headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797

6. కథల్లో అర్థాలంకారాల అనువాదం: పద్ధతులు

dr_b_bhujangareddy
డా. బాణాల భుజంగరెడ్డి

అసిస్టెంట్ ప్రొఫెసర్,
తెలుగుశాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ,
హైదరాబాద్. తెలంగాణ.
సెల్: +91 9493976813. Email: bbreddy65@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఏ భాషలోనుంచి ఏ భాషలోనికైనా అలంకారాలను అనువదించడం అంత సులభం కాదు. భాషకూ, సమాజానికీ, సంప్రదాయాలకూ, అనువాదానికీ విడదీయరాని సంబంధం ఉంది. ఒక భాషలోని అలంకారాలు ఆ భాషా వ్యవహర్తల పరిసరాలూ, ఆచారాలూ, అలవాట్లూ, నమ్మకాలూ, సంప్రదాయాలపై ఆధారపడి వుంటాయి. నిత్యం మంచు కురిసే ప్రాంతంలో మాట్లాడే భాషలో మంచును ఉపమానంగా గ్రహించే కవిసమయం ఉంటుంది. ఉదా: as white as snow. ఈ ఉపమానం ఎడారి ప్రాంతంలో మాట్లాడే భాషలో ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఎట్లా అనువాదం చెయ్యాలి అనే సమస్య తలెత్తుతుంది. అలంకారాల అనువాద పద్ధతులను గురించి Eugene A Nida, భోలానాథ్ తివారీ లాంటి అనువాదవేత్తలు తమ అనువాద సిద్ధాంత గ్రంథాల్లో తెలిపారు. వీరు తెలిపిన అలంకారాల అనువాద పద్ధతుల నేపథ్యంలో తెలుగు కథల్లోని అలంకారాలను ఇంగ్లీషు, హిందీ భాషల్లోనికి అనుదించిన అనువాదకులు అనుసరించిన పద్ధతులను విశ్లేషించడమే ప్రస్తుత వ్యాస ఉద్దేశం.

Keywords: అలంకారం, అర్థాలంకారం, అనువాదం, భాషాంతరీకరణ, కథలు, భుజంగరెడ్డి.

1. ఉపోద్ఘాతం:

అబ్బూరి ఛాయాదేవి రచించిన ‘‘సుఖాంతం’’, పి. సత్యవతి రచించిన ‘‘ఇల్లలకగానే’’, ఓల్గా రచించిన ‘‘తోడు’’ కథలను మూలభాషాపాఠాలుగా తీసుకొని, వీటిని ఇంగ్లీషులోకి అనువదించిన రాయప్రోలు శ్రీనివాస్, కల్లూరి శ్యామల, వాడ్రేవు విజయలక్ష్మి, అనువాదాలనూ - జె.ఎల్. రెడ్డి, ఇలపావులూరి పాండురంగారావు, శ్రీదేవి, పోలి విజయరాఘవరెడ్డి అనువదించిన హిందీ అనువాదాలను విశ్లిషించి అలంకారాల అనువాదాల్లో వాళ్లు అనుసరించిన పధ్దతులను వివరించడం జరిగింది. అలంకారాల అనువాదంలో అనువాదకులు ఎంతవరకు సఫలమయ్యారో, ఎక్కడ విఫలమయ్యారో ఈ వ్యాసంలో వివరించడం జరిగింది.

అలంకారాలు రెండు రకాలు. 1. శబ్దాలంకారాలు, 2. అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు పాఠకునికి శ్రవణ మాధుర్యాన్ని కలిగిస్తే, అర్థాలంకారాలు పఠనాసక్తిని కలిగిస్తాయి. రచయిత చెప్పదలచుకున్న విషయాన్ని సమగ్రంగా, సంక్షిప్తంగా, స్పష్టంగా చెప్పడానికి ఉపయోగపడతాయి. శబ్దాలంకారాలు ‘ధ్వని సామ్యం’ మీద ఆధారపడతాయి. ఏ రెండు భాషల్లోనూ ఒకే అర్థాన్ని వ్యక్తం చేసే పదాల మధ్య 'ధ్వనిసామ్యం' ఉండదు కాబట్టి శబ్దాలంకారాలను అనువదించడం సాధ్యం కాదు. ఇక్కడ అర్థాలంకారాల అనువాద పద్ధతులను పరిశీలించడం జరుగుతుంది.

2. అలంకారానువాదాలు- పద్ధతులు:

అలంకారాల అనువాదంలో అనుసరించే మూడు పద్ధతులను Nida తెలిపారు. అవి: 1. అలంకారాన్ని అలంకార రహితంగా (వివరణాత్మకంగా) అనువదించడం. 2. ఒక అలంకారాన్ని మరొక అలంకారంగా అనువదించడం. 3. నిరలంకార అభివ్యక్తిని అలంకారంగా అనువదించడం (Nida 1969 : 107). ఇవి కాక మూల భాషలోని ఒక అలంకారాన్ని లక్ష్య భాషలో అదే అలంకారంగా అనువదించే పద్ధతి కూడా వుంది. ఉదా : ఆశాకిరణం ray of hope - ఆశాకిరణ్. ఈ పద్ధతిని Nida పేర్కొనలేదు. కాని, ఈ పద్ధతి సాధ్యంకానప్పుడు మాత్రమే పైన పేర్కొన్న మూడు పద్ధతులను అనుసరించాలని Nica సూచించినట్లు అనిపిస్తున్నది.

ఒక భాషలోని ఒక అలంకారాన్ని మరో భాషలో అదే అలంకారంగా అనువదించడం అన్ని సందరాల్లో సాధ్యం కాదు. ఒక భాషలోని అలంకారాన్ని అర్థవంతంగా మరో భాషలో అదే అలంకారంగా అనువదించాలంటే ఈ కింది పరిస్థితులు ఉండాలి. (తివారీ, మహేంద్రి చతుర్వేది 1993 : 61,62)

  1. మూలభాషలోని అలంకారం - లక్ష్య భాషలో కూడా ఉండాలి. (ఉపమ - simile అతిశయోక్తి Hyperbole రూపకం - metaphor etc.).
  2. మూలభాషలో ఉన్న ఉపమానమే లక్ష్య భాషలోనూ ఉండాలి.
  3. ఉపమానం మూల, లక్ష్యభాషల్లో ఒకే భావాన్ని వ్యక్తం చేయాలి.

మూలభాషలో ఉన్న అలంకారం లక్ష్య భాషలో లేకుండా అలంకారాన్ని అదే అలంకారంగా అనువదించడం సాధ్యం కాదు. మూల భాషలో ఉపమానంగా తీసుకున్న వస్తువు లక్ష్య భాషలో లేనట్లయితే ఒక అలంకారాన్ని అదే అలంకారంగా అనువదించలేం. ఉపమానంగా ఏ వస్తువును గ్రహించాలనేది ఆయా భాషల భౌగోళిక, సాంస్కృతిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీషులోని as white as snow అనే పోలికను తెలుగులోకి అదే ఉపమానంతో అనువదించలేం. తెలుగు ప్రాంతంలో snow ఉండదు కాబట్టి.

కొన్నిసార్లు మూలభాషలో ఉపమానంగా తీసుకున్న వస్తువు లక్ష్య భాషా ప్రాంతంలో ఉన్నప్పటికీ దాన్ని ఉపమానంగా గ్రహించే అలవాటు లేనట్లయితే దాన్ని అనువదించలేం. ఉదా : ఇంగ్లీషులోని as cool as cucumber అన్న ఉపమాలంకారంలో cucumber  (దోసకాయ) తెలుగువారికి పరిచితమైన వస్తువైనా దాన్ని ఉపమానంగా ఈ అర్థంలో వాడే అలవాటు లేనందువల్ల ఈ అలంకారాన్ని 'దోసకాయంత చల్లగా ” అని అనువదించలేం. ఒకే ఉపమానం మూల, లక్ష్య భాషల్లో వేరు వేరు అర్థాలలో వాడుకలో ఉన్నప్పుడు కూడా మూల భాషలోని అలంకారాన్ని లక్ష్య భాషలో అదే అలంకారంగా అనువదించడం సాధ్యం కాదు. ఉదాహరణకు -

హిందీలో గుడ్లగూబ (ఉల్లూ) ను మూర్ఖత్వానికి ఉపమానంగా వాడుతారు. "వహ్ ఉల్లూ హై" అనే రూపకాలంకారానికి “వాడు వట్టి మూర్ఖుడు" అని అర్థం. ఇంగ్లీషులో గుడ్లగూబను (హిందీ పద్ధతికి విరుద్ధంగా) తెలివితేటలకు చిహ్నంగా వాడుతారు. He is as wise as an owl/ He is wise as an owl. ఇక తెలుగులో గుడ్లగూబను పై రెండు అర్థాల్లో ఏ అర్థంలోనూ ఉపయోగించే ఆచారం లేదు. కాబట్టి మూల భాషలోని అలంకారాన్ని లక్ష్య భాషలో కూడా అదే అలంకారంగా అనువదించడం క్లిష్టమైన పని అని తెలుస్తుంది.

ఒక అలంకారాన్ని అదే అలంకారంగా అనువదించడం సాధ్యం కానప్పుడు Nida సూచించిన మూడు పద్ధతుల్లో మొదట, అలంకారాన్ని మరొక అలంకారంగా అనువదించాలి. ఇది కూడా సాధ్యం కానప్పుడు అలంకారాన్ని అలంకార రహితంగా వివరణాత్మకంగా అనువదించాలి. అలంకారాన్ని అనువదించకుండా వదిలేసినట్లయితే మూ రచనలోని సౌందర్యం నశిస్తుంది. పాఠకునిలో పఠనాసక్తిని కలిగించలేకపోతుంది. కాబట్టి, అలాంటి అనువాదాలు విఫలమైనట్లే.

Peter Newmark రూపకాలంకారాన్ని అనువదించే పద్ధతులను తెలుపుతూ, మూలంలోని అలంకారాన్ని తొలగించడం (deletion) కూడా ఒక పద్ధతిగా పేర్కొన్నారు. (Newmark 1981 : 91) అయితే, మూల రచనలో అనవసరమైన అలంకారంగా అనువాదకుడు భావించినప్పుడే దాన్ని తొలగించాలని ఆయన సూచించడం గమనార్హం.

3. మూలకథల్లో అలంకారాలు – అనువాదవిధానం:

ఈ నేపథ్యంలో కథల అనువాదంలో అనువాదకులు మూలకథల్లోని అలంకారాలను అనువదించిన విధానాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

  1. అర్థరాత్రి వరకు ప్రణయలోకంలో విహరించి అలసి సొలసి పడుకున్న దానికి పొద్దున్నే పాలవాడి కేక యముని రాకలాగే తోచేది నాకు. (సుఖాంతం : 187)

Till midnight I'd be revelling in my husband’s embrace. And then a little bit of tossing in bed. And then my ears would be shattered by the milkman's call. (Happy Ending -1: 60)

I used to live in a world of heavenly romance till late in the night and go to sleep in a tired state only to get up early in the morning again to attend the call of the milkman which used to be like that of Lord Yama to me. (Happy Ending -2: 187)

ఆధీ రాత్ తక్ ప్రేమ్ కీ దునియా మే విచరణ్ కర్కే థకీ - మాందీ పడీ రహతీ థీ తో సబేరే దూద్ వాలే కీ అవాజ్ సే ముఝే యమ్ రాజ్ కే ఆకార్ కా ఆభాన్ హో జాతా థా | (సుఖాంత్ -1 : 184-185)

ఆధీ రాత్ తక్ ప్రణయ్ లోక్ మే విచరణ్ కర్కే థకీ - హారీ ముఝే సబేరే హీ దూద్ వాలే కీ పుకార్ యమ్ రాజ్ కే ఆహ్ వాన్ జైసీ లగ్తీ | (సుఖాంత్ - 2 : 119)

  1. ఈ లోపల పనిమనిషి వచ్చి "అమ్మా" అంటూ దూడలా అరిచేది. (సుఖాంతం: 188)

(రాయప్రోలు శ్రీనివాస్ గారు ఈ అలంకారాన్ని అనువదించలేదు.)

Then would come the maid to do the evening work calling out loudly " amma " like a buffalo. (Happy Ending-2:55) 11

ఇతనే మే " మాజీ " కహకర్ నౌకరానీ కీ బైన్స్ కీ – సీ అవాజ్ సునా ఈ దేతీ | (సుఖాంత్ -1 : 185)

తభీ కామ్ వాలీ " మాఁజీ " కహకర్ బచ్ డే కీ తరహ రంభాతీ ....... (సుఖాంత్ - 2 : 119)

  1. అప్పుడా ఇల్లాలిని దాహంతో ఆర్చుకుపోయి, ఎండిపోయి ప్రాణం పోవడానికి సిద్ధపడిన వాడికి కొత్త కూజాలో నీళ్ళు చెంచాతో నోట్లో పోసి బ్రతికించిన చందంగా బ్రతికించింది - ఆ స్నేహితురాలు. (ఇల్లలకగానే : 28)

The housewife felt like a thirsty man, parched totally and dried up, about to die-getting a drink of water from the fresh kooja (goglet) Poured into his mouth with a spoon and given thus a new life. The friend indeed gave her a new life. (What is my name: 157)

జైసే లూ సే ఝుల్ సే , ప్యాన్ సే సూఖే ఔర్ మరణాసన్న్ వ్యక్తి కో కోఈ నఈ సురాహీ రా పానీ చమ్మచ్ సే ముఁ హ్ మే డాల్ కర్ జీవన్ దాన్ దే, వైసే హీ ఉస్ సహేలీ నే ఇసే జీవన్ దాన్ దియా | (మై కౌన్ హూఁ : 48)

ఉస్ వక్త్ గృహిణీ కో ఏసే లగా మానో రేగిస్తాన్ మే బటక్ తే ఇన్ సాన్ కో సముద్ర్ మిల్ గయా హై (పహచాన్ : 53)

  1. నువ్వు లేవు - ఇల్లు చూడెలా ఉందో... సత్రంలా ఉంది. (ఇల్లలకగానే : 29)

You have not been here - look at the state of the house - It’s like a choultry. (158)

తుమ్ నహీ థీ - ఘర్ కో దేఖో కైసే హో గయా హై - సరాయ్ లగ్ నే లగా (మై కౌన్ హూ : 48)

తుమ్ నహీఁ థీ | దేఖో తో ఘర్ కీ క్యా హాలత్ హో గఈ హై | మేలే కీ తరహ హో గయా హై | (54)

  1. దాన్ని ఎలా పట్టుకోవాలో కూడా తెలియని గంగాధరం వెంటనే తిరిగిచ్చేశాడు. చంటి పిల్లాడిని ఎత్తుకోవడం చేతకానివాడు తల్లికి తిరిగి ఇచ్చేసినట్లుగా. (తోడు : 5)

Gangadharam who didn't know how even to hold it, gave it back to her immediately just as a man who didn't know how to hold a baby would return it to its mother. (Companionship:73)

గంగాధరమ్ నే, జో యహ్ బీ నహీఁ జాన్తా కీ ఉసే కిస్ తరాహ సే పకడ్నా హై, వయొలిన్ ఉసే ఇన్ తరహ లౌటా దియా, జైసే కోఈ చోటే బచ్చే కో హాథ్ మే ఉటానా నహీఁ బాస్తా సో బచ్చే కో మాతా కో లౌటా దేతా హై (సమారా : 108)

  1. నేను వచ్చిన రోజు ఇల్లు వల్ల కాడులా ఉంది. (తోడు: 9)

The day I arrived; the house looked like a graveyard. (Companionship: 78):

జిస్ దిన్ మై ఆఈ, సారా ఘర్ ఖబ్ రస్తాన్ సా థా | (సహారా : 111)

  1. గంగాధరం ముఖం చెక్కు తీసిన బీట్రూట్ దుంప అయ్యింది. (తోడు : 11)

Gangadharam's face turned red like a peeled beet root. (Companionship: 80)

గంగాధరమ్ కో చెహరా బదల్ గయా, జైసే ఛిల్కా ఉతారా హువా చుకందర్ హో | (సహారా : 112)

  1. "ఇంతకూ నే చెప్పొచ్చేదేమిటంటే - ' అనాథ ' అనే మాట భర్త చనిపోయిన ఆడవాళ్ళ విషయంలో నిజం కాదు. నిజమైన అనాథలు భార్యలు పోయిన మగవాళ్ళే నవ్వింది విజయలక్ష్మి (తోడు : 8)

All that I want to say is that the world' orphan' is not apt for woman who have lost their husbands. Men who have lost their wives are the real orphans, laughed Vijayalakshmi (Companionship: 76)

"మేరే కహనే కా తాత్పర్యు యహ్ హై కీ 'అనాథ్' శబ్ద విద్వా ఔరత్ కే లియే ఉప్ యుక్త్ నహీఁ హై వాస్త్ విక్ అనాథ్ తో వే పుర్ష్ హై, జిన్ కి పత్నీయోం కీ మృత్యు హో గఈ హో" కహ కర్ విజయలక్ష్మీ హఁస్ నే లగీ |” (సహారా :110)

4. ఉదాహరణల్లో అలంకారాల అనువాద స్వరూపం – స్పష్టత, ప్రయోజనాలు:

పైన పేర్కొన్న మొదటి ఉదాహరణలో తెలుగులోని 'పాలవాడి కేక యముడి రాకలా తోచేది' అన్న ఉపమాలంకారాన్ని రాయప్రోలు శ్రీనివాస్ గారు తన ఆంగ్లానువాదంలో అలంకార రహితంగా అనువదించారు. దీనివల్ల మూల భాషలోని ఉపమాలంకారం ద్వారా వ్యక్తమవుతున్న అనుభూతి లక్ష్య భాషలో వెల్లడి కావడంలేదు. అలంకార ప్రయోజనం దెబ్బతిన్నది.

తెలుగు కథలోని ఈ అలంకారాన్ని కల్లూరి శ్యామలగారు ఆంగ్లంలో యథాతథంగా అనువదించి మూలరచనకు న్యాయం చేశారు. హిందీ అనువాదం-1లో పాండురంగారావు గారు మూలభాషాకథలోని ఉపమాలంకారాన్ని హిందీలో ఉపమాలంకారంగా అనువదించబోయి విఫలం చెందారు. ఈయన 'యముడి రాక' ను 'యముడి ఆకారం ' గా మార్చి అనువదించారు. ఈ అభివ్యక్తిలో మూలంలోని సృష్టత లోపించింది.

జె. ఎల్. రెడ్డి గారు తెలుగుకథలోని ఉపమాలంకారాన్ని హిందీలో ఉపమాలంకారంగా చక్కగా అనువదించడమే కాక మూలభాషలోని అలంకారంలో ఉన్న లోపాన్ని సవరించారు. మూల రచనలోని పాలవాడి కేక యముడి రాకలా తోచేది 'అన్న అలంకారాన్ని ‘పాలవాడి కేక యముడి పిలుపులా తోచేది' అని సవరించడం అర్థవంతంగా ఉంది.

రెండో ఉదాహరణలో, “పని మనిషి వచ్చి 'అమ్మా' అంటూ దూడలా అరిచేది” అన్న తెలుగు ఉపమాలంకారాన్ని రాయప్రోలు శ్రీనివాస్ గారు ఆంగ్లంలో అనువదించకుండా వదిలేశారు. దీనివల్ల మూల కథలోని భావానికి నష్టం వాటిల్లింది.

కల్లూరి శ్యామల గారు మూల భాషా కథలోని ఉపమాలంకారాన్ని ఆంగ్లంలో సమానమైన ఉపమాలంకారంగా అనువదించారు. శ్యామల గారిలాగే హిందీ అనువాదకులు ఇద్దరూ తెలుగు కథలోని ఉపమాలంకారాన్ని సమానమైన ఉపమాలంకారంగా అనువదించారు.

మూడో ఉదాహరణలో, తెలుగు కథలోని ఉపమాలంకారాన్ని ఆంగ్లంలో వాడ్రేవు విజయలక్ష్మిగారు, హిందీ మొదటి అనువాదంలో జె. ఎల్. రెడ్డి గారు ఉపమాలంకారంగానే బాగా అనువదించారు.

'పహచాన్' అనే హిందీ అనువాదంలో ఎల్. శ్రీదేవి గారు తెలుగు కథలోని ఉపమాలంకారాన్ని ఉపమాలంకారంగానే అనువదించినా, హిందీలోని ఉపమాలంకారం అర్థవంతంగా లేదు. తన స్నేహితురాలు తనను కలవగానే ఆ గృహిణికి ఎడారిలో తిరుగుతున్న వాడికి సముద్రం దొరికినట్లుగా అనిపించిందని శ్రీదేవి గారు అనువదించారు. కాని, ఉపమానం అర్థవంతంగా లేదు. ఎడారిలో తాగడానికి నీళ్ళే దొరకకపోతే, సముద్రంలో నీళ్ళున్నా అవి తాగడానికి పనికిరావు. కాబట్టి సముద్రంలో నీళ్లున్నా లేనట్టే లెక్క. సముద్రం బదులు ఒయాసిస్సును ఉపమానంగా గ్రహించివుంటే అనువాదం అర్థవంతంగా ఉండేది.

నాలుగో ఉదాహరణలో తెలుగులోని 'సత్రంలా ఉంది' అనే పోలికను వాడ్రేవు విజయలక్ష్మిగారు ఇంగ్లీషులో, జె.ఎల్.రెడ్డిగారు హిందీలో సమానమైన అలంకారంగా అనువదించగా 'పహచాన్' అనే హిందీ అనువాదంలో 'మేలే కీ తరహ్' అని అనువదించారు. కాని ఇది అంత ఉచితంగా అనిపించడంలేదు.

ఐదో ఉదాహరణలో, తెలుగులోని ఉపమాలంకారాన్ని అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్ గార్లు ఆంగ్లంలోనూ పోలి విజయరాఘవరెడ్డి గారు హిందీలోనూ ఉపమాలంకారంగానే అనువబంచారు. అయితే ఆంగ్లానువాదంలోని వాక్యంలో even అనే పదాన్ని సరైనా స్థానంలో ప్రయోగించలేదు.

ఆరో ఉదాహరణలో తెలుగు కథలోని ఉపమాలంకారాన్ని ఇంగ్లీషులోనూ, హిందీలోనూ ఉపమాలంకారం గానే అనువదించారు. ఏడో ఉదహరణలో తెలుగు కథలోని ముఖం చెక్కు తీసిన బీట్ రూట్ దుంప అయ్యింది. అనే రూపకాలంకారాన్ని ఇంగ్లీషులో, హిందీలో ఉపమాలంకారంగా మార్చి అనువదించారు. ఈ మార్పు వల్ల మూల భాషలోని అభివ్యక్తికి నష్టమేమి జరుగలేదు.

చివరి ఉదాహరణలో తెలుగు కథలోని 'అనాథ' అనే పదానికి 'తల్లీదండ్రులు లేని వ్యక్తి', 'నాథుడులేని స్త్రీ/విధవ' అనే రెండర్థాలున్నాయి. కాబట్టి ఇది శ్లేషాలంకారం. ఈ పదానికి సమానార్థకంగా ఇంగ్లీషులో వాడిన orphan అనే పదానికి రెండర్థాలు లేవు. కాబట్టి తెలుగులోని శ్లేషాలంకారం ఇంగ్లీషు అనువాదంలో ప్రతిబింబించలేదు. హిందీ అనువాదంలో వాడిన 'అనాథ్' పదానికి కూడా రెండర్థాలున్నాయి. కాబట్టి తెలుగులోని శ్లేషాలంకారం ఈ అనువాదంలో వచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో ఉన్న కామన్ ఒకాబ్యులరీ వల్ల ఇది సాధ్యమైంది.

5. ముగింపు:

ఈ విధంగా తెలుగు మూలకథల్లోని అర్థాలంకారాలు కొందరు ఆయా భాషలలోకి అనువదించినప్పుడు వివిధ పద్ధతులను అనువదించారని స్పష్టమౌతోంది. కొందరు అనువదించకపోవడం, కొన్ని అలంకారాలను చక్కగా అనువదించడం, కొందరు ఒక అలంకారాన్ని మరో అలంకారంగా మార్చి అనువదించండం వంటివి చోటుచేసుకున్నాయని గమనించవచ్చు. కొందరు తమ అనువాదాలలో మూలకథల్లోని అలంకారానికి సరైన న్యాయంచేయగా, కొందరు ఆయా మూలకథల్లోని అలంకారాలను సమర్థంగా అనువదించడంలో విఫలమయ్యారని తెలిస్తోంది. కథల్లోని అలంకారాలు పాఠకుణ్ణి ఆకట్టుకోవడంలో కథనంలో ప్రముఖపాత్ర వహిస్తాయి కాబట్టి ఆయా మూలాభాషాసౌందర్యాన్ని భంగం కలగకుండా కథానువాదకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

6. ఉపయుక్త గ్రంథ సూచి:

తెలుగు గ్రంథాలు:

  1. ఓల్గా, 1995.‘‘తోడు’’ ప్రయోగం: రాజకీయ కథలు - 2, హైదరాబాద్: మానవి ప్రచురణలు
  2. ఛాయాదేవి, అబ్బూరి. (తృ.ము.) “సుఖాంతం” కథాభారతి: తెలుగు కథానికలు. న్యూఢిల్లీ : నేషనల్ బుక్ ట్రస్ట్
  3. సత్యవతి, పి. “ఇల్లలకగానే " ఇల్లలకగానే... సత్యవతి కథలు. హైదరాబాద్: రచయిత్రి

హిందీ గ్రంథాలు:

  1. తివారీ, భోలానాథ్ అనువాద్ విజ్ఞాన్. దిల్లీ: శబ్దకార్ (ప్రకాశక్)
  2. తివారీ, భోలానాథ్, మహేంద్ర చతుర్వేది. కావ్యానువాద్ కీ సమస్యాయేఁ. దిల్లీ: శబ్దకార్ (ప్రకాశక్)
  3. పాండురంగారావు, ఇలపావులూరి. ‘‘సుఖాంత్’’ తెలుగు కహాఁనియాఁ. సంపా. పురాణం సుబ్రహ్మణ్య శర్మ. దిల్లీ: నేషనల్ బుక్ ట్రస్ట్
  4. రెడ్డి, జె.ఎల్. ‘‘సుఖాంత్’’ భాషా. జూలై-ఆగస్త్ 1997
  5. రెడ్డి, జె. ఎల్. “మై కౌన్ హూఁ’’ సమకాలీన్ భారతీయ సాహిత్య్. నఈ దిల్లీ: సాహిత్య అకాడమీ. జులై - సితంబర్, 1995
  6. విజయరాఘవరెడ్డి, పి. “సహారా’’ అనువాద్. నఈ దిల్లీ: భారతీయ్ అనువాద్ పరిషద్ జనవరి-జూన్,1995
  7. శ్రీదేవి, ఎల్. “పహచాన్’’ సమకాలీన్ భారతీయ సాహిత్య్. నఈ దిల్లీ: సాహిత్య అకాడమీ, సితంబర్ – అక్తూబర్, 1999

ఆంగ్ల గ్రంథాలు:

  1. Nida, Eugene A., and Charles R. Taber. 1974 edition. The Theory and Practice of Translation. Leiden: E.J. Brill (First edition 1969)

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]