headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797

5. నూతనసాహిత్యసంస్కృతి, అంతర్జాలసాహిత్యం: సామాజికమాధ్యమాలు

dr_venkata_ramaiah
డా. వెంకట రామయ్య గంపా

తెలుగు సహాచార్యులు,
ఆధునిక భారతీయభాషలు మరియు సాహిత్యాధ్యయనశాఖ,
ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ - 110007
సెల్: +91 9958607789. Email: gvramaiah@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

అంతర్జాలంలో సాహిత్యం ఏ విధంగా ఉంది? తెలుగులో ఉన్న అంతర్జాల సాహిత్యానికి ఆంగ్లంలో ఉన్న ఎలక్ట్రానిక్ లిటరేచర్ కు ఉన్న భేదం ఏమిటి? అంతర్జాల సాహిత్యానికి ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏమిటి? నూతన సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా ఫేస్ బుక్ లో వెలువడుతున్న తెలుగు సాహిత్యం ఏ విధంగా ఉంది? ఫేస్ బుక్ లో వస్తున్న సాహిత్యంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి? వాటికి ఎటువంటి పరిష్కారాలను గమనించవచ్చు మొదలైన అంశాలను వ్యాసంలో చర్చించడం జరిగింది.

Keywords: నూతన సాహిత్య సంస్కృతి, అంతర్జాల సాహిత్యం, సామాజిక మాధ్యమాలు

1. ఉపోద్ఘాతం:

అక్షరానికి ముద్రణా రూపం ఏర్పడిన తర్వాత సాహిత్య కళారూపం నూతనత్వాన్ని సంతరించుకుంది. గతంలో కవి తన అక్షరానికి శాశ్వత తత్వాన్ని చేకూర్చడం కోసం భూస్వాములను, రాజులను ఆశ్రయించారు. తన ప్రతిభను అంకితం రూపంలో ఇతరుల దగ్గర అమ్ముకోవలసి వచ్చింది. గతంలో తాళపత్ర రచన అనేటువంటిది చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేది. కవి తన అక్షరాలను తాళపత్రాలపై ముద్రించాలనుకోవడం అత్యాశగా కనిపించే రోజులు ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. కానీ ముద్రణ యంత్రాలు ప్రవేశించిన తర్వాత రచయితకు, పాఠకుడికీ అనేక ప్రయోజనాలు చేకూరాయి. మౌఖికంలో ఉన్నటువంటి సాహిత్యం రాత రూపంలోకి రావడం, రాత రూపంలో ఉన్న అక్షరం ముద్రణా రూపంలోకి ప్రవేశించడం గొప్ప మార్పు. ముద్రణ యంత్రాల ప్రవేశంతో అన్ని వర్గాలకు చెందిన వారు తమ రచనలను ప్రచురించే ప్రయత్నం చేశారు.

1990 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అంతర్జాల విప్లవం అన్ని రంగాలతో పాటు సృజనాత్మక రంగానికి ఎంతో ఉపయోగకరంగా మారింది. ముఖ్యంగా అంతర్జాలం సామాన్యుడికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఖర్చులు లేకుండా రచయితలు/కవులు తమ రచనలను అంతర్జాలం ద్వారా, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా పాఠకులకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణం వలన రచయితలతో పాటు పాఠకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందుకు ముఖ్య కారణం ముద్రణ అనంతర యుగం ప్రారంభం కావడం.

2. వ్యాస పరిమితి:

తెలుగులో సామాజిక మాధ్యమాలలో ఉన్న సాహిత్య పరమైన మౌలిక అంశాలను పరిచయం చేయడం ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. సామాజిక మాధ్యమాలలో సాహిత్యాన్ని చర్చిస్తున్నప్పుడు ఉన్న సమస్యలేమిటి? ఆ సమస్యలకు పరిష్కారాలు ఏమిటి? అనే అంశాలను పరిచయం చేయడం జరిగింది.

3. సాహిత్యం – అంతర్జాలం :

అంతర్జాలం అనేది సమాచార వ్యవస్థను మార్చిన గొప్ప ఆవిష్కరణలలో ఒకటి. అంతర్జాలం ద్వారా అనుసంధానమైన సామాజిక మాధ్యమాలు ఉపయోగించడానికి సులభంగా ఉండటం వల్ల అవి మన దైనందిన జీవితంలో భాగం అయ్యాయి. చరవాణి (మొబైల్స్), కంప్యూటర్ ద్వారా అంతర్జాలం ఉపయోగించడం చాలా సులభమైన విషయంగా మారిపోయింది.

ప్రస్తుత సమాజం సాహిత్య ప్రపంచంలోకి సాంకేతికత ప్రవేశాన్ని అనివార్యం చేసింది. దీని వలన సాహిత్యం భిన్నమైన కళారూపాన్ని సంతరించుకుంది. సాంకేతికత యుగంలో సాహిత్యం ఒక భాగంగా కలిసిపోయింది. సాహిత్యం, సాంకేతిక అంశాలు కలిపి ఒక భిన్నమైన సాహిత్య రూపంగా మారింది. కంప్యూటర్ల రాకతో సైబర్ సాహిత్యం అనే కొత్త సాహిత్య రూపం ఉద్భవించింది. ముద్రణా గ్రంథాలకు భిన్నమైన మాయా గ్రంథాలు వెలువడ్డాయి. సాహిత్యం, కంప్యూటర్ సాంకేతికతతో ఏర్పడిన సాహితీ రూపాన్ని ఆంగ్లంలో డిజిటల్ లిటరేచర్, సైబర్ లిటరేచర్ అనే పేర్లతో పిలుస్తున్నారు. ఇంకా

మరికొందరు డిజిటల్ లిటరేచర్, స్క్రీన్ లిటరేచర్, ఇంటరాక్టివ్ ఫిక్షన్, ఇ-పొయెట్రీ, ఇ-గేమింగ్ అంటారు, అనేక రకాల రూపాలలో కళా ప్రక్రియలు మరియు ఉప-ప్రక్రియలు ఉన్నాయి.1 (O’Sullivan, Jame. Towards a Digital Poetics electronic Literature & Literary Games. p. xvii)

ఆంగ్ల సాహిత్యంలోని పేర్లతో తెలుగులో పిలవడం సమంజసంగా కనిపించడం లేదు. డిజిటల్ లిటరేచర్ లేదా సైబర్ సాహిత్యంలో సాంకేతికత, సాహిత్యం యొక్క అంశాలు సమానంగా అధ్యయనం చేయబడతాయి. వివిధ రకాల సాంకేతిక విషయాలు సాహిత్యంలో చొప్పించబడతాయి. అయితే తెలుగులో ఇటువంటి పద్ధతిలో తెలుగులో సాహిత్యం వెలువడినట్లు కనిపించడం లేదు. తెలుగులో ముద్రణ రూపంలో ఉన్న పద్ధతిలోనే అంతర్జాల మాధ్యమం ద్వారా సాహిత్యం వెలువడుతూ ఉంది. దీనిని మనం సామాన్య పరిభాషలో తెలుగులో వెలువడుతున్న అంతర్జాల సాహిత్యం అని చెప్పవచ్చు

4. అంతర్జాల సాహిత్య లక్షణాలు-ప్రత్యేకతలు :

  1. సాహిత్య కళకు వివిధ సాంకేతికత అంశాలను జోడించే సౌలభ్యం ఉంది.
  2. అంతర్జాల సాహిత్యం సాంకేతికత అభివృద్ధితో సమాంతరంగా మారుతూ ఉంది. సాహిత్యాన్ని నిరంతరం మార్చుకునే సౌకర్యం ఉంది. 
  3. అంతర్జాల సాహిత్య ప్రతిరూపం ముద్రణా సాహిత్యానికి కొంత భిన్నంగా మార్చుకునే సౌలభ్యం ఉంది.
  4. సాంప్రదాయ మాధ్యమం నుండి అంతర్జాల సాహిత్యానికి మారుతున్నప్పుడు హైపర్ టెక్స్ట్ రూపంలో లింకులను రూపొందించుకునే సౌలభ్యం ఉంది. 
  5. అంతర్జాల సాహిత్యం రాయడం, చదవడం మరియు అధ్యయనం చేసే పద్ధతిని సమూలంగా మార్చింది. 
  6. అంతర్జాల సాహిత్యం అనేది విశాల దృక్పథం. దీనికి ఎల్లలు లేవు. 
  7. ఇటీవల కాలంలో అంతర్జాల సాహిత్యాన్ని నచ్చిన భాషలో అనువాదంలో చదువుకునే సౌలభ్యం ఉంది. 
  8. ఆంగ్ల అంతర్జాల సాహిత్యంలో ప్రయోగాత్మక సాహిత్యం వెలువడుతూ వుంది. 
  9. అంతర్జాల సాహిత్యంలో పాఠాన్ని యంత్రంగానూ పరిగణిస్తారు. 
  10. అంతర్జాల సాహిత్యంలో నూతన అధ్యయన పద్ధతులు ఏర్పడ్డాయి. 
  11. అంతర్జాల సాహిత్యంలో రచన, ప్రచురణ మరియు పంపిణీ రంగాలలో కొత్త అవకాశాలను తెరిచింది. 

5. అంతర్జాలంలో తెలుగు:

మనదేశంలో కంప్యూటర్లోకి ప్రవేశించిన తొలి భారతీయ భాష తెలుగు. మన దేశంలో మొదటి కంప్యూటర్ తయారుచేసింది కూడా ఇసిఐఎల్ కంపెనీయే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకులు కంప్యూటర్లోకి తెలుగును ప్రవేశపెట్టగలిగారనే వార్తను 3-8-1976న ‘ఆంధ్రపత్రిక’తో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రధానపత్రికలలో ప్రచురించారు.” (హేమలత, పుట్ల. అంతర్జాలంలో తెలుగు సాహిత్యం, 42).

కంప్యూటర్లో తెలుగు వినియోగించడం అనేటువంటిది 1980 కాలం నాటికే ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో తక్కిన భాషల కంటే తెలుగు భాష కంప్యూటర్ లో వినియోగించడం అనేటువంటిది పేర్కొనదగిన అంశం. అంతర్జాలంలో తెలుగును ఉపయోగించడం అనేది చాలా కాలం తర్వాత జరిగిన విషయం. ప్రస్తుతం తెలుగు భాషను కంప్యూటర్ తో పాటు చరవాణిలో కూడా ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల ఖతులు (ఫాంట్లు) అందుబాటులోకి వచ్చాయి. గత రెండు దశాబ్దాలుగా అంతర్జాలంలో తెలుగు సాహిత్యం ప్రచురితమవుతోంది.

6. సామాజిక మాధ్యమాలు: సాంఘికీకరణ (Socialization):

ప్రస్తుత కాలంలో అంతర్జాలం జీవితంలో ఒక భాగంగా మారింది. మనుషుల మధ్య సంబంధాలు ప్రత్యక్షంగా తగ్గిపోయి పరోక్షంగా పెరిగిపోయాయి. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు ఎక్కువ కావడం వలన మానవ సంబంధాలలో మార్పులు వచ్చాయి. సమూహం నుంచి ఒంటరితనానికి మనిషి ప్రయాణం చేస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో పరోక్షంగా సమూహంతో కూడడానికి సహకరిస్తున్నటువంటివి అంతర్జాల సామాజిక మాధ్యమాలు. 1996 సంవత్సరంలో తెలుగులో మొదటి అంతర్జాల సామాజిక మాధ్యమం ఏర్పడినట్లు తెలుస్తుంది.

కుమార్ అంపని, మధుసూదన్ ఓరుగంటి నిర్వహణలో 1996లో ప్రారంభమైన ‘తెలుగు వాణి’ మొట్టమొదటి తెలుగు వెబ్ చర్చావేదిక అని చెప్పవచ్చు. ఈ చర్చావేదికల్లో అంత్యాక్షరి ఫోరం ఆ రోజుల్లో అమిత ప్రజాదరణ పొందింది. శ్రీనివాస్ పరుచూరి సాయంతో శ్రీకాంత్ బండి తెలుగు సినిమా సమాచారాన్ని అందజేసే Telugu Film Serverని 1996లో ఆవిష్కరించారు. (1998 తరువాత దీనిని lekha.org కు తరలించారు). సిటి కేబుల్ వారు రవి ప్రకాశ్ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ వార్తల్ని అందించే మొదటి తెలుగు పోర్టల్ని తీసుకువచ్చారు.

(వెంకటేశ్వరరావు ఇమ్మడిశెట్టి. వెబ్ సైట్లలో తెలుగు సాహిత్యం- పరిశీలన, పుట-17).

తర్వాత కాలంలో క్రమక్రమంగా విభిన్న రూపాలకు చెందిన సామాజిక మాధ్యమాలు పరిచయమయ్యాయి. వీటి ద్వారా వ్యక్తులు తమకు కావలసిన అంశాన్ని చదవడం, తాము చెప్పాలనుకున్న విషయాన్ని పాఠకులతో పంచుకోవడానికి రచన రూపంలో అందించే సౌలభ్యం ఉంది. ఈ సామాజిక మాధ్యమాలలో రచయితలు రాయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నవి బ్లాగులు. బ్లాగింగ్ సైట్లు వ్యక్తుల ఆలోచనలు ప్రపంచంతో పంచుకోవడం ఒక ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. బ్లాగుల ద్వారా సమాచారాన్ని పాఠకులకు అందించడం, చదివే వ్యక్తుల నుండి ప్రశ్నలు, సమాధానాలు, వ్యాఖ్యలు వస్తాయి. తద్వారా రచయిత, పాఠకుడు పరస్పరం స్పందించే అవకాశాన్ని కలిగి ఉంటారు. కాబట్టి బ్లాగ్ ను రచయితకు అందుబాటులో ఉన్న అత్యంత ప్రాథమిక రూపంలో ఉన్న సామాజిక మాధ్యమంగా పేర్కొనవచ్చు. సామాజిక మాధ్యమాల ముఖ్య ఉద్దేశం విభిన్న స్థాయుల్లో స్నేహితులను పెంచడం.

స్నేహితుల సమూహాలు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రముఖమైనవి ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ మొదలైనవి. ముఖ్యంగా ఫేస్ బుక్ భారతదేశంలో అత్యంత ప్రముఖమైన సామాజిక మాధ్యమంగా మారింది. ప్రభుత్వ సంస్థలు, సుప్రసిద్ధ వ్యక్తులు ఫేస్ బుక్ సామాజిక మాధ్యమంలో సభ్యులుగా చేరారు. ఫేస్ బుక్ ద్వారా తమ సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు. ఫేస్ బుక్ ద్వారా ఎంతోమంది ప్రముఖులుగా మారారు. చాలా మంది తమ అనుభవం, సామాజిక సేవ మొదలైన వాటిని పంచుకుంటారు.

7. నూతన మాధ్యమాల్లో తెలుగు సాహిత్యం:

ఈ సామాజిక మాధ్యమాన్ని సాహితీవేత్తలు తమకు అనుకూలంగా మార్చుకొని ఉపయోగించుకుంటున్నారు. పాఠకులు, రచయితలు సామాజికమాధ్యమాల్లో సాహిత్యబృందాలను ఏర్పాటు చేసుకున్నారు. అన్ని రకాల సాహిత్యాన్ని సామాజిక మాధ్యమాలలో పెడుతున్నారు. రచనలపై చాలా చర్చ జరుగుతుంది. శాఖలు, సంస్థలు, సాహితీవేత్తలు అనేక సాహిత్య సదస్సులు నిర్వహించినా ఆర్థికసమస్యల కారణంగా సదస్సుపత్రాలు ప్రచురితం కాలేదు. కరోనా వైరస్ వ్యాప్తి తరువాత సామాజిక మాధ్యమాలలో పలు అంతర్జాల సదస్సులు నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. సాహిత్య రచనలు చదివిన తర్వాత, పాఠకులు ఒకే వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. పుస్తకాన్ని సాఫ్ట్ కాపీగా తయారు చేసి అంతర్జాలంలో సులభంగా పాఠకులకు పంపడం చాలా సులువైంది. సాహిత్యం లిఖితరూపంలోనే కాకుండా ఆడియో, వీడియో రూపంలో కూడా లభిస్తుంది. సాహిత్యవిశ్లేషణ విధానంలో కూడా మార్పు వచ్చింది. సామాజికమాధ్యమాల కారణంగా కొంతకాలంగా తెలుగు రచనల సంఖ్య పెరిగింది, పాఠకులు కూడా అదే స్థాయిలో పెరిగారు. సమకాలీన కాలంలో పాఠకులు, విమర్శకులు, పరిశోధకులు వెబ్ సైట్లు, బ్లాగులు, వెబ్ మ్యాగజైన్లలో తెలుగు సాహిత్యాన్ని చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇది తెలుగు సాహిత్యంలో శుభసూచకం.

8. ఫేస్ బుక్ లో తెలుగు సాహిత్యం:

పైన పేర్కొన్నట్లు ఫేస్ బుక్ అనేటువంటి సామాజిక మధ్యమం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షించింది. ఈ సామాజిక మాధ్యమాన్ని నివేదిక చేసుకుని ఎన్నో సమూహాలు సంఘాలు ఉన్నాయి. ఇందులో భావజాలపరంగా ప్రాంతం పరంగా, జండర్ ఆధారంగా అనేక సమూహాలు ఉన్నాయి. ఇందులో కొన్ని పబ్లిక్ గ్రూపులు ఉండగా మరికొన్ని ప్రైవేట్ గ్రూపులు ఉన్నాయి. పబ్లిక్ గ్రూపులో సులభంగా ఏ పాఠకుడైన సభ్యుడిగా చేరవచ్చు కానీ ప్రైవేట్ గ్రూపులో పాఠకుడు సమూహంలో చేరడానికి ఆసక్తిని కనబరుస్తే అడ్మిన్ అంగీకరించిన తర్వాతనే సమూహంలో చేరడానికి అవకాశం ఉంటుంది.

సామాజిక మధ్య సమూహంలో పలువురు తమ కవితలను వ్యాసాలను పోస్ట్ చేయడం, తర్వాత వాటిపైన ఇతరులు చర్చించడం చేస్తూ ఉన్నారు. ఇందులో చాలామంది రచయితలు తమ రచనల ఆవిష్కరణలను కూడా ఏర్పాటు చేయడం విశేషం. మరి కొంతమంది రచయితలు ప్రతి వారం ఒక అంశం పైన ప్రత్యక్షంగా పాఠకులతో మాట్లాడుతూ ఉపన్యాసాలు ఇవ్వడం పేర్కొనదగినటువంటి విషయం. ఒక్క మాట్లాడిన తర్వాత తక్కిన సభ్యులు వారి ప్రశ్నలను టైపు చేయడం, లేదంటే రచయిత తమ మాట్లాడాలనుకున్న వారితో లంకె కలిపి ప్రత్యక్షంగా మాట్లాడే సౌలభ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి కొంతమంది రచయితలు తమకు సంబంధించినటువంటి అంశాలను సమూహంలో పోస్ట్ చేసి వాటిపైన చర్చ పెట్టడం అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది.

ఇందులో కనిపించే అంశాలు రెండు రకాలుగా ఉన్నాయి.

మొదటి అంశం రచయితలు తాము రాసిన రచనలు ఇతర పత్రికలలోనూ పుస్తకాలలోనూ ముద్రితమైన వాటిని తిరిగి ఇక్కడ పోస్ట్ చేయడం, వాటిని చదవమని పాఠకులకు తెలపడం.

రెండవ అంశం రచయితలు తమ రచనలను కేవలం ఫేస్ బుక్ కోసం మాత్రమే రాసిన వారు. ఈ అంశాలను తిరిగి ఎక్కడ ముద్రణకు పంపరు. ఫేస్ బుక్ లో ఉన్న పాఠకులు ఆ రచనలను చదివి తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తారు.

మరికొన్ని సమూహాలలో కొత్తగా వచ్చిన పుస్తకాలను పరిచయం చేసి వాటిపైన చర్చ పెట్టె ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరికొందరు ఆ పుస్తకానికి సంబంధించినటువంటి సమీక్షలను విశ్లేషణాత్మక వ్యాసాలను జోడిస్తూ ఉంటారు. కొత్తగా వచ్చిన పుస్తకాలలో ఉత్తమంగా ఉన్న పుస్తకాన్ని పాఠకుడు సులభంగా ఎంపిక చేసుకొని చదివే ప్రయత్నం చేయవచ్చు.

ముఖ్యంగా రచయితలు, పాఠకులకు అపూర్వమైన స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సామాజిక సంబంధాలను, పేరు ప్రఖ్యాతులను అంతర్జాల సామాజిక మాధ్యమాలు కల్పించాయి. ఉదాహరణకు కరోనా సమయంలో కొంతమంది కవులు రాసిన కవితలు గేయాలతో ఎంతోమంది పాఠకులకు చేరువయ్యారు. ఒక గొప్ప తెలుగు రచయిత జీవిత కాలంలో సంపాదించిన పేరు ప్రఖ్యాతలు ఒక కవి కొన్ని కవితలు గేయాలతో అత్యంత ప్రసిద్ధులయ్యారు. ఉదాహరణకు-

"పిల్లజల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రో
నా ముసలితల్లి ఏమి బెట్టి సాకుతుందో
పూటపూట చేసుకోని బతికేటోళ్లం బ
పూట గడవా ఇంతదూరం వచ్చినోళ్లం
దేశమేమో గొప్పదాయె
మాబతుకులేమో సిన్నవాయే
మాయదారీ రోగమొచ్చీ
మాబతుకుమీద మన్నుబోసి
ఏమి బతుకూ ఏమి బతుకూ
చెడ్డ బతుకూ చెడ్డ బతుకూ చెడ్డ బతుకూ
-----------------
-----------------” (రవి, ఆదేశ్. ముసలితల్లి పాట. Youtube)

ఈ గేయం యొక్క యూట్యూబ్ లింక్ ఫేస్ బుక్ లోకి వచ్చిన తరువాత కొన్ని వందలమంది మరొకరితో పంచుకున్నారు. కొన్ని లక్షలమంది ఈ గేయాన్ని యూట్యూబ్ లో చూశారు. ఈ ఒక్క గేయంతో రచయిత ప్రముఖమైన వ్యక్తుల జాబితాలో చేరారు. కరోనా కాలంలో వచ్చిన ఉత్తమ రచనల్లో ఈ గేయం ఉంటుంది. ముద్రణా సాహిత్యం ఇవ్వని పేరు ప్రఖ్యాతులు సామాజిక మాధ్యమాలు కల్పించాయి. ఇటువంటి రచనలు చాలా ఉన్నాయి. ఒక సిద్ధాంత గ్రంథానికి సరిపడ సమాచారం సామాజిక మాధ్యమాల్లో ఉంది.

9. సామాజిక మాధ్యమాల్లో తెలుగు సాహిత్యం- కొన్ని ప్రశ్నలు, పరిష్కారాలు:

  1. సాహిత్యం అంటే ఏమిటి సాహిత్య లక్షణాలు మొదలైన వాటి గురించి ప్రాచ్య, పాశ్చాత్య దేశాలలో చాలా విస్తృతమైన చర్చ జరిగింది. ఏదైనా ఒక రచనను సాహిత్యంగా పేర్కొనాలంటే అందుకు సంబంధించినటువంటి సాహిత్యపరమైన అంశాలు లక్షణాలు కొన్ని ఉండాలి అటువంటి లక్షణాలు అంతర్జాల సామాజిక మాధ్యమ సాహిత్యంలో ఉంటున్నాయా? అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న.
  2. ఈ విషయంపై సంప్రదాయ వాదాలు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంతకు ముందు రచన ముద్రణా రూపంలో ప్రచురించే సమయంలో రచయితలు తమ రచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారని, అర్హత కలిగిన రచనలు మాత్రమే పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యేవని, తప్పులను సరిదిద్దుకోవడానికి సంపాదకులు రచయితలతో సంప్రదింపులు జరిపేవారని, ఆ తర్వాత రచనలు ప్రచురితమయ్యేవని వారి ప్రధాన వాదన. ఇప్పుడు నూతన సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సాహిత్యంలో అలాంటి పద్ధతి లేదు. ప్రతి ఒక్కరికీ వారి రచనలను ప్రచురించే హక్కు ఉంది. కానీ ఇతరులు సూచించే సలహాల స్వీకరించడానికి సిద్ధంగా లేరు. భావజాలం, జండర్ , ప్రాంతం మొదలైన వాటి ఆధారంగా ఒక సమూహం కలిసిపోయింది. ఒకరి రచనలను మరొకరు ప్రశంసించుకోవడం మరియు వారి స్వంత సమూహాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు.
  3. సంప్రదాయాన్ని గౌరవిస్తూ గతంలో వచ్చిన రచనలను కవులను గౌరవించడం వర్తమాన రచయితల కర్తవ్యం. కానీ ఇటీవల కాలంలో భావజాలం పేరుతో కొందరి కవులను రచనలను ఒక వర్గానికో, ప్రాంతానికో పరిమితం చేసి విమర్శించడం, అవసరమైతే దూషించడం కూడా జరుగుతూ ఉంది. ఇందుకు సామాజిక మాధ్యమాలు వేదికగా మారాయి. ఉదాహరణకు ప్రాచీన తెలుగు సాహిత్యంలో కొంతమంది కవులు ప్రస్తుతానికి ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయారు. వారు తెలుగు కవులు అని చెప్పడం కంటే ఒక ప్రాంత కవులు అని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటువంటి విషయాలను సామాజిక మాధ్యమాలలో అధిక సంఖ్యలో సభ్యులు చర్చకు పెడుతున్నారు. వీటి స్థానంలో ఆరోగ్యకరమైన అంశాలను చర్చించడం ఉత్తమం.
  4. సాహిత్యం పైన ఆసక్తి ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అయితే వారికి సరైన శిక్షణ గానీ, దిశా నిర్దేశం కానీ లేవు. సమూహాల్లో చర్చలు మాత్రమే కాకుండా ప్రముఖుల ద్వారా అంతర్జాలం ద్వారా శిక్షణ శిబిరాలు నిర్వహించడం సమంజసంగా ఉంటుంది. అటువంటి ప్రయత్నం కొంతమంది చేశారు. కానీ తరచు అటువంటి కార్యక్రమాలు జరిగితే బాగుంటుంది. 
  5. సాహిత్య శిక్షణ కార్యక్రమాలలో పాల్గొన్న రచయితలు తర్వాత రోజులలో అవసరమైనటువంటి పుస్తకాలను చదవడం, ఇతరులు రాసిన అంశాలను సునిశితంగా పరిశీలించడం, రచనలోని లోపాలను సరి చేసుకునే ప్రయత్నం చేయాలి.
  6. రచయితకు భావజాలం ముఖ్యమే అయినప్పటికీ కేవలం భావజాలం కోసం రచనలు చేయడం ఇతర భావజాలాలకు చెందిన రచయితలను రచనలను గౌరవించేలా ప్రవర్తించాలి. అవసరమైతే ఆరోగ్యకరమైన చర్చ చేసే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఇతరులను కించపరిచేలా వ్యక్తిగతదూషణలకు దిగడం సరైన పద్ధతి కాదు. ఇటీవల కాలంలో ఒక ప్రముఖ రచయిత కొన్ని కారణాల వలన తన బాధను వ్యక్తపరుస్తూ రచయితగా తాను ఇక కొనసాగబోనని పేర్కొన్నారు. (రచయిత ఇంకా చాలా పెద్ద పదమే వాడారు)
  7. రచయిత నైతిక ధర్మాన్ని కలిగి ఉండాలి. గతంలో రచయితలు బాధ్యత కలిగిన వారుగా కనిపించారు వారు సమాజానికి దారి చూపే దివిటీలాగా మార్గదర్శకంగా ఉన్నారు. గతంలో చర్చ అనేటువంటిది పత్రికల ద్వారా జరిగేది. పత్రికలు వెలువడడానికి కొంత సమయం పట్టేది. ఆ కాలంనాటికి ఏవైనా ఉన్న విషయాలు ఉద్రేకాన్ని కలిగించేవి కావు. కానీ ఈరోజు అంతర్జాల మాధ్యమం ద్వారా ఒక అంశం చర్చకు వచ్చిన వెంటనే కొన్ని గంటల్లోనే అనేకమంది అంశాన్ని చర్చించడం, అవసరమైతే వ్యక్తిగతమైన అంశాలను పేర్కొనడం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాల వలన సాహిత్యానికి ప్రయోజనం కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. 
  8. సామాజిక మాధ్యమాల సమూహాలలో ఉన్నవారు అనుభవజ్ఞుల వారు తర్వాత వారికి మార్గదర్శకం చేసేలా ఉండాలి. ముఖ్యంగా ప్రతి సమూహంలో యువకులు, అనుభవజ్ఞులైన రచయితలు ఉంటున్నారు. అనుభవజ్ఞులైన వారు యువకులకు సాహిత్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఎటువంటి పనులకు సాహిత్యాన్ని సాధనంగా ఉపయోగించకూడదు? సాహిత్యం అయినటువంటి ఒక బాధ్యతాయుతమైన సాధనంగా ఎలా చూడాలి మొదలైన? అంశాలను బోధించాల్సిన అవసరం ఉంది.
  9. అంతర్జాలంలో ఉన్న సాహిత్య బృందానికి కొన్ని నియమ నిబంధనలు కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి వాటిని కఠినంగా అమలు చేయాలి. తద్వారా వివిధ భావజాలాలు, జెండర్, ప్రాంతం మొదలైన అంశాల పైన ఆరోగ్యకరమైన చర్చ జరగడంతో పాటు వ్యవస్థకు ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమ బృందానికి అడ్మిన్ గా ఉన్న వ్యక్తులు సభ్యులు పంపిన సమాచారాన్ని పరిశీలించిన తర్వాతనే సమూహంలోకి వెళ్లేలా నిబంధన రూపొందించుకోవాలి. 
  10. ఇతర సభ్యులు సమూహాలు ఉన్న చోట వారి సాహిత్య రచనలు కాకుండా వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అభిప్రాయాలు, చర్యలకు దూరంగా ఉండేలా అడ్మిన్లు చర్యలు తీసుకోవాలి. 
  11. ఒక ముద్రితమైన పుస్తకాన్ని శాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించినట్లే అంతర్జాల సామాజిక మాధ్యమంలో కూడా సాహిత్య రచనలను శాస్త్రీయ పద్ధతిలో అనుశీలించే ప్రయత్నం చేయాలి. దీని వలన సామాజిక మాధ్యమాలలోనూ ఉత్తమ సాహిత్యం వెలవడుతుంది. 

10. ముగింపు:

సాహిత్య కళ అనేది ఇంతకు ముందు వచ్చిన దానికి కొనసాగింపు, ఇంకా ఉండబోయేదానికి ఒక ముందడుగు. గతాన్ని ఆధారం చేసుకొని ప్రస్తుతం జరుగుతున్న మార్పులను గమనిస్తూ భవిష్యత్తుకు బాట వేయడమనేటువంటిది సాహిత్య కళకు ఉన్న ముఖ్య లక్షణం. ఈ లక్షణాన్ని అర్థం చేసుకున్న రచయిత లేదా పాఠకుడు కాలంలో నిలుస్తాడు. మార్పును కోరుకోకుండా కేవలం గతం గొప్పదంటూ వర్తమానాన్ని, భవిష్యత్తును ఊహించని రచయిత కాలగర్భంలో కలిసిపోతారు. అలాగే నూతన సృజనాత్మక ప్రక్రియలు, సాహిత్య అభిరుచులు, ప్రాధాన్యతల గురించి విలువైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు అందిస్తూ ఉన్నాయి. ఈ అంతర్జాల వేదికలు విభిన్న సాహిత్య కార్యకలాపాలలో నిమగ్నమైన వారు నూతన పద్ధతుల్లో తమ భావాలను వ్యక్తపరిచే అవకాశాలను కల్పిస్తున్నాయి. పాఠం, మౌఖిక ప్రతిస్పందనలు, చిత్రాలు మొదలైన పద్ధతుల్లో సాహిత్యాన్ని వెలిబుచ్చే సౌకర్యాన్ని సామాజిక మాధ్యమాలు కల్పించాయి. సామాజిక మాధ్యమాలు ముద్రానంతర సాహిత్యం గురించి, పత్రికానంతర సాహిత్యం గురించి చర్చిస్తున్నాయి. అకడమిక్స్ లో కొత్త పద్ధతిలో సాహిత్యాన్ని పరిశీలించే మార్గాన్ని సామాజిక మాధ్యమాలు కల్పించాయి.

తెలుగులో అవధానం, చిత్రకవిత్వం మొదలైనవి సాహిత్యక్రీడలుగా ప్రసిద్ధి చెందాయి. అలాగే కొంతమంది కృషి చేస్తే భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ లిటరేచర్ లేదా ఈ లిటరేచర్ లేదా అంతర్జాల సాహిత్యం అనేటువంటిది విభిన్న మాధ్యమాలను ఉపయోగించి రచించే ఒక సాహిత్య క్రీడగా రూపాంతరం చెందే అవకాశముంది. ఆంగ్లంలో ఇప్పటికే ఎలక్ట్రానిక్ లిటరేచర్ ప్రసిద్ధి చెందింది. తెలుగులో కూడా ఇటువంటి రచనలు చేస్తే పాఠకులకు ఒక ఆసక్తికరమైన సాహిత్య క్రీడగా రూపాంతరం చెంది అవకాశముంది. సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకొని చెడు పనులు చేస్తూ ఉన్నవారు ఉన్నారు. కానీ సాహిత్య పరంగా చూసినప్పుడు కొన్ని అంశాలలో ఇబ్బందులు ఉన్నప్పటికీ సాహిత్యానికి, పాఠకుడికి, రచయితకు ఎంతో మేలు జరిగిందని చెప్పుకోవాలి.

11. పాదసూచికలు:

  1. others say digital literature, screen literature, interactive fiction, e-poetry, e-something, and there are genres and sub-genres within all of the many types and forms.

12. ఉపయుక్తగ్రంథసూచి:

తెలుగు:

  1. హేమలత, పుట్ల. తెలుగులో అంతర్జాల సాహిత్యం. రాజమండ్రి: ____,2015.

అముద్రిత సిద్ధాంతగ్రంథం:

  1. వెంకటేశ్వరరావు ఇమ్మడిశెట్టి. వెబ్ సైట్లలో తెలుగు సాహిత్యం- పరిశీలన. అముద్రిత సిద్ధాంత గ్రంథం. మద్రాసు విశ్వవిద్యాలయం, 2017. 

ఆంగ్లం:

  1. O’Sullivan, Jame. Towards a Digital Poetics Electronic Literature & Literary Games. Ireland: Palgrave MacMillan, 2019.

Youtube:

  1. రవి, ఆదేశ్. ముసలితల్లి పాట. YouTube Uploaded by Mictv, May 11, 2020. https://youtu.be/10FbxvaHJKM

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]