AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797
1. కాళోజీ సంఘటనాత్మకకవిత్వం: ఉద్యమస్ఫూర్తి
ఆచార్య విస్తాలి శంకరరావు
ఆచార్యులు & అధ్యక్షులు
తెలుగుశాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం,
పరితిమల్ కలైంజ్ఞర్ ప్రాంగణం, చెన్నై - 600 005. తమిళనాడు.
సెల్: +91 9445203041. Email: vistalisankararao@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
సంఘంలో జరిగే ఘటనలకు కవులు స్పందిస్తారు. తీవ్రమైన నిరాస, పోరాటకాంక్షలనుండి వీరావేశంతో పుట్టిన కవిత్వం సమకాలీన సంఘానికి స్ఫూర్తిదాయకంగా, భావితరాలకు వాస్తవచరిత్రను పట్టిచూపేదిగా ఉంటుంది. అలాంటి భావావేశంతో నిండిన తెలంగాణా తొలిపొద్దు కాళోజీ నారాయణరావు రచనల్లో సంఘటనాత్మక కవిత్వాన్ని ఉటంకిస్తూ సామాజికంగా అది కలిగించిన ప్రేరణ, ఉత్సాహాలను పరిచయంచేయడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. కాళోజీ జీవనరేఖల్ని స్పృశిస్తూ.. “నాగొడవ” మొదలైన రచనల్లో సందేశాత్మకంగా వెలుగుచూసిన కవిత్వాన్ని అనుశీలించడం, పూర్వపరిశోధకులు ఉద్యమగీతాలు, తెలంగాణా ఉద్యమం, మోనోగ్రాఫులలో పేర్కొన్న వివిధ ఘటనల్లో కాళోజి స్పందించిన తీరును ప్రస్తావించడం, నారాయణరావు ఆలోచనలలో భవిష్యత్తును ఏ విధంగా సూచించారో తెలుసుకోవడం ఈ వ్యాసలక్ష్యం.
Keywords: కాళోజీ, నారాయణరావు, సంఘటనాత్మకకవిత్వం, ఉద్యమస్ఫూర్తి, రజాకర్లు, నిజాం.
1. ఉపోద్ఘాతం:
‘‘నేను ప్రస్తుతాన్ని, నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని, గతానికి శిఖరాన్ని, భావికి ఆధారాన్ని’’ (నా గొడవ, నేనుప్రస్తుతాన్ని పుట. 35) అని తన కవితా లక్ష్యాన్ని ప్రకటించిన ప్రజాకవి కాళోజి. ప్రజల గురించి ప్రజల భాషలో, ప్రజల కోసం కవిత్వాన్ని ఆయుధంగా మలిచిన ఉద్యమకవి. సమాజాన్ని దర్శించి అందులోని వాస్తవాలను తన కవిత్వం ద్వారా ఉద్యమాల ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప ద్రష్ట కాళోజీ. ఆయన జీవితమే ఒక ఉద్యమం. ఆ ఉద్యమాన్ని 90 ఏళ్ళు వయస్సు వరకు సాగించిన విశిష్టకవి. తెలుగు సాహిత్యంలో, సామాజిక ఉద్యమప్రస్థానంలో కాళోజిస్థానం ఎందరికో ఆదర్శనీయం.
2. జీవన ప్రస్థానం:
కాళోజీ 1914 సెప్టంబర్ 9వ తేదిన కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రంటిహళి అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రమాబాయమ్మ, రంగారావులు. కాళోజీ కర్నాటకలో జన్మించిన ఆయనకు 2 సంవత్సరాల వయస్సులో వరంగల్ జిల్లాలోని కాజీపేట, హనుమకొండ సమీపంలో ఉన్న మడికొండ అనే గ్రామంలో స్థిరపడ్డారు. వీరి పూర్తిపేరు ‘‘రఘువీర్‌నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా కాళోజీ’’ ఆ తర్వాత వీరే తన పేరును నారాయణ రావుగా మార్చుకున్నారు.
కాళోజి అనేది వీరి ఇంటిపేరు. అయితే సాహితీ లోకంలో ‘కాళోజీ’గానే ప్రసిద్ధులు. ఇక వీరు ప్రాథమిక విద్య మడికొండలోను, ఉన్నత విద్య వరంగల్, హైదరాబాద్‌లోను పూర్తిచేశారు. విద్యాభ్యాసం అనంతరం 1940లో లాయర్ వృత్తిని చేపట్టారు. వారు వృత్తి నిర్వాహణతోపాటు ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమపోరాటంలోను, నైజాం వ్యతిరేక పోరాటంలోను ప్రముఖ పాత్రను పోషించారు. ఈ క్రమంలో మూడు సార్లు జైలుకు కూడా వెళ్లివచ్చారు. కాళోజీ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు మంచి స్నేహితులు. వీరిరువురు కలిసి తెలంగాణ సాయుధ పోరాటంలో విరివిగా పాల్గొన్నారు. అలాగే ఉస్మానీయా విద్యార్థుల వందేమాతర ఉద్యమాలలోను, సత్యాగ్రహ ఉద్యమాలలోను, ఆర్యసమాజ్, రాష్ట్రకాంగ్రెస్, రజాకార్ల ఉద్యమాలలోను పాల్గొని ఎందరినో చైతన్యవంతులను చేశారు.
కాళోజీ ఒకవైపు ఉద్యమాలలో పాల్గొంటూనే మరొకవైపు సాహితీరంగంలో తనదైన ప్రస్థానాన్ని కొనసాగించారు. వీరి కలం నుండి జాలువారిన రచనలు ‘నాగొడవ’, అణా కథలు, నా భారతదేశ యాత్ర, జీవనగీత, బాపూ బాపూ బాపూ మొదలైన వాటితో కలిపి దాదాపు 21 గ్రంథాల వరకు ఉన్నాయి. అంజలి, ఖలీల్ జిబ్రాన్ కవితలకు అనువాదాలు, భారతీయ సంస్కృతి అనేవి వీరి అరుదైన రచనలుగా ఉన్నాయి. దీనితో మంచి రచయిత గానేకాక గొప్ప అనువాదకులుగా కీర్తించబడినారు. వీరు అనువదించిన ‘జీవనగీత’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968లో ఉత్తమ అనువాద రచనాఅవార్డును ప్రకటించారంటే అనువాద రచనలో వీరి ప్రజ్ఞావిశేషాలు ఎలాంటివో తెలుస్తుంది. ఇంకా వీరి జీవన ప్రస్థానంలో అనేక అవార్డులను పొందారు. ముఖ్యంగా 1975లో బూర్గుల రామకృష్ణరావు మెమోరియల్ అవార్డు, గురజాడ అవార్డు, ఉండాల మాల కొండారెడ్డి విజ్ఞానపీఠం అవార్డు, రామినేని పౌండేషన్ అవార్డులు మొదలైనవి వున్నాయి.
3. ప్రజాకవి కాళోజీ - సాహిత్యోద్యమ ప్రస్థానం:
అన్నిటికంటే ముఖ్యంగా వీరు గొప్పమానవతావాది. ప్రతిమనిషి సుఖసంతోషాలతో ఉండాలని, మరొకరు వారి ఆ సుఖసంతోషాలకు అడ్డుకారాదనేది వీరి దృక్పథం. కనుకనే వారి అక్షరాలు సమాజానికి చైతన్య మార్గాలుగా నిలుస్తాయి. ఇక వీరి సాహిత్యోద్యమ ప్రస్థానాన్ని పరిశీలిద్దాం.
కాళోజీ అనగానే వెంటనే గుర్తుకువచ్చేవి వారి అక్షరాల అగ్నివర్షం. తన సాహిత్యం ద్వారా సమాజంలో మానవ సంబంధాలు మెరుగుపడాలని అశించాడు. ఎక్కడ అన్యాయం జరిగినా చెమ్మగిళ్లేవారి కళ్ళు అన్యాయాన్ని తీవ్ర స్వరంతో ఖండిరచే అక్షరాగ్నులను కురిపిస్తాయి. వారి జీవన గమనంలో భాగస్వామికాని ప్రజాఉద్యమం లేదు. అంతేకాక ఆ ఉద్యమానికి ఆయువు పట్టునిచ్చే సాహిత్యం వారి కలం నుండి వర్షిస్తోంది. ఇలా కాళోజి సాహిత్యోద్యమాల్ని పరిశీలిస్తే వాటిలో అనేక పార్శ్వాలు కనిపిస్తాయి. వీటన్నికి మించి కాళోజి కాలంతో నడిచిన ప్రజాకవి. సాధారణంగా జీవితంలో తడి తెలిసిన వారు, ఆయా అంశాల వాటి పట్ల స్పందించే తీరు వేరుగా ఉంటుంది. అంటే వారు జీవితాన్ని భిన్న కోణాలలో దర్శించినవారు, అనుభవించినవారు. వారు పదాలు కడితే అవి భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. అటువంటి ఆదర్శవంతమైన సాహిత్యాన్ని కాళోజీ అందించారు.
4. కాళోజీ - ఆగ్రహజ్వాలలు:
కాళోజీ మంచివక్త, తెలుగు, కన్నడం, మరాఠి, హింది, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన గొప్ప సాహితీవేత్త. 1931లో భగత్ సింగ్‌ను ఆంగ్లేయులు ఉరితీసినప్పుడు కాళోజీ ఆయన సంతాపసభలో భగత్ సింగ్‌పై వీరావేశంతో గేయాన్ని రాశారు. అంతేకాదు ప్రజాహక్కుల పరిరక్షణకోసం బ్రిటీష్ పాలకులతోను ఆ తర్వాత నిజాం నిరంకుశధోరణిని వ్యతిరేకిస్తు ఎన్నో పోరాటాలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తన తుదిశ్వాస విడిచేవరకు అనేక ఉద్యమాలతో అగ్రభాగాన ఉన్నారు.
5. కాళోజీ - సంఘటనాత్మక కవిత్వం:
నిజాంపాలనకు వ్యతిరేకంగా, రజాకార్లదుశ్చర్యలను ఖండిస్తూ అనేక రచనలు చేశారు. రజాకార్లు దురాహంకారంతో ప్రజలను, ఉద్యమకారులను ఘోరంగా హింసించారు. ఇళ్ళు తగులపెట్టారు. స్త్రీలను చెరబట్టారు, ఇంకా దోపిడీలు, హత్యలు వారి నిత్యకృత్యాలుగా మారిన సమయంలో గుల్బర్గా జైలులో ఉన్న కాళోజీ చలించి హింసకు ప్రతిహింసే సమాధానంగా గర్జించారు.
“మన కొంపలార్చిన మనస్త్రీల
చెరచిన
మన పిల్లలను చంపి మనల
బంధించిన
మానవాధములను
మండలాధీశులను
మరచిపోకుండగ
గురుతుంచుకోవాలె
కసియారి పోకుండ
బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానె కాటేసి
తీరాలె
‘సత్యమ్మహింస’ యని
సంకోచపడరాదు
.............................................
తిట్టిన
నాల్కలను చేపట్టి కొయ్యాలె
కొంగులాగిన వ్రేళ్ళ కొలిమిలో
పెట్టాలె
కన్నుగీటిన కళ్ళ కారాలు
చల్లాలె
తన్నిన కాళ్ళను ‘డాకలి’గ
వాడాలె
కండ కండగ కోసి కాకులకు
వేయాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె” (తెలుగులో ఉద్యమగీతాలు పుట. 284)
అంటూ వారి అరాచకాలను గుర్తుపెట్టుకుని తగిన గుణపాఠం నేర్పాలని ఆక్రోశించారు. “ఇందులో ఎంతటి ఉద్వేగమున్నదో పాఠకులు ఊహించగలుగుతారు. కాళోజీది అంతటి ధర్మాగ్రహం. దీన్ని విన్న తోటి ఖైదీలు వీరావేశంతో ఊగిపోయినారు” (కాళోజీ నారాయణరావు, జగన్నాథం, పేర్వారం పుట: 64) అని వరంగల్లు జిల్లా, జనగామ తాలూకాలోని బహిరాన్ పల్లిలో రజాకర్లు నిజాంపోలీసులు ఏకమై - 90 మంది ఉద్యమకారులని కిరాతకంగా కాల్చిచంపిన ఘటనకు స్పందనగా కార్చిచ్చుగా మారిన కన్నీటి గేయంగా ఇది వెలుగుచూసిందని పేర్వారం జగన్నాథం పేర్కొన్నారు.
అలాగే వర్తమాన రాజకీయ వ్యవస్థపై కూడా కవితాక్షరాలను కురిపించారు. రాజకీయ నాయకుల, ప్రభుత్వాధికారుల గుట్టురట్టు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సమయంలో ఒటరు స్పందించవలసిన తీరును ఇలా ఉద్భోదిస్తున్నారు.
“అభ్యర్థి ఏ పార్టీ వాడని
కాదు
ఏపాటి వాడో చూడు
ఎన్నుకుంటే వెలగ బెట్టడం కాదు
ఇందాక ఏం చేశాడో
చూడు
ఇప్పుడు కట్టే ముడుపులు కాదు
ఇందాక చెల్లించింది చూడు
పెట్టుకునే టోపీ
కాదు
పెట్టిన టోపీ చూడు
ఎగ రేసిన జండాకాదు
చాటున ఆడిరచిన
దందాచూడు
మనిషిని చూడు, చరిత్రను
చూడు
నుడువులు కాదు, నడవడిచూడు”
అని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, విలువులకోసం, వాటిని రక్షించడంకోసం ఎంతో తపన చెందాడు. ఇక పరభాషల మోజులో పడి మన సంస్కృతిని కాలరాస్తున్న నేటి సమాజానికి చురకలంటించాడు.
“నీ వేష భాషలను
నిర్లక్ష్యముగ జూచు
భావ దాస్యం బెప్తు బాసిపోవునురా
...................................................
తెలుగు
బిడ్డవయ్యు తెలుగు రాదంచును
సిగ్గులేక ఇంక
జెప్పుటెందుకురా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు
రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా?”
అంటూ నిర్భయంగా సత్యాన్ని తమ కవితారూపంలో
వెల్లడిరచారు.
చరిత్రలో ఒక విశిష్టంగా తెలంగాణ ప్రత్యేకరాష్ట్రోద్యమం నిలిచింది. కాళోజీ జీవితం తెలంగాణా పరిణామచరిత్రలో ముడిపడి ఉంది. ఈ ఉద్యమ చైతన్యంలో కాళోజీపాత్ర కీలకం. తెలంగాణా సర్వతోముఖాభివృద్ధిని సాగించాలంటే ప్రత్యేకరాష్ట్రం తప్ప వేరే మార్గం లేదని కాళోజీ ఇలా భావించారు.
“ప్రాంతం
వారీరక్షణ
పనికి రాదు అన్నప్పుడు
ప్రత్యేకంగా రాజ్యం
పాలుకోరడం
తప్పదు
ముఖ్యమంత్రి ఆదర్శం
ముఠాతత్వమైనప్పుడు...
..............................
బూర్గుల నాటి
ఒప్పందం
బుట్టదాఖలైనప్పుడు
విన్నపాలు విజ్ఞప్తులు
విను నాథులె
లేనప్పుడు
తెలంగాణా సిబ్బందిది
‘త్రిశంకు’ గతి అయినప్పుడు
‘బాసచాన’
వయ్యారం
యాస కంటు అయినప్పుడు
మాండలికపు మర్యాదలు
మాటలు
చేదైనప్పుడు
బాలానంద కోస్తా
బాలల సొమ్మైనప్పుడు”
అంటూ తెలంగాణా ప్రజల ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. అందుకే కాళోజీ తన కవిత్వాన్ని ‘నడుస్తున్న చరిత్రకు రన్నింగ్ కామెంటరీ అంటారు. నిత్య సత్యాలతో, ప్రజలను సామాజిక సమస్యలపట్ల చైతన్యాన్ని రగిలిస్తూ ముసుగులు లేకుండా రాజీలేని పోరాటం చేసే వైతాళికుడు కాళోజీ తన నా గొడవను ఇలా తెలిపారు.
“నా
గొడవనునది
అక్షరాల జీవనది
నానా భావన నది
నీనా భావన
లేనిది
మన భావననది
సమ
భావన నది
సమరస భావన నది
ఎదచించుక పారునది
ఎదలందున చేరునది” అని ఎలుగెత్తి చాటారు.
ఆయన రచనలు పరిశీలిస్తే వారి సాహిత్య లక్ష్యం ‘ప్రజాచైతన్యమే’ అని స్పష్టంగా తెలుస్తుంది.
“అక్షర రూపం
దాల్చిన
ఒకే ఒక్క సిరాచుక్క
లక్ష మెదళ్ళను కదలిక” అన్నాడు బైరన్
- అన్నారు.
ఇలా కాళోజీ ఏ విషయానైనా నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పడం ఆయనకు అలవాటు. ఇతరులు ఏమనుకుంటారోననే భయంలేదు. ప్రజల భాషలో ప్రజల కవిత్వాన్ని రాశారు. ప్రజలకు అర్థం కాని భాష రాయడం వ్యర్థం అని ఆయన భావం. అందుకే ప్రజల వ్యావహారిక భాషలో ఉన్న పదాలు హిందిపదమైనా, ఉర్ధూపదమైనా, ఆంగ్ల పదమైనా, ప్రయోగించారు. వారు వాడిన సలామత్, భాయీ భాయిగా పోలింగ్ భూత్, బస్సుసీటు, బిజలి వంటి పదాలు నిరక్ష్యరాస్యులకు సైతం సులభంగా అర్థమవుతాయి. ఇలా సజీవమైన పదసంపద కాళోజీ సాహిత్యంలో దర్వనమిస్తుంది. నిలిచిన తన నైజంగా పోరాడిన కాళోజి, అవిశ్రాంత ప్రజాయోధుడు. చివరికి స్వల్ప అస్వస్థతో బాధపడుతూ 2002 నవంబర్ 13వ తేదీన తుది శ్వాసవిడిచారు.
కాళోజీ సాహిత్యం బహుముఖాలుగా సాగింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలను తన కవిత్వంలో బంధించిన కాళోజీ మరణంతో ఒక శకం అంతరించినట్లేనని పెద్దలు అభిప్రాయ పడినారు.
కాళోజి ‘నాగొడవ’ గురించి శ్రీశ్రీ ఇలా అంటారు - ‘‘ఇది కవి గొడవగానే కనిపించినప్పటిక చదివిన వారికి తమ గొడవగానే అర్థమవుతుంది’’ అని అన్నారు.
అలాగే దాశరథి కాళోజీకి నివాళులు అర్పిస్తూ - ‘‘ఆయన తెలుగులో రాశాడు కాబట్టి తెలుగు వారికే పరిమితమయ్యాడు గాని, యూరోపియన్ భాషలో రాసి ఉంటే విశ్వకవి అయి ఉండేవాడు’’, అని తెలిపారు.
ఇలా కాళోజీ సాహిత్యం ఒక సామాజికసందేశంగా
సాహిత్యంలో మానవత్వమే గొప్ప లక్షణంగా ముందుకు సాగి తెలంగాణ ప్రజల శ్వాసగా నిలిచింది. కనుకనే వారి మరణాంతరం
సిద్ధించిన తెలంగాణారాష్ట్రంలోని ప్రభుత్వం వారికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వరంగల్లులోని ఆరోగ్యవైద్య
విశ్వవిద్యాలయానికి ‘కాళోజి యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ ఆండ్ సైన్సు’ గా పేరు
పెట్టారు. అలాగే వరంగల్లులో మూడు ఎకరాల స్థలంలో కాళోజీ కళాకేంద్రంగా చేయాలనే నిర్ణయించింది. ఇంకా కాళోజీ
జయంతిని తెలంగాణ విమోచనదినంగా, మాండలిక భాషాదినోత్సవంగా నిర్ణయించి ఆ ప్రజాకవికి ఘనంగా నివాళులు
అర్పించింది.
6. ముగింపు:
ఇలా ప్రజాకవులు తరాలు మారిన ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచి వారిని నిరంతరం చైతన్యం చేస్తూనే ఉంటారని వీరి జీవితం వలన తెలుస్తుంది. ఇలా తెలుగు ఉద్యమసాహిత్యంలో తెలంగాణా పోరాటంలో అలాగే వివిధ సామాజిక ఉద్యమాలలో కాళోజీ ప్రస్థానం అనిర్వచనం. కనుకనే తెలంగాణ తోలిపొద్దుగా (పుక్కటి పురాణాలలో ఏముందిలే అని చులకనగా చుడవద్దు. ఇతిహాసాలను కొట్టిపారవేయద్దు. నీ గతచరిత్ర తెలియనిదే భవిష్యత్తు లేదు వర్తమానం అంతకన్నా లేదని జీవితవిశేషాలను పేర్కొన ప్రజాకవి.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- అయిలయ్య, బన్న. 1969 తెలంగాణ ఉద్యమం - ప్రజాకవి కాళోజీ కవిత్వం.
- కాలోజి, నాగొడవ. యువభారతి. సాహితీవాహిని పరంపర, సికిందరాబాదు: 1974
- కృష్ణానంద్, మల్లాది. తెలుగు పెద్దలు. విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్. హైదరాబాద్. 2021
- జగన్నాథం, పేర్వారం. కాళోజీనారాయణరావు. (మోనోగ్రాఫ్). సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ: 2007
- జయరాములు, బి., ఆధునికాంధ్రకవులు. నవరత్న బుక్ హౌస్, విజయవాడ: 2013.
- తిరుపతి, భూక్య. కాళోజీ రచనల్లో సమాజం, భాష. వ్యాసం.
- మల్లారెడ్డి, తూర్పు. తెలంగాణ సాహిత్యం - జీవితచిత్రణం (సంపా.) ఒకరోజు జాతీయ సదస్సు (19-07-2007) వ్యాసాల సంచిక. శ్రీలక్ష్మీనరసింహస్వామి కళాశాల ప్రచురణ: 2007.
- సత్యనారాయణ, ఎస్వీ. తెలుగులో ఉద్యమగీతాలు. (సిద్ధాంతగ్రంథం) విశాలంధ్రపబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్: 1991.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.