headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797

7. రాయలకాలంనాటి దేవాలయాలు: నిర్మాణనేపథ్యం

dr_t_venkataswamy
డా. తోట వెంకటస్వామి

సహాయ ఆచార్యులు,
ప్రచురణలు & విస్తరణ సేవల కేంద్రం, ద్రావిడ విశ్వవిద్యాలయం,
కుప్పం - 517426, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9492631323. Email: venkataswamythota63@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఆంధ్రదేశంలో సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు దేశంలోని దేవాలయాలకు చేసిన సేవను నిర్మించిన దేవాలయాలు, వాటి అభివృద్ధి గురించి తెలియజేయడమే ప్రస్తుత పరిశోధన వ్యాస ముఖ్యోద్దేశం. శ్రీకృష్ణదేవరాయలు ప్రాంతాల వారీగా చేసిన దేవాలయాల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి మొదలగునవి. ఈ పరిశోధన వ్యాసంద్వారా భావి పరిశోధకులు భారతదేశంలోని వివిధ సామ్రాజ్యాధిపతులు వారి కాలంలో చేసిన దేవాలయాల అభివృద్ధిని కూలంకషంగా పరిశోధిస్తారని భావించడం.

Keywords: విజయనగర రాజ్యం, హైందవ రాజవంశం, విద్యానగరం, తుళువ వంశం, తుళువనాడు, విద్యారణ్యస్వామి, విరూపాక్ష ఆలయం, విఠలాలయం, హజార రామాలయం, కృష్ణాలయం, ఏకశిలా రథము, తిరుమల రాయలు, ఆంధ్ర మహావిష్ణు ఆలయం, లేపాక్షి దేవాలయం.

1. ఉపోద్ఘాతం:

“భారతదేశ చరిత్రలో విజయనగర రాజ్యానికి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. భారతదేశ చరిత్రలో విలసిల్లిన గొప్ప రాజ్యాలలో విజయనగర రాజ్యం ఒకటి. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన చిట్టచివరి హైందవ రాజవంశం విజయనగరం వారిది. ఈ రాజ్యం హరిహర, బుక్కరాయలనే ఇద్దరు అన్నదమ్ములచే తుంగభద్రానదీ తీరంలో హంపీ వద్ద క్రీ.శ. 1336లో స్థాపింపబడింది. వీరి రాజధాని అయిన విజయనగరం (విద్యానగరం) కర్ణాటక ప్రాంతంలో ఉన్నప్పటికీ, వీరి పరిపాలన ఆంధ్ర తీరప్రాంతం వరకు విస్తరించింది.” (ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి: పుటలు 12-13) విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి అనే నాలుగు రాజ వంశాలు పరిపాలించాయి. వీటిలో తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తులలోనే కాక దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులందరిలో సుప్రసిద్ధుడు. మైసూర్‌లో ఉన్న ‘‘తుళువనాడు’’ జన్మస్థలం కావడంవల్ల వీళ్ళకి తుళువ వంశస్థులు అనే పేరు వచ్చింది. ‘వీరనరసింహరాయలు’తో తుళువ వంశపరిపాలన ప్రారంభమైనది. ఇతని మరణానంతరం అతని సోదరుడు శ్రీకృష్ణదేవరాయలు, క్రీ.శ. 1509, ఆగస్టు 8వ తేదీన పట్టాభిషేకం జరుపుకుని క్రీ.శ. 1529 వరకు పరిపాలించినట్లు తెలుస్తోంది. నాగాంబ, నరసనాయకులు, రాయల తల్లిదండ్రులు.

2. దేవాలయాల నిర్మాణం - అభివృద్ధి:

రాయలు గొప్ప యోధుడు. మంచి పరిపాలనా దక్షుడు. రాజనీతిజ్ఞుడు. సాహిత్యాభిమాని, సాహిత్యపోషకుడు, వైష్ణవ భక్తుడు. గొప్ప భవన నిర్మాత. ఈ విధంగా అన్ని విద్యల్లో ఆరితేరిన ప్రతిభావంతుడు శ్రీకృష్ణదేవరాయలు. ఎత్తైన గోపురాలతో కూడిన శిలా ప్రాకారాలు, విశాలమైన రంగమండపాలు ఈ వంశస్థులు నిర్మించిన ఆలయాల ముఖ్యలక్షణాలు. సామ్రాజ్య విస్తృతికి, ఐశ్వర్యానికి నాటి ఆలయాలు నిదర్శనాలుగా ఉండేవి. సామాన్య పౌరుని మొదలు, రాజాధిరాజువరకు దేవాలయాల అభివృద్ధికి చేయూతనిచ్చారు. ప్రతీ దేవాలయంలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు నిర్వహించబడేవి. రాయలు అన్ని మతాలపట్ల సహన శీలతను ప్రదర్శించాడు. ప్రతి మనిషీ రావడానికి, వెళ్లడానికి, వచ్చినవారు తమ మతాచారం ప్రకారం, ఎవరికీ ఇబ్బంది కలగకుండా నడచుకోవడానికి స్వేచ్ఛగా మెలగడానికి అనుమతించాడు. “శ్రీకృష్ణ దేవరాయలు అందరిపట్ల సమతాభావం, న్యాయం ప్రదర్శించటమే కాదు రాయలకాలంనాటి అతని ప్రజలు కూడ ఏ భేదభావం లేకుండా కలిసిమెలసి జీవించేవారని బర్బోసా తెలియచేశాడు.” (ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు-ప్రధాన దేవాలయాలు, పుట 55) కృష్ణదేవరాయల సామ్రాజ్యంలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సాలలోని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎత్తైన, విశాలమైన, సుందర దేవాలయాలను రాయలు నిర్మించాడు. విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడైన విద్యారణ్యస్వామి సలహాపై పాత దేవాలయాల పునరుద్ధరణ చేయుటమే కాకుండ కొత్త దేవాలయాలు కూడ నిర్మించాడు. పట్టాభిషేకానికి గుర్తుగా, శత్రు రాజులను తుదముట్టించి, రాజ్య విస్తరణకు ప్రతీకగా, జైత్రయాత్రల సందర్భంగా, ప్రజల మతభావ పరిరక్షణకు, మఠాధిపతుల కోరిక మేరకు అనేక దేవాలయాలను నిర్మించాడు.

3. హంపీ ప్రాంతంలో నిర్మించిన దేవాలయాలు:

రాయలు తన రాజధాని నగరమైన ‘హంపీ’ విజయనగరంలో, విరూపాక్ష ఆలయము, విఠలాలయం, హజార రామాలయం, కృష్ణాలయం, నాగలాపురం (హోస్పేట్‌) అనంతశయన ఆలయం నిర్మించాడు. ఎంతో సుందరమైన ఈ అనంతశయన ఆలయాన్ని ప్రస్తుతం ‘‘అనంత సేన గుడి’’ అని పిలుస్తున్నారు. “విజయనగరాన్ని రోమ్‌ వంటి మహానగరంతో తీసిపోనంత సుందరంగా ఉన్నట్లు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని దర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ‘డోమింగ్‌పేస్‌’ వర్ణించాడు.” (ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు-ప్రధాన దేవాలయాలు, పుట 66) హంపీలో నాగులకు ప్రభువైన విరూపాక్షునికి ఆలయమును విజయనగర సామ్రాజ్య ప్రారంభానికి ముందే నిర్మించటం ప్రారంభించారు. ఈ ఆలయ సముదాయంలో కొన్ని కట్టడాలను, మొదటి హరిహరరాయలు, కృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ ఆలయంలోనే హరిహరరాయలు, విద్యారణ్యస్వామికి గౌరవసూచకంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు. రాయలు తన పట్టాభిషేక సందర్భంలో ఈ ఆలయంలో రంగమండపాన్ని నిర్మించాడు. దేవాలయ గోపురమొక దానికి మరమ్మత్తులు చేయించి, తూర్పుద్వారంపై కొత్త గోపురాన్ని నిర్మించాడు. విరూపాక్ష స్వామికి నవ రత్నాలు పొదిగిన బంగారు తామర పుష్పాన్ని, ఒక సర్పహారాన్ని కూడా బహుకరించాడు. అంతేకాక ఆలయంలో జరిగే వసంతోత్సవాల సందర్భంగా రాయలు కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయుటయే కాక, తాను రచించిన ‘జాంబవతీ పరిణయం’ అనే నాటకాన్ని ప్రదర్శింపచేసేవాడు. ఈ ఆలయాన్నే ‘పంపావతీ ఆలయం’ అని కూడా అంటారు.

4. విఠలాలయ నిర్మాణం:

మహారాష్ట్రంలో పండరీక్షేత్రము విఠలేశ్వరుని నివాసస్థలం. విఠలేశ్వరుని భక్తులు వివిధ ప్రాంతాలలో భక్తి ప్రచారం చేస్తూ ఆంధ్రదేశంలో ప్రవేశించారు. వారి ప్రచారం వలన వేలాది ప్రజలు విఠలేశ్వరుని భక్తులైనారు. వారి కొరకు హంపీలో విఠలాలయం నిర్మించబడింది. ఇది రెండవ దేవరాయల కాలంలో ప్రారంభమైనా కృష్ణరాయల కాలంలో పూర్తి చేయబడి ఒకే రాతి చక్రాలతో కూడిన రథము, (ఏకశిలా రథము) సప్తస్వరాలు పలికే స్తంభాలున్న మండపం వంటివి వీరి శిల్పాకళానైపుణ్యానికి తలమానికం. ఏకశిలా రథము మహాబలిపురంలోని పల్లవ రాజులచే నిర్మించిన రాతి రథాలను పోలి ఉంటుంది. ఇది విజయనగర శిల్పాలన్నింటిలో విశిష్టమైనది. తాడిపత్రి దేవాలయంలో ఉన్న రథము కూడా ఇటువంటిదే. హజార రామస్వామి దేవాలయాన్ని రాజకుటుంబీకుల కోసం రాజ ప్రాసాదానికి దగ్గరలో నిర్మించారు. ఈ ఆలయంగోడలపైన రామాయణ, భాగవత దృశ్యాలు చిత్రించబడ్డాయి. గర్భాలయం వెలుపలి గోడపై రెండు బుద్ధ ప్రతిమలున్నాయి. దీన్ని బట్టి బౌద్ధమతం కూడా ఆదరించబడినట్లు తెలుస్తోంది. ఈ ఆలయం దక్షిణ హిందూ దేశంలో శ్రీరామ సంప్రదాయాన్ని తెలుపుతోంది.

5. కృష్ణాలయ నిర్మాణం:

రాయలు హంపీలో కృష్ణాలయాన్ని క్రీ.శ.1513లో నిర్మించాడు. రాయలు ఉదయగిరి కోటను స్వాధీన పరచుకున్న తరువాత అక్కడ లభించిన కృష్ణ ప్రతిమను ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మింపజేశాడు. గర్భాలయం, అర్ధమండపం, మహామండపాలతో అలరారుతున్న ఈ ఆలయం రాయల సౌందర్య పిపాసకు నిదర్శనం. రత్నాలు రాసులుగా పోసి అమ్మే వీథిలో ఉన్న ఈ ఆలయం శిథిలాలు మాత్రమే నేడు కనిపిస్తున్నాయి. క్రీ.శ. 1520లో రాయలు, తన తల్లి నాగాంబ జ్ఞాపకార్థం నాగలాపురమనే (హోస్పేట్‌) పట్టణాన్ని నిర్మించాడు. దాని సమీపంలో క్రీ.శ. 1528లో ఏకశిల నుండి చెక్కబడిన ‘నృసింహస్వామి భారీ విగ్రహం’ కృష్ణరాయల పాలనకొక స్మారక చిహ్నంగా చెప్పుకోవచ్చు. హంపీ శిథిలాలలో నేటికీ మన దృష్టిని ఆకర్షించే విగ్రహమిది.

6. రాయలు తిరుమల సందర్శన - ఆలయాభివృద్ధి:

శ్రీకృష్ణదేవరాయలు వేంకటేశ్వరస్వామికి తన మనస్సును అర్పించిన మహాభక్తుడు. తిరుమల తిరుపతిని ఏడుసార్లు దర్శించి, కానుకలు సమర్పించటమే కాకుండ తానురాసిన ఆముక్తమాల్యద గ్రంథాన్ని వేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. ఆలయ ఆవరణంలో శ్రీకృష్ణదేవరాయలు తన ఇద్దరు దేవేరులైన తిరుమలాంబ, చిన్నాంబ దేవతలతో ప్రతిష్టించుకున్న తామ్ర ప్రతిమలు నేటికీ దర్శనమిస్తాయి. ఇది ఆయన వైష్ణవ భక్తికి నిదర్శనం. తన కుమారునికి “తిరుమల రాయలు” అని పేరు పెట్టడంలో అతనికి తిరుమల వాసునిపై కల భక్తి భావమే కారణం కావచ్చు. రాయలు క్రీ.శ. 1513లో మూడుసార్లు తిరుపతి ఆలయాన్ని దర్శించి కానుకలు సమర్పించాడు. మొదటిసారి తన ఇద్దరు భార్యలతో సందర్శించి నవరత్న కిరీటాన్ని, ఇతర ఆభరణాలు సమర్పించాడు. తిరుపతి దర్శనం తరువాత కాళహస్తి కూడా దర్శించాడు. మలయప్ప, శ్రీదేవి, భూదేవులకు బంగారు కిరీటాలు, ఆభరణాలు సమర్పించాడు. ఐదు గ్రామాలు ఆలయానికి దానం చేశాడు. క్రీ.శ. 1514లో నాలుగవసారి తిరుమల ఆలయాన్ని దర్శించి, తిరువేంగళనాథునికి 30 వరహాలతో కనకాభిషేకం చేయించి, తాళ్లపాక గ్రామాన్ని దానం చేశాడు. తిరుమలలో పడికావలి గోపురం లోపలి మంటపాన్ని కృష్ణరాయలే నిర్మించటం చేత ఆ మంటపానికి కృష్ణరాయల మంటపమనే పేరు వచ్చింది. ఈ మంటపంలోనే రాయలు, ఆయన భార్యల కంచు విగ్రహాలుండటంవల్ల ఈ మంటాపాన్ని ప్రతిమా మంటమని కూడా అంటారు. క్రీ.శ. 1517లో గజపతులతో యుద్ధం చేసిన తరువాత ఐదవసారి తిరుమల దర్శించి 30 వేల బంగారు నాణేలతో తిరువెంగళనాథుని దివ్యవిమానానికి బంగారు పూతపూయించాడు. క్రీ.శ. 1518లో తన పెద్ద భార్య తిరుమల దేవితో కలిసి ఆరవసారి తన కుమారుడు తిరుమల రాయలు జన్మించిన సందర్భంగా, ఆ బిడ్డకు ఆయురారోగ్యాల్ని ప్రసాదించమని వేడుకోటానికి రాయలు తిరుమల వచ్చాడు. క్రీ.శ. 1522లో ఏడవసారి తిరుమల సందర్శించి, తిరువెంగళనాథునికి ఒక పీతాంబరాన్ని, ఆభరణాలకు 10వేల వరహాలను దానం చేశాడు. తిరుపతిలో మఠాల నిర్మాణానికి కూడా రాయలు దానం చేశాడు.

7. రాయలు చేసిన శైవాలయాల అభివృద్ధి:

రాయలు వైష్ణవాలయాలనే కాక, శివాలయాలను కూడా కట్టించి, అనేక దానాలు చేసినాడు. క్రీ.శ. 1513లో శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి ఆలయ తూర్పు గోపురం, దానికెదురుగాగల రథవీథి మంటపాలను నిర్మించాడు. గర్భాలయ ద్వారాలకు బంగారు రేకులను క్రీ.శ. 1529లో మంత్రి చంద్రశేఖరామాత్యుడు తొడిగించడమే కాక స్వామి కల్యాణమంటపాన్ని నిర్మించాడు. క్రీ.శ. 1515లో తూర్పు దిగ్విజయ యాత్ర సందర్భంగా అమరేశ్వర స్వామిని దర్శించి, తులాపురుష దానాన్ని, రత్నధేను, సప్త సాగర దానాన్ని చేశాడు. శ్రీకృష్ణదేవరాయలు తిరుపతికి వచ్చినపుడు శ్రీ కాళహస్తిని కూడా సందర్శించి మడి, మాన్యాలను నగ, నైవేథ్యాలను ఏర్పాటు చేసేవాడు. “క్రీ.శ. 1516లో రాయలు కాళహస్తి సందర్శించి, పశ్చిమం నుంచి తూర్పుకు విస్తరించేటట్లు వంద స్తంభాల మంటపాన్ని నిర్మించాడు. రాయలు అదే సంవత్సరంలో అహోబలం వెళ్లి, నరసింహస్వామిని దర్శించి ఒక కంఠభూషణం వజ్రాలు, పచ్చలు పొదిగిన పతకం, కంకణాలు, బంగారు పళ్లెం, 1000 వరహాలను దానం చేశాడు. అదే సంవత్సరం సింహాచలాన్ని దర్శించి, ఒక ఆలయాన్ని నిర్మించాడు. క్రీ.శ. 1517లో కంచి దర్శించి, వరద రాజదేవుని పుణ్యకోటి విమానానికి బంగారం పూయించి, ఐదు గ్రామాలు దానం చేశాడు. చిదంబరంలోని పొణ్ణంబలనాథాలయ ఉత్తర గోపురాన్ని నిర్మించాడు. చోళ మండలంలో శైవ వైష్ణవాలయాలకోసం 10వేల పొన్నులను దానం చేశాడు. క్రీ.శ. 1518లో కుంభకోణంలో 12 సంవత్సరాలకొకసారి జరిగే మహామిగం అనే ఉత్సవంలో పాల్గొని, పుష్కరిణిలో స్నానంచేసి, అనేక కానుకల్ని పంచాడు. క్రీ.శ. 1521 సంవత్సరం బెజవాడ కనకదుర్గాలయ శాసనం ప్రకారం రాయలు రాయచూర్‌లో రంగస్వామికి ఆలయం కట్టించాడు. గుంటూరుజిల్లా కాకాని దేవాలయం, కర్ణాటకలో తుముకూరు జిల్లాలో దేవరాయస దుర్గంలో కొండమీది కోటను, అందులోని యోగ నరసింహాలయాన్ని రాయలే నిర్మించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళంలో ఆంధ్రమహావిష్ణు ఆలయాన్ని కూడా దర్శించాడు. రాయలు ప్రతి విజయానంతరం, ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లి, అక్కడున్న దేవాలయాలకు విరివిగా దానాలు చేసినట్లు తెలుస్తోంది.” (ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు-ప్రధాన దేవాలయాలు, పుట 144) కృష్ణదేవరాయలేకాక అతని సామంతులు, ఉద్యోగులు కూడా ఆలయాలను నిర్మించారు. రాయల సోదరుడు, అచ్యుతరాయలు విఠలస్వామి దేవాలయాన్ని, పట్టాభిరామస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. పట్టాభిరాముని మందిరం సువిశాలమైన మండపంతో, పుష్కరిణులతో ఉండి, చూపరులకు విస్మయం కలిగిస్తున్నది. తిరుపతి క్షేత్రంలో భక్తుల కొరకై మండపాలను కట్టించాడు.

8. అనంతపురంజిల్లాలో రాయలు నిర్మించిన దేవాలయాలు:

అనంతపురం జిల్లాలో హిందూపురానికి తూర్పుదిశలో 12 కి.మీ. దూరంలో లేపాక్షి గ్రామం ఉంది. ఇచటి శ్రీ వీరభద్రేశ్వరాలయాన్నే లేపాక్షి దేవాలయం అంటారు. ఇదొక అత్యద్భుతమైన కళాఖండం. దీన్ని విజయనగర రాజయిన అచ్యుతరాయల కాలంలో (క్రీ.శ.1530 ప్రాంతం) పెరుంకొండ (పెనుగొండ) విరుపణ్ణ నిర్మించాడు. పాపనాశేశ్వరాలయం ఈయన కాలానికి పూర్తికాలేదని అంటారు. చిన్న చిన్న గుడులనన్నిటిని ఒక ప్రాకారంలోనికి చేర్చి విశాల మండపాలను నిర్మించి ఆలయ నిర్మాణానికి విరుపణ్ణ పూనుకొన్నాడు. విశాలమైన కల్యాణ, రంగమంటపాలను నిర్మించి, అందులో తన కులదైవమైన వీరభద్రస్వామిని ప్రతిష్టించినట్లుగా శాసనాలు తెలియజేస్తాయి. అయితే ఆలయ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. విరుపణ్ణ లేపాక్షి నందిలక్కుసెట్టి ముద్దమ్మల కొడుకు. తను వీరభద్రుడికి పలు గ్రామాలు సమర్పించడమే కాక, తన రాజు అచ్యుతరాయుడిచే కొన్ని గ్రామాలు దానం చేయించాడు.

9. లేపాక్షి దేవాలయం:

మరణావస్థలో ఉన్న జటాయువును చూసి శ్రీరామచంద్రుడు ‘లేపక్షి’ అని పిలవడంవల్ల ఈ క్షేత్రానికి ‘లేపాక్షి’ అని పేరు వచ్చిందని ఒక ఐతిహ్యం చెప్తుంది, అచ్యుతదేవరాయల ఆగ్రహానికి లోనై తనకు కలిగిన శిక్షావమానాన్ని భరించలేక విరుపణ్ణ తనకు తానే కండ్లూడబెరికికొని, వాటిని దేవాలయం గోడలకు విసరి కొట్టాడట. నేటికీ నేత్రాకారంలో ఉన్న రెండు గుంటలు, రక్తపు మరకలు ఈ ఆలయం గోడలమీద కన్పిస్తాయి. ‘పక్షి-లే’ వల్ల దీనికి ‘లేపాక్షి’ అన్న పేరు వచ్చిందని మరో ఐతిహ్యం చెప్తుంది.

లేపాక్షి దేవాలయానికి మంటపం, మహామంటపం, కల్యాణమంటపం ఉన్నాయి. మహామంటపం 66 స్తంభాలతో నిర్మించబడింది. స్తంభాలమీద పెక్కు మంది గాయనీ గాయకుల చిత్రాలు మనోహరంగా చెక్కబడ్డాయి. మహామంటపం పై కప్పు లోపలిభాగంమీద మహాభారత, రామాయణ కథలు రమణీయంగా చిత్రించబడ్డాయి. వీరభద్ర, శివ, వైష్ణ్వాలయాల ముఖమంటపాల మీద కూడ మహాభారత, రామాయణ కథలు చిత్రించబడ్డాయి. వీరభద్రస్వామి దేవాలయం గోడలమీద పార్వతీపరిణయం, శివతాండవం, శివుని జటాజూటంనుండి ప్రవహించే గంగానది అద్భుతమైన రంగుల్లో మనోహరంగా చిత్రించబడ్డాయి. వర్ణచిత్రాలన్నీ తెలుపు, నలుపు, పసుపు రంగుల్లో రచించబడ్డాయి. వీరభద్రాలయం చుట్టూ రెండు ప్రాకారాలు ఉన్నాయి. మొదటి ప్రాకారపు తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో మూడు ద్వారాలు ఉన్నాయి. ఇందులో ఉత్తర ద్వారం మాత్రమే తెరువబడింది. రెండవ ప్రాకారం లోపలే వీరభద్రాలయం నిర్మింపబడింది. లోపల ప్రవేశించగానే సప్తఫణి నాగేంద్రుడు మూడు చుట్టలుగా చుట్టుకొని మధ్య శివలింగాన్ని, పానవట్టాన్ని కలిగి ఉన్నాడు. ఈ నాగేంద్రుడికి చేరువలోనే ఆసీన విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంది.

వీరభద్రాలయానికి గర్భగృహం, అంతరాళం, ప్రదక్షిణాపథం ఉన్నాయి. ఈ ఆలయం ఉత్తరాభిముఖంగా నిర్మింపబడి వాస్తుశాస్త్రానికి విరుద్ధంగా కన్పిస్తుంది. ఈ దేవాలయంలో పాపనాశేశ్వరుడు, రాముడు, వీరభద్రుడు, దుర్గ - ఈ నలుగురు దేవతలు ఒకే స్థలంలో నేటికి ఆరాధింపబడుతూ ఉండడం ఒక విశేషం దేవాలయం వెలుపలి గోడలమీద సిరియాళుని కథ, కిరాతార్జునీయం చక్కగా చిత్రించబడ్డాయి.

లేపాక్షి దేవాలయంలో మనల్ని అమితంగా ఆకర్షించేది అక్కడి నాట్యమంటపం. రంభాశివుల నాట్యవిన్యాసదృశ్యం మైమరిపింప చేస్తుంది. స్తంభాలమీది నాట్యకత్తెల అభినయాలు, పద్మినీజాతి స్త్రీల అంగసౌష్ఠలు, కాలభైరవ, గణపతి, నటరాజ శిల్పాలు చూడమనోహరంగా ఉన్నాయి. ఇక్కడి స్తంభాలలో ఒకటి క్రింద ఏ ఆధారం లేకుండా పై నుండి వ్రేలాడుతూ ఉంటుంది. భూమికీ, స్తంభానికి మధ్య ఉన్న స్థలం నుంచి చేతి వస్త్రాన్ని అవలీలగా అటు ప్రక్కనుండి ఇటు ప్రక్కకు లాగవచ్చును. ఇది చాల వింత అనుభవం. ఈ స్తంభాన్ని ‘అంతరిక్ష స్తంభం’ అంటారు. ఇక్కడి కల్యాణ మంటపం 33 స్తంభాల సాయంతో నిర్మించబడింది. ఈ స్తంభాలమీద అష్టదిక్పాలకులు, ప్రముఖదేవతలు, మునుల శిల్పాలు చెక్కబడ్డాయి. వీళ్ళంతా శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి విచ్చేసినట్లు మలచబడి ఉండడం ఒక విశేషం. కల్యాణమంటపానికి పై కప్పు నిర్మించబడలేదు. కల్యాణనుంటపాన్ని అనుకొని లతామంటపం నిర్మించబడింది.

లేపాక్షి దేవాలయానికి రెండువందల గజాల దూరంలో బసవేశ్వరుడి ‘(‘జసపణ్ణ’ - నంది) విగ్రహం నాటి అద్భుత కళాకౌశల్యానికి నిదర్శనం. ఇది 20 అడుగుల ఎత్తును, 30 అడుగుల పొడవును కలిగి  ఉంటుంది. దీన్ని శిల్పులు అరగంటలో చెక్కారట, భోజనాలు రావడం ఆలస్యం కాగా ఆ మధ్య కాలాన్ని ఎందుకు వృధాపోనివ్వాలని ఆ శిల్పులు ఈ నందీశ్వరుని మలిచారని అంటారు. ‘లేపాక్షి బసవయ్య లేచిరావయ్య’” (ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు- ప్రధాన దేవాలయాలు, పుట-161)అని పిలిపించుకొనే ఈ నందీశ్వర విగ్రహం. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదిగా చెప్పబడుతోంది.

10. రామలింగేశ్వరాలయం - తాడిపత్రి:

అనంతపురంజిల్లాలో గుంతకల్లుకు 55 కి.మీ. దూరంలో తాడిపత్రి పట్టణం ఉంది. ఇది నాటి శిల్పకళా నైపుణ్యానికి తార్కాణం. ఈ దేవాలయ ప్రాంతాన్ని పూర్వం ‘భాస్కరక్షేత్రం’ అనేవారట. దీనికి దక్షిణ భాగంలో దట్టమైన అరణ్యంలో తాడిచెట్లు అమితంగా ఉండేవనీ, అందువల్లనే ఈ ప్రాంతానికి తామ్లపల్లి (తాటివనం)” (ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు- ప్రధాన దేవాలయాలు, పుట-61) అనే పేరు వచ్చిందనీ అంటారు. “శక 1120 లో సోమదేవ కంచలదేవి కుమారుడు ఉదయాదిత్య రాజు తుటిపురంను నిర్మించాడు” అని (ఎస్‌.ఎస్‌.ఐ.4-788) శాసనం చెపుతుంది. ఈ ప్రాంతమే ప్రౌఢ దేవారాయని కాలంలో పెమ్మసాని రామలింగనాయకుడిచే తాడిపత్రిగా పిలువబడింది.

రామలింగేశ్వరాయం చుట్టూ ఉత్తర, దక్షిణ పశ్చిమ దిశలలో మూడు గోపురాలు ఉన్నాయి. అయితే దక్షిణ గోపురం బాగా దెబ్బతినింది. తూర్పు వైపున గోపురం నిర్మాణం కాలేదు. దక్షిణ గోపురమే నేడు ఆలయముఖద్వారంగా ఉంది. ఈ గోపురం ద్వారం లోనికి ప్రవేశిస్తే ప్రధానాలయం కన్పిస్తుంది. ఇందులో గర్భగుడి, అంతరాళం, ముఖమండపం ఉన్నాయి. గర్భగుడి మీద ద్వితల విమానం ఉంది. గర్భాలయం నడుమ రుద్రపీఠం (సోమసూత్రం) మీద శివలింగం ఉంది. ఇది స్వయంభువు అంటారు. గర్భగుడి గోడలమీద అనేక శిల్పాలు ఉన్నాయి. ముఖమండపానికి రెండువైపులా ద్వారపాలకుల విగ్రహాలు. ఉన్నాయి. అంతరాళానికి ఎదురుగా నందీ విగ్రహం ఉంది. మండపానికి చేరువలో నవగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. గర్భాలయానికి దక్షిణంగా శ్రీరామ మందిరం, పార్వతీదేవి మందిరం ఉన్నాయి. ఈ రెండు మందిరాలకు ఒకే ముఖమండపం ఉంది. ఇక్కడి శివలింగం అడుగుభాగంలో పూర్వం ‘బుగ్గ’ ఊరుతూ ఉండడం వల్లనూ, రామలింగ నాయకుడు నిర్మించడం వల్లనూ ఈ ఆలయానికి ‘బుగ్గరామ లింగేశ్వరాలయం’ అనే పేరు వచ్చిందని భావించవచ్చు. బుగ్గరామలింగస్వామి ఆలయం నల్లనిరాతి (బొగ్గురంగు) లో కట్టబడింది కాబట్టి బొగ్గు. బొగ్గ - బుగ్గ అయిందని ప్రతీతి. నరసనాయకుని ముగ్గురు కొడుకులు వీరనరసింహ, కృష్ణదేవరాయ, అచ్యుతరాయల కాలంలో రామేశ్వరాలయం బహువిధ పోషణ పొందినది.

11. ముగింపు:

ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో అనేక దేవాలయాలను నిర్మించి, పరమత సహనాన్ని పాటించాడు. కొత్త దేవాలయాలను నిర్మించి, పాత దేవాలయాలు బాగు చేయించి, ఆలయ నిర్మాణాన్ని ఆదరించాడు. అలా ఆలయాలను నిర్మించి అంతటితో ఆగిపోకుండా ఆ ఆలయాల నిర్వహణకు అవసరమైన నిధుల ఏర్పాటుకై కొంత మాన్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.  ఆలయ నిర్మాణాభివృద్ధి రాయలు చేసినంతగా మరే యితర చక్రవర్తులు చేయలేదని చెప్పవచ్చు. రాయలానంతర రాజులు ఆవిధంగా ఎందుకు చేయలేకపోయారనేది ప్రశ్న. చేస్తే ఎంతవరకు చేశారనేది భావిపరిశోధకులు తేల్చాల్సిన అంశం. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ కె.సి.ఆర్. తెలంగాణాలోని యాదగిరి నరసింహస్వామి ఆలయం, భద్రాద్రి రామాలయం, చిలుకూరి బాలాజీ ఆలయాల పునర్ధుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టి వాటిని మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. నా ఈ పరిశోధన వ్యాస పఠనానంతరం భావి పరిశోధకులు వివిధ ఆంధ్ర రాజుల కాలాలనాటి దేవాలయాల నిర్మాణం, అభివృద్ధి, బాగోగులు గురించిన ఆయా రాజుల కృషిని పరిశోధనకు ఎంచుకొని వారి పరిశోధనలను కొనసాగించడానికి ఈ వ్యాసం ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నాను.

12. ఉపయుక్తగ్రంథసూచి:

  1. నరసింహం, కె.వి.ఆర్. (1975). ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధనలు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్ అండ్ పబ్లికేషన్స్, విశాఖపట్టణం.
  2. ప్రతాపరెడ్డి, సురవరం (1992) ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సాహిత్య వైజయంతి ప్రచురణ, హైదరాబాద్‌.
  3. బలరామమూర్తి, ఏటుకూరి. (1989). ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
  4. బాలగోపాల్, కె. (1986). ప్రాచీన భారతదేశ చరిత్ర. హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్.
  5. మోహన్‌, జి.ఎస్‌. (2015) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు-ప్రధాన దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
  6. రామారావు, తణుకు. (1956) విజయనగర సామ్రాజ్యము, గౌతమీ కళాపరిషత్తు, ఆత్రేయపురము, తూర్పుగోదావరిజిల్లా.
  7. రామచంద్రయ్య చౌదరి, దుగ్గిరాల. (1914). విజయనగర సామ్రాజ్యము. విజ్ఞాన చంద్రికా మండలి, మద్రాసు.
  8. లక్ష్మీరంజనం, ఖండవల్లి (1957) ఆంధ్రుల చరిత్ర సంస్కృతి. బాలసరస్వతీ బుక్ డిపొ, కర్నూలు.
  9. వెంకటరామారావు, జి. (1990) భారతదేశ చరిత్ర ప్రధాన సంఘటనలు, సౌభాగ్యలక్ష్మి ప్రెస్. తెనాలి.
  10. వెంకటసుబ్బయ్య వల్లంపాటి (అను). (2002). ప్రాచీన భారతదేశ చరిత్ర. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]