి కూడా కావడంవల్లనే తెలుగులో భారత రచన గొప్ప ప్రారంభానికి నోచుకున్నది (1).

హృద్యము, అపూర్వము, ఎరుక సమగ్రమై ఉండేది, అఘనిబర్హణము అయిన భారతకథను నన్నయ లోకజ్ఞతతో జగద్ధితంగా రచించాడు(2).

ప్రసన్న కథాకలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థ సూక్తినిధిత్వం అనేవి తన కవితా లక్షణాలుగా నన్నయ ప్రకటించాడు(3).

ఈ సూక్తులు సందర్భశుద్ధితో పాఠకులను అలరించడమేగాక సకలమానవాళికి సన్మార్గనిర్దేశనం చేస్తాయి(4). నన్నయ భారతంలోని సూక్తులలో విశ్వజనీనమైన అమూల్యమైన మానవమూల్యాలను గమనించవచ్చు.

నన్నయ రుచిరార్థసూక్తినిధి: నన్నయ తాను నానారుచిరార్థసూక్తినిధిని అని చెప్పుకున్నాడు. సూక్తి అంటే సుభాషితం. మనోహరమైన, ప్రయోజనకరమైన అనేక సుభాషితాలకు నిధి అని తాత్పర్యం(5).

సత్యనిష్ఠ, సర్వభూతప్రీతి, ప్రియభాషణం, ధర్మదీక్ష, ఉత్తమగుణం, జ్ఞానవైశిష్ట్యం, మొదలైన ఎన్నో అంశాలను ఆయా సందర్భాలలో వర్ణిస్తూ సార్వకాలిక సందేశాన్ని అందించాడు నన్నయ.
అంతేగాక అరిషడ్వర్గాలు, అర్థం, హింస, మద్యపానం, వాక్ పారుష్యం మొదలైన అంశాలను వాటివల్ల మానవ సమాజానికి కలిగే హానిని ఆయా సన్నివేశాలలో వర్ణిస్తూ వాటిని మానవుడు విడనాడాలని శాసించాడు కూడా.

2. నన్నయ సూక్తులు – సందేశాలు:

ఏ సన్నివేశంలో ఏ పాత్రచేత పలికించినా నన్నయసూక్తులు సార్వకాలిక, సార్వజనీన లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్తులలో ఏ కాలంలోనైనా మనిషి ఆచరించదగిన, అనుసరించదగిన అంశాలను గమనించవచ్చు.

(అ) సత్యనిష్ఠ: 

ఎల్లవేళలా సత్యమే పలకడం సార్వకాలిక విలువ. ఇది ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా ఏ మానవ సమాజంలోనైనా అనుసరించదగిన, ఆచరించదగిన అత్యున్నత వ్రతం. సత్యవాక్కును గురించి చెప్పవలసిన ప్రతి సందర్భంలోనూ నన్నయ సత్యనిష్ఠను మించిన విలువ విశ్వంలో ఏదీలేదని నొక్కి వక్కాణించాడు. అసలు ఆ మాటకొస్తే, ‘శకుంతలోపాఖ్యానం’ వంటి కథలు సత్యవాగ్వైశిష్ట్యాన్ని ప్రతిష్ఠాపించడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తాయి. నిత్యసత్యవచనుడైన నన్నయ సందర్భానుసారంగా సత్యవ్రత మహిమను అపూర్వంగా వర్ణించాడు.

(i) భృగువంశవర్ణనం:

పులోముడనే రాక్షసుడు తన భార్య అయిన పులోమను ఎత్తుకుపోవడానికి అగ్నిదేవుడే కారణమని భావించిన భృగుమహర్షి సర్వభక్షకుడవు కమ్మని అగ్నిదేవుణ్ణి శపించాడు. అప్పుడు అగ్నిదేవుడు భృగుమహర్షితో పలికిన పలుకులు సత్యవాక్కు గొప్పదనాన్ని పట్టిస్తాయి.

తన యెఱిగిన యర్థం బొరు
డనఘా! యిది యెట్టు చెప్పుమని యడిగిన జె
ప్పనివాడును సత్యము జె
ప్పనివాడును ఘోరనరక పంకమున బడున్” (ఆది.ప్రథమ-136)

‘తనకు తెలిసిన విషయాన్ని ఇతరులు అడిగినా చెప్పనివాడూ సత్యం చెప్పనివాడూ భయంకర నరకానికి పోతారు’ అని భావం. ఈ సూక్తి విద్యాబోధకులకు కూడా స్పూర్తినందిస్తుంది. విద్యార్థి ఆసక్తులతో సంబంధం లేకుండా క్రమపద్ధతిలో సమయపట్టికనుబట్టి వివిధ పాఠ్యాంశాలను బోధించడంకంటే ఉత్సుకతతో విద్యార్థి అడిగే సందేహాలను, ప్రశ్నలను సాధికారికంగా, సోపపత్తికంగా, సంతృప్తికరంగా వివరించడంద్వారానే విద్యార్జన ఫలవంతమౌతుంది. అట్లా వివరించగలిగినవాడే నిజమైన గురువు. అందువల్లనే భారతకథ అంతా సందేహాలను తీర్చే విధానంలోనే కొనసాగుతుంది. ఆఖిలార్థికోటికి ఇచ్చినప్పటికీ పెరిగే శక్తి ఉన్న విజ్ఞానాన్ని యోగ్యులైనవారికి అందించాలనే అంశం ఈ పద్యభావంలో స్పురిస్తుంది. భారతప్రభుత్వం ఆమోదించిన నూతన జాతీయ విద్యావిధానంలో విద్యార్థి ఆసక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ముదావహం.

తనకు తెలిసిన అంశాన్ని ఎవరైనా అడిగినా చెప్పకపోవడం సత్యం చెప్పకపోవడంతో సమానమని వర్ణించడంద్వారా విద్యాబోధన, విద్యార్జనలకు ఉన్న ప్రాముఖ్యాన్ని చాటిచెప్పాడు నన్నయ. ఈ రెండు అంశాలకూ సమానత్వాన్ని స్పురింపజేయడానికే ‘జెప్పనివాడును’ అనే వర్ణక్రమాన్ని మూడు నాలుగు పాదాలలో సమానంగా ప్రయోగించడం నన్నయగారి శిల్పచమత్కృతి.

ఈ సందర్భంగా “ ‘సాక్ష్యం అడిగితే మౌనం వహించకూడదు. అసత్యం చెప్పకూడదు’ అనే భావన మాత్రమే సంస్కృతంలో ఉంది... దాన్ని నన్నయ విస్తృతపరిచి విపులార్థవంతం గావించాడు. కథాభాగం నుంచి విడదీసి చదువుకునేందుకు వీలుగా రచించాడు నన్నయ” అన్న రామకృష్ణమూర్తిగారి మాటలు గమనించదగినవి (రామకృష్ణమూర్తి 2000:30).

(ii) ద్రౌపదీ వస్త్రాపహరణం: 

తనకు జరిగిన అవమానానికి దుఃఖిస్తూ తాను ధర్మవిజితనా? అధర్మవిజితనా? అని అడిగిన ప్రశ్నకు ద్రౌపదికి సభలో ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. మాయాజూదంలో ధర్మరాజు ముందు తన సకలసంపదలనూ, తర్వాత తమ్ములనూ ఓడి చివరికి తాను కూడా ఓడిపోయాడు. శకుని ప్రేరణతోనే ద్రౌపదిని పణంగా పెట్టడానికి సాహసించాడు. ముందు ఓడి విజేతలకు బానిస అయిన ధర్మరాజుకు మరే వస్తువునూ పణంగా పెట్టే అధికారం ఉండదు. అపుడు వికర్ణుడు ప్రకటించినట్లు ద్రౌపది అధర్మవిజిత అవుతుంది (6).

ఈ సందర్భంలో కూడా నన్నయ సభలో ఎవరైనా ధర్మసందేహం అడిగినపుడు తెలిసి కూడా చెప్పని సభ్యులు అసత్యఫలంలో సగపాలు పొందుతారనీ, ఒకవేళ స్వార్థంతోగానీ లోభంతోగానీ పక్షపాత బుద్ధితోగానీ చెప్పకపోతే వారు అసత్యఫలాన్ని పొందుతారని వర్ణించాడు నన్నయ (7). ఋషి అయిన కవివాక్కు వృధాకాలేదు. సభాపర్వంలో ద్రౌపది మనసులో రగిలిన ప్రశ్నకు యుద్ధపర్వంలో సమాధానం లభించడం జగద్విదితం.

(iii) శకుంతలోపాఖ్యానం:

తనను గాంధర్వవివాహం చేసుకొని భరతుని పుట్టుకకు కారణమైన దుష్యంతుడు తనను గుర్తుపట్టని సందర్భంలో శకుంతల నోట నన్నయ పలికించిన సూనృత వైశిష్ట్యవర్ణన ఎంతో ప్రసిద్ధమైనది.

“నుతజల పూరితంబులగు నూతులు నూఱిటి కంటె సూనృత
వ్రత! యొక బావిమేలు; మరి బావులు నూఱిటి కంటె నొక్క స
త్క్రతువదిమేలు, తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు త
త్సుత శతంబున కంటె సూనృతవాక్యము మేలు సూడగన్” (ఆది. చతుర్థ – 93)

‘ఓ రాజా! వంద మంచినీళ్ళ బావులకన్నా ఒక దిగుడుబావి మేలు. వంద దిగుడుబావులకన్నా ఒక యజ్ఞం మేలు. అటువంటి వంద యజ్ఞాలకన్నా ఒక కుమారుడు మేలు. వందమంది కుమారులకన్నా ఒక్క సత్యవాక్యం మేలు’ అని భావం. ఇందులో సత్యవాక్కు గొప్పదనాన్ని వర్ణిస్తూనే సత్యం పలకాలని కాంక్షిస్తూ తన భర్తను శకుంతల సూనృతవ్రత! అని సాభిప్రాయంగా సంబోధించడం విశేషం.

అంతేగాక వేయి అశ్వమేధయాగాలను నిర్వహించడంగానీ సకల తీర్థాలను సేవించడంగానీ వేదాలను వల్లించడంగానీ సత్యనిష్ఠకు సాటిరావని వర్ణించాడు నన్నయ(8). లోకవ్యవహారమంతా సత్యంమీదనే ఆధారపడి ఉన్నది. వేదాలు సాక్షాత్తూ సత్యస్వరూపాలు. సత్యం సర్వధర్మాలలో సర్వశ్రేష్ఠమైనది. ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ అన్న ఉపనిషద్వాక్యం సత్యవైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. సత్యం లేనిచోట ఎన్ని గుణాలు, ఎన్ని సంపదలూ ఉన్నా వ్యర్థమే.

లోకంలో బహుళప్రచారంలో ఉన్న ‘నిజం నిలకడమీద తెలుస్తుంది’, ‘నిజం గడప దాటే లోపల అబద్దం లోకాన్ని చుట్టి వస్తుంది’ అనే నానుడులకు, విశ్వాసాలకు సత్యవైశిష్ట్యాన్ని బోధించే ఇటువంటి ఇతిహాస కథాఘట్టాలే స్పూర్తి. సత్యవాక్పాలనంవల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలు, అసత్యాలాపనంవల్ల కలిగే అనర్థాలను నాటకీయంగా, హృద్యంగా, సూక్తి సుందరంగా వర్ణించిన ఈ ఉపాఖ్యానంద్వారా సత్యానిదే తుదివిజయం ఆనే వాస్తవం బోధపడుతుంది.

3. నన్నయ సూక్తులు – శాసనాలు:

దురలవాట్లు, వ్యసనాలవల్ల కలిగే నష్టాలగురించి నన్నయ వివరించిన సూక్తులలోని ఈ శాసనాలు, సూచనలు సకల మానవాళికీ అనుసరణీయాలు. సర్వకాల సర్వావస్థలలో ఆచరణీయాలు.

(i) అరిషడ్వర్గాలు:

కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనలోపల ఉండే శత్రువులు. వీటినే అరిషడ్వర్గాలు అంటారు. ఇవి మానవులందరిలోనూ సహజంగా ఉండేవే అయినా వాటిని అదుపులో ఉంచుకోకపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయని నన్నయ ఎన్నో సూక్తులలో బోధించాడు. “వదలక అంతరరివర్గము నోర్చి జితేంద్రియుండవై...” ఉన్నావుకదా అంటూ ధర్మరాజుకు రాజనీతిని బోధించాడు నారదమహర్షి(9). అరిషడ్వర్గాలు అంతఃశత్రువులు. అంటే పైకి కనబడని శత్రువులు. అంతశ్శత్రువులను జయించినవాడు మాత్రమే బయటకు కనబడే శత్రువులను జయించగలడని తీర్పు చెప్పాడు నన్నయ(10).

(అ) క్రోధం:

అరిషడ్వర్గాలలో రెండవదైన క్రోధంవల్ల జరిగే హాని గురించి నన్నయ ఎన్నో సూక్తులలో వివరించాడు. వారంరోజులలో తక్షక విషాగ్నికి దగ్ధమైపోతాడని శృంగి పరీక్షిత్తును శపించినప్పుడు శమీక మహర్షి క్రోధంవల్ల కలిగే అనర్థాలను ఇట్లా వివరిస్తాడు.

క్రోధమ తపముం జెఱచును
గ్రోధమ యణిమాదు లయిన గుణముల బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు
బాధయగుం గ్రోధిగా దపస్వికి జన్నే!” (ఆది.2– 172)
‘క్రోధం తపస్సునూ అష్టసిద్దులనూ నాశనం చేయడమేగాక ధర్మకార్యాలకు చేటు చేస్తుంది. కనుక తపస్వి అయినవాడు క్రోధి కావడం తగదు” అని భావం. అంతేగాక

క్షమలేని తపసి తపమును
బ్రమత్తు సంపదయు ధర్మబాహ్య ప్రభు రా
జ్యము భిన్న కుంభమున తో
యములట్టుల యధ్రువంబులగు నివి యెల్లన్” (ఆది.2-175)

‘సహనం లేని తపస్వి తపస్సు, గర్వం కలవాని సంపద, ధర్మం లేనివారి రాజ్యం పగిలిన కుండలో నీళ్ళలాగా చెల్లాచెదరైపోతాయి’. ఇక్కడ చెప్పిన అంశాలలో సహనంలేనివాని తపస్సు వృధా అనే అంశం మాత్రమే ఈ సన్నివేశానికి సంబంధించినది. దానికి గర్వించే వాని సంపద, ధర్మం లేనివాని రాచరికం అనే మరో రెండు అమూలక అంశాలను చేర్చి నన్నయ తన సూక్తినిధిత్వాన్ని నిరూపించుకున్నాడు(11). ఇంకా ‘నియమనిష్ఠలతో విలువైన దక్షిణలతో వేల యజ్ఞాలు చేసినవారికంటే కూడా క్రోధం లేని శాంతమూర్తి గొప్పవాడని ధర్మజ్ఞులు చెబుతారు’ అని కూడా వర్ణించాడు(12).

ఉదంకుడుకూడా క్రోధంవల్లనే గృహస్థాశ్రమ ధర్మాచరణయోగ్యతనూ, తపశ్శక్తినీ కోల్పోయాడు. గృహస్థు కావలసినవాడికి ఉండవలసిన లక్షణాలను కూడా ఉదంకునికథ ద్వారా నన్నయ బోధించాడు.

(ii) అర్థం:

ధర్మార్థకామమోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలలో అర్థం రెండవది. ధర్మబద్ధమైన అర్థాపేక్ష మనిషి జీవికకు అవసరం. కానీ మితిమీరిన సంచయనం జీవి అస్తిత్వాన్నే నాశనం చేస్తుందని వర్ణించాడు నన్నయ.

‘నీటిలో చేపలు ఆకాశంలో పక్షులూ మాంసాన్ని భక్షించినట్లు ధనవంతులను అందరూ అనేక విధాలుగా పీక్కుతింటారు(13). అంతేగాక

“అర్థమ యనర్థ మూలం
బర్థమ మాయావిమోహనావహము నరుం
డర్థార్జున దుఃఖమున న
పార్థీకృత జన్ముడగుట పరమార్థమిలన్” (అరణ్య.ప్రథమ – 28)

‘అర్థమే అన్ని అనర్థాలకూ కారణం. ధనమే వ్యామోహాన్ని కలిగిస్తుంది. మానవుడు ధనాన్ని సంపాదించడంకోసం దుఃఖిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు’ అని తాత్పర్యం. ఈ మాటలు అవసరాన్ని మించిన ధనార్జనకోసం విలువలకు సైతం తిలోదకాలిస్తున్న నేటి మానవులకు అమూల్య సందేశం.

(iii) హింస:

“అహింసా పరమో ధర్మః” అన్న మహర్షి వాక్కును అనుసరిస్తూ సర్వభూతదయను అపేక్షించిన నన్నయ హింసకు విరోధి. ఏ పరిస్థితులలోనైనా ఏ రూపంలోనైనా జీవహింస తగదు. హింస చేసినవారికి దుర్గతులు కలుగుతాయి. అంతేగాక హింసను ఉపేక్షించిన వారికి కూడా అదే గతి పడుతుందని వర్ణించాడు నన్నయ.

ఎఱుక గలడేని మఱి శక్తుడేని యన్యు
లన్యులకు హింస గావించునపుడు దాని
బూని వారింపకున్న నప్పురుషుడేగు
హింస చేసిన వారల యేగు గతికి” (ఆది.సప్తమ – 146)

నేరుగా హింస చేయడం మాత్రమే కాకుండా కళ్ళెదుట జరుగుతున్న హింసను ఆపకుండా ఉపేక్షించడం కూడా హింసతో సమానమని ప్రకటించడంద్వారా హింస ఏ రూపంలో ఉన్నప్పటికీ వర్జనీయమనే సందేశాన్ని అందించాడు నన్నయ. ఈ సూక్తిని, అందులోని స్పూర్తినీ ఆవగతం చేసుకున్న సమాజంలో హంసకు తావు ఉండదు.

(iv) మద్యపానం: 

మద్యపానం ఒక చెడ్డ అలవాటు. దీనివల్ల కలిగే అనర్థాలను కచదేవయాని కథలో వర్ణించాడు నన్నయ. మద్యపానం కూడదని శాసించాడు. మద్యపానం చేసినవారు ఎంత గొప్పవారైనా అధములైపోతారని శపించాడు.

మృతసంజీవనీవిద్యకోసం రాక్షసకుల గురువైన శుక్రాచార్యునివద్ద శిష్యునిగా చేరాడు కచుడు. గురుపుత్రి అయిన దేవయాని అభిమానాన్ని చూరగొన్నాడు. కచుడంటే గిట్టని రాక్షసులు అతణ్ణి కాల్చి చంపి బూడిదచేసి ఆ బూడిదను శుక్రుడు తాగే మద్యంలో కలిపారు. తాను చేసిన మద్యపానంవల్ల బూడిదరూపంలో తన కడుపులోనే ఉన్న కచునికి శుక్రుడు మృతసంజీవనీవిద్యను అనివార్యంగా నేర్పవలసివచ్చింది.

మొదలి పెక్కు జన్మమ్ముల బుణ్యకర్మముల్
పరగ బెక్కు సేసి పడయబడిన
యట్టి యెఱుక జనుల కాక్షణ మాత్రన
చెఱుచు మద్యసేవ సేయనగునె” (ఆది. తృతీయ – 20)

‘ఎన్నో జన్మలలో చేసిన పుణ్యఫలం, ఎంతో కష్టపడి సాధించిన జ్ఞానం మానవులకు మద్యపానంవల్ల ఆ క్షణంలోనే నాశనం అవుతాయి. అందువల్ల మద్యపానం తగదు’ అంటూ శుక్రుడు మద్యపానాన్ని నిషేధించాడు.

నేటికీ సమాజంలో మద్యపాన వ్యసనంవల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రజలను చైతన్యవంతులనుచేయడంద్వారా ఈ దుర్వ్యసనాన్ని రూపుమాపడంకోసం ఆధునిక సాహిత్యంలో మహాకవి కాళ్ళకూరి నారాయణరావు ‘మధుసేవ’ అనే నాటకాన్ని కూడా రచించాడు. శుక్రుని శాసనాన్ని తుచ తప్పక పాటించడం అవశ్యం. యుగాలుగా ధనవంతులను నిరుపేదలుగా, కడుపేదలను అనాథలుగా మార్చివేస్తున్న మద్యపానాన్ని మానుకోవడమే మానవులకు శ్రేయస్కరం.

(v) వాక్పారుష్యం:

ప్రియభాషణం వాంఛనీయమైన, శ్రేయోదాయకమైన గుణం కాగా అప్రియభాషణం లేక వాక్పారుష్యం అవాంఛనీయమైనది, హానికరమైనది. అందుకే ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలుసుకొని మెలగుతూ ఎదుటివారి మనసులను నొప్పించకుండా, తానూ నొచ్చుకోకుండా మాట్లాడేవాడే ధన్యుడని నీతిశతకకర్త అయిన బద్దెన కూడా వర్ణించాడు. “సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్...” అన్న ఆర్షసూక్తి ప్రకారం ప్రియమైనదైనప్పటికీ అసత్యాన్ని, అప్రియం కలిగించే సత్యాన్ని చెప్పకపోవడమే మేలు అని వర్ణించడంద్వారా ప్రియవచనాలకు సనాతనధర్మం ఇచ్చిన ప్రాధాన్యం అవగతమౌతుంది. ఈ అంశాన్ని అనుసరించిన నన్నయ ‘పరుషవచనం విషంకన్నా, అగ్నికన్నా దారుణమైనదని’ వర్ణించాడు (14).

ఈ సూక్తిద్వారా నేటి సమాజం ముఖ్యంగా యువత ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడడంవల్ల కలిగే ప్రయోజనాలను గ్రహించవచ్చు. తద్వారా నేటి సమాజంలో ఆయా వ్యాపారాలకూ, ఉదోగార్థులకూ అవశ్యమైన భాషణ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.

4. గతకాలము మేలు: 

పాండురాజు మరణంవల్ల హస్తినలో రాచరికంలో కలిగిన లోటును గురించి వ్యాసుడు తన తల్లితో ఇట్లా అన్నాడు.

“మతి దలపగ సంసారం
బతి చంచల మెండమావు లట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు
గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్” (ఆది.పంచమ.159)

‘ఈ సంసారం ఎండమావులలాగా చంచలమైనది. సంపదలు అశాశ్వతాలు. వచ్చేకాలంకంటే జరిగిపోయిన కాలం మేలైనది’ అని భావం. క్రాంతదర్శి అయిన వ్యాసుడు పాండురాజు మరణంవల్ల రాజ్యంలో జరగబోయే అనర్థాలనుగురించి పలికిన మాటలివి. వ్యాసుడు భారతాన్ని ఎటువంటి పరిమితులూ, ఆంక్షలూ లేకుండా ఇతిహాసంగా రచించగా నన్నయ సమకాలీన సామాజిక అవసరాలనూ, రాజరాజు మెచ్చేటట్లుగానూ మహాకావ్యంగా ప్రారంభించాడు. అందువల్ల వ్యాసమహర్షి పాత్రచేత పలికించిన ఈ మాటలద్వారా నన్నయ తన కావ్యరచనావస్థను ధ్వనింపజేశాడని ఖండవల్లివారు భావించారు(15).

కుటుంబం బాగోగులు చూసే ఇంటి పెద్దగానీ, ప్రజల ఆలనా పాలనా చూసే మహనీయులైన నాయకులుగానీ గతించిన సందర్భంలో చింతించే బాధితుల మనసులోమాటను నన్నయ వ్యాస మహర్షినోట పలికించాడు.

5. ముగింపు:

ఈ విధంగా శబ్దశాసనుడు, నిత్యసత్యవచనుడు అయిన నన్నయ భృగువంశవర్ణన, ద్రౌపదీ వస్త్రాపహరణం, శకుంతలోపాఖ్యానం మొదలైన ఘట్టాలద్వారా సత్యవాక్కు విశిష్టతను సందేశాత్మకంగా వర్ణించాడు. క్రోధం, అతిసంచయేచ్చ, హింస, మద్యపానం, పరుషవాక్కులు మొదలైన వాటివల్ల కలిగే అనర్థాలను వర్ణించడమే గాక అటువంటి దోషాలను విడిచిపెట్టాలని శాసనాత్మకంగా బోధించాడు. ఆంధ్రమహాభారత మహాకావ్యాన్ని ప్రారంభించి నానారుచిరార్థసూక్తులతో మానవసమాజానికి సర్వకాలాలలో వర్తించే ఇటువంటి ఎన్నో విలువలను నిక్షేపించాడు. అందువల్లనే నన్నయ తన కవిత్వప్రతిభతో “ఆంధ్ర కవితాగురుడు” (మారన-మార్కండేయ పురాణం), “ఆంధ్ర కావ్యపథము తీర్చినవాడు” (కొలని గణపతిదేవుడు – శివయోగసారం), “మహి మున్ వాగనుశాసనుండు సృజయింపన్.....” (రామరాజభూషణుడు - వసుచరిత్రము), “... భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌఢి నొక్కొక మాటు.....” (శ్రీనాథుడు – కాశీఖండము), “ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి.....” (విశ్వనాథ – శ్రీమద్రామాయణ కల్పవృక్షము) అంటూ ఆనంతరకవుల ప్రశంసలు అందుకున్నాడు. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య వికాసానికి మార్గదర్శకునిగా, ఆదికవిగా కీర్తిపొందాడు.

6. పాదసూచికలు:

  1. భార.ఆది.ప్రథమ - 9
  2. భార.ఆది.ప్రథమ – 29
  3. భార.ఆది.ప్రథమ – 25
  4. “రుచిరార్థం అంటే – భావ చమత్కారం కావచ్చు. అర్థచమత్కారం కావచ్చు. సూక్తికల్పన లోకానుభవసారంగా చెప్పే లోకోక్తులలో నిక్షిప్తమై అడుగడుగునా పాఠకులకు ఇంపు గొల్పుతుంది.”(హనుమచ్చాస్త్రి 1986:18)
  5. “కవులు వ్యంగ్యముగనో వాచ్యముగనో ఉపదేశాత్మకములైన సూక్తులను తమ కావ్యములలో ప్రవేశపెట్టుచుందురు. ఆంధ్ర మహాభారత మిట్టి సూక్తి రత్నములకు రత్నాకరము. నన్నయ భారతమును రచించినప్పుడు అమూలకములైన సూక్తులను పెక్కింటిని ప్రత్యేకముగను, అర్థాంతరన్యాసాలంకార పూర్వకముగను అచ్చటచ్చట చొప్పించి యుండెను. కథతో సంబంధము లేకుండ ఎవరైనా సందర్భోచితముగ వాడుకొనుటకు తగినట్లు అతడు నీతియుక్తములైన విడి పద్యములను కూడ పెక్కుచోట్ల రచించియుండెను” (వేంకటావధాని 1986:60)
  6. “ఈ సన్నివేశాన్ని పరిశీలిస్తే కురుసభలో ద్రౌపది ప్రశ్నకు ఏ ఒక్కరు సరియైన సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. భీష్మ, ద్రోణ, కృప, విదురాది పెద్దలకు అక్కడ అజరుగుతున్నది అన్యాయం, అధర్మం అని తెలుసు. దాన్ని సరిదిద్ది న్యాయం చేయవలసిన మహారాజు ధృతరాష్ట్రుడే దుర్యోధనునికి అయిష్టంగా ప్రవర్తించక మిన్నకుండిపోయాడు. దుర్యోధనుడి దౌష్ట్యం బాగా ఎరిగినవారు భీష్మాదులు. అతడి మాట కాదనలేని బలహీనుడయిన రాజు ధృతరాష్ట్రుడు. రాజుకు రాజ్యానికి విధేయులైనవారు భీష్మాదులు. ఇదొక చిత్రమైన సన్నివేశం. ఈ స్థితిలో సభలోనివారు మిన్నకుండిపొగ, ధర్మమాసభాలోనే నిద్రపోయింది. ద్రౌపదికి జరుగవలసిన అవమానం జరిగిపోయింది. ఆమె ప్రశ్న సమాధానం రాని ప్రశ్నగా మిగిలిపోయింది” (వెంకటరత్నం 2019:34)
  7. భార.సభా.ద్వితీయ - 237, 238
  8. భార.ఆది.చతుర్థ - 95
  9. భార.సభా.ప్రథమ - 53
  10. భార.ఆది.తృతీయ – 206
  11. “ఇందు ‘క్షమలేని తపసి తపము’ అనునది ఒక్కటే కథకు సంబంధించినది. దానితోపాటు ‘ప్రమత్తు సంపద’, ‘అధర్మప్రభురాజ్యము’ నను మరి రెండింటిని కలిపి వానికి మూలమున లేని ఒక మంచి ఉపమానమును చూపినాడు నన్నయ. ఇది సర్వకాలముల కన్వయిమ్పగల లౌకిక ధర్మమును బోధించు నీతి” (నాగయ్య 1990:94)
  12. భార.ఆది.తృతీయ - 146
  13. భార.అరణ్య.ప్రథమ - 27
  14. భార.సభా.ద్వితీయ - 17
  15. “నన్నయ మూలములో పౌరుల కియ్యబడిన ప్రాముఖ్యత నియ్యకుండుట జూడ నాతని కాలములో ప్రజాభిప్రాయమున కెంత విలువ యుండెడిదో మన మెరుంగగలము”......”ప్రజలను దిరస్కరించినచో వారు మనలను బంధుమిత్రులతో సహా చంపకుందురా అని అడుగుచున్నాడు. ఈ యభిప్రాయము నన్నయ బొత్తిగా విడిచిపెట్టుటచే ప్రజలు రాజును సంహరించుటాతడు నోటగూడ ఉచ్చరించడని మన మనుకొనవలసి వచ్చుచున్నది...”(లక్ష్మీరంజనం 1970: 22, 25)

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆంధ్ర మహాభారతం. కవిత్రయకృతం. ప్రథమ సంపుటం. హైదరాబాదు: తెలుగు విశ్వవిద్యాలయం.
  2. ఆచార్య లక్ష్మీరంజనం, ఖండవల్లి. 1970. లక్ష్మీరంజన వ్యాసావళి. హైదరాబాదు: స్వీయప్రచురణ (ప్రథమ ముద్రణ 1968)
  3. నాగయ్య, ఆచార్య జి. 1990. తెలుగు సాహిత్య సమీక్ష. తిరుపతి: నవ్య పరిశోధక ప్రచురణలు (ప్రథమ ముద్రణ 1983)
  4. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. శ్రీనివాసులు, సూరం.2000. భారత నిరుక్తి నన్నయ రుచిరార్థసూక్తి. తాడేపల్లి: స్వీయ ప్రచురణ (ప్రథమ ముద్రణ 1983)
  5. వెంకటరత్నం, డాక్టర్ గుంజి. 2019. మహాభారతంలో ఇవి మీకు తెలుసా?. హైదరాబాదు: ఎమెస్కో 
  6. వేంకటావధాని, ఆచార్య దివాకర్ల. 1986. నన్నయభట్టు. హైదరాబాదు: యువభారతి
  7. శ్రీమదాంధ్ర మహాభారతము. 2014. కవిత్రయకృతం. సుబ్రహ్మణ్యం, ఆచార్య జి.వి.(సం.). ప్రథమసంపుటం. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు (ప్రథమ ముద్రణ 2000) 
  8. హనుమచ్ఛాస్త్రి, ఇంద్రగంటి. 1986. ఆరుయుగాల ఆంధ్రకవిత. హైద్రాబాదు: ఆంధ్ర సారస్వత పరిషత్తు.

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]